Friday, November 20, 2015

భయమూ, ద్వేషమూ లేని జీవితాన్ని ఆమె సాక్షిగా గడుపుతాం!ఉగ్రవాదులను కనిపిస్తే చాలు నరికిపడేయాలన్నంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత వాతావరణంలో ద్వేషాన్ని వారికి బహుమతిగా అందివ్వబోమని ప్రకటించడానికి ఎంత సాహసం కావాలి? తమకు తాముగా సృష్టించి వదిలిన భస్మాసురులను మట్టుబెట్టడానికి మరో భీకర యుద్ధ రంగాన్ని సృష్టించాలనుకుంటున్న పాశ్చాత్య పాలకులకు ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రపంచం పట్ల ఎంత మమకారం ఉండాలి?

ఉగ్రవాద దాడుల్లో ప్రేమాస్పదురాలైన జీవన సహచరిని అతడు శాశ్వతంగా కోల్పోయాడు. పన్నెండేళ్లపాటు నిస్వార్థంగా ప్రేమను పంచిపెట్టిన అమృతమయమైన ఒక సుకుమార, సున్నిత నిసర్గ సౌందర్యాన్ని అతడు ఉగ్ర దాడిలో పోగొట్టుకున్నాడు. పారిస్ లోని బటాక్లాన్ థియేటర్‌లో, నవంబర్ 17న ఐఎస్ఐఎస్ చేసిన మెరుపుదాడిలో ఒకేచోట 82 మంది తోటి ప్రేక్షకులతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఆమెకు కానీ, ఆమెను కోల్పోయిన ఆ భర్తకు కానీ, వారి నెలల ప్రాయపు చిన్నారి కుమారుడికి కానీ ఏ రాజకీయాలూ తెలీవు. తమకు అందుబాటులో ఉన్న జీవితాన్ని కాసింత సంతోషంతో, కాసింత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో గడుపుదామనే చిన్న కోరిక తప్ప వారికి ఈ ప్రపంచంలో పెద్దగా ఆశలూ లేవు.

కానీ మృత్యువు వికటాట్టహాసం చేసిన ఆ కాళరాత్రి తన నెచ్చెలిని పోగొట్టుకున్న ఆ భర్త జీవితకాల బాధను కూడా దిగమింగుకుని యావత్ ప్రపంచానికీ చిరుసందేశం పంపుతున్నాడు. తన భార్యను చంపిన వారికి తన ద్వేషాన్ని పొందే అవకాశం కూడా ఇవ్వబోనంటూ అతడు చరిత్ర కనీవినీ ఎరుగని తిరస్కార, ధిక్కార సందేశాన్ని ఉగ్రవాదులకు అందించాడు. తానూ, 17 నెలల ప్రాయంలోని తన కుమారుడూ ఇరువురం కలిసి భయమూ, ద్వేషమూ లేని జీవితాన్ని భార్య జ్ఞాపకాల సాక్షిగా గడుపుతామంటూ ప్రపంచం పట్ల, జీవితం పట్ల ఎనలేని విశ్వాసం ప్రకటించాడు. ద్వేషంతో కాదు.. ప్రేమతో, వెరపులేనితనంతో జీవిస్తామంటున్న ఈ సాధారణ పౌరుడు శ్వేతజాతీయుడు కాదు. ఒక పర్షియన్. బతుకు కోసం ఫ్రాన్స్‌ను మాతృదేశంగా చేసుకున్న పరదేశీయుడు. పేరు ఆంటోనె లేరిస్. ఆమె పేరు హెలెన్ ముయాల్ లేరిస్ (35 ఏళ్లు). ఇద్దరిదీ పన్నెండేళ్ల బంధం. వారికి పదిహేడు నెలల కుమారుడు మెల్విల్.

పారిస్ ఉగ్రదాడిలో సహచరిని కోల్పోయిన మూడు రోజులకు ‘మీరు నా ద్వేషాన్ని కూడా పొందలేరు’ (యు విల్ నాట్ హావ్ మై హార్టెడ్) అంటూ ఫేస్‌బుక్‌లో ఫ్రెంచ్ భాషలో లేరిస్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆన్‌లైన్‌ పాఠకుల హృదయాలను కదిలిస్తోంది.
https://www.facebook.com/antoine.leiris/posts/10154457849999947?pnref=story
Antoine Leiris

129 మందిని బలిగొన్న ఉగ్రవాదులను ఉద్దేశించి లేరిస్ రాసిన పోస్టును ఇంతవరకు రెండు లక్షలమంది షేర్ చేశారు. అలాగని లేరిస్ ఉపన్యాసాలేవీ దంచలేదు. కేవలం నాలుగు చిన్ని పేరాల స్పందన మాత్రమే ప్రపంచంతో పంచుకున్నాడు. ప్రస్తుతం కుటుంబంలో తానూ తన కుమారుడు మాత్రమే ఉండొచ్చు కానీ ప్రపంచంలోని అన్ని సైనిక బలగాలకంటే తాము ఇప్పుడు అతిశక్తిమంతులం అంటూ ఉగ్రదాడులను లెక్కచేయనితనంతో ఆ తండ్రి చేసిన పోస్ట్‌ ఇప్పుడు యావత్ ప్రపంచం ముందూ మన కాలపు ధిక్కార స్వరాన్ని వినిపిస్తోంది. నీవు లేని ప్రపంచంలో నీ జ్ఞాపకాలతోటే నిర్భయంగా, ద్వేష రహితంగా బాబును పెంచుతానంటూ శాశ్వతంగా దూరమైన భార్యకు అతడు పలికిన నివాళి సమాజంలో విభజనలను, ద్వేషాన్ని పెంచి పోషించాలని చూస్తున్న సమస్త శక్తులకూ గుణపాఠమై నిలుస్తోంది.

ఫ్రాన్స్‌కే కాకుండా పాశ్చాత్య దేశాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకే విఘాతం కలిగించినట్లు భావిస్తున్న పారిస్ దాడులు అటు స్థానికులనూ, ఇటు శరణార్థులను కంపింపజేస్తున్నాయి. ఫ్రాన్స్ లోని ముస్లిం జనాభాపై, ఆశ్రయం కోరి వస్తున్న ముస్లిం శరణార్థులపై ప్రతీకార దాడులు తప్పవని భయాందోళనలు చెలరేగుతున్న తరుణంలో లేరిస్ వంటి పలువురు పర్షియన్లు సమాజాన్ని ద్వేషంతో ముంచెత్తించాలనుకుంటున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల లక్ష్యాన్ని తాము లెక్కపెట్టబోమని, తమ జీవితాలను ఇక్కడే ఎప్పటిలా గడుపుతామని ప్రకటిస్తున్నారు.

ఉగ్ర దాడుల పట్ల లేరిస్ వినిపించిన ఆ మానవ ధిక్కారాన్ని తన మాటల్లోనే విందాం


"శుక్రవారం రాత్రి మీరు ఒక ఆసాధారణమైన జీవితాన్ని (నా జీవిత ప్రేమమూర్తిని, నా కుమారుడి తల్లిని) బలిగొన్నారు. కానీ మీరు నా ద్వేషాన్ని పొందలేరు. మీరెవరో నాకు తెలీదు. నాకు తెలుసుకోవాలనీ లేదు. మీరు మృతాత్మలు.. అంతే. మీరు ఎవరికోసం గుడ్డిగా మనుషులను చంపుతున్నారో ఆ దేవుడు మమ్మల్ని తన ప్రతిబింబంగా చేసుకున్నట్లయితే మాత్రం.. నా భార్య దేహంలోకి మీరు చొప్పించిన ప్రతి తూటా ఆయన హృదయంలో ఒక్కో గాయమై తగిలి తీరుతుంది. 

అందుకే, నా ద్వేషాన్ని కూడా మీకు నేను దక్కనివ్వను. సరిగ్గా మీరు ద్వేషాన్నే కోరుకుంటున్నారు. కాని ద్వేషం పట్ల ఆగ్రహంతో స్పందించడం అనేది బాధితులను అదే అజ్ఞానంలో పడవేయడంతో సమానం. ద్వేషమే మిమ్మల్ని అలా తయారు చేసింది. మీరు నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. నా దేశపౌరుల పట్ల నేను అవిశ్వాసం ప్రదర్శించాలని, నా భద్రతకోసం నా స్వేచ్ఛను త్యాగం చేయాలని మీరు కోరుకుంటున్నారు. కాని అక్కడే మీరు ఓడిపోయారు.

నేను ఆమెను ఇవ్వాళ ఉదయం చూశాను. చివరిసారిగా అంటే రాత్రింబవళ్లు నిరీక్షించిన తర్వాత ఆమెను ఇవ్వాళే చూశాను. శుక్రవారం రాత్రి ఆమె బయటకు వెళ్లినప్పుడు ఎప్పటిలాగే ఆమె సౌందర్యంతో మెరిసిపోయింది. 12 ఏళ్లుగా తన ప్రేమతో నన్ను దాసోహం చేసుకున్న అద్భుత సౌందర్యంతో ఆమె వెళ్లిపోయింది. నిజమే. ఆమెను కోల్పోయిన బాధలో నేను కుప్పగూలిపోవడం నిజమే. మీరు చిన్న విజయం సాధించారని నేను అంగీకరిస్తున్నా. కానీ గుండెను తొలిచివేస్తున్న ఈ బాధ తాత్కాలికమే. ప్రతి రోజూ, ప్రతి క్షణం ఆమె మాతో ఉంటుందని నాకు తెలుసు. మీరు ఎన్నటికీ ప్రవేశించలేని ప్రేమాన్విత స్వేచ్ఛా స్వర్గంలో మేం మళ్లీ మళ్లీ కలుసుకుంటూనే ఉంటాం.

ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం. నేనూ, నా కుమారుడు. కానీ ఒక విషయం మాత్రం చెప్పదల్చుకున్నా. ప్రపంచంలోని సకల సైనిక బలగాల కంటే మేము శక్తిమంతులం. మీమీద దృష్టి పెట్టేంత సమయం నాకు ఏమాత్రం లేదు. మా అబ్బాయి మెల్విల్‌ను నేను నిద్ర లేపాల్సి ఉంటుంది. అతడి వయసు కేవలం 17 నెలలు మాత్రమే. అతడు ఎప్పటిలాగే తన ఆహారం తీసుకుంటాడు. ఎప్పటిలాగే మేము కలిసి ఆడుకోవడానికి వెళతాం. ప్రతిక్షణం అణువణువునా చెక్కు చెదరని సంతోషాన్ని అనుభవిస్తూ.. ఈ చిన్నారి జీవితాంతం మిమ్మల్ని అవమానిస్తూనే, భయపెడుతూనే ఉంటాడు. ఎందుకంటే, అతడి ద్వేషాన్ని కూడా మీరు పొందలేరు."

యావత్ ప్రపంచానికి తన ఈ చిన్ని లేఖ ద్వారా లేరిస్ అందించిన మహత్తర సందేశం అటు ఉగ్రవాదులకే కాదు.. ఆ ఉగ్రవాదులను నిత్యం సృష్టిస్తున్న వ్యవస్థలకు కూడా మర్చిపోలేని గుణపాఠాన్ని అందిస్తోంది. ద్వేషించడం అనే బహుమతిని పారిస్ ఉగ్రవాదులకు తాను అందించనంటున్నాడు ఆ తండ్రి. మరణంతో కూడా విడిపోని స్వేచ్ఛాయుత ఆత్మిక స్వర్గంలో ప్రతి రోజూ తాము కలుసుకుంటూ ఉంటామని, ఆ స్వర్గంలోకి మీరెన్నడూ ప్రవేశించలేరంటూ ఉగ్రవాదులందరికీ సవాల్ విసురుతున్నాడు. సమాజాన్ని ద్వేషంతో ముంచెత్తించాలనుకుంటున్న వారి లక్ష్యాన్ని తామెన్నటికీ సరకు చేయమని, తమ జీవితాలను ఇక్కడే ఎప్పటిలా గడుపుతామని ఆ తండ్రి చేస్తున్న హెచ్చరిక విద్వేషాన్ని ప్రేరేపించాలనుకుంటున్న సమస్త శక్తులకు చెంపపెట్టులాంటిది. మిన్ను విరిగి మీద పడినా చలించని మానవాత్మ ముందు ప్రపంచంలోని సైనిక బలగాలన్నీ కూడా శక్తిహీనమే అని ప్రకటించిన సాహసోపేత వ్యక్తిత్వం ఆ తండ్రిది.

ఉగ్రవాదులను కనిపిస్తే చాలు నరికిపడేయాలన్నంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత వాతావరణంలో ద్వేషాన్ని వారికి బహుమతిగా అందివ్వబోమని ప్రకటించడానికి ఎంత సాహసం కావాలి? తమకు తాముగా సృష్టించి వదిలిన భస్మాసురులను మట్టుబెట్టడానికి మరో భీకర యుద్ధ రంగాన్ని సృష్టించాలనుకుంటున్న పాశ్చాత్య పాలకులకు ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రపంచం పట్ల ఎంత మమకారం ఉండాలి? ఒక చిన్ని లేఖ రూపంలోని ఈ మానవీయ సందేశం... బాధితులందరి తరపున ఈ ప్రపంచం ముందు ప్రకటిస్తున్న వేడుకోలు. అటు ఉగ్రవాదులూ, ఇటు పాలకులూ ఈ వేడుకోలు సారాంశాన్ని ఇకనైనా గ్రహిస్తారా?

(మనం రోజువారీ జీవితంలో చేస్తున్న చిన్న పనుల్లో ఏవైనా అడ్డంకులు ఎదురైతే ఎక్కడలేని చిరాకు కలుగుతుంది. మన వాదనకు, అభిప్రాయాలకు, భావజాలానికి కాస్త భిన్నంగా ఎవరైనా విభేదిస్తే.. అడ్డంగా నరికేయాలన్నంత అసహనం, కోపం అమాంతంగా మనల్ని ఆవహిస్తుంటాయి. మనకు కాస్త అపకారం తలపెట్టిన వారిని రావిశాస్త్రిగారి మాటల్లో చెప్పాలంటే ఒకసారి చంపిన తర్వాత మళ్లీ చంపాలన్నంత ప్రతీకార క్రౌర్యం మనలో రాజుకుంటూ ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అన్ని విధాలుగా బండబారిపోతున్నాం మనం.  కానీ... పారిస్‌లో ఆ పర్షియన్ భర్త , తన జీవితంలోనే అత్యంత సన్నిహితురాలైన భార్యను, 12 ఏళ్లు ప్రేమను  పంచిపెట్టిన ప్రేమమూర్తిని కోల్పోయిన పరమ విషాద పరిస్థితుల్లో కూడా అందుకు కారకులను ద్వేషించనంటున్నాడు. అన్నిటికంటే మించి అతడొక సామాన్యుడు. ప్రేమైక మూర్తిని పోగొట్టుకున్న ఆ తండ్రికి, ఆ నెలల ప్రాయపు చిన్నారికి కాస్త సానుభూతి చెబుదాం. కానీ.. ఉగ్రవాదుల దాడిలో జీవన సహచరిని కోల్పోయిన ఆ సామాన్యుడు అసామాన్యంగా ప్రదర్శిస్తున్న ఈ శాంతి సందేశం నుంచి మనం నేర్చుకోగలిగింది ఏమయినా ఉందా?)

ఈ కథనం సాక్షి దినపత్రిక సంపాదకీయ పేజీలో (తెలంగాణ ఎడిషన్) నిన్న -19-11-2015- 'మృతాత్మలను ద్వేషించలేం' శీర్షిక పేరిట ప్రచురితమైంది. స్థలాభావం వల్ల పత్రికలో కుదించిన ఈ కథనం పూర్తి పాఠాన్ని ఈ బ్లాగులో ప్రచురించడమైనది.

(వారాంతపు సెలవు -బుధవారం-పై విరామంగా ఇంట్లో  ఉంటున్నప్పుడు, బిజీగా లేకుంటే ఈ కథనం రాసి పంపగలరా అంటూ ప్రతిపాదించి సోర్స్ పంపిన మా ఎడిట్ పేజ్ ఇన్‌చార్జ్ వేణుగోపాల్ గారికి... చాలారోజుల తర్వాత మళ్లీ కన్నీళ్లు పెట్టుకునేలా చేసినందుకు కృతజ్ఞతలతో)

సాక్షి పత్రికలో వచ్చిన ఈ కథనం లింక్ కింద చూడగలరు.
మృతాత్మలను ద్వేషించలేం
http://www.sakshi.com/news/opinion/even-we-dont-hate-them-says-frace-attak-victim-291769

కె. రాజశేఖరరాజు
7396494557 (నా కొత్త మొబైల్ నంబర్)
krajasekhara@gmail.com

Thursday, November 19, 2015

వాళ్లకు తుపాకులుంటే మనకు పూలున్నాయి కద నాన్నా!
ఒకే ఒక ఉగ్రదాడితో పారిస్ గుండె పగిలింది. నవంబర్ 17 కాళరాత్రి ఐఎస్ ఉగ్రవాదుల కాటుకు గురైన పారిస్ బిత్తరపోయింది. ప్రపంచ పాలకులనే నివ్వెరపోయేలా చేసిన ఆ దాడి పారిస్ లోని ప్రతి ఒక్కరినీ భయకంపితులను చేసింది. ఇక ఇక్కడ ఉండొద్దు వెళ్లిపోవలిసిందే అంటూ పసిపిల్లలు సైతం తేల్చేసుకునేలా చేసిన ఆ దాడికి 129 మంది బలయ్యారు. మనుషులు ప్రాణాలు అమూల్యమైనవి. కాదనలేం. కానీ దశాబ్దాల తరబడి పరస్పరం పెంచుకున్న పౌర బంధాలు ఒక్క క్షణం పిడుగుపాటుకు గురయ్యాయి.

దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి కన్న తండ్రితోపాటు వచ్చి చూసిన చిన్నారి బాలుడితో తండ్రి మాట్లాడిన మాటలు కోట్లాది మందిని ఇప్పుడు భావోద్వేగంలో ముంచెత్తుతున్నాయి. ఆ తండ్రీ కుమారుల సంభాషణపై ఒక ఫ్రెంచ్ పత్రిక లె పెటిట్ రిపోర్టర్ తీసిన వీడియోను ఇప్పటికే కోటీ 20 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులు చూశారు. లె పెటిట్ జర్నల్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆ ఇంటర్వ్యూ ప్రపంచాన్ని కదిలించివేస్తోంది.

తాము నివసిస్తున్న ఫ్రాన్స్ గురించి, అది ప్రాతినిధ్యం వహిస్తున్న విలువల గురించి గర్వపడేలా తన కుమారుడికి బోధించాలని ఆ తండ్రి భావించాడు. ఆ ఉద్దేశంతోనే దాడి తర్వాత ఏం జరుగుతోందో పిల్లవాడికి చూపించాలని స్మారక చిహ్నం వద్దకు తీసుకెళ్లాడు.

పారిస్‌లో ఉగ్రవాద దాడి జరిగిన బటాక్లాన్ థియేటర్ వద్దకు తండ్రితోపాటు వచ్చిన ఆ చిన్నారిని ఫ్రెంచి జర్నల్ టీవీ విలేకరి 'ఏం జరిగిందో ఇలాంటి దాడులను ఎందుకు చేస్తున్నారో అర్థమవుతోందా' అని అడిగాడు.

ఆ చిన్నారి బాలుడు చెప్పాడు. 'అవును. ఎందుకంటే వారు నీచులు. మంచివాళ్లు కాదు. మేం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి. రక్షణ లేదు. ఇళ్లు మారవలసిరావటం ఆందోళనగా ఉంటుంది.'

ఆ క్షణంలో ఆ బాలుడి తండ్రి జోక్యం చేసుకుని భయపడనవసరం లేదని ధైర్యం చెప్పాడు. 'ఫ్రాన్స్ మన ఇల్లు నాన్నా, మనం వెళ్లిపోవలసిన అవసరం లేద'ని చెప్పాడు. వారి సంభాషణ ఇలా సాగింది.

అబ్బాయి: కాని ఇక్కడ చెడ్డవాళ్లు ఉన్నారు నాన్నా...

