Pages

Saturday, June 27, 2020

కరోనాకు భయపడకండి... ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి..



సాయంత్రం ఆఫీసుకు రాగానే మా ఇన్ చార్జ్ వేణుగోపాల్ గారు కరోనా వైరస్ బారినపడి సకాలంలో మంచి చికిత్స పొంది క్షేమంగా వచ్చిన ఒక జర్నలిస్టు మిత్రుడి స్వీయానుభవం గురించిన కథనం పంపారు. చూడగానే దాన్ని అందరికీ తెలుపాలనే ఉద్దేశంతో నా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాను. మా స్వీయానుభవం కూడా దానికి జతకలిపాను. ఇప్పుడు ఇక్కడ నా బ్లాగులో కూడా దాన్ని పోస్ట్ చేస్తున్నాను. 

కరోనా విషయంలో భయాందోళనలు వద్దని, అంటరానితనాన్ని ఆధునిక రూపంలో పాటించవద్దని సూచిస్తున్న ఈ టపా ఎంతమందిని కదిలిస్తోందో నా ఫేస్ బుక్ పోస్టుకు వస్తున్న సందేశాలు, లైక్‌లే రుజువు. మంచి విషయాన్ని పంచుకుంటున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.

కరోనా వ్యాధి చికిత్సకు సంబంధించిన అమూల్యమైన విషయాన్ని తెలిపినందుకు జర్నలిస్టు మిత్రుడు రమణకుమార్ గారికి అభినందనలు.. 
..........................

కరోనాకు భయపడకండి... ప్రైవేట్ ఆసుపత్రులకు లక్షలు తగలెయ్యకండి..

కరోనా వ్యాధికి చికిత్సపై.. సీనియర్ జర్నలిస్టు రమణకుమార్ గారి స్వీయ అనుభవం..

Dear friends:
కరోనాకు భయపడకండి.

కరోనా వచ్చింది అనగానే వారిని అంటరాని వారిగానో, ఎదో తప్పు చేసినా వారిగా చూడకండి. ఇది ఒక మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల వారికి వస్తుంది. కరోనా వచ్చిన వారు first ధైర్యంగా ఉండాలి.

నేను వృత్తి రీత్యా జర్నలిస్టును. 24 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్నాను. నా వృత్తి ధర్మంలో భాగంగా నేను విధులు నిర్వహించడానికి వెళ్ళినప్పుడు మరో మీడియా మిత్రుని ద్వారా నాకు కరోనా సోకింది. నాకు positive వచ్చింది అని తెలియగానే ముందు నేను కొంత ఆందోళన పడ్డాను. వెంటనే మా కుటుంబ సభ్యులకు టెస్ట్ చేయించడంతో వారికి కూడా positive అని తేలింది.

ఆందోళన నుంచి తేరుకొని నా మిత్రులు, శ్రేయోభిలాషులు సూచన మేరకు వెంటనే మా కుటుంబ సభ్యులు అందరం నేచర్ క్యూర్ హాస్పిటల్ లో చేరాము. హాస్పిటల్‌లో వైద్యులు ఇచ్చిన మెడిసిన్స్, అక్కడి వాతావరణం మమ్మల్ని వారం రోజుల్లోనే సాధారణ వ్యక్తులుగా మార్చింది.

మాకు ఇచ్చిన మెడిసిన్స్

* ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్,
* B-Complex,
* C Vitamin Tablets,
* Citrizen Tab,
* Ambroxel syrup (దగ్గు ఉన్న వారికి మాత్రమే.)

నాకు కానీ, నా మిస్సెస్ కు కానీ పెద్దగా సింటెమ్స్ ఏమి లేవు. టెస్ట్ positive వచ్చిన తర్వాత రెండవ రోజు నుంచి మా ఇద్దరికీ కొంచం పొడి దగ్గు ప్రారంభం అయింది. జ్వరం ఉండేది కాదు కానీ, బాడీ feverish గా ఉండేది. డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు paracitamal ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాము. పొడి దగ్గు ఉంది కాబట్టి దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాము. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు వేసుకున్నాము.

ఈ మెడిసిన్ తో పాటు మేము పాటించిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని garlic చేయడం (ఉక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం.

''వీటన్నిటినీ మేము వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడంతో వారం రోజుల్లోనే మేము సాధారణం స్ధితికి వచ్చేశాము."

వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, orenge వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు. కరోనా వైరస్ ఒక వ్యక్తి శరీరంలో నుంచి మరో వ్యక్తికి వ్యాపించే సమయం 7 రోజులు మాత్రమే నని, 7 రోజుల తర్వాత వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించే శక్తి కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక మనిషి శరీరంలోకి చేరిన కరోనా వైరస్ 10 నుంచి 12 రోజులకంటే ఎక్కువగా జీవించి ఉండదని, మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్ తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లోనే కరోనాను జయించిన వారు ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు.

నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో...
మేము ఉదయమే హాస్పిటల్‌కు వెళ్ళాము. ఎంట్రెన్స్ లోనే టిఫిన్, వాటర్ బాటిల్స్, మాకు అవసరమైన సామాగ్రి ఇచ్చారు. మేము రూమ్ లోకి వెళ్లిన ఒక గంట తర్వాత డాక్టర్ వచ్చి మా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు లంచ్, సాయంత్రం 4:30 గంటలకు హెర్బల్ టీ, సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మళ్లీ డాక్టర్స్ విజిట్. రాత్రి 8:00 గంటలకు భోజనం. ఇక్కడ హాస్పిటల్ లో సౌకర్యాలు, వైద్యులు, ఇతర అన్ని రకాల సిబ్బంది సేవలు అభినందనీయం. మరీ ముఖ్యంగా నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో వాతావరణం ఇక్కడికి వచ్చిన వారి రుగ్మతను సగం తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. ఉదయం, సాయంత్రం డాక్టర్స్ విజిట్. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం హెర్బల్ టీ.

ఇక్కడి వైద్యులు ఇచ్చే సూచన మేరకు మెడిసిన్స్ వాడడం, తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే ఇక్కడికి వచ్చిన వారు నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు. నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో ఉదయం, సాయంత్రం ఇచ్చే హెర్బల్ టీ లో వేసే పొడి..."మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన powder ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మగ్గబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ కప్పు, సాయంత్రం ఒక టీ కప్పు ఇస్తారు. ఈ నాలుగు కలిపి దంచి తయారు చేసిన పొడిని ఒక టీ కప్పుకు సగం చెంచా చొప్పున వేసుకోవాలి.

నిజంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ వైద్యుల, సిబ్బంది సేవలు అభినందనీయం.

కరోనా వచ్చింది అనగానే చుట్టు పక్కల వారు వారిని చూసి ఎదో మాయ రోగం వచ్చింది అన్నట్టుగా చూడడం మానేయండి. వారిలో ముందు ఆత్మస్థైర్యాన్ని నింపండి. వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. గుండె జబ్బు, కిడ్నీ,శ్వాసకోశ వ్యాధులు లేని వారు కరోనా గురించి అస్సలు చింతించకండి. ఇవి ఉన్నవారు డాక్టర్ల సూచనతో చికిత్స పొందండి. ఏమీ కాదు.

కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుంది డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్ కానీ, హాస్పిటల్ క్వారెంటైన్ కానీ పాటించాలి. ఈ 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం అయిపోతుంది. కరోనా కష్టకాలంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికుల సేవలు మరువలేనివి.

- ఎ. రమణ కుమార్, సీనియర్ జర్నలిస్ట్.


గమనిక.. ఇది నాచుర్ క్యూర్ ఆసుపత్రి ప్రమోషన్ కోసం రాసినది కాదు. ఆ ఆసుపత్రిలో చేరిన తర్వాత వారి స్వీయానుభవం ఇది. ఏ ఆసుపత్రికి వెళ్లనవసరం లేకుండానే పైన చెప్పిన మందులు, ఆహారం తీసుకుంటే చాలు అని చెబుతున్న ప్రాక్టికల్ అనుభవం ఇది. ఆ రకంగానే దీన్ని చూడగలరు.
.................


ఇది మా స్వీయానుభవం
మా శోభకు జ్వరం, బాడీపెయిన్స్ వచ్చినప్పుడు ఏ డాక్టర్ వద్దకు పోకుండా సరిగ్గా పైన చెప్పిన మాత్రలే వాడాము. (ఎందుకైనా మంచిదని చింతలబస్తీలో ఉన్న మా ఇంటికి దగ్గరలో ఉన్న కమ్యూనిటీ సెంటర్‌కు వెళితే.. 'రక్తపరీక్షలు వద్దు. పాడూ వద్దు. వాతావరణం మారింది. వర్షం పడుతోంది కాబట్టి ప్రతి ఒక్కరికీ కామన్‌గా జలుబు, జ్వరం, దగ్గు వస్తున్నాయి. అస్సలు భయపడవద్దు. పరీక్షలు ఏవీ వద్దు' అంటూ వారి వద్ద ఉన్న ప్యారాసెటిమల్ మాత్రలే ఇచ్చి వేసుకోమని చెప్పి పంపారు.) తర్వాత రెండు మూడు రోజులకే ఆమెకు నయమైపోయింది.

