Sunday, February 28, 2016

న్యాయం లభించని నేలపై నిరసన కూడా నేరమేనా?

(జేఎన్‌‍యూలో దేశద్రోహ చర్యలు జరిగిపోతున్నాయంటూ ఆరోపణలు, చర్యలు మొదలైన తొలి రోజుల్లోనే ఫిబ్రవరి 14న ఆ ఘటనలపై స్పందిస్తూ ప్రముఖ కాలమిస్టు ఆకార్ పటేల్ రాసిన కథనం ఇక్కడ పోస్ట్ చేయడమైంది. ఈ సమస్యను మరింత ఓపికతో అర్థం చేసుకుని ఉంటే బాగుండేదనేది వ్యాసకర్త ప్రధాన అభిప్రాయం.)

మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ 1931 అక్టోబర్‌లో అంబేడ్కర్ గురించి మాట్లాడుతూ, ‘‘కటువుగా, దూకుడుగా ఉండటానికి ఆయనకు పూర్తి హక్కు ఉంది. కానీ మన తలలు బద్దలు చేయకుండా ఆయన తన్ను తాను నియంత్రించుకున్నారు’’ అన్నారు. తనపై, తన కమ్యూనిటీపై జరుగుతున్న  దౌర్జన్యాలపై అంబేద్కర్ తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో గాంధీ అలా అన్నారు. తాను ఉపయోగిస్తున్న పదాల విషయంలో అంబేద్కర్ చాలా కఠినంగా ఉంటారని ప్రతీతి.

ఇప్పుడు మరొక కళాశాలలో జరిగిన నిరసన కార్యక్రమం పాలక పార్టీ ఆగ్రహాన్ని చవిచూడటం గురించి నేను ఆలోచిస్తున్నాను. అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నిరసన తెలిపిన విద్యార్థులపై ఢిల్లీలో పోలీసులు దేశద్రోహ ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ‘తమ ప్రభుత్వంపై ప్రజలు అవిధేయత ప్రకటించేలా మాట్లాడటం, రాయడం లేదా వారిని ప్రోత్సహించేలా ఏవైనా చర్యలు చేపట్టడం ద్వారా చేసే నేరమే’ దేశద్రోహం అంటున్నారు.

విద్యార్థులను రాజ్యాంగ వ్యతిరేకులుగా, జాతి వ్యతిరేకులుగా పేర్కొంటూ తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ మనీష్ గిర్రీ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ‘అలాంటి అవమానకరమైన, దేశ వ్యతిరేక చర్యలు పునరావృతం కాకుండా ఈ నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్య తీసుకోవాల’ని కోరుతూ గిర్రీ.. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీలకు ఉత్తరం రాశారు.

యాకుబ్ మెమొన్‌ను ఉరితీయడంపై హైదరాబాద్‌లో నిరసన తెలిపిన విద్యార్థులపై బీజేపీ కఠినంగా వ్యవహరించిన ఘటన ఢిల్లీలో పునరావృతమైంది. నిరసన తెలిపిన విద్యార్థులలో ఒకరు తనకు తాను ఉరివేసుకున్న విషాదంతో హైదరాబాద్ ఉదంతం ముగిసింది. అలాంటి నిరసన చర్యను తాను అనుమతించలేదని చెప్పిన జేఎన్‌యూ ఒక విచారణ కమిటీని ఏర్పర్చింది కానీ, కమిటీలో ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్య ఇక్కడా ఎదురైంది. వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ఏ సభ్యుడూ ఈ కమిటీలో లేరని విద్యార్థి సంఘం పేర్కొంది.

బీజేపీకి ఇక్కడ మరొక అవకాశం ఉంది. విద్యార్థులపై నేరారోపణ చేయడానికి బదులుగా, సమస్యను అర్థం చేసుకోవడానికి అది ప్రయత్నించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఈ సమస్య కులంతో నేరుగా సంబంధం కలిగి ఉంది. మెమొన్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో దళితులు ఎందుకు నిరసన తెలిపారు? జేఎన్‌యూలో ముస్లింలపై ఎందుకు దృష్టి కేంద్రీకరించారు? ఒక కమిటీ తమపై ఒక తీర్పు చెబుతున్నప్పుడు దాంట్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం ఉండాలని విద్యార్థులు ఎందుకు పట్టుబడుతున్నారు? ఎందుకంటే భారతదేశం చాలావరకు దళితులు, ముస్లింల కోసమే ఉరిశిక్షను పరిమితం చేసి ఉంచిందన్నది వాస్తవం.

దేశంలో 75 శాతం మరణ దండనలు, ఉగ్రవాద చర్యలకు గాను విధించిన మరణ శిక్షల్లో 93.5 శాతం వరకు దళితులు, ముస్లింలే ఉన్నారని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ ఏడు ప్రచురించనున్న అధ్యయనం సూచిస్తోంది. ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్న సమస్య ఏమిటంటే పక్షపాత ధోరణే.

మాలెగావ్ బాంబు దాడుల కేసు చెబుతున్నట్లుగా అగ్రవర్ణ హిందువులు పాల్గొన్న ఉగ్రవాద చర్యలపై ప్రభుత్వం కఠినచర్య తీసుకున్న దాఖలాలు లేవు. రాజీవ్‌గాంధీ హంతకులు తమపై విధించిన ఉరిశిక్ష అమలుకు దశాబ్దాలుగా ఎదురు చూస్తుండగా, పంజాబ్ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హంతకుడిని ఉరితీయడంలోనూ మన పాలక వ్యవస్థ ఎలాంటి ఆతృతనూ ప్రదర్శించి ఉండలేదు. కానీ ఉగ్రవాద ఆరోపణలతోనే వీరికీ ఉరిశిక్ష విధించారు. ఒకే విధమైన చట్టాలతో దేశంలో నేరస్థులపై నిర్ణయాలు చేయడం లేదన్నదే వాస్తవం. 95మంది గుజరాతీలను నిలువునా ఊచకోత కోసిన మాయాబెన్ కొద్నాని వంటివారిని కనీసం జైల్లో కూడా ఉంచలేదన్న విషయాన్ని పక్కన బెడదాం.

ఇక్కడ రెండో విషయం ఏమిటంటే ఆర్థికం. దళితులు, ముస్లింలు పేదరికానికి పర్యాయపదాలు. ట్రయల్ కోర్టు దశలో అఫ్జల్ గురుకు దాదాపుగా న్యాయ సహాయం లభించలేదు. ఈ వాస్తవాల ప్రాతిపదికన దళితులు, ముస్లింలు వారి మద్దతుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. తమ నిరసనను వ్యక్తీకరించడానికి వారికి పూర్తి హక్కు ఉంది. వారు అదుపు తప్పిన వారిగా, స్థిమితం కోల్పోయిన వారిగానూ కనిపించవచ్చు కానీ, వారు వాస్తవం ప్రాతిపదికపైనే వాదిస్తున్నారు. భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరించిన వారికి వ్యతిరేకంగా కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్మృతి ఇరానీకి ఉత్తరాలు సంధించింది బీజేపీ ఎంపీలే.

మనది సంపూర్ణమైన, లోపరహితమైన సమాజమనీ, దానికి ప్రతి ఒక్కరూ విధేయులై ఉండాలనే కాల్పనిక భ్రమలను భారతీయులందరూ అందిపుచ్చుకోవాలని అగ్రకులాల్లోని మనం బలవంతం చేస్తున్నాం. హిందుత్వ సమాజమే ప్రధానంగా మధ్యతరగతి, అగ్రవర్ణాలతో కూడుకున్నది. తమకున్న సౌకర్యాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయని గ్రహిస్తున్నందున, వీరు రిజర్వేషన్లు అనే భావననే అసహ్యించుకుంటున్నారు. గర్హిస్తున్నారు.

అందుకే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సైతం రిజర్వేషన్లను సమర్థించడం లేదు. రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చేసిన ప్రకటనలు ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ పుట్టి ముంచిన విషయం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని స్పందన ఎలా ఉంది? ప్రతిపక్షం కట్టుకథలల్లుతోందని, అబద్దాలాడుతోందని ఆరోపించడానికే మోదీ పరిమితమయ్యారు.

కాని క్షేత్రస్థాయిలో వాస్తవాలు అత్యంత స్పష్టంగా ఉన్నాయి. ఇవాళ దళితులు నోరు విప్పుతున్నారు, వారి హక్కుల కోసం నిలబడుతున్నారు. దీంట్లో ఎలాంటి తప్పూ లేదు. దుందుడుకు భాషను వాడుతున్నంత మాత్రాన వారిని నేరస్తులుగా భావించకూడదు. నేడు వారు సంధిస్తున్న నినాదాలకు వ్యతిరేకంగా స్పందించడానికి, ఆగ్రహించడానికి బదులుగా ప్రభుత్వం వారితో చర్చలు జరపటం, వారి వాదనను కనీసం వినడానికైనా ప్రయత్నించడం ముఖ్యం.

మొదట హైదరాబాద్‌లో, ఇప్పుడు ఢిల్లీలో విద్యార్థులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో హిందుత్వ నేతలు ప్రదర్శిస్తున్న అసంబద్ధ ప్రతీకార చర్యలను... ఈ కథనం మొదట్లో పేర్కొన్నట్లుగా, అంబేడ్కర్ ఉపయోగించిన పదాల కాఠిన్యంపై గాంధీజీ ప్రదర్శించిన విజ్ఞతతో సరిపోల్చి చూడండి.

ఈ సమస్యలపై మనం కాస్త పరిపక్వతతో కూడిన అవగాహనను ప్రదర్శించాలి. ప్రభుత్వం ఈ దిశగా అడుగులేయడానికి ప్రయత్నించనంత కాలం... అత్యంత క్రూరంగా, పాశవికంగా మనం అణచివేస్తున్న వారు, ప్రభుత్వం పట్ల ప్రజల్లో అవిధేయతను ప్రోత్సహించేలా మాట్లాడుతూ, రాస్తూ ఉండటమే కాకుండా అలాంటి చర్యలకు భవిష్యత్తులో కూడా పాల్పడుతూనే ఉంటే మనం ఏమాత్రం ఆశ్చర్యపోవలసిన పనిలేదు.

ఈ వ్యాసాన్ని కింది లింకులో కూడా చూడవచ్చు.

న్యాయం లభించని నేలపై నిరసన కూడా నేరమేనాFriday, February 26, 2016

నా పేరు ఉమర్‌ ఖాలిద్‌ నిజమే కానీ నేను టెర్రరిస్టును కాను..!!


ప్రపంచంలో ఎన్నో దేశాల చరిత్రను చదువుకున్నాం. అనేక ఉద్యమాలను వాటి కారణాలను, వాటి పర్యవసానాలను, అంతిమ ఫలితాలను కూడా కొద్దో గొప్పో తెలుసుకున్నాం కానీ చదువుతున్న విద్యార్థులపై దేశద్రోహం ఆరోపణలు మోపి ప్రపంచ వ్యాప్తంగా అభాసు పాలవుతున్న వ్యవస్థను గురించి ఇప్పుడే తెలుసుకుంటున్నాం. 

కానీ లక్షల కోట్లు దిగమింగినవాళ్లు, ఆలా దిగమింగుతున్న వాళ్లకే గత 68 ఏళ్లుగా అడిగినా అడగకున్నా దేశ సంపదలను రుణాల రూపంలో అంటగడుతున్నవారు, మంచుగడ్డల్లో అంగుళంగుళం కాపలా కాస్తున్న సైనికులకు అత్యవసరమైన ప్రాణరక్షక సామగ్రిని సైతం కల్తీ చేసి కమీషన్లను కొల్లగొట్టినవారు.. దేవుళ్ల పేరు చెప్పి పంచలోహ విగ్రహాలను దేశదేశాల్లో అమ్ముకుంటున్న వారు. కొల్లగొట్టిన అక్రమార్జనను నల్లధనంగా మార్చి ఖండాతరాలకు తరలించి దేశ మూలుగులనే పీల్చేసినవారు.., 2014 తర్వాత కూడా ఇలాంటి నల్లధన బకాసురుల కొమ్ము కాస్తున్నవారు...  స్ట్రింగ్ ఆపరేషన్‌తో బెదిరింపులకు దిగి ఒకే ఒక్క కంపెనీ యజమానితోటే వందకోట్లకు బేరసారాలకు దిగి, అదే రివర్స్ స్ట్రింగ్‌కు అడ్డంగా దొరికిపోయి ధర్మపన్నాలు, శోకన్నాలు పెట్టి, ఇప్పుడు ఎవరు దేశద్రోహో తేల్చిపడేస్తున్న మీడియా ముష్కరులు.., ఖనిజ సంపదల తోడివేత పేరుతో ఆదివాసులు అడవులనుంచి తరిమివేసే మహాకుట్రకు పథకరచన చేసినవారు...  వీరెవరూ దేశద్రోహులు కారట. ఈ రకం దేశద్రోహాలు దేశభక్తిపరులకు ఎవరికీ కనిపించవు.

ఒక్కటిమాత్రం నిజం..  కొండను ఢీకొన్న పొట్టేళ్ల గురించి చిన్నప్పుడు చాలా కథలు చదువుకున్నాం కానీ కొండ తనంతట తాను నేరుగా వెళ్లి.. ఆవేశాన్ని, యవ్వనోద్రేకాన్ని నినాదాల రూపంలో, కవిత్వ రూపంలో వ్యక్తీకరించే విద్యార్థులతో ఢీకొంటున్న కథను ఇప్పుడు మాత్రమే వింటున్నాం. కొండ పగపట్టింది. తన స్థాయికి సరిజోదు అయిన మరో కొండతో కాదు. నినాదాలు, చర్చలు తప్ప మరే ప్రత్యక్ష ఆచరణలోనూ పాలు పంచుకోని అర్భక విద్యార్థులపై పగబట్టింది. అలాంటివాళ్లలో రోహిత్ ఒకరైతే... కన్హయ్య, ఉమర్ తదితరులు మరొకరు.

నాకు తెలిసినంత మేరకు బ్రిటిష్ ప్రభుత్వం తనపై యుద్ధాన్ని ప్రకటించడమే కాకుండా ఆచరణలోనే చూపించి తిరగబడిన నూనూగు మీసాలు రాని ఈ దేశ యువకులను వెంటాడి చంపింది. ఉరికొయ్యలపై వేలాడదీసింది. దేశ భక్తి గురించి ఎవరూ ఎవరికీ పాఠాలు చెప్పకున్నా.. దేశాన్ని పరాయి పాలన నుంచి, దాస్యం నుంచి పారదోలాలనే ధర్మాగ్రహంతో తిరగబడిన ఆ మాన్య యువకులు రక్తం పొంగే దివ్యస్మృతులతో ఈ దేశ యువతరానికి, మనకు కూడా నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. కానీ ఇదేమిటి? ఏ సాయుధ పోరాటంతో సంబంధం లేని రోహిత్, కన్హయ్య, తన ముస్లిం మూలాలను కూడా చేరిపేసుకుని తనది పీడిత ప్రజల పక్షమని ప్రకటించిన ఉమర్ ఖాలిద్ తదితరులు తమ ఆలోచనలను నినాదాల రూపంలో వ్యక్తీకరించినందుకే దేశ ద్రోహులైపోతారా?

ఇక్కడ ఒక దేశద్రోహి తాను ఎలాంటి దేశద్రోహో, ఎలాంటి దేశద్రోహి కాడో కూడా వివరిస్తున్నాడు. 'మిత్రులారా నాపేరు ఉమర్ ఖాలిద్‌. నిజమే. కానీ నేను టెర్రరిస్టును కాదు' అంటూ జేఎన్‌యూ విద్యార్థుల సాక్షిగా తన స్వీయ నివేదనను ఈ దేశం ముందు విప్పి చెప్పాడు.

