Wednesday, February 28, 2018

బాత్ టబ్ మరణాలు మనకు లేవు కానీ..

నా చిన్ని జర్నలిస్టు జీవితంలో తొలిసారి నాపై, నా వృత్తిపై సందేహం, అంతకు మించి అసహ్యం కలిగిన క్షణాలివి. మా బాల్యంలో, మా యవ్వనంలో నటన అనే అపురూప కళ ద్వారా మమ్మల్ని చల్లగా పలకరించిన శ్రీదేవితో.. ఇంద్రజగా ఒక లోకోత్తర సౌందర్య పరిమళాన్ని తన కళ్లతో, సాధుత్వంతో ప్రదర్శించిన శ్రీదేవి జీవితంతో, ఆమె కుటుంబంతో గత మూడురోజులుగా ఆడుకున్న మా మీడియాను ఏం చేసినా పాపం పోదన్నదే నా మనోభావం.

ముఖ్యంగా సోషల్ మీడియా 'ముండాకొడుకులు' టీవీ మీడియా రాక్షసోన్మాదులు...  అనూహ్యంగా, అకాలంగా తన బిడ్డలకు, భర్తకు దూరమైన వ్యక్తి జీవితంపై చిలవలు, పలవలు రేపుతూ, క్షణక్షణానికి పుకార్లు రేపుతూ, కథనాలు అల్లుతూ చేసిన బీభత్స ప్రదర్శనలను అంత సులువుగా మర్చిపోవడం కష్టం.

ఆమె ఇక లేరని తెలిసిన క్షణం నుంచి ఆమెను తాగుబోతుగా, డగ్స్ బానిసగా, కాస్మొటిక్ సర్జరీల వ్యామోహంతో చావు కొనితెచ్చుకున్న భ్రష్ట సంజాతురాలిగా కనీ వినీ ఎరుగని పుకార్లను రేపిన నెంబర్ వన్ శత్రువు సోషల్ మీడియా. ఈ క్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌నీ వదలలేదు. ఆమె ప్రాణప్రదంగా ప్రేమించిన కన్నకూతురు జాన్వీని వదల్లేదు.

భర్తే ఏదో చేశాడట. జాన్వీతో గొడవలతో ఆమె సగం అలసిపోయిందట. ఆస్తి గొడవలతో వేసారిపోయిందట. ఇలా అనుమానాలు లేని చోట అనుమానాలు రేపుతూ రావిశాస్త్రి ఓ సందర్భంలో అన్నట్లు... శ్రీదేవినీ, ఆమె కుటుంబాన్ని మూడు రోజుల్లో 300 సార్లయినా చంపేసిన పాపం మన మీడియాదే.

అందుకే మంగళవారం రాత్రి మా పత్రికాఫీసులో పనిచేసుకుంటున్నప్పుడు మాటల మధ్యలో మా కొల్లీగ్స్ చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావించాలనిపిస్తోంది. "స్వర్గమనేది నిజంగా ఉంటే, శ్రీదేవి అక్కడికే చేరి ఉంటే, భూమండలంలో భారతీయ మీడియా అనే ఒక వికృత వ్యవస్థ నాపై ఇంత అభాండాలేస్తోందా" అని భోరున విలపిస్తూ ఉంటుందట.

యాభై ఏళ్లు నటన తప్ప మరేమీ మనకివ్వని ఆ అమాయకత్వపు ముగ్ధని, తన జీవితంలో అత్యంత సన్నిహితంగా భాగమై ఉన్నవారిని.. ఇంతగా చెండాడాలా?  చివరకు దుబాయ్ ప్రభుత్వం, దర్యాప్తు శాఖలు కూడా భారత్ మీడియాపై అసహ్యించుకునేంత తారాస్థాయిలో మన మీడియో ప్రచారం, మన హిట్ల యావ చెలరేగిపోయింది.

చివరకు ఇంత జరిగాక, శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరాక కూడా ఆమె మృతి వెనుక మిస్టరీ గురించి మంగళవారం అర్ధరాత్రి కూడా స్క్రోలింగ్‌లు పడుతుంటే, రామ్ గోపాల్ వర్మ స్థాయిలో ఏడ్వాలనిపిస్తోంది.

బాత్‌ టబ్‌లో పొరపాటున పడి మృతి చెంది ఉంటారన్న అంచనాతో కేసు మూసివేసిన దుబాయ్ పోలీసు శాఖ మన మీడియాను పాత చెప్పుతో కొట్టినంత పనిచేసింది.

