Pages

Thursday, December 29, 2016

కాసిన్ని కన్నీళ్లతోనా రాయడం!



గుత్తా వెంకట లక్ష్మీ నరసింహారావు అంటే చాలామందికి తెలియదు. జీవీఎల్‌ నరసింహారావు అంటే పత్రికారంగంలో పనిచేసిన కొందరికి తెలుసు. ‘జీవీఎల్‌’ అంటే రాజకీయ పత్రికారంగాల్లో ప్రముఖులు, అప్రముఖులు చాలామందికి తెలుసు. బాల్యదశ (బాలసంఘం) నుండి అంత్యదశ వరకూ కమ్యూనిస్టుగా జీవించిన ఓ కామ్రేడ్‌ జీవీఎల్‌. అరవై నుండి తొంబైవ దశకం చివరి వరకూ పాత్రికేయుడు జీవీఎల్‌ నరసింహారావు. మాజీ కేంద్ర మంత్రి, ఆమధ్య మరణించిన పర్వతనేని ఉపేంద్ర జీవీఎల్‌కు బాలసంఘం రోజులనుండీ బాల్య మిత్రుడు. సుప్రసిద్ధ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌ జీవీఎల్‌కు ఉద్యమ సహచరుడు. ఆయనలో సగం వయస్సువాళ్లం మేం. అయినా ఏనాడూ పెద్దరికం చెలాయించని జీవీఎల్‌ మాలో ఒకరు. మాకో ప్రేరణశక్తి.

ఉద్యమంలో యోధుడు, జీవితంలో సాధువు అయిన మనిషి గురించి రాయడం ఎలా! సాదాసీదాగా కనిపించే మనిషిని, నిండుగా జీవించిన మనీషిని చిత్రించడం ఎలా! నిరంతరం తనలోకి తాను చూసుకుంటూ, తను నమ్మిన రాజకీయ తాత్విక దక్పథాన్ని చివరి కంటా దృఢతరం చేసుకుంటూ నిజంగా సజీవంగా జీవించిన వ్యక్తి గురించి, మాలోంచి జారిపోయిన శక్తి గురించి రాయటం మాటలా!

కాసిన్ని కన్నీళ్లతోనా రాయడం! అది మాకు నచ్చని విషయం, ఆయన మెచ్చని విషయం. దోసెడు ఎర్రపూలతోనా నివాళులివ్వడం! ఇలాంటివన్నీ ఆయన ససేమిరా అంటాడనీ తెలుసు. అయినా ‘అదేం కుదరదు, నువ్వేం చేస్తావో మాకు తెలవదు’ అంటారు మా ‘వృత్తిమిత్రులు’. బెజవాడలో మా మిత్ర బృందం ఏవేవో చేయాలని అనుకున్నపుడు, చేసినపుడు మాకు మేము పెట్టుకున్న పేరది.

మేము మార్క్సిజంలోకి తొంగిచూసి జర్నలిజంలోకి జంపయిన ఓ అరడజనుమంది జర్నలిస్టులం. అందరిదీ పల్లెటూళ్ల నేపథ్యమే. వివిధ పత్రికల్లో సంపాదక వర్గానికి సంబంధించిన వివిధ బాధ్యతల్లో పనిచేసేవాళ్లం. విజయవాడ పటమట ఎన్నెస్సెమ్‌ హైస్కూల్‌ రోడ్డులోంచి ప్రభ అమరయ్య (ఇప్పుడు సాక్షి అమరయ్య), నిర్మల హైస్కూలు వెనక రోడ్డులోంచి జ్యోతి కృష్ణ, శాంతి నర్సింగ్‌హోమ్‌ పక్క సందులోంచి భూమి నరసింహారావు, అయ్యప్పనగరో, చౌదరిపేట నుంచో నేను, రాంబాబు, పాషా పంటకాల్వ సెంటరుకు వచ్చిచేరేవాళ్లం.