"గత ఏడేండ్లుగా నేనీ క్యాంపస్‌ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నాను. కానీ ఇన్నేండ్లలో నన్ను నేను ఎప్పుడూ ఒక 'ముస్లిం'గా భావించలేదు. నన్ను నేను ఎప్పుడూ ఒక ముస్లింగా ప్రదర్శించుకోలేదు. ఎందుకంటే పీడన కేవలం ముస్లింల పైననే జరగడం లేదు. సమాజంలోని వివిధ పీడిత సెక్షన్లన్నీ బాధిత సమూహాలే. ఆదివాసులపై, దళితులపై పీడన కొనసాగుతోంది. మా లాంటి బాధిత సమూహాల నుంచి వచ్చే వాళ్లం మా తక్షణ గుర్తింపుల పరిధి లోంచి బైటికి వచ్చి సమస్యలను సమగ్ర దృష్టితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత ఏడేండ్లలో నాకు మొదటిసారిగా గత పది రోజుల్లోనే నేను ముస్లింనని తోచింది. రోహిత్‌ వేముల మాటల్లో చెప్పాలంటే, నన్ను నా తక్షణ గుర్తింపుకు కుదించి వేశారు. ఇది చాలా సిగ్గు చేటైన విషయం" అంటూ ఈ దేశం ముందు తన స్వభావం గురించి విప్పి చెప్పుకుంటున్నాడు.

ఇది నవతెలంగాణ వంటి పత్రికలలో, కొన్ని వెబ్‍‌సైట్లలో నిన్ననే అచ్చయిన ఖాలిద్ పూర్తి ప్రసంగ పాఠం. ఇవ్వాళే నాకు మీడియా మిత్రుల ద్వారా అందింది. మనమంతా ఇప్పటికే ఇతడు దేశద్రోహి అని  దృఢంగా ఒక అభిప్రాయానికి వచ్చేశాం కదా. కానీ ఉరి తీసేముందు కూడా ఆ శిక్షకు గురైన వాదనను వినే దొడ్డదేశం మనది కాబట్టి ఇప్పుడు కాస్త ఓపిక, సహనం తెచ్చుకుని ఉమర్ ఖాలిద్ అనే ఈ 'దేశద్రోహి' మాటలను కూడా  కాస్త ఆలకిద్దాం.

'దేశద్రోహి' మాటలు విన్నంతమాత్రాన, చదివినంత మాత్రాన మనం పాకిస్తాన్ మద్దతుదారులుగా, జిహాదీలుగా, ఉగ్రవాదులుగా, దేశద్రోహులుగా మారిపోమనే నేను విశ్వసిస్తున్నా.


(జేఎన్‌యూ వివాదంలో ఉమర్‌ ఖాలిద్‌ గురించి చాలా చర్చ జరిగింది. మీడియాలో ఒక వర్గం అతణ్ని 'టెర్రిరిస్టు'గా చిత్రించడానికి తప్పుడు ఆరోపణలెన్నో చేసింది. 'సంఘ్' భక్తులు అతని కుటుంబాన్ని చాలా దుర్మార్గంగా వేధించారు. పోలీసులు అతని కోసం దేశవ్యాప్తంగా 'వేట' ప్రారంభించామని చెప్పారు. కానీ ఖాలిద్‌ అతని అనుచరులతో పాటు సోమవారం తెల్లవారు జామున జేఎన్‌యూ విద్యార్థుల ముందు ప్రత్యక్షమై ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటికీ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఇది ఆ ప్రసంగం పూర్తి పాఠం.)

My name is Umar Khalid and I am not a terrorist

మిత్రులారా! నా పేరు ఉమర్‌ ఖాలిద్‌ నిజమే కానీ నేను టెర్రిరిస్టును కాను. మొట్టమొదటగా, ఈ ఉద్యమంలో దృఢంగా నిలబడ్డ విద్యార్థులకు, అధ్యాపకులకు నా అభినందనలు. ఈ పోరాటం కేవలం ఐదారుగురు వ్యక్తుల కోసం సాగుతున్నది కాదనేది మనకు తెలుసు. ఇది మనందరి పోరాటం. ఇది ఈ విశ్వవిద్యాలయం పోరాటం. దేశంలోని విశ్వవిద్యాలయాలన్నింటి పోరాటం. ఇది మన సమాజ మార్పునకు సంబంధించిన పోరాటం.

గత పది రోజుల్లో నా గురించి నాకే తెలియని చాలా విషయాలు తెలిశాయి. నేను రెండు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లొచ్చానట! నా దగ్గర పాస్‌పోర్టే లేదు కానీ రెండు సార్లు వెళ్లానట! ఈ ఆరోపణ బెడిసికొట్టడంతో మరొకటి పుట్టించారు. నేను 'మాస్టర్‌ మైండ్‌'నట! జేఎన్‌యూ విద్యార్థులందరికీ అద్భుతమైన 'మైండ్‌' ఉంటుందనేది నిజమే కానీ ఈ మొత్తం కార్యక్రమానికి పథకం రచించిన 'మాస్టర్‌ మైండ్‌'గా నన్ను చిత్రించారు! అంతేకాదు, నేను ఈ ప్రోగ్రాంను 17-18 విశ్వవిద్యాలయాల్లో నిర్వహించాలని ప్లాన్‌ చేసినట్టుగా కూడా చెప్పారు. నా ప్రభావం ఇంత విస్తృతంగా ఉందని నాకే తెలియదు! నేను గత 2-3 నెలలుగా ఆ సమావేశం కోసం పథకం రూపొందించానని వారు చెప్పారు. ఇది కూడా కౌంటర్‌ కావడంతో, నేను గత కొద్ది రోజులలో 800 ఫోన్‌కాల్స్‌ చేశానని అన్నారు.. 

ఏ సాక్ష్యం అవసరం లేదు మీడియాకు! 'ఎలెజెడ్లీ' (కథనం) అని చెప్పాల్సిన అవసరం కూడా లేదిప్పుడు! ఎక్కడెక్కడికి కాల్స్‌ చేశానట గల్ఫ్‌కు చేశానట! కాశ్మీర్‌కు చేశానట! మరి సాక్ష్యం తీసుకురావచ్చుగా! ఫోన్‌ చేసినంత మాత్రాన నేరం కాదనేది మొదటి విషయం. ఒకవేళ చేసినా దానికి సాక్ష్యాలైతే ఉండాలి కదా! వీళ్లకు ఇంతలా అబద్ధాలాడేందుకు సిగ్గుగా కూడా అనిపించడం లేదు. జరిగినదంతా 'మీడియా ట్రయలే'. మన నేరాల చిట్టా (ప్రొఫైలింగ్‌) కూడా తయారు చేసింది. ఆఖరుకు ఐబీ, ప్రభుత్వం సైతం జైషేమహ్మద్‌తో వీళ్లకు సంబంధాలు లేవని చెప్పినా, మీడియా మాత్రం క్షమాపణ చెప్పడం గానీ, డిస్‌క్లెయిమర్‌ గానీ ఏదీ ఉండదు.

మొదట ఇవన్నీ వింటుంటే నవ్వొచ్చింది. ఇన్ని అబద్ధాలతో, ఇన్ని ఆరోపణలు ప్రచారంలో పెట్టి తప్పుకోవచ్చని మీడియా వాళ్లు అనుకుంటున్నారేమో కానీ అలా జరగదు. వ్యక్తిగతంగా నేనెప్పుడూ భయపడలేదు. ఎందుకంటే నాకు తెలుసు. మీరంతా వేల సంఖ్యలో నాకు మద్దతుగా నిలబడతారని. కానీ నేను నా చెల్లెండ్ల ప్రకటనలు, మా తండ్రి ప్రకటన చూశాక ఆందోళన చెందాను. నా చెల్లెండ్లను రేప్‌ చేస్తామని, యాసిడ్‌ దాడి చేస్తామని సోషల్‌ మీడియాలో బెదిరింపులు రావడంతో ఆందోళన కలిగింది. నాకప్పుడు కంధమాల్‌ (ఒడిషా) గుర్తుకొచ్చింది. క్రైస్తవ సన్యాసినిపై బజరంగ్‌దళ్‌ గూండాలు సామూహిక అత్యాచారం జరిపినప్పుడు 'భారత్‌ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు. ఫిబ్రవరి 11న కామ్రేడ్‌ కన్నయ్య అన్నట్టుగా, 'ఇదే మీ భారత్‌ మాత అయితే మాకీ భారత్‌ మాత వద్దు'. దీనికి మేం సిగ్గుపడం కూడా!

మా తండ్రిని టీవీ స్టూడియోల్లో ప్రశ్నలతో వేధించారు. ఎక్కడెక్కడి వివరాలో తవ్వి తీసి వాటిని దీనితో జోడించే ప్రయత్నం చేశారు. జీ న్యూస్‌, టైమ్స్‌ నౌ (దాన్ని నడిపిస్తున్న వ్యక్తి పేరు నేను చెప్పదల్చుకోలేదు) వంటి చానెళ్లకు ఇంత ద్వేషం, ఇంత కోపం ఎక్కడి నుంచి వస్తోంది ఇంత ద్వేషాన్ని ఎలా పెంచుకోగలుగుతారో అర్థం కావడం లేదు.

గత ఏడేండ్లుగా ఈ నేనీ క్యాంపస్‌ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నాను. కానీ ఇన్నేండ్లలో నన్ను నేను ఎప్పుడూ ఒక 'ముస్లిం'గా భావించలేదు. నన్ను నేను ఎప్పుడూ ఒక ముస్లింగా ప్రదర్శించుకోలేదు. ఎందుకంటే పీడన కేవలం ముస్లింల పైననే జరగడం లేదు. సమాజంలోని వివిధ పీడిత సెక్షన్లన్నీ బాధిత సమూహాలే. ఆదివాసులపై, దళితులపై పీడన కొనసాగుతోంది. మా లాంటి బాధిత సమూహాల నుంచి వచ్చే వాళ్లం మా తక్షణ గుర్తింపుల పరిధి లోంచి బైటికి వచ్చి సమస్యలను సమగ్ర దృష్టితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత ఏడేండ్లలో నాకు మొదటిసారిగా గత పది రోజుల్లోనే నేను ముస్లింనని తోచింది. రోహిత్‌ వేముల మాటల్లో చెప్పాలంటే, నన్ను నా తక్షణ గుర్తింపుకు కుదించి వేశారు. ఇది చాలా సిగ్గు చేటైన విషయం.

వీళ్లు నన్ను పాకిస్తాన్‌ ఏజెంట్‌ అంటున్నారు. నేను పాకిస్తాన్‌కు చెందిన ఒక కవి రాసిన రెండు మాటలు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. 'అరే భాయి! హిందూస్తాన్‌ నాదే... పాకిస్తాన్‌ నాదే.. కానీ ఈ రెండింటిపైనా ఉన్నది అమెరికా పెత్తనమే. ఆ అమెరికాకు మీరు దళారులు!' మీ ప్రభుత్వానికి దళారీతనం తప్ప మరొకటి రానే రాదు. మీరే అమెరికా పాదాలు నాకుతున్నారు. ఈ దేశ సంపదలను, వనరులను అమెరికాకు దోచిపెడుతున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్‌సీలు ఇక్కడి శ్రమశక్తిని దోచుకుంటున్నాయి. విద్యారంగాన్ని కూడా తాకట్టు పెట్టింది. డబ్ల్యూటీవోలో ప్రభుత్వం ఎలా మోకరిల్లిందో మనం చూశాం. వీళ్లు మాకు దేశభక్తి గురించి చెబుతున్నారు! నా తోటి దేశద్రోహులారా! 'ప్రపంచ దేశద్రోహులారా, ఏకం కండి' అని అనాలిప్పుడు. మేం ప్రజలను ప్రేమిస్తాం. మా పోరాటానికి హద్దులు, సరిహద్దులు లేవు. ప్రపంచవ్యాప్తంగా మనమంతా ఏకమవుతాం. ప్రజలను పీడించే ఏ దేశ ప్రభుత్వానికైనా వ్యతిరేకంగా ఏకమవుతాం.

ఈ తరహా హేయమైన ఎత్తుగడలతో వాళ్లు మనల్ని భయపెట్టలేరు. వాళ్లు మన నోళ్లను మూయించలేరు. మిత్రులారా! మనం వీళ్లకు భయపడాల్సిన అవసరం లేదని మీకు చెప్పాల్సిన పనే లేదు. వీళ్లకు మెజారిటీ ఉండొచ్చు. వీళ్లకు చాలా సీట్లు ఉండొచ్చు. వీళ్ల దగ్గర బలమైన మీడియా ఉండొచ్చు. రాజ్య యంత్రానికి సంబంధించిన చాలా విభాగాలు, పోలీసులు వగైరా ఉండొచ్చు. అయినా వీళ్లు భయపడతున్నారు. మన పోరాటాలకు భయపడుతున్నారు. మనం ఆలోచిస్తున్నందుకు వాళ్లు భయపడుతున్నారు. నా సహచరుడు అనిర్బాన్‌ ఫిబ్రవరి 10న ఒక మాట చెప్పాడు. దేశద్రోహి కావడం చాలా సులువని. ఆలోచించడం మొదలు పెడితే చాలు వెంటనే దేశద్రోహి అయిపోతారు. కాబట్టి మీరు మమ్మల్ని భయపెట్టగలమని అనుకుంటే మీరు చాలా పెద్ద భ్రమలో ఉన్నట్టే. ముందే చెప్పినట్టుగా, మీరీ విశ్వవిద్యాలయంతో తలపడి పొరపాటు చేశారు. చాలా విశ్వవిద్యాలయాలతో ఇదివరకే మీరు తలపడ్డారు. ఎఫ్‌టిఐఐలో జరిగింది గానీ, హెచ్‌సీయూలో రోహిత్‌ వేముల హత్య జరిగిన తీరు గానీ, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో సందీప్‌ పాండేకు జరిగింది గానీ... ఈ అన్ని పోరాటాలతో మేం భుజం భుజం కలిపి నడిచాం. ప్రతి పోరాటాన్ని మేం ఇక్కడ వీధుల్లోకి తీసుకెళ్లాం. ఇది మా బాధ్యతని మేం భావిస్తాం.

అయితే మీకు జేఎన్‌యూనే పెద్ద అడ్డంకిగా ఉంది కాబట్టి దీనినే అణచివేస్తామని అనుకుంటే మీకు చెప్పేదొకటే. ఈ తరహా విఫల ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి. బహుశా మీరు మర్చిపోవచ్చు గానీ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరా గాంధీ ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తే ఆమెను అడ్డుకున్నారు. మునుపటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇక్కడికి వచ్చినప్పుడు యూపీఏ దేశాన్ని తాకట్టు పెడుతున్న విధానాలను వ్యతిరేకిస్తూ అతనికి నల్ల జెండా చూపించాం. చిదంబరం ఇక్కడికి వచ్చినప్పుడు, తనకు ఘన స్వాగతం లభిస్తుందని ఆశించి ఆశాభంగం పొందిన విషయం గుర్తుండాలి. విద్యార్థులు తాము ఈ దేశ పీడిత ప్రజల వైపున్నామని చిదంబరంకు తెలియజెప్పారు. కాబట్టి ఇలాంటి తాటాకు చప్పుళ్లతో బెదిరిపోయే కుందేళ్లం కాదు మేం. ఇవి కేవలం మైండ్‌గేమ్స్‌ మాత్రమే! మనం భయపడతామా లేదా అని వాళ్లు పరీక్ష పెడుతున్నారు. కానీ మనం భయపడమని చాటి చెబుదాం. సవాలును స్వీకరిద్దాం. ప్రతి రంగంలోనూ ఎదురు నిలిచి పోరాడుదాం. ప్రతి అంశంపైనా, క్యాంపస్‌లోని ప్రతి విద్యార్థికీ ఎలాంటి జంకు లేకుండా తన అభిప్రాయాన్ని చర్చించే హక్కుంది.

