Monday, March 28, 2016

ఇలాంటి వీసీ 'గురువు' లెక్కలోకి వస్తాడా?

కొన్ని రోజుల క్రితం 'అది దేశద్రోహం కాక మరేమిటి' అంటూ ఆరెస్సెస్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి భాగయ్య గారు 'సాక్షి' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం లింకును ఈ బ్లాగులో పొందుపరుస్తూ నా భిన్నాభిప్రాయం పోస్ట్ చేశాను. 'రోహిత్ ఆత్మహత్య ముమ్మాటికీ దురదృష్టకరం.' అంటూ బాధను వ్యక్తీకరిస్తున్నవారు.. తన ఆత్మహత్య తర్వాత నేటివరకూ హెచ్‌సీయూలో జరుగుతున్న అమానుష పరిణామాలకు ఎవరు బాధ్యులో చెప్పరే అని ప్రశ్నిస్తూ కింది అభిప్రాయం ప్రకటించాను.

"హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ అప్పారావు పొదిలి రెండునెలల తర్వాత చెప్పా చెప్పకుండా మళ్ళీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తన అధికారిక నివాసంపై దాడి జరిగితే యూనివర్సిటీ చరిత్రలో దుర్దినం -బ్లాక్ డే- అంటూ ఓండ్రపెట్టాడు. ఒక మేధోవంతుడైన విద్యార్థి... కేవలం  వీసీగా తన నిర్లక్ష్యం, క్రూరత్వం కారణంగా గుండె పగిలి చావును కొని తెచ్చుకుంటే ఆరోజు అదే యూనివర్సిటీ చరిత్రలో బ్లాక్ డే అయిందనే మాట ఈ మహానుభావుడి నోటివెంట పెగల్లేదు. అతగాడి ఇంట్లో ధ్వంసమైన ఫర్నిచర్‍‌కు ఉన్నంత విలువ కూడా ఆ యూనివర్శిటీలో విద్యార్థికి లేదు."

"మనుషుల ప్రాణాలను నిలువునా హరించే చర్యలు, లెటర్లమీద లెటర్లు, హెచ్చరికల మీద హెచ్చరికలు చేసి రాచి రంపాన పెట్టి మనిషిని నిలువునా హతమార్చిన పెద్దమనుషులు, తారామణులు, చేసిన తప్పు ఎక్కడ మెడకు చుట్టుకుందోనని అబద్దాల మీద అబద్దాలు పలికి బయటపడ్డవారు.. వీరెవ్వరూ దేశద్రోహులు కారు. వీరెవ్వరూ జాతి ద్రోహులు కారు..."

నా టపా చదివిన ఒక అజ్ఞాత వ్యాఖ్యాత మరికొన్ని విమర్శలు చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ మీద దాడి చేసిన వారిని సమర్థిస్తున్నారని నన్ను విమర్శిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.

"గురువు దైవంతో సమానం అంటారు. అలాంటి గురువు మీద దాడిని సమర్ధిస్తున్న మిమ్మల్ని చూసి ఏమనాలో అర్థం కావటం లేదు."

దానికి ఆ టపాలో  నా వ్యాఖ్య ఇది.

"ఇక గురువు. గురువు మీద దాడి. నేను సమర్థించడం.. ఒక పచ్చి హంతకుడిని గురువుగా భావించడం నాకు చేతకాదు. అంత శక్తీ నాకు లేదు. హెచ్ సీయూలో గొడవ జరిగినప్పటినుంచి అబద్దాలు, అబద్దాల మీద అబద్దాలు.. దొడ్డిదారిన రాయబారాలు.. దొంగ బతుకు బతకడం కూడా గురుత్వంలో భాగమేనా? కేంద్రం ఎజెండాలో భాగంగా దొంగదారిలో వచ్చి రాజకీయం చేస్తున్న వారు గురువులు. ఆహా.."

నా పై అభిప్రాయాన్ని పూర్తిగా పక్కన బెట్టినా ఫర్వాలేదు. కానీ...

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్యుద్ధాన్ని పోలిన పరిస్థితులు తలెత్తడానికి ఎవరు కారకులో కూలంకషంగా వివరిస్తూ ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి పంపిన రచన ఆదివారం నాటి 'సాక్షి' సంచిక (27-03-2016) 4వ పేజీలో ప్రచురితమైంది. ఆయన పేరు కె.ఆర్. వేణుగోపాల్. "ఇది విద్యాహక్కుకు భంగం కాదా" అనే శీర్షిక కింద ఆయన కొన్ని మౌలిక విషయాలను లేవనెత్తారు.

"హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్యుద్ధాన్ని పోలిన పరిస్థితులు తలెత్తడానికి ఆ విశ్వవిద్యాలయ వివాదాస్పద వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ అప్పారావు మళ్లీ పదవీ బాధ్యతలను చేపట్టడంలో ప్రదర్శించిన బాధ్యతా రాహిత్యం, మొరటుతనం ప్రధాన కారణం."

"కొన్ని మాసాల నుంచి మానవ హక్కుల రక్షణలో ఆయన దారుణమైన అసమర్థతతో వ్యహరించారు. అందు లోనే విద్యార్థుల విద్య హక్కు ఇమిడి ఉంది. రోహిత్ వేముల ఆత్మహత్య సహా,  విశ్వవిద్యాలయ ప్రాంగణం యుద్ధాన్ని మరిపించే రీతిలో తయారు కావడానికి ఇదే కారణం. సమ్మె చేస్తున్న విద్యార్థులను శాంతింపచేయడంలో  వైస్‌చాన్స్‌లర్ పూర్తిగా విఫలమయ్యారని, ఫలితంగానే సమస్య ముదిరి పోయిందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నియమించిన నిజనిర్ధారణ సంఘం కూడా చెప్పేసింది."

"వైస్‌చాన్స్‌లర్ మళ్లీ విధులు చేపట్టడానికి వచ్చేనాటికి రూపన్‌వాల్ జుడీషియల్ కమిషన్ తన నివేదికను సమర్పించలేదు. తాను చేసిన పనికి వైస్‌చాన్స్‌లర్ కుంటిసాకులు వెతుకుతూ ఎలిబీ సృష్టించుకుంటున్నారు తప్ప, ఒక విద్యాలయం యుద్ధాన్ని మరిపించే విధంగా తయారు కావడానికి తన వంతు పాత్రను గురించి ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోవడం లేదు."

"కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలతో వైస్ చాన్స్‌లర్ సెలవుపై వెళ్లారన్నది సుస్పష్టం. ఇన్‌చార్జి వీసీని ఆయన స్థానంలో నియమించడం కూడా జరిగింది. అలాంటప్పుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు లేకుండానే, వైస్‌చాన్స్‌లర్ తనకు తానై కార్యాలయానికి వచ్చి ఎలా కూర్చుంటారు చెప్పాపెట్టకుండా వైస్ చాన్స్‌లర్ అలా మళ్లీ వచ్చి విధులు ఎలా చేపట్టారని మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా విస్తుపోయిందని విశ్వసించదగిన మీడియా వార్తల వల్ల తెలుస్తున్నది. నిజానికి ఆ మంత్రిత్వ శాఖ నిజంగానే ఆశ్చర్యపోయిందా; లేక ఇది కూడా దోబూచులాటేనా?"

వేణుగోపాల్ గారు ఇలా తమ అభిప్రాయం వ్యక్తం చేశాకు వేరే మాటలు అనవసరం. బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిగారి సిఫారసుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌గా గద్దెనెక్కినట్లు అందరూ చెప్పుకుంటున్న అప్పారావు పొదిలి ఆ వర్శిటీలో గత కొన్ని నెలలుగా ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తూ వస్తున్నారో.. నేను కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గారి నిర్వాకంపై తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయవలసిన స్థాయి సదరు వీసికి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈసడించుకున్న విషయం తెలిసిందే.

రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి  కె.ఆర్. వేణుగోపాల్ గారు హెచ్‌సీయూలో విద్యాహక్కు, మానవ హక్కులు టోకున ఉల్లంఘనకు గురవుతున్నాయని, ఈ పాపాలనుంచి ఎవరూ బాధ్యతను తప్పించుకోలేరని అభిప్రాయపడుతూ రాసిన కథనం పూర్తి పాఠాన్ని కింది లింకులో చదవగలరు

ఇది విద్యాహక్కుకు భంగం కాదా
Saturday, March 26, 2016

ఇది క్షాత్ర పరీక్ష కాదు భారతమాత పరీక్ష

"భారత మాతాకీ జై’ అన్న నినాదం చేయలేని వాళ్లకు ఆ నినాదం నేర్పాలి. కొత్త తరాలతో భారత్ మాతా కీ జై అనిపించాలి. దేశభక్తిని ప్రబోధించే నినాదాలను నేటి యువతకు నేర్పించాలి. విద్యను జాతీయీకరణ చేయాలి." (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్)

'నా గొంతుపై కత్తిపెట్టినా ఆ నినాదాన్ని చేయను. 'భారత్‌ మాతాకీ జై' అని ప్రతి ఒక్కరూ కచ్చితంగా నినదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు' ఒక నినాదం చేయనందుకు సభ్యుడిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని ప్రధాని చెప్పినప్పుడు.. ఎన్నికైన సభ్యుడు ఒక నినాదం ఇవ్వనన్నందుకు సస్పెండ్ చేయాలని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉంది? రాజ్యాంగం కోరని ఒక నినాదం చేయాలని సభ్యుడిని ఒత్తిడి చేశారు. అది భావ ప్రకటనాస్వేచ్ఛ. ఒక నినాదం చేయనంత మాత్రాన అది చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదు. మనం చీకటి యుగంలోకి వెళ్ల్లిపోతున్నాం"  (అసదుద్దీన్ ఒవైసీ). 

"భారత్ మాతాకీ జై అని నినదించని వారికి దేశంలో నివసించే హక్కు లేదు. భారత్ మాతాకీ జై అని నినదించని వారికి దేశంలో నివసించే హక్కు లేదు." (బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయ్‌వర్గీయ)

"భారత్ మాతాకీ జై అని నినాదం చేయనని చెప్పిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీని పాక్‌కు పంపించేయాలి. ఇలాంటి పాములను భారత్ పెంచి పోషించాల్సిన అవసరం లేదు." (మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శివసేన మంత్రి రాందాస్ కదం)

భారతమాతకు జై పలకడానికి అభ్యంతరమున్న ఒవైసీ ఒక దేశద్రోహి. ఆయనకు ఈ దేశంలో ఉండే అర్హత లేదు. భారతమాతను అవమానించిన ఒవైసీ నాలుకను తెగ్గొయ్యాలి. ఆ పని చేసినవారికి  ఏకంగా కోటి రూపాయల రివార్డ్ ఇస్తాను (ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత శ్యామ ప్రకాష్ ద్వివేది)

"దేశభక్తి గురించి మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. దేశభక్తిని ఎన్నో విధాలుగా వ్యక్తీకరించవచ్చు. హిందుస్థాన్ జిందాబాద్, విప్లవం జిందాబాద్ వంటి నినాదాలు కూడా ఈ క్యాటగిరీ లోనివే. అయితే కేవలం భారత్ మాతాకీ జై అనే నినాదంతోనే దేశభక్తి ఉన్నట్లు వారు అనుకుంటున్నారు. లోగడ హిట్లర్ జర్మనీలో ఫాసిజంను రెచ్చగొట్టడానికి ఇట్లాంటి జాతీయవాదాన్ని వినియోగించుకున్నాడు. దేశభక్తి గురించి జైట్లీ నుంచి తెలుసుకోవల్సిన అవసరం మాకు లేదు. మీరు మా తోని ఉంటారా? లేక ఉగ్రవాదులతో ఉంటారా? తేల్చుకోండి అని మాజీ అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్ ఇదివరకు చేసిన వ్యాఖ్యల మాదిరిగానే జైట్లీ వ్యాఖ్యలున్నాయి. తనకు మద్దతు ఇస్తేనే దేశభక్తులు లేకపోతే దేశద్రోహులు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తున్నది."  (ఏచూరి సీతారాం) 

"ఒక్కసారి కాదు.. ఇదే నినాదం వందసార్లు చేస్తా... రాజ్యాంగం కోరడంలేదు కనుక భారత్ మాతాకీ జై అని నినదించబోనని ఒవైసీ చెప్తున్నాడు. షేర్వాణీ, టోపీ ధరించాలని కూడా రాజ్యాంగం ఆయనను అడగడం లేదు. భారత్ మాతాకీ జై అనడం నా కర్తవ్యమో కాదో నాకు తెలియదు కానీ అది నా హక్కు. ముస్లింలు పాకిస్థాన్ వెళ్లిపోవాలని అతివాదులు చెప్పడం తప్పు. లౌకికవాదం లేకుండా ప్రజాస్వామ్యం లేదు. దేశంలో తిరోగామి శక్తులు పేట్రేగిపోతున్నాయి.. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవం నుంచి నేర్చుకునేవారు తెలివైనవారు. ఇతరుల అనుభవం నుంచి నేర్చుకునేవారు మరింత తెలివైనవారు. మతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిన దేశాలను చూడండి.. మతానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి నాలుకలు తెగ్గోసి, ఉరి తీసే దేశాలను చూడండి. అటువంటి దేశాలు మనకు ఆదర్శమా? లేక మత స్వేచ్ఛ కలిగిన దేశం ఆదర్శంగా ఉండాలా? ఆలోచించుకోవాలి. మోదీ ప్రభుత్వంలో మంచి పనులు చేయగల సామర్థ్యం ఉన్న నేతలు ఉన్నారని, అదే సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, వ్యవస్థ ఉన్నప్పటికీ మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోయాం? మనకు అభివృద్ధి కావాలి. కానీ ఎవరి అభివృద్ధి? ఎవరికి అభివృద్ధి అనేది ఆలోచించాలి. అభివృద్ధి అంటే జీడీపీ కాదు, మానవాభివృద్ధి సూచిక". (జావేద్ అక్తర్)

"భారత్ నుండి ఓవైసీ సోదరులను మీకు ఇచ్చేస్తాం.. భారత్ గురించి గొప్పగా మాట్లాడిన అఫ్రిదీ, మాలిక్ లను మాకు ఇచ్చేయండి"  (సోషల్ మీడియాలో ఛలోక్తులు)

సభ సెంటిమెంట్ కారణంగానే సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చింది (ఎంఐఎం మహారాష్ట్ర శాఖ నేత, ఆ రాష్ట్ర ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌పై అసెంబ్లీలో సస్పెన్షన్ విధించిన స్పీకర్ హరిభావ్ బగ్డే)

ఇది మాత్రం నిజం. మన దేశంలో సెంటిమెంట్ కారణంగానే సస్పెన్షన్ చేస్తారు.

జాతి చైతన్యం ఒత్తిడి మేరకే అప్జల్ గురులను ఉరి తీస్తారు. (ఇది సాక్షాత్తూ అప్జల్ గురుకు ఉరిశిక్ష అమలుపై తుది తీర్పును ప్రకటించిన న్యాయమూర్తి ప్రకటన. ఆ తీర్పుపై తన అసమ్మతి నోట్ పెట్టిన జస్టిస్ గంగూలీ ఆ తీర్పు మౌలిక భావాన్నే వ్యతిరేకిస్తూ తర్వాత అనేకసార్లు బహిరంగంగా మాట్లాడారు).

మెజారిటీ మనోభావాలకు అనుగుణంగానే సమస్త వ్యవహారాలనూ నిర్దేశిస్తారు. వాటిని ఏమాత్రం ఒప్పుకోకపోయినా మైనారిటీలపై దేశద్రోహ ముద్రలు వేసేస్తారు.

"భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్న వారిని జైహింద్ అనేలా ఒత్తిడికి గురిచేశాం. జాతీయవాదంపై భావజాల సవాల్ తొలి రౌండ్‌లో బీజేపీదే విజయం." (అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి). ఇది ఈ మొత్తం గొడవలో అత్యంత తాజా వార్త. 
---------------

మన దేశాన్ని గత నెలరోజులుగా దహిస్తున్న చర్చా సరళి ఇది. మీకు మూడు పూటల తిండి లేకపోయినా ఫర్వాలేదు. తాగడానికి కాసిన్ని మంచినీళ్లకు గతిలేకపోయినా ఫర్వాలేదు. మీకు ఉద్యోగాలు కల్పించలేకపోయినా ఫర్వాలేదు. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో భావజాల మంటలు రేగుతున్నా ఫర్వాలేదు. మన గొప్ప దేశాన్ని ఈ నినాదాలు, ప్రతినినాదాల సాక్షిగా ఇలాగే ముందుకు తీసుకుపోతాం. ఇందుకు మీ సహకారం కావాలి అంటూ పాలక పక్షాలు.. ప్రతిపక్షాలు... మిత పక్షాలు, అతి పక్షాలు.. దేశానికి ఇలా దిశా నిర్దేశం చేస్తున్నాయి. వీటన్నింటికీ కొసమెరుపు లాంటి వార్త కింద చూడవచ్చు

ఒవైసీ దిష్టిబొమ్మను దహనం చేయబోయి..
భారత్ మాతాకీ జై అని నినదించబోనని వ్యాఖ్యానించిన ఎంఐఎం నేత అసదుద్దీన్ దిష్టిబొమ్మను దహనం చేయబోయి కాన్పూర్‌లో ఒక ఏబీవీపీ కార్యకర్త తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. బుధవారం నగరంలోని ఒక రద్దీ ప్రాంతంలో గుమిగూడిన ఏబీవీపీ కార్యకర్తలు ఒవైసీ దిష్టిబొమ్మను దహనం చేయబోయారు. దిష్టిబొమ్మకు నిప్పు పెట్టబోయిన కార్యకర్త చొక్కాకు మంటలు అంటుకున్నాయి. తగలబడుతున్న తన చొక్కా విప్పుకొనేందుకు అతడు నానా ప్రయత్నాలు చేశాడు. చివరకు తోటి కార్యకర్తలు మంటలు ఆర్పి, అతడిని దవాఖానకు తరలించారు. స్వల్ప గాయాలైన అతడికి చికిత్స జరుగుతున్నది.

ఏబీవీపీ కార్యకర్త ఒంటికి నిప్పంటించుకోవడం లేదా దిష్టిబొమ్మను దహనం చేయబోయి తాను మంటల్లో చిక్కుకోవడం బాధాకరమైన విషయమే.. కానీ నెలరోజులుగా  ఈ వివాదాన్ని రేపుతున్న వారు. ప్రత్యేకించి నినాదాల్లో మాత్రమే దేశభక్తిని, అభివృద్ధిని దర్శిస్తున్నవారు మంటల్లో చిక్కుకున్న సందర్భానికి ఇది సింబాలిక్ షాట్ లాగ కనిపిస్తోంది.

కానీ..

"దేశ భక్తికి ప్రతీకగా ఫలానా నినాదం చేయాలని పట్టుపట్టినపుడు చట్టసభలు అందుకు వంతపాడడమా? మెజారిటీ ప్రజలు సున్నితత్వం మొద్దుబారడం దేశానికి ఎంత ప్రమాదమో, తమ హక్కుల కోసం గట్టిగా మాట్లాడేందుకు మైనారిటీ ప్రజలు భయపడే పరిస్థితి రావడం కూడా అంతే ప్రమాదం" అంటూ ఇవ్వాళే (మార్చి 26) ఆంద్రజ్యోతి దినపత్రిక సంపాదకీయ పేజీలో ఒక కథనం ప్రచురితమైంది. ఆ కథనంలోని ముఖ్యమైన పేరాలను కింద యధాతథంగా ఇస్తున్నాను. ఆసక్తి మాత్రమే కాదు.. సమస్యను రెండువైపులా చూడాలనుకుంటున్న వారు కూడా కింది పేరాలను తప్పక చదవండి.

"నిజానికి ఇది పూర్తిగా పనీపాటా లేని వ్యవహారం. ఆరెస్సెస్‌ నాయకుడు ఆ మాట అనక్కరలేదు. అన్నందుకు ఎవరూ ఆశ్చర్యపోనూ అక్కరలేదు. హిందూ జాతీయవాదం, దానితో కలగలసిపోయిన దేశభక్తి రాజకీయాల నుంచే కదా వాళ్లు శక్తి కూడదీసుకునేది! రెండోవైపున, మజ్లిస్‌ నాయకుడు తన గొంతు మీద ఎవరో కత్తి పెట్టినట్టు జవాబు ఇవ్వనక్కరలేదు. కానీ ఇవ్వకుండా ఎలా ఉంటారు? ఇండియాలో సర్వకాల సర్వావస్థలలో తమను వెన్నాడి వేధిసున్నారన్న భావనను ముస్లింలలో పెంచి పోషిస్తేనే కదా వారికి బలం చేకూరేది! వ్యవహారం అక్కడితో ఆగితే బాగానే ఉండేది.

కానీ, ‘భారత మాతాకీ జై’ అని నినదించనందుకు మహారాష్ట్ర శాసనసభలో మజ్లిస్‌ సభ్యుడు వారిస్‌ పఠాన్‌ను సస్పెండ్‌ చేశారు. తాజాగా అసదుద్దీన్‌ ఒవైసీని అభిశంసిస్తూ మధ్యప్రదేశ్‌ శాసనసభ ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది. ఒవైసీపై కొన్ని చోట్ల కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో శివసేన సహజంగానే బీజేపీ కన్నా దుందుడుకు వైఖరి తీసుకుని ఆయన నాలుకకు వెలకడుతోంది. ఇప్పుడిక వివాదం ‘భారత మాతాకీ జై’ అన్న ఒక్క నినాదానికి సంబంధించినది కాదు. భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశం ఇందులో ఇమిడి ఉంది. ఎవరైనా సరే తమ దేశభక్తిని తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది? ఫలానా పని చేసిగానీ, ఫలానా మాట అనిగానీ తమ దేశభక్తిని నిరూపించుకోవాల్సిందిగా డిమాండ్‌ చేసే హక్కు ఎవరికైనా ఎక్కడ నుంచి సంక్రమిస్తుంది? అలాంటి హక్కును తమకు తాము దఖలు పరచుకున్న కొందరు, దేశభక్తికి ప్రతీకగా ఫలానా నినాదం చేయాలనిపట్టుపట్టినపుడు, చట్టసభలు అందుకు వంతపాడడమా? మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్‌ఐఎమ్‌ సభ్యుడి తాత్కాలిక బహిష్కరణ తీర్మానానికి గానీ, మధ్యప్రదేశ్‌ సభలో ఒవైసీ అభిశంసన తీర్మానానికి గానీ వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క గొంతు కూడా లేవకపోవడం గమనార్హం.

మంచి చెడుల మీమాంసపై అర్థవంతమైన చర్చకు అత్యున్నత వేదిక అయిన చట్టసభలో ‘దేశభక్తి’ కారణంగా మూకస్వామ్యం వర్థిల్లినపుడు మనం ఎటు వెళుతున్నట్లు? 19వ శతాబ్ది చివరి రోజులలో మొదలుపెట్టి జాతీయోద్యమంలో వందేమాతరం గీతం ప్రముఖ పాత్ర పోషించింది. ‘వందేమాతరం’ అన్న నినాదం జనాన్ని ఉర్రూతలూగించింది. నిజానికి వలస పాలన కింద ఉన్న భారత దేశంలో ‘మాతృభూమి’ అన్న భావన వేళ్లూనుకోవడం కూడా దీనితోనే మొదలయింది. మళ్లీ ఒకసారి వెనక్కి వెళితే, దేశానికి స్వాతంత్య్రం రాకమునుపే వందేమాతర ం గీతంపై చాలా చర్చ నడిచింది. దుర్గా మాతను కీర్తించే తర్వాతి చరణాలను వదిలిపెట్టి ఆ ప్రస్థావన లేని మొదటి రెండు చరణాలనే తీసుకున్నప్పటికీ ముస్లింలు ఈ గీతాన్ని ఆలపించేందుకు నిరాకరించారు. మాతృభూమి భావనను కీర్తించడం కూడా తమ మత నియమాల ప్రకారం ‘షిర్క్‌’ (విగ్రహారాధన నేరం) అని వారు పేర్కొన్నారు.

తాజా వివాదానికి కారణమైన ‘భారత మాత’ కీర్తనను నిరాకరించడంలో ఇమిడివున్న అంశం కూడా ఇదే. తమ మత నియమాలకు వ్యతిరేకం కాబట్టి తాము ‘భారత మాతాకీ జై’ అని నినదించేది లేదని అసదుద్దీన్‌ ఒవైసీ అంటున్నారు. అందుకు ఆయన దేశద్రోహి అయిన పక్షంలో భారత దేశంలో ఇంకా కొన్ని కోట్ల మంది ముస్లింలు కూడా దేశద్రోహులవుతారు. మజ్లిస్‌ నాయకులు వ్ర వచిస్తున్నంత మాత్రాన దీనిని పిడివాద మత నియమాల నిర్వచనం అనుకోనవసరం లేదు. ఈ వాదనకు కట్టుబడుతున్న ముస్లింలు ఎక్కువ మందే ఉన్నారు.

బిజో ఎమాన్యుయేల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో, 1986లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక విశిష్టమైన తీర్పు ఈ విషయంలో పూర్తి స్పష్ట త కల్పిస్తోంది. క్రిస్టియన్‌ మతంలో ‘జాషువా విట్‌నెసెస్‌’ అనే తెగకు చెందిన ముగ్గురు పిల్లలు తాము చదువుతున్న పాఠశాలలో అందరితో పాటు జాతీయ గీతం ‘జనగణమన...’ ఆలపించడానికి నిరాకరించారు. తమ మత విశ్వాసాలకు అది విరుద్ధమని వారు వాదించారు. మొదట వారి వాదనలతో ఏకీభవించిన స్కూలు యాజమాన్యం కేరళ శాసనసభ జోక్యంతో చర్య తీసుకొన్నది; ముగ్గురు విద్యార్థులనూ పాఠశాల నుంచి బహిష్కరించింది. ఆ పిల్లల తండ్రి బిజో ఎమాన్యుయేల్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ స్కూలు యాజమాన్యం వైఖరికే మద్దతు లభించింది. ఆ తండ్రి సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు. జస్టిస్‌ ఓ. చిన్నపరెడ్డి, జస్టిస్‌ ఎమ్‌.ఎమ్‌. దతలతో కూడిన ధర్మాసనం అప్పీలు విచారించింది. మతపరంగా సరైన అభ్యంతరం ఉన్న పక్షంలో, అందరితోపాటు వారిని కూడా జాతీయ గీతం ఆలపించాల్సిందేనని బలవంతం చేయడం కుదరదని ధర్మాసనం తీర్పు చెప్పింది. అలా బలవంతం చేయడం ఆర్టికల్‌ 19(1) (ఎ) - భావ ప్రకటన స్వేచ్ఛ - ఆర్టికల్‌ 25 (1) - మత స్వేచ్ఛకు విరుద్ధమని బెంచ్‌ స్పష్టం చేసింది. మౌనంగా వుండడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమేనని తీర్పు వెలువరించిన జస్టిస్‌ చిన్నపరెడ్డి పేర్కొన్నారు. ‘ఎంత అప్రధానమైన మైనారిటీలయినా ఈ దేశపు రాజ్యాంగం కింద తమ గుర్తింపును తాము పొందగలగడమే నిజమైన ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష. మన సంప్రదాయం సహనాన్ని నేర్పుతున్నది. మన తాత్వికత సహనాన్ని బోధిస్తున్నది. మన రాజ్యాంగం సహనాన్ని ఆచరణలో పెడుతున్నది. దానిని మనం పలచన చేయకూడదు’ అని జస్టిస్‌ చిన్నపరెడ్డి పేర్కొన్నారు. భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అలా ఉండగా, ‘భారత మాతాకీ జై’అని నినదించనందుకు ఒక రాష్ట్ర చట్టసభ ఒక సభ్యుడిని బహిష్కరిస్తుంది. నినదించను అని అన్నందుకు మరొకరిని ఇంకొక రాష్ట్ర చట్టసభ అభిశంసిస్తుంది. ఈ గందరగోళంలో కాస్త సవ్యమైన గొంతులేకున్నా ఉన్నా గానీ అవి మనకు వినబడవు.

‘భరతమాత’ అన్నది చాలా సున్నితమైన అంశం. దేశద్రోహి అనిపించుకునేందుకు ఎవడూ సిద్ధంగా ఉండడు. ఇలాంటి సున్నితమైన అంశాన్ని ఉపయోగించుకుని మరో సున్నితమైన విషయంలో ప్రజల ‘సెన్సిటివిటి’ మొద్దుబారేట్లు చేయడం వారి లక్ష్యం. తమ మతపరమైన విశ్వాసం ముస్లింలకు సున్నితమైన అంశమే కదా మరి! ఇప్పుడు దానిని ‘భారత మాతాకి జై’ నినాదంతో ముడిపెడితే మెజారిటీ మతం ప్రజలు ఎలా స్పందిస్తారు? ఇలా బోడిగుండుకీ, మోకాలికీ ముడిపెట్టినపుడు మెజారిటీ ప్రజల సెన్సిటివిటి మొద్దుబారడం ఒక్కటే కాదు; మైనారిటీ మతం వారి స్పందన కూడా మారే ప్రమాదం ఉంది. మెజారిటీ ప్రజలు సున్నితత్వం మొద్దుబారడం దేశానికి ఎంత ప్రమాదమో, తమ హక్కుల కోసం గట్టిగా మాట్లాడేందుకు మైనారిటీ ప్రజలు భయపడే పరిస్థితి రావడం కూడా అంతే ప్రమాదం."

అంటున్నారీ కథన రచయిత ఆలపాటి సురేశ్‌ కుమార్‌...

ఆంద్రజ్యోతి సంపాదకీయ పేజీలోని ఈ కథనం పూర్తి పాఠాన్ని చూడాలనుకుంటే కింది లింకును చూడండి.

‘భారత మాత’ పరీక్ష! 

http://www.andhrajyothy.com/Artical?SID=221920

Wednesday, March 23, 2016

అది దేశద్రోహం కాక మరేమిటి?

జాతీయవాదం, దేశభక్తి, దేశద్రోహం, చట్టబద్ధ హత్యలు వంటి... ప్రస్తుతం దేశాన్ని భావజాలపరంగా రెండుగా చీల్చిన అనేక అంశాల పట్ల మీడియాలో ఒక వెర్షన్ లేదా ఒక పక్షాన్ని సమర్థించే రచనలనే ప్రచురిస్తున్నారని, దేశంమీద ప్రేమతోనే భారత వ్యతిరేక నినాదాలను ఖండిస్తున్న వారి వాదానికి మీడియా స్థానం కల్పించటం లేదని వస్తున్న విమర్శలకు ఇక్కడ ఇస్తున్న కథనం ఒక సమాధానం కావచ్చు.

