అజ్ఞాతవాసిని దెబ్బతీసిన (కలెక్షన్లను అలా పక్కనబెట్టండి) మూడు టెర్రిబుల్ మిస్టేక్స్ ఏమిటి అనే అంశంపై కత్తి మహేష్ తార్కిక, హేతుపూర్వక సమాధానాలు కింది లింకులో చూడవచ్చు. సినిమా సమీక్ష అంటే హీరోమీద, దర్శకుడి మీద బండలేయడం కాదంటూ కత్తి ఇక్కడ ఇచ్చిన వివరణ అర్థవంతంగానే ఉంది. చివరి వరకూ చూడండి. కత్తి వర్సెస్ పవన్ అభిమానుల మధ్య కొనసాగుతున్న యుద్ధాలను పక్కనబెట్టి సినిమా సమీక్షను సమీక్షగా మాత్రమే చూడాలంటే ఇలాంటివే నిజమైన సినీ అభిమానులకు అవసరం. పూర్తిగా సంయమనం తోటే సాగిన ఈ సమీక్ష తెలుగు సినిమా పరిణతికి చాలా అవసరం.
ఇక నా అభిప్రాయంపై కూడా భిన్నాభిప్రాయాలు, ఉద్దేశపూర్వకంగా ఏర్పర్చుకునే దురభిప్రాయాలు రావంటే, ఏర్పడవంటే నేనే నమ్మను.
కానీ కత్తి మహేష్.. మీరు నిజంగా చేయాల్సింది ఇలాంటి యుద్ధమే. మీ అవసరం ఈ కోణంలో సినీ పరిశ్రమకు చాలా అవసరం. అజ్ఞాతవాసి సినిమా దర్శకుడు, హీరోకు ఇష్టమున్నా లేకున్నా ఈ సినిమా అంచనాలను ఎందుకు అందుకోలేకపోయింది (మరోసారి చెప్పాలి. ఇది కలెక్షన్ల గొడవ కానేకాదు) అనే విషయంలో వ్యతిరేకాభిప్రాయాన్ని దానిలో దాగిన వాస్తవాలను తాము చూడా చూడటం అవసరం. వారి అభిమానులకు కూడా ఈ దృష్టి అవసరం.
ఎందుకంటే అభిమానులు తమ తమ హీరోల సినిమాలను ఆర్థికగా నిలబెట్టిన, గెలిపించిన చరిత్ర ఇంతవరకు ఏ తెలుగు సినిమాకూ లేదు. ఇకపై రాబోదు. హీరో హీరోయిజాన్ని దిగజార్చేసి, అతడి చేత పిచ్చి కామెడీ చేయించేసి. ఇదే మీరు కామెడీ అనుకుని ఎంజాయ్ చేయండి అని చెబితే సినిమా చూసే ప్రేక్షకులు నిజంగానే తలను సీటు కిందికి దించుకోవలసి వస్తుంది. ఇది అజ్ఞాతవాసికే కాదు ఏ సినిమాకైనా వర్తిస్తుందన్న కత్తి మహేష్ వ్యాఖ్య నూటికి నూరుపాళ్లు నిజం.
అర్థం పర్థం లేని కామెడీలు, హీరోయిజాలు, హింసలు, బూతులు, ద్వంద్వార్థాలు, సినిమా కథను ధ్వంసం చేసి దాని విలువను దిగజార్చివేస్తున్న పాడు కాలంలో చిత్ర విమర్శకు కత్తి మహేష్ కొత్త అర్థం చెబుతున్నారా అనిపిస్తోంది. సగటు సినిమా సమీక్షలను దాటి విమర్శను కళాత్మక రూపంలోకి తీసుకుపోవడం తెలుగు సినిమాలో ఇప్పుడే మొదలైందా అనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ అభిమానులను ఇలాంటి సినిమా తీసి అవమానించే హక్కు పవన్ కల్యాణ్ కు కూడా లేదంటున్న కత్తి మహేష్ అభిప్రాయాన్ని పవన్ అభిమానులు కూడా సీరియస్‌గానే పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
Mojo TV తరపున వచ్చిన కింది ఇంటర్వ్యూలో కేవలం అజ్ఞాతవాసి సినిమా వైఫల్యంపై సమీక్ష మాత్రమే కాకుండా. పవన్ కల్యాణ్ అభిమానులు తనతో అనవసరంగా ఘర్షిస్తున్న తీరు మీద కూడా చాలా వివరంగా కత్తి మహేష్ ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ భవిష్యత్ జీవితానికి హాని చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ లేదని, కాని ఆయన రాజకీయ అడుగులపై తాను చేస్తున్న విమర్శ కొంచెం కఠినంగా ఉండవచ్చు కానీ అది హార్ష్ రియాలిటీ ఆని ఈ కఠిన వాస్తవాన్ని పవన్ అభిమానులు అర్థం చేసుకోలేకపోతున్నారని కత్తి మహేష్ చెబుతూ వచ్చారు. అందుకే దీన్ని అజ్ఞాతవాసి సినిమా పై సమీక్షగా మాత్రమే కాకుండా పవన్ అభిమానుల ఆవేశంపై కూడా సమీక్షగానే చెప్పవచ్చు.