వీళ్లకో విద్యార్థి విభాగం ఉంది - ఏబీవీపీ. ఇది ఈ క్యాంపస్‌లో వాళ్ల వానర సేన. ఏ అంశం వచ్చినా వీళ్లు అల్లరి మూకలా వ్యవహరిస్తారు. పోలీసులు, క్యాంపస్‌ అడ్మినిస్ట్రేషన్‌, మంత్రులు అందరూ వీళ్లకు అండగా ఉంటారు. రోహిత్‌ను ఇట్లాగే అందరూ కుమ్మక్కై చంపేశారు. కానీ ఇక్కడ ఎవ్వరూ మరో రోహిత్‌ కాబోరని నేను ప్రకటిస్తున్నాను. ఈ క్యాంపస్‌ విలువేమిటో మనకు తెలుసు. దీన్ని మనమే తీర్చిదిద్దుకున్నాం. దీన్ని నాశనం చేయాలనే వీళ్ల ప్రయత్నాలను ఓడిద్దాం. ఇందులో ఒక్క అంగుళం స్థలం కూడా వారికి వదిలెయ్యం. ఏబీవీపీకి అసలు ప్రజల్లో బలం లేదు. ప్రజలను సమీకరించలేరు వీళ్లు. కేవలం ప్రభుత్వ యంత్రాంగాన్ని తోడుగా తెచ్చుకుంటారు. ఈ పది రోజుల్లో ఇంత మీడియా ప్రచారం, ఇన్ని మీడియా ట్రయల్స్‌, దేశభక్తి పేరుతో రెచ్చగొట్టే ప్రకటనలు ఇన్ని జరిగినా వీళ్ల కార్యక్రమాలకు హాజరవుతున్నది కేవలం వేళ్ల మీద లెక్కించేంత మందే. ఇక్కడ మనం 15 వేల మంది దాకా సమీకరించగలిగాం. 

విద్యార్థి ఉద్యమంలో మనం నేర్చుకున్నది ఏమిటంటే, 'అసమ్మతిని అనుమతించని విశ్వవిద్యాలయం జైలుగా మారిపోతుంది'. వారి అజెండా స్పష్టమే! విశ్వవిద్యాలయాలను జైళ్లుగా మార్చాలనేదే వాళ్ల లక్ష్యం. దీన్ని మనం ఓడించాలి. ఐక్యంగా ఉండాలి. చీలి పోవద్దు. మనలో మనకు విభేదాలున్నాయని మనకు తెలుసు. అయితే వాటిని ఎలా చర్చించుకోవాలో కూడా మనకు తెలుసు. చివరగా, గత పదిరోజుల్లో ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా లెక్క లేనన్ని దాడులు జరిగాయి. హౌండా కార్మికులపై దాడి జరిగింది. జగ్దల్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌)లో లీగల్‌ ఎయిడ్‌ గ్రూపుపై దాడి జరిగింది. సోని సోరిపై దాడి జరిగింది. ఈ పోరాటాలన్నింటికీ సంఘీభావం తెలపాలి. ఈ పోరాటాలతో అనుసంధానం చేసుకోవాలి. ఎక్కడ, ఏ అన్యాయం జరిగినా వారికి అండగా నిలబడే జేఎన్‌యూ సంప్రదాయాన్ని సజీవంగా నిలుపుకోవాలి. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌!

మీరు దేశ ప్రజలకు వ్యతిరేకంగా... ఆదివాసులైతే వారిపై మావోయిస్టులనే ముద్రవేయడం ద్వారా, ముస్లింలైతే టెర్రరిస్టులుగా ముద్ర వేయడం ద్వారా సాగిస్తున్న విచారణలు ఎన్నో ఉన్నాయి. చాలా మంది నిస్సహాయులు కాబట్టి ఇలాగే సాగిపోతోంది. కానీ మీరిప్పుడు పప్పులో కాలేశారు. జేఎన్‌యూ విద్యార్థులు దీనికి సరైన జవాబు చెబుతారు. ఇలా తప్పుడు రిపోర్టింగ్‌ చేసిన ఒక్కొక్క మీడియా చానెల్‌ ఇందుకు బాధ్యత వహించక తప్పదు....

My name is Umar Khalid, I’m not a terrorist: JNU prodigal returns and how


https://www.youtube.com/watch?v=RBfXNleLApw

(Full speech of Umar Khalid)

ఈ టపా పోస్ట్ చేసిన తర్వాత పై యూట్యూబ్ లింకులో ఖాలిద్ వీడియో ప్రసంగాన్ని విన్నా. ఈ దేశంలో 'దేశభక్తి'పరులంతా మూకుమ్మడిగా ద్వేషిస్తున్న, ఆరోపిస్తున్న ఈ దేశద్రోహి జేఎన్ యూలో మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి వ్యక్తీకరణకు అక్కడ హాజరైన విద్యార్ధినీ విద్యార్థులు హర్షద్వానాలతో స్వాగతించారు. తనను దేశద్రోహిగా  ఆరోపిస్తూ ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యనూ, ప్రతి నేరారోపణను ఖండఖండాలుగా చీల్చివేస్తూ ఖాలిద్ చేసిన ప్రసంగం వారిని నవ్వించింది. జేఎన్ యూ నవ్వింది. ఈ దేశ దౌర్భాగ్యాన్ని చూసి నవ్వింది.  

ఆ రాత్రి గడిస్తే చాలు తనను దేశద్రోహ ఆరోపణలపై అరెస్టు చేస్తారని లేదా తానే సరెండర్ కావాల్సి ఉంటుందని ఖాలిద్ కు తెలుసు. కానీ ఒక్క క్షణం కూడా ఖాలిద్ భయపడుతున్నట్లుగానీ, రేపటి తర్వాత తన పరిస్తితి ఏమవుతుందని కానీ కించిత్ ఆందోళన ఈ వీడియోలో కనిపించలేదు. అన్నిరంగాల్లోను అన్యాయంపై పోరాడతామని, అందరితో ఐక్యమవుతామని, విభేదిస్తున్నవారితో కూడా చర్చలు ఎలా జరపాలో తమకు తెలుసుని ఖాలిద్ స్థిరమైన స్వరంతో చెబుతుంటే వింటున్న వారిలో విద్యుత్తేజం. 

యూనివర్శిటీ అసమ్మతిని అనుమతించకపోతే అలాంటి యూనివర్సిటీ జైలుగా మారిపోతుంది అంటూ జేఎన్ యు పునాదిని గుర్తు చేసిన ఖాలిద్  మన ప్రజాస్వామ్య ఉనికిని, పునాదిని, రాజ్య అహంకారాన్ని, నినాదాల్లో, జెండాల్లో దేశద్రోహాన్ని చూస్తున్న వ్యవస్థ దుస్థితిని అపహాస్యం చేస్తున్నాడు. 

మన ముసుగులన్నింటినీ పక్కనబెట్టి చూస్తే... మొన్న కన్హయ్య కానీ, నిన్న ఖాలిద్ కానీ చేసిన ప్రసంగాలు ప్రపంచ విద్యార్థి ఉద్యమాల చరిత్రలో ధిక్కారానికి, న్యాయాన్వేషణకు అచ్చమైన ప్రతిబింబాలుగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేం వర్సిటీ విద్యార్థులుగా ఉన్న కాలంలో అంటే 35 ఏళ్ల క్రితం ఇలాంటి నినాదాలెన్నో చేశాం. ఆనాడు మా దృష్టికి వచ్చిన ప్రతి అన్యాయంపైనా గళమెత్తాం. గోడలన్నీి నినాదాలతో ముంచెత్తాం. ఎన్నోసార్లు అరెస్ట్యయ్యాం. జైలుకెళ్లాం కానీ ఎన్నడూ ఏ ప్రభుత్వమూ మా నినాదాలకు కానీ, గోడరాతలకు కానీ, ప్రసంగాలకు కానీ మమ్మల్ని దేశద్రోహులుగా ఆరోపించలేదు. 

కానీ ఇదేంటి? కొన్ని నినాదాలు చేసినంత మాత్రానికే దేశద్రోహ ఆరోపణా? 

నాకు ఒకటే ప్రశ్న కేంద్రప్రభుత్వం బలంగా ఉందా, బలహీనంగా ఉందా? నినాదాలకే కదలిపోయేంత బలహీనంగా ఉందా? 

వంద దేశద్రోహాలు మోపినా అన్యాయాన్ని ఎదిరించడంలో ఒక్క అంగుళం కూడా వెనుకంజ వేయం  అంటున్నారు వీళ్లు. ఇలాంటివారిని ఏ ప్రభుత్వాలైనా ఏం చేయగలవు?

కానీ.. విద్యార్థులపై కుట్రకేసులు, దేశద్రోహ ఆరోపణలు మరీ ఇంత అన్యాయంగా, ఇన్ని అబద్దాలతో, వక్రీకరణలతో మోపితే ఇవి నిలబడతాయా లేదా అనేది తర్వాతి విషయం కానీ ప్రపంచ వ్యాప్తంగా విద్యాకేంద్రాలు, మేధో బృందాలు భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్న దేశద్రోహ ప్రహసనాన్ని చూసి అపహాస్యం చేస్తున్నాయి. 

ఈ కుట్రకేసులూ, దేశద్రోహ అరోపణలు అంతిమంగా నిలచేవి కావు. బూర్జువా న్యాయ స్థానాల్లో కూడా నిలబడనంత బలహీన కేసులు, ఆరోపణలు ఇవి. 

ఇంతకూ మన రాజ్యవ్యవస్థ ఏం సాధించదలిచినట్లు. ఏ ఎజెండా లక్ష్యంతో పనిచేస్తున్నట్లు?

ఇప్పుడే నేను చూసిన వార్త

Confusing national interest with nationalism helps India's enemies

ప్రభుత్వానికి వ్యతిరేరంగా హింసను ప్రేరేపించేవారు, ప్రభుత్వాన్ని కూలదోయాలని పిలుపునిచ్చేవారిపై దేశద్రోహ చట్టాన్ని ఉపయోగించండి కానీ నినాదాలు చేసే విద్యార్థుల మీద కాదని ఈ లింకులోని వ్యాసం చెబుతోంది. పైగా అలాంటిది వ్యతిరేక ఫలితాలనే తీసుకువస్తుందని, జేఎన్ యూలో కేంద్రం ఇక్కడే తప్పటడుగు చేసిందని ఈ వ్యాసం తెలుపుతోంది. పైగా జాతీయవాదాన్ని పౌరులపై బలవంతంగా రుద్దరాదని, అది స్వచ్చంద వ్యవహారమని చెబుతోంది.

అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడాల్సిన దేశద్రోహ లేదా రాజద్రోహ కేసును విద్యార్థులపై విచక్షణా రహితంగా ప్రయోగించిన క్షణంలోనే ప్రభుత్వానికి భంగపాటు జరిగిపోయింది. ఇక కోర్టుల్లో దాని ముగింపు మాత్రమే మిగిలివుంది. 


Wednesday, February 24, 2016

ప్రధాని కుట్ర సిద్ధాంతమే ఒక కొత్త కుట్ర

(ఇది నేను రాసిన వ్యాసం కాదు. సీనియర్ పాత్రికేయులు డానీ సాక్షి పత్రికకు పంపిన వ్యాసం పూర్తి పాఠం. పత్రికలో స్పేస్ పరిమితి కారణంగా సంక్షిప్తం చేసి ప్రచురించిన ఆయన రచన పూర్తి పాఠాన్ని దాని ప్రాసంగికత రీత్యా ఇక్కడ పోస్ట్ చేయడమైంది. దీంట్లోనూ కొన్ని వివాదాస్పద విషయాలు ఉన్నప్పటికీ అవి చదివి విశ్లేషించుకోవడానికి అడ్డంకి కాదనే భావిస్తున్నా.)

కథ, నవల వంటి వర్ణనాత్మక సాహిత్య ప్రక్రియల్ని చదువుతున్నప్పుడు పాఠకులు రెండు రకాల అనుభూతులకు గురవుతుంటారు. మొదటిది, ఆ రచనలోని సన్నివేశాలు, పాత్రల భావోద్వేగాలను ఆస్వాదించడం. రెండోది, ఆ రచనల్ని పోలిన నిజజీవిత పాత్రలు, సన్నివేశాలని గుర్తుకు తెచ్చుకుని ఆస్వాదించడం. వర్తమాన జాతీయ రాజకీయాలు కూడా మనకు అలాంటి రెండు రకాల అనుభూతుల్ని ఇస్తున్నాయి. వర్తమానంతోపాటూ  రెండవ ప్రపంచయుధ్ధానికి ముందు నాటి ఇటలీ, జర్మనీ పరిణామాలు గుర్తుకు తెస్తున్నాయి.

ఒక నకిలీ ట్వీట్ ను పట్టుకుని భారత హోంమంత్రి, ఒక నకిలీ వీడియోను తీసుకుని ఢిల్లీ పోలీస్ బాస్ కలిసి జేయన్ యూ విద్యార్ధి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్ మీద ఆడిన దేశద్రోహ ప్రహసనాన్ని దేశమంతా చూసింది. అంతకు ముందే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ వేముల బలవన్మరణానికి పురికొల్పిన కేంద్రమంత్రుల నిర్వాకాన్ని కూడా మనం చూశాం.

భారత రాజ్యాంగాన్ని అభిమానించేవాళ్ళకు కూడా కొన్ని అంశాల్లో కొంత అసంతృప్తి కూడా వుంటుంది. కొన్ని విషయాల్లో మరి కొంత స్పష్టత అవసరమనీ, ఇంకొన్ని విషయాలను చేరిస్తే మరింత బాగుండేదనీ అనిపిస్తుంది. కానీ, భారత రాజ్యాంగాన్ని ప్రశంసిస్తూ కన్హయ కుమార్ అంతటి ఉత్తేజం, ఉత్సాహం, తాదాత్మ్యం, ఆవేశాలతో ప్రసంగించే యువతరాన్ని మనం ఇప్పుడే చూస్తున్నాం.  కార్ల్ మార్క్స్, బాబాసాహెబ్ అంబేడ్కర్, అష్ఫఖుల్లా ఖాన్‌ల కూర్పు ఒక మహత్త పరిణామం. ఇందులో బిర్సాముండా, ఫూలేలను కూడా చేరిస్తే అదొక కొత్త చరిత్ర ఆవిర్భావానికి వేదిక అవుతుంది.

గత 'ప్రభుత్వాధినేత్రి' సోనియా గాంధి చాలా ఆచితూచి మాట్లాడేవారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అంతకన్నా తక్కువగా మాట్లాడేవారు. ఇది చాలా మందికి నచ్చలేదు. ఏ విషయం మీద అయినా సరే కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాల్ని చెప్పేస్తారు అని ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి పేరుండేది. అయితే, ఇది అర్ధసత్యమే అనిపిస్తోంది.  వారు స్పందించాల్సిన అవసరమేలేని విషయాల మీద  అత్యుత్సాహం ప్రదర్శిస్తూ  స్పందించాల్సిన అవసరం ఉన్న విషయాల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు దేశమంతటా బలపడుతున్న అభిప్రాయం.

మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు అక్కడి పోలీసులు తరచూ ఒక ప్రహసనం ఆడేవారు. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు ఒక ముఠా కుట్ర చేస్తున్నదని ప్రచారం చేసేవారు. ఒకటి రెండు బూటకపు ఎన్ కౌంటర్లు జరిపి మృతుల్ని ఆ ముఠా సభ్యులుగా ప్రకటించేవారు. దానితో పోలీసులకు పదోన్నతులు, అవార్డులు మాత్రమే కాక వాళ్ళు లెఖ్ఖ చెప్పాల్సిన అవసరంలేని నిధుల కేటాయింపులు, అధికారాలు పెరిగేవి. ఇజ్రాయిల్ నుండో మరో దేశం నుండో అత్యాధునిక భద్రతా పరికరాలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యేవి. అన్నింటికన్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద సానుభూతి పెరిగేది.

దాదాపు ఇదే ఫార్మూలాను ఇప్పుడు నరేంద్ర మోదీ సలహాదారులు జాతీయస్థాయిలో అమలు చేస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ సంఘటనల తరువాత దేశంలోని దాదాపు యాభై విశ్వవిద్యాలయాల్లో అసమ్మతి రగులుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇరుకున పడింది. నెహ్రు హరిత విప్లవం , ఇందిరాగాంధీ గరీబీ హటావో, రాజీవ్ గాంధీ ఐటీ విప్లవం, మన్మోహన్ సింగ్ గ్రామీణ ఉపాధిపథకం వంటి చెప్పుకోదగ్గ ఒక్క పథకాన్ని కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూపొందించలేకపోయింది. మరోవైపు, ఆయన్ను ఏరికోరి తెచ్చుకున్న కార్పొరేట్ రంగానికి కూడా సంతృప్తికరంగా వున్నట్టులేదు. దేశంలో పెరుగుతున్న ప్రభుత్వ ప్రాయోజిత అసహన వాతావరణం మీద రతన్ టాటా వంటి  కార్పొరేట్ దిగ్గజాలు తరచూ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనేవున్నారు.  “(మోదీ) జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు 7 శాతం వుంటే ఏపీ పెరుగుదల రేటు 15 శాతం వుంద”ని  ఎన్డీయే భాగస్వామి అయిన చంద్రబాబే అనేస్తుంటే నరేంద్రుని ప్రతిష్ట ఎంత వేగంగా దిగజారిపోతున్నదో అర్ధం అవుతుంది.

ఇలాంటి నైతిక సంక్షోభ సమయాల్లో ప్రయోగించడానికి నరేంద్ర మోదీ దగ్గర గుజరాత్ మార్కు సానుభూతి ఫార్ములా ఎలాగూ వున్నది. దాన్నే వారు ఒడిషాలో ప్రయోగించారు. తనను అంతం చేయడానికీ, తన ప్రతిష్టను దెబ్బతీయడానికీ  తన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి స్వచ్చంద సేవా సంస్థ (ఎన్జీవో)లు, యూరియా ఉత్పత్తిదారులు, ప్రతిపక్షాలు రాత్రింబవళ్ళు కుట్రలు చేస్తున్నాయని బార్గడ్ రైతు సదస్సులో వారు ఆవేదన వ్యక్తం చేశారు. చాయ్ వాలా ప్రధాని కావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారని ఒక భావోద్వేగాన్ని కూడా వదిలారు. హిట్లర్ కూడా తనకు నైతిక సంక్షోభం వచ్చినప్పుడెల్లా తాను పేద కుటుంబంలో పుట్టాననీ, పెళ్ళిచేసుకోలేదనీ, శాకాహారిననీ, కమ్యూనిస్టులు, యూదులు తనను అంతం చేయడానికి కుట్రలు చేస్తున్నారని చెప్పుకునేవాడట!

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల ప్రకటిత లక్ష్యమే అధికార పార్టీ తప్పుల్ని ఎండగట్టి, ఎన్నికల్లో ఓడించి తాము అధికారాన్ని చేపట్టడం. ఇందులో కుట్ర ఎక్కడ నుండి వచ్చింది? ప్రధాని ప్రసంగంలో యురియా ఉత్పత్తిదారుల ప్రస్తావన రైతుల కంటితుడుపు కోసమే తప్ప మరోటి కాదు. ప్రధాని ప్రధానంగా ప్రస్తావించ దలచింది స్వచ్చంద సంస్థల గురించి. విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనల వెనక కొన్ని ఎన్జీవోలు వున్నాయనీ, వాటికి విదేశాల నుండి నిధులు వస్తున్నాయనీ వారు ప్రస్పుటంగానే ఒక సంకేతాన్ని బలంగా ప్రజల్లోనికి పంపాలనుకున్నారు. ఇంకొంచెం తరచి చూస్తే క్రైస్తవ మిషనరీలు, ముస్లీం మదరసాలను వారు పరోక్షంగా ప్రస్తావించారని తెలుసుకోవడం కష్టమేమీకాదు.

బీజేపి, సంఘీ, ఓడిషా, క్రైస్తవ మిషనరీల ప్రస్తావన వచ్చిందంటే ఎవరికయినా క్రైస్తవ ఫాదర్  గ్రాహమ్ స్టేయిన్స్ హత్య కేసు గుర్తుకొస్తుంది. ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ సేవకుడు గ్రాహమ్ స్టేయిన్స్ భార్యాబిడ్డలతో భారత దేశానికి వచ్చి ఒడిషాలోని మయూర్ భంజ్, కేంఝోర్ జిల్లాల్లో ఆదివాసుల అభివృధ్ధికోసం పాటుపడ్డాడు. ఆ ప్రాంతంలో వేగంగా వ్యాపిస్తున్న కుష్టురోగ నివారణకు కృషిచేశాడు. అయితే, గ్రాహమ్ స్టేయిన్స్ ఆ రెండు జిల్లాలోని ఆదివాసుల్ని క్రైస్తవులుగా మతమార్పిడి చేస్తున్నాడని  సంఘీయులు ప్రచారం చేసేవారు. అటల్ బీహారీ వాజ్ పాయి ప్రధానిగా వున్న కాలంలో  భజరంగ్ దళ్ కార్యకర్తలు అతన్ని హత్య చేశారు. 1999 జనవరి 23 రాత్రి కేంఝోర్ జిల్లాలో ఒక కార్యక్రమానికి వెళ్ళి మయూర్ భంజ్ తిరిగి వస్తూ దారి మధ్యలో అలసిపోయి  రోడ్డు పక్కన వ్యాన్ నిలిపి అందులో తన ఇద్దరు కొడుకులతో పాటూ నిద్రపోయాడు. ఇదే అదనుగా  స్థానిక భజరంగ్ దళ్ నాయకుడు  దారా సింగ్  యాభైమంది అనుచరులతోపాటూ  ఆ వ్యాన్ మీద దాడిచేసి, నిప్పుపెట్టి, ఇద్దరు చిన్న పిల్లలతోసహా స్టేయిన్స్ ను సజీవ దహనం చేశాడు. ఈ కేసులో ఒడిషా కోర్టు దారాసింగ్ కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. స్టేయిన్స్ చనిపోయిన తరువాత కూడా  ఆయన భార్య గ్లాడిస్ ఆ ప్రాంతంలోనే కుష్టురోగులకు పైద్య సేవలు కొనసాగించింది. ఓడిషా ప్రభుత్వ సిఫార్సు మేరకు 2004లో భారత ప్రభుత్వం గ్లాడిస్ ను ప్రద్మశ్రీ బిరుదుతో సన్మానించింది.

తమ మీద వచ్చే నిందల్ని తప్పించుకోవడానికి అధికారపార్టీలు తరచు చేసే వాదన ఒకటి వుంటుంది. గ్రామాల్లో జరిగే చిన్న సంఘటనలకు కూడా ముఖ్యమంత్రినో, ప్రధానినో బాధ్యుల్ని చేయడం సరికాదని వారంటుంటారు. కారంచేడు నరమేధానికీ, చుండూరు దురాగతానికీ అప్పటి ముఖ్యమంత్రులు యన్ టీ రామారావు, యన్ జనార్దన రెడ్డి నేరుగా బాధ్యులు కాకపోవచ్చు. కానీ వాళ్ళు అప్పుడు ఆ పదవుల్లో వుండడంవల్లనే స్థానికులకు దాడి చేసే తెగువ వచ్చిందనేది మాత్రం ఎవ్వరూ  కాదనలేని నిజం.

ప్రధాని బార్గడ్  ప్రసంగంలో ఒక సున్నితమైన అంశం వుంది. కొంచెం విశ్లేషణ చేస్తే సంఘీయుల దృష్టిని వారు  క్రైస్తవ, ముస్లిం సేవాసంస్థల మీదికి మళ్ళిస్తున్నారని  సులువుగానే అర్ధం అవుతుంది. కేంద్రంలో అధికార పార్టి మొదలు, స్థానికంగా అధికారుల వరకు “భరోసా” ను అందించడంవల్లనే దాద్రీలో అఖ్లాఖ్ హత్య జరిగిందని గుర్తు చేసుకుంటే భారత సమాజంలో సమీప భవిష్యత్తులో జరగనున్న పరిణామాల్ని ఊహించడం కష్టం కాదు.

వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు డానీ మొబైల్: 9010757776

ఈ వ్యాసం సంక్షిప్త పాఠం కింది లింకులో చూడవచ్చు.

కుట్ర సిద్ధాంతమే ఓ కుట్ర

Monday, February 22, 2016

దేశభక్తికి కొత్త నిర్వచనమిచ్చిన కన్హయ్య ప్రసంగం

దాదాపు 20 ఏళ్ల ఉద్యమ జీవితం నుంచి బయటకు వచ్చి వృత్తి జీవితంలో స్థిరపడిన తర్వాత గత 13 సంవత్సరాల నా బహిరంగ జీవితంలోనే అత్యంత శక్తివంతమైన, భావస్ఫోరకమైన. తాత్విక స్థాయి కలిగిన ఒక గొప్ప కథనాన్ని (ప్రసంగపాఠం) నేటి తెల్లవారుజామున తెలుగులో చదివాను. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ రాజద్రోహం ఆరోపణలపై అరెస్టు కావడానికి ముందు జేఎన్‌యూ క్యాంపస్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన హిందీ పాఠానికి తెలుగు సేత. అగ్నిసదృశమైన పదాలతో మాటల మంత్రజాలంతో ఈ దేశ వాస్తవ పరిస్థితిపై అత్యద్భుతమైన శైలితో కన్హయ్య మాట్లాడిన మాటలివి.

"దేశభక్తి గురించి ఎవరితోనో చెప్పించుకునే దుస్థితిలో మేం లేం.. మేము ఈ దేశానికి చెందిన వాళ్లం. ఈ మట్టిని మేం ప్రేమిస్తాం. ఈ దేశంలో ఉన్న 80 శాతం పేద ప్రజల కోసం మేం పోరాడుతాం.... మా దృష్టిలో దేశభక్తి అంటే ఇదే. అందరికీ జీవించే హక్కు ఉండాలి. అందరికీ తినే, మాట్లాడే, నివసించే హక్కుండాలి. ఈ స్వప్నంతోనే మేం నిలబడి ఉన్నాం. దీని కోసమే రోహిత్‌ ప్రాణత్యాగం చేశాడు. కానీ రోహిత్‌ విషయంలో జరిగినట్టు, జేఎన్‌యూలో మేం జరగనివ్వమని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌ చేసి మరీ చెబుతున్నాం. మేం భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం నిలబడుతాం. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల విషయం వదిలెయ్యండి. ప్రపంచ పేదలంతా ఏకం కావాలని మేమంటున్నాం. 'ప్రపంచ కార్మికులారా ఏకం కండి' అని కోరే వాళ్లం మేం. ప్రపంచ మానవత వర్ధిల్లాలి. భారత మానవత వర్ధిల్లాలి అని మేమంటాం. మానవత్వానికి వ్యతిరేకంగా నిలబడిందెవరో మేం గుర్తించాం....  మీ న్యాయం మా న్యాయాన్ని ఇముడ్చుకోనప్పుడు మీ న్యాయాన్ని మేం ఒప్పుకోం. మీరు చెప్పే స్వాతంత్య్రాన్ని మేం ఒప్పుకోం. మనుషులందరికీ వారి రాజ్యాంగ హక్కులు లభించిన రోజునే మేం స్వాతంత్య్రాన్ని గుర్తిస్తాం."

సమాజాన్ని కులంతోనూ, మతంతోనూ చీలుస్తున్నవారు అత్యున్నత విద్యాసంస్థలైన యూనివర్శిటీల్లో కూడా కుల, మత, మనువాద తత్వాలను పెంచి పోషించాలని సర్వశక్తులు ప్రయోగిస్తున్న తరుణంలో, కన్హయ్య చేసిన మెరుపు ప్రసంగం ఈ దేశ ప్రజల నిజమైన వాణికి అచ్చమైన ప్రతిబింబం. జేఎన్‌యూ విశ్వవిద్యాలయ భావ, తాత్విక సంవేదనను మహత్తరమైన రీతిలో వ్యక్తీకరించిన కన్హయ్య కుమార్ ప్రసంగ పాఠంలోని విషయంతో మనం ఏకీభవించవచ్చు లేదా పూర్తిగా తిరస్కరించవచ్చు. కానీ వ్యవస్థీకృతమైన అధికార అహంకారానికి బలైన ఒక చైతన్య యువకుడి ఆత్మ నివేదనను ఈ ప్రసంగ పాఠం కళ్లకు కట్టినట్లు చూపుతోంది. కుహనా దేశభక్తి, నిర్బంధ జాతీయవాద సులోచనాల్లోంచి కాకుండా సరిగ్గా దానికి వ్యతిరేక కోణంలోంచి ఈ దేశాన్ని చూస్తే ఎలా ఉంటుందో చూపడానికి ఈ ప్రసంగ పాఠం ఓ ప్రత్యక్ష నిదర్శనం.

తెలుగులో ఏ ప్రధాన మీడియా కూడా ఇంత భావస్ఫోరకమైన ప్రసంగాన్ని ప్రచురించలేకపోవడం నిజంగా బాధాకరం. గత నాలుగు రోజులుగా దీన్ని అనువదించి సాక్షి పత్రిక సంపాదక పేజీలో ప్రచురించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదు. గత వారం రోజులుగా సాక్షిలో జేఎన్‌యూ ఘటనల పరంపరపై సాక్షిలో పలువురు కాలమిస్టులు వరుసగా తమ అభిప్రాయాలను ప్రచురిస్తుండటమే దీనికి కారణం. కాలమిస్టుల స్పందనలకు అదనంగా ఇంత పెద్ద ప్రసంగ పాఠం ప్రచురించడానికి తగిన స్పేస్ సాక్షి సంపాదక పేజీలో లేకపోయింది.

తెలుగులో ప్రధాన మీడియా దాదాపుగా విస్మరించిన  ఈ నేపథ్యంలో ప్రజాశక్తి పత్రిక కన్హయ్య ప్రసంగ పాఠాన్ని బాధ్యతగా భావించి "మనువులూ, హిట్లర్‌లూ, గోబెల్స్‌లూ! కాస్త నోళ్లు మూసుకుంటారా" అనే శీర్షికతో అచ్చు వేయడం అభినందనీయం.

ప్రజాశక్తి పత్రికలో జి.వి.కె ప్రసాద్ చేసిన తెలుగుసేత మూలంలోని భావ గాఢతకు తీసిపోనివిధంగా కుదిరింది. దేశానికి దిశానిర్దేశం చేస్తున్న ఇంత మంచి ప్రసంగాన్ని సారాంశం చెక్కుచెదరకుండా అనువదించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజాశక్తిలో వచ్చిన వ్యాసాన్ని యధాతథంగా (కొన్ని అచ్చుతప్పులను సవరించడం మినహా) ఈ బ్లాగులో ప్రచురిస్తున్నాను. ఇది బ్లాగర్ల కోసం మాత్రమే కాకుండా... నాకోసం, భవిష్యత్తులో కూడా పదే పదే నేను మననం చేసుకోవడానికి వీలిచ్చే అపురూప జ్ఞాపికగా దీన్ని నేను సొంతం చేసుకుంటున్నాను.

