Pages

Monday, August 21, 2017

రేప్ చేసిన చేతులకు రాఖీలా?

ఛత్తీస్‌ఘడ్ దంతెవాడ జిల్లా పాల్నార్ గ్రామంలో ఆరోజు రాఖీ పున్నమి. కాని ఆదివాసి బాలికల జీవితాల్లోకి నిండు వెన్నెల తొంగి చూడవలసిన తరుణంలో చేదు చీకటి అనుభవం చోటు చేసుకున్నది. ఆ చేదు నాభి దాకా దిగి ఆ రుచి నాలికకో, నోటికో, శరీరానికో కాదు, గుర్తు చేసుకుంటేనే వణికిపోయేలా మనస్సును ఎల్లప్పుడూ అంటుకునే ఉంటుంది. గుర్తు చేసుకోకపోవడానికి అదేం మరిచిపోయే ఘటననా? ఒక్కరి అనుభవమా? ఐదు వందల మంది మహిళల సామూహిక అనుభవం.

రాఖీ కట్టడం అనేది ఈ దేశంలో ఒక సోదర భావానికి చిహ్నం. సోదరి తన సోదరుని పట్ల రక్తబంధంతో, ప్రేమతో, విశ్వాసంతో రాఖీ కట్టే ఒక ఫ్యూడల్ విలువ. ఆ మహిళ ఆ పురుషునిపై.. తాను ఒక సహచర్యాన్ని ఎంచుకునే దాకా విశ్వాసంతో ఆధారపడే విలువకు ప్రతీక.  స్త్రీలు దానిని ఒక నిర్మలమైన భావనతోటే నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో దీనిని ఒక హిందూ సంప్రదాయంగా సంఘ్ పరివార్ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతున్నది. ఒక వేలంవెర్రిగా ఈ రాఖీ పండుగ జరుపుకునే వేడుకలు జరుగుతున్నాయి. 

దండకారణ్యంలో గ్రామాలు తగలబెడుతూ, స్త్రీలపై సామూహిక లైంగిక అత్యాచారాలు చేస్తూ, మావోయిస్టులు అనే అనుమానం ఉన్నవారిని, సానుభూతిపరులను, కానివారిని కూడా నిత్యం ఎన్‌కౌంటర్లలో చంపుతున్న రాజ్యం తాను పనిముట్లుగా వాడుకుంటున్న పారా మిలిటరీ బలగాలను చాల ఫ్రెండ్లీ పోలీసులుగా చూపడానికి ఈ రాఖీ పున్నమినే ఎంచుకున్నది.

పాల్నార్ గ్రామంలోని బాలికల వసతి గృహంలో ఐదు వందల మంది ఆదివాసి బాలికలు ఉన్నారు. వారికక్కడ బాలికల పాఠశాల ఉన్నది. అక్కడికి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సందర్శనకు వచ్చారు. ఇక్కడ వాళ్లకు ఒక నూతన కార్యక్రమం అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. అదే ఈ పాఠశాల పిల్లలతో సిఆర్‌పిఎఫ్ సైనికులకు రాఖీలు కట్టించాలని.

31 జూలై రోజే ఈ పథకాన్ని రచించి వందమంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను తీసుకొని ఆ వసతి గృహానికి వెళ్లారు. అధికారులు ఈ రాఖీ కట్టే దృశ్యాన్నంతా వీడియో తీసే ఏర్పాటు కూడా చేశారు. ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆదివాసి మహిళలకు సీఆర్‌పీఎఫ్ జవాన్లు సంరక్షకులుగా ఉన్నారని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి చూపాలనుకున్నది. ఈ అధికారులు ఆ మేరకు ఒక టీవీ ఛానల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారు.

రక్షాబంధన్ రోజు ఆ కార్యక్రమాన్ని లైవ్ షో చేయాలనుకున్నారు. అందుకని రాఖీ పున్నమి రోజు చాలాసేపటి వరకు ఆ కార్యక్రమం కొనసాగింది. ఉదయం నుంచి ఈ కార్యక్రమం చాలాసేపు కొనసాగడంతో కొంతమంది బాలికలు కార్యక్రమం మధ్యలో మరుగుదొడ్డికి వెళ్లారు. వాళ్లను ఐదారుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అనుసరించారు. తాము మరుగుదొడ్ల లోపల ఉండగా బయట ఇట్లా సీఆర్‌పీఎఫ్ జవాన్లు నిలబడడానికి ఆ అమ్మాయిలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆ జవాన్లు బెదిరించారు. మీ శరీరంలోని రహస్య ప్రదేశాల్లో ఏం దాచుకున్నారో మేం వెతకాల్సి ఉంటుందన్నారు. ఈ వెతకడం అనే నెపంతో ముగ్గురు అమ్మాయిల స్తనాలను దారుణంగా నలిపేశారు. ఒక అమ్మాయి మరుగుదొడ్డిలో తలుపు వేసుకొని ఉండిపోయింది. ముగ్గురు సైనికులు తలుపు తోసుకొని లోపలికి వెళ్లారు. పదిహేను నిమిషాలు వాళ్లు ఆ లోపలే ఉండిపోయారు. మిగిలిన అమ్మాయిలను బయట ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్లు గొడవ చేయకుండా నోరు మూశారు.

ఇదంతా జరిగిన తరువాత ఆ బాలికలు తిరిగి తమ గదుల్లోకి వెళ్లిపోయారు. జవాన్లు కూడా వెళ్లి అక్కడి కార్యక్రమంలో చేరిపోయారు. కార్యక్రమమంతా ముగిసిన తరువాత అధికారులు, సైనికులు వెళ్లిపోయారు. రాఖీ బంధన్ సంరక్షకుల కార్యక్రమం ముగిసింది. ఆ రాత్రి ఆ బాలికలు తమ వార్డెన్ ద్రౌపదీ సిన్హాకు జవాన్లు తమతో వ్యవహరించిన తీరు చెప్పారు. వార్డెన్ ఈ విషయాన్ని ఎస్‌పి, కలెక్టర్ దృష్టికి తెచ్చింది. మరునాడు కలెక్టర్, ఎస్‌పి ఇద్దరు కూడా పల్నార్ వచ్చారు. కాని ఆ అమ్మాయిలను పిలిపించడం కాని, ఏం జరిగిందని అడగడం కాని చేయలేదు.

ఈ ఫిర్యాదు చేసిన అమ్మాయిలను సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు తీసుకురమ్మని వెళ్లిపోయారు. హాస్టల్ వార్డెన్ ఇద్దరమ్మాయిలను సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు తీసుకువెళ్లింది. అక్కడ కలెక్టర్, ఎస్‌పి ఆ ఇద్దరినీ బెదిరించారు. ఈ సంఘటన గురించి ఎవ్వరికీ చెప్పవద్దని హెచ్చరించారు. కాని అప్పటికే పాల్నార్ గ్రామమంతా ఈ వార్త వ్యాపించిపోయింది. గ్రామస్తులు చొరవ తీసుకొని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోవాలని సోనీ సోరీని పిలిపించారు.

సోనీ సోరి అక్కడికి వెళ్లి ఆ వసతి గృహం దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయింది. ఆ హాస్టల్ వార్డెన్ గేటుకు తాళం పెట్టి వాచ్‌మన్ లాగా గేటు ముందు కూర్చున్నది. ఒక పోలీసు కానిస్టేబుల్‌ను పై అధికారులు అక్కడ నియమించారు. ఏ ఒక్క సామాజిక కార్యకర్త కాని, పత్రికా రచయిత కాని ఆ గేటు దాటి ఆ వసతి గృహంలోకి వెళ్లి అక్కడి ఆదివాసి బాలికలను కలవకుండా తీసుకున్న జాగ్రత్త అన్నమాట అది.

ఇంక చేసేది లేక సోనీ సోరి అక్కడి పాఠశాలలో చదివే పిల్లల ఇళ్లల్లోకి వెళ్లి ఆ సంఘటనకు సంబంధించిన సమాచారమంతా సేకరించింది. ఆ అమ్మాయిలు జరిగిన కథంతా వివరించారు.

దంతెవాడలో చాలాకాలం పాటు వనవాసి ఆశ్రమం నిర్వహించి, దాన్ని పోలీసులు తగులబెట్టి తనకు ప్రాణాపాయం తలపెట్టడంతో ఛత్తీస్‌ఘడ్ వదిలి వెళ్లిన హిమాంశు కుమార్ ఈ సంఘటనను బయటి ప్రపంచం దృష్టికి తెచ్చాడు. జవాన్లు చేసిన దారుణమైన లైంగిక నేరాన్ని, దాన్ని కప్పిపుచ్చడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానం దృష్టికి తెస్తానని ఆయన ప్రకటించాడు.

తమ పట్ల సీఆర్‌పీఎఫ్ జవాన్ల అమానుషమైన ప్రవర్తనను, జిల్లా సంరక్షకులు అని భావించే కలెక్టర్, ఎస్‌పిల దృష్టికి తెచ్చినప్పుడు ఫిర్యాదును పట్టించుకొని, నమోదు చేసి, చర్యలు తీసుకోవడానికి బదులు దాన్ని కప్పిపుచ్చడానికి, అణచివేయడానికి ప్రయత్నించడం కంచే చేను మేయడం.

ఈ సంఘటనలోని వాస్తవాలను విచారణ చేయడానికి బదులు వాళ్లు ఫిర్యాదు చేసిన వాళ్లనే బెదిరించారు. మైనర్ బాలికలపై అభ్యంతకరమైన లైంగిక చర్యలకు పూనుకోవడం లైంగిక అత్యాచారాల నుంచి బాలురను రక్షించే (పోస్కో  ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సస్) చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం.

వాస్తవానికి ఇంత అమానుషంగా వ్యవహరించిన సిఆర్‌పిఎఫ్ జవాన్ల మీద, కప్పిపుచ్చిన అధికారుల మీద ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్య తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదంతా రాఖీ పున్నమి రోజు జరిగింది. కనీసం రాఖీ పున్నమి రోజు కూడా సిఆర్‌పిఎఫ్ రక్షక భటులు రక్షకులుగా ఉండలేకపోయారు. వాళ్లను ఆదివాసుల పట్ల, ముఖ్యంగా ఆదివాసి మహిళల పట్ల రక్షకులుగా చూపాలని, అందుకే రానున్న ఆదివాసి తరానికి వాళ్లు సంరక్షకులుగా హామీ పడుతున్నారని ప్రపంచానికంతా దృశ్యమానం చేయదల్చుకున్న ప్రభుత్వం ఆ ఒక్క రోజైనా నిత్యం ఆదివాసి మహిళల పట్ల వాస్తవంగా జరుగుతున్నదేమిటో దాచలేకపోయింది.

ఇది కేవలం సముద్ర గర్భం నుంచి పొడసూపిన మంచు ముక్క మాత్రమే.

రాఖీ పున్నమికి రెండు రోజుల ముందే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మావోయిస్టు ప్రభావం ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు జమ్ము కశ్మీర్‌లో అనుసరిస్తున్న సైనిక రాజనీతిని అనుసరించాలన్నాడు. భద్రతా బలగాలు కశ్మీర్‌లో వలె నాయకత్వం మీద కేంద్రీకరించే నిఘా విధానాలను అనుసరించాలని సూచించాడు. ఈ విధానం వల్ల ఈ ఒక్క సంవత్సరం లోనే కశ్మీర్ లోయలో 115 మంది విదేశీ, స్థానిక టైరిస్టులను చంపగలిగామని గర్వంగా చెప్పాడు. 

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వమంతా భద్రతా బలగాల దృష్టి వలయానికి బయటే ఉంటున్నదని, వాళ్లకు సంబంధించిన కనీస సమాచారం గాని, వాళ్ల కదలికలు గాని, వాళ్ల స్థావరాలు గాని భద్రతా బలగాలు కనిపెట్టలేకపోతున్నాయని ఆయన వాపోయాడు. నిఘా వర్గాల దగ్గర కేంద్ర కమిటీ కార్యదర్శితో సహా సభ్యుల ఇటీవలి ఫొటోలు ఏవీ లేవని కూడా ఆయన తన ఆగ్రహం ప్రకటించాడు.