భావప్రకటన స్వేచ్ఛ పేరుతో దేశద్రోహానికి పాల్పడుతున్నారని, దేశ సమగ్రతకు భంగకరమైన వారని సహించలేమని, స్వతంత్ర కశ్మీర్, ఇండియా గో బ్యాక్ అనడాన్ని ఎదుర్కొంటామని చెబుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి భాగయ్య గారు ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని ఈ పోస్ట్ చివరన ఇచ్చిన లింకులో చూడవచ్చు.

గత నెల రోజులుగా ఇంకా చెప్పాలంటే వేముల రోహిత్ విషాద మరణ ఘటన నుంచి రగులుతున్న పరిణామాలపై ఆరెస్సెస్ నుంచి తొలిసారిగా సమగ్ర వివరణను, అభిప్రాయాలను ఈ కథనం అత్యంత సమగ్రంగా వివరిస్తోంది. ఈ వ్యాసంలోని చాలా అభిప్రాయాలతో నాకు ఏకీభావం లేదు. కానీ ఈ కథనాన్ని ఆసక్తి ఉన్న అందరూ వీలయితే చదవాలని, చదివి ఎవరికి వారు ఆలోచించుకోవాలని కోరుతున్నాను.

నా దృష్టిలో..

ఈ వ్యాసంలో పరస్పరం ఘర్షించే విరుద్ధాంశాలు చాలానే ఉన్నాయి. 'దేశభక్తి అంటే మాదే అని మేం ఎప్పుడూ అహంకరించలేదు. గుత్తాధిపత్యం ప్రకటించుకోలేదు' అంటూ పరమ ప్రజాస్వామికంగా ప్రకటిస్తూనే కశ్మీర్‌ని భారత్ దురాక్రమించిందని చెప్పే దేశద్రోహ భావాలను ఆరెస్సెస్ సహించదని హెచ్చరించడం ఈ వ్యాసంలోని వైరుధ్యాలకు పరాకాష్ట. సహించకపోవడం అంటే ఏమిటి? దేశద్రోహ నినాదాలు చేయలేదని కోర్టులు సైతం నిర్ధారించిన తర్వాత కూడా జేఎన్‌యు విద్యార్థి నేతలను దేశద్రోహులుగానే ముద్రిస్తున్న సంస్థ ఆచరణను ఎలా అర్థం చేసుకోవాలి? ఆ నినాదాలతో సంబంధిత విద్యార్థి నేతలకు ఏ విధంగానూ సంబంధం లేదని చివరికి ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఉమర్ ఖాలిద్, అనిర్బన్‌లపై కూడా దేశద్రోహ చట్టం వర్తించదని ఢిల్లీ కోర్టు చెప్పిన తర్వాతయినా తమ వాళ్లు ఎంత అతిగా వ్యవహరించారో ఆరెస్సెస్ నాయకత్వం ఆలోచించగలుగుతుందా?

తమను మించిన దేశభక్తులు లేరనే అహంతో, విద్యాలయాల్లో స్వయం ప్రకటిత నిఘాను అమలు చేస్తూ, ఎవరైనా కాస్త గట్టిగా అరిస్తే చాలు వారందరినీ వేటాడుతూ పోలీసు స్టేషన్లలో, కోర్టుల్లో పంచాయితీల్లోకి నెడుతున్న విద్యార్థి సంఘం ఈ దేశాన్ని ఏం చేయదల్చుకున్నదనేది ఇప్పుడు మౌలిక ప్రశ్న. ఒకవేళ ఈ వైఖరి సరైనదే అనుకుందాం. మీరు దేశద్రోహం అంటున్న ఇలాంటి చర్యలను, ఘటనలను కోర్టుల్లోకి ఈడ్చి రభస సృష్టించడం ద్వారా, విద్యార్థులను చీల్చివేయడం ద్వారా మీరు దేశభక్తిని, దేశ సమగ్రతను పరిరక్షించే విషయంలో గ్యారంటీ ఇవ్వగలరా? ఆ విద్యార్థి సంఘానికి ఇది సాధ్యమేనా? అటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో, ఇటు జేఎన్‌యూలో మీ దూకుడు వైఖరి ఫలితంగా దేశవ్యాప్తంగా విద్యార్థులలో అలజడిని కాదు ఉద్యమ వాతావారణాన్ని మీకు మీరే పెంచి పోషించగలిగారు. అజాదీ నినాదాలు దేశమంతా మార్మోగుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో మీరనుకుంటున్న దేశభక్తి స్థాపనకు ఎంత కాలం పడుతుందో చెప్పగలరా?

పైగా... తనతో ఏకీభవించనివారిని దేశద్రోహులుగా పేర్కొంటున్న బీజేపీ కశ్మీర్‌లో వేర్పాటువాదులను బాహాటంగా సమర్థించే పీడీపీతో ఎందుకు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మళ్లీ ఎందుకు ప్రయత్నిస్తున్నది అంటూ ఇంటర్వ్యూ చేసినవారు అడిగిన ప్రశ్నకు బాగయ్య గారు నేర్పుగా సమాధానం దాటవేశారు. 'ఇది పూర్తిగా బీజేపీకి సంబంధించిన వ్యవహారం. వారినే అడగాలి.' అంటూ ఏకవాక్యంతో ఈ ప్రశ్నను దాటేశారు. నిజంగా దేశప్రజలకు దీన్నే నమ్మాలని చెబుతున్నారా? ప్రజలను ఇంత అమాయకంగా అంచనా వేస్తే ఎలా? ఆరెస్సెస్ వ్యతిరేకిస్తే కశ్మీర్లో వేర్పాటువాదులను బాహాటంగా సమర్థించే పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాదు కదా. అలాంటి ఆలోచన చేయడానికైనా బీజేపీ సాహసించగలదా? వేర్పాటువాదులతో మీరు జత గట్టవచ్చు. దాంట్లో మీ ప్రయోజనాలు ఎన్నయినా ఉండవచ్చు కానీ ప్రభుత్వంలో మేము లేము అనే టెక్నికల్ అంశాన్ని మాత్రమే ముందుకు తెచ్చి పీడీపీ వ్యవహారంతో మాకు సంబంధం లేదంటే ఈ దేశ ప్రజలు నమ్మాల్సిందేనా?

"బీజేపీ సహా ఏ సంస్థ సిద్ధాంతంతో అయినా విభేదించే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. వాటికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. తప్పులేదు. కానీ ఈ సంస్థలను అడ్డం పెట్టుకుని దేశాన్ని ముక్కలు చేస్తాం అనే వరకు వెళ్లడం ఏమిటి దీనికేనా భావ ప్రకటనా స్వేచ్ఛ అని పేరు?" అని ఈ కథనం ప్రశ్నిస్తోంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఈ ముక్కలు చేస్తా మాటలను ఎవరన్నారు అనే విషయాన్నే ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. మీరు కాదు.. పోలీసులు, కోర్టులు సైతం  దీన్ని తేల్చలేకపోతున్నాయి. కానీ మీ ఆరోపణ మాత్రం మొత్తంగా జేఎన్‌యూ విద్యార్థులపైనే బురద చల్లుతోంది. విద్యార్థులపై రాజద్రోహ కేసులు. జాతీయ చలన చిత్ర సంస్థ ఫిక్కీలో సినిమా రంగంపై అధ్యయనం చేస్తున్న 35 మంది విద్యార్థులపై రాజద్రోహ కేసులు. మీకూ, మీ అనుబంధ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు తెరిస్తే చాలు స్కాలర్ షిప్ కటింగులు, విశ్వవిద్యాలయాలను మూసివేయాలంటూ బరితెగింపు రాతలూ, ఇంకా ముదిరితే రాజద్రోహ కేసులూ.. ఈ దేశంలో అకడమిక్, పరిశోధనా వాతావరణాన్ని మీరేం చేయాలనుకుంటున్నారో చెబితే బాగుంటుంది.

"మనుస్మృతి గురించి మాకు కచ్చితమైన అవగాహన ఉంది. అదేమీ వేదం కాదు. స్మృతి. ఒక కాలానికి సంబంధించినది. దానికి ఎప్పుడో కాలదోషం పట్టింది. మనుస్మృతిని మేం ఏనాడూ ప్రస్తావించలేదు." చాలా సంతోషం. మనుస్మతికి ఎప్పుడో కాలదోషం పట్టిందనీ, మనుస్మృతిని ఏనాడూ మేం ప్రస్తావించలేదని ఒక ఆరెస్సెస్ ప్రముఖులు ఇంత బాహాటంగా ప్రకటించడం నిజంగా సంతోషించవలసిన విషయమే. కానీ ఇది కేవలం ప్రకటన వరకే పరిమితం కాకుండా నిజంగా మీరు మనుస్మృతి ప్రాతిపదికన ఈ దేశంలో జరుగుతున్న దారుణ వివక్షతలను కుల అంతరాలను పోగొట్టే చర్యలు చేపడితే  ఈ దేశం నిజంగానే బాగుపడుతుంది.
కాని అలాంటి ఒక్కటంటే ఒక్క చర్యను ఆరెస్సెస్ చేపట్టగలిగిందా?

చిన్న ఉదాహరణ. తిరుమల గోవిందుడిని దళితవాడల్లోకి తీసుకుపోయి ఒక రాత్రి మాత్రమే అక్కడ ఉంచి శయనించి మళ్లీ అక్కడినుంచి వచ్చేసే నాటకాన్ని టీటీడీ నాలుగేళ్ల క్రితమే ప్రదర్శించి ఎంత అభాసు కావాలో అంతగానూ అభాసు పాలయ్యింది. చివరకు కాలదోషం పట్టిందని మీరు చెబుతున్న మనుస్మతిని తగులబెడితే.. ఎందుకు తగలబెట్టారంటూ జేఎన్‌యు (ఆరెసెస్ భావజాలం రంగరించుకున్న) అధికారులు నోటీసు పంపితే దీన్నేమని అర్థం చేసుకోవాలి? ఎలా జీర్ణించుకోవాలి? మాటల్లో మార్పు... చేతల్లో మాత్రం వెయ్యేళ్ల వెనకటి ఆలోచనల కూర్పును అట్టిపెట్టుకోవడం. ఈ ద్వంద్వ వైఖరి, కపట వైఖరిని దేశం ముందు ప్రదర్శించడమే దేశభక్తా?

"భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మతంతో ప్రమేయం లేకుండా దేశ ప్రజలంతా ఇచ్చిన నినాదాలు భారత్‌మాతాకీ జై, వందేమాతరం. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసం కొందరు ఈ నినాదాన్ని అవమానించడమంటే, స్వరాజ్య సమరంలో మన పెద్దలు చేసిన త్యాగాలను అవమానించడమే."

ఎంత చక్కటి మాట... ఆనాడు దేశప్రజలు స్వచ్చందంగా తమకు తాముగా ఆమోదించి, సొంతం చేసుకుని పలికిన ఈ స్ఫూర్తిదాయక నినాదాలను మీరు ఇవ్వాళ జాతిపై రుద్దుతున్నారు. భారత్‌మాతాకీ జై అనకపోతే జాతీయ వాదమే లేదని, దేశభక్తులే కారని మీరు తీర్పు చెబుతున్నారు. ఇదెంత ప్రమాదకరమైన పరిణామమంటే దేశం నిలువుగా చీలిపోయే ప్రమాదముంది.

గుర్రాన్ని బలవంతంగా నీళ్ల తొట్టివద్దకు తీసుకువెళితే ఏమవుతోందనే సాధారణ సత్యాన్ని కూడా మీరు మర్చిపోతున్నారు. ఈ నిర్బంధ వాతావరణం, ఈ నిర్బంధ దేశభక్తి, నిర్బంధ భారతమాత స్తుతి ఇవి మీరు ఆశిస్తున్న అఖండభారత్‌కు ఏ కొంచెమైనా మేలు చేస్తాయనుకుంటున్నారా? నాదైన కారణాలతో భారతమాతకు జైకొట్టలేను అంటే కూడా సహించలేనివారు.. అలాంటి వారిపై నిర్బంధ భావజాలాన్ని రుద్దాలనుకుంటున్నవారు ఏ అఖండ భారత్‌ను నిర్మించాలనుకుంటున్నారు?

'రోహిత్ ఆత్మహత్య ముమ్మాటికీ దురదృష్టకరం.' అంటూ బాధను వ్యక్తీకరిస్తున్నవారు.. ఏ కారణం వల్లనయినా కావచ్చు రోహిత్ కన్నతల్లిని ఇప్పటికయినా కలిసి ఓదార్పు, సానుభూతి ప్రకటించే సంస్కార ప్రదర్శన చేయడం లేదు. ఏ సంస్కృతి అడ్డం వస్తోందో మరి. పైగా ఆమె కులం గురించి నీచాతినీచమైన విచారణలు, శల్యపరీక్షలు చేస్తూ, చేయిస్తూ పోవటం.. పార్లమెంటులో కూడా అబద్ధాల స్మృతి ఆమె కులానికి అంత ప్రాధాన్యత నివ్వడం.. ఇది మనుస్మృతికి కాలదోషం పట్టిన సమాజానికి, ఆచరణకు సంకేతమేనా? రోహిత్ తల్లి నిజంగా దళితురాలు కాకపోతే, రోహిత్ నిజంగానే దళితుడు కాకపోతే అతడి ఆకస్మిక ఆత్మహననం సమర్థనీయమే అవుతుందా?

ఆరెస్సెస్ భావాలను రంగరించుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ అప్పారావు పొదిలి రెండునెలల తర్వాత చెప్పా చెప్పకుండా మళ్ళీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తన అధికారిక నివాసంపై దాడి జరిగితే యూనివర్సిటీ చరిత్రలో దుర్దినం -బ్లాక్ డే- అంటూ ఓండ్రపెట్టాడు. ఒక మేధోవంతుడైన విద్యార్థి... కేవలం  వీసీగా తన నిర్లక్ష్యం, క్రూరత్వం కారణంగా గుండె పగిలి చావును కొని తెచ్చుకుంటే ఆరోజు అదే యూనివర్సిటీ చరిత్రలో బ్లాక్ డే అయిందనే మాట ఈ మహానుభావుడి నోటివెంట పెగల్లేదు. అతగాడి ఇంట్లో ధ్వంసమైన ఫర్నిచర్‍‌కు ఉన్నంత విలువ కూడా ఆ యూనివర్శిటీలో విద్యార్థికి లేదు.

మనుషుల ప్రాణాలను నిలువునా హరించే చర్యలు, లెటర్లమీద లెటర్లు, హెచ్చరికల మీద హెచ్చరికలు చేసి రాచి రంపాన పెట్టి మనిషిని నిలువునా హతమార్చిన పెద్దమనుషులు, తారామణులు, చేసిన తప్పు ఎక్కడ మెడకు చుట్టుకుందోనని అబద్దాల మీద అబద్దాలు పలికి బయటపడ్డవారు..

వీరెవ్వరూ దేశద్రోహులు కారు. వీరెవ్వరూ జాతి ద్రోహులు కారు...

ఇదీ ఈ కథనంపై నా భిన్నాభిప్రాయం..

కానీ నా అభిప్రాయం నాది. దీంతో పనిలేకుండా ఆరెస్సెస్ భాగయ్యగారి పూర్తి కథనాన్ని కింది లింకులో చదువగలరు.

అది దేశద్రోహం కాక మరేమిటి?


Monday, March 21, 2016

‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయట...!

మహత్తరమైన మన భారత జాతీయవాదులు, మరో దేశానికి వ్యతిరేకంగా కాదు, తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగానే ఆగ్రహావేశాలను రేకెత్తిస్తున్నారు. మన కపట జాతీయవాదులు తమ సొంత పౌరుల మతం లేదా భావజాలం గురించి వెంటపడుతున్నారు. వారికి పట్టేది, వారి ఆగ్రహం అంతా అంతర్గత శత్రువు గురించే. అది దేశం మీద ప్రేమ కాదు లేదా  మరే ఇతర ప్రేమా కాదు. అది విద్వేషం, విరోధం. 

