Pages

Friday, January 27, 2017

కూడు పెట్టేది ఇంగ్లీష్ కాదు – నైపుణ్యమే!



తెలుగు జాతి పిల్లలు మునుపటిలా తెలుగు మాధ్యమంలో చదవాలా? లేక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బుల్లెట్ ట్రెయిన్ వేగంతో తీసుకువస్తున్న ఆంగ్లం మాధ్యమంలో చదవాలా అనే అంశంపై గత కొంతకాలంగా తెలుగు దినపత్రికల్లో, ప్రజాసాహితి వంటి మాస పత్రికల్లో వస్తున్న వ్యాస పరంపరలో తాజా రచన "కూడు పెట్టేది ఇంగ్లీష్ కాదు – నైపుణ్యమే!". ఆంగ్లంలో చదవకపోతే పిల్లలు అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోలేరు అంటూ సాగుతున్న పరమ భయంకర వితండ వాదాన్ని తిప్పి కొడుతూ, మాతృ భాషా మాధ్యమంలో చదవడం కంటే మించిన గొప్ప సౌలభ్యం, అవకాశం ఏ భాషా సమాజానికీ ఉండదని ప్రతిపాదిస్తున్న నిరుపమాన కథనం ఇది.

బతుకు తెరువు కోసం ఏ దేశానికి వెళితే ఆ దేశ భాషను మూడు నెలల్లో నేర్చుకుని స్థానికులతో అదే భాషలో కమ్యూనికేట్ చేయగలుగుతున్న ఆ దళిత ఎలక్ట్రీషియన్ మాతంగి కోటేశ్వరరావు (11 భాషలు నేర్చిన ప్రవీణుడు)కు నీరాజనం అర్పించాలి మనందరం. అలాగే కేవలం నాల్గవ తరగతి మాత్రమే చదువుకుని ఆఫ్రికాలోని అనేక దేశాలకు వెళ్లి కృత్రిమ కాళ్ళను తయారు చేయడంపై వర్క్ షాప్‌లను ఆంగ్లంలో నిర్వహిస్తున్న ఆ దళిత యువకుడికీ నమస్కరించాలి మనం.

ఇంగ్లీషు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు అని అడిగితే నవ్వేసి ‘అదేమన్నా బ్రహ్మ విద్యా అండి, అవసరం అయితే ఏ భాష అయినా కొద్ది రోజుల్లోనే తేలికగా నేర్చుకోవచ్చు’ అని సమాధానమిచ్చాడితడు. అతడి అనుభవం ప్రకారం ఒక కొత్త భాషను నేర్చుకోవడానికి కేవలం 3 నెలల సమయం సరిపోతుంటే చిన్నప్పటి నుంచే సైన్స్, సోషల్, లెక్కలు ఇంగ్లీషులో నేర్చుకోవలసిన అవసరం ఏమిటి? అని ప్రతిపాదిస్తున్న ఈ వ్యాసం డాక్టర్ దాసరి రామకృష్ణ ప్రసాదు గారిది.

telugumaata@googlegroups.com గ్రూపు నుంచి బొందలి శ్రీనివాస్ గారు పంపిన ఈ వ్యాసాన్ని అక్షరం కూడా మార్చకుండా యధాతథంగా ఇక్కడ మళ్లీ పోస్ట్ చేస్తున్నాను.

ఆంగ్ల మానస పుత్రులు... వారి మానస మానస మానస సంతానానికి ఇది కాస్తయినా కనువిప్పు కలిగిస్తుందనే ఆకాంక్షతోనే డాక్టర్‌ దాసరి రామకృష్ణ ప్రసాదు గారి రచనను ఇక్కడ అందిస్తున్నాను.

భిన్నాభిప్రాయాలకేం... చాలా ఉంటాయి. కానీ చదవడానికి అవేమన్నా అభ్యంతరపెడతాయా..

చదవండి.
                               

                                                *****************





కూడు పెట్టేది ఇంగ్లీష్ కాదు – నైపుణ్యమే!

పసిప్రాయం నుంచీ సొంత భాషలో పాఠాలు చెప్పకుండా పరాయి భాషలో చెప్పడం పిల్లల సృజనాత్మకతను దెబ్బతీయడమే కాక, దేశ స్వావలంబనకు అతి పెద్ద నష్టం కూడా. పరాయీకరణ చెందిన యువతరంతో మన దేశాన్ని నిర్మించడం అత్యంత కష్టం. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన ఏ దేశమూ పరాయి భాషలో చదువు చెప్పడం లేదు.

"‘తెంస్కృత’ మీడియం తీసేద్దురూ!" అనే శీర్షికన జనవరి 25న హెచ్చార్కె రాసిన వ్యాసానికి ఇది నా స్పందన. మూడు, నాలుగు సంవత్సరాలు ఇంటి భాషలో పదజాలాన్నీ, వాక్య నిర్మాణాన్ని నేర్చుకొని చక్కగా భావ వ్యక్తీకరణ చేయగలిగిన పసి వారు ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, సమన్వయం చేసుకోవడానికే పాఠశాలకు పంపబడతారు. ఆడుతూ, పాడుతూ అలవోకగా లెక్కలు, సైన్స్, సోషల్ శాస్త్రాలు నేర్చుకోవాల్సిన వాళ్ళకు తెలియని ఆ సబ్జెక్టులను బొత్తిగా తెలియని ఇంగ్లీష్ భాషలో నేర్చుకోవలసిన పరిస్థితి అత్యంత బాధాకరం.

పిల్లల సొంత భాషలో మరిన్ని విషయాలు చెప్తే త్వరగా నేర్చుకోగలరు గానీ, అర్థంకాని ఇంగ్లీషులో నేర్చుకోవడానికి వాళ్ళు పడే కష్టం ఎంత దురదృష్టం! బట్టీ పట్టి అప్పచెప్పటమూ, రాయడం ద్వారా మార్కులు తెచ్చుకుని తలిదండ్రులనూ, ఉపాధ్యాయులనూ సంతోషపెట్టవలసి వస్తుంది. బాల్యాన్నీ, బాలల సృజనాత్మకతనూ ఇలా చిదిమేసే హక్కు తల్లిదండ్రులకు ఎక్కడిది? ‘‘భాషా పునాదులు పూర్తిగా ఏర్పడటానికి మొదటి 7 సంవత్సరాలు పడుతుంది. ఈ మొదటి భాష పునాదిపై ఎన్ని భాషలయినా సులభంగా నేర్చుకోవచ్చు’’ అని భాషా శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా! ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల మానేసేవారి సంఖ్య (Drop outs) పెరుగుతున్న విషయం నిరూపించబడినది. పల్లెటూళ్ళలో ఉండేవారికి ఇది విదితమే! ఇంతకు ముందు సరిపడా ఆర్థిక స్థాయి లేక మానేసేవాళ్ళు; ఇప్పుడు పరాయిభాషా మాధ్యమం కూడా కారణంగా తోడయ్యింది.

ఇంగ్లీష్ మాత్రమే కూడు పెట్టదు. మన చుట్టూ ఉన్న అనేక ఉద్యోగాలలో చూస్తే ఇంగ్లీష్ వలన మాత్రమే సంపాదిస్తూ బ్రతికేవారు అతి తక్కువమంది. ఏదో ఒక పని నైపుణ్యమే వారికి కూడు పెడ్తోంది. ఇంగ్లీషులో వ్యవహరించగలగడం, కంప్యూటర్‌తో పనిచేయగలగడం కొన్ని ఉద్యోగాలలో కేవలం అదనపు అర్హతలు. కావలసిన వారు ఇంగ్లీషును నేర్చుకోవడం పెద్ద సమస్యేమీ కాదు. కానీ పసిప్రాయం నుంచీ సొంత భాషలో పాఠాలు చెప్పకుండా పరాయి భాషలో చెప్పడం పిల్లల సృజనాత్మకతను దెబ్బతీయడమే కాక, దేశ స్వావలంబనకు అతి పెద్ద నష్టం కూడా. పరాయీకరణ చెందిన యువతరంతో మన దేశాన్ని నిర్మించడం అత్యంత కష్ట సాధ్యం. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందిన ఏ దేశమూ పరాయి భాషలో చదువు చెప్పడం లేదు. పరాయి భాషలో చదువు చెప్పిన దేశాలు కేవలం సేవారంగంలో తప్ప ఉత్పత్తి రంగంలో అభివృద్ధి చెందనే లేదు.

కృష్ణా జిల్లా బొబ్బర్లంక గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించిన మాతంగి కోటేశ్వరరావు 11 భాషలు మాట్లాడగలడు. కేవలం 9వ తరగతి మాత్రమే చదివిన అతనొక ఎలక్ట్రీషియన్. తన కాంట్రాక్టరు ఏ దేశం వెళ్ళమంటే ఆ దేశం వెళ్లి అక్కడి భాషను 3 నెలల్లోనే నేర్చుకునేవాడు. అవసరం అతనికి అన్ని భాషలూ నేర్పింది. పనిలో నైపుణ్యంతో మాత్రమే అతనికా ఉద్యోగం లభించింది.