జమ్ము కశ్మీర్‌లో బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ దగ్గర నుంచి సైన్యం విజయవంతంగా ఒక లక్ష్యంగా సాధిస్తున్న ఈ దాడిని ఇక్కడ అర్థ సైనిక బలగాలు సాధించాలని ఆయన ఆశించాడు. నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలన్నాడు. కేరళ, తమిళనాడు, కర్నాటక మూడు రాష్ట్రాల ట్రై జంక్షన్‌లో కూడా మావోయిస్టు ప్రాబల్యం పెరుగుతున్నదని ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఇటీవల నాయకత్వాన్ని లక్ష్యం చేసుకొని దేవరాజ్, అజితలను ఎన్‌కౌంటర్‌లో చంపిన తీరు ఇతర ప్రాంతాల్లో ఆదర్శం కావాలన్నాడు. స్థానికంగా ఉండే పోలీసుల నుంచి ముప్పై శాతమైనా ఇటువంటి చర్యల్లో సిఆర్‌పిఎఫ్ సహకరించాలని ఆయన సూచించినప్పుడు ఆ సమావేశంలో ఉన్న ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అంత సంఖ్యను కేటాయించే పోలీసు బలగం తమకు లేదన్నాడు.

ఒక స్థావరాన్ని ఆక్రమించుకొని తాను అనుకున్న పద్ధతిలో అభివృద్ధిచేయడానికి నీళ్లు తోడేయకుండా చేపలను చంపడం సాధ్యం కాదనే వ్యూహాన్ని అమలు చేస్తున్న రాజ్యవ్యవస్థ తాము ఆదివాసుల పట్ల, సాధారణ ప్రజానీకం పట్ల ఏ హానీ తలపెట్టడం లేదని, తాము తలపెట్టిన అభివృద్ధికి కేవలం మావోయిస్టులే ఆటంకంగా ఉన్నారని అభిప్రాయం కలిగించడానికి అప్పుడప్పుడూ ఇటువంటి ప్రకటనలు చేస్తుంటుంది. వాస్తవంలో తాము తలపెట్టిన అభివృద్ధికి ఆదివాసి సమాజం, సాధారణ ప్రజానీకమే ఆటంకంగా ఉన్నారని రాజ్యం భావిస్తోందనడానికి ఈ రాఖీ పున్నమి నాటి సిఆర్‌పిఎఫ్ జవాన్ల చర్య ఒక తాజా దాఖలా.

ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న.. తమపై లైంగిక అత్యాచారం చేసిన సిఆర్‌పిఎఫ్ జవాన్లకే తాము రాఖీలు కట్టే స్థితికి నెట్టబడిన ఆదివాసీ బాలికల పట్ల ఈ వ్యవస్థ వైఖరి ఏమిటి? ఈ వ్యవస్థలో సామాజికులుగా మన బాధ్యత ఏమిటి? వాస్తవానికి ఈ వ్యవస్థ గమనం ఎక్కడికి? ఆదివాసులపై సామూహిక లైంగిక అత్యాచారాలను ప్రోత్సహించడమే కాకుండా, స్వయంగా తాను కూడా అందులో పాల్గొన్నాడనే నేరారోపణ జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు రుజువైన పోలీసు ఉన్నతాధికారి కల్లూరిని.. ఆగస్టు 15న ఒక విశ్వవిద్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ఆహ్వానించడం రేప్ చేసిన చేతులకు రాఖీలు కట్టించడమనే దుర్మార్గానికి పరాకాష్ట కాదా?

వరవరరావు
విరసం వ్యవస్థాపక సభ్యుడు

గమనిక: చత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ మహిళలపై జరుగుతున్న దారుణ కృత్యాలపై విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు గారు పంపిన వ్యాసం పూర్తి పాఠం ఇక్కడ ప్రచురించడమైనది. ఈ బ్లాగులో ప్రచురించడానికి అనుమతించినందుకు ఆయనకు ధన్యవాదాలు.

పై వ్యాసం సంక్షిప్త పాఠం ఆగస్టు 18, 2017 సాక్షి పత్రిక సంపాదక పేజీలో, వెబ్ సైట్‌లో ప్రచురితమైనది

http://www.sakshi.com/news/vedika/varavara-rao-criticises-crpf-jawans-500308

Saturday, May 27, 2017

ఐదు దశాబ్దాల వసంత మేఘగర్జన.. నక్సల్బరీ

‘‘నక్సల్బరీ ఏకీ రస్తా’’ ‘‘నక్సల్బరీ గతం కాదు, చరిత్ర, వర్తమానం, భవిష్యత్తుకూడా.’’ 





‘‘నక్సల్బరీ ఏకీ రస్తా’’ ‘‘నక్సల్బరీ గతం కాదు, చరిత్ర, వర్తమానం, భవిష్యత్తుకూడా.’’
92 ఏళ్ళ కురు వృద్ధుడు కొకొణ్‌ మజూందార్‌ తడబడుతోన్న గొంతులోంచి ఏమాత్రం తొట్రుపడకుండా నక్సల్బరీని వ్యాఖ్యానించిన తీరు ఇది. నక్సల్బరీ విప్లవోద్యమ ముద్దుబిడ్డ చారూమజూందార్‌ యావత్‌ భారతదేశ జనావళికి అందించిన పోరాట పంథాని చేబూని, చైనా విప్లవోద్యమ మహానాయకుడు మావోసేటుంగ్‌ లాంగ్‌మార్చ్‌ స్ఫూర్తితో పశ్చింబెంగాల్‌ లోని కుగ్రామమైన  నక్సల్బరీ నుంచి చైనాకు నడిచి వెళ్ళి అక్కడ ఆయుధ శిక్షణనొంది, మావోతో చర్చలు జరిపి తిరిగొచ్చిన నాటి నవయుకుడు నేటి కురువృద్ధుడు కొకొణ్‌ మజూందార్‌ తెలుగు గడ్డ నుంచి తొలిసారిగా నక్సల్బరీలో అడుగుపెట్టిన ఏకైక పత్రిక ‘సాక్షి’తో అన్న మాటలివి.

‘‘దేశ అంతరంగిక భద్రతకు పెనుముప్పు నక్సలిజం’’ ఈ మాటలన్నది భారతదేశ మాజీ  ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌. ఇదే ప్రజల భాషలోకి తిరగరాస్తే నక్సల్బరీ ఒక ఊరు కాదు. ఓ సిద్ధాంతం. నక్సల్బరీ ముప్పుకాదు, పెను ఉప్పెన. ప్రపంచం నలుమూలలా వెల్లువెత్తుతోన్న ప్రజా పోరాటాలూ, జాతుల విముక్తి ఉద్యమాలతో ప్రభావితమై విప్లవాన్ని వర్షించిన  వసంత మేఘ గర్జన నక్సల్బరీ. యాభై వసంతాలను పూర్తిచేసుకుంటోన్న నక్సల్బరీలోనికి అడుగుపెట్టిన సాక్షికి నక్సల్బరీ విప్లవోద్యమం, నిర్బంధం, నాటి ఆదివాసీ, రైతాంగ పోరాటాలూ, భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాట్లూ అనుభవాలను సజీవంగా మా ముందుంచారు.

నక్సల్బరీ నెత్తుటికి ప్రత్యక్ష సాక్షి శాంతి ముండా



పదిహేను రోజుల పురుటి గుడ్డును పొత్తిళ్ళలోకెత్తుకుని రైతాంగపోరాటంలో పాల్గొన్న ఆదివాసీ యువతి యిప్పుడు పండు ముసలి శాంతి ముండా స్వయంగా నాటి పోరాటాన్ని సాక్షికి కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

శాంతి ముండా! విప్లవాగ్నులను రాజేసిన నక్సల్బరీ పురిటిగడ్డపై భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమంలో చిందిన నెత్తుటికి ప్రత్యక్ష సాక్షి. నక్సల్బరీ ఉద్యమానికి ప్రత్యక్షనాయకత్వం వహించి, మొదటి నక్సలైట్‌గా ప్రసిద్ధిగాంచిన కానూసన్యాల్‌తో భుజం, భుజం కలిపి నడిచిన నక్సల్బరీలో మిగిలిఉన్న నాటి పోరాట జ్ఞాపకం శాంతి ముండా. నక్సల్బరీ అనే నాలుగక్షరాలు ఐదు దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలను, మరెన్నో త్యాగాలను తనలో నింపుకున్న విప్లవోద్యమ మహాచరితపై ఆమె ఓ చిరు సంతకం. నా ప్రశ్నలకు సమాధానంగా ఆమె నోరు విప్పింది.

శాంతి ముండాది నక్సల్బరీ ప్రాంతంలోని సిలిగురికి ఐదారుకిలోమీటర్ల దూరంలో ఉన్న హత్‌ఘిస్సా గ్రామం. కమ్యూనిస్టు పార్టీ చీలికకు ముందే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలంలోనే అంటే 1958లో తొలిసారిగా ఆమె పార్టీలో సభ్యురాలిగా చేరారు. 1967లో ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సల్బరీ సాయుధ తిరుగుబాటులో ముందువరుసలో ఉన్నవారిలో శాంతిముండా కూడా ఒకరు. నక్సల్బరీ తొలితరం నాయకుడైన కానూసన్యాల్‌తోనూ, ఆయన సిద్ధాంతంతోనూ  తుదకంటా వెన్నంటి నడిచిన కూనూదాదా అనుచరురాలు. భూపోరాటాల్లో 12 ఏళ్ళ చిన్నారి శాంతి ముండా భాగమయ్యారు.

‘‘రెండు బీగాల (ఆరెకరం) పొలం తిండికే చాలేది కాదు. దీనికి తోడు భూస్వాముల దగ్గర తెచ్చుకున్న రుణం తీర్చేందుకు పండిన పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. ఇక మిగిలిన తాలు గింజలను చీపురుతో పోగుచేసుకుని ఇంటికి తెచ్చుకుని గంజితాగి బతికే పరిస్థితి మాది’’.  ‘‘మాదే కాదు. హతిఘస్సా చుట్టుపక్కల గ్రామాల్లోని మెజారిటీ ప్రజలందరిదీ అదే పరిస్థితి. అంతా చిన్న, సన్నకారు రైతులే. రోజురోజుకీ శృతిమించిపోతున్న పెత్తందార్ల, జోతేదార్ల పోకడలకు వ్యతిరేకంగా చిన్న నిరసనలుగా ప్రారంభమైన మా పోరాటం దావానలమైంది. అయితే 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా నాటి తమ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు స్ఫూర్తిదాయకమయ్యిందని శాంతి ముండా గుర్తుచేసుకున్నారు.

నక్సల్బరీ నిప్పుకణికకు ఇక్కడే బీజం



నక్సల్బరీ ప్రాంతంలో 1960 దశకం ప్రారంభం నుంచే సిపిఎం నాయకత్వంలోనే పోరాటబీజాలు పడ్డాయి. ఆ క్రమంలో 1967 మార్చి 3న డార్జిలింగ్‌ జిల్లాలోని నక్సల్బరీకి సమీపంలోని హతిఘస్సా ప్రాంతంలో భూస్వాముల, జోతేదార్ల దోపిడీకి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది. çపండించిన పంట మొత్తాన్ని భూస్వాములే దోచుకుంటుంటే కడుపుమండిన రైతాంగం భూస్వాముల భుముల్లో ఎర్రజెండాలు పాతి పంటను కోసుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత భూస్వాముల గ్రామీణ ప్రాంతాల పెత్తందార్ల దోపిడీని నిర్మూలించడానికి రైతాంగాన్ని సంఘటిత పరిచి సాయుధం చేయాలని నాటి సిపిఎం స్థానిక పార్టీ నిర్ణయించింది.



