Pages

Monday, February 21, 2022

సినిమా కళను ఉద్దీప్తం చేసిన యుద్ధ వ్యతిరేక చిత్రం.. 'కమ్ అండ్ సీ'



రెండు ప్రపంచ యుద్ధాల గురించి, వియత్నాంలో అమెరికా సాగించిన యుద్ధం గురించి తదితర చారిత్రక యుద్ధాల గురించి ఎన్నో సినిమాలు మనం చూసి ఉండవచ్చు. ది బ్యాటిల్‌షిప్ పొటెంకిన్‌ని మర్చిపోలేం. ఒమర్ ముక్తర్‌ని మర్చిపోలేం. సైనికులారా యుద్ధాన్ని మానండి అంటూ చార్లీ చాప్లిన్, ఆర్యజాతి సముద్ధరణ కర్త హిట్లర్ బతికుండగానే అంటే 1942లోనే పొలికేక వేసి మరీ తీసిన ది గ్రేట్ డిక్టేటర్‌ని మర్చిపోలేం. వార్ అండ్ పీస్‌‌ని మర్చిపోలేం. స్పార్టకస్ మూవీని మర్చిపోలేం. ది ప్యాసేజ్ సినిమాను మర్చిపోలేం. ది డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్, ది యాక్ట్ ఆఫ్ కిల్లింగ్, ది కాజువాలిటీస్ ఆఫ్ వార్, లిబరేషన్, ది బంకర్, డౌన్‌ఫాల్, ది బ్రెస్ట్ ఫోర్ట్రెస్, హోలోకాస్ట్,  ష్లిండర్స్ లిస్ట్‌ వంటి గొప్ప సినిమాలను అసలు మర్చిపోలేం. యుద్ధాలకు, వాటి విషాద పర్యవసానాలకు పట్టంగట్టిన మాస్టర్ పీస్ సినిమాలు ఇవన్నీ. 

కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సోవియట్ యూనియన్ చిత్ర దర్శకుడు ఎలెమ్ క్లిమోవ్‌ 1985లో తీసిన భయానక యుద్ధ వ్యతిరేక చిత్రం కమ్ అండ్ సీ (Come and See)ని మనం మర్చిపోవాలన్నా మర్చిపోలేం. ఎందుకంటే యుద్ధం రేపే పాశవిక హింసను, సోవియట్ యూనియన్‌ని ముట్టడించిన నాజీల దురాగతాలను కేంద్రబిందువుగా తీసుకుని, గత 80 సంవత్సరాల ప్రపంచ సినిమా చరిత్రలో వచ్చిన కళాఖండాల్లో కెల్లా మాస్టర్ పీస్ లాంటి చిత్రం కమ్ అండ్ సీ. 

సోవియట్ చిత్ర దర్శకుడు ఎలెమ్ క్లిమోవ్ 1985లో తీసిన లెజెండరీ యుద్ధ వ్యతిరేక చిత్రం కమ్ అండ్ సీ ని చూసిన వారెవరూ క్లైమాక్స్‌లో కనిపించే ఆ భయానక దృశ్యాలను జీవితంలో మర్చిపోలేరు. క్లైమాక్స్ అని మాత్రమే కాదు.. ఈ సినిమా ఆద్యంతం చిరస్మరణీయమైనది. ఒక భయంకరమైన దుస్వప్నం వాస్తవరూపం దాలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. యుద్ధం అనే ఆ పీడకల ఇప్పటికీ ప్రపంచంలో సహస్ర రూపాలతో కొనసాగుతూనే ఉంది కాబట్టి మన చరిత్రలో యుద్ధం అనేది వర్తమానంలో కూడా పునరావిర్భవిస్తూనే ఉంది. 

కమ్ అండ్ సీ అనే పేరున్న ఈ సినిమాను  అచ్చంగా తెలుగు చేయాలంటే సింపుల్‌గా 'రండి.. చూడండి'' అని చెప్పవచ్చు. సినిమా పేరుకు తగ్గట్లే దీంట్లోని ఒక్క దృశ్యాన్ని చూస్తే చాలు.. ఈ పేరు దీనికి ఎందుకు తగిందో అర్థమైపోతుంది. ఒక గ్రామంలో సజీవంగా ఉన్న వందలాది మనుషుల్ని -స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు- నాజీ సైనికులు ఒక పామ్ హౌస్‌లో కుక్కి తలుపులు మూసి ఆ ఇంటిని పెట్రోల్‌తో తగులబెట్టి, బుల్లెట్లు దించుతుంటే మంటల్లో తగులబడిపోతున్న ఆ నిస్సహాయులు పెడుతున్న హాహాకారాలను, ఫామ్ హౌస్ మొత్తాన్ని చుట్టుముడుతున్న ఆ అగ్నిజ్వాలల్ని ఈ సినిమా చివర్లో చూపిన ఆ దృశ్యాన్ని చూస్తే చాలు... సినిమా మొత్తాన్ని దర్శకుడు ఎలా ప్రాణం పెట్టి తీశాడో మనకు అర్థమవుతుంది. 