గత 3 నెలలుగా కంటిన్యూగా హైదరాబాద్ లోని సాక్షి పత్రికాఫీసులో పనిచేస్తూ వచ్చిన నాకు కూడా ఆ సమయంలోనే నలతగా అనిపిస్తే అవే మాత్రలు వాడాను. ఆశ్చర్యకరంగా నాకూ రెండు మూడురోజులకే జ్వరం తగ్గిపోయింది. ఇంతమాత్రానికి ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల రూపాయలు పరీక్షల పేరిట పీల్చేస్తున్నాయి. 3 నెలలపాటు రోగులు లేక రాబడి రాక విలవిల్లాడిపోయినట్లుంది కదా అందుకే పొరపాటున కరోనా చికిత్స కోసం రోగులు వస్తే చాలు జలగల కంటే ఘోరంగా రక్తం పీల్చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో ఒక కార్పొరేట్ ఆసుపత్రి జలగలు కరోనా చికిత్స పేరట ఏడున్నర లక్షల రూపాయల బిల్లు వేశారట. వార్త కూడా వచ్చింది. పాపం. ఆ చికిత్స చేయించుకున్న పెద్దమనిషి ప్రాణం అలాగే పోయి ఉంటుంది ఆ బిల్లు చూడగానే.

(మా ఇద్దరికీ సీజనల్ జ్వరం రావడానికి కారణం మూడు వారాల క్రితం హైదరాబాదులో కురిసిన తొలి వర్షంలో తడుస్తూ రాత్రిపూట సాక్షి ఆఫీసు నుంచి నడుస్తూ ఇంటికి చేరడమే. తొలి వానల్లో తడిస్తే ప్రమాదం అని తెలిసీ.. ఇల్లుదగ్గరే కదా త్వరగా వెళ్లిపోవచ్చులే అని నడుచుకుంటూ వెళ్లాం. అంతే.. కొట్టేసింది. ఆ మాత్రం దానికి ఆమె ఆఫీసు వారి సలహాతో స్వచ్చందంగా రెండు వారాలు హోం క్వారంటైన్‌లో ఉండిపోయింది. (రిస్కు వద్దని, ఎవరూ ఇబ్బంది పడవద్దని, ఇబ్బంది పెట్టవద్దని మా ఆఫీసు వారి సలహా.) అయితే  కరోనా ఏదీ సోకకున్నప్పటికీ, పాజిటివ్ అని తేలకపోయినప్పటికీ ముందు జాగ్రత్త పేరిట హోం క్వారంటైన్‌లో ఉన్న ఏకైక విచిత్రపు కేసు మా శోభదే కాబోలు).

మిత్రులు రమణ్ కుమార్ గారు పైన చెప్పిన మాత్రలు సులువుగా దొరుకుతాయి. ఏ చిన్న మెడికల్ షాపుకి వెళ్లి అడిగినా ఇస్తారు. మేము వాడిందే ఇవి మరి. పైగా డాక్టర్ సమరం గారు ముప్పై ఏళ్ల క్రితమే చెప్పినట్లు తిండి విషయంలో రాజీపడకుండా మూడు పూటలా కడుపునిండా తిండి తింటే ఏ రోగమూ దరి చేరదు. భారతదేశంలో నూటికి 75 శాతంపైగా రోగాలు ఆహార లేమితోనే వస్తున్నాయని డాక్టర్ సమరం అప్పట్లోనే చెప్పారు. అందుకే కదా యాత్ర సినిమాలో వైఎస్సార్ పాత్రధారి గొప్ప డైలాగు చెబుతారు. 'అన్నిటికంటే పెద్ద జబ్బు పేదరికమేనయ్యా' అని..

డయాబెటిక్, బీపీ ఉన్న నేను ఏమాత్రం భయపడకుండా హైదరాబాద్‌లోని సాక్షి ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా గత 3 నెలలుగా (ఆదివారం మినహా) నిత్యం పని చేస్తూనే వచ్చాను. (మూడు వారాల క్రితం ఆమెతోపాటు నాకు కూడా జ్వరం, జలుబు చేసిన ఆ నాలుగురోజులు ఇంటి వద్దే ఉండి పని చేశాను. వర్క్ ఫ్రమ్ హోమ్.) అన్ని పత్రికాఫీసులు, టీవీ మీడియంలో మాదిరే మా ఆఫీసులోకూడా లాక్ డౌన్ ప్రకటించిన రెండున్నర నెలల తర్వాత ఒకరిద్దరికి కరోనా పాజిటివ్ సోకింది. వారు క్వారంటైన్ అయ్యారు. కొంతమంది ఇంటినుంచే పని చేస్తున్నారు. మాలాంటి వాళ్లం రెగ్యులర్‌గా ఆఫీసుకు వస్తూనే ఉన్నాం. మాకేమీ కాలేదు.

కానీ ఇదిగో పులి అంటే అదిగో తోక అన్న చందాన కరోనా పాజిటివ్ అని తెలిస్తే చాలు.. అంటరానితనాన్ని ఆధునిక రూపంలో పాటిస్తూ పారిపోతున్న, అతి జాగ్రత్తల పేరుతో హైరానా పడుతున్న వారిని చూస్తే "ప్రభూ వీళ్లేం చేస్తున్నారో వీరికి తెలియదు క్షమించుడి" అనే ఆ ప్రఖ్యాత స్తోత్రవచనం మళ్లీమళ్లీ గుర్తుకొస్తూ ఉంటుంది.

మరో గమనిక: నా ఫేస్ బుక్ పోస్టులో ఈ కథనం చదివి నేచుర్ ఆసుపత్రి ఎక్కడ ఉందో చిరునామా పంపండి అని కొందరు మిత్రులు మెసేజ్ పెట్టారు. వారందరికోసం ఆ ఆసుపత్రి వివరాలు గూగుల్‌లో వెతికి ఇక్కడ ఇస్తున్నాను. అయితే ప్రత్యామ్నాయ వైద్య క్లినిక్‌గా చెప్పుకుంటున్న ఈ ఆసుపత్రిలో ఫీజుల వివరాలు నాకు తెలీవు. 

Nature Cure HospitalTop of Form

Bottom of Form
Alternative medicine clinic in Hyderabad, Telangana
Address: MMTS Station, Begumpet, Hyderabad, Telangana 500017
Hours:  Opens 9AM Mon
Phone: 040 2373 1786

Thursday, April 30, 2020

విద్వేష రహిత భారత్‌‌ నా స్వప్నం - ఎమిరేట్స్ యువరాణి సందేశం



గల్ఫ్ న్యూస్‌ పత్రికలో "I pray for an India without hate and Islamophobia" అనే పేరిట  ప్రచురితమైన ఎమిరేట్స్ యువరాణి షెకా హింద్ ఖసేమీ వ్యాసానికి ఇది పూర్తి అనువాదం. సాక్షి పత్రికలో స్పేస్ పరిమితుల రీత్యా కాస్త తగ్గించి ఈ గురువారం సంచికలో ప్రచురించడమైంది. భారతదేశం గురించి హృదయం నిండా ప్రేమను పెంచుకున్న ఒక గల్ఫ్ యువరాణి తాజా సందేశాన్ని పాఠకులకు అందించడం కోసం ఇంతకన్నా మించిన తరుణం ఉండదనే ఉద్దేశమే ఈ వ్యాసం అనువాదానికి, ప్రచురణకు మూలం.

మహావిష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన ఒక కమలంపై బ్రహ్మ కూర్చుని ఉంటాడు. బ్రహ్మ ఆ పుష్పాన్ని స్వర్గం, భూమి, ఆకాశం అనే మూడు భాగాలుగా వేరుచేశాడు. ఒంటరితనం తాళలేని బ్రహ్మ తనను తాను రెండుగా వేరుపర్చుకుని ఒక పురుషుడిని, ఒక స్త్రీని సృష్టించాడు. వీరినుంచే ప్రాణులన్నీ సృష్టించబడ్డాయి.

ఒక భారీ కమలం ఆకారంలోని రంగస్థలం మధ్యలో నేను ఇజ్రేలీ సెనేటర్‌కు ఎదురుగా కూర్చుని ఉన్నాను. ఆమె 'టియర్స్ ఆఫ్ ఏ జ్యూయిష్ విమన్' (యూదు మహిళ కన్నీళ్లు) పుస్తక రచయిత్రి. అంతకుముందు ఎన్నడూ నేను యూదు వ్యక్తిని కలిసి ఉండలేదు. అందులోనూ ఆమె యూదు మత సమర్థకురాలు, ఇజ్రేలీ పార్లమెంట్ సభ్యురాలు కూడా. తాను ఎదురుపడినప్పుడు కాస్త భయపడ్డాను. కానీ ప్రశాంతంగా కూర్చున్నాను. మేమిరువురం క్లుప్లంగానే మాట్లాడుకున్నాం. ఎందుకంటే బెంగళూరు ఆశ్రమంలో యోగాను కొత్తగా ప్రాక్టీసు చేసేవాళ్లం. ఆమె తనను మళ్లీ కలవమని చెప్పారు. నేను కూడా తనను మరోసారి కలవాలని ఆశించాను.

బెంగళూరు ఆశ్రమంలో యోగాభ్యసనం ద్వారా ఆనందం పొందడం కోసం ప్రపంచమంతటినుంచి వచ్చి నిరాడంబరంగా కూర్చుని ఉన్న అనేకమంది వ్యక్తులను కలిసి నేను ఆనందించాను, కొత్త జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఆశ్రమంలో ఉన్నంతకాలం మేం శాకాహారులుగానే ఉన్నాం. నాకు మాంసాహారం పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు కాబట్టి అక్కడి అలవాటు నాకు ఏమంత ఇబ్బంది కలిగించలేదు. హార్వార్డ్ పట్టభద్రుడైన నా డాక్టర్ మిత్రుడు అక్కడ నన్ను కలుసుకున్నాడు. ఆ గ్రామంలోని చీరలషాపులో చీరలు, నుదుటి బొట్టు, చెవిదిద్దుల కోసం వెతుకుతూ కొంత సమయం గడిపాం.

