Pages

Wednesday, November 24, 2010

తెలుగు సినిమా విశ్వరూపం “మాయాబజార్”


January 11th, 2010
దాదాపు 30 ఏళ్ల క్రితం రాయచోటిలో ఇంటర్ చదువుతున్న రోజుల్లో -1978-79- ఈనాడు సితారసినీపత్రికలో ఓ సినిమాను సమీక్షిస్తూ ఇలా ప్రకటించారు. ఇప్పటికి పాతికేళ్ల క్రితం జన్మించిన తెలుగువారు ఎవరయినా ఈ సినిమా గనుక చూడకపోయి ఉంటే అలాంటి వాళ్లు తెలుగు వారు కాదు.ఒక్కసారిగా నాకు, మా రూమ్మేట్లకు భయం పుట్టుకుంది. ఇదేమి ఖర్మరా స్వామీ సినిమా చూడకపోతేనే తెలుగువాళ్లం కాకపోతామాఅని అప్పట్లో మా చిన్నిబుర్రలకు అనిపించింది.

కానీ సితారలో ఆ చిత్ర సమీక్ష పూర్తిగా చదివాక ఆ వాక్యం నిజమే అనిపించింది. పాత సినిమాలంటే చెవికోసుకునే మేం రాయచోటి సినిమా హాళ్లలో అడపా దడపా వచ్చే వాటిని క్రమం తప్పకుండా పలకరించేవాళ్లం. కానీ పల్లెటూర్లో ఉంటూ హైస్కూలు చదువులో ఉన్నప్పుడు కాని, రాయచోటిలో డిగ్రీ చదివినప్పుడు కాని ఆ సినిమాను చూసే అవకాశం నాకు రాలేదు. అది ఎలా తప్పిపోయిందో నాకు తెలీదు. తర్వాత పీజీ చదువుల కోసం తిరుపతి వచ్చినప్పుడు కాని ఆ సినిమా చూసే అవకాశం రాలేదు. అలా పాతికేళ్ల వయసు లోపే ఆ సినిమాను చూసి నేనూ తెలుగువాడినే అని గర్వంగా ఫీలయిపోయాను. అది ఒక చరిత్ర.

ఆ సినిమా ఏదో ఇంకా మీకు తట్టలేదా? ఆ చిత్రం పేరు మీకు ఇంకా తట్టకపోయి ఉంటే మీరూ తెలుగు వారు కారనే చెప్పాలి మరి..
భయపడకండి.
అది… “మాయాబజార్
శశిరేఖా పరిణయం అని కూడా చెప్పుకునే మాయాబజార్
అద్భుతం అనే మాటకు అసలైన నిర్వచనంగా నిలిచిపోయిన చిత్రం.

ఇది ప్రపంచ చలన చిత్ర చరిత్రకు మా వంతు చేర్పుఅని తెలుగోడు సగర్వంగా సమర్పించిన అజరామర చిత్రం.
అది మహాభారతంలో జరగని ఒక కల్పిత గాథ ఆధారంగా తెలుగువారు రమణీయంగా అల్లుకున్న కమనీయ కథా చిత్రం.

ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని పెద్దలు కొనియాడిన మేటి చిత్రం.
షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకందించిన మరొక అపురూప కళాఖండం.

స్క్రీన్‌ప్లే, సంగీతం, సాహిత్యం, కళాదర్శకత్వం, ఛాయాగ్రహణం, స్పెషల్ ఎఫెక్టులు, మాటలు, పాటలు, గానం, నటన, అన్నిటికంటే మించి మండుటెండలో పండువెన్నెలను సృష్టించిన విజయా వారి వెన్నెల.. వీటన్నిటి మహాద్భుత విశ్వరూపం మాయాబజార్.

దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఇంత చక్కటి పొందికతో అమరిన, ఒదిగిపోయిన చిత్రం ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అరుదుగా జరుగుతూంటుంది. ఈ ఘనతను మన తెలుగు సినిమా 50 ఏళ్ల క్రితమే సాధించిందంటే.. అది తెలుగువారికి సంబరం కలిగించదా..

అందుకే గత యాభై ఏళ్లుగా తెలుగు వారు ఈసినిమాను విరగబడి చూస్తూనే ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు విడుదలైనా సరే హాళ్లు, పల్లెటూరి టెంట్‌లు నిండిపోతాయంటే మాయాబజార్ సత్తా ఏమిటో అర్థం అవుతుంది.
ప్రపంచ యవనికపై తెలుగు సినిమా గర్వంగా ఛాతీ విరుచుకుని నిలబడేలా చేసిన మహత్తర చిత్రం. 78 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో టాప్ టెన్‌ చిత్రాలను బేరీజు చేస్తే ఈ నాటికీ నంబర్‌వన్ స్థానంలో నిలబడే దన్ను కలిగిన చిత్రం. శతాబ్దాల మానవ వినోద చరిత్రలో ఓ గొప్ప విప్లవంగా నిలిచిన సినిమాకే కొత్త నిర్వచనం ఇస్తూ గత యాభై ఏళ్లుగా ఇది రసజ్ఞుల హృదయాలను కదిలిస్తూనే ఉంది.

కంప్యూటర్ మాయాజాలం, గ్రాఫిక్స్ మంత్రలోకాలు ప్రస్తుతం వెండితెరని, సినిమా రూపురేఖలనే సమూలంగామార్చివేస్తున్నప్పటికీ తెలుగు ప్రేక్షకుల స్మృతి పథంలో చెరగని ముద్రవేస్తున్న మేటి చిత్రం మాయాబజార్.

ఎందరో చిత్ర సమీక్షకులు, సినిమా ప్రేమికులు అన్నట్లు, అంటున్నట్లు….
మాయాబజార్
తెలుగు జాతి సంపద
తెలుగు జాతి సంస్కృతి
తెలుగు జాతి సంతకం
తెలుగు జాతి మురిపెం
అంతే కాదు..
అది..
మన బాల్యం
మన పద్యం
మన పాట
మన పురా జ్ఞాపకం
మన జీవితం
మన చరిత్ర
మన సర్వస్వం

ఒక్కమాటలో చెప్పాలంటే దీనికి జాతి, కుల, మత, ప్రాంత భేదాలు లేవు.

విడిపోవడాన్ని ప్రస్తుతం తారకమంత్రంగా జపిస్తున్న తెలుగు జాతికి మిగిలిన ఏకైక సమైక్య భావన మాయాబజార్. ఇది మనదీ, మన సినిమా, మన అద్భుత కృషి అంటూ రాష్ట్రం నలు చెరగులా భవిష్యత్ తరాలు కూడా చెప్పుకుని పరవశించే మలయ పవన సోయగం.

తెరపై నలుపు తెలుపు రంగులతో దశాబ్దాలుగా సమ్మోహనం చేస్తూవచ్చిన మాయాబజార్ త్వరలో సప్తవర్ణ కాంతులీనబోతోంది. విడిపోయినా, విడిపోకపోయినా తెలుగు జాతి పాడుకునే మంత్రం మాయాబజార్. తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు అని కోట్లమందిని భ్రమింపజేసిన మహాద్భుతం. సందేహముంటే లాహిరి లాహిరి లాహిరిలో పాటను మళ్లీ చూస్తూ వినండి. దాన్ని మండుటెండలో తీశారు. అది విజయావారి ఎండవెన్నెల. కెమెరా మాయకు చిక్కి చల్లబడిన మండువెన్నెల.