వేరుశనక్కాయ గింజలు నములుతూ, మెుక్కజొన్న పొత్తులు, పలకమారిన జాంకాయల్ని కబుర్ల మధ్యలో కొరుక్కుతింటూ పటమట యు.సి టీస్టాల్లో టీలు తాగుతూ జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు, జర్నలిస్టుల రాజకీయాలు, డెస్కుల్లో రిస్కులూ, హస్కులు, జోకులూ అన్నీ కప్పుల్లోంచి లేచే టీ పొగల్లా గుప్పుమంటుండేవి. సిగరెట్‌ అంచున లేచే ధూమంలా రింగురింగులు తిరుగుతూ సాగేవి.

ఓ రోజు ‘నిర్మలా హైస్కూలు ఎదురుగా నిన్న కొత్తగా ప్రారంభించిన ‘టేకిట్‌ ఈజీ’ హోటల్లో మనం రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి కలుస్తున్నాం. మనకో కొత్తవ్యక్తి పరిచయం కానున్నారు. వివరాలు రేపు...’ అంటూ అమరయ్య నుంచి అందరికీ ఫోను కాల్స్‌.

మరీ పన్నెండున్నరకు కాకపోయినా కొంచెం అటూ ఇటుగా అందరం టేకిట్‌ ఈజీ హోటల్‌కి చేరుకున్నాం. అమరయ్య ఏ కవినో, ఏ రచయితనో, ఏ రహస్యోద్యమ నాయకుణ్ణో వెంటబెట్టుకొస్తున్నాడనుకున్నాం. కానీ అవేమీ లేని మాకెవరికీ ఏరకంగానూ పరిచయంలేని ఓ పెద్దాయనతో వచ్చి అప్పటికే అమరయ్య హోటల్లో కూర్చొని ఉన్నాడు. తెల్లటి పైజమా, లాల్చీ, కళ్లద్దాలతో చాలాసాదాసీదాగా ఉన్నాడాయన.

అమరయ్య అందర్నీ ఆయనకు పరిచయం చేశాడు. ఆ పెద్దాయన తెల్లగా నవ్వుతూ అందరితో చేతులు కలిపారు. ఆయన ఎడమ చేతిలో రెండేళ్లమధ్య సిగరెట్టు కూడా ఎర్రగా నవ్వుతోంది. ‘ఈయన జీవీఎల్‌గారు. జీవీఎల్‌ నరసింహారావుగారు. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు. ఉండటం బెజవాడే’ అంటూ పరిచయం చేశాడు. గత శతాబ్ది చివరి దశకంలో సంగతులివి.

లక్ష్యసాధనలో కసిని ఓ ముసలాయన నవ్వులో కూడా చూడవచ్చని ఈ పెద్దాయన్ని మెుదటిసారిగా కలిసినపుడు మాకు తెలిసింది. నవ్వంటే జ్ఞాపకం వచ్చింది. ఎపుడూ ఆ మఖంమ్మీద నిలిచి వెలిగే తెల్లని చిరునవ్వూ, ఆయన ఎడంచేతి రెండేళ్ల నడుమ రగిలిపోయే సిగరెట్‌ ఎర్రని వేడి నవ్వూ; ఈ రెండూ నవ్వులూ పరస్పర విరుద్ధ అంశాలు. ఆయన తెల్లని చిరునవ్వు మాకు ఉత్తేజం. సిగరెట్‌ ఎర్రని వెచ్చని నవ్వు జీవీఎల్‌గారి రాతకి ఉత్తేజం. కానీ చివరికి ఆ ‘ఎర్రని నవ్వే’ ఆయనకు మృత్యుముఖ సందర్శనం చేయించింది.