నాన్న: అవును. కానీ చెడ్డవారు ప్రతి చోటా ఉన్నారు కదా.

అబ్బాయి: వారికి తుపాకులున్నాయి. వాళ్లు మనల్ని కాలుస్తారు. ఎందుకంటే వారు భయంకరమైన మనుషులు నాన్నా..

నాన్న: (కుమారుడికి ధైర్యం చెబుతూ) సరే.. వారికి తుపాకులు ఉండొచ్చు. కానీ మనవద్ద పూలున్నాయి కదా.

అబ్బాయి: కానీ పూలు ఏమీ చేయలేవు కదా నాన్నా.

నాన్న: అలా చూడు. ప్రతి ఒక్కరూ అక్కడ పూలు ఉంచుతున్నారు. ఇది తుపాకులకు వ్యతిరేకంగా పోరాడటమే మరి.

పిల్లాడు: తన చుట్టూ చూస్తూ నవ్వుతూ అడిగాడు. 'ఇవి కాపాడటానికేనా? కొవ్వొత్తులు కూడా కాపాడటానికేనా?'

నాన్న: తుపాకులకు వ్యతిరేకంగా పోరాడటంలో పూలు, కొవ్వొత్తులు కూడా భాగమే నాన్నా.

ఇలా సాగిన ఇంటర్వ్యూ చివరలో ఆ రిపోర్టర్ 'ఇప్పుడు నీవు స్థిమితపడినట్లేనా' అంటూ ఆ అబ్బాయిని అడిగాడు.

పిల్లాడు: అవును.. ఇప్పుడు నాకు పర్వాలేదు.

చనిపోయినవారికి పూలతో, కొవ్వొత్తులతో నివాళులర్పించడం కూడా తుపాకులకు వ్యతిరేక పోరాటంలో భాగమే అంటూ కన్నతండ్రి ఇచ్చిన జవాబు తన చిన్ని కుమారుడికి నచ్చచెప్పడమే కాదు.. కోట్లమంది హృదయాలను చెమ్మగిల్లజేస్తోంది.

తన తండ్రి భరోసా ఇస్తూ చెబుతున్న మాటల కంటే అతడి ముఖాన్ని నేరుగా చూస్తూ ధైర్యం తెచ్చుకుని నవ్వుతున్న ఆ పిల్లవాడిని వీడియోలో చూస్తే పిల్లల మనసులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంత సున్నితంగా ఉంటాయనే విషయం గుర్తొస్తుందని ఒక వ్యాఖ్యాత కామెంట్ కూడా పెట్టారు. తల్లిదండ్రులు శారీరకం గానే కాదు, మానసికంగా కూడా పిల్లల రక్షకులుగా ఉంటారన్నది ఆ తండ్రిని చూస్తే బోధపడుతుంది.

ఆ తండ్రీకుమారుల సంభాషణను కింది వీడియో లింకులో చూడవచ్చు

https://www.youtube.com/watch?v=fpHJ-0BOdPI

Wednesday, July 29, 2015

కొన్ని మరణాలు సామూహికమే...!


కొన్ని మరణాలు సామూహికమే...!

సామూహిక మరణం అంటే
అందరూ కలసి చావడం కాదు

ఒక్క మరణాన్ని 
సమాజమంతా అనుభవించడం...!

ఒక్క బ్రతుకును
దేశమంతా కోల్పోవడం...!

అవును మరి!

జీవితాన్ని జాతికి అంకితమిచ్చిన వాడి మరణం
సామూహికం కాకుండా ఎలా పోతుంది?

తన సృజనతో దేశానికి ఊపిరిచ్చిన వాడి మరణం 
వైయక్తికం ఎలా అవుతుంది?

జననంలోనే కాదు.. మరణంలోనూ
మనకు మిగిలిందీ.. మనకు మిగిల్చిందీ
ఆ స్ఫూర్తినే కాదా... 
ఆ దివ్యాగ్ని జ్వాలనే కదా!

అద్దంకి తుషార, హైదరాబాద్
27-07-2015

డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం కన్నుమూశారని తెలియగానే ఒక యువహృదయం గుండె లోతుల్లోంచి సహజాతిసహజంగా పెల్లుబికి వచ్చిన అక్షర నీరాజనం ఇది. కోట్లమంది భారతీయులు.. ప్రత్యేకించి యువతీ యువకుల హృదయాలను కదిలిస్తున్న కలాం స్మృతులకు ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని (బిటెక్ థర్డ్ ఇయర్) పట్టిన ఆత్మీయ నివాళి ఇది.

"సామూహిక మరణం అంటే అందరూ కలసి చావడం కాదు.. ఒక్క మరణాన్ని సమాజమంతా అనుభవించడం...! ఒక్క బ్రతుకును దేశమంతా కోల్పోవడం...!" అంటూ మహాకావ్య సదృశ ప్రారంభంతో తుషార అప్పటికప్పుడు రాసిన కవితా పాదాలు ఆయన మరణం సామూహికం కాకుండా ఎలా పోతుంది అంటూ ఒక మహాద్భుత సమర్థనతో ఇలా ముగిశాయి

"అవును మరి! జీవితాన్ని జాతికి అంకితమిచ్చిన వాడి మరణం సామూహికం కాకుండా ఎలా పోతుంది? తన సృజనతో దేశానికి ఊపిరిచ్చిన వాడి మరణం వైయక్తికం ఎలా అవుతుంది?"

"ఒక దివ్యాగ్నిని అంతఃకరణలో ఉంచుకునే మనందరం జన్మించాం. ఆ అగ్నికి  రెక్కలు తొడిగి దాని మంచితనం మెరుగును ఈ ప్రపంచమంతా నింపివేసే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి" అంటూ భారత క్షిపణి శాస్త్ర పితామహుడు కలాం రాసిన అగ్నిజ్వాలల వంటి అక్షర తూణీరాలు ఒక తరం యువతీయువకులపై శాశ్వత ప్రభావం వేశాయి. వాటి ప్రభావం ఎంత గొప్పదంటే.. స్వాతంత్ర్యానంత దేశ చరిత్రలో తొలిసారిగా.. తమ జీవితాలు ఎంతో విలువైనవని, తాము సాధించాల్సిన కలలు తమ కళ్లముందు నిలబడి తమను వెంటాడుతున్నాయంటూ యువత ఉద్వేగంతో ఊగిపోయింది.

200 సంవత్సరాలకు పైగా పరాయిపాలనలో మగ్గిపోయిన భారత జాతి సగర్వంగా తలెత్తుకుని బతుకుతున్న తరంలో మనముంటున్నాం. ఆర్థిక పరాధీనత ఇప్పటికీ వెంటాడుతున్నా.. కోట్లమందికి ఇప్పటికీ జీవితం ప్రశ్నార్థకంలా మిగులుతున్నా.. అందుబాటులో కి వచ్చిన కాసిన్ని అవకాశాలనే రెండుచేతులతో ఒడిసి పట్టుకున్న భారత యువత ప్రపంచ యవనికలో తన పరిశ్రమతో, మేధస్సుతో అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది.

నాయకత్వం అంటేనే నమ్మకాలు పూర్తిగా కోల్పోతున్న కాలంలో వందకోట్ల పైబడిన ప్రజానీకానీకంలో పెను ఆశల్ని, ఆకాంక్షల్ని రగిలించిన ఒకేఒక్కడు కలాం. ఈ దేశ యువతరం తన స్ఫూర్తిని ఎక్కడి నుంచి గ్రహిస్తోందో.. ఏ మహనీయ మూర్తిమత్వం ప్రేరణతో తన పయనాన్ని కొనసాగిస్తోందో .. ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణకు మారుపేరు కలాం. సమస్త రాజకీయ మరుగుజ్జులను దాటుకుని, ఈ దేశం, ఈ జాతి నమ్మకం ఉంచిన, గౌరవం పెంచుకున్న ఒకే ఒక్క మౌని కలాం. రాజకీయం అనే కళకు దూరంగా జీవిత పర్యంతం బతికిన ఆ మహనీయుడికి ఒక తెలుగు యువతి పట్టిన అక్షరాంజలి ఇది.

మా ఇన్‌చార్జి ద్వారా తర్వాత తెలుసుకున్నదేమంటే ఆమె నిజంగానే పుస్తకాల పురుగు. ఎంతగానంటే 20 ఏళ్ల ప్రాయంలోనే అంతగా అర్థం కాకపోయినా కారల్‌మార్క్స్ 'కేపిటల్‌' గ్రంథాన్ని ఏకధాటిగా చదువుకుంటూ పోయిన తీవ్ర పఠనాసక్తి ఆమెది. కారల్ మార్క్స్‌నే చదవడానికి ప్రయత్నించిన ఆమె ఇక ఏ పుస్తకంపై అయినా ఆసక్తి పెట్టగలదంటే సందేహమెందుకు?

తుషారా... చదువు తల్లీ... కలాం నుంచి కారల్ మార్క్స్ దాకా నువ్వు ఎంచుకున్న ఈ ప్రపంచ పరిశీలనా చట్రాన్ని ఇలాగే కొనసాగించు.. జీవితం పట్ల స్ఫూర్తి పొందడానికి, విశ్వ మూర్తిమత్వాన్ని ఆకళింపు చేసుకోవడానికి నీవెన్నుకున్న మార్గం నుంచి ఎన్నటికీ వైదొలగకు. చదవటం కంటే చూడటంమీదే ఆసక్తి పెంచుకుంటున్న కొత్త తరాలకు నీ అభిరుచి కూడా ప్రేరణ కావాలి.

గమనిక: 
నిన్న అంటే సోమవారం (27-07-2015) సాయంత్రం కలాం కన్నుమూత వార్త విన్న వెంటనే సాక్షి పత్రికకు తుషార పంపిన ఈ భావోద్వేగ స్పందనను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాం. ఎడిటోరియల్ పేజీ (4)లో సింగిల్ కాలమ్ లెటర్ స్థానంలో ఈ కవితను కూర్చి ఇంకా చోటు ఉండటంతో తప్పనిసరై ఆమె కవితకు ముగింపుగా చివరి కవితా పాదాన్ని మావైపునుంచి చేర్చాం. ఈ అదనపు చేర్పుతో పనిలేకుండానే ఆమె పంపిన లఘుకవిత సారాంశం అమూల్యం.. అమోఘం.

దాన్ని మీకోసం ఈ బ్లాగులో మరోసారి పోస్ట్ చేస్తున్నాం.

మంగళవారం (28-07-2015) సాక్షి సంపాదక పేజీలో (4) లో దిగువ భాగంలో ఈ కవితను చూడవచ్చు
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/28072015/4

Sunday, July 26, 2015

బాహుబలి కత్తితో తెలుగు దర్శకుల తలలు నరికిన రాజమౌళి


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరు తలలను బాహుబలి కత్తితో నరికాడు రాజమౌళి అంటూ రాం గోపాల్ వర్మ మరోసారి పూనకం పట్టి అరిచేశాడు. వాస్తవానికి బాహుబలి సినిమాను ప్రీమియర్ షో చూసిన తర్వాతే బాంబే చిత్రపరిశ్రమ మూగపోయింది. ఆ సినిమా చూసిన తర్వాతే తమిళ చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. లక్ష లోపాలున్నాయని విమర్శకులు మొత్తుకుంటున్నా సరే బాహుబలి ప్రభావం హాలీవుడ్ వరకు విస్తరించిపోయింది. భాషా భేదాలు లేకుండా సినిమాను చూస్తున్న జనం బాహుబలికి అది విడుదలైన 15 రోజుల తర్వాత కూడా దాసోహమవుతున్నారు. ఆ దాసోహం విలువ డబ్బు రూపంలో నేటికి 402 కోట్లు.

కానీ ఆశ్చర్యం ఏమంటే రాంగోపాల్ వర్మ ఇంతవరకు ఆ సినిమాను చూడలేదు. కానీ ప్రపంచం మొత్తాన్ని ఎదురుగా పెట్టుకుని రాజమౌళిని తొలి రోజునుంచి ఆకాశానికి ఎత్తిన రామూ.. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్లు, దర్శకులందరి తలల్నీ రాజమౌళి నరకడమే కాకుండా మీ స్టామినా ఏదో ఇప్పుడు నాకు చూపండి అంటూ సవాలు విసిరాడని మరోసారి ఢంకా భజాయించాడు.

సాక్షి మేనేజింగ్ ఎడిటర్ స్వప్న నేతృత్వంలో రూపొందుతున్న రాముఇజం ప్రసార కార్యక్రమంలో ఒక గంటపాటు మళ్లీ బాహుబలి ప్రభావం గురించి ప్రచారం చేసాడు (జూలై 19న.). ఒక సినిమాను ఇంతవరకూ చూడకుండానే ఇంత స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తిన రామూకు.. బాహుబలి టిక్కెట్లు ఇస్తున్నాం పోయి చూసి రండి అంటూ ఇంటర్వ్యూ చివరలో సాగనంపారు స్వప్న.

రామూ ఎందుకు తెలుగు సినీ దర్శకులను ఇంతగా తీసిపారేస్తున్నాడో, దమ్ముంటే బాహుబలిని మించిన సినిమాను తీయండి చూద్దాం అంటూ ఎందుకిలా పదే పదే సవాలు చేస్తున్నాడో తెలుసుకోవాలంటే జూలై 19న స్వప్నకు తను ఇచ్చిన ఇంటర్వ్యూను కింది లింకులో చూడండి.

ఇది మీ ఓపికకు సంబంధించిన సమస్య. నాకయితే తన మాటల్లో పూర్తి నిజాయితీ ఉందనిపించింది. మీరు ఏకీభవించవచ్చు లేదా ఏకీభవించకపోవచ్చు కానీ ఆసక్తి ఉంటే రామూ బాధను ఒకసారి వినండి. కాదు.. చూడండి.

RGV Talks about Baahubali Movie Episode 33
https://www.youtube.com/watch?v=XdPQK4EqP3I

Wednesday, April 15, 2015

సోమరులకెందునూ మోక్షము లేదు….


ఇప్పుడు విద్య వ్యాపారంగా మారి అటు టీచర్లూ, ఇటు పిల్లలూ క్షణక్షణమూ లెక్కించుకునే కాలం కాబట్టి పిల్లల, టీచర్ల మనస్తత్వాలు మొత్తం మీద ఎలా ఉంటున్నాయో తెలీదు కాని….మారోజుల్లో టీచర్లు ఏ క్లాసు పాఠం చెప్పేవారు అయినా సరే, సబ్జెక్టు మాత్రమే కాక జీవితానికి సంబంధించిన విలువల గురించి సందర్బం వచ్చినప్పుడల్లా పిల్లల మనసుల్లో నాటేవారు. విసుగు తెప్పించే మామూలు పాఠాల కంటే అప్పుడప్పుడూ అయ్యవార్లు చెప్పే ఇలాంటి జనరల్ విషయాలే చాలా బాగుండేవి.

అయితే వాటిని ఎంతవరకు పాటించాం అనే అంశం కంటే క్లాసుపాఠాల బోర్ నుంచి మా తరం పిల్లల్ని తప్పించడమే కాదు. ఆరేడు గంటలపాటు నిరవధికంగా రకరకాల పాఠాలు వినవలసివచ్చిన మాకు అవి పెద్ద ఉపశమనం గాను, నిద్రమత్తునుంచి వదిలించేవి గాను ఉండేవి. ఊళ్లల్లో హరికధ, బుర్రకథలు వంటివి సుదీర్ఘంగా ప్రదర్శిస్తున్నప్పుడు హరదాసులు, గాయకులు అప్పుడప్పుడు చెప్పే పిట్టకథలు సైతం ఇలా జనం నిద్రను పోగొట్టి మళ్లీ కథలో లీనం చేయడానికి ఉపయోగపడేవి కదా. అసలు పిట్టకథల ప్రయోజనం ఇందుకోసమేనేమో..

మేం ఊర్లో అయిదోక్లాసునుంచి గెంతు వేసి మా పల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలోని సెకండరీ స్కూల్‌లో ఆరవ తరగతికి వెళ్లినప్పుడు హిందీ టీచర్ అయిన కృష్ణమూర్తి సార్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆయన తొలిరోజు మా క్లాసుకు వచ్చినప్పుడే అందరివద్దా నోట్సు ఉన్నాయా అని అడిగి ఈ వాక్యం రాసుకోమని చెప్పారు. “సోమరులకెందునూ మోక్షము లేదు…” చాలా సాదాసీదాగా ఆయన ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించేవారు.

“పల్లెబడులలోంచి పెద్దబడికి వచ్చారు కాబట్టి అయిదారు సబ్జెక్టులు చదివి మననం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏరోజు పనిని ఆ రోజే పూర్తి చేసుకోండి. ఎప్పుడూ ఏ పనిని పెండింగ్‍‌లో పెట్టవద్దు. అలా పెండింగ్‌లో పెట్టకూడదు అని తెలిసి వచ్చేలా, గుర్తు చేసేలా మీ ప్రతి నోట్స్ పుస్తకంలోనూ సోమరులుకెందునూ మోక్షము లేదు అని రాసుకోండ్రా” అని పురమాయించేవారు. ఒకవేళ ఏ పిలగాడయినా తాను చెప్పినట్లు నోట్సులో ఈ వాక్యం రాసుకోలేదని కనిపెట్టినట్లయితే వెంటనే తొడబెల్లం పెట్టేవారు.

రాయలసీమలో పిల్లలను కాస్త తీవ్రంగా దండించాలనుకునే అయ్యవార్ల చేత వజ్రాయుధం లాంటిది ఈ తొడబెల్లం. ఏ కాలంనుంచి ఈ శిక్షా పద్ధతిని అమలు చేస్తూ వచ్చారో తెలీదు కాని దీనికి గురైన పిల్లలకు మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టదంటే నమ్మండి. తప్పుచేసిన పిల్లలకు చెంప పగులకొట్టడం, వీపుమీద పిడిగుద్దులతో సత్కరించడం వంటి మామూలు శిక్షలు సరిపోవనుకున్నప్పుడు గురువులు వెంటనే పిల్లల తొడను చేతి వేళ్లతో పట్టుకుని మెలిపెట్టేవారు. మెలిపెట్టడంతో పాటు ఒక్కోసారి గిచ్చేవారు.

ఇది ఎంత సుదీర్ఘకాలంపాటు కొనసాగితే పిల్లవాడికి అంతసేపు నరకం కనబడుతుందన్నమాట. ఒక్కోసారి ఇంటికి పోయాక కూడా ఆ తొడబెల్లం సలుపు, గిచ్చుడు తగ్గకపోతే అమ్మ దగ్గర పట్టు వేయించుకునేవారం. తమ బిడ్డలను అలా హింసించిన టీచర్ల బతుకును గ్రామీణ తిట్లతో అమ్మలు ఉతికేసేవారనుకోండి. అలా ఆయన పెట్టే ఈ రకం హింసకు తట్టుకోలేక అందరమూ ఈ వాక్యాన్ని నోట్సులలో నింపేవారం. నోట్స్ మధ్య పేజీలలో కూడా పుట పైభాగాన రాసుకోమని చెప్పేవారాయన.

అలా అయిదేళ్లపాటు ఆయన చెప్పిన ఈ మెరుపువాక్యం అలాగే మాకు గుర్తుండిపోయింది. ఇంటర్ డిగ్రీల్లో సైతం నోట్స్ పుస్తకాలలో ఇది అలవాటుగా రాసుకుంటూ వచ్చాను. అయితే మేం ఎంతవరకూ ఈ వాక్యసారాంశాన్ని ఆచరించామంటే చెప్పలేను. స్కూల్లో ఏడెనిమిది గంటల వరుస శిక్ష పూర్తయ్యాక పల్లెటూళ్ల విద్యార్థులకు పనులు, ఆటలు, భజనలు ఇవి ఇచ్చే ఉత్సాహం అంతా ఇంతా కాదు కాబట్టి వెంటనే మేం ఇటు వైపుకు మళ్లేవాళ్లం.