1985లో రష్యన్ భాషలో వచ్చిన ఈ భయానక యుద్ధ చిత్రాన్ని సోవియెట్ యూనియన్‌లో చూసిన కోట్లాదిమంది ప్రజల గుండెలవిసిపోయాయి. నాజీల దురాగతాలకు బలైపోగా ప్రాణాలతో మిగిలి అప్పటికీ బతికి ఉన్న యుద్ధ బాధితులు ఈ సినిమా చూసి భోరుమంటూ విలపించారు. ఎందుకంటే ఇది వారికి సినిమా మాత్రమే కాదు. 1939లో మొదలైన రెండో ప్రపంచ యుద్ధం సోవియట్ యూనియన్‌ని సమీపించాక నాజీల ముట్టడిలో చిక్కుకున్న సోవియట్ భూమిలో కుటుంబాలను కోల్పోయిన, నాజీలు మండించిన అగ్నిజ్వాలల్లో గ్రామాలకు గ్రామాలే తగులబడిపోయిన అలనాటి సన్నివేశాలను ఈ సినిమా చూపిస్తుంటే.. ఆనాటికి బతికి ఉన్న బాధిత కుటుంబాలకు ఆ పాత జీవితం మళ్లీ కళ్లముందు కనిపించినట్లయింది. సినిమా కళ ఎంత మహత్తరమైన శక్తిని కలిగి ఉందో తెలుసుకోవడానికి కరుణామయమైన ఈ ఒక్క సినిమా చూస్తే చాలు. 

1985లో రష్యన్ భాషలో వచ్చిన ఈ సినిమా 2020 నాటికి గానీ అంటే 35 సంవత్సరాల గానీ అమెరికాలో, యూరప్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో విడుదల కాలేకపోయింది. న్యూయార్క్ తదితర అమెరికన్ నగరాల్లో కొత్తప్రింట్‌తో విడుదలైన కమ్ అండ్ సీ సినిమా చూసిన అమెరికన్ చిత్ర విమర్శకులు ముక్తకంఠంలో పలికిన మాట క్లాసిక్. పరమ ప్రామాణికమైన చిత్రం. సినిమా కళను ఉద్దీప్తం చేసే చిరస్మరణీయమైన ప్రామాణిక కొలమానం కమ్ అండ్ సీ అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే దావానలాన్ని పోలిన ఆ నాజీల దహనకాండను చూస్తున్న అమెరికన్ చిత్ర విమర్శకుల గుండెలు అవిసిపోవడం కాదు.. ఒక్కసారిగా ఆగిపోయాయంటే అతిశయోక్తి కాదు.. ఈ సినిమా కలిగించిన మహత్తర అనుభూతికి ఇంతకుమించిన నిదర్శనం మరొకటి అవసరం లేదు.

