Pages

Wednesday, July 29, 2015

కొన్ని మరణాలు సామూహికమే...!


కొన్ని మరణాలు సామూహికమే...!

సామూహిక మరణం అంటే
అందరూ కలసి చావడం కాదు

ఒక్క మరణాన్ని 
సమాజమంతా అనుభవించడం...!

ఒక్క బ్రతుకును
దేశమంతా కోల్పోవడం...!

అవును మరి!

జీవితాన్ని జాతికి అంకితమిచ్చిన వాడి మరణం
సామూహికం కాకుండా ఎలా పోతుంది?

తన సృజనతో దేశానికి ఊపిరిచ్చిన వాడి మరణం 
వైయక్తికం ఎలా అవుతుంది?

జననంలోనే కాదు.. మరణంలోనూ
మనకు మిగిలిందీ.. మనకు మిగిల్చిందీ
ఆ స్ఫూర్తినే కాదా... 
ఆ దివ్యాగ్ని జ్వాలనే కదా!

అద్దంకి తుషార, హైదరాబాద్
27-07-2015

డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం కన్నుమూశారని తెలియగానే ఒక యువహృదయం గుండె లోతుల్లోంచి సహజాతిసహజంగా పెల్లుబికి వచ్చిన అక్షర నీరాజనం ఇది. కోట్లమంది భారతీయులు.. ప్రత్యేకించి యువతీ యువకుల హృదయాలను కదిలిస్తున్న కలాం స్మృతులకు ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని (బిటెక్ థర్డ్ ఇయర్) పట్టిన ఆత్మీయ నివాళి ఇది.

"సామూహిక మరణం అంటే అందరూ కలసి చావడం కాదు.. ఒక్క మరణాన్ని సమాజమంతా అనుభవించడం...! ఒక్క బ్రతుకును దేశమంతా కోల్పోవడం...!" అంటూ మహాకావ్య సదృశ ప్రారంభంతో తుషార అప్పటికప్పుడు రాసిన కవితా పాదాలు ఆయన మరణం సామూహికం కాకుండా ఎలా పోతుంది అంటూ ఒక మహాద్భుత సమర్థనతో ఇలా ముగిశాయి

"అవును మరి! జీవితాన్ని జాతికి అంకితమిచ్చిన వాడి మరణం సామూహికం కాకుండా ఎలా పోతుంది? తన సృజనతో దేశానికి ఊపిరిచ్చిన వాడి మరణం వైయక్తికం ఎలా అవుతుంది?"

"ఒక దివ్యాగ్నిని అంతఃకరణలో ఉంచుకునే మనందరం జన్మించాం. ఆ అగ్నికి  రెక్కలు తొడిగి దాని మంచితనం మెరుగును ఈ ప్రపంచమంతా నింపివేసే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి" అంటూ భారత క్షిపణి శాస్త్ర పితామహుడు కలాం రాసిన అగ్నిజ్వాలల వంటి అక్షర తూణీరాలు ఒక తరం యువతీయువకులపై శాశ్వత ప్రభావం వేశాయి. వాటి ప్రభావం ఎంత గొప్పదంటే.. స్వాతంత్ర్యానంత దేశ చరిత్రలో తొలిసారిగా.. తమ జీవితాలు ఎంతో విలువైనవని, తాము సాధించాల్సిన కలలు తమ కళ్లముందు నిలబడి తమను వెంటాడుతున్నాయంటూ యువత ఉద్వేగంతో ఊగిపోయింది.

200 సంవత్సరాలకు పైగా పరాయిపాలనలో మగ్గిపోయిన భారత జాతి సగర్వంగా తలెత్తుకుని బతుకుతున్న తరంలో మనముంటున్నాం. ఆర్థిక పరాధీనత ఇప్పటికీ వెంటాడుతున్నా.. కోట్లమందికి ఇప్పటికీ జీవితం ప్రశ్నార్థకంలా మిగులుతున్నా.. అందుబాటులో కి వచ్చిన కాసిన్ని అవకాశాలనే రెండుచేతులతో ఒడిసి పట్టుకున్న భారత యువత ప్రపంచ యవనికలో తన పరిశ్రమతో, మేధస్సుతో అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది.

నాయకత్వం అంటేనే నమ్మకాలు పూర్తిగా కోల్పోతున్న కాలంలో వందకోట్ల పైబడిన ప్రజానీకానీకంలో పెను ఆశల్ని, ఆకాంక్షల్ని రగిలించిన ఒకేఒక్కడు కలాం. ఈ దేశ యువతరం తన స్ఫూర్తిని ఎక్కడి నుంచి గ్రహిస్తోందో.. ఏ మహనీయ మూర్తిమత్వం ప్రేరణతో తన పయనాన్ని కొనసాగిస్తోందో .. ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణకు మారుపేరు కలాం. సమస్త రాజకీయ మరుగుజ్జులను దాటుకుని, ఈ దేశం, ఈ జాతి నమ్మకం ఉంచిన, గౌరవం పెంచుకున్న ఒకే ఒక్క మౌని కలాం. రాజకీయం అనే కళకు దూరంగా జీవిత పర్యంతం బతికిన ఆ మహనీయుడికి ఒక తెలుగు యువతి పట్టిన అక్షరాంజలి ఇది.

మా ఇన్‌చార్జి ద్వారా తర్వాత తెలుసుకున్నదేమంటే ఆమె నిజంగానే పుస్తకాల పురుగు. ఎంతగానంటే 20 ఏళ్ల ప్రాయంలోనే అంతగా అర్థం కాకపోయినా కారల్‌మార్క్స్ 'కేపిటల్‌' గ్రంథాన్ని ఏకధాటిగా చదువుకుంటూ పోయిన తీవ్ర పఠనాసక్తి ఆమెది. కారల్ మార్క్స్‌నే చదవడానికి ప్రయత్నించిన ఆమె ఇక ఏ పుస్తకంపై అయినా ఆసక్తి పెట్టగలదంటే సందేహమెందుకు?