రామన్ మెగసెసే అవార్డు విజేత డాక్టర్‌ రజనీ కాంత్ అరోలి వద్ద కేవలం నాల్గవ తరగతి మాత్రమే చదువుకున్న దళిత యువకుడు. ఆఫ్రికాలోని అనేక దేశాలకు వెళ్లి కృత్రిమ కాళ్ళను తయారు చేయడంపై వర్క్ షాప్స్ను ఆంగ్లంలో నిర్వహించేవాడు. ఇంగ్లీషు ఇంత బాగా ఎలా నేర్చుకున్నావు అని అడిగితే నవ్వేసి ‘అదేమన్నా బ్రహ్మ విద్యా అండి, అవసరం అయితే ఏ భాష అయినా కొద్ది రోజుల్లోనే తేలికగా నేర్చుకోవచ్చు’ అని సమాధానమిచ్చాడు. ఒక కొత్త భాషను నేర్చుకోవడానికి కేవలం 3 నెలల సమయం సరిపోతుంటే చిన్నప్పటి నుండే సైన్స్, సోషల్, లెక్కలు ఇంగ్లీషులో నేర్చుకోవలసిన అవసరం ఏమిటి?

పరాయి భాషను నేర్పే పద్ధతులలోనే ఏ కొత్త భాషనైనా నేర్పాలి గదా! సైన్స్, సోషల్, లెక్కలు సబ్జెక్టుల ద్వారా కొత్తభాషను నేర్పడం అనే ప్రయోగం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఎందుకంటే అది ఇంగితజ్ఞానం (కామన్ సెన్స్)కు కూడా అశాస్త్రీయమని అర్థమవుతుంది. అందుకే అతి చిన్న దేశమైన కొరియాలో కూడా ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ వరకు వారి సొంత భాషలోనే బోధిస్తారు. మరి మన పిల్లలేం పాపం చేసుకున్నారు?

ఇది శాస్త్రీయం అని తెలిసినపుడు ప్రభుత్వాలను వత్తిడి చేసి సొంత భాషలోనే పాఠశాల విద్య ఉండేటట్లు చేయాలి కానీ, తల్లిదండ్రులందరూ కోరుకుంటున్నారు కనుక రాష్ట్రమంతా ఇంగ్లీషు మీడియం స్కూళ్ళే ఉండాలని నిర్ణయించడం వివేకమేనా? తెలియక నిప్పును పట్టుకునే పసివాడిని వదలి ఊరుకుంటామా? వెంటనే నిప్పుకు దూరంగా తీసుకువెళ్తామా?



గత వారంలో మా బంధువు కోపెన్ హాగాన్ (డెన్మార్క్ రాజధాని) నుంచి వచ్చాడు. అక్కడి విద్య గురించి చెబుతూ ఎల్‌కేజీ నుంచి పీహెచ్‌డీ వరకూ బోధన అంతా డేనిష్ (వాళ్ళ భాష)లోనే ఉంటుందనీ, కేవలం విదేశస్తుల కోసమే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉంటాయనీ చెప్పాడు. యూరప్ అంతా అలానే ఉంటుంది. ఇంగ్లీష్ మాతృభాష కాని ఏ అభివృద్ధి చెందిన దేశంలోనైనా (ఉదాహరణకి– ఇంగ్లాండ్ మినహా మిగిలిన యూరప్ దేశాలు, జపాన్, చైనా, కొరియా) విద్య మొత్తం వారి సొంత భాషలోనే ఉంటుంది. వ్యాపారావసరాలకు కానీ, మరే ఇతర అవరసరాలకైనా గానీ వేరే దేశాలకు వెళ్ళవలసిన వారు మాత్రమే ఇంగ్లీషూ, వేరే దేశ భాషలూ నేర్చుకుంటారు.

అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలలో ఉద్యోగాలు చేస్తున్న తెలుగువారు వారి నైపుణ్యంతో మాత్రమే పొట్టపోసుకుంటున్నారు. ఆంగ్లంలో భావ వ్యక్తీకరణ వారికి అదనపు అర్హత మాత్రమే. అక్కడికి వెళ్ళడానికి, ఆ తర్వాత వ్యవహరించడానికి 3 నెలల కోర్సు చాలు. ఈ కొద్ది మంది కోసం లక్షలాది బాలల బాల్యాన్ని బలిచేయడం అన్యాయం కాదా? మాతృభాషలో విద్య అనే అంశం కేవలం తెలుగు భాష మీద ప్రేమతో కాదు. మన పిల్లల బాల్యం, మన దేశ స్వావలంబన, సర్వతోముఖ వికాసం ఇక్కడ ముఖ్యమైన విషయాలు.

ధనికులు, అగ్ర కులస్తులుగా పిలవబడే వారి పిల్లలంతా ఆంగ్ల మాధ్యమంలో చదవడం వలన లబ్ధి పొందడం ఒక మిథ్య. అలాగే బడుగుల పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో పాఠశాల విద్య నేర్వకపోవడం వలన నష్టపోవడం మరొక భ్రమ. ఏ మీడియంలోనైనా రాణించగల బలమైన గిత్తల్లాంటి ఐదారు శాతం పిల్లలకు తప్ప మిగిలిన గ్రామ ప్రాంతాల బడుగు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య వారి పురోభివృద్ధికి పెద్ద అడ్డంకిగా నిలిచి, కీడు చేస్తుందే తప్ప కూడు పెట్టదు.

ఆఖరుగా ప్రముఖ రచయిత ‘‘కాలువ మల్లయ్య’’ గారి మాటలు ఉటంకిస్తూ ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను: ‘‘దళిత బహుజనుల్లో నుండి, కటిక పేదరికం నుండి వచ్చిన నాలాంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదవడం వల్లనే జీవితాలను గెలుచుకొన్నారు, గెలుచుకొంటున్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో గూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే, అసంఖ్యాక బడుగు జనుల పిల్లలు ధనికుల పిల్లల్లాగే తమ మూలాలకు దూరమై, యంత్రాలుగా మారి, అన్ని విధాలా ఓడిపోతారు.’’

డాక్టర్‌ దాసరి రామకృష్ణ ప్రసాదు
27-01-2017  - 01:38:35
 

                                           ***************


అమృతోపమానమైన ఈ వ్యాసాన్ని నా జిమెయిల్ ఐడీకి పంపిన వారు శ్రీనివాస బొందలి గారు
Sreenivas Bondili <telugusreenivasu@gmail.com>

ఈ వ్యాసం తెలుగుమాట గూగుల్ గ్రూప్‌లో భాగంగా వచ్చింది. ఆసక్తి కలిగిన వారందరూ ఈ గ్రూప్‌లో చేరవచ్చు. అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు.
telugumaata@googlegroups.com

------------------------------

తాజా సమాచారం.

ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి సంపాదక పేజీలో వచ్చింది. దాని వెబ్‌సైట్ లింకు కింద చూడగలరు



Tuesday, January 24, 2017

మీడియా నేర్వదగిన పాఠం


దేశాధ్యక్షుడు ప్రదర్శిస్తున్న శత్రువైఖరి అమెరికా మీడియాను ఒక్కటిగా చేసింది. ఎంత కండబలాన్ని ప్రదర్శించినా, శ్వేతసౌథం నుంచి ప్రెస్ బృందాన్ని సాగనంపినా ఈ యుద్ధంలో ట్రంప్ విజయం పొందలేడని తేల్చి చెప్పింది. జర్నలిస్టులు ఎవరు, వారెందుకు, ఎవరికోసం ఉంటున్నారు అనే మౌలిక సమస్యల పట్ల పునరాలోచించుకునే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడికి కృతజ్ఞతలు చెప్పింది అక్కడి మీడియా. మరి.. కాస్త ఒంగమంటే సాష్టాంగపడిపోతున్న మన మీడియా పరిస్థితి ఏమిటి? 

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రెండు యుద్ధాలను ఎదుర్కొంటున్నారు. ఒకటి. ట్రంప్‌‌పై విరుచుకుపడుతున్న మహిళా నిరసన ప్రదర్శనలు. రెండు. మీడియాపై ట్రంప్ స్వయంగా ప్రకటించిన యుద్ధం. ఇప్పుడు ఈ రెండు ఘటనలే కొత్త అధ్యక్షుడి భవిష్యత్తును నిర్దేశించే సంకేతాలను ఇస్తున్నాయి. అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాది మహిళలు ట్రంప్ విధానాలపై, అతడి పురుషాహంకారపు అసభ్య ప్రకటనలపై వీధుల్లోకి వచ్చేశారు. మరోవైపు అమెరికా మీడియా మొత్తంపై కత్తిగట్టినట్లుగా ట్రంప్ నేరుగా మీడియా వ్యతిరేక యుద్ధానికి పిలుపునివ్వడం అమెరికా సమాజం ఎన్నడూ చూసి ఉండని ఘటన. దేశాధ్యక్షుడికి, అమెరికా మీడియాకు మధ్య సంబంధం ఇప్పుడు అత్యంత హీన స్థాయికి చేరుకుంది. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భాన్ని కూడా పట్టించుకోకుండా ట్రంప్ మీడియాను ఎత్తిపొడవడం, ఒక దశలో మీడియా కంటే సైనిక బలగాలు ఎంతో ఉత్తమమైనవని పొగడటం. అధ్యక్షుడిగా తొలిరోజునుంచే బహిరంగ వేదికలపై మీడియాను అవహేళన చేస్తూ మాట్లాడటం. వీటన్నింటిని చూస్తే ఎన్నికల ప్రచార దశలో తాను ప్రవేశపెట్టిన విభజన, ద్వేషపూరిత విధానాలనుంచి ట్రంప్ ఏమాత్రం తప్పుకోలేదని స్పష్టమౌతోంది.

