Pages

Wednesday, November 16, 2022

గ్లాసెడు నీళ్ల సిద్ధాంతం - వీఐ లెనిన్

 

''ఆడపిల్లలకు..

''పెళ్లికి ముందు సెక్స్ విషయంలో ఏవో కొన్ని విలువలు మీకు మీరే ఏర్పరచుకోండి. ఎలాంటివి అని నన్ను అడిగితే నేను చెప్పలేను. మీ చదువు, అనుభవం, మీ గతం, మీ కుటుంబం, మీ పరిసరాల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలో, మరొకటో..ఏవో కొన్ని విలువలను సెక్స్‌కు జత చేసుకోండి. దాని వల్ల శారీరక సంబంధాలలోకి దిగేటప్పుడు, మీకొక అడ్డంకి ఉంటుంది. అది దాటే ముందు ఒకసారి ఆలోచిస్తారు. ఇది చాలా అవసరం'' అంటూ బీబీసీ తెలుగు విభాగంలో పనిచేస్తున్న ఆలమూరు సౌమ్య గారు రాసిన ఈ కథనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ...''

ఆమె  రాసిన ఒరిజనల్ కథనాన్ని తప్పకుండా పూర్తిగా చదవండి. ఆమె వ్యాసంపై ఒక సినీ మిత్రుడితో ఇటీవలే సాగించిన వాట్సాప్ సంభాషణ క్రమంలో నాటి సోవియన్ యూనియన్ అధినేత వీఐ లెనిన్ రాసిన గ్లాసెడు నీళ్ల సిద్ధాంతం గురించిన ప్రస్తావన కూడా వచ్చింది. ఆమె కథనం సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్‌కి గురవుతోందో తెలిసిందే. దీనిపై నా సినీమిత్రుడికి నాకూ మధ్య జరిగిన వాట్సాప్ చర్చను పంచుకోవాలనిపించింది. సమయం ఉన్నప్పుడు దీన్ని తీరిగ్గా చూడండి.

సర్, ఆలమూరు సౌమ్య రాసిన కింది అంశాలు మరో కోణంలో చూడాలనుకుంటాను. సెక్స్ సంబంధాల్లో మోసపోతే జీవితమే కోల్పోయినట్లు భావించవద్దని ఆమె ప్రధాన అభిప్రాయం.

''తెలివి తెచ్చుకోండి. సెక్స్ ముఖ్యమే, కానీ దానికి ఇవ్వాల్సినత ప్రాముఖ్యమే ఇవ్వండి. అదే జీవితం కాదు. సెక్స్‌ని ఒక శారీరక అవసరంగా చూడడం నేర్చుకోండి. దానికి విలువ ఇవ్వండి. గౌరవించండి. దాని ద్వారా ఆనందం కలగాలి తప్పితే బాధ కాదు. వ్యక్తిగత హక్కును ఉపయోగించుకోవడం ఎంత సంతోషమో, ఎంత గర్వమో గుర్తించండి. తెలివిగా ఉండండి...... వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అని ఏడుస్తూ జీవితాలను నాశనం చేసుకోకండి. వాడెలా దులిపేసుకుంటున్నాడో, మీరూ అలా దులిపేసుకోండి. దానికి కావలసిన దన్ను సంపాయించండి. ఈ కాలం అమ్మాయిలకు కావలసింది ఈ తెలివితేటలే. ఇంకా ఎన్నాళ్లని ఈ ఏడుపులు, కేసులు.. అవీ ఎటూ తేలక వేదన, బాధ!''

''శారీరక సంబంధాలలో ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోకండి. తలలో దురదగా ఉంటే తల స్నానం చేసి ఆ దురదని వదిలించుకుంటాం కదా, అలా శరీరానికి పట్టిన దురదను వదిలించేసుకుని, తలంటుకోండి. అంతటితో దాన్ని వదిలేయండి'' అంటూ సౌమ్య చెప్పిన దాన్ని కూడా.. ప్రేమ పేరుతో వంచనకు గురవుతున్న వారికి 2020ల నాటి సమాజంలో జీవితం పట్ల భరోసా కల్పించడానికేనని అర్థం చేసుకోవాలనుకుంటాను.''


లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న ప్రేమికురాలిని ఢిల్లీలో ఒక ప్రేమికుడి రూపంలోని ఉన్మాది నిలువునా చంపేసి 35 ముక్కలుగా నరికి, వాటిని ఫ్రిజ్ లో  పెట్టి 18 రోజులపాటు సమీపంలోని అడవిలో పారేసి అయిదు నెలలపాటు దొరక్కుండా దాగిన విషయం రెండురోజులుగా బయటపడుతోంది. ఇప్పుడు సెక్సు వాంఛలు తీర్చుకునేంత వరకు అన్ని లివ్ ఇన్ రిలేషన్లు పనికివస్తాయి. అది పెళ్లి దాకా తీసుకువచ్చేసరికి హత్యలు, శరీరాన్ని ముక్కలు చేసి వాటిని ఫ్రిడ్జ్‌లో దాచి ఉంచి రోజూ ఆమె తల చూస్తూ గడిపే నికృష్ట కాలం మన కళ్లముందుకే వచ్చేసింది. ప్రేమ లేక సెక్స్ లేదా స్త్రీపురుష బంధాన్ని వ్యక్తిగతంగా మాత్రమే చూస్తూ కాలం నెట్టుకొస్తున్న రోజులివి. ఆధునిక స్త్రీ చరిత్ర తిరగరాస్తుందని గురజాడ ఏనాడో అన్నారు. నవీన స్త్రీ స్వేచ్చను ఇక ఎవరూ అరికట్టలేరని 90 ఏళ్ల క్రితమే చెలం ఆధునికతకు తనదైన నిర్వచనం ఇచ్చేశారు. కానీ వ్యక్తిత్వం లేని స్వేచ్ఛ, లైంగిక సంబంధం మాత్రమే ప్రధానం అంటున్న స్వేచ్చ, స్వీయ నియంత్రణ అనేదానికి అర్థం తెలీని స్వేచ్ఛ అనేవి స్త్రీ స్వేచ్ఛ అనే భావనకే సరికొత్త శృంఖలాలను బిగిస్తోందా.. ఆ పాడుకాలమే సరికొత్త రూపంలో లయిస్తోందా.. 

వందేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన సోవియట్ యూనియన్ పాలనా కాలంలో రష్యన్ సమాజంలో యువతీయువకుల మధ్య ఏర్పడుతున్న సంబంధాలు, ప్రేమ, లైంగిక ఆకాంక్షలు వంటి వాటిపై సోవియట్ యూనియన్ అధినేత వీఐ లెనిన్, క్లారా జెట్కిన్ తదితరులతో చర్చించారు. ప్రేమ, సెక్స్, కోరికలు వ్యక్తిగతమైనవి కావని, వాటిలోని సామాజిక అంశాన్ని వాటి చుట్టూ ఏర్పడే కుటుంబాన్ని, సమాజం పట్ల ప్రేమికుల బాధ్యతను కూడా మర్చిపోరాదని లెనిన్ ఆ సంభాషణలో చెప్పారు. రష్యన్ యువత ప్రేమను, లైంగిక జీవితాన్ని పూర్తిగా వ్యక్తిగత సమస్యగా చూస్తున్నారు. ఇది తప్పు అని లెనిన్ స్పష్టం చేశారు. 

వందేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగుసమాజంలో సెక్స్, ప్రేమ, శారీరక సంబంధాల పట్ల తాజాగా జరుగుతున్న చర్చ సందర్భంగా లెనిన్ వ్యాఖ్యలు మరోసారి పరామర్శించాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను, ఆధునిక స్త్రీ వందేళ్ల ప్రయాణంలో భాగంగా ఇప్పుడు వారిముందు కెరీర్ పరంగా, విద్య పరంగా, ఆకాంక్షల పరంగా ఎన్నో అవకాశాలు తలుపుతడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రేమ పేరుతో మోసపోతే, వంచనకు గురైతే వారు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే అంశంలో ఆలమూరు సౌమ్య రాసిన విషయాలు ఆధునిక సమాజంలో స్త్రీ భావాలకు పట్టం కట్టేవే.


లెనిన్ ఏం చెప్పారంటే..

లైంగిక వాంఛను తీర్చుకోవడం అనేది గ్లాసెడు మంచినీళ్లు తాగడం అంత సింపుల్ గా ఉంటుందని 1910, 20లలో రష్యా సమాజంలో బలపడిన అభిప్రాయాలను లెనిన్ తీవ్రంగా ఖండించారు. ''ఈ గ్లాసెడు మంచి నీళ్ల సిద్ధాంతం మన యువతను పిచ్చెక్కిస్తోంది. కానీ ఈ సిద్ధాంతం కచ్చితంగా మార్క్సిస్టు వ్యతిరేకమైంది. పైగా ఇది సంఘ వ్యతిరేకం కూడా. సెక్సువల్ లైఫ్‌ సులభమైన అంశం కాదు. దీనిలో సాంస్కృతిక లక్షణాలు ముడిపడి ఉన్నాయి. సెక్సులోని సామాజిక అంశాన్ని మర్చిపోరాదు. గ్లాసెడు నీళ్లు తాగడం అనేది వ్యక్తిగత వ్యవహారమే కావచ్చు. కానీ ప్రేమ అనేది రెండు జీవితాలకు సంబంధించింది. దీంట్లో బిడ్డ రూపంలో మరో ప్రాణి జీవితం కూడా ఉంది. ఇక్కడే సామాజిక ఆసక్తితోపాటు కమ్యూనిటీ పట్ల బాధ్యత కూడా ఉంది'' అని క్లారా జెట్కిన్‌తో లెనిన్ చర్చించారు. ఈ గ్లాసెడు మంచి నీళ్ల సిద్ధాంతం స్థానంలో స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణకు లెనిన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. 

