అజ్ఞాతవాసిని దెబ్బతీసిన (కలెక్షన్లను అలా పక్కనబెట్టండి) మూడు టెర్రిబుల్ మిస్టేక్స్ ఏమిటి అనే అంశంపై కత్తి మహేష్ తార్కిక, హేతుపూర్వక సమాధానాలు కింది లింకులో చూడవచ్చు. సినిమా సమీక్ష అంటే హీరోమీద, దర్శకుడి మీద బండలేయడం కాదంటూ కత్తి ఇక్కడ ఇచ్చిన వివరణ అర్థవంతంగానే ఉంది. చివరి వరకూ చూడండి. కత్తి వర్సెస్ పవన్ అభిమానుల మధ్య కొనసాగుతున్న యుద్ధాలను పక్కనబెట్టి సినిమా సమీక్షను సమీక్షగా మాత్రమే చూడాలంటే ఇలాంటివే నిజమైన సినీ అభిమానులకు అవసరం. పూర్తిగా సంయమనం తోటే సాగిన ఈ సమీక్ష తెలుగు సినిమా పరిణతికి చాలా అవసరం.
ఇక నా అభిప్రాయంపై కూడా భిన్నాభిప్రాయాలు, ఉద్దేశపూర్వకంగా ఏర్పర్చుకునే దురభిప్రాయాలు రావంటే, ఏర్పడవంటే నేనే నమ్మను.
కానీ కత్తి మహేష్.. మీరు నిజంగా చేయాల్సింది ఇలాంటి యుద్ధమే. మీ అవసరం ఈ కోణంలో సినీ పరిశ్రమకు చాలా అవసరం. అజ్ఞాతవాసి సినిమా దర్శకుడు, హీరోకు ఇష్టమున్నా లేకున్నా ఈ సినిమా అంచనాలను ఎందుకు అందుకోలేకపోయింది (మరోసారి చెప్పాలి. ఇది కలెక్షన్ల గొడవ కానేకాదు) అనే విషయంలో వ్యతిరేకాభిప్రాయాన్ని దానిలో దాగిన వాస్తవాలను తాము చూడా చూడటం అవసరం. వారి అభిమానులకు కూడా ఈ దృష్టి అవసరం.
ఎందుకంటే అభిమానులు తమ తమ హీరోల సినిమాలను ఆర్థికగా నిలబెట్టిన, గెలిపించిన చరిత్ర ఇంతవరకు ఏ తెలుగు సినిమాకూ లేదు. ఇకపై రాబోదు. హీరో హీరోయిజాన్ని దిగజార్చేసి, అతడి చేత పిచ్చి కామెడీ చేయించేసి. ఇదే మీరు కామెడీ అనుకుని ఎంజాయ్ చేయండి అని చెబితే సినిమా చూసే ప్రేక్షకులు నిజంగానే తలను సీటు కిందికి దించుకోవలసి వస్తుంది. ఇది అజ్ఞాతవాసికే కాదు ఏ సినిమాకైనా వర్తిస్తుందన్న కత్తి మహేష్ వ్యాఖ్య నూటికి నూరుపాళ్లు నిజం.
అర్థం పర్థం లేని కామెడీలు, హీరోయిజాలు, హింసలు, బూతులు, ద్వంద్వార్థాలు, సినిమా కథను ధ్వంసం చేసి దాని విలువను దిగజార్చివేస్తున్న పాడు కాలంలో చిత్ర విమర్శకు కత్తి మహేష్ కొత్త అర్థం చెబుతున్నారా అనిపిస్తోంది. సగటు సినిమా సమీక్షలను దాటి విమర్శను కళాత్మక రూపంలోకి తీసుకుపోవడం తెలుగు సినిమాలో ఇప్పుడే మొదలైందా అనిపిస్తోంది.