1978లో వచ్చిన 'ఐ యామ్ ఫ్రమ్ ది ఫైరీ విలేజ్' (I Am from the Fiery Village) పుస్తకానికి క్లిమోవ్, అలెస్ అదమోవిచ్‌లు ఇచ్చిన సినిమా రూపమే కమ్ అండ్ సీ. తరుణ వయస్సులో ఉన్న కుర్రాడి జీవితంలో నాజీలు ప్రేరేపించిన యుద్ధం గురించిన భయానక వర్ణనతో ఈ సినిమా నడుస్తుంది. ఆ అబ్బాయి పేరు ఫ్లియోరా (అలెక్సీ క్రవచెంకో). సినిమా ప్రారంభంలోనే ఇతడు తన గ్రామంలో నాజీలకు వ్యతిరేకంగా సోవియట్ పక్షం వహించిన పార్టిజన్స్‌లో చేరిపోవాలనే ఉద్దేశంతో ఇసుకలో కూరుకుపోయిన నాజీల తుపాకిని తవ్వి తీస్తుంటాడు. (1943లో నాజీలు ఆక్రమించిన బెలారస్ -నాడు బైలో రష్యా- ప్రాంతంలో ఈ సినిమాను తీశారు.) ఆ అబ్బాయి ఫ్లియోరా ఇసుకలో కూరుకుపోయి ఉన్న తుపాకిని తవ్వి తీస్తుంటే ఊరి మనిషి ఒకరు హెచ్చరిస్తాడు. ఊరకే తుపాకీని తవ్వి తీయడం ప్రమాదకరమైన ఆలోచన అంటూ అతడి తల్లి కూడా ఆ పని చేయవద్దని బతిమాలుతుంది. కానీ ఆ గ్రామంలో అప్పటికే తిష్ట వేసి ఉన్న నాజీలకు ఆ అబ్బాయి చర్య అనుమానాలు రేకెత్తిస్తుంది. త్వరలోనే అతడు సోవియట్ అనుకూల బలగాల్లో చేరిపోవలసి వస్తుంది. 

తన విధిని తానే లిఖించుకున్న దశనుంచి త్వరలోనే అతడు ఊహించశక్యం కాని దుష్టశక్తితో ఎన్‌కౌంటర్‌లోకి చిక్కుకుపోతాడు. ఈ క్రమంలో ఆ అబ్బాయికి పరిచయమున్న వారంతా చనిపోతారు. నాజీల దురాగతాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆ బాలుడి అమాయకత్వం చెల్లాచెదరవుతుంది. తర్వాత బుద్ధి మాంద్యం అతడిని ఆవహిస్తుంది. చివరలో నాజీలు అతడిని చంపకుండా వదిలేయడానికి కూడా తన బుద్ధి మాంద్యమే కారణం. అలెక్సీ క్రవచెంకో అనే రైతు బాలుడి ముఖంలో యుద్ధ బీభత్సాన్ని, ఉన్మాదాన్ని, మృత్యు విహ్వలతను సినిమా మొత్తంగా చూపించడంలో దర్శకుడు క్లిమోవ్ ఎంత ప్రావీణ్యత చూపాడంటే. రోజుల తరబడి ఆ అబ్బాయి ముఖం మనల్ని వెంటాడుతుంది. అసాధారణ పరిస్థితులకు మనుషులు ఎలా బలవుతారు, అమాయకులు వధ, నిర్మూలన యుద్ధకాలంలో ఎంత సాధారణ విషయంగా మారిపోతుందో ఈ సినిమా చూపించినంతగా మరే సినిమా చూపించి ఉండదంటే అతిశయోక్తి కాదు. పాశవికత్వానికి మూలం, దాని ప్రభావం గురించిన అద్భుత అధ్యయనం సమాహారమే ఈ మాస్టర్ పీస్ నిర్మాణానికి దారితీసింది.

20వ శతాబ్దిలో, సినిమా కళ పట్ల గొప్ప అనురక్తితో, సాహసంతో, అద్భుతమైన నైపుణ్యంతో తీసిన గొప్ప సినిమాల్లో కమ్ అండ్ సీ ఒకటి. సోవియట్ సెన్సార్ ఆంక్షల మధ్యనే జాతి అణచివేతకు వ్యతిరేకంగా ఆగ్రహం, ఆవేదన కలగలిపి తీసిన సాహసోపేత చిత్రం ఇది. భూమ్మీద యుద్ధం రూపంలో నరకం అనేది ప్రజాజీవితాన్ని ఎంతగా విధ్వంసం చేసి పడేస్తుందో అత్యంత నిర్దిష్టంగా, హింసాత్మకంగా, భయానకంగా చూపించిన కళాత్మక చిత్రం కమ్ అండ్ సీ

రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ విజయం సాధించి 40వ వార్షికోత్సవం సందర్భంగా 1985లో విడుదలైన ఈ సినిమాకు సోవియట్ యూనియన్ ప్రేక్షకులు అప్పట్లోనే బ్రహ్మరథం పట్టారు. ఎనిమిదేళ్ల నిర్విరామ ప్రయత్నం తర్వాత సోవియట్ సెన్సార్ ఆంక్షలను దాటుకుని చివరకు వెలుగు చూసిన కమ్ అండ్ సీ యుద్ధ చిత్రాల నిర్మాణంలో ఒక కళాఖండంగా చరిత్రలో నిలిచిపోయింది. అత్యంత హింసాత్మక ఘటనల సమాహారంతో రూపొందిన అత్యంత అరుదైన యుద్ద సినిమాల్లో ఒకటిగా సినిమా గురించిన మన నిర్వచనాలన్నింటినీ తోసిరాజన్న చిత్రమిది. 