నా గురించి నేను ఎప్పుడు పరిచయం చేసుకున్నా జనం నన్ను చిరునవ్వుతూ పలకరించేవారు. హింద్ అనే పేరు కలిగిన ఒక అరబ్ యువరాణిని కలుసుకోవడం పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి ప్రదర్శించేవారు. వారు నా రాణిత్వం గురించి అడిగేవారు. నేను చిరునవ్వుతోనే జవాబిచ్చేదాన్ని. తెల్లవారుజామునే నిద్రలేచి, ఉదయం యోగా సెషన్స్ కోసం ఆశ్రమంలోని హాలుకు వెళ్లేవాళ్లం. అది నిజంగా ఒక తీర్థయాత్ర లాంటిది. మీరు ఎంత నిరాడంబరంగా జీవించవచ్చో తెలిపే ప్రయాణం అది. సాధారణమైన చెప్పులు, పలుచటి నూలుదుస్తులు ధరించేవారం. కానీ నేను మాత్రం కాటుక, బొట్టు, అరబ్ సెంటును కూడా వాడేదాన్ని. ఆ గ్రామంలో ప్రపంచమంతటి నుంచి వందలాది మంది వ్యక్తులు వచ్చి ఉండేవాళ్లు. యోగా సభ్యులు ఇచ్చే విరాళాలతో అక్కడ ఒక అనాథాశ్రమం నడిపేవారు. అక్కడే ఐటీ కోసం భవంతులు, సర్వీసులు కూడా నిర్వహించేవారు. అక్కడే ఒక స్పాతో కూడిన రిసార్టు కూడా ఉండేది.

ఆధునిక ఊహాస్వర్గం
ఆ ఆశ్రమంలో నా అమెరికన్ స్నేహితుడు, నేను కలిసి ప్రజలు.. వారి గాథలు.. ఆవిష్కరణల సంపదల గురించి తెలుసుకునేవారం. అక్కడ వివక్ష కలికానికి కూడా కనిపించేది కాదు. అది నిజంగానే ఆధునిక కాలపు ఊహాస్వర్గాన్ని గుర్తు తెచ్చేది. అనేకమంది రాయబారులు, వారి భార్యలతో కలిసి నేను ఆశ్రమ గురువును కలిసి ఆనందించేదాన్ని. మతం ఒక అనవసరమైన అంశమని వారంతా పదే పదే చెప్పేవారు. అది సామరస్యంగా జీవించే కళను తిరిగి ఆవిష్కరించిన ఒక సాధారణ ప్రపంచం.

మీ జాతి, మతం, ప్రాంతంకి పూర్తి భిన్నమైన వ్యక్తుల సమూహంతో జీవించగలగడం నిజంగా ఒక పర్వదినం లాంటిదే. నా కొత్త గ్లాస్ స్లిప్పర్స్ ధరించి అక్కడున్న బ్యాలేకి వెళ్లేదాన్ని. ఒక విముక్తిని పొందిన భావనతో.. ఎలాంటి వివక్ష, విద్వేషం లేకుండా నిరాడంబరంగా జీవించే అనుభవం కోసం కనీసం ఒక్కరోజయినా  ప్రతి ఒక్కరూ ఆ అశ్రమంలో గడపాలని నేను సిఫార్సు చేస్తున్నాను. మీకు వినయం అనే గ్రంథి ఇచ్చే ప్రతి దాన్నీ విద్వేషం ఓడిస్తుంది. నేను అక్కడి వాతావరణానికి దాసోహమైపోయానని అంగీకరిస్తున్నా. ప్రేమించడం అనే మత్తులో గడిపాను.

మీ హృదయం తెరుచుకున్నప్పుడు అక్కడ విద్వేషానికి మరి చోటు ఉండదు. అనేక కారణాల వల్ల మనకు ఆగ్రహం కలగవచ్చు కానీ దాన్ని మీ పడకగది వరకూ తీసుకు పోవద్దు. విషయాలను తేలిగ్గా చూసే కళే నిజంగా జీవించడానికి అనువైన కళ. అయితే పోరాడేందుకు అవసరమైన పరిస్థితులు కొన్ని ఉంటాయి కానీ, స్వభావసిద్ధం గానే ఒక పారిశ్రామిక, ఉత్పాదక వ్యక్తినైన నేను పరిష్కారాల కోసమే చూస్తాను తప్ప సమస్యలను సాగదీస్తూ కాలాన్ని వ్యర్థం చేయడాన్ని ద్వేషిస్తాను. నేను సమాధానాలు కనుగొనడాన్ని ఇష్టపడతాను. ఆగ్రహం, పాతుకుపోయిన దురభిప్రాయాలు అనేవి మునిగిపోతున్న నావ చుక్కాని లాంటివి.

ఎమిరేట్స్ ప్రజలకు, భారతీయులకు మధ్య విచ్ఛిన్నం చేయడానికి వీలుకాని బంధం ఒకటి ఏర్పడి ఉంది. ఇది ఇతరులకు అర్థం కాకపోవచ్చు. మా చుట్టూ, మా ఇళ్లలో అరబ్బుల కంటే భారతీయ పిల్లలే ఎక్కువగా ఉంటూవచ్చిన వాతావరణంలో మేం పెరుగుతూ వచ్చాం. కాబట్టి మా డీఎన్ఏలో తిరస్కరించడానికి వీలులేని అనుబంధం, ఆపేక్ష ఉంటూ వస్తోంది. మా రోజువారీ భాష కూడా మా సొంత ఆచారాలనుంచి పుట్టుకొచ్చిన పదాల నుంచే అరువు తెచ్చుకునేది.

నేను అభివృద్ది చెందుతున్న దేశాల్లో స్వావలంబన అనే అంశంపై పీహెచ్‌డి చేస్తున్నాను. దేశాలు తమ శక్తి ఎక్కడుందో గ్రహించి, దానికోసమే ప్రయత్నించి, తమ బలహీనతలను సర్దుబాటు చేసుకోవడం, తమముందున్న అవకాశాలను గుర్తించడం, తమకు ఎదురవుతున్న ప్రమాదాలను తటస్థం చేయడం గురించిన పరిశోధన అది. భారత్ కూడా ఇలాంటి దేశాల్లో ఒకటి. ఒక పేద వ్యవసాయ దేశం నుంచి నేడు సూపర్ పవర్‌గా ఎదిగిన దేశమది. సింగపూర్, దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్ కూడా ఈ కోవలోకే వస్తాయి. నేను ప్రేమించే నా స్వదేశం యూఏఈ కూడా ముత్యాలు ఏరుకునే కొన్న గ్రామాల సమూహంగా ఉండి, కొత్తగా కనుగొన్న చమురు నిక్షేపాలతో సంపన్న దేశంగా మారి ఒక సంతోషకమైన, సంవద్వంతమైన జాతిగా ఆవిర్భవించింది. మా దేశంలో 33 లక్షలమంది భారతీయులు ఆతిథ్యం పొందుతూ స్వదేశంలోని తమ కుటుంబాలకు ఏటా 17 బిలియన్ డాలర్లను పంపుతున్నారు.

మతసహనపు తారాస్థాయి
నేను పైన పేర్కొన్న దేశాలు ఏవీ మార్గదర్శకత్వం లేకుండా ఎదిగినవి కావు. వీటిలో ప్రతి దేశం కూడా అభివృద్ధి విత్తనాలను నాటిన ఒక విజ్ఞత కలిగిన నాయకుడిని కలిగి ఉండేది. వారి విజ్ఞత వల్లే రెండు తరాల తర్వాత మా శ్రమ ఫలితాన్ని ఈరోజు మేం అందుకుంటున్నాం. మతపరమైన సామరస్యపు ఔన్నత్యమే ఈ దేశాల్లో అపారమైన అభివృద్ధికి తావిచ్చిందని కొంతమంది చెబుతుంటారు కూడా. విద్య, ఆరోగ్యం, సామాజిక పెట్టుబడి, భద్రత, అవకాశం, ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యతత్వం అనేవి ఈరోజు ఏ దేశానికైనా విజయాన్ని సాధించే వ్యూహంలో అంతర్భాగాలుగా ఉంటాయి.

గాంధీ మ్యూజియాన్ని సందర్శించి ఆనాడు యుద్ధాన్ని నిలిపివేయాలని హిట్లర్‌ను కోరుతూ గాంధీ రాసిన ఉత్తరాన్ని చదివి నేను ఆయన జీవిత చరిత్ర గ్రంథాన్ని కొనుక్కున్నాను. భారత్‌కు కావలసింది విద్య, టాయెలెట్లు (ఇవి మహిళ ఆరోగ్యానికి, భద్రతకు తొలిమెట్టు) అని ఆయన నొక్కి చెప్పారు. పైగా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నవి కాకుండా భారతీయ నూలు వస్తాలను మాత్రమే వాడాలని చెప్పారు. స్వదేశీ ఉత్పత్తులు వాణిజ్యంలో పోటీకి అవకాశమిచ్చి ఆర్థిక వ్యవస్థను పెంచిపోషించేవి. ఆయన దూరదృష్టికి నిజంగా జోహార్లు చెప్పాలి.

