Thursday, April 2, 2015

మగాళ్లతో మీరు సరదాగా గడుపుతారా?తీహార్ జైలులో ఉన్న నిర్భయ కేసులోని దోషి ముఖేష్ సింగ్ ఇప్పటికీ ఏమంటున్నాడో మనం ఇటీవలే చూశాం. నిందితుల తరపున కేసు వాదించిన ఆ లాయర్లు న్యాయదేవతను తమ 'డైమండ్ మహిళ' వ్యాఖ్యల ద్వారా ఎంత పునీతం చేశారో కూడా విన్నాం. దేశం దేశమే జైలులాగా, అలాంటి లాయర్ల ఖిల్లాగా ఉందని వస్తున్న అభిప్రాయాల పదునును ఏమాత్రం తగ్గించకుండా మరొక పసందైన సన్నివేశానికి కూడా మన దేశమే సాక్షిగా నిలిచింది. దీంట్లో కొత్తదనం ఏదంటే ఈ సారి వంతు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌ది కావడమే.

విషయానికి వస్తే.. మార్చి 18న హాంకాంగ్ వెళ్లడానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక మహిళ అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారి బారిన పడింది. ఆమె బెంగళూరు నివాసి. తన భర్తను కలుసుకోవడానికి హాంకాంగ్ వెళుతున్న ఆమెను ఆ అధికారి మాటలతోనే కుళ్లబొడిచేశాడు.

ఆమె ధ్రువపత్రాలను తనిఖీ చేసే క్రమంలో ఆమెను అసహ్యకరమైన మాటలతో వేధించడమే కాదు.. దేశీయ, అంతర్జాతీయ మార్గాల మధ్య ఉండే ఎస్కలేటర్ పొడవునా ఆమెను అనుసరించి వెళుతూ మహా ఇబ్బంది కలిగించాడట. అదేంటో ఆమె మాటల్లోనే చూద్దాం.

'ఆ అధికారి నన్ను తాగుతావా అనడిగాడు. నువ్వు స్మోక్ చేస్తావా, చికెన్ తింటావా, నీ భర్త లేనప్పుడు మగాళ్లతో నువ్వు సరదాగా గడుపుతావా, సంతాన నిరోధం కోసం నీవు సర్జరీ చేసుకున్నావా? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. చివరి ప్రశ్ననయితే కనీసం నాలుగుసార్లు అడిగాడు' అని ఆమె సిఎన్ఎన్-ఐబీఎన్ చానెల్ విలేకరికి చెప్పింది.
పైగా, ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమెను పట్టుకుని తనతో కలిసి మూడోబిడ్డను కనాలనుందా అనడిగాడు. హాంకాంగ్‌కు ఒంటరిగా ఎందుకెళుతున్నావు. భర్తను కలవడానికేనా లేక ఇతర మగాళ్లతో సరదాగా గడపడానికా.. అని కూడా రెట్టించాడు. పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లే ఆమెలాంటి ఆడవారు వివాహేతర సంబంధాల కోసమే విదేశాలకు తరచుగా వెళుతుంటారని కూడా అతగాడు వ్యాఖ్యానించాడు.

చివరాఖరుగా.. 'నీ పర్సనల్ మొబైల్ నంబర్ ఇచ్చివెళ్లు.. నీ భర్త ఇంట్లో లేనప్పుడు నీకు కాల్ చేస్తాను' అని కూడా ఆ అధికారి అన్నాడు. ఇంత జరిగాక, ఆ మహిళ తన కుటుంబంతో కలిసి ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపింది. కానీ ఆ ఫిర్యాదుకు ఇంతవరకు అంటే 15 రోజుల తర్వాత కూడా సమాధానం కానీ, స్పందన కానీ లేదట.

ఆ వార్త సారాంశం ఇంతే.  ఒక్క మాట కూడా నేను కల్పించి చెప్పింది లేదు. firstpost.comలో మార్చి 27న వచ్చిన ఒక చిన్న వార్త ఇది. చాలా ఆలస్యంగా బయటపడిన ఘటన కావడంతో ఇది ఆ మహిళ వెర్షన్‌ని మాత్రమే చెప్పిన వార్తగా రూపొందింది. అవతలిపక్షం స్పందనను ఈ వార్తలో పొందుపర్చే అవకాశం కూడా లేదు.