భారత ముస్లింలను, భారత దళితులను అణచివేయడం జాతీయవాదం కాదు. ‘జాతి వ్యతిరేకత’ అని మనం అభియోగంగా అతి తేలికగా వాడేసే ఈ పదం నేడు యూరోపియన్ భాషలలో నిజంగా వాడుకలో ఉన్నది కాదు. భారతీయుల వంటి ప్రాచీన కాలపు ప్రజలు మాత్రమే వాడేది. జాతి అనేది ఏ అర్థాన్ని ఇస్తుందో దానికి వ్యతిరేకమైన విషయాలకే అది ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్ మాతా కీ జై అనడం గాక, ఏది నిజమైన జాతీయవాదమో నిర్ణయించేది ఎవరు? నిజంగానే నాకు భారత జాతీయవాదం అంటే ఏమిటో తెలియదు.

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ జాతీయవాదం అంటే ఏమిటనే అంశంపై బహిరంగ ఉపన్యాసాల పరంపరను నిర్వహిస్తోంది. వీడియోల సెట్టుగా అవి అందుబాటులోకి వస్తున్నాయి. అవి విద్వద్వంతమైనవే అయినా సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి. అదో గొప్ప కృషే. కానీ అందులో చాలా భాగం భారతీయుల మీదనే వృథా చేస్తారేమోనని నా భయం.  మీరెంత ఘోరంగా ప్రవర్తించినా ఫర్వాలేదు, భారత్ మాతా కీ జై అని అంటున్నంత కాలం మీరీ దేశంలో జాతీయవాదే.

వార్తా పత్రికల్లోనే వచ్చిన మరో కథనం, ఇద్దరు ముస్లింల గురించినది. వారిలో ఒకరు 15 ఏళ్ల పిల్లాడు. సరిగ్గా అమెరికన్ ఆఫ్రికన్లను అమెరికాలో చేసినట్టే... వాళ్లను కూడా చెట్టుకు కట్టేసి చిత్రహింసల పాలు చేసి చంపారు. వారిద్దరూ గేదెలను మేపుకుంటున్నారు. కాబట్టి వారి నేరం ఏమిటో స్పష్టం కాలేదు. అయితే ఈ విద్వేషాన్ని ఎక్కడి నుంచి రేకెత్తిస్తున్నారనేది మాత్రం పూర్తిగా కచ్చితంగా తెలిసినదే.

ఇదేమైనా ప్రభుత్వం కాస్త ఆగేట్టు చేస్తుందా? ఎంతమాత్రమూ చేయదు. ఇంకా మరింత ‘‘జాతీయవాదం’’ కోసం పిలుపునివ్వడం కోసం ఈ వారాంతంలో బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశం కానున్నది. ఇప్పటికే మనకున్నది సరిపోదా?

మన హిందుత్వ జాతీయవాదులు ప్రచారం చేస్తున్నది విభిన్న తరహా జాతీయవాదం. అది, మరో దేశంతో పోలిస్తే మరొక దేశంలోని వారికి తమ పట్ల ఉండే భావం అని చెప్పే యూరోపియన్ జాతీయవాదం కాదు.

సెర్బియన్లను, ఆస్ట్రో-హంగేరియన్లు, వారిని రష్యన్లు, వారిని జర్మన్లు, వారిని ఫ్రెంచ్‌వాళ్లు ద్వేషించటం వల్ల ప్రపంచ యుద్ధం జరిగింది. ఇటాలియన్లు ఆ యుద్ధంలో ఎందుకు చేరారో నాకైతే గుర్తులేదు. కానీ బ్రిటిష్‌వాళ్లు ప్రతి ఒక్కరినీ ద్వేషించేవారనేది మాత్రం నిజం. ఒక్కసారి నిప్పు అంటుకున్నదే చాలు, అంతా ఒకరిపైకి మరొకరు విరుచుకుపడ్డారు.  టర్కులను, అరబ్బులను, భారతీయులను, తత్పర్యవసానంగా అమెరికా వంటి  దేశాలనూ అందులోకి ఈడ్చారు.

రెండు ప్రపంచ యుద్ధాలలో ఆ దేశాలు తమకు తాము చేసుకున్న హాని ఫలితంగా యూరోపియన్ దేశాలు తమ సంకుచితత్వాన్ని కోల్పోయాయి. అదే ఆ తర్వాత వారిలో యూరోపియన్ యూనియన్ పట్ల ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈయూ అంటేనే, తమ తమ జాతీయతలను వదుల్చుకుని, తమ సరిహద్దులను, మార్కెట్లను ఒకరికొకరు తెరుచుకోవాలని కోరుకున్న ప్రజా సముదాయాలు.  కాగా, నేటి భారతదేశంలోని మన ‘జాతీయవాదం’ మరో జాతికి వ్యతిరేకమైనది కాదు, ఇతర భారతీయులకు వ్యతిరేకమైనది. అందుకే ఇది విభిన్నమైనది.

నాగరిక సమాజంలో భారత ప్రతిష్టపై ఇది ఎలాంటి ప్రభావాన్ని కలుగజేస్తుందో బీజేపీ వాళ్లకు తెలియదా? ఏ విదేశీ పేపర్‌ను లేదా పత్రికైనా తీసుకోండి. భారత్ గురించి అందులో ఉండే వార్తలన్నీ ప్రతికూలమైనవే. ఎందుకు? నివారించగలిగిన ఒకే విధమైన ఘటనలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయని మనలో చాలా మందిమి, మిగతా ప్రపంచమూ కూడా భావిస్తోంది కాబట్టి. ఈ పరిస్థితుల్లో అవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవేమోననే అనుమానం కలగకుండా ఉండటం తేలికేం కాదు.

విద్వేషం నిండిన, కపట జాతీయవాదులకు మంచి రోజులు వచ్చేశాయి.
..................

పై పరిచయ వాక్యాల్లో ఒక్క అక్షరం కూడా నాది కాదు.

ప్రముఖ కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్ 'సాక్షి' పత్రికకు పంపిన కాలమ్ ఇది.

జాతీయవాదులకు, జాతి వ్యతిరేకులకు మధ్య సాగుతున్న మోసపూరితమైన, ఈ సొంత తయారీ చర్చ త్వరలోనే సమసిపోతుందని ఆశపడుతున్న తనలాంటి వాళ్లకు.. 'భారత వ్యతిరేకమైన రాతలేవీ రాయడం లేదని హామీ ఇవ్వాలం'టూ కేంద్ర మానవ వనరుల మంత్రిణి.. ఈ కలియుగంలో సైతం సత్యం మాత్రమే పలికుతూ అసత్యాన్ని తన దరికి కూడా రానివ్వని.. శ్రీమాన్ స్మృతి ఇరానీ నిర్దేశనలోని ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్’ (ఎన్‌యూపీయూఎల్), మార్చి 19న  దేశంలోని ఉర్దూ రచయితలందరినీ నిర్దేశించినట్లు వచ్చిన వార్త నిరుత్సాహం కలిగించిందని ఆకార్ పటేల్ అభిప్రాయపడ్డారు.

తనకు ఇప్పుడు సాగుతున్న ప్రపంచ క్రికెట్ కప్ వంటి విషయాల గురించి రాయాలని ఉంది. కానీ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన ఈ వార్తా కథనం వల్ల... మధ్యయుగాల కాలపు ఈ నిత్య పోరాటంలో తాను కూడా ఏదో ఒక పక్షాన నిలవడం తప్ప, గత్యంతరం లేకపోయిందంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.

అణువణువునా విద్వేషం నిండిన కపట జాతీయ వాదులకు ప్రస్తుతం మంచిరోజులు వచ్చేశాయన్నది ఆయన ముక్తాయింపు.

అదేదో ఆయన మాటల్లోనే పూర్తిగా కింది లింకులో చదువగలరు.

‘జాతీయవాదులకు’ మంచి రోజులు వచ్చేశాయి
ఆకార్ పటేల్
aakar.patel@icloud.com


గమనిక:
దేశద్రోహ కేసులో అరెస్టయిన జేఎన్ యూ విద్యార్తులు ఉమర్ ఖాలిద్, అనిర్బాన్ మార్చి 18న విడుదలై క్యాంపస్ కు వచ్చిన సందర్భంగా జేఎన్ యూ విద్యార్థినీ విద్యార్థుల ఆనంద హేలను ఈ అత్యద్భుతమైన  వీడియోలో చూడగలరు. దేశంలో ఏ యూనివర్సిటీలోనూ లేనంత అధికంగా (60 శాతం) జేఎన్ యూలో ఉన్న విద్యార్థినులు గళమెత్తితే, ఆజాదీ అంటూ తాండవమాడితే ఎలా ఉంటుందో ఈ తాజా వీడియోలో సుస్పష్టంగా చూడవచ్చు. 

వెనుకబడిన, ఉన్నత వర్గాల విద్యార్థినులు తమ విద్యార్థి నేతల విడుదల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చేసిన నినాదాల ఆత్మఘోషను వినడానికి మనసు పుడితే కింది వీడియో లింకు తప్పక చూడండి.

Stand With JNU

(Electrified video from Jnu ladies)
https://www.facebook.com/standwithjnu/videos/1280983335249155/

Azadi Azadi Azadi Azadi

Slogans for freedom resonated in JNU as the University community celebrated the return of Umar and Anirban to the campus on 18 March 2016, following the grant of bail by the Patiala House court.

https://www.facebook.com/c.vanaja/posts/10208247434730794?from_close_friend=1
--------------------------

అలాగే ఉమర్ ఖాలిద్, అనర్బన్ విడుదల సందర్భంగా కన్హయ్య నేతృత్వంలో వందలాది విద్యార్థులు ఇస్తున్న నినాదాల హోరును ఇక్కడ చూడవచ్చు.

Azadi slogans at JNU's Freedom Square, led by Kanhaiya

https://www.youtube.com/watch?v=VQc_1a2tXX4

Students chant slogans of Azadi (freedom) at JNU's Freedom Square on 18 March 2016 - the night when Umar and Anirban returned to campus - with Kanhaiya Kumar, the JNUSU President, leading the sloganeering.
Saturday, March 19, 2016

ఇదీ జేఎన్‍యూ అంటే..! ఇదీ చర్చా సంస్కృతి అంటే..!

ఇక్కడ ఇస్తున్న వీడియో లింక్ టైటిల్‌కి దానిలోపల విషయానికి కాస్త వ్యత్యాసం ఉన్నట్లుంది. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య రాజద్రోహ నేరారోపణపై అరెస్టై మూడు వారాల తదుపరి విడుదలైన సందర్భంగా చేసిన  చారిత్రక ప్రసంగంలో అజాదీ గురించి మాట్లాడిన విషయాలపై జేఎన్‌యూ ప్రొఫెసర్ మకరంద్ పరాంజపే మరొక వీడియోలో విమర్శించారు.

కానీ ఇక్కడ ఈ టైటిల్‌తో రూపొందిన ఈ  వీడియో లింకులో జేఎన్‌యు లోపల అంతర్గతంగా ఎలాంటి చర్చలు  జరుగుతున్నాయో, వంద విరుద్ధ భావాలు అక్కడ ఎంత తీవ్రస్థాయిలో, ప్రజాస్వామికంగానే ఘర్షిస్తున్నాయో. అక్కడి విద్యార్థులు, అధ్యాపకుల మధ్య దేశంలోనే ఎక్కడా లేనంత మనోహర చర్చాసంబంధాలు పాతుకుని ఉన్నాయో ఈ వీడియో తొలినుంచి చివరివరకు చాలామంది కళ్లు తెరిపించేలా చూపిస్తోంది. ఒక్కసంవత్సరమైనా జేఎన్‌యూలో  చర్చావాతావరణంలో గడపాలనే కోరిక యూనివర్శిటీ విద్య ముగించిన ముప్పై ఏళ్ల తర్వాత నాకే మళ్లీ పుడుతోంది.

అక్కడ హిందువు మాట్లాడతాడు. అంబేద్కరిస్తులు మాట్లాడతారు. మనుధర్మ మద్దతుదారులు మాట్లాడుతారు. దాని వ్యతిరేకులు మాట్లాడతారు, సిక్కులు మాట్లాడతారు. ముస్లింలు మాట్లాడతారు. చివరికి చైనీయులు కూడా మాట్లాడతారు. ఒక కమ్యూనిస్టు సవాలు చేస్తే ఒక స్వతంత్ర మేధావి జవాబు చెబుతాడు. విద్యార్థుల మధ్య చర్చలు, ప్రశ్నలు, అధ్యాపకులు జవాబులు, సవాళ్లు ఇంత జరిగినా చర్చలో పాల్గొన్నవారి మధ్య సామరస్య వాతావరణం దెబ్బతినకుండా చూసే విద్యార్థి సంఘం నేతలు.. ఏమి జీవితమది?

'తత్వశాస్త్రాన్ని క్లాసురూముల్లోంచి బయటకు లాగండి. చీకటి గదులనుంచి బయటకు లాగండి' అంటూ చైనా కమ్యూనిస్టు పార్టీ అధినేత మావో సేటుంగ్ చేసిన వ్యాఖ్యానానికి అచ్చు గుద్దినట్లుండే వాతావరణం జేఎన్‌యూలో కనబడుతోందిప్పుడు. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులు క్లాసురూముల్లో క్లాసులు చెబుతున్నారో, పాఠాలు వింటున్నారో తెలియదు గానీ జేఎన్‌యూ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద ప్రతి సాయంత్రం జరుగుతున్న చర్చాగోష్టులకు మాత్రం వందలాది మంది విద్యార్థినీ విద్యార్థులు హాజరవుతున్నారు. దేశంలోనే ఏ యూనివర్సిటీలోనూ లేనంతగా 60 శాతం మంది విద్యార్థినులే ఉంటున్న జేఎన్‌యూలో ప్రతి సభ, ప్రతి చర్చాగోష్టిలో విద్యార్థినులదే ఆధిక్యం. విద్యార్థులపై రాజద్రోహం కేసు మోపడానికి ముందు కూడా సంవత్సరాలుగా జేఎన్‌యూ తన చర్చా సంప్రదాయాన్ని ఏమాత్రం వదులుకోలేదు.

జేఎన్‌యు వెలుపల వున్న మనం. కొన్ని అజ్ఞాత కేకలు, నినాదాలతో భారత ఉనికికే భంగం ఏర్పడిపోయినట్లుగా ఉన్మత్తోన్మాద విభజనతో చీలిపోయి.. దేశభక్తి, దేశద్రోహం గురించి కాట్లాడుకుంటున్న మనం.. కాస్త ఓపిక తెచ్చుకుని జేఎన్‌యు అసలు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంత బాగుండేదో.. దేశద్రోహ కేసుల సాక్షిగా, మన పిల్లలపైకి ఎక్కుపెట్టిన కండోమ్‌ల సాక్షిగా ఒక్క విషయం మాత్రం నేడు స్పష్టమవుతోంది. జేఎన్‍‌యూ చరిత్రలోనే ఎన్నడూ లేనంత ఐకమత్యం ఇవ్వాళ అక్కడి విద్యార్థులు, అధ్యాపకుల మధ్య ఏర్పడిపోయింది. జేఎన్‌యూపై అనరాని మాటలను ప్రయోగించి పైశాచికానందాన్ని పొందిన వారెవ్వరూ ఇకపై జేఎన్‌యూ ఈక కూడా పెరగలేనంత దృఢమైన బంధం అక్కడి అణువణువులోనూ పాతుకుపోయింది.