మరోవైపున అమెరికా మీడియా మటుకు అధ్యక్షుడి హుంకారాలకు లొంగేది లేదని (భారతీయ మీడియా లాగా కాకుండా) స్పష్టం చేస్తూ ట్రంప్‌కు పెద్ద ఉత్తరం రాసింది. మీడియా నోరు నొక్కాలని ఎంతగా ప్రయత్నించినా, ట్రంప్ ఈ యుద్ధంలో విజయం పొందలేడని యుఎస్ మీడియా ఈ ఉత్తరంలో తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడి వార్తలను కవర్ చేయడానికి వైట్ హౌస్‌లో ఉండే ప్రెస్ బృందాన్ని అక్కడి నుంచి సాగనంపటంపై ట్రంప్ తీవ్రంగా యోచిస్తున్నారని  వస్తున్న వార్తల నేపథ్యంలో మీడియా దేశాధ్యక్షుడికి నేరుగా ఉత్తరం రాసింది. అధ్యక్షుడికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించడం ద్వారా ట్రంప్ గెలుపొందలేడని, ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యూరోక్రాట్లతో సహా ప్రభుత్వాంగాలన్నింట్లో విలేకరులను చొప్పించి సమాచారం రాబడతామని తేల్చి చెప్పింది. వెస్ట్ వింగ్‌లోని తన కార్యాలయం నుంచి మీడియాను నియంత్రించాలని ట్రంప్ భావించవచ్చు కానీ, అధ్యక్షుడి విధానాల అమలు తీరుతెన్నులను కవర్ చేయడంలో అంతిమంగా మాదే పై చేయి అవుతుందని మీడియా తేల్చి చెప్పింది.

అమెరికన్ మీడియాతో పోలిస్తే భారతీయ మీడియా తన నోరు నొక్కివేత నుంచి విముక్తి కావడానికి సిద్ధపడకపోవడం విషాదం. వాస్తవానికి మన మీడియా ప్రభుత్వాన్ని ప్రశంసించడం, మద్దతివ్వడం ద్వారా మూతిని ఇంకా గట్టిగా బిగించుకుంటోంది. ప్రభుత్వ విధానాల సారాన్ని పరిశీలించి.. ప్రశ్నించడానికి బదులుగా భారత్‌లోని పేదల్లోకెల్లా నిరుపేదలపై ఆ విధానాలు కలిగిస్తున్న ప్రభావాల గురించి రిపోర్ట్ చేయడానికి కనీస ప్రయత్నం చేయకుండా, ప్రభుత్వ పాలసీయే అంతిమ సత్యంలాగా ప్రచారం చేస్తూ దేశ మీడియా తనకు తానుగా అధికార వ్యవస్థలో భాగమైపోతోంది. పాలసీలకు వ్యతిరేకంగా ఎవరైనా కాస్త గీత దాటితే చాలు వారిని పక్షపాతులని ముద్రవేస్తూ, శపిస్తూ, దూషిస్తూ విలేకరులపై మరుగుజ్జులు దాడి చేస్తున్న సమయంలోనూ మన మీడియా మౌనముద్ర దాల్చడమే పరమ విషాదకరమైన విషయం. భారతీయ మీడియాలో నెలకొన్న ఈ దుస్థితికి భిన్నంగా అమెరికన్ మీడియా నుంచి మనం గ్రహించవలసిన పాఠాలు ఏమయినా ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఆ లేఖ సారాంశాన్ని పరిశీలించాల్సిందే.

డియర్ మిస్టర్ ప్రెసిడెంట్ ఎలెక్ట్

మీరు ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గర పడుతున్న సమయంలో మీ పాలనా యంత్రాంగానికి, అమెరికన్ ప్రెస్ బృందానికి మధ్య సంబంధాన్ని మేమెలా చూస్తున్నామో స్పష్టం చేయడానికి ఈ ఉత్తరం సహాయపడుతుందని మేం భావిస్తున్నా. గత కొన్ని రోజులుగా మీ ప్రెస్ కార్యదర్శి శ్వేతసౌధం నుంచి వార్తా మీడియా ఆఫీసులను ఎలా సాగనంపాలా అని ఆలోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారం సమయంలో మీ విశేషాలను కవర్ చేయడంపై మీరు ఆద్యంతం నిషేధించిన వైఖరికి ఇది తాజా ఉదాహరణ మాత్రమే. విలేకరులను వ్యక్తులుగా బెదరించడానికి, మీరు ట్విట్టర్‌ని వాడుకుంటున్నారు. మీ మద్దతుదారులను కూడా ప్రోత్సహిస్తున్నారు. మీడియాపై పరువునష్టం దాఖలు చేస్తానని మీరే స్వయంగా అనేకసార్లు హెచ్చరించారు. ఒకేరకమైన వార్తలను వండిపెడుతూ, నిత్యం ప్రెస్ కాన్ఫరెన్సులను నిర్వహిస్తూనే మీరు ప్రెస్‌ను పక్కనబెట్టారు. అంగవైకల్యం ఉంది కాబట్టే నాకు వ్యతిరేకంగా రాశావంటూ ఒక విలేకరిని మీరు హేళన చేశారు. 

బహుశా మీకు ఎంపిక చేసుకునే హక్కు ఉండవచ్చు. పత్రికా స్వేచ్ఛను మన రాజ్యాంగం రక్షిస్తున్నప్పటికీ, ఆ స్వేచ్ఛను అధ్యక్షుడు ఎలా గౌరవించాలనే విషయాన్ని రాజ్యాంగం ఆదేశించలేదు. అయితే.. ప్రెస్‌తో ఎలా వ్యవహరించాలనే అంశంపై విధివిధానాలను నిర్ణయించుకోవడానికి మీకు పూర్తి హక్కు ఉన్నట్లే మాకు కూడా కొన్ని హక్కులున్నాయి. మా ప్రసారాలను, వార్తా‌ కాలమ్‌లను ప్రభావితం చేయాలని మీరు భావిస్తుండవచ్చు. కానీ మా పాఠకులకు, శ్రోతలకు, వీక్షకులకు ఎంత ఉత్తమంగా సేవలందించాలన్నది మేం నిర్ణయించుకుంటాం. ఆ పని మీది కాదు. కాబట్టి వచ్చే నాలుగేళ్లలో మానుంచి మీరు ఏం ఆశించాలి అనే అంశంపై మీరు క్షుణ్ణంగా ఆలోచించుకోండి.

మీ పాలనను పరిశీలించే అవకాశం విలేకరులకు ఇవ్వాలా లేదా అని మీరు నిర్ణయించుకోవచ్చు. ఆ చాయిస్ మీదే.. కానీ సమాచారాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో పొందడంలో మాకు విశేషమైన అనుభవం ఉంది.  ఇక్కడ విలేకరులకు ప్రవేశం ఉండదు అని చెబితే అది మాకు ప్రధానమైన విషయం కాదు. కాని అది మేం ఇష్టపడి ఎదుర్కొనే సవాలు వంటిది.

ఆఫ్‌ ది రికార్డుగా చెబుతున్నాం. వార్తల విషయంలో ప్రాధమిక సూత్రాలను నిర్దేశించాల్సింది మేమే తప్ప అది మీ బాధ్యత కాదు. మీ అధికారులతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడటానికి, మేం అంగీకరించవచ్చు. అంగీకరించకపోవచ్చు. అది మా ఎంపిక, మా నిర్ణయం మాత్రమే. కాని నిబంధనలకు అంగీకరించని విలేకరులను తన్ని పంపిస్తానని మీరు భావిస్తుంటే మాత్రం అది జరగని పని.

మమ్మల్ని మీరు బయటకు పంపినప్పటికీ మీ అభిప్రాయాలను సేకరించడానికి మేం ప్రయత్నిస్తూనే ఉంటాము. కానీ సత్యాన్ని పదే పదే వక్రీకరిస్తున్న, లొంగదీసుకుంటున్న వ్యక్తులకు మా ప్రసారాలను, వార్తా కాలమ్‌లను కట్టబెడతామని దీనర్థంకాదు.