వ్యవసాయం లేదా ఊర్లో వృత్తి పనులు చేసుకునే కుటుంబాలనుంచి వచ్చిన వారే మా స్కూల్లో అన్ని క్లాసుల్లో ఉండేవారు. సహజంగానే చదువు పట్ల ఉద్యోగస్తుల కుటుంబాల్లో మాదిరి కఠినమైన సమయపాలనను మేం పాటించేవాళ్లం కాదు. దీనికి కారణం కూాడ ఉండేది. గ్రామీణ పిల్లలకు చదువు మాత్రమే వ్యాపకం కాదు. తమ స్థాయిల్లో వ్యవసాయ, వృత్తి పనుల్లో పాల్గొనవలసి రావడం వల్ల మాకందరికీ చదువు పట్ల కంటే వృత్తిపనుల పట్లే ఎక్కువ ఆసక్తి, అనురక్తి ఉండేవి.

అందుకే బడికి పోవడం, స్కూలుకు పోవడం కంటే బడినుంచి బయటపడిన వెంటనే ఏదో ఒక విధమైన ఆటల్లో, పనుల్లో, భజన, పల్లీయ సంస్కృతికి సంబంధించిన ఇతరవ్యాపకాల్లో పాల్గొంటూ పరమానందంగా గడిపేవాళ్లం. అది పైచదువులకు పోవడానికి, మంచి వృత్తి చదువులు ఎన్నుకోవడానికి చాలామందికి ఆటంకంగా నిలిచేది కూడా.

‘చదువుకోకుంటే బిచ్చమెత్తుకోని తిరుగుతార్రా’ అంటూ టీచర్లు చెప్పే చదువుల సారానికి, ‘పనులు చేయకపోతే కూడా బిచ్చమెత్తుకొని తిరుగుతార్రా’ అంటూ మా పెద్దవాళ్లు చెప్పే జీవన సారాంశానికి ఎక్కడో లంకె తప్పింది కాబట్టి ఈ గొప్ప సత్యం కూడా ఆచరణలో అలా అటకెక్కిపోయింది కానీ, నా జ్ఞాపకాల దొంతరలో మాత్రం ఈ వాక్యం అలాగే నిలిచిపోయింది.

“సోమరులకెందునూ మోక్షము లేదు….”

గమనిక:
ఇది 2008లో నా మరొక బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. ఈ బ్లాగ్‌ను ఇప్పుడు ఉపయోగించడం లేదు


Thursday, April 2, 2015

మగాళ్లతో మీరు సరదాగా గడుపుతారా?తీహార్ జైలులో ఉన్న నిర్భయ కేసులోని దోషి ముఖేష్ సింగ్ ఇప్పటికీ ఏమంటున్నాడో మనం ఇటీవలే చూశాం. నిందితుల తరపున కేసు వాదించిన ఆ లాయర్లు న్యాయదేవతను తమ 'డైమండ్ మహిళ' వ్యాఖ్యల ద్వారా ఎంత పునీతం చేశారో కూడా విన్నాం. దేశం దేశమే జైలులాగా, అలాంటి లాయర్ల ఖిల్లాగా ఉందని వస్తున్న అభిప్రాయాల పదునును ఏమాత్రం తగ్గించకుండా మరొక పసందైన సన్నివేశానికి కూడా మన దేశమే సాక్షిగా నిలిచింది. దీంట్లో కొత్తదనం ఏదంటే ఈ సారి వంతు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌ది కావడమే.

విషయానికి వస్తే.. మార్చి 18న హాంకాంగ్ వెళ్లడానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక మహిళ అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారి బారిన పడింది. ఆమె బెంగళూరు నివాసి. తన భర్తను కలుసుకోవడానికి హాంకాంగ్ వెళుతున్న ఆమెను ఆ అధికారి మాటలతోనే కుళ్లబొడిచేశాడు.

ఆమె ధ్రువపత్రాలను తనిఖీ చేసే క్రమంలో ఆమెను అసహ్యకరమైన మాటలతో వేధించడమే కాదు.. దేశీయ, అంతర్జాతీయ మార్గాల మధ్య ఉండే ఎస్కలేటర్ పొడవునా ఆమెను అనుసరించి వెళుతూ మహా ఇబ్బంది కలిగించాడట. అదేంటో ఆమె మాటల్లోనే చూద్దాం.

'ఆ అధికారి నన్ను తాగుతావా అనడిగాడు. నువ్వు స్మోక్ చేస్తావా, చికెన్ తింటావా, నీ భర్త లేనప్పుడు మగాళ్లతో నువ్వు సరదాగా గడుపుతావా, సంతాన నిరోధం కోసం నీవు సర్జరీ చేసుకున్నావా? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. చివరి ప్రశ్ననయితే కనీసం నాలుగుసార్లు అడిగాడు' అని ఆమె సిఎన్ఎన్-ఐబీఎన్ చానెల్ విలేకరికి చెప్పింది.
పైగా, ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమెను పట్టుకుని తనతో కలిసి మూడోబిడ్డను కనాలనుందా అనడిగాడు. హాంకాంగ్‌కు ఒంటరిగా ఎందుకెళుతున్నావు. భర్తను కలవడానికేనా లేక ఇతర మగాళ్లతో సరదాగా గడపడానికా.. అని కూడా రెట్టించాడు. పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లే ఆమెలాంటి ఆడవారు వివాహేతర సంబంధాల కోసమే విదేశాలకు తరచుగా వెళుతుంటారని కూడా అతగాడు వ్యాఖ్యానించాడు.

చివరాఖరుగా.. 'నీ పర్సనల్ మొబైల్ నంబర్ ఇచ్చివెళ్లు.. నీ భర్త ఇంట్లో లేనప్పుడు నీకు కాల్ చేస్తాను' అని కూడా ఆ అధికారి అన్నాడు. ఇంత జరిగాక, ఆ మహిళ తన కుటుంబంతో కలిసి ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపింది. కానీ ఆ ఫిర్యాదుకు ఇంతవరకు అంటే 15 రోజుల తర్వాత కూడా సమాధానం కానీ, స్పందన కానీ లేదట.

ఆ వార్త సారాంశం ఇంతే.  ఒక్క మాట కూడా నేను కల్పించి చెప్పింది లేదు. firstpost.comలో మార్చి 27న వచ్చిన ఒక చిన్న వార్త ఇది. చాలా ఆలస్యంగా బయటపడిన ఘటన కావడంతో ఇది ఆ మహిళ వెర్షన్‌ని మాత్రమే చెప్పిన వార్తగా రూపొందింది. అవతలిపక్షం స్పందనను ఈ వార్తలో పొందుపర్చే అవకాశం కూడా లేదు.

అయితే ఈ వార్తకు కింద కామెంటు పెట్టిన వారి వ్యాఖ్యలు ఈరోజు నాకు మరింత జ్ఞానాన్ని ఇచ్చాయని మాత్రం అంగీకరించి తీరాలి. ఒక సమస్యను ఎన్ని కోణాల్లోంచి చూడాలో, ఒక ఘటన ఎన్ని డైమెన్షన్ల నుంచి చూడబడుతుందో.. మధ్యలో ఎన్ని వ్యంగ్యాలూ, ఎన్ని అపవ్యాఖ్యలూ, హేళనలూ పుట్టుకొస్తాయో కూడా అవి నేర్పాయి.

ఒక్కటి మాత్రం వాస్తవం. సంస్కృతి.. ఘనమైన నాగరికత. గత వైభవ దీప్తి వంటి పెద్ద పెద్ద మాటల జోలికి పోనవసరం లేదు కానీ, ఇంటిబయట తిరిగే, పనిచేసే, ప్రయాణం చేసే ఆడవారి పట్ల నూటికి 99 మంది మన దేశంలోని పురుష పుంగవుల్లో కొద్దో గొప్పో తేడాలతో సరిగ్గా ఆ ఇమ్మిగ్రేషన్ అధికారి ఆలోచనలే ఉంటాయనటంలో సందేహమెందుకు?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంజీ ఎంత రంజుగా ఇదే మాటలన్నాడో కదా బహిరంగ సభలో. 'పేదవర్గాలకు చెందిన మగవాళ్లు బతుకుకోసం వలస వెళితే ఇంట్లోని ఆడవాళ్లు ఏం చేస్తారో మీకు తెలుసుకదా' అనే ఆయన వెకసెక్కపు మాటలు టీవీ తెర నిండుగా వినడాన్ని, చూడటాన్ని మనం ఇంకా మర్చిపోలేదు.

మిగతా ప్రపంచం ఎక్కడయినా చావనీ... ఎలాగైనా ఉండనీ... భారతీయులుగా మనం ఇలాగే పుట్టాం, పెరిగాం. మునుపటి తరాలు, ఆ వెనుకటి తరాలు, రేపటి తరాలు కూడా మన జాతిలో సగం గురించి ఇలాగే భావిస్తూవచ్చాయి. భావిస్తున్నాయి. భావిస్తూ ఉంటాయి కూడా. ఈ నగ్న వాస్తవాన్ని మనం అంగీకరిస్తే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆవేశకావేషాలకు గురవ్వాల్సిన పని ఉండదు.

బయటివాడో, బయటిదో ఒకరన్నారనీ, వీడియోలు తీశారని బాధపడటం.. కించపడటం, పరువునష్టంగా ఫీలవడం, దేశభక్తిని కృత్రిమ రంగుల్లో కొత్తగా ప్రదర్శించడం వంటి భావోద్వోగాలకు మనం గురి కావలసిన అవసరమూ లేదు. మనం ఇలా ఉన్నాం అనే నిజాన్ని ఒప్పేసుకుంటే పోయె. మనవద్ద లేని, మనకు చేతకాని అనవసర భేషజాలకు పోవడం ఎందుకనేదే నా ప్రశ్న.

ఢిల్లీ విమానాశ్రయంలో ఈ వ్యవహారానికి మూలపురుషుడైన ఆ మగాధికారి ఫోటోను చూశాను. టై, ఇన్‌సర్ట్, షూస్ తగిలించుకోవడం తప్పితే మిగతా ఆపాదమస్తకం అతగాడు అచ్చంగా మనలాగే ఉన్నాడు. అమ్మయ్య.. అతడు దేవుడు మాత్రం కాదు.. మన వాడే.. మన మగాడే..

ఓపిక ఉంటే ఫస్ట్‌పోస్ట్.కామ్ లోని ఒరిజనల్ వార్త, దానిపై వ్యాఖ్యలు కూడా కింద చూడగలరు.

'Do you have fun with other men' Immigration officer crosses new line in sexual harassment

http://www.firstpost.com/living/do-you-have-fun-with-other-men-immigration-officer-crosses-new-line-in-sexual-harassment-2176963.html

కొసమెరుపు: 
" మీరు నర్సులు.. ఎండలో ధర్నా చేస్తే నల్లబడతారు. అవకాశాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పెళ్లికొడుకులూ దొరకరు"
ఇది ఈ రోజే అంటే ఏప్రిల్ 1న మన గోవా ముఖ్యమంత్రి గారు నర్సులకు  చేసిన పవిత్ర ప్రవచనం. ఈయన రాజ్యంలో నర్సులు తమ సమస్యలు పరిష్కారం కాలేదని వీధికెక్కారు. అంతే. ఈ చిన్న పాపమే వాళ్లు చేసింది. ఇక మీకు పెళ్లి కొడుకులు దొరకరనేంతవరకు పోయింది వ్యవహారం. తర్వాత ఆ మాటే తాననలేదని ఆయన వివరణ ఇచ్చి ఉండవచ్చు. కానీ కావాల్సింది 'మీరు అందంగా ఉండేవారు. ఇప్పుడు చూడండి.. నల్లబడిపోయారు' అనే మాటలతో సానుభూతి చూపడమా లేక  ఆ నర్సులను వీధులకెక్కకుండా సమస్యలు పరిష్కరించడమా...? ఇది గాల్లో కలిసిపోయింది.

మరొక మెరుపు...
తెల్లతోలు ఉంది కాబట్టే సోనియాకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కిందని కొంత సేపటి క్రితం జాతి వివక్షా వ్యాఖ్యలతో వాంతి చేసుకున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కాస్సేపట్లోనే క్షమాపణలతో బొక్కబోర్ల పడ్డాడు. ప్రమాదాన్ని గ్రహించిన సీనియర్ మంత్రి ఒకరు (మన వెంకయ్య గారేనా) క్లాస్ పీకడంతో ఈయన సర్దుకున్నాడని వార్తలు.

ఇప్పుడు చెప్పండి.. మనం ఇలా కాక మరోలా ఉంటామా? ఉండగలమా..? మన పరువు ఇలా కాక మరోలా ఎప్పుడయినా, ఏ కాలంలో అయినా ఉండి ఏడ్చిందా?


ఈ అంశంపై కొనసాగుతున్న చర్చను కింది కథనాల్లోనూ చూడవచ్చు. 

మరోసారి నేతల మకిలి!
http://www.sakshi.com/news/editorial/again-leaders-got-black-spot-with-controversial-comments-227177

రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
http://www.sakshi.com/news/opinion/why-government-target-roja-226541Tuesday, March 31, 2015

అమెరికా నుంచి ఉప్పాడ తీరం దాకా....

నిన్న సాయంత్రం 4 గంటలకు ఎప్పటిలాగే సాక్షి ఆఫీసుకు వచ్చి మెయిల్స్, వార్తలు చూస్తున్నా. సాక్షి వెబ్ సైట్ హోమ్ పేజీలో దిగువన ఉన్న వార్తాంశాలలో ఉప్పాడ బీచ్‌లో వలకు చిక్కిన  జారు మీను అనే షార్క్ చేప గురించిన వార్త, దాని బొమ్మ ఎందుకోగానీ ఆకట్టుకుంది. జారు మీను అనాల్సింది స్థానిక యాసలో జారుమెను అన్నారా లేదా అచ్చు దోషమా తెలియలేదు.

ఆ వార్త పూర్తి పాఠం ఇదీ...

ఉప్పాడ బీచ్‌లో వలకు చిక్కిన జారుమెను
Sakshi | Updated: March 30, 2015 15:59 (IST)
http://www.sakshi.com/news/andhra-pradesh/big-fish-caught-in-uppada-beach-226208

తూర్పుగోదావరి: కాకినాడలోని ఉప్పాడ బీచ్ వద్ద వేటకు వెళ్లిన మత్స్య కారులకు సోమవారం పంట పండింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే జారుమెను జాతికి చెందిన చేప వలకు చిక్కింది. దీంతో దానిని బోటుకు కట్టుకుని తీరానికి లాక్కొచ్చారు. దానిని చూడటానికి స్థానికులు గుమిగూడుతున్నారు....
2 వేల కిలోల బరువైన భారీ షార్క్ జాలర్ల వలకు ఎలా చిక్కిందని అబ్బురపడుతూనే వార్తను చదివాను. ఇలాంటి పెద్ద పెద్ద చేపలు వలలో చిక్కిన వైనం తరచుగా వార్తల్లో చూస్తుండటంతో అంతకుమించి దృష్టి పోలేదు.

సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎడిట్ పేజి ఇంటర్ కామ్ నంబర్ గణగణ మోగింది. పాఠకులు, లేదా రచయితల నుంచి వచ్చి ఉంటుందని తీసుకుంటే ఊహించనంత దూరం నుంచి వచ్చిందది. అమెరికా లోని డల్లాస్ (డాలస్) నుంచి ఐటీ రంగ నిపుణులు కె.శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. ఆశ్చర్యంగా అంతకుముందు నేను సాక్షి వెబ్‌సైట్‌లో చూసిన ఆ జారుమీను గురించి ప్రస్తావించారు.

ఆ వార్తలో భాగంగా వేసిన చేప ఫొటో వాస్తవమైనదేనా, లేదా ఫైల్ ఫొటోనా అని ఆయన వాకబు చేశారు. మళ్లీ ఒకసారి దాన్ని చూసి వార్త ప్రకారం అది తాజా ఫొటోనేనని చెప్పాను. 'మీరేమనుకోకపోతే ఆ వార్త పంపిన రిపోర్టరును ఒకసారి వాకబు చేసి ఆ చేప ఇంకా బతికి ఉందో లేదో కనుక్కోండి. బతికే ఉంటే దాన్ని వెంటనే సముద్రంలోకి వదిలిపెట్టమని ఆ జాలర్లకు తెలుపండి' అంటూ ఆయన అభ్యర్థించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రాణి అయిన ఆ చేప (వేల్ షార్క్ : ఇది షార్క్ చేపే అయినప్పటికీ తిమింగలం (వేల్) సైజులో ఉండటంతో దీన్ని వేల్ షార్క్ అని పిలుస్తున్నారు) సాధుజీవి అనీ, సముద్రంలో ఉన్నప్పుడు మనిషి తన సమీపంలోకి వచ్చి తాకినా అది ఏమీ చేయదని, దీన్ని ఐక్యరాజ్య సమితి రక్షిత జీవులు జాబితాలో చేర్చిందని, ఎలాంటి అవకాశం ఉన్నాసరే దాన్ని నీళ్లలోకి పంపించే ఏర్పాటు చేయమని ఆయన కోరారు.


ఈ సాయంత్రం నేను మా వెబ్‌సైట్‌లో యాదృచ్ఛికంగా చూసిన ఆ వార్త అమెరికాలోని ఒక ఐటీ నిపుణుడి దృష్టిలో కూడా పడి ఆయన నేరుగా మా పత్రికాఫీసుకే ఫోన్ చేసి విచారించిన వైనం నాకు దిగ్భ్రాంతి కలిగించింది. నిజంగానే షాక్ తిన్నానా క్షణంలో. ఉప్పాడ ప్రాంత రిపోర్టర్ గురించి తెలీదని, కాస్త సమయం ఇస్తే కనుక్కుని ఈ సమాచారం వారికి చెబుతానని చెప్పి ఆయన ఈమెయిల్‌ని తీసుకున్నాను.

ఎడిట్ పేజీలో డెస్క్‌లో కూర్చుని బుద్ధిగా పనిచేసుకునే నాకు ఆ స్థానిక రిపోర్టర్ వివరాలు తెలీవు. వెంటనే మా ఎడిటోరియల్ ఇన్‌చార్జి వేణుగోపాల్ గారిని సంప్రదించి అమెరికా కాల్ విషయం చెబితే ఆయన తూర్పుగోదావరి జిల్లా సాక్షి బ్యూరోకి చెందిన అనంత్ గారి మొబైల్‌ నంబర్ ఇచ్చారు. వెంటనే ఆయనకు కాల్ చేసి ఉప్పాడ రిపోర్టర్‌కు ఈ విషయం తెలిపి ఆ చేప ఇంకా బతికి ఉన్నదీ లేనిదీ వివరాలు కనుక్కోమని కోరాను. ఈలోగా అనంత్ గారి మొబైల్‌ని శ్రీనివాస్ గారికి ఈమెయిల్ చేశాను. రెండు నిమిషాల్లోనే పిఠాపురం రిపోర్టర్ ప్రసాద్ గారి నుంచి సమాచారం వచ్చింది. వలలో చిక్కిన ఆ చేప అప్పటికే చనిపోయిందనీ, ఆ అరుదైన చేప పట్ల భవిష్యత్తులో జాగరూకతతో వ్యవహరించడానికి ఆ జాలర్లను కలిసి విషయం చెబుతానని ఆ రిపోర్టర్ చెప్పినట్లు అనంత్ గారు తెలిపారు. ఈలోపు నా మెయిల్లో అనంత్ గారి మొబైల్ నంబర్ చూసిన శ్రీనివాస్ గారు నేరుగా తనకే కాల్ చేయడంతో నేను రంగం నుంచి తప్పుకున్నాను.