హిందీవాళ్లకు మొఘల్ ఇ అజమ్,’ ‘నయాదౌర్చిత్రాలు నలుపుతెలుపుల నుండి రంగుల ప్రపంచంలోకి వచ్చినట్లే.. మన మాయాబజార్యాభై ఏళ్ల తర్వాత గోల్డ్‌స్టోన్ సంస్థ నిబద్ధ కృషి ఫలితంగా సకల వర్ణ శోభితంగా తయారై మనముందుకు వస్తోంది. రాజకుమారిగా సావిత్రి రాజసాన్ని, రాక్షసుడిగా ఘటోత్కచుడి సాటిలేని ఆహార్యాన్ని, లాహిరి లాహిరి పాటలో రాత్రి -నట్టెండ- అందాలను వర్ణభరితంగా చూడడానికి సిద్ధంగా ఉండండి మరి.
ఎవరూ కనిపెట్టకుండా మాటలు ఎలా పుడతాయి అనే గొప్ప సత్యాన్ని మాయాబజారే చెప్పింది మనకు. అందుకే గత యాభై ఏళ్లుగా అది మాటల కనికట్టుతో తెలుగువారిని తనవద్దకు రప్పించుకుంటోంది.

నిజమే.. మాయాబజార్ ఎన్ని సార్లు చూసినా, ఎన్ని సార్లు చదివినా బోర్ కొట్టదు. కమ్మటి ముద్దపప్పు, అవకాయ భొజనం, సుఖమైన నిద్ర, మాయాబజార్ సినిమా .. వీటికి ప్రత్యామ్నాయాలుంటాయా?” ఉండవు గాక ఉండవు..
యాభై ఏళ్ళ మాయాబజార్”, “మనయింటి బంగారం మాయాబజార్”, “తెలుగు సినిమాకు పెద్దబాల శిక్ష మాయాబజార్”, “అర్ధ శతాబ్ది అద్భుత అనుభూతి మాయాబజార్ఇవీ మన తెలుగు పత్రికలు పెట్టిన శీర్షికలు.
కెవి రెడ్డి దర్శకత్వం, సాలూరి, ఘంటసాల సంగీతామృతం, పింగళి మాటల మూటలు, మార్కస్ బార్ట్‌లే కెమెరా కన్ను, హర్బన్స్ సింగ్ అలనాటి గ్రాఫిక్స్ మాయాజాలం, ఘంటసాల , పి.లీల , పి.సుశీల , మాధవపెద్ది సత్యంల గాంధర్వగానపు కువకువలు, తెలుగు సినిమాలో చరితార్థుడిగా నిలిచిన శ్రీకృష్ణుడు, పాటల కథానాయకుడు నాగేశ్వరరావు. తెలుగు చిత్ర వైభవానికి పట్టం కట్టిన ఎందరో.. ఎందరెందరో..

ఇందుకోసమే మాయాబజార్‌ను చూడాలి.

తెలుగువాళ్లం ఇప్పటిలాగే కాదు. మరోలా కూడా ఉంటాం అని నిరూపించడానికైనా మాయాబజార్ చూడాలి.
మాయా బజార్ చిత్రం విడుదల సందర్భంగా చందమామకథల పత్రికలో ఈ సినిమా పూర్తి కథను చక్కటి భాషలో ప్రచురించారు. అది చదివితే ఆ సినిమా కథ మొత్తం తెలుసుకోవచ్చు. April 1957 చందమామలో ఇది వచ్చింది. ఆన్‌లైన్ చందమామ ఆర్కైవ్స్ -భాండాగారం- లోని 1957 చందమామ ఏప్రిల్ సంచిక 13-20 పుటలలో ఈ కథను కింది లింకుపై క్లిక్ చేసి -మీ భాష, సంవత్సరం, నెల ఎంపిక చేసుకుని- చదవగలరు.

http://www.chandamama.com/archive/storyArchive.php
వికీపీడియాలో కూడా ఈ కథను పీడీఎఫ్‌గా ఇచ్చారు.

