Sunday, June 10, 2018

సినిమా కళ ఉద్దీప్తమైన క్షణం : మహానటి


మూడు వారాల తర్వాత మహానటి సినిమాను చూశాను. హైదరాబాద్ లోని ఈసీఐఎల్‌.. ఏఎస్‌రావు నగర్‌లోని రాధికా థియేటర్లో మా చెల్లి మాధవి, బావ, తమ్ముడు రాంబాబుతో కలిసి మహానటిని ఎట్టకేలకు -27-05-2018-న చూడగలిగాను. సినిమా చూశాక రోజుల తరబడి ఆ జ్ఞాపకాలే వెంటాడాయి. మహానటికి తెలుగు ప్రేక్షకులు అర్పిస్తున్న నీరాజనం అనిర్వచనీయం. స్వయంగా సినిమాను థియేటర్లో చూస్తే తప్ప ఆ అనుభూతి మనకు అందదు. మూడో ఆదివారం సెకండ్ షో సైతం హౌస్ ఫుల్ కావడం చిత్రవిజయానికి గుర్తు. వృద్ధులతో సహా కుటుంబాలకు కుటుంబాలు సినిమాకు రావడం పాతతరంపై కొత్త తరం చూపించిన గౌరవం కావచ్చు. దాదాపు మూడు గంటలపాటు సాగిన సినిమా ముగిశాక థియేటర్ మొత్తం సావిత్రి పునర్ జ్ఞాపకాలతో మూగపోయింది.సినిమాలో వాస్తవానికి భిన్నంగా అనేక అంశాలు ఉన్నాయంటూ రంధ్రాన్వేషకులతోపాటు సినిమా కళ పట్ల గౌరవంతో విమర్శించినవారి వ్యాఖ్యలను, సమీక్షలను అలా పక్కన బెడితే.. తెరమీద తెరవెనుక సావిత్రి విశ్వరూపాన్ని జనరంజకంగా చూపించడంలో కొట్టొచ్చినట్లు కనిపించేది ఒక్కటే. దర్శకుడి నిజాయితీతో కూడిన ప్రయత్నం.

మానవజాతి సృజించిన అత్యున్నత ఆధునిక కళారూపం సినిమా అయితే, ఆ సినిమా కళను ఉద్దీపింపజేసిన అతి గొప్ప సినిమాలలో మహానటి ముందువరుసలో నిలుస్తుంది. పల్లెటూర్లో పుట్టి ఊహ తెలిసినప్పటినుంచి గత నలభై ఆయిదేళ్ల నా జ్ఞాపకాల్లో బళ్లు కట్టుకుని మైళ్లదూరం ప్రయాణించి టెంట్లలో సినిమాలను చూసి ఆనందించిన ఆ అద్భుతమైన రోజులు మళ్లీ గుర్తొస్తున్నాయి. మల్లీశ్వరి, దేవదాసు, మాయాబజారు, అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం, ఆకలిరాజ్యం, మరోచరిత్ర, సాగరసంగమం, అన్నమయ్య, బాహుబలి, ఇప్పుడు మహానటి.. మానవ భావోద్వేగాలను శిఖరస్థాయికి తీసుకెళ్లిన గొప్ప సినిమాలను చూసిన అద్భుతానుభవంలో నేనూ ఒక భాగం. తల్చుకుంటేనే మనసు పులకరించి, మా బాల్యాన్ని తరింపజేసిన గొప్ప సినిమాలు కళ్లముందు మళ్లీ కదలాడుతున్నాయి.

నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులవి. 1978-79 అనుకుంటాను. మాయాబజార్ సినిమా విడుదలై పాతికేళ్లయిన సందర్భంగా సితార సినీ పత్రికలో ఆ సినిమా గురించి ఒక కథనం ప్రచురించారు. అప్పటికి పాతికేళ్లకు ముందు పుట్టినవారు మాయాబజార్‌ సినిమాను చూడకపోయి ఉంటే వారు తెలుగువారు కానేవారు అని ఆ కథనంలో రాశారు.ఆనాటికి నాకు 17 ఏళ్ల వయస్సు. ఆనాటికి ఊరి టెంటులో కాని, తర్వాత రాయచోటి హాళ్లలో కానీ మాయాబజార్ సినిమా చూసే అవకాశం కలగలేదు. ఆ తర్వాత యూనివర్సిటీలో పీజీ కోసం తిరుపతికి వచ్చినప్పుడు 1983-84 ప్రాంతంలో జ్యోతి థియేటర్లో మాయాబజార్ చూశాను. తిరుపతిలో పాతసినిమాలు చూడాలంటే జ్యోతి మహల్, ఇంగ్లీషు సినిమాలు చూడాలంటే ఐఎస్ మహల్ థియేటర్లు ప్రసిద్ధి. ఎట్టకేలకు మాయాబజార్‌ను 22 ఏళ్ల వయసులోనే చూసి నేనూ తెలుగువాడినే అని రొమ్ము విరుచుకు సంతోషించిన రోజులవి.

ఇప్పుడు మరో 35 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్ల తర్వాత సితార సినీ పత్రికలో ఆనాడు వచ్చిన కథనంలోని ఆ సాహస ప్రకటనను మళ్లీ చేయాలనిపిస్తోంది.మహానటి సినిమాను థియేటర్లో చూడకపోతే మనం తెలుగువాళ్లం కాము. కాలేము. తెలుగు గడ్డపై అతి సాధారణ కుటుంబంలో పుట్టి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, పదితరాలపాటు జనం మరవని, మరవలేని చరిత్రను సొంతం చేసుకున్న సావిత్రి మూర్తిమత్వాన్ని శిఖరస్థాయిలో మనముందు ప్రదర్శించిన అద్వితీయ కళారూపం మహానటి. దర్శకుడు రూపొందించుకున్న స్క్రిప్ట్ తర్వాత, మన సావిత్రిని మళ్లీ కళ్లముందు నిలిపిన అతి గొప్ప నటనను ప్రదర్శించిన సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్‌కి చేతులెత్తి నమస్కరించాల్సిందే. నిజంగానే ఆమెను సావిత్రి పూనినట్లుంది.


కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా సాధించలేని పబ్లిసిటీని ఒక్క మౌత్ పబ్లిసిటీ అదీ జనం నోటినుంచి వచ్చే మాటలు సినిమాను ఎక్కడికో తీసుకెళతాయంటే దానికి ఆధునిక నిర్వచనం మొదటిది బాహుబలి అయితే రెండోది మహానటి. ఈ రెండు సినిమాల్లోని భయంకరమైన లోపాలను, తప్పు వాస్తవాలను చాలామంది చాలా రకాలుగా ఒకరకంగా నిజాయితీగానే ప్రస్తావించారు. విమర్శించారు కూడా. కానీ ఆ భయంకరమైన లోపాలన్నీ సినిమా చూశాక చంద్రునిమీద దూదిపింజలాగా తేలిపోతాయి. ఈ మధ్యకాలంలో కోట్లాది మంది ఒళ్లు పులకరించిపోయిన అనుభూతికి ప్రత్యక్ష నిదర్శనం ఈ రెండు సినిమాలు. బాహుబలి కల్పన అని కొట్టిపారేయవచ్చు. విజయేంద్రప్రసాద్ కథకు రాజమౌళి శిల్పంలాగా చెక్కకపోతే బాహుబలికి ఆ ఫేమ్ ఎక్కడిది అని తీసిపారేయవచ్చు. కానీ మహానటి అలా కాదే!

మనకు రెండు తరాల క్రితం ఈ భూమ్మీద, మనగడ్డపైనే పుట్టి పెరిగిన ఒక అమాయకపు కొంటెపిల్ల మన తల్లిదండ్రుల, అవ్వతాతల కళ్లముందే చిత్రసీమలో ఎదిగి సినిమాకళకు మహిమాన్విత నిర్వచనంలా ప్రభాసించిన కథే మహానటి. అది కల్పన కాదు. మూడక్షరాలను చిత్రరంగస్థలంపై మూర్తీభవింపచేసిన వాస్తవరూపం. నరాలను ఉద్రేకపరిచే ఒక్క కాముక దృశ్యం కూడా చూద్దామన్నా కనిపించలేదు. ఒక్క ఫైటింగ్ కూడా లేదు. ఒక్క వెకిలి హాస్యపు కంపూ లేదు. ఒక్క పనికిమాలిన హీరోయిజమూ లేదు. పంచ్‌ల కోసమే పుట్టిస్తున్న ఒక్క దరిద్రపు డైలాగూ లేదు. ఒక్క రక్తపాత ఘటనా లేదు. కానీ మాయాబజార్ తర్వాత శంకరాభరణం తర్వాత, అన్నమయ్య తర్వాత (బాహుబలిని మినహాయిస్తే) మూడుగంటల పాటు ఆబాల గోపాలం తనువు పులకరింపజేసిన అపూర్వ కళకు కట్టెదుటి రూపం మహానటి. బీ సెంటర్లనుంచి ఏ సెంటర్ల నుంచి, ఐమాక్స్ థియేటర్ల నుంచి చూసిన చూస్తున్న జనం నోట ఒకేమాట. మహానటి. ఒక సినిమాను, ఒక పాత్రను, ఒక జీవితాన్ని యావత్ సమాజం ఇంతఆర్తితో తమ సొంతం చేసుకున్న ఘటన చలనచిత్ర చరిత్రలో చాలా అరుదుగా సంభవిస్తుందేమో.

తెలుగు హీరో చిరంజీవి కోట్లమంది ప్రేక్షకుల గుండె చప్పుళ్లను ఒక్కటిగా చేసి ఒక గొప్ప నిజాన్ని మాట్లాడారు. 'మహానటి సినిమాను చూస్తున్నంతసేపూ ఏడుస్తూనే ఉన్నాను. ఏడుస్తూనే మొత్తం సినిమాను చూశాన'న్నారు. మా సినిమా ప్రారంభోత్సవానికి, విడుదలకీ వచ్చి నాలుగు మాటలు చెప్పి ఆశీర్వదించండి అని ఎవరైనా నిర్మాతలు, నటులు, దర్శకులు అడిగితే లేదనకుండా, కాదనకుండా తాను ఎన్నో సార్లు ఎందరి సినిమాలకో సరుకు లేకున్నా ముఖప్రీతి కోసమైనా చాలా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ మహానటి సినిమాపై చిరంజీవి చేసిన వ్యాఖ్య నిజాయితీకి నిలువెత్తు గోడగా నిలిచిందనడమే నిజం. రెండు వారాల క్రితం ఆ ఆదివారం రాధికా ఐమాక్స్ థియేటర్లో సెకండ్ షో కి వెళ్లినప్పుడు జనం మొత్తం మూగపోయి సినిమాలో లీనమవడమే నాకు కనిపించింది, వినిపించింది.

ఇంతమంది జనం మహానటి సినిమానూ చూస్తూ మౌనంగా విలపించారంటే, సావిత్రి విషాదాన్ని తమదిగా సొంతం చేసుకున్నారంటే, తెలుగుప్రజల భాగ్యవశాత్తే ఇంత మంచి సినిమా, ఇంత కరుణామయ కళ మనకు అందిందనే చెప్పాలి. ఇంటర్వెల్‌ సమయంలో థియేటర్ నుంచి బయటకు రాకుండా సగంమందికి పైగా లోపలే ఉండిపోయారంటే వాళ్లనుభూతి చెందుతున్న ఆ ట్రాన్స్, ఆ కళాత్మక మత్తు వేసిన ముధ్ర ఏమిటో అర్థమవుతుంది. ముఖ్యంగా పదే పదే మహానటీ.. అనే బిట్ వెనుక వినిపించిన సంగీతం సావిత్రి జీవితంలోని ఆనందాన్నీ దాని వెనకే వెంటాడిన విషాదాన్నంతటినీ రంగరించిపోసినట్లుగా సినిమా విజయానికి మూలకారణమై నిలిచింది. చివరివరకూ ప్రేక్షకులను విషాదాంతపు అనుభూతితో నిలిపిన గొప్ప మ్యూజిక్ బిట్ అది.

సావిత్రి జీవితంలోని సంతోషానికి, వేదనకు, బాధకు, విషాదాంతానికి కర్త కర్మ క్రియ సావిత్రి మాత్రమే అని చెబితే న్యాయంగా ఉంటుందా? మహానటి సినిమా చూడక ముందు ఇదే ప్రశ్న వేసుకున్నాను. చూసిన తర్వాత కూడా ఇదే ప్రశ్న వేసుకుంటున్నాను. అవును. సావిత్రి జీవితంలోని ప్రతి అనుభవానికి సావిత్రే మూలం. చిన్నప్పటినుంచి చివరిదాకా తానెలా ఉండాలనుకుందో అలాగే ఉండిపోయింది. ఎవరి మాటా వినలేదు. ఎవరి సలహానూ పాటించలేదు. ఎవరి మెప్పు కోసమో జీవించలేదు. తన సంతోషాన్ని, చిలిపితనాన్నీ, తన వైభవాన్ని, తన పేదరికాన్ని, తన భావోద్వేగాలను పూర్తిగా తనకే సొంతం చేసుకుంది. ఒకరిని తప్పు పట్టలేదు. వేలెత్తి చూపలేదు. తన సినీ జీవితానికి తిలకం దిద్ది మద్దతిచ్చి తోడుగా నిలబడ్డాడన్న ఏకైక కారణం అతడితో జీవిత బంధం వరకూ తీసుకెళ్లింది. ఇద్దరు పెళ్లాల మొగుడైన జెమినీని నమ్మింది. తనకే సొంతమవుతాడని భ్రమించింది.