కాసేపయ్యాక శ్రీనివాస్ గారు మళ్లీ ఫోన్ చేశారు. ఆ చేప బతికి ఉండే అవకాశం లేదని సందేహిస్తూనే ఒక ప్రయత్నం చేద్దామని మీకు ఫోన్ చేశానని, అది చనిపోయిందని నిర్ధారణ అయినా, నా కాల్‌కి సాక్షి సిబ్బందిగా మీరందరూ సత్వరం స్పందించడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన చెప్పారు. ఈ అరుదైన షార్క్ చేపలను ఇంగ్లీషులో జెంటిల్ జెయింట్స్ అంటారట. దీన్ని తెలుగులో మహా సాధువులు అందామా, సాధు చేపలు అందామా, మృదు తిమింగలాలు అందామా నాకయితే సరైన పదం స్ఫురించడం లేదు. ఈ జెంటిల్ జెయింట్స్ గురించి సైన్స్ పత్రికలలో ఉన్న ఇంగ్లీషు సమాచారాన్ని లింకులతో సహా ఆయన మెయిల్ చేశారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాణికి సంబంధించిన ఒక చిన్న వార్తాంశం అమెరికానుంచి ఉప్పాడ తీరం దాకా ప్రసరించిన ఈ మానవీయ స్పందనను నేనయితే మరవలేను. ఆ చేప బతికి ఉండకపోవచ్చు. వలలో చిక్కిన తర్వాత బతికి బట్టకట్టే అవకాశాలు లేకపోవచ్చు. కానీ అవకాశముంటే దాన్ని సముద్రంలోకి తిరిగి పంపేందుకు మానవ ప్రయత్నం జరిగితే ఎంత బావుణ్ణు అనే చిరు ఆశను కొన్నివేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రేరేపించిన శ్రీనివాస్ గారూ.. ధన్యవాదాలండీ..

చేప కోసం తపనలోంచి ఏర్పడిన ఈ సుదూర పరిచయ బంధం ఇలాగే కొనసాగాలని తప్ప మీ నుంచి ఇంకేమి కోరుకోగలం? జూన్‌లో ఇండియా వచ్చినప్పుడు ఏపీలో మీ \పర్యావరణంపై వీడియో ప్రాజెక్టు సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండీ...

శ్రీనివాస్ గారి వివరాలు
Srinivas Kanchadapu
Vasunix@yahoo.com
+18044418543 (డల్లాస్ మొబైల్ నంబర్)
---------------------------

శ్రీనివాస్ గారు పంపిన ఈమెయిల్ లింకులలోంచి తెలుసుకున్న వేల్ షార్క్ వివరాలు కొన్ని....
ప్రపంచంలోనే అతి పెద్ద చేప అయిన వేల్ షార్క్ 12,500 కిలోల నుండి 20 వేల కిలోల బరువు వరకు పెరుగుతుంది. సముద్రాల్లో దీనిలాగా వలస వెళ్లే చేప మరొకటి లేదు. వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. మహా సముద్రాల లోతట్టు ప్రాంతాల్లో నివసించే ఈ మహా షార్క్‌లు అంతదూరం ఆహారం కోసమే వలస వెళతాయా లేదా వేరే కారణాలున్నాయా అనే విషయంలో నేటికీ స్పష్టత లేదు. 300 పళ్లు దీని నోటి భాగంలో ఉన్నా వాటి పనేంటన్నది తెలియనప్పటికీ దాని నోరు ఒక మీటరు నుంచి 3 మీటర్ల వెడల్పుతో తెరుచుకుంటుందట. భారీ పరిమాణంలో నీటిని నోటిలోకి మింగి, తర్వాత ఆ నీటిని పళ్ల కోరలనుంచి బయటకు వదిలేస్తూ మిగిలిన ఆహారాన్ని ఇవి స్వీకరిస్తాయి. వెచ్చటి నీటిలోనూ, వెయ్యి మీటర్ల లోతులో 3 సెటీగ్రేడ్ డిగ్రీల స్వల్ప ఉష్ణోగ్రతలలో కూడా ఇవి మనగలుగుతాయి. అంతరించిపోనున్న జాతుల జాబితాలో ఉన్న వీటి మాంసానికి కొన్ని ఆసియా దేశాల మార్కెట్లలో విపరీతంగా డిమాండ్ ఉండటం కూడా ఈ మహా ప్రాణుల ఉనికికి భంగకరం అవుతోంది. పునరుత్పత్తి రేటు చాలా తక్కువ కావటంతో ఇవి అంతిరిస్తున్న జాతుల్లో ఒకటిగా మిగిలాయి. ఎంత మహా భారీ కాయంతో ఉన్నప్పటికీ బెదురు, బిడియం లక్షణాలు కలిగిన ఈ తిమింగలాలు ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులకు ఆకర్షణీయ ప్రాణులుగా ఉంటున్నప్పటికీ వీటిని కాపాడుకునే విషయంలో ఆ టూరిస్టుల అవగాహన ఏంటన్నది తెలియరావడం లేదు.


                                           (వేల్ షార్క్ నోట్లోని 300 పైగా పండ్లు లేదా కోరలు)

నీటిమీద 9 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి పడే ఈ షార్క్ చేపలు సముద్ర రాణులనే చెప్పాలి. ఒక్కసారి నోరు తెరవడం, మూయడం ప్రక్రియతో ఇవి భారీ స్థాయిలో చేప గుడ్లను, బిలియన్ల సంఖ్యలో అత్యంత సూక్ష్మరూపంలో ఉండే జంతు, మొక్కల రూపంలోని ప్రాణులను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.

చాలావరకు ఒంటరి జీవితం గడిపే ఈ మహా తిమింగలాలు ఒక్కో సీజనులో మాత్రం వందల సంఖ్యలో ఒకే చోట దర్శనమిస్తుంటాయి. తరతరాలుగా జాలర్లు, స్థానికులకు ఈ విషయం తెలిసి ఉన్నప్పటికీ శాస్త్ర ప్రపంచానికి నిన్న మొన్నటి దాకా దీనిపై అవగాహన లేకపోవడం ఆశ్చర్యకరం. వేల్ షార్క్‌లు వందేళ్లు బతుకుతాయి గానీ వీటికి సెక్సువల్ మెచూరిటీ 18 సంవత్సరాలనుంచి 30 సంవత్సరాలలో కలుగుతుందట. అంటే వీటి సంతానోత్పత్తికి సుదీర్ఘ కాలం పడుతుంది. అయితే ఈ భారీ చేప ఎక్కడ జత కూడతాయన్నది నేటికీ మిస్టరీనే. ఇది నీటి బయట, మైదానాల్లో, తీరప్రాంతాల్లో సంతానోత్పత్తి చేయడం ఇంతవరకు ఎవరూ చూడలేదు. కానీ ఒక ఆడ షార్క్ ఎంత దూరం వెళుతుందంటే 2007 ఆగస్టు నుంచి 2008 జనవరి మధ్య కాలంలో అంటే కేవలం ఆరు నెలల కాలంలో 7,200 కిలోమీటర్ల దూరం సముద్రాల్లో పయనించిందని ఉపగ్రహాలతో అనుసంధించిన దాని ట్యాగ్‌లు పసికట్టాయి.How to Love a Whale Shark
http://www.scientificamerican.com/article/love-whale-shark/

Whale shark fact file
http://www.arkive.org/whale-shark/rhincodon-typus/

Whale Shark Facts
http://www.seethewild.org/whale-shark-facts/Wednesday, March 25, 2015

పరాభవ మూల్యం


ఆమె అసామాన్యురాలు కాదేమో కానీ... సామాన్యురాలు మాత్రం కాదు. ఆనాటికి అగ్రరాజ్యంగా యావత్ ప్రపంచానికీ వెరపు పుట్టిస్తున్న అమెరికా అధ్యక్ష స్థానాన్నే ప్రకంపింపజేసి, ఆ దేశ రాజకీయ చరిత్రను చీకటి రోజుల్లో ముంచెత్తిన అతి పెద్ద కుంభకోణంలో పాత్రధారి తను. శ్వేత సౌథంలో తాను ఎవరి కింద అయితే పని చేస్తూ ఉండిందో ఆ బాస్ తోనే ప్రణయ సంబంధం నెరపి కనీవినీ ఎరుగని సంచలనానికి నాంది పలికిన యువతి. ఆనాటికి ఆమె వయస్సు 22 ఏళ్లు. అమెరికా అధ్యక్షుడితో ఆమె సంబంధం గురించి ఇంటర్నెట్‌లో తొలిసారి  వార్త ప్రసారమయ్యాక ఆమె బహుశా చరిత్రలోనే కనీవినీ ఎరుగని బహిరంగ అవమానం (పబ్లిక్ హ్యుమిలియేషన్ అనే ఆంగ్లపదానికి ఇది సరైన అనువాదం కాదేమో) పాలైంది. శ్వేతసౌధంలో ఇంటర్న్‌షిప్‌గా చేయడం తప్పితే మరే రాజకీయాలు తెలియని, రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేని ఆమె జీవితం ఆ ఒకే ఒక్క సంఘటనతో అంధకారంలో కూరుకుపోయింది. చాలా కాలం ఆమె ప్రపంచానికి దూరమైపోయింది.

ఇప్పుడామెకు 41 సంవత్సరాలు. యుక్తవయస్సులో తప్పులు చేసి, పబ్లిక్ జీవితంలో అవమానాలు పొంది ఆత్మహత్యలు, ఆత్మహననాలకు పాలవుతున్న వారందరి ప్రతినిధిగా ఆమె నేడు ప్రపంచం ముందుకు వచ్చింది.

తప్పు చేసిన వారి పట్ల సానుభూతి కాదు. క్షమాగుణాన్ని ఈ ప్రపంచం ప్రదర్శించాలి. వారు మనుగడ సాధించడానికి, సర్వైవ్ కావడానికి వ్యక్తులూ, సంస్థలూ, సమాజం చేయూత నందించాలి అంటూ అన్‌లైన్‌లో విజ్ఞప్తి చేస్తున్న ఆమె మోనికా లెవిన్‌స్కీ. ఒక బాస్, ఒక దేశాధ్యక్షుడి కుటుంబ జీవితంలో చిచ్చు పెట్టిన వ్యక్తిగా యావత్ ప్రపంచం దాడికి గురైన, అవమానాల పాలైన ఈ సామాన్య అసామాన్యురాలి జీవితానుభవాన్ని, ప్రపంచం పట్ల ఆమె స్పందనలను ఆమె మాటలలోనే విందాం.

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక దేనికోసమో ఇంటర్నెట్ చూస్తే ఈ వీడియో కనబడిన పర్యవసానమే ఈ అర కొర టపా.

Ted.com వారి వీడియోలో ఆమె ప్రసంగంలోని కొన్ని మాటలు ఇక్కడ చూడండి.

"మీరు ఒక మహిళను చూస్తున్నారు. జీవితపు తొలిదశలో తప్పు చేసిన యువతిని మీరు చూస్తున్నారు. 22 ఏళ్ల వయస్సులో నా బాస్‌తో ప్రేమ సంబంధంలోకి వెళ్లాను. 24 ఏళ్ల వయస్సులో ఆ సంబంధం అనంతర తీవ్ర పర్యవసానాలను ప్రత్యక్షంగా చవిచూశాను. పదేళ్లకు పైగా ఈ ప్రపంచానికే దూరమైపోయాను. నా జీవితంలోనే అత్యంత అంధకార క్షణాల్లోకి నేను కూరుకుపోయి కూడా నేను బతికి బట్టకట్టగలిగానంటే  నా కుటుంబం, స్నేహితులు, అపరిచతులు కూడా అవసరమైన క్షణంలో అందించిన సహకారమే కారణం.

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అభిశంసనకు గురైన మహిళగా బహిరంగ జీవితంలో అవమానం పాలై ప్రపంచానికి కనుమరుగైపోయిన వ్యక్తిగా నేను అనుభవించిన భాధ మాటలకు అందనిది. అమెరికా అధ్యక్షుడితో సంబంధం గురించి నాపై వెలువడిన ఆ తొలివార్త.. సాంప్రదాయిక మీడియా కంటే ఆన్‌లైన్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందిన తొలి వార్తగా చరిత్రలో నిలిచిపోయింది. ఒక సంవత్సరం పైగా నా జీవితంపై వచ్చిన వార్తలు, పుకార్లు, గాసిప్‌లతో నేను సర్వం కోల్పోయాను.

1998లో ఆ వార్త బయటకు వచ్చాక కుప్పకూలిపోయిన నన్ను అమ్మే కాపాడింది. ప్రతి రోజూ నేను స్నానం చేయడానికి పోయిన ప్రతిసారీ ఆమె నా బాత్ రూమ్ తలుపు తెరిచి ఉంచేది. కారణం. అవమాన భారంతో నేనెక్కడ చావును కొనితెచ్చుకుంటానో అన్నది ఆమె భయం. ఆమె నన్నూ నా జీవితాన్నీ కాపాడింది.

తప్పు జరిగినప్పుడు తప్పు చేసిన వ్యక్తి తన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రపంచం అవకాశం ఇవ్వాలి. కాని ఇవ్వాళ ప్రపంచ మంతటా వ్యక్తిగత జీవితాలను బహిరంగపర్చడం, అంతులేని అవమానాలకు గురిచేయడం మీడియాకు అలవాటుగా మారిపోయింది. సైబర్ బుల్లింగ్ పేరిట సాగుతున్న ఈ ప్రక్రియ వ్యక్తికి జీవించే అవకాశం లేకుండా చేస్తోంది.

2010లో సోషల్ మీడియా ప్రపంచాన్ని ఆవరించేసింది. దాంతోపాటు వ్యక్తుల జీవితాలను బహిరంగంగా అవమానించడం, పరాభవించడం పెరిగిపోయాయి. అత్యంత సున్నిత అంశాలను కూడా మొద్దుబార్చివేసేలా సైబర్ బుల్లీయింగ్ నేడు విశ్వరూపమెత్తుతోంది. ఒక గ్యాసిప్ వెబ్ సైట్ 50 లక్షల హిట్లను సాధిస్తోంది. ప్రజల వ్యక్తిగత జీవితాలను అవమానించడం ద్వారా, బహిరంగపర్చడం ద్వారా పబ్లిక్ హ్యుమిలియేషన్ అనేది ఒక సరకుగా మారిపోయిన కాలమిది.

షేమ్, పబ్లిక్ హ్యుమిలియేషన్ బారిన బడిన వారు ఒక విషయం అర్థం చేసుకోవాలి. వారు మనుగడ సాగించగలరు. జీవితాన్ని కొనసాగించగలరు. వారికి కావలసింది కాసింత సహాయం, కాసింత ప్రేరణ.

పబ్లిక్ షేమింగ్ యాజ్ ఎ బ్లడ్ స్పోర్ట్ హాజ్ టు స్టాప్ (రక్త క్రీడగా మారిన బహిరంగ అవమానాలను నిలిపివేయాలి. షేమ్ కెనాట్ సర్వైవ్ ఎంపతీ.)

ఇక్కడ పొందుపర్చిన ఆమె ప్రసంగం లోని కొన్ని మాటలు ఆమె అంతర్వాణిని పూర్తిగా చూపించకపోవచ్చు. ఎవరైనా కింది వీడియో పూర్తి పాఠాన్ని తెలుగు చేయగలిగితే మరీ మంచిది.

ప్రైస్ ఆఫ్ షేమ్ అనే పేరిట టెడ్.కామ్ ప్రసారం చేసిన ఈ వీడియో పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడగలరు.

Monica Lewinsky: The price of shame
https://www.youtube.com/watch?v=H_8y0WLm78U

(అమెరికా అధ్యక్షుడితో తన సంబంధం.. తదనంతర పర్యవసానాల గురించి తొలిసారిగా 1999లో మోనికా లెవిన్ స్కీ ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూ కింద చూడగలరు)

20/20 Monica Lewinsky Interview Full 
https://www.youtube.com/watch?v=AB2_HKREoVo


Monica Lewinsky in TED Talk: 'Public humiliation as a blood sport has to stop'
https://www.youtube.com/watch?v=wBbKNO9fwjU


కొసమెరుపు
1999లో ఆమె ఇచ్చిన తొలి ఇంటర్వ్యూను, ఇప్పుడు ది ప్రైస్ఆఫ్ షేమ్ పేరిట ఆమె చేసిన ప్రసంగాన్ని చూశాక గమనించిన విషయం ఏమిటంటే చెక్కు చెదరని ఆమె చిరునవ్వు. యావత్ సమాజం చేత ఘోరంగా దెబ్బతిన్న తర్వాత కూడా ఆమెను జీవింప జేస్తున్న, ఆమెకు స్థైర్యమిస్తున్న అతి గొప్ప జీవ లక్షణం ఆ చిరునవ్వేనేమో..

తన ఉదంతంపై నిత్యం తప్పు ప్రచారాలతో, ఏక పక్ష వార్తల ప్రసారాలతో పబ్బం గడుపుకుంటున్న వారు ఒక ప్రెసిడెంట్ ఆయన కుటుంబ జీవితం ధ్వసం అవుతోందని గ్రహించడంలేదంటూ మోనికా తన తొలి టీవీ ఇంటర్వ్యూలో విలపించారు. ఇలాంటి రిపోర్టింగ్ నిజంగా విధ్వంసకరం అన్నారామె. ముగింపులో ఆమె చెప్పిన మాట.. "ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్"

మీడియా పుణ్యమా అని పబ్లిక్‌లో నిత్యం అవమానాలకు గురవుతున్న వేలాది మంది ప్రతినిధిగా మన ముందుకొచ్చిన ఆమెను, ఆమె కాజ్‌ను కాసింత సానుభూతితోనే అర్థం చేసుకుందామా?

22 ఏళ్ల ప్రాయంలో తన జీవితం ఎదుర్కొన్న ఘటనలపై మోనికా అంతరంగాన్ని నేటి సాక్షి పత్రిక ఫ్యామిలీ విభాగంలో వచ్చిన కింది కథనం మరింత స్పష్టంగా ఉంది. దాని లింకును కింద చూడగలరు.


Thursday, March 19, 2015

ఈ అవమానాల కంటే ఆ 'వీడియో' అంత ఘోరమైందా?


ప్రపంచంలో మిగతా దేశాల్లో పరిస్థితిని అలా పక్కన బెడదాం. మన దేశంలో మాత్రం మగాడి కొవ్వుకు ఏ ఆడదీ సరిపోవడం లేదు. జుగుప్స కలిగిస్తున్నా సరే.. కొన్ని నిజాల్ని, కొన్ని వ్యాఖ్యలనూ  అందరం వినడం.. కాదు కాదు... పంచుకోవలసిన అవసరం.. ఇన్ని వేల సంవత్సరాల ఘనతర చరిత్ర తర్వాత ఇప్పుడే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కామ నరం కట్టలు తెంచుకునిపోయిన మన దేశపు మగాడి కంటికి పసిపాపలూ సరిపోవడం లేదు. పండు ముదుసళ్లూ సరిపోవడం లేదు. చివరకు ముష్టెత్తుకుని బతుకుతున్న అభాగ్య మహిళలను కూడా వదలడం లేదు.

ఇండియాస్ డాటర్‌ డాక్యుమెంటరీని నిషేధించి ప్రపంచం ముందు పరువు కాపాడుకున్నామని శ్రీమాన్ కేంద్రప్రభుత్వం వారు చంకలు గుద్దుకుంటూ ఉండవచ్చు కానీ పశ్చిమ బెంగాల్లో 72 సంవత్సరాల క్రైస్తవ సన్యాసినిపై జరిగిన అత్యాచారంపై అసహ్యం వ్యక్తపర్చేందుకు భాషలోని ఏ పదాలు సరిపోకపోవచ్చు. ఈ దేశం బాగుపడే లక్షణానికి దూరమవుతోందనడానికి ఇంతకు మించిన నిఖార్సు సాక్ష్యం మరొకటి దొరకదు. అన్ని రకాల విద్వేషాలను పెంచి పోషించే రంగస్థలం ఒకటి యావద్దేశంలో తయారయ్యాక పార్లమెంటులో మన జాతి నిర్దేశకులు ఎన్ని బూటకపు ప్రకటనలు చేసినా ఇలాంటి ఘటనలు జరగకుండా ఆగవని తేలిపోతోంది.

తనపై లైంగిక దాడి జరిపిన వారిని క్షమించాలనీ, తన రక్షణ కంటే ఇప్పుడు తన పాఠశాల, అందులో చదువుతున్న పిల్లల రక్షణ గురించే ఎక్కువ ఆందోళనగా ఉందంటూ ఆ క్రైస్తవ సన్యాసిని చేసిన వ్యాఖ్య జాతి మొత్తానికి మరింత అవమానాన్నీ, ఆవేదననూ కలిగిస్తోంది. ఘటనపై ఎంత విచారం వ్యక్తం చేసినా కేంద్ర పరిధిలో లోని చోట ఢిల్లీ అవతల రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే వాటి అధికారం పుట్టలో వేలు పెట్టలేమనీ, మా పరిధిలో ఏం చెయ్యాలో అదంతా చేస్తామని ప్రకటన చేయడం ద్వారా దులుపుకోవడానికి కేంద్రానికి సులువు కావచ్చు.