మాయాబజార్ సినిమా కథ
ముందస్తు హెచ్చరిక: రంగుల మాయాబజార్‌ను చూడకపోతే కూడా మనం తెలుగువాళ్లం కాదన్నమాటే.. తస్మాత్ జాగ్రత్త..
====================================================
7 Responses to “తెలుగు సినిమా విశ్వరూపం మాయాబజార్””
  1. Bhanu Majji on January 11, 2010 5:51 AM
Maayabazar meeda naaku elanti negative feelings levu
but this article seems to be a curtain raiser or teaser for the colored version of it
A Few Facts first
The Gold stone technologies has closed its multimedia
divsion సుద్ద్
enly after coloring lot of classic movies in different languages . The Employees who have worked on Colorization of Mayabazaar are now Jobless on the Roads !!
However it seems Goldstone and the Super good films will reap the benefits , instead of the 160+ poor fellows who have worked their blood and sweat on the movie !!
Ide emo vidhi raatha anTe !!
  1. chandamama on January 11, 2010 6:25 AM
భాను గారూ,
మాయాబజార్ రంగుల వెనుక దాగిన సత్యం అంటూ మీరు వేటిని ప్రస్తావించారో వాటి గురించి నిజంగా నాకు తెలీదు. సెర్చ్ వర్డ్స్ సహాయంతో నేను సేకరించిన సమాచారంలో గోల్డ్ స్టోన్ సంస్థ ఉద్యోగుల దయనీయ స్థితి పొందుపర్చబడలేదు. మనది అని చెప్పుకుంటున్న దాన్ని శిరసున పెట్టుకునే క్రమంలో దాని నిర్మాణానికి కృషిచేసిన వారి పరిస్థితి ఎప్పటికీ కనుమరుగవుతుండటం మన వ్యవస్థ లక్షణాల్లో ఒకటేమో మరి.
వ్యాఖ్యలో మీరు పొందుపర్చిన విషయాన్ని నేను స్వీకరిస్తున్నాను. మరింత సుబోధకం కావడం కోసం గోల్ట్ స్టోన్ ఉద్యోగుల పరిస్థితిపై సమాచారం మీ వద్ద ఏదైనా ఉంటే దయచేసి పంపండి. గత మూడు రోజులుగా పలు పత్రికలలో, వెబ్‌సైట్లలో రంగుల మాయాబజారు గురించి కథనాలు చూస్తున్నాను. కాని ఈ గొప్ప పరిణామం వెనుక జరిగిన ఘోరం గురించి ఎక్కడా రాలేదు. ఈ ఉద్యోగులందరూ కాంటాక్టు ప్రాతిపదికన సంస్థలో పనిచేస్తున్నవారయితే కంపెనీ చెప్పా చెప్పకుండా వారిని వెళ్లగొట్టించడానికి చట్టబద్ధత ఉండవచ్చు. కానీ మీరన్నట్లు తమ రక్తమాంసాలను ఫణంగా పెట్టి నలుపుతెలుపు చిత్రాలను రంగులమయం చేసిన వారి జీవితాల్లో రంగులు మాసిపోవడం నిజంగా బాధాకరం. తక్షణ చర్యగా నా కథనంలో రాసిన గోల్డ్ స్టోన్ నిబద్ధ కృషిఅనే పదబంధాన్ని, ‘రంగుల మాయాబజార్‌ను చూడకపోతే కూడా మనం తెలుగువాళ్లం కాదన్నమాటే.అనే చివరి వాక్యాన్ని నేను disown చేసుకుంటున్నాను. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున దాచేసిన దాగని సత్యాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. దయచేసి గోల్డ్ స్టోన్ సంస్థకు చెందిన నిజాలను నాకు పంపగలరు.
మీరు తెలిపిన ఈ చేదు నిజాన్ని చూసిన తర్వాత మాయాబజార్ నలుపు తెలుపులోనే బాగుంటుందనిపిస్తోంది.
  1. సుజాత on January 11, 2010 10:35 AM
