Pages

Saturday, January 14, 2023

స్టాలినూ.... కుమారుడూ...

 



స్టాలిన్ పక్కన ఉన్న ఆయన కొడుకు

యాకోబ్ జుకాష్ విలీ!

రెండవ ప్రపంచ యుద్ధంలో లెఫ్టినెంట్ సైనికుడు. 

రెడార్మీ సైనికులతో బాటు నాజీలకు ఖైదీగా దొరికాడు! 

యాకోబ్ నాజీల జైలులో నిర్బంధించబడ్డాడు.!


కొద్ది కాలంతరువాత నాజీల అత్యున్నత సైనికాధికారి 

మార్షల్ ఫెడరిక్ పాలస్ రష్యా రెడార్మీకి ఖైదీగా దొరికాడు!


తమ అత్యున్నత సైనికాధికారీ, యుధ్ధవ్యూహ నిపుణుడూ అయిన 

పాలస్‌ను విడిపించుకోడానికి నాజీలు బేరం పెట్టేరు!

మీరు మా పాలస్‌ను విడిచి పెడితే మేము

స్థాలిన్ కొడుకైన యాకోబ్‌ను విడుదల చేస్తామని ప్రతిపాదించారు!


అప్పుడు స్టాలిన్ ఏమన్నాడంటే..


నాకొడుకు తన తోటి రెడార్మీ

సైనికులతో విడుదలౌతాడు !

అంతేగానీ నా కుమారుడ కోసం 

పాలస్‌ను విడుదలచేసి

నా సోవియట్ ప్రజలను నరకానికి తోయలేనని 

స్థాలిన్ ఖైదీల మార్పిడీకి అంగీకరించలేదు!


దీనితో 1943 ఏప్రిల్ 14న యుధ్ధఖైదీ 

స్టాలిన్ కుమారుడు యాకోబ్ ను

నాజీలు కాల్చిచంపేరు!


దేశరక్షణకోసం స్టాలిన్ 

తన ప్రేమాస్పదుడైన కొడుకును త్యాగంచేశాడు!

కమ్యునిస్టుల జీవితాలు

త్యాగభరితంగా ఉంటాయి

..........................................


విజయవాడ నుంచి మా మంచి మిత్రుడు శ్రీను గారు వాట్సాప్‌లో పంపితే దొరికిన ఫోటో కథనం ఇది. 

సోషల్ మీడియా చేసే అతి గొప్ప పనుల్లో ఇది ఒకటి. చాలా ముఖ్యమైన విషయాలను, రహస్యంగా ఉండిపోయిన నిజాలను కూడా చాలా తేలిగ్గా పోస్ట్ చేసి ఊరకుండిపోతుంది. 

రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ అధినేత తన కొడుకును త్యాగం చేశాడని చదివి ఉంటాము కానీ యూనిఫాం ధరించిన కుమారుడితో కలిసి స్టాలిన్ ఫోటో దిగిన దృశ్యం ఇంతవరకు చూడలేదు. అందుకే ఇది అరుదైనది. 

కొరియా గడ్డపై అమెరికా యుద్ధంలో కొరియా పక్షాన నిలిచి మద్దతు పలికి, ప్రజావిముక్తి సైన్యాన్ని పంపించిన క్రమంలో తన కుమారుడిని కూడా యుద్ధంలో పోగొట్టుకుంటాడు చైనా అధినేత మావో సేటుంగ్. అప్పుడే పెళ్లయి భర్తను కోల్పోయిన తన కోడలికి సాంత్వన పలుకుతూ మావో చెప్పిన మాటలు మరుపురావు. తన కుటుంబ సభ్యులు కాబట్టే బందీగా దొరికిన కుమారుడి విషయంలో బేరసారాలకు తాను దిగలేదని ఆమెను ఓదార్చుతూ యావత్ చైనా విముక్తి కోసం సాధారణ ప్రజలు పడుతున్న బాధలను మావో గుర్తు చేసుకుంటాడు. 

అలాగే 1950ల కష్టకాలంలో హాస్టల్లో చదువుకుంటున్న మావో కన్న కూతురు తగిన రేషన్ లభ్యంకాక సగం ఆకలితో నకనకలాడుతూ తల్లిదండ్రుల  ఇంటికి వచ్చి, హాస్టల్లో రేషన్ విధించడం వల్ల కడుపు నిండా తినలేకపోతున్నానని పేవులను అంటుకుపోయిన కడుపును పట్టుకుని చూపించి తన పరిస్థితిని చెప్పలేక చెప్పినప్పుడు, కన్నకూతురు దీనస్థితిని తట్టుకోలేక 'తన కుటుంబంలో పుట్టారు కాబట్టే మీకు ఇలాంటి  బాధలు తల్లీ' అంటూ విలపిస్తూ చైనా చైర్మన్ మావో సేటుంగ్ విషాదంలో మునిగిపోయాడని చైనా సాహిత్యం చెబుతోంది. చివరకు మావో అంగరక్షకుడు ఆ పాపను తీసుకెళ్లి కోరినంత తిండిపెడితే ఆబగా తిన్న వైనం కూడా మనం చదువుకున్నాం. 

సంపదను, లేమిని, సంతోషాన్ని, విచారాన్ని కూడా ప్రజలు, నాయకత్వం సమానంగా పంచుకుని జీవించిన నిజమైన ప్రజా జీవితమది. నిత్యదారిద్ర్యంలో కునారిల్లుతున్న వారు, తరాలు కూర్చుని తిన్నా సంపద మేట కరగని భాగ్యజీవితంతో మదిస్తున్నవారు ఉంటున్న మన సమాజాన్ని ఆనాటి చైనా, సోవియట్ యూనియన్ ఆదర్శాలతో పోల్చనైనా పోల్చలేమేమో...

విప్లవం సాధించిన సోవియట్ యూనియన్, చైనా వంటి దేశాల్లో దేశనాయకుల పిల్లలు తిండి విషయంలో కూడా ఇంత పక్షపాత రహితంగా పెరిగారని, అవసరమైనప్పుడు ప్రాణత్యాగాలు కూడా చేశారని తెలిస్తే మన రాజకీయ నాయకులు, వారి పిల్లల వైభోగం చూసి చీదరపుడుతుంది. ఎలాంటి అసమాన సమాజంలో మనం ఉంటున్నామోనని అగ్రహం కలుగుతుంది. 


మీ త్యాగం ఉన్నతమైనది అదీ హిమశిఖరాల వంటిదీ.. 

మీ ఆశయం శాశ్వతమైనది. అది కమ్యూనిజం తెస్తనంటదీ... 

30 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో విప్లవోద్యమం రాసి, పాడుకున్న మహాద్భుతమైన కారుణ్య గీతం ఇది.

కమ్యూనిస్టులు ముఖ్యంగా విప్లవోద్యమ కార్యకార్తలు అంటేనే ద్వేషంతో గొంతు చించుకుంచుకుంటున్నవారికి కమ్యూనిస్టులు త్యాగాలు అణుమాత్రంగా కూడా అర్థం కావు. ప్రయత్నించరు కూడా.

ఇలాంటి వారిని చూసే కాబోలు... 1948 ప్రాంతంలో తెలుగునేలపై తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టుల ప్రాణార్పణల వార్తలను విని ప్రముఖ సాహితీవేత్త గుడిపాటి వెంకటా చెలం గారు ఒకే వ్యాఖ్య చేశారు. 'కమ్యూనిస్టుల విధానాలను నేను అంగీకరించక పోవచ్చు. కానీ జీవితాన్ని తృణప్రాయంగా ప్రజల కోసం అర్పించే వారి త్యాగాన్ని శిరసున పెట్టుకుంటాను' అన్నారాయన.

.................................


స్టాలిన్ తనయుడితో కూడిన ఈ ఫోటో సహిత వ్యాఖ్యను పంపగానే మిత్రులు ఆలూరి రాఘవ శర్మ గారి తక్షణ స్పందన ఇది. చూడండి.

''చాలా అరుదైనది. గొప్పది. దేశం కోసం స్టాలిన్ కొడుకును త్యాగం చేస్తే , కొడుకు కోసం, వారసుల కోసం దేశాన్ని త్యాగం చేస్తారు మన నాయకులు.

నేను fb లో పోస్టు చేస్తాను.''

శ్రీనుగారూ చాలా చాలా ధన్యవాదాలండి. స్టాలిన్, ఆయన కుమారుడి ఫోటోతో కూడిన వ్యాఖ్యను వాట్సాప్ లో పంపి ఒక్కసారిగా పాత జ్ఞాపకాలను తవ్వుకునేలా చేశారు. థ్యాంక్యూ అండి.

Wednesday, November 16, 2022

గ్లాసెడు నీళ్ల సిద్ధాంతం - వీఐ లెనిన్

 

''ఆడపిల్లలకు..

''పెళ్లికి ముందు సెక్స్ విషయంలో ఏవో కొన్ని విలువలు మీకు మీరే ఏర్పరచుకోండి. ఎలాంటివి అని నన్ను అడిగితే నేను చెప్పలేను. మీ చదువు, అనుభవం, మీ గతం, మీ కుటుంబం, మీ పరిసరాల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలో, మరొకటో..ఏవో కొన్ని విలువలను సెక్స్‌కు జత చేసుకోండి. దాని వల్ల శారీరక సంబంధాలలోకి దిగేటప్పుడు, మీకొక అడ్డంకి ఉంటుంది. అది దాటే ముందు ఒకసారి ఆలోచిస్తారు. ఇది చాలా అవసరం'' అంటూ బీబీసీ తెలుగు విభాగంలో పనిచేస్తున్న ఆలమూరు సౌమ్య గారు రాసిన ఈ కథనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ...''

ఆమె  రాసిన ఒరిజనల్ కథనాన్ని తప్పకుండా పూర్తిగా చదవండి. ఆమె వ్యాసంపై ఒక సినీ మిత్రుడితో ఇటీవలే సాగించిన వాట్సాప్ సంభాషణ క్రమంలో నాటి సోవియన్ యూనియన్ అధినేత వీఐ లెనిన్ రాసిన గ్లాసెడు నీళ్ల సిద్ధాంతం గురించిన ప్రస్తావన కూడా వచ్చింది. ఆమె కథనం సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్‌కి గురవుతోందో తెలిసిందే. దీనిపై నా సినీమిత్రుడికి నాకూ మధ్య జరిగిన వాట్సాప్ చర్చను పంచుకోవాలనిపించింది. సమయం ఉన్నప్పుడు దీన్ని తీరిగ్గా చూడండి.

సర్, ఆలమూరు సౌమ్య రాసిన కింది అంశాలు మరో కోణంలో చూడాలనుకుంటాను. సెక్స్ సంబంధాల్లో మోసపోతే జీవితమే కోల్పోయినట్లు భావించవద్దని ఆమె ప్రధాన అభిప్రాయం.

''తెలివి తెచ్చుకోండి. సెక్స్ ముఖ్యమే, కానీ దానికి ఇవ్వాల్సినత ప్రాముఖ్యమే ఇవ్వండి. అదే జీవితం కాదు. సెక్స్‌ని ఒక శారీరక అవసరంగా చూడడం నేర్చుకోండి. దానికి విలువ ఇవ్వండి. గౌరవించండి. దాని ద్వారా ఆనందం కలగాలి తప్పితే బాధ కాదు. వ్యక్తిగత హక్కును ఉపయోగించుకోవడం ఎంత సంతోషమో, ఎంత గర్వమో గుర్తించండి. తెలివిగా ఉండండి...... వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అని ఏడుస్తూ జీవితాలను నాశనం చేసుకోకండి. వాడెలా దులిపేసుకుంటున్నాడో, మీరూ అలా దులిపేసుకోండి. దానికి కావలసిన దన్ను సంపాయించండి. ఈ కాలం అమ్మాయిలకు కావలసింది ఈ తెలివితేటలే. ఇంకా ఎన్నాళ్లని ఈ ఏడుపులు, కేసులు.. అవీ ఎటూ తేలక వేదన, బాధ!''

''శారీరక సంబంధాలలో ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోకండి. తలలో దురదగా ఉంటే తల స్నానం చేసి ఆ దురదని వదిలించుకుంటాం కదా, అలా శరీరానికి పట్టిన దురదను వదిలించేసుకుని, తలంటుకోండి. అంతటితో దాన్ని వదిలేయండి'' అంటూ సౌమ్య చెప్పిన దాన్ని కూడా.. ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్న వారికి 2020ల నాటి సమాజంలో జీవితం పట్ల భరోసా కల్పించడానికేనని అర్థం చేసుకోవాలనుకుంటాను.''


లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న ప్రేమికురాలిని ఢిల్లీలో ఒక ప్రేమికుడి రూపంలోని ఉన్మాది నిలువునా చంపేసి 35 ముక్కలుగా నరికి, వాటిని ఫ్రిజ్ లో  పెట్టి 18 రోజులపాటు సమీపంలోని అడవిలో పారేసి అయిదు నెలలపాటు దొరక్కుండా దాగిన విషయం రెండురోజులుగా బయటపడుతోంది. ఇప్పుడు సెక్సు వాంఛలు తీర్చుకునేంత వరకు అన్ని లివ్ ఇన్ రిలేషన్లు పనికివస్తాయి. అది పెళ్లి దాకా తీసుకువచ్చేసరికి హత్యలు, శరీరాన్ని ముక్కలు చేసి వాటిని ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచి రోజూ ఆమె తల చూస్తూ గడిపే నికృష్ట కాలం మన కళ్లముందుకే వచ్చేసింది. ప్రేమ లేక సెక్స్ లేదా స్త్రీపురుష బంధాన్ని వ్యక్తిగతంగా మాత్రమే చూస్తూ కాలం నెట్టుకొస్తున్న రోజులివి. ఆధునిక స్త్రీ చరిత్ర తిరగరాస్తుందని గురజాడ ఏనాడో అన్నారు. నవీన స్త్రీ స్వేచ్చను ఇక ఎవరూ అరికట్టలేరని 90 ఏళ్ల క్రితమే చెలం ఆధునికతకు తనదైన నిర్వచనం ఇచ్చేశారు. కానీ వ్యక్తిత్వం లేని స్వేచ్ఛ, లైంగిక సంబంధం మాత్రమే ప్రధానం అంటున్న స్వేచ్చ, స్వీయ నియంత్రణ అనేదానికి అర్థం తెలీని స్వేచ్ఛ అనేవి స్త్రీ స్వేచ్ఛ అనే భావనకే సరికొత్త శృంఖలాలను బిగిస్తోందా.. ఆ పాడుకాలమే సరికొత్త రూపంలో లయిస్తోందా.. 

వందేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన సోవియట్ యూనియన్ పాలనా కాలంలో రష్యన్ సమాజంలో యువతీయువకుల మధ్య ఏర్పడుతున్న సంబంధాలు, ప్రేమ, లైంగిక ఆకాంక్షలు వంటి వాటిపై సోవియట్ యూనియన్ అధినేత వీఐ లెనిన్, క్లారా జెట్కిన్ తదితరులతో చర్చించారు. ప్రేమ, సెక్స్, కోరికలు వ్యక్తిగతమైనవి కావని, వాటిలోని సామాజిక అంశాన్ని వాటి చుట్టూ ఏర్పడే కుటుంబాన్ని, సమాజం పట్ల ప్రేమికుల బాధ్యతను కూడా మర్చిపోరాదని లెనిన్ ఆ సంభాషణలో చెప్పారు. రష్యన్ యువత ప్రేమను, లైంగిక జీవితాన్ని పూర్తిగా వ్యక్తిగత సమస్యగా చూస్తున్నారు. ఇది తప్పు అని లెనిన్ స్పష్టం చేశారు. 

వందేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగుసమాజంలో సెక్స్, ప్రేమ, శారీరక సంబంధాల పట్ల తాజాగా జరుగుతున్న చర్చ సందర్భంగా లెనిన్ వ్యాఖ్యలు మరోసారి పరామర్శించాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను, ఆధునిక స్త్రీ వందేళ్ల ప్రయాణంలో భాగంగా ఇప్పుడు వారిముందు కెరీర్ పరంగా, విద్య పరంగా, ఆకాంక్షల పరంగా ఎన్నో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రేమ పేరుతో మోసపోతే, వంచనకు గురైతే వారు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశంలో ఆలమూరు సౌమ్య రాసిన విషయాలు ఆధునిక సమాజంలో స్త్రీ భావాలకు పట్టం కట్టేవే.


లెనిన్ ఏం చెప్పారంటే..

లైంగిక వాంఛను తీర్చుకోవడం అనేది గ్లాసెడు మంచినీళ్లు తాగడం అంత సింపుల్ గా ఉంటుందని 1910, 20లలో రష్యా సమాజంలో బలపడిన అభిప్రాయాలను లెనిన్ తీవ్రంగా ఖండించారు. ''ఈ గ్లాసెడు మంచి నీళ్ల సిద్ధాంతం మన యువతను పిచ్చెక్కిస్తోంది. కానీ ఈ సిద్ధాంతం కచ్చితంగా మార్క్సిస్టు వ్యతిరేకమైంది. పైగా ఇది సంఘ వ్యతిరేకం కూడా. సెక్సువల్ లైఫ్‌ సులభమైన అంశం కాదు. దీనిలో సాంస్కృతిక లక్షణాలు ముడిపడి ఉన్నాయి. సెక్సులోని సామాజిక అంశాన్ని మర్చిపోరాదు. గ్లాసెడు నీళ్లు తాగడం అనేది వ్యక్తిగత వ్యవహారమే కావచ్చు. కానీ ప్రేమ అనేది రెండు జీవితాలకు సంబంధించింది. దీంట్లో బిడ్డ రూపంలో మరో ప్రాణి జీవితం కూడా ఉంది. ఇక్కడే సామాజిక ఆసక్తితోపాటు కమ్యూనిటీ పట్ల బాధ్యత కూడా ఉంది'' అని క్లారా జెట్కిన్‌తో లెనిన్ చర్చించారు. ఈ గ్లాసెడు మంచి నీళ్ల సిద్ధాంతం స్థానంలో స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణకు లెనిన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

లైంగిక జీవితంలో కరిగిపోవడం అనేది తనకు తానుగా బూర్జువా సంస్కృతి క్షీణ దశ అనే చెప్పాలి. దీన్ని కమ్యూనిస్టులు అనుకరించకూడదు. బూర్డువా క్షీణ ఆలోచనలకు ఈ గ్లాసెడ్ మంచినీళ్ల సిద్ధాంతం ఏ రకంగానూ విభిన్నం కాదని లెనిన్ హెచ్చరించారు. ప్రేమలోని సామాజిక అంశాన్ని ఈ గ్లాసెడు మంచినీళ్ల సిద్ధాంతం పూర్తిగా విస్మరిస్తోందని లెనిన్ నొక్కి చెప్పారు. 

రష్యన్ యువత ప్రేమను, లైంగిక జీవితాన్ని పూర్తిగా వ్యక్తిగత సమస్యగా చూస్తున్నారు. ఇది తప్పు అని లెనిన్ స్పష్టం చేశారు. కమ్యూనిస్టుగా ఈ గ్లాసెడు మంచినీళ్ల సిద్ధాంతం పట్ల కనీస సానుభూతి కూడా నేను ప్రదర్శించను. ప్రేమలో సంతృప్తి అనే చక్కటి శీర్షికతో ఇది ముందుకొస్తోంది అని లెనిన్ వ్యాఖ్యానించారు.

కాబట్టి...

శారీరక ఆకర్షణలకు, వయోగతంగా అనివార్యంగా పుట్టుకొచ్చే లైంగిక వాంఛలకు లోనై వంచనకు గురవుతున్న వారికి మాత్రమే ఆలమూరు సౌమ్య అభిప్రాయాలు వర్తిస్తాయి. ఉద్యమ జీవితం, సామాజిక బాధ్యతల్లో మునిగి తేలేవారికి ఇవి వర్తించవు. ఎందుకంటే వీరు సెక్స్‌ వాంఛలను అదుపులో పెట్టుకునే చైతన్యం కలిగి ఉంటారు. కమ్యూనిస్టు, విప్లవ ఉద్యమ కార్యకర్తల్లో బలహీన క్షణాలకు గురికాని వారు ఉండరని గ్యారంటీ లేదు. కానీ లెనిన్ చెప్పిన స్వీయ క్రమశిక్షణ , స్వీయ నియంత్రణ ఇప్పటికీ వీరికి అనుభవ సత్యంగానే ఉంటుంది.

“Glass-of-water theory”

“You must be aware of the famous theory that in communist society the satisfaction of sexual desire, of love, will be as simple and unimportant as drinking a glass of water. The glass of water theory has made our young people mad, quite mad…I think this glass of water theory is completely un-Marxist, and moreover, anti-social. In sexual life there is not only simple nature to be considered, but also cultural characteristics, whether they are of a high or low order…Of course, thirst must be satisfied. But will the normal man in normal circumstances lie down in the gutter and drink out of a puddle, or out of a glass with a rim greasy from many lips? But the social aspect is the most important of all. Drinking water is of course an individual affair. But in love two lives are concerned, and a third, a new life, arises. It is that which gives it its social interest, which gives rise to a duty towards the community.”(Clara Zetkin, Reminiscences of Lenin, p. 49)

Lenin, in particular, pointed out that the “glass-of-water theory” completely ignored the social aspect of love. Certainly the drinking of a cup of water is merely an individual thing. But love, although seen as something “private,” in fact has another aspect. Love is first of all a relationship and connection between two people. Therefore, it is already a social relation. Moreover, through the connection of two people, a “third new life” can be born. Seen from the perspective of humanity, the birth of a child through the relationship between a man and a woman is of decisive social importance. Thus, the social significance of love must be noted, rather than viewing it as purely individual problem. Young people tend to view this as a purely individual problem, and there is no lack of theories that appeal to this tendency. However, according to Lenin this is a mistake and he says that, “as a communist I have not the least sympathy for the glass of water theory, although it bears the fine title ‘satisfaction of love.’


Sunday, July 31, 2022

సారపు ధర్మమున్ విమల సత్యము...




దాదాపు 45 ఏళ్లకు ముందుమాట. చిన్నవయసులోనే పాఠ్య పుస్తకాలతోపాటు చందమామ, బాలమిత్ర వంటి బాలల కథా పత్రికలు (చందమామ ఆబాల గోపాల పత్రిక అని తర్వాత్తర్వాత అర్థమైందనుకోండి), ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి పత్రికలు, (ఈనాడు అప్పటికి ఊళ్లలోకి రాలేదు)  ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి వారపత్రికలు పల్లెటూర్లోని మా కుటుంబాలను ప్రతినెల, ప్రతి రోజూ పలకరిస్తున్న కాలమది. ఎమెస్కో పాకెట్ బుక్స్ పథకం ద్వారా వంద రూపాయల సంవత్సర చందా ఒకేసారి కట్టేసి నెలకు మూడు పుస్తకాలు నాన్న తెప్పిస్తూ పుస్తకాలు చదవండిరా జ్ఞానమొస్తుంది అని చెప్పి ప్రోత్సహించిన కాలమది. (అప్పట్లో ఒక పుస్తకం కనిష్ట ధర 3 రూపాయలు మాత్రమే. పది రూపాయలకు మూడు పుస్తకాలు పోస్టులో పంపేవారు) 

ఆనాడు ఏకైక వినోదసాధనం రేడియో మాత్రమే కాబట్టి శ్రీలంక తెలుగు రేడియోలో మీనాక్షి పొన్నుదురై అనే తెలుగు ప్రోగ్రామర్ అద్భుతమైన మాటలు, ఆ తర్వాత ఆమె శ్రోతలు వినడానికి వేసే మధురమైన పాత సినిమా పాటలు వింటూ, రేడియోలో రాత్రిపూట క్రమం తప్పకుండా వచ్చే పద్య నాటకాలు వింటూ బాల్యాన్ని పారవశ్యంగా గడుపుతున్న కాలమది. ఇదంతా 1970ల మధ్య నాటి ముచ్చట. ఆమెను మీనాక్షి అక్కయ్యా అని ఉత్తరాల్లో సంబోధించేవారని గుర్తు. ఆమె మాటల, పాటల ప్రజెంటేషన్ ఎంత ఆకర్షణీయంగా ఉండేదంటే నాటి ఆంధప్రదేశ్ లోని జిల్లాల నుంచి శ్రీలంక రేడియో శ్రోతలు వెర్రెత్తిపోయి ఆమెకు లేఖలు రాసేవారు. వాటిలో ఒకటి రెండు తదుపరి వారం చదివి వినిపించేవారామె. ఆమె తెలుగు మాట్లాడే తీరు తమాషాగా ఉండేదని తిరుపతి సీనియర్ జర్నలిస్టు మిత్రులు రాఘవ శర్మ గారు ఇప్పుడే గుర్తు చేశారు. బహుశా ఆమె తమిళ మూలాలు దీనికి కారణం కావచ్చు. 

ఆమె ఉచ్ఛారణ తీరు అలా ఉంచితే ఆమె శ్రోతలకు ఆపాత మధురమైన తెలుగు పాత సినిమా పాటలు అందించేవారు. మధ్యాహ్నం తర్వాత అరగంట ప్రోగ్రామ్ టైం అయిపోగానే వినపడుతున్న పాటను అలాగే కట్ చేసి మరొక భాషా ప్రోగ్రామర్ వచ్చేవారు. ప్రాణం ఉసూరుమనేది. శ్రీలంక రేడియోలో తెలుగు పాటల కార్యక్రమం పూర్తికాగానే మరొక మహిళ తమిళంలో సినీ పాటల కార్యక్రమం మొదలెట్టేవారు ఇక పండుగల వేళ ఊరిలో హరికథలు, భజన పాటలు కలిగించే మహదానందం గురించి చెప్పాల్సిన పనిలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచేకొద్దీ వందలు కాదు వేల పుస్తకాలు (డిటెక్టివ్ నవలలు, మాసపత్రికలు, వాటిలోని సీరియల్స్, కథలు, బాలల పత్రికలు, వార పత్రికలు,  దినపత్రికలు, వాటిలోని రాజకీయాంశాలు... ఇలా చదవని పుస్తకం లేని కాలం కూడా వచ్చేసిందనుకోండి) చదివిన అనుభవం తక్కువ కాదు. 

చివరికి ఈ చదివే పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే రాయచోటిలో 1977-83 మధ్య కాలంలో నేను ఇంటర్, డిగ్రీ చదువుతున్న సంవత్సరాల్లో రోడ్డుమీద చింపి పడేసిన పేపర్ ముక్కలు కూడా గబాలున తీసుకుని నడుస్తూ చదువుకుంటూ పోతుండగా, రోడ్డు మీద జనం వింతగా చూస్తూ పోయే పరిస్థితి వచ్చేసింది. ఇదంతా బాల్యజీవితం నుంచి కౌమార జీవితంలోకి అడుగుపెడుతున్న కాలంలో నేను పొందిన జీవిత వికాస అనుభవం. 

ఇదంతా ఒకెత్తు అయితే.. ఇంట్లో అమ్మ ద్వారా మాకు లభ్యమైన సాహిత్య, సాంస్కృతిక, సినీ జ్ఞాన సంపద ఒకెత్తు. పద్యం, పాట తెలుగు సాహిత్యానికి రెండు కళ్లు అని ఆమె భావయుక్తంగా పాడి వినిపించేది. సావిత్రి అంతటి గొప్ప నటి, భానుమతి అంతటి గొప్ప గాయని, ఘంటసాల వంటి మేటి గాయకుడు ప్రపంచంలోనే ఉండరు, ఉండబోరు అని ఆమె ప్రగాఢ నమ్మకం. అలాగని సుశీల, లీల, జిక్కీ, జానకి వంటి గాయనిల దివ్య గాన లహరిని ఆమె తక్కువ చేసింది లేదనుకోండి. కానీ నటనలో సావిత్రి, సంగీతాలాపనలో భానుమతి, ఘంటసాలను మించినవారు మరొకరు ఉండరని ఆమె నమ్మకం. 