ఏ విషయంలో అయినా సరే ఒక వస్తుగత వాస్తవం ఉందని మా విశ్వాసం. దాన్నే మేం ఎత్తిపడతాం. మీరూ, మీ తైనాతీలు నిర్దిష్టంగా ఒక తప్పు విషయాన్ని చెబుతున్నప్పుడు, ట్వీట్ చేస్తున్నప్పుడు మేం వాటిని ప్రచురిస్తాం. కానీ వాటితోపాటు మేం వాస్తవాలను కూడా చెబుతాం.

రాజకీయ రంగంలో మీడియాపై అవిశ్వాసాన్ని తీవ్రస్థాయిలో ప్రచారం చేసిన ఘనత మీదేనని గుర్తిస్తున్నాం. కానీ దాన్ని మేమొక ముందస్తు హెచ్చరికగా తీసుకుంటాం. మా పట్ల ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందుతాం. మా తప్పుల్ని గుర్తించడం ద్వారా, మాకు మేము నిర్దేశించుకున్న అత్యున్నత నైతిక ప్రమాణాలకు కట్టుబడటం ద్వారా నిర్దిష్టమైన, నిర్భయంతో కూడిన రిపోర్టింగ్ ద్వారా మేం ఇందుకు ప్రయత్నిస్తాం.

ఒక్కమాట. ఇక నుంచి మీడియాలో ఉన్న అందరం కలిసి పనిచేయబోతున్నాం. మీరు మమ్మల్ని విభజించడానికి ప్రయత్నించారు. మా విలేకరుల్లోని అత్యంత స్పర్థాత్మక (పోటీ) తత్వాన్ని మీరు కుటుంబ కలహాలకోసం వాడుకున్నారు. ఆ రోజులు గతించాయి. మీ వార్తలను కవర్ చేయడంలో ఉన్న సవాలును ఎదుర్కొనడానికి వీలైన చోటల్లా మేం పరస్పరం సహకరించుకుంటాం.

ఇకపై మీరు ఇష్టపడని అంశాలను ప్రస్తావించిన రిపోర్టర్‌ నోరు మూయించడానికి మీరు ప్రయత్నించినప్పుడు మా మీడియా మొత్తంతో కూడిన ఐక్య సంఘటననే మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది. వార్తల్లో నీతి లేదా అభిరుచి, లేదా న్యాయబద్ధమైన వ్యాఖ్యల గురించి మాలో మాకు ఇప్పటికీ విభేదాలు ఉండవచ్చు. చర్చలు జరగవచ్చు కాని ఆ చర్చలను ప్రారంభించాల్సిందీ, ముగించాల్సిందీ కూడా మేమేనని మర్చిపోవద్దు.

చివరిగా.. మేం దీర్ఘకాలం సాగే ఈ ఆటను ఆడబోతున్నాం. మీరు మీ పనిలో మహా అయితే మరో 8 ఏళ్లు కొనసాగవచ్చు. కాని మేం మాత్రం అమెరికన్ రిపబ్లిక్ స్థాపన నాటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ మహత్తర ప్రజాస్వామ్యంలో మా పాత్రను పదేపదే స్థిరపర్చుకుంటూ వస్తున్నాం, దృఢపర్చుకుంటున్నాం కూడా. మేం ఎవరం, ఎందుకు ఇక్కడ ఉన్నాం అనే మౌలిక ప్రశ్నల గురించి ఆలోచించుకునేలా మీరు మమ్మల్ని ఒత్తిడికి గురిచేశారు. అందుకు మీకు మేం కృతజ్ఞులమై ఉంటాం.

ఇక మీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆస్వాదించండి

వైట్ హౌస్ ప్రెస్ కోర్

                                                   ****************



ఈ  సంపూర్ణ వ్యాసం సంక్షిప్త పాఠం నిన్నటి దినం సాక్షి దినపత్రిక సంపాదకీయ పేజీలో (24-01-2017)
"ఆ పాత్రికేయం.. ఆదర్శనీయం" పేరిట అచ్చయింది.

ఆ పాత్రికేయం.. ఆదర్శనీయం

సాక్షి సౌజన్యంతో..
------------------------------


ఒక సంతోష క్షణం:
నా ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అమెరికా వైట్ హౌస్ ప్రెస్ కోర్ (వైట్‌హౌస్‌లో అధ్యక్షుల దైనందిన వ్యవహారాల సమాచారాన్ని సేకరించే కీలకమైన మీడియా బృందం) రాసి ప్రచురించిన ఇంగ్లిష్ వ్యాసాన్ని అనువదించి స్పేస్ సరిపోకపోవడంతో కుదించి సాక్షిలో ప్రచురించడమైనది. సాక్షిలో ఊహించని పై స్థాయి వారి నుంచి ఈ వ్యాసం బాగుందని చిరుప్రశంస రావడం, మా సాక్షి వాట్సప్ ఫ్యామిలీ గ్రూప్‌లో పత్రికలో వచ్చిన సంక్షిప్త పాఠాన్ని చాలా మంది షేర్ చేయడం, మీడియా వారందరూ దీన్ని చదవాలని సిఫార్సు చేయడం.. రోజువారీ ఉద్యోగ బాధ్యతల్లో కాస్తంత సంతోషాన్ని కలిగించింది.

ఈ వ్యాసం కూడా అన్నింటిలాగే విమర్శలకు, భిన్నాభిప్రాయాలకు, చర్చకు పాత్రమైనదే అనడంలో సందేహమే లేదు.  దీని సారాంశంతో ఏకీభవించే వారికంటే వ్యతిరేకించే వారే  ఎక్కువగా ఉండవచ్చు కూడా.

కానీ.. "ప్రెస్‌తో ఎలా వ్యవహరించాలనే అంశంపై విధివిధానాలను నిర్ణయించుకోవడానికి మీకు పూర్తి హక్కు ఉన్నట్లే మాకు కూడా కొన్ని హక్కులున్నాయి. మా ప్రసారాలను, వార్తా‌ కాలమ్‌లను ప్రభావితం చేయాలని మీరు భావిస్తుండవచ్చు. కానీ మా పాఠకులకు, శ్రోతలకు, వీక్షకులకు ఎంత ఉత్తమంగా సేవలందించాలన్నది మేం నిర్ణయించుకుంటాం. ఆ పని మీది కాదు"..  "వార్తల్లో నీతి లేదా అభిరుచి, లేదా న్యాయబద్ధమైన వ్యాఖ్యల గురించి మాలో మాకు ఇప్పటికీ విభేదాలు ఉండవచ్చు. చర్చలు జరగవచ్చు కాని ఆ చర్చలను ప్రారంభించాల్సిందీ, ముగించాల్సిందీ కూడా మేమేనని మర్చిపోవద్దు" అంటూ అమెరికన్ మీడియా తమ నూతన అధ్యక్షుడికి రాసిన ఉత్తరం సమస్త మీడియా ప్రపంచానికీ అగ్ని సదృశమైన స్ఫూర్తిని అందిస్తోంది.

అందుకే సాక్షి వాట్సప్ ప్యామిలీ గ్రూప్‌లో ఈ వ్యాసంపై స్పందించిన ఒక మిత్రులు ఈ రచన తీవ్రతను, ప్రాధాన్యతను, అవసరాన్ని సరిగ్గానే అంచనా వేశారు.

"ట్రంప్"రేచర్ పెంచిన మీడియా 
ఇదీ మీడియా పవరంటే.. 
ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధ్యం.. హాట్స్ ఆఫ్ టు వైట్ హౌస్ ప్రెస్ కోర్..

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ మీడియా పట్ల ద్వేషపూరిత విభజన వైఖరి అవలంబిస్తున్న తరుణంలో అక్కడి మీడియా స్పందన సహజంగా ఆసక్తి రేకెత్తించేదే. అధ్యక్షుడి దురుసు వైఖరికి దీటుగా అత్యంత ఘాటుగా అక్కడి మీడియా నాయకత్వం ట్రంప్ కి రాసిన ఓ ఉత్తరం నాకు భలే ముచ్చటేసింది.  

ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు వైట్‌హౌస్‌ ప్రెస్‌కోర్‌ నేరుగా ట్రంప్ కి రాసిన ఉత్తరంలో ప్రతి వాక్యం ఒక తూటా. అధ్యక్షుడిని ఇలా గట్టిగా హెచ్చరించే దమ్ము అక్కడి మీడియాకి ఉండడం గొప్ప విషయం. మన దేశ మీడియాతో పోలిస్తే ఇది మరింత సుస్పష్టం. మన మీడియా నాయకత్వం ఒక ఎమ్మెల్యేని హెచ్చరించాలంటేనే వణికిపోతుంది. ఎందుకంటే అన్నీ లొసుగులు.

అన్నారా మిత్రులు. వారికి ధన్యవాదాలు చెబుతూ.. ఈ వ్యాసాన్ని పాజిటివ్ గానూ నెగటివ్ గానూ కూడా చదవాలని కోరుకుంటున్నాను. 

చివరిగా... 