పవన్ కల్యాణ్ అభిమానులను ఇలాంటి సినిమా తీసి అవమానించే హక్కు పవన్ కల్యాణ్ కు కూడా లేదంటున్న కత్తి మహేష్ అభిప్రాయాన్ని పవన్ అభిమానులు కూడా సీరియస్‌గానే పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
Mojo TV తరపున వచ్చిన కింది ఇంటర్వ్యూలో కేవలం అజ్ఞాతవాసి సినిమా వైఫల్యంపై సమీక్ష మాత్రమే కాకుండా. పవన్ కల్యాణ్ అభిమానులు తనతో అనవసరంగా ఘర్షిస్తున్న తీరు మీద కూడా చాలా వివరంగా కత్తి మహేష్ ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ భవిష్యత్ జీవితానికి హాని చేయాలన్న ఆలోచన తనకు ఎప్పుడూ లేదని, కాని ఆయన రాజకీయ అడుగులపై తాను చేస్తున్న విమర్శ కొంచెం కఠినంగా ఉండవచ్చు కానీ అది హార్ష్ రియాలిటీ ఆని ఈ కఠిన వాస్తవాన్ని పవన్ అభిమానులు అర్థం చేసుకోలేకపోతున్నారని కత్తి మహేష్ చెబుతూ వచ్చారు. అందుకే దీన్ని అజ్ఞాతవాసి సినిమా పై సమీక్షగా మాత్రమే కాకుండా పవన్ అభిమానుల ఆవేశంపై కూడా సమీక్షగానే చెప్పవచ్చు.
పైగా పవన్ కల్యాణ్ మెగా ప్యామిలీకి కుటుంబ పరంగా దూరమైపోవడంతో సినిమాల ఎంపిక, దాని సాధక బాధకాలపై సరైన అంచనా, అవగాహనను ఇచ్చి గైడ్ చేసే అవకాశం కోల్పోయాడని ఇది వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా పవన్‌కి నష్టం కలిగించే అంశమని కత్తి తేల్చి చెప్పారు. కుటుంబ జీవితం నుంచి, కుటుంబం నుంచి వైదొలిగి ఏకాకి అయిన ప్రతి వ్యక్తీ తన జీవితాన్ని రూపొందించుకోవడంలో ఎక్కడో ఒకచోట తప్పటడుగు వేయక తప్పదని కత్తి అంటున్న మాటను ఆలోచించాల్సిందే.
చివరలో ఆణిముత్యం లాంటి మాట విసిరాడు కత్తి మహేష్. వ్యవస్థను కాపాడాలంటే వ్యక్తులను వ్యక్తులుగా మాత్రమే చూడాలి. వాళ్లను వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా చూడకూడదు. మనిషిని తీసుకుపోయి దేవుడిని చేసేస్తే, ఇక ఆ దేవుడు మనుషుల్లో ఉండటం మానేస్తాడు. తర్వాత దేవుడు ప్రశ్నాతీతమైపోతాడు. అదే మంచిది కాదు. అందుకే మనుషుల్ని మనుషుల్లాగే చూద్దాం. వాళ్లను మనుషుల్లాగే ట్రీట్ చేద్దాం. వాళ్లు దేనికి బాధ్యత వహిస్తారో చూద్దాం. అంటూ పవన్ దేవుడిగా చూస్తున్న అభిమానులకు సూచించాడు కత్తి.
ఈ పోస్టులో నా అభిప్రాయాన్ని పట్టించుకోకుండా, ఆద్యంతం హుందాగా కొనసాగిన కత్తి మహేష్ నిజాయితీతో కూడిన అజ్ఞాత వాసి సమీక్షను ఈ లింకులో చూడండి.
Kathi Mahesh Honest Review And Analysis On "Agnyaathavaasi" Movie | Mojo TV (best analysis by katti)
https://www.youtube.com/watch?v=3d-xN8W1MIs
********** **********
అజ్ఞాతవాసి సినిమాపై 10 టీవీలో వచ్చిన మరొక సమీక్ష మరీ అద్భుతంగా ఉంది.
అద్భుతమైన సినిమాటోగ్రఫీ, చక్కటి సంగీతం అమరినప్పటికీ అజ్ఞాతవాసి కథాపరంగా ఎక్కడ తేలిపోయింది? విమర్శకులే కాకుండా సామాన్య ప్రేక్షకులు, హీరో అభిమానులు కూడా ఎవరికి వారు పెట్టుకున్న అంచనా ఎంత ఘోరంగా దెబ్బతింది అనే విషయంపై అటు కత్తి మహేష్ ఇటు ఇన్‌పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరాం చేసిన విలక్షణ సమీక్షను కింది లింకులో చూడవచ్చు.
Kathi Mahesh Review on Pawan Agnyaathavaasi Movie | Review | #Trending | 10TV
(best analysis from katti and krishna sairam)
https://www.youtube.com/watch?v=SdGnFRCbwOs
5 comments:
కత్తి మహేష్ అనే వ్యక్తిని ఒక మహామనిషిగా portray చేస్తూ, మీ వ్యక్తిత్వాన్ని తగ్గించుకుంటున్నారేమో పునరాలోచించుకోండి రాజుగారూ!