దీనికి ప్రధానంగా చారూమజూందార్‌ సిద్ధాంతభూమికను తయారుచేసారు. 8 డాక్యుమెంట్ల పేరుతో నక్సల్బరీ పోరాటానికి ముందే ఆయన ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసారు. దీని ప్రభావంతో నక్సల్బరీ, కరీబరీ, ఫాన్సీ దేవ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 274 చదరపు మైళ్ళ ప్రాంతంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 60 కి పైగా పోరాట సంఘటనలు జరిగాయి. గ్రామగ్రామంలో రైతులు కమిటీలుగా ఏర్పడి జోతేదార్ల వద్ద ఉన్న భూములను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. దాదాపు 20 వేల మంది రైతులు ఉద్యమంలో పూర్తికాలం కార్యకర్తలుగా చేరారు.

ఈ క్రమంలోనే జరిగిన సంఘటన నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటచరిత్రలో నిప్పుకణికగా చెప్పుకోవచ్చు. మే 24న జోతేదార్లకు మద్దతుగా వస్తున్న పోలీసులకు అక్కడి రైతాంగానికీ, ఆదివాసీలకు మధ్య జరిగిన ఘర్షణలో సోనం వాంగ్డే అనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై ఆదివాసీలు సాంప్రదాయక ఆయుధాలైన బాణాలతో దాడిచేసారు. దానికి ప్రతీకారంగా మే 25వ తేదీన పోలీసులు బెంగాయ్‌ జోతె గ్రామంపై పెద్దెత్తున జరిపిన కాల్పుల్లో 7 గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఒక పురుషుడు మరణించారు. ఆ కాల్పుల్లో ధనేశ్వరీ దేవి, సీమేశ్వరీ మాలిక్, నయనేశ్వరీ మాలిక్, సురుబాలా బర్మన్, సోనామతీ సింగ్, ఫులుమతీదేవి, సంసారీ సైభానీ, గౌద్రౌ సైబానీ, కర్సింగ్‌ మాలిక్‌ తోపాటు ఇద్దరు చిన్నారులు మరణించారు. ప్రసాద్‌ జోతె మారణకాండగా పేరొందిన ఈ ఘటన నక్సల్బరీ పోరాటానికి నాందీ ప్రస్థానంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటనతో పోలీసుల నిర్బంధం తీవ్రమైంది. చారూమజూందార్‌ తో పాటు అనేకమంది నాయకులు అజ్ఞాత వాసంలోనికి వెళ్ళారు.

చైనాకు వెళ్లి మావోను కలిసిన నక్సల్బరీ నాయకత్వం



ఆ సమయంలోనే  కానూసన్యాల్, కొకణ్‌ మజూందార్, కుదన్‌లాల్‌ మాలిక్, దీపక్‌ బిశ్వాస్‌ అనే నలుగురు సభ్యులతో కూడిన నక్సల్బరీ నాయకత్వం చైనాలో మావోసేటుంగ్‌ని కలిసి, ఆయుధ శిక్షణతో పాటు, నాటి భారత విప్లవ రాజకీయాలను చర్చించారు. 1967 సెప్టెంబర్‌లో బయలుదేరి వెళ్ళిన బృందం డిసెంబర్‌ 24 వరకు  మూడునెలలపాటు చైనాలో గడిపింది. ఈ బృందంలో ఒకరైన కుదన్‌లాల్‌ మాలిక్‌ నాడు మావోసేటుంగ్‌తో తమ అనుభూతులను నెమరువేసుకున్నారు. మావోను కలిసిన అనుభవం మమ్మల్నెంతో ఉత్తేజితులను చేసిందనీ, నక్సల్బరీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు అశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో భాగం చేయాలనీ, లేదంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేసినట్టే రాజ్యం అణచివేస్తుందనీ మావో వ్యాఖ్యానించారని కుదన్‌లాల్‌ మాలిక్‌ గుర్తుచేసుకున్నారు.

చారూ మజూందార్‌ కుమారుడు అభిజిత్‌ మజూందార్‌



విప్లవ నినాదానికి సైద్ధాంతిక భూమికనందించిన పేరు. యాభయ్యేళ్ళుగా పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న పేరు. దేశంలోని లక్షలాది మంది ప్రజల్లో విప్లవాగ్నులు రగిల్చిన చిన్న నిప్పుకణికను అందించిన నాలుగక్షరాల నక్సల్బరీ ఉద్యమాన్ని సాయుధపోరాటంవైపు మళ్ళించి, పాలకులను గడగడలాడించిన చారూ మజూందార్‌ ఏకైక కుమారుడు అభిజిత్‌ మజూందార్‌ అన్న మాటలవి.

‘‘చైనా ఛైర్మన్‌ ఈజ్‌ అవర్‌ ఛైర్మన్‌. మావో సేటుంగ్‌ ఈజ్‌ అవర్‌ లీడర్‌. చిన్ని చిన్ని చేతులతో మేం రాసిన గోడరాతలవి. నిజానికి విప్లవోద్యమ ఆటలవి. మాటలైనా, పాటలైనా, చివరకు ఆటలైనా నాడు విప్లవమే. అత్యంత నిర్భందం మధ్య, పోలీసు పదఘట్టనల మధ్య మా కుటుంబం నేపథ్యం అసాధారణంగా గడిచింది’’.

‘‘అప్పటికి నాకు ఏడేళ్ళుంటాయేమో కొనసాగించాడు చారూమజూందార్‌ సంతానంలో అందరికన్నా చిన్నవాడైన అభిజిత్‌ మజూందార్‌. అభిజిత్‌ మజూందార్‌కి ఇద్దరక్కలు. అనిత, మధుమిత. అంత చిన్న వయస్సులో అన్ని ఘటనలూ సరిగ్గా గుర్తులేకపోయినా అర్థ రాత్రీ అపరాత్రీ అని లేకుండా ప్రతినిత్యం ఇంటిని ముట్టడించి, భయభ్రాంతులకు గురైచేసిన నాటి నిర్బంధం నాకు మిగిల్చిన చేదు జ్ఞాపకాలెన్నో.  ‘‘ సమానత్వం కోసం సాయుధపోరాటమార్గాన్ని ఎంచుకున్న నాన్నని ఓ హంతకుడిలా చూసిన సమాజం నుంచి అమ్మ చాలా చేదు అనుభవాలను ఎదుర్కొంది. అయినా మొక్కవోని ధైర్యం మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దింది.’’

మా అమ్మమ్మ ఊరైన సిలిగురిలో అమ్మా, నాన్న ఇద్దరూ కలిసారు. పెళ్ళి చేసుకున్నారు. మాది ఉమ్మడి కుటుంబం. మా తాతగారు ప్రభుత్వోద్యోగి. రాజకీయ అవగాహన కలిగిన కుటుంబం మాది. అమ్మా, నాన్నా ఇద్దరూ మార్క్సిస్టు పార్టీ సభ్యులుగా ఉండేవారు. మార్క్సిస్టు పార్టీతో సైద్ధాంతికంగా విభేదించి  నాన్నతో సహా  కానూసన్యాల్‌ మరికొందరు నాయకులు మార్క్సిస్టు లెనినిస్ట్‌ పార్టీని స్థాపించారు. అప్పటికీ కూడా అమ్మ సిపిఎం సభ్యత్వాన్ని వదులుకోలేదు. రాజకీయంగా నాన్నకి వెన్నుదన్నుగా నిలిచింది అమ్మ. మా ఇల్లు ఎప్పుడూ చాలా సందడిగా ఉండేది. ఎవరెవరో వచ్చి పోతూ ఉండేవారు. ఇంట్లో చాలా తక్కువగా గడిపేవారు. రాను రాను నాన్న ఇంటికి రావడం తగ్గిపోయింది. ఇంకొన్నాళ్లకు నాన్న అర్థరాత్రుళ్ళు ఏ కొద్ది సమయమో మేం నిద్దట్లో ఉండగా కనిపించేవారు. అది కలో నిజమో కూడా తెలియని మగతలో మమ్మల్ని పలకరించిన జ్ఞాపకాలు.

నాన్న చారూమజూందార్‌ పీడిత జన విముక్తికోసం తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించాలని సాయుధపోరాటానికి పిలుపునిచ్చిన విప్లవ కారుడు. మా అమ్మ లీలా మజూందార్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌. ఇల్లు దాటి బయటికెళ్ళాలంటే మాకుటుంబానికి భయం. ఏవేవో కామెంట్స్‌ మా మనస్సుని కష్టపెట్టేవి. మమ్మల్ని ఉద్దేశించి వాళ్ళన్న మాటలు మమ్మల్ని చిత్రవధ చేసేవి. ‘‘నాన్న ప్రాణాలు తీస్తాడు, అమ్మ ప్రాణాలకు వెల కడుతుంది’’(అమ్మ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌). బూర్జువా చదువులొద్దని చెప్పే వాళ్ళ పిల్లలే ఆ బూర్జువా చదువులు చదువుతారంటూ మమ్మల్ని నాన్న మరణం తరువాత కూడా వేధించిన అనుభవాలున్నాయి.

పోలీసుల వేధింపులు మాకు కొత్తకాదు. నాన్న రహస్యజీవితంలోనికి వెళ్ళిపోయాక పోలీసుల టార్చర్‌ విపరీతంగా పెరిగిపోయింది. అర్ధరాత్రులూ, అపరాత్రులూ అని లేకుండా మా యింటిపైన దాడిచేసేవారు. అటువంటి సందర్భాల్లోనే అమ్మ ధైర్యం చూసి అంతా అవాక్కయ్యేవాళ్ళు. పోలీసులను లోనికి అనుమతించేవారు కాదు. అరెస్టు వారెంట్‌ అడిగేవారు. అది చూపించినా తెల్లవారే వరకూ ఇంట్లోకి పోలీసులను రానిచ్చేది కాదు. వచ్చే ముందు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలను కూడా బయటే పెట్టి రమ్మని ఆదేశించేది. లేదంటే వాళ్ల జేబుల్లోని ఆయుధాలు మా ఇంట్లో దొరికేవి. అందుకే అమ్మ అంత కఠినంగా వ్యవహరించేవారు.

నాన్నని చంపేసాక అంతా నిశ్శబ్దం...
1972 జూలై 16న అరెస్టు చేసి కలకత్తా లోని అలీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేసి జూలై 28న చంపేసారు. నాన్న భౌతిక కాయాన్ని తీసుకొచ్చిన ఘటన నాకింకా గుర్తు. ప్రాణంలేని ఆయన శరీరాన్ని చూసి కూడా ఈ పోలీసులు, పాలకులు భయభ్రాంతులకు గురయ్యారు. నిశ్శబ్దంగా కదులుతున్న మనుషుల మధ్యలోంచి పోలీసులు మమ్మల్ని మాత్రమే మా నాన్న భౌతిక కాయం దగ్గరికి తీసుకెళ్ళారు. అంత నిర్బంధంలోనూ ఎక్కణ్ణుంచో హోరుగాలి మోసుకొచ్చిన నినాదం గంభీరంగా నా చెవుల్లో మార్మోగుతోంది. ‘‘చారూబాబూ అమర్‌రహే’’ నినాదాలను మోసుకొచ్చిన గాలి సైతం గంభీరంగా కదులుతోంది అమ్మలాగే. కళ్ళనిండా నీరునింపుకొని జ్ఞాపకాల్లోంచి బయటకు రాలేకపోయారు అభిజిత్‌.

