Friday, August 26, 2016

పాకిస్తాన్ నరకమట... మన బంగారం మాటేమిటి?


క్షయవ్యాధి బారిన పడి ఆసుపత్రిలో కన్నుమూసిన తన భార్య శవాన్ని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన నివాసానికి తీసుకుపోవడానికి డబ్బులేక, అంబులెన్స్ దొరకక ఆమెను భుజాలపై పెట్టుకుని పది కిలోమీటర్లు నడిచిన ఒక ఆధునిక బేతాళుడు ఈ బుధవారం మన పౌర సమాజం మొత్తాన్ని చెళ్లున చెరిచాడు. ఆ పది కిలోమీటర్ల దూరం భార్య శవాన్ని మూట గట్టుకుని మోసిన ఆ గిరిజనుడు తన జీవిత కాలానికి సరిపడా నరకాన్ని చూసేశాడు.

కాని అతడు పాకిస్తాన్‌ని సందర్శించలేదు. గర్వించదగిన మన భారత దేశంలో, ఒరిస్సాలోని కలహాండి ప్రాంతంలో దశాబ్దాలుగా బతుకీడుస్తూ వచ్చాడతడు. క్షయ వ్యాధినుంచి భార్యను కాపాడుకోలేకపోయాడు. భార్య దేహాన్ని గౌరవప్రదంగా ఊరికి తీసుకుపోయేందుకు సరిపడా డబ్బులను కూడా మిగిల్చుకోలేకపోయాడు. అంబులెన్స్ లేక కాదు. ఆసుపత్రి వర్గాలు కరుణించక పోవడం, కొత్త అంబులెన్స్ ఆసుపత్రిలోనే ఉన్నా దాన్ని ప్రారంభించేందుకు వీఐపీ లేక అది అక్కడే మూలబడి ఉంది.

పాకిస్తాన్ వెళితే నరకాన్ని చూసినట్లే అని మన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ మధ్యనే పేర్కొన్నట్లు గుర్తు. ఆ గిరిజనుడు పాకిస్తాన్లో కాదు.  33 కోట్ల మంది దేవతలు నడయాడే ఈ గడ్డమీదే నరకం చూశాడు. భార్య శవం మోసి మోసి డస్సిపోయాడు. పది కిలోమీటర్లు నడిచివెళుతున్నప్పుడు ఏ ఒక్కరూ అతడిని పలకరించలేదు. పరామర్శించలేదు. మనిషిని దుప్పటి కప్పి భుజాలపై ఎందుకు మోస్తున్నావంటూ కనీస ఇంగితాన్ని కూడా ఎవరూ ప్రదర్శించలేదు. శక్తి ఉడిగిపోయి, ఊగుతూ ఊగుతూ నడుస్తున్న అతడిని, తండ్రిని అనుసరిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ వెళుతున్న 12 ఏళ్ల కుమార్తెను  కొందరు కరుణామయులు  ఆదుకున్నారు.

యావద్దేశాన్ని కదిలిస్తున్న ఈ నరకయాతనను ఓటీవీ అనే చానల్  చిత్రీకరించింది.  అది చిత్రించిన ఆ 22 సెకన్ల దృశ్యం రాతి గుండెలను సైతం కదిలిస్తోంది. ఇండియా ఈజ్ షైనింగ్ అంటూ పాలకులు మరోసారి పాట పాడుతున్న నేపథ్యంలో మన కళ్లముందు ఒక అభాగ్య శవానికి పట్టిన గతి ఇది. ఆవిర్భవిస్తున్న గ్లోబల్ సూపర్ పవర్‌గా పాలకవర్గాలు, దాని తైనాతీ మీడియా ఊదర గొడుతున్న భారత దేశంలో వ్యవస్థ తన పౌరులను ఏ స్థాయికి దిగజార్చివేస్తోందో తెలుసుకోవడానికైనా ఆ దృశ్యాన్ని అందరూ చూడాల్సిందే.

