Pages

Monday, August 21, 2017

రేప్ చేసిన చేతులకు రాఖీలా?

ఛత్తీస్‌ఘడ్ దంతెవాడ జిల్లా పాల్నార్ గ్రామంలో ఆరోజు రాఖీ పున్నమి. కాని ఆదివాసి బాలికల జీవితాల్లోకి నిండు వెన్నెల తొంగి చూడవలసిన తరుణంలో చేదు చీకటి అనుభవం చోటు చేసుకున్నది. ఆ చేదు నాభి దాకా దిగి ఆ రుచి నాలికకో, నోటికో, శరీరానికో కాదు, గుర్తు చేసుకుంటేనే వణికిపోయేలా మనస్సును ఎల్లప్పుడూ అంటుకునే ఉంటుంది. గుర్తు చేసుకోకపోవడానికి అదేం మరిచిపోయే ఘటననా? ఒక్కరి అనుభవమా? ఐదు వందల మంది మహిళల సామూహిక అనుభవం.

రాఖీ కట్టడం అనేది ఈ దేశంలో ఒక సోదర భావానికి చిహ్నం. సోదరి తన సోదరుని పట్ల రక్తబంధంతో, ప్రేమతో, విశ్వాసంతో రాఖీ కట్టే ఒక ఫ్యూడల్ విలువ. ఆ మహిళ ఆ పురుషునిపై.. తాను ఒక సహచర్యాన్ని ఎంచుకునే దాకా విశ్వాసంతో ఆధారపడే విలువకు ప్రతీక.  స్త్రీలు దానిని ఒక నిర్మలమైన భావనతోటే నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో దీనిని ఒక హిందూ సంప్రదాయంగా సంఘ్ పరివార్ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం జరుగుతున్నది. ఒక వేలంవెర్రిగా ఈ రాఖీ పండుగ జరుపుకునే వేడుకలు జరుగుతున్నాయి. 

దండకారణ్యంలో గ్రామాలు తగలబెడుతూ, స్త్రీలపై సామూహిక లైంగిక అత్యాచారాలు చేస్తూ, మావోయిస్టులు అనే అనుమానం ఉన్నవారిని, సానుభూతిపరులను, కానివారిని కూడా నిత్యం ఎన్‌కౌంటర్లలో చంపుతున్న రాజ్యం తాను పనిముట్లుగా వాడుకుంటున్న పారా మిలిటరీ బలగాలను చాల ఫ్రెండ్లీ పోలీసులుగా చూపడానికి ఈ రాఖీ పున్నమినే ఎంచుకున్నది.

పాల్నార్ గ్రామంలోని బాలికల వసతి గృహంలో ఐదు వందల మంది ఆదివాసి బాలికలు ఉన్నారు. వారికక్కడ బాలికల పాఠశాల ఉన్నది. అక్కడికి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సందర్శనకు వచ్చారు. ఇక్కడ వాళ్లకు ఒక నూతన కార్యక్రమం అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. అదే ఈ పాఠశాల పిల్లలతో సిఆర్‌పిఎఫ్ సైనికులకు రాఖీలు కట్టించాలని.

31 జూలై రోజే ఈ పథకాన్ని రచించి వందమంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను తీసుకొని ఆ వసతి గృహానికి వెళ్లారు. అధికారులు ఈ రాఖీ కట్టే దృశ్యాన్నంతా వీడియో తీసే ఏర్పాటు కూడా చేశారు. ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆదివాసి మహిళలకు సీఆర్‌పీఎఫ్ జవాన్లు సంరక్షకులుగా ఉన్నారని ఈ వీడియో ద్వారా ప్రపంచానికి చూపాలనుకున్నది. ఈ అధికారులు ఆ మేరకు ఒక టీవీ ఛానల్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారు.