మీరూ చదవండి. చదివి ఇష్టమున్నా లేకున్నా కన్హయ్య ప్రసంగపాఠాన్ని వీలైనంతమందికి షేర్ చేయండి. 'తమసోమా జ్యోతిర్గమయ' అనే వేద పాఠం కూడా 'చీకట్లను తొలగించుకుని కాంతి ఉద్భవించుగాక' అనే చెబుతోంది. ఇది జ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం కూడా. చివరగా..  "వందపుష్పాలను వికసింపనివ్వండి. వేయి భావాలను వెదజల్లనివ్వండి.."

గమనిక: కన్హయ్య కుమార్ జేఎన్ యూలో విద్యార్థుల ముందు చేసిన ఈ ప్రసంగంలో రాజద్రోహ జాడలు ఉన్నాయని కనిపెట్టిన కేంద్రప్రభుత్వం వెంటనే ఆయనపై రాజద్రోహ ఆరోపణలు మోపి జైలుకు పంపింది. తదనంతర పరిణామాలు మనకందరికీ తెలిసినవే. సెడిషన్ అనే ఆంగ్లపదానికి రాజద్రోహం సరైన అనువాదం కాగా పనిగట్టుకుని మరీ దాన్ని దేశద్రోహం అని మార్చివేసి అటు పాలకులూ ఇటు దాని మీడియా తొత్తులూ చేసిన భావోద్వేగ ప్రేరిత దుష్ప్రచారం కారణంగా ఒక విద్యార్థి నేడు మనందరిముందూ దేశద్రోహిగా నిలిచాడు. ఇదీ నేటి భారతం. మౌన బాబా మోదీగారూ, మీ పాలన ఎంత ధర్మబద్ధంగా కొనసాగుతోందో వెనక్కి తిరిగి చూసుకుంటున్నారా?
................................


('రాజద్రోహం' ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేయడానికి కొద్ది ముందు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌ క్యాంపస్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంటర్నెట్‌పై యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న ఈ ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం. ప్రేక్షకుల చప్పట్ల మూలంగా అక్కడక్కడ వినబడని భాగాలు మినహాయిస్తే, ఇది ఆయన హిందీలో చేసిన ప్రసంగానికి పూర్తి పాఠం. జేఎన్‌యూ విద్యార్థుల 'దేశభక్తి' విషయంలో మతతత్వ శక్తులు సాగిస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో కన్నయ్య కుమార్‌ ప్రసంగమే అనేక ప్రశ్నలకు జవాబు చెబుతుందని భావించి దాన్ని యదాతథంగా ప్రచురిస్తున్నాం - ప్రజాశక్తి సంపాదకులు)

"...వాళ్లు త్రివర్ణ పతాకాన్ని కాలబెట్టే వాళ్లు. బ్రిటిష్‌ వాళ్లను క్షమాభిక్ష వేడుకున్న సావర్కర్‌కు శిష్యులు వాళ్లు. ఇప్పుడు హర్యానాలో ఖట్టర్‌ ప్రభుత్వం వాళ్లదే. ఈ ప్రభుత్వం షహీద్‌ భగత్‌సింగ్‌ పేరుతో ఉన్న విమానాశ్రయానికి ఒక 'సంఘీయుడి' పేరు పెట్టింది. వీళ్లా మాకు దేశభక్తి గురించి పాఠాలు చెప్పేది? దేశం గురించి, దేశభక్తి గురించి ఆర్‌ఎస్‌ఎస్‌తో చెప్పించుకునే దుస్థితిలో మేం లేం.... మేము ఈ దేశానికి చెందిన వాళ్లం. ఈ మట్టిని మేం ప్రేమిస్తాం. ఈ దేశంలో ఉన్న 80 శాతం పేద ప్రజల కోసం మేం పోరాడుతాం. మా దృష్టిలో దేశభక్తి అంటే ఇదే. మాకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉంది. అంతే కాదు, ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించే వాళ్లను మేం సహించబోమని కూడా స్పష్టం చేస్తున్నాం. 'సంఘీయులే' కానివ్వండి, లేదా మరెవరైనా సరే...

అయితే, 'ఝండేవాలా' (ఆర్‌ఎస్‌ఎస్‌ ఢిల్లీ కార్యాలయం)లో, 'నాగపూర్‌' (ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం)లో నిర్వచించే రాజ్యాంగంపై మాత్రం మాకెలాంటి విశ్వాసం లేదు! మాకు మనుస్మతిపై ఎలాంటి విశ్వాసం లేదు. ఈ దేశంలో వేళ్లూనుకున్న కులవ్యవస్థపై మాకు విశ్వాసం లేదు! అట్లాగే, ఇదే రాజ్యాంగంలో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 'రాజ్యాంగ పరిహారం' గురించి కూడా చెప్పారన్న విషయం మరచిపోవద్దు. మరణశిక్షను రద్దు చేయాలని కూడా అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారన్న విషయం మర్చిపోవద్దు. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆయన సర్వోన్నత స్థానం ఇచ్చారన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఈ అంశాలన్నింటితో సహా, మన మౌలిక హక్కులను, రాజ్యాంగపరమైన హక్కులను నిలబెట్టుకోవాలని మేం ఆకాంక్షిస్తున్నాం.

కానీ ఈరోజు ఏబీవీపీ తనకున్న మీడియా అండతో ఈ విషయాన్ని పూర్తిగానే తారుమారు చేయడం చాలా సిగ్గుచేటు.. బాధాకరం కూడా. విషయాన్ని అది పూర్తిగా నీరు గారుస్తోంది. నిన్న ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మాట్లాడుతూ, 'మేం ఫెలోషిప్‌ కోసం పోరాడుతామ'ని చెప్పాడు. ఎంత హాస్యాస్పదం ఇది! ఇప్పటికే వీళ్ల ప్రభుత్వం, మేడం 'మను'స్మతి ఇరానీ ఫెలోషిప్‌లు లేకుండా చేసేశారు. ఉన్నత విద్యకు బడ్జెట్లో వీళ్ల ప్రభుత్వం 17 శాతం కోత విధించింది. దాంతో మన హాస్టళ్లు గత నాలుగేండ్లుగా అఘోరిస్తున్నాయి. మనకు వై-ఫై లభ్యం కాలేదు. బీహెచ్‌ఈఎల్‌ ఒక బస్సునివ్వగా, దాంట్లో చమురు పోయడానికి అధికారుల వద్ద డబ్బు లేదు! ఏబీవీపీ వాళ్లు మాత్రం మేం హాస్టళ్లు నిర్మింపజేస్తామని, వై-ఫై తెప్పిస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.

మిత్రులారా! ఈ దేశంలో మౌలిక ప్రశ్నలపై చర్చ ప్రారంభిస్తే వీళ్ల ముసుగు తొలగిపోతుంది. మేం మౌలిక ప్రశ్నలు లేవనెత్తుతున్నందుకు గర్విస్తున్నాం. వాటిపై చర్చ చాలా అవసరం...జేఎన్‌యూలో జెహాదీలున్నారని సుబ్రమణ్యస్వామి అన్నాడు. జేఎన్‌యూ వాళ్లు హింసను వ్యాపింప జేస్తున్నారని అంటున్నారు. నేనీ జేఎన్‌యూ గడ్డ మీది నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్తలను సవాల్‌ చేస్తున్నాను. రండి, మాతో వాదించండి! మేమసలు 'హింస'కు సంబంధించిన మౌలిక అవగాహనపైనే చర్చ చేయాలనుకుంటున్నాం. 'ఖూన్‌ సే తిలక్‌ కరేంగే, గోలియోంసే ఆరతీ' (నెత్తుటితో తిలకం దిద్దుకుంటాం, తుపాకీ గుళ్లతో హారతి) అని ఏబీవీపీ వాళ్లు చేస్తున్న నినాదాల గురించి కూడా మాట్లాడుకుందాం రండి. ఈ దేశంలో మీరెవరెవరి రక్తం పారించాలను కుంటున్నారో చెప్పండి. ఎవరిపై తూటాలు పేల్చాలనుకుంటున్నారో చెప్పండి. అవును, మీరు తుపాకీ గుళ్లు కురిపించారు... బ్రిటిష్‌ వాళ్లతో చేయి కలిపి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడే వాళ్లపై గుళ్లు కురిపించారు. దేశంలో పేదరికంతో, ఆకలితో పీడితులైన వాళ్లపై మీరు గుళ్లు కురిపించారు. మీరు ముస్లింలపై గుళ్లు కురిపించారు.

మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమిస్తే, 'ఐదు వేళ్లు సమానమవుతాయా' అని మీరంటారు. మహిళలు 'సీత' లాగా ఉండాలని, అగ్నిపరీక్షకు దిగాలని మీరంటారు. ఈ దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం కదా! ప్రజాస్వామ్యంలో అందరికీ సమానంగా జీవించే హక్కుండాలి కదా! విద్యార్థులైనా, ఉద్యోగులైనా, పేదలైనా, కార్మికులైనా, రైతులైనా... అంబానీ అయినా, అదానీలైనా అందరికీ హక్కులు సమానమే కదా! కానీ మహిళల సమాన హక్కుల గురించి మాట్లాడితే, భారతీయ సంస్క తిని నాశనం చేయాలనుకుంటున్నారని మీరు గొంతు చించుకుంటారు.

నిజమే, మేం మీ దోపిడీ సంస్కతిని నిజంగానే నాశనం చేయాలనుకుం టున్నాం! మీ కులతత్వ సంస్కతిని నాశనం చేయాలనుకుంటున్నాం. మీ మనువాద సంస్కతిని నాశనం చేయాలనుకుంటున్నాం. అసలు సంస్కృతికి నిర్వచనాన్నే మార్చాలని మేమంటున్నాం. అసలు వీళ్లకు సమస్య ఎక్కడొస్తోంది? మనం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వీరికి కడుపుమంటగా ఉంది. 'లాల్‌ సలాం'తో పాటు 'నీలా సలాం' అని మనం నినదిస్తే, మార్క్స్‌తో పాటు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ గురించి మనం మాట్లాడితే వీరికి మింగుడు పడకుండా ఉంది.... కుట్ర వీళ్లదే. వీళ్లసలు బ్రిటిష్‌ వాళ్ల తొత్తులు! కావాలంటే నాపై పరువు నష్టం కేసు పెట్టుకోండి. ఆర్‌ఎస్‌ఎస్‌ చరిత్రే బ్రిటిష్‌ వాళ్లతో కుమ్మక్కయిన చరిత్రని మళ్లీ మళ్లీ అంటాను! ఈ దేశద్రోహులు మనల్ని దేశభక్తి సర్టిఫికేట్‌ చూపాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నా మొబైల్‌ను పరిశీలించండి మిత్రులారా! మా తల్లిని నానా రకాల బూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టారు. వీళ్లేనా భారతమాత గురించి మాట్లాడేది ఒకవేళ మీరు చెప్పే 'భారతమాత'లో నా తల్లి భాగం కాకపోతే నేను 'భారతమాత' అనే మీ అవగాహనను నేనంగీకరించను. నా తల్లి ఆంగన్‌వాడీ సేవకురాలిగా పని చేస్తోంది. రూ. 3,000లతో మా కుటుంబం బతుకుతోంది. ఆమెను వీళ్లు బూతులు తిడుతున్నారు. వీళ్ల 'భారతమాత' నినాదానికి నేను సిగ్గు పడుతున్నాను. ఈ దేశంలో ఉన్న నిరుపేద, దళిత, రైతుకూలీల తల్లులెవరూ వీళ్ల 'భారతమాత' పరిధిలోకి రారు. నేనంటాను 'జై'! దేశంలోని మాతలందరికీ జై! తండ్రులందరికీ జై! అక్కాచెల్లెండ్లకు జై! రైతుకూలీలకు, కార్మికులకు, ఆదివాసీలకు, దళితులకు జై! వాళ్లకు ఇలా అనే దమ్ముందా ఉంటే అనమనండి. 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌' అని అనమనండి వీళ్లను. 'భగత్‌సింగ్‌ జిందాబాద్‌' అనమనండి. 'సుఖ్‌దేవ్‌ జిందాబాద్‌' అనమనండి. 'అష్ఫాఖుల్లా ఖాన్‌ జిందాబాద్‌' అనమని అనండి. 'బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జిందాబాద్‌' అనమనండి.

బాబా సాహెబ్‌ 125వ జయంతి పేరుతో మీరాడిందంతా నాటకం! మీకు ధైర్యముంటే, బాబాసాహెబ్‌ చెప్పినట్టుగా ఈ దేశంలో కులవాదమే అతి పెద్ద సమస్య అని ఒప్పుకోండి. కులతత్వం గురించి మాట్లాడండి. రిజర్వేషన్లు అమలు చేయండి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ అమలు చేయండి.... అప్పుడు నమ్ముతాం మీకు ఈ దేశంపై విశ్వాసం ఉందని. అసలు దేశమంటే ఏమిటి? దేశమంటే మనుషులు! దేశం గురించిన మీ అవగాహనలో పేదలకు, నిస్సహాయులకు, రైతుకూలీలకు, ఆదివాసులకు, దళితులకు చోటే లేదు. నేను నిన్నొక టీవీ డిబేట్‌లో మాట్లాడాను. దీపక్‌ చౌరాసియాతో చెప్పాను. ఇది చాలా సీరియస్‌ సమయం అనే విషయం గుర్తుంచుకోండని అన్నాను. దేశంలో పడగ విప్పుతున్న ఫాసిజంతో మీ మీడియాకు కూడా ముప్పేనని చెప్పాను. ఇకపై మీక్కూడా సంఘ్ కార్యాలయం నుంచే స్క్రిప్టులు వస్తాయని అన్నాను. సరిగ్గా ఇందిరాగాంధీ సమయంలో కాంగ్రెస్‌ కార్యాలయం నుంచి వచ్చినట్టుగానే.

కొంత మంది మీడియా వాళ్లు అంటున్నారు. మా పన్నులతో, సబ్సిడీ డబ్బులతో జేఎన్‌యూ నడుస్తుంది అని. అవును నిజమే! అనుమానమేమీ లేదు. కానీ అసలు విశ్వ విద్యాలయాలు ఉన్నది దేని కోసం అని మేమడుగుతున్నాం. విశ్వవిద్యాలయాలుండేది సమాజంలోని 'కామన్‌ కాన్సెన్స్‌' (సామూహిక చేతన)ను విమర్శనాత్మకంగా విశ్లేషించడానికే. అవి ఆ పని చేయకపోతే దేశమే సరిగా నడవదు. అలాంటి దేశం కేవలం పెట్టుబడిదారులకు నెలవుగా మాత్రమే మిగిలిపోతుంది. దోపిడీ, పీడనలకు మాత్రమే ఆలవాలంగా మారిపోతుంది. దేశ ప్రజల సంస్కృతి, విశ్వాసాలకు, హక్కులకు స్థానం లేనప్పుడు అసలు దేశం అనే మాటలో అర్థమే లేదు.