పోనీ.. మసీదుల ధ్వంసం, చర్చీల ధ్వంసం, ముదివగ్గు సన్యాసినుల జీవన విధ్వంసం అన్నీ వదిలేయండి. మతమార్పిడీలను, మరొక అంశాన్నీ కారణాలుగా పేర్కొని ఈ విద్వేషాన్ని సమర్థించుకుందాం. కానీ బుధవారం నాటి పత్రికలు కొన్ని తిరగేస్తే ఈ దేశం భవిష్యత్ తరాలకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం నూటికి నూరు రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది.

మచ్చుకు కొన్ని ఘటనలు..

నిన్నటి నమస్తే తెలంగాణ పత్రికలో రెండు వార్తలు..

సికిందరాబాద్ లోని పాత గాంధీ ఆస్పత్రి ప్రదేశంలో ప్రహారీ పక్కన ఉన్న చెట్ల పొదల్లో మంగళవారం తెల్లవారు జామున ఓ మహిళ మృతదేహం వెలుగులోకి వచ్చింది. మృతదేహంపై తీవ్రగాయాలు. లైంగిక దాడి చేసి ఆమెను హతమార్చి ఉండొచ్చని పోలీసుల ప్రకటన. నమస్తే తెలంగాణా పత్రిక టాబ్లాయిడ్‌లో హత్యకు గురైన ఆ 40 ఏళ్ల మహిళ ఫొటోను అత్యంత జుగుప్సాకరమైన భంగిమలో చూపించారు.

(సరదాగా రేప్ చేసుకుంటే అమ్మాయిలు పడి ఉండాలి కానీ తిరగబడితే ఊరకే వదిలిపెడతామా అని నిర్భయ హంతకుల్లో ఒకడైన ముకేష్ సింగ్ అన్ని మాటలు నిజమయ్యాయి అప్పుడే. అత్యాచారం అనంతరం హత్యలకు ఇది శ్రీకారమేనా?)

ఆ పక్క కాలమ్‌లోనే మరో వార్త. కుత్బుల్లాపూర్ సర్కిల్ జగద్గిరి గుట్ట పరిధిలోని మైసమ్మ నగర్‌లో కూలిపని చేసుకుని బతికే కుటుంబానికి చెందిన 9 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల పక్కింటి అబ్బాయి నోట్లో చేతి రుమాలు కుక్కి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

తెలంగాణ రాజధానిలో ఈ ఘోరాలు నమోదైతే.. నవ్యాంధ్ర రాజధానికి నిలయమైన గుంటూరులో ఇంకా గొప్ప ఘటనలు జరిగాయని ఆంధ్రజ్యోతిలో మరి రెండు వార్తలు..

గుంటూరులోని బాపట్ల నియోజకవర్గం గడ్డంవారిపాలెంలో 55 ఏళ్ల ప్రభుదాస్ అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను (1వ తరగతి, 2వ తరగతి) చాక్లెట్ ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి వారిపై .... చేశాడు.

(ఇక దేశంలో చాక్లెట్లపై నిషేధం విధిస్తే చాక్లెట్ల పరువు కూడా కలకాలం భద్రంగా ఉంటుందేమో కదా..)

మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో మానసిక స్థితి సరిగా లేక తల్లితో గొడవపడి ఇంట్లోనుంచి వచ్చేసి అర్థరాత్రి వనపర్తి బస్టాండుకు చేరితే మార్కెట్ యార్డులో ఉన్న విజయకుమార్ అత్యాచారం చేశాడని అదే పేపర్ వార్త.

ఇక సాక్షి పత్రికలో వార్త ప్రకారం, హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలిక అపహరణ యత్నానికి గురై చావు తప్పి బయటపడిందట.

ఎన్ని మంచివార్తలు... జాతి గౌరవాన్ని నిలబెట్టే ఘటనలు...

ఆ 'పనికిరాని' ఆంగ్ల మహిళ ఇంగ్లండ్ నుంచి పరిగెత్తుకు వచ్చి 'భారత పుత్రి' గురించి పనీపాటా లేకుండా వీడియో తీసి ప్రపంచం ముందు ప్రదర్శించకుండా ఉంటే మన పరువు ఇంకెంత పదిలంగా ఇలా పేపర్ల మాటున దాక్కుని ఉండేదో కదా..

అప్పుడెప్పుడో రామారావు సినిమా దానవీరశూరకర్ణలో చెప్పినట్లుగా మన పరువు ఎప్పుడో గంగ మురికిలో కలిసిపోయింది. ప్రతి రోజూ, ప్రతి గంట, రాత్రి పగలు తేడా లేకుండా మనం పోగొట్టుకుంటున్న పరువు..  ఒక వీడియోపై నిషేధం విధించినంత మాత్రాన నిలుస్తుందా?

ఈ గొప్ప పరువు నిలిపే వార్తలు తిరిగేశాక ఇక నిద్రేం పడుతుందనీ...?

నాకయితే ఇండియాస్ డాటర్ వీడియో వివాదం అనంతరం ఎన్డీటీవీలో ఉడ్విన్, నిర్భయ తల్లిదండ్రులతో జరిపిన ఇంటర్వ్యూను మరోసారి చూడాలనిపిస్తోంది.

Nirbhaya's Parents Talk to NDTV About Documentary on 'India's Daughter
https://www.youtube.com/watch?v=R6_SKpm8RpA

ఆ వీడియో అమెరికాలో విడుదలైన సందర్భంగా మూడు రోజుల క్రితం yahoo.com లో చిత్ర నిర్మాత, దర్శకురాలు, కంపోజర్‌‌లతో ఆ యాంకర్ చేసిన అద్భుతమైన ఇంటర్వ్యూను కూడా పనిలో పనిగా మళ్లీ చూడాలనిపిస్తోంది.

'India’s Daughter' The true story behind the banned film
http://news.yahoo.com/india-s-daughter-documentary-about-2012-delhi-gang-rape-and-murder-

భయపడకండి. ఈ రెండు ప్రోగ్రామ్‌లూ పై వార్తల కంటే, మన ఘన వారసత్వం కంటే పెద్ద జగుప్సాకరంగా లేవనే మాటిస్తున్నా...

ఒక అమ్మాయిని ఘోరంగా అత్యాచారం చేసి, చంపితే వేలాది మంది స్త్రీపురుషులు మొత్తం ప్రభుత్వంపైనే తిరగబడిన ఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా జరగలేదనీ, తన 57 ఏళ్ల జీవితంలో అన్యాయం పట్ల ఇంతటి గొప్ప స్పందనను ఎక్కడా చూసి ఎరుగననీ, ఆనాటి నిరసనలూ, ప్రజాగ్రహ ప్రదర్శనలూ భారత చరిత్రలో గర్వించదగిన అత్యుత్తమ క్షణాలని ఆ పనికిరాని మహిళ యాహూ.కామ్ ఇంటర్వ్యూలో ప్రకటిస్తోంది...

అవి అత్యుత్తమ క్షణాలో... పనికిరాని క్షణాలో మనకు మనమే చూసి నిర్ణయించుకుందాం. ఆ తర్వాత ఎవరి అంచనా, ఎవరి జడ్జిమెంటు వారికుంటుంది కదా..!

Tuesday, March 17, 2015

యోగా సంగతి సరే, ప్రాచీన కళల మాటేమిటి?


(ఇది జీవవేద విజ్ఞాన రుషిపీఠంకి చెందిన ఆచార్య గల్లా ప్రకాశ్‌రావు గారు 'సాక్షి'కి పంపిన వ్యాసం. యోగాకు మత దృష్టితో విపరీత ప్రాధాన్యం, ప్రాచుర్యం కల్పిస్తూ యోగాకంటే అతి ప్రాచీనమైన భారతీయ యుద్ధవిద్యలను -మార్షల్ ఆర్ట్స్- పూర్తిగా విస్మరిస్తూ ప్రభుత్వాలు, రాజకీయ నేతలూ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర నిరసన తెలుపుతూ ఆయన రాసిన ఈ కథనాన్ని స్పేస్ సమస్య రీత్యా బాగా కుదించి, మార్చి 11న సాక్షి దినపత్రిక సంపాదకీయం పేజీలో ప్రచురించారు. ఇది వివాదాస్పదం కానందుకు సంతోషిస్తూనే... ఈ వ్యాసం పూర్తి పాఠం కావాలని అనేకమంది మిత్రులు కోరటంతో ఆ పూర్తి పాఠాన్ని ఈ బ్లాగులో ప్రచురించడమైనది. యోగాను, క్రికెట్‌ను ఈ దేశంలో వేలం వెర్రిగా మార్చి మనవైన ప్రాచీన కళలను, ప్రత్యేకించి ప్రపంచమంతటా వ్యాపించిన మన యుద్ధ విద్యలను మన నేతలు, ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తున్నాయి అనే ఆవేదనను రచయిత వ్యక్తపరుస్తున్నారు. ఆయన ఆవేదన ఆలోచనాత్మకంగా ఉందని భావించి మిత్రుల కోరికపై పూర్తి పాఠాన్ని ఇక్కడ అందించడమైనది. ఈ కథనం రచయితతో ఏకీభవించేవారూ, విభేదించేవారు కూడా ఆయనతో నేరుగా మొబైల్ ద్వారా సంభాషించవచ్చు.)

కేంద్ర బడ్జెట్‌లో తొలిసారి యోగా ప్రస్తావన వచ్చింది. యోగాను ప్రచారం చేసే సంస్థల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని యోగా ప్రచార కార్యక్రమాలకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బల్లను చరుస్తూ ఆనందం వ్యక్తం చేయటం లోకమంతా చూసింది. నరేంద్రమోదీ గెలవటానికీ, అధికారంలోకి రావటానికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా యోగా గురువులు, యోగా ప్రచార సంస్థలు పనిచేశాయన్నది నిజం. ఆ కృతజ్ఞతతో ఈ పన్ను మినహాయింపు ప్రతిపాదన చేశారన్నది కూడా నిజమే.

ఐక్యరాజ్య సమితి జూన్ 21ని ‘ప్రపంచ యోగాదినం’గా గుర్తించింది. ఐరాసలో భారతదేశం తరఫున పనిచేస్తున్న అధికారుల కృషివల్లే ఇది సాధ్యమైంది. అంటే అంతర్జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేయగల నెట్ వర్క్ యోగా సంస్థలకు, వాటి అధిపతులకు ఉందని అర్థం అవుతుంది. ‘ప్రపంచానికి మనదేశం అందించిన కానుక యోగా’ అని అరుణ్ జైట్లీ సంబరపడ్డారు. ఇలా యోగాను ఆకాశానికెత్తడంలోని ఆంతర్యమే మిటి? యోగాను నేర్పిస్తామనే పేరుతో పేరు మోసిన కొంతమంది గురువులు, స్వామీజీలు, మాతాజీలు పెద్ద పెద్ద పీఠాలను, మఠాలను తయారు చేశారు. అంతేకాదు యోగాను హిందూమత ప్రచారానికి వాడుకుంటున్నారు. యోగా, ధ్యానం పేరుతో ఆధ్యాత్మిక సంస్థలు నడుపుతూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాగే, ఇదే యోగా గురువులు ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేస్తూ దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. మొత్తంగా యోగా, ధ్యానం, ఆయుర్వేదం వ్యాపార సరుకులైపోయాయి. ఇది అత్యంత బాధాకరం.

ప్రభుత్వాలను శాసించే స్థాయిలో యోగా గురువులు తయారయ్యారు. ఆ మధ్య ఏపీ సీఎం చంద్రబాబు చేత యోగా గురువు జగ్గీ వాసుదేవ్ డ్యాన్స్ చేయించాడు. జగ్గీవాసుదేవ్ వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఆధ్యాత్మికత పేరుతో నిర్మించుకున్నాడు. చంద్రబాబు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ స్థానంలో ఉన్న వ్యక్తి వివేకవంతుడిగా, బహిరంగ కార్యక్రమాల్లో గౌరవంగా, హుందాగా ప్రవర్తించాలి. కానీ ఒక యోగా గురువు చెప్పా డని డ్యాన్స్ చేయటం సిగ్గుచేటు. అంతేకాదు, జగ్గీవాసుదేవ్ సంస్థకు అక్షరాల రెండుకోట్లను విరాళంగా చంద్రబాబు ఇచ్చారు. అది ఆయన వ్యక్తిగతమైన సొమ్ముకాదు. కోట్లాది మంది ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చిన ప్రభుత్వ ఆదాయాన్ని ఒక గురువుకు ధారాదత్తం చేయటం, ఆయన కాళ్లకు నమస్కరించటం ప్రజలను అవమానించటమే.

అసలు ఇంత మంది బాబాలు, స్వామీజీలు, మాతాజీలు, గురువులు బ్రహ్మచారులమని చెప్పుకుంటున్నారు. బ్రహ్మచర్య సన్యాస జీవితం గడిపేవాళ్లకు ఇన్ని వందల, వేల కోట్ల ఆస్తులు, ధనం ఎందుకని ఒక్కరూ ప్రశ్నించరేమీ? అరిషడ్ వర్గాలను జయించిన వారే సన్యాస జీవితానికి అర్హులు. కానీ, అన్ని సుఖాలూ, భోగాలూ అనుభవిస్తూ, ఇంత ధన వ్యామోహంతో జీవించే వారిని బాబాలు, స్వామీజీలు, మాతాజీలు, యోగులు అని పిలవటమేంటి? కనీస నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలూ లేని వ్యక్తుల కాళ్లకు దండం పెట్టడమేంటి?

యోగాను ఒక మత సంస్కృతిగా వ్యాప్తిచేయటం దారుణమైన విషయం. అసలు యోగాను మించిన ఎన్నో అద్భుతమైన విద్యలను మన పూర్వీకులు తయారు చేశారు. అలాంటివాటిలో యోగవిద్య చాలా చిన్నది. యోగాను చాలాకాలంగా చేస్తూ అనారోగ్యం బారినపడిన వారిని ఎంతోమందిని నేను చూశాను. యోగా గురువులే కళ్లు, నోరు సరిచేసుకోలేకపోతున్నారు. యోగా గురువుగా ప్రపంచమంతా తెలిసిన ఒకాయన కిడ్నీలు పాడై, పక్షవాతం వచ్చి ఆ మధ్య చనిపోయాడు. ఇప్పటికీ చాలామంది యోగా గురువులకు అలాంటి అనారోగ్య సమస్యలున్నాయి. మరి, అలాంటి దుస్థితి ఉన్నప్పుడు యోగాను మాత్రమే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? పాలకుల రాజకీయ, మత ప్రయోజనాలు ఈ ప్రచారం వెనుక దాగున్నాయి.

మన దేశ ప్రజల ఆరోగ్యం పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఒక విధానమంటూ లేదు. వైద్యం, ఆరోగ్యం అనగానే లక్షల కోట్ల వ్యాపారం చేసే అల్లోపతిని ప్రమోట్ చేయటం, కార్పొరేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ మందుల తయారీ కంపెనీలకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం మినహా మరో ఆలోచనే లేదు. ఇప్పటికీ డయాబెటీస్‌కు సంబంధించిన ఒక జాతీయ విధానం లేదు. అన్ని రకాల మందులు వాడి ఆరోగ్యం పాడు చేసుకున్న వాళ్లు ప్రత్యామ్నాయం వెతుకుతుంటే యోగాను సమాధానంగా చూపిస్తున్నారు. ఇది హాస్యం కాక మరేమిటి? మన దేశాన్ని ఇప్పుడు యోగా, క్రికెట్‌లు పీడిస్తున్నాయి.

మన దేశానికి పట్టిన పీడ క్రికెట్. క్రికెట్ ఒక అంతర్జాతీయ వాణిజ్యపరమైన క్రీడ. అసలు క్రికెట్ వల్ల చూసేవారికి ఏమైనా ప్రయోజనం ఉందంటే అదీ లేదు. పూర్వం మన పూర్వీకులు గానీ.. సరే.. ఈ బాబాలు ప్రచారం చేసే దేవుళ్లు కూడా క్రికెట్ ఆడిన సందర్భాలు ఏ గ్రంథంలోనూ కనబడవు. కానీ దేవుళ్లందరూ యుద్ధవిద్యలు ప్రాక్టీస్ చేసేవాళ్లు. క్రికెట్ ఆడే దేవుడు కనిపించనట్లే, యోగా చేసే దేవుడు కూడా కనిపించడు. వరల్డ్ కప్ జరుగుతున్నన్ని రోజులు ప్రజలు, ప్రభుత్వ అధికారులూ అన్ని పనులూ మానేస్తున్నారు. క్రికెట్ వల్ల కొన్ని కోట్ల పనిగంటలు వృధా అవుతున్నాయి. ప్రభుత్వానికి వచ్చే రాబడి కన్నా నష్టమే లక్షల కోట్లలో ఉంది. క్రికెట్ ఆడిన ప్రతి ఆటగాడూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భుజాలు, మోకాళ్లు అరిగిపోయి నలభై ఏళ్లకే ముసలివాళ్లయిపోతున్నారు. కానీ చిన్నతనంలోనే పిల్లలను క్రికెట్ లోకి దించుతున్నారు. చిన్నతనంలోనూ, యవ్వనంలోనూ బాగానే ఉంటుంది. కానీ, ముప్పై ఏళ్లు దాటినప్పటి నుంచీ శరీరం కుళ్లిపోతుంది. నలభై ఏళ్లకే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మన ఆటగాళ్లు ఒళ్లంతా గాయాలతో ప్రతి రోజూ పెయిన్ కిల్లర్స్ వాడుతున్న నిజం అందరికీ తెలుసు.


వంద సంవత్సరాల వయస్సులో కూడా మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న మాస్టర్లున్నారు. ఆటలకు, ఆర్ట్‌కు మధ్య ఎంతో తేడా ఉంది. యోగా కూడా క్రికెట్ వంటిదే. చిన్న పిల్లలకు కూడా యోగా పేరుతో జిమ్నాస్టిక్స్ నేర్పుతున్నారు. ముఖ్యంగా వెన్నుపామును ఇష్టమొచ్చిన వంచటం ద్వారా పాతికేళ్లు దాటిన తర్వాత వెన్ను సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. యోగాను చేసే ఎంతోమందికి మోకాళ్ల నొప్పులు, సయాటికా, స్పాండిలోసిస్ మొదలైన సమస్యలున్నాయి. యోగాతో అతి కొద్ది ఉపశమనమే ఉంటుంది. తప్ప శాశ్వత పరిష్కారం ఉండదు. మరి ఇంత నష్టం జరుగుతున్నా క్రికెట్ పిచ్చినీ ప్రభుత్వమే ఎందుకు పెంచుతోంది? గతంలో జూదం, మట్కా, గుర్రప్పందాలు మొదలై వాటికి ప్రజలను బానిసలను చేసేవారు. ఇప్పుడు మత్తు, మతం, కులం, క్రికెట్టు, యోగా, ధ్యానం మొదలైనవాటికి బానిసలను చేసి ప్రజలు ఏమీ ఆలోచించకుండా తయారు చేస్తున్నారు. స్వతంత్ర్యం వచ్చినప్పటినుంచి పాలకులు మన దేశాన్ని అభివృద్ధి కానీయకుండా ఇలాంటి కుట్రలు చేస్తూనే ఉన్నారు.