రక్షాబంధన్ రోజు ఆ కార్యక్రమాన్ని లైవ్ షో చేయాలనుకున్నారు. అందుకని రాఖీ పున్నమి రోజు చాలాసేపటి వరకు ఆ కార్యక్రమం కొనసాగింది. ఉదయం నుంచి ఈ కార్యక్రమం చాలాసేపు కొనసాగడంతో కొంతమంది బాలికలు కార్యక్రమం మధ్యలో మరుగుదొడ్డికి వెళ్లారు. వాళ్లను ఐదారుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు అనుసరించారు. తాము మరుగుదొడ్ల లోపల ఉండగా బయట ఇట్లా సీఆర్‌పీఎఫ్ జవాన్లు నిలబడడానికి ఆ అమ్మాయిలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆ జవాన్లు బెదిరించారు. మీ శరీరంలోని రహస్య ప్రదేశాల్లో ఏం దాచుకున్నారో మేం వెతకాల్సి ఉంటుందన్నారు. ఈ వెతకడం అనే నెపంతో ముగ్గురు అమ్మాయిల స్తనాలను దారుణంగా నలిపేశారు. ఒక అమ్మాయి మరుగుదొడ్డిలో తలుపు వేసుకొని ఉండిపోయింది. ముగ్గురు సైనికులు తలుపు తోసుకొని లోపలికి వెళ్లారు. పదిహేను నిమిషాలు వాళ్లు ఆ లోపలే ఉండిపోయారు. మిగిలిన అమ్మాయిలను బయట ఉన్న సిఆర్‌పిఎఫ్ జవాన్లు గొడవ చేయకుండా నోరు మూశారు.

ఇదంతా జరిగిన తరువాత ఆ బాలికలు తిరిగి తమ గదుల్లోకి వెళ్లిపోయారు. జవాన్లు కూడా వెళ్లి అక్కడి కార్యక్రమంలో చేరిపోయారు. కార్యక్రమమంతా ముగిసిన తరువాత అధికారులు, సైనికులు వెళ్లిపోయారు. రాఖీ బంధన్ సంరక్షకుల కార్యక్రమం ముగిసింది. ఆ రాత్రి ఆ బాలికలు తమ వార్డెన్ ద్రౌపదీ సిన్హాకు జవాన్లు తమతో వ్యవహరించిన తీరు చెప్పారు. వార్డెన్ ఈ విషయాన్ని ఎస్‌పి, కలెక్టర్ దృష్టికి తెచ్చింది. మరునాడు కలెక్టర్, ఎస్‌పి ఇద్దరు కూడా పల్నార్ వచ్చారు. కాని ఆ అమ్మాయిలను పిలిపించడం కాని, ఏం జరిగిందని అడగడం కాని చేయలేదు.

ఈ ఫిర్యాదు చేసిన అమ్మాయిలను సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు తీసుకురమ్మని వెళ్లిపోయారు. హాస్టల్ వార్డెన్ ఇద్దరమ్మాయిలను సీఆర్‌పీఎఫ్ క్యాంపుకు తీసుకువెళ్లింది. అక్కడ కలెక్టర్, ఎస్‌పి ఆ ఇద్దరినీ బెదిరించారు. ఈ సంఘటన గురించి ఎవ్వరికీ చెప్పవద్దని హెచ్చరించారు. కాని అప్పటికే పాల్నార్ గ్రామమంతా ఈ వార్త వ్యాపించిపోయింది. గ్రామస్తులు చొరవ తీసుకొని ఈ విషయం ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోవాలని సోనీ సోరీని పిలిపించారు.

సోనీ సోరి అక్కడికి వెళ్లి ఆ వసతి గృహం దృశ్యాన్ని చూసి అవాక్కయిపోయింది. ఆ హాస్టల్ వార్డెన్ గేటుకు తాళం పెట్టి వాచ్‌మన్ లాగా గేటు ముందు కూర్చున్నది. ఒక పోలీసు కానిస్టేబుల్‌ను పై అధికారులు అక్కడ నియమించారు. ఏ ఒక్క సామాజిక కార్యకర్త కాని, పత్రికా రచయిత కాని ఆ గేటు దాటి ఆ వసతి గృహంలోకి వెళ్లి అక్కడి ఆదివాసి బాలికలను కలవకుండా తీసుకున్న జాగ్రత్త అన్నమాట అది.

ఇంక చేసేది లేక సోనీ సోరి అక్కడి పాఠశాలలో చదివే పిల్లల ఇళ్లల్లోకి వెళ్లి ఆ సంఘటనకు సంబంధించిన సమాచారమంతా సేకరించింది. ఆ అమ్మాయిలు జరిగిన కథంతా వివరించారు.

