Pages

Wednesday, February 28, 2018

బాత్ టబ్ మరణాలు మనకు లేవు కానీ..

నా చిన్ని జర్నలిస్టు జీవితంలో తొలిసారి నాపై, నా వృత్తిపై సందేహం, అంతకు మించి అసహ్యం కలిగిన క్షణాలివి. మా బాల్యంలో, మా యవ్వనంలో నటన అనే అపురూప కళ ద్వారా మమ్మల్ని చల్లగా పలకరించిన శ్రీదేవితో.. ఇంద్రజగా ఒక లోకోత్తర సౌందర్య పరిమళాన్ని తన కళ్లతో, సాధుత్వంతో ప్రదర్శించిన శ్రీదేవి జీవితంతో, ఆమె కుటుంబంతో గత మూడురోజులుగా ఆడుకున్న మా మీడియాను ఏం చేసినా పాపం పోదన్నదే నా మనోభావం.

ముఖ్యంగా సోషల్ మీడియా 'ముండాకొడుకులు' టీవీ మీడియా రాక్షసోన్మాదులు...  అనూహ్యంగా, అకాలంగా తన బిడ్డలకు, భర్తకు దూరమైన వ్యక్తి జీవితంపై చిలవలు, పలవలు రేపుతూ, క్షణక్షణానికి పుకార్లు రేపుతూ, కథనాలు అల్లుతూ చేసిన బీభత్స ప్రదర్శనలను అంత సులువుగా మర్చిపోవడం కష్టం.

ఆమె ఇక లేరని తెలిసిన క్షణం నుంచి ఆమెను తాగుబోతుగా, డగ్స్ బానిసగా, కాస్మొటిక్ సర్జరీల వ్యామోహంతో చావు కొనితెచ్చుకున్న భ్రష్ట సంజాతురాలిగా కనీ వినీ ఎరుగని పుకార్లను రేపిన నెంబర్ వన్ శత్రువు సోషల్ మీడియా. ఈ క్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌నీ వదలలేదు. ఆమె ప్రాణప్రదంగా ప్రేమించిన కన్నకూతురు జాన్వీని వదల్లేదు.

భర్తే ఏదో చేశాడట. జాన్వీతో గొడవలతో ఆమె సగం అలసిపోయిందట. ఆస్తి గొడవలతో వేసారిపోయిందట. ఇలా అనుమానాలు లేని చోట అనుమానాలు రేపుతూ రావిశాస్త్రి ఓ సందర్భంలో అన్నట్లు... శ్రీదేవినీ, ఆమె కుటుంబాన్ని మూడు రోజుల్లో 300 సార్లయినా చంపేసిన పాపం మన మీడియాదే.

అందుకే మంగళవారం రాత్రి మా పత్రికాఫీసులో పనిచేసుకుంటున్నప్పుడు మాటల మధ్యలో మా కొల్లీగ్స్ చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించాలనిపిస్తోంది. "స్వర్గమనేది నిజంగా ఉంటే, శ్రీదేవి అక్కడికే చేరి ఉంటే, భూమండలంలో భారతీయ మీడియా అనే ఒక వికృత వ్యవస్థ నాపై ఇంత అభాండాలేస్తోందా" అని భోరున విలపిస్తూ ఉంటుందట.

యాభై ఏళ్లు నటన తప్ప మరేమీ మనకివ్వని ఆ అమాయకత్వపు ముగ్ధని, తన జీవితంలో అత్యంత సన్నిహితంగా భాగమై ఉన్నవారిని.. ఇంతగా చెండాడాలా?  చివరకు దుబాయ్ ప్రభుత్వం, దర్యాప్తు శాఖలు కూడా భారత్ మీడియాపై అసహ్యించుకునేంత తారాస్థాయిలో మన మీడియో ప్రచారం, మన హిట్ల యావ చెలరేగిపోయింది.

చివరకు ఇంత జరిగాక, శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరాక కూడా ఆమె మృతి వెనుక మిస్టరీ గురించి మంగళవారం అర్ధరాత్రి కూడా స్క్రోలింగ్‌లు పడుతుంటే, రామ్ గోపాల్ వర్మ స్థాయిలో ఏడ్వాలనిపిస్తోంది.