యుద్ధానికి సంబంధించిన అధివాస్తవికతను 35 సంవత్సరాల తర్వాత కూడా మానవజాతి సంపూర్ణంగా, సమగ్రంగా అర్థం చేసుకోవలసిన అవసరముందని ఈ సినిమా వాదిస్తుంది. ఇది నాజీల చేతిలో ఘోర హత్యలకు గురైన బాధితుల భయంకరానుభూతిని కేవలం తిరిగి చూపించిన సినిమా కాదు. 

ఈ చిత్ర దర్శకుడు క్లిమోవ్ 1933లో స్టాలిన్‌గ్రాడ్‌లో జన్మించాడు. యుద్ధాల చరిత్రలోనే భయానక దాడులకు నిదర్శనంగా నిలిచిన స్టాలిన్ గ్రాడ్ యుద్ధ సమయంలో 1942లో క్లిమోవ్ తన కుటుంబంతో పాటు ఆ నగరాన్ని వదిలి వెళ్లిపోతాడు. నాజీల ముట్టడిలో తూర్పు యూరప్ దారుణ అనుభవాలకు సంబంధించిన ప్రాథమిక, సర్వసమగ్ర సమాచారం క్లిమోవ్ కి స్పష్టంగా తెలుసు. ఆనాడు తన అనుభవంలోకి వచ్చిన ఆ జ్ఞాపకాలన్నింటినీ క్లిమోవ్ సినిమాగా మలిచాడు. కదులుతున్న స్టీడీ కామ్ షాట్లకు అనుగుణంగా దాదాపు సెట్టింగ్ అనేదే లేని రూపంలో ఈ చిత్రంలో నటీనటులు నటించారు. నేరుగా కెమెరా ముందు ముఖం పెట్టి నటీనటులు అనుభవిస్తున్న భయానక స్థితిని ఈ రెండున్నర గంటల సినిమాలో దర్శకుడు చూపించాడు. అందుకే స్టీడీకామ్‌ను ఆనాటికి ఈ సినిమాలో ఉపయోగించినంత ఎక్కువగా మరే సినిమాలోనూ చూడలేమని ఆస్కార్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ రోజర్ డీకిన్స్ వ్యాఖ్యానించారంటే అతిశయోక్తి కాదు. 

ఒక తరుణ వయస్కుడు అనాలోచితంగా చేసిన పనికి తన అమూల్యమైన బాల్యాన్ని, ఆ వయసుకు సంబంధించిన అమాయకత్వాన్ని ఎలా పోగొట్టుకుని హింసాత్మక ఘటనల క్రమంలో కొట్టుకునిపోయాడో.. ఆ క్రమంలో తాను బుద్ధి మాంద్యానికి గురవడమే కాకుండా, తన కుటుంబాన్ని, తెలిసిన వారందరినీ ఎలా కోల్పోయాడో పరమ భయానకంగా చూపించిన ఈ సినిమా చందమామ కథ కాదు. పెద్దలు చెప్పిన మాటలు వినాలి అని భారతీయ సమాజం నేర్పించే నీతి పాఠం అంతకంటే కాదు. ఆ అబ్బాయి అమాయకంగా చేసిన పనికి (నాజీలు కోల్పోయిన తుపాకీని ఇసుకలోంచి లాగడం), ఆ తర్వాత తన ప్రమేయం లేకుండానే నాజీల దురాగతాలు ఆ గ్రామ ప్రజలపై ఏ స్థాయిలో కొనసాగాయో, ఊళ్లకు ఊళ్లనే ఎలా వాస్తవంగానే తగులబెట్టేశారో వరుసగా చూపిస్తూ పోయిన మాంత్రిక వర్ణనకు ఈ సినిమా తిరుగులేని నిదర్శనం. తాను తెలిసీ తెలియక చేసిన పనికి ఆ బాలుడు పాఠం నేర్చుకున్నాడో లేదో కానీ, నాజీల ముట్టడిలో నాడు సోవియట్ గ్రామాలు అనుభవించిన దురాగతాలన్నింటినీ ఆ అబ్బాయి సినిమా పొడవునా కెమెరా ముందు పెట్టిన తన ముఖం సాక్షిగా ఒక బీభత్సానుభూతిని ప్రేక్షకులకు అనుభూతి కలిగిస్తూ పోతాడు. 