అన్నింటికంటే మించి ఎమెస్కో బుక్స్ ద్వారా ఆరోజుల్లో మా ఇళ్లలోకి వచ్చిపడిన ఉషశ్రీ భారతం, ఉషశ్రీ రామాయణం చదువుతూ ఆయన అద్భుతమైన శైలిని మైమర్చిపోతూ మళ్లీ మళ్లీ చదువుకోవడం ఒక గొప్ప జ్ఞాపకం. అమ్మ పెద్దగా చదువుకోలేదు. మహా అయితే ఆరో తరగతితో ఆమె చదువు నిల్చిపోయిందనుకుంటాను. కానీ తన తరంలో (1960లలో) రచయిత్రుల సీరియల్స్, నవలల ద్వారా చదవటం అనే అభ్యాసం చక్కగా అలవాటు చేసుకున్న అమ్మ సాహిత్య, సాంస్కృతిక అంశాలపై స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉండేది. గురజాడ కన్యాశుల్కం వంటి గొప్ప నాటకం మనం ఏ భాషలోనూ చూడలేమని ఆమె చెప్పిన తర్వాతే నాన్న వద్ద పోరు పెట్టి కన్యాశుల్కం నాటకాన్ని ఎమెస్కో పాకెట్ బుక్స్ ద్వారా తెప్పించి మరీ మేం చదివిన అనుభవం మర్చిపోలేను. తెలుగు సమాజంలోని సామాన్యుల మాండలికాలను సమగ్ర స్వరూపంతో పరిచయం చేసిన తొలి నాటకం కన్యాశుల్కం. ఆ నాటకంలో గురజాడ అప్పారావు వాడిన ఇంగ్లీషు వ్యాక్యాలు, పదాలు తదుపరి నాలుగైదేళ్లలో మళ్లీ మళ్లీ చదివిన తర్వాత కానీ అర్థం కాలేదంటే నేను సిగ్గుపడాల్సిందేమీ లేదు. 

ముఖ్యంగా నాచ్చి క్వశ్చన్ అనే పదం గింజుకున్నా అర్థం అయ్యేది కాదు. కానీ ''ఏం వాయ్ మైడియర్ వెంకటేశం.. నిన్ను సురేంద్రనాథ్ బానర్జీ అంతటి వాడిని చేస్తానోయ్'' అంటూ గిరీశం కోసే కోతలు కడుపుబ్బా నవ్వించేవి. అంత చిన్నవయస్సులోనే అగ్నిహోత్రావధాన్లు పేరు వింటేనే వణుకు వచ్చేది. ఎందుకంటే తెలుగు కుటుంబాల్లో అప్పటికీ ఇప్పటికీ నాన్నలంటే ఎవరిమాటా వినని, చెప్పినా పట్టించుకోని అగ్నిహోత్రావధానుల వంటి వారే కదా. కానీ... తాంబూలం ఇచ్చేశాను తన్నుకు చావండి అంటూ కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు వేసిన డైలాగ్ ఇప్పటికీ జ్ఞాపకాల్లో ఉంటూనే వస్తోంది. ఇక రామప్పంతులును 'లొటి పిట' అంటూ మధురవాణి ఆటాడించడం, ఎవడో మంచం కింద దూరినట్లుందే అంటూ గిరీశం అన్నప్పుడు, మధురవాణి తర్జని చూపిస్తూ మంచం కింద రామప్పంతులు దూరాడని సంజ్ఞ చేయడం... సినిమాలో చూపించినంత దృశ్యమానంగా అంత చిన్న వయసులోనే స్ఫురించి నవ్వు తెప్పించేది. ''స్వతంత్రం వచ్చింది సరే ఊరి హెడ్ కనిస్టీబును ఎప్పుడు మారుస్తారు'' అంటూ ఈ నాటకంలో ఒక పాత్రధారి అడగటం షాక్ కలిగించింది. ఈ వందేళ్లపైబడిన కాలంలో మన పోలీసుల పట్ల జనంలో ఉన్న ఈ వ్యతిరేకత కాస్తయినా తొలిగిందా అంటే డౌటే మరి.


మరోసారి సారపుధర్మమున్ విమల సత్యము...

ఇదంతా ఒక కథ అయితే అమ్మ మహాభారతంలోని ఒక పద్యాన్ని విశేషంగా మా మధ్య మాటల్లో ప్రస్తావించేది. సారపు ధర్మమున్ విమల సత్యము అనే పద్యం ఒక్కటి మిగిలి, తక్కిన మహాభారతం లేకుండా పోయినా ఆ గ్రంథం విలువ తగ్గదు అనే బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేదామె. ఆ పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించి వినిపించేది. అంత విలువ ఏమిటో ఆ చిన్ని బాల్యంలో మాకు అర్థం కాలేదు కానీ తర్వాత రోజుల్లో ఎస్వీ యూనివర్సిటీకి వచ్చి అక్కడి లైబ్రరీలో తెలుగు విభాగంలో భారతి, జయంతి వంటి సాహిత్య మాస పత్రికల బౌండు పుస్తకాలు వెతికినప్పుడు ఆ పద్యం విశేషాలను తరచి తరిచి చూసి తెలుసుకున్నాను. సత్యాన్ని, ధర్మాన్ని దక్షత ఉండీ రక్షించకపోతే ఆ సమర్థునికే చేటు కలుగుతుంది కానీ దైవం మాత్రం చూస్తూ ఊరకుండడనీ, దెబ్బతింటున్న ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని తప్పకుండా కాపాడతాడు అనీ ఈ పద్యం అర్థం. 


సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ

బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె

వ్వార లుపేక్ష చేసిరది వారల చేటు గాని ధర్మ ని

స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్.


ఇన్నేళ్ల తర్వాత సారపు ధర్మమున్ విమల సత్యమున్ పద్యాన్ని రావిశాస్త్రి గారు రాసిన 'నిజం' కథకు అన్వయిస్తూ ఈ జూలై 30న సాక్షి సంపాదక పేజీలో (శనివారం) వచ్చిన ఒక అద్భుత వ్యాసం చూశాను. రావిశాస్త్రి శతజయంతి సందర్భంగా ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పేజీ ఆయన శత జయంతి జ్ఞాపకాలను ఏ తెలుగు వార్తా పత్రికకూ సాధ్యం కాని రీతిలో అక్షరీకరించిందనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఈ ప్రత్యేక పేజీలో రావిశాస్రి గురించి వచ్చిన ఆ అయిదు కథనాలూ విలువైనవే కానీ తిక్కన మహాభారతంలో రాసిన ఆ గొప్ప పద్యంతో పోలుస్తూ, రావిశాస్త్రి 60 ఏళ్ల క్రితం 1962లో రాసిన 'నిజం' నాటకాన్ని అందులోని ఒక కథనం ప్రస్తావించింది. 'అరవై ఏళ్లయినా అదే నిజం'' అనే పేరుతో వచ్చిన ఆ వ్యాసకర్త రాంభట్ల నృసింహశర్మ గారు.

నిజం నీరు కారిపోయి పత్తేదారులక్కూడా పత్తా లేకుండా ఏ లోతుల్లోకో యింకిపోకుండా కాపు కాయడానికే న్యాయ, పోలీసు వ్యవస్థలున్నాయి. మరి అవి అలా పన్జేస్తున్నాయా? చేసుండుంటే శాస్త్రిగారు ఈ నాటకం ఎందుకు రాసి ఉండేవారు అని ఆ వ్యాసంలో ప్రశ్నించారు రచయిత. ఈయన మాటల్లోనే 'నిజం' గురించి చదువుకుందాం..

''పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ తదితర ముఖ్య స్థాయిల్లో దక్షులైనవారంతా నిజం చెప్పకపోతే ఏమవుతుందో, ఆంధ్రమహాభారతం ఉద్యోగ పర్వంలో చెప్పకనే చెప్పారు తిక్కన. 'సారపు ధర్మమున్ విమల సత్యము, పాపము చేత బొంకుచే' అనే పద్యంలో... చేతనైన వాళ్లు కూడా న్యాయధర్మాలను కాపాడే సత్యదీక్షను నిర్లక్ష్యం చేస్తే కాపాడే బాధ్యతను దైవమే తీసుకొంటుందని తిక్కన ఏడు శతాబ్దాల క్రితమే సూచ్యం చేశారు. కానీ అరవైఏళ్ల క్రితం 'మీరింక మారరు, కాదు, మారుతానంటారా! ఎప్పుడో బాణం పట్టుకు శ్రీరాముడో, నాగలి పట్టుకు ఏ బలరాముడో ఒస్తే మీరు మారాలేమో కానీ, మీరు మరింక మారరు. మీరే కానీ మారితే, భగవంతుడున్నాడనే లెక్క. మిమ్మల్ని మంచికి మార్చగల వారెవరైనా ఉంటే భగవంతునితో సమానమనే లెక్క'' అని సుశీల పలికిన 'నిజం' నాటకం ఇప్పుడు అరవయ్యేపడిలో పడింది''.

... కాబట్టి నిజం, దేవుడు అనేవి రెండూ లేవు. ఈ రెండూ వేర్వేరూ కావు. దేవుడు నిజమైనా కాకున్నా, నిజమే దేవుడు అన్న సత్యం ఆవిష్కృతమయ్యేలా రావిశాస్త్రి రాసిన నాటకం 'నిజం' అని రాంభట్లగారు తన ఈ చిన్ని కథనంలో పేర్కొన్నారు.

ఎప్పుడో 45 ఏళ్ల క్రితం 1975 ప్రాంతాల్లో అమ్మ ద్వారా నేను విన్న ఆ 'సారపు ధర్మమున్ విమల సత్యము'  పద్యం ఆంద్ర మహాభారత రచనాకాలం నుంచి నేటివరకు ఒకే సత్యాన్ని గొప్పగా చెబుతూ వస్తోంది. సమర్థులైన వారు కూడా అసత్యం నుంచి సత్యాన్ని, అధర్మం నుంచి ధర్మాన్ని కాపాడకపోతే, సత్య దీక్షను నిర్లక్ష్యం చేస్తే ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని కాపాడే బాధ్యతను దైవమే తీసుకుంటాడన్నది 'సారపు ధర్మమున్' పద్య సారం. ప్రాచీన సాహిత్యంలో సామాజిక వాస్తవాన్ని ఆ నాటి పరిమితుల్లోనే ఎంత గొప్పగా ఈ పద్యం చెప్పిందో చూడాలి మరి. కానీ రావిశాస్త్రి గారు 60 క్రితం రాసిన 'నిజం' నాటకం కూడా సత్యాన్ని, ధర్మాన్ని రక్షించలేని వ్యవస్థలే నేటికీ రాజ్యమేలుతున్నాయని సారపు ధర్మమున్ పద్యం సాక్షిగా కొత్త రూపంలో చాటి చెప్పింది.


ఆ అపరూప ప్రత్యేక సంచికలో రావిశాస్త్రిగారి శతజయంతి సందర్భంగా వచ్చిన అయిదు చక్కటి వ్యాసాల కోసం కింది లింక్‌లో చూడండి


అల్పజీవుల బుద్ధిజీవి

https://epaper.sakshi.com/3551526/Hyderabad-Main/30-07-2022#page/6/1


(30-07-2022 నాటి సాక్షి సంపాదకీయ పేజీ రావిశాస్త్రి శతజయంతి ప్రత్యేక సంచిక)

...................................................


కొసమెరుపు:

సారపు ధర్మమున్ పద్య భావం గురించి నెట్‌లో వెతికితే దొరికిన సమాచారం...

సారపు ధర్మమున్ విమల సత్యము పద్యం ఆంధ్రమహాభారతములో ఉద్యోగ పర్వంలో తృతీయాశ్వాసంలో తిక్కన చెప్పిన పద్యమిది. అత్యంత ప్రాచుర్యం పొందిన, తెలుగు సమాజంలో సూక్తిగా, వ్యాఖ్యగా పలుమార్లు పలు సందర్భాల్లో తిరిగితిరిగి చెప్పుకున్న పద్యమిది. సత్యాన్ని, ధర్మాన్ని దక్షత ఉండీ రక్షించకపోతే అది ఆ సమర్థునికే చేటు.

సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ

బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె

వ్వార లుపేక్ష చేసిరది వారల చేటు గాని ధర్మ ని

స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్.


ఒక అనువాదం

ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది గాని ధర్మనిస్తారకము, సత్యశుభదాయకము అయిన దైవం లేకపోలేదు. కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. ఆ సత్యధర్మాలను ఉద్ధరించటానికి దక్షులైన భీష్మద్రోణాదులు ఉపేక్ష వహిస్తున్నారు. దీనివలన వారికి కీడు కలుగుతుందే గాని సత్యాన్ని, ధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు.


మరొక అనువాదం

సారమైన ధర్మం పాపం చేతా, ఏ మాలిన్యమూలేని సత్యం బొంకు చేతా గట్టెక్కలేక చెడిపోయే దశను సమర్థులైనవారు ఉపేక్ష చేస్తే అది వారికి చేటు తెస్తుంది. కాని ధర్మాన్ని గట్టెక్కించేది సత్య శుభస్థితిని యోగ్యులకు సమకూర్చేదీ అయిన దైవము ఎల్లవేళలా ఉంటుంది.

మహాభారతంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో భీష్మునితో శ్రీకృష్ణుని సంభాషణలో భాగమైనదీ పద్యం. సమర్థత కలిగివుండీ సత్యము, ధర్మము పాడయ్యేప్పుడు భీష్ముడి వంటి దక్షుడు కాపాడకపోతే ఆయనే పాడవుతాడని, కానీ ఆ సత్య ధర్మాలను కాపాడేందుకు భగవంతుడు ఉండనే ఉన్నాడని ఈ పద్యంతో చెప్తాడు. అయితే ఆ భగవంతుడు తానే కావడం విశేషం, భావి భారత యుద్ధంలో ధర్మం జయిస్తుందని, ఏ కారణంతోనైనా అధర్మపక్షం వహించడం భీష్మునికి చేటు అని చెప్తాడు. కౌరవ పాండవులలో ఎవరికి చావు, బాధ కలిగినా దుఃఖించేది నీవే కదా. అలా కాకుండా ఈ రెండు పక్షాల వారిని కాచుకోవలసిన కర్తవ్యం నీదే అని ఉపదేశించి పాండవులు ఒక్క మాటగా ధృతరాష్ట్రునితో చెప్పమన్న విషయాన్ని చెప్పి, వారు సభ్యులతో చెప్పమన్న విషయాన్ని పై పద్యం సాక్షిగా శ్రీకృష్ణుడు వివరిస్తాడు.

.................................................


- కె. రాజశేఖరరాజు

79893 74301 / 73496 94557

Saturday, March 5, 2022

'కమ్ అండ్ సీ' యుద్ధ సినిమా పరిచయంపై ఒక చర్చ

 'కమ్ అండ్ సీ' యుద్ధ సినిమా పరిచయంపై ఒక చర్చ

సోవియట్ యూనియన్ ఉనికిలో ఉన్న కాలంలో వచ్చిన కళాత్మక యుద్ధ సినిమా Come and See ని వివరంగా పరిచయం చేసి (చూడటం, రాయడం ఆరుగంటలు పట్టింది) గత ఆదివారం వాట్సాప్ లోని మంచిసినిమా గ్రూప్‌లో పోస్ట్ చేశాను. దాన్ని తర్వాత మరి కాస్త సమాచారం జోడించి నా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాను. ఆ సినిమా పరిచయం చదివి, చూసి విలపించామని డాక్టర్ గీతాంజలి గారితో సహా చాలామంది మంచి సినిమా గ్రూప్ సభ్యులు తమ అనుభూతిని పంచుకున్నారు. 

''సినిమా చూడ్డం మొదలెట్టి మళ్ళీ మీ ఈ విశ్లేషణ మొత్తం చదివాక చూద్దామని చదివాను. మనసంతా దుఃఖంతో వణికి పోయింది...ఇప్పుడు ఇసుకలో తుపాకీ తవ్వితీసిన బాలుడి జీవితం సినిమాలో చూడాలంటే భయం వేస్తోంది. గొప్ప విశ్లేషణ... నాజీ యుద్ధ సినిమాలు చాలా చూసాను కానీ మీ ఈ విశ్లేషణ చదివాక...హృదయం వేదనతో మెత్తబడి పోయింది.

సినిమా ఇప్పుడే ముగించాను ఏడుస్తూ చూసాను.. ఇక ఈ రాత్రి నిద్రపోలేను'' (డాక్టర్ గీతాంజలి గారు)

గత వారంరోజులుగా ఆ సినిమా పరిచయం గురించి మిత్రుల నుంచి వ్యాఖ్యలు, అభినందనలు వస్తూనే ఉన్నాయి. కాగా ఈ సినిమా పరిచయాన్ని కాస్త ఎడిట్ చేసి ప్రజాసాహితి మార్చి 2022 సంచికలో ప్రచురిస్తున్నామని 'ప్రజాసాహితి' పత్రిక సీనియర్ బాధ్యులు, మంచి సినిమా గ్రూప్ సభ్యులు కొత్తపల్లి రవిబాబు గారు నిన్ననే తెలిపారు. భావజాలపరంగా నిబద్ధత కలిగిన ఒక వామపక్ష సాహిత్య పత్రికలో ఈ సినిమా పరిచయాన్ని ప్రచురిస్తుండటం కంటే మించిన గౌరవం మరొకటి లేదు కదా..

ఈ కాకతాళీయం అర్థం చేసుకోవడం ఎలా?

ఇక్కడ ఒక విషయం మీ దృష్టికి తేవాలి. ఏ బెలారస్‌లో అయితే 75 ఏళ్ల క్రితం నాజీలు తలపెట్టిన సజీవ దహన కాండపై కమ్ అండ్ సీ అనే గొప్ప యుద్ధ వ్యతిరేక చిత్రాన్ని 1985లో సోవియట్ సినీ దర్శకుడు తీశారో అదే బెలారస్, దాని పక్కనే ఉన్న ఉక్రెయిన్‌పై రూపం మార్చుకున్న అదే రష్యా ఇప్పుడు యుద్ధం ప్రారంభించడం బాధాకరం. కమ్ అండ్ సీ సినిమాను నేను పరిచయం చేయడం యాదృచ్ఛికం కాగా, ఆ తర్వాత కొద్దిరోజులకే బెలారస్‌తో సహా ఉక్రెయిన్ మొత్తం యుద్ధ బీభత్సంలో కూరుకుపోవడం విషాదకరం. ఎందుకిలా జరిగింది, ఎవరిది తప్పు అనేది తేల్చాలంటే ప్రచ్చన్నయుద్ధ కాలం నుంచి ఇప్పటి వరకు అమెరికా కూటమికి, సోవియట్ యూనియన్,  ఆ తర్వాత రష్యా కూటమికి మధ్య కొనసాగుతూ వస్తున్న భౌగోళిక రాజకీయ (జియోపొలిటకల్) వ్యూహాలను అర్థం చేసుకోవలసిందే. ఒక చిన్న దేశంపైకి అంత పెద్ద దేశం యుద్ధం చేయవచ్చా అంటే, మనుషుల భావోద్వేగాల ప్రకారం చూస్తే తప్పే అనాల్సి ఉంటుంది. కానీ భావోద్వేగాల ప్రకారం మాత్రమే యుద్ధ పరిస్థితులు ఉత్పన్నం కావు కదా. కాబట్టే ఈ చర్చ ఇక్కడ అప్రస్తుతం. ఉక్రెయిన్‌ని వారూ వీరూ తేడా లేకుండా అందరూ బలిచేశారన్నదే వాస్తవం.  కానీ కమ్ అండ్ సీ సినిమా పరిచయం నేను అనుకోకుండా చేయడం, ఆ వెనువెంటనే యుద్ధం మొదలుకావడం నాకయితే షాకింగ్‌గా ఉంది. ఇది పూర్తి యాదృచ్ఛిక ఘటన మాత్రమే అయినప్పటికీ ఇంత కాకతాళీయంగా ఇవెలా జరిగాయన్నదే ఒక షాకింగ్ అనుభూతిని కలిగిస్తోంది.

ఆ తర్వాత ఈ ఆదివారం రాత్రి (27-02-2022) మంచిసినిమా గ్రూపులో ఆ సినిమా పరిచయంపై కొందరు మిత్రులు చేసిన వ్యాఖ్యలకు ఆలస్యంగా ప్రతిస్పందించాను. చాలామంచి సమీక్ష చేశారని వారు పెట్టిన వ్యాఖ్యలకు ధన్యవాదాలు తెలిపాను.

ఆ సమయంలోనే..  1985లోనే ఏదో ఒక ఫిలిం ఫెస్టివల్‌లో 'కమ్ అండ్ సీ'' సినిమాను చూశానంటూ ఒక తెలుగు సినీ దర్శకుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు నాతో పంచుకున్నారు. 'ఆ సినిమా చూసిన నాకే కాదు, చూసిన వాళ్లందరికీ జ్వరం వచ్చినట్టుగా అయిపోయింది. ఆ మహా దర్శకుడు Elon Klimov అధ్వర్యంలో Moscow film institute లో సినిమా కోర్సులో అవకాశం వస్తూ, వస్తూ, కోల్పోయిన వాణ్ణి'' అంటూ తెలుగు సినీ దర్శకుడు (స్క్రీన్ ప్లే చిత్రం)  కెఎల్ ప్రసాద్ గారు చాలా సేపు నాతో మంచి పుస్తకం గ్రూప్ లో చాట్ చేసి అనేక విషయాలు చెప్పారు. ఈయన మంచిసినిమా గ్రూప్ సభ్యులు కూడా.

మూడు దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్రసీమతో నిత్య సంబంధాలు కలిగి ఉన్న కేఎల్ ప్రసాద్ గారు రెండేళ్ల క్రితం తీసి, రిలీజ్ చేసిన ఒక ప్రయోగాత్మక తెలుగు చిత్రం 'Screenplay of an Indian Love Story' గురించిన తన  అనుభవాలను కూడా నాతో పంచుకున్నారు.

అందుకే గత రాత్రి మా మధ్య జరిగిన వాట్సాప్ చర్చను ఒకచోట చేర్చి ప్రత్యేకంగా కథనంగా అందిస్తే మంచిదని భావించి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. వ్యాఖ్య, ప్రతివ్యాఖ్య రూపంలో మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో కొంతభాగాన్ని ఆసక్తి ఉంటేనే ఇక్కడ చదవగలరు. 

............................

మంచిసినిమా గ్రూప్ గురించి కొంత

(ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వాట్సాప్ లోని కొన్ని మంచి చర్చా బృందాల్లో మంచిసినిమా గ్రూప్ ప్రముఖమైంది. సాధారణంగా మనం థియేటర్లలో చూడలేని అపురూపమైన చిత్రాలను, వరల్డ్ క్లాసిక్స్ మూవీస్‌ని ఈ గ్రూప్ తన సభ్యులకు పరిచయం చేస్తూ చూడమని చెబుతూ ఉంటుంది. యూట్యూబ్‌లో క్లాసిక్స్ సినిమా లింకులు పెడుతూ వాటిని క్లుప్తంగానూ, విపులంగానూ పరిచయం చేస్తూ, జూమ్ ద్వారా కూడా చర్చలు, సినిమాలు చూపిస్తూ ఉన్న చక్కటి ప్రామాణిక సినిమా చర్చా బృందం మంచిసినిమా గ్రూప్. గత కొన్ని సంవత్సరాలుగా కొన్న వందల ప్రపంచ క్లాసిక్స్ మూవీస్‌ని వీరు పరిచయం చేసారు. చూపించారు కూడా. 

ఈ గ్రూప్ గురించి ఇంకా ఎవరికైనా తెలియకపోతే, మంచి సినిమాల పట్ల ఆసక్తి, అభిరుచి ఉండి చూడాలని, తెలుసుకోవాలని అనుకుంటే మంచిసినిమా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి. మీ మొబైల్ నంబర్ ఇస్తే ఈ గ్రూప్ నిర్వాహకులు ఐకా బాలాజీ ( Aika Balaji - 90077 55403) గారు మిమ్మల్ని మంచిసినిమా గ్రూప్ లో చేరుస్తారు.

నిజంగానే మంచి సినిమాలు, క్లాసికల్ మూవీస్‌ని చూడాలని తెలుసుకోవాలని ఆశిస్తున్న వారికి వాట్సాప్ లోని మంచిసినిమా గ్రూప్ ఒక కరదీపిక లాంటిది.

ఇది ప్రమోషన్‌కి సంబంధించిన పోస్ట్ కానే కాదు అని పాఠకులు గుర్తిస్తే చాలు.)

..........................

ఇప్పుడు మంచిసినిమా వాట్సాప్ గ్రూపులో కెఎల్ ప్రసాద్ గారికీ నాకూ మధ్య జరిగిన సంభాషణలో కొంత భాగాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను చూడండి. 

కెఎల్ ప్రసాద్ గారు

మీ ఆలోచనా విధానం, నిబద్ధత, సాంఘిక బాధ్యత, మన professional film critics వుండి వుంటే ఎంతో బాగుండేది.... 

మీ Come and See పరిచయం చదివి ఎంత వుద్వేగానికి లోనయ్యానో చెప్పలేను. బహుశా film festival లో 1985 లో చూసాననుకుంటాను. నాకే కాదు, చూసిన వాళ్లందరికీ జ్వరం వచ్చినట్టుగా అయిపోయింది. ఆ మహా దర్శకుడు Elon Klimov అధ్వర్యంలో Moscow film institute లో సినిమా కోర్సులో అవకాశం వస్తూ, వస్తూ, కోల్పోయిన వాణ్ణి. 

..................

రాజు

సినిమా రంగంతో మంచి పరిచయం ఉన్న మీరు ఇంత గొప్పగా 'కమ్ అండ్ సీ' సినిమా పరిచయం గురించి చేసిన వ్యాఖ్యను వినమ్రంగా స్వీకరిస్తున్నాను సర్. ఎప్పుడో 1950ల మొదట్లో కొడవటిగంటి కుటుంబరావు గారు కినీమా పత్రికలో చేసిన రివ్యూలు ఆనాటి తెలుగు సినిమా ప్రయాణం పట్ల ఒక దార్శనిక దృష్టిని అందించాయని మీకూ తెలుసు. మన హీరోహీరోయిన్ల తొక్కుళ్లు, వారి చుట్టూనే తిరిగే బీభత్స భయానక కథా గమనాలు దాటి, మలయాళ సినిమా పోకడల అంచుల వరకయినా మన సినిమాలు పోగలిగితే ఎంత బాగుంటుందనేది నా ఆలోచన. ముఖ్యంగా గత రెండేళ్ల కరోనా కాలం నాకే కాదు. ఎంతోమంది కళ్లు తెరిపించిందనుకుంటాను. ఓటీటీల్లో సులభంగా దొరుకుతున్న సినిమాలను ఏది పడితే అది చూడకూడదనే గొప్ప జ్ఞానాన్ని అందించింది కరోనా సమయం. మన సినిమాలపై నేను చేసిన ఆ పరుష వ్యాఖ్యను సానుకూలంగానే తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండీ...

............................

కెఎల్ ప్రసాద్ గారు

మీరన్నది నిజం రాజు గారూ! Corona కారణంగా మనవాళ్లు OTT లో మలయాళం సినిమాలు చూసి చాలా తెలుసుకుంటున్నారు. 

మలయాళ సినీ రంగంలో మధు అంబట్ చాలా ప్రముఖుడు. He is a very famous Cinematographer & Director. తను హైదరాబాద్ వచ్చినపుడు ప్రత్యేకంగా సినిమా (Screenplay of an Indian Love Story) ప్రదర్శించి చూపించాను. నన్ను తిట్టి తిట్టి వదిలాడు.