ఈ వీడియో మొత్తం ఇంతవరకు అంటే ఈ రోజు తెల్లవారు జాము వరకు చూశాను. ఇప్పుడు జేఎన్‍యూ మొత్తం మీద మారుమోగుతున్న  నినాదం ఒక్కటే.. అర్భకులమీద రాజద్రోహాన్ని ఆరోపించవద్దనే. చదువుకోసం వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులపై కండోమ్ బాణాలను విసరవద్దనే.. కశ్మీర్ విముక్తి, భారత్‌ని ముక్కలు చేస్తాం అంటూ బయటివారు, ముసుగులోని వ్యక్తులు కొద్దిమంది మాట్లాడిన మాటలవల్లే జేఎన్‌యూ ఇంత అపనిందలను ఎదుర్కోవలసి వచ్చిందని.. (నా క్యాంపస్‌ను కొద్దిమంది హైజాక్ చేశారని అందుకే ఇంత సమస్య తలెత్తిందని) మాలో మాకు ఎవ్వరికీ విభేదాలు, తగాదాలు అసలు లేవని.. కమ్యూనిజాన్ని తన కోణంలో మేధోవంతగానే విమర్శించే ప్రొఫెసర్ మకరంద్ పరాంజపే సైతం ఈ వీడియోలో ప్రకటించారంటే జేఎన్‌యూ ఏ విశిష్ట వారసత్వంతో కొనసాగుతోందో అర్థమవుతుంది. జిహాదిజం అనేది సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నిస్తోంది కనుక ఆ కోణంలో జిహాద్‌ని కూడా సపోర్టు చేస్తానని పరాంజపే ప్రకటించారంటే అది జేఎన్‌యూకే సాధ్యం.

ఒకవైపు కమ్యూనిస్టులూ, మరొకవైపు ఆరెస్సెస్ శక్తులూ, మరోవైపు అంబేద్కరిస్టులూ నిత్యం చర్చిస్తున్న, ఘర్షిస్తున్న జేఎన్‌యూలో.. పార్టీలతో సంబంధంలేని స్వతంత్ర మేధావులు, గ్రాంసీ ఏనాడో పేర్కొన్న ఇండిపెండెంట్ ఇంటలెక్చువల్స్ ఉండాలని కోరుతున్న ప్రొఫెసర్ పరాంజపే మాటల్ని అక్కడి విద్యార్థులు తమ భావాలను, పార్టీలతో బంధాలని పక్కనబెట్టి మరీ స్వాగతించడం వింటూంటే రోమాంచిత స్ఫూర్తి కలుగుతోంది.

అలాంటి జేఎన్‌యూపై ఇకనైనా నిందలు మోపడాన్ని మానుకుందాం. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఐఎఫ్‌ఎస్‌లు, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, టీచింగ్ వంటి సకలరంగాల్లో జేఎన్‌యూ ప్రోడక్ట్స్ గత 60 ఏళ్లుగా తమ ప్రభావం చూపుతూనే ఉన్నారు. ఒక ఉత్కృష్ట చర్చా సంస్కృతికి, వారసత్వానికి నిలయమైన జేఎన్‌యూపై మరక చల్లడాన్ని ఇకనైనా ఆపేద్దాం.

జేఎన్‌యూని జేఎన్‌యూలాగే ఉండనిద్దాం. జేఎన్‌యూని దాని మానాన దాన్ని ఉండనిద్దాం. ఈ దేశానికి దానివల్ల ఉపయోగం ఉందో లేదో ఈ జాతి మొత్తానికే తెలుసు కానీ.. జేఎన్‌యూ వల్ల ఎలాంటి అపకారం దేశానికి జరగలేదని, జరగదని, జరగబోదని నా ప్రగాఢ విశ్వాసం. గత నెలరోజుల పైగా ప్రతిరోజూ జెఎన్‌యూ పరిణామాలను నిద్రమేలుకుని మరీ గమనిస్తున్న, చూస్తున్న నాకు ఈ అభిప్రాయం తప్ప మరేదీ కలగలేదంటే నేను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు కాదు. జేఎన్‌యూని సపోర్ట్ చేసినంత మాత్రాన నేను దేశద్రోహిని అయిపోను.

నాదొక్కటే బాధ. పదవ తరగతి పూర్తయ్యాక ఇక వద్దు బాబో అంటూ హిందీని వదిలేశాను. ఇన్నేళ్ల తర్వాత నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడే అర్థమవుతోంది. భాషలను వ్యతిరేకించడం, ఆధిపత్య భాష సాకుతో ఒక నిర్దిష్ట భాషకు దూరమవటం ఎంత అర్థరహితమో ఇప్పడు అర్థమవుతంది.

జేఎన్‌యూలో అంతర్గత చర్చా సంస్కృతి ఎంత దివ్యంగా విరాజిల్లుతోందో అర్థం చేసుకోవడానికి కింది వీడియో లింకును తెరచి చూడగలరు. మరోసారి చెబుతున్నాను. ఈ వీడియో టైటిల్‌కి దాని లోపలి విషయానికి సంబంధం లేదు.

JNU Professor Makarand Paranjape Slams Kanhaiya Kumar on his 'Azadi' Speech (VIDEO)

https://www.youtube.com/watch?v=-V6T_jjiVLw

ప్రొఫెసర్ మకరంద్ పరాంజపే జాతీయవాదంపై చేసిన పూర్తి పాఠం ఇక్కడ చూడగలరు.
Lecture on Nationalism #15th by Makarand Paranjape

Friday, March 18, 2016

దేశభక్తి అంటే ఇదీ!

‘‘అంటరాని కులాల ప్రజలను జంధ్యం ధరించడానికి అనుమతిస్తున్నామా? వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేయడానికి అంగీకరిస్తున్నామా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. మరి అటువంటప్పుడు ఇతర దేశాల వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తున్నారని, అవమానిస్తున్నారని విమర్శించే హక్కు మనకు ఎక్కడున్నది?’’ 

‘‘కొన్ని విషయాలను తలచుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. ఒక కుక్కను మన తొడల మీద కూచోపెట్టుకొని గారాబం చేస్తాం. వంటగది సహా, ఇల్లంతా స్వేచ్ఛగా తిరగనిస్తాం. కానీ సాటి మనిషిగా పుట్టిన వాడిని అంటరానివాడని పేరుపెట్టి, అంటుకుంటే చాలు మన ధర్మం నాశనమవుతుందని బాధపడిపోతాం’’

"మురికిగా, అపరిశుభ్రంగా ఉంటారని, అపరిశుభ్రమైన పనులు చేస్తారని కొందరిని వెలివేస్తున్నాం. మన మురికిని కడిగిన తల్లిని ఎందుకు వెలివేయడం లేదు?"

"గురుగోవింద్‌సింగ్ సైన్యంలోనూ, ఛత్రపతి శివాజీకి అండగానూ అంటరాని కులాలు పనిచేశాయి, వాళ్ళు లేకపోతే హిందూ ధర్మం ఎప్పుడో దెబ్బతినేది."

పైన ప్రస్తావించినవన్నీ... ఒక బాబాసాహెబ్ అంబేద్కరో లేక ఒక మహాత్మ జ్యోతిరావు ఫూలేనో అన్న మాటలు కావు. బ్రిటిష్ వాడి గుండెల్లో బాంబులు పేల్చి, దేశ దాస్య శృంఖలాలను ఛేదించేందుకు ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన విప్లవ వీరుడు షహీద్ భగత్‌సింగ్ రాసిన మాటలివి. మనమెరిగిన భగత్‌సింగ్‌లోని అంతగా వెలుగుచూడని తాత్విక కోణమిది. 1928, జూన్‌లో ‘కీర్తి’ అనే పంజాబీ పత్రికలో ‘అంటరానితనం’పై ఆయన రాసిన వ్యాసంలోని వాక్యాలివి. అంటరానితనం దుష్టస్వరూపాన్ని, దానిని అమలు చేస్తున్న హిందూమత వ్యవస్థ డొల్లతనాన్ని అందులో ఆయన తూర్పారబట్టారు.

భారత సమాజంలోని వైరుధ్యాలకు ఆయువుపట్టుగా ఉన్న కులాన్ని, దాని వికృత రూపమైన అంటరానితనాన్ని అర్థం చేసుకొని భగత్‌సింగ్ చేసిన విశ్లేషణ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. దేశ రక్షణకు, సమాజ పురోగతికి అంటరాని కులాలు చేసిన సేవను ప్రస్తావిస్తూ... గురుగోవింద్‌సింగ్ సైన్యంలోనూ, ఛత్రపతి శివాజీకి అండగానూ అంటరాని కులాలు పనిచేశాయని, వాళ్ళు లేకపోతే హిందూ ధర్మం ఎప్పుడో దెబ్బతినేదని ఆయన స్పష్టం చేశారు.

అంటరాని కులాల ప్రజలను ఉద్దేశిస్తూ, ‘‘మీరు నిజమైన కార్మికవర్గం. మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మీ కాళ్ళ మీద నిలబడి ఈ అసమానతల్ని ప్రతిఘటించండి. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూ డదు. మీకు మీరే రక్షకులుగా నిలవండి. సామాజిక ఉద్యమం ద్వారా విప్లవానికి నాంది పలకండి. మీరు, మీరు మాత్రమే ఈ దేశపు మూలస్తంభాలు, మూలాధారాలు. నిద్రపోతున్న సింహాల్లారా, లేవండి విప్లవ పతాకాన్ని ఎగురవేయండి!’’ అంటూ ఆయన గర్జించడాన్ని చదువుతుంటే భగత్‌సింగ్ కళ్ళ ముందే నిలిచినట్టనిపిస్తుంది.

ఆయన రచనల పేరుతో వచ్చిన చాలా పుస్తకాల్లో ఈ వ్యాసానికి చోటు దక్కకపోవడానికి కారణాలు ఎలాంటివో అర్థం చేసుకోగలం. కులం పట్ల భగత్ సింగ్ విస్పష్ట వైఖరిని మరుగుపరిచే ప్రయత్నం జరిగిందనే భావించాలి.

1928 సమయంలో అంబేద్కర్ నాయకత్వంలో అంటరాని కులాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఉద్యమానికి భగత్‌సింగ్ సంఘీభావాన్ని ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్‌ను అంగీకరించడం ద్వారానే వారి జీవితాలలో మార్పు వస్తుందంటూ ‘‘ఈ సమస్యకు పరిష్కారం ఏమిటనే ప్రశ్న అందరిలో ఉదయిస్తుంది. ప్రతి మనిషి పుట్టుక, వృత్తి ద్వారా గుర్తింపును పొందకుండా, ప్రతి మనిషిని సమానంగా చూసినపుడే అంటరానితనం కుల వివక్ష, మాయమైపోతాయి’’ అంటూ కులసమస్యకు పరిష్కారం చూపాడు.

భగత్‌సింగ్ ఇరవై నాలుగేళ్ల ప్రాయంలోనే అమరుడైనా, ఆయన ఆలోచనలు, ఆచరణ, జీవితం నాటి నుంచి నేటి వరకు యువతరాన్ని విప్లవోన్ముఖులను చేస్తూనే ఉన్నాయి.

అంటరానితనంపై ఆయన ప్రకటించిన అభిప్రాయాలు నాటి పంజాబ్‌లోని అంటరాని సామాజిక వర్గాల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. అక్కడి అంటరాని కులాలు సాధించిన సామాజికార్థికాభివృద్ధే అందుకు నిదర్శనం. కొందరి  జీవితాలు, ఆలోచనలు, సమాజ గతిని నిర్దేశిస్తాయి. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ నిరంతరం పురోగమించే శక్తిని సమాజానికిస్తాయి. అందుకే భగత్‌సింగ్ వంటి వారు అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.

దేశభక్తి, దేశద్రోహం అడ్డుగోడలను కాస్త పక్కనబెట్టి 68 ఏళ్ల క్రితం భగత్ సింగ్ అనే... ఒక నవయువకుడు 22 సంవత్సరాల చిరుప్రాయంలో ప్రకటించిన అగ్నిసదృశ ప్రకటన ఇది. ఒకటి మాత్రం నిజం.. జాతీయ విప్లవకారుల  త్యాగానికి మారుపేరుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన భగత్ సింగ్ ఇవ్వాళ మన గడ్డపై ఉండి పై మాటలను పలికి ఉంటే ఖచ్చితంగా రాజద్రోహి, దేశద్రోహి అయి ఉండేవాడు.

"ఒక కుక్కను మన తొడల మీద కూచోపెట్టుకొని గారాబం చేస్తాం. వంటగది సహా, ఇల్లంతా స్వేచ్ఛగా తిరగనిస్తాం. కానీ సాటి మనిషిగా పుట్టిన వాడిని అంటరానివాడని పేరుపెట్టి, అంటుకుంటే చాలు మన ధర్మం నాశనమవుతుందని బాధపడిపోతాం"

భగత్ సింగ్ చెప్పిన ఈ ఒక్కమాట చాలు. మన ధర్మం, న్యాయం ఎక్కడ చంకనాకిపోయిందో అర్థం చేసుకోవడానికి..

"మురికిగా, అపరిశుభ్రంగా ఉంటారని, అపరిశుభ్రమైన పనులు చేస్తారని కొందరిని వెలివేస్తున్నాం. మన మురికిని కడిగిన తల్లిని ఎందుకు వెలివేయడం లేదు?"

అయ్యా. ఇదీ మన దేశం. ఇదీ మన జాతి గొప్పదనం. ఇదీ నాలుగుపాదాల మీద నడిచి పాకి దేకి వచ్చిన మన ధర్మం.

మన తరతరాల బూజు ఇలా పేరుకుపోయాక ఇప్పుడు ఏ దేశభక్తిని గురించి పొగుడుకోవాలి మనం?

‘‘నేను విప్లవోద్యమంలో పూర్తి కాలం పనిచేయాలనుకుంటున్నాను. నీవు ఒక తల్లి కోరిక మేరకు నా పెళ్ళి చేయాలనుకుంటున్నావు. కానీ కోట్లాది మంది భారతీయుల తల్లి భరతమాత చెర విడిపించడం, ఆ తల్లి కోరిక తీర్చడం నా కర్తవ్యం’’

అంటూ కన్న తండ్రికి లేఖ రాసి 14 ఏళ్ల ప్రాయంలో ఇంటినుంచి వెళ్లిపోయిన భగత్ సింగ్ పాతికేళ్లు కూడా నిండకుండానే తన ధర్మాన్ని నిర్వర్తించాడు. దేశభక్తికి అసలు చిరునామాగా, జాతి గుండెల్లో నిలిచిపోయాడు. ఇదీ దేశభక్తి అంటే.

భగత్ సింగ్ ఇవ్వాళ మన మధ్య నిలబడి ఆనాడు తానన్న మాటలని మళ్లీ ప్రకటించి ఉంటే, ఆయన తలకు, నాలుకకు, అంగాంగానికి వెల కట్టి ప్రకటించి ఉండేవాళ్లం. నెంబర్ వన్ జాతి దేశ ద్రోహిగా ముద్రించి తొక్కి పడేసేవాళ్లం ..

పెళ్లి అనే భావనను కూడా మనసులోకి రానివ్వని ఆ మాన్యుడికి కూడా 'కండోమ్' అంటగట్టేవాళ్లం...

ఎందుకంటే... మనం మాగొప్ప దేశభక్తిపరులం కదా మరి!

అందుకే.. మనం ఇంకో వెయ్యేళ్లపాటు ఇలాగే జాతిని, దేశాన్ని ఉద్ధరిస్తూ ఉంటాం.