యూట్యూబ్ తెరిస్తే మలినం. ప్రపంచంమీదే అసహ్యం వేసేంత కారుకూతలు. ఫోటోలు చూపుతూ కంపు కథనాలల్లే రోత బతుకులు...

అమెరికా, యూరప్ ఖండాలను అలా పక్కన బెట్టండి. మన ఖండం లోని జపాన్‌లోనే బాత్ టబ్‌లలో జారిపడి సంవత్సరానికి దాదాపు 20 వేలమంది చనిపోతున్నారని వార్తలు వస్తున్నప్పుడు శ్రీదేవి మరణాన్ని ఒక అత్యంత దురదృష్టకరమైన ప్రమాద ఘటనగా తప్ప మరే రకంగా అయినా ఊహించగలమా?

నిద్రలేచిన వెంటనే ముఖం చన్నీళ్లతో కడుక్కోకుండా బాత్‌రూమ్‌కి వెళితే, ఆ నిద్రమత్తులో తప్పటడుగులు వేసి కూలబడటం, జారటం, మనం జీవితంలో ఎన్నిసార్లు అనుభవించలేదు?

తడిసిన నేలపై కాస్త కాలుజారితే నడుమో, కాళ్లో అమాంతంగా విరిగిపోయి, రోజుల తరబడి మంచానపడే బాధను మన కళ్లముందు ఎందరి జీవితాల్లో మనం చూడలేదు?

ఆమె నడుస్తూ తూలి అలాగే టబ్ లోకి పడిపోయిందో (టీవీ9కి అంతర్జాతీయ అవార్డు ఇచ్చేయాలి)  లేక టబ్‌లో అడుగుపెట్టిన తర్వాత కాలు జారి గభాలున నీళ్లలో మునిగి ఆ భయంతో ఊపిరాడక జీవితం విషాదం ముగించుకుందో ఎవరికి తెలుసు?

ఆకస్మికంగా కింద పడితే, ఏదైనా అనూహ్యమైన వార్తను, దృశ్యాన్ని వింటే, చూస్తే అమాంతం స్పృహ కోల్పోవడం, మరణించడం కూడా  ప్రపంచంలో కొత్త విషయం కాదు కదా.

విదేశాల్లో బాత్ టబ్ మరణాలు మామూలు స్థాయిలో లేవని వేల సంఖ్యలో అవి నమోదవుతున్నాయని అర్థమవుతున్నప్పుడు శ్రీదేవి మరణాన్ని నమ్మశక్యం కానీ విషాద ఘటనగా తప్ప మరొకలా ఎలా ఊహించగలం?

జీవితంలో వైన్ తప్ప ఆమె మరేదీ ముట్టలేదని సన్నిహితులు చెబుతున్నప్పుడు.. అందుకే ఆమె నీళ్లలో పడి చనిపోయిందని అభాండాలు వేస్తే ఏం న్యాయం.. ఏం రాతలివి...

ప్రాణం లేని ఆ కట్టెను సాగనంపాల్సింది ఇలాగేనా? ఒక సామాన్య కుటుంబంలో పుట్టి తన కష్టంతో, సానపట్టిన ప్రతిభతో అత్యున్నత శిఖర స్థాయిని అందుకున్న ఆ పసిపిల్లను పంపించాల్సింది ఇలాగేనా?

                          ************                      *************

విదేశాల్లో బాత్ టబ్  మరణాలపై ముఖ్య కథనం కింది లింకులో చూడండి.

బాత్‌టబ్‌లో పడితే చనిపోతారా

అలాగే...లోకాన్ని నటనతో మైమరపింప జేసిన శ్రీదేవి వ్యక్తిగత జీవితంలోని ఎత్తుపల్లాలపై వర్మ నిజాయితీతో కూడిన అభిప్రాయం కోసం ఇక్కడ చూడండి.

మోసాలు... బాధలు... కన్నీళ్లు! 

శ్రీదేవి జీవితంపై రామ్‌గోపాల్‌ వర్మ కోణం

Sunday, February 18, 2018

'యుద్ధకాలంలో స్వప్నాలు' పుస్తకావిష్కరణ నేడు హైదరాబాద్‌లో


నేను డెవిల్ ఆన్ ది క్రాస్ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్‌ పేపర్ మీద రాసాను. నా మరొక పుస్తకం యుద్ధకాలంలో స్వప్నాలును ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా వుండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి!  - గుగీవా థియోంగీ