పాలనకు సంబంధించిన నాణ్యత అనేది కొనసాగింపు తత్వానికి హామీనిచ్చే పజిల్‌లో చివరి ముక్కలాంటింది. రోమ్ నిర్మాణం ఒక్కరోజులో జరగలేదు. గాంధీ కార్యాచరణను ఒకటి రెండు తరాల తర్వాతే చూడగలిగేవాళ్లం. శాంతి సాధన విషయంలో గాంధీ ప్రాపంచిక దృక్పథాన్నే నెల్సన్ మండేలా అనుసరించారన్న విషయం మర్చిపోవద్దు. గాంధీ భారత విముక్తి ప్రదాత అనే విషయాన్ని ఇప్పుడు ఎవరూ వ్యతిరేకించలేరు. భారతదేశం గురించి ఇంత అనురక్తితో మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. అది పాలు, తేనెతో కూడిన దేశం. నా సంస్కృతిలో ఒక సామెత ఉంది. మీరు భారత్ పాలు తాగినట్లయితే ఆ దేశమే మీ మాతృమూర్తి అవుతుందని మా వాడుకలో ఉంది.

నాజీయిజం మారణకాండకు కారణమైన విద్వేష ప్రచారం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదని కొత్తగా పుట్టుకొచ్చిన ఈ శక్తిమంతులైన కోటీశ్వరులు గ్రహించడం లేదా? విద్వేష ప్రచారాన్ని విషంలాగా పెంచి పోషించారు. ఇప్పుడు భారత్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో 18 కోట్లమంది ముస్లింలు జీవిస్తున్నారు. "ముస్లింలు, క్రిస్టియన్లు 2021 డిసెంబర్ 31 నాటికి భారత్ నుంచి తుడిచిపెట్టేస్తాం' అంటూ బీజేపీ, ఆరెస్సెస్ నేత రాజేశ్వర్ సింగ్ చెబుతున్న మాటలు విద్వేష ప్రచారానికి అసలు సిసలు నమూనాలు.

ప్రపంచానికి మరో హిట్లర్ అవసరం లేదు..
నేటి ప్రపంచానికి కొత్తగా మరొక హిట్లర్ అవసరం లేదు. కానీ దానికి మార్టిన్ లూథర్, నెల్సన్ మండేలా, గాంధీ వంటి ధోరోదాత్త నాయకులు కావాలి. మీ సోదరుడిని చంపడం మిమ్మల్ని హీరోని చేయదు. విద్వేషం స్వాగతించాల్సిన అంశం కాదు కాబట్టి దానికి పుల్ స్టాప్ పడాలి. యూఏఈలో విద్వేష ప్రచారం చట్టవ్యతిరేకం. ఇలాంటి చట్టాలు ఉన్నాయంటే ప్రజలు జోక్‌గా భావించవచ్చు కానీ ఇలాంటి చట్టాలే మా దేశంలో శాంతిని నెలకొల్పుతున్నాయి. మీరు నిర్మించిన దేశాన్ని మీరే ఎందుకు తగులబెట్టుకుంటారు? మా దేశంలో అమలవుతున్న ఈ చట్టం అభివృద్ధిని కాంక్షించే ప్రతి దేశ నాయకుడు పాటించాల్సిన తారకమంత్రం లాంటిది.

కానీ భారతదేశం గురించి ఎంతగానో సాన్నిహిత్యం ఉంటున్న మాలాంటివారికి నేటి భారత్‌లో ద్వేషం, ఇస్లామోఫోబియా, రోజువారీ రక్తపాతం జరుగుతుండటం షాక్ కలిగిస్తోంది. పైగా దేశాన్ని 'ఖురానో-వైరస్' అనే సాంక్రమిక వ్యాధి చుట్టుముడుతున్నట్లుంది. ఒకనాడు నేను గడిపిన ఆ గొప్ప కమలాకారంలోని భవంతి నుంచి నేను పొందిన శాంతి సారాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నాను.

వసుధైక కుటుంబం.. అంటే 'ప్రపంచమంతా ఒకే కుటుంబం' అనే భావన భారతీయ సమాజంలోని అత్యున్నతమైన నైతిక విలువలలో ఒకటి. ఈ ఉపనిషత్ శ్లోకాన్ని భారత పార్లమెంటు హాల్‌లో చెక్కారు కూడా. గాంధీ దాన్ని అనుసరించారు. ప్రధాని నరేంద్రమోదీ దాన్ని మళ్లీ నొక్కి చెప్పారు. భారత్‌లో శాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకించి కరోనా మహమ్మారి మృత్యుచ్ఛాయలను విస్తరించకుండా, ఆర్థిక వ్యవస్థను, సమాజాన్ని చిన్నాభిన్నం చేయకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ స్వీయనిర్బంధాన్ని గడిపేలా ప్రజలను చైతన్యవంతం చేయవలసిన ఈ తరుణంలో భారత్‌లో శాంతి కోసం నేను ప్రార్థిస్తున్నాను.

షేఖా హింద్ అల్ ఖసేమి, ఎమిరేట్స్ యువరాణి, రచయిత్రి, ఎడిటర్, 'వెల్వెట్' మేగజైన్

వివరణ
గల్ఫ్ న్యూస్‌ పత్రికలో "I pray for an India without hate and Islamophobia" అనే పేరిట  ప్రచురితమైన షేఖా హింద్ ఖసేమీ వ్యాసానికి ఇది పూర్తి అనువాదం. సాక్షి పత్రికలో స్పేస్ పరిమితుల రీత్యా కాస్త తగ్గించి ఈ గురువారం సంచికలో ప్రచురించడమైంది. భారతదేశం గురించి హృదయం నిండా ప్రేమను పెంచుకున్న ఒక గల్ఫ్ యువరాణి సందేశాన్ని పాఠకులకు అందించడం కోసం ఇంతకన్నా మించిన తరుణం ఉండదనే ఉద్దేశమే ఈ వ్యాసం అనువాదానికి, ప్రచురణకు మూలం.

విద్వేష రహిత భారత్‌ నా స్వప్నం
https://www.sakshi.com/news/guest-columns/sheikha-hend-faisal-al-qassemi-article-my-dream-india-1281794?

మూల రచనకు కింది లింకులో చూడగలరు
I pray for an India without hate and Islamophobia

https://gulfnews.com/opinion/op-eds/i-pray-for-an-india-without-hate-and-islamophobia-1.71169436
fbclid=IwAR2vYJs_AIJX6wXTh0ttwQIqMH0kE_YB1f3ANGYMafW73bHd7PISky8ptS4

ఎమిరేట్స్ యువరాణి పర్సనల్ జీవితం లాంటి సామాజిక జీవిత వివరాల కోసం కింది ఇంటర్వ్యూను కింది లింకులో తప్పక చదవండి
Very hard for a princess to turn to social media for support, says Qatari royal

https://www.dnaindia.com/world/interview-very-hard-for-a-princess-to-turn-to-social-media-for-support-says-qatari-royal-2790034


Sunday, February 24, 2019

బ్రిటిష్ పాలకులపై ఓడి గెలిచిన జన నాయకుడు : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి


ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం (1857) ప్రారంభం కావడానికి పదేళ్లకు ముందే బ్రిటిష్ వారి దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన జన నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తన ఆత్మాభిమానాన్ని అవమానించినందుకు నిరసనగానే కాకుండా అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా  విస్తృత జన సమూహాలను కూడగట్టి వేలాదిమంది మద్దతును పొంది రెండేళ్లపాటు పాలకులపై తిరుగుబాటు ప్రకటించిన వాడు ఉయ్యాలవాడ. బ్రిటిష్ సైనికబలం ముందు నిలబడలేక వరుస పరాజయాలతో బందీగా చిక్కి ఉరికొయ్యకు వేలాడిన ఉయ్యాలవాడ 172 ఏళ్ళ క్రితమే తెలుగు సీమలో ప్రత్యేకించి కర్నూలు లోని కోయిలకుంట్ల ప్రాంతంలో (అప్పట్లో కడప ప్రాంతపరిధిలోనిది) జనం నోళ్లలో తరతరాలుగా నానే వీరగాధగా నిలిచిపోయాడు. ఫిబ్రవరి 22న కర్నూలులో ఉయ్యాలవాడ కంచు విగ్రహ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా ఆయన నాటి పోరాటంలో వాడిన కరవాలాన్ని ఆయన కుటుంబానికి సంబంధించిన నేటి సభ్యులు ప్రదర్శించారట.

ఉద్యమ కాలంలో బందీ కాబడిన 901 మందిలో 412 మందిని విడుదలకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించింది, 223 మందిని జామీనుతో వెళ్ళడానికి అంగీకరించింది, ముగ్గురికి జీవితాంతం, ఐదుగురికి పద్నాలుగేండ్లు, నలుగురికి ఎనిమిదేండ్లు, ముగ్గురికి పదేండ్లు, 83 మందికి ఐదేండ్లు, ఒక్కరికి మూడేండ్లు, ఆరుగురికి రెండేండ్లు, ముగ్గురికి ఒక ఏడు, ఇద్దరికి ఆరు నెలలు, మొత్తం నూటపన్నెండు మందికి శిక్ష విధించింది. ఇక, నరసింహారెడ్డికి మరణ శిక్ష విధించబడి కోయిలకుంట్ల వీధుల్లో సంకెళ్ళతో త్రిప్పబడి, ఆ తరువాత జుర్రేటి బావివద్ద (జుర్రేటివాగు ఒడ్డున గల బావి) ఉదయం 7 గంటల సమయాన పిబ్రవరి 22, 1847 న ఉరితీయబడినాడు. ఆ ప్రాంత జనాల్లో భయం కల్పించడంకై ఆతని శవం 1877 వరకు అక్కడే వ్రేలాడదీయబడి ఉండేదని ఇప్పటికీ అక్కడి జనాల్లో కథనాలు ఉన్నాయి.