సాటి మనిషిని అంటుకోవాలంటే భయపడుతూ....

దేశభక్తికి కొత్త కొత్త పాడు నిర్వచనాలు ఇచ్చుకుంటూ...

స్త్రీమూర్తిని ఒక మైలగా, ముట్టుగా, మురికిగా ఆరోపించి వారిని దేవాలయాల్లోకి కూడా రానివ్వకుండా నిషేధాలు విధించుకుంటూ...

మరో వెయ్యి సంవత్సరాలపైగా మనం పవిత్ర బతుకులు, ధర్మబద్ధ జీవితాలు ఇలాగే గడుపుతూ.......నే ఉంటాం.

అవునూ.. చెప్పడం మర్చిపోయాను..

మన అపర దేశభక్తికి సరికొత్త ట్యాగ్ నిన్ననే పుట్టింది.....

అదేమిటంటారా?

భారత్ మాతాకీ జై....
...................

దేశ నిజమైన సమస్యల పట్ల భగత్‌సింగ్ వాణిని వినిపించిన మల్లెపల్లి లక్ష్మయ్యగారి స్పూర్తిదాయక వ్యాసాన్ని కింది లింకులో చూడగలరు.

దేశభక్తికి అసలు చిరునామా

Saturday, March 5, 2016

స్వాతంత్ర్యమే అతడి 'ప్రియురాల'టగత నెల చివరి వరకు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనే చాలామందికి తమ విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్ ఎవరో పెద్దగా తెలిసేది కాదు. కానీ దేశద్రోహం ఆరోపణపై మూడువారాలు తీహార్ జైలులో గడిపి గురువారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌కు బెయిల్‌పై వచ్చిన కన్హయకు స్వాగతం పలకడానికి జేఎన్‌యూ మొత్తంగా తరలివచ్చింది. వాక్ స్వాతంత్రంపై జాతీయస్థాయిలో గ్రేట్ డిబేట్‌కు కారకుడైన కన్హయకు మద్దతు తెలుపుతూ వేలాది మంది జేఎన్‌యూ పరిపాలనా భవనం వద్దకు వచ్చారు.

ఆ తర్వాత.. కాలం స్రవించిన ఒక గంట సమయంలో అక్కడ జరిగిన ఘటనల క్రమాన్ని యావద్దేశం జాతీయ చానెళ్లలో తిలకిస్తూ పోయింది. విద్యార్థులనే కాదు.. స్వేచ్ఛను దాని నిజమైన అర్థంలో పొందగోరుతున్న దేశ ప్రజానీకం 60 నిమిషాల పాటు కన్హయ్య ఉత్తేజభరిత ప్రసంగాన్ని చూస్తూ పోయింది. క్రికెట్, లోక్‌సభ గొడవలు, సినిమా విడుదల వార్తలు ఆ గంట సేపు గాల్లో కలిసిపోయాయి.

మన కళ్ల ముందే ఉత్తుంగ శిఖరంలా ఎగిసి లేచిన ఈ అంగుష్టమాత్రుడి మాటలను జాతీయ చానెల్స్ మొత్తంగా తమ ప్రైమ్ టైమ్ న్యూస్ కింద ప్రసారం చేస్తూ గడిపాయి. ఇక ట్విట్టర్ అయితే కన్హయ్య ప్రసంగ విశేషాలతో హోరెత్తిపోయింది. సానుకూలంగానూ, ప్రతికూలంగానూ కూడా. దేశ రాజధాని అతడి ప్రసంగం గురించి, అతడి వివాదాస్పద అరెస్టు గురించి చర్చిస్తూ పోయింది.పార్టీలకతీతంగా రాజకీయ నేతలు జలపాతంలా దుముకుతూ వచ్చిన కన్హయ్య ప్రసంగాన్ని వింటూ నివ్వెరపోయారంటే అతిశయోక్తి కాదు. అందరికంటే ముందు వ్యాఖ్య కేజ్రీవాల్‌దే. ఎంత మేథో ప్రసంగం అంటూ ట్వీట్ చేశారు. పార్లమెంటులో కన్హయ్యకు ఒక ఎంపీ సీటు ఇప్పటికే రిజర్వ్ అయిపోయిందంటూ ఈ వివాదానికంతటికీ మూలకారణమైన బీజేపీ తరపున కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

అన్నిటికంటే మించి ప్రధాని మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్ సభలో పరస్పర విమర్శలతో చేసిన ప్రసంగాల కంటే కన్హయ్య గురువారం రాత్రి జేఎన్‌యూలో చేసిన ప్రసంగానికే సోషల్ మీడియాలో ఎక్కువ స్పందనలు రావడం గమనించవలసిన విశేషం. జేఎన్‌యూ, రోహిత్ అంశాలతో ప్రచారం లోకి వచ్చి దాంట్లో భాగంగానే జైలు కెళ్లిన కన్హయ్య మాత్రం ఒక్క సారిగా దేశాన్ని ఆకర్షించారు. తొణకని స్వరంతో అనుకున్నది కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరి మోదీ, రాహుల్, కన్హయ్యల్లో ఎవరి స్వరం దేశ గళంగా మారింది అనే ప్రశ్నకు మేధావులు, మీడియా, నెటిజన్లలో అత్యధిక శాతం కన్హయ్యకే ఓటేస్తున్నారు. అతడు ఈ దేశ యువత కాంక్షలకు ప్రతినిధి అంటున్నారు. దేశానికి కన్హయ్య లాంటి నాయకుడు కావాలని scroll.in వంటి ఆన్‌లైన్ పత్రికలు కోరుకుంటున్నాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా భారత గళానికి ఈ వారం ప్రతినిధి కన్హయ్యే. 

చరిత్రలో అతి గొప్ప ఘటనలు ఒక చిన్న బిందువునుంచే మొదలవుతాయన్నది చరిత్ర విద్యార్థులందరీకీ తెలిసిన విషయమే. స్వతంత్ర భారత చరిత్రలోనే జాతీయవాదంపై, దేశభక్తిపై, ఎన్నడూ లేనంత విస్తృత చర్చకు తెరతీసిన ఈ 29 సంవత్సరాల అర్భకుడు డిల్లీని, జాతిని కూడా కదిలించివేయగలిగిన ప్రసంగంతో ఉర్రూతలూగించి ఉండవచ్చు కానీ తన పయనం మాత్రం ఢిల్లీకి చాలా దూరంగా అత్యంత సాధారణ జీవితంతో మొదలైంది.

బీహార్ లోని బెగుసరాయ్ ప్రాంతంలోని బేటియా గ్రామంలో కన్హయ్య  జన్మించాడు. మీనాదేవి, జైశంకర్ సింగ్ తన తల్లిదండ్రులు. స్వాతంత్రం తొలినాళ్ల నుంచి బెగుసరాయ్ వామపక్షాల కంటుకోటగా ఉంటూ వచ్చింది. తండ్రి జై శంకర్ సింగ్ 2009 వరకు రోజు కూలీగా పనిచేసేవాడు. పక్షవాతంతో తను మంచం పడ్డాడు. కన్హయ్య తల్లి ప్రభుత్వ అంగన్ వాడీ పథకంలో వలంటీర్‌గా పనిచేస్తూ నెలకు 3 వేల రూపాయలు సంపాదిస్తూ కుటుంబాన్ని నడిపిస్తోంది.

నిజమే. లెక్క తప్పు కాదు. కేవలం 3 వేల రూపాయలతో ఈ దేశంలో ఒక కుటుంబం బతుకుతోంది. అందుకేనేమో తరచుగా ఈ దేశంలో పేదలే చాలా సులభంగా దేశద్రోహులు అయిపోతుంటారు. ఆరోపణలకు చిక్కుతుంటారు. వందల కోట్లు దిగమింగిన విజయ్ మాల్యాలు, అంతకంటే దిగమింగిన రిలయన్స్ వంటి చప్పన్నారుమంది బిలియనీర్లు, వారికి ప్రజల ఆస్తులను అప్పనంగా అందించిన మోసకారి బ్యాంకులు,  వారి సేవలోనే తరిస్తున్న బ్యాంకుల మేనేజర్లు వీళ్లెవరూ దేశద్రోహులు కారు. అసలైన దేశద్రోహం కాలనాగై ప్రతి క్షణం కాటేస్తున్న ఈ దేశంలో కన్హయ్యలు కాక ఇంకెవరు 'దేశద్రోహు'లవుతారు.

29 ఏళ్లకే దేశద్రోహి అయిపోయిన కన్హయ్య ఇంటివద్దే 5వ తరగతివరకూ చదివాడు. గ్రామంలోని సన్ రైజ్ పబ్లిక్ స్కూలులో 1995లో చేరాడు. తర్వాత బరౌనీలోని ప్రభుత్వ హైస్కూల్లో చేరాడు. తర్వాతి చదువుల కోసం పాట్నా కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చేరాడు. జీవితమంతా ప్రభుత్వ స్కూళ్లలో, కాలేజీల్లోనే చదివిన కన్హయ్యలు దేశద్రోహులవుతుండగా, ప్రైవేట్ చదువులు, కాన్వెంట్ చదువులు, బిజినెస్ స్కూళ్లలో చదివి నాజూగ్గా దేశాన్ని ముంచుతున్న వారు, వారి వారస పుత్రపుత్రికలు మహా దేశభక్తులయిపోతుండటం బహుశా మన దేశానికే చెల్లుతుందేమో..

కన్హయ్య చిన్న తమ్ముడు, ప్రస్తుతం ఎం కామ్ చదువుతున్న ప్రిన్స్ మాటల్లో చెప్పాలంటే. స్వాతంత్ర్యమే కన్హయ్య ప్రియురాలట. "మా అన్నకు కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేరు. ఈ విషయమై తనను అల్లరి పట్టిస్తే, మేరే దుల్హన్ తో ఆజాదీ హై (స్వాతంత్ర్యమే నా ప్రియురాలు) అనేవాడు. 2009లో మా నాన్న జబ్బుతో మంచం పట్టాక  అన్న తన చదువుకోసం ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించుకునేవాడు" అన్నాడు కన్నయ్య తమ్ముడు. కన్హయ్ పెద తమ్ముడు మణికాంత సింగ్ అస్సాంలో ఒక ప్రైవేట్ సంస్థలో సూపర్ వైజరుగా పనిచేస్తున్నాడు. అతడు కూడా తెలివైన విద్యార్థే.

పాట్నాలో కన్హయ్యతోపాటు హాస్టల్ రూమ్‌ పంచుకున్న అమిత్ కుమార్.. కాలేజీ మొత్తంమీద ఉత్తమ వక్తల్లో కన్హయ్య ఒకడని చెప్పాడు. ఎప్పుడు చర్చల పోటీలు జరిగినా అతడే గెలిచేవాడట. రాజకీయాలపై తనకు అపారమైన పరిజ్ఞానం ఉండేదట.

కన్హయ తండ్రి జైశంకర్ సింగ్ చురుకైన వామపక్ష కార్యకర్తగా పనిచేశారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా రెండుసార్లు గెలుపొందిన తోటి గ్రామస్తుడు చంద్రశేఖర్ ప్రసాద్ ప్రభావం కన్హయ్యపై అపారంగా ఉండేది. చంద్రశేఖర్‌ను 1997లో బీహార్‌లో మైనింగ్ మాఫియా కాల్చి చంపింది.

కన్హయ్య 2011లో జేఎన్‌యూలో ఎంఫిల్ కోర్సులో చేరాడు. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్నాడు. సెంటర్ ఫర్ ఆఫ్రికన్ స్టడీస్ విభాగంలో వర్ణవివక్షానంతర దక్షిణాప్రికాపై పరిశోధన చేస్తున్నాడు. కన్హయ్య పీహెచ్‌డీని పర్యవేక్షిస్తున్న రీసెర్చ్ గైడ్ సుబోధ్ మాలాకర్ మాటల్లో చెప్పాలంటే అతడొక చురుకైన విద్యార్థి. "తనను చూసి గర్వపడుతుంటానని, పేద రైతాంగ కుటుంబం నుంచి వచ్చాడు కనుకే ఈ దేశంలో క్షేత్ర స్థాయి వాస్తవాలపై అతడికి లోతైన అవగాహన ఉంద"ని  సుబోధ్ ప్రశంసిస్తారు.


కన్హయ్యకు ఒక గర్ల్ ప్రెండ్‌ను సంపాదించుకునే సమయం ఇంతవరకూ లేకపోవచ్చు. పేదరికం అతడిని ప్రేమకు కూడా దూరం చేసి ఉండవచ్చు. కానీ ఈరోజు వందలాది యువతులకు అతడొక ఐకాన్. ఎంతగానంటే వియ్ లవ్ కన్హయ్యా అంటూ ప్లేకార్డులు ప్రదర్శించేంత పెద్ద ఐకాన్. ఆ ప్రేమ అతడి ఆశయాలతో మమేకమవుతామంటూ ఘోషిస్తున్న అమలిన ప్రేమ. బలంగా స్టాంప్ వేయబడిన ఒక దేశద్రోహిని ఎంతమంది దేశద్రోహులు ప్రేమిస్తున్నారో! వీళ్లందరినీ ఏ జైళ్లకు పంపుదాం? రెడీమేడ్ దేశభక్తులే సెలవియ్యాలి మరి.

( ఈ సాయంత్రమే అందిన వార్త. సీపీఐ జాతీయ సమితి సమావేశంలో కన్హయ్య ఉదంతంపై తీవ్రస్థాయి చర్చ జరిగిందని తెలిసింది. ఆ అర్భకుడిని దేశంలోకెల్లా దేశద్రోహిగా ఆరోపిస్తూ,  దాడులు చేస్తూ, అటు పోలీసులు, ఇటు కోర్టుల్లో న్యాయవాద గూండాలు, దేశభక్తియుత ప్రభుత్వం వెంటాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారంటూ సీపీఐ అత్యున్నత స్థాయి కమిటీలోని యువ నాయకత్వం తమ వృద్దనాయకత్వాన్ని తీవ్రంగా నిలదీసిందని విశ్వసనీయ వార్త. ఒక రాహుల్ గాంధీ,  సీతారాం ఏచూరి,  అరవింద్ కేజ్రీవాల్ తదితర నేతలు నైతిక మద్దతు నిచ్చి తన వెన్నంటి నిలబడకపోయి ఉంటే ఒక చురుకైన విద్యార్థి జీవితం ధ్వంసమైపోయేది కదా, అతడి రక్షణ కోసం మీరేం చేశారని సీపీఐ జాతీయ సమితిలో యువనాయకత్వం తమ సీనియర్లను ఏకిపడేసిందట. ఏం సమాధానం చెప్పాలో తెలియక సుధాకరరెడ్డి, డి. రాజాతో సహా వృద్ధ నాయకత్వం ఆ సమావేశంలో మాటలు రాక మూగపోయిందని తెలుస్తోంది.

దేశ రాజధానిలో సీపీఐ నాయకత్వం ఇంత నీరుగారిన స్థితిలో ఉందా అని ఈ సమాచారం నాతో పంచుకున్న సీనియర్ జర్నలిస్టు ఒకరు  ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రకంగా చూస్తే వయసుడిగిన నాయకత్వం కనుమరుగవుతూ, కన్హయ్య వంటి వారితో కొత్త నాయకత్వం తెరముందుకు వచ్చేందుకు జేఎన్‌యూ ఘటన ఒక  ఉత్ప్రేరకంగా పని చేయనుందేమో మరి. కన్హయ్యకు పార్లమెంటులో సమీప భవిష్యత్తులో సీటు రిజర్వుగా ఉందో లేదో తెలీదు కానీ,  ఒక గొప్ప వక్త, ప్రజలను కదిలించే  వక్త, దేశ వ్యాప్తంగా తన వాణిని వినిపించే రోజులు మాత్రం సమీప భవిష్యత్తులోనే రానున్నాయేమో! పశ్చిమబెంగాల్, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసంగాలకు కన్హయ్యను తురుపు ముక్కలా ఉపయోగించుకుంటామని ఇప్పటికే సీతారాం ఏచూరి ప్రకటించేశారు.