ఆలోచలను రేకెత్తించగలిగిన చక్కటి వ్యాసాన్ని అనువదించగల అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మా ఇన్‌చార్జ్ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు

Sunday, January 22, 2017

ఐక్యత కాదు ట్రంప్... ముందు నీ యవ్వారం తేల్చు: తిరగబడ్డ అమెరికన్ భద్రకాళులు


అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి కొన్ని గంటలైనా కాక ముందే లక్షలాదిమంది అమెరికన్ మహిళలు వాషింగ్టన్ వీధుల్లో భద్రకాళులై తిరగబడ్డారు. ట్రంప్ పురుషాధిక్య భావాలకు వ్యతిరేకంగా లేచినిలబడ్డ అమెరికన్ మహిళలకు ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో వేలాది మంది మహిళలు శనివారం మార్చ్ చేస్తూ సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ బీభత్సం సృష్టించిన గుంపులతో పోలిస్తే శనివారం ట్రంప్ వ్యతిరేక మహిళా నిరసనకారులు భారీ ఎత్తున గుమికూడినప్పటికీ శాంతియుత ప్రదర్శనలకే పరిమితం అయ్యారు.

అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ వైట్ హౌస్‌లో నేషనల్ ప్రేయర్ సర్వీసుకు హాజరువుతుండగా వాషింగ్టన్ నగరం మహిళా జన సంద్రాన్ని తలపించింది. అంచనాలకు మించి అయిదు లక్షల మందికి పైగా మహిళలు నేషనల్ మాల్ చేరుకున్నారు.  ఈ ఆందోళనలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా డొనాల్డ్ ట్రంప్‌పై దుమ్మెత్తిపోయడం గమనార్హం. "ఈ దేశ నైతిక మూల సూత్రాల కోసం మేం ఈరోజు ఇక్కడ మార్చ్ చేస్తున్నాం. మహిళలపై యుద్ధాన్ని ప్రకటించిన ప్రెసిడెంట్‌కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాం. మా గౌరవ మర్యాదలు, మా హక్కులు, మా శీలం సమస్తంపై దాడులు జరుగతున్నాయి. విద్వేష, విభజన రాజకీయాల ప్లాట్‌ఫాం నిన్న అధికారాన్ని స్వీకరించిందం"టూ హాలీవుడ్ నటి అమెరికా ఫెరీరా శనివారం ఉదయం నేషనల్ మాల్‌లో గుమికూడిన జనాన్ని ఉద్దేశించి ప్రసంగించింది. అయితే "అధికారాన్ని స్వీకరించిన ప్రెసిడెంట్ అమెరికా కాదని, మనమే అమెరికా అని, ఆ విషయాన్ని ఎలుగెత్తి చాటడానికే ఇక్కడ నిలబడ్డామం"టూ ఆమె ట్రంప్‌పై ధ్వజమెత్తారు. ఇక మడోనా, మైఖేల్ మూర్ వంటి ఇతర సెలబ్రిటీలు పాల్గొన్న ఈ ఆందోళనలు పురుషులను, మహిళలను, చిన్న పిల్లలను కూడా పెద్ద ఎత్తున ఆకర్షించాయి. ఒక మహిళ అయితే ట్రంప్‌ను పరమ భీకర అధ్యక్షుడిగా వర్ణించింది.

ఇక చికాగో నగరంలో ట్రంప్ వ్యతిరేక మార్చ్‌ నిర్వహించడానికి ప్రయత్నించిన ఆర్గనైజర్లు ఆ మార్చ్‌కు లక్షా యాభై వేలమందిపైగా హాజరు కావడంతో భద్రతా కారణాలపై మార్చ్‌ని రద్దుచేశారు.

అయితే అధ్యక్షుడిగా చేసిన తొలి ప్రసంగంలో ట్రంప్ దేశంలోని విభజనలను తొలగించడానికి సరికొత్త జాతీయాభిమానం పెంపొందాలని పిలుపిచ్చారు. ట్రంప్ చెప్పినట్లుగానే శనివారం నిరసనకారులు ఐక్యత పాటించారు  కానీ కొత్త అధ్యక్షునికి సామూహిక వ్యతిరేకత తెలిపిన ఐక్యత అది. 24 గంటల ముందు లక్షలాది ట్రంప్ మద్దతుదారులు హర్షధ్వానాలు చేసిన చోటే వేలాది మహిళలు తిరుగుబాటుకు సంకేతంగా వైవిధ్యపూరితమైన దుస్తులు ధరించి కదం తొక్కారు.

వాషింగ్టన్‌లో మహిళాలోకం పుస్సీ హ్యాట్‌లను ధరించి అధ్యక్షుడికి వ్యతిరేకంగా అసభ్యకరమైన సందేశాలు, నినాదాలు చేస్తూ నేషనల్ మాల్‌ని చుట్టుముట్టింది. ఇక వీరికి మద్దతుగా అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగానూ వందలాది స్థలాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి.

ఈ భారీ జన సందోహంలో తమతల్లులతో పాటు పిల్లలు కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. "మేం ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇక్కడికి రాలేదు. కాని అతడికి మద్దతుగా మాత్రం రాలేదు" అని ఒక హోర్డింగ్ పేర్కొంది. "దేవుడు ప్రతి ఒక్కరిపై తన ప్రేమను ప్రదర్శిస్తాడన్న భావాన్ని పంచుకోవడానికే మేమిక్కడికి వచ్చాం" అని అందులో రాశారు.

ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో గర్భనిరోధం, హెల్త్ కేర్, గే హక్కులు, వాతావరణ మార్పు వంటి అంశాలపై ప్రదర్శించిన వైఖరిని దుమ్మెత్తిపోస్తూ వాషింగ్టన్ నగరంలో మహిళలు చేసిన నినాదాలు న్యూయార్క్, ఫిలడెల్పియా, చికాగో, లాస్ ఏంజెల్స్ నగరాల నుంచి పారిస్, బెర్లిన్, లండన్, ప్రేగ్, సిడ్నీ, ప్రేగ్, కోపెన్ హాగెన్ తదితర యూరప్ నగరాలల్లో కూడా మహిళా ప్రదర్శనల్లో ప్రతిధ్వనించాయి. మయన్మార్ నుంచి ఆస్ట్రేలియా వరకు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌కు వ్యతిరేకంగా కనీసం 600 మహిళా నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయని సమాచారం.

"అమెరికా చరిత్రలో ఇంతకంటే బాధ్యతా రహితమైన, పురుషాహంకారి అయిన, ప్రమాదకారి అయిన వ్యక్తిని ఇకపై కూడా ప్రెసిడెంట్‌గా చూడలేమ"ని సౌత్ కరోలినా యూనివర్శిటీ టీచర్ శశికా కోనెన్ స్నిడర్ పేర్కొన్నారు.

అమెరికాలో గత కొన్ని వారాలుగా చెలరేగుతున్న ట్రంప్ వ్యతిరేక మార్చ్‌లు శనివారం నాటి మహిళల ప్రపంచవ్యాప్త ప్రదర్శనలతో పరాకాష్టకు చేరుకున్నాయి. వందల సంవత్సరాల అమెరికా చరిత్రలో ఒక అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఇంతమంది మహిళలు తిరగబడ్డం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో ట్రంప్ సమీప భవిష్యత్తులో పదవీ చ్యుతుడై ఉపాధ్యక్షుడే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించినా ఆశ్చర్యపడనవసరం లేదంటూ అమెరికన్ రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్గం.

శనివారం వాషింగ్టన్ లోని నేషనల్ మాల్‌లో 5 లక్షలమంది పైగా మహిళలు ట్రంప్‌కి వ్యతిరేకంగా చేసిన  నిరసన ప్రదర్శనలపై మరింత సమాచారం కోసం... కింది లింకులను చూడండి.

Women's anti-Trump march clogs Washington streets | Reuters


What We’re Seeing at the Women’s March


తాజా సమాచారం
ఇతర దేశాలను సంపద్వంతంగా మారుస్తున్న క్రమంలోనే అమెరికా వెనకబడిపోయిందని ట్రంప్ యిజం చెబుతున్న వాదనలో నిజమెంతో కింది కథనం చెబుతోంది. దీన్ని కూడా చూడగలరు.

మీకు చేతకాక మాపై పడితే ఎలా బిగ్ బ్రదర్: అమెరికాపై ఆలీబాబా విసుర్లు

యావత్ ప్రపంచాన్ని సుసుంపన్నంగా మార్చిన అమెరికా తాను మాత్రం వెనుకబడిపోయిందని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే స్వరం చైనా నుంచి వచ్చింది. అమెరికా ఆర్థిక మందకొడితనానికి కారణం అమెరికానే కానీ మరెవ్వరూ కాదని చైనా ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా.కామ్ వ్యవస్థాపకుడు జాక్ మా ఆక్షేపించారు. యుద్ధాల కోసం తాను చేసిన ఖర్చుల కారణంతోటే  అమెరికా ఆర్థిక పరిస్థితి దెబ్బతింది గానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్ల కాదన్నారు. అమెరికా గత 30 ఏళ్లలో రూ.952లక్షల కోట్లను మౌలిక సదుపాయాలపై కాకుండా యుద్ధాలపై వెచ్చించిందని తెలిపారు.