మేం ఈ దేశంతోపాటుగా సంపూర్ణంగా నిలబడి ఉన్నాం. భగత్‌సింగ్‌, బాబాసాహెబ్‌ కన్న కలల కోసం నిలబడి ఉన్నాం. అందరికీ సమాన హక్కులుండాలన్న అవగాహనతో నిలబడ్డాం. అందరికీ జీవించే హక్కు ఉండాలి. అందరికీ తినే, మాట్లాడే, నివసించే హక్కుండాలి. ఈ స్వప్నంతోనే మేం నిలబడి ఉన్నాం. దీని కోసమే రోహిత్‌ ప్రాణత్యాగం చేశాడు. కానీ రోహిత్‌ విషయంలో జరిగినట్టు, జేఎన్‌యూలో మేం జరగనివ్వమని కేంద్ర ప్రభుత్వానికి సవాల్‌ చేసి మరీ చెబుతున్నాం. మేం భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం నిలబడుతాం.

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల విషయం వదిలెయ్యండి. ప్రపంచ పేదలంతా ఏకం కావాలని మేమంటున్నాం. 'ప్రపంచ కార్మికులారా ఏకం కండి' అని కోరే వాళ్లం మేం. ప్రపంచ మానవత వర్ధిల్లాలి. భారత మానవత వర్ధిల్లాలి అని మేమంటాం. మానవత్వానికి వ్యతిరేకంగా నిలబడిందెవరో మేం గుర్తించాం. మనువాదం, కులవాదం.. బ్రాహ్మణ వాదంతో కుమ్మక్కయిన పెట్టుబడిదారీ విధానం - ఇవే మానవత్వానికి శత్రువులు. వీటి ముఖాలను బట్టబయలు చేయాలి. నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన స్వాతంత్య్రం దేశంలో నెలకొల్పాలి. ఆ స్వాతంత్ర్యం రాజ్యాంగం ద్వారానే వస్తుంది. పార్లమెంటు ద్వారా వస్తుంది. ప్రజాస్వామ్యం ద్వారా వస్తుంది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన మధ్య ఎన్ని విభేదాలున్నా, భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం, రాజ్యాంగం కోసం, దేశ సమగ్రత కోసం మనందరం ఐక్యంగా నిలబడదాం. సంఘీయులే మన దేశాన్ని చీలదీసే శక్తులు... ఉగ్రవాదాన్ని పెంచి పోషించే శక్తులు.

ఇక చివరి ప్రశ్న. కసాబ్‌ ఎవరు? అఫ్జల్‌ గురు ఎవరు? శరీరాలపై బాంబులు కట్టుకొని హత్యలు చేయడానికి సిద్ధపడుతున్న ఆ పరిస్థితులేమిటి? ఈ ప్రశ్నను విశ్వ విద్యాలయాల్లో చర్చించకపోతే అవి ఉండీ ప్రయోజనం లేదని నా అభిప్రాయం. హింసను కూడా నిర్వచించుకుందాం. హింస అంటే ఏమిటి తుపాకీ తీసుకొని ఒకరిని చంపడమే హింస కాదు. దళితులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్‌ ఇవ్వడానికి నిరాకరిస్తే అది కూడా హింసే అవుతుంది. ఇది వ్యవస్థీకృత హింస. న్యాయం అంటే ఏమిటి? దీనిని నిర్ణయించేదెవరు? బ్రాహ్మణవాద వ్యవస్థలో దళితులకు మందిరంలోకి ప్రవేశం లేదు. ఆనాడు అదే న్యాయం. బ్రిటిష్‌ కాలంలో కుక్కలకు, భారతీయులకు రెస్టారెంట్లలోకి ప్రవేశం లేదనేవారు. అప్పటికి అదే న్యాయం.

కానీ ఈ న్యాయాన్ని అప్పుడూ సవాలు చేశారు. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు చెప్పే న్యాయాన్ని మేం సవాల్‌ చేస్తున్నాం. మీ న్యాయం మా న్యాయాన్ని ఇముడ్చుకోనప్పుడు మీ న్యాయాన్ని మేం ఒప్పుకోం. మీరు చెప్పే స్వాతంత్య్రాన్ని మేం ఒప్పుకోం. మనుషులందరికీ వారి రాజ్యాంగ హక్కులు లభించిన రోజునే మేం స్వాతంత్య్రాన్ని గుర్తిస్తాం. ప్రతి మనిషికీ తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హౌదాను కల్పించినప్పుడే, ఆ రోజునే మేం ఇది న్యాయమని ఒప్పుకుంటాం. జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఏ రకమైన హింసనూ, ఏ ఉగ్రవాదినీ, ఏ ఉగ్రవాద సంఘటననూ, ఎలాంటి దేశ వ్యతిరేక చర్యనూ ఏ రకంగానూ సమర్థించదని నేను స్పష్టం చేస్తున్నాను. కొంతమంది... గుర్తు తెలియని వ్యక్తులు 'పాకిస్తాన్‌ జిందాబాద్‌' అని నినాదాలు చేశారు. దానిని జేఎన్‌యూ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండిస్తోంది....

తెలుగు సేత జి.వి.కె. ప్రసాద్‌

https://www.youtube.comwatchv=21qExVVuhhk

ప్రజాశక్తి పత్రికలో వచ్చిన కన్హయ ప్రసంగ పాఠం లింకులు ఇక్కడ చూడండి.
Posted On Tue 16 Feb 000009.278402 2016

http://www.prajasakti.com/EditorialPage/1758266
http://epaper.prajasakti.com/c/8628400 (For Epaper article)


Sunday, February 21, 2016

ఇలాంటి 'పరివారం'తో మోదీకే ప్రమాదమట!

జవహర్‌లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్యా కుమార్ వ్యవహారంలో కేంద్రప్రభుత్వం, బీజేపీ, దాని అనుబంధ సంస్థలు, లాయర్ల ముసుగులోని వీధి రౌడీలు, వీరితోపాటు ఢిల్లీ పోలీస్ చీఫ్ ఇంతవరకు అనుసరించిన వైఖరిని దేశం మొత్తం మీద ఒక్క పత్రిక కానీ, ఇతర మీడియా కానీ మద్దతు పలుకుతున్న చిహ్నాలు కనిపించటం లేదు. (హిందూత్వ అనుకూల చానెళ్లూ, గార్దభ గోస్వామి వంటి  వాటి వందిమాగధ యాంకరాగ్రేసరులు తప్ప)

అమెరికాలో నివసిస్తున్న నోమ్ చామ్‌స్కీ వంటి ప్రపంచ స్థాయి మేధావులు వందలాదిమంది జేఎన్‌యూ వ్యవహారంపై తీవ్ర నిరసన తెలుపుతున్నా,  ప్రపంచంలోని అన్ని పత్రికలూ కన్హయ్యా అరెస్టుకు వ్యతిరేకంగా  సంపాదకీయాలు రాసినా కానీ మన ప్రధాని మాత్రం నోరుమెదపకపోవటం ఆలోచనాపరులను దిగ్భ్రాంతిపరుస్తోంది. జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేములను బలిగొన్న ఘటన కానీ, ఒక చైతన్య శీలి అయిన యువకుడి భవిష్యత్తుతో చెలగాటమాడి జేఎన్‌యూ పరువునే కాకుండా దేశం పరువును కూడా నడిబజారులో నిలబెట్టిన తాజా ఘటన కానీ చెదురుమదురు ఘటనలు మాత్రం కావు. వాటి వెనుక స్పష్టమైన ఎజెండా ఏదో ఉన్నట్లు సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి.

దైవభక్తికి దేశభక్తిని జోడించి ప్రాబల్యం పెంచుకోవాలన్నది బీజేపీ తాజా ప్రయత్నమైతే దాంట్లో భాగంగా చేస్తున్న ఇంత రాద్ధాంతం ఈ ఎత్తుగడను ఫలింపచేస్తుందో కూడా తెలియదు. కానీ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఒక ఘటనపైన కేంద్ర హోంమంత్రి, హెచ్‌ఆర్‌డీ మంత్రి, పోలీసు బలగం జోక్యం చేసుకొని గోటితో పోయే విషయాన్ని గొడ్డలి దాకా తెచ్చిన ఫలితం మాత్రం మోదీ ప్రభుత్వాన్ని ఊరికే వదలదంటున్నారు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి గారు.

యూపీఏ అవినీతి కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు మోదీని ఆపద్బాంధవుడుగా పరిగణించి ఓట్లు వేసి గెలిపించారు. వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలాగానే మోదీ నేతృత్వంలోని సర్కార్ అన్ని వర్గాలనూ కలుపుకొని పోతుందనీ, సొంత ఎజెండాను పక్కన పెడుతుందనీ ఆశించినవారికి ఇంత త్వరగా భంగపాటు కలుగుతుండటం గుర్తించదగ్గ విషయం.

అప్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీన కశ్మీర్ యువత స్మారక సభలు జరుపుకోవడం కొత్త కాదు, కశ్మీర్ స్వాతంత్ర్యం, పాకిస్తాన్ అనుకూల వైఖరి పట్ల వారు నినాదాలు చేయడం కూడా ఈ దేశానికి కొత్త కాదు. ఈసారి జేఎన్‌యూలో అది కాస్త శ్రుతి మించి ఉండవచ్చు. కానీ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఢిల్లీ నడి బొడ్డున నినాదాలు చేసిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఉండొచ్చు కానీ ఏ పని చేసినా చట్టబద్ధంగా, హేతుబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్నట్టు కనిపించాల్సిన సున్నిత వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు, దేశభక్తి పూనకం నిండా ఆవహించిన లాయర్లు వ్యవహరించిన తీరు బీజేపీకే అంతిమంగా నష్టదాయకం అంటున్నారీయన..

వాస్తవానికి అప్జల్ గురు ఉరిని నాటినుంచి నేటిదాకా బహిరంగంగా వ్యతిరేకిస్తూ వస్తున్న కశ్మీర్ పీడీపీ అధినేత్రి మొహబూబా ముఫ్తీని తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి ఆమె మంత్రివర్గంలో చేరడానికి నానా తిప్పలు పడుతున్న పాలకపార్టీకి.. వేళ్లమీద లెక్కబెట్టదగిన సంఖ్యలోని విద్యార్థులు -ఉడ్డా ముగ్గురు- అప్జల్ ఉరికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై ఇంత రాద్ధాంతం చేయడం అవసరమేనా? అయిదు లక్షల మంది భారత సైనిక బలగాలు నిత్య పహారా కాస్తున్నప్పటికీ కశ్మీరులో వేలాది మంది బహిరంగంగా పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తుండగా, ఆకుపచ్చ జెండా ఎగురవేస్తుండగా అక్కడ ఎవరిపైనా రాజద్రోహ కేసులు పెట్టిన పాపాన పోలేదు.

పైగా దేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో మూడురంగుల జెండాను ఎగురవేయడం ద్వారా దేశభక్తిని కొత్తగా వర్శిటీ విద్యార్థులకు నేర్పాలనుకుంటున్న రాజకీయ నాయకత్వం చట్టసభల్లోపలా, బయటా ఎంత నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. దేశ ప్రజలపై ఒకే భావజాలాన్ని రుద్దాలని ప్రయత్నించినా, తాము మాత్రమే దేశ భక్తులమనీ, తక్కినవారంతా దేశద్రోహులనీ అడ్డంగా వాదించినా ఈ దేశ ప్రజలు సహించరు. ఒకే భావజాలాన్ని అందరూ అంగీకరించాలనీ, తమ అభి మాతాన్నే అందరూ శిరసావహించాలని భావించేవారికి భారత సమాజం అర్థం కాలేదని అనుకోవాలి.

సోషల్ మీడియాలో పోస్టింగులను చూసీ, పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న అర్ణబ్ గోస్వామి వంటి జర్నలిస్టులను చూసీ అదే సకల జనాభిప్రాయం అని భావిస్తే పొరబాటనీ, పోయిన ఎన్నికలలో ఎటువంటి రాజకీయ, సామాజిక భావజాలం లేని యువత  అసంఖ్యాకంగా ఓటు చేయబట్టే బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో లోక్‌సభలో 282 స్థానాలు గెలుచుకోగలిగిందనీ మూర్తిగారంటున్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం, జెఎన్‌యూ పరిణామాలు బీజేపీకి ఏమాత్రం మేలు చేయవనీ, కశ్మీర్ ప్రజలలో దేశభక్తిని పాదుకొల్పడానికీ దోహదం చేయవనీ, పైగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ కంటే, కమ్యూనిస్టులకంటే సొంత పరివారం ద్వారానే ముప్పు తప్పదనీ ఆయన హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి ఆవేశకావేశాలకు తావీయకుండా, సమతుల్యతతో ఆయన ఇవ్వాళ సాక్షి దినపత్రిక సంపాదకీయ పేజీలో 'త్రికాలమ్‌'లో రాసిన బృహత్ కథనాన్ని కింది లింకులో చదువగలరు.

ఎజెండా వందనం
http://www.sakshi.com/news/opinion/narendra-modi-leading-nda-government-315901

Thursday, February 18, 2016

ఈ అబద్ధాల రాయుళ్లూ దేశభక్తి పరులేనా?

"తెలుగునాట భక్తిరసం- తెప్పలుగా పారుతోంది
డ్రెయినేజీ స్కీములేక- డేంజరుగా మారుతోంది''

అంటూ ప్రముఖ అభ్యుదయ కవి గజ్జెల మల్లారెడ్డి, వ్యక్తుల ప్రైవేట్ వ్యవహారంగా ఉన్న భక్తిని వ్యాపారమయం చేస్తున్న అపధోరణిని పై కవిత ద్వారా దశాబ్దాల క్రితమే అక్షరీకరించారు.

దీన్ని ఇప్పుడు భారత దేశం మొత్తానికి వర్తింపజేసి 'ఇండియాలో దేశభక్తి తెప్పలుగా పారుతోంది.. డ్రెయినేజీ స్కీములేక డేంజరుగా మారుతోంది'  అని మార్చి పాడుకుంటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో దేశభక్తి భావనను ఇంతగా కలుషితం చేస్తున్న దేశం మరొకటి లేదనిపించేవిధంగా భారత్ ప్రపంచం ముందు నవ్వుల పాలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రోహిత్ వేముల నుంచి మొదలై, కన్హయ కుమార్ అరెస్టు దాకా సాగుతున్న ప్రహసనంలో రాజ్యం రాజ్యమే దేశభక్తికి కొత్త నిర్వచనాలిస్తూ.. భిన్నాభిప్రాయం ప్రకటించిన వారినల్లా జైళ్లలో కుక్కడం, వెలివేసి  మరీ ఆత్మహత్యలకు ప్రేరేపించడం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

కానీ యూనివర్సిటీ వంటి అత్యున్నత విద్యాసంస్థల వైస్ చాన్సలర్‌లే ఇంత అబద్దాలకు, పచ్చి వక్రీకరణలకు దిగగలరని మా తరం ఎన్నడూ ఊహల్లో కూడా భావించలేదు. 33 ఏళ్ల క్రితం యూనివర్సిటీ చదువు పూర్తి చేసుకున్న మా పాత తరంకి వైస్ చాన్సలర్లు ఇలా కూడా ఉంటారా అనే కొత్త సత్యం ఇప్పుడు బోధపడుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అప్పారావు, ఇప్పుడు జవహర్‌లాల్ యూనివర్సిటీ వైస్ చాన్సరల్ జగదీష్‌ కుమార్ అబద్దాలు ఆడటంలో అందరినీ మించిపోయారని తేలిపోయింది. యూనివర్సిటీ పరువు తీయడంలో ఇంత అధ్వానంగా వ్యవహరించిన వీసీలను ఇటీవలికాంలో మాత్రం చూడలేదు. ఈ ఇద్దరు వీసీలూ మన తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వాళ్లు కావడంతో తెలుగువాళ్ల పరువు హుసేన్ సాగర్‌ సాక్షిగా మురికిలో కలిసిపోయింది.