చైనాను చూడండి. అది ప్రపంచానికే కుంగ్‌ఫును, తాయి-చీనీ నేర్పడం ద్వారా వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో అల్లోపతి వంటి వైద్యవిధానాలకు బదులు కుంగ్‌ఫు, తాయి-చీలనే ఆశ్రయిస్తున్నారు. చైనాకు యుద్ధవిద్యలు నేర్పిన దేశం మనది. మాతంగ కాశ్యప్, కొండయ్య, బౌద్ధధర్మ, బౌద్ధరష్మి, పద్మసంభవుడు వంటి ఎంతోమంది చైనా, టిబెట్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, మియన్మార్, ఇండోనేషియా, కాంబోడియా వంటి దేశాలకు యుద్ధవిద్యలను నేర్పారు. చైనా మనం నేర్పిన జ్ఞానంతో ప్రపంచాన్ని శాసిస్తున్నది. కుంగ్‌ఫులోనే యోగా, ధ్యానం అంతర్భాగంగా ఉంటాయి. కుంగ్‌ఫు, తాయిచీ, కుంగ్, నీ-కుంగ్ అనే పేర్లతో చైనా చేస్తున్నదంతా మన విద్యలే.

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని స్థాపించిన మావో ఈ విద్యలను గుర్తించి వాటిని ప్రజలపరం చేశాడు. నేడు సుమారు 50 కోట్ల మంది చైనా ప్రజలు ప్రతిరోజూ ఈ  విద్యలను ప్రాక్టీసు చేస్తూ వంద ఏళ్లకు పైగా హాయిగా జీవిస్తున్నారు. అంతే కాదు. చైనా ఆర్మీకి, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విద్యలను తప్పకుండా నేర్పుతున్నారు. 24 గంటలు పనిచేసినా అలిసిపోకుండా ఉండాలంటే, ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయాలో షావోలిన్ టెంపుల్ లోని కుంగ్‌ఫు మాస్టర్స్ చేత శిక్షణ ఇప్పిస్తున్నారు.

ఇలాంటి ప్రయత్నమేదీ మన ప్రభుత్వాలు చేయడం లేదు. రైల్వే ఉద్యోగులకు యోగా శిక్షణ ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పట్టాలు మోసే గ్యాంగ్‌మెన్‌లు, లైన్‌మెన్లకు యోగా చేసే వాళ్ల కన్నా ఎక్కువ ఫిట్‌నెస్, ఆరోగ్యం ఉంటుంది. మరి, బాగా తిని బొజ్జలు పెంచిన పైస్థాయి అధికారులకు యోగా నేర్పిస్తారేమో?


మన దేశంలో వేలాది మంది మార్షల్ ఆర్టిస్టులున్నారు. వాళ్లు యోగా గురువులకన్నా ఎక్కువ ఆరోగ్యంగా, శారీరక దృఢత్వంతో, మానసిక ఆరోగ్యంతో ఉన్నారు. మన పూర్వీకులు మనకు బహూకరించిన ఆ విద్యలను నేను గత నలభై ఏళ్లుగా బోధిస్తూ ఉన్నాను. నాలాగా జీవితాన్ని మార్షల్ ఆర్ట్స్‌కు అంకితం చేసిన ఎంతోమంది, పాలకుల విధానాలతో కలత చెందుతున్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్న ఎంతోమంది యోగా పిచ్చిని చూసి భాధపడుతున్నారు. యోగవిద్యను మించిన పురాతన కళలను నాశనం చేయడం వల్ల ఈ దేశానికి నష్టం వాటిల్లుతుంది.

ఈ దేశానికీ, ఇతర దేశాలకూ జ్ఞానాన్ని బోధించిన తెలుగునేల పాలకుల అజ్ఞానం వల్ల తన ప్రాచీన విద్యలను కోల్పోతుందనే దుఃఖం కలుగుతుంది. హిందూమతంతో ముడిపెట్టి యోగను బతికిస్తున్నారు తప్ప దానిలోని శక్తివల్ల కాదు. యోగాను రాజకీయాల కోసం ఉపయోగించుకుంటే, ప్రజలు ఆ యోగా రాజకీయాలను తప్పకుండా తిప్పికొడతారు. మన ప్రాచీన విద్యలను పరిరక్షించుకోవడానికి వివేకవంతులు పూనుకునే సమయం ఆసన్నమైంది.

ఆచార్య గల్లా ప్రకాశ్‌రావు 
జీవవేద విజ్ఞాన రుషిపీఠం, 
విజయవాడ-హైదరాబాద్, 
మొబైల్: 9959282226

ఈ కథనం సంక్షిప్త భాగం మార్చి 11న సాక్షిలో ప్రచురితమైంది.
http://www.sakshi.com/news/opinion/yogas-okay-what-about-the-ancient-art-220488

Wednesday, March 11, 2015

నేనూ.. మా ఇల్లూ.. కాసిని నెమలీకలూ...


(విశ్వ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలన్న ఆశయంతో దశాబ్దం క్రితం ఏర్పడిన అరుదైన పుస్తక ప్రచురణ సంస్థ 'పీకాక్  క్లాసిక్స్' గురించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అపూర్వ పరిచయం చేసిన తెరేష్‌బాబు రచన ఇది. 'పుస్తకాల్లో నెమలీకలు దాచుకోవడం -గతం.. నెమలీకలు పుస్తకాలై పురివిప్పడం -ప్రస్తుతం..' అనే ఏక వాక్య ప్రకటనతో... తెలుగు ప్రచురణారంగంలో సరికొత్త సంచలనాన్ని సృష్టించిన పీకాక్ క్లాసిక్స్ పై ఇంత మంచి పరిచయం చేసిన తెరేష్ బాబు ఈ మధ్యే మననుంచి వెళ్లిపోయారు...
2011 మే 2 సోమవారం నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్య పేజీ 'వివిధ'లో అచ్చయిన ఈ పరిచయ కథనం లింక్ ఇప్పుడు ఆ పత్రిక వెబ్‌సైట్‌లోనూ లింక్ రూపంలో అందుబాటులో లేదు. ఆన్‌లైన్‌లో ప్రముఖ పత్రికలలో వచ్చిన అద్భుత రచనలు, కథనాలను కూడా స్పేస్ సమస్య ఒక కాలబిలంలా మింగేస్తున్న పాడుకాలంలో తెరేష్ బాబు రచనను మళ్లీ ఆన్‌లైన్ పాఠకులకు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో యధాతథంగా ఇక్కడ పోస్ట్ చేయడమైనది. పీకాక్ క్లాసిక్స్ బ్లాగ్ నిర్వాహకులు ఈ కథనం పీడీఎఫ్ కాపీని భద్రపర్చడం వల్ల మనకు ఈ రూపంలో అందుబాటులో ఉంది. అందుకు వారికి ధన్యవాదాలు.)

ఎంతయినా నెమలి గ్లామరు వేరు.

కారుమబ్బులు కమ్మినప్పుడు, గాలి పాడే ప్రేమగీతానికి ఒళ్లు పులకరించి పురివిప్పి నాట్యం చేస్తుందట. ప్రకృతి పరవశిస్తుందట. ఆ అందం అడవికే సొంతమట! వినడమే గాని ఎప్పుడూ చూళ్లేదు. అయితే ఇప్పుడో కొత్తరకం నెమలి వచ్చింది. అది సర్వకాల సర్వావస్థల్లో పురి విప్పుతుంది. నట్టింట్లో నాట్యమాడుతుంది. మనసు పులకించిపోతుంది. ఆ అందం అనుభవైకవేద్యం. అది పురివిప్పినప్పుడల్లా ప్లేటో, బుద్ధుడు, పోతన, గోర్కీ, గొగోల్, ఆస్కార్ వైల్డ్, ప్రేమ్‌చంద్, సామినేని ముద్దు నరసింహంనాయుడు, జాక్ లండన్ ఒకరేమిటి మీకు చాలామంది కనిపిస్తారు.

పుస్తకాల్లో నెమలీకలు దాచుకోవడం -గతం
నెమలీకలు పుస్తకాలై పురివిప్పడం -ప్రస్తుతం

              ***

మా ఆఫీసు (హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం) ఆవరణలో ఓ పొగడ చెట్టుంది. అక్కడ కాస్సేపు నిలబడితే చాలామంది కలుస్తుంటారు. చాలా విషయాలు తెలుస్తుంటాయి. కవులు కళాకారులు, కార్యకర్తలు, అప్పులోళ్లు... ఎవరొచ్చినా అదే మీటింగ్ పాయింట్. ఓ ఏడేళ్ల క్రితం పొద్దుటి పూట సహోద్యోగి వలేటి గోపీచంద్ కలిశారు. ఎప్పట్లా సమకాలీన రాజకీయాల మీద ఛలోక్తులు విసురుతారేమోననుకున్నా. వస్తూనే పీకాక్ క్లాసిక్స్ అనే కొత్త ప్రచురణ సంస్థ గురించి చెప్పారు. వరల్డ్ క్లాసిక్స్‌లో కొన్నింటిని, ఇప్పటి వరకు తెలుగులో రానివి, ముఖ్యంగా నాన్‌ఫిక్షన్, తెలుగులోకి తెస్తున్నట్టు అందులో ఫెడరలిస్టు పత్రాలు, ప్లేటో వంటి అరుదైన పుస్తకాలున్నాయనేది ఆయన మాటల సారాంశం.

'కళ్లు' పులిసిపోయాయి. ఎందుకంటే ఉప్మా పెడుతున్నారని తెలిసి బడికెళ్లిన బాపతు మనం. అమ్మా ఆవుల దగ్గర్నించి ఎమ్మేవరకు తెలుగు మీడియం లోనే వెలగబెట్టాం. పైగా ఇంగ్లీషు పంతుళ్లని ఆట పట్టించి క్లాసులెగ్గొట్టి అత్తెసరు మార్కులతో ముక్కి మూలిగిన నేపథ్యం. ఇంగ్లీషు రమ్మంటే ఎలా వస్తుంది. కాబట్టి ఇంగ్లీషు సాహిత్యాన్ని చదవాలంటే అనువాదాలే శరణం. 'నాకా పుస్తకాలు కావాలి గురూ' అన్నాను. 'మొదట ఇరవై అయిదు పుస్తకాలు త్వరలో వస్తున్నాయి. ఇప్పుడు పదిహేనొందలు కడితే ఇరవై అయిదు పుస్తకాల సెట్టు ఇస్తారు' అన్నారాయన. వెంటనే కట్టేశాను.

ఆ తర్వాత కొన్నేళ్లకు మా ఇంట్లో ప్లేటో హోమిల్టన్, మాడిసన్, జే, జాన్ మిల్టన్, థామస్ పెయినీ, జాన్ స్టువర్ట్ మిల్, కార్ల్‌మార్క్స్, జార్జ్ ఆర్వెల్, స్టీఫెన్ హాకింగ్.. ఓరినాయనో.. వీళ్లంతా తెలుగులో మాట్లాడుతున్నారు. నాకు అర్థం అవుతున్నారు. కొత్తవాకిళ్లు తెరుచుకుంటున్నాయి.

పుస్తకాల బండిల్ చూసి మా ఆవిడ యధాప్రకారం మొహం చిట్లించింది. ఆ ఎక్స్‌ప్రెషన్ చాలు ఆవేళంతా బాధ పడ్డానికి. 'ఇంటి నిండా పుస్తకాలు పేర్చడమే పనిగా పెట్టుకున్నట్లున్నావు. మళ్లీ ఎంత తగలేశావు బంగారు తండ్రీ' అంది. నేనేం మాట్లాళ్లేదు. ఎందుకంటే నిజానికి ఆమె పుస్తక వ్యతిరేకి ఏం కాదు. నేను 'పైడిశ్రీ' అనే కలం పేరుతో- 'పోస్ట్' అనే కేకతో ఉలికిపడి, పరంధామయ్య గేటు వైపు చూశాడు.. లాంటి కథలు పుంఖానుపుంఖాలుగా రాస్తున్నప్పుడు, నాకు అభిమానిగా మారి పొరపాట్న పెళ్లి చేసుకుని నన్ను భరిస్తున్న ఉత్తమ ఇల్లాలు.

మొట్టమొదట ఐదు సుప్రసిద్ధ ప్లేటో రచనలు (ది అపాలజీ ఆఫ్ సోక్రటీస్, క్రిటో, ఫేడో, అయోన్, మెనో- అన్నీ ఒకే పుస్తకంలో అనువాదం: ఎ. గాంధీ) చదివా. 'ఏథెన్స్ వాసులారా..' అంటూ సోక్రటీస్ న్యాయస్థానంలో అన్యాయాన్ని నిలదీసిన వైనం. 'మనం విడిపోయే సమయం ఆసన్నమయింది. మనం ఎవరి దారిన వారు పోబోతున్నాం. నేను చావడానికి. మీరు బతకడానికి. ఏది మేలో ఆ దేవుడికే తెలుసు' అంటున్నప్పుడు రాత్రెందుకు బరువెక్కిందో నా కళ్లెందుకు చెమ్మగిల్లాయో నాకింకా అర్థం కాలేదు.

మర్నాడు నా టేబుల్ మీంచి కొన్ని పుస్తకాలు మిస్సింగ్! ముల్లా నస్రుద్దీన్ కథలు (అను: కె.బి.గోపాలం), జంగిల్ బుక్ (అను: సుబ్బు) ఈసప్ కథలు (అను: శాంతారాం, పియస్సార్), జర్మన్ జానపద కథలు (అను: శాంతారాం, పియస్సార్) జర్మన్ జానపత కథలు (అను: పి.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నెస్ హరనాథ్, ఎ.గాంధీ), పంచతంత్రం రెండు భాగాలు (అను: సహవాసి) మా పాప దగ్గరున్నాయి. అప్పుడే వాటిమీద ఆమె పేరు, తన క్లాస్, సెక్షన్, రోల్ నెంబర్ కూడా రాసేసుకుంది. 'అయితే ఇది కూడా బాగుంటుంది చదువు' అని 'అడవి పిలిచింది' (జాక్ లండన్, సంక్షిప్తానువాదం: ఎ. గాంధీ) ఇచ్చాను.

మామూలుగా అయితే మా అబ్బాయికి ఫేస్‌బుక్కుల్లాంటివి తప్ప ఇలాంటి బుక్కులు పెద్దగా గిట్టవ్. అలాంటిది 'వాటే సర్‌ప్రైజ్ డాడ్.. స్టీఫెన్ హాకింగ్ తెలుగులో ఎవైలబులా?' అంటూ తను తీసుకున్న కాలం కథ (అను: ఎ.గాంధీ) 'కాల బిలాలూ, పిల్ల విశ్వాలు' (అను: యం. విజయకుమార్, ఎ.గాంధీ) చూపించాడు.

'మిగతావి నువ్వు గాని తీశావా' అని మా ఆవిణ్ణి అడిగితే- అమ్మ (గోర్కీ, అను: సహవాసి) పోతన భాగవతం రెండు భాగాలు (వచనం: ముసునూరు శివరామకృష్ణారావు) తన దగ్గరే ఉన్నాయంది. నా అంచనా కరెక్టే. ఆవిడ పుస్తక వ్యతిరేకి కాదు. ఎక్కడంటే అక్కడ పుస్తకాలు పరిచి దుమ్మును పోగేయడానికి వ్యతిరేకి.

అప్పట్నుంచి ఇప్పటిదాక అంటే సుమారు డెబ్బై పుస్తకాలు (కేవలం పీకాక్ క్లాసిక్స్ వాళ్లవే) ఇంటికి చేరాయి. వాటిని సమీక్షించగల శక్తి నాకు లేదు గాని, అవి చూపిన ప్రభావం గురించి కొన్ని ముచ్చట్లు మీతో పంచుకుంటా.

నిద్రపోయే ముందు పిల్లలు కథలు చెప్పమని అడగడం, కథ వింటూ నిద్రపోవడం సర్వసాధారణంగా జరిగేదే! పైగా నేను ఇంట్లో బాగా ఇష్టపడేది నిద్రాపూర్వ కథాసమయం. నేను చెప్పే కథలకు నిద్ర రాదు సరికదా వచ్చే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోయింది అనే అపవాదు ఒకటుంది మా ఇంట్లో. అందుకే కథల విషయంలో వాళ్లమ్మ మీదనే ఎక్కువగా ఆధారపడ్తారు పిల్లలు. మా పాపకు కథలు చదవడం అలవాటయ్యాక తనే మాకు కథలు చెప్పడం మొదలెట్టింది.

ఆమె లేటెస్టుగా మాకు చెప్పిన కథ 'సీగల్' (రిచర్డ్ బాక్. తెలుగు: ముక్తవరం పార్థసారధి), ఎందరు వారిస్తున్నా ఎంతో ఎత్తుకు ఎగరాలని తపించే సముద్ర పక్షి కథను తను స్వంతం చేసుకుని, హావభావాలు జోడించి చెప్పే కథన శైలికి ఆశ్చర్యమేసింది. కథ చెబుతూ చెబుతూ ఆవులించి నెమ్మదిగా నిద్రలోకి జారుకునే టెక్నిక్ కూడా ఆమెకు తెలుసు.

ఇంకో రాత్రి మావాడు ఆస్కార్ వైల్డ్ 'కోకిల- ఎర్ర గులాబీ' కథ చెప్పాడు. చెప్పాక అందరం ఫీలయ్యాం. కోకిల తన గుండెను ముల్లుకు ఆనించి తన రక్తంతో తెల్లగులాబీని ఎర్రగులాబీగా మార్చి ప్రేమికుడికి కానుకగా ఇస్తే, ప్రేమికుడు ప్రేయసికిస్తే, ప్రేయసి ఆ ఎర్ర గులాబీని నిర్లక్ష్యంగా అవతల పడెయ్యడం కథాంశం. వాడు చెప్పింతర్వాత ఆ కథ చదివాన్నేను.

ఒక రోజు హింస అహింసల గురించి ఇంట్లో చర్చ. ఏదో గుర్తొచ్చినట్లు మధ్యలో మా ఆవిడ పక్కకెళ్లి వాల్మీకి రామాయణం మొదటిభాగం (వచనం: ముసునూరు శివరామ కృష్ణారావు) పుస్తకం తెచ్చింది. 111వ పేజీ చూపించింది. 'అహింసను బోధించిన సీత' అనే చాప్టర్ చూపించింది. 'కోరికల వల్ల కలిగే వ్యసనాల గురించి ముఖ్యంగా వైరం లేని క్రూరత్వం ప్రమాదకరమైనదని, తాపసుల రక్షణకోసం రాక్షసులను చంపడం సమంజసం కాదేమో! ఆలోచించండి' అంటూ రాముడికి సీత నచ్చచెప్పే అధ్యాయం అది. 'రాముడికి సీత క్లాస్ పీకిందా, ఆసమ్' అంటూ పిల్లలు ఆశ్చర్యపోయారు. అది యట్లుండనిమ్ము.

వైరం లేని క్రూరత్వం. ఉద్యోగంలో భాగంగా కాల్చి చంపడాలు, ఉరి తీయడాలు..! వైరం లేని క్రూరత్వం హింసకు దారి తీస్తుందన్న హెచ్చరిక ఎంత ప్రాచీనమో అంత అత్యాధునికం!

             ***

2007వ సంవత్సరం ఆకాశవాణి జాతీయకవి సమ్మేళనానికి తెలుగు కవిగా నన్ను ఎంపిక చేశారు. ఉజ్జయిని నగరంలో కవి సమ్మేళనం. లాంగ్ జర్నీ. వారం రోజుల పాటు ఉద్యోగానికి ఆఫిషియల్ డుమ్మా! పండగే పండగ! బట్టలకన్నా ముందు పుస్తకాలు సర్దుకున్నా. అందులో స్వేచ్ఛ ఉంది. (జాన్ మిల్టన్ 'అరియోపగిటికా' అను: సహవాసి, థామస్ పెయినీ, 'మానవ హక్కులు' అను: నాగరాజ్, జె.ఎస్.మిల్ 'స్వేచ్ఛ' అను: ఎ.గాంధీ, కార్ల్‌మార్క్స్ 'సెన్సార్‌షిప్' అను: ఎ.గాంధీ; జార్జ్ ఆర్వెల్ 'సాహిత్యానికి సంకెళ్లు' అను: సనామ)

'స్వేచ్ఛ'. ఎంత మంచి పుస్తకం! కొత్త ఆలోచనలు పైకి రానివ్వకుండా పాత మనుషులు చేసే ధాష్టీకం! దాన్ని ఎదిరిస్తూ అయిదుగురు మేధావులు శతాబ్దాల తరబడి చేసిన తర్కబద్ధమైన మేధోపోరాటం! నా పరిసరాలు, నా సహచరులు ఇవ్వలేని అవగాహనా శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి... సరికొత్త ధిక్కార పతాకాన్ని నా చేతికిచ్చింది. అంబేద్కర్ రచనల తర్వాత అంత స్ఫూర్తినిచ్చిన పుస్తకం. మొత్తం చదివేశాక వదలబుద్ధి కాలేదు. వేరే పుస్తకాల మీదకు మనసు పోలేదు. వారం రోజుల పాటు అదే చదువుకుంటూ ఉండిపోయా!