దంతెవాడలో చాలాకాలం పాటు వనవాసి ఆశ్రమం నిర్వహించి, దాన్ని పోలీసులు తగులబెట్టి తనకు ప్రాణాపాయం తలపెట్టడంతో ఛత్తీస్‌ఘడ్ వదిలి వెళ్లిన హిమాంశు కుమార్ ఈ సంఘటనను బయటి ప్రపంచం దృష్టికి తెచ్చాడు. జవాన్లు చేసిన దారుణమైన లైంగిక నేరాన్ని, దాన్ని కప్పిపుచ్చడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానం దృష్టికి తెస్తానని ఆయన ప్రకటించాడు.

తమ పట్ల సీఆర్‌పీఎఫ్ జవాన్ల అమానుషమైన ప్రవర్తనను, జిల్లా సంరక్షకులు అని భావించే కలెక్టర్, ఎస్‌పిల దృష్టికి తెచ్చినప్పుడు ఫిర్యాదును పట్టించుకొని, నమోదు చేసి, చర్యలు తీసుకోవడానికి బదులు దాన్ని కప్పిపుచ్చడానికి, అణచివేయడానికి ప్రయత్నించడం కంచే చేను మేయడం.

ఈ సంఘటనలోని వాస్తవాలను విచారణ చేయడానికి బదులు వాళ్లు ఫిర్యాదు చేసిన వాళ్లనే బెదిరించారు. మైనర్ బాలికలపై అభ్యంతకరమైన లైంగిక చర్యలకు పూనుకోవడం లైంగిక అత్యాచారాల నుంచి బాలురను రక్షించే (పోస్కో  ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సస్) చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరం.

వాస్తవానికి ఇంత అమానుషంగా వ్యవహరించిన సిఆర్‌పిఎఫ్ జవాన్ల మీద, కప్పిపుచ్చిన అధికారుల మీద ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి చర్య తీసుకోవాల్సి ఉంటుంది.

ఇదంతా రాఖీ పున్నమి రోజు జరిగింది. కనీసం రాఖీ పున్నమి రోజు కూడా సిఆర్‌పిఎఫ్ రక్షక భటులు రక్షకులుగా ఉండలేకపోయారు. వాళ్లను ఆదివాసుల పట్ల, ముఖ్యంగా ఆదివాసి మహిళల పట్ల రక్షకులుగా చూపాలని, అందుకే రానున్న ఆదివాసి తరానికి వాళ్లు సంరక్షకులుగా హామీ పడుతున్నారని ప్రపంచానికంతా దృశ్యమానం చేయదల్చుకున్న ప్రభుత్వం ఆ ఒక్క రోజైనా నిత్యం ఆదివాసి మహిళల పట్ల వాస్తవంగా జరుగుతున్నదేమిటో దాచలేకపోయింది.

ఇది కేవలం సముద్ర గర్భం నుంచి పొడసూపిన మంచు ముక్క మాత్రమే.

రాఖీ పున్నమికి రెండు రోజుల ముందే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మావోయిస్టు ప్రభావం ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు జమ్ము కశ్మీర్‌లో అనుసరిస్తున్న సైనిక రాజనీతిని అనుసరించాలన్నాడు. భద్రతా బలగాలు కశ్మీర్‌లో వలె నాయకత్వం మీద కేంద్రీకరించే నిఘా విధానాలను అనుసరించాలని సూచించాడు. ఈ విధానం వల్ల ఈ ఒక్క సంవత్సరం లోనే కశ్మీర్ లోయలో 115 మంది విదేశీ, స్థానిక టైరిస్టులను చంపగలిగామని గర్వంగా చెప్పాడు. 

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకత్వమంతా భద్రతా బలగాల దృష్టి వలయానికి బయటే ఉంటున్నదని, వాళ్లకు సంబంధించిన కనీస సమాచారం గాని, వాళ్ల కదలికలు గాని, వాళ్ల స్థావరాలు గాని భద్రతా బలగాలు కనిపెట్టలేకపోతున్నాయని ఆయన వాపోయాడు. నిఘా వర్గాల దగ్గర కేంద్ర కమిటీ కార్యదర్శితో సహా సభ్యుల ఇటీవలి ఫొటోలు ఏవీ లేవని కూడా ఆయన తన ఆగ్రహం ప్రకటించాడు.