ఫ్రాంటియర్‌ పత్రిక సంపాదకుడు తిమిర్‌ బసు



భారత దేశ ఉద్యమ చరిత్రలో ‘ఫ్రాంటియర్‌’పత్రిక పాత్ర చిరస్థాయిగా  నిలిచి ఉంది. నక్సల్బరీ ఉద్యమ కాలం నుంచి ఆ పత్రికలో పనిచేసి, ప్రస్తుతం అదే పత్రికకు సంపాదకుడిగా ఉన్న తిమిర్‌బసును వెతుక్కుంటూ వెళ్ళాం. కలకత్తాలోని ఓల్డ్‌సిటీ ప్రాంతంలో ఉన్న 61, మట్‌లేన్‌లో యిప్పుడో ఇంకాసేపట్లోనో కూలడానికి సిద్ధంగా ఉన్నట్టున్న ఓ పురాతన భవనంలోని చిన్ని గది ఆ పత్రిక కార్యాలయం. ఫ్రాంటియర్‌ ఎడిటర్‌ తనను, తనలాంటి వారినెందరినో ఉత్తేజితం చేసిన నక్సల్బరీ ప్రభావాన్ని వివరిస్తూ మావోనినాదాన్ని పలవరించిన నాటి పశ్చిమబెంగాల్‌ పల్లెలను, పట్టణాలను ఆవిష్కరించారు. ‘‘గ్రామాలకు తరలిరండి’’ ఇది చైనా విప్లవోద్యమంలో మావో నినాదం. ఆ నినాదాన్ని నక్సల్బరీ అందిపుచ్చుకుంది. ‘‘బూర్జువా చదువులు మాకొద్దు’’ అనే చారూ నినాదం ఆనాడు భారతదేశ వ్యాప్తంగా ఎందరో మేథావులను, డాక్టర్లను, ఇంజనీర్లను వాళ్ళ చదువులను వదిలేసి నక్సల్బరీ ఉద్యమంలో మమేకమయ్యేలా చేసింది. భారత దేశం నలుమూలల నుంచి నవయువకులు పశ్చింబెంగాల్‌కి పరుగులు పెట్టారు. భూస్వామ్య విధానానికీ, జాగీర్దారీ విధానానికీ, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో వారు కీలక భూమిక పోషించారు.

సాంస్కృతికోద్యమ నాయకుడు కంచన్‌కుమార్‌



ఎనబైయేళ్ళు పైబడినా తొణకని ఆత్మవిశ్వాసంతో మావోయిజమే సరైనవిప్లవ మార్గమంటూ... సరిగ్గా నేటి మరో నక్సల్బరీ ఉద్యమ ఆవశ్యకతను అరగంట సేపు అనర్గళంగా వివరించారు కలకత్తాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ పరిసరాల్లో నివసిస్తోన్న తొలిసాంస్కృతికోద్యమ నాయకుడు కంచన్‌కుమార్‌. దాదాపు కలకత్తాలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి వందలాది మంది విద్యార్థులు నక్సల్బరీ రైతాంగ సాయుధ పోరాటానికి మద్దతుగా నిలిచారు. అలాగే ‘దేర్‌ ఈజ్‌ నో కన్‌స్ట్రక్షన్, వితౌట్‌ డిస్ట్రక్షన్‌’ 'పాతని ధ్వంసం చేయకుండా నూత్నంగా దేన్నీ నిర్మించలేం’ అనే మావో నినాదాన్ననుసరించి చైనా విప్లవంలో మాదిరిగానే పాత సంస్కృతికి చిహ్నలైన నాయకుల విగ్రహాలను కలకత్తాలో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టారు. కాలక్రమేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిర్బంధం వల్ల నక్సల్బరీలో ప్రారంభమైన నక్సలైట్‌ పోరాటం పశ్చిమబెంగాల్‌లో దీర్ఘకాలం కొనసాగకపోయినప్పటికీ దాని ప్రభావం అనేక ఉద్యమాల పైన, సాహితీ సాంస్కృతిక రంగాలమీద చివరకు సినీరంగంపైన కూడా గొప్ప ప్రభావాన్ని కలుగజేసిందని తొలి సాంస్కృతికోద్యమ నాయకుడు కంచన్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

దోపిడీ పద్ధతులు మారాయి కానీ లక్షణం మారలేదు.. అందుకే నక్సల్బరీ సజీవం..

నాటి నక్సల్బరీ తరం నేడేం కోరుకుంటోందో శాంతిముండా ఇలా చెపుతున్నారు
.

"సాయుధ పోరాట చైతన్యం ప్రజల మనసుల్లో నుంచి చెరిగిపోలేదు. అయితే దొపిడీ పద్ధతులు, విధానాలు మారాయిగానీ దోపిడీ లక్షణం మారలేదు. పాత దోపిడీవిధానాల స్థానంలో కొత్తవిధానాలు వచ్చాయి. అప్పుడు జోతేదార్ల ఆక్రమణలో ఉన్న భూములను రైతాంగం పోరాడి సాధించుకున్నది. కానీ యిప్పడవే భూములను విమానాశ్రయాలూ, టీ తోటలూ, ఇతరత్రా అభివృద్ధి పేరుతో ఆక్రమించుకుంటున్నారు. దీంతో వేలాది మంది భూమినుంచి వెలివేయబడుతున్నారు.  నిరాశ్రయులుగా మారుతున్నారు. నక్సల్బరీ చూపిన పోరాట మార్గం ఇంకా సజీవంగా ఇక్కడి ప్రజల హృదయాల్లో నాటుకొని ఉంది. అందుకే నక్సల్బరీకి మరణం లేదు. అది సజీవంగా ఉంది. ఉంటుంది. దోపిడీ ఉన్నంత కాలం ఆ పోరాట స్ఫూర్తి ఇక్కడి ప్రజలనే కాదు, యావత్‌ దేశ ప్రజానీకాన్ని ముందుకు నడిపిస్తుంటుంది. "

అరుణ అత్తలూరి
ప్రిన్సిపల్ కరస్పాండెంట్
సాక్షి దినపత్రిక

గమనిక: సాక్షి దినపత్రిక ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అత్తలూరి అరుణ గారు నక్సల్బరీ ఉద్యమానికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా స్వయంగా పశ్చిమ బెంగాల్ లోని నక్సల్బరీ పరిసర ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉద్యమ జ్ఞాపకాలుగా మిగిలివున్న అలనాటి ప్రముఖులను కలిసి చేసిన ఇంటర్వ్యూ పాఠం ఇది. ఈ రచన సంక్షిప్త పాఠం సాక్షి దినపత్రిక 25-05-2017 నాటి సంపాదకీయ పేజీలో "ఐదు దశాబ్దాల మేఘగర్జన" పేరిట ప్రధాన వ్యాసంగా అచ్చయింది. ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ ఈ బ్లాగులో ప్రచురించడానికి అవకాశం ఇచ్చిన అరుణ గారికి కృతజ్ఞతలు.



భారత ప్రజా రాజకీయాలలో నక్సల్బరీ నేపథ్య చరిత్రను మరోసారి విస్తృత ప్రజానీికానికి పరిచయం చేస్తూ ఈ వ్యాసాన్ని ప్రచురించిన సాక్షి పత్రికకు ధన్యవాదాలు.


ఐదు దశాబ్దాల మేఘగర్జన


http://www.sakshi.com/news/opinion/five-decades-of-naksalbari-478624


Saturday, March 18, 2017

ప్రజాసాహితి – 400వ సంచిక, 400 సంచికల సి.డి. ల ఆవిష్కరణ


‘భారతి’ తర్వాత తెలుగు సాహిత్య చరిత్రలో 400కు పైగా సంచికలను పూర్తి చేసుకున్న మాసపత్రిక ‘ప్రజాసాహితి’. నాల్గవ వంతుకు పైగా అంటే 100కు పైగా సంచికలను ప్రత్యేక, విశిష్ట సంచికలుగా వెలువరించటం ద్వారా తన సాంస్కృతికోద్యమ కర్తవ్య దీక్షను ప్రజాసాహితి ప్రదర్శించింది. సరాసరిన ప్రతి నూరు సంచికలలో 11 దాకా ప్రత్యేక సంచికలున్నాయి.

ప్రజాసాహితి ప్రత్యేక సంచికలు అంటే ఎక్కువ పేజీలతో, సాధారణ సంచిక కంటే ఎక్కువ పరిమాణంతో, వెలువరించే పద్ధతి కాదు. ఒక ప్రత్యేక అంశం పైన – ప్రధానంగా సాహిత్యకారులపై, సామాజిక సందర్భౌచిత్యం గల అంశాలపై ప్రత్యేక దృష్టితో సంచికలు తెచ్చారు. ఉదాహరణకు 1980 ఆగస్టులో ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు చనిపోయిన వెంటనే 1980 అక్టోబరులో (37వ సంచిక) ఆయనపై ప్రత్యేకంగా ఒక సంచికను తెచ్చారు. 1995 సెప్టెంబరు 28న గుర్రం జాషువా గారి శత జయంతి సందర్భంగా కూడా ప్రజాసాహితి ఆయనపై ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది.

మతతత్త్వం భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు 1991 నాటి జనవరి సంచికనూ, 1992 నాటి డిసెంబరు సంచికనూ – (బాబ్రీ మసీదు కూల్చివేసిన వెంటనే) ప్రచురించింది. అలాగే 2005లో ‘గ్రామీణ జీవన సంక్షోభం - రైతాంగ ఉద్యమం’ అనే అంశం పైనా, మహాకవి గురజాడ 150వ జయంతి సందర్భంగా, 2012లో ఆయనపై రెండవసారి ప్రత్యేక సంచికను తెచ్చింది. అలా గడిచిన 40 సంవత్సరాలలో 45కు పైగా ప్రత్యేక సంచికలను విడుదల చేసిన ఘన చరిత్ర ప్రజాసాహితిది.

ప్రజాసాహితి 100-200-రజితోత్సవ సంచిక–300వ సంచిక - అన్నీ ప్రత్యేక సంచికలే. ఆ క్రమంలో యిప్పుడు 400వ సంచికను “25 ఏళ్ల ప్రపంచీకరణ:సాoస్కృతిక విధ్వంసం:సాహిత్యోద్యమం” అనే అంశంపై ప్రత్యేక సంచికగా విడుదల చేసారు.

మోహన్ గీసిన ముఖ చిత్రం – ప్రపంచీకరణ సృష్టించిన సాంస్కృతిక విధ్వంసాన్ని “ఉక్కు డేగ పై ధిక్కార స్వరంతో శాంతి పావురపు సృజనగా” సాగుతున్న లాంగ్ మార్చ్ అంటూ ఈ 400వ సంచిక ప్రత్యేకతను కనుల ముందు దృశ్యమానం చేస్తుంది. 156 పేజీల సంచికలో 6 కథలూ, 17వ్యాసాలూ, 7గురు ప్రముఖుల సందేశాలూ, 17కవితలూ, 2 పాటలూ, 4 సమీక్షా వ్యాసాలూ..తో పాటు సాధారణ సంచికల ధారావాహికలను కొనసాగిస్తూ ఈ సంచిక వెలువడింది. నేతాజీ చరిత్రని ఆవాహన చేసుకుంటూ పాపినేని శివశంకర్ రాసిన కవిత ఒక విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. 25 ఏళ్ల సామ్రాజ్యవాద ప్రపంచీకరణాన్ని భారత ప్రజలపై సాగుతున్న విధ్వంసక సాంస్కృతిక దాడిగా, కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక భూస్వామ్య-సామ్రాజ్యవాద సంస్కృతుల విస్ఫోటనంగా ప్రజాసాహితి పరిగణిస్తూ వస్తోంది. అందుకే దాని ఆర్ధిక-రాజకీయ స్వభావాలను పాఠకులకు అర్ధం చేయిస్తూ ఏ ఏ విధంగా సాంస్కృతిక రూపాలలో అది వ్యక్తమవుతూ వస్తోందో విశ్లేషించే వ్యాసాలూ యిందులో చెప్పుకో దగినన్ని ఉన్నాయి.