అప్పటివరకూ వృత్తి ఉద్యోగానికే పరిమితమైన మా వ్యాపకాలకు కొత్త అజెండాను అందించారు జీవీఎల్‌. నిరంతర వయోజన విద్యాకేంద్రాల కోసం ఆయన అప్పటికే ఓ పత్రిక నడుపుతున్నారు. కార్పోరేట్‌ వైద్యరంగం విజయవాడలో వేళ్లూనుతున్న కాలమది. ప్రజలకు వైద్య అరోగ్య విషయాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించాలని అందుకోసం ఓ పుస్తకం తీసుకురావాలని ఆయన ప్రతిపాదన. రెండుమూడు నెలల కృషి ఫలితంగా ‘హలో డాక్టర్‌!’ పేరుతో ఒక విశేష సంచికను తీసుకువచ్చాం.

కార్పోరేట్‌ విద్యావిధానానికి ప్రత్యామ్నాయ విద్యాబోధన ఉద్యమం విజయవాడలో ఊపందుకుంది. విద్యావేత్త ఎన్‌. శివరామ్, శాంతి విద్యావనం పర్వతనేని కిషోర్‌మాస్టారు, వికాసవిద్యావనం పరిమి దంపతులు, గౌతమ్‌ విద్యాసంస్థల అధిపతి చౌదరిబాబు మరికొందరు అందుకు నడుంకట్టారు. అందులోనూ వృత్తిమిత్రులు తలదూర్చారు.

వేమన సుమతి పద్యాలకు సరళమైన భావం, శ్రావ్యమైన సంగీతంతో ఆడియో కాసెట్లు తయారుచేయాలని సంకల్పించాం. పద్యాలను ఏర్చికూర్చడం ఖర్చు భరించడం మావంతు. భావాన్ని అందించడం జీవీఎల్‌గారి వంతు. సంగీతాన్ని, గాత్రాలను సమకూర్చడం సంగీత దర్శకులు ప్రజానాట్యమండలి కళాకారులు బొడ్డుగోపాలంగారి వంతు. అనుకున్న సమయం మించినా మంచి ఫలితాలు వచ్చాయి. వాటి ఆవిష్కరణ రోజు జీవీఎల్‌గారిని ఎంతగా కోరినా వేదికమీదకు ఎక్కలేదు. మాధ్యమంలో పనిచేసినప్పటికీ ప్రచార అర్భాటాలకు ఆమడ దూరంగా ఉన్నారాయన.

దాని కొనసాగింపుగా 'వేమన్న ఏమన్నాడు' పుస్తకాన్ని తీసుకొచ్చాం. నాటినుండి జీవీఎల్‌గారికి బాల సాహిత్య సృజనపట్ల ఆసక్తి పెరిగింది. కిలాడి దెయ్యాలు, పాతాళ జలరాక్షసులు, మేడారం జాతర, గబ్బిలమూ గుడ్లగూబ, నూరు కథలతో కథాశతంకం, కథలుతినే జడలభూతం, షేక్స్‌పియర్‌ నాటక కథలు పుస్తకాలుగా విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అచ్చయ్యాయి.

జీవీఎల్‌ రచనా వ్యాసంగం విశాలాంధ్ర దినపత్రిక ఉద్యోగంతో ప్రారంభమయింది. మధ్యలో ఏ మలుపులు తిరిగినా చివరిగా విశాలాంధ్రకు రాస్తుండగానే ముగిసింది. ఏలూరు కమ్యూనిస్టుపార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అత్తలూరి సర్వేశ్వరరావు పత్రికా రంగంవైపు ప్రోత్సహించారని జీవీఎల్‌ గుర్తుచేసుకునేవారు.

1934లో పశ్చిమగోదావరిజిల్లా పోతునూరులో కమ్యూనిస్టు కుటుంబంలో జీవీఎల్‌ జన్మించారు. ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, స్వతంత్ర ఆర్ట్స్‌ వ్యవస్థాపకులు యుగంధర్‌ ప్రోత్సాహంతో బాలసంఘంలోచేరి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 1949 –52 మధ్యకాలంలో పర్వతనేని ఉపేంద్ర, గుత్తికొండ నాగేశ్వరరావు తదితరులతో కలిసి జాతీయ విద్యార్థి వికాస మండలిని స్థాపించి ఆ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారు. అనంతరం పశ్చిమగోదావరిజిల్లా యువజన సమాఖ్యకు కార్యదర్శిగా పనిచేశారు. 1952, 55 సాధారణ ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించారు. భారత కమ్యూనిస్టుపార్టీ ఏలూరు తాలూకా కమిటి సభ్యులుగా పనిచేశారు. 1955 అనంతరం పార్టీ బాధ్యతల నుండి రిలీవయ్యారు.