జమ్ము కశ్మీర్‌లో బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ దగ్గర నుంచి సైన్యం విజయవంతంగా ఒక లక్ష్యంగా సాధిస్తున్న ఈ దాడిని ఇక్కడ అర్థ సైనిక బలగాలు సాధించాలని ఆయన ఆశించాడు. నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలన్నాడు. కేరళ, తమిళనాడు, కర్నాటక మూడు రాష్ట్రాల ట్రై జంక్షన్‌లో కూడా మావోయిస్టు ప్రాబల్యం పెరుగుతున్నదని ఆయన దృష్టికి తెచ్చినప్పుడు ఇటీవల నాయకత్వాన్ని లక్ష్యం చేసుకొని దేవరాజ్, అజితలను ఎన్‌కౌంటర్‌లో చంపిన తీరు ఇతర ప్రాంతాల్లో ఆదర్శం కావాలన్నాడు. స్థానికంగా ఉండే పోలీసుల నుంచి ముప్పై శాతమైనా ఇటువంటి చర్యల్లో సిఆర్‌పిఎఫ్ సహకరించాలని ఆయన సూచించినప్పుడు ఆ సమావేశంలో ఉన్న ఛత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ అంత సంఖ్యను కేటాయించే పోలీసు బలగం తమకు లేదన్నాడు.

ఒక స్థావరాన్ని ఆక్రమించుకొని తాను అనుకున్న పద్ధతిలో అభివృద్ధిచేయడానికి నీళ్లు తోడేయకుండా చేపలను చంపడం సాధ్యం కాదనే వ్యూహాన్ని అమలు చేస్తున్న రాజ్యవ్యవస్థ తాము ఆదివాసుల పట్ల, సాధారణ ప్రజానీకం పట్ల ఏ హానీ తలపెట్టడం లేదని, తాము తలపెట్టిన అభివృద్ధికి కేవలం మావోయిస్టులే ఆటంకంగా ఉన్నారని అభిప్రాయం కలిగించడానికి అప్పుడప్పుడూ ఇటువంటి ప్రకటనలు చేస్తుంటుంది. వాస్తవంలో తాము తలపెట్టిన అభివృద్ధికి ఆదివాసి సమాజం, సాధారణ ప్రజానీకమే ఆటంకంగా ఉన్నారని రాజ్యం భావిస్తోందనడానికి ఈ రాఖీ పున్నమి నాటి సిఆర్‌పిఎఫ్ జవాన్ల చర్య ఒక తాజా దాఖలా.

ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న.. తమపై లైంగిక అత్యాచారం చేసిన సిఆర్‌పిఎఫ్ జవాన్లకే తాము రాఖీలు కట్టే స్థితికి నెట్టబడిన ఆదివాసీ బాలికల పట్ల ఈ వ్యవస్థ వైఖరి ఏమిటి? ఈ వ్యవస్థలో సామాజికులుగా మన బాధ్యత ఏమిటి? వాస్తవానికి ఈ వ్యవస్థ గమనం ఎక్కడికి? ఆదివాసులపై సామూహిక లైంగిక అత్యాచారాలను ప్రోత్సహించడమే కాకుండా, స్వయంగా తాను కూడా అందులో పాల్గొన్నాడనే నేరారోపణ జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు రుజువైన పోలీసు ఉన్నతాధికారి కల్లూరిని.. ఆగస్టు 15న ఒక విశ్వవిద్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడానికి ఆహ్వానించడం రేప్ చేసిన చేతులకు రాఖీలు కట్టించడమనే దుర్మార్గానికి పరాకాష్ట కాదా?

వరవరరావు
విరసం వ్యవస్థాపక సభ్యుడు

గమనిక: చత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ మహిళలపై జరుగుతున్న దారుణ కృత్యాలపై విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు గారు పంపిన వ్యాసం పూర్తి పాఠం ఇక్కడ ప్రచురించడమైనది. ఈ బ్లాగులో ప్రచురించడానికి అనుమతించినందుకు ఆయనకు ధన్యవాదాలు.

పై వ్యాసం సంక్షిప్త పాఠం ఆగస్టు 18, 2017 సాక్షి పత్రిక సంపాదక పేజీలో, వెబ్ సైట్‌లో ప్రచురితమైనది

http://www.sakshi.com/news/vedika/varavara-rao-criticises-crpf-jawans-500308

0 comments:

Post a Comment