బాత్‌ టబ్‌లో పొరపాటున పడి మృతి చెంది ఉంటారన్న అంచనాతో కేసు మూసివేసిన దుబాయ్ పోలీసు శాఖ మన మీడియాను పాత చెప్పుతో కొట్టినంత పనిచేసింది.

యూట్యూబ్ తెరిస్తే మలినం. ప్రపంచంమీదే అసహ్యం వేసేంత కారుకూతలు. ఫోటోలు చూపుతూ కంపు కథనాలల్లే రోత బతుకులు...

అమెరికా, యూరప్ ఖండాలను అలా పక్కన బెట్టండి. మన ఖండం లోని జపాన్‌లోనే బాత్ టబ్‌లలో జారిపడి సంవత్సరానికి దాదాపు 20 వేలమంది చనిపోతున్నారని వార్తలు వస్తున్నప్పుడు శ్రీదేవి మరణాన్ని ఒక అత్యంత దురదృష్టకరమైన ప్రమాద ఘటనగా తప్ప మరే రకంగా అయినా ఊహించగలమా?

నిద్రలేచిన వెంటనే ముఖం చన్నీళ్లతో కడుక్కోకుండా బాత్‌రూమ్‌కి వెళితే, ఆ నిద్రమత్తులో తప్పటడుగులు వేసి కూలబడటం, జారటం, మనం జీవితంలో ఎన్నిసార్లు అనుభవించలేదు?

తడిసిన నేలపై కాస్త కాలుజారితే నడుమో, కాళ్లో అమాంతంగా విరిగిపోయి, రోజుల తరబడి మంచానపడే బాధను మన కళ్లముందు ఎందరి జీవితాల్లో మనం చూడలేదు?

ఆమె నడుస్తూ తూలి అలాగే టబ్ లోకి పడిపోయిందో (టీవీ9కి అంతర్జాతీయ అవార్డు ఇచ్చేయాలి)  లేక టబ్‌లో అడుగుపెట్టిన తర్వాత కాలు జారి గభాలున నీళ్లలో మునిగి ఆ భయంతో ఊపిరాడక జీవితం విషాదం ముగించుకుందో ఎవరికి తెలుసు?

ఆకస్మికంగా కింద పడితే, ఏదైనా అనూహ్యమైన వార్తను, దృశ్యాన్ని వింటే, చూస్తే అమాంతం స్పృహ కోల్పోవడం, మరణించడం కూడా  ప్రపంచంలో కొత్త విషయం కాదు కదా.

విదేశాల్లో బాత్ టబ్ మరణాలు మామూలు స్థాయిలో లేవని వేల సంఖ్యలో అవి నమోదవుతున్నాయని అర్థమవుతున్నప్పుడు శ్రీదేవి మరణాన్ని నమ్మశక్యం కానీ విషాద ఘటనగా తప్ప మరొకలా ఎలా ఊహించగలం?

జీవితంలో వైన్ తప్ప ఆమె మరేదీ ముట్టలేదని సన్నిహితులు చెబుతున్నప్పుడు.. అందుకే ఆమె నీళ్లలో పడి చనిపోయిందని అభాండాలు వేస్తే ఏం న్యాయం.. ఏం రాతలివి...

ప్రాణం లేని ఆ కట్టెను సాగనంపాల్సింది ఇలాగేనా? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి తన కష్టంతో, సానపట్టిన ప్రతిభతో అత్యున్నత శిఖర స్థాయిని అందుకున్న ఆ పసిపిల్లను పంపించాల్సింది ఇలాగేనా?

                          ************                      *************

విదేశాల్లో బాత్ టబ్  మరణాలపై ముఖ్య కథనం కింది లింకులో చూడండి.

బాత్‌టబ్‌లో పడితే చనిపోతారా

అలాగే...లోకాన్ని నటనతో మైమరపింప జేసిన శ్రీదేవి వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలపై వర్మ నిజాయితీతో కూడిన అభిప్రాయం కోసం ఇక్కడ చూడండి.

మోసాలు... బాధలు... కన్నీళ్లు! 