''పాతికేళ్లుగా మనం స్నేహితులం. ఈ సినిమా గురించి నాకెందుకు చెప్పలేదు! ఇదే సినిమాని మలయాళంలో తీసివుంటే నిన్ను నెత్తి మీద పెట్టుకుని ప్రపంచం అంతా తిప్పేవారు. మీ వాళ్లు కోటి రూపాయలిచ్చి రైట్స్ కొనేవారు. తెలుగులో తీసావుగా, అనుభవించు'' అని శపించాడు. 

మలయాళం నాకు తెలియని భాష. పైగా తెలుగులో కూడా మీలాంటి సినిమాలు రావాలని కదా నా తాపత్రయం అని సర్ది చెప్పాను.

.........................

రాజు

కెఎల్ ప్రసాద్ గారూ, ఈ రాత్రి మీ వంటి నిజమైన సినీ కళాకారుడి పరిచయం ఇలా కావడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా రంగంలో సినిమా కళ పట్ల ఇంత అభినివేశం ఉన్న వ్యక్తులు ఉంటారా అనే నా చిరకాల సందేహాలను ఈ రాత్రి మీ వ్యాఖ్యలతో నివృత్తి చేశారండి. మీలాంటి వారు సీనీరంగంలో లైమ్ లైట్ లో లేనందుకు మనందరం కలిసి బాధపడాల్సిందే. మధు అంబట్ అంతటి వ్యాఖ్య మీపై చేశారంటే గ్రేట్. ఇకపోతే 1985లోనే కమ్ అండ్ సీ యుద్ధ సినిమా చూసిన అనుభవం పంచుకున్నారు. మీతో పాటు అందరికీ ఆరోజు జ్వరం వచ్చిందన్నారు. ఇప్పటికీ అదే అనుభూతి చాలామందికి కలుగుతోంది. ఆ చిత్ర దర్శకుడి అధ్వర్యంలో Moscow film institute లో సినిమా కోర్సులో అవకాశం వస్తూ, వస్తూ, కోల్పోయిన వాణ్ణి అని మీరు చెప్పడం చాలా బాధ కలిగిస్తోంది. మనం దీనికి సంబంధించిన విశేషాలు నేరుగా ఫోనో లోనే మాట్లాడుకుందాం అండి. 

మీరు తీసి పలు ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ సినిమా Screenplay of an Indian Love Story మేం ఇప్పుడైనా చూసే అవకాశం ఉందా.. యూట్యూబ్ లో దొరికితే మరీ సంతోషం. కనీసం మంచి సినిమా గ్రూప్ సభ్యులకైనా చూసే ఏర్పాటు చేయండి సర్. 

మొన్న ఆదివారం కమ్ అండ్ సీ సినిమా పరిచయం చేయడం. 1985లోనే ఆ సినిమా చూసి జ్వరం తెచ్చుకున్న వ్యక్తి ఈ ఆదివారం పరిచయం కావడం.. మాటల్లో చెప్పలేనంత మహదానందంగా ఉంది. వీలైనంత త్వరలో మనం మాట్లాడుకుందామండి. మీ మొబైల్ నంబర్ తీసుకున్నాను. 

మంచిసినిమా గ్రూప్ ద్వారా మీ పరిచయం ఇలా కావడం చాలా చాలా ఆనందంగా ఉంది నాకయితే. మనలో మాట.... ప్రజాసాహితి పత్రిక వారు కమ్ అండ్ సీపై నేను పరిచయం చేసిన కథనాన్ని మార్చినెల సంచికలో ప్రచురిస్తున్నారు. వారి అవసరాలకు అనుగుణంగా కాస్త ఎడిట్ చేశారట. పర్వాలేదండి. ఎలాగోలో చేరవలసిన వారికి వాయిస్ పోతుంది కదా. అదే చాలు..

......................

కెఎల్ ప్రసాద్ గారు

నేను తీసిన Screenplay of an Indian Love Story సినిమాపై ఒక Newyork based film critic రాసిన రివ్యూ కారణంగా (ఆయన సాధారణంగా European classics మీద రివ్యూలు రాస్తుంటారట.) Spain లో జరిగిన On line festivals చాలా ఆదరించాయి నా సినిమాని. చాలా విషయాలున్నాయి రాజు గారు! సినిమా మీద మీకున్న ప్రేమకి జోహార్లు. మీకు సమయం వుంటే నా సినిమా మీద IMDB.COM లో రివ్యూలు చదవండి.

Screenplay of an Indian love story

https//www.imdb.comtitlett11905470ref_=fn_al_tt_1

,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజు

దాదాపు 80 ఏళ్ల క్రితం చలంగారు గొప్ప కామెంట్ చేశారండి. కమ్యూనిస్టులు ప్రాణాలు తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధపడతారు కానీ స్త్రీ హృదయాన్ని అర్థం చేసుకోలేరు అన్నారాయన. కాని కమ్యూనిస్టులు అన్న పదం స్థానంలో పురుషులందరూ అని చేరిస్తే బాగుంటుందండి. 

2020లో థియేటర్లలో Screenplay of an Indian love story చిత్రం రిలీజ్ అయిన సందర్భంగా హీరోయిన్‌గా నటించిన ఆ అమ్మాయి ప్రగతి యాదాటి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంది. డబ్బుల్లేక ప్రమోట్ చేసుకోలేకపోయాం అంటూ ప్రసాద్ థియేటర్ ఎదురుగా చానెల్స్‌తో ఆమె చెప్పిన మాట నిజంగా బాధాకరం. 

కనీసం ఒటీటీలో కూడా దీన్ని విడుదల చేయలేకపోయారా అని డౌట్. ఇప్పుడు నేను, నాలాంటివాళ్లు ఈ సినిమాను ఎలా చూడాలి? వచ్చి రెండేళ్లయిపోయింది. అన్ని ఇంగ్లీష్ పత్రికల్లో కూడా దీనిపై మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ ప్రమోట్ చేయలేక ఇది ప్రచారం కాలేదే. చాలా బాధాకరం ఇది.

Screenplay Of An Indian Love Story Movie Heroin  CMN Telugu TV

https//www.youtube.com/watchv=D66hpsTOTAk

.......................

రాజు

IMDb.com లో ఇప్పుడే మీ సినిమాపై రివ్యూ, ట్రయిలర్ కూడా చూశాను. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందండి. మొత్తం కథను అదే మోసుకుపోయినట్లుంది.

....................

కేఎల్ ప్రసాద్ గారు తీసిన Screenplay Of An Indian Love Story సినిమా ట్రయిలర్ చూడటం తప్ప సినిమాను చూడలేదు కాబట్టి దాని గురించి వ్యాఖ్య ఇక్కడ చేయలేదు. అయితే 2020లో విడుదల సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ ప్రగతి యాధాటి చెప్పిందాని ప్రకారం, కాలేజీ ఆమ్మాయిలకు ఈ సినిమాను విడిగా చూపిస్తే 'మొదటగా అబ్బాయిలకు ఈ సినిమా చూపించండి, వారిలో మార్పువస్తే చాలు' అని ముక్తకంఠంతో అన్నారట. 

పరుచూరి గోపాలకృష్ణ, కత్తి మహేష్ గార్లు కూడా ఈ సినిమా గురించి చాలా పాజిటివ్ గా చెప్పారు. అంచనాలకు మించిన సినిమా.. కేవలం మూడుపాత్రలతో, అద్భుతమైన ప్రేమకథతోపాటు సామాజిక అంశాలను స్పృశించిన విధానం చాలా బాగుందని వీరన్నారు. విద్యార్థుల రాజకీయాల గురించి, మహిళల పట్ల భారతీయ సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి నిర్భయ వంటి ఘటనల గురించి సరికొత్తగా చెప్పిన సినిమా అని వీరు దీన్ని ఆకాశానికి ఎత్తేశారు.

'అబ్బాయికి అమ్మాయికి పెళ్లిచేసిన తల్లిదండ్రులు ఈ సినిమాను చూడాలి. పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి, అమ్మాయి ఈ సినిమా చూడాలి. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అమ్మాయి కూడా ఈ సినిమా చూడాలి' అని పరుచూరి గోపాలకృష్ణ గారు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మూడు పాత్రలతో, సింగిల్ లొకేషన్లో వైవిధ్యపూరితంగా తీసిన సినిమా అంటూ వీరు చెప్పిన విధానం ఆసక్తిదాయకంగా ఉంది.

Paruchuri Gopala Krishna Great Words  Screenplay of an Indian Love Story  K L Prasad  Pragathi Y

https//www.youtube.com/watchv=DZ4kMd31izI


Kathi Mahesh Review about Screenplay of an Indian Love Story Movie  

https//www.youtube.com/watchv=LsRtnqZXuJ0

...........................

ఆసక్తి కలిగినవారు కింది లింకుల్లోని ఈ చిత్ర సమీక్షను చూడగలరు. దాదాపు జాతీయ ఆంగ్ల పత్రికలన్నీ ఈ సినిమా గురించి సమీక్షించాయి. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో వస్తోందని కేఎల్ ప్రసాద్ గారు చెప్పారు. కోవిడ్ కాలంలో మిస్సయిన వారందరూ ఈ సినిమాను చూసే అవకాశం ఉంది.

Screenplay of an Indian love story

https//www.imdb.comtitlett11905470ref_=fn_al_tt_1


An immensely successful film director is getting ready for his latest release when he gets the shock of his life - his wife wants a divorce. He places a condition before her, that the two of them should spend 24 hours in a far off place, with no other people and no outside communication, after which she can do as she pleases. She agrees and they drive to a farmhouse, but will 24 hours be enough for him to re-captivate his wife

A successful Indian film director faces the biggest crisis of his life in the middle of the week of his biggest movie release. His wife of 8 years suddenly declares that she wants to file for divorce and insists on publicly announcing their separation immediately.


—Shrinivas G. Kulkarni

.........................


Screenplay of an Indian love story  A gripping tale of present-day relationships and moral decay

https//newsmeter.inentertainmentscreenplay-of-an-indian-love-story-a-gripping-tale-of-present-day-relationships-and-moral-decay-679624


It is KL Prasad's directorial debut. He has intersetengly titled this film as 'Screenplay of an Indian Love Story'

................

కమ్ అండ్ సీ సినిమాపై నా పరిచయం చదవకపోతే కింది లింకులో చూడవచ్చు.


సినిమా కళను ఉద్దీప్తం చేసిన యుద్ధ వ్యతిరేక చిత్రం.. 'కమ్ అండ్ సీ'

kanthisena.blogspot.com/2022/02/blog-post.html



Monday, February 21, 2022

సినిమా కళను ఉద్దీప్తం చేసిన యుద్ధ వ్యతిరేక చిత్రం.. 'కమ్ అండ్ సీ'



రెండు ప్రపంచ యుద్ధాల గురించి, వియత్నాంలో అమెరికా సాగించిన యుద్ధం గురించి తదితర చారిత్రక యుద్ధాల గురించి ఎన్నో సినిమాలు మనం చూసి ఉండవచ్చు. ది బ్యాటిల్‌షిప్ పొటెంకిన్‌ని మర్చిపోలేం. ఒమర్ ముక్తర్‌ని మర్చిపోలేం. సైనికులారా యుద్ధాన్ని మానండి అంటూ చార్లీ చాప్లిన్, ఆర్యజాతి సముద్ధరణ కర్త హిట్లర్ బతికుండగానే అంటే 1942లోనే పొలికేక వేసి మరీ తీసిన ది గ్రేట్ డిక్టేటర్‌ని మర్చిపోలేం. వార్ అండ్ పీస్‌‌ని మర్చిపోలేం. స్పార్టకస్ మూవీని మర్చిపోలేం. ది ప్యాసేజ్ సినిమాను మర్చిపోలేం. ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్, ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్, ది కాజువాలిటీస్ ఆఫ్ వార్, లిబరేషన్, ది బంకర్, డౌన్‌ఫాల్, ది బ్రెస్ట్ ఫోర్ట్రెస్, హోలోకాస్ట్,  ష్లిండర్స్ లిస్ట్‌ వంటి గొప్ప సినిమాలను అసలు మర్చిపోలేం. యుద్ధాలకు, వాటి విషాద పర్యవసానాలకు పట్టంగట్టిన మాస్టర్ పీస్ సినిమాలు ఇవన్నీ. 

కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సోవియట్ యూనియన్ చిత్ర దర్శకుడు ఎలెమ్ క్లిమోవ్‌ 1985లో తీసిన భయానక యుద్ధ వ్యతిరేక చిత్రం కమ్ అండ్ సీ (Come and See)ని మనం మర్చిపోవాలన్నా మర్చిపోలేం. ఎందుకంటే యుద్ధం రేపే పాశవిక హింసను, సోవియట్ యూనియన్‌ని ముట్టడించిన నాజీల దురాగతాలను కేంద్రబిందువుగా తీసుకుని, గత 80 సంవత్సరాల ప్రపంచ సినిమా చరిత్రలో వచ్చిన కళాఖండాల్లో కెల్లా మాస్టర్ పీస్ లాంటి చిత్రం కమ్ అండ్ సీ. 

సోవియట్ చిత్ర దర్శకుడు ఎలెమ్ క్లిమోవ్ 1985లో తీసిన లెజెండరీ యుద్ధ వ్యతిరేక చిత్రం కమ్ అండ్ సీ ని చూసిన వారెవరూ క్లైమాక్స్‌లో కనిపించే ఆ భయానక దృశ్యాలను జీవితంలో మర్చిపోలేరు. క్లైమాక్స్ అని మాత్రమే కాదు.. ఈ సినిమా ఆద్యంతం చిరస్మరణీయమైనది. ఒక భయంకరమైన దుస్వప్నం వాస్తవరూపం దాలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. యుద్ధం అనే ఆ పీడకల ఇప్పటికీ ప్రపంచంలో సహస్ర రూపాలతో కొనసాగుతూనే ఉంది కాబట్టి మన చరిత్రలో యుద్ధం అనేది వర్తమానంలో కూడా పునరావిర్భవిస్తూనే ఉంది. 

