Monday, June 25, 2012

ఇదేం కమ్యూనిజం...!


ఈ ఆదివారం ఉదయం దినపత్రికల లోపలి పేజీలలో ఓ దుర్వార్త.

"రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీకి సిపిఎం ఇచ్చిన మద్దతును నిరసిస్తూ ప్రసేన్‌జిత్ బోస్ ఇచ్చిన రాజీనామాను తిరస్కరించిన సిపిఎం ఆయనను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. ప్రణబ్‌ను బలపరుస్తూ పొలిట్ బ్యూరో నిర్ణయించడాన్ని నిరసిస్తున్నాను. ఇది చాలా పెద్ద తప్పని, దీనివల్ల పార్టీకి నష్టంతో పాటు వామపక్ష ఐక్యతకూ భంగకరం అని ప్రసేన్ పార్టీకి బహిరంగ లేఖ రాశారు. నాయకత్వం మరో ఖరీదైన తప్పు  చేస్తోందని, తమ సూచనలన్నీ బుట్టదాఖలవుతున్నాయని పార్టీ సభ్యులు ఆవేదన చెందుతున్నారని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బోస్ తన లేఖలో పేర్కొన్నారు."

తమ రాజకీయ వైఖరికి దురుద్దేశాలు అంటగట్టేందుకు ప్రయత్నించినందుకు ఆయన్ను పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.  బోస్ శుక్రవారమే రాజీనామా చేసినప్పటికీ దాన్ని తిరస్కరించి వేటువేశామని తెలిపింది.

కాగా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి చేసిన బోస్. సీపీఎం పరిశోధన విభాగం కన్వీనర్‌గా వ్యవహరించారు. పలు చానెళ్లలో పార్టీ తరపున చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ప్రణబ్ అభ్యర్థిత్వానికి సిపిఎం మద్దతు తెలుపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 2007 నుంచి పార్టీ నాయకత్వం వరుస తప్పులు చేస్తోందన్నారు.

"కాంగ్రెస్, బి.జె.పి పార్టీలపై రాజకీయ పోరాటం సాగించాలని ఏప్రిల్ మహాసభల్లో నిర్ణయించిన సి.పి.ఎం పార్టీ" తన నిర్ణయాన్ని తనే తుంగలో తొక్కుతూ ఆ  పార్టీ పాలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రసేన్ జిత్ రాజీనామా ప్రకటించటమే ఒక షాక్ కాగా, ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి రాజీనామాను తిరస్కరించిన పార్టీ, అతడిని పార్టీ నుంచే బహిష్కరించడం మరో షాక్. పార్టీ మౌలిక నిర్ణయంతో విభేదిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడటమే సంప్రదాయంగా ఉన్న పార్టీ నిర్మాణంలో అందుకు భిన్నంగా ఆయన రాజీనామా చేయడం, దానికి ఫలితంగా బహిష్కరణకు గురవడం... ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో ఎక్కడైనా ఇలాంటి ఘటన జరిగిందేమో నాకయితే తెలీదు.

పైగా "బోస్ శుక్రవారమే రాజీనామా చేసినప్పటికీ దాన్ని తిరస్కరించి వేటువేశామని తెలిపింది." అంటూ పత్రికలలో వచ్చిన వార్త సాక్షరంగా నిజమే అయితే ఇంత కసాయి పార్టీ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోనే ఉండదు.

సరిగ్గా నెలరోజుల క్రితం అనుకుంటాను. తెలుగుదేశంలో సీనియర్ నేతగా ఉన్న మైసూరారెడ్డి ఏ కారణం వల్లైనా కావచ్చు పార్టీకి రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ రాజీనామాను కూడా పక్కనబెట్టి బహిష్కరించినట్లు గుర్తు. ఇది నిజమే అయితే ఒక పాలకవర్గ పార్టీకి, ఒక కమ్యూనిస్టు పార్టీగా చెప్పుకుంటున్న పార్టీకి తన సభ్యుడి అసమ్మతిని, ధిక్కారస్వరాన్ని అంచనా వేయడంలో, తీర్పు చెప్పడంలో ఏమాత్రం తేడా లేనట్లే కనిపిస్తోంది.

పైగా "పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని ఆయన లేఖాంశాలు అపఖ్యాతిపాలు చేసే విధంగా ఉన్నాయని" ప్రసేన్ జిత్ బహిష్కరణకు సాకులు వెతకడం కూడా సిపిఎంకే చెల్లనుకుంటాను. ఒక కమ్యూనిస్ట్ పార్టీ -?- మూడునెలల క్రితం ఆమోదించిన రాజకీయ తీర్మానానికి -కాంగ్రెస్, బిజెపి రెండింటిపై రాజకీయ పోరాటం సాగించాలనే తీర్మానానికి- భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కనీసం తన పార్టీ సభ్యుల అవగాహన కోసమైనా ముందస్తు వివరణ ప్రత్రికా ముఖంగా ఇవ్వవలిసిన బాధ్యత ఆ పార్టీకి లేదా అనేది ఒక ప్రశ్న. పరుపు, ప్రతిష్ట అనే పదాలకు అర్థం ఉందనుకుంటే, వాటికి గత కొన్నేళ్లుగా తూట్లు పొడుస్తూ కూడా -బలవంతంగా రైతుల భూములు గుంజుకోవడం, నందిగ్రామ్ పోలీసు కాల్పులు వగైరా- పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని ప్రసేన్ లేఖాంశాలు అపఖ్యాతిపాలు చేసే విధంగా ఉన్నాయని సిపియమ్మే ఆరోపించడం అంటే దొంగే దొంగ అని ఆరోపించినట్లుంది.