మాయా బజార్ ని ఎంచేతో బ్లాక అండ్ వైట్ లోనే ఎంజాయ్ చెయ్యగలమేమో అని ఒక పక్క అనిపిస్తూనే మరో పక్క రంగుల్లో చూడాలని ఉబలాటపడుతున్న తరుణంలో అద్భుతమైన మీ పోస్టు మరో సారి ఆ డీవీడీ ని బయటికి తీసేలా చేసింది రాజు గారూ!
మాయాబజార్
తెలుగు జాతి సంపద
తెలుగు జాతి సంస్కృతి
తెలుగు జాతి సంతకం
తెలుగు జాతి మురిపెం
అక్షర సత్యాలు మీ మాటలు.
సినిమా కథ లింకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
అసలు ఘటోత్కచుడిని ప్రధాన పాత్రగా మలచాలన్న ఆలోచనకే లక్షలివ్వొచ్చు కదూ! ఆ ఆటవికుడి ఆహార్యం, మాటలు…!అద్భుతం!
ఎవరూ పుట్టించకుండా మాటలెలా పుడతాయి?”
వెయ్యండ్రా వీరతాడు
వారినలా చీల్చి చెండాడాల్సిందే(దుష్ట చతుష్టయమనే మాట సరిగా ఒక రాక్షసుడు సరిగా పలకలేనపుడు)ఇటువంటి మాటలు మర్చిపోగలమా?
పాటలో? ఎంత రాయాలి ఇక ?
మాయా శశిరేఖ లక్ష్మణ కుమారుడిని హడలెత్తించిన వైనం ఎన్ని సార్లు చూసినా నవ్వులు పూయించే సన్నివేశమే!
కానీ పైన భాను గారి కామెంట్ చదివాక చాలా సందేహాలు తలెత్తాయి.
మాయబజార్ కలరింగ్ కీ ఆ ఉద్యోగులు వీధిన పడటానికీ సంబంధం అర్థం కాలేదు. అది భాను గారే వివరిస్తే బాగుంటుందనిపిస్తోంది.
  1. రాజు on January 11, 2010 11:24 PM
సుజాత గారూ,
రాత్రి కాస్త త్వరగా నిద్రపోయాను. దీంతో మెయిల్స్ చూడలేదు. ఇంత చక్కటి వ్యాఖ్య పంపినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా వారి నలా చీల్చి చెండాడవలసిందేచూస్తుంటేనే నాకు నవ్వాగటం లేదు.
ఓ పని చేయండి. ఎలాగూ డీవీడీ బయటకు తీసారు కాబట్టి ఓపిగ్గా మళ్లీ చూసి ఆ అనుభూతిని పెద్ద ఆర్టికల్‌గా మల్చి మీ బ్లాగులో పోస్ట్ చేయండి. ఎంతమంది, ఎన్నిసార్లు రాసినా మళ్లీ మళ్లీ చదవాలనిపించే, చూడాలనిపించే చిత్రం కదా మాయాబజార్. నిజంగానే అది దశాబ్దాలుగా మనల్ని మాయ చేస్తూనే వస్తోంది. తప్పక సినిమాపై మీ అనుభూతిని పోస్ట్ చేయండి.
మాయాబజారు రంగుల వెనుక నీలినీడల గురించి భాను గారు నిన్ననే తిరిగి ఓ మెయిల్ పెట్టారు. రాత్రి చూడలేదు. దాన్ని కూడా మీ వ్యాఖ్య తరవాత ఇస్తున్నాను. చూడండి.
NB: అలవాటులో పొరపాటుగా మర్చిపోయినట్లుంది. మాయాబజార్ ఎన్ని సార్లు చూసినా, ఎన్ని సార్లు చదివినా బోర్ కొట్టదు. కమ్మటి ముద్దపప్పు, అవకాయ భొజనం, సుఖమైన నిద్ర, మాయాబజార్ సినిమా .. వీటికి ప్రత్యామ్నాయాలుంటాయా?” అంటూ బ్లాగర్ సురేష్ గారు పుస్తకం.నెట్‌లో మాయాబజార్ సినిమా సమీక్షపై తన వ్యాఖ్య పెట్టారు. http://pustakam.net/?p=67
దీనికి ప్రస్తుత నేపధ్యంలో నోరూరించే గటక, నోట్లో వేసుకుంటే కరిగిపోయే సంగటి,” అని కూడా జోడించుకోవాలి. ఎందుకంటే తెలంగాణా, రాయలసీమ సాంప్రదాయిక ఆహారంలో ఇవి మర్చిపోలేని, మరవకూడని భాగం మరి. (ఉత్తరాంధ్ర ప్రియమైన ఆహారం ఏమిటో నాకు తెలీదు.) ప్రాంతీయతను గౌరవించడం అంటే వారి వారి ఆహార అలవాట్లను కూడా గౌరవించాలి కదా.
ధన్యవాదాలు
రాజు
  1. రాజు on January 11, 2010 11:31 PM