అయితే ఈ వార్తకు కింద కామెంటు పెట్టిన వారి వ్యాఖ్యలు ఈరోజు నాకు మరింత జ్ఞానాన్ని ఇచ్చాయని మాత్రం అంగీకరించి తీరాలి. ఒక సమస్యను ఎన్ని కోణాల్లోంచి చూడాలో, ఒక ఘటన ఎన్ని డైమెన్షన్ల నుంచి చూడబడుతుందో.. మధ్యలో ఎన్ని వ్యంగ్యాలూ, ఎన్ని అపవ్యాఖ్యలూ, హేళనలూ పుట్టుకొస్తాయో కూడా అవి నేర్పాయి.

ఒక్కటి మాత్రం వాస్తవం. సంస్కృతి.. ఘనమైన నాగరికత. గత వైభవ దీప్తి వంటి పెద్ద పెద్ద మాటల జోలికి పోనవసరం లేదు కానీ, ఇంటిబయట తిరిగే, పనిచేసే, ప్రయాణం చేసే ఆడవారి పట్ల నూటికి 99 మంది మన దేశంలోని పురుష పుంగవుల్లో కొద్దో గొప్పో తేడాలతో సరిగ్గా ఆ ఇమ్మిగ్రేషన్ అధికారి ఆలోచనలే ఉంటాయనటంలో సందేహమెందుకు?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంజీ ఎంత రంజుగా ఇదే మాటలన్నాడో కదా బహిరంగ సభలో. 'పేదవర్గాలకు చెందిన మగవాళ్లు బతుకుకోసం వలస వెళితే ఇంట్లోని ఆడవాళ్లు ఏం చేస్తారో మీకు తెలుసుకదా' అనే ఆయన వెకసెక్కపు మాటలు టీవీ తెర నిండుగా వినడాన్ని, చూడటాన్ని మనం ఇంకా మర్చిపోలేదు.

మిగతా ప్రపంచం ఎక్కడయినా చావనీ... ఎలాగైనా ఉండనీ... భారతీయులుగా మనం ఇలాగే పుట్టాం, పెరిగాం. మునుపటి తరాలు, ఆ వెనుకటి తరాలు, రేపటి తరాలు కూడా మన జాతిలో సగం గురించి ఇలాగే భావిస్తూవచ్చాయి. భావిస్తున్నాయి. భావిస్తూ ఉంటాయి కూడా. ఈ నగ్న వాస్తవాన్ని మనం అంగీకరిస్తే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆవేశకావేషాలకు గురవ్వాల్సిన పని ఉండదు.

బయటివాడో, బయటిదో ఒకరన్నారనీ, వీడియోలు తీశారని బాధపడటం.. కించపడటం, పరువునష్టంగా ఫీలవడం, దేశభక్తిని కృత్రిమ రంగుల్లో కొత్తగా ప్రదర్శించడం వంటి భావోద్వోగాలకు మనం గురి కావలసిన అవసరమూ లేదు. మనం ఇలా ఉన్నాం అనే నిజాన్ని ఒప్పేసుకుంటే పోయె. మనవద్ద లేని, మనకు చేతకాని అనవసర భేషజాలకు పోవడం ఎందుకనేదే నా ప్రశ్న.

ఢిల్లీ విమానాశ్రయంలో ఈ వ్యవహారానికి మూలపురుషుడైన ఆ మగాధికారి ఫోటోను చూశాను. టై, ఇన్‌సర్ట్, షూస్ తగిలించుకోవడం తప్పితే మిగతా ఆపాదమస్తకం అతగాడు అచ్చంగా మనలాగే ఉన్నాడు. అమ్మయ్య.. అతడు దేవుడు మాత్రం కాదు.. మన వాడే.. మన మగాడే..

ఓపిక ఉంటే ఫస్ట్‌పోస్ట్.కామ్ లోని ఒరిజనల్ వార్త, దానిపై వ్యాఖ్యలు కూడా కింద చూడగలరు.

'Do you have fun with other men' Immigration officer crosses new line in sexual harassment

http://www.firstpost.com/living/do-you-have-fun-with-other-men-immigration-officer-crosses-new-line-in-sexual-harassment-2176963.html