తుషారా... చదువు తల్లీ... కలాం నుంచి కారల్ మార్క్స్ దాకా నువ్వు ఎంచుకున్న ఈ ప్రపంచ పరిశీలనా చట్రాన్ని ఇలాగే కొనసాగించు.. జీవితం పట్ల స్ఫూర్తి పొందడానికి, విశ్వ మూర్తిమత్వాన్ని ఆకళింపు చేసుకోవడానికి నీవెన్నుకున్న మార్గం నుంచి ఎన్నటికీ వైదొలగకు. చదవటం కంటే చూడటంమీదే ఆసక్తి పెంచుకుంటున్న కొత్త తరాలకు నీ అభిరుచి కూడా ప్రేరణ కావాలి.

గమనిక: 
నిన్న అంటే సోమవారం (27-07-2015) సాయంత్రం కలాం కన్నుమూత వార్త విన్న వెంటనే సాక్షి పత్రికకు తుషార పంపిన ఈ భావోద్వేగ స్పందనను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాం. ఎడిటోరియల్ పేజీ (4)లో సింగిల్ కాలమ్ లెటర్ స్థానంలో ఈ కవితను కూర్చి ఇంకా చోటు ఉండటంతో తప్పనిసరై ఆమె కవితకు ముగింపుగా చివరి కవితా పాదాన్ని మావైపునుంచి చేర్చాం. ఈ అదనపు చేర్పుతో పనిలేకుండానే ఆమె పంపిన లఘుకవిత సారాంశం అమూల్యం.. అమోఘం.

దాన్ని మీకోసం ఈ బ్లాగులో మరోసారి పోస్ట్ చేస్తున్నాం.

మంగళవారం (28-07-2015) సాక్షి సంపాదక పేజీలో (4) లో దిగువ భాగంలో ఈ కవితను చూడవచ్చు
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/28072015/4

Sunday, July 26, 2015

బాహుబలి కత్తితో తెలుగు దర్శకుల తలలు నరికిన రాజమౌళి


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరు తలలను బాహుబలి కత్తితో నరికాడు రాజమౌళి అంటూ రాం గోపాల్ వర్మ మరోసారి పూనకం పట్టి అరిచేశాడు. వాస్తవానికి బాహుబలి సినిమాను ప్రీమియర్ షో చూసిన తర్వాతే బాంబే చిత్రపరిశ్రమ మూగపోయింది. ఆ సినిమా చూసిన తర్వాతే తమిళ చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. లక్ష లోపాలున్నాయని విమర్శకులు మొత్తుకుంటున్నా సరే బాహుబలి ప్రభావం హాలీవుడ్ వరకు విస్తరించిపోయింది. భాషా భేదాలు లేకుండా సినిమాను చూస్తున్న జనం బాహుబలికి అది విడుదలైన 15 రోజుల తర్వాత కూడా దాసోహమవుతున్నారు. ఆ దాసోహం విలువ డబ్బు రూపంలో నేటికి 402 కోట్లు.

కానీ ఆశ్చర్యం ఏమంటే రాంగోపాల్ వర్మ ఇంతవరకు ఆ సినిమాను చూడలేదు. కానీ ప్రపంచం మొత్తాన్ని ఎదురుగా పెట్టుకుని రాజమౌళిని తొలి రోజునుంచి ఆకాశానికి ఎత్తిన రామూ.. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్లు, దర్శకులందరి తలల్నీ రాజమౌళి నరకడమే కాకుండా మీ స్టామినా ఏదో ఇప్పుడు నాకు చూపండి అంటూ సవాలు విసిరాడని మరోసారి ఢంకా భజాయించాడు.

సాక్షి మేనేజింగ్ ఎడిటర్ స్వప్న నేతృత్వంలో రూపొందుతున్న రాముఇజం ప్రసార కార్యక్రమంలో ఒక గంటపాటు మళ్లీ బాహుబలి ప్రభావం గురించి ప్రచారం చేసాడు (జూలై 19న.). ఒక సినిమాను ఇంతవరకూ చూడకుండానే ఇంత స్థాయిలో బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తిన రామూకు.. బాహుబలి టిక్కెట్లు ఇస్తున్నాం పోయి చూసి రండి అంటూ ఇంటర్వ్యూ చివరలో సాగనంపారు స్వప్న.

రామూ ఎందుకు తెలుగు సినీ దర్శకులను ఇంతగా తీసిపారేస్తున్నాడో, దమ్ముంటే బాహుబలిని మించిన సినిమాను తీయండి చూద్దాం అంటూ ఎందుకిలా పదే పదే సవాలు చేస్తున్నాడో తెలుసుకోవాలంటే జూలై 19న స్వప్నకు తను ఇచ్చిన ఇంటర్వ్యూను కింది లింకులో చూడండి.

ఇది మీ ఓపికకు సంబంధించిన సమస్య. నాకయితే తన మాటల్లో పూర్తి నిజాయితీ ఉందనిపించింది. మీరు ఏకీభవించవచ్చు లేదా ఏకీభవించకపోవచ్చు కానీ ఆసక్తి ఉంటే రామూ బాధను ఒకసారి వినండి. కాదు.. చూడండి.

RGV Talks about Baahubali Movie Episode 33
https://www.youtube.com/watch?v=XdPQK4EqP3I