కానీ పుష్పంమీద వాలడం జీవన ధర్మంగా పెట్టుకున్న ఒక భ్రమరం తన చుట్టూ మాత్రమే తిరగదన్న వాస్తవాన్ని గ్రహించిన క్షణం... 'అది తన బలహీనత, కానీ తన ప్రేమ మొత్తం నీమీదే' అన్న భ్రమర న్యాయాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఇద్దరు భార్యలతో గడుపుతూనే మూడో పెళ్లికీ సిద్ధమైన బంధంలో పవిత్రతకు, స్వచ్ఛతకు తావులేదన్న నిజాన్ని గ్రహించకపోవడమే సావిత్రి చేసిన తప్పా? వ్యక్తిగత జీవితంలో ఇంకేమీ మిగలబోదన్న వాస్తవం అర్థమయ్యాక కూడా బతుకు కోసమో, నటన మీద పిచ్చితోనో, చివరి క్షణం వరకు సినిమాల్లో నటిస్తూనే పోవాలన్న కాంక్షతోనో మాత్రమే సావిత్రి మరో 15 ఏళ్లు బతికిందా? అన్నీ ప్రశ్నలే. సినిమా చూసినంత ఈజీగా తేల్చుకోలేని ప్రశ్నలు. కన్న కూతురితో సహా అందరూ సావిత్రి గురించి పాక్షిక సత్యాలనే చెబుతున్నారనిపించేలా నలుమూలల్నుంచి ఆమెతో పరిచయం ఉన్నవారు నేటికీ బయటపెడుతున్న వాస్తవాలు.. ఏది నిజమో, ఏది అబద్ధమో ఎవరికీ పూర్తిగా తెలీదు. నిర్ధారణ లేదు.

కానీ ఒకటి మాత్రం నిజం. ఇదొకటే నిజం. 1952 నుంచి 1981లో కన్నుమూసేంతవరకు సావిత్రి జీవితంలోంచి వ్యక్తిగతాన్ని మినహాయిస్తే, మనకు వద్దనుకుంటే చివరికీ మిగిలేది మూడక్షరాల నటవిశ్వరూపం. నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వంటి స్టార్ నటులు కూడా ఆ మూడక్షరాల నట విరాడ్రూపం ముందు నిలబడాలంటేనే వణికిపోయిన మహనీయ మూర్తిమత్వం. 78 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో నటనకు మారుపేరుగా నిలిచిన ఒకే ఒక్కడు ఎస్వీరంగారావు సైతం సావిత్రి ముందు నిలబడి నటించాలంటే జాగ్రత్తగా ముందే సిద్ధపడి రావలసివచ్చేదంటే అది ఆ మూడక్షరాల మనిషి సినిమా కళపై చేసిన చెరగని సంతకం. హీరోయిన్‌గా వెలిగిపోయినపుడు లక్షలు తీసుకున్నా, సైడ్ పాత్రలకూ, తల్లి పాత్రలకూ పరిమితమై పాత్రకు ఆరువేల రూపాయలు మాత్రమే తీసుకోవలసి వచ్చినా, 'ప్రేక్షకులచేత చప్పట్లు కొట్టించుకోవడానికే బాబాయ్ మనం ఉండేది, ఉండాల్సిందీ...' అంటూ నటజీవితంపై తాత్విక వ్యాఖ్యానం చేసినా అది సావిత్రికే చెల్లు.

మన సావిత్రిని ఇలాగే గుర్తు పెట్టుకుందాం. ఆమె వ్యక్తిగత జీవితాన్ని, దానిలోని నిమ్నోన్నతాలను సవినయంగా, నమ్రతతో ఆమెకే వదిలేద్దాం. మన తీర్పులను, ముద్రలను వినడానికి, సమాధానం ఇవ్వడానికి కూడా ఆమె మన ముందు లేదు. జీవితం మొత్తంలో రాజీపడని వైఖరి, సర్దుబాటు అనే మాటకు తావివ్వని ప్రవృత్తి, తానేమనుకుంటే అదే నిజం అనుకున్న నమ్మకం. మనిషిమీద నమ్మకం సడలుతుండే కొద్దీ గరళాన్ని మింగి.. అదే నమ్మకం, అదే జీవితం అనుకున్న మొండితనం... సామాన్య జీవితాలకు అర్థం కాని, ఎవరూ సాహసించలేని ఈ వ్యక్తిగత తెంపరితనాన్ని దాటి చూస్తే... మొదట్లోనే చెప్పినట్లు సినిమా కళను ఉద్దీపింపచేసిన మహత్వపూర్ణ నటనా కౌశలం సావిత్రి.

నా చిన్నప్పుడు అంటే 1970లలో మాయాబజారు సినిమా ఊరి టెంట్లలో ప్రదర్శిస్తే బళ్లు కట్టుకుని మరీ వచ్చి చూశారు జనం. మహానటి సినిమాకు ఎవరూ బళ్లు కట్టుకుని రాలేదు. కారణం ఊర్లలో ఇప్పుడు టెంట్లు లేవు. బళ్లూ లేవు. వ్యవసాయం మొత్తంగా యంత్రాల పాలబడుతోంది. కష్టజీవి శ్రమను పోగొట్టి విరామాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందించిన ఆ గొప్ప సినిమా సంస్కృతి ఇప్పుడు పల్లెల్లో లేదు. ఎందుకంటే అక్కడ కూడా అన్ని ఇళ్లల్లో టీవీలు దూరేశాయి. 40 ఏళ్లలో జీవితం ఇంతగా మారిపోయిందా అంటూ నివ్వెరపోతున్న క్షణాల్లో మండువేసవిలో మలయమారుతంలా చల్లగా పలకరిస్తూ వచ్చింది సావిత్రి. అదే మహానటి.

మాయాబజారు సినిమా చూడకపోతే తెలుగువాళ్లు కాదు అని 70ల చివర్లో ఒక సినిమా పత్రిక కథనం మమ్మల్ని భయపెట్టింది. ఇప్పుడు అదే భయాన్ని మహానటికి కూడా ఆపాదించు కోవాల్సి ఉంది. మహానటి సినిమా చూడకపోతే, అదీ థియేటర్లోకి వెళ్లి చూడకపోతే మన తెలుగువాళ్లం కాదు అని కొత్త స్లోగన్ రాసుకోవాలిప్పుడు. మరోసారి చెబుతున్నా.. సినిమా కళను ఉద్దీపింప చేసిన అరుదైన చిత్రాల్లో మహానటి తాజా సినిమా. మనం మర్చిపోయిన అలనాటి సుగంధ పరిమళాన్ని మరోసారి ఆస్వాదించాలన్నా.. మహానటి చిత్రాన్ని ఎవరూ మిస్ కాకూడదు. ఇంకా ఎవరైనా చూడకుంటే ఇప్పటికైనా వెళ్లి చూడండి. థియేటర్లో మాత్రమే చూడండి. బాహుబలి సినిమాను మిస్సయినా పర్వాలేదు. మహానటిని మాత్రం ఈ తరంలో ఏ ఒక్కరూ మిస్ కాకూడదు. ఎందుకంటే ఈ సినిమాను చూడకపోతే మనమీద కూడా తెలుగువాళ్లం కాదు అనే అపప్రథ కచ్చితంగా పడుతుంది.
-------------
నిజామాబాద్‌కు చెందిన ధర్మరాజ్ అనే అతను మహానటి సినిమా చూసి యూట్యూబ్‌లో రాసిన నాలుగు ముక్కలు మళ్లీ ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. "అది సినిమా కాదు.. ఒక జీవిత పాఠం.. జీవితంలో మనం చేసే పొరపాట్లు.. జీవితం మనకు ఇచ్చే అవకాశాలు.." అంటూ మొత్తం సినిమా గురించి రెండు చిన్న వాక్యాలలో అద్భుతంగా స్పందించారు. సినిమాలో నిజంగా సావిత్రే ఉందనుకుని, మధ్యలో అలా చేయకు ఇలా చేయకు అని చెబుదామా అనే తాదాత్మ్యత లోకి వెళ్లిపోయారీయన.

సినిమా రివ్యూలు, మేధోవంతమైన సమీక్షలు వంటివి పక్కన బెడితే.. ఒక సగటు ప్రేక్షకుడు మహానటి పట్ల ఎంత గొప్పగా స్పందించారో కింది పేరాలో చూడండి.

"నిన్న మహానటి సినిమా చూసిన... అది సినిమా కాదు ఒక అద్భుత దృశ్య కావ్యం... ఒక జీవిత పాఠం... జీవితంలో మనం చేసే పొరపాట్లు... జీవితం మనకు ఇచ్చే అవకాశాలు... Ball will come to our court... definitely... But how we will utilise it is important... That is life... That Is "Mahaanati" Saavitri... చివరకు ఇలా ఎందుకు జరిగింది అని భారమైన హృదయంతో థియేటర్ నుండి బయటకు వచ్చాను... సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కళాకారులు కనబడలేదు.... ఆ మహానటి సావిత్రమ్మను దగ్గర నుండి చూస్తున్నాను అనే ఒక గట్టి భావన... మధ్య మధ్యలో సావిత్రమ్మను పిలిచి చెబుదామా అన్నంత అలజడి హృదయంలో..."
dharamraj
నిజామాబాద్
--------------------
ధర్మరాజ్ ఒక్కరే కాదు... ఒక సినిమాను చూసి థియేటర్ నుంచి లక్షలాది మంది మౌనంగా విలపిస్తూ, దీర్ఘాలోచనతో బయటకు రావడం ఎలా సాధ్యం అనే ప్రశ్నకు మన తరం జీవితంలో నిలువెత్తు సమాధానం మహానటి. మన సావిత్రికి జననీరాజనం మహానటి. తప్పక ఈ ఆదివారమైనా వెళ్లి చూడండి. థియేటర్లోనే చూడండి.

మహానటిపై ఈ కథనం ముందుగా నా పేస్ బుక్ లో పోస్ట్ చేశాను. కింది లింకులో చూడండి
సినిమా కళ ఉద్దీప్తమైన క్షణం : మహానటి

Friday, April 20, 2018

మీ మొహాలకు తెలుగు హీరోయిన్లు పనికిరారా? తెలుగు హీరోలపై సంధ్య ఫైర్

యూట్యూబ్ తెరిస్తే చాలు.. శ్రీరెడ్డికి సపోర్టుగా, వ్యతిరేకంగా తెలుగు సమాజం నిలువునా చీలిపోయిన ముఖచిత్రమే గత కొన్ని వారాలుగా కనబడుతోంది. ఎవరి వైఖరి సరైంది, కాదు అని ఎవరికి వారు తేల్చుకునే సమయంలోనే పరిణామాలు విపరీతంగా మారిపోతున్నాయి. ప్రత్యేక హోదా ఉద్యమమే పక్కకు పోయేంత తీవ్ర స్థాయిలో ఇప్పుడు తెలుగు మీడియా తెలుగు సినీరంగంలో క్యాస్టింగ్ క్యాచ్‌పై ఎడతెగని యుద్ధాలు చేస్తోంది. రాంగోపాల్ వర్మ సలహా వ్యవహారం మరో కొత్త యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తోంది.

కానీ ఇన్ని సంక్లిష్టతల మధ్య, వాదవివాదాల మధ్య కొన్ని ఉత్తేజకరమైన, స్ఫూర్తిదాయక మైన ప్రసారాలు యూట్యూబ్‌లో కనబడుతున్నాయి. వాటిలో ఇవ్వాళ నాకు కనిపించిన వీడియోలో కొంత భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది తెలుగు సినీమా మాఫియా గురించి, తెల్లతోలుపై హీరోల యావ గురించి, చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యే లేదంటూ సినీ నటి జీవిత చేసిన సంచలనాత్మక ప్రకటనపై పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య చేసిన ప్రసంగం. అత్యంత స్పష్టతతో కూడిన ఆమె ఉపన్యాసంలో కొంత భాగం ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆమె ప్రసంగం పూర్తి పాఠం కింది వీడియో లింకులో కూడా చూడవచ్చు.