దాంతర్వాత నాలుగేళ్లకి సర్వేపల్లి రాధాకృష్ణన్ 'భారతీయ తత్వశాస్త్రం' నాలుగు సంపుటాలై నా చేతుల్లో వాలింది (అను: ముసునూరు రామకృష్ణారావు). వేద వాజ్మయం నుంచి ఇటీవలి తత్వశాస్త్ర ధోరణులు, పెడదారుల వరకు సుదీర్ఘ విశ్లేషణాత్మక యాత్ర. బౌద్ధం గురించి ఆయనతో అక్కడక్కడ చిన్న చిన్న పేజీలున్న సాంఖ్యం, శైవ శాక్తేయాది మతాల గురించిన చర్చ కొత్తవాకిళ్లు తెరుస్తాయి.

ఇలాంటి క్లాసిక్స్.. ఒకటా రెండా.. డెబ్బై! అనువాద రీతులు అక్కడక్కడ నన్ను ఇబ్బంది పెట్టాయి. మూలాలు చదివిన వాళ్లమాట చెప్పలేను గానీ, అనువాదాల మీద ఎక్కువ ఆధారపడే నాలాంటి వాళ్లకు అపురూపమైన పుస్తకాలే! అరల్లో ఒదిగే పుస్తకాలు కొన్నైతే, మస్తిష్కపు పొరల్లో మిగిలిపోయే పుస్తకాలు మరికొన్ని! బహుశా ఇలాంటి వాటినేనేమో 'బుక్స్ ఆఫ్ పర్మనెన్స్' అన్నాడు బెర్నార్డ్‌షా.

పీకాక్ క్లాసిక్స్... అదుగో అలాంటివే!

               ****

మొన్నామధ్య క్యాంటీన్లో కలిసినపుడు వలేటి గోపీచంద్ గారిని అడిగా- 'పుస్తకాల మొత్తం సెట్టు తీసుకుంటానంటున్నాడు మా ఫ్రెండొకాయన. పుస్తకాల మీద రే్ట్లు గాక టోకున ఏదో ఒక బేరం చేసి ఇప్పించకూడదూ!'

'అదెంత భాగ్యం. మిగతా వాళ్లలాగ మాకు షాపులు లైబ్రరీ శాఖ వారి ఆదరణ లేవు. అలాంటి పుస్తక ప్రియులే మాకు దిక్కు. మొత్తం సెట్టు తీసుకుంటానంటే మూడొంతుల్లో ఓ వంతు ధర తగ్గించి ఇవ్వడానికైనా మేం రెడీ' అన్నారాయన. గోపీచంద్ అనే పెద్దమనిషి ఫోన్నంబరిదీ: 94412  76770.

చిరునామా: 

పీకాక్ క్లాసిక్స్, G2, బ్లాక్ నం.6, పంచవటి ప్రగతి నగర్, opp. JNTU కుకట్‌పల్లి, హైదరాబాద్-90
ఎడిటర్: ఎ. గాంధీ. 
మొబైల్: 90102 04633 
ల్యాండ్ లైన్: 040-23894648
email: agaandhi@gmail.com

'పీకాక్ క్లాసిక్స్' ఎడిటర్ ఎ. గాంధీతో నాలుగు మాటలు

 * ఇలాంటి క్లాసిక్స్ తెలుగులోకి తీసుకురావాలన్న ఆలోచన మీకు ఎప్పుడొచ్చింది? 

గాంధీ: 1980లో రెండేళ్లపాటు మాస్కోలో ఉన్నాను. మా ఇన్‌స్టిట్యూట్‌లో అరవై దేశాల వాళ్లు ఉండే వాళ్లు. ఒక నార్వేజియన్‌తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల భాషలో మన భారత, రామాయణాలున్నాయని, షేక్‌స్పియర్, బెరోల్ట్ బ్రెక్ట్ లాంటి వారి రచనల అనువాదాలు ఉన్నాయని చెప్పాడు. ఆశ్చర్యమేసింది. వాళ్ల క్లాసిక్స్ మనకు లేవని బాధేసింది. అదే ఈ ప్రయత్నానికి ప్రేరణ.

* వరల్డ్ క్లాసిక్స్ అనువాదాలు యూరప్‌లో మాదిరిగా తెలుగులోకి అంతగా ఎందుకని రాలేదు? 

గాంధీ: యూరప్‌లో సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో ఇది బాగా జరిగింది. ఎక్కడ ఏ కొత్త ఆలోచన వచ్చిందని తెలిసినా అది తమ భాషలోకి తెచ్చుకోవాలని తహతహలాడేవారు. వలస పాలన ఉన్న దేశాలలో ఆ ప్రక్రియ అంతగా జరగలేదు. వరల్డ్ క్లాసిక్స్ తెలుగులో రావాల్సిన అవసరం ఉందని చాలా మంది అంటుంటారు గాని, అలా తేవాలన్న ఆదుర్దా చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది.

* పుస్తక ప్రచురణలో మీరనుసరించిన ప్రణాళికేమిటి? 

గాంధీ: ప్రధానంగా నాన్‌ఫిక్షన్! అందులోనూ సైన్సెస్, ఫిలాసఫీకి ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాం. తర్వాత అనుభవం కొన్ని పాఠాలు నేర్పింది. దాంతో అన్ని రకాల క్లాసిక్స్ రెండు మూడు చొప్పున తీసుకురావాలనుకున్నాం. బాలల సాహిత్యం మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టాం.

* మిగతా ప్రచురణలకు, పీకాక్ క్లాసిక్స్‌కు తేడా ఏమిటి?

గాంధీ: ఇది ఎడిటర్ ఓరియెంటెడ్ సంస్థ. ప్లేటో రచనలు, ఫెడరలిస్టు పత్రాలు, స్టీఫెన్ హాకింగ్ రచనలు, సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ తత్వశాస్త్రం, స్వేచ్ఛ వంటి చాలా పుస్తకాలు మొదటిసారి తెలుగులోకి తీసుకువచ్చిన సంస్థ.

* ప్రభుత్వం నుంచి సహకారం? 

గాంధీ: జీరో! ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే లైబ్రరీ శాఖ వారి వద్ద పుస్తకాల ఎంపిక విషయమై చిత్ర విచిత్రమైన ప్రమాణాలున్నాయి. మా పుస్తకాలు చాలా మటుకు వాళ్ల ప్రమాణాలకు ఒదిగిలేవట. (నవ్వు). అయినా సరే.. పుస్తక ప్రియుల మీద మాకు నమ్మకం ఉంది. వారి తోడ్పాటు స్థాయి మరికొంచెం పెరిగితే మరిన్ని క్లాసిక్స్ తెలుగులో తీసుకురాగలమన్న విశ్వాసమూ ఉంది.

- పైడి తెరేష్ బాబు 9948491523

         *************************

కొసమెరుపు

ఈ నెమలీకలను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఎందుకో నెట్‌లోకి వెళితే ఆశ్చర్యంగా నా చందమామ చరిత్ర బ్లాగులో 2011 మే 11న నేనే దీని ప్రస్తావన చేసిన వైనం బయటపడింది.

అలనాటి చందమామ రాయితీ…


దాని యధాతథ పాఠం ఇక్కడ ఇస్తున్నాను

పాఠాలు మాత్రమే కాకుండా, పాఠ్యేతర పుస్తకాలు ఎందుకు చదవాలో, ఆంధ్రజ్యోతి మే నెల 2, 2011 నాటి వివిధ సాహిత్య వేదిక పేజీలో వచ్చిన “నేనూ.. మా ఇల్లూ.. కాసిని నెమలీకలూ…” పేరిట పి. తెరేష్ బాబుగారు రాసిన ఆ సాహితీ నెమలీకలను విప్పి చూడండి. ఆన్‌లైన్ ఆంధ్రజ్యోతి హోమ్‌పేజీలో వివిధ ఆర్కైవ్స్ విభాగంలో “2-5-11″ పేరిట ఇది ఉంది కూడా.

వైరం లేని క్రూరత్వ ప్రదర్శన -ఉద్యోగంలో భాగంగా కాల్చిచంపడాలు, ఉరి తీయడాలు- హింసకు దారితీసి సమాజానికే ప్రమాదకరమవుతుందంటూ రాముడికే అహింసను బోధించిన సీత ఎంత ప్రాచీనురాలో, ఎంత అర్వాచీనురాలో ఈ కాసిని నెమలీకలను చూస్తే తెలుస్తుంది.

ఈ ఒక్క వాక్యాన్ని ఈ నెమలీకలలో చదివిన తర్వాత పీకాక్ క్లాసిక్స్ వారు ప్రచురించిన వాల్మీకి రామాయణం -వచనం: ముసునూరు శివరామ కృష్ణారావు- తప్పకుండా కొని చదవాలనిపిస్తోంది.

ఈ నెమలీకలను చదవాలంటే  కింది లింకుపై క్లిక్ చేయండి.

బాధాకమైన విషయం ఏమిటంటే పైని ఆంధ్రజ్యోతి వివిధ లింకు ఇప్పుడు ఓపెన్ కావడం లేదు.

చివరగా... పీకాక్ క్లాసిక్స్ ప్రచురించిన అమూల్య గ్రంథాలను ఆధునిక, ప్రాచీన సాహిత్యంపై అభిరుచి ఉన్న తెలుగు పాఠకులు తప్పకుండా తమ పిల్లలకోసం కొనిపెట్టాలని కోరుతున్నాం. మొత్తం సెట్ కావాలన్నా, కొన్ని పుస్తకాలు కావాలన్నా తగు రాయితీతో కనీస లాభాపేక్ష లేకుండా అందించడానికి పీకాక్ క్లాసిక్స్ నిర్వాహకులు సిధ్ధంగా ఉన్నారు. 

కింది చిరునామాలో సంప్రదించండి

పీకాక్ క్లాసిక్స్, G2, బ్లాక్ నం.6, పంచవటి ప్రగతి నగర్, opp. JNTU కుకట్‌పల్లి, హైదరాబాద్-90
ఎడిటర్: ఎ. గాంధీ. 
మొబైల్ 90102 04633, 
ల్యాండ్ ఫోన్ 040-23894648
email: agaandhi@gmail.com

http://peacockclassics.blogspot.in/


ముక్తాయింపు

ఇంత మంచి కథనం గతంలో ప్రచురించిన ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను

అలాగే ఈ కథనానికి పై మెరుగులుగా పీకాక్ క్లాసిక్స్ వారి పుస్తకాల ముఖచిత్రాలను ఉపయోగించడమైనది. తెలుగు జాతికి ఇంత మంచి పుస్తకాలను, ఇంత క్లాసిక్‌గా గోధుమ వర్ణపు నిసర్గ సౌందర్య పత్రంతో అందించిన ఈ సంస్థ నిర్వాహకులకు మాత్రం నిండు కృతజ్ఞతలు. 


Tuesday, March 10, 2015

అమ్మ మనసుకు చల్లదనం...!నా చిన్నప్పుడు ఒక పున్నమి రాత్రి మా అమ్మ మమ్మల్ని ఒడిలో కూర్చొండబెట్టుకుని చంద్రుని కథ చెప్పింది. వెన్నెలకు ఆ చల్లదనం ఎలా వచ్చింది అనేదే ఆ కథ. చంద్రుడి వెన్నెల చల్లదనం గురించి "చందమామ" మాసపత్రిక అప్పట్లో చెప్పిన మరుపురాని మానవీయ కథ ఇది. ఇక్కడ మా ఊర్లో మా చిన్నతనంలో చందమామ పత్రిక మాకు ప్రసాదించిన జ్ఞానం గురించి కొంత నేపథ్యం తెలుసుకుంటే మంచిదనుకుంటా...

కడప జిల్లా రాయచోటి తాలూకా సుండుపల్లి మండలంలో బాహుదా (చెయ్యేరు) నది దాటితే వచ్చే మా ఊరు పేరు చండ్రాజుగారి పల్లె.  దాదాపు ముప్పై అయిదేళ్లకు ముందు మా కుటుంబం (నలుగురు అన్నదమ్ములు, వారి పిల్లలు, అవ్వాతాతలు కలిసి 30మంది) మొత్తం ఇంటికొకటి చొప్పున చందమామ, బాలమిత్ర, బుజ్జాయి వంటి కథల పత్రికలను క్రమం తప్పకుండా తెప్పించుకునేది. వాటిని చదవడంలో పెద్దలు, పెదపెద్దలు, పిల్లలు, పినపిల్లలు అంతా పోటీలు పడేవాళ్లం. వ్యవసాయపనుల్లో అందరూ మునుగుతున్నందున ఎవరికి తీరిక ఉంటే వారు కథ చదివితే తక్కినవారి వంతు తర్వాత వచ్చేది.

అయితే ఆ రోజుల్లో సీరియల్‌గా మహాభారతం, రామాయణం, భాగవతం కథలు, భేతాళ కథలు వంటివి వచ్చేవి కాబట్టి ముందుగా చదవని వారు ఈ నెల ఫలానా కథ ఏమైంది అని అప్పటికే చదివిన వారిని అడగటం, వారు యథాశక్తిగా తమ తీరులో కథను చెప్పటం, తర్వాత పుస్తకం వంతులు మారి చేతికొచ్చినప్పుడు మళ్లీ ఆ కథలను చదివి మననం చేసుకోవటం ఇలా మా చిన్నతనంలో -1970-77- ఏళ్ల తరబడి ఈ కథా పారాయణం, పఠనం సాగుతూ వచ్చింది. పుస్తకాన్ని కొని చదివే స్తోమత, సాహిత్య పరిచయం కలిగిన తెలుగు కుటుంబాలకు 60, 70 ల కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చేమో...

ఈ నేపథ్యం నుంచి బయటకి వస్తే చందమామకు ఆ చల్లదనం ఎక్కడినుంచి వచ్చింది..?  ఏ మహత్తర క్షణంలో మా అమ్మ చందమామ చల్లదనం గురించి చందమామ పత్రికలో వచ్చిన ఆ వెన్నెల రాత్రి కథను చల్లగా చెప్పిందో కాని ఈ రోజుకూ కథ విన్న ఆ రాత్రినీ, ఆ అనుభూతినీ, అది రేపెట్టిన ఆలోచనలను మర్చిపోలేకున్నానంటే నమ్మండి. చందమామలో ఆ నాడు వచ్చిన, అమ్మ చెప్పిన ఆ చల్లదనపు కథను నేను గుర్తుపెట్టుకున్నంతమేరకు చెబుతున్నా వింటారా.... చదవటం కూడా వినటంతో సమానమే కదా..

సూర్యుడు, వరుణుడు, అగ్ని, చంద్రుడు ఈ నలుగురికీ ఒకే తల్లి అట. అల్లారు ముద్దుగా ఎక్కువ తక్కువ తేడాలు లేకుండా ఆ తల్లి తన పిల్లలను పెంచి పెద్ద చేసిందట.. ఒకరోజు దేవతలలో ఎవరో ఒకరికి పెళ్లి జరుగుతోందట...వీళ్ల తండ్రి పనిమీద బయటకు వెళ్లాడట. -దేవతలకు పని ఏముంటుంది అని అడగకండి వాళ్ల స్థాయిలో వాళ్ల పనులు వాళ్లకుంటాయి కదా...కంటెంట్ ప్రొవైడర్లకు, లోకలైజర్లకే కాక కార్పొరేట్ ఆఫీసుల్లో ఎడిటర్లకు, మేనేజర్లకు కూడా వాళ్ల స్థాయి పని వాళ్లకున్నట్లు మరి-

పాపం మరి భర్త లేనప్పుడు ఎంత దేవతా స్త్రీ అయితే మాత్రం ఆ సూర్యవరుణాగ్నిచంద్ర మాత తన ఇల్లు విడిచి బయటకు పోవచ్చా మరి. పోకూడదు కదా... అలాగని పెళ్లికి హాజరు కాకపోతే ఆ పెళ్లాడే దేవత వీళ్ళ ముఖం మళ్లీ చూడాలాయె. అందుకన్జెప్పి తాను పోకున్నప్పటికీ తన పిల్లలను ఆ పెళ్లికి పంపించిందామె.

అలా పిల్లలను పెళ్లికి పంపుతూ తల్లి ఒక మాట చెప్పింది. "నాయనా... పెళ్లి పందిర్లో ఎవరితో గొడవపడకండి, అల్లరి చేయకుండా, తోటి పిల్లలతో కొట్లాడకుండా పదిమందిలో పేరు తెచ్చుకోండి. మన ఇంటి పేరు నిలబెట్టండి.." ఇలాంటి బుద్ధి మాటలు చెబుతూ చివరలో పెళ్లి విశేషాలను తిరిగొచ్చాక వివరంగా చెప్పమంది. పెళ్లికి పోయినందుకు గుర్తుగా ఏదైనా అక్కడినుంచి తీసుకురమ్మని చెప్పింది.

తల్లి మాటలకు "ఓ" అన్నారు పిల్లలు. తల్లి సాగనంపింది. నలుగురు పిల్లల్లో ఏ ఒకరూ తనకు ఎక్కువా కాదు తక్కువా కాదు. పేగు బంధం భేదమెరుగదు కదా..వెళుతున్న పిల్లలకేసి చూస్తూ ఆలోచనలతో ఇంటి మార్గం పట్టింది. మరోవైపు ఈ నలుగురూ పెళ్లికెళ్లారు. మాట ప్రకారం మెత్తగా, ఎవరితో గొడవపడకుండా గడిపారు. ముహూర్తం రాగానే అక్షంతలు చల్లారు. తంతు పూర్తి కాగానే విస్తళ్లు పడ్డాయి. పోటీగా పరుగెత్తి భోజనాలకు కూర్చున్నారు. పంచభక్ష్య పరమాన్నాలు సుష్టుగా భోంచేశారు. ఇకేముంది తోటి పిల్లలకు వస్తామంటూ చెప్పి బయలుదేరారు.

ఇంటికి రాగానే తల్లి దగ్గరకు తీసుకుని ముద్దాడింది. పెళ్ళి విశేషాలు నలుగురు పిల్లలనూ అడిగి మరీ తెలుసుకుంది. తర్వాత తీరిగ్గా అడిగింది. "పెళ్లి గుర్తుగా నాకేమన్నా తెచ్చారామ్మా" అంటూ....పెద్దవాడు సూర్యుడు బిక్కచూపులు చూశాడు. నడిపోడు వరుణుడు తేల ముఖం వేశాడు. చిన్నోడు అగ్ని పాలిపోయాడు. అమ్మ చెప్పిన మాట మర్చిపోయారుగా. ఇక కట్టకడపటివాడు చంద్రుడు..తల్లి పిలిచింది. తలమీద చేయివేసి హత్తుకుంది. "నువ్వు కూడా ఏమీ తేలేదామ్మా" అంటూ చిన్నబోయిన స్వరంతో అడిగింది.

"తేకేం.. తెచ్చానమ్మా పెళ్లి భోజనంలో లడ్డూ కారాలు పెట్టారు.. లడ్డు కొంత తిని కొంత ఇదిగో నా గోట్లో పెట్టుకుని తీసుకొచ్చా.." అంటూ గోట్లోంచి తుంపిన లడ్డుముక్క తీసి తల్లి చేతిలో పెట్టాడు. (గోట్లో ఎంత లడ్డుపడుతుంది అని అడగకండి.. అవి దేవతల గోళ్లు..) "తింటూంటే నువ్వు చెప్పింది గుర్తుకొచ్చింది. జేబులో పెట్టుకుంటే తింటున్న పక్కవారు చూసి నవ్వుతారు కదా అని పట్టినంత ముక్క గోటిలో పెట్టుకుని తీసుకొచ్చా" అంటూ చెప్పాడు మెత్తగా....

