Pages

Tuesday, March 31, 2015

అమెరికా నుంచి ఉప్పాడ తీరం దాకా....

నిన్న సాయంత్రం 4 గంటలకు ఎప్పటిలాగే సాక్షి ఆఫీసుకు వచ్చి మెయిల్స్, వార్తలు చూస్తున్నా. సాక్షి వెబ్ సైట్ హోమ్ పేజీలో దిగువన ఉన్న వార్తాంశాలలో ఉప్పాడ బీచ్‌లో వలకు చిక్కిన  జారు మీను అనే షార్క్ చేప గురించిన వార్త, దాని బొమ్మ ఎందుకోగానీ ఆకట్టుకుంది. జారు మీను అనాల్సింది స్థానిక యాసలో జారుమెను అన్నారా లేదా అచ్చు దోషమా తెలియలేదు.

ఆ వార్త పూర్తి పాఠం ఇదీ...

ఉప్పాడ బీచ్‌లో వలకు చిక్కిన జారుమెను
Sakshi | Updated: March 30, 2015 15:59 (IST)
http://www.sakshi.com/news/andhra-pradesh/big-fish-caught-in-uppada-beach-226208

తూర్పుగోదావరి: కాకినాడలోని ఉప్పాడ బీచ్ వద్ద వేటకు వెళ్లిన మత్స్య కారులకు సోమవారం పంట పండింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే జారుమెను జాతికి చెందిన చేప వలకు చిక్కింది. దీంతో దానిని బోటుకు కట్టుకుని తీరానికి లాక్కొచ్చారు. దానిని చూడటానికి స్థానికులు గుమిగూడుతున్నారు....




2 వేల కిలోల బరువైన భారీ షార్క్ జాలర్ల వలకు ఎలా చిక్కిందని అబ్బురపడుతూనే వార్తను చదివాను. ఇలాంటి పెద్ద పెద్ద చేపలు వలలో చిక్కిన వైనం తరచుగా వార్తల్లో చూస్తుండటంతో అంతకుమించి దృష్టి పోలేదు.

సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎడిట్ పేజి ఇంటర్ కామ్ నంబర్ గణగణ మోగింది. పాఠకులు, లేదా రచయితల నుంచి వచ్చి ఉంటుందని తీసుకుంటే ఊహించనంత దూరం నుంచి వచ్చిందది. అమెరికా లోని డల్లాస్ (డాలస్) నుంచి ఐటీ రంగ నిపుణులు కె.శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. ఆశ్చర్యంగా అంతకుముందు నేను సాక్షి వెబ్‌సైట్‌లో చూసిన ఆ జారుమీను గురించి ప్రస్తావించారు.

ఆ వార్తలో భాగంగా వేసిన చేప ఫొటో వాస్తవమైనదేనా, లేదా ఫైల్ ఫొటోనా అని ఆయన వాకబు చేశారు. మళ్లీ ఒకసారి దాన్ని చూసి వార్త ప్రకారం అది తాజా ఫొటోనేనని చెప్పాను. 'మీరేమనుకోకపోతే ఆ వార్త పంపిన రిపోర్టరును ఒకసారి వాకబు చేసి ఆ చేప ఇంకా బతికి ఉందో లేదో కనుక్కోండి. బతికే ఉంటే దాన్ని వెంటనే సముద్రంలోకి వదిలిపెట్టమని ఆ జాలర్లకు తెలుపండి' అంటూ ఆయన అభ్యర్థించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రాణి అయిన ఆ చేప (వేల్ షార్క్ : ఇది షార్క్ చేపే అయినప్పటికీ తిమింగలం (వేల్) సైజులో ఉండటంతో దీన్ని వేల్ షార్క్ అని పిలుస్తున్నారు) సాధుజీవి అనీ, సముద్రంలో ఉన్నప్పుడు మనిషి తన సమీపంలోకి వచ్చి తాకినా అది ఏమీ చేయదని, దీన్ని ఐక్యరాజ్య సమితి రక్షిత జీవులు జాబితాలో చేర్చిందని, ఎలాంటి అవకాశం ఉన్నాసరే దాన్ని నీళ్లలోకి పంపించే ఏర్పాటు చేయమని ఆయన కోరారు.