1961నుండి 63వరకు విశాలాంధ్ర దినపత్రికలో పనిచేశారు. అనంతరం సీపీఎం నడిపిన జనశక్తి పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా పనిచేశారు. వీవీ రాఘవయ్యగారి జ్యోతి రాజకీయ వారపత్రికకు, 1979–81 కాలంలో విశాఖలో విజయభాను వారపత్రికకు, 81–83లో గౌతులచ్చన్నగారి బహుజన వారపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. తొలికోడి సాయంకాల దినపత్రికను ఏలూరులో కొంతకాలం, గుంటూరులో కొంతకాలం సొంతగా నడిపారు. 1991 నుండి 2000 వరకు ఆంధ్రపత్రిక దినపత్రిక మాగజైన్‌ ఎడిటర్‌గా పనిచేశారు.

నిరంతర వయోజన విద్యాకేంద్రాల కోసం లేఖ పక్షపత్రికను విజయవాడనుండి నడిపారు. వయోజనులకు సుబోధకంగా ఉండేట్టు చదువుపట్ల ఆసక్తిని కలిగించే విధంగా సంధులు లేని అత్యంత సరళమైన భాషను వాడేవారు. పత్రికలలో వచ్చే ఆసక్తికరమైన వార్తాంశాలను, వైద్య ఆరోగ్య వ్యవసాయ పర్యావరణ తదితర అంశాలను చక్కని కథల రూపంలో, చిన్న చిన్న పాఠ్యాంశాలుగా కూర్చేవారు. ఈ విషయంలో జీవీఎల్‌ అరుదైన తనదైన ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకున్నారు.

మహాకవి శ్రీశ్రీ షష్ఠిపూర్తి ఉత్సవాల సందర్భంగా ‘విశాఖ విద్యార్థుల బహిరంగ లేఖ’ బయటకొచ్చింది. అదొక సంచలనం. దానికి స్క్రిప్టు, దర్శకత్వ బాధ్యతలు జీవీఎల్‌గారివే. ఇందులో విశాఖ వైద్య విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించారని జీవీఎల్‌ అనేవారు.

వ్యక్తిగత జీవితంలో, రాజకీయ, సామాజిక, పత్రికా రంగాల్లో ఎక్కడా రాజీపడని, మడమతిప్పని అసలైన యోధుడు జీవీఎల్‌.

వృత్తి ప్రవత్తుల నేపథ్యంలో కలిసి హటాత్తుగా వెళ్ళిపోయిన జర్నలిస్టు చంద్రశేఖర్‌గారు మాతో ఎప్పుడూ అంటూండేవారు. ‘మీ ముచ్చట్లు, ఆలోచనలు, కార్యకలాపాల్ని కాగితాలమీద పెట్టండి. ఒకప్పటికి అదే చరిత్ర అవుతుంది. మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది’ అని. ‘మాకు పెద్ద తలకాయ కదా’ ఆ పనిని జీవీఎల్‌గార్నే ప్రారంభించమన్నాం మేమంతా. అంతకన్నా నాకు అర్జంటు పనులున్నాయంటూ ఈ నెల (డిసెంబర్) 22వ తేదీ సాయంత్రం ఆయన వెళ్లిపోయాడు.

(2017 జనవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హాలులో జీవీఎల్‌ సంస్మరణ సభ జరుగనున్న సందర్భంగా...)
--వృత్తి మిత్రులు

జీవీఎల్ జ్ఞాపకాల గురించి ఆయనతో పరిచయం ఉన్న వృత్తి మిత్రుల పేరుతో చిరు, చిర వ్యాసం అందించిన సాక్షి సాగుబడి సంపాదకులు పతంగి రాంబాబు గారికి ధన్యవాదాలూ, కృతజ్ఞతలూ... ఈ వ్యాస రచయిత శరత్‌చంద్ర జ్యోతిశ్రీ.