కొసమెరుపు: 
" మీరు నర్సులు.. ఎండలో ధర్నా చేస్తే నల్లబడతారు. అవకాశాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పెళ్లికొడుకులూ దొరకరు"
ఇది ఈ రోజే అంటే ఏప్రిల్ 1న మన గోవా ముఖ్యమంత్రి గారు నర్సులకు  చేసిన పవిత్ర ప్రవచనం. ఈయన రాజ్యంలో నర్సులు తమ సమస్యలు పరిష్కారం కాలేదని వీధికెక్కారు. అంతే. ఈ చిన్న పాపమే వాళ్లు చేసింది. ఇక మీకు పెళ్లి కొడుకులు దొరకరనేంతవరకు పోయింది వ్యవహారం. తర్వాత ఆ మాటే తాననలేదని ఆయన వివరణ ఇచ్చి ఉండవచ్చు. కానీ కావాల్సింది 'మీరు అందంగా ఉండేవారు. ఇప్పుడు చూడండి.. నల్లబడిపోయారు' అనే మాటలతో సానుభూతి చూపడమా లేక  ఆ నర్సులను వీధులకెక్కకుండా సమస్యలు పరిష్కరించడమా...? ఇది గాల్లో కలిసిపోయింది.

మరొక మెరుపు...
తెల్లతోలు ఉంది కాబట్టే సోనియాకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కిందని కొంత సేపటి క్రితం జాతి వివక్షా వ్యాఖ్యలతో వాంతి చేసుకున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కాస్సేపట్లోనే క్షమాపణలతో బొక్కబోర్ల పడ్డాడు. ప్రమాదాన్ని గ్రహించిన సీనియర్ మంత్రి ఒకరు (మన వెంకయ్య గారేనా) క్లాస్ పీకడంతో ఈయన సర్దుకున్నాడని వార్తలు.

ఇప్పుడు చెప్పండి.. మనం ఇలా కాక మరోలా ఉంటామా? ఉండగలమా..? మన పరువు ఇలా కాక మరోలా ఎప్పుడయినా, ఏ కాలంలో అయినా ఉండి ఏడ్చిందా?


ఈ అంశంపై కొనసాగుతున్న చర్చను కింది కథనాల్లోనూ చూడవచ్చు. 

మరోసారి నేతల మకిలి!
http://www.sakshi.com/news/editorial/again-leaders-got-black-spot-with-controversial-comments-227177

రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
http://www.sakshi.com/news/opinion/why-government-target-roja-22654117 comments:

Anonymous said...

పల్లేల్లో పెరిగినవాడిని నన్నడగండి. "పేదవర్గాలకు" అనగా... -ఎందుకులెండి ఇంకో వివాదం- చెందిన ఆడాళ్ళు ఏంచేస్తారో తెలిసిన ఘనుడే అదే "పేదవర్గాలకు" చెందిన మగాళ్ళు ఎవరితో (నా ఉద్దేశ్యం "ధనికవర్గాలకు" చెందిన అని) కలుస్తారో చెబుతాను. కోస్తా జిల్లాల పల్లెల్లో ఒక గొప్ప సాంప్రదాయం ఉంది. ఒకానొక ధనికవర్గానికి చెందినవారిలో.... అదేమిటంటే.... భర్త ఇంటిలోకి ప్రవేశించేముందు వాకిలిదగ్గర చెప్పులు గమనించిగానీ ఇంటిలోకి ప్రవేశించడు. గాంధీగారు పల్లెలు భారతసంస్కృతికి వెన్నెముకవంటివి అన్నారు.

నా ఒకానొక సహోద్యోగి నిమ్నకులాలస్త్రీలతో తన తండ్రి రాసలీలల గురించి "గర్వం"తో చెప్పుకొన్నప్పుడు, నేను అదే నిమ్నకుల మగాళ్లతో మావూరి "ధనికవర్గ"పు ఆడాళ్ల రంకుని వివరించినందుకు ఆయన తెగబాధపడిపోయి, నాతో మాట్ళాడడం మానేసాడు.


స్త్రీలను గౌరవించినందుకుగానూ దేవతలతో పూజలందుకొనే దేశానికి కైమోడ్పులు!!!!

Anonymous said...