విద్యార్థుల శ్రేయస్సునూ, యూనివర్సిటీ ప్రతిష్టను తాకట్టు పెట్టి మరీ వీరెందుకిలా వ్యవహరించారన్నది ప్రశ్న. ఒక విద్యార్థి సంఘానికి, దాని రాజకీయ పార్టీకి తలొగ్గకపోతే ఇలాంటి అబద్దాలు వీరి నోటి నుంచి ఎలా వస్తాయన్నది ఇప్పుడు చర్చగా మారింది. రోహిత్‌ను వెలి వేయలేదని, హైద్రాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్‌ను, ఇతర దళిత విద్యార్థులపై ఎలాంటి ఆంక్షలూ విధించలేదని, చివరివరకూ దళిత విద్యార్థుల గురించే ఆలోచించానని గతంలో ఆ వర్సటీ వీసీ అప్పారావు అడుగడుగునా అబద్దాలు చెప్పిన చరిత్ర మన కళ్లముందే ఉంది

.

ఇప్పడు మరొక తెలుగు వైస్ చాన్సలర్ అబద్దాలు చెప్పడంలో తానెవరికీ తీసిపోనంటూ నిరూపించుకున్నారు. జెఎన్‌యూలో హాస్టళ్లను తనిఖీ చేయాలని, విద్యార్థులను అరెస్టు చేయాలని పోలీసులను తాను కోరలేదని ఆ వర్శిటీ వీసీ జగదీష్ కుమార్ చెబుతున్నదానికీ, కనిపిస్తున్న ఆధారాలకు ఏమాత్రం పొంతన కుదరటం లేదని పత్రికలు ఇప్పుడు కోడై కోస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు, వీసికి మధ్య కొనసాగిన లేఖల్లో అవసరమైతే తనిఖీలు చేసుకోవచ్చని ఈ వీసీ అనుమతి ఇవ్వడం స్పష్టంగా ఉందని తేలింది. జెఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయకుమార్‌ను అరెస్టు చేసిన రోజే (ఫిబ్రవరి 11) వీసీ రాసిన లేఖలో అవసరమనిపిస్తే జేఎన్‌యూ క్యాంపస్‌లోకి ప్రవేశించి తనిఖీలు చేసుకోవచ్చని వీసీ అనుమతిచ్చినట్లు దక్షిణ ఢిల్లీ డీసీపీకి వర్సిటీ రిజిస్ట్రార్ భూపిందర్ జుట్షి రాతపూర్వకంగా తెలియపర్చారని తాజా వార్త.

నరనరానా హిందూ భావజాలం జీర్ణించుకున్న వారిని ఈ దేశంలోని సమస్త అధికార రంగాల్లోనూ చొప్పించే ప్రయత్నం పకడ్బందీగా చేస్తున్నట్లు కర్నాటక బీజేపీ వర్గాలు గత ఏడాది చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఇప్పుడు మరింతగా రుజువవుతున్నాయి. (ఇప్పటికే కర్ణాటక లోని పోలీసు విభాగంలో 60 శాతం మేరకు సంఘ్ పరివార్ అనుకూల శక్తులనే నియమించామని ఆ రాష్ట్ర బీజీపీ నేత స్పష్టం చేశారు కూడా). ఈ ఇద్దరు తెలుగు వీసీలు కూడా ఆ బాపతువారే అని ఇప్పుడు తేలుతోంది.

తెలంగాణ ప్రాంతానికి చెందిన జగదీష్ కుమార్‌ను రెండు నెలల క్రితం ఉన్నట్లుండి ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా నియమిస్తున్నట్లు వార్తలు రాగానే ఎవరీయన అని వాకబు చేస్తే. కరుడుగట్టిన ఆరెసెస్‌ వాది అని మీడియా మిత్రులు ఆనాడే చెప్పారు. వాక్స్వాతంత్రానికి, వ్యక్తి స్వేచ్చకు ప్రతీకగా నిలిచిన జేఎన్‌యూకు ఇతగాడిని వీసీగా పంపిస్తున్నారంటేనే ఆ వర్సిటీకి మూడిందని, ఆరోజే మీడియా మిత్రులు హెచ్చరించారు. సరిగ్గా అదే నిజమైందిపుడు.

జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ కుమార్‌ను ఎంత నిరాధార ఆరోపణలతో జైలుకు పంపించారో ఇప్పుడు వాస్తవాలు బయటపడుతున్నాయి. కింది లింకును చూడగలరు.

JNU student leader Kanhaiya named in FIR only after TV report

హిందూస్తాన్‌టైమ్స్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి వ్యవస్థానుకూల లేదా బీజేపీ అనుకూల పత్రికలే కన్హయ ఉదంతంలో అధికారుల, పోలీసుల అతి చేష్ట్యను తూర్పారబడుతూ వరుస కథనాలు ప్రచురిస్తున్నాయి. పైగా కన్హయపై దేశద్రోహ నేరం కింద కేసు నమోదు చేయడం గర్హనీయమని, పాకిస్తాన్ జిందాబాద్ లాంటి నినాదాలు చేశాడని అతడిని అరెస్టు చేయడం జరిగివుంటే అది దేశద్రోహం కిందికి రాదని, దేశద్రోహ నేరాన్ని సుప్రీంకోర్టు విస్పష్టంగా నిర్వచించిందని ప్రముఖ రాజ్యాంగ వేత్త, మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ వ్యాఖ్యానించారు. ఇవేవీ మనుషుల్లో కాకుండా... మట్టిలో, రాళ్లలో, మంచుకొండల్లో మాత్రమే దేశభక్తిని చూస్తున్న వారికి కనిపించవు, వినిపించవు కాబోలు.

అసలు దేశద్రోహం అనే పదమే నేర న్యాయ చట్టంలో లేదని సెడిషన్ అనే పదానికి రాజద్రోహం అని వందల సంవత్సరాలుగా వాడుకలో ఉంటూండగా దాన్ని దేశద్రోహంగా మార్చి ఉద్దేశపూర్వకంగా భావోద్వేగాలను రెచ్చగొట్టే తత్వం ఇప్పుడు బలం పుంజుకుంటోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బ్రిటిష్ వారు కూడా రాజద్రోహం అనే పదమే వాడారు తప్పితే వారి వలస పాలనలో దేశద్రోహం అనే భావనకే తావు లేదు. పైగా అది కాలం చెల్లిన పదం. ఎక్కడైతే పుట్టిందో ఆ బ్రిటన్‌లోనే 20 ఏళ్ల క్రితమే రద్దయిన పురాతన చట్టం అది. కాని నేటి భారతీయ కుహనా దేశభక్తులకు మాత్రం ఆ వలస పాలనా వారసత్వాన్ని కొనసాగించడమే కాదు దాన్ని వక్రీకరించి దేశభక్తి పైత్యాన్ని తారస్థాయికి తీసుకుపోవడం కూడా తాము ప్రబోధించే సంస్కృతిలో భాగమైనట్లుంది.

మొత్తంమీద మౌలిక ప్రశ్న. దేశభక్తులూ వారి అనుయాయులూ, వారి పంచమాంగ దళాలూ ఇన్ని అబద్దాలు, అసత్యాలు, నిరాధార చర్యల ద్వారా తమ దేశభక్తి చుట్టూ ఇలాంటి కోటలెందుకు కట్టుకుంటున్నారన్నదే ఇప్పుడు పజిల్‌గా మారింది. అబద్దాలతో, అసత్యాలతో, లేనిపోని అనుమానాలతో నిర్మితమవుతున్న ఇలాంటి కుహనా దేశభక్తికి మామూలు జనం ఎంత దూరంగా ఉంటే వారికీ, దేశానికీ కూడా చాలా మంచిది.

ఇలాంటి పైపై మెరుగుల దేశభక్తికి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత శక్తివంతంగా సమాధానమిచ్చిన కన్హయ కుమారే మన కాలం వీరుడు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి సంఘాల నేతల సైద్ధాంతిక లేమిని చూస్తే కన్హయ రాసిన ఆ ఉత్తరం ఎంత తాత్వికంగా, ఎంత శక్తివంతంగా ప్రగతిశీల భావనను వ్యక్తీకరించిందో పూర్తిగా చదివితే కానీ బోధపడదు.

Is this anti-India :  Read full text of JNU leader Kanhaiya’s speech

గత మూడు రోజులుగా పాటియాలా కోర్టు ఆవరణలో లాయర్ల ముసుగులోని వీధి రౌడీలు, నేతలు జేఎన్‌యూ విద్యార్థులపై, జర్నలిస్టులపై చేస్తున్న దాడులు, వాటిపై రాజ్యయంత్రాంగం మొత్తంగా నిద్రపోవడం చూస్తూ మనసు రగిలిపోయిున ఒక సీనియర్ జర్నలిస్టు ఒకే మాటన్నారు. న్యాయాన్ని నడిరోడ్డుపై ఇలా కుళ్లబొడుస్తున్న ఇలాంటి వారి పని పట్టాలంటే శాంతి కపోతాలను అరువు తెచ్చుకుని గత యాభై ఏళ్లుగా ఎముకలు కుళ్లిన ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాలు చాలవని, దీనికి మావోయిస్టులు బలపడటమే పరిష్కారమని, వారు చేపట్టే చర్యలే కొన్ని సందర్భాల్లో చాలా న్యాయమైనవని  ఆయన అన్నారు.

ఆయన మాటలు నిజం కాకూడదనే భావిద్దాం. కానీ ఈ కుహనా దేశభక్తుల వీరంగం చూస్తుంటే దేశంలో రేపు జరగబోయే పరిణామం అదేనా అనే సందేహం వస్తోంది.

Let Kanhaiya come, we will burn him alive: Lawyer recalls JNU horror


దేశరాజధానిలో నల్లకోటు ధరించిన లాయర్లు వీధిరౌడీలకంటే మించిన జుగుప్సాకరమైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కస్టడీలో ఉన్న కన్హయపై పిడిగుద్దులు కురిపించారంటే ఈ వ్యవహారం ఇక మాటలతో తేలే పని కాదనిపిస్తోంది.

ఇప్పుడే అందిన వార్త. 2014 ఒక్క సంవత్సరంలోనే ఎన్డీయే పాలనలో 47  రాజద్రోహ కేసులు నమోదు చేశారని ఇన్నేళ్ల దేశ చరిత్రలో ఎన్నడూ ఇన్ని రాజద్రోహ కేసులు నమోదు కాలేదని ఎన్‌సీఆర్‌బీ నివేదిక తాజాగా తెలుపుతోంది. రాజద్రోహులు పెరుగుతున్నారంటేనే రాజ్య పాలన సక్రమంగా లేదని అర్థం. స్వతంత్ర పోరాటం పదే పదే మనకు నేర్పిన పాఠం ఇదే.

అబద్దాల పునాదిపై దేశభక్తిని వక్రమార్గం పట్టిస్తున్న పాలనలో రాజద్రోహాలు పెరగక తప్పదని పై గణాంకాలే చాటి చెబుతున్నాయి.

తాజా వార్త మరింత ఆసక్తిదాయకంగా ఉంది. దేశభక్తి వికృతత్వం బీజేపీ విద్యార్థి సంఘంలోనే కలవరం పుట్టిస్తున్నట్లు చెబుతున్న ఈ కింది వార్తను తప్పక చదవాల్సిందే.

కేంద్రంపై నిరసనగా ఏబీవీపీ నాయకులు రాజీనామా

న్యూఢిల్లీ: జేఎన్ యూలో కన్హయ్య కుమార్ అరెస్టు వివాదం, రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు, పోలీసుల స్పందన తమను కలిచి వేసిందంటూ బీజేపీకి చెందిన విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కు చెందిన ముగ్గురు విద్యార్థి నాయకులు తమ బాధ్యతలకు రాజీనామా చేశారు. 'జేఎన్ యూకు చెందిన ముగ్గురు ఏబీవీపీ నాయకులు కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు' అని పీటీఐ వార్తా సంస్థ గురువారం ఉదయం వెల్లడించింది.

వారు ఒక లేఖను ఈ సందర్భంగా విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఉండలేమంటూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అధ్యక్షుడు రాహుల్ యాదవ్, కార్యదర్శి అంకిత్ హన్స్, మరో కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జేఎన్ యూ వివాదం, మనుస్మృతిపై చాలా కాలంగా బీజేపీకి ఉన్న అభిప్రాయం, రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన విషయంలో కేంద్రం తీరుపై అభిప్రాయ భేదాలు రావడంతోపాటు పోలీసుల చర్యలు కూడా తమను ఇబ్బందికి గురిచేశాయని, విద్యార్థుల మధ్య చీలికలు తెచ్చేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీంతోపాటు దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.)
-------------------------
దేశభక్తుల పార్టీ వ్యవహారాన్ని ఆ  పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంతో ఇన్నాళ్లూ అంటకాగిన వారే ఇంత ఘనంగా ప్రకటిస్తున్నారు. కింది వార్త చూస్తే ఇంత దేశ భక్తా అని కిందపడి దొర్లాలనిపించకమానదు.

ఈ కింది వార్త దేశభక్తుల డొల్లతనాన్ని ఇంకా బాగా చెబుతోంది చూడండి. భారత మాతతో చెలగాటమాడితే గ్యాంగ్ రేప్ తప్పదట. ఇది ఖచ్చితంగా కుహనా దేశభక్తిని నరనరానా జీర్ణింప చేసుకున్న మూర్ఖ శిఖామణి ప్రేలాపన. ఈ ప్రేలాపన చేసినవాడిని కాదు ఇతగాడి తల్లిదండ్రులను చూసి మనం జాలిపడాలి. ఎలాంటి వాడికి వాళ్లు జన్మనిచ్చారా అని.

ఒకట్రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్‌రేప్ చేస్తారు!

ముంబై: ఒకట్రెండు రోజుల్లో నిన్ను గ్యాంగ్‌రేప్ చేస్తామంటూ ఓ మహిళా జర్నలిస్టును ట్విట్టర్‌లో హెచ్చరించాడో దుండగుడు. ఈ బెదిరింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసులు అతనిపై కేసు నమోదుచేశారు. అమరేంద్రకుమార్ సింగ్ అనే ట్విట్టర్‌ ఖాతాదారుడు ఈ మేరకు హెచ్చరిక చేశాడు. జేఎన్‌యూ వివాదం నేపథ్యంలో ఢిల్లీ పటియాల కోర్టులో పాత్రికేయులపై జరిగిన దాడిని ఖండిస్తూ ముంబైలో విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఫొటోలను ఓ మహిళా జర్నలిస్టు తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. దీంతో ఆమెను ఉద్దేశించి అమరేంద్రకుమార్ తీవ్రస్థాయి బెదిరింపులకు దిగాడు. 'ఒకట్రెండు రోజుల్లో నీపై తీవ్రమైన గ్యాంగ్‌ రేప్ జరుగుతుంది. స్పృహలోకి రండి. భారత మాతతో చెలగాటమాడకండి' అంటూ అతడు ట్వీట్ చేశాడు. దీనిపై ఆ పాత్రికేయురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. అతనిపై ఐపీసీ సెక్షన్లు 354 (ఏ) 1 (అమర్యాదపూర్వకంగా వ్యవహరించడం), 509 (మహిళలను అవమానించే చర్యలకు పాల్పడటం), 506 (నేరపూరిత ఉద్దేశం) కింద ఆజాద్ మైదాన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదుచేశారు.)

