Pages

Showing posts with label నల్లధనం - దేశభక్తి. Show all posts
Showing posts with label నల్లధనం - దేశభక్తి. Show all posts

Saturday, January 7, 2017

పెద్ద నోట్ల రద్దు వెనుక దాగిన భండారం బట్టబయలైందా?


దేశభక్తి పేరుతో పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం వెలికితీత ముసుగులో 60 రోజులుగా భారత ప్రభుత్వం, దాని పెద్దన్న నరేంద్రమోదీ ఆడుతున్న దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. దేశంలో ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉన్నట్టు, అమెరికా చెప్పినట్టుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌, ఆర్థిక శాఖ తలాడించినట్టు ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ 'దాచిపెట్టిన బహిరంగ రహస్యం: భారత చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్‌' పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత తీసుకోవడానికి ముందు, తెరవెనుకా, తెరపైనా ఏడాది కాలంగా జరుగుతున్న ‘ఏర్పాట్లు’, ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్రధారులు, ఈ నిర్ణయం వెనక అసలు ప్రయోజనాలు, లబ్దిదారుల వివరాలను ఈ కథనం వెల్లడించింది,

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మోదీ ప్రభుత్వ వాగాడంబరంపై సెటైర్లు వేసినట్లు నటించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రాజన్ కూడా ఈ కుట్రలో సంవత్సరం పైగా పాల్గొని నాటకమాడినట్లు విదేశీ మీడియా బయటపెట్టడం సంచలనం గొల్పిస్తోంది. 125 కోట్లమంది ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టిన ఈ ఘాతుక చర్యను దేశభక్తి ముసుగులో నగ్నంగా సమర్థించిన కిరాతకులు...  పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న బాధలను ఎత్తి చూపితే అలాంటివారిపై దేశద్రోహులంటూ ఆరోపించి మరీ వెంటాడిన దేశభక్తులు వారి తైనాతీ పార్టీలు నిజంగా దేశభక్తులు కారని, వీరంతా దేశభక్తుల పేరుతో సాగుతున్న దేశభుక్తులని సాక్షాత్తూ విదేశీ మీడియా కథనం ద్వారా బట్టబయలైంది.

డిజిటల్ ఎకానమీ పేరుతో చేసిన పెద్ద నోట్ల రద్దు.. "భారత ప్రజలకు మేలు చేసేందుకు కాదు. వారికి తెలియకుండానే వారితో చెలగాటమాడాలి. కరెన్సీ నోట్ల రద్దుతో క్షతగాత్రులైన ప్రజలు భారత ప్రభుత్వాన్ని మాత్రం నిందించకూడదు. అందుకే డిజిటల్‌ పేమెంట్స్‌ లక్ష్యాన్ని తెరవెనక్కి నెట్టి, నల్లధనం, అవినీతి లక్ష్యాలను తెరముందుకు తెచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించారు. ఆ విధంగానే ఆయన ప్రకటన సాగింది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్రధారులందరికీ ఏం జరుగుతుందో తెలుసు, వారి లక్ష్యమేమిటో తెలుసు, వ్యూహమేమిటో తెలుసు.. కాగితాలపై మాత్రం ఎక్కడా ఏమీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. రహస్యాలేవీ బయటకుపొక్కకుండా చర్యలు తీసుకున్నారు.

అలా 125 కోట్ల భారత ప్రజల అమాయకత్వాన్ని, దేశభక్తిమాటున, అవినీతిపై యుద్ధం చాటున వారిని తేలిగ్గా బుట్టలో వేసుకునే వెసులుబాటును గుర్తించిన తర్వాత, ఏకంగా మొత్తం దేశాన్ని ప్రయోగశాలగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో అమెరికా మార్చేసింది. వాస్తవాలను కప్పిపెట్టి, కాకమ్మ కబుర్లతో ఎన్డీయే సర్కారు కోట్లాది మంది ప్రజలను ‘‘బకరా’’లను చేసింది. ఫలితంగా దేశంలో కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. నోట్ల రద్దుకు ముందు భారతలో నగదు లావాదేవీల వాటా 97 శాతం ఉంది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలు చిన్న బ్రతుకులను ఛిద్రం చేసినప్పటకీ, డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల్లో ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్‌ ఇతర సంస్థలకు మాత్రం వ్యాపార విస్తరణ, లాభార్జన అవకాశాలను తెరిచాయి."