తెల్లతోలు ఉంది కాబట్టే సోనియాకు ..జాతి వివక్షా వ్యాఖ్యలతో
అందులో జాతి వివక్షత ఎమి ఉందో? మనదేశంలో తెల్లతోలు పిచ్చి చాలా ఉంది. నల్లగా ఉండేవారి సంఖ్య తమిళనాడు లో చాలా ఎక్కువ. వాళ్ళ సినేమాలలో ఒకప్పుడు తెలుగు, మలయాళ తెల్లటి అమ్మాయిలను హీరొయిన్ లుగా నటించేవారు. హీరోయిన్ ల చేత అంగాంగ ప్రదర్శన మొదలైన తరువాత బాంబే నుంచి దిగుమతి చేసుకొంట్టునారు. నార్త్ వాళ్ళు అదే ధరకు రెండితలు లాభం (తెల్లతోలు+అంగప్రదర్శన). వీళ్ళతో చూపించటంలో పోటి పడలేక సౌత్ వాళ్ళు మూలబడ్డారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ సినేమాలన్నిటిలో దాదాపు బాంబే వాళ్లే హీరోయిన్ లు. విదేశాలలో చిత్రికరించే పాటలలో సహితం వెనుక ఉండేవారు తెల్ల తోలు మహిళలు. మనదేశం లో ఫైర్ అండ్ లవ్లీ క్రీం లు పూసుకొని తెల్ల బడ్డవారు లేకపోయినా నిరాటంకంగా దశాబ్దాలుగా వాడు వేలకోట్ల వ్యాపారం చేస్తున్నాడు. దానికి తెల్ల పిచ్చి ఒకటే కారణం. ఇంత తెల్ల పిచ్చి మనకు పెట్టుకొని బిజెపి నేత నిజం మాట్లాడితే, ఆ వ్యాఖ్యను మీడీయా అతిగా వక్రీకరిస్తే విమర్శించటమా? మొన్న పార్లమెంట్లో శరద్ యాదవ్ అన్న మాటలేమిటి, కుమార్ విశ్వాస్ మలయాళి నర్సులను కాలి పీలి అన్న మాటల సంగతేమిటి? మన లొపాలు మనకు తెలుసు. మీడీయా చిన్న విషయాన్ని గోకి,గోకి పెద్దది చేస్తుంది. బిజెపి వ్యతిరేక మేధావులు బ్రహ్మాండ బద్దలు అయినట్లు ప్రచారం చేస్తారు.

Anonymous said...

భారత రాజకీయాలలో మహిళలు చాలా మంది తెల్లతోలువారే పాపులర్. ఆ మట కొస్తే ప్రపంచ రాజకీయాలలో కూడా ఇదే వర్తిస్తుంది. తమిళ మిత్రుడు ఒకడుండే వాడు, యం.జి.ఆర్., జయలలిత బంగారురంగులో ఉంటాడని పొంగిపోతాడు. ప్రజల మీద తెల్లా తోలు ప్రభావం ఎంతో ఉంట్టుంది.

కమనీయం said...


తెల్లతోలు పిచ్చి మనదేశంలో విస్తారంగా ఉంది అన్న విషయం తెలిసిందే.ఎవరో సామాన్యుడు అంటే వేరు.ఇక్కడ ప్రశ్న ఏమంటే ప్రభుత్వంలోగాని, ప్రజాజీవితంలోగాని ముఖ్య పాత్రవహిస్తున్న వ్యక్తి ( బీ.జె.పి.కానీండి మరో పార్టీ కాని ) అలా మాట్లాడవచ్చునా అనేది .

Anonymous said...

ఎమి రాజకీయ నాయకులు ఆకాశంలో నుంచి పేరాచుట్ లేసుకొని ఊడిపడ్డారా? వాళ్ళు సామాన్య మానవులే, ఈ దేశంలో నే పుట్టారు. ఈ ప్రజా జీవితంలో బాధ్యత వహించాల్సినదంతా బిజెపి పార్టివారే. ఈ నీతులు ఇతరపార్టిలకు వర్తించవు. అమేరికా అధ్యక్షుడు కూడా ఇలా మాట్లాడిన సంధర్భాలు ఉన్నాయి. ఆఫ్ ది రికార్డ్ మాటలను ప్రసారంచేసిన యన్.డి.టి.వి. చానల్ కి ఉన్న నైతికత ఎమిటి? భారతదేశానికి రేసిసిజానికి సంబంధం ఎమిటి? ఆ పదాలు వాడవలసిన అవసరం అంతకన్న ఎమిటి? విదేశి పే మాస్టర్లనుంచి ఇంగ్లిష్ మీడియా వాళ్ళు డబ్బులను దొబ్బి తినటం బాగా అలవాటై, మనదేశం పై దుష్ప్రచారం చేయటంలో ఇంగ్లిష్ మీడీయా అందులోను యన్.డి.టి.వి. ముందుంది. అందులో పనిచేసే యాంకర్ భర్ఖా దత్ అతి జుగుప్సాకరమైన చరిత్ర ఎవరికి తెలియదు. సంఘవిద్రోహక చానల్స్ ప్రచారం చేసే వార్తలను జనాలు వాళ్ళు ఎలా గుడ్డిగా నమ్ముతారో, మళ్ళి వాటిపైన చర్చనా?

Anonymous said...