ఈ వ్యాసం నేటి (30-12-2016) సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ సంపాదక పేజీ -4- లో సంక్షిప్త రూపంలో ప్రచురితమైంది.

సాక్షి సౌజన్యంతో...

Saturday, December 10, 2016

ఆసుపత్రిలో జయలలిత ఎలా ఉండేదంటే...!


ఆగస్టు 29న అపోలో ఆసుపత్రిలో చో రామస్వామి ఉన్న రూమ్‌కి వెళ్లి  ఆయనకు ధైర్యం చెప్పి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పడూ పాజిటివ్ గానే ఆలోచించాలని, మీకు నయం అవుతుందని చెప్పిన జయలలిత మూడు నెలల తర్వాత అదే అప్పోలోలో గుండె ఆగిన సమస్యతో చనిపోవడం కోట్లమందిని విభ్రాంత పరిచింది. చో ఆమెను గుర్తించి సారీ చెప్పబోతే మీరెందుకు సారీ చెప్పాలి, అంటూ సున్నితంగా అడ్డుచెప్పిన జయలలిత.. జీవితం పట్ల ఆశావహ దృక్పథంతో ఉండాలని,  మీకేమీ కాదని ఊరడించిన జయలలిత.. అదే ఆసుపత్రిలోనే కనుమరుగవడం జాతీయ వ్యాప్తంగా షాక్‌ కలిగించింది.

ఆసుపత్రిలో జయ ఎలా ఉండిందనే విషయమై సిబ్బంది లేదా మరెవ్వరో అతి రహస్యంగా తీసి పోస్ట్ చేస్తున్న వీడియోలు, చిత్రాల ద్వారానే తెలుస్తోంది తప్ప 75 రోజుల్లో ఏ ఒక్క సందర్భంలోనూ అప్పోలో యాజమాన్యం జయ క్షేమంగా ఉందన్న ప్రకటనలు తప్పితే ఆమెను వీడియో రూపంలో చూపించి తమిళనాడు ప్రజలకు స్వాంతన కలిగించే ప్రయత్నం చేయకపోవడం వైద్యపరమైన నైతిక సూత్రాల్లో భాగమేనా?

సకల వ్యవస్థలనూ నిర్వీర్యం చేస్తున్న పాలకులు కాస్త సంక్షేమం ప్రదర్శిస్తే చాలు.. కోట్లాది జనం దాసోహమైపోతున్న మన సామాజిక సంస్కృతీ నేపథ్యంలో పాలకవర్గాల అంతఃపుర కుట్రల గురించి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

ఎంత పరిమితార్థంలో అయినా సరే.. సంక్షేమం భావనకు దేశ చరిత్రలో కొత్త అర్థం చెప్పిన సొంతమామ ఎన్టీఆర్‌ను దశమగ్రహ జామాత ఏ గతి పట్టించాడో చూసింతర్వాత కూడా పాలక వర్గ రాజకీయ కుట్రలు ఎలా ఉంటాయో తెలియంది కాదు.

కానీ ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఆరోగ్యంపై కోట్లమంది అభిమానులు తల్లడిల్లిపోతున్న ఆందోళనకర పరిస్థితుల్లో కూడా 75 రోజుల పాటు ఆసుపత్రి యాజమాన్యం, తమిళనాడు గవర్నమెంటు, శశికళాంబలు నోరిప్పకుండా ఉండిపోయారంటే, ఈ దేశపు కేంద్ర ప్రభుత్వమూ, ఈ దేశపు మహా దొడ్డ న్యాయస్థానమూ నవరంధ్రాలూ మూసుకుని  నిశ్శబ్దంగా ఉండిపోయాయంటే వాళ్లు నమ్ముతున్న రాజ్యాంగానికి ఇంతకు మించిన ఉల్లంఘన మరొకటి ఉందా?