మాయాబజార్ సినిమాకు రంగులద్దిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీస్ అంతర్గతవిషయాలు గురించి భాను గారు నిన్న సాయంత్రమే మరొక వ్యాఖ్య చేసి నాకు ఈమెయిల్‌లో పంపారు. పబ్లిక్‌కు సంబంధించిన ఈ అంతర్గత విషయాలను తోటి మాయాబజార్ అభిమానులకు తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో భాను గారి ఉత్తరాన్ని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
భానుగారికి ధన్యవాదాలు
from
bhanu majji
to
Raja Sekhara Raju
dateMon, Jan 11, 2010 at 5:21 PM
subjectRe: [చందమామ చరిత్ర] Comment: “తెలుగు సినిమా విశ్వరూపం మాయాబజార్”"
hide details 5:21 PM (16 hours ago)
Hi Raju ,
That’s a really fast reply !! .
Goldstone group flagship company is Goldstone technologies , which is decent company and it’s division is Goldstone Multimedia (atleast something similar name ) Initially they recruited any Degree holders by taking 25000 per head( mentioned as tuition fee ) , They were given some 5000-6000 rs and promised hike every year. As promised the first batch of recruiters were given 20k per month .For the next batch of recruits , there was never a hike , but only false promises , But they worked sincerely .
From the next batch onwards the fee taken was 75k (again non refundable ) . After Working on number of movies ,when employees asked about their hikes .(though salaries were paid , they were minimal) ,
Administration told them to wait till the movies get released . One fine day , Goldstone decided to close its multimedia division .
Now from the news it is known that mayabazaar was sold to Super good films , I believe that the rest of the movies would have been sold for profits. Now the employees who worked on them , have no job and since Goldstone is the only one such company (in hyd)that specialilses in coloring of black and white movies , The prev employees are forced to learn new skills
Regards
Bhanu
  1. srinivas on February 1, 2010 3:35 AM
ee cinema chala bagundi ani okka mata chebite sarepodu
telugu vadu gundechelchi arva valalsina mata adi
ee cinema na bu tho na bhvishyt vasu
  1. రాజేంద్రకుమార్ దేవరపల్లి on April 26, 2010 3:58 AM
రంగులమాయాబజార్ సినిమాను నేను చూడలేదు,చూడను కూడా.గతంలో మొఘల్-ఎ-అజమ్ ను రంగులలో చూసిన చేదుజ్ఞాపకం ఇంకా తాజాగా ఉంది.అయినా అది నా చిన్నతనపు మధురానుభవం,దాన్ని అలాగే మా పిల్లలకూ చూయించాను,మళ్ళీ మళ్ళీ చూస్తాను,చూయిస్తాను తప్ప ఈ రంగులసంకరంతో నాఅభిమానచిత్రాన్ని చూసి యెందుకు ఖేదపడాలి?చెప్పండి!!

0 comments:

Post a Comment