గత 14 ఏళ్లుగా దేశభాషల్లో వెబ్ సైట్లను విజయవంతంగా నిర్వహిస్తున్న వెబ్‌దునియా.కామ్ తెలుగు వెబ్ సైట్ పెద్దనోట్ల రద్దు వెనుక నడచిన దేశద్రోహపూరిత నాటకానికి అక్షరరూపమిచ్చింది. దేశభక్తుల దేశద్రోహాన్ని ఇంత బాహాటంగా బయటపెట్టిన కథనం ఈ మధ్యకాలంలో చూడలేదు. విదేశీ ఆర్థిక సంస్థల, సామ్రాజ్యవాద కంపెనీల ప్రయోజనాలకోసమే పెద్ద నోట్ల రద్దు తతంగాన్ని ఎన్టీఏ ప్రభుత్వం ప్రారంభించిందంటూ గతంలోనే అనేక వ్యాసాలు చదివినప్పటికీ దాని వెనుక సంవత్సర కాలంగా సాగిన ప్రయత్నాలను ఇంత వివరంగా ఆధార సహితంగా ఏ కథనమూ ఇంతవరకూ బయటపెట్టలేదు.



ఒక విషయం మాత్రం నిజం. దేశభక్తులుగా గొంతు చించుకుంటున్న వారు, దేశభక్తిని నినాద ప్రాయం చేసి గబ్బుపట్టిస్తున్న వారు తాము నమ్ముతున్న గంగలో నూరుసార్లు మునకలేసినా సరే.. పెద్ద నోట్ల రద్దు పేరిట వారు చేసిన పాపాలు మాసిపోవన్నది నిజం.

దేశభక్తుల పార్టీ ఈ దేశానికి చేసిన అసలైన ద్రోహం గురించి తెలుసుకోవాలంచే తెలుగు.వెబ్‌దునియా.కామ్ (telugu.webdunia.com) లో ఇవ్వాళ వచ్చిన ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. చదివి తరించండి.

కుహనా దేశభక్తి నశించాలి. దేశభక్తుల ముసుగులోని నకిలీ దేశభక్తులు, దేశభుక్తులు నశించాలి. అమెరికా సామ్రాజ్యవాదుల పాదాల ముందు దేశాన్ని సరికొత్తగా తాకట్టు  పెట్టడానికి సాహసించిన ఎన్డీయే ప్రభుత్వ దుర్మార్గం నశించాలి. మన యోగి భోగి ప్రధాని దొంగ నాటకం నశించాలి.

రాజన్ నుంచి మోదీ దాకా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సాగించిన ఈ దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా యావద్దేశం ఒక్కటిగా నిలవాలి.

వెబ్ దునియా వెబ్ సైట్‌లో వచ్చిన ఈ పెద్ద నోట్ల రద్దు భండారంపై కథనం లింకును కింద చూడండి. మీ మిత్రులందరకీ షేర్ చేయండి.

125 కోట్ల మంది ప్రజలను బకరాలను చేసిన నరేంద్ర మోడీ... కరెన్సీ నోట్ల రద్దు వెనక పెద్దన్న హస్తం!?
http://telugu.webdunia.com/article/current-affairs/washington-is-behind-india-s-brutal-demonetization-project-117010700036_1.html


తాజా సమాచారం.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ముసుగులో దేశ ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాదుల హక్కు భుక్తం చేసే భారీ కుట్ర అనూహ్య ఘటన కాదని ఒకటన్నర సంవత్సరం పైగా ఇటు భారత ప్రభుత్వమూ, అమెరికా ప్రభుత్వమూ, ద్రవ్య పెట్టుబడుదారులూ కలిసి అత్యంత గోప్యంగా, అతి రహస్యంగా, అతి మార్మికంగా సాగించిన క్రూర పథకంలో భాగంగానే ఇది జరిగిందని నిరూపించే అద్భుత వ్యాసాలు ఇంగ్లీషులో లభించాయి. సమయం ఉంటే వీటిని పూర్తిగా అనువదించి ఇక్కడే పోస్ట్ చేయాలని ఉంది కానీ ఇప్పుడు కుదిరేటట్లు లేదు. అంతవరకు ఆ రెండు కీలక వ్యాసాలను కింది లింకుల్లో చూడగలరు.

A Well-Kept Open Secret Washington Is Behind India’s Brutal Demonetization Project

http://www.globalresearch.ca/a-well-kept-open-secret-washington-is-behind-indias-brutal-demonetization-project/5566167

పై ఇంగ్లీష్ వ్యాసం సంక్షిప్త అనువాదం ఇవ్వాళే తెలుగు ప్రింట్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ ప్రచురించారు.