తల్లి గుండె నీరయింది. కంట నీరు చిప్పిల్లింది. మాతృహృదయం ఒక్కసారిగా ఒణికింది. ఆబగా పిల్లాడిని కౌగలించుకుంది. జుట్టు చెరిపింది. సంతోషంతో తల్లి కడుపు సగం నిండిపోయింది. 'చాలమ్మా.. నువ్వయినా మాట గుర్తు పెట్టుకున్నావు. చెప్పిన మాట నిలబెట్టావు' అంటూ మనసారా నవ్వింది. అంతలోనే రోషకషాయిత నేత్రాలతో పెద్దపిల్లలకేసి చూసింది. నిజంగా వణికిపోయారు వాళ్లు. వాళ్లకేసి తీవ్రంగా చూస్తూ ఇలా శపించింది.

"మీరు పెళ్లిలో తిన్నదాంట్లో భాగం అడగలేదురా నేను...తల్లిని నన్ను మర్చిపోవద్దన్నానంతే.. ఏదైనా గుర్తుగా తీసుకురమ్మని చెప్పాను. మరి కనీసం తల్లి మాటను గుర్తు పెట్టుకోలేకపోయారు మీరు. అందుకే తల్లి మనసును బాధించిన మీరు ఎంత మంచిపని చేసినప్పటికీ లోకంచే తిట్లు పడుతూ ఉండండి కలకాలం" అంటూ శపించింది.

పెద్ద కొడుకులకు శాపాల వరాలు పూర్తయ్యాక చిన్నపిల్లాడికేసి చూసింది. "పెళ్లి తీపి తెచ్చినందుకు, తినిపించినందుకు కాదురా.... నా మాట గుర్తుపెట్టుకున్నావు. అంతే చాలు నాకు..తల్లి మనసును సంతోషపెట్టావు. జన్మకిది చాలు.. ఈ క్షణం తల్లిగా నేను అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని నువ్వు కలకాలం లోకమంతటికీ పంచెదవు గాక" అంటూ దీవించింది.

ఇంకేముంది ఆ రోజే సూర్యచంద్రాదుల గతులు నిర్దేశించబడ్డాయట. నలుగురూ లోకకళ్యాణంకోసమే పాటు పడుతున్నప్పటికీ ఆ ఆరోజునుంచి తొలి ముగ్గురూ లోకంలో అందరిచేత తిట్లు, శాపనార్థాలు తింటూ ఉండసాగారు. ఎందుకో తెలుసా...

సకల జీవులకు వెలుగునిచ్చే సూర్యుడు మార్తాండావతారమెత్తి ఆయా పనులు చేసుకునే వారికి ఉక్క పుట్టించి చెడతిట్లు తింటాడు గదా... మరి వరుణుడు.....సకల పంటలకూ, ఫలాలకు, ఫలితాలకు కారకుడైనప్పటికీ అడ్డదిడ్డంగా వర్షాలు కురిపించి, తుపానులు పుట్టించి, ఊర్లకు ఊర్లనే లేపుతూ ప్రపంచంలో ఏదో ఓ చోట ప్రతిరోజూ అకాలవర్ష బాధ్యుడిగా, అతివృష్టి కారకుడిగా జనం శాపనార్థాలకు గురవుతుంటాడు గదా..

ఇక పోతే అగ్ని. భూమిని పునీతం చేసే పని. సకల వ్యర్థాలు, చెత్తలను తనలో మరిగించుకుని కొత్త సృష్టికి నాంది పలికే పని. పనికిమాలినదాన్ని ఎంత తగులబెట్టి అరగించుకున్నప్పటికీ, శాపకారణంగా మనుషులకు ఉపయోగపడే వాటిని కూడా లాగించేస్తుంటాడు. ఎంతమంది కొంపలు ఆ రోజునుంచి ఆర్పేశాడని మరి....ఎన్ని ఊళ్లను మటుమాయం చేశాడని...తల్లి శాపం తగిలిన క్షణంలో అడుగుపెట్టిన చోటల్లా భస్మీపటలమే కదా. మరి తిట్లు గాక దీవెనలు దక్కుతాయా...

మరి చంద్రుడూ... సొంత అన్నలు కూడా గమనించనంత జాగ్రత్తగా పెళ్లి లడ్డును తుంపి గోటిలో ఉంచుకుని తెచ్చి తల్లికి ఇచ్చాడు కదా. ఆ అభిమాన బలం ఊరకే పోతుందా మరి..అందుకే తల్లి దీవెన ఫలించి చల్లటి జీవితం దక్కింది. తన ఈ చిన్ని కార్యంతో తల్లిని సంతోషపెట్టిన వాడు, తల్లి మనస్సును చల్లబరచిన వాడు...సమస్త లోకానికే చల్లదనం పంచి ఇచ్చే మహా వరం పొందాడు.

ఆనాటినుంచి ఈనాటిదాకా చంద్రుడు ఎక్కడ అడుగుపెట్టినా చల్లదనం పారాడుతుంది. సమస్త జీవరాశులూ పిండి వెన్నెలను ఆస్వాదించి పరవశిస్తాయి. తల్లి మనసులో చల్లదనం పోసిన చంద్రుడు సూర్యవరుణాగ్నుల అసందర్భ క్రియలనుంచి లోకాన్ని కాపాడి అందరికీ వెన్నెల చల్లదనాన్ని పంచిపెడతాడు...అన్నిటికంటే మించి చంద్రుడి కంటే మించిన సోషలిస్టు, సమానత్వ వాది ఈ ప్రపంచంలోనే దొరకడేమో కదా...

సూర్యుడు బలవంతులనూ ధనవంతులనూ తాకలేడు వేధించలేడు. ప్రాచీన మధ్యయుగాలలో భారీ ఎత్తు మందపు రాతి కట్టడాలు సూర్యుడి బారినుంచి రాజులను చక్రవర్తులను, నిచ్చెన మెట్ల పైభాగంలో ఉన్నవారిని కాపాడితే ఇప్పుడు ఎసి ఉన్న మారాజులు సూర్యుడి వేడిని ఏ మాత్రం లెక్క చేయరు. రాజమందిరాలు, ధనికుల సౌధాలు అప్పుడూ ఇప్పుడూ కూడా వరుణుడి ప్రతాపానికి, మహోగ్నిజ్వాలలకు బెదిరిపోవు, చెదిరిపోవు..

మరి చంద్రుడి విషయానికి వస్తేనో....చంద్రుడు నిజంగా పేదల మనిషి. రాజాంతఃపురాలకంటే, ఆకాశ హర్మ్యాల కంటే, అపార్ట్‌మెంట్ బతుకులకంటే మిన్నగా చంద్రుడు పేదలపట్లే పక్షపాతం చూపిస్తాడు. చంద్ర వెన్నెల సోయగం నిజంగా పేదల గుడిసెలలోనే తారాడుతుంది. సామాన్యుల ఇళ్లలోనే వెన్నెల తెల్లగా వెల్లివెరుస్తుంది. తాపం బారిన పడే జనాలకు నిజమైన స్వాంతన వెన్నెల చల్లదనం నుంచే లభిస్తుంది. ప్రజల మిత్రులు ఎవరంటే తనకే సాధ్యమైన రీతిలో చల్లదనాన్ని పంచి పెట్టే చంద్రుడి లాంటి వారే కదా.........

అమ్మ కథ ఆపేసింది.... ఆ రాత్రివేళ, ఒక అందమైన స్వాప్నిక ప్రపంచం హద్దుల్లోకి తీసుకు పోయి మమ్మల్ని అక్కడ వదిలేసింది. చల్లదనపు మహత్తు గురించిన అనుభూతిలో మమ్మల్ని ముంచెత్తింది. కథా శ్రవణం నుంచి, పిల్లలకే సాధ్యమైన మంత్రజగత్తులోంచి మెల్లగా లోకంలోకి వచ్చి పడ్డాం. చుట్టూ చూస్తే వెన్నెల.. పిండారబోసినట్లుగా, అమ్మ మనసును సంతోషపెట్టినట్లుగా, తరతరాలుగా, యుగయుగాలుగా ఒకే బాట.. చల్లదనాన్ని లోకంముందు పరుస్తూ పోతూ వెన్నెల..పిండి వెన్నెల....

కధ విన్నది ముగ్గురు పిల్లలం. నేను. చెల్లెలు, తమ్ముడు. నోటిమాటలేదు మాకు. మూగబోయాం. ఆ మహిమాన్విత చంద్రకాంతి చల్లదనంలో తడిసి ముద్దయ్యాం. ఆ కథ వినక ముందు మా జీవితాలకు విన్న తర్వాత ఆ క్షణంలో మా జీవితాలకు ఏదో వార..ఏదో అగాథం..ఏదో వ్యక్తావ్యక్తవేదన... స్వప్న, వాస్తవ ప్రపంచాలకు మధ్య ఏదో తేడా. తెలిసీ తెలియని తేడా....ఆ తేడా ఏమిటి అని మేం కొట్టుమిట్లాడుతున్నాం... ఏం చెప్పాలో, ఏమని చెప్పాలో అర్థం కాని స్థితి.

ఎప్పుడు కథ చెప్పినా, అమ్మ అడుగుతుంది మమ్మల్ని.. ఆ కథలోని నీతి ఏమిటి అని.. దాంట్లోంచి ఏం గ్రహించారు అని. ఇప్పుడూ అలాగే అడిగింది.  మాకు తెలియని, ఆనాటి మా ఊహకు అందని మాటల్లో మెల్లగా గొణిగాం...అమ్మ మనసును కష్టపెట్టకూడదు ఇదే కదా ఆ కథలో ఉన్న నీతి..ముగ్గురు పిల్లలమూ దీనికే ఓటేశాం. అమ్మ చాలాసార్లు మేం గ్రహించిన కథాసారాన్ని ఖండించో లేక ఇంకాస్త సవరించో దాంట్లోని అసలు విషయాన్ని చివర్లో వివరించేది...

కానీ ఆరోజు అమ్మ ఆశ్చర్యకరంగా మా ఓటు వైపే మొగ్గు చూపింది. అదే ఆకథలోని అసలు నీతి అని తేల్చి చెప్పేసింది. ఇన్నాళ్లకు అమ్మ మనస్సును అర్థం చేసుకున్నాం, గెలిచాం అని అనుకుంటున్నాం.. ఇంతలో ఉన్నట్లుండి ఒక ప్రశ్న విసిరింది. "తల్లి మనసుకు కష్టం తగలనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా..."

మా పసిహృదయాలకు ఆరోజు అర్థం కాని ప్రశ్న అది. మూగబోయాం.. మాకే తెలియని ఓ కొత్త నిశ్శబ్దం....తన పాతికేళ్ల నవ యవ్వన మాతృ జీవితంలో పొందిన ఏ బాధాకర అనుభవాలు ఆమెను ఆ క్షణంలో ముంచెత్తాయో... ఆ సమయంలో ఆ కథలోని అమ్మ స్థానాన్ని తానే ఆవహించిందేమో... తండ్రితో, భర్తతో, మొత్తం సమాజంతో తన హృదయానికి తూట్లు పడిన గాయాల చరిత్రనే ఆరోజు ఆమె అలా ప్రశ్న రూపంలో వెలువరించిందేమో..

ఇదీ మేము పుట్టిపెరుగుతున్న రోజుల్లో చందమామ పత్రిక మాకు అందించిన గొప్ప కథ. మానవీయ కథ. ఆరోజు మేం ఏం చెప్పాలో తెలీని క్షణాల్లో అమ్మను గట్టిగా హత్తుకుని ఆమె మానుంచి ఏ క్షణాల్లో అయినా జారిపోతుందేమో, దూరమైపోతుందేమో అనే భయాందోళనల మధ్య గడిపాం...

కాని ఈ రోజు.. దాదాపు 30 సంవత్సరాలు దాటాక...ఆ తల్లే మాకు దూరమయ్యాక, సమాజం పట్ల కొంచెంగా పెరిగిన జ్ఞానంతో ఆ ప్రశ్నను కాస్త మార్చి ఇలా చెప్పుకుంటే.. "స్త్రీల మనసుకు కష్టం తగులనివ్వని వారు ఈ లోకంలో ఉన్నారా ఎవరైనా?"

కాస్తంత విశాలంగా ఆలోచిస్తే..... మనిషికి మనిషికి మధ్య భయంకరమైన అగాధాలు, అంతరాలు, వ్యక్తిత్వ హత్యలు, అహంకారాలు, జీవన విధ్వంసాలు పెచ్చరిల్లుతున్న పాడుకాలంలో... మనిషికి ఎందుకు కష్టం తగులుతోంది. మనిషి మనసు ఎందుకు బాధపడుతోంది..అనే ప్రశ్నలోనే పై ప్రశ్నకు కూడా సమాధానం ఉందేమో మరి.

మహిళలకే కాదు, సమాజంలో ఏ ఒక్కరికీ ప్రశాంతత లేదు. తినడం, సంపాదించడం, చావడమే జీవితచక్రంగా మారి మిగిలిన అన్నివిలువలూ లుప్తమవుతున్న కాలంలో "స్త్రీల మనస్సుకు కష్టం" అనే సమస్య "సమస్త మానవుల కష్టం" అనే మౌలిక సమస్యలోనే దాగి ఉందేమో...

మనిషి జీవితంలో సుఖమే లేదా మరి. అనుబంధాలలో, బాంధవ్యాలలో చల్లదనమే లేదా...చల్లదనాన్ని పంచిపెట్టే గుణమే సమాజంలో హరించుకుపోయిందా.. ఆ తల్లి మొత్తం సమాజానికే ఇంత గాఢమైన ప్రశ్న సంధించి ఉండవచ్చు కాని ఆమె జీవితంలో ఎప్పుడూ ఏ సుఖమూ అనుభవించలేదా... మరీ ఇంత ప్రతికూల ధోరణితో మానవ జీవితంపైనే వ్యాఖ్యానాలు చేయవచ్చా అనే ప్రశ్నలు ఎవరికయినా రావచ్చు...

అయితే మనం మన అవ్వలను, తాతలను, కాటికి సిద్ధంగా ఉన్న కడు వృద్ధులను ఒకసారి అడిగి చూస్తే తెలుస్తుంది. నా అనుభవంలో, లోకంలో పుట్టి మహత్కార్యాలు సాధించకున్నా.. నిండు జీవితాలను తమ స్థాయిలో తమదైన రీతిలో గడిపి, చివరికి మిగిలేదేమిటి అని చివరి పరామర్శకు దిగినవారిని ప్రశ్నించినప్పుడు వారు దాదాపు ఒకేలా సమాధానం ఇచ్చారు.

ఎవరి వద్దకో ఎందుకు... తన కూతురు -మా అమ్మ- వెళ్లిపోయినా ఇంకా బ్రతికే ఉన్నానంటూ వ్యధ చెందుతున్నప్పటికీ, జీవితసారమిదే, మనం దీనిని భరించాల్సిందే అని చెప్పే మా అవ్వే తన జీవితానుభవాల్లో మానవసారాన్ని ఎత్తి చూపుతుంది. "జీవితంలో సుఖం కన్నా కష్టం పాలే ఎక్కువ. సుఖపడుతున్నాం, సంతోషంగా ఉంటున్నాం అనుకునే క్షణంలోనే ఏదో ఒక కష్టం మనలను వెన్నాడుతుంది, ముప్పుతిప్పలు పెడుతుంది. దాన్ని భరించడమే తప్ప మనం ఏం చేయలేం.." అనే సాంప్రదాయ జీవన తాత్వికతకు మా అవ్వ ప్రతిరూపంగా కనిపిస్తుంది.

మొత్తం మీద మనిషి జీవితంలో చల్లదనం లేదు. మానవ సమాజంలో చల్లదనం లేదు. ఇదే వాస్తవమైతే మనలో, మనందరిలో ఆ చల్లదనాన్ని రకరకాలుగా హరించివేసే ఉష్ణతాపం రగులుతూ ఉన్నట్లే...ఇక్కడ స్త్రీల మనస్సే కాదు, పురుషుల మనస్సే కాదు, వృద్ధుల మనస్సే కాదు లోకంలో బతికే ఎవరి మనస్సు కూడా చల్లదనంతో లేదన్నదే వాస్తవం. మనిషి జీవితం వేడెక్కుతుందో లేదో చూడాలంటే... నలభై ఏళ్లక్రితమే తెలుగులో వచ్చిన అపరూప చిత్రం "తాతామనవడు" చూడండి చాలు.

ఆ చిత్రంలో, కాటికి కాళ్లు చాపుకున్న కన్నతండ్రి ఇక ఒక్క క్షణం ఉన్నా కుటుంబానికి భారమే అనే ఉద్దేశ్యంతో సాక్షాత్తూ పుత్రరత్నమే తన ముదుసలి తండ్రికి గొయ్యి తవ్వుతూంటే.. ఆ పుత్రరత్నపు సుపుత్రరత్నం (తాతకు మనవడు) తన తండ్రికి సైతం గొయ్యి తవ్వాలని బయలుదేరుతాడు.. ఈ ఘోరం ఏమిట్రా తండ్రీ అని వాడి కన్నతండ్రి.... అదే.. తన తండ్రికి గొయ్యి తవ్వాలని చూసిన కొడుకే తన కుర్రాడిని అడిగితే... ఇదే చెబుతాడు. నీవు నేర్పిన న్యాయమే కదా తండ్రీ, నువ్వు నీ తండ్రికి గొయ్యి తవ్వుతున్నప్పుడు కొన్నాళ్లకయినా నా తండ్రికి నేనే గొయ్యి తవ్వాలి కదా..అందుకని ఇప్పుడే మొదలెట్టేస్తున్నా అంటాడు.

ఇదీ మన జీవితాల్లోని విషాదం, విధ్వంసం, జీవితాల్లో వ్యాపించిన ఈ వేయికోణాల వేడి చల్లబడకుండా, చల్లార్చకుండా మనిషి జీవితం చల్లారుతుందా.. మహిళలకే కాదు ఎవరికైనా చల్లదనం లభిస్తుందా...చల్లదనాన్ని అందరికీ పంచిపెట్టే ఆ మహిమాన్విత కాలం ఎప్పుడొస్తుందని కాదు.. అందరికీ రావాలని ఆశించడంలో తప్పులేదు కదా.. వెన్నెల చల్లదనాన్ని పంచిపెట్టే ఆ చంద్రుడే మనకు సాక్షి, నిదర్శనం కావాలని భావించడం తప్పు కాదు కదా......

చందమామా వర్థిల్లు...

వెన్నెల చల్లదనమా వర్ధిల్లు.......

(1973లో మా అమ్మ మా ముగ్గురు పిల్లలకు చెప్పింది మొదలుకుని ఈ కథ నన్ను జీవితం పొడవునా వెంటాడుతూ వస్తోంది. 'చందమామ చదవండి జ్ఞానం వస్తుంది' అని ఏ మహత్తర క్షణంలో మా నాన్న చందమామను చిన్నప్పుడు మాకిచ్చి చదివించాడో కానీ.. అప్పటినుంచి మా లోకమంతా చందమామకే పట్టం. జ్ఞానం వచ్చిందో లేదో తెలీదు కానీ.. మా బాల్యం మొత్తంగా వెన్నెల చల్లదనంతోనే తడిసిపోయింది. మా బాల్యాన్ని వెన్నెలతో స్పర్శించిన, పండించిన ఆ చందమామ నా నడివయసులో.. నాకు చందమామ పత్రికలోనే కొన్నేళ్లక్రితం ఆన్‌లైన్ ఉద్యోగాన్ని పిలిచి మరీ ఇచ్చింది. పల్లెటూరులో పుట్టిపెరిగిన ఓ చిన్ని జీవితానికి ఇంకేం కావాలి.)

2009లో ఇది నా మరొక బ్లాగులో పోస్ట్ అయింది. ప్రస్తుతం దేశం మొత్తంగా నిర్భయల ఘటనలతో గజగజలాడుతున్న నేపథ్యంలో మహిళకు, మనిషికి చల్లదనం ప్రసాదించే మంచి  జీవితం గురించి మరోసారి గుర్తు చేద్దామని మళ్లీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

రాజశేఖరరాజు
krajasekhara@gmail.com