తెలుగు సినిమా రంగంలో, భూస్వామ్య వారసత్వ సంస్కృతిని బలోపేతం చేస్తున్న పెట్టుబడిని బహిర్గతం చేస్తున్న ఆదిత్యనాధ్ వ్యాసం చాలా మంది ఎరుగున్న వాస్తవాల వెనుక ఎరగని మన సామాజిక వ్యవస్థ లక్షణాన్ని  పట్టి చూపిస్తుంది. 25 ఏళ్ల క్రితమే సామ్రాజ్యవాద ప్రపంచీకరణపై కూచిపూడి యక్షగాన ప్రక్రియలో ఎక్కుపెట్టిన ‘అప్పులభారతం’ గురించి వారాల కృష్ణ మూర్తి వ్యాసం ద్వారా పాఠకులు తెలుసుకుంటారు. విద్యా సాగర్ కావ్యం “దిష్టిబొమ్మను” (1995) ఇటీవలి ప్రజాసాహితి పునర్ముద్రించింది. దాన్ని మేడిపల్లి ఈ సంచికలో విశ్లేషించారు. భాషపై, బాల్యంపై, విద్యార్ధి-యువజనులపై, మహిళలపై, మత మౌఢ్యం రూపంలో ప్రపంచీకరణo ఎలా విధ్వంసక పాత్ర నిర్వహిస్తుందో తెలిపే వ్యాసాలిందులో ఉన్నాయి.

“రాజ్యం-రచయితలూ” అన్న సి.హెచ్. మధు వ్యాసం నేటి రచయితలందర్నీ తట్టి లేపుతున్నట్లుగా, ఆలోచించమన్నట్లుగా, మీరెటు వైపూ అని నిలదీస్తున్నట్లుగా వుంటూ – ప్రజల పక్షాన నిలవమని ఆదేశిస్తున్నట్లు సాగుతుంది. సాధారణ సినీ ప్రేక్షకుల దృష్టికి రాని అనేక విశిష్ట డాక్యుమెంటరీలను కోల్‌కతా బాలాజీ తెలుగు పాఠకులకు పరిచయం చేసారు.

గడిచిన 25 ఏళ్లలో ప్రజాసాహితిలో వెలువడిన కొన్ని కథలలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వ్యక్తీకరణల గురించి డా.శాంతి కుమార్ రాస్తే, మహిళల జీవితాలను ప్రభావితం గావించిన కొన్ని కథలను వి. ప్రతిమ విశ్లేషించారు. “ప్రపంచీకరణ-సాహిత్య సాంస్కృతికోద్యమాలు” పై ఎ.కె. ప్రభాకర్ వ్యాసం, “రాజకీయ వ్యవస్థ – దాని సాంస్కృతిక పరిణామాలు” పై సూర్యసాగర్ వ్యాసం, “25 ఏళ్ల ఆర్ధిక పరిణామాలు”పై శశికుమార్ వ్యాసం, గ్రామీణ దళిత, బడుగు వర్గాల జీవితాలను గెంటివేతలకు (విస్థాపన అంటున్నారు) గురి చేస్తున్న విధానాల పై డా. తోట జ్యోతి రాణి వ్యాసాన్ని ఈ సంచికలో చూడగలుగుతాం.

పాపినేని శివశంకర్ రూపొందించిన కొత్త భావనల్ని విశ్లేషించిన కొత్తపల్లి రవిబాబు, ఒక దళితుని ఆత్మ కథను వివరంగా పరిచయం చేసిన జి.వి.భద్రం, నూరేళ్ళనాటి సోవియట్ విప్లవ ప్రభావంతో వెలువడిన భారతీయ కవిత్వం పై రాచపాళెం, దంగల్ సినిమా పై వెన్నెల చేసిన సమీక్ష మొదలైన వ్యాసాలన్నీ కూడా ఈ సంచికలో చూడవచ్చు. గతంలో 2 ప్రత్యేక సంచికలను పునర్ముద్రించిన ఘనత ‘జనసాహితి’ సంస్థకుంది. 1981 నాటి తెలంగాణా పోరాట సాహిత్య సంచిక (41)నూ, ప్రజాకళారూపాల ప్రత్యేక సంచిక (1985 జూన్)ను తిరిగి ముద్రించారు. నిజానికి అలాంటి ప్రత్యేక సంచికలు ఇంకా – ఉదా|| గరికపాటి రాజారావ్ సంచిక, ‘గోర్కి నవల అమ్మ’ పై సంచిక – పునర్ముద్రణ కావాల్సి వున్నాయి. ఇప్పుడు 400 సంచికలనూ సి.డి.ల రూపంలో కూడా విడుదల చేస్తున్నట్లు జనసాహితి ప్రకటించింది. సాహిత్యాభిమానులకూ, సాహిత్య-సామాజిక చరిత్ర పరిశోధకులకూ ఓపిక వున్నంత మేర ఆరగించగలిగే విందును అందుకోవటమే తరువాయి.

(ఆదివారం (19-03-2017) విజయవాడ, హైదరాబాద్, ఒంగోలు, అనకాపల్లి, శ్రీకాకుళంలో ప్రజాసాహితి 400వ సంచిక, 400 సంచికల సి.డి. ల ఆవిష్కరణ సభల సందర్భంగా)  

మరిన్ని వివరాలకు

మంజరి lakshmi
23-22-123, శివాలయం స్ట్రీట్,
సత్యన్నారాయణ పురం, విజయవాడ:520 011
ఫోన్ నెం.:086 2535884
lakshmi manjari <manjari.lakshmi57@gmail.com>


గమనిక: 
ఇప్పటికే ప్రగతిశీల సాహిత్యానికి పెనుగొమ్మగా నిలిచిన సృజన పాతికేళ్ల సంచికలను, అరుణతార 35 ఏళ్ల సంచికలను డీవీడీరూపంలో అందించిన సృజన సాహితీ మిత్రులు, అరుణతార నిర్వాహకులు నాలుగు దశాబ్దాల తెలుగు ఉద్యమ సాహిత్య, సాంస్కృతిక మేధోకృషికి సంబంధించిన చరిత్రను తెలుగు పాఠకులకు శాశ్వత ప్రాతిపదికన అందించి ఎనలేని సహాయం అందించారు. ఇప్పుడు ప్రజాసాహితి మాసపత్రిక 40 సంవత్సరాల సంచికలను రెండు డీవీడీల రూపంలో అందిస్తున్న ప్రజాసాహితి నిర్వాహకులు జ్ఞానాన్ని పాఠకుడికి ముంగిట్లోకి తీసుకువస్తున్న నిరుపమాన ప్రక్రియ క్రమానికి అద్భుతమైన తోడ్పాటునిస్తున్నారు. హైదరాబాద్‌ సాహిత్య మిత్రులు వీలయితే రేపు సాయంత్రం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగనున్న ప్రజాసాహితి 40 ఏళ్ల సంచికల డీవీడీల ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాగలరు.

Thursday, March 2, 2017

అలాంటి వ్యక్తి ఇక లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు: సునయన హృదయవేదన


ప్రేమను పంచే పోరాటంలో ప్రాణాలర్పించి గెలిచావు శ్రీనివాస్: సునయన అత్మవేదన

బరువెక్కిన హృదయంతో నేనీ నాలుగు ముక్కలు రాస్తున్నాను. గత బుధవారం, ఫిబ్రవరి 22, 2017 నాకో కాళరాత్రి. ఆ రోజు నేను నా భర్తను, ఆత్మబంధువును, మిత్రుడిని, అత్యంత నమ్మకస్తుడిని కోల్పోయాను. అతనో స్ఫూర్తి ప్రదాత. సహాయకారి. ఒక్క నాకే కాదు... తనని ఎరిగిన వారందరికీ. ఎవరు ఎదురైనా... ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. తనకంటే పెద్దవారి పట్ల ఇంకా గౌరవభావంతో మెసిలేవాడు. 2006 ఆగష్టులో కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత ‘ఆర్కుట్‌’  ద్వారా పలకరించుకునే వాళ్లం.

తొలి పరిచయంతోనే ఇద్దరమూ ఒకరినొకరం ఇష్టపడ్డాం. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో నేనే చిన్నదాన్ని. చాలా గారాభంగా, స్వేచ్ఛగా పెరిగాను. అమెరికాకు వెళ్లి చదువుకోవాలనే నా కలను నిజం చేసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని నాకు శ్రీనివాసే ఇచ్చాడు. నేనీ రోజు ఇలా స్వత్రంత్య భావాలు కలిగిన వ్యక్తిగా, సొంత కాళ్లపై నిలబడగల, ధైర్యమున్న మహిళగా ఎదగడానికి అమెరికాలో చదువు దోహదపడింది. గత ఏడాది మే నెల నుంచే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం రావడంలో శ్రీనివాస్‌ది ముఖ్యపాత్ర. ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడు. నిరాశపడ్డప్పుడల్లా వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాడు. ఎందుకంటే నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ ఉద్యోగ జీవితం మొదలుపెట్టాను.

విమానయాన రంగంలో నిరంతరం కొత్త ఆవిష్కరణల కోసం తపించేవాడు. రాక్‌వెల్‌ కోలిన్స్‌ కంపెనీలో చేరడం ద్వారా శ్రీనివాస్‌ తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌పై పనిచేసేవాడు. ప్రాథమిక ఫ్లైట్‌ కంట్రోల్‌ కంప్యూటర్‌ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. రాత్రి భోజనం కోసం ఇంటికి వచ్చి, అది కాగానే ఆఫీసుకు వెళ్లిపోయిన రోజులు చాలానే ఉన్నాయి. అలా వెళ్లి మళ్లీ ఏ రెండింటికో, మూడింటికో తిరిగివచ్చేవాడు. రాక్‌వెల్‌లో ఉద్యోగంతో చాలా సంతోషంగా ఉండేవాడు. అయోవాలోని చిన్న పట్టణం సెడార్‌ రాపిడ్స్‌లో ఉండటానికి కూడా ఇష్టపడ్డాడు. అయితే నేను ఉద్యోగం సంపాదించడానికి, నా కలలను సాకారం చేసుకోవడానికి పెద్ద పట్టణానికి మారాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. మరో ఆలోచన లేకుండా వెంటనే కాన్సస్‌ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. ఎన్నో కలలతో కాన్సస్‌లో అడుగుపెట్టాం. సొంతింటి కలను నేరవేర్చుకున్నాం. ఈ ఇంటికి శ్రీనివాస్‌ స్వయంగా రంగులేశాడు... గ్యారేజీకి తలుపు బిగించాడు. ఇంటికి సంబంధించిన ఏ పనినైనా అతనెంతో ఇష్టపడి చేసేవాడు. అందులో ఎంతో సంతోషం పొందేవాడు. మా కోసం, మాకు పుట్టబోయే బిడ్డల కోసం అతను కట్టిన ఇల్లు ఇది. మాకంటూ చిన్ని కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి వేసిన తొలి అడుగు.