శ్రీదేవి జీవితంపై రామ్‌గోపాల్‌ వర్మ కోణం

12 comments:

Anonymous said...

Very very true.Indian media shows its ignorance about day to day things lack of conscience and minimum manners once again. So so unfortunate how people without even having basic knowledge and information can create stories. Shame on them as they are degrading us and portraying Indians as stupid people. Even a small kid may analyse things with information or wait for full information before coming to conclusion on any event.

kanthisena said...

ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు.

విన్నకోట నరసింహా రావు said...

రేటింగుల యావలో ఏ విలువలూ గుర్తుండవేమోనండి?
ఆదివారం పొద్దున్న మొదలైన మీడియా హడావుడి ..... పోయిన వ్యక్తి చితి ఇవాళ మధ్యాహ్నం అంటుకుని ఆ మంట, పొగ పైకి లేస్తుండగా “ఇక సెలవు” అని పెద్ద అక్షరాలతో వ్రాసేంత వరకూ .... కొనసాగే ఆస్కారమే ఎక్కువ కదా - మనం గతంలో చూసిన అనుభవం ప్రకారం.
వ్యాపారసంస్కృతి బాగా విస్తరించిపోయిన దాని పరిణామాలు ఇటువంటివి.

నీహారిక said...

బాత్ రూం లో జారిపడి మా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. నా క్లోజ్ ఫ్రెండ్ 30 సం వయసులో బాత్ రూం లోనే జారిపడి మృతిచెందింది. మీడియా గానీ, మరెవరైనా గానీ ఎంతగా విమర్శించినా శ్రీదేవి సమాధానం మాత్రం రాజమౌళికి ఇచ్చిన సమాధానమే సమాధానం.

https://www.youtube.com/watch?v=Q4UfKmv-Rq8

కడుపుచించుకు పుట్టిందొకరు
కాటికి మోసేదొకరు
తలకు కొరివి పెట్టేదొకరు
ఆపై ఆమెతో వచ్చేదెవరు ?

UG SriRam said...

మన బ్లాగులో శంకర్ అనే అతను ఉండేవాడు. అతను కాకినాడ / గోదావరి జిల్లాల కి చెందినవారుఅతను బాత్ రూం లో జారి పడి చనిపోయాడు. ఆ సమయంలో ఇంటిలో ఎవ్వరు లేరు. అతని భార్య వచ్చి చూసేటప్పటికి ఆలస్యమైందని అప్పట్లో రాశారు.

Gundluru Ram Mohan said...

Very true

kanthisena said...

శ్రీరామ్ గారూ, మీరు పేర్కొన్న శంకర్ గారి విషాదాంతం అప్పుడే తెలుసు. జీవితానికి అలాంటి ముగింపు మనవద్ద కూడా ఉందని నిరూపించిన విషాదాంతం అది.
నీహారిక గారూ, మీకూ సానుభూతి.
విన్నకోట గారూ. వ్యాపార సంస్కృతి... ఒక్క పదంతో మీడియా జీవితాల్లోని డొల్లను బయటపెట్టేశారు. ప్రింట్ మీడియా ఉన్నంతలో కాస్త మెరుగ్గా ఉందనుకుంటే దానిక్కూడా సోషల్ మీడియా ప్రచార రోగం అంటుకుంటూందేమోనని అనిపిస్తోంది.
సహానుభూతిని పంచుకున్న అందరికీ ధన్యవాదాలు

kanthisena said...

నీహారిక గారూ
మీరు ఇక్కడ పెట్టిన లింకులో రాజమౌళికి శ్రీదేవి ఇచ్చిన సమాధానం పరిపూర్ణతకు నిదర్శనంగా ఉంది. శివగామి పాత్రకు 5 కోట్లు అడిగింది, 8 కోట్లు అడిగింది అంటూ తనపై వచ్చిన వార్తలు అన్నీ అభాండాలే అంటూ శ్రీదేవి పల్లెత్తు మాట అనుకుండానే ఖండిస్తూ రాజమౌళి అండ్ టీమ్‌కి శుభాకాంక్షలు చెప్పిన తీరు అపూర్వం. ఒక సినిమాను ఒకే చేయడం, చేయకపోవటం ఆర్టిస్టు ఛాయిస్ కాకూడదా అంటూ ఆమె వేసిన ప్రశ్నకు రాజమౌళి క్షమాపణతోనే దండం పెట్టేశాడు. తనను బహిరంగంగా అంతగా అవమానించిన దర్శకుడిని ఒక్క విసురు మాట అనకుండా శుభాకాంక్షలు చెప్పడం ఎంత సంస్కారం ఉంటే సాధ్యమవుతుంది?