"తెలుగు సినీ మాఫియా, వీరి వెనక రాజకీయ నాయకులు, అక్రమ డబ్బును పోగేసుకుని వస్తున్నవారు తెలుగు సినిమాలోకి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే, నాలుగే నాలుగు బ్యానర్లు మాత్రమే సినీరంగాన్ని ఏలుతున్నాయి. నాలుగు లేక అయిదు కుటుంబాలు.. దాంట్లో కూడా ఒక్క కులం లేదా రెండో కులం ఒకటి ఆరా కులాలు ఇవ్వాళ తెలుగు సినీ రంగాన్ని ఏలుతున్నాయి. వీళ్లే ముక్కుమొహాలున్నోళ్లా..  వీళ్లే వారసులా? ఇవ్వాళ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ హీరోల కంటే అందమైన పిల్లలు లేరా హీరోలుగా? మీరు అమ్మాయిలను ఇతర రాష్ట్రాలనుంచి తెచ్చుకుంటున్నారు. మరి అందంగా ఉండే అరవిందస్వామి లాంటివారిని, బాలీవుడ్ నుంచి మరికొందరిని తీసుకురండి. మీ నాలుగైదు కుటుంబాల హీరోలనే ఎందుకు చూడాలి మేం.  పక్కరాష్ట్రాల నుంచి అందంగా ఉండే హీరోలను తెచ్చుకుని ఎందుకు పెట్టరు? హీరోలుగా మీరే ఉంటారు? హీరోయిన్లనేమో పక్క రాష్ట్రాలనుంచి తెచ్చుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో తెలుగు అమ్మాయిలు లేరా అందంగా? నటన చేయగలిగే అబ్బాయిలు లేరా? మీరే హీరోలుగా ఉంటారు. మీకు మాత్రం ఇంత పక్షపాతం అవసరమా? మీ సినిమాలే ధియేటర్లలో విడుదల చేసుకుంటారు. నిర్మాతలు లేకపోయినా, పెట్టుబడులు లేకపోయినా డబ్బులు పోగేసుకుని సినిమా పిచ్చితో సినిమా తీస్తే వాళ్లకు థియేటర్లు దొరకనీయరు. ఒకవేళ వేరేవాళ్ల సినిమాలు బాగున్నాయని టాక్ వస్తే వ్యతిరేకంగా రివ్యూలు రాయిస్తారు. నేనివాళ చెబుతున్నాను. సినిమారంగంలో ఉన్న అయిదు బ్యానర్లు, నాలుగైదు కుటుంబాలు ఒక మాఫియా. మీలో మార్పు వస్తేనే సినిమారంగంలో మార్పు వస్తుంది. మీరు అందరినీ అణిచివేస్తున్నారు. కొత్తగా సృజనాత్మకంగా కథలు రానివ్వరు. సృజనాత్మకంగా నటించే వారిని రానివ్వరు. ఉదయ్ కిరణ్ లాంటి వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?

సినిమారంగంలోకి వేరే కులాల వాళ్లు వచ్చినా, లేదా సినిమా కుటుంబాలకు చెందని చిన్నవాళ్లు వచ్చినా మీరు తొక్కేస్తున్నారు. ఎంతకాలం తొక్కేస్తారో చూస్తాం. సినిమారంగంలో కొత్త రక్తం రావాలి. కొత్తవాళ్లు రావాలి. సృజనాత్మకత రావాలి. మంచి కథలు రావాలి అని ప్రజాసంఘాలుగా మేము కూడా కోరుకుంటున్నాం.  అలాగే సినిమారంగంలోని తీరుతెన్నుల్లో మార్పు రావాలి. అక్కడి వారి సమస్యలు పరిష్కరించాలి. సినీరంగంలోని దోపిడీ విధానాలు మారాలని కోరుకుంటున్నాం కాబట్టే ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యను ఇతర మహిళా సంఘాలతో కలిసి చేపట్టాం.

జీవితగారు ఇవ్వాళ మాపై కేసు పెట్టారని భయపడం. అనేకమంది మాకు మద్దతుగా వస్తామని, సాక్ష్యం చెబుతామని చెబుతున్నారు. ఇలాంటి కేసులు చాలా చూశాం. కేసులు పెడితే భయపడిపోయే వాళ్లం కాదు. ఇలాంటి కేసులు మాకు కొత్త కాదు. రాజ్యమే మాపై ఎన్నో కేసులు పెట్టింది. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వస్తే తొమ్మిది వామపక్షాలు కలిసి నిరసన తెలిపాయని ఆరోపించి నన్ను ఏ1 ముద్దాయిగా కేసు పెట్టారు. ఎంతోమంది వామపక్ష నేతలపై కేసులు పెట్టారు. ఎంతోమంది ఉద్యోగాలను రాజ్యం తీసేసింది. నా ఉద్యోగాన్ని కూడా తీసింది. అయినా మేం వేటికీ చెక్కుచెదరలేదు. అలాంటిది జీవిత పెట్టిన కేసును ఎదుర్కొవడానికి ఇక్కడెవరూ భయపడటం లేదు.

జీవిత అనుకోవచ్చు సంధ్య అంటే ఒక వ్యక్తి అని. కానీ సంధ్య వ్యక్తి కాదు. సంస్థ. ప్రగతిశీల మహిళా సంఘం ఆశయాలతో  గత 40 ఏళ్లుగా శ్రామికవర్గ మహిళా ఉద్యమాన్ని నిర్మించడానికి పనిచేస్తున్న సంఘానికి నేను బాధ్యురాలిని. పీడిత వర్గం ఎక్కడుంటే అక్కడ వారికోసం మేం పనిచేస్తున్నాం. ఇలాంటి కేసులకు మేం భయపడేది లేదు. జీవితా నువ్వు భాష మార్చుకో. నువ్వు మహిళలను అవమానపరుస్తున్నావు.  విడాకులు తీసుకున్న వారిని అవమానిస్తున్నావు. ఉద్యమకారులను అవమానపరుస్తున్నావు. ఇది కొనసాగించవద్దు.మహిళగా నీమీద మాకు సింపతీ ఉంది. కానీ హద్దులు దాటి నువ్వు హెచ్చరికలు చేస్తే భయపడేది లేదు. నీ తీరును మార్చుకో అని హెచ్చరిస్తున్నాం. 

గ్లామర్ ఉన్న హీరోయిన్లను కాకుండా తెలుగు అమ్మాయిలను పెట్టుకుని సినిమాలు తీస్తే మాకు నష్టాలు వస్తే వాటిని ఎవరు భరించాలి అనే ప్రశ్న కొంతకాలంగా ముందుకొస్తోంది. మరి ముక్కూ మొహాలు సక్కంగ లేనోళ్లు, 20, 30 ఆపరేషన్లు చేసుకుని ఇండస్ట్రీలో నిలబడిన మీ మొహాలను తెలుగు ప్రజలమీద రుద్దుతున్నారా అని నేనడుగుతున్నాను. మంచిదే. తెలుగు వారు ఎవరూ పనికిరారు. మన ఇండస్ట్రీలో ఉన్నవారు ఎవరూ పనికిరారు. మీకిష్టమైన వారిని తెచ్చుకుని ఇక్కడి వారికి పది రూపాయలు ఖర్చుపెడితే వాళ్లకు వందరూపాయలు ఖర్చుపెడుతున్నారు. మరి ఆ నాలుగైదు కుటుంబాల వారినే ఎందుకు జనంమీద హీరోలుగా రుద్దుతున్నారు. వాళ్లనే హీరోలుగా అలవాటు చేశారు కదా. అంటే వీళ్లంతా సినిమాతోనే పుట్టిపెరిగిన హీరోలా? ఈ ముక్కూ మొహం సరిగా లేని హీరోలను అలవాటు చేయగలిగినప్పుడు.. ప్రతిభ, అందం ఉన్నవారిని, నటన చేయగలిగినవారిని ఇక్కడివారిని సెలెక్ట్ చేసుకుంటే తెలుగు ప్రజలు ఆదరించరా అని నేనడుగుతున్నాను.

బయటి వాళ్లే కావాలి అనేది ముందే నిర్ధారించుకుని తెచ్చుకున్న అభిప్రాయాలు మాత్రమే. వాళ్లొక మైండ్ సెట్‌తో ఉన్నారు. వాళ్లకు కావలసిన వారని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను. అమితాబ్ లాంటి వాడే కోట శ్రీనివాసరావును మీరు టాలీవుడ్‌లో ఉండవలసిన వారు కాదు. బాలీవుడ్‌కి రండి అని ఆహ్వానించారని ఈమధ్యే విన్నాను. అలాంటి కోటా గారే విలన్లను కూడా బయటి నుంచి తెచ్చుకోవడం ఏమిటి అని చాలాసార్లు ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఈ వాయిస్ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. కమిడియన్లు కూడా మాట్లాడుతున్నారు. విలన్లు మాట్లాడుతున్నారు. ఇవేవో మేము మాట్లాడుతున్నది కాదండి. చిన్న చిన్న హీరోలు, చిన్న నిర్మాతలు, చిన్న దర్శకులు కూడా మాట్లాడుతున్నారు. గతంలో వీరంతా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. మీడియాకు గుర్తుంటుంది. వాళ్లు రోడ్డుమీదికొస్తే మేం వెళ్లి మద్దతు ప్రకటించాం.

థియేటర్లు దొరకకపోతే మాకూ థియేటర్లు ఇవ్వమని కోరుతూ అమ్మాయిలను పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవి చెబితే ఒడిసేటివి కాదండి.  థియేటర్లు దొరకనీయక పోవడం అప్రజాస్వామ్యం కాదా? వాళ్లకున్న భూములు, ఆస్తులు, బంగారం అమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి సినిమా పూర్తి చేస్తే, ఆ సినిమా రిలీజ్‌కి థియేటర్లు దొరకలేదంటే,  ఇది ఎవరి బాధ్యత? ఇన్ని సమస్యలు మీకుంటే ఇన్నాళ్లుగా మీరు నిర్లక్ష్యం చేశారు. మీరు లెక్కచేయకపోబట్టే ఇవ్వాళ క్యాస్టింగ్ కౌచ్ సమస్య బయటికొచ్చింది. మీ వైఫల్యాలే సమస్యను ఇవాళ ఇలా బయటకు తెచ్చాయి. బయటి వారి మద్దతు లేకుండా మీ సమస్యను పరిష్కరించుకుంటే మా ప్రమేయమే అవసరం లేదు. ఇప్పటికైనా తెలుగు సినీ రంగంలో సమస్యలు ఉన్నాయని గుర్తించండి. తగిన చర్యలు చేపట్టండి.

జీవిత మీద కేసు పెట్టాలన్న ఆలోచన కాని, ఆ సమయం కానీ మాకు లేవు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య తెలుగు సినీరంగంలో లేదని, అసలు కమిటీయే అవసరం లేదని ప్రకటించింది కాబట్టే, ఆమెనే క్యాస్టింగ్ కౌచ్ కమిటీ చైర్ పర్సన్‌గా చేయనున్నారు అని తెలిసే ఎలాంటి అవగాహనా లేని ఆమెకు, ఇంత అహంకారంతో అసలు సమస్యే లేదని బహిరంగంగా ప్రకటించిన జీవితను కమిటీ చైర్మన్‌గా ఎలా పెడతారు అనే ప్రశ్నిస్తున్నాం. ఇన్ని పోరాటాల తర్వాత 'మా' దిగి వచ్చి క్యాషింగ్ కౌచ్‌కి వ్యతిరేకంగా కమిటీ పెడతామని ప్రకటిస్తే అ కమిటీయే వద్దని జీవిత ప్రకటించడం చట్టవ్యతిరేకం, చట్ట విరుద్ధం. ఒక మహిళగా సంధ్య నన్ను అలా అనవచ్చా అని జీవిత అంది. క్యాస్టింగ్‌పై కమిటీ పెడతామని 'మా' అంటే వద్దని ఒక మహిళగా జీవిత అనడం సబబేనా అన్నది మా ప్రశ్న. నలభై ఏళ్ల ఉద్యమ జీవితంలో ఏనాడూ వ్యక్తుల వ్యక్తిగత విషయాలను మేం బయటపెట్టలేదు. స్పష్టమైన ఆధారాలున్నా, వ్యక్తుల పేర్లు బయటపెట్టకుండా సమస్యను పరిష్కరించడానికే ప్రయత్నించాం. ఆంధ్రజ్యోతిలో ఏడేళ్ల క్రితం జీవిత భర్త వ్యవహరంపై పూర్తి పేజీలో ప్రచురింపచేసిన వ్యాసంలో కూడా ఆ అమ్మాయిలు రాసిన లేఖనే ప్రచురించాం కానీ వ్యక్తుల పేరు బయటపెట్టలేదు. కానీ క్యాస్టింగ్ కౌచ్ సమస్యే లేదని చెబుతున్న వ్యక్తి అదే కమిటీ బాధ్యతల్లోకి వస్తోందని స్పష్టంగా తెలిసిన తర్వాతే, ఆమె అర్హతను ప్రశ్నిస్తూ మేం మాట్లాడాల్సి వచ్చింది.