దురదృష్టమేమింటే... ఇప్పుడీ కల చెదిరిపోయింది. మా ఆశలు, ఆకాంక్షలు, కలలు అన్నీ చెదిరిపోయాయి... ఒకే ఒక వ్యక్తి మూలంగా. తన చర్యవల్ల బాధిత కుటుంబంపై పడే ప్రభావం ఏమిటనేది అతను ఆలోచించని మూలంగా. ఆ రోజు రాత్రి పోలీసులు మా ఇంటి తలుపులు తట్టి... ఎవరో ఆగంతకుడు తుపాకీతో నా భర్త ప్రాణాలు తీశాడని చెబుతుంటే నేను నమ్మలేకపోయా. ‘మీరు చెబుతున్నది వాస్తవమేనా మీరు శ్రీనివాస్‌ను చూశారా తనను గుర్తుపట్టడానికి నాకేదైనా ఫోటోను చూపించగలరా మీరు మాట్లాడుతున్నది ఆరు అడుగుల రెండు అంగుళాలు ఉండే వ్యక్తి గురించేనా అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నా. అన్నింటికీ పోలీసులు తలూపుతూ... ‘అవును’ అనే సమాధానం ఇచ్చారు. వెంటనే డల్లాస్‌లో ఉంటున్న శ్రీనివాస్‌ తమ్ముడికి ఫోన్‌ చేశా. నమ్మలేదు... నేనేదో జోక్‌ చేస్తున్నానని అనుకున్నాడతను. తమ ఆప్త మిత్రుడిని, అత్యంత సన్నిహితుడికి కడసారి వీడ్కోలు పలకడానికి అయోవా, మిన్నెసోటా, సెయింట్‌ లూయిస్, డెన్వర్, కాలిఫోర్నియా, న్యూజెర్సీల నుంచి మిత్రులు వచ్చారు. న్యూయార్క్, న్యూజెర్సీలో ఉండే అతని ఆంటీలు వచ్చారు. ఈ మార్చి తొమ్మిదికి తను 33వ ఏట అడుగుపెట్టేవాడు. తన కజిన్‌ ఎంగేజ్‌మెంట్‌ కోసం న్యూజెర్సీకి విమానంలో వెళ్లొద్దామని మేము ప్లాన్‌ చేసుకున్నాం. ఈ ట్రిప్‌ కొరకు వీకెండ్‌లో షాపింగ్‌ చేయాలని కూడా అనుకున్నాం. కానీ జరిగింది మరొకటి. నేను భారత్‌కు ప్రయాణమయ్యాను. శవపేటికలో తనని తీసుకొని.

ఆరేళ్ల స్నేహం తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. అదంత తేలికగా ఏమీ జరగలేదు. వాళ్ల తల్లిదండ్రులతో పాటు మా అమ్మానాన్నలను కూడా అతనే ఒప్పించాల్సి వచ్చింది. మీ ప్రియమైన కూతురిని బాగా చూసుకోగలనని, తగినవాడినని చెప్పి పెళ్లికి ఒప్పించడానికి పలుమారు మా కుటుంబీకులను కలిశాడు. అడిగిన ప్రశ్నలన్నింటికీ ముఖంపై చిరునవ్వుతో సమాధానాలిచ్చాడు. ఆయన సమ్మోహన శక్తి ఎలాంటిదంటే... అనతికాలంలోనే మా కుటుంబంలో అందరికీ అత్యంత ఆప్తుడైపోయాడు. అలాంటి వ్యక్తి ఇక లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. చిన్న చిన్న వాటిల్లోనే సంతోషం పొందేవాడు. టీవీ చూడటం ఆయనకు అత్యంత ఇష్టమైన కాలక్షేపం. కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వ్యక్తి. ఇంట్లో వండినవి తినడమే ఆయనకిష్టం. ప్రతిరోజు రాత్రి... మరుసటి రోజు లంచ్‌కు మాకిద్దరికీ బాక్స్‌లను సిద్ధం చేసేదాన్ని. బాక్స్‌ సర్దుకోవడం అస్సలు ఇష్టముండేది కాదతనికి. ఎందుకలా... అని అడిగితే సరదాగా ఉండే వివరణలు ఇచ్చేవాడు. నా లంచ్‌ బాక్స్‌ నేనే సర్దుకుంటే... ఏ తినబోతున్నానో ముందే తెలుస్తుంది. అదే నువ్వు ప్యాక్‌ చేశావనుకో... ఈరోజు లంచ్‌లో ఏముందో అనే ఆసక్తి నాకుంటుంది అనేవాడు. ఆప్యాయంగా భోజనం పెట్టిన వారినీ ‘అన్నదాతా సుఖీభవ’ అని మనసారా దీవించేవాడు. చాలామంది మిత్రులకు శ్రీనివాస్‌ నుంచే ఈ అలవాటు వచ్చింది. లంచ్‌లో ఆర్నబ్‌ గోస్వామిని ఎంజాయ్‌ చేసేవాడు. మళ్లీ ఎప్పుడు టీవీ తెరపై కనిపిస్తాడా అని ఎదురుచూస్తుండే వాడు.

పిల్లలంటే తనకెంతో ఇష్టం. పిల్లలను కనాలనే ఆలోచనతో ఉన్నాం. కొన్ని వారాల కిందటే డాక్టర్‌ను కలిశాం కూడా. ‘నానీ (తను నన్నలా పిలేచేవాడు)... కృత్రిమ గర్భధారణకు వెళ్లాల్సి వస్తే... దానికోసం డబ్బు దాచాలిరా’  అని అన్నాడు. తను నాతో పంచుకొన్న కొన్ని చివరి ఆలోచనల్లో ఇదొకటి. మా ఈ కల చెదిరిపోయిందనేది ఇప్పుడిప్పుడే నాకు జీర్ణమవుతోంది... అందుకే రాస్తున్నాను. మాకో బిడ్డ ఉంటే... తనలోనైనా శ్రీనివాస్‌ను చూసుకునే దాన్ని. శ్రీనులా పెంచేదాన్ని. చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై ఆసక్తి ఉండేది. రోజూ టీవీలో వార్తలు చూడటం, పత్రికలు చదవడం చేసేవాడు. భారత్‌ గురించి, నరేంద్ర మోదీ గారి గురించి గర్వంగా ఫీలయ్యేవాడు. దేశానికి సమర్థ నాయకత్వం లభించిందనే భావనతో ఉండేవాడు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ విదేశాల్లో ఉన్న భారతీయులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించే తీరు తనకు నచ్చేది. అలా సహాయం పొందే వాళ్లలో తాను ఒకడినవుతానని ఊహించి ఉండడు. కష్టకాలంలో మాకు సహాయపడ్డందుకు మరోసారి ధన్యవాదాలు మేడమ్‌. మిమ్మల్ని, మోదీ గారిని కలిసి మా ఇరువురి తరఫున కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను.

ఇమ్మిగ్రేషన్‌ విధానం, చట్టాల గురించి ఆందోళన చెందేవాడు. ఇంటర్నెట్‌లో ఈ అంశాలను చాలా ఆసక్తితో చదివేవాడు. అమెరికా శాశ్వత నివాస కార్డు కోసం దరఖాస్తు చేసి ఏళ్లు గడిచిపోతోంది... ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో అని అప్పుడప్పుడు అనేవాడు. హెచ్‌–1బీ వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుకల్పించే హెచ్‌4 ఈఏడీ రూల్‌ చట్టసభల ఆమోదం పొందినపుడు ఎంత సంతోషించాడో. ‘నానీ... నువ్వు ఇక ఉద్యోగం చేయవచ్చురా. మనకు డబ్బు అవసరం ఉందని కాదు. నువ్వు నీ కలలను సాకారం చేసుకునేందుకు... నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయడానికి’ అని అన్నాడు. తక్కువ ఆదాయంతో ముగ్గురు మగపిల్లలను పెంచడానికి వాళ్ల తండ్రి బాగా కష్టపడ్డాడని రోజుకు ఒకసారైనా గుర్తుకు చేసుకునేవాడు. తల్లిదండ్రులకు ఎంతో చేయాల్సి ఉందనేవాడు.

‘నేనొకటి కచ్చితంగా చెప్పగలను శ్రీను... నువ్వు మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదిగావు. కానీ నువ్విలా మమ్నల్ని విడిచి వెళ్లకుండా ఉండాల్సింది’. ముగ్గురు పిల్లల్లో శ్రీను రెండోవాడు. తనకు తమ్ముడంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ముగ్గురూ బాగా అల్లరి చేసేవారంట. ఇదివరకు ప్రెస్‌మీట్లో చెప్పినట్లుగా... ఎవరైనా హత్యకు గురయ్యారనే వార్త విన్నపుడల్లా ఇక్కడి నుంచి వెళ్లిపోదామా అని అడిగేదాన్ని. ‘మన ఆలోచనలు మంచిగా ఉంటే, మనం సత్ప్రవర్తనతో నడుచుకుంటే... మనకు మంచే జరుగుతుందని, మనకేం కాదు అని ప్రతిసారీ ధైర్యం చెప్పేవాడు. నన్ను గట్టిగా హత్తుకొని పడుకొనేవాడు... శ్రీను ఆ ఆత్మీయ ఆలింగనం, నేనున్నాననే భరోసా... నాకిప్పుడు లేవు. నాకిక మునుపటిలా నిద్ర రాదేమో! ఎలాంటి ఆందోళన, భయం లేకుండా నేను హాయిగా నిద్రపోయేది ఒక్క నీ ఎదపైనే.

కాన్సస్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఎంతోమంది నన్ను గుర్తుపట్టారు. ఆలింగనం చేసుకొని ఓదార్చారు. నా జీవిత పరమార్థాన్నే మార్చేశావని ఓ డెర్మటాలజిస్టు అంది. ప్రేమను పంచే పోరాటంలో అది తొలి విజయమేమో. నీ గురించి... చుట్టుపక్కల ఉన్న వారికి నువ్వు పంచిన ప్రేమ గురించి ఓ పుస్తకం రాసినా సరిపోదేమో. ఒకే సాయంత్రంతో అంతా మారిపోయింది. భార్య నుంచి వితంతువును అయిపోయాను. ఈ నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. శ్రీను... నా ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... ఎప్పటికీ నీ ఆశలను, ఆశయాలను ఓడిపోనివ్వను.

ఐ లవ్‌ యూ, నువ్వు ఎప్పటికీ నా వాడివే.

టీ తాగడానికి ఇంటికి రమ్మని పిలిచినపుడు నీవు వచ్చుంటే బాగుండని అనుకుంటున్నాను. నాలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి. వాటికి నువ్వు జవాబివ్వాలని కోరుకుంటున్నాను. అవతలి ప్రపంచంలో నీవున్న చోటికి నేను వచ్చినప్పుడే నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు.

గార్మిన్‌ సీఈఓవోకు, శ్రీను సహచరులకు, ఓలేత్‌ నగర మేయర్‌కు, కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను పనిచేస్తున్న ఇన్‌టచ్‌ సొల్యూషన్స్‌ సీఈవో ఫ్రాంక్‌కు ధన్యవాదాలు. ఎంతకాలమైనా సెలవు తీసుకోమని, ఎప్పుడొచ్చినా... నా ఉద్యోగం నాకు ఉంటుందని చెప్పారాయన. నేను అమెరికాలో కెరీర్‌ను నిర్మించుకోవాలనేది నా శ్రీను కల. దానిని నెరవేర్చడానికి నేను అమెరికా తిరిగి రావాలి. నా భర్తను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి కాల్పుల్లో గాయపడ్డ ఇయాన్‌ గ్రిలాట్‌ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నాను. ఓలేత్‌కు తిరిగివచ్చాక మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్నాను. గ్రిలాట్‌ సాటి మనిషిని కాపాడటానికి మీరు చేసిన ప్రయత్నం, మీరు ప్రదర్శించిన మానవత్వం... ప్రేమపై, ప్రేమను పంచడంపై నాలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచాయి. ట్వీట్ల ద్వారా మద్దతు పలికిన సత్య నాదెళ్ల, కమలా హారిస్‌లకు కృతజ్ఞతలు. మార్క్‌ జుకెర్‌బర్గ్, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ లాంటి వారందరికీ నా విన్నపం ఒకటే... మానవ హక్కులకు మీ మద్దతును వీలైనంతగా జనంలోకి తీసుకెళ్లండి. ద్వేషాన్ని ఆపాలి... ప్రేమను వ్యాపింపజేయాలి. ఈ రోజు గార్మిన్‌ ఉద్యోగికి జరిగింది... రేపు మీ ఉద్యోగుల్లో ఒకరు కావొచ్చు. మా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను.