బ్రిటిష్ పాలకులచేతిలో ప్రాణం కోల్పోయినా ప్రజలకు ప్రధానంగా ఉన్న ఇనాంల రద్దు నిర్ణయాన్ని బ్రిటిష్ వారు పునఃపరిశీలన చేసేట్లు, వారి భూహక్కులు తిరిగి ఇవ్వబడేట్లు తన ఉద్యమంతో ప్రభావం చూపగలిగాడు. ఇందుకై 1858లో మద్రాస్ ప్రభుత్వం డబ్ల్యు. టి. బ్లేయ్‌ర్ అధ్యక్షతన ఇనాం కమిషన్‌ను నియమించింది. మద్రాసు ప్రెసిడెన్సీలోని అన్ని రకాల ఇనాంలను పరిశీలించి, వాటిని క్రమబద్దీకరించే పనిని ఇది పూర్తి చేసింది. ఇంతటి ఘనతల్ని సాధించినాడు కాబట్టే ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆతని ఉద్యమం ఎంతోమందికి, ఎన్నో ఉద్యమాలకు స్పూర్తినిస్తున్నాయి.

ఈ వీరోచిత గాధను చరిత్ర నేపథ్యంలో వెలికితీసి విశ్రాంత చరిత్ర ఆచార్యులు దేవిరెడ్డి సుబ్రమణ్య రెడ్డి గారు రాసి పంపిన ఈ పెద్ద వ్యాసం తెలుగు పాఠకులందరికీ వాస్తవగాధను తెలియపరిచే కరదీపికగా ఉంటుందని ఆశిస్తున్నాను. తెలుగు నేలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన అలనాటి పోరాటాలను, ప్రత్యేకించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటగాధను దాదాపు 300 పేజీల పుస్తకం సైజులో దేవిరెడ్డి రాశారట. ఏనాటికైనా దాన్ని ఆయన దాన్ని ముద్రించగలిగితే అరుదైన చరిత్రకు సంబంధించిన విశేషాలు మనందరికీ లభిస్తాయి. త్వరలో ఆ పనికి ఆయన పూనుకుంటారని ఆశ.

ఈ బృహత్ వ్యాసంతో పాటు దేవిరెడ్డి గారు పంపిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అరుదైన అసలు ఫోటోతోపాటు వారి ఈ తరం బంధువుల ఫోటోలను, నాటి కోట బురుజులను, ఆయన ఆనాడు ఉపయోగించిన ఫిరంగిని కూడా ఇక్కడ ప్రచురించడమైనది. తెలుగునేలపై జరిగిన ఈ మహత్తరమైన ఘటన గురించి కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటే వ్యాసం కింద ప్రచురించిన ఆయన మొబైల్ నంబర్‌లో సంప్రదించగలరు.