నిన్ను సినీరంగం రాణిగా చూసుకుంటుందని అంటున్నావు. రేపు నీ కూతురు సినిమాల్లోకి వస్తే  ఆమెకు నువ్వు ఏ సమస్య లేకుండా కాపాడుకోవచ్చు. ఎవరూ నీ కూతురు జోలికి వెళ్లకపోవచ్చు. కానీ చాలామంది బిడ్డలు, చెల్లెళ్లు, తల్లులు, అమ్మాయిలు సినిమామీద పిచ్చితో, సినిమాకళపై మోజుతో  వచ్చారు. వచ్చి బయటకు పోలేక, వేరే పనులు చేసుకోలేక వేలాడుతున్నారు. వాళ్లకు మీకు ఉన్నంత అండదండలు లేకపోవచ్చు. నీకు భర్త ఉన్నాడు. నీ కూతురుకు మీరున్నారు. కానీ అలాంటి అండదండ లేని వారికి రక్షణ కల్పించమని అడిగితే తప్పెలా అవుతుంది? అలాంటివాళ్లు లైంగిక దోపిడికి గురికాకూడదు అని కోరుకుంటే తప్పెలా అవుతుంది?

జీవిత ఆలోచించాలి. బతుకు జట్కా బండి ప్రోగ్రామ్‌లో జీవితే అంది. సినీరంగంలోకి అమ్మాయిలు వస్తే, తెలుగు అమ్మాయిలు వస్తే వద్దు అని చెప్పి అనేకసార్లు వారిని వెనక్కు పంపానని జీవితే గతంలో అన్నది. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయని అమ్మాయిలను వెనక్కు పంపించావు? సమస్యను పరిష్కరించాల్సింది పోయి అమ్మాయిలను వెనక్కు పంపిస్తున్నారు. ఆ సమస్యలు ఇప్పుడైనా పరిష్కరించమని అడిగితే అసలు క్యాష్ కమిటీలే వద్దంటున్నారు. పైగా 'సంధ్య ఒక విడాకులు తీసుకున్న వ్యక్తి' అని జీవిత మాట్లాడింది. నేనెవరో అందరికీ తెలుసు. కానీ డైవోర్సీ అంటే ఒక లంగ, దొంగ అనే అర్థంవచ్చేలా వెటకారంగా మాట్లాడిందామె. నీ సినిమా పరిశ్రమలో వందలమంది సింగిల్ వుమెన్ ఉన్నారు. నువ్వు వాళ్లందరినీ ఉద్దేశించి డైవోర్సీలు అని అపహాస్యంగా మాట్లాడుతున్నావంటే డైవోర్సు తీసుకున్నవారు నేరస్తులా, వాళ్లే తప్పులు చేస్తేనే వారికి డైవోర్సులు వచ్చాయా అని అడుగుతున్నాను.

తినితాగేవాళ్లు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్లు, భార్యల్ని వదిలేసేవాళ్లు ఎంతమంది లేరు?  మగాళ్లు చేసే ఆకృత్యాలకు పిల్లలు బలవుతున్నా, కుటుంబాలు నలిగిపోతున్నా సింగిల్ విమెన్‌గా, డైవోర్సీలుగా తమ కుటుంబాలను నెట్టుకుని వస్తున్నారు. ఇలాంటి వారి పట్ల సానుభూతి చూపనవసరం లేదు. సహానుభూతి చూపాలి. వందలాది మంది డైవోర్సీలు ఇవాళ నాకు ఫోన్లు చేసి, మీరు మీటింగ్ పెట్టండి మేం వచ్చి మాట్లాడతాం. జీవిత మమ్మల్ని అవమానించింది. విడాకులు తీసుకుని మేం తప్పు చేశామా, ఆమె ఎందుకనాలి? డైవోర్సీలను అలా అనవద్దు అని మీరు చెప్పడం మాకు చాలా ధైర్యాన్నిచ్చింది అని వారన్నారు. అందుకే కుటుంబాల చరిత్రలు చెప్పుకోవలసిన గతి నీకుందేమో కానీ మాకెవరికీ లేదు. మహిళలందరినీ ప్రేమిస్తాం.

పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య స్ఫూర్తిదాయక ప్రసంగం పూర్తి పాఠం కింది లింకులో చూడండి

POW Sandhya counters Jeevitha || Tollywood Casting Couch

Monday, April 16, 2018

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు తెలుగు రేప్ ఇండస్ట్రీ : తేజస్విని ఫైర్

బడాబాబులు, వారి కొడుకులు, వారి కాళ్లు నాకే నిర్మాతలు, దర్శకులు రాజ్యమేలుతున్న తెలుగు చిత్ర పరిశ్రమ వాస్తవానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదని తెలుగు రేప్ ఇండస్ట్రీ అని తీవ్రాతితీవ్రమైన ఆరోపణలు చేశారు హైదరాబాద్ మహిళా నేత తేజస్విని. టాలీవుడ్‌‌లో కమిట్‌మెంట్, కాంప్రమైజ్ అనే పదాల చాటున సాగుతున్న రేప్‌ల భాగోతంపై మొన్న మాధవీలత, గాయత్రీగుప్తా నిన్న శ్రీరెడ్డితో మొదలైన ఆరోపణల పర్వం గత రెండు మూడు రోజులుగా టాలీవుడ్‌లోని జూనియర్ ఆర్టిస్టుల ఆక్రందనలతో, పొలికేకలతో పరాకాష్టకు చేరినట్లయింది. కోఆర్డినేటర్లు, కో ప్రొడ్యూసర్లు, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, నటరాక్షసులు.. ఇలా నానా జాతి ఖంగాళీలంతా జూనియర్ ఆర్టిస్టుల నిస్సహాయతను ఆధారం చేసుకుని టాలీవుడ్‌లో నిత్యం సాగిస్తున్న అత్యాచారాల బీభత్స కాండ హాలీవుడ్‌లో జరిగిన దానికి ఏమాత్రం తీసిపోదని అక్కడికంటే ఇంకా ఎక్కువ దారుణాలు ఇక్కడే తెలుగు సినిమా రాక్షసులు సాగిస్తూ నిర్లజ్జగా, నిర్భీతిగా బతికేస్తున్నారని తేజస్విని మండిపడ్డారు. ఆమె మాటల్లో చెప్పాలంటే..

"జూనియర్ ఆర్టిస్టుల బాధలను మొన్న విన్నాం. నిన్న విన్నాం. ఈరోజు వింటున్నాం. ఇది తెలుగు ఫిలిం ఇండస్టీ కాదు. తెలుగు రేప్ ఇండస్ట్రీ. మీరు ఒక్క సినిమా చేయడానికి ఎన్ని రేప్‌లు చేస్తారో చెప్పండి. ఎన్ని కలెక్షన్లు కాదు.. ఎన్ని రేప్‌లు చేస్తారో చెప్పండి ముందు. ఒక సినిమా కంప్లీట్ కావడానికి ఎన్ని రేప్‌లు అవుతాయో చెప్పండి. రేప్ చేయకుండా ఒక్క సినిమానైనా చేయగలరా చెప్పండి.  క్విడ్ ప్రో కో ప్రకారం వచ్చి పడుకో.. పడుకుంటే సినిమా చాన్స్ ఇస్తా, కమిట్‌మెంట్ ఇస్తే సినిమా ఇస్తా అంటున్నారు కదా. ఇలా కమిట్‌మెంట్ తీసుకునే వాళ్లంతా రేపిస్టులే. తెలుగు సినీ ఇండస్ట్రీ నిండా రేపిస్టులే ఉన్నారు. ఢిల్లీలో నిర్భయ విషయంలో జరిగింది మాత్రమే రేప్ అనుకుంటున్నారా? మీరు చేసేవన్నీ రేప్‌లే. రేప్ చేయకుండా ఒక్క సినిమా తీసి చూపించండి మాకు. మీరు ఇష్టప్రకారం రేప్‌లు చేస్తూ ఉంటే మేం చూస్తూ ఊరుకోవాలా, ఊరుకుంటామా?"

తేజస్విని మాటలను అలా పక్కనబెడితే, మరోవైపున జూనియర్ ఆర్టిస్టులయితే తమ వంతుగా, మా శాపం తగిలి తెలుగు సినిమా నిర్మాతలు కాలిపోతున్నారని, అట్టర ప్లాఫ్‌లతో నాశనమైపోతున్నారని శపిస్తున్నారు. మా ఉసురు తగిలి హార్ట్ ఎటాక్ వచ్చి పోతారని, నాశనమైపోతారని శాపాలు పెడుతున్నారు. ఇక గత కొన్నివారాలుగా టాలీవుడ్ క్యాషింగ్ కౌచ్ వ్యవహారాలను టీవీ మీడియా, సోషల్ మీడియా ద్వారా గమనిస్తున్న సగటు వీక్షకులు అయితే ఇంత మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటూ ఒ నలుగురు, ఐదుగురు వ్యక్తులు గొప్పవాళ్లుగా, ధనవంతులుగా మారే ఈ నీచమైన వ్వవస్థను సినీ రంగం, సినీపరిశ్రమ అని అనడానికి వీల్లేదని, ఇది స్త్రీలను వ్యబిచారంలోకి దించే మాఫియా గ్యాంగ్ అనీ ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. 'మా' (MAA) అంటే మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ కాదు అదొక 'మాఫియా ఆగడాల అడ్డా' అంటూ మండిపడుతున్నారు.

ఇక హేతువాది  గోగినేని బాబు అయితే 'మా' ని రద్దు చేసిపడేస్తే తప్ప తెలుగు సినీ గిల్డ్ బాగుపడదని తేల్చి పడేస్తున్నారు. టాలీవుడ్ అసలు పరిశ్రమే కాదని, పరిశ్రమకు ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా దాంట్లో అమలు కావడం లేదని, పునాదులతో సహా మళ్లీ కొత్తగా నిర్మిస్తే తప్ప టాలీవుడ్‌లో మహిళల ఆక్రందనలు నిలిచిపోవని గోగినేని ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సత్యం ప్రత్యేక హోదాలోనే కాదు... ఆ సత్యం శ్రీరెడ్డి పొలికేకలోనూ ఉంది. తెలుగు సినీరంగంలోని జూనియర్ ఆర్టిస్టుల హాహాకారాల్లో ఉంది. ఒక మహిళా జూనియర్ ఆర్టిస్టును 700 సార్లు పైగా బలవంతంగా అత్యాచారం చేసిన తెలుగు మూవీ మాపియాను, 15-20 ఏళ్ల లోపు అమ్మాయిలను తీసుకువచ్చి తార్చితే సినీ అవకాశాలిస్తామని ప్రకటిస్తున్న కోఆర్డినేటర్లను, వారి పైన ఉన్న ఎగ్జిక్యూటివ్ దర్శకులను బహిరంగంగా ఏకిపడేస్తున్న జూనియర్ ఆర్టిస్టుల ఆకలికేకల్లో సత్యం ఉంది.

ముంబై నుంచి వచ్చి పడుతున్న తెల్ల చర్మాల సుందరాంగులపై పంజా విసురుతున్న తెలుగు హీరోల్లో ఒక్కడంటే ఒక్కడు కూడా టాలీవుడ్‌ని కుదిపేస్తున్న ఈ సెక్స్ కుంభకోణం గురించి నోరు విప్పే సాహసం చేయడం లేదు. తెలుగు సినిమాకు పట్టిన చీడపురుగులు ఇప్పుడు నోరు విప్పితే తమ బాగోతం ఎక్కడ బాగుపడుతుందో అనే చందాన జుట్టుపీక్కుంటున్నారు. నిన్నగాక మొన్న మీడియాకు దొరికిన పవన్ కల్యాణ్ మరోసారి తన తిక్కను ప్రదర్శించి నవ్వులపాలయ్యాడు. మోసపోయిన అమ్మాయిలు టీవీలకు ఎక్కకుండా, రేటింగులకు తోడ్పడకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టాలని వాళ్లు న్యాయం చేయకపోతే అప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవలసి వస్తుందని హీరోయిజం ప్రదర్శించిన పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లో క్యాషింగ్ కౌచ్ గురించి ఒక్క మాటంటే ఒక్కమాట కూడా ప్రస్తావించకుండా తప్పించుకోవడంపై మహిళా సంఘాలు తూర్పారపడుతున్నాయి. ఇక శ్రీరెడ్డి అయితే బెంగాలీ హీరోయిన్లతో బాడీ మసాజ్‌లకు అలవాటుపడ్డ పవన్‌ కల్యాణ్‌కు తెలుగు నటిల, జూనియర్ ఆర్టిస్టుల బాధలు ఏం తెలుస్తాయంటూ దెప్పి పొడిచింది.

ఈ నేపథ్యంలో ఇన్నాళ్లుగా వాయిస్ అనేది లేకుండా ఎవరికి తమ బాధలు చెప్పుకోవాలో అర్థం కాకుండా దశాబ్దాలుగా తెలుగు సినిమా రాక్షసుల దమన కాండను మౌనంగా భరించిన పేద అమ్మాయిలను, జూనియర్ ఆర్టిస్టులను మహిళా సంఘాలే ఒక స్పష్టమైన మార్గం గుండా నడిపించి వారి సమస్యలకు సరైన పరిష్కారం చూపిస్తారని, చివరికంటా వారిని వదలకుండా ముందుకు నడిపిస్తారని ఆశించడం తప్ప ఇంకేమీ చేయలేం. దశాబ్దాలుగా మహిళల సమస్యలపై ముందుండి పోరాడుతున్న మహిళా సంఘాల నేతలు సైతం జూనియర్ ఆర్టిస్టుల ఆర్తనాదాలను వింటూ నిద్రలేని వేదనను అనుభవిస్తున్నారంటే తెలుగు సినీ కీచకాధకములు ఎంత స్థాయిలో పతనమయ్యారో తెలుస్తుంది.