అమెరికా చెప్పిందే... మోదీ చేశారా..?
http://www.andhrajyothy.com/artical?SID=354497

వీటితో పాటు కేంద్ర బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకే నగదు రద్దు పథకాలు అమలు చేయాలని సామ్రాజ్యవాదుల ముద్దుల పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ 2015 ఆగస్టులో పిలుపిచ్చిందంటూ కింది వ్యాసం పేర్కొంటోంది. నగదు రహిత వ్యవస్థల గురించి ఊదరగొడుతున్న నేతలు, వారి తైనాతీలు, భజనపరుల కుట్రల గురించి ఇంకా ఎవరికైనా సందేహం మిగిలి ఉంటే ఈ కింది వ్యాసం వాటిని తీీర్చవచ్చు.

Financial Times Calls For Abolishing Cash. “To Give More Power to Central Banks”

http://www.globalresearch.ca/financial-times-calls-for-abolishing-cash-to-give-more-power-to-central-banks/5472522?utm_campaign=magnet&utm_source=article_page&utm_medium=related_articles


10 వేల ఏళ్లలో ఘోరమైన పాలన ఇదే
మోదీ గారి పాలనలో ఇండియా వెలిగిపోతుంటే తగులబడుతోంటారమేటి అంటూ మోదీ భక్తులకు ఆగ్రహమూ, సందేహమూ కలిపి రావచ్చు. కానీ మహారాష్ట్రలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న శివసేన నిన్న మోదీ పాలన గురించి ఒక గొప్ప కామెంట్ చేసింది. 10 వేల ఏళ్లలో ఘోరమైన పాలన ఇదే అనేసింది. ఆ ప్రకటన సారాంశం ఇక్కడ చూడండి.

"10 వేల ఏళ్లలోనే అత్యంత ఘోరమైన పాలన మోదీ సర్కారుదే. పెద్దనోట్ల రద్దు నల్లధనాన్ని రూపుమాపుతుందని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు పిచ్చివాళ్ల స్వర్గంలో ఉంన్నారు. ఈ నిర్ణయంతో చివరకు మహిళలను కూడా అష్టకష్టాల పాలు చేశారు. పాత పెద్దనోట్ల మార్పిడికి అనుమతించలేదన్న ఆగ్రహంతో ఓ తల్లి అర్ధనగ్నంగా మారటం ప్రభుత్వ ప్రాయోజిత నిర్భయ ఘటన."

(ఇది ఆంధ్రజ్యోతి జనవరి 7వ తేదీనాటి 2వ పేజీలో వచ్చిన వార్తా రాజం. అధ్వానపు పరిపాలనపై ఈ చిన్ని వ్యాఖ్య చూశాక ఇక మాటల్లేవు....



Wednesday, January 4, 2017

త్యాగాలు ప్రజలవి - భోగాలు నాయకులవి



ఇప్పుడు కాదు... ఎమర్జెన్సీ సమయం నుంచి నేను రాజకీయాలను చూస్తున్నాను.  ఇందిరాగాంధీ మొదలుకొని తదుపరి వచ్చిన మురార్జీ, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, వీపీ సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు చెప్పే ఒక స్టాక్ డైలాగ్ "ప్రజలు త్యాగాలు  చెయ్యాలి".

* నిజమే.. ప్రజలు త్యాగాలు చెయ్యాలి.

* తమకు వచ్చే వంద రూపాయల గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలి.

* నాయకులు మాత్రం తమకు లభించే ఏ సబ్సిడీని వదులుకోరు.

* బయట 200  రూపాయలు ఉండే బిర్యానీని వారు మాత్రం ఇరవై రూపాయలకే ఆరగిస్తారు.

* ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అనుభవిస్తారు.

* ప్రజలు చచ్చి చెడి తమ కష్టార్జితంలోనుంచి నానా తిప్పలు పడి అధిక చార్జీలు చెల్లించి ప్రయాణాలు చేస్తారు.

*  నాయకులు మాత్రం విమానాలలో ఉచితంగా ప్రయాణాలు చేస్తారు.

*  లక్ష రూపాయలుగా ఉన్న తమ వేతనాలను అమాంతం నాలుగు లక్షలకు పెంచుకుంటారు.