పాతనీరు కొత్త నీరుకు స్థానమిచ్చి ఇక తప్పుకోక తప్పదేమో.. మంచిదే కదా..)

"నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా.  ఒక జేఎన్‌యు విద్యార్థి ఎప్పటికీ జాతి వ్యతిరేకిగా ఉండబోడని ఈ దేశంలో పన్ను చెల్లింపుదార్లకు మాటిస్తున్నా" అని కూడా కన్హయ్య శుక్రవారం మీడియా సమావేశంలో ప్రకటించాడు. బ్రిటిష్ వారు భారతీయులను అణచివేసేందుకు రాజద్రోహ చట్టం తీసుకువస్తే, ప్రస్తుత భారత ప్రభుత్వం విద్యార్థులను అణచివేయడానికి ఆ పాత చట్టాన్ని వాడుతోందని వ్యాఖ్యానించాడు. విద్యార్థులు జీవితాలను ధ్వసం చేయడానికి దేశద్రోహ చట్టం వంటి నల్లచట్టాలను ఉపయోగించవద్దని ఈ ప్రభుత్వాన్ని కోరండి అంటూ డిమాండ్ చేశాడు.

అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక సందేశం కూడా పంపాడు. "భారత రాజ్యాంగం అనేది ఇష్టమొచ్చినట్లు మార్చివేయడానికి వీడియో కాదు." ఇదీ కన్హయ్య విడుదలానంతర సందేశం.

జేఎన్‌యూలోనే చదివి ఇంటెలిజెన్స్ సంస్థలో పనిచేస్తున్న ఒక అధికారి మరోలా చెబుతున్నారు. "కన్హయ్య మమ్మల్మందరినీ గర్వించేలా చేశాడు. మేము జేఎన్‌యూ నుంచే వచ్చాం అని  చెప్పుకున్నప్పుడు ప్రజలు మాపట్ల అపనమ్మకంగా చూసేవారు. కాని జవహర్ లాల్ యూనివర్సిటీ దేనికోసం నిలబడుతోందో కన్హయ్య జాతి మొత్తానికే చూపించాడు."

శుక్రవారం యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వద్ద కన్హయ్యతో భేటీ కావడానికి పోటీలు పడుతూ వచ్చిన మీడియా బృందాలను చూసి జేఎన్‌యూ ప్యాకల్టీ సభ్యులు ఒకరు ఇలా అన్నారు. "చివరకు జేఎన్‌యూ శక్తి సామర్థ్యాలను మార్కెట్  గుర్తించినట్లుంది."

ఈ పూటకు సెలవు......

గురువారం రాత్రి జేఎన్‌యూలో కన్హయ్య చేసిన ప్రసంగం పూర్తి పాఠం ఇక్కడ చూడవచ్చు

We will win this fight Full text of Kanhaiya’s JNU speechFriday, March 4, 2016

దేశం నుంచి కాదు.. కొల్లగొట్టే వారి నుంచి స్వాతంత్ర్యం కావాలన్న కన్హయ్య


దేశం నుంచి ఆజాదీ -స్వాతంత్ర్యం-ని తానెన్నడూ కోరలేదని, దేశాన్ని కొల్లగొట్టేవారినుంచి స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటున్నానని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ డిమాండ్ చేశారు. తప్పుడు దేశద్రోహ కుట్ర కేసులో ఇరికించబడి 23 రోజుల కస్టడీ తర్వాత గురువారం సాయంత్రం తీహార్ జైలునుంచి బయటకి వచ్చిన కన్హయ్య జేఎన్‌యు మాత్రమే కాదు దేశం మొత్తం విని తీరవలసిన ప్రసంగం చేశారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై తనకు విశ్వాసం ఉందన్న కన్హయ్య తనపై దేశద్రోహ కేసు మోపిన కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

అవి మాటలు కావు.. నిప్పుకణికలు. ఈ దేశ ప్రజానీకం గొంతును తనదిగా చేసుకుని జాతి వాణిని వినిపించిన మాటలవి. ఉద్యమాల్లో భాగంగా జైలు జీవితం గడిపి వచ్చిన వారు నిర్బంధంలో మరెంతగా రాటుదేలతారో మరోసారి.. మరోసారి నిరూపించిన మాటలు. ఇంత జరిగినప్పటికీ తన అరెస్టు ఉదంతానికి కారణమైన ఏబీవీపీపై తనకు శత్రుభావం లేదని, వాళ్లు తన ప్రత్యర్థులు మాత్రమేనని చెప్పిన కన్హయ్య వారిలాగా తాను వెంటాడి వేధించే పనికి పూనుకోనని స్పష్టం చేశారు. పైగా జేఎన్‌యూ క్యాంపస్ లోని ఏబీవీపీ వాళ్లు క్యాంపస్ బయట ఉన్న ఏబీవీపీ వారికన్నా ఎక్కువ జాతీయవాదులుగా, హేతుబద్దంగా ఉన్నారని కితాబు కూడా ఇచ్చారు. ప్రజాస్వామ్యంపై,  రాజ్యాంగంపై తమకు నమ్మకం ఉంది కాబట్టే ఇంత జరిగిన తర్వాత కూడా తమకు ఏబీవీపీపై చెడు భావం లేదన్నారు.

ముక్తకంఠంతో జేఎన్‌యూ ఇలా ఒక్కత్రాటిన నిలబడటంలో ఉన్న మంచి విషయం ఏమిటంటే ఇది సహజాతి సహజంగా పుట్టుకొచ్చిందే కానీ ఎవరో చెబుతున్నట్లు ప్లాన్ ప్రకారం పుట్టుకొచ్చింది కాదంటూ కన్హయ్య ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగం ప్రవచించిన సోషలిజం, సెక్యులరిజం, సమానత్వం కోసంమే తాము నిలబడుతున్నామన్నారు. ప్రధాని మోదీతో తాను అనేక విషయాల్లో విభేదిస్తున్నప్పటికీ సత్యమేవ జయతే అంటూ తాను చేసిన ట్వీట్‌తో మాత్రం తనకు ఏకీభావం ఉందని, సత్యమే జయిస్తుందని చెప్పారు.

మాటలు రాతను అధిగమించే సందర్భాలు అత్యంత అరుదుగా మాత్రమే జరుగుతుంటాయి. కన్హయ్య విద్యార్థుల ముందు మాట్లాడుతూ అణచివేతపై నిప్పురవ్వలు చిమ్ముతూ, నిర్బంధాలను గేలి చేస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ చేసిన ప్రసంగం కలిగించిన ప్రభావం దాన్ని పదాల్లోకి మార్చినప్పుడు అంత శక్తివంతంగా ప్రతిబింబించలేదేమో...

విద్యార్థి జీవితం ముగిశాక ఇన్నేళ్ల తర్వాత ఇంత స్పూర్తిదాయకమైన, ప్రసంగాలు వినడం ఇదే మొదటిసారి. 35 ఏళ్ల ముందు నా గతాన్ని, యూనివర్సిటీ జీవితాన్ని, గ్రామాలకు తరలండి పిలుపు కలిగించిన ఉత్తేజాన్ని మరోసారి ఇప్పుడు చూస్తున్నాను.

తనను అన్యాయంగా తప్పుడు వీడియోలో ఇరికించి దేశద్రోహిగా ముద్రించి కోర్టుకీడ్చినప్పటికీ అందుకు కారణమైన విద్యార్థి సంస్థ తన శత్రువు కాదని, తాను వారిలాగా వెంటాడి వేధించబోనని, వారు తమ ప్రత్యర్థులు మాత్రమేనని చెప్పడానికి ఒక మనిషికి ఎంత నిలకడ ఉండాలి? ఎంత సహనం, సంయమనం ఉండాలి? తనను దెబ్బ తీసిన ప్రత్యర్థులను, విరోధులను సైతం తేలిగ్గా తీసుకునే తత్వానికి శిఖరస్థాయి ప్రదర్శన ఇది. ఈ దేశంలో నిరుపేదలకు మాత్రమే సాధ్యమైన క్షమా గుణం ఇది. భావజాలాలకు అతీతంగా, భావాల మధ్య సంఘర్షణకు అతీతంగా వ్యక్తమైన అద్భుతమిది. ఇదీ ప్రజాస్వామ్యం అంటే.

వందలాది జేఎన్‌యూ విద్యార్థుల ముందు కన్హయ్య కుమార్ చేసిన ప్రసంగం తన మాటల్లోనే క్లుప్తంగా చూద్దాం."...మీరు లేచి నిలబడి మాట్లాడారంటే చాలు.. అతికించిన నకిలీ వీడియోలను సైబర్ సెల్ విడుదల చేస్తుంది. మీ డస్ట్‌బిన్‌లో కండోమ్‌లను లెక్కిస్తుంది.  నిరసనలను చట్టవిరుద్ధం చేయడానికి, రోహిత్ వేములకు న్యాయం జరగకుండా నిరోధించడానికి ఇది పథకం ప్రకారం జరిగిన దాడి. కానీ జేఎన్‌యూలో ప్రవేశం పొందడం అంత సులభం కాదు. అలాగే జేఎన్‌యూ నోరు మూయించడం కూడా అంత సులువు కాదు. మా పోరాటాన్ని మీరు పలుచన చేయలేరు.

మన సైనికులు సరిహద్దుల్లో నేలకొరుగుతున్నారని వారంటున్నారు. అలా నేలకొరుగుతున్న  సైనికులకు నేను సెల్యూట్ చేస్తున్నా. కానీ సైనికులు సరిహద్దుల్లో చనిపోతున్నారని పార్లమెంటులో ప్రస్తావించిన బీజేపీ ఎంపీని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అలా చనిపోయిన సైనికుడు మీ కుమారుడు కాదు. మీ స్నేహితుడు అంతకంటే కాదు.  కరువు దెబ్బకు కుంగి, కృశించి మరణిస్తున్న రైతు కొడుకులు ఆ సైనికులు. ఈ ఈ వాస్తవాన్ని పక్కన బెట్టి దేశంలో తప్పుడు చర్చను సృష్టించవద్దు. ఇంతకూ ఈ మరణాలన్నింటికీ  ఎవరు కారణం?

సిరిసంపదలను కలిగి ఉండటంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కు లభించేంతవరకు మేము విశ్రాంతి తీసుకోం. మేం భారత్ నుంచి స్వాతంత్ర్యాన్ని కోరుకోవడం లేదు. ఎందుకంటే భారత్ దేన్నీ తన వలసగా చేసుకోలేదు. దేశాన్ని కొల్లగొడుతున్న వారినుంచి మేం స్వాతంత్ర్యం కోరుకుంటున్నాం. సరిహద్దులపై పోరాడుతున్న సైనికుడు బహుశా చదవాలని కోరుకుని ఉంటాడు కానీ తనకు జేఎన్‌యూలో ప్రవేశం లభించి ఉండదు.

రైల్వేస్టేషన్లలో జనాలకు మాయలు, కనికట్టులతో బురిడీ గొట్టే వారిని మనం చూస్తాం, దేశంలో అలాంటి వారు ఉన్నారు. వాళ్లు నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తామన్నారు. ఇంకా వికాసం గురించి, సమానత్వం గురించి చాలా చాలా మాట్లాడుతున్నారు. భారతీయులు విషయాలను సులువుగా మర్చిపోతారు కానీ ఈ సారి మాత్రం తమాషా చాలా పెద్దదిగా కనబడుతోంది. ఓటర్లను మర్చిపోవద్దు.

మీరు ఒక రోహిత్‌ని నోరు మూయించారు. కానీ ఈరోజు ఆ విప్లవం ఎంత పెద్దదిగా మారిందో చూడండి.జైలులో నేను ఒక అంశాన్ని గుర్తించాను. జేఎన్‌యూలో ఉన్న మనం నాగరిక భాషలో మాట్లాడుతున్నాం. కానీ మనం చాలా కఠినమైన పదజాలాలను వాడుతుంటాం. బహుశా అది సగటు మనిషికి చేరకపోవచ్చు కూడా. మనం సామాన్య ప్రజలతో సంబంధాలను నెలకొల్పుకోవాలి. 

ఈరోజు గౌరవనీయ ప్రధాని స్టాలిన్ గురించి మాట్లాడారు. అయితే మోదీజీ కొన్ని సార్లు హిట్లర్ గురించి కూడా మాట్లాడి ఉంటారనుకుంటాను. వీలయితే ముస్సోలినీతో కూడా. మోదీ మన్ కీ బాత్ గురించి మాట్లాడుతుంటారు కానీ ఆయన ఎప్పుడు వినదల్చుకోడు. 

నేనొక వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చాను. మాది పేద కుటుంబం. పోలీసుల్లో కూడా చాలామంది పేద వర్గాల నుంచి వచ్చిన వారే.  పేద వర్గాలనుంచి వచ్చినవారు పీహెచ్ డీలను పొందకూడదనే ప్రభుత్వం జేఎన్‌యూని అణిచివేయాలనుకుంటోంది. నేను మీడియాకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాలాంటి పేదవర్గాల నుంచి వచ్చిన వారెందరో ఉన్నారు. కానీ వీరికి జేఎన్‌యూలోనూ సీట్లు దొరకవు. సైన్యం లోనూ స్థానం లభించదు.  అందుకో పొలాల్లో పనిచేస్తున్నావారి కోసం, సైన్యంలో ఉండి మనకోసం పోరాడుతున్నవారి కోసం, జేఎన్‌యూలో స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారి కోసం మా పోరాటాన్ని మేం నిలిపివేయం. 

అదేసమయంలో మేం సమానత్వంకోసం పోరాడతాం. అప్పుడే ఒక ప్యూన్ కొడుకు, రాష్ట్రపతి కొడుకు ఇద్దరూ సమాన వాతావరణంలో చదువుకోగలరు. దారిద్ర్యం నుంచి, సామాజిక అణచివేత నుంచి మేము స్వాతంత్ర్యం కోరుకుంటున్నాం. ఈ యూనివర్శిటీ ద్వారా మేం ఆ స్వాతంత్ర్యాన్ని పొందగలం. ఇదే రోహిత్ వేముల కన్న స్వప్నం కూడా. 

నాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. కానీ నాకోసం నిలబడుతున్న వారిని కూడా జాతి ద్రోహులుగా పిలుస్తున్నారు. సీతారాం ఏచూరి, రాహుల్ గాందీలను కూడా జాతి ద్రోహులంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్‌ గురించి చాలా చాలా మాట్లాడారు. కానీ వీరెవరూ జేఎన్‌యూ కోసం మాట్లాడలేదు. మంచికి, చెడ్డకు వ్యత్యాసాన్ని మాత్రమే వీరు ప్రదర్శించారు. 

బీజేపీ హర హర్ అని పిలవడం ద్వారా ప్రజలను గెల్చుకోవడానికి ప్రయత్నించింది. కానీ 'అరహర్' (కందిపప్పు) ధర విపరీతంగా పెరగడంతో ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉంటున్నారు. సమస్యలను సృష్టిస్తున్నది మేం కాదు. మీరే సమస్యలను సృష్టించుకుంటున్నారు. 

కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఎదుర్కొంటున్న నిరసలకు ప్రభుత్వమే కారణం.  తమ స్వంత చర్యలే అందుకు కారణం. మీరు సంపాదించుకున్నదే మీరిప్పుడు ఆరగిస్తున్నారు. జేఎన్‌‍యూ వివాదం ఇప్పుడు టీవీ చానళ్ల ప్రైమ్ టైమ్‌లో చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే మీరు చేసిన 15 లక్షల రూపాయల వాగ్దానాన్ని జాతి మర్చిపోవాలని మీరు కోరుకుంటున్నారు. (నల్లధనం వెనక్కు రప్పిస్తే ప్రతి భారతీయుడికి 15 లక్షల రూపాయలను ఇవ్వవచ్చు అని మోదీ గతంలో వాగ్దానం చేశారు)

ఈ దేశంలో నిత్యం చస్తున్న రైతుల బాధలను మీరెందుకు పట్టించుకోరు? జేఎన్‌యూలో సీటు పొందడం సులభం కాదు. అలాగే జేఎన్‌యూలోని విద్యార్థులను మర్చిపోవడం కూడా అంత సులభం కాదు. దేశంలో అధికారం వెలగబెడుతున్న వారు ప్రజలను ఎప్పుడు అణిచివేసినా ప్రజలు తమ గొంతు విప్పారు. మేం కూడా మీకు వ్యతిరేకంగా గొంతు విప్పుతాం. 

లోక్‌సభలో ఒక బీజేపీ నేత సరిహద్దుల్లో చనిపోతున్న సైనికులను గురించి మాట్లాడారు. నేను అతడిని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఆ చనిపోతున్నది మీ సోదరుడా? ఈ దేశంలో పిట్టల్లా రాలిపోతున్న రైతుల గురించి మీరేం చెబుతారు? చనిపోతున్న సైనికుల పేర్లను వెల్లడించడం ద్వారా దేశంలో మరొక తప్పుడు సమస్యను సృషించవద్దు. (కన్నయ్య మాట్లాడుతున్న ప్రతి సందర్భం చివర్లో వందలాది జేఎన్‌యూ విద్యార్థులు హర్షద్వానాలతో స్వాగతించారు. షేమ్ షేమ్ అంటూ కేంద్ర ప్రభుత్వ నిర్వాకాన్ని గేలి చేశారు.)

ఈరోజు దేశంలో జరుగుతున్నది చాలా ప్రమాదకరమైనది.  ఒక పార్టీ గురించో, ఒక ఛానల్ గురించో నేను చెప్పడం లేదు.  నా కుటుంబం 3 వేల రూపాయలు సంపాదిస్తోందని నేనింతవరకు ఎవరికీ చెప్పి ఉండలేదు. నావంటి వారు మరే ఇతర కాలేజీలో అయినా పీహెచ్‌డీ చేసి చేస్తూ ఉంటారని మీరు ఊహించగలరా? న్యాయం కోసం నిలబడే ఎవరినైనా వారు ద్రోహి అంటున్నారు. ఎలాంటి స్వయం ప్రకటిత జాతీయ వాదం ఇది?

మన ప్రభుత్వానికి ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. దేశంలో 69 శాతం మంది మీకు వ్యతిరేకంగా ఓటేశారు. కేవలం 31 శాతం మంది మాత్రమే మీకు ఓటేశారు. వారిలో కొద్దిమంది మీ మాయలో చిక్కుకున్నారు. ఈరోజు వాళ్లు దేశమంతటా విధ్వసంకరమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు నిజమైన సమస్యలను అడగకూడదన్నదే వారి లక్ష్యం. 

ఆర్ఎస్ఎస్ అధికార వాణి ది ఆర్గనైజర్ జేఎన్‌యూపై ఒక ముఖచిత్ర కథనం ప్రచురించింది. జేఎన్‌యూని నాలుగు నెలలపాటు మూసివేయడానికి తగిన కారణాలను వారు చర్చలో హేతుపూర్వకంగా చెప్పగలిగితే, నేను వారి మాటలను సమ్మతిస్తాను. కానీ వారు అసమ్మతిని అణచివేయాలనుకుంటున్నారు. కానీ నేను వారికి ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా. అది మీవల్ల కాదు. 

మరోసారి స్వాతంత్ర్యం కోసం నినాదాలు ఇద్దాం. భారత్ నుంచి కాదు. భారత్‌లో స్వాతంత్ర్యం. ఆకలి నుంచి స్వాతంత్ర్యం, దారిద్ర్యం నుంచి స్వాతంత్ర్యం, కుల వ్యవస్థ నుంచి స్వాతంత్ర్యం. దేశాన్ని కొల్లగొడుతున్న వారినుంచి స్వాతంత్ర్యం. ఇదే మనం కోరుకుంటున్న స్వాతంత్రం...."

తీహార్ జైలు నుంచి విడుదలయ్యాక జేఎన్‌యూలో గురువారం సాయంత్రం విద్యార్ధి నాయకుడు కన్హయ్య కుమార్ చేసిన మహోధృత ప్రసంగం వీడియో లింక్ ఇక్కడ చూడండి. 

ఈ వీడియో ప్రసంగం కొత్త లింక్ ను తాజాగా ఇప్పుడే జత చేయడమైంది. ఇది ఇంగ్లీష్ స్ర్కోలింగ్ తో మరింత స్పష్టంగా ఉంది.

JNUSU president Kanhaiya Kumar Fiery Speech after getting out of jail 3/3/2016
https://www.youtube.com/watch?v=yS9AX8rvYhg


Tuesday, March 1, 2016

రెడీమేడ్ దేశభక్తి

దాదాపు పాతికేళ్ల క్రితం ఎస్వీయూలో ఎంఫిల్ పరిశోధన చేస్తున్నప్పుడు మేం హెచ్ బ్లాక్‌లో ఒకే గదిలో ఉండేవాళ్లం. ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసి ఎంఫిల్ చేస్తుండిన ఎల్ఎన్ (మేం అదే పేరుతో పిలిచేవాళ్లం.. పూర్తి పేరు జి. లక్ష్మీనరసయ్య. ఇంటిపేరు గుంటూరు అనుకుంటాను.) మా రూమ్మేట్.  ఆంగ్ల సాహిత్య విమర్శా ధోరణులను తెలుగు సాహిత్య, సామాజిక పరిస్థితులకు అన్వయించి అద్భుతంగా మాట్లాడేవాడు.

కళ కళ కోసమేనా ప్రజల కోసం కూడానా అనే చర్చ ఆనాడు కూడా విస్తృతంగా జరుగుతున్న రోజుల్లో ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన ఒక సెమినార్‌లో అభ్యుదయ సాహిత్యంలో, కవిత్వంలో సామాజిక అంశాలు ఎక్కడున్నాయి అంటూ  వరంగల్ కాకతీయ యూనివర్శిటీ నుంచి వచ్చిన ఒక తెలుగు సాంప్రదాయిక ప్రొఫెసర్  సవాలు చేస్తే, 1940ల చివరలో తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఒక పేద రైతు అప్పటికప్పుడు అల్లి పాడుకున్న పాటను సభలోనే అద్వితీయంగా పాడి యావత్ సభ ప్రశంసలందుకున్నాడు ఎల్ ఎన్. అభ్యుదయ కవిత్వం అంటే ఆకలి కేకలు కాదనీ,  జీవనవేదనను అనితర సాధ్యంగా వర్ణించే కవిత్వం, పాట దాని సొంతమని సమర్థించి సభ దృష్టిని ఆకర్షించాడు తను.

ఆ పాట.. "ఏనాటి కానాడు ఎండవానల్లోన చేసి చేసీ ప్రాణమిసిగిపోయేనూ.. కూడుంటే కూరుండదోరన్నా అసలు కుక్కలే నయమురా కూలన్నా" అంటూ పది చరణాలలో సాగుతుంది. పేదరికపు దుస్థితిని, నాటి తెలంగాణ రైతు-కూలీల బాధామయ గాథలను ఆ పాట  చెప్పినంత హృద్యంగా మరే పాటలోనూ ఆనాటికి మేం వినలేదు.

అలాగే శివసాగర్ రాసిన అద్వితీయ పాట "తూర్పుపవనం వీచెనోయ్ తూర్పుదిక్కెరుపెక్కెనోయ్. భరత భూమీ కనులు తెరిచీ వెలుగు రెక్కలు విసిరెనోయ్" ను తను ఆరున్నొక్క రాగంలో పాడుతుంటే మైమరిచిపోయి వినేవాళ్లం.

"చెల్లెలా నా చెల్లెలా.. అడవి తల్లీ కన్నులల్లో వెన్నెలా" అంటూ ఆయన పాడుతుంటే మైమర్చి వినేవాళ్లం.  (విశాఖ ఏజెన్సీ చింతపల్లి ఏరియాలో కేవలం 15 ఏళ్ల ప్రాయంలో నాటి పీపుల్స్ వార్ పార్టీ దళంలో చేరి చదువు నేర్చుకుంటుండగా పోలీసుల చేత చిక్కి దారుణ అత్యాచారం పాలబడి కన్నుమూసిన ఆదివాసీ చిన్నారి జ్యోతి అమరత్వంపై గుండె కరిగి నీరయ్యే బాణీలో రూపొందిన పాట అది.)

అలాగే "పరిటాలా రాములూ నీకు లాల్ సలాములూ వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం" అంటూ అనంతపురం విరసం నేత, రైతుకూలీ నాయకుడు పరిటాల శ్రీరాములుపై జననాట్యమండలి వారు రాసిన పాటను ఆరున్నొక్క రాగంతో పాడుతుంటే పరిసరాలు ఆవేశంతో ప్రతిధ్వనించిపోయేవి.

(అప్పట్లో ఎల్ ఎన్ గొంతుకు సరిసమాన స్థాయిలో పాడగలిగిన మరో మిత్రుడు కట్టా శేఖర్ రెడ్డి (ఇప్పుడు నమస్తే తెలంగాణ ఎడిటర్). శ్రీశ్రీ రాసిన "ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు" గీతాన్ని అన్ని సభల్లో, సమావేశాల్లో తను ఒకరకమైన విషాద స్వరంతో  దరువు వేస్తూ పాడుతుంటే వినడం గొప్ప అనుభూతి.)

భావకవిత్వంలో భాగమైన ఎంకి పాటలను కూడా అదే రీతిలో పాడేవాడు ఎల్ఎన్. పరిశోధన ముగిశాక వృత్తి జీవితంలో అడుగుపెడుతున్న దశలో ఆంధ్రజ్యోతి సాహిత్య అనుబంధంలో వారాల తరబడి తను సాహిత్య విమర్శా వ్యాసాలు రాయడం ఒక సంచలన ఘట్టం.

ఇవన్నీ ఒక ఎత్తయితే తను పుట్టి పెరిగిన పరిసరాల్లో దారిద్ర్యం తాండవిస్తున్న జన జీవితం గురించి కళ్ల నీళ్లు తిరిగేలా వర్ణించేవాడు. పొలాలలో వరిపంట కోతలు పూర్తయి రైతు ఇంట చేరాక, పొలంలో కింద పడిన కాసిన్ని వడ్ల గింజల కోసం మోటు పొరకతో వరిదంటుల నుంచి గింజలను తోసి చేటలో వేసి వాటిని ఇంటికి తెచ్చుకుని ఆ పూటకు వండిపెట్టే దళిత అమ్మల పేదరికాన్ని తను వర్ణిస్తుంటే... మా జీవితం అలాంటి స్థితిని అనుభవించనందుకు సంతోషించాలో.. దారిద్య భారత వర్ణనను చూసి బాధపడాలో అర్థమయ్యేది కాదు. మావైపు కూడా రైతుల పొలాల్లోంచి దళిత స్త్రీలు ఇలాగే గింజలు మోటుపొరకతో ఊడ్చి తీసుకుని పోయేవారు కానీ వారనుభవిస్తున్న దారిద్ర్య స్థాయి ఏమిటో మిత్రుడు చెబితే కానీ అర్థం కాలేదు.

నా పరిశోధనా జీవిత కాలంలో తనదైన  స్ఫూర్తిని కలిగించిన ఆ మిత్రుడిని చూసి 28 ఏళ్లయింది. అప్పుడప్పుడూ పత్రికలలో తన రచనలు చూసి ఆనందించండం తప్ప తనను ఇంతవరకూ కలిసిందీ లేదు.  అయితే తను కూడా భావజాలం విషయంలో మారలేదని, విప్లవ సాహిత్యం నుంచి బహుజన దళితోద్యమాల వైపు దిశ మార్చుకున్నా.. ఎవరి గురించి రాయాలో, దేనిగురించి రాయాలో తేల్చుకున్న అలనాటి నిర్ణయం నుంచి తానేమీ మారలేదని.. జేఎన్‌యూ ఘటనలపై స్పందనగా "రెడీమేడ్ దేశభక్తి" గురించి తను ఫిబ్రవరి 29న రాసిన కవిత పట్టి చూపుతోంది.

ప్రస్తుతం "దేశభక్తి"కి, "దేశద్రోహం"కి మధ్య దేశంలో జరుగుతున్న భావజాల యుద్ధ నేపథ్యంలో మిత్రుడు రాసిన 'రెడీమేడ్ దేశభక్తి'  కవిత గురించి మళ్లీ వ్యాఖ్యానాలు ఏవీ అవసరం లేదు. మీరు ఈ కవితను ఆస్వాదించినా,  ఆగ్రహంతో కంపించిపోయినా ఆ క్రెడిట్ మొత్తం నా అలనాటి మిత్రుడు జి. లక్ష్మీనరసయ్యదే.

ఇక చదవండి.

రెడీమేడ్ దేశభక్తి...
ఇక్కడ
టైంటేబుల్ ప్రకారమే చెమటపట్టాలి

గుండె కొట్టుకోవడానికీ 
ఎండ పండటానికీ
అనుమతుల్ని సులభవాయిదాల్లో పొందవచ్చు

కళ్లు నూరటానికీ, పళ్లు కొరకటానికీ
పచ్చ జండాల సౌకర్యం కలదు

దేశాన్ని ప్రేమించడానికి
శిక్షణ తప్పనిసరని గుర్తించగలరు
సిద్ధం చేసిన దేశభక్తిని 
ఉచిత బఫేలో వడ్డించుకోగలరు

స్వప్నాలకు సిలబస్ సప్లై చేయడం
శ్వాసలకు సంప్రదింపులు జరపటం
మా ఎవర్ కాషాయ స్పెషాలిటీ

జాతీయ జెండాని గుండెల్లో మోయకండి
బయటకి లాగి ఉతికి ఇస్త్రీ చేసి మరీ ఎగరేయండి
బోలో స్వతంత్ర భారత్‌కీ జై

ఎందుకయినా మంచిది మీ ఆహారం మీద
ఏలినవారి ముద్ర వేయించుకోండి
మీ విశ్వాసాల మీద
సంస్కృతంలో ఓం అని పచ్చ పొడిపించుకోండి

ఇక మీ ఆకళ్లూ, అవమానాలూ అంతరాత్మల కేకలూ
హిందూ మహాసముద్రంలో కొట్టుకుపోవాల్సిందే

జి. లక్ష్మీనరసయ్య

(నమస్తే తెలంగాణ సోమవారం (29-02-2016) సాహిత్య పేజీ చెలిమెలో అచ్చయిన కవిత ఇది. రగులుతున్న సమస్యపై ఒక దృక్కోణాన్ని ఇంత తాత్విక భూమికతో వివరించిన కవితను ప్రచురించినందుకు నమస్తే తెలంగాణ పత్రిక నిర్వాహకులకు అభినందనలు.)