ఏసీ కారవాన్‌లలో సేదతీరే ముదనష్టపు హీరోలు, ముంబై, బెంగాలీ హీరోయిన్లు ఒకవైపు..  మంచినీళ్లకు గతిలేకుండా, బట్టలు మార్చుకోవడానికి కూడా చోటు లేకుండా నట్టెండలో మగ్గుతున్న జూనియర్ ఆర్టిస్టులు. మరొవైపు.. తెలుగు సమాజంలోని వర్గ దోపిడీ మొత్తం ఇక్కడే కనిపిస్తోంది. ఇది సినిమారంగ సమస్య కాదు. ఇది జూనియర్ ఆర్టిస్టుల సమస్య అంతకంటే కాదు. పేదలపై ధనవంతులు, ధనమదాంధుల అడ్డాగా మారిన క్రూర దోపిడీ వ్యవస్థ సమస్యగానే దీన్ని అర్థం చేసుకోవాలి.  ఈ వర్గ పీడనపై మహిళా సంఘాలు చివరిదాకా పోరాడతాయని, జూనియర్ ఆర్టిస్టులకు ఇకనైనా మనుషులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలను సమకూర్చే వ్యవస్థను టాలీవుడ్‌లో నిర్మించే ప్రయత్నం చేస్తాయని ఆశిద్దాం.

జూనియర్ ఆర్టిస్టుల ఆవేదనను, తేజస్విని ఆగ్రహాన్ని కింది లింకులో పూర్తిగా చూడవచ్చు.

They Can't Do One Movie Without Using Women: Feminist Tejaswini 

Wednesday, February 28, 2018

బాత్ టబ్ మరణాలు మనకు లేవు కానీ..

నా చిన్ని జర్నలిస్టు జీవితంలో తొలిసారి నాపై, నా వృత్తిపై సందేహం, అంతకు మించి అసహ్యం కలిగిన క్షణాలివి. మా బాల్యంలో, మా యవ్వనంలో నటన అనే అపురూప కళ ద్వారా మమ్మల్ని చల్లగా పలకరించిన శ్రీదేవితో.. ఇంద్రజగా ఒక లోకోత్తర సౌందర్య పరిమళాన్ని తన కళ్లతో, సాధుత్వంతో ప్రదర్శించిన శ్రీదేవి జీవితంతో, ఆమె కుటుంబంతో గత మూడురోజులుగా ఆడుకున్న మా మీడియాను ఏం చేసినా పాపం పోదన్నదే నా మనోభావం.

ముఖ్యంగా సోషల్ మీడియా 'ముండాకొడుకులు' టీవీ మీడియా రాక్షసోన్మాదులు...  అనూహ్యంగా, అకాలంగా తన బిడ్డలకు, భర్తకు దూరమైన వ్యక్తి జీవితంపై చిలవలు, పలవలు రేపుతూ, క్షణక్షణానికి పుకార్లు రేపుతూ, కథనాలు అల్లుతూ చేసిన బీభత్స ప్రదర్శనలను అంత సులువుగా మర్చిపోవడం కష్టం.

ఆమె ఇక లేరని తెలిసిన క్షణం నుంచి ఆమెను తాగుబోతుగా, డగ్స్ బానిసగా, కాస్మొటిక్ సర్జరీల వ్యామోహంతో చావు కొనితెచ్చుకున్న భ్రష్ట సంజాతురాలిగా కనీ వినీ ఎరుగని పుకార్లను రేపిన నెంబర్ వన్ శత్రువు సోషల్ మీడియా. ఈ క్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌నీ వదలలేదు. ఆమె ప్రాణప్రదంగా ప్రేమించిన కన్నకూతురు జాన్వీని వదల్లేదు.

భర్తే ఏదో చేశాడట. జాన్వీతో గొడవలతో ఆమె సగం అలసిపోయిందట. ఆస్తి గొడవలతో వేసారిపోయిందట. ఇలా అనుమానాలు లేని చోట అనుమానాలు రేపుతూ రావిశాస్త్రి ఓ సందర్భంలో అన్నట్లు... శ్రీదేవినీ, ఆమె కుటుంబాన్ని మూడు రోజుల్లో 300 సార్లయినా చంపేసిన పాపం మన మీడియాదే.

అందుకే మంగళవారం రాత్రి మా పత్రికాఫీసులో పనిచేసుకుంటున్నప్పుడు మాటల మధ్యలో మా కొల్లీగ్స్ చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించాలనిపిస్తోంది. "స్వర్గమనేది నిజంగా ఉంటే, శ్రీదేవి అక్కడికే చేరి ఉంటే, భూమండలంలో భారతీయ మీడియా అనే ఒక వికృత వ్యవస్థ నాపై ఇంత అభాండాలేస్తోందా" అని భోరున విలపిస్తూ ఉంటుందట.

యాభై ఏళ్లు నటన తప్ప మరేమీ మనకివ్వని ఆ అమాయకత్వపు ముగ్ధని, తన జీవితంలో అత్యంత సన్నిహితంగా భాగమై ఉన్నవారిని.. ఇంతగా చెండాడాలా?  చివరకు దుబాయ్ ప్రభుత్వం, దర్యాప్తు శాఖలు కూడా భారత్ మీడియాపై అసహ్యించుకునేంత తారాస్థాయిలో మన మీడియో ప్రచారం, మన హిట్ల యావ చెలరేగిపోయింది.

చివరకు ఇంత జరిగాక, శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరాక కూడా ఆమె మృతి వెనుక మిస్టరీ గురించి మంగళవారం అర్ధరాత్రి కూడా స్క్రోలింగ్‌లు పడుతుంటే, రామ్ గోపాల్ వర్మ స్థాయిలో ఏడ్వాలనిపిస్తోంది.

బాత్‌ టబ్‌లో పొరపాటున పడి మృతి చెంది ఉంటారన్న అంచనాతో కేసు మూసివేసిన దుబాయ్ పోలీసు శాఖ మన మీడియాను పాత చెప్పుతో కొట్టినంత పనిచేసింది.

యూట్యూబ్ తెరిస్తే మలినం. ప్రపంచంమీదే అసహ్యం వేసేంత కారుకూతలు. ఫోటోలు చూపుతూ కంపు కథనాలల్లే రోత బతుకులు...

అమెరికా, యూరప్ ఖండాలను అలా పక్కన బెట్టండి. మన ఖండం లోని జపాన్‌లోనే బాత్ టబ్‌లలో జారిపడి సంవత్సరానికి దాదాపు 20 వేలమంది చనిపోతున్నారని వార్తలు వస్తున్నప్పుడు శ్రీదేవి మరణాన్ని ఒక అత్యంత దురదృష్టకరమైన ప్రమాద ఘటనగా తప్ప మరే రకంగా అయినా ఊహించగలమా?

నిద్రలేచిన వెంటనే ముఖం చన్నీళ్లతో కడుక్కోకుండా బాత్‌రూమ్‌కి వెళితే, ఆ నిద్రమత్తులో తప్పటడుగులు వేసి కూలబడటం, జారటం, మనం జీవితంలో ఎన్నిసార్లు అనుభవించలేదు?

తడిసిన నేలపై కాస్త కాలుజారితే నడుమో, కాళ్లో అమాంతంగా విరిగిపోయి, రోజుల తరబడి మంచానపడే బాధను మన కళ్లముందు ఎందరి జీవితాల్లో మనం చూడలేదు?

ఆమె నడుస్తూ తూలి అలాగే టబ్ లోకి పడిపోయిందో (టీవీ9కి అంతర్జాతీయ అవార్డు ఇచ్చేయాలి)  లేక టబ్‌లో అడుగుపెట్టిన తర్వాత కాలు జారి గభాలున నీళ్లలో మునిగి ఆ భయంతో ఊపిరాడక జీవితం విషాదం ముగించుకుందో ఎవరికి తెలుసు?

ఆకస్మికంగా కింద పడితే, ఏదైనా అనూహ్యమైన వార్తను, దృశ్యాన్ని వింటే, చూస్తే అమాంతం స్పృహ కోల్పోవడం, మరణించడం కూడా  ప్రపంచంలో కొత్త విషయం కాదు కదా.

విదేశాల్లో బాత్ టబ్ మరణాలు మామూలు స్థాయిలో లేవని వేల సంఖ్యలో అవి నమోదవుతున్నాయని అర్థమవుతున్నప్పుడు శ్రీదేవి మరణాన్ని నమ్మశక్యం కానీ విషాద ఘటనగా తప్ప మరొకలా ఎలా ఊహించగలం?

జీవితంలో వైన్ తప్ప ఆమె మరేదీ ముట్టలేదని సన్నిహితులు చెబుతున్నప్పుడు.. అందుకే ఆమె నీళ్లలో పడి చనిపోయిందని అభాండాలు వేస్తే ఏం న్యాయం.. ఏం రాతలివి...

ప్రాణం లేని ఆ కట్టెను సాగనంపాల్సింది ఇలాగేనా? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి తన కష్టంతో, సానపట్టిన ప్రతిభతో అత్యున్నత శిఖర స్థాయిని అందుకున్న ఆ పసిపిల్లను పంపించాల్సింది ఇలాగేనా?

                          ************                      *************

విదేశాల్లో బాత్ టబ్  మరణాలపై ముఖ్య కథనం కింది లింకులో చూడండి.

బాత్‌టబ్‌లో పడితే చనిపోతారా

అలాగే...లోకాన్ని నటనతో మైమరపింప జేసిన శ్రీదేవి వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలపై వర్మ నిజాయితీతో కూడిన అభిప్రాయం కోసం ఇక్కడ చూడండి.

మోసాలు... బాధలు... కన్నీళ్లు! 

శ్రీదేవి జీవితంపై రామ్‌గోపాల్‌ వర్మ కోణం

Sunday, February 18, 2018

'యుద్ధకాలంలో స్వప్నాలు' పుస్తకావిష్కరణ నేడు హైదరాబాద్‌లో


నేను డెవిల్ ఆన్ ది క్రాస్ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్‌ పేపర్ మీద రాసాను. నా మరొక పుస్తకం యుద్ధకాలంలో స్వప్నాలును ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా వుండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి!  - గుగీవా థియోంగీ

సీగుల్ పబ్లిషర్స్ ఆహ్వానంపై ఇండియాకు వస్తున్న సుప్రసిద్ధ కెన్యా రచయిత గూగీవాథియాంగో మలుపుప్రచురణల ఆహ్వానానికి స్పందిస్తూ ఇండియాకు రావాలని ఉత్సుకతతో ఉన్నాను. ఇంక హైదరాబాదుకు రావడమంటే నాకెంతో ఇష్టం. ప్రత్యేకించి ప్రొ.జి.ఎన్.సాయిబాబా అనువదించిన నా బాల్యజ్ఞాపకాలు  యుద్ధకాలంలో స్వప్నాలు’ (Dreams in a Time of War: A Childhood Memoir) పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడమంటే అంతకన్నా ఏంకావాలి. ప్రొఫెసర్ సాయిబాబాను కలిసే అవకాశం ఉంటే ఇంకెంతో బాగుండేదిఅని రాసారు.

గూగీ నవలల్లో ఆఫ్రికా ప్రజలు ద్వేషించే యూరపు వలసవాదుల తర్వాత మనకు కనిపించేది గుజరాతీ వ్యాపారులే. కాని ఆయనకు భారతప్రజల పట్ల వాళ్ల పోరాటాల పట్ల ఎంతో ఆసక్తి ఉంది.

గూగీ మొదటిసారి 1996 ఫిబ్రవరిలో ఎఐపిఆర్‌ఎఫ్ (ఆల్‌ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్) ఆహ్వానంపై ఢిల్లీలో జరిగిన జాతుల సమస్యపై అంతర్జాతీయ సదస్సుకు వచ్చాడు. అక్కడ ఆయన ప్రపంచీకరణ జాతుల సమస్య గురించి చేసిన ప్రసంగానికి సాయిబాబా అధ్యక్షత వహించాడు.

అక్కడినుంచి గూగీ హైదరాబాదు, కాకతీయ యునివర్సిటీ, 1990 వరకు కరీంనగర్ విప్లవోద్యమ అమరుల స్మృతిలో నిర్మించిన హుస్నాబాద్ స్థూపం చూసి తాను అప్పటికే ప్రవాస జీవితం గడుపుతున్న అమెరికాకు వెళ్లిపోయాడు. తన ఇండియా పర్యటన ప్రభావంతోనే విజార్డ్ క్రౌఅనే బృహత్తర నవల రాసాడు. అప్పటినుంచీ ఆయనకు ఇండియా, తెలంగాణ  ఈ దేశంలో, ఈ ప్రాంతంలోని విప్లవోద్యమం, ఇక్కడి జీవితానికి, పోరాటానికి తాను ఎంచుకున్న ఒక సంభాషణ వంటి సాయిబాబాతో గాఢానుబంధం ఏర్పడింది.