దీనికి రాజకీయ కమ్యూనిజం ఆచరణ చరిత్రలోనే మూలం ఉందేమో మరి. వేళ్లతో లెక్కించగలిగినంత తక్కువ మంది సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరో, పార్టీ రాజకీయ ఆచరణ సర్వస్వాన్ని నిర్ణయించగలిగే అపరిమితాధికారాలను గుప్పిట్లో పెట్టుకోవడం మొదలయ్యాకే ఇలాంటి భ్రష్టాచారాలు కమ్యూనిస్టు పార్టీలకు తగులుకున్నాయనుకుంటాను. పార్టీని వేలెత్తి చూపితే వ్యతిరేక పంధాగా, పంథాను తప్పు పట్టినంతమాత్రానే విమర్శించినంతమాత్రానే ఎంతటి ఘనాపాటీల చరిత్ర అయినా సరే ప్రజా ద్రోహ చరిత్ర'గా మారిపోవడం 1930ల తర్వాతనే మొదలయిందనుకుంటాను. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ల కాలం నాటి కమ్యూనిస్టు ఆచరణలలో భిన్నాభిప్రాయాన్ని ఏమాత్రం సహించలేని ధోరణులను నేనయితే చదవలేదు. వినలేదు కూడా.

జర్మనీ కార్మిక వర్గ నాయకురాలు రోజా లగ్జెంబర్గ్, విప్లవానంతరం శైశవదశలోని సోవియట్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో పొడసూపుతున్న అప్రజాస్వామిక లక్షణాలను ఎత్తి చూపుతూ సోవియట్ తరహా కమ్యూనిజం అతి త్వరలోనే శ్రామిక వర్గ నియంతృత్వం పేరిట ప్రజారాసుల సమిష్టి కార్యాచరణల అమలుకు భిన్నంగా పోలిట్ బ్యూరో నియంతృత్వాన్ని నెలకొల్పే ప్రమాదకరమైన నియంతృత్వ ధోరణుల్లోకి ప్రయాణించనుందని తీవ్రంగా విమర్శించారు. లెనిన్ బతికి ఉన్నప్పుడే ఆమె చేసిన ఈ విమర్శను తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం పెడచెవిన పెట్టింది లేదా సాయుధ బలంతో రాజ్యాధికారంలోకి వచ్చాక, ఇక కమ్యూనిజానికి, పార్టీకి తిరుగులేదని భ్రమిసిపోయి, రాజకీయాధికారపు గర్వాంధకారంలో కన్నుమిన్నూ గానకుండా వ్యవహరించింది.

దాని ఫలితాలను గత 80 ఏళ్లుగా అందరం చూస్తూనే ఉన్నాం...

పొలిట్‌బ్యూరో నిర్ణయాలకు అందరూ గంపగుత్తగా చేతులెత్తేస్తూ ఏకగ్రీవతీర్మానాలు అమలయిపోయే భ్రష్ట ధోరణులు ఉనికిలోకి వచ్చేశాక ఇలాంటి ఏకశిలాసదృశ -మోనోలితిక్- నిర్మాణాలకు ఎదురునిల్చి పోరాడటం ప్రసేన్ జిత్ లాంటి వ్యక్తులకు సాధ్యమయ్యే పనేనా?

అందుకే ఆయన రాజీనామా ఇచ్చినట్లుంది. దానికి కూడా సహించలేక ప్రసేన్‌జిత్‌ను బహిష్కరణ వేటుతో చంపేశారు. ఈ బహిష్కరణతో, సిపిఎం పార్టీలో నిన్న గాక మొన్న చేరిన బుడ్డాపకీరు కూడా ఇక ఆయన ముఖం చూడడు.

ఆహా -రాజకీయ- కమ్యూనిజమా!

ఇలాంటి కమ్యూనిజాన్ని ఎవరూ కోరుకోకూడదు. మన ఖర్మ ఏమంటే భారతదేశంలో అన్ని రకాల కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాలూ ఇలాగే ఏడుస్తున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను ఇలాగే ఉద్ధరిస్తున్నాయి. ఉద్యమ నిర్మాణాలలో ఇన్ని లోపాలు పెట్టుకుని, కమ్యూనిస్టు సిద్ధాంత వ్యతిరేకులు కమ్యూనిస్టు పార్టీల దౌర్భాగ్య ఆచరణను సాకుగా చూపి కమ్యూనిజాన్నివిమర్శిస్తున్నారంటే మనం ఉలికిపాటుకు గురికావలసిన పని లేదేమో మరి.

దీనర్థం ఇక మనందరం కమ్యూనిజం అనే ఆదర్శాన్ని తోసిపారేయాలని కాదు.

(ఈ కథనంలో అధికభాగాన్ని విశేఖర్ గారి తెలుగువార్తలు బ్లాగులో "రాష్ట్రపతి ఎన్నిక: సి.పి.ఎం సిద్ధాంతకర్త ప్రసేన్‌జిత్ బహిష్కరణ" కథనానికి వ్యాఖ్యగా పోస్ట్ చేశాను. తర్వాత మరి కాస్త పొడిగించి నా బ్లాగులో టపాగా ప్రచురిస్తున్నాను.)