ఈ ప్రజాస్వామ్యమూ, దాని మహా గొప్ప విలువలూ ఎంత గొప్ప వికారాలను, జుగుప్సలను ప్రదర్శిస్తున్నాయో జయలలిత అనారోగ్యం, ఆకస్మిక మరణం తేటతెల్లం చేస్తున్నాయి. ఈ ప్రజాస్వామ్యం ఎలాంటి విలువలూ లేని, తల్లకిందుల ప్రజాస్వామ్యం అంటే చాలామందికి కోపాలు, తాపాలూ, కడుపు మంటలూ రావచ్చు.

కాని తన రాజకీయ గురువు చో రామస్వామిని 3 నెలల క్రితం జయలలిత అపోలో ఆసుపత్రిలో కలిసి ధైర్యవచనాలు చెప్పిన ఈ అపురూప వీడియోను కింది లింకులో చూడండి. కానీ కింది వీడియో హెడ్డింగుకు, దాని కంటెంటుకు సంబంధం లేదన్నది గుర్తించాలి.

Jayalalithaa heart attack , Inside hospital leaked video
https://www.youtube.com/watch?v=Dbdf-C_9hqk



అలాగే, గత 35 ఏళ్లుగా వేల సభల్లో మాట్లాడి మాట్లాడి దెబ్బతినిపోయిన జయలలిత స్వరపేటికకు అపోలోలో జరిగినట్లు చెబుతున్న చికిత్స గురించిన ఊహాత్మకమైన సాంకేతికంగా నాణ్యమైన ఒక వీడియోను కూడా ఇక్కడ చూడండి.

Jayalalitha Started Communicating - What Was The Treatment Given? - Complete Medical Report
https://www.youtube.com/watch?v=OShb40f_P_g


Tuesday, December 6, 2016

తమిళనాడు అసెంబ్లీలో జయలలిత తెలుగు

తమిళనాడు అసెంబ్లీలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత  తెలుగులో మాట్లాడిన అరుదైన క్షణం ఇక్కడ చూడండి. మా తెలుగును కాపాడండి. మా భాషను కాపాడండి. అలాగే ఉర్దూ, మలయాళం, కన్నడ భాషలను కూడా తమిళనాడులో ప్రోత్సహించండి అంటూ హోసూరు ఎమ్మెల్యే గోపీనాధ్ 2012లో తమిళనాడు అసెంబ్లీలో అభ్యర్థించినప్పుడు జయలలిత తమిళ బ్రాహ్మణ యాసతో కూడిన తెలుగులో సమాధానం ఇచ్చారు. అన్ని భాషలను కాపాడడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఏం కావాలో మీరు చెప్పండి అంటూ జయలలిత చెప్పిన సమాధానం సభలో హర్షధ్వానాలకు తావిచ్చింది. కానీ తమిళనాడులో ప్రతి ఒక్కరూ తమిళం నేర్చుకోవలసిందే అని ఆమె తమిళంలో ముక్తాయింపు పలికారు. ఆమె కాని, కరుణానిధి కాని అన్య భాషలకు తమిళనాడులో ప్రోత్సాహం ఇవ్వలేదని, అన్య భాషల భరతం పట్టడానికి తమ వంతు పాత్ర పోషించారన్నదే వాస్తవం. యూట్యూబ్‌లో అప్ లోడ్ అయిన ఈ వీడియో లింకు కింద వ్యాఖ్యలను చూస్తే నవ్వు కాదు.. భయమేస్తుంది.

ఆ  వ్యాఖ్యలను పక్కనబెట్టి...

జయలలిత తమిళనాడు శాసనసభలో తెలుగులో చేసిన ఆ క్లుప్త సంభాషణను ఇక్కడ వినండి.
Jayalalitha Speaks In Telugu
https://www.youtube.com/watch?v=dTFZwU_fvmE