దేవిరెడ్డి గారు రాసిన పూర్తి వ్యాసాన్ని ఇక్కడి నుంచి చదవగలరు




ఉయ్యాలవాడ నరసింహారెడ్డి: జన సమస్యలపై పోరాడిన వీరుడు

ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ 1600లో ఏర్పరచబడింది. భారత్‌లో ‘‘ఫ్యాక్టరీ’’ అనబడిన తొలి వ్యాపార స్థావరాన్ని సూరత్‌లో 1611లో ఏర్పరచుకొంది. తరువాత, పశ్చిమ తీరంలో, తూర్పు తీరంలో, దేశపు లోతట్టు ప్రాంతాల్లో కూడా వ్యాపార స్థావరాల్ని ఏర్పరచుకొంది. తీరాంధ్రలో తొలి స్థావరాన్ని మచిలీపట్నంలో 1611లో ఏర్పరచుకొంది. నేటి నెల్లూరు జిల్లాలోని ఆర్మగాన్ అనబడిన దుగ్గరాజపట్నంలో మొట్టమొదటి కోటను 1626లో నిర్మించుకొంది. కాళహస్తి రాజా నుండి నాటి తెలుగు ప్రాంతం మద్రాసును మరో స్థావరంగా 1639లో పొంది, ఫోర్ట్‌సెయింట్‌జార్జ్ కోటను 1640 నాటికి నిర్మించుకొంది. క్రమంగా దేశమంతా వ్యాపారాన్ని వ్యాప్తిచేసుకొంది. మన సరకుల్ని ఎగుమతి చేసి విపరీతంగా ఆదాయాల్ని పొందింది. మన జనంతోనే సిపాయి సైన్యాన్ని ఏర్పరచుకొంది. మన రాజ్యాల రాజకీయాల్లో తలదూర్చి యుద్ధాలతో, అంగీకారాలతో మన పాలకుల్నే దాదాపు లేకుండా చేసింది; రాజకీయ, ఆర్థిక అధికారాల్ని చేజిక్కించుకొంది.
                ఆ తరువాత, చేనేత వృత్తి వంటి పని వారికి బ్రతుకుతెరువు లేకుండా చేసింది (డీ ఇండస్ట్రియలైజేషన్). వ్యవసాయదారుల్ని పీడించింది (డీ పెజంటైజేషన్). వారసత్వంగా తరతరాలుగా వస్తుండిన భూహక్కును రైతులకు లేకుండా చేసింది (పర్మనెంట్ హెరిడిటరీ ఆకుపెన్సీ రైట్ టు ల్యాండ్). తక్కువ పన్ను చెల్లింపుతో గాని, పన్ను మినహాయింపుతో గాని అనుభవిస్తుండిన ఇనాందార్ల భూములపై పూర్తిస్థాయి పన్ను విధించి, పీడించి వసూలు చేసింది. వ్యాపార, వాణిజ్య కారులు స్వేచ్ఛగా తమ వృత్తిని సాగించలేని పరిస్థితిని కల్పించింది. కొండ ప్రాంతాల జనాల హక్కుల్ని హరించింది. గ్రామ సభల హక్కుల్ని కుదించి వేసింది. దేశం గ్రామీణ దేశంగా మారేట్లు (రూరలైజేషన్), జనం నాశనమయ్యేట్లు (రూయినైజేషన్), దరిద్రులుగా మారేట్లు (పాపరైజేషన్) చేసింది. పరిమితికి మించిన ఆదాయాన్ని ఇవ్వలేని వ్యవసాయంపై మాత్రమే అత్యధిక జనం ఆధారపడి జీవించేట్లు కుటీర పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యాల నాశనం ద్వారా చేసింది. దీనితో తలసరి ఆదాయం పడిపోయింది. జనం చేతిలో నిత్యావసర సరకుల్ని కొనుక్కొని తినడానికి అవసరమైన డబ్బు లేకుండా పోయింది. దీనితో తిండిలేని కృత్రిమ క్షామాలు, కరువులు, వాటి కారణంగా ఆకలి చావులు దేశ చరిత్రలో తొలిసారిగా వీరిపాలనలో సంభవించసాగాయి. కొత్త భూశిస్తు విధానాల్తో పన్నుల భారం విపరీతంగా పెంచడంతో రైతుల ఆదాయాలు తగ్గి, అప్పులపాలయి, భూముల్ని వ్యవసాయేతరులైన వడ్డీవ్యాపారులు వంటి వారికి ఇచ్చేసే పరిస్థితుల్ని కల్పించింది; వారు కౌలుదార్లుగా, వ్యవసాయ కూలీలుగా మారేట్లు చేసింది. అనగా, దేశంలో తొలిసారిగా ఆంగ్లేయుల పాలనలో వ్యవసాయ కూలీల వర్గం నూతనంగా పుట్టుకొచ్చింది (వడ్డీవ్యాపార వర్గంవలె). ఉదాహరణకు, లక్ష జనాభాకు బెంగాల్ ప్రసిడెన్సీలో పదిలక్షల పన్ను, బొంబాయిలో పదిహేడు లక్షల పన్ను వసూలు కాబడగా, మన మద్రాసు ప్రసిడెన్సీలో మాత్రం ఇరవైమూడు లక్షల పన్ను వసూలు చేయబడింది. అంతేగాక, ప్రాధాన్యతా రంగాలుగా నిలదొక్కుకొని వేలఏండ్లుగా జనం మొత్తానికీ ఉపాధి కల్పిస్తుండిన (ఫుల్ ఎంప్లాయ్‌మెంట్) వ్యవసాయ, పారిశ్రామిక (కుటీర పరిశ్రమ) రంగాల్ని, వాటి మధ్య తరతరాలుగా ఉండిన అనుంధాన్ని దెబ్బతీసింది. ఇలాంటి అంశాల కారణంగా ఆంగ్లేయుల పాలన ఆరంభమైన తొలిరోజుల నుండే వారికి వ్యతిరేకంగా దేశమంతటా, ఎల్లప్పుడూ, ఏదోఒకచోట తిరుగుబాట్లు జరుగసాగాయి. భవిష్యత్తులో జరిగిన 1857-58 నాటి సిపాయిల తిరుగుబాటుకు, 1885 1947 మధ్య జరిగిన స్వాతంత్య్రోద్యమానికి ఇవి స్పూర్తిదాయకంగా నిలిచాయి.
                ఇలా 1857కు పూర్వం తిరుగుబాటు చేసిన వారిలో నాటి మద్రాసు ప్రసిడెన్సీ లోని తెలుగు ప్రాంతాల పాలయగాళ్ళు, జమిందార్లు కూడా ఉన్నారు. నేడు రాయలసీమగా పిలువబడు ఒకప్పటి ‘‘సీడెడ్ జిల్లా’’ల్లో ముప్పయ్ వేల సైన్యం కల్గిఉండిన ఎనభై మంది పాలయగాళ్ళు ఉండేవారు. వీరు 1800-1802 మధ్య, ఆతరువాత 1846 లో తిరుగుబాట్లు చేశారు. ఐదువేల సైన్యం కల్గి ఉండిన పదిమంది ‘‘చిత్తూరు పాలయగాళ్ళు’’ 1801-1805 మధ్య తిరుగుబాటు చేశారు. ఇరవై వేల సైన్యం కల్గి,‘‘పశ్చిమ పాలయగాళ్ళు’’ అని పిలువబడిన నలుగురు పాలయగాళ్ళు నేటి నెల్లూరుచిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉండేవారు. నలభై వేల సైన్యం కల్గి ఉండిన డెబ్బయ్ మంది జమిందార్లు ‘‘ఉత్తర సర్కార్ల’’ ప్రాంతంలో ఉండేవారు. వీరు కూడా సుదీర్ఘ కాలం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పదునెనిమిది, పందొమ్మిది శతాబ్దాల్లో పోరాడారు. ఐతే, తెలుగు ప్రాంతాలన్నింటిలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిలో ఇప్పటి కర్నూలు జిల్లాలోని (ఒకప్పటి కడపలో ఉండిన) ఉయ్యాలవాడ పాలయగాళ్ళ కుటుంబానికి చెందిన మజ్జర నరసింహారెడ్డి 1846లో చేసిన  తిరుగుబాటు ముఖ్యమైంది; విశిష్ఠమైంది.
                సీడెడ్ జిల్లాలని పిలువబడిన నేటి రాయలసీమ ప్రాంతం 1800 లో ఆంగ్లేయుల పరమయ్యాక దాని తొలి ‘‘ప్రిన్సిపల్ కలెక్టర్’’గా థామస్ మన్రో నియమింపబడిన కాలానికి ఉయ్యాలవాడ పాలయానికి నరసింహారెడ్డి తండ్రి పెద్దమల్లారెడ్డి పాలయగాడుగా ఉండేవాడు. పెద్దమల్లారెడ్డికి చిన్నమల్లారెడ్డి అను తమ్ముడు కూడా ఉండేవాడు. అప్పట్లో ఈ పాలయానికి రు.30,480-8-5 రెవిన్యూ వస్తుండేది. నరసింహారెడ్డి తాత, అనగా, అమ్మకు తండ్రయిన జయరామరెడ్డి నొస్సుం కు పాలయగాడుగా ఉండేవాడు. ఈ పాలయానికి రు.83,230-0-0 రెవిన్యూ వస్తుండేది. థామస్ మన్రో సీడెడ్ జిల్లాల్లోని ఎనభై మంది పాలయగాళ్ళను 1800-1802 మధ్య సైన్యంతో, బెదిరింపులతో, బలవంతంతో పదవుల నుండి తొలగించి, వారికి పెన్షన్లు ఇచ్చినప్పుడు పెద్దమల్లారెడ్డి, చిన్నమల్లారెడ్డికి కలిపి రు.70-0-0, అనగా ఒక్కొక్కరికి, రు.35 వంతున, జయరామి రెడ్డికి రు. 8,323-10-5 ఇవ్వడం జరిగింది. పెద్దమల్లారెడ్డికి ముగ్గురు కుమారులైనందున ఆతని మరణానంతరం చిన్నవాడైన నరసింహారెడ్డికి తండ్రి పెన్షన్‌లో సుమారు పన్నెండు రూపాయలు నెలసరి పెన్షన్‌గా రావడం జరిగింది. (పెద్ద మల్లారెడ్డి పెద్ద భార్య కుమారులు  కుమార మల్లారెడ్డి,  వరదారెడ్డి లకు రెండు భాగాలు పోగా) తాత జయరామిరెడ్డి మరణించాక ఆతనికి వస్తుండిన పెన్షన్ నరసింహారెడ్డి తల్లికి రావడంతో అది నరసింహారెడ్డి కుటుంబానికి ఆదరువుగా ఉండేది. కాని తల్లి మరణించాక ప్రభుత్వం దానిని ఆపివేసింది. ఐతే, తల్లి పెన్షన్ తనకు కొనసాగించాలని నరసింహారెడ్డి కోరడం జరిగింది. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో ఆంగ్లేయులపై నరసింహారెడ్డికి ఆక్రోశం పుట్టుకొచ్చింది. కాని, అతడు తొందరపడలేదు. కొంతకాలం వనపర్తి జమిందార్ వద్ద, మరికొంత కాలం బనగానపల్లిలో కొంతభాగానికి అధిపతిగా ఉండిన హైదరాబాదు పఠాన్ షా ఆలంఖాన్ వద్ద ఉద్యోగం చేయడం జరిగింది. ఇదే కాలంలో ఉయ్యాలవాడ, నొస్సుం తదితర ప్రాంతాల్లోని రైతులు తరతరాలుగా అనుభవిస్తుండిన పలురకాల భూహక్కుల్ని బ్రిటిష్ వాలకులు తొలగించంతో బాటు మితిమీరిన స్థాయిలో పన్నులు విధించి, నిక్కచ్ఛిగా వసూలు చేయసాగారు. దీనితో, కోపోద్రిక్తుడైన నరసింహారెడ్డి ప్రజల భూహక్కుల రద్దుకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఆరంభించాడు.
                ఇతని ఉద్యమం ప్రధానంగా జన సమస్యలకై, ముఖ్యంగా రైతుల భూసమస్యలకై జరుగుతోన్న పోరాటం గావున కట్టుబడి, భటవృత్తి, ఖైరతి వంటి పలు రకాల ఇనాందార్లు, ఇతర రైతులు, చెంచులు, యానాదులు, వడ్డెర్లు, గ్రామాధికారులు, కరణాలు, వ్యవసాయ కూలీలు వంటి వారు వేలకొద్ది ఇతని పోరాటంలో పాల్గొనసాగారు. వీరేగాక, కడప, కర్నూలు, బళ్ళారి, హైదరాబాదు ప్రాతాల పాలయగాళ్ళు, జమిందార్లు, రాజులు వంటివారు కూడా ఏదోఒక రూపంలో ఇందులో పాల్గొన్నారు. మట్ల వంశపు ఔక్ రాజకుటుంబీకులు వెంకటరామరాజు, నారాయణరాజు, నరసరాజు వంటివారు, బనగానపల్లి జాగీర్దార్ గులాం మహమ్మద్ ఖాన్, జటప్రోలురాజా లక్ష్మణరాయుడు, మునగాలరాజా రామకృష్ణారెడ్డి, పెనుకొండ రాజా, కంపిలి ఆనెగొంది రాజు మంత్రి పంపాపతిరావు, హైదరాబాదు ప్రాకుటూరు జమిందార్ లాల్‌ఖాన్ జమేదార్, కోలాపురం, అలంపురం జమిందార్లు, వనపర్తి రాజా రామేశ్వరరావు, కర్నూలు పాపాఖాన్, ఆతని తండ్రి హైదరాబాద్ వాసి సలాంఖాన్, నొస్సుం కట్టుబడి దఫేదార్, గోడ సుబ్బడు, చాగలమర్రి తాలూకా పాతకందుకూరు గ్రామాధికార్లు, ఆకుమల్ల వాసి గోసాయి వెంకన్న, కరణం అశ్వద్ధం, దరిసి రోసిరెడ్డి, జంగం మల్లయ్య వంటివారు అనేకమంది నరసింహారెడ్డికి అండగా నిల్చారు.
                జన సమస్యలకై నరసింహారెడ్డి ఆంగ్లేయులతో పోరాటానికి సిద్ధమౌతున్న దశలో, 1845లో, గోసాయి వెంకయ్య అను సన్యాసిని నరసింహారెడ్డి కలవడం, తిరుగుబాటు ద్వారానే అనుకొన్న లక్ష్యాలు సాధించవచ్చునని ఆతడు నరసింహారెడ్డితో ప్రోత్సాహపు మాటలు అనడం, ఇద్దరూ కలసి కోయిలకుంట్ల తాలూకా, తదితర ప్రాంతాల్ని సందర్శించడం, అక్కడి జనాల ఆలోచనల్ని అంచనా వేసుకోవడం ఒకదానివెంట మరొకటి త్వరత్వరగా జరిగిపోయాయి. ఇదే తరుణంలో, 1846 జూలై తొలినాళ్ళలో నరసింహారెడ్డికి అండగా నిలవడానికి ముప్పయ్ మంది ముందుకు రావడం జరిగింది. అంచనాలకు తగినట్లు జనం మద్దతు వస్తుండడంతో నరసింహారెడ్డి ధైర్యం మరింత పెరిగింది. దీనితో పోరాటానికి నిర్ణయించుకొని, ఆంగ్లేయుల్ని రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తించ సాగాడు. తొలుత, తన పెన్షన్ తీసుకోవడానికి ఇకమీదట తాను స్వయంగా రానని, తహసిల్దారే తనకు పంపాలని కోయిలకుంట్ల తాలూకా తహసిల్దారును కోరడం జరిగింది. ఇందుకు తహసిల్దార్ రాఘవాచార్యులు ఉగ్రుడై, నరసిహారెడ్డిని పట్టుకు రమ్మని పోలీసుల్ని, 106 మంది కట్టుబడి దారుల్ని పంపడం జరిగింది. నరసింహారెడ్డిని పట్టుకోవడానికి  పోలీసులు కొంతకాలం ప్రయత్నించడం, పోలీసుల్ని బంధించడానికి నరసింహారెడ్డి ప్రయత్నించడం వంటి తరుముకోవడాలు కొంతకాలం జరిగాక కర్నూలు జిల్లాలోని చాగలమర్రి తాలూకాలోని మిట్టుపల్లి అను చిన్న పట్టణంలో ఇరువురిమధ్య ఘర్షణ జరిగింది. ఇందులో, తొమ్మిదిమంది పోలీసుల్ని నరసింహారెడ్డి అనుచరులు చంపడం జరిగింది. ఐనా, ఈ గొడవ ఇంతటితో ఆగలేదు.