ఈ సాయంత్రం నేను మా వెబ్‌సైట్‌లో యాదృచ్ఛికంగా చూసిన ఆ వార్త అమెరికాలోని ఒక ఐటీ నిపుణుడి దృష్టిలో కూడా పడి ఆయన నేరుగా మా పత్రికాఫీసుకే ఫోన్ చేసి విచారించిన వైనం నాకు దిగ్భ్రాంతి కలిగించింది. నిజంగానే షాక్ తిన్నానా క్షణంలో. ఉప్పాడ ప్రాంత రిపోర్టర్ గురించి తెలీదని, కాస్త సమయం ఇస్తే కనుక్కుని ఈ సమాచారం వారికి చెబుతానని చెప్పి ఆయన ఈమెయిల్‌ని తీసుకున్నాను.

ఎడిట్ పేజీలో డెస్క్‌లో కూర్చుని బుద్ధిగా పనిచేసుకునే నాకు ఆ స్థానిక రిపోర్టర్ వివరాలు తెలీవు. వెంటనే మా ఎడిటోరియల్ ఇన్‌చార్జి వేణుగోపాల్ గారిని సంప్రదించి అమెరికా కాల్ విషయం చెబితే ఆయన తూర్పుగోదావరి జిల్లా సాక్షి బ్యూరోకి చెందిన అనంత్ గారి మొబైల్‌ నంబర్ ఇచ్చారు. వెంటనే ఆయనకు కాల్ చేసి ఉప్పాడ రిపోర్టర్‌కు ఈ విషయం తెలిపి ఆ చేప ఇంకా బతికి ఉన్నదీ లేనిదీ వివరాలు కనుక్కోమని కోరాను. ఈలోగా అనంత్ గారి మొబైల్‌ని శ్రీనివాస్ గారికి ఈమెయిల్ చేశాను. రెండు నిమిషాల్లోనే పిఠాపురం రిపోర్టర్ ప్రసాద్ గారి నుంచి సమాచారం వచ్చింది. వలలో చిక్కిన ఆ చేప అప్పటికే చనిపోయిందనీ, ఆ అరుదైన చేప పట్ల భవిష్యత్తులో జాగరూకతతో వ్యవహరించడానికి ఆ జాలర్లను కలిసి విషయం చెబుతానని ఆ రిపోర్టర్ చెప్పినట్లు అనంత్ గారు తెలిపారు. ఈలోపు నా మెయిల్లో అనంత్ గారి మొబైల్ నంబర్ చూసిన శ్రీనివాస్ గారు నేరుగా తనకే కాల్ చేయడంతో నేను రంగం నుంచి తప్పుకున్నాను.


కాసేపయ్యాక శ్రీనివాస్ గారు మళ్లీ ఫోన్ చేశారు. ఆ చేప బతికి ఉండే అవకాశం లేదని సందేహిస్తూనే ఒక ప్రయత్నం చేద్దామని మీకు ఫోన్ చేశానని, అది చనిపోయిందని నిర్ధారణ అయినా, నా కాల్‌కి సాక్షి సిబ్బందిగా మీరందరూ సత్వరం స్పందించడం చాలా సంతోషకరమైన విషయమని ఆయన చెప్పారు. ఈ అరుదైన షార్క్ చేపలను ఇంగ్లీషులో జెంటిల్ జెయింట్స్ అంటారట. దీన్ని తెలుగులో మహా సాధువులు అందామా, సాధు చేపలు అందామా, మృదు తిమింగలాలు అందామా నాకయితే సరైన పదం స్ఫురించడం లేదు. ఈ జెంటిల్ జెయింట్స్ గురించి సైన్స్ పత్రికలలో ఉన్న ఇంగ్లీషు సమాచారాన్ని లింకులతో సహా ఆయన మెయిల్ చేశారు.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాణికి సంబంధించిన ఒక చిన్న వార్తాంశం అమెరికానుంచి ఉప్పాడ తీరం దాకా ప్రసరించిన ఈ మానవీయ స్పందనను నేనయితే మరవలేను. ఆ చేప బతికి ఉండకపోవచ్చు. వలలో చిక్కిన తర్వాత బతికి బట్టకట్టే అవకాశాలు లేకపోవచ్చు. కానీ అవకాశముంటే దాన్ని సముద్రంలోకి తిరిగి పంపేందుకు మానవ ప్రయత్నం జరిగితే ఎంత బావుణ్ణు అనే చిరు ఆశను కొన్నివేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రేరేపించిన శ్రీనివాస్ గారూ.. ధన్యవాదాలండీ..

చేప కోసం తపనలోంచి ఏర్పడిన ఈ సుదూర పరిచయ బంధం ఇలాగే కొనసాగాలని తప్ప మీ నుంచి ఇంకేమి కోరుకోగలం? జూన్‌లో ఇండియా వచ్చినప్పుడు ఏపీలో మీ \పర్యావరణంపై వీడియో ప్రాజెక్టు సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండీ...