ఇంతకూ అజ్ఞాతవాసిలో ఆ మూడు తప్పిదాలను మీరు చెప్పలేదు. ఒకవేళ ఆ తప్పిదాలు కత్తి ఈ రివ్యూలలో చెప్పారా? అలా అయితే అతని రివ్యూను హైలైట్ చేయటానికే ఈ పోస్ట్ రాశారా. అతను ఒక స్పష్టమైన ఎజెండాతోనే మీడియాలో కొద్ది నెలలుగా రచ్చ చేస్తున్నాడనే విషయం తెలుస్తూనే ఉంది. పవన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు విముక్తి కల్పిస్తానంటున్నాడు. పవనేమైనా లాడెనా, ట్రంపా, మరెవరైనా అసాంఘిక - సంఘవిద్రోహ శక్తా? It is clear that he is enjoying every minute of the attention he is getting in the media. మీరు పనిచేసే సాక్షి అధినేతను గురించి ప్రస్తావించేటప్పుడు మాత్రం జగన్ గారు అంటూ తన విధేయతను చెప్పకనే చెప్పుకుంటున్నాడు.
జగన్ తెలివితక్కువ వల్ల టీడీపీని ఇరుకున పెట్టగలిగే ఎన్నో అవకాశాలను తనకు అనుకూలంగా మల్చుకోవటం చాతకాక తన పరువును పొగొట్టుకుంటున్నాడు.పవన్ ఏమో ఉన్నంతవరకు స్నేహంగా ఉంటూనే చాలా తెలివైన లెక్క ప్రకారం అడుగులు వేస్తూ జగన్ స్థానం ఆక్రమించబోతున్నాడు.పవన్ ముందుకు వచ్చేకొద్దీ జగన్ వెనకి వెళ్తాడు.అదే జగన్ కత్తి మహేష్ మధ్య కుదిరిన ఒడంబడిక ప్రకారం కత్తి మహేష్ పవన్ మీద దాడి చెయ్యటానికి కారణం.ఈ బ్లాగూ,ఇదీ సంగతి,వయస్సార్ అంతరంగం మాత్రమే మహేష్ పవన్ మీద చేస్తున్న దాడిని సమర్దించడానికి కారణం.
కానీ రాజకీయాల్లో స్వశక్తితో సొంత మేధస్సుతో మాత్రమే పైకి రాగలరు - అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకోవదానికి పోటీదారుల్ని ఇట్లా చేసినా ప్రయోజనం ఉంటుంది గానీ అధికారంలోకి రావడానికే ఇలాంటి దిక్కుమాలిన ప్లానులు వేస్తే జనానికి అభిమానం పుట్టడం కన్న అసహ్యం వెయ్యడమే ఎక్కువగా జరుగుతుంది!ఇదివరకు తెలియకపోయినా ఈ మూడు బ్లాగులు మాత్రమే సమర్ధించడం వల్ల ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది.ముద్రగడకి రైలు దహనం చెడ్దపేరుతో పరువు చిరిగినట్టే కత్తికీ మరో ఎపిసోడుతో పరువు చిరగడం ఖాయం!
ఆ మూడు తప్పిదాలు కత్తి మహేష్ చెప్పినవేనండీ, హీరో ఉదాత్తతను కామెడీలో ముంచెయ్యడం, అద్బుతమైన సాంకేతిక విలువలు కథను ముంచెయ్యడం, హీరోయిన్లను జోకర్ల స్థాయికి తగ్గంచేయడం వంటి కారణాలు ఈ వీడియోలలో తను స్పష్టంగానే చెప్పారు. పోతే, కత్తి స్పష్టమైన ఎజెండాకూ ఈ పోస్టుకు ఎలాంటి సంబంధం లేదు. ఇతర టీవీ ఇంటర్వ్యూలలో తనకూ, పవన్ అభిమానులకూ మధ్య సాగిన వివాదాలు, దూషణలు, భీకర చర్చలు వంటి వాటితో పనిలేకుండా అజ్ఞాతవాసి ఎందుకు బావుంది, ఎక్కడ బాగాలేదు అనే విషయానికి మాత్రమే కట్టుబడి పక్కదోవలు పట్టకుండా రివ్యూ చేశారు, అలాగే ఆ లేడీ యాంకర్ కూడా వివాదాల జోలికి పోకుండా చాలా సంయమనంగా ఇంటర్వ్యూను నడిపించారు కాబట్టి ఇది ఇతర దురుద్దేశాలకు పోకుండా నింపాదిగా వినవచ్చు అనిపించి నా అభిప్రాయాన్ని పోస్టుగా పెట్టాను. ఇక పవన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు విముక్తి కల్పిస్తానంటున్నాడు అని కదా మీరన్నారు. అంటే పవన్ అంత బలహీనంగా ఉన్నాడా. ఒక వ్యక్తి నీ పని పడతాను అంటే పడిపోతాడా పవన్. ఇది పవన్,అతడి అభిమానులు తేల్చుకోవలిసిన విషయం. సమస్య అంతా మా దేవుడిని అంత మాటంటావా అంటూ వీరారాధన మితిమీరి అభిమానులు రెచ్చిపోవడం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందేమే మరి. ఇది ఇక్కడ చర్చనీయాంశం కాదనుకోండి.