* తమ నియోజకవర్గాలలో ప్రజాధనంతో సమకూర్చిన వాహనాలలో దర్జాగా ప్రయాణిస్తారు. బస్సుల్లో, రైళ్లలో, విమానాలలో తమకు లభించే ఏ విధమైన రాయితీని విసర్జించరు.

* ప్రజలు మాత్రం త్యాగాలు చెయ్యాల్సిందే.

* మీకు చిన్న చిన్న రోగాలు వస్తే ప్రజల ఖర్చుతో విదేశాలు వెళ్లి వైద్యాలు చేయించుకుంటారు.

* ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులలో ఛీత్కారాలు భరిస్తూ ఒక్కో బెడ్ మీద ముగ్గురు పేషేంట్స్‌తో పడుకోవాలి.  లేదా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇల్లూ వాకిళ్ళు, పొలాలు పుట్రలు అమ్మేసుకుని దివాళా తీయాలి.

* అవును మరి.. ప్రజలు త్యాగాలు చెయ్యాలి.

* గత రెండురోజులుగా సోషల్ మీడియాలో చాలామంది వీరదేశభక్తులు కొత్త లాజిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు.  "మీరు తిరుపతి, శ్రీశైలం, షిరిడీ వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్స్‌లో టికెట్స్ కోసం ఏడెనిమిది గంటలు నిల్చోవడం లేదా? ఏటీఎం ల దగ్గర గంట సేపు నిలుచోలేరా? " అని తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

* నిజమే... సామాన్య ప్రజలు గంటలతరబడి నిలుచుని తమ సమయాన్ని త్యాగం చేస్తారు.  మరి నాయకులు?

* తిరుపతిలో, షిరిడీలో ఏనాడైనా క్యూలలో నించున్నారా?

* మహాద్వారం నుంచి మహారాజుల్లా తమ కుటుంబాలతో సహా గర్భగుడి వరకు  దూసుకుని పోతారేం? స్వామివారితో అరగంట సేపు గడుపుతారు.  శేషవస్త్రాలు, ప్రసాదాలు స్వీకరిస్తారు.  ప్రత్యేక ఆశీర్వచనాలు తీసుకుంటారు... మరి వారు ఎందుకు త్యాగం చెయ్యరు?

* ఒక నాయకుడికి అధికారం ఇచ్చింది దేనికి?

* ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందిస్తారు అనేగదా?

* నేను కొత్త సంస్కరణలు తీసుకువస్తాను...మీరు ఓపికపట్టండి అని చెప్పని నాయకుడు ఎవరైనా గతంలో ఉన్నారా?

* ఆర్ధిక సంస్కరణల ఫలితాలు రెండు ఏళ్లలో కనిపిస్తాయి...వస్తువులు చౌకగా లభిస్తాయి. ప్రజలు త్యాగాలకు సిద్ధపడాలి అని చెప్పారు పీవీ నరసింహారావు.. ఆ తరువాత వాజపేయి, మన్మోహన్ కూడా ఇదే పాట పాడారు.

ఇరవై ఏళ్ల తరువాత కూడా వాటి ఫలితాలు పూర్తిగా కనిపించాయా?

* దేశంలో పేదరికం నలభై ఏళ్ళక్రితం 70 శాతమే ఉన్నది. ఇప్పుడూ అంతే ఉన్నది. ప్రజలు మాత్రం త్యాగాలు చేస్తూనే ఉన్నారు.

* పాత నోట్ల రద్దు ద్వారా నల్లధనం బయటకి తీయవచ్చు అని మోడీ భావించారు. బాగుంది. నేను కూడా హర్షించాను. కానీ మోడీ ఊహించిన విధంగా జరుగుతున్నదా?

*దేశంలో 18 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉన్నది అని కేంద్రం చెప్తున్నది.  గత మూడు రోజుల్లో బయటకి వచ్చింది కేవలం యాభై మూడు వేలకోట్ల రూపాయలు మాత్రమే.

* డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వెలికి వచ్చే అవకాశం ఉన్నదని ఇవాళ మధ్యాహ్నం ఆర్ధిక శాఖ అధికారులు చెప్తున్నారు!!!  మరి ఈ సంస్కరణ ద్వారా ఫలితం లేకపోతె ప్రధాని తన చర్యకు మూల్యం చెల్లిస్తారా?