బీజింగ్‌ అమెరికా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణం ఆ దేశమేనని అలీబాబా డాట్‌ కామ్‌ అధినేత జాక్‌ మా ఆరోపించారు. యుద్ధాల కోసం ఆ దేశం చేసిన ఖర్చుల కారణంతోటే ఆర్థిక పరిస్థితి దెబ్బతిందే గానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్లకాదన్నారు. అమెరికా గత 30 ఏళ్లలో రూ.952లక్షల కోట్లను మౌలిక సదుపాయాలపై కాకుండా యుద్ధాలపై వెచ్చించిందని తెలిపారు.
 
డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం గురించి పదే పదే వస్తున్న వ్యాఖ్యానాలను జాక్ మా ఖండించారు. అమెరికా ఆర్థిక దుస్థితికి ఆ దేశం సాగించిన యుధ్ధాలే కారణం కానీ చైనాతో వ్యాపార సంబంధాల వల్ల కాదని జాక్ మా తేల్చి చెప్పారు. యుద్ధాల కోసం అమెరికా చేసిన భారీ వ్యయాలే అమెరికా పతనానికి దారితీశాయని జాక్ స్పష్టం చేశారు. 
 
చాలామంది భావిస్తున్నట్లు అమెరికన్ల ఉద్యోగాలను చైనా దొంగిలించలేదని అన్నారు. అమెరికా వ్యూహాత్మకంగా చేసిన స్వయంకృత అపరాధాల కారణంగా అక్కడ ఉద్యోగాల కొరత ఏర్పడిందని చెప్పారు. ముప్పై ఏళ్ల క్రితం మేథోసంపత్తిపై హక్కులను మాత్రం ఉంచుకొని తక్కువస్థాయి కార్మిక ఉద్యోగాలను మిగిలిన ప్రపంచానికి అమెరికా వదిలేసిందని జాక్‌మా అన్నారు. ఆ కారణంగానే ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌ లాంటి కంపెనీలు భారీగా ఆదాయాన్ని సాధించాయని పేర్కొన్నారు. 
 
మైక్రోసాఫ్ట్, ఐబీఎం వంటి బహుళజాతి కంపెనీలు ప్రపంచీకరణ ద్వారా బిలియన్లాది డాలర్ల లాభాలను సృష్టించాయని, ఈ భారీ మొత్తాలను స్వదేశంలో మౌలిక సదుపాయాలకు ఉపాధి కల్పనకు వెచ్చించకుండా 13 యుద్ధాలపై అమెరికా ఖర్చుపెట్టిందని, నిధులను హేతుబద్ధంగా కేటాయించడంలో ఘోరవైపల్యమే అమెరికా దుస్థితికి కారణమని  జాక్ మా తేల్చి చెప్పారు.అమెరికన్ కంపెనీలు ఆసియా ఖండంలో ఆలీబాబా ప్లాట్‌ఫారంపై తమ ఉత్పత్తులు అమ్మినట్లయితే పలు మార్గాల్లో పది లక్షలమంది అమెరికన్లకు ఉపాధి లభిస్తుందని, ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి ఉత్పాదకతా అంశాలపై దృష్టి పెడితే తనకూ, ప్రపందానికీ మంచిదని ఆలీబాబా. కామ్ వ్యవస్థాపకుడు జాక్ మా హితవుచెప్పారు. 
 
వ్యాపార యుద్ధాన్ని ప్రారంభించడం తేలికే కానీ ముగించడం కష్టం అని ఆయన అన్నారు. ఈ యుద్ధం ముగియాలంటే అసలు యుద్ధం ప్రారంభం కావాలని అన్నారు. సాధారణంగా వ్యాపారం వల్ల ప్రజల ఆలోచనలు, సంస్కృతులను పంచుకుంటారని అన్నారు. 
 
1979లో చైనా అమెరికా వ్యాపార విలువ 2.5 బిలియన్‌ డాలర్లు అని అది 2016 నాటికి అంటే  38 ఏళ్లలో 211 రెట్లు పెరిగి 519 బిలియన్‌ డాలర్లు అయింది. కానీ అమెరికాకు చైనా 400 బిలియన్ డాలర్ల సరుకులను ఎగుమతి చేయడంతో ఇరుదేశాల మధ్య వాణి్జ్య సమతూకం చైనాకే ఎక్కువ అనుకూలంగా మారింది. 

Blame costly wars, not China, for poor state of U.S. economy: Jack Ma ...

www.thehindu.com/news/...wars...economy.../article17077834.ece

Saturday, January 7, 2017

పెద్ద నోట్ల రద్దు వెనుక దాగిన భండారం బట్టబయలైందా?


దేశభక్తి పేరుతో పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనం వెలికితీత ముసుగులో 60 రోజులుగా భారత ప్రభుత్వం, దాని పెద్దన్న నరేంద్రమోదీ ఆడుతున్న దొంగ నాటకం గుట్టు బట్టబయలైంది. దేశంలో ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్ల వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉన్నట్టు, అమెరికా చెప్పినట్టుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌, ఆర్థిక శాఖ తలాడించినట్టు ఆసియా పసిఫిక్‌ రీసెర్చ్‌ డాట్‌ కామ్‌ అనే సంస్థ 'దాచిపెట్టిన బహిరంగ రహస్యం: భారత చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్‌' పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత తీసుకోవడానికి ముందు, తెరవెనుకా, తెరపైనా ఏడాది కాలంగా జరుగుతున్న ‘ఏర్పాట్లు’, ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్రధారులు, ఈ నిర్ణయం వెనక అసలు ప్రయోజనాలు, లబ్దిదారుల వివరాలను ఈ కథనం వెల్లడించింది,

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మోదీ ప్రభుత్వ వాగాడంబరంపై సెటైర్లు వేసినట్లు నటించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రాజన్ కూడా ఈ కుట్రలో సంవత్సరం పైగా పాల్గొని నాటకమాడినట్లు విదేశీ మీడియా బయటపెట్టడం సంచలనం గొల్పిస్తోంది. 125 కోట్లమంది ప్రజలను నడిరోడ్డుపై నిలబెట్టిన ఈ ఘాతుక చర్యను దేశభక్తి ముసుగులో నగ్నంగా సమర్థించిన కిరాతకులు...  పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులు పడుతున్న బాధలను ఎత్తి చూపితే అలాంటివారిపై దేశద్రోహులంటూ ఆరోపించి మరీ వెంటాడిన దేశభక్తులు వారి తైనాతీ పార్టీలు నిజంగా దేశభక్తులు కారని, వీరంతా దేశభక్తుల పేరుతో సాగుతున్న దేశభుక్తులని సాక్షాత్తూ విదేశీ మీడియా కథనం ద్వారా బట్టబయలైంది.

డిజిటల్ ఎకానమీ పేరుతో చేసిన పెద్ద నోట్ల రద్దు.. "భారత ప్రజలకు మేలు చేసేందుకు కాదు. వారికి తెలియకుండానే వారితో చెలగాటమాడాలి. కరెన్సీ నోట్ల రద్దుతో క్షతగాత్రులైన ప్రజలు భారత ప్రభుత్వాన్ని మాత్రం నిందించకూడదు. అందుకే డిజిటల్‌ పేమెంట్స్‌ లక్ష్యాన్ని తెరవెనక్కి నెట్టి, నల్లధనం, అవినీతి లక్ష్యాలను తెరముందుకు తెచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించారు. ఆ విధంగానే ఆయన ప్రకటన సాగింది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్రధారులందరికీ ఏం జరుగుతుందో తెలుసు, వారి లక్ష్యమేమిటో తెలుసు, వ్యూహమేమిటో తెలుసు.. కాగితాలపై మాత్రం ఎక్కడా ఏమీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. రహస్యాలేవీ బయటకుపొక్కకుండా చర్యలు తీసుకున్నారు.

అలా 125 కోట్ల భారత ప్రజల అమాయకత్వాన్ని, దేశభక్తిమాటున, అవినీతిపై యుద్ధం చాటున వారిని తేలిగ్గా బుట్టలో వేసుకునే వెసులుబాటును గుర్తించిన తర్వాత, ఏకంగా మొత్తం దేశాన్ని ప్రయోగశాలగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో అమెరికా మార్చేసింది. వాస్తవాలను కప్పిపెట్టి, కాకమ్మ కబుర్లతో ఎన్డీయే సర్కారు కోట్లాది మంది ప్రజలను ‘‘బకరా’’లను చేసింది. ఫలితంగా దేశంలో కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. నోట్ల రద్దుకు ముందు భారతలో నగదు లావాదేవీల వాటా 97 శాతం ఉంది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలు చిన్న బ్రతుకులను ఛిద్రం చేసినప్పటకీ, డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల్లో ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్‌ ఇతర సంస్థలకు మాత్రం వ్యాపార విస్తరణ, లాభార్జన అవకాశాలను తెరిచాయి."