పైగా "మీరు పనిచేసే సాక్షి అధినేతను గురించి ప్రస్తావించేటప్పుడు మాత్రం జగన్ గారు అంటూ తన విధేయతను చెప్పకనే చెప్పుకుంటున్నాడు" అని మీరు వ్యాఖ్యానించారు. కానీ నేను చూసిన నాలుగైదు ముఖ్యమైన వీడియోలలో కత్తి సాక్షి అధినేతను కూడా గౌరవ వాచకాలు ఏమీ లేకుండా ఏకవచనంతోనే సంబోధించారు. పైగా ఏపీలో ఏర్పడుతున్న రాజకీయ శూన్యతను జగన్ పూరించలేకపోతున్నాడు కాబట్టిే పవన్ తాను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆ స్పేస్‌ను పూరించగలిగితేనే ఏపీ రాజకీయాల్లో నిలబడగలగుతాడు. ఇంతవరకు అలాంటి ప్రయత్నాలు తనవైపు నుంచి రాకపోవడమే పవన్ లోపం అని కూడా కత్తి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.
మొత్తంమీద ఒక యుద్ధవాతావరణాన్ని తలపించే కుమ్ములాటకు పోకుండా దాదాపు సంయమనంతో జరిగిన ఇంటర్వ్యూలు కాబట్టే ఈ రెండింటిని సినిమా ప్రధానంగా పవన్ అంశం ద్వితీయంగా మాత్రమే జరిగాయి. నాకు నచ్చిన అంశం అదొక్కటే..
మీకు మరికాస్త వివరణ. కత్తికి లభిస్తున్న వివరీత ప్రచారం తనను పెద్ద టీవీ సెలబ్రిటీగా మార్చి ఉండవచ్చు కానీ, తెలుగు సమాజంలో పవన్-అభిమానులు- కత్తి యుద్ధాలు తప్ప మరే విధమైన సమస్యలు లేవా అని జరుగుతున్న మరోరకం చర్చ కూడా నాకు ఆమోదమే. వాటిని కూడా నేను ఫాలోఅవుతున్నాను. చాలా కాలం తర్వాత టీవీ చర్చలకు దూరంగా ఉండి నిన్న అనుకోకుండా వీటిని చూశాను కాబట్టి దానిపై కాస్త సమయం తీసుకుని ఇలా పోస్టు చేశాను తప్పితే అంతకు మించిన ప్రాముఖ్యత దీనికి లేదని గుర్తించగలరు.
ఏది ఏమైనా మీ అజ్ఞాత వ్యాఖ్యకు ధన్యవాదాలు
"అంటే పవన్ అంత బలహీనంగా ఉన్నాడా" - నేను లేవనెత్తిన పాయింట్ కత్తి మహేష్ వ్యవహారశైలి గురించి. పవన్ బలహీనంగా ఉన్నాడా, బలంగా అన్నది పక్కన పెట్టండి. పవన్ నుంచి విముక్తికోసం జాతిపిత గాంధీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ లెవల్ లో కత్తి ఉద్యమిస్తానని గొంతు చించుకోవటంపై నేను ప్రశ్న లేవనెత్తాను. పవన్ పై ఆ స్థాయిలో కత్తి కట్టటం వెనక ఎజెండా ఏమిటని అడిగాను. మీరు కత్తి లాగానే పవన్ వైపు వెళుతున్నారు. పైన బ్లాగర్ హరిబాబుగారు తన కామెంటులో కూడా నేను చెప్పిన పాయింట్ నే చెబుతున్నారు. ఒకసారి గమనించండి. ఈ లింక్ కూడా చూడండి - https://www.facebook.com/TeluguData/videos/1747325971976647/
Post a Comment