UG SriRam said...

చిన్నప్పటి నుంచి శ్రీదేవి సినేమాలు చూస్తూ పెరిగాను ఆమే అంటే చాలా అభిమానం. నాకు హీరోయిన్ అంటే శ్రీదేవే. ఆ తరువాతే ఎవరైనా. తెలుగు, తమిళ, హిందిలలో నటించిన సినేమాలు చాలా చూశాను. గోవిందా గోవిందా సినేమాను కడప రాయల్ థియేటర్లో, రెండువారల్లో ఐదు సార్లు చూశాను. ఇప్పుడా థియేటర్ మూసేశారు. ఇక టివిలలో చెప్పకరలేదు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఇంటర్వ్యులు చదివినా, ఒక్కసారి కూడా ఇతరులను పల్లెత్తు మాట అనలేదు. అంతేకాదు ఏ హీరో తో నటిస్తున్నా, ఆ హీరోకి సరైనా జోడీలా కనిపిస్తుంది.

మీకో ప్రశ్న ఆ టివి9 ను అందరు ఇంతాలా విమర్శిస్తున్నా వారు లెక్క చేయరా? అక్కడ పనిచేసే ఉద్యోగులు, నేను టివి9 లో పని చేస్తున్నాని బంధుమిత్రులకు గర్వంగా చెప్పుకోగలరా? సోషల్ మీడీయాలో నే వారిపై లెక్కలేనన్ని జోకులు ఉంటాయి, వీళ్ళెక్కడైనా ఫంక్షన్ లో కనిపిస్తే వాళ్ల బంధుమిత్రులు జోకులు వేయారా?

voleti said...

లండన్ లేడీ డయానాని వెంటాడి వేటాడి చంపిన మీడియా...

ఇండియన్ బ్యూటీ నగీనా చనిపోయినా వెంటాడి వేయిసార్లు చంపేసాయి....

న్యూస్ కావాలా? న్యూసెన్స్ కావాలా??
You decide..they report...
కొన్నాళ్ళు నిరంతర వార్తా ప్రసారాన్ని ban చేస్తే తప్ప నియంత్రించలేము...

Zilebi said...



లండన్లోన డయానన్
చెండాడిరి దేశమందు శ్రీదేవిని హా!
పండుగయె మీడియాకున్
నిండుగ నుసురులును బోవ నీరజ నయనా !

జిలేబి

విన్నకోట నరసింహా రావు said...

వోలేటి వారూ, పైన మీరన్న దానితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అసలు 24గంటల న్యూస్-ఛానెల్స్ ఏమిటండీ? చెప్పడానికి 24గంటలూ కొత్త వార్తలెక్కడ నుండి వస్తాయి? ఉండవు కాబట్టే ఏవేవో ప్రోగ్రాములతో నింపడం. పైగా పోటీ అనే వంకొకటి. మీరన్నట్లు తప్పక ban చెయ్యవలసినదే.

(అసలు కొంతకాలం ఓ పదేళ్ళ పాటు ban చెయ్యదగిన వాటిలో కార్ల ఫేక్టరీలు, మోటర్ సైకిళ్ళ ఫేక్టరీలు కూడా ముఖ్యమైనవే - నా అభిప్రాయంలో. ఇప్పటి వరకూ రోడ్డు మీదకి వదిలినది చాలు. ఇబ్బడిముబ్బడిగా తయారుచేసి రోడ్ల మీదకు వదులుతున్న ఈ వాహనాలతో ట్రాఫిక్ ఎంత భయానకంగా తయారయిందో, రోడ్లు ఎంత ప్రాణాంతకంగా తయారయినాయో చూస్తున్నాంగా)

Post a Comment