శ్రీనివాస్ గారి వివరాలు
Srinivas Kanchadapu
Vasunix@yahoo.com
+18044418543 (డల్లాస్ మొబైల్ నంబర్)
---------------------------

శ్రీనివాస్ గారు పంపిన ఈమెయిల్ లింకులలోంచి తెలుసుకున్న వేల్ షార్క్ వివరాలు కొన్ని....
ప్రపంచంలోనే అతి పెద్ద చేప అయిన వేల్ షార్క్ 12,500 కిలోల నుండి 20 వేల కిలోల బరువు వరకు పెరుగుతుంది. సముద్రాల్లో దీనిలాగా వలస వెళ్లే చేప మరొకటి లేదు. వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. మహా సముద్రాల లోతట్టు ప్రాంతాల్లో నివసించే ఈ మహా షార్క్‌లు అంతదూరం ఆహారం కోసమే వలస వెళతాయా లేదా వేరే కారణాలున్నాయా అనే విషయంలో నేటికీ స్పష్టత లేదు. 300 పళ్లు దీని నోటి భాగంలో ఉన్నా వాటి పనేంటన్నది తెలియనప్పటికీ దాని నోరు ఒక మీటరు నుంచి 3 మీటర్ల వెడల్పుతో తెరుచుకుంటుందట. భారీ పరిమాణంలో నీటిని నోటిలోకి మింగి, తర్వాత ఆ నీటిని పళ్ల కోరలనుంచి బయటకు వదిలేస్తూ మిగిలిన ఆహారాన్ని ఇవి స్వీకరిస్తాయి. వెచ్చటి నీటిలోనూ, వెయ్యి మీటర్ల లోతులో 3 సెటీగ్రేడ్ డిగ్రీల స్వల్ప ఉష్ణోగ్రతలలో కూడా ఇవి మనగలుగుతాయి. అంతరించిపోనున్న జాతుల జాబితాలో ఉన్న వీటి మాంసానికి కొన్ని ఆసియా దేశాల మార్కెట్లలో విపరీతంగా డిమాండ్ ఉండటం కూడా ఈ మహా ప్రాణుల ఉనికికి భంగకరం అవుతోంది. పునరుత్పత్తి రేటు చాలా తక్కువ కావటంతో ఇవి అంతిరిస్తున్న జాతుల్లో ఒకటిగా మిగిలాయి. ఎంత మహా భారీ కాయంతో ఉన్నప్పటికీ బెదురు, బిడియం లక్షణాలు కలిగిన ఈ తిమింగలాలు ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులకు ఆకర్షణీయ ప్రాణులుగా ఉంటున్నప్పటికీ వీటిని కాపాడుకునే విషయంలో ఆ టూరిస్టుల అవగాహన ఏంటన్నది తెలియరావడం లేదు.


                                           (వేల్ షార్క్ నోట్లోని 300 పైగా పండ్లు లేదా కోరలు)

నీటిమీద 9 మీటర్ల ఎత్తు వరకు ఎగిరి పడే ఈ షార్క్ చేపలు సముద్ర రాణులనే చెప్పాలి. ఒక్కసారి నోరు తెరవడం, మూయడం ప్రక్రియతో ఇవి భారీ స్థాయిలో చేప గుడ్లను, బిలియన్ల సంఖ్యలో అత్యంత సూక్ష్మరూపంలో ఉండే జంతు, మొక్కల రూపంలోని ప్రాణులను ఇవి ఆహారంగా తీసుకుంటాయి.