గత 14 ఏళ్లుగా దేశభాషల్లో వెబ్ సైట్లను విజయవంతంగా నిర్వహిస్తున్న వెబ్‌దునియా.కామ్ తెలుగు వెబ్ సైట్ పెద్దనోట్ల రద్దు వెనుక నడచిన దేశద్రోహపూరిత నాటకానికి అక్షరరూపమిచ్చింది. దేశభక్తుల దేశద్రోహాన్ని ఇంత బాహాటంగా బయటపెట్టిన కథనం ఈ మధ్యకాలంలో చూడలేదు. విదేశీ ఆర్థిక సంస్థల, సామ్రాజ్యవాద కంపెనీల ప్రయోజనాలకోసమే పెద్ద నోట్ల రద్దు తతంగాన్ని ఎన్టీఏ ప్రభుత్వం ప్రారంభించిందంటూ గతంలోనే అనేక వ్యాసాలు చదివినప్పటికీ దాని వెనుక సంవత్సర కాలంగా సాగిన ప్రయత్నాలను ఇంత వివరంగా ఆధార సహితంగా ఏ కథనమూ ఇంతవరకూ బయటపెట్టలేదు.



ఒక విషయం మాత్రం నిజం. దేశభక్తులుగా గొంతు చించుకుంటున్న వారు, దేశభక్తిని నినాద ప్రాయం చేసి గబ్బుపట్టిస్తున్న వారు తాము నమ్ముతున్న గంగలో నూరుసార్లు మునకలేసినా సరే.. పెద్ద నోట్ల రద్దు పేరిట వారు చేసిన పాపాలు మాసిపోవన్నది నిజం.

దేశభక్తుల పార్టీ ఈ దేశానికి చేసిన అసలైన ద్రోహం గురించి తెలుసుకోవాలంచే తెలుగు.వెబ్‌దునియా.కామ్ (telugu.webdunia.com) లో ఇవ్వాళ వచ్చిన ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. చదివి తరించండి.

కుహనా దేశభక్తి నశించాలి. దేశభక్తుల ముసుగులోని నకిలీ దేశభక్తులు, దేశభుక్తులు నశించాలి. అమెరికా సామ్రాజ్యవాదుల పాదాల ముందు దేశాన్ని సరికొత్తగా తాకట్టు  పెట్టడానికి సాహసించిన ఎన్డీయే ప్రభుత్వ దుర్మార్గం నశించాలి. మన యోగి భోగి ప్రధాని దొంగ నాటకం నశించాలి.

రాజన్ నుంచి మోదీ దాకా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సాగించిన ఈ దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా యావద్దేశం ఒక్కటిగా నిలవాలి.

వెబ్ దునియా వెబ్ సైట్‌లో వచ్చిన ఈ పెద్ద నోట్ల రద్దు భండారంపై కథనం లింకును కింద చూడండి. మీ మిత్రులందరకీ షేర్ చేయండి.

125 కోట్ల మంది ప్రజలను బకరాలను చేసిన నరేంద్ర మోడీ... కరెన్సీ నోట్ల రద్దు వెనక పెద్దన్న హస్తం!?
http://telugu.webdunia.com/article/current-affairs/washington-is-behind-india-s-brutal-demonetization-project-117010700036_1.html


తాజా సమాచారం.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ ముసుగులో దేశ ఆర్థిక వ్యవస్థను సామ్రాజ్యవాదుల హక్కు భుక్తం చేసే భారీ కుట్ర అనూహ్య ఘటన కాదని ఒకటన్నర సంవత్సరం పైగా ఇటు భారత ప్రభుత్వమూ, అమెరికా ప్రభుత్వమూ, ద్రవ్య పెట్టుబడుదారులూ కలిసి అత్యంత గోప్యంగా, అతి రహస్యంగా, అతి మార్మికంగా సాగించిన క్రూర పథకంలో భాగంగానే ఇది జరిగిందని నిరూపించే అద్భుత వ్యాసాలు ఇంగ్లీషులో లభించాయి. సమయం ఉంటే వీటిని పూర్తిగా అనువదించి ఇక్కడే పోస్ట్ చేయాలని ఉంది కానీ ఇప్పుడు కుదిరేటట్లు లేదు. అంతవరకు ఆ రెండు కీలక వ్యాసాలను కింది లింకుల్లో చూడగలరు.

A Well-Kept Open Secret Washington Is Behind India’s Brutal Demonetization Project

http://www.globalresearch.ca/a-well-kept-open-secret-washington-is-behind-indias-brutal-demonetization-project/5566167

పై ఇంగ్లీష్ వ్యాసం సంక్షిప్త అనువాదం ఇవ్వాళే తెలుగు ప్రింట్ మీడియాలోనూ, వెబ్ మీడియాలోనూ ప్రచురించారు.

అమెరికా చెప్పిందే... మోదీ చేశారా..?
http://www.andhrajyothy.com/artical?SID=354497

వీటితో పాటు కేంద్ర బ్యాంకులకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకే నగదు రద్దు పథకాలు అమలు చేయాలని సామ్రాజ్యవాదుల ముద్దుల పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ 2015 ఆగస్టులో పిలుపిచ్చిందంటూ కింది వ్యాసం పేర్కొంటోంది. నగదు రహిత వ్యవస్థల గురించి ఊదరగొడుతున్న నేతలు, వారి తైనాతీలు, భజనపరుల కుట్రల గురించి ఇంకా ఎవరికైనా సందేహం మిగిలి ఉంటే ఈ కింది వ్యాసం వాటిని తీీర్చవచ్చు.

Financial Times Calls For Abolishing Cash. “To Give More Power to Central Banks”

http://www.globalresearch.ca/financial-times-calls-for-abolishing-cash-to-give-more-power-to-central-banks/5472522?utm_campaign=magnet&utm_source=article_page&utm_medium=related_articles


10 వేల ఏళ్లలో ఘోరమైన పాలన ఇదే
మోదీ గారి పాలనలో ఇండియా వెలిగిపోతుంటే తగులబడుతోంటారమేటి అంటూ మోదీ భక్తులకు ఆగ్రహమూ, సందేహమూ కలిపి రావచ్చు. కానీ మహారాష్ట్రలో మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న శివసేన నిన్న మోదీ పాలన గురించి ఒక గొప్ప కామెంట్ చేసింది. 10 వేల ఏళ్లలో ఘోరమైన పాలన ఇదే అనేసింది. ఆ ప్రకటన సారాంశం ఇక్కడ చూడండి.

"10 వేల ఏళ్లలోనే అత్యంత ఘోరమైన పాలన మోదీ సర్కారుదే. పెద్దనోట్ల రద్దు నల్లధనాన్ని రూపుమాపుతుందని ఆలోచిస్తున్న బీజేపీ నేతలు పిచ్చివాళ్ల స్వర్గంలో ఉంన్నారు. ఈ నిర్ణయంతో చివరకు మహిళలను కూడా అష్టకష్టాల పాలు చేశారు. పాత పెద్దనోట్ల మార్పిడికి అనుమతించలేదన్న ఆగ్రహంతో ఓ తల్లి అర్ధనగ్నంగా మారటం ప్రభుత్వ ప్రాయోజిత నిర్భయ ఘటన."

(ఇది ఆంధ్రజ్యోతి జనవరి 7వ తేదీనాటి 2వ పేజీలో వచ్చిన వార్తా రాజం. అధ్వానపు పరిపాలనపై ఈ చిన్ని వ్యాఖ్య చూశాక ఇక మాటల్లేవు....



Wednesday, January 4, 2017

త్యాగాలు ప్రజలవి - భోగాలు నాయకులవి



ఇప్పుడు కాదు... ఎమర్జెన్సీ సమయం నుంచి నేను రాజకీయాలను చూస్తున్నాను.  ఇందిరాగాంధీ మొదలుకొని తదుపరి వచ్చిన మురార్జీ, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, వీపీ సింగ్ నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు చెప్పే ఒక స్టాక్ డైలాగ్ "ప్రజలు త్యాగాలు  చెయ్యాలి".

* నిజమే.. ప్రజలు త్యాగాలు చెయ్యాలి.

* తమకు వచ్చే వంద రూపాయల గ్యాస్ సబ్సిడీని వదులుకోవాలి.

* నాయకులు మాత్రం తమకు లభించే ఏ సబ్సిడీని వదులుకోరు.

* బయట 200  రూపాయలు ఉండే బిర్యానీని వారు మాత్రం ఇరవై రూపాయలకే ఆరగిస్తారు.

* ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అనుభవిస్తారు.

* ప్రజలు చచ్చి చెడి తమ కష్టార్జితంలోనుంచి నానా తిప్పలు పడి అధిక చార్జీలు చెల్లించి ప్రయాణాలు చేస్తారు.

*  నాయకులు మాత్రం విమానాలలో ఉచితంగా ప్రయాణాలు చేస్తారు.

*  లక్ష రూపాయలుగా ఉన్న తమ వేతనాలను అమాంతం నాలుగు లక్షలకు పెంచుకుంటారు.