కమ్ అండ్ సీ అనే పేరున్న ఈ సినిమాను  అచ్చంగా తెలుగు చేయాలంటే సింపుల్‌గా 'రండి.. చూడండి'' అని చెప్పవచ్చు. సినిమా పేరుకు తగ్గట్లే దీంట్లోని ఒక్క దృశ్యాన్ని చూస్తే చాలు.. ఈ పేరు దీనికి ఎందుకు తగిందో అర్థమైపోతుంది. ఒక గ్రామంలో సజీవంగా ఉన్న వందలాది మనుషుల్ని -స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు- నాజీ సైనికులు ఒక పామ్ హౌస్‌లో కుక్కి తలుపులు మూసి ఆ ఇంటిని పెట్రోల్‌తో తగులబెట్టి, బుల్లెట్లు దించుతుంటే మంటల్లో తగులబడిపోతున్న ఆ నిస్సహాయులు పెడుతున్న హాహాకారాలను, ఫామ్ హౌస్ మొత్తాన్ని చుట్టుముడుతున్న ఆ అగ్నిజ్వాలల్ని ఈ సినిమా చివర్లో చూపిన ఆ దృశ్యాన్ని చూస్తే చాలు... సినిమా మొత్తాన్ని దర్శకుడు ఎలా ప్రాణం పెట్టి తీశాడో మనకు అర్థమవుతుంది. 

1985లో రష్యన్ భాషలో వచ్చిన ఈ భయానక యుద్ధ చిత్రాన్ని సోవియెట్ యూనియన్‌లో చూసిన కోట్లాదిమంది ప్రజల గుండెలవిసిపోయాయి. నాజీల దురాగతాలకు బలైపోగా ప్రాణాలతో మిగిలి అప్పటికీ బతికి ఉన్న యుద్ధ బాధితులు ఈ సినిమా చూసి భోరుమంటూ విలపించారు. ఎందుకంటే ఇది వారికి సినిమా మాత్రమే కాదు. 1939లో మొదలైన రెండో ప్రపంచ యుద్ధం సోవియట్ యూనియన్‌ని సమీపించాక నాజీల ముట్టడిలో చిక్కుకున్న సోవియట్ భూమిలో కుటుంబాలను కోల్పోయిన, నాజీలు మండించిన అగ్నిజ్వాలల్లో గ్రామాలకు గ్రామాలే తగులబడిపోయిన అలనాటి సన్నివేశాలను ఈ సినిమా చూపిస్తుంటే.. ఆనాటికి బతికి ఉన్న బాధిత కుటుంబాలకు ఆ పాత జీవితం మళ్లీ కళ్లముందు కనిపించినట్లయింది. సినిమా కళ ఎంత మహత్తరమైన శక్తిని కలిగి ఉందో తెలుసుకోవడానికి కరుణామయమైన ఈ ఒక్క సినిమా చూస్తే చాలు. 

1985లో రష్యన్ భాషలో వచ్చిన ఈ సినిమా 2020 నాటికి గానీ అంటే 35 సంవత్సరాల గానీ అమెరికాలో, యూరప్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో విడుదల కాలేకపోయింది. న్యూయార్క్ తదితర అమెరికన్ నగరాల్లో కొత్తప్రింట్‌తో విడుదలైన కమ్ అండ్ సీ సినిమా చూసిన అమెరికన్ చిత్ర విమర్శకులు ముక్తకంఠంలో పలికిన మాట క్లాసిక్. పరమ ప్రామాణికమైన చిత్రం. సినిమా కళను ఉద్దీప్తం చేసే చిరస్మరణీయమైన ప్రామాణిక కొలమానం కమ్ అండ్ సీ అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే దావానలాన్ని పోలిన ఆ నాజీల దహనకాండను చూస్తున్న అమెరికన్ చిత్ర విమర్శకుల గుండెలు అవిసిపోవడం కాదు.. ఒక్కసారిగా ఆగిపోయాయంటే అతిశయోక్తి కాదు.. ఈ సినిమా కలిగించిన మహత్తర అనుభూతికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి అవసరం లేదు.

1978లో వచ్చిన 'ఐ యామ్ ఫ్రమ్ ది ఫైరీ విలేజ్' (I Am from the Fiery Village) పుస్తకానికి క్లిమోవ్, అలెస్ అదమోవిచ్‌లు ఇచ్చిన సినిమా రూపమే కమ్ అండ్ సీ. తరుణ వయస్సులో ఉన్న కుర్రాడి జీవితంలో నాజీలు ప్రేరేపించిన యుద్ధం గురించిన భయానక వర్ణనతో ఈ సినిమా నడుస్తుంది. ఆ అబ్బాయి పేరు ఫ్లియోరా (అలెక్సీ క్రవచెంకో). సినిమా ప్రారంభంలోనే ఇతడు తన గ్రామంలో నాజీలకు వ్యతిరేకంగా సోవియట్ పక్షం వహించిన పార్టిజన్స్‌లో చేరిపోవాలనే ఉద్దేశంతో ఇసుకలో కూరుకుపోయిన నాజీల తుపాకిని తవ్వి తీస్తుంటాడు. (1943లో నాజీలు ఆక్రమించిన బెలారస్ -నాడు బైలో రష్యా- ప్రాంతంలో ఈ సినిమాను తీశారు.) ఆ అబ్బాయి ఫ్లియోరా ఇసుకలో కూరుకుపోయి ఉన్న తుపాకిని తవ్వి తీస్తుంటే ఊరి మనిషి ఒకరు హెచ్చరిస్తాడు. ఊరకే తుపాకీని తవ్వి తీయడం ప్రమాదకరమైన ఆలోచన అంటూ అతడి తల్లి కూడా ఆ పని చేయవద్దని బతిమాలుతుంది. కానీ ఆ గ్రామంలో అప్పటికే తిష్ట వేసి ఉన్న నాజీలకు ఆ అబ్బాయి చర్య అనుమానాలు రేకెత్తిస్తుంది. త్వరలోనే అతడు సోవియట్ అనుకూల బలగాల్లో చేరిపోవలసి వస్తుంది. 

తన విధిని తానే లిఖించుకున్న దశనుంచి త్వరలోనే అతడు ఊహించశక్యం కాని దుష్టశక్తితో ఎన్‌కౌంటర్‌లోకి చిక్కుకుపోతాడు. ఈ క్రమంలో ఆ అబ్బాయికి పరిచయమున్న వారంతా చనిపోతారు. నాజీల దురాగతాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆ బాలుడి అమాయకత్వం చెల్లాచెదరవుతుంది. తర్వాత బుద్ధి మాంద్యం అతడిని ఆవహిస్తుంది. చివరలో నాజీలు అతడిని చంపకుండా వదిలేయడానికి కూడా తన బుద్ధి మాంద్యమే కారణం. అలెక్సీ క్రవచెంకో అనే రైతు బాలుడి ముఖంలో యుద్ధ బీభత్సాన్ని, ఉన్మాదాన్ని, మృత్యు విహ్వలతను సినిమా మొత్తంగా చూపించడంలో దర్శకుడు క్లిమోవ్ ఎంత ప్రావీణ్యత చూపాడంటే. రోజుల తరబడి ఆ అబ్బాయి ముఖం మనల్ని వెంటాడుతుంది. అసాధారణ పరిస్థితులకు మనుషులు ఎలా బలవుతారు, అమాయకులు వధ, నిర్మూలన యుద్ధకాలంలో ఎంత సాధారణ విషయంగా మారిపోతుందో ఈ సినిమా చూపించినంతగా మరే సినిమా చూపించి ఉండదంటే అతిశయోక్తి కాదు. పాశవికత్వానికి మూలం, దాని ప్రభావం గురించిన అద్భుత అధ్యయనం సమాహారమే ఈ మాస్టర్ పీస్ నిర్మాణానికి దారితీసింది.

20వ శతాబ్దిలో, సినిమా కళ పట్ల గొప్ప అనురక్తితో, సాహసంతో, అద్భుతమైన నైపుణ్యంతో తీసిన గొప్ప సినిమాల్లో కమ్ అండ్ సీ ఒకటి. సోవియట్ సెన్సార్ ఆంక్షల మధ్యనే జాతి అణచివేతకు వ్యతిరేకంగా ఆగ్రహం, ఆవేదన కలగలిపి తీసిన సాహసోపేత చిత్రం ఇది. భూమ్మీద యుద్ధం రూపంలో నరకం అనేది ప్రజాజీవితాన్ని ఎంతగా విధ్వంసం చేసి పడేస్తుందో అత్యంత నిర్దిష్టంగా, హింసాత్మకంగా, భయానకంగా చూపించిన కళాత్మక చిత్రం కమ్ అండ్ సీ

రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ విజయం సాధించి 40వ వార్షికోత్సవం సందర్భంగా 1985లో విడుదలైన ఈ సినిమాకు సోవియట్ యూనియన్ ప్రేక్షకులు అప్పట్లోనే బ్రహ్మరథం పట్టారు. ఎనిమిదేళ్ల నిర్విరామ ప్రయత్నం తర్వాత సోవియట్ సెన్సార్ ఆంక్షలను దాటుకుని చివరకు వెలుగు చూసిన కమ్ అండ్ సీ యుద్ధ చిత్రాల నిర్మాణంలో ఒక కళాఖండంగా చరిత్రలో నిలిచిపోయింది. అత్యంత హింసాత్మక ఘటనల సమాహారంతో రూపొందిన అత్యంత అరుదైన యుద్ద సినిమాల్లో ఒకటిగా సినిమా గురించిన మన నిర్వచనాలన్నింటినీ తోసిరాజన్న చిత్రమిది. 

యుద్ధానికి సంబంధించిన అధివాస్తవికతను 35 సంవత్సరాల తర్వాత కూడా మానవజాతి సంపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవలసిన అవసరముందని ఈ సినిమా వాదిస్తుంది. ఇది నాజీల చేతిలో ఘోర హత్యలకు గురైన బాధితుల భయంకరానుభూతిని కేవలం తిరిగి చూపించిన సినిమా కాదు. 

ఈ చిత్ర దర్శకుడు క్లిమోవ్ 1933లో స్టాలిన్‌గ్రాడ్‌లో జన్మించాడు. యుద్ధాల చరిత్రలోనే భయానక దాడులకు నిదర్శనంగా నిలిచిన స్టాలిన్ గ్రాడ్ యుద్ధ సమయంలో 1942లో క్లిమోవ్ తన కుటుంబంతో పాటు ఆ నగరాన్ని వదిలి వెళ్లిపోతాడు. నాజీల ముట్టడిలో తూర్పు యూరప్ దారుణ అనుభవాలకు సంబంధించిన ప్రాథమిక, సర్వసమగ్ర సమాచారం క్లిమోవ్ కి స్పష్టంగా తెలుసు. ఆనాడు తన అనుభవంలోకి వచ్చిన ఆ జ్ఞాపకాలన్నింటినీ క్లిమోవ్ సినిమాగా మలిచాడు. కదులుతున్న స్టీడీ కామ్ షాట్లకు అనుగుణంగా దాదాపు సెట్టింగ్ అనేదే లేని రూపంలో ఈ చిత్రంలో నటీనటులు నటించారు. నేరుగా కెమెరా ముందు ముఖం పెట్టి నటీనటులు అనుభవిస్తున్న భయానక స్థితిని ఈ రెండున్నర గంటల సినిమాలో దర్శకుడు చూపించాడు. అందుకే స్టీడీకామ్‌ను ఆనాటికి ఈ సినిమాలో ఉపయోగించినంత ఎక్కువగా మరే సినిమాలోనూ చూడలేమని ఆస్కార్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ రోజర్ డీకిన్స్ వ్యాఖ్యానించారంటే అతిశయోక్తి కాదు. 

ఒక తరుణ వయస్కుడు అనాలోచితంగా చేసిన పనికి తన అమూల్యమైన బాల్యాన్ని, ఆ వయసుకు సంబంధించిన అమాయకత్వాన్ని ఎలా పోగొట్టుకుని హింసాత్మక ఘటనల క్రమంలో కొట్టుకునిపోయాడో.. ఆ క్రమంలో తాను బుద్ధి మాంద్యానికి గురవడమే కాకుండా, తన కుటుంబాన్ని, తెలిసిన వారందరినీ ఎలా కోల్పోయాడో పరమ భయానకంగా చూపించిన ఈ సినిమా చందమామ కథ కాదు. పెద్దలు చెప్పిన మాటలు వినాలి అని భారతీయ సమాజం నేర్పించే నీతి పాఠం అంతకంటే కాదు. ఆ అబ్బాయి అమాయకంగా చేసిన పనికి (నాజీలు కోల్పోయిన తుపాకీని ఇసుకలోంచి లాగడం), ఆ తర్వాత తన ప్రమేయం లేకుండానే నాజీల దురాగతాలు ఆ గ్రామ ప్రజలపై ఏ స్థాయిలో కొనసాగాయో, ఊళ్లకు ఊళ్లనే ఎలా వాస్తవంగానే తగులబెట్టేశారో వరుసగా చూపిస్తూ పోయిన మాంత్రిక వర్ణనకు ఈ సినిమా తిరుగులేని నిదర్శనం. తాను తెలిసీ తెలియక చేసిన పనికి ఆ బాలుడు పాఠం నేర్చుకున్నాడో లేదో కానీ, నాజీల ముట్టడిలో నాడు సోవియట్ గ్రామాలు అనుభవించిన దురాగతాలన్నింటినీ ఆ అబ్బాయి సినిమా పొడవునా కెమెరా ముందు పెట్టిన తన ముఖం సాక్షిగా ఒక బీభత్సానుభూతిని ప్రేక్షకులకు అనుభూతి కలిగిస్తూ పోతాడు. 