నిజంగా ఇవే మంచి రోజులు అయితే (అచ్చే దిన్) భారత్ నేరుగా అంధయుగాల్లోకి వెళుతున్నట్లే. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్..  బలూచిస్తాన్ కాస్తా వేచి ఉంటుంది కానీ.. ముందుగా మన కలహండిని సరిదిద్దుకుందాం. కానీ కలహండినో, ఒరిస్సానో, నవీన్ పట్నాయక్‌నో తప్పువట్టనవసరం లేదు. దేశమంతటా ఇదే బతుకే. బీదర్లో రెండు నెలలకాలంలో ఆత్మహత్యల పాలైన 25 మంది రైతులు, వరంగల్‌లో వ్యవసాయ దారు అయిన తండ్రి ఆత్మహత్య చేసుకుంటే కాలేజీ మానుకుని రైతుకూలీగా మారిన స్వప్న అనే అమ్మాయి కానీ, అక్షరాలా నరకాన్ని ఇక్కడే ఈ దేశంలోనే అనుభవించేస్తున్నారు.

గురువారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ మరో అద్భుతమైన ప్రకటన చేసి పడేశారు. తెలంగాణ మరొక కరువు బారిన పడనుందని ఎందుకు భావించాలి మనం? వర్షం కోసం ప్రార్థనలు చేద్దాం రండి అంటూ పిలుపిచ్చేశారీయన. భారత రాజ్యవ్యవస్థే మొత్తంగా మావోయిస్టుల కంటే, జిహాదీల కంటే పెద్ద టెర్రరిస్టుగా మారుతున్నప్పుడు ప్రజలకు ప్రార్థించడం తప్ప మరొక దారి ఏమున్నది కనుక? కనికరించమని వేడుకోవడం తప్ప వారికి వేరే దారి ఏముందీ దేశంలో? జీవితం పట్ల ఎలాంటి ఆశలు మోసులెత్తని రైతుకు పురుగుల మందును చేరుకోవడం, మెడకు తాడు బిగించుకోవడాన్ని మాత్రమే మన వ్యవస్థ ఆఫర్ చేస్తోంది.

మరోవైపు ఆంధ్రా-చత్తీస్‌గడ్ సరిహద్దులో 30వ జాతీయ రహదారి పొడవునా మావోయిస్టు రాజ్యం నడుస్తోంది. భారత్ లోని ఆ భాగంలో నివసిస్తున్న ప్రతి గ్రామస్తుడూ మావోయిస్టు సానుభూతిపరుడిగా ముద్రించబడుతున్నారు. కుంట ప్రాంతంలోని నిరుపేద గిరిజనులు నక్సలైట్ల ప్రభావంలోకి వెళ్లడం తప్ప వారికే మార్గమూ మిగిలిలేదు. అన్నలకు తిండి పెడుతున్నారని రాజ్యం వారిని వేధిస్తున్నప్పుడు విసిగిపోయిన ఆ గిరిజనులు నేరుగా తుపాకీ పడుతున్నారు. రాజ్యం ఇక్కడ ఒక నిషిద్ధ మానవుడిని తయారు చేస్తోంది. అతడిని జాతి మొత్తానికే అతిపెద్ద అంతర్గత శత్రువుగా ముద్ర వేస్తోంది. ఆ తర్వాత అతడిని ఎన్‌కౌంటర్ లెక్కలో వేసుకుని చంపడం చాలా సులువు.

కలహండి, బీదర్, వరంగల్, ఉస్మానాబాద్, కుంట.. ఇలా పలు ప్రాంతాల గాధలన్నీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వ్యవస్థ పూర్తిగా పతమైపోయిందనడానికి తిరుగులేని రుజువులుగా కనబడుతున్నాయి. మరోవైపున భారత జాతిపైనే అత్యాచారం సల్పుతూ దురహంకారపు జాతీయవాద నినాదాలు దేశమంతా పెచ్చరిల్లుతున్నాయి. ఈ నినాదాలు చేసే పని ఒక్కటే. డబ్బుల్లేక భార్య శవాన్ని మోసుకెళుతున్న దానా మాజి వంటి విషాదమూర్తుల నరక ప్రాయపు జీవితాలను ప్రపంచం కంట బడకుండా దాచి ఉంచడమే.