                ఇది జరిగాక, నరసింహారెడ్డి, ఆతని అనుచరులు దాదాపు మూడువందల మంది మేచ్‌లాక్స్, డేగర్స్, కత్తులు, కర్రల్ని చేతబట్టుకొని జూలై పదవతేదీ 1846న కోయిలకుంట్లను ముట్టడించారు, తహసిల్దార్‌ని బంధించారు, దగ్గర్లోని తాలుకా ఖజానా లోని రు. 805`10`4 కొల్లగొట్టారు, ఆతరువాత జరిగిన ఘర్షణలో ఐదుగురు పోలీసుల్ని చంపేశారు. ఈ సంఘటనతో నిచ్ఛేష్టుడైన బ్రిటిష్ అధికారి జాన్ కొక్రేన్ (ఆక్టింగ్ కలెక్టరు అండ్ మెజిస్ట్రేట్), కర్నూలు లోని గవర్నర్ ప్రతినిధి సెప్టిమస్‌స్కాట్, కడప సేనల అధిపతి కలొనల్ గ్రంథం వంటివారిని చైతన్య పరచి, తనుకూడా కోయిలకుంట్లకు పరుగుతీయడం జరిగింది.
                ఇదే తరుణంలో నరసింహారెడ్డి, ఆతని అనుచరులు కోయిలకుంట్లను వదలి, దువ్వూరు తాలూకాలోని రుద్రవరం వైపు పయనమై, దారి మధ్యలో ఆనెగొందె వద్దగల రంగస్వామి ఆలయంలో విశ్రాంతి తీసుకొని, ఆతరువాత రుద్రవరం చేరి, దానిని మూడువేల మందితో ముట్టడించి, దోచుకొన్నారు. నరసింహారెడ్డిని బంధించడంకై శ్రీనివాసరెడ్డ్డి, నర్శిరెడ్డి అను తహసిల్దార్లు, బ్రిటిష్ సైన్యాలు రుద్రవరంకు వచ్చినా ఆతనిని పట్టుకోలేకపోయారు. రుద్రవరం సంఘటన జరిగిన వెంటనే ఉద్యమకార్లు నల్లమల అడవుల్లోకి జారుకొని, చివరకు కొత్తకోట చేరి, అక్కడే పదిరోజులు విడిదిచేసి, ఆతరువాత దగ్గర్లోని గిద్దలూరుకు వెళ్ళడం జరిగింది.
                రుద్రవరం ఘటనతో దిమ్మతిరిగిన బ్రిటిష్ సైనిక అధికారులు బ్రిగేడియర్‌జనరల్ జాన్ ఆండర్సన్, లెఫ్టినెంట్ రసెల్, లెఫ్టినెంట్ లిల్లీక్రాఫ్ట్, కెప్టన్ నాట్, లెఫ్టినెంట్ వాట్సన్ వంటివారు సైన్యాల్ని సమాయత్తపరిచారు. కాని, అప్పటికే గిద్దలూరు చేరిన నరసింహారెడ్డి, ఆతని అనుచరులు 1846 జూలై 22, జూలై 23 తేదీలలో రెండు పర్యాయాలు అప్పటికే అక్కడికి చేరుకొనివున్న వంద వాట్సన్ సైన్యాలపై ముట్టడిచేసి, వారిని ఐదు గంటలపాటు చుట్టుముట్టి దిగ్భంధించారు. కాని, దీని తరువాత జూలై 23, 1846న ఇరువురిమధ్య ఇక్కడ జరిగిన యుద్ధంలో వాట్సన్ ఉద్యమ కారుల్ని ఓడించడం జరిగింది. ఇందులో రెండు వందల మంది ఉద్యమకారులు మరణించగా, మిగిలినవారు తప్పించుకు వెళ్ళారు. ఈ ఘర్షణలో కంభం తహసిల్దార్ కూడా మరణించడం జరిగింది.
                గిద్దలూరు యుద్ధం తరువాత తిరుగుబాటుదార్లు కంభం వైపు పయనించి కృష్ణమచెట్ట్టిపల్లి, ఆతరువాత గిద్దలూరుకు నాలుగు మైళ్ళ దూరంలోని ముండ్లపాడుకు చేరుకొన్నారు. ఐతే, జూలై 24, 1846న ఇక్కడ కెప్టన్ నాట్ ఆధీనంలోని యాబైమంది కర్నూల్ సవార్లు, 250 మంది సైన్యాలకు, తిరుగుబాటు దార్లకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు ముప్పయ్ మంది ఉద్యమకార్లు మరణించారు, ముప్పయ్ ఐదు మంది బంధీ అయ్యారు. కర్నూల్ అసిస్టెంట్ కమిషర్ కెప్టన్ రసెల్‌ని నరసింహారెడ్డి కాల్చిచంపడం జరిగింది. ఇది జరిగాక నరసింహారెడ్డి తిరిగి కొత్తకోటకు వెళ్ళాడు. ఇదే సమయంలో కొందరు అనుచరులు నరసింహారెడ్డిని వీడడం కూడా జరిగింది. బ్రిటిష్ సైన్యం కూడా నరసిహారెడ్డిని వెంటాడసాగింది. దీనితో, నరసింహారెడ్డి కొత్తకోట వద్ద తన కుటుం సభ్యుల్ని వదిలేసి, నల్లమల అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అనుచరులు చాలామంది చిందరవందర కావడం కూడా జరిగింది.
                ఇలాంటి స్థితిలో నరసింహారెడ్డిపై, ఆతని అనుచరులపై కన్నేసి ఉంచాలని జనరల్ ఆండర్సన్, కెప్టన్  నాట్, కెప్టన్ కోట్స్, మేజర్ రీడ్ వంటి వారిని బ్రిటిష్ అధికారులు ఆజ్ఞాపించడం జరిగింది. అరతేగాక, నరసింహారెడ్జిని బంధించిన వారికి వెయ్యి రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ఆగస్టు 1846 మొదటి వారంలో ప్రకటించడం జరిగింది. సైనిక రక్షణలో నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల్ని కడపకు తీసుకెళ్ళడం జరిగింది. అంతేగాక హైదరాబాదు, కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లోని నరసింహారెడ్డి సన్నిహితుల పేర్లను సేకరించే ప్రయత్నం కూడా జరిగింది. అలాంటి వారిలో ముఖ్యులు: గోసాయి వెంకయ్య, కరణం అశ్వద్ధం (గుండ్లదుర్తి), దర్శి రోసిరెడ్డి (గుండ్లదుర్తి), జంగం మల్లయ్య, కాస్సాని వాలయ్య (గ్రామాధికారి మరియు కట్టుబడి ఇనాందార్ల నాయకుడు, నొస్సుం).
                ఇది ఒకవైపు జరుగుచుండగా, నరసింహారెడ్డి, ఆతని వీరాభిమానులు గోసాయి వెంకయ్య, కరణం అశ్వద్ధం లతో కలసి కృష్ణానదిని దాటి హైదరాబాదు నిజాం భూభాగాల్లో ప్రవేశించాడని కొక్రేన్‌కు సమాచారం వచ్చింది. దీనితో ఆగష్టు 26, 1846న హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెంట్‌ను అలర్ట్ చేసి, నల్లమల అడవుల ప్రాంతాల్లో సైన్యం నిలపడం జరిగింది.
                ఇలా వెళ్ళిన నరసింహారెడ్డి 1846 సెప్టంబర్ మొదటి వారంలో కృష్ణా నది దక్షిణ ఒడ్డున ప్రత్యక్షమయ్యాడు. దీనితో ఉద్యమకారులంతా కోయిలకుంట్ల, ఔక్ (అవుకు) ల దగ్గర్లోని ఎర్రమలై అడవులవద్ద పోగయ్యారు. ఇది తెలిసిన కొక్రేన్ కూడా నొస్సుం, కోయిలకుంట్ల, ఔక్, తిమ్మనంపేట, జమ్మలమడుగు వంటి ప్రాంతాలకు సైన్యాల్ని పంపాడు. ఐనా, నరసింహారెడ్డి కోయిలకుంట్ల, ఔక్, నొస్సుం వంటి ప్రాంతాల్ని సందర్శించి, కట్టుబడిదార్లు మొదలైన వారితో సంప్రదించి, అక్కడి ప్రజల్ని ఉద్యమానికి సమాయత్తపరచాడు. ఆతరువాత ఆతని అనుచరులు రెండు గ్రూపులుగా విడిపోయి సూదమలచెన్నియ, సూద్దనుల్ల అను రెండు గ్రామాల్ని సెప్టంబర్ 21, 1846న దోచుకొన్నారు.
                ఈ సంఘటన జరిగినందుకు మద్రాసు ప్రసిడెన్సీ గవర్నర్ సైనికాధికారుపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చడం జరిగింది. దీనితో, అక్టోబర్ తొలినాళ్ళలో గ్రంథం, నాట్, ఫిర్త్ వంటి అధికారులు పెల్నికోట, భద్రాచలం, ఔక్, చిన్ననాయనిపేట, నొస్సుం, ఉయ్యాలవాడ, కోయిలకుంట్లలకు సైన్యాలతో పరుగులుతీశారు. కాని, అక్టోబర్ 4, 1846న రెండు వందల మంది ఉద్యమకారులు ఔక్ ను ముట్టడించి భద్రాచలం కొండపై గల కోటలో పోగయ్యారు. అతేగాక, 1846 అక్టోబర్ 8,న నరసింహారెడ్డి నుట్టపల్లిని దోచుకొన్నాడు. ఆ తరువాత, నరసింహారెడ్డి, ఆతని అనుచరులు జగన్నాథం కొండపై గల జగన్నాథం ఆలయంలో గుమికూడారు. ఇది తెలుసుకొన్న బ్రిటీష్ సైనికాధికారులు కొక్రేన్, నాట్‌లు బీడు ప్రాంతాల్లో ఆశ్విక దళాల్ని ఉంచి, కొండపైకి పశ్చిమం నుండి నైన్యాలతో ముట్టడి చేయించారు. లెఫ్టినెంట్ న్యూలిన్, యంగ్‌హస్బెండ్  వాంటివారైతే కొండపైకి ప్రాకి, ఆలయాన్ని చుట్టుముట్టారు. దీనితో ఇరువురి మధ్య ఇక్కడ యుద్ధం ఆరంభమైంది. ఇందులో ఉద్యమకారులు 46 మంది చనిపోయారు, 8 మంది గాయపడ్డారు, 83 మంది లొంగిపోయారని తెలుస్తోంది. ఇక, నరసిహారెడ్డికి మోకాలిపై గాయం కావడంతో పోరాటం చేయలేక, తప్పించుకోలేక బంధీ అయ్యాడు. 
                ఈ సంఘటన తరువాత నరసింహారెడ్డి నాయకత్వాన జరిగిన ఉద్యమ విషయాలు లోతుగా తెలుసుకోవడంకై మద్రాసు ప్రభుత్వం ఒక స్పెషల్ కమీషన్‌ను నియమించింది. దీని అద్యక్షుడుగా డబ్ల్యు.ఎ.డి.ఇంగ్లిస్ నియమించబడినాడు. పరిశీలన పూర్తయ్యాక, ఈ కమీషన్, ఉద్యమ కాలంలో బందీకాబడిన తొమ్మిది వందల ఒకరిలో నాలుగు వందల పన్నెండు మందిని విడుదలకు అనుమతించింది, రెండు వందల ఇరవైమూడు మందిని జామీనుతో వెళ్ళడానికి అంగీకరించింది, ముగ్గురికి జీవితాంతం, ఐదుగురికి పద్నాలుగేండ్లు, నలుగురికి ఎనిమిదేండ్లు, ముగ్గురికి పదేండ్లు, ఎనభైమూడు మందికి ఐదేండ్లు, ఒక్కరికి మూడేండ్లు, ఆరుగురికి రెండేండ్లు, ముగ్గురికి ఒక ఏడు, ఇద్దరికి ఆరు నెలలు, మొత్తం నూటపన్నెండు మందికి శిక్ష విధించింది.
                ఇక, నరసింహారెడ్డికి మరణ శిక్ష విధించబడి కోయిలకుంట్ల వీధుల్లో సంకెళ్ళతో త్రిప్పబడి, ఆ తరువాత జుర్రేటి బావివద్ద (జుర్రేటివాగు ఒడ్డున గల బావి) ఉదయం 7 గంటల సమయాన పిబ్రవరి 22, 1847 న ఉరితీయబడినాడు. ఆ ప్రాంత జనాల్లో భయం కల్పించడంకై ఆతని శవం 1877 వరకు అక్కడే వ్రేలాడదీయబడి ఉండేదని ఇప్పటికీ అక్కడి జనాల్లో కథనాలు ఉన్నాయి. నరసింహారెడ్డివలె ఉరితీయబడి, వ్రేలాడి ఉంచబడిన వారిలో తిరువాన్కూరుకు చెందిన వేలుతంబి, హైదరాబాదులో 1857 నాటి తిరుగుబాటు కాలంలో బ్రిటీష్ రెసిడెన్సీపై ముట్టడి చేసిన బేగంబజార్ నివాసి తుర్రేబాజ్ ఖాన్ వంటి వారు అనేకమంది ఉన్నారు. అసలు, 1857 ఉద్యమ కాలాన బెనారస్-అలహాబాద్‌ల మధ్య మైళ్ళకొద్ది దూరం చెట్లకు వ్రేలాడదీయబడిన శవాలు దర్శనమిస్తుండేవి. ఇలాంటి క్రూర చర్యలకు కారకుడైన బ్రిగేడియర్ నీల్‌ను మానవ రూపపు రాక్షసుడు అని అప్పట్లో అనేవారు. తరువాతి కాలాల్లో ఇతడిని మరో డయ్యర్ అనేవారు. నరసింహారెడ్డి ఉరితీయబడినాక ఆతని వీరత్వంపై కుప్పలకొద్ది వీరగాథలు, నాటకాలు, కథలు వంటి పలు కళలు పుట్టుకొచ్చాయి. నేటికీ అవి తెలుగు ప్రాంతాలన్నింటిలో ప్రాచుర్యంలో ఉన్నాయి.
                నరసింహారెడ్డి ఉద్యమ ఫలితాల్ని పరిశీలిస్తే, జన పీడిత పాలకులతో ఓడిగెలిచిన నాయకుడని ఆతని గురించి చెప్పక తప్పదు. ప్రాణం కోల్పోయినా ప్రజలకు ప్రధానంగా ఉన్న బ్రిటిష్ వారి ఇనాంల రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసేట్లు, వారి భూహక్కులు తిరిగి ఇవ్వబడేట్లు తన ఉద్యమంతో ప్రభావం చూపగలిగాడు. ఇందుకై 1858 లో మద్రాస్ ప్రభుత్వం డబ్ల్యు. టి. బ్లేయ్‌ర్ అధ్యక్షతన ఇనాం కమిషన్‌ను నియమించింది. మద్రాసు ప్రసిడెన్సీలోని అన్ని రకాల ఇనాంలను పరిశీలించి, వాటిని క్రమబద్దీకరించే పనిని ఇది పూర్తి చేసింది. ఇంతటి ఘనతల్ని సాధించినాడు కాబట్టే ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆతని ఉద్యమం ఎంతోమందికి, ఎన్నో ఉద్యమాలకు స్పూర్తినిస్తున్నాయి.