రెండున్నర గంటలపాటు సాగే ఈ సినిమాను చూస్తుంటే యుద్ధం గురించి, పరాయిదేశపు కిరాయి సైన్యం ముట్టడిలో చిక్కుకున్న ప్రజల నరకబాధల గురించి మనకు ముఖ్యంగా భారతీయులకు ఏమీ తెలీదనే చెప్పాల్సి ఉంటుంది. నాజీల ముట్టడికి గురైన ప్రాంతాల్లో హింస ఎంత పరాకాష్టకు పోయిందో ఈ సినిమా చూపించినంత దారుణంగా మరే యుద్ధ సినిమా చూపించలేదని విమర్శకుల వ్యాఖ్య. ఆ ఫామ్ హౌస్‌లో వందలాదిమందిని కుక్కి నాజీలు తగులబెడుతుంటే ఒక నాజీ మహిళ.. పీత కాలును నోట్లో వేసుకుని కొరుకుతుండటం, అపరాధభావంతో కుమిలిపోతున్న ఆ అబ్బాయి తన తలను బురదలో కూర్చి ఉండిపోవడం, అతడి స్నేహితురాలు ఆ అబ్బాయి కుటుంబాన్ని మొత్తంగా నాజీలు చంపేసి ఉన్న దృశ్యాన్ని చూసి స్థాణువై పోవడం. సినిమా మొత్తంగా షాక్ మీద షాక్‌ని చూస్తున్న వారికి కలిగిస్తూనే ఉంటుంది. 

భావోద్వేగాలను పరాకాష్టకు తీసుకుని పోవడమే తన సినిమాల విజయ రహస్యం అని గొప్పగా చెప్పుకునే మన రాజమౌళికి మానవ భావోద్వేగాల గురించి ఏమీ తెలీదని ఈ సినిమా చూశాక మనకు అర్థమవుతుంది. 

దాదాపు ముప్పై ఏళ్లకు పైబడి అనుకుంటాను భారతీయ మేటి దర్శకుడు సత్యజిత్ రాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినమాట మళ్లీ ఇప్పుడు గుర్తుకొస్తోంది. సినిమా తీయడానికి వందల కోట్ల పెట్టుబడి మన చేతిలో ఉన్నప్పటికీ లేదా ప్రభుత్వాలే పెట్టుబడి పెట్టినప్పటికీ, వార్ అండ్ పీస్ లాంటి భారీ రష్యన్ సినిమాలను మనం ఎన్నటికైనా తీయగలమా అని సత్యజిత్ రాయ్ ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. తెలుగు సినిమా పెట్టుబడి విశ్వరూపమో లేక విషరూపమో ధరించి వందల కోట్లఖర్చుతో సాంకేతికత పేరుతో, విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో, దద్దమ్మ హీరోలతో పనికిమాలిన సినిమాలను తీయగలుగుతున్న నేటి రోజుల్లో కూడా, సత్యజిత్ రాయ్ ఆనాడు చెప్పినమాట అక్షరసత్యంగా ఇప్పటికీ వర్తిస్తుందనే ఘంటాపథంగా చెప్పవచ్చు. 

నిజంగా యుద్ధం అంటే ఏమిటో, దాని విధ్వంసకర పరిణామాలు ఏమిటో ఓనమాలు కూడా తెలీని రాజమౌళి, బాహుబలి తరహా యుద్ధాన్ని బీభత్సంగా చూపించి ఇదే యుద్ధం అనుకోవాలంటూ మనల్ని మాయలో ముంచెత్తాడు. ఇటీవలి కాలంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో యూట్యూబ్‌లో విడుదలవుతున్న అలనాటి సోవియట్ యూనియన్ యుద్ధ సినిమాల భారీతనాన్ని చూస్తే, మనవాళ్లు వట్టి వెధవాయిలోయి అని గురజాడ అప్పారావు ఎందుకన్నారో మళ్లీ గుర్తుకు రాకమానదు. 

సోవియట్ యుద్ధ చిత్రాలను వరుసగా చూసే అవకాశం, సమయం దొరికి గత కొన్నివారాలుగా చూస్తున్న నాకు, వారి యుద్ధచిత్రాల్లో ఒక్కదాంట్లో కూడా హీరో కానీ పార్కుల్లో పాటలనే తైతెక్కలాడే హీరోయిన్ కానీ కనబడలేదు. నిజంగానే సోషలిస్టు రియలిజానికి పట్టం కట్టిన చిత్రాలవి. (ఈరోజుల్లో ఈ భావనను అపహాస్యం చేసేవారే ఎక్కువ) ఒక్కమాటలో చెప్పాలంటే హీరోయిజాన్ని భారతీయ సినిమా అపహాస్యం చేసినంత ఘోరంగా మరే దేశ సినిమా కూడా చేయలేదని నా అభిప్రాయం. 

మన హీరోలు నట హంసలు కాదు.. నట హింసలు. ఆ నట హింసను చూసి వెర్రెత్తిపోతున్న జనాలు కూడా రెడీగా ఉన్నారు కాబట్టే మానవ జీవితాన్ని, దాని సహస్ర పార్శ్వాలను ఉద్దీప్తం చేయాల్సిన సినిమా అనే మహత్తర కళ మన దేశంలో కలెక్షన్ల వసూలు పిచ్చలో పడి దేకుతూ అక్కడే ఆగిపోతోంది. సినిమా కళమీద దాని ఔన్నత్యం మీద కనీస అవగాహన లేని చింతపండు వ్యాపారులు, సారా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినిమా నిర్మాతలుగా అవతారమెత్తితే, వాళ్ల చీకటి పెట్టుబడి ఆధారంగా రెమ్యునరేషన్ల రికార్డుల వైపుగా సాగిపోతున్న మన ''నట వారస హింస''ల భయంకర నటనా వైదుష్యంతో భారతీయ సినిమా.. ప్రపంచ సినిమా రంగం ముందు సాగిలపడి దేకుతోంది. 

అమానుషత్వం, జాత్యహంకారం, తుపాకీ బలం తెచ్చిపెట్టే తిరుగులేని అధికారం చరిత్రలో ఉన్నంతవరకు మనకు యుద్ధాలు, యుద్ధ బీభత్సాలు తప్పవని ఈ సినిమా స్పష్టం చేస్తుంది. యుద్ధం లేని ప్రపంచం గురించి మానవజాతి కన్న ఆ బాల్య స్వప్నం మరో వెయ్యేళ్ల తర్వాత కూడా ఫలించదనిపిస్తుంది.  

1943లో బైలోరష్యాను ముట్టడించిన నాజీ బలగాలు 648 గ్రామాలను అక్కడ నివసించే వేలాది ప్రజలతో సహా తగులబెట్టిన వాస్తవగాథను దర్శకుడు క్లిమోవ్, అలెస్ అదమోవిచ్‌ కలిసి సినిమా రూపంలోకి మార్చారు. స్వయంగా నాటి నాజీ ముట్టడిని వారు చిన్నవయసులోనే ఎదుర్కొని అనుభవించారు కనుకే 40 సంవత్సరాల తర్వాత తాము చూసిన ఆ భయానక దృశ్యాలకు సినీరూపమిచ్చారు. చరిత్రలోని వాస్తవ ఘటనలను సినిమా రూపంలోకి ఎలా మార్చాలో తెలిపే కరదీపికగా కమ్ అండ్ సీ సినిమా మన చరిత్రకు మిగిలింది.

కమ్ అండ్ సీ సినిమాపై ఈ పరిచయం నాదే అని ఎలా చెప్పుకోవాలి? మన ఇల్లు, మన ఉద్యోగం, మన బ్యాంకు, మన వేతనం, మన ఆస్తి లాగా మన రచనలు మన జ్ఞానం కూడా మన సొంతమే అవుతాయా అంటూ బాలగోపాల్ ఏనాడో వేసిన పొటుకు మర్చిపోవడం సాధ్యం కాదు కదా.. 

మన సినిమా వైభవం గురించిన చర్చ ఇక్కడ అప్రస్తుతం అనుకుంటే, యుద్ధ సినిమాల చరిత్రలో తలమానికంగా నిలిచిన కమ్ అండ్ సీ సినిమాను కింది లింకులో తప్పక చూడండి. ఇది అంతగా క్వాలిటీ లేని యూట్యూబ్ లింక్ అని గుర్తుపెట్టుకోండి.

COME AND SEE | ENGLISH SUBTITLES

https://www.youtube.com/watch?v=NJYOg4ORc1w


కొసమరుపు:

''సినిమా చూడ్డం మొదలెట్టి మళ్ళీ మీ ఈ విశ్లేషణ మొత్తం చదివాక. చూద్దామని చదివాను. మనసంతా దుఃఖంతో వణికి పోయింది...ఇప్పుడు ఇసుకలో తుపాకీ తవ్వితీసిన బాలుడి జీవితం సినిమాలో చూడాలంటే భయం వేస్తోంది. గొప్ప విశ్లేషణలు... నాజీ యుద్ధ సినిమాలు చాలా చూసాను కానీ మీ ఈ విశ్లేషణ చదివాక... హృదయం వేదనతో మెత్తబడి పోయింది. 

సినిమా ఇప్పుడే ముగించాను ఏడుస్తూ చూసాను.. ఇక ఈ రాత్రి నిద్రపోలేను.''

అంటూ మంచిసినిమా గ్రూప్ సభ్యురాలు డాక్టర్ గీతాంజలి గారు ఈ సినిమా పరిచయం గురించి రాసిన వ్యాఖ్య ఇక్కడ తాజాగా పొందుపరుస్తున్నాను. ఆమె వ్యాఖ్యకు నా సమాధానం కూడా ఇక్కడ ఇస్తున్నాను.

ఆ సినిమా చివరి 15 నిమిషాల క్లైమాక్స్ లో చూపింది చాలా తక్కువే చెప్పానండీ. పిల్లలతో సహా గ్రామం మొత్తాన్ని తగులబెట్టేశాక.  ఒక ముదుసలిని మంచంమీద బయటకు తెచ్చి  ఆ నాజీ ముష్కరులు చెప్పిన డైలాగ్ నేనయితే పరిచయంలో రాయలేకపోయాను. పిల్లలతో సహా మీ వాళ్లనందరినీ లేపేశాం. నువ్వు మళ్లీ పిల్లలను కని మామీదకు వాళ్లను పంపించు అనే అర్థం వచ్చేలా వాళ్లు చేసిన హేళనకు అంత పెద్ద ముసలావిడ కూడా కన్నీళ్లు పెడుతూ వాళ్లకేసి చూసిన చూపు మర్చిపోలేం. ఇదీ భావోద్వేగం అంటే. మన రాజమౌళికి అర్థం కానిదిదే... 

గ్రామాన్ని తగులబెట్టిన నాజీలను చివరికి రెడార్మీ పట్టుకున్నప్పుడు ప్రాణం కోసం వాళ్లు వేసే వేషాలు. ఆ కుర్రాడి కాల్చేసే చూపును ఎన్నటికీ మర్చిపోలేం. 

దాదాపుగా సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన యుద్ధ సినిమాలన్నీ ఇలాగే పరిచయం చేయాలని ఉంది. పదేళ్లక్రితం ప్రాణహిత, ప్రజాకళ అనే రెండు వెబ్ సైట్లకు ప్రపంచ క్లాసిక్ మూవీస్ పై సమీక్ష కావాలంటే ది బ్యాటిలిషిప్ పొటెంకిన్, స్పార్టకస్, ఇవాన్  ది టెర్రిబుల్, ఎనిమీ అట్ ది గేట్స్ వంటి యుద్ధ సంబంధిత సినిమాలను సమీక్షించి పంపాను. అవి సంచలనం కలిగించాయి. అయితే ఆర్థిక వనరుల లేమితో వాటిని మూసేశారు దాంతో వంద క్లాసిక్ సినిమాలు పరిచయం చేద్దామనుకున్న నా ప్లాన్ పోయింది.  అయితే ఇప్పుడు ఒక వెబ్ సైట్‌లో పనిచేసే అవకాశం వస్తోంది కాబట్టి మళ్లీ సినిమాల పరిచయం చేయగలనని అనుకుంటున్నాను.

ఒరిజనల్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉందని మిత్రులు చెప్పారు. మీకు వీలయితే అక్కడే చూడండి. అయితే యూట్యూబ్ లోని ఈ లింకు కూడా మంచి క్వాలిటీతోనే ఉన్నట్లుంది. ఇక్కడే చూడవచ్చు.

COME AND SEE | ENGLISH SUBTITLES

https://www.youtube.com/watch?v=NJYOg4ORc1w


Thursday, January 28, 2021

గుస్సాడి నృత్య మారాజుకు ‘పద్మా’భరణం

 

గుస్సాడి నృత్య మారాజుకు పద్మాభరణం

ఆత్రం భుజంగరావు

 ప్రభుత్వం ఇచ్చింది పద్మశ్రీ అవార్డు 

ఆదివాసులిచ్చింది గుస్సాడి బిరుదు...

 


కొమురం బీం జిల్లా జైనూరు మండలంలోని ఆదివాసీ కుగ్రామం మార్లవాయిలో ఒక నిరుపేద కుటుంబంలో 60 ఏళ్ల క్రితం కనకరాము, రాజుభాయి దంపతులకు ఏకైక సంతానంగా కనకరాజు జన్మించారు. ఆదివాసీ గోండు తెగకు చెందిన అక్షరం తెలియని కళాతపస్వి ఈయన. ఇద్దరు భార్యలు, 11 మంది సంతానం (ముగ్గురు మగపిల్లలు, 8 మంది అమ్మాయిలు) కలిగిన పెద్దకుటుంబీకుడు కనకరాజు. అడవి పోడు వ్యవసాయం. వర్షాధారంపై ఆధారపడిన జీవనం. ఖాళీ సమయంలో గ్రామంలో ఉన్న ఆశ్రమపాఠశాలలో దినసరి కూలీగా 30 ఏళ్లనుంచి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తడికల పెంకుటింటిలో నివాసం. ఆదివాసీ పండగలలో ముఖ్యమైనదైన దండారి పండుగ వచ్చిందంటే నెల రోజుల ముందునుంచే గుస్సాడి టోపీలను అలంకరించడం ఈయనకు ఆనవాయితీ. యుక్తవయస్సు నుంచే గుస్సాడి నృత్యం అంటే ప్రాణంలా భావిస్తూ వచ్చారు. ఎత్మసూర్ (ఆత్మదేవత) దేవుని సన్నిధిలో నేటికీ గుస్సాడి నృత్యంలో శిక్షణ ఇస్తూ యువ గుస్సాడీల తప్పటడుగులను సవరిస్తూ వారిని ముందుకు నడుపుతారు. గుస్సాడి నృత్య ప్రదర్శనకు గానూ ఏరోజూ తనకు వయస్సు అడ్డు రాలేదు. దండారి పండగ 20 రోజులవరకు ఉంటుంది. ఆయన లేనిదే మార్లవాయి గ్రామ దండారి ముందుకు సాగదు. ఆయనకు ఆదివాసులు ప్రేమతో ఇచ్చిన బిరుదు గుస్సాడి. ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆదివాసులకు ఆత్మగౌరవంగా భావిస్తున్నారు.