గూగీ దంపతులకు హుస్నాబాద్ స్థూపాన్ని చూసిన అనుభవం ఒక అపూర్వ అనుభూతిగా మిగిలింది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ ఎఐఎల్‌ఆర్‌సి (ఆల్ ఇండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్) తరఫున ఎం.టి.ఖాన్ ఏర్పాటుచేసిన రచయితల సదస్సులో ఆ ఇద్దరూ ఆ అనుభవాన్ని ఒక ఈవెంట్ (సంఘటన)గా చెప్పుకున్నారు.

ఈ అనుబంధానికి ఒక కారణముంది. 1946-51 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వలెనే కెన్యాలోనూ వలసవాద విముక్తి పోరాటంలో భాగంగా మౌమౌ ఉద్యమం 1952 నుంచి 62 వరకు సాయుధంగా సాగింది. మరొకవైపు కెన్యాట్టా నాయకత్వంలో జాతివిముక్తి పోరాటం జరిగి 1963లో కెన్యా బ్రిటిష్ వలస నుంచి విముక్తమై జోమో కెన్యాట్టా కెన్యా అధ్యక్షుడయ్యాడు. కాని తన బాల్యంలో తన అన్న స్వయంగా పాల్గొన్న విముక్తిపోరాట లక్ష్యాలయిన భూమి, భుక్తి, సామ్రాజ్యవాద దళారీ దోపిడీ నుంచి ప్రజల స్వేచ్ఛ ఎండమావులే అయ్యాయి. ఈ బాల్య జ్ఞాపకాలే  ముఖ్యంగా తాను 1938లో పుట్టి యుద్ధకాలంలో కన్న కలలే తన ఆత్మకథలోని మొదటిభాగం యుద్ధకాలంలో స్వప్నాలు’.

తెలంగాణ ప్రజల అనుభవం కూడ అదే అయినప్పటికీ కెన్యా ప్రజలకు గూగీకి మౌమౌ పోరాటం ఒక జ్ఞాపకం, ఒక తొణికిన స్వప్నంగా మిగిలిపోతే  తెలంగాణ ప్రజలకు మాత్రం అది గతమే కాకుండా, వర్తమానంగానూ భవిష్యత్‌తో పోరాట సంభాషణగానూ కొనసాగుతున్నది.

గూగీని ఢిల్లీ జాతీయ సదస్సుకు పిలిచిన నవీన్‌బాబు, ఆ తర్వాత కాలంలో విప్లవోద్యమంలో ఎన్‌కౌంటర్‌లో అమరుడయినాడని రాసినపుడైనా, పీపుల్స్‌వార్ కేంద్రకమిటీ సభ్యుల ఎన్‌కౌంటర్ తర్వాత 1999 డిసెంబర్ ఆఖరులో శ్యాం అంతిమయాత్ర ముగిసాక రాజ్యం హుస్నాబాదు స్థూపాన్ని కూల్చేసిందని రాసినా ఆయన ఈ చీకటిమబ్బు అంచున ఎప్పుడూ మీ వర్తమానంలో ఒక మెరుపుతీగ వంటి ఆకాంక్ష, ఆశ మిగిలే ఉంటాయి అని రాసేవాడు. మీకు పోరాటం ఉంటుంది, పోరాటయోధులు అమరులైన జ్ఞాపక చిహ్నాలుంటాయి, అవి తుడిచేసినా వాళ్ల ఆకాంక్షలను జెండాలుగా పూని నడిచే పోరాటం ఉంటుంది అని రాసేవాడు.


మనసును వలసవాదం నుంచి విముక్తం చేయాలని, భాషను ఒక పదునైన అస్త్రంగా, సాహిత్యాన్ని అత్యంత ఆధునిక, సాంకేతిక నైపుణ్యంతో మెత్తటి మట్టిలాగ మార్చగలగాలంటే భాషా సాహిత్యాలు కూడ మానవశ్రమ నుంచి ఉత్పత్తి అయినవేననే ఎరుక కలగాలని ఆయన ఢిల్లీ సదస్సులోనూ, నిజాం కాలెజి సభలోను, చలసాని ప్రసాద్ అధ్యక్షతన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విరసం సభలోనూ  మాట్లాడాడు.

తెలుగు భాషలో వస్తున్న ప్రజా విప్లవ సాహిత్యం తాను నేరుగా గికియు భాషలోకి తీసుకపోగలిగితే ఎంత బాగుండును అని ఆశించాడు. ఈ అవగాహనే ఒక సాంస్కృతిక పోరాటయోధునిగా గూగీని ఒక ప్రజాస్వామిక పోరాయోధుడైన సాయిబాబాతో నిరంతర అనుబంధంలో కొనసాగించింది. గూగీ తన నవలలు, నాటకాలు, ప్రజారంగస్థల నిర్మాణం వలన కెన్యాలోని నియంతలకు కన్నెర్ర అయి 1978-79 కెన్యా ఆత్యయికస్థితి కాలంలో జైలుపాలయినట్లుగానే సాయిబాబా తన గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాటం వలన జైలుపాలయ్యాడు. యావజ్జీవ కారాగార శిక్ష విధింపుకు ముందు బెయిలుపై విడుదల కావడానికన్న ముందే నాగపూర్ హై సెక్యూరిటీ జైల్లోని అండా సెల్‌లోనే గూగీ ఆత్మకథను తెలుగు చేసాడు.

‘‘అది అక్షరాలా ఒక యుద్ధకాలంలో పుట్టిన శిశువు స్వప్నాలకు ఒక యుద్ధఖైదీ చేసిన అనుసృజన. ప్రొఫెసర్ సాయిబాబా దీన్ని అనువదించడం నాకు చాల సంతోషం  1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో కలిసినపుడు కష్టజీవి సాయిబాబాతో నా కలయిక జ్ఞాపకాలను నేనెన్నటికీ మరచిపోలేను. హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో అనుకోకుండా దొరికిన నా పుస్తకం డెవిల్ ఆన్ ది క్రాస్ తన జీవితం మీద ఎంత ప్రభావం వేసిందో ఆయన చెప్పడం నాకింకా గుర్తుంది. నేను ఆ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్‌ పేపర్ మీద రాసాను. నా సాంస్కృతిక కార్యాచరణ వల్ల ముఖ్యంగా కెన్యాలోని కామిరితు గ్రామంలో రైతులు, కార్మికులు, తమ భాషలో తమ పోరాటాల గురించి చెప్పే తమ సొంత నాటకరంగాన్ని సృష్టించాలని చేసిన ప్రయత్నానికి సహకరించినందువల్ల నన్ను జైలులో పెట్టారు. నా పుస్తకాల్లో మరొకదాన్ని (యుద్ధకాలంలో స్వప్నాలు) అదే సాయిబాబా మహారాష్ట్రలోని నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా వుండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి! దుర్భరమైన పరిస్థితులో అనువాదం చేయడం! ఆయన తన జీవిత, సాంస్కృతిక కార్యాచరణ కోసం జైలుజీవితం గడుపుతున్నాడంటే నాకు ఆయనతో ఇప్పుడు, మరొకసారి, ఒక ప్రత్యేకమైన బంధం ఉందనిపిస్తుంది.’’

ఆ బంధం వల్లనే, ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా అతని సహచర ఖైదీల విడుదల కోసం, రాజకీయ ఖైదీల విడుదల కోసం, జైళ్లు, నిర్బంధాలు లేని, అణచివేత దోపిడీ పీడనా లేని వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘీభావ, ప్రజాస్వామిక పోరాటంలో తన వంతు కర్తవ్యంగా గూగీ వా థియాంగో ఈ ఫిబ్రవరి 18న జిఎన్ సాయిబాబా అనువదించిన తన పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడానికి హైదరాబాదుకు వస్తున్నాడు. కాని మన మధ్యన మన భాషలో గూగీ యుద్ధకాలపు బాల్యజ్ఞాపకాలు వివరించిన సాయిబాబా ఉండకపోవచ్చు. తానాశించినట్లుగా నాగపూర్‌కు వెళ్లి గూగీ సాయిబాబాను కలుసుకోలేక పోవచ్చు. కాని ఇప్పటికి ఇరువురి భావజాలంతో పెనవేసుకొని సుదృఢమవుతున్న మన స్వేచ్ఛాకాంక్షల్ని పంచుకోవడానికి ఒక సాహిత్య, సాంస్కృతిక పోరాట సాయంత్రం కలుసుకుందాం.

ముఖ్యంగా ఈ బాధ్యత మనపై ఎందుకుందో తాను జైలులో బందీ అయిన రోజుల్లోనే 1978లో, కార్ల్‌మార్క్స్ మాటల్లో చెప్పాడు. అవి కార్ల్‌మార్క్స్ చెప్పినవి కూడ కాదు. ఆయనకు ఒక కార్మిక ప్రతినిధి రాసినవి. కార్ల్‌మార్క్స్ 25 ఆగస్టు 1852 న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు చేసిన రచనలో ఉల్లేఖించాడు.

‘‘నేను నీ హక్కుల్ని విస్తృతపరచడానికి ప్రయత్నించాను. కాబట్టే నా హక్కుల్ని హరించారు. మీ అందరికోసం స్వేచ్ఛామందిరాన్ని నిర్మించాలని ప్రయత్నించాను. కాబట్టే నన్నొక హంతకుని జైల్లోని సెల్‌లోకి తోసేసారు.... నేను సత్యానికి స్వరాన్ని అందించడానికి ప్రయత్నించాను. కాబట్టి నన్ను నిశ్శబ్దంలోకి తోసివేశారు.....జైల్లో ఒంటరి నిర్బంధంలో నిశ్శబ్ద వ్యవస్థలో ఉంచారు. నువ్వు ఇది ప్రజా సంబంధమైన సమస్య కాదనవచ్చు. కాని ఇది అయితీరుతుంది. ఎందుకంటే ఖైదీ భార్య గురించి పట్టించుకోని మనిషి కార్మికుని భార్య గురించి కూడ పట్టించుకోడు. బంధితుని పిల్లల గురించి వ్యగ్రత చూపనివాడు శ్రామిక సేవకుని పిల్లల గురించి కూడ వ్యగ్రత చూపడు. అందువల్ల ఇది ప్రజాసమస్య.

(గూగీ వాథియాంగో జైలు డైరీ బందీ  జైలు నోట్స్ నుంచి)

(ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అనువదించిన గూగీ వా థియాంగో యుద్ధకాలంలో స్వప్నాలుపుస్తకావిష్కరణ ఫిబ్రవరి 18 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరగనుంది. అందరూ ఆహ్వానితులే)
వరవరరావు
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు

గమనిక: ఇది 17-02-2018 సాక్షి సంపాదక పేజీలో ప్రచురితమైన వరవరరావు గారి రచనకు పూర్తి పాఠం. ఈ బ్లాగులో ప్రచురణకు అనుమతించినందుకు ఆయనకు ధన్యవాదాలు.

వలసవాద విముక్తి గీతం గూగీFriday, January 19, 2018

కొత్త రాష్ట్రంలో తెలంగాణా విస్మృత అధ్యాయమేనా?

తెలంగాణలో కవులు, రచయితలు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రభుత్వానికి అమ్ముడుపోయారని, అవార్డులకోసం, రివార్డుల కోసం, శాలువాల కోసం కవులు, రచయితలు ప్రభుత్వం ముందు సాగిలపడిన ఇంత సాంస్కృతిక దిగజారుడుతనాన్ని ఏనాడూ చూడలేదని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారాతెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్ తిరుమలరావు గారు ఇది నిజమే అని ఢంకా భజాయించి చెబుతున్నారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే...

ప్రభుత్వంశాలువాలు కప్పుకున్న గాయకులుకవుల్ని చూసి ‘‘నాభిల సల్ల పడ్డరు ఇక నవాబుకి జవాబేమిస్తరు’’ కలాలు నిస్సిగ్గుగా తల వంచాయి. వీరు నిజానికి నియ్యత్ లేని నిప్పులే’  కాని చెద పట్టిన నిప్పులు అయ్యారని భావిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే ఏమి కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యం అయ్యాయి. రోశాల పాటగాడికి వేశాలు మెండు’ అనే సామెత నిజం అయ్యిందని బాధ పడుతున్నారు. ఆనాడు పాటలు పాడినవారుఆటలు ఆడిన వాళ్ళని చూసి ఎకెసక్కాలాడుతుండ్రు. ప్రజల సాంస్కృతిక చరిత్రలో ఇంత దిగజారుడుతనాన్ని ఏనాడు చూడలేదని ఒకటే బాధ. వీళ్ళ లాంటి వారిని చూసి నమ్మదినికడపటనెనరు లేదన్నరట’ అలాంటి వారు ఈ కవులు అని చెవులు కొరుక్కుంటున్నరు. ఈ కవులను చూశాక పిట్టల దొరలు అంతరించి పోయారు. కాని కొత్త దొరలు ఈ కొత్త పిట్టలదొరలను సృష్టించుకున్నారని అంటున్నారు. నక్క సుట్టు నాలుగు గుడ్డి దీపాలు’. ఆ నక్కప్రజలకు చెబుతున్నదేంటే లోకమంతా వెలుగులే’ నమ్మండి అని. సుక్క నూనె లేదు. వెయ్యి దీపాలు వెలిగిస్తా’ నని హెచ్చులు పోయేవారిని ఎగతాళి పట్టిస్తున్నారు. ఈ భాష పాలకులకి వినరావడం లేదు. ఇది తరతరాల ప్రతిఘటన భాష.