రెండున్నర గంటలపాటు సాగే ఈ సినిమాను చూస్తుంటే యుద్ధం గురించి, పరాయిదేశపు కిరాయి సైన్యం ముట్టడిలో చిక్కుకున్న ప్రజల నరకబాధల గురించి మనకు ముఖ్యంగా భారతీయులకు ఏమీ తెలీదనే చెప్పాల్సి ఉంటుంది. నాజీల ముట్టడికి గురైన ప్రాంతాల్లో హింస ఎంత పరాకాష్టకు పోయిందో ఈ సినిమా చూపించినంత దారుణంగా మరే యుద్ధ సినిమా చూపించలేదని విమర్శకుల వ్యాఖ్య. ఆ ఫామ్ హౌస్‌లో వందలాదిమందిని కుక్కి నాజీలు తగులబెడుతుంటే ఒక నాజీ మహిళ.. పీత కాలును నోట్లో వేసుకుని కొరుకుతుండటం, అపరాధభావంతో కుమిలిపోతున్న ఆ అబ్బాయి తన తలను బురదలో కూర్చి ఉండిపోవడం, అతడి స్నేహితురాలు ఆ అబ్బాయి కుటుంబాన్ని మొత్తంగా నాజీలు చంపేసి ఉన్న దృశ్యాన్ని చూసి స్థాణువై పోవడం. సినిమా మొత్తంగా షాక్ మీద షాక్‌ని చూస్తున్న వారికి కలిగిస్తూనే ఉంటుంది. 

భావోద్వేగాలను పరాకాష్టకు తీసుకుని పోవడమే తన సినిమాల విజయ రహస్యం అని గొప్పగా చెప్పుకునే మన రాజమౌళికి మానవ భావోద్వేగాల గురించి ఏమీ తెలీదని ఈ సినిమా చూశాక మనకు అర్థమవుతుంది. 

దాదాపు ముప్పై ఏళ్లకు పైబడి అనుకుంటాను భారతీయ మేటి దర్శకుడు సత్యజిత్ రాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినమాట మళ్లీ ఇప్పుడు గుర్తుకొస్తోంది. సినిమా తీయడానికి వందల కోట్ల పెట్టుబడి మన చేతిలో ఉన్నప్పటికీ లేదా ప్రభుత్వాలే పెట్టుబడి పెట్టినప్పటికీ, వార్ అండ్ పీస్ లాంటి భారీ రష్యన్ సినిమాలను మనం ఎన్నటికైనా తీయగలమా అని సత్యజిత్ రాయ్ ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. తెలుగు సినిమా పెట్టుబడి విశ్వరూపమో లేక విషరూపమో ధరించి వందల కోట్లఖర్చుతో సాంకేతికత పేరుతో, విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో, దద్దమ్మ హీరోలతో పనికిమాలిన సినిమాలను తీయగలుగుతున్న నేటి రోజుల్లో కూడా, సత్యజిత్ రాయ్ ఆనాడు చెప్పినమాట అక్షరసత్యంగా ఇప్పటికీ వర్తిస్తుందనే ఘంటాపథంగా చెప్పవచ్చు. 

నిజంగా యుద్ధం అంటే ఏమిటో, దాని విధ్వంసకర పరిణామాలు ఏమిటో ఓనమాలు కూడా తెలీని రాజమౌళి, బాహుబలి తరహా యుద్ధాన్ని బీభత్సంగా చూపించి ఇదే యుద్ధం అనుకోవాలంటూ మనల్ని మాయలో ముంచెత్తాడు. ఇటీవలి కాలంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో యూట్యూబ్‌లో విడుదలవుతున్న అలనాటి సోవియట్ యూనియన్ యుద్ధ సినిమాల భారీతనాన్ని చూస్తే, మనవాళ్లు వట్టి వెధవాయిలోయి అని గురజాడ అప్పారావు ఎందుకన్నారో మళ్లీ గుర్తుకు రాకమానదు. 