 గుస్సాడి నృత్యం గోండు ఆచారంలో ప్రధానమైనది. ఈ నృత్యాన్ని గుస్సాడి వేషధారణతో ప్రదర్శించి ప్రజలను అలరించేవారు. పూర్తి ఆదివాసీ నృత్యమైన గుస్సాడిని దండకారణ్యం నుంచి రాష్ట్రాల రాజధానులను దాటించి దేశ రాజధాని డిల్లీలోనూ ప్రదర్శనలు చేసి అబ్బురపర్చారు కనకరాజు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే గిరిజన కళాబృందాల్లో గుస్సాడి వేషంలో కనకరాజు తప్పనిసరిగా ఉండేవారు. ఉమ్మడి ఏపీ రాజధానిలో, జిల్లా స్థాయిలో కూడా సాంస్కృతిక ప్రదర్శనల్లో కనకరాజు కనిపించేవారు. ఢిల్లీ, హైదరాబాద్ సాంస్కృతిక ప్రదర్శనలలో రిపబ్లిక్ ఉత్సవాల్లో ఎన్నోసార్లు పాల్గొన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈయన కృషి, పట్టుదలను గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం ఆదివాసీ సమాజానికి ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నాం. ఒక మూలవాసీ కళను గుర్తించి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడం ఆదివాసీలందరికీ స్ఫూర్తినిస్తుంది.


 ఆదివాసులుగా పుట్టి ఎస్టీ రిజర్వేషన్లతో ఉద్యోగాలు చేస్తూ, ఉన్నత విద్య పొందుతూ గిరిజన సంస్కృతి తెలీకుండానే గడుపుతున్నవారు ఎక్కువ మంది. కానీ కారడవుల్లో ఉండి ప్రకృతిని ఆరాధిస్తూ తమ ఆచారాలను కాపాడుతూ భావి తరానికి అందిస్తూ కనకరాజు చేసిన కృషి అసామాన్యం. చాలామంది ఆదివాసీ విద్యావంతులు అభివృద్ధి మాయాజాలంతో ఆదివాసీ ప్రకృతి అనుబంధ సంస్కృతిని కనుమరుగు చేస్తున్న పరిస్థితుల్లో.. ప్రకృతి సిద్ధమైన గుస్సాడి నృత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ దానిలో ఉన్న మానసిక ఉల్లాసం, గ్రామాల మధ్య, మనుషుల మధ్య అనురాగానుబంధాలు, మానవులకు ఉండాల్సిన మానమర్యాదలను గౌరవించడం, మానవ సంబంధాలు పెంచుకోవడం వంటి అంశాలను కనకరాజు తన ప్రదర్శనలతో చాటి చెబుతుటారు. గుస్సాడి రూపంలో ఉన్న వస్తువులతో రాజు కాలిగజ్జెల అల్లికలు, వాయిద్యాలు తయారు చేస్తారు. నెమలి ఈకలతో గుస్సాడి టోపీలను అల్లుతారు. డప్పు, డోలు, డోల్కి వీటికి సంబంధించిన పాటలు, కథలు, దండారి పూర్వపరాలు, హాస్య నాటికలు, పదాలు, స్త్రీ పురుష వేషాలతో హాస్య నృత్యాలు చేసి ప్రజలను అలరిస్తారు. తన సహజమైన సొంత అనుభవాలను జోడించి, ఆదివాసీ సమాజానికి నష్టం కలిగిస్తున్న సంఘటనలను కల్పించి చెబుతారు. 


 మూడు తరాలుగా తన దంత గుప్త విద్యను ప్రచారంలో పెట్టి మౌఖికంగా ఆదివాసీ సమాజాన్ని చైతన్య పరుస్తున్న కళాకారుడు కనకరాజు. సమాజం నుంచి ఏనాడూ ఏదీ ఆశించని నిగర్వి కనకరాజు. ఇలాంటి నిరాడంబరునికి అత్యున్నత పురస్కారంతోపాటు ఒక ఇల్లు, శాశ్వత ఉద్యోగం, వ్యవసాయ భూమి కల్పిస్తూ ప్రభుత్వం అండదండలు అందించాలని, కనకరాజులో ఉన్న కళా, సాంస్కృతిక వైభవానికి తగిన గుర్తింపునివ్వాలని నాగరిక సమాజానికి విజ్ఞప్తి.

(ఆదివాసీ కళాకారుడు గుస్సాడి కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా)

వ్యాసకర్త ఉపాధ్యాయుడు 

ఉట్నూరు, ఆదిలాబాద్

మొబైల్ 9440585605

..............

కొసమెరుపు:

ఆదివాసీ కళాకారుడు గుస్సాడి కనకరాజు గారికి పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా ఉట్నూరు మండలంలో టీచర్‌గా పనిచేస్తున్న ఆత్రం భుజంగరావు గారు సాక్షి సంపాదకపేజీ కోసం ఈ వ్యాసం పంపారు. ఈయన కనకరాజు గారి సమీప బంధువే. ఆదివాసీలం తెలుగు అంతబాగా రాదనీ, తన వ్యాసంలో తప్పులుంటే కాస్త సవరించిగలరు అంటూ భుజంగరావుగారు అభ్యర్థించారు. నిజంగానే ఆయన శైలి మౌఖిక వ్యవహారానికి సమీపంగా ఉంటుంది. అక్షరం ముక్క రాని గుస్సాడి నృత్య కళాకారుడు కనకరాజుగారి గురించి ఆయన పంపిన వ్యాసాన్ని కాస్త సవరించి ఈరోజు (28-1-2021) సాక్షి సంపాదక పేజీలో ప్రచురించడమైనది.

ఆంధ్ర, తెలంగాణ రెండు ఎడిషన్లలో ఈ వ్యాసాన్ని ప్రచురించడంతో రచయితకు తెల్లవారి 5.30 గంటలనుంచి పుంఖానుపుంఖాలుగా ఫోన్ కాల్స్ వెల్లువలా వచ్చిపడ్డాయని రచయితే చెప్పారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్స్  వస్తూనే ఉన్నాయని ఒకేరోజు రెండుసార్లు చార్జి పెట్టుకోవలసి వచ్చిందని భుజంగరావుగారు చెప్పారు. అరుదైన తెలంగాణ కళాకారుడు గుస్సాడి కనకరాజు గురించిన కథనాన్ని తెలుగు రాష్ట్రాల పాఠకలోకం అద్భుతంగా స్వీకరించినట్లే తెలుస్తోంది. పైగా మద్రాసు, ఒడిశా వంటి ప్రాంతాలనుంచి కూడా కాల్ చేశారని, యూనివర్శిటీ ప్రొఫెసర్లు కూడా మాట్లాడారని నా రచనకు ఇంత గొప్ప స్పందన ఎప్పుడూ చూడలేదని కృతజ్ఞతలు తెలిపారు రచయిత.


 
ఈ సందర్భంగా కనకరాజు గారు నివసిస్తున్న పూరి గుడిసె ఫోటోలు కూడా పంపారాయన. జీవితం మొత్తంగా అదివాసీ కళకు అంకితం చేసిన గుస్సాడి కనకరాజుకు అక్షరం ముక్క రాకపోవడమే కాడు. చివరకు ఆధునిక జీవితానికి అత్యవసరమైన మొబైల్ ఫోన్ కూడా లేదట. ఆయన కుటుంబీకులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాబట్టి ఆయన ఊరినుంచి నగరానికి, నగరం నుంచి ఊరికి రాకపోకలు చేస్తుంటారు. ఎలాగోలా ఒక ఫోన్ అయినా పెట్టుకోండి అని గుస్సాడి రాజు కుటుంబానికి చెప్పానని రచయిత తెలిపారు.

ఎలా అర్థం చేసుకోవాలి ఈయనని... కళాకారుడు అంటేనే పైరవీకారుడు అనే పెద్ద అపప్రథ రాజ్యమేలుతున్న నేటికాలంలో ఆ పదాలకు అర్థం కూడా తెలీకుండా గడుపుతున్న నిరుపమాన జీవితం కదా ఆయనది.. పద్మశ్రీ వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయో లేదో కానీ ఆయనను వరించిన పద్మశ్రీ పురస్కారం మాత్రం ఈరోజు నిజంగా పునీతమైందని ఒక మిత్రుడు చెప్పిన మాట అక్షరసత్యమే.

ఇంతవరకు ఆయన ఎవరినీ ఏదీ యాచించలేదు.. నాగరిక సమాజం, నాగరిక ప్రభుత్వాలు ఆయన్ను పట్టించుకుంటాయో లేదో తెలీదు కానీ జీవిత పర్యంతమూ ఆయన ఆడిపాడి కాపాడుకున్న గుస్సాడి కళారూపం కాసింత ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించే అర్హత మనకు ఉందా లేదా అనేదే పెద్ద ప్రశ్న.

NB:

చివరగా.. ఆయన గురించి ఏదైనా సాక్షికి రాసి పంపుతారా అని అడిగినప్పుడు భుజంగరావు గారి ఫోన్ ఇచ్చి వ్యాసం రాయించి సాక్షికి గౌరవం కలిగించిన మిత్రులు జయధీర్ తిరుమల రావుగారికి కృతజ్ఞతలు కాదు.. నిండు నమస్కారాలు..

 ......................

గుస్సాడి నృత్యం గురించి మరింత సమాచారం

గుస్సాడీ- దండారి ఉత్సవంలో గుస్సాడిల నృత్యాలు || కే.బి కాలనీ || Gussadi dance

https://www.youtube.com/watch?v=2JRmhVLprJg&ab_channel=AdivasiKabur

 గుస్సాడీ కళాకారుడు కనకరాజును అభినందించిన మంత్రి

సాక్షి, ఆదిలాబాద్‌ : కొమరం భీమ్‌ జిల్లా అదివాసీ  కళాకారునికి అరుదైన గౌరవం లభించింది‌. సంప్రదాయాలు పాటిస్తూ, ఆచారాలు పరిరక్షిస్తున్న ఆదివాసీ కళకారుడు కనకరాజు.. సంప్రదాయ గుస్సాడీ న్రుత్యం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి  గుస్సాడీ కళకారుడు కనకరాజును కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డు  దక్కిన వారిలో తెలంగాణ నుంచి ఎంపికైన వారిలోకనకరాజు ఏకైక వ్యక్తి కావడం విశేషం. గిరిజన గుస్సాడీ కళకారునిగా అరుదైన పద్మశ్రీ  అవార్డు కనకరాజుకు లభించడంతో అదివాసీల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అదివాసీ కళకారునికి కేంద్ర పురస్కారం దక్కించుకున్న కనకరాజును అందరూ అభినందిస్తున్నారు. 

అద్బుతమైన కళా నైపుణ్యంతో ఈ అవార్డును సాదించిన కనకరాజును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా ఓకళాకారునిగా కేంద్రం పురస్కారం లబించడంపై కనకరాజు సంతోషం వ్యక్తం చేశారు. కలలో కూడ ఈ అవార్డు దక్కతుందని ఊహించలేందని భావోద్వేగానికి లోనయ్యారు. అవార్డు తనకు దక్కినప్పటికీ గిరిజనుల కళకు సర్కార్ ఇచ్చిన గౌరవంగా బావిస్తున్నానని  కనకరాజు పేర్కొన్నారు. అయితే కళకారుని అద్బుతమైన నైపుణ్యం ఉన్నా.. అర్థికంగా అంతంత మాత్రమే బతుకున్నారని, అర్థికంగా సర్కారు అదుకోవాలని కనకరాజు కోరారు.

అయితే గుస్సాడీ  కళ వందల ఎళ్ల  కాలం నుండి వస్తున్నా కళ. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా  దండారి  ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అదివాసీల దైవం ఎథ్మసూర్‌ను ప్రార్థిస్తూ  గుస్సాడీ నృత్యం చేస్తారు గిరిజనులు. గుస్సాడీ  నృత్యం చేసే వాళ్లు నెత్తిన నెమలి  పించం, భుజాన జింక చర్మాన్ని దరించి, చేతిలో దండారి పట్టుకొని గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా గుస్సాడీ చేసే నాట్యం చూపరుల గుండెలను హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి అద్బుతమైన కళను కనరాజు పరిరక్షరిస్తున్నారు. అందులో బాగంగా గుస్సాడీలో గిరిజనులకు శిక్షణ ఇస్తున్నారు.

ఈవిదంగా కొన్ని వందల మందికి శిక్షణ ఇచ్చారు. అందుకే కనకరాజును గుస్సాడీ గురువుగా పిలుస్తుంటారు. ఒకవైపు గుస్సాడీ  కళను పరిరక్షిస్తూనే మరోకవైపు కనకరాజు శిక్షణ ఇస్తున్నారు. అద్బుతమైన నైపుణ్యంతో అనేక ప్రాంతాలలో గుస్సాడీ కళ ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ ప్రదాన మంత్రి ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చారు..ఇలా ఏందరో మహనుబావులను  గుస్సాడీ కళ నైపుణ్యంతో అకట్టుకున్నారు‌. వివిర రంగాల వ్యక్తుల నుండి ప్రశంసలు, మన్ననలు కనకరాజుకు లబించాయి.