* తమ నియోజకవర్గాలలో ప్రజాధనంతో సమకూర్చిన వాహనాలలో దర్జాగా ప్రయాణిస్తారు. బస్సుల్లో, రైళ్లలో, విమానాలలో తమకు లభించే ఏ విధమైన రాయితీని విసర్జించరు.

* ప్రజలు మాత్రం త్యాగాలు చెయ్యాల్సిందే.

* మీకు చిన్న చిన్న రోగాలు వస్తే ప్రజల ఖర్చుతో విదేశాలు వెళ్లి వైద్యాలు చేయించుకుంటారు.

* ప్రజలు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులలో ఛీత్కారాలు భరిస్తూ ఒక్కో బెడ్ మీద ముగ్గురు పేషేంట్స్‌తో పడుకోవాలి.  లేదా కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇల్లూ వాకిళ్ళు, పొలాలు పుట్రలు అమ్మేసుకుని దివాళా తీయాలి.

* అవును మరి.. ప్రజలు త్యాగాలు చెయ్యాలి.

* గత రెండురోజులుగా సోషల్ మీడియాలో చాలామంది వీరదేశభక్తులు కొత్త లాజిక్స్‌ను పోస్ట్ చేస్తున్నారు.  "మీరు తిరుపతి, శ్రీశైలం, షిరిడీ వెళ్ళినప్పుడు, రైల్వే స్టేషన్స్‌లో టికెట్స్ కోసం ఏడెనిమిది గంటలు నిల్చోవడం లేదా? ఏటీఎం ల దగ్గర గంట సేపు నిలుచోలేరా? " అని తమ పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

* నిజమే... సామాన్య ప్రజలు గంటలతరబడి నిలుచుని తమ సమయాన్ని త్యాగం చేస్తారు.  మరి నాయకులు?

* తిరుపతిలో, షిరిడీలో ఏనాడైనా క్యూలలో నించున్నారా?

* మహాద్వారం నుంచి మహారాజుల్లా తమ కుటుంబాలతో సహా గర్భగుడి వరకు  దూసుకుని పోతారేం? స్వామివారితో అరగంట సేపు గడుపుతారు.  శేషవస్త్రాలు, ప్రసాదాలు స్వీకరిస్తారు.  ప్రత్యేక ఆశీర్వచనాలు తీసుకుంటారు... మరి వారు ఎందుకు త్యాగం చెయ్యరు?

* ఒక నాయకుడికి అధికారం ఇచ్చింది దేనికి?

* ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందిస్తారు అనేగదా?

* నేను కొత్త సంస్కరణలు తీసుకువస్తాను...మీరు ఓపికపట్టండి అని చెప్పని నాయకుడు ఎవరైనా గతంలో ఉన్నారా?

* ఆర్ధిక సంస్కరణల ఫలితాలు రెండు ఏళ్లలో కనిపిస్తాయి...వస్తువులు చౌకగా లభిస్తాయి. ప్రజలు త్యాగాలకు సిద్ధపడాలి అని చెప్పారు పీవీ నరసింహారావు.. ఆ తరువాత వాజపేయి, మన్మోహన్ కూడా ఇదే పాట పాడారు.

ఇరవై ఏళ్ల తరువాత కూడా వాటి ఫలితాలు పూర్తిగా కనిపించాయా?

* దేశంలో పేదరికం నలభై ఏళ్ళక్రితం 70 శాతమే ఉన్నది. ఇప్పుడూ అంతే ఉన్నది. ప్రజలు మాత్రం త్యాగాలు చేస్తూనే ఉన్నారు.

* పాత నోట్ల రద్దు ద్వారా నల్లధనం బయటకి తీయవచ్చు అని మోడీ భావించారు. బాగుంది. నేను కూడా హర్షించాను. కానీ మోడీ ఊహించిన విధంగా జరుగుతున్నదా?

*దేశంలో 18 లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఉన్నది అని కేంద్రం చెప్తున్నది.  గత మూడు రోజుల్లో బయటకి వచ్చింది కేవలం యాభై మూడు వేలకోట్ల రూపాయలు మాత్రమే.

* డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల కోట్ల రూపాయలు మాత్రమే వెలికి వచ్చే అవకాశం ఉన్నదని ఇవాళ మధ్యాహ్నం ఆర్ధిక శాఖ అధికారులు చెప్తున్నారు!!!  మరి ఈ సంస్కరణ ద్వారా ఫలితం లేకపోతె ప్రధాని తన చర్యకు మూల్యం చెల్లిస్తారా?

(ఈ ఒక్క పాయింటు మాత్రం ఇప్పుడు కాస్త మార్పు చేయాలి. డిసెంబర్ చివరి నాటికి రద్దయిన పెద్ద నోట్లలో 14.5 లక్షల కోట్ల వరకు బ్యాంకులకు చేరాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం చలామణిలో ఉన్న పెద్దనోట్లు 15 లక్షల కోట్ల పైబడి. అంటే దేశంలో నల్లధనం అన్నదే లేకుండా మొత్తం దాదాపుగా వైట్ అయిపోయింది. 130 కోట్లమందిని గత 55 రోజులుగా కుళ్లబొడిచి, వారి అనంత కష్టాలను  దేశభక్తి మకిలిలో ముంచెత్తి మన భోగి యోగి ప్రధాని ఊడపొడిచిందేమిటి? ఇదంతా చూస్తుంటే సన్యాసిని నా దగ్గరేముంది బూడిద తప్ప అనే ఎన్టీఆర్ పాత డైలాగ్ గుర్తుకొస్తోంది. ఇంతకూ నల్లధనం ఉందా లేదా, ఉంటే అదంతా ఎక్కడికి పోయినట్లు?)

* పైగా మరో విచిత్రమైన సంగతి ఏమిటంటే... ఈ నిర్ణయం మంత్రివర్గం సమావేశం లో తీసుకుని ప్రధాని బయటకి వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. టీవీలో లైవ్ ఇచ్చి ప్రకటించారు. అప్పటివరకు మంత్రులు అందరిని సమావేశ హాల్‌లోనే బంధించేశారట..ఎందుకయ్యా అంటే.. మంత్రులు బయటకి వెళ్తే ఈ నోట్ల రద్దు విషయం లీక్ అవుతుందని భయం ట...

* ఎంత దారుణం?  అంటే... తన మంత్రుల మీద తనకే నమ్మకం లేదన్న మాట!! మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అత్యంత గోప్యం...ఈ రహస్యాలు కాపాడుతారని నమ్మకం మోడీకి తన మంత్రులమీద లేనప్పుడు అలాంటి వారిని మంత్రివర్గంలో కొనసాగించడం ఎంతవరకు సమంజసం?  ఇది మంత్రులకు అవమాసం కాదా?  అంతా ఏకపాత్రాభినయం కాదా ఇది? మోడీ గారు తన మంత్రులను నమ్మరు.  ప్రజలు మాత్రం మోడీగారిని నమ్మాలి!  దట్స్ ఆల్!

* నా చిన్నప్పటినుంచి వింటున్న మరో గొప్ప ఆణిముత్యం ఏమిటంటే  "ఈ దేశం నీకేమి ఇచ్చిందని అడగకూడదు... ఈ దేశానికి నువ్వు ఏమిచ్చావు?"

* ఎందుకు ఇవ్వడం లేదు?  నాకొచ్చే జీతం లో నలభై శాతం వివిధ పన్నుల రూపంలో కడుతున్నాను.

* అది కాక బయట ఏ వస్తువు కొన్నా సర్వీస్ టాక్స్, స్వచ్ భారత్ టాక్స్, కృషికళ్యాణ్ టాక్స్ కలిపి పదిహేను శాతం కడుతున్నా.

* అనగా నా ఆదాయంలో సగభాగం నేను దేశానికి ఇస్తున్నా...

* పొట్టపొడిస్తే అక్షరం ముక్క రానివారిని కూడా  ఈ దేశం మంత్రులను చేసింది.  మీరు వేలకోట్ల అవినీతి సొమ్మును కొల్లగొడుతున్నా భరిస్తున్నది. మాలాంటి వాళ్ళు ఇరవై రెండు ఏళ్లపాటు వివిధ విద్యాలయాలలో చదివి ఎంతో జ్ఞానం సంపాదించుకుని గుమాస్తాలుగా ఎద్దుల్లా చాకిరీ చేస్తున్నాము.

* నాయకులకు నేను వేస్తున్న సూటి ప్రశ్న...

"ఈ దేశం మీకు చాలా ఇచ్చింది... మీరు ఈ దేశానికి ఏమి ఇచ్చారు?"

(ఇది సాక్షి పత్రిక సిబ్బంది వాట్సప్ గ్రూప్‌లో 29-11-2016న వచ్చిన టపా. ఆ తర్వాత నెలరోజులకు కూడా ఈ టపా ప్రాసంగికత మారినట్లు కనిపించకపోవడంతో దీన్ని యధాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. మధ్యలో బ్రాకెట్లలో నల్లధనం వివరాల చేర్పు తప్పితే ఈ టపా కర్త రాజన్ గారు.)