రాతిగుండెలను సైతం కరిగిస్తూన్న ఈ వీడియోను ఈ తెల్లవారు జామున చూస్తున్నప్పుడు నాలో రేగుతున్న ప్రశ్న ఒక్కటే..

మనం అన్నం తినే బతుకుతున్నామా?

కొంతమంది సహాయంతో భార్య దేహానికి దానా మాజీ అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఆమెకు ఇకనైనా శాంతి కలుగుతుందన్న ఆశ అతనికి ఉండవచ్చు. నిజంగానే ఆమెకు శాంతి లభించవచ్చు. "భారత ప్రజలమైన మేము" అని మనం ఘనంగా చెప్పుకుంటున్న ఈ భూభాగంలో భాగం కాకుండా ఆమె వీడ్కోలు పలికింది కదా మరి.

మన ఇంటిని చక్కదిద్దుకోవడం తెలీని మనం మాత్రం పాచి పళ్ల దాసరి పాటను పాడుకుంటూనే ఉందాం. భారతదేశం చాలా గొప్ప దేశము. పాకిస్తాన్ అతి పెద్ద నరకము. భూమ్మీద మనవంటి జాతి లేదు అనుకుంటూ.. నినాదాలకు, వివాదాలకు, విద్వేషాలకు, దురహంకారపు దేశభక్తులకు ఇక్కడ కొదవ లేదు కదా.

దిగ్భ్రాంతి కలిగిస్తున్న ఆ వీడియోను, మూల రచన పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడండి. చదవండి.

For A Man Who Had To Carry His Wife's Dead Body For 10 Kilometres, Is India Not Hell
http://www.huffingtonpost.in/2016/08/25/for-a-man-who-had-to-carry-his-wifes-dead-body-for-10-kilometre

బద్ద శత్రువును హతమార్చిన సందర్భంలో కూడా అతడి శవానికి అంతిమ గౌరవం ఇవ్వాలనే అత్యున్నత సంస్కారం వేలాది సంవత్సరాల మనుగడలో మానవజాతి నేర్చుకున్న అతి గొప్ప పాఠాల్లో ఒకటి. ఈ వీడియోలో మనం చూస్తున్నదేమిటి? కళ్లముందు కన్నుమూసిన సహచరిని ఆ గిరిజనుడు మనిషిగా కాదు బండరాయిలాగా మోసుకుపోతున్నాడు. అమ్మను కోల్పోయిన బాధ, ఆ బాధలోనూ తండ్రితో కలిసి పది కిలోమీటర్ల పైన నడిచినప్పుడు కలిగే శోషతో ఆ చిన్నారి. చనిపోయిన ఆ తల్లికి ఒక వస్తువుకు లేదా పరిభాషలో చెప్పాలంటే ఒక సరకుకు ఉండే కనీస విలువ కూడా లేదు.

ఒక రజతపతకం అతి కష్టంమీద తీసుకొచ్చిన పీవీ సింధుకు నజరానాలు బహుకరించడంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంత జుగుప్సాకరమైన రాజకీయాలను ప్రదర్శించారో అందరం చూశాం. సింధు, సాక్షి, దీపా కర్మార్కర్ సాధించిన విజయాలను తేలిక చేయకూడదు. నిజమే. ఇక్కడ మనిషిగా జీవించటం అనే భావనకు కూడా దూరంగా ఉంటూ తల్లిని పోగొట్టుకున్న నిస్సహాయ బాలికకు ఈ దేశం ఏమని సమాధానమిస్తుంది? ఇక్కడ రాజకీయాలు చేయడానికి ఎలాంటి హంగామాలు లేవు కాబట్టి ఆమె ఇక అనాథగా అలా పడి ఉండాల్సిందే.  ఆర్థిక పరంగానే కాదు.. విద్యా పరంగా, అవకాశాలు దక్కించుకుంటున్న పరంగా కూడా బలిసినవారిదే భారతదేశం అంటే చాలామందికి కోపం రావచ్చు. కానీ జనజీవిత వాస్తవం ఇంతకంటే భిన్నంగా ఇక్కడ ఏడ్చి చస్తోందా?