సీగుల్ పబ్లిషర్స్ ఆహ్వానంపై ఇండియాకు వస్తున్న సుప్రసిద్ధ కెన్యా రచయిత గూగీవాథియాంగో మలుపుప్రచురణల ఆహ్వానానికి స్పందిస్తూ ఇండియాకు రావాలని ఉత్సుకతతో ఉన్నాను. ఇంక హైదరాబాదుకు రావడమంటే నాకెంతో ఇష్టం. ప్రత్యేకించి ప్రొ.జి.ఎన్.సాయిబాబా అనువదించిన నా బాల్యజ్ఞాపకాలు  యుద్ధకాలంలో స్వప్నాలు’ (Dreams in a Time of War: A Childhood Memoir) పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడమంటే అంతకన్నా ఏంకావాలి. ప్రొఫెసర్ సాయిబాబాను కలిసే అవకాశం ఉంటే ఇంకెంతో బాగుండేదిఅని రాసారు.

గూగీ నవలల్లో ఆఫ్రికా ప్రజలు ద్వేషించే యూరపు వలసవాదుల తర్వాత మనకు కనిపించేది గుజరాతీ వ్యాపారులే. కాని ఆయనకు భారతప్రజల పట్ల వాళ్ల పోరాటాల పట్ల ఎంతో ఆసక్తి ఉంది.

గూగీ మొదటిసారి 1996 ఫిబ్రవరిలో ఎఐపిఆర్‌ఎఫ్ (ఆల్‌ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్) ఆహ్వానంపై ఢిల్లీలో జరిగిన జాతుల సమస్యపై అంతర్జాతీయ సదస్సుకు వచ్చాడు. అక్కడ ఆయన ప్రపంచీకరణ జాతుల సమస్య గురించి చేసిన ప్రసంగానికి సాయిబాబా అధ్యక్షత వహించాడు.

అక్కడినుంచి గూగీ హైదరాబాదు, కాకతీయ యునివర్సిటీ, 1990 వరకు కరీంనగర్ విప్లవోద్యమ అమరుల స్మృతిలో నిర్మించిన హుస్నాబాద్ స్థూపం చూసి తాను అప్పటికే ప్రవాస జీవితం గడుపుతున్న అమెరికాకు వెళ్లిపోయాడు. తన ఇండియా పర్యటన ప్రభావంతోనే విజార్డ్ క్రౌఅనే బృహత్తర నవల రాసాడు. అప్పటినుంచీ ఆయనకు ఇండియా, తెలంగాణ  ఈ దేశంలో, ఈ ప్రాంతంలోని విప్లవోద్యమం, ఇక్కడి జీవితానికి, పోరాటానికి తాను ఎంచుకున్న ఒక సంభాషణ వంటి సాయిబాబాతో గాఢానుబంధం ఏర్పడింది.

గూగీ దంపతులకు హుస్నాబాద్ స్థూపాన్ని చూసిన అనుభవం ఒక అపూర్వ అనుభూతిగా మిగిలింది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీ ఎఐఎల్‌ఆర్‌సి (ఆల్ ఇండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్) తరఫున ఎం.టి.ఖాన్ ఏర్పాటుచేసిన రచయితల సదస్సులో ఆ ఇద్దరూ ఆ అనుభవాన్ని ఒక ఈవెంట్ (సంఘటన)గా చెప్పుకున్నారు.

ఈ అనుబంధానికి ఒక కారణముంది. 1946-51 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వలెనే కెన్యాలోనూ వలసవాద విముక్తి పోరాటంలో భాగంగా మౌమౌ ఉద్యమం 1952 నుంచి 62 వరకు సాయుధంగా సాగింది. మరొకవైపు కెన్యాట్టా నాయకత్వంలో జాతివిముక్తి పోరాటం జరిగి 1963లో కెన్యా బ్రిటిష్ వలస నుంచి విముక్తమై జోమో కెన్యాట్టా కెన్యా అధ్యక్షుడయ్యాడు. కాని తన బాల్యంలో తన అన్న స్వయంగా పాల్గొన్న విముక్తిపోరాట లక్ష్యాలయిన భూమి, భుక్తి, సామ్రాజ్యవాద దళారీ దోపిడీ నుంచి ప్రజల స్వేచ్ఛ ఎండమావులే అయ్యాయి. ఈ బాల్య జ్ఞాపకాలే  ముఖ్యంగా తాను 1938లో పుట్టి యుద్ధకాలంలో కన్న కలలే తన ఆత్మకథలోని మొదటిభాగం యుద్ధకాలంలో స్వప్నాలు’.

తెలంగాణ ప్రజల అనుభవం కూడ అదే అయినప్పటికీ కెన్యా ప్రజలకు గూగీకి మౌమౌ పోరాటం ఒక జ్ఞాపకం, ఒక తొణికిన స్వప్నంగా మిగిలిపోతే  తెలంగాణ ప్రజలకు మాత్రం అది గతమే కాకుండా, వర్తమానంగానూ భవిష్యత్‌తో పోరాట సంభాషణగానూ కొనసాగుతున్నది.