సంస్కృతి గురించి ఓనమాలు తెలియని బాపతు రకాలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. బాధాకరమైనదేమిటంటే మొత్తం మన సోషల్ మీడియా అంతా ఇలాంటి సంస్కృతీ ఉద్ధారకులే పాతుకుపోయారు. భిన్నాభిప్రాయం పట్ల వీరి వ్యాఖ్యలు చూస్తే సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న అభిప్రాయం తప్పు కాదనిపిస్తుంది. ఒక తెలుగులోనే కాదు .. దేశమంతా సోషల్ మీడియా బతుకు ఇలాంటివాళ్లతోటే తెల్లారుతోంది. సాక్షాత్తూ నరేంద్రమోదీకే డోకు వచ్చి తూర్పారపట్టిన ఈ రకం దేశభక్తి ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలో తెప్పలుగా పారుతోంది మరి.

చివరగా.. ఇలాంటి దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటే ఎంత బావుణ్ణో..!

ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో ,
సంసారపు గోడల మధ్య
ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో,
ఎక్కడ సత్యాంతరాళంలోంచి పలుకులు బైలు వెడలతాయో,
ఎక్కడ అలసట నెరుగని శ్రమ
తన బాహువుల్ని పరిపూర్ణత వైపు చాస్తుందో,
ఎక్కడ నిర్జీవమైన ఆచారపుటెడారిలో
స్వచ్చమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో,
ఎక్కడ మనసు
నిరంతరం వికసించే భావాలలోకి, కార్యాలలోకి
నీచే నడపబడుతుందో,
ఆ స్వేచ్ఛా స్వర్గానికి,
తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు.
-గీతాంజలి (రవీంద్రనాథ్ టాగోర్)

గమనిక:
(రెండురోజులుగా కళ్లకలక సమస్యతో నా ఈ టపాపై వచ్చిన స్పందనలకు సమాధానమివ్వలేకపోయాను. ఇక్కడ తాజాగా అదనపు సమాచారాన్ని పొందుపరుస్తున్నాను. చూడగలరు.)

నా టపాను ఇంకా చూస్తున్న వారికి ఇక్కడ మరొక లింకును ఇస్తున్నాను. మీరు ఆమోదించినా లేకున్నా సరే ది వైర్ వెబ్ సైట్లో ప్రచురితమైన ఈ ఆంగ్ల కథనాన్ని తప్పక చదవగలరు. ఇండో అమెరికన్ రచయిత, ది వైర్ సంపాదకుడు, హిందూ మాజీ జర్నలిస్టు సిద్ధార్థ్ వరదరాజన్ 19వ తేదీన ఈ కథనం ప్రచురించారు.

On Kanhaiya: It is Time to Stand Up and Be Counted

http://thewire.in/2016/02/19/on-kanhaiya-it-is-time-to-stand-up-and-be-counted-22039/

ఆకలి నుంచి స్వాతంత్యం, భూస్వామ్య విధానం నుంచి స్వాతంత్ర్యం, మతతత్వం నుంచి స్వాతంత్ర్యం అంటూ ఎలుగెత్తిన కన్హయ్య ప్రసంగంలోని మాటలను కత్తిరించి కశ్మీరీ స్వాతంత్ర్యం అంటూ కథలల్లి ప్రకటించిన జీన్యూస్, ఇండియా న్యూస్, న్యూస్ ఎక్స్, టైమ్స్ నౌ టీవీ జర్నలిస్టులు జర్నలిజానికే కాదు.. భారతదేశానికే కళంకం అంటూ ఈ వ్యాస రచయిత ఆరోపిస్తున్నారు.

కన్హయ్య అనని మాటలను అనినట్లుగా అసలు వీడియోను మార్చిన బీజేపీ నేతలు కానీ, దాన్ని అందిపుచ్చుకున్న డిల్లీ పోలీస్ చీఫ్ బస్సీ కానీ, వంతపాడిన ఆర్ఎస్ఎస్ అనూకూల చానెళ్లు కాని, లేని నేరం మోపి కోర్టు ఆవరణలోనే కన్హయపై, అధ్యాపకులపై దాడి చేసిన బీజేపీ ఎంఎల్ఏ, ప్రొ బిజేపీ లాయర్లు కాని వీళ్లకంటే మించిన దేశ ద్రోహులు లేరంటూ సిద్ధార్థ్ వరదరాజన్ ప్రకటిస్తున్నారు.

చైతన్యశీలి అయిన ఒక యువకుడి జీవితాన్ని పిచ్చికుక్కలకు ఆహారంగా వదిలిన మార్ఫింగ్ జర్నలిస్టులకే శిక్ష విధించాలంటున్నాడీయన. ఆయన కథనంతో మీరు ఏకీభవించినా, ఏకీభవించకపోయినా సరే, ఆయన వాదనను కనీసం చదవండి చాలు.

సోమవారం లోపు ఈ వ్యాసాన్ని అనువదించి ఇక్కడే ప్రచురిస్తాను. దీంతోపాటు కన్హయ్య పూర్తి ప్రసంగ పాఠాన్ని కూడా..

Friday, February 12, 2016

అంతరిక్ష అధ్యయనంలో శతాబ్ది ఆవిష్కరణదాదాపు ఆరేళ్ల క్రితం అంటే 2009లో చెన్నైలో చందమామ పత్రిక వెబ్‌సైట్‌లో అసోసియేటెడ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడు మద్రాస్ మ్యూజియంలో విశేషాలను ప్రచురించే పనిమీద ఆ మ్యూజియం సందర్శించాము. నాతోపాటు తమిళ, ఇంగ్లీష్ భాషల చందమామ అసోసియేటెడ్ ఎడిటర్లు ప్రేమ్ కుమార్, తార కూడా మ్యూజియంకు వచ్చారు. (మద్రాస్ మ్యూజియంకి మరోపేరు ఉంది చచ్చిన కాలేజి అని. అంటే జీవంలేని వస్తువులను భద్రపర్చారు కాబట్టి అది చచ్చిన కాలేజి. జీవం ఉన్న వాటిని సంరక్షిస్తున్నారు కాబట్టి బతికిన కాలేజి అని మద్రాస్ జూ పార్క్‌ని పిలిచేవారు. దీంట్లోనే చిల్డ్రన్ పార్క్ కూడా భాగం.)

మా పనిలో భాగంగా మద్రాస్ మ్యూజియం వెళ్లి అక్కడున్న అయిదారు మహా భవంతులలోని విశేషాలను నోట్ చేసుకుని అవసరమైన ఫొటోలు తీసుకున్నాం. ఆ మ్యూజియంలో కెల్లా పంచలోహాలతో చేసిన భారీ నటరాజ విగ్రహం ఒక శిఖర స్థాయి కళాఖండం. దాన్ని చూసేందుకు విదేశీయులు సైతం పనిగట్టుకుని వస్తుంటారని ప్రతీతి. ఆ మ్యూజియం భవంతుల వెలుపల భద్రపర్చిన ఒక పురాతన కొయ్య ఒకటి మమ్మల్ని విశేషంగా ఆకర్షించింది. 2 కోట్ల సంవత్సరాల క్రితం నాటి పురాతన కొయ్య శిలాజం అది.

ప్రపంచంలోనే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతి పురాతన వస్తువుగా దానికి గుర్తింపు ఉంది. దాన్ని అలా ఆరుబయట ఉంచేయటం బాధ కలిగించినా చేసేదేమీ లేక దాని ఫొటో కూడా తీసుకుని చందమామ ఆఫీసుకు వెళ్లిపోయాం. రెండ్రోజుల తర్వాత మద్రాసు మ్యూజియంపై రెండు లేదా మూడు బాగాల కథనాన్ని తెలుగు, తమిళ, ఇంగ్లీషు చందమామ వెబ్‌సైట్లలో ప్రచురించాము. తెలుగు చందమామ వెబ్‌సైట్లో ప్రచురించిన ఆ  పురాతన కొయ్య శిలాజం ఫొటోను చూసి చాలామంది పాఠకులు స్పందించారు కూడా. ఇంత పురాతన వస్తువు మద్రాసు మ్యూజియంలో ఉందన్న ఊహే లేదంటూ మద్రాసు పాఠకులు కూడా మెయిల్ పెట్టారు.  అది నా చందమామ అనుభవాల గతం.

విషాదకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు చందమామ పత్రికా లేదు. వెబ్ సైటూ లేదు. మద్రాసు మ్యూజియంపై ప్రచురించిన ఆ విశేష కథనం కూడా అందుబాటులో లేదు. నా చందమామ బ్లాగులో దానిగురించి లింక్ ఇచ్చినట్లు ఉంది కాని ఆ లింకు ఇప్పుడు తెరుచుకోదు. వెబ్‌సైటే లేదు కాబట్టి.

కానీ ఇవ్వాళ సాక్షి పత్రిక సంపాదకీయ పేజీ పని ముగించుకుని అర్థరాత్రి ఇంటికొచ్చి లాప్‌టాప్ తెరిచి గూగుల్ న్యూస్ చూస్తే పరమాద్భుత విషయం కనిపించింది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని కనుగొనడమే కాకుండా వాటి శబ్దాన్ని కూడా విన్నామని అమెరికా శాస్త్రజ్ఞులు ప్రకటించారు.  ఆ వార్త విశేషాలను వెదకటం, కాపీ చేసుకోవడం అయ్యాక వివరాల చూస్తే ఒళ్లు గగుర్పొడిచే అంశం బయటపడింది. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్ సరిగ్గా వందేళ్ల క్రితం గురుత్వాకర్షణ తరంగాలు విశ్వంలో ఉన్నాయని చేసిన ఊహాత్మక ప్రతిపాదన ఇప్పుడు వాస్తవంగా రుజువయింది. లేదా కనిపెట్టారు.

దాదాపు వందకోట్ల కాంతి సంవత్సరాల క్రితం విశ్వంలో రెండు నల్లబిలాలు (బ్లాక్ హోల్స్)  ఢీకొని ఒకటిగా కలిసిపోయినప్పుడు ఏర్పడిన శబ్దాన్ని అమెరికాలోని లైగో (Laser Interferometer Gravitational Wave Observatory) కనిపెట్టింది. వందేళ్ల క్రితం ఐన్‌స్టీన్ చేసిన ఊహను నిరూపించడానికి, తమ కెరియర్‌నే ఫణంగా పెట్టిన ముగ్గురు భౌతిక శాస్త్రజ్ఞుల అవిరామ కృషి నేటికి ఫలించింది. విశ్వ-కాలం (స్పేస్ టైమ్)ని దాని ప్రశాంత స్థితిలోనే ఇంతవరకు శాస్త్రజ్ఞులు చూడగలిగారని, ఇది ప్రశాతం సమయంలో సముద్ర ఉపరితలాన్ని చూడటంతో సమానమని ఈ బృందంలో ఒకరైన డాక్టర్ థ్రోన్ పేర్కొన్నారు. రాక్షస అలలతో  ఉవ్వెత్తున చెలరేగే సముద్ర తుఫానును చూసిన పరిణామం ఇప్పుడు విశ్వంలో నెలకొన్నదని, గురుత్వాకర్షణ తరంగాలను కనుగొని వినటం, దాన్ని రికార్డు చేయడం సైన్స్ ఈ శతాబ్ది సైన్స్ సాధించిన అతిగొప్ప ఆవిష్కరణగా చరిత్రలో మిగలనుందని శాస్త్ర ప్రపంచం పేర్కొంటోంది. ఈ గొప్ప ఆవిష్కరణ గురించి కూలకషంగా రాయడం ఈ తెల్లవారు జామున సాధ్యం కాదని తేలిపోతోంది. కాబట్టి గురుత్వాకర్షణ తరంగాల ఉనికిపై వచ్చిన సమాచారాన్ని కింది లింకులలో చూడండి.

Gravitational Waves Detected, Confirming Einstein’s Theory
OUT THERE
FEB. 11, 2016  468 COMMENTS
http://www.nytimes.com/2016/02/12/science/ligo-gravitational-waves-black-holes-einstein.html?_r=0

న్యూయార్క్ టైమ్స్ వెబ్‌సైట్ ప్రచురించిన ఈ వ్యాసంలో నల్లబిలాలు అంటే ఏమిటి, అవి ఢీకొన్నప్పుడు, సంలీనం చెందినప్పుడు జరిగే శక్తి విస్పోటనం ఏమిటి. గురుత్వాకర్షణ తరంగాల స్వరూపం ఏమిటి అనే విశేషాలను స్పష్టంగా ఒక వీడియో లింకు ద్వారా చూపించారు. ఆసక్తి ఉంటే తప్పక చూడగలరు.

ఈ అంశంపై నేను సేకరించిన మరి కొన్ని మంచి ఇంగ్లీషు వార్తా కథనాలను కూడా ఇక్కడ లింకుల రూపంలో చూడవచ్చు.

Gravitational waves The universe in a new light
(Written by Rajesh Gopakumar, Spenta R. Wadia
Gopakumar is senior professor and director, ICTS-TIFR, Bangalore. Wadia is emeritus professor and founding director, ICTS-TIFR, Bangalore)

http://indianexpress.com/article/opinion/columns/gravitational-waves-albert-einstein-theory-of-relativity-the-universe-in-a-new-light/
-------------------------------

Gravitational waves detected 100 years after Einstein predicted them
AP  Feb 11, 2016, 09.41 PM IST
http://timesofindia.indiatimes.com/home/science/Gravitational-waves-detected-100-years-after-Einstein-predicted-them/articleshow/50950379.cms
----------------------------------

మనిషి నిలువెల్లా గడ్డకట్టుకుపోయే మంచు దిమ్మెల కింద కూరుకుపోయి ఆరు రోజులు ప్రాణాలు నిలుపుకుని రెస్క్యూ టీమ్ అవిరళ కృషి వల్ల  బయటపడిన సియాచిన్ సోల్జర్ హనుమంతప్ప ప్రకృతి హద్దులను అధిగమించలేక నిన్ననే కన్ను మూశారు. ఇక్కడ మానవ ప్రయత్నం విషాదకరంగా ఓడిపోయింది.

India's resolute troops Lance Naik Hanamanthappa Koppad symbolises every soldier in Siachen
Feb 11, 2016 2115 IST
By Lt Gen Prakash Katoch
http://www.firstpost.com/india/indias-resolute-troops-lance-naik-hanamanthappa-koppad-symbolises-every-soldier-in-siachen-2622288.html?utm_source=fp_top_internal
-----------------------------------------

మానవ ఊహకు, పరికల్పనకు వందేళ్ల తర్వాత విజయాన్ని కట్టబెడుతూ నిన్ననే శాస్త్రజ్ఞులు విశ్వ చలన (గురుత్వాకర్షణ తరంగాల) సంగీతాన్ని రికార్డు చేశారు. ఒక ధీరోదాత్త మరణం 120 కోట్లమంది భారతీయులను కదిలించింది. తన ప్రాణాలు నిలవాలంటూ తపించింది. వందేళ్ల క్రితం నాటి ఐన్‌స్టీన్ ఊహ నిజం కావడంతో 700 కోట్లపైబడిన ప్రపంచం ఆ వార్తను సంభ్రమాశ్చర్యాలతో సొంతం చేసుకుంటోంది. కోట్లాదిమందిని నిరాశలో ముంచెత్తుతూ ఒక చోట మానవ ప్రయత్నం అంతిమ పరాజయం పొందితే కోటానుకోట్ల మందిలో కొత్త ఆశలు రేపుతూ మరో పెనువిజయం మానవ ప్రయత్నాన్ని మకుటాయమాన స్థానంలో నిలిపింది.

ఆ అంతిమ పరాజయాన్ని, ఈ ప్రారంభ విజయాన్ని ఒకేలాగా స్వీకరిద్దాం. పదార్థ చలన క్రమాన్ని ఇలాగే పరిశీలిద్దాం.

గమనిక: 
ఇప్పుడే ఈనాడులో వచ్చిన ప్రధాన వ్యాసాన్ని కింది లింకులో చూడవచ్చు

వైజ్ఞానిక మైలురాయి
http://www.eenadu.net/Homeinner.aspx?item=break28