జయధీర్ తిరుమల రావుగారి రచన సంక్షిప్తపాఠం సాక్షి నేటి సంచిక -19-01-2018-లో అలసిన తెలంగాణ ఆకాంక్షలు పేరట ప్రచురితమైనది. సాహిత్య అకాడెమీలకు, బీసీ కమీషన్లకు, కాసిన్ని కాసులకు, దుశ్శాలువలకు తెలంగాణ రచయితలు ఇంతగా అమ్ముడుపోతారా, అమ్ముడు పోవాలా అంటూ జనం ఘోష సాక్షిగా జయధీర్ తిరుమల రావు గారు రాసిన రచనకున్న చారిత్రక ప్రాధాన్యత రీత్యా దాని పూర్తి పాఠాన్ని అధ్యయనం, అవగాహన కోసం ఈ బ్లాగులో ప్రచురిస్తున్నాను. తెలంగాణ జనజీవితంలోంచి ఊరి వచ్చిన సామెతల నిసర్గ సౌందర్యాన్ని జయధీర్ గారు రాసిన కింది వ్యాసంలో విస్తృతంగా చూడవచ్చు.

కొత్త రాష్ట్రంలో తెలంగాణా విస్మృత అధ్యాయమేనా?
మూడున్నరేళ్ళ కాలంలో తెలంగాణఎంత వెలిగిందో తేటతెల్లంగా మాట్లాడుకోలేకపోయాం. ఎవరు, ఏది మాట్లాడినా తెలంగాణా వ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారు. ప్రతిపక్షం అని నిందించడం మామూలైంది. లేదా ఎవరో ఒకరితో ఖండింపచేయడం ఆనవాయితిగా మారింది. నిజానికి ఆనాడు తెలంగాణ సాధన అవసరం ఏమిటి? రాష్ట్రం వచ్చాక ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తీరాయా లేదా మరింతగా వాటి ప్రాసంగికత సంతరించుకుందా అని ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది.

ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నా అక్కడ ప్రజలువ్యతిరేకించలేదు. కొద్దిమంది పెట్టుబడిదారులు తప్ప. తెలంగాణా ప్రజలు మూకుమ్మడిగా మలిదశలో రెండు దశాబ్దాలుగా నిరవధికంగా ఉద్యమాలు చేశారు. నాటినుండి రాష్ట్రం సిద్ధించే వరకు ఒకే ఆశ. ఒకే ఆశయం. ఒకే క్రమశిక్షణ. పాలకులు ప్రజల ఓపిక తాడు తెంపినప్పుడు మాత్రమే ధర్మాగ్రహం పెచ్చుపెరిగింది. సాగరహారం, రాష్ట్రవ్యాప్త బందులు, ఊరూరా ధర్నాలు, ఊరేగింపులు ఉధృతంగా జరిగాయి.

ఈ ఉద్యమానికి నిరుద్యోగులు, యువకులు, వర్శిటీ విద్యార్థులు, రైతాంగం, అధికార వ్యవస్థలని ఎదిరించిన కవులు, రచయితలు, మేధావులు ఒక్కొక్కరే రంగప్రవేశం చేశారు. ఆ తరువాతే రాజకీయ నాయకులు కళ్ళు తెరిచారు. తెరాస పార్టీ ఆవిర్భవించింది.

ఉద్యోగాలు, అన్ని రంగాలలో వాటా, మూసివేసిన మిల్లులు, ఫాక్టరీలు తెరవడం, సాంస్కృతిక సంపద పరిరక్షణ, కరుడుగట్టిన దళారి పాత్ర వ్యతిరేకత, తెలంగాణా ఆత్మగౌరవ భావన, విద్య, భాష, సాహిత్య, సాంస్కృతిక, పరిశోధన రంగాలలో జరిగిన అవమానం, అన్యాయం ఉద్యమానికి ముఖ్య కారణాలు. ఐతే రాష్ట్రం వచ్చాక ప్రజల ఆకాంక్షల్ని పక్కన పెట్టి తెరాస అధినాయకుల అభీష్టాలకోసం, ప్రయోజనాల కోసమే పాలన ఆరంభమైంది. ఇప్పటివరకు అదే రీతిలో ఆగకుండా కొనసాగుతున్నది.

ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే ఇప్పుడిక తెరాస ఉద్యమ పార్టీ కాదు అని ప్రకటించారు. గద్దెనెక్కింది మాత్రం ఉద్యమ పార్టీగానే. అన్ని బూర్జువా పార్టీలలాగే ఎన్నికల పార్టీ అనే సంకేతం ఇచ్చారు. అన్ని పార్టీలు లోగడ తెలంగాణ ప్రజలను వంచించిన విధంగానే, ఆ పార్టీలు ప్రవర్తించిన రీతిలోనే తెరాస ఉంటుందని వారి భావనేమో.

ఈ ప్రకటన వెలువడినప్పుడే ప్రజల నుంచి, ఉద్యమకారుల నుంచి పెద్ద ఎత్తున ప్రతిస్పందన రావలసింది. అందుకు వ్యతిరేకంగా పోరాటం జరగవలసి ఉండింది. మావోయిస్టు ఎజండా మా ఎజండా అని ప్రకటించిన అధినాయకుల ప్రకటన ఆంతర్యాన్ని బట్టబయలు చేయవలసి ఉండింది. కాని ఎందుచేతనో దాని గురించి సీరియస్‌గా ఆలోచించలేదు. అదిగో! అప్పటి నుండే తెలంగాణ ప్రజల వాంఛలకు, బతుకులకు వ్యతిరేక దిశలో పాలన మొదలైంది. ఎన్నికల ప్రణాళికలో ఉంచిన ప్రధానమైన అంశాలు పక్కన పడినాయి. అవి కేవలం సైనుబోర్డులకి, ఫ్లెక్సీలకి, పత్రికలలో పేజీల నిండా ప్రకటనలకి, రంగు రంగుల కరపత్రాల ప్రచారానికే ఎక్కువ పరిమితం అయ్యింది.

ఆ వెంటనే రాష్ట్రంలో ప్రజావ్యతిరేక భూసామ్య పెత్తందారీ విధానం అమలులోకి వచ్చింది. బ్రాహ్మణ, పాలకవర్గాలకి ఇచ్చిన ప్రాధాన్యతలో పది శాతం కూడా కింది వర్గాలకి ఇవ్వలేదు. ముఖ్యమంత్రి చుట్టూరా ఆ శక్తులే ఎక్కువగా మోహరించాయి. చండీయాగం తరువాత ఈ సంస్కృతికి రాష్ట్రమంతా ద్వారాలు తెరుచుకున్నాయి. ఇరవై శాతం పాలక వర్గాల ప్రయోజనాల ముందు ఎనభైశాతం ప్రజల మత సాంస్కృతిక సాహిత్య చరిత్రలు దిగదుడుపు అయ్యాయి. దీనిని కప్పి పుచ్చడానికి కొత్తగా, కులాలవారిగా, మతాలవారిగా పథకాలకు రూపకల్పన చేశారు. దీనిని గమనించిన ప్రజలు ఇలా అనుకున్నారు.

గురిజెత్తు బంగారం చూపి మణుగెత్తు మరకతం ఇస్తాఅన్నాడనే సామెత గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందంటూనే ప్రపంచ బ్యాంకు నుండి లక్షల కోట్ల అప్పు తీసుకోవడం, ప్రజలపై ప్రత్యక్షంగా భారం వేయడమే. వచ్చేవి తొంభైఆరు ఇచ్చేవి లెక్క తీయంగ ఆరేఅనే సూక్తి ఇందుకోసమే పుట్టింది. వరిగడ్డి మంట పెట్టి ఏడాది పొడుగు దీపాల వెలుగుఅనే సామెత ఇలాంటి ప్రభువులను చూసే ఆనాడు పుట్టి ఉంటుంది. ఈనాడు దానిని సందర్భోచితంగా గుర్తు చేసుకుంటున్నారు.

ఎక్కడా, ఏ రూపంలోనూ ఆలనలో, పాలనలో తెలంగాణ మాట లేదు. ముచ్చట లేదు. అధినాయకుల కీర్తనే. జై తెలంగాణఅని ఎవరూ నినదించడం లేదు. తెలంగాణా ఆత్మాభిమానం తాకట్టు పెట్టి వందకోట్లతో తెలుగుకు తారాజువ్వల వెలుగులు అద్దారు. ఆనాటి ఉద్యమ భావనలకు ఇలాంటి కార్యక్రమాలు విరుద్ధం. విచారం పెద్ద, విత్తులు తాలుఅనే నానుడిని ప్రజలు ఈ సందర్భంగా వాడుకుంటున్నారు.

కేవలం పదిమందికే ప్రయోజనం దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. అధినాయకుని గడీలోని వారికే సంతసం. మిగతా వారంతా డమ్మీలే. ఎన్నో ఏళ్ళుగా ఉద్యమం చేసిన అమాత్యులకి, ఎమ్మెల్లేలకి, నాయకులకి సరైన గౌరవం ఏ రూపంలోనూ ఇవ్వడం లేదని ప్రజలకి అర్థమైంది. రాష్ట్ర ఆదాయంలో ప్రజలకి ప్రత్యక్షంగా దక్కేదెంత అనే ఆలోచన బంగారం నడుం బంటి ఉంది. సింగారం మాత్రం చెప్పులెత్తు లేదుఅనీ, ‘రాజులు పెరిగిండ్రు. జనాలు తరిగిండ్రుఅని తలసరి ఆదాయం పెరగవలసిన పేద ప్రజలు ఆర్థిక భారంతో బతకలేక కుంగిపోతున్నారు.

ఎందుకోగాని సంకల తెలంగాణా పెట్టుకుని ఎక్కడెక్కడో వెతుకులాడుతున్నామని అనుకుంటే తప్పనిపించడం లేదు. దేశానికే తలమానికమైన రామప్ప, గణపురం, వరంగల్ కోట, హనుమకొండ వంటి అనేక శిథిల శిల్ప కళా ఖండాల పరిరక్షణ ఊసలేదు. వాటి పరిస్థితి రోజు రోజుకు దిగజారి పోతున్నది. సున్నకు సున్నా. హళ్ళికి హళ్ళి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. ఇప్పుడు గొర్రెలకు, మనుషలకు తేడా లేదు. తెలంగాణాలో పేరు పెరుమాళ్ళది. ఆరగింపు మాత్రం అయ్యగార్లదే’  లాగా, ‘పులగం పెడుతానన్న దొర సొట్ట గిన్నె కూడ లాక్కు పోయిండన్నచందంగా మారిపోయింది. లెక్కలు చెప్పుతున్నరు. చుక్కలు చూపిస్తున్నరుఅంతా టక్కరితనమే. పాత దొరలందరు నేతలైండ్రు. ఆనాడు జెండ పాతిన చెలకలన్ని దొరలకు చేరుతున్నాయి. అంటరానోళ్ళకు మూడెకరాల భూమి ఆశ చూపి, అడియాస చేసిండ్రు.

పత్తి గింజల్ని ముత్యాలు చేసిండ్రు, ముడుపులు చెల్లించి మళ్ళీ వాటిని కొనుక్కొంటున్నరుఅన్న చందాన భూ పందేరం ఉంది. పండుగైనంక ఇల్లు పడావు పడినట్లున్నదిఇప్పుడు తెలంగాణ! ఐతే ఈ విషయం పాలకులు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ధగ ధగల సైనుబోర్డుల వెలుగులే సత్యమని నిత్యమని నమ్ముతున్నారు. మేడిపండు చూడ.... వేమన పద్యం తప్పు అని పద్యాల మాస్టరు నిరూపిస్తున్నారు. ఆనాడు ఈనాడు ఎక్కువ మాటలు చెప్పినోడు ఊరికి పెద్ద’. పాత వ్యవస్థకు కొత్త ప్రాణం. ఇప్పుడు కూడా తక్కువ తిన్నోడు గడిల వెట్టి వంతులోడుఅయ్యిండు. బావిల పడ్డోన్ని తీయడానికి బంగారు తంతెలు పరుస్తారటపాలకులు. ఇదీ ఇవ్వాళ బంగారు తెలంగాణ బతుకు. తిన్నమ్మకు తిన్నంత’. బోడితలకు మొట్టికాయలేమిగులుతాయి. కాని ఆ బోడి తలలే ఆనాడు నైజాం కిరీటాన్ని, దేశముఖుల హోదాలని, దొరల గడీలను కూల్చివేశారు.