(ఈ ఒక్క పాయింటు మాత్రం ఇప్పుడు కాస్త మార్పు చేయాలి. డిసెంబర్ చివరి నాటికి రద్దయిన పెద్ద నోట్లలో 14.5 లక్షల కోట్ల వరకు బ్యాంకులకు చేరాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం చలామణిలో ఉన్న పెద్దనోట్లు 15 లక్షల కోట్ల పైబడి. అంటే దేశంలో నల్లధనం అన్నదే లేకుండా మొత్తం దాదాపుగా వైట్ అయిపోయింది. 130 కోట్లమందిని గత 55 రోజులుగా కుళ్లబొడిచి, వారి అనంత కష్టాలను  దేశభక్తి మకిలిలో ముంచెత్తి మన భోగి యోగి ప్రధాని ఊడపొడిచిందేమిటి? ఇదంతా చూస్తుంటే సన్యాసిని నా దగ్గరేముంది బూడిద తప్ప అనే ఎన్టీఆర్ పాత డైలాగ్ గుర్తుకొస్తోంది. ఇంతకూ నల్లధనం ఉందా లేదా, ఉంటే అదంతా ఎక్కడికి పోయినట్లు?)

* పైగా మరో విచిత్రమైన సంగతి ఏమిటంటే... ఈ నిర్ణయం మంత్రివర్గం సమావేశం లో తీసుకుని ప్రధాని బయటకి వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. టీవీలో లైవ్ ఇచ్చి ప్రకటించారు. అప్పటివరకు మంత్రులు అందరిని సమావేశ హాల్‌లోనే బంధించేశారట..ఎందుకయ్యా అంటే.. మంత్రులు బయటకి వెళ్తే ఈ నోట్ల రద్దు విషయం లీక్ అవుతుందని భయం ట...

* ఎంత దారుణం?  అంటే... తన మంత్రుల మీద తనకే నమ్మకం లేదన్న మాట!! మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అత్యంత గోప్యం...ఈ రహస్యాలు కాపాడుతారని నమ్మకం మోడీకి తన మంత్రులమీద లేనప్పుడు అలాంటి వారిని మంత్రివర్గంలో కొనసాగించడం ఎంతవరకు సమంజసం?  ఇది మంత్రులకు అవమాసం కాదా?  అంతా ఏకపాత్రాభినయం కాదా ఇది? మోడీ గారు తన మంత్రులను నమ్మరు.  ప్రజలు మాత్రం మోడీగారిని నమ్మాలి!  దట్స్ ఆల్!

* నా చిన్నప్పటినుంచి వింటున్న మరో గొప్ప ఆణిముత్యం ఏమిటంటే  "ఈ దేశం నీకేమి ఇచ్చిందని అడగకూడదు... ఈ దేశానికి నువ్వు ఏమిచ్చావు?"

* ఎందుకు ఇవ్వడం లేదు?  నాకొచ్చే జీతం లో నలభై శాతం వివిధ పన్నుల రూపంలో కడుతున్నాను.

* అది కాక బయట ఏ వస్తువు కొన్నా సర్వీస్ టాక్స్, స్వచ్ భారత్ టాక్స్, కృషికళ్యాణ్ టాక్స్ కలిపి పదిహేను శాతం కడుతున్నా.

* అనగా నా ఆదాయంలో సగభాగం నేను దేశానికి ఇస్తున్నా...

* పొట్టపొడిస్తే అక్షరం ముక్క రానివారిని కూడా  ఈ దేశం మంత్రులను చేసింది.  మీరు వేలకోట్ల అవినీతి సొమ్మును కొల్లగొడుతున్నా భరిస్తున్నది. మాలాంటి వాళ్ళు ఇరవై రెండు ఏళ్లపాటు వివిధ విద్యాలయాలలో చదివి ఎంతో జ్ఞానం సంపాదించుకుని గుమాస్తాలుగా ఎద్దుల్లా చాకిరీ చేస్తున్నాము.

* నాయకులకు నేను వేస్తున్న సూటి ప్రశ్న...

"ఈ దేశం మీకు చాలా ఇచ్చింది... మీరు ఈ దేశానికి ఏమి ఇచ్చారు?"

(ఇది సాక్షి పత్రిక సిబ్బంది వాట్సప్ గ్రూప్‌లో 29-11-2016న వచ్చిన టపా. ఆ తర్వాత నెలరోజులకు కూడా ఈ టపా ప్రాసంగికత మారినట్లు కనిపించకపోవడంతో దీన్ని యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. మధ్యలో బ్రాకెట్లలో నల్లధనం వివరాల చేర్పు తప్పితే ఈ టపా కర్త రాజన్ గారు.)