సోవియట్ యుద్ధ చిత్రాలను వరుసగా చూసే అవకాశం, సమయం దొరికి గత కొన్నివారాలుగా చూస్తున్న నాకు, వారి యుద్ధచిత్రాల్లో ఒక్కదాంట్లో కూడా హీరో కానీ పార్కుల్లో పాటలనే తైతెక్కలాడే హీరోయిన్ కానీ కనబడలేదు. నిజంగానే సోషలిస్టు రియలిజానికి పట్టం కట్టిన చిత్రాలవి. (ఈరోజుల్లో ఈ భావనను అపహాస్యం చేసేవారే ఎక్కువ) ఒక్కమాటలో చెప్పాలంటే హీరోయిజాన్ని భారతీయ సినిమా అపహాస్యం చేసినంత ఘోరంగా మరే దేశ సినిమా కూడా చేయలేదని నా అభిప్రాయం. 

మన హీరోలు నట హంసలు కాదు.. నట హింసలు. ఆ నట హింసను చూసి వెర్రెత్తిపోతున్న జనాలు కూడా రెడీగా ఉన్నారు కాబట్టే మానవ జీవితాన్ని, దాని సహస్ర పార్శ్వాలను ఉద్దీప్తం చేయాల్సిన సినిమా అనే మహత్తర కళ మన దేశంలో కలెక్షన్ల వసూలు పిచ్చలో పడి దేకుతూ అక్కడే ఆగిపోతోంది. సినిమా కళమీద దాని ఔన్నత్యం మీద కనీస అవగాహన లేని చింతపండు వ్యాపారులు, సారా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినిమా నిర్మాతలుగా అవతారమెత్తితే, వాళ్ల చీకటి పెట్టుబడి ఆధారంగా రెమ్యునరేషన్ల రికార్డుల వైపుగా సాగిపోతున్న మన ''నట వారస హింస''ల భయంకర నటనా వైదుష్యంతో భారతీయ సినిమా.. ప్రపంచ సినిమా రంగం ముందు సాగిలపడి దేకుతోంది. 

అమానుషత్వం, జాత్యహంకారం, తుపాకీ బలం తెచ్చిపెట్టే తిరుగులేని అధికారం చరిత్రలో ఉన్నంతవరకు మనకు యుద్ధాలు, యుద్ధ బీభత్సాలు తప్పవని ఈ సినిమా స్పష్టం చేస్తుంది. యుద్ధం లేని ప్రపంచం గురించి మానవజాతి కన్న ఆ బాల్య స్వప్నం మరో వెయ్యేళ్ల తర్వాత కూడా ఫలించదనిపిస్తుంది.  

1943లో బైలోరష్యాను ముట్టడించిన నాజీ బలగాలు 648 గ్రామాలను అక్కడ నివసించే వేలాది ప్రజలతో సహా తగులబెట్టిన వాస్తవగాథను దర్శకుడు క్లిమోవ్, అలెస్ అదమోవిచ్‌ కలిసి సినిమా రూపంలోకి మార్చారు. స్వయంగా నాటి నాజీ ముట్టడిని వారు చిన్నవయసులోనే ఎదుర్కొని అనుభవించారు కనుకే 40 సంవత్సరాల తర్వాత తాము చూసిన ఆ భయానక దృశ్యాలకు సినీరూపమిచ్చారు. చరిత్రలోని వాస్తవ ఘటనలను సినిమా రూపంలోకి ఎలా మార్చాలో తెలిపే కరదీపికగా కమ్ అండ్ సీ సినిమా మన చరిత్రకు మిగిలింది.

కమ్ అండ్ సీ సినిమాపై ఈ పరిచయం నాదే అని ఎలా చెప్పుకోవాలి? మన ఇల్లు, మన ఉద్యోగం, మన బ్యాంకు, మన వేతనం, మన ఆస్తి లాగా మన రచనలు మన జ్ఞానం కూడా మన సొంతమే అవుతాయా అంటూ బాలగోపాల్ ఏనాడో వేసిన పొటుకు మర్చిపోవడం సాధ్యం కాదు కదా.. 

మన సినిమా వైభవం గురించిన చర్చ ఇక్కడ అప్రస్తుతం అనుకుంటే, యుద్ధ సినిమాల చరిత్రలో తలమానికంగా నిలిచిన కమ్ అండ్ సీ సినిమాను కింది లింకులో తప్పక చూడండి. ఇది అంతగా క్వాలిటీ లేని యూట్యూబ్ లింక్ అని గుర్తుపెట్టుకోండి.