చాలావరకు ఒంటరి జీవితం గడిపే ఈ మహా తిమింగలాలు ఒక్కో సీజనులో మాత్రం వందల సంఖ్యలో ఒకే చోట దర్శనమిస్తుంటాయి. తరతరాలుగా జాలర్లు, స్థానికులకు ఈ విషయం తెలిసి ఉన్నప్పటికీ శాస్త్ర ప్రపంచానికి నిన్న మొన్నటి దాకా దీనిపై అవగాహన లేకపోవడం ఆశ్చర్యకరం. వేల్ షార్క్‌లు వందేళ్లు బతుకుతాయి గానీ వీటికి సెక్సువల్ మెచూరిటీ 18 సంవత్సరాలనుంచి 30 సంవత్సరాలలో కలుగుతుందట. అంటే వీటి సంతానోత్పత్తికి సుదీర్ఘ కాలం పడుతుంది. అయితే ఈ భారీ చేప ఎక్కడ జత కూడతాయన్నది నేటికీ మిస్టరీనే. ఇది నీటి బయట, మైదానాల్లో, తీరప్రాంతాల్లో సంతానోత్పత్తి చేయడం ఇంతవరకు ఎవరూ చూడలేదు. కానీ ఒక ఆడ షార్క్ ఎంత దూరం వెళుతుందంటే 2007 ఆగస్టు నుంచి 2008 జనవరి మధ్య కాలంలో అంటే కేవలం ఆరు నెలల కాలంలో 7,200 కిలోమీటర్ల దూరం సముద్రాల్లో పయనించిందని ఉపగ్రహాలతో అనుసంధించిన దాని ట్యాగ్‌లు పసికట్టాయి.



How to Love a Whale Shark
http://www.scientificamerican.com/article/love-whale-shark/

Whale shark fact file
http://www.arkive.org/whale-shark/rhincodon-typus/

Whale Shark Facts
http://www.seethewild.org/whale-shark-facts/



5 comments:

ranivani said...

మంచి పోస్ట్ .

ranivani said...

మంచి పోస్ట్ .

kanthisena said...

ధన్యవాదాలు నాగరాణి గారూ!

addankikesavarao said...

రాజశేఖర్గారూ ఈ అర్టికల్ ని వేణు అప్పుడే నాకు మైల్ చేసారు. ఐతే అప్పటికి నాకు నాస్పందనను ఈ బ్లాగులో ఎలాపోస్టు చేయాలో తెలియలేదు. ఇప్పుడుతెలిసింది. పర్యావరణం పైనా, జీవవైవిధ్యం పైనానేనొక స్లోగను రాసాను. శాఖాహారాన్నే భుజిద్దం! జీవవైవిద్యాన్ని కాపాడుదాం!! పర్యావరణాన్ని సం రక్షిద్దాం!!! వేణు సహకారంతో దీన్ని ఇంగ్లీషులోకి మార్చాను. Be Vegetarian! Save Environment !! Protect Bio-diversity!!! నేను నిర్వహిస్తూన్న విద్యాసంస్థ లో చదువుకుంటున్న పిల్లల్లో ఈ స్పృహను కలిగించడానికి ఈ కొటేషన్ ను 2010 నుండి వరుసగా 3సంవత్సారాలు నోట్ బుక్ కవర్ గా వేయించాను.2010 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి జీవవైవిధ్య సంవత్సరంగా ప్రకటించింది. చాలామంది పిల్లలతో బాటు వారి తల్లిదండ్రులలో కొంతమందిని కూడా శాఖాహారులుగా మార్చాను. ఇందుకోసం నెట్ లో ఇండియన్ వెజిటేరియన్ కాంగ్రెస్ వారు వారి నెట్ పత్రికలలో పొస్టు చేసిన వ్యాసాలన్ని పిల్లలకు వివరిస్తూ వుంటాను. మీ ఈ అర్టికల్ నాలో మరిన్ని కొత్త ఆలోచనలను రేకెత్తించింది. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

kanthisena said...

చంద్రదేవ్ గారూ,
మీ ఈ వ్యాఖ్యను కూడా ఇప్పుడే చూస్తున్నాను. మాంసాహారం, శాఖాహారం అలవాటుపై ప్రస్తుతం నడుస్తున్న తీవ్ర వాదోపవాదాలను పక్కన బెట్టి చూస్తే మీరు కొనసాగిస్తున్న నిరంతర ప్రయత్నం అభినందనీయమండీ. ఇండియన్ వెజిటేరియన్ కాంగ్రెస్ వారు తమ నెట్ పత్రికలలో పోస్టు చేసిన కొన్ని మంచి లింకులను నాకు కూడా పంపరా.! నేను ఇంకా శాకాహారిని కాకపోయినప్పటికీ ఒక జ్ఞానదాయికమైన అంశాన్ని తెలుసుకోవడంలో వెనుకబడకూడదు కదా.. పిల్లలను వారి తల్లితండ్రులను కూడా శాకాహారులుగా మార్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నం మంచిదేనండీ. ఏ ఆహారం గొప్పది అనే గొడవల్లోకి దిగకుండా మీరు నమ్మిన దాన్ని ఆచరిస్తూనే కదలండి. అది ఎవరికీ హాని చేయకుండా ఉంటే చాలు. ధన్యవాదాలండీ.

Post a Comment