గూగీని ఢిల్లీ జాతీయ సదస్సుకు పిలిచిన నవీన్‌బాబు, ఆ తర్వాత కాలంలో విప్లవోద్యమంలో ఎన్‌కౌంటర్‌లో అమరుడయినాడని రాసినపుడైనా, పీపుల్స్‌వార్ కేంద్రకమిటీ సభ్యుల ఎన్‌కౌంటర్ తర్వాత 1999 డిసెంబర్ ఆఖరులో శ్యాం అంతిమయాత్ర ముగిసాక రాజ్యం హుస్నాబాదు స్థూపాన్ని కూల్చేసిందని రాసినా ఆయన ఈ చీకటిమబ్బు అంచున ఎప్పుడూ మీ వర్తమానంలో ఒక మెరుపుతీగ వంటి ఆకాంక్ష, ఆశ మిగిలే ఉంటాయి అని రాసేవాడు. మీకు పోరాటం ఉంటుంది, పోరాటయోధులు అమరులైన జ్ఞాపక చిహ్నాలుంటాయి, అవి తుడిచేసినా వాళ్ల ఆకాంక్షలను జెండాలుగా పూని నడిచే పోరాటం ఉంటుంది అని రాసేవాడు.


మనసును వలసవాదం నుంచి విముక్తం చేయాలని, భాషను ఒక పదునైన అస్త్రంగా, సాహిత్యాన్ని అత్యంత ఆధునిక, సాంకేతిక నైపుణ్యంతో మెత్తటి మట్టిలాగ మార్చగలగాలంటే భాషా సాహిత్యాలు కూడ మానవశ్రమ నుంచి ఉత్పత్తి అయినవేననే ఎరుక కలగాలని ఆయన ఢిల్లీ సదస్సులోనూ, నిజాం కాలెజి సభలోను, చలసాని ప్రసాద్ అధ్యక్షతన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విరసం సభలోనూ  మాట్లాడాడు.

తెలుగు భాషలో వస్తున్న ప్రజా విప్లవ సాహిత్యం తాను నేరుగా గికియు భాషలోకి తీసుకపోగలిగితే ఎంత బాగుండును అని ఆశించాడు. ఈ అవగాహనే ఒక సాంస్కృతిక పోరాటయోధునిగా గూగీని ఒక ప్రజాస్వామిక పోరాయోధుడైన సాయిబాబాతో నిరంతర అనుబంధంలో కొనసాగించింది. గూగీ తన నవలలు, నాటకాలు, ప్రజారంగస్థల నిర్మాణం వలన కెన్యాలోని నియంతలకు కన్నెర్ర అయి 1978-79 కెన్యా ఆత్యయికస్థితి కాలంలో జైలుపాలయినట్లుగానే సాయిబాబా తన గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాటం వలన జైలుపాలయ్యాడు. యావజ్జీవ కారాగార శిక్ష విధింపుకు ముందు బెయిలుపై విడుదల కావడానికన్న ముందే నాగపూర్ హై సెక్యూరిటీ జైల్లోని అండా సెల్‌లోనే గూగీ ఆత్మకథను తెలుగు చేసాడు.

‘‘అది అక్షరాలా ఒక యుద్ధకాలంలో పుట్టిన శిశువు స్వప్నాలకు ఒక యుద్ధఖైదీ చేసిన అనుసృజన. ప్రొఫెసర్ సాయిబాబా దీన్ని అనువదించడం నాకు చాల సంతోషం  1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో కలిసినపుడు కష్టజీవి సాయిబాబాతో నా కలయిక జ్ఞాపకాలను నేనెన్నటికీ మరచిపోలేను. హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో అనుకోకుండా దొరికిన నా పుస్తకం డెవిల్ ఆన్ ది క్రాస్ తన జీవితం మీద ఎంత ప్రభావం వేసిందో ఆయన చెప్పడం నాకింకా గుర్తుంది. నేను ఆ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్‌ పేపర్ మీద రాసాను. నా సాంస్కృతిక కార్యాచరణ వల్ల ముఖ్యంగా కెన్యాలోని కామిరితు గ్రామంలో రైతులు, కార్మికులు, తమ భాషలో తమ పోరాటాల గురించి చెప్పే తమ సొంత నాటకరంగాన్ని సృష్టించాలని చేసిన ప్రయత్నానికి సహకరించినందువల్ల నన్ను జైలులో పెట్టారు. నా పుస్తకాల్లో మరొకదాన్ని (యుద్ధకాలంలో స్వప్నాలు) అదే సాయిబాబా మహారాష్ట్రలోని నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా వుండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి! దుర్భరమైన పరిస్థితులో అనువాదం చేయడం! ఆయన తన జీవిత, సాంస్కృతిక కార్యాచరణ కోసం జైలుజీవితం గడుపుతున్నాడంటే నాకు ఆయనతో ఇప్పుడు, మరొకసారి, ఒక ప్రత్యేకమైన బంధం ఉందనిపిస్తుంది.’’