డా॥ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
రిటైర్డ్‌ ప్రొఫెసర్, చరిత్ర శాఖ, ఎస్వీ యూనివర్శిటీ, తిరుపతి.
189 బి, తుమ్మలగుంట, తిరుపతి  517 502.
మొబైల్ : 9849584324
ఈమెయిల్: dsreddy.svu@gmail.com

NB: కర్నూలులో ఫిబ్రవరి 22న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థూపావిష్కరణ సందర్భంగా ఉయ్యాలవాడ పోరాట నేపధ్యం గురించి దేవిరెడ్డి గారు రాసిపంపిన ఈ బృహత్ వ్యాసాన్ని చాలా వరకు సంక్షిప్తం చేసి సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్ సంపాదకీయ పేజీలో (22-02-2019) ప్రచురించటమైనది. సకాలంలో ఉయ్యాలవాడపై సంక్షిప్తంగా నైనా కథనాన్ని ప్రచురించినందుకు ఆవిష్కరణ సభకు వచ్చిన వారందరూ సంతోషాన్ని వ్యక్తపరిచారంటూ దేవిరెడ్డి గారు ఇవ్వాళే నాకు కింది మెసేజ్ పంపారు. దాన్ని కింద చూడండి.

Dear Sir, Namaste.  Thank you very much for the help. Every one felt happy with the article on the eve of installation of the big bronze statue of Uyyalavada with a sword in hand on a horse. I could see the original sword used in the fight and preserved by his family and displayed at the meeting yesterday. I am really grateful to you for this and for the others also. .

Devireddy subramanyam reddy


ఈ బృహత్ వ్యాసాన్ని నా ఈ బ్లాగులో, ఫేస్ బుక్‌లో కూడా ప్రచురించడానికి అవకాశం ఇచ్చిన గురుతుల్యులు దేవిరెడ్డి గారికి కృతజ్ఞతలతో... 




ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ వాస్తవ చిత్రాన్ని సైరా చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా నేడు మీడియాకు విడుదల చేశారు.

విప్లవ వీరుడు..రేనాటి సూర్యుడు

పై లింకులో కోవెలకుంట్లలో ఫిబ్రవరి 22న ప్రతిష్ఠించిన ఉయ్యాలవాడ కంచువిగ్రహంతో పాటు ఆయన చరిత్రకు చెందిన మరికొన్ని విశేషాలతో సాక్షి ప్రత్యేక వ్యాసం ఉంది. చూడగలరు.