పైగా పవన్ కల్యాణ్ మెగా ప్యామిలీకి కుటుంబ పరంగా దూరమైపోవడంతో సినిమాల ఎంపిక, దాని సాధక బాధకాలపై సరైన అంచనా, అవగాహనను ఇచ్చి గైడ్ చేసే అవకాశం కోల్పోయాడని ఇది వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా పవన్‌కి నష్టం కలిగించే అంశమని కత్తి తేల్చి చెప్పారు. కుటుంబ జీవితం నుంచి, కుటుంబం నుంచి వైదొలిగి ఏకాకి అయిన ప్రతి వ్యక్తీ తన జీవితాన్ని రూపొందించుకోవడంలో ఎక్కడో ఒకచోట తప్పటడుగు వేయక తప్పదని కత్తి అంటున్న మాటను ఆలోచించాల్సిందే.
చివరలో ఆణిముత్యం లాంటి మాట విసిరాడు కత్తి మహేష్. వ్యవస్థను కాపాడాలంటే వ్యక్తులను వ్యక్తులుగా మాత్రమే చూడాలి. వాళ్లను వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా చూడకూడదు. మనిషిని తీసుకుపోయి దేవుడిని చేసేస్తే, ఇక ఆ దేవుడు మనుషుల్లో ఉండటం మానేస్తాడు. తర్వాత దేవుడు ప్రశ్నాతీతమైపోతాడు. అదే మంచిది కాదు. అందుకే మనుషుల్ని మనుషుల్లాగే చూద్దాం. వాళ్లను మనుషుల్లాగే ట్రీట్ చేద్దాం. వాళ్లు దేనికి బాధ్యత వహిస్తారో చూద్దాం. అంటూ పవన్ దేవుడిగా చూస్తున్న అభిమానులకు సూచించాడు కత్తి.
ఈ పోస్టులో నా అభిప్రాయాన్ని పట్టించుకోకుండా, ఆద్యంతం హుందాగా కొనసాగిన కత్తి మహేష్ నిజాయితీతో కూడిన అజ్ఞాత వాసి సమీక్షను ఈ లింకులో చూడండి.
Kathi Mahesh Honest Review And Analysis On "Agnyaathavaasi" Movie | Mojo TV (best analysis by katti)
https://www.youtube.com/watch?v=3d-xN8W1MIs
********** **********
అజ్ఞాతవాసి సినిమాపై 10 టీవీలో వచ్చిన మరొక సమీక్ష మరీ అద్భుతంగా ఉంది.
అద్భుతమైన సినిమాటోగ్రఫీ, చక్కటి సంగీతం అమరినప్పటికీ అజ్ఞాతవాసి కథాపరంగా ఎక్కడ తేలిపోయింది? విమర్శకులే కాకుండా సామాన్య ప్రేక్షకులు, హీరో అభిమానులు కూడా ఎవరికి వారు పెట్టుకున్న అంచనా ఎంత ఘోరంగా దెబ్బతింది అనే విషయంపై అటు కత్తి మహేష్ ఇటు ఇన్‌పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం చేసిన విలక్షణ సమీక్షను కింది లింకులో చూడవచ్చు.
Kathi Mahesh Review on Pawan Agnyaathavaasi Movie | Review | #Trending | 10TV
(best analysis from katti and krishna sairam)
https://www.youtube.com/watch?v=SdGnFRCbwOs