COME AND SEE | ENGLISH SUBTITLES

https://www.youtube.com/watch?v=NJYOg4ORc1w


కొసమరుపు:

''సినిమా చూడ్డం మొదలెట్టి మళ్ళీ మీ ఈ విశ్లేషణ మొత్తం చదివాక. చూద్దామని చదివాను. మనసంతా దుఃఖంతో వణికి పోయింది...ఇప్పుడు ఇసుకలో తుపాకీ తవ్వితీసిన బాలుడి జీవితం సినిమాలో చూడాలంటే భయం వేస్తోంది. గొప్ప విశ్లేషణలు... నాజీ యుద్ధ సినిమాలు చాలా చూసాను కానీ మీ ఈ విశ్లేషణ చదివాక... హృదయం వేదనతో మెత్తబడి పోయింది. 

సినిమా ఇప్పుడే ముగించాను ఏడుస్తూ చూసాను.. ఇక ఈ రాత్రి నిద్రపోలేను.''

అంటూ మంచిసినిమా గ్రూప్ సభ్యురాలు డాక్టర్ గీతాంజలి గారు ఈ సినిమా పరిచయం గురించి రాసిన వ్యాఖ్య ఇక్కడ తాజాగా పొందుపరుస్తున్నాను. ఆమె వ్యాఖ్యకు నా సమాధానం కూడా ఇక్కడ ఇస్తున్నాను.

ఆ సినిమా చివరి 15 నిమిషాల క్లైమాక్స్ లో చూపింది చాలా తక్కువే చెప్పానండీ. పిల్లలతో సహా గ్రామం మొత్తాన్ని తగులబెట్టేశాక.  ఒక ముదుసలిని మంచంమీద బయటకు తెచ్చి  ఆ నాజీ ముష్కరులు చెప్పిన డైలాగ్ నేనయితే పరిచయంలో రాయలేకపోయాను. పిల్లలతో సహా మీ వాళ్లనందరినీ లేపేశాం. నువ్వు మళ్లీ పిల్లలను కని మామీదకు వాళ్లను పంపించు అనే అర్థం వచ్చేలా వాళ్లు చేసిన హేళనకు అంత పెద్ద ముసలావిడ కూడా కన్నీళ్లు పెడుతూ వాళ్లకేసి చూసిన చూపు మర్చిపోలేం. ఇదీ భావోద్వేగం అంటే. మన రాజమౌళికి అర్థం కానిదిదే... 

గ్రామాన్ని తగులబెట్టిన నాజీలను చివరికి రెడార్మీ పట్టుకున్నప్పుడు ప్రాణం కోసం వాళ్లు వేసే వేషాలు. ఆ కుర్రాడి కాల్చేసే చూపును ఎన్నటికీ మర్చిపోలేం. 

దాదాపుగా సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన యుద్ధ సినిమాలన్నీ ఇలాగే పరిచయం చేయాలని ఉంది. పదేళ్లక్రితం ప్రాణహిత, ప్రజాకళ అనే రెండు వెబ్ సైట్లకు ప్రపంచ క్లాసిక్ మూవీస్ పై సమీక్ష కావాలంటే ది బ్యాటిలిషిప్ పొటెంకిన్, స్పార్టకస్, ఇవాన్  ది టెర్రిబుల్, ఎనిమీ అట్ ది గేట్స్ వంటి యుద్ధ సంబంధిత సినిమాలను సమీక్షించి పంపాను. అవి సంచలనం కలిగించాయి. అయితే ఆర్థిక వనరుల లేమితో వాటిని మూసేశారు దాంతో వంద క్లాసిక్ సినిమాలు పరిచయం చేద్దామనుకున్న నా ప్లాన్ పోయింది.  అయితే ఇప్పుడు ఒక వెబ్ సైట్‌లో పనిచేసే అవకాశం వస్తోంది కాబట్టి మళ్లీ సినిమాల పరిచయం చేయగలనని అనుకుంటున్నాను.

ఒరిజనల్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉందని మిత్రులు చెప్పారు. మీకు వీలయితే అక్కడే చూడండి. అయితే యూట్యూబ్ లోని ఈ లింకు కూడా మంచి క్వాలిటీతోనే ఉన్నట్లుంది. ఇక్కడే చూడవచ్చు.

COME AND SEE | ENGLISH SUBTITLES

https://www.youtube.com/watch?v=NJYOg4ORc1w