ఆ బంధం వల్లనే, ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా అతని సహచర ఖైదీల విడుదల కోసం, రాజకీయ ఖైదీల విడుదల కోసం, జైళ్లు, నిర్బంధాలు లేని, అణచివేత దోపిడీ పీడనా లేని వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘీభావ, ప్రజాస్వామిక పోరాటంలో తన వంతు కర్తవ్యంగా గూగీ వా థియాంగో ఈ ఫిబ్రవరి 18న జిఎన్ సాయిబాబా అనువదించిన తన పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడానికి హైదరాబాదుకు వస్తున్నాడు. కాని మన మధ్యన మన భాషలో గూగీ యుద్ధకాలపు బాల్యజ్ఞాపకాలు వివరించిన సాయిబాబా ఉండకపోవచ్చు. తానాశించినట్లుగా నాగపూర్‌కు వెళ్లి గూగీ సాయిబాబాను కలుసుకోలేక పోవచ్చు. కాని ఇప్పటికి ఇరువురి భావజాలంతో పెనవేసుకొని సుదృఢమవుతున్న మన స్వేచ్ఛాకాంక్షల్ని పంచుకోవడానికి ఒక సాహిత్య, సాంస్కృతిక పోరాట సాయంత్రం కలుసుకుందాం.

ముఖ్యంగా ఈ బాధ్యత మనపై ఎందుకుందో తాను జైలులో బందీ అయిన రోజుల్లోనే 1978లో, కార్ల్‌మార్క్స్ మాటల్లో చెప్పాడు. అవి కార్ల్‌మార్క్స్ చెప్పినవి కూడ కాదు. ఆయనకు ఒక కార్మిక ప్రతినిధి రాసినవి. కార్ల్‌మార్క్స్ 25 ఆగస్టు 1852 న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు చేసిన రచనలో ఉల్లేఖించాడు.

‘‘నేను నీ హక్కుల్ని విస్తృతపరచడానికి ప్రయత్నించాను. కాబట్టే నా హక్కుల్ని హరించారు. మీ అందరికోసం స్వేచ్ఛామందిరాన్ని నిర్మించాలని ప్రయత్నించాను. కాబట్టే నన్నొక హంతకుని జైల్లోని సెల్‌లోకి తోసేసారు.... నేను సత్యానికి స్వరాన్ని అందించడానికి ప్రయత్నించాను. కాబట్టి నన్ను నిశ్శబ్దంలోకి తోసివేశారు.....జైల్లో ఒంటరి నిర్బంధంలో నిశ్శబ్ద వ్యవస్థలో ఉంచారు. నువ్వు ఇది ప్రజా సంబంధమైన సమస్య కాదనవచ్చు. కాని ఇది అయితీరుతుంది. ఎందుకంటే ఖైదీ భార్య గురించి పట్టించుకోని మనిషి కార్మికుని భార్య గురించి కూడ పట్టించుకోడు. బంధితుని పిల్లల గురించి వ్యగ్రత చూపనివాడు శ్రామిక సేవకుని పిల్లల గురించి కూడ వ్యగ్రత చూపడు. అందువల్ల ఇది ప్రజాసమస్య.

(గూగీ వాథియాంగో జైలు డైరీ బందీ  జైలు నోట్స్ నుంచి)

(ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా అనువదించిన గూగీ వా థియాంగో యుద్ధకాలంలో స్వప్నాలుపుస్తకావిష్కరణ ఫిబ్రవరి 18 ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరగనుంది. అందరూ ఆహ్వానితులే)
వరవరరావు
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు

గమనిక: ఇది 17-02-2018 సాక్షి సంపాదక పేజీలో ప్రచురితమైన వరవరరావు గారి రచనకు పూర్తి పాఠం. ఈ బ్లాగులో ప్రచురణకు అనుమతించినందుకు ఆయనకు ధన్యవాదాలు.

వలసవాద విముక్తి గీతం గూగీ