శ్రీనివాస్‌ పార్థివదేహం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరేలా చూసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అమితాబచ్చన్‌ సర్, షారూక్‌ ఖాన్‌ సర్‌... మేము మీకు వీరాభిమానులం. ప్రేమను పంచాలనే గట్టి సందేశాన్ని అందరికీ చేరవేయడానికి నాకు మీ మద్దతు కావాలి. నేను అదే ప్రశ్న మళ్లీ అడుగుతాను. చర్మం రంగును బట్టి ఒక మనిషి మంచివాడో, చెడ్డవాడో ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు కొంతకాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుంది. కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారు. ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి నిరంతర పోరాటం జరగాలి. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రతి వలసదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్న... మేమీ ప్రాంతానికి చెందిన వాళ్లమేనా? చివరగా దీనికి సమాధానం కావాలి. ఇది మేము కలలు గన్న దేశమేనా? పిల్లలు, కుటుంబంతో కలిసి నివసించడానికి ఇది సురక్షితమేనా

– సునయన దుమాలా
అమెరికాలోని కాన్సస్‌ రాష్ట్రంలో ఫిబ్రవరి 22న జరిగిన ద్వేషపూరిత దాడిలో ప్రాణాలు కోల్పోయిన కూచిబొట్ల శ్రీనివాస్‌ అర్ధాంగి.
(28–02–2017లో తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో చేసిన పోస్ట్‌)
https://www.facebook.com/sunayana.dumala/posts/1254788961284812


సునయన రాసిన ఇంగ్లీషు పాఠానికి తెలుగులో అన్ని పత్రికలూ ఇప్పటికే తమ స్పేస్ పరిధుల్లో పూర్తిగానూ, సంక్షిప్తంగానూ అనువాదం చేసి ప్రచురించాయి. ఇక్కడ పొందుపర్చిన అనువాదం వీలైనంత సంపూర్ణంగా ఉంది. (పూర్తిగా అని కాదు).

పూర్తి పాఠం చూడాలంటే పైన పొందుపర్చిన ఆమె ఫేస్ బుక్ తొలి పోస్టు లింకును చూడండి. సాంత్వనగా కాస్త సానుభూతి కూడా తెలిపితే మరీ మంచిది

https://www.facebook.com/sunayana.dumala/posts/1254788961284812


ప్రజల మనసుల్లో ద్వేషాన్ని రూపుమాపేందుకు ఎంత పోరాటం చేయాలి: సునయన ప్రశ్న

హైదరాబాద్, గురువారం, 2 మార్చి 2017 (03:45 IST)
చర్మం రంగును బట్టి ఒక మనిషి మంచివాడో, చెడ్డవాడో ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినపుడు కొంతకాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుంది. కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారు. ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి నిరంతర పోరాటం జరగాలి. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రతి వలసదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్న... మేమీ ప్రాంతానికి చెందిన వాళ్లమేనా? చివరగా దీనికి సమాధానం కావాలి. ఇది మేము కలలు గన్న దేశమేనా? పిల్లలు, కుటుంబంతో కలిసి నివసించడానికి ఇది సురక్షితమేనా
ఓ కాళరాత్రి అమెరికాలో జాతి వివక్షా ఉన్మాద చేష్ట్య కారణంగా తన జీవన సహచరుడిని పోగొట్టుకున్న సునయన యావత్ ప్రపంచానికి వినిపిస్తున్న ఇది. తన భర్తను బలిగొన్న ఘటనల వంటివి జరిగినప్పుడు కొంత కాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుందనీ, కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారనీ.. కానీ ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి ఎంత పోరాటం జరగాలి అని ప్రశ్నిస్తున్నారామె. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వాలు ఏం చేయబోతాయి అని నిలదీస్తున్నారామె.

ఒకే ఒక వ్యక్తి మూలంగా. తన చర్యవల్ల బాధిత కుటుంబంపై పడే ప్రభావం ఏమిటనేది అతను ఆలోచించని మూలంగా ఒకే సాయంత్రంతో అంతా మారిపోయింది. మా ఆశలు, ఆకాంక్షలు, కలలు అన్నీ చెదిరిపోయాయి...  భార్య నుంచి వితంతువును అయిపోయాను. ఈ నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. శ్రీను... నీ ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియటం లేదని విలపిస్తున్న సునయన వ్యక్తిగత జీవితంలో తన ప్రమేయం లేకున్నప్పటికీ ఓడిపోయిన నిస్సహాయ క్షణాల్లో కూడా ప్రపంచాన్ని శపించలేదు. తన కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని కోరుకుంటోందామె.

బండగుండెల ట్రంప్ జాతి వివక్షకు ఇస్తున్న కొత్త నిర్వచనం సాక్షిగా అమరికాలో పెరిగిపోతున్న ఉన్మాదాన్ని సవాలు చేస్తూనే తన భర్త ప్రాణాలు కాపాడటానికి ప్రాణం అడ్డువేసిన సాటి అమెరికన్ పౌరుడు ఇయాన్ గ్రిలాట్ ప్రేమను పంచడంపై తనలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతున్నాడని కృతజ్ఞతలు చెబుతున్నారు సునయన. నా భర్తను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి కాల్పుల్లో గాయపడ్డ ఇయాన్‌ గ్రిలాట్‌ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నాను. ఓలేత్‌కు తిరిగివచ్చాక మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్నాను. గ్రిలాట్‌.. సాటి మనిషిని కాపాడటానికి మీరు చేసిన ప్రయత్నం, మీరు ప్రదర్శించిన మానవత్వం... ప్రేమపై, ప్రేమను పంచడంపై నాలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచాయి.
ట్వీట్ల ద్వారా మద్దతు పలికిన సత్య నాదెళ్ల, కమలా హారిస్‌లకు కృతజ్ఞతలు చెబుతూనే ప్రపంచ సాంకేతిక దిగ్గజ సంస్థల సీఈఓలను ద్వేషాన్ని ఆపి ప్రేమను వ్యాపింపజేసే మృదు సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లవలసిందిగా ఆమె అభ్యర్థిస్తున్నారు.

"మార్క్‌ జుకెర్‌బర్గ్, సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ లాంటి వారందరికీ నా విన్నపం ఒకటే... మానవ హక్కులకు మీ మద్దతును వీలైనంతగా జనంలోకి తీసుకెళ్లండి. ద్వేషాన్ని ఆపాలి... ప్రేమను వ్యాపింపజేయాలి. ఈ రోజు గార్మిన్‌ ఉద్యోగికి జరిగింది... రేపు మీ ఉద్యోగుల్లో ఒకరు కావొచ్చు. మా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను."

జీవనలత ఒక్కసారిగా కళ్లముందే వాడిపోయిన భయవిహ్వల క్షణంలోనూ గుండె దిటవు  చేసుకుని తన జీవన సహచరుడు శ్రీనివాస్ ఆకాంక్ష మేరకు అమెరికాలోనే కెరీర్ నిర్మించుకోవడానికి తప్పకుండా ఆ దేశానిని మళ్లీ వెళతానని సునయన చేబుతున్నారు. శ్రీను... నీ ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... ఎప్పటికీ నీ ఆశలను, ఆశయాలను ఓడిపోనివ్వను అంటూ శపథం చేస్తున్నారు.
అమెరికాలోనే కాదు... భారత్‌తో సహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెరిగిపోతున్న విద్వేష భావనలను, వాటిని ఎగవేస్తున్న సంకుచిత రాజకీయాలను సునయన ఆత్మ ఘోష మారుస్తుందా.. మానవత్వానికి ఆమె ఇస్తున్న నిలువెత్తు నిర్వచనాన్ని ఈ ప్రపంచం ఏనాటికైనా తనదిగా చేసుకుంటుందా?

బరువెక్కిన హృదయంతో నేనిలా రాస్తున్నా  (లేదా)
అశ్రు‘నయన’ ప్రశ్న
http://www.sakshi.com/news/hyderabad/kuchibhotla-srinivas-wife-sunayana-facebook-post-454360?pfrom=home-top-story 

కొండంత అండను కోల్పోయాను... కన్నీళ్లు పెట్టిస్తున్న సునయన ఫేస్‌బుక్ పోస్ట్
http://www.andhrajyothy.com/artical?SID=376360

ప్రేమను పంచే పోరాటంలో ప్రాణాలర్పించి గెలిచావు శ్రీనివాస్: సునయన అత్మవేదన
http://telugu.webdunia.com/article/andhra-pradesh-news/kuchibhotla-srinivas-wife-sunayana-facebook-post-117030200002_1.html

Kansas shooting: Hyderabad techie's wife Sunayana prefers to return to ground zero
http://timesofindia.indiatimes.com/city/hyderabad/kansas-shooting-sunayana-prefers-to-return-to-ground-zero/articleshow/57421953.cms


Thursday, February 23, 2017

అనువాదంతోనే జీవితం పండించుకున్న మాననీయులు ఏజీ యతిరాజులు


ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా అలుపెరగకుండా తెలుగు, తమిళ భాషల్లో అనువాద రంగంలో నిరంతరం కృషి చేసిన సృజనకారుడు ఏజీ. యతిరాజులు గారు. తెలుగు, తమిళ సాహిత్యాభిమానులకు గత 56 సంవత్సరాలుగా వీరు సుపరిచితులే. తమిళనాట వీరి గ్రంథాలు పది ముద్రణలు పొందాయి. అలెక్స్‌ హేలీ– ‘ఏడు తరాలు’, డా. కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’, కళ్యాణరావు ‘అంటరాని వసంతం’ తదితర పుస్తకాలను తమిళంలోకి అనువదించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ హిందీ గ్రంథాల అనువాదాలకు కేంద్ర, తమిళనాడు పురస్కారాలను అందుకున్నారు. ప్రసిద్ధ హిందీ రచయిత రాహుల్‌ 12 గ్రంథాలను తమిళంలో వరుసగా అనువదించి ప్రచురించినందుకు తమిళనాడు ప్రభుత్వంచే సన్మానం పొందారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జన విజ్ఞాన వేదిక కార్యకర్తగా ఆ రెండు సంస్థల సన్మానాలను స్వీకరించారు. తమిళనాడులోని ‘దిసై ఎట్టుం–నల్లి’ సాహితీ సంస్థ చేత అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే లక్ష్మణన్‌ ద్వారా జీవిత సాఫల్య పురస్కారం పొందారు.

తమిళనాడులోని గుడియాత్తంలో చేనేత కుటుంబంలో 1935 ఆగస్టు 4న యతిరాజులు జన్మించారు. మునెమ్మ, గోవిందస్వామి వీరి తల్లిదండ్రులు. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషలలోనూ, ఆయా భాషల సాహిత్యంతోనూ వీరికి మంచి పరిచయం ఉంది. వీరి మాతృభాష తెలుగు. చిత్తూరు జిల్లాలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. చిత్తూరు పట్టణం గ్రీమ్స్‌పేటలో నివాసం ఉంటున్నారు.

15వ ఏట నుంచే తమిళనాడులోని గుడియాత్తం పట్టణంలో వామపక్ష ఉద్యమంతో సన్నిహిత సంబంధం కారణంగా 1950 నుంచే ‘జనవాణి’, ‘సందేశం’ పత్రికల ద్వారా తెలుగు అభ్యుదయ సాహిత్యంతో పరిచయంవల్ల తెలుగు, హిందీ, తమిళం భాషల్లోని అభ్యుదయ రచనలను మరో భాషా పాఠకులకు అందించాలనే లక్ష్యం ఏర్పడిందంటారు యతిరాజులు.

హిందీ ఎంఏ, బీఈడీ అయిన పారంగల్, శిక్షణ కళా ప్రవీణ్, ప్రవీణ్‌ ప్రచారక్‌ వీరి విద్యార్హతలు. సాహితీ అధ్యయనం, సాహిత్య బోధన, అనువాద రచనలతోబాటు సామాజిక సేవ కూడా వీరికి చాలా ఆసక్తికరమైన రంగాలు. సాహిత్యకారుడిగా, సాహిత్య ప్రేమికుడిగా మొదలైన ప్రస్థానమే అనువాదకుడిగా అతడి ప్రారంభం.