లైంగిక జీవితంలో కరిగిపోవడం అనేది తనకు తానుగా బూర్జువా సంస్కృతి క్షీణ దశ అనే చెప్పాలి. దీన్ని కమ్యూనిస్టులు అనుకరించకూడదు. బూర్డువా క్షీణ ఆలోచనలకు ఈ గ్లాసెడ్ మంచినీళ్ల సిద్ధాంతం ఏ రకంగానూ విభిన్నం కాదని లెనిన్ హెచ్చరించారు. ప్రేమలోని సామాజిక అంశాన్ని ఈ గ్లాసెడు మంచినీళ్ల సిద్ధాంతం పూర్తిగా విస్మరిస్తోందని లెనిన్ నొక్కి చెప్పారు. 

రష్యన్ యువత ప్రేమను, లైంగిక జీవితాన్ని పూర్తిగా వ్యక్తిగత సమస్యగా చూస్తున్నారు. ఇది తప్పు అని లెనిన్ స్పష్టం చేశారు. కమ్యూనిస్టుగా ఈ గ్లాసెడు మంచినీళ్ల సిద్ధాంతం పట్ల కనీస సానుభూతి కూడా నేను ప్రదర్శించను. ప్రేమలో సంతృప్తి అనే చక్కటి శీర్షికతో ఇది ముందుకొస్తోంది అని లెనిన్ వ్యాఖ్యానించారు.

కాబట్టి...

శారీరక ఆకర్షణలకు, వయోగతంగా అనివార్యంగా పుట్టుకొచ్చే లైంగిక వాంఛలకు లోనై వంచనకు గురవుతున్న వారికి మాత్రమే ఆలమూరు సౌమ్య అభిప్రాయాలు వర్తిస్తాయి. ఉద్యమ జీవితం, సామాజిక బాధ్యతల్లో మునిగి తేలేవారికి ఇవి వర్తించవు. ఎందుకంటే వీరు సెక్స్‌ వాంఛలను అదుపులో పెట్టుకునే చైతన్యం కలిగి ఉంటారు. కమ్యూనిస్టు, విప్లవ ఉద్యమ కార్యకర్తల్లో బలహీన క్షణాలకు గురికాని వారు ఉండరని గ్యారంటీ లేదు. కానీ లెనిన్ చెప్పిన స్వీయ క్రమశిక్షణ , స్వీయ నియంత్రణ ఇప్పటికీ వీరికి అనుభవ సత్యంగానే ఉంటుంది.

“Glass-of-water theory”

“You must be aware of the famous theory that in communist society the satisfaction of sexual desire, of love, will be as simple and unimportant as drinking a glass of water. The glass of water theory has made our young people mad, quite mad…I think this glass of water theory is completely un-Marxist, and moreover, anti-social. In sexual life there is not only simple nature to be considered, but also cultural characteristics, whether they are of a high or low order…Of course, thirst must be satisfied. But will the normal man in normal circumstances lie down in the gutter and drink out of a puddle, or out of a glass with a rim greasy from many lips? But the social aspect is the most important of all. Drinking water is of course an individual affair. But in love two lives are concerned, and a third, a new life, arises. It is that which gives it its social interest, which gives rise to a duty towards the community.”(Clara Zetkin, Reminiscences of Lenin, p. 49)

Lenin, in particular, pointed out that the “glass-of-water theory” completely ignored the social aspect of love. Certainly the drinking of a cup of water is merely an individual thing. But love, although seen as something “private,” in fact has another aspect. Love is first of all a relationship and connection between two people. Therefore, it is already a social relation. Moreover, through the connection of two people, a “third new life” can be born. Seen from the perspective of humanity, the birth of a child through the relationship between a man and a woman is of decisive social importance. Thus, the social significance of love must be noted, rather than viewing it as purely individual problem. Young people tend to view this as a purely individual problem, and there is no lack of theories that appeal to this tendency. However, according to Lenin this is a mistake and he says that, “as a communist I have not the least sympathy for the glass of water theory, although it bears the fine title ‘satisfaction of love.’