ఇప్పుడు తెలంగాణ ప్రజల మనసులు బాగోలేవు. అందుకే పాత నానుడులు, జాతీయాలు, సామెతల వాడుక మెల్లి మెల్లిగా మొదలైంది. ఒక కొత్త విచారధార వారి పదాల్లో తొంగి చూస్తోంది.

మాకు మా అసలు తెలంగాణ, కోరిన తెలంగాణ రాలేదు. వచ్చిన తెలంగాణా ఆత్మరహిత తెలంగాణ. నిర్జీవ తెలంగాణ. తెలంగాణ జీవ ధాతువులకి గుర్తింపు లేని తెలంగాణ. ప్రజల అస్తిత్వం, కాంతి లేని రోల్డు గోల్డు తెలంగాణ వచ్చింది. వచ్చింది పాలకవర్గాల తెలంగాణే. ఇది ప్రజలు ఊహించని పరిణామం. పైగా తెలంగాణా తల్లికి గౌరవం లభించడం లేదనే ఆలోచన అంతటా పెరిగింది. మళ్ళీ ఒక పోరాటం చేయాలెఅని నిర్ధారించుకున్న శబ్దం వినవస్తోంది. తెలంగాణ ఉద్యమం కొనసాగాలనే ఆలోచన విస్తరిస్తుంది.

ఇప్పుడు ప్రతి మాటకు, ప్రతి ప్రజల ఆటకు, సభలో జై తెలంగాణనినాదం మారుమోగాలని ఆలోచిస్తున్నారు. సద్ది తిన్న రేవుని తలవనివారికి బుద్ధి చెప్పాలని యోచన చేస్తున్నారు. తియ్యటి మాటలకు తీర్థం పోతే వాడు (గడీలనో), గుడిలోనో నేను మాత్రం చలిలోఅనే సామెత నిజం చేసినందుకు పాలకుల స్వభావాన్ని అభినందించాలి. చెప్పింది దండి  చేసింది మొండిఅని ప్రభుత్వానికి తెలిసినా దానిని వాళ్ళు ఒప్పుకోరు. ప్రజలు మాత్రం దొప్పెడు అంబలి కోసం, దోసి అంబలి పారబోసుకున్నారు’. మరోసారి తెలంగాణ ప్రజలు, తెలంగాణా పేర ఏర్పడిన పార్టీ, ప్రభుత్వం చేతిలో ఓడిపోయినట్లుగానే లెక్కిస్తున్నారు. ఇంతటి దుర్గతిలో కూడా ప్రస్తుత పాలకవర్గాలకి, పార్టీలకి ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నారు. మళ్ళీ ఎవరు తెలంగాణ అంటారో వారికి మద్దతు ఇస్తాం. మోసపోకుండా జాగ్రత్త తీసుకోవడం ఎలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు.

వచ్చిన భౌగోళిక సరిహద్దుల్లోనే తమ నూతన విజయం దాగుంది. దానిని ఇప్పుడు ఎనభై శాతం ప్రజలకి ఎలా వర్తింపచేయగలం అని ఆలోచిస్తున్నారు. కాని ప్రభుత్వం, శాలువాలు కప్పుకున్న గాయకులు, కవుల్ని చూసి ‘‘నాభిల సల్ల పడ్డరు ఇక నవాబుకి జవాబేమిస్తరు’’ కలాలు నిస్సిగ్గుగా తల వంచాయి. వీరు నిజానికి నియ్యత్ లేని నిప్పులే’  కాని చెద పట్టిన నిప్పులు అయ్యారని భావిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే ఏమి కవులకి తమ ఎండిన పూదండల గుబాళింపులే ముఖ్యం అయ్యాయి. రోశాల పాటగాడికి వేశాలు మెండుఅనే సామెత నిజం అయ్యిందని బాధ పడుతున్నారు. ఆనాడు పాటలు పాడినవారు, ఆటలు ఆడిన వాళ్ళని చూసి ఎకెసక్కాలాడుతుండ్రు. ప్రజల సాంస్కృతిక చరిత్రలో ఇంత దిగజారుడుతనాన్ని ఏనాడు చూడలేదని ఒకటే బాధ. వీళ్ళ లాంటి వారిని చూసి నమ్మదిని, కడపట, నెనరు లేదన్నరటఅలాంటి వారు ఈ కవులు అని చెవులు కొరుక్కుంటున్నరు. ఈ కవులను చూశాక పిట్టల దొరలు అంతరించి పోయారు. కాని కొత్త దొరలు ఈ కొత్త పిట్టలదొరలను సృష్టించుకున్నారని అంటున్నారు. నక్క సుట్టు నాలుగు గుడ్డి దీపాలు’. ఆ నక్క, ప్రజలకు చెబుతున్నదేంటే లోకమంతా వెలుగులేనమ్మండి అని. సుక్క నూనె లేదు. వెయ్యి దీపాలు వెలిగిస్తానని హెచ్చులు పోయేవారిని ఎగతాళి పట్టిస్తున్నారు. ఈ భాష పాలకులకి వినరావడం లేదు. ఇది తరతరాల ప్రతిఘటన భాష.

ఇప్పుడు, తెలంగాణా ఆత్మ, నాలుగు కోట్ల ప్రజల గుండెలను తట్టి లేపుతున్నది. నక్కను తొక్కి వచ్చినవాడికి శత్రువు ఆ నక్కే. నక్క జిత్తులు ఎన్ని వేసినా నక్కలకి తెలిసిపోతుంది. ఇవి విశ్వాసపాత్రమైన కుక్కల్ని చూసి పారిపోక తప్పదు. సీమాంధ్ర నాయకులను ఎంత రాపాడారో ఈ కవులు మరిచి పోయారు. ఇప్పుడు ఆంధ్రపాలకుల కన్నా అన్నింటిలోనూ ఒక ఆకు ఎక్కువే చదివిన వాళ్ళని చూసి దండం దొరా! అని పక్కకి తప్పుకుంటున్నారు. కాని వారిని వదలకుండా పాత బాకీతే! అంటున్నారు.

ఉమ్మడి పాలనలో మిస్అయిన సన్మానం, ప్రతి శాలువ తనకే కావాలని సర్కారీ కవులు కంకణబద్దులయ్యారు.  ఈ మూడున్నరేళ్ళలో కవుల మతలబు ఏమిటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నాలిక మీద ప్రేమ. నాభి కాడ కోపంకలిగిన పాలకుల అసలు స్వభావం అర్థం చేసుకున్నారు. గాచారం దప్పి గడీలకు పోతే ఆచారం దప్పక అణగబెట్టిండ్రటఇలాంటి వ్యవస్థని నిరాకరించిన తెలంగాణా ప్రజలు నాటిని గుర్తు తెచ్చుకుంటూ నేటి ప్రతిఫలనాలను లోతుగా అర్థం చేసుకుంటున్నారు. తొండకు దొరతనమిస్తే ప్రహరి గోడ మీద సవారి చేసిందనే నానుడిని, ‘ఊసరవెల్లి అసలు రంగు మోసమేఅని తెల్లంగా గ్రహించారు.

దూరపోని (సీమాంధ్రుల) మీద దుంకులాడి తనవాడి (తెలంగాణ ప్రజల) మీద నిప్పులు పోస్తున్నవైనం చూస్తున్నరు. తెగిన బొక్కెన ఎక్కడి వరకే అంటే, నూతిల దాకనేకదా అని చెప్పిన సత్యాన్ని అర్థం చేసుకున్నారు. అంతే సులువుగా తమ ఆగ్రహావేశాలను నుడికారాలలోంచి వెళ్ళగక్కుతున్నారు. ఇప్పుడు పాటలు, కళారూపాలు కాదు. ధూం ధాంలు అసలే కాదు. మాటలను, శబ్దాలను ఉద్యమం తెలంగాణలో జరగవలసినవి తక్కువ జరిగాయి. జరగకూడనివి అతి ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిమధ్య సమతౌల్యత లేని కారణంగా తెలంగాణాలో అనిశ్చిత వాతావరణం నెలకొంది. అశాంతి గాలులు వీస్తున్నాయి. ఇవి ఈ ఏడాది చలి గాడ్పులకన్నా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ఈ వాతావరణంలో మరోసారి తెలంగాణా ఉద్యమ ఉష్ణోగ్రతలో ప్రజలు సేద దీరాలనుకుంటున్నారు!

ఇప్పుడు ఏ పార్టీ, ఏ పంథా అయినా మరోసారి తెలంగాణకు సైఅంటుందో వారికే ఇక్కడ భవిష్యత్తు ఉంది. మార్క్సిస్టు పార్టీ తన గత పాత్రకి అపాలజీ చెప్పి తెలంగాణాకి అంకితం కావాలి. అప్పుడు పోషించని పాత్రని ఇప్పుడు త్యాగాలతో పూర్తి చేయాలి. ఎన్నికలు ముఖ్యంకాదు. తెలంగాణా ప్రజల పూర్తి కాని ఆకాంక్షలే ప్రధానం. కాంగ్రెస్ పార్టీ పోరాడకుండానే కేవలం పార్లమెంటరీ పోరాటం ద్వారా తెలంగాణాకి మార్గం వేశారు. కాని ఇప్పుడు అధికారం కోసం రాజకీయాలు ఆపి పరిపూర్ణ తెలంగాణా కోసం పోరాడాలి. జైళ్ళకైనా వారు వెళ్ళగలగాలి. తమ నిజాయితిని చూపగలగాలి. రెండు కళ్ళ దృష్టిని ఒకే చూపుగా మార్చుకుని టీడీపి పార్టీ పాప ప్రక్షాళన చేసుకోవాలి. పసుపురంగుని తెలంగాణా ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంగా మలచుకోవాలి. వరంగల్‌లో ఇరవై ఏళ్ళ కింద డిక్లేరేషన్ కాదు. ఇవ్వాళ తెలంగాణ మూడున్నరేళ్ళలో బలపడాల్సిన వాళ్ళు బలహీనం కావడానికి తెలంగాణా గౌరవాన్ని విస్మరించి, పాలక వర్గాల పాచికలో పడిపోలేదని ఎలుగెత్తాలి. బడుగు జనాల పోరాటానికి, ఓ మెట్టు కిందకు దిగి ప్రజలతో కలసి మమేకం కావాలి. జేఏసీలు వేసిన పప్పులో కాళ్ళని బయట పడేసుకుని ఆత్మ విమర్శ చేసుకుని సరిదిద్దుకోవాలి. ఎందుకు తాము బలహీన పడినామని తమలోకి చూసుకోవాలి. ఎవరినీ కలుపుకుని పోని విధానాన్ని తప్పుగా ఒప్పుకోవాలి.

అందరూ అంతో ఇంతో ఎంతో చేశారు. కాని అది సరిపోలేదు. ఈనగాచి పందులకు పెట్టినట్లుఆనే సామెతలా కాకుండా శ్రమ జీవులకు రాజ్యాధికారాన్ని కట్టబెట్టడానికి కొత్తగా ఆలోచించాలి.

నూతిలో తుపాకి గుండేసి తూటు చూపియ్యి అన్నాడటవెనకటికో దొరగారు. ఆనాటికది సామెత! నేడు ప్రజలు తమ గుండెలు విప్పి చూపి అన్నీ తూటులే అని అంటున్నారు. మా ఊరి దొరగారి బర్రె కొమ్ములకు మా మంచి బంగారి నిగనిగలుఅని ఇప్పుడు ప్రజలు చంకలు గుద్దుకోవడం లేదు. తెలంగాణాలో బంగారం అంతా ఎక్కడ ఎక్కువగా కుప్ప కూడుతున్నదో కళ్ళు విప్పి చూస్తున్నారు. లెక్కలు కడుతున్నారు. మొలిచే కొమ్ములను వంచడానికి మార్గం వెదుకుతున్నారు. చల్లబడిన సిద్ధాంతాలను పెనం మీద కాదు, అగ్గి కొలిమిని రాజేసి పరీక్షిస్తున్నారు. వేశాలు దొరలవి రోశాలు కావుఅవి దోపిడి మార్గాలు అని నిరూపించ దలిచారు. నియ్యత్ లేని దొర పాలనలో బర్కత్ లేని ప్రజ’  ఉన్నంతకాలం మళ్ళీ మళ్ళీ తెలంగాణ పోరాటం అన్ని శక్తులను కలుపుకొని కొత్త పల్లవి అందుకుంటుంది.

తెలంగాణ ఉద్యమం గతం కాదు. అది రేపులో కదలాడుతున్నది.

గురిజెత్తు ఆశయం, గురి చూసి కొట్టే అమ్ముల పొదిలా ఉంది పరిస్థితి. తెలంగాణా ఎన్నడూ పాలకులకు సింహస్వప్నమే. అసలు సిసలు తెలంగాణా సాధన కోసం ఉద్యమం కొనసాగింపు దిశగా కదులుతుందా?

జయధీర్ తిరుమలరావు
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు
మొబైల్ : 99519 42242

సాక్షి పత్రికలో వచ్చిన సంక్షిప్త పాఠం కింది లింకులో చూడవచ్చు.

అలసిన తెలంగాణ ఆకాంక్షలు
https://www.sakshi.com/news/guest-columns/desires-weary-telangana-972139