పదేళ్ల వయస్సులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసాక నెలకొన్న దారుణ కరువు పరిస్థితుల్లో ఆకలి, దారిద్య్రం, అభద్రతా భావనలు బాల్యంలోనే తనపైన తీవ్ర ప్రభావాన్ని చూపాయంటారు. శేరు బియ్యం కోసం ఒక రోజంతా వరుసలో నిలబడటం తనకింకా బాగా గుర్తుందంటారు.

యుద్ధాలవల్ల స్త్రీలు, పిల్లలు, సాధారణ ప్రజానీకం ఎన్ని అవస్థలు పడతారో, జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన కారణంగానే హింసకు, యుద్ధానికి తాను వ్యతిరేకం అంటూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే దుష్టశక్తుల్ని వ్యతిరేకించే సాహిత్యమే నాకు అత్యంత ప్రమాణీకరమైందని అంటారు యతిరాజులు.

హిందీనుండి వీరు పలు గ్రంథాల్ని తమిళంలోకి అనువదించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ స్వీయ చరిత్ర 4 భాగాలు, దేశ దిమ్మరి పురాణం, హిందూ తత్వశాస్త్రం, బౌద్ధ తత్వశాస్త్రం, ఇస్లాం తత్వశాస్త్రం, ఐరోపా తత్వశాస్త్రం, గతితార్కిక, భౌతిక శాస్త్రం, వైదిక ఆర్యులు, దివోదాసు రామరాజ్యం–మార్క్సిజం, ప్రేంచంద్‌ కథానికలు, శివశర్మగారి సంస్కృతులు.

ఇవికాక తెలుగు నుండి తమిళంలోకి చాలా గ్రంథాల్ని అనువదించారు. కృష్ణారెడ్డి ‘ఉప్పెన’ నవల, వెంకటేశ్వరరావు ‘మహాత్ములు’, మేజర్‌ జైపాల్‌ సింగ్‌ ‘దేశం పిలిచింది’ అమీర్‌ హైదర్‌ఖాన్‌ ‘స్వీయచరిత్ర’, పుచ్చలపల్లి సుందరయ్య ‘విప్లవ పథంలో నా పయనం’ (2 భాగాలు) హోవర్డ్‌ ఫాస్ట్‌ – ‘స్పార్టకస్‌’, అలెక్స్‌ హేలీ ‘ఏడుతరాలు’, డాక్టర్‌ కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ మొదలైనవి.

ఆయా మూల భాషల్లోని విశిష్టమైన గ్రంథాల్ని వీరు ఎంపిక చేసుకోవటంలోనే ఒక విలక్షణత సుస్పష్టంగా కనబడుతుంది. సమాజంలోని అన్ని తరగతుల వారికి, అన్ని స్థాయిల వారికి ఉపయోగపడే విధంగా వీరి అనువాద రచనలు విస్తృత ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. అనువాద రంగంలో దశాబ్దాల తరబడి వీరు సాగిస్తున్న కృషి ఫలితంగా తెలుగు, తమిళ భాషల్లోకి ఎన్నో విలువైన గ్రంథాలు చేర్చబడ్డాయి.

నిత్య సాహిత్య విద్యార్థిగా ఉంటూ, తెలుగు, తమిళ సాహిత్య రంగంలో ఎప్పుడు ఎక్కడ మంచి పుస్తకాలు వచ్చినా, వాటిని వెతికి పట్టుకుని చదువుకునే ఔత్సాహిక సాహిత్యాభిమాని, నిరంతర పాఠకుడు యతిరాజులు.

‘రోజూ పుస్తకాలు చదువుతారా సార్‌’ అనడిగితే వారు చెప్పే సమాధానం ఒక్కటే– వారి సాహిత్య వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ‘రోజూ అన్నం తింటాం కదా అని తినటం ఏరోజూ మానెయ్యం కదా? అట్లాగే చదవటం కూడా నిరంతరం కొనసాగుతూనే ఉండాలి’ అంటారు ఎనభైయ్యేళ్ల యువ సాహిత్యకారుడు, అలుపెరుగని యతిరాజులు.

స్వాతంత్య్రం భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ పండుగ వాతావరణం తదనంతర కాలంలో దేశంలో ఎక్కడా కనిపించకపోవడం బాధాకరం అని, సమానత్వం లేకపోవడం వల్ల స్త్రీలు, దళితులు పడే బాధలు తనను కలచి వేశాయని, పీడితుల వైపు నిలబడి వారిలో చైతన్య కలిగించే రచనలు స్ఫూర్తి కలిగిస్తాయి కాబట్టే అలాంటి మహత్తర రచనల్ని తనంతట తాను అనువదించటం ప్రారంభించానని వారు అంటారు. దేశ విభజన సమయంలో నెలకొన్న అల్లకల్లోలం, విధ్వంసకాలు, స్త్రీలపై అత్యాచారాలు, కుటుంబాలు నాశనం కావటం, శరణార్థుల బాధలు తనను ఎంతగానో కలచివేసాయని, ఈ కారణాలే సాహిత్య అధ్యయనం వైపు, అనువాదాలవైపు తనను నడిపించాయని యతిరాజులు చెబుతుంటారు.

తెలుగులోకన్నా తమిళంలో సాహిత్య పత్రికల సంఖ్య ఎక్కువగా ఉందనీ, వాటి స్థితి నిలకడగా ఉందనీ, అందుకే తమిళంలో ఆయా వాదాలు, భావాలకు ఆదరణ ఎక్కువగా ఉందనీ, తమిళంలో అనువాద గ్రంథాలు పది ముద్రణలు కూడా జరుగుతున్నాయనీ, వేలాది ప్రతులు అమ్ముడవుతున్నాయని యతిరాజులు చెబుతుంటారు.

అనువాదాల్లో అనువాదకుడి భావజాలానికి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన అనువాదాలు చాలా ముఖ్యమైనవిగా ఉంటూ చాలామంది పాఠకులకు అతి తక్కువ కాలంలో చేరువ కావటానికి ప్రయత్నిస్తాయి. అందుకే అనువాదకుడు తన స్వంత నిర్ణయంతో, ఎంపికతో చేసే అనువాదాలకు స్థల, కాల పరిమితులు ఉండవు. ఇలాంటి అనువాదాలు చరిత్రలో నిలచిపోతాయి. చరిత్రను కూడా సృష్టిస్తాయి.

కేవలం కాల్పనిక సాహిత్యమే కాక, చరిత్ర, సామాజిక శాస్త్రాలకు చెందిన ఎన్నో విలువైన గ్రంథాల్ని, అంతే విలువైన ఆత్మకథల్ని, స్వీయ చరిత్రల్ని కూడా యతిరాజులు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి అనువదించారు.

వీరు అనువదించిన పుస్తకాలను, వస్తు విస్తృతిని, విభిన్న ఎంపికల్ని పరిశీలిస్తే వీరియొక్క విశాల దృక్పథం, ఆలోచనా పరిధి అర్థమవుతాయి. సమాజానికి చాలా అత్యవసరమైన మందుల్లాంటి విలువైన ఎన్నో పుస్తకాల్ని వీరు అందజేశారు. రాయటానికి చేయి సహకరించకపోయినా తాను చెబుతూ డీటీపీ చేయించడం విశేషం. ఇంత వయసులో కూడా వీరు నిత్య చదువరిగా ఉండటం అద్భుతమైన విషయం. వివిధ భాషల్లోని ప్రగతిశీల మానవతా రచనలను ఇతర భాషలకు అందజేయటం వీరికి చాలా ఇష్టమైన ప్రవృత్తి.

కె.చిన్నప్ప భారతి నవలలు – ‘దాహం’, ‘సంఘం’తో పాటు ఇ.యం.ఎస్‌. నంబూద్రిపాద్ రచనలు ‘వైదిక భారతం’, ‘భారతదేశ చరిత్ర’ తదితర పుస్తకాలను తమిళం నుండి తెలుగులోకి ఏజీ. యతిరాజులు అనువదించారు. హిందీ నుండి తెలుగులోకి అనువదించిన రచనలు– శివశర్మ ‘సంస్కృతులు’, రాహుల్‌జీ ‘ఈ దుష్ట సమాజం సమాజం పతనం కాక తప్పదు’, ప్రభాకర సాంజ్‌గిరి ‘మనిషి కథ’, గిజూభాయి ‘సమగ్ర సాహిత్యం’ ఏడు భాగాలు.

సాధారణంగా ఒక యూనివర్సిటీ కానీ, సాహిత్య సంస్థకానీ, ప్రచురణ సంస్థకానీ చేయాల్సినంత పనిని యతిరాజులు ఒక్కరే ఒంటరిగా చేయటం వీరి కృషికి, చిత్తశుద్ధికి సాక్ష్యం. విలువైన రచయితల విలక్షణ రచనల్ని ఎంతో శ్రద్ధగా ఎంపిక చేసుకుని, సహజమైన రచన అనిపించేంత రీతిలో, ఎక్కడా ఇది అనువాద రచన కదా అనే భావన రానివ్వకుండా, పాఠకుడి చేత ఆసక్తికరంగా చదివింపజేసేలా అనువాదం చేయటం యతిరాజులు ప్రత్యేకత. అందుకే సమకాలీన అనువాద రచయితల వరుసలో వీరికి ప్రత్యేక స్థానం ఉంది.

సాహితీవేత్త ఏజీ. యతిరాజులు కన్నుమూత

ప్రముఖ సాహితీవేత్త, అనువాదకుడు ఏజీ. యతిరాజులు మృతికి సాహితీ స్రవంతి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. చిత్తూరు జిల్లాకు చెందిన యతిరాజులు ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే అనేక పుస్తకాలను అనువదించారు. తమిళ, హిందీ, తెలుగు భాషల్లోని ప్రజలకు ఉపయోగపడే సాహిత్యాన్ని ఎంపిక చేసుకుని అంకిత భావంతో చేసిన ఆయన అనువాదాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనలను హిందీ నుండి తమిళంలోకి అనువదించినందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ విద్యావేత్త గిజుభాయి సాహిత్యాన్ని హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ప్రచురించిన గిజుభాయి పుస్తకాలు విశేషంగా ప్రచారం పొందాయి. అభ్యుదయ, ప్రగతిశీల ఉద్యమాలను ప్రోత్సహించేవారు. సామాన్యుల జీవితాల్లో మార్పు రావాలని ఆకాంక్షించిన యతిరాజులు గారి మృతి తెలుగు సాహిత్యానికి, అనువాద సాహిత్య రంగానికి తీరని లోటు. చివరికంటా ప్రజా సాహిత్యంపట్ల, ప్రజా ఉద్యమాలపట్ల అభిమానాన్ని వెలిబుచ్చిన యతిరాజులు నిజమైన ప్రజా రచయిత. సాహితీ స్రవంతి నిర్వహించే కార్యక్రమాలకు నిరంతరం ప్రోత్సాహాన్ని అందించేవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
– తెలకపల్లి రవి గౌరవ అధ్యక్షులు, వొర ప్రసాద్‌ అధ్యక్షులు సాహితీ స్రవంతి, గవర్నరుపేట, విజయవాడ

తెలుగులో వీరు అనువదించిన పుస్తకాలు ప్రజాశక్తి బుక్ షాపులో దొరుకుతాయి.

(నాలుగు పుస్తకాలు రాస్తేనో, అనువాదాలు చేస్తేనో విశ్వమంతా టముకు వేసుకుని పురస్కారాల మీద పురస్కారాలు తీసుకుని అంతర్జాలంలో ప్రచారంలో అందరికంటే ముందుండే మహానుభావులు తయారవుతున్న కాలంలో ఆన్‌లైన్ మొత్తం గాలించినా ఒక్కటంటే ఒక్క ఫోటో లేకుండా అనువాద కృషిలో మునిగిపోయిన నిరాడంబరులు యతిరాజులు. ఉన్న ఆ ఒక్క ఫోటో కూడా ఒక తమిళ వెబ్ సైట్ నుంచి తీసిందే. )