రాజకీయనాయకులు ప్యారాచ్యూట్‌లతో ఊడిపపడనప్పుడు, మనమందరమూ రాజకీయనాయకుల అభిప్రాయాలతో అంగీకరిస్తున్నట్లుగా అభిప్రాయపడవచ్చా? అలా అభిప్రాయపడ్డాకకూడా మనం 'పవిత్రులం' అవుతామా? అప్రాచ్యులకనా మెరుగైనవారలం అవుతామా? ఒక వ్యక్తి (ఇక్కడ స్త్రీ) స్వాతంత్ర్యాన్ని గుర్తించడం ఒక ప్రాచ్యుడిగా నాకు ఎందుకు అసాధ్యమైనదిగా అనిపిస్తుంది?

Anonymous said...

అప్రాచ్యులకనా మెరుగైనవారలం అవుతామా?
మొదట అప్రాచ్యులు మెరుగైన వారని నీకెవరు చెప్పారు? ఎక్కడ చదివావో పోయి వారినడుగు. ఇక్కడ పవిత్రత, అపవిత్రత గురించి ఎవరు మాట్లడారు? ఒక వ్యక్తి కి గౌరమిచ్చేటప్పుడు అతని/ఆమే వ్యక్తిత్వం సబ్ కాన్షియస్ గా మనిషి మీద ప్రభావం చూపుతుంది. ఆయన విమర్శించిన ఆవిడ వ్యక్తిత్వం సంగతి దేశంలో చాలా మందికి తెలుసు. ఆమేమి సరోజిని నాయుడు కాదు కదా! అవమానం జరిగిందో అని గోల చేయటానికి. ఆమే గురించి ఒకవేళ నీకు తెలియకపోతే యుట్యుబ్ లో ఆమే పేరు సుబ్రమణ్యస్వామి పేరు వేసి సర్చ్ చేసు చూడు. చాలా వీడీయోలు ఉంటాయి. చూసి తెలుసుకో!మనమందరమూ రాజకీయనాయకుల అభిప్రాయాలతో అంగీకరిస్తున్నట్లుగా అభిప్రాయపడవచ్చా?
ఒకప్పుడు గాంధి,కామరాజ్ కాలంలో రాజకీయ నాయకుడిని అనుసరించేవారేమో గాని నేడు వారిని ప్రజలేమి అనుకరించటంలేదు. నువ్వే నాయకుడి అడుగుజాడలో నడుస్తున్నావో చెప్పు. పొలిటికల్ కరేక్ట్ ప్రశ్నలు వేసి, రాజకీయ నాయకులు తప్పుడు వారని నిరూపించి కొద్ది సేపు చర్చ చేయగలవేమోగాని, సమాజానికి ఒరిగేదేమి లేదు. మాటలను బట్టి కాదు మనుషులను అంచనావేయాలసింది చేసే పనులను బట్టి. దిగ్విజయ్ సింగ్ అతని ప్రియురాలిని ఇప్పటివరకు ఎందుకు పెళ్ళి చేసుకోలేదో, పోని ఎప్పుడు చేసుకొంటాడో చెప్పమను. కాంగ్రెస్ పార్టి నిండా ఇటువంటి వాళ్ళు లెక్క లేనంత మంది ఉన్నారు.వారిని మీడీయా కవర్ చేసిందా? వాళ్లు స్రీ లకిచ్చే గౌరవమేమిటి. బిజెపి నాయకుడు తడినోట పొడిమాట మాట్లాడితే వాడు మోడికి దగ్గరి వాడని చీల్చి చెండాడం.

Anonymous said...

ఒక వ్యక్తి (ఇక్కడ స్త్రీ) స్వాతంత్ర్యాన్ని గుర్తించడం ఒక ప్రాచ్యుడిగా నాకు ఎందుకు అసాధ్యమైనదిగా అనిపిస్తుంది?

మొన్న రోజ అసెంబ్లీలో ఎలా మాట్లాడింది. పార్లమెంట్ లో జయప్రద, ఇతర మహిళా నాయకులు ఎలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తారో తెలుసు. భారతదేశంలో జెండర్ వివక్షత నువ్వు చెప్పినట్లు ఉండి ఉంటే, దాని ప్రకారం మహిళలను అణచివేసిన సమాజం మనదైతే అలా మాట్లాడగలుగుతారా? జెండర్ వివక్షత ను పాటించే అరబ్బు దేశాలలో ఇలా మాట్లాడగలరా?
పోటి వున్న రంగంలో ఎవరు పని చేస్తూ ఉన్నా అక్కడ ఎవ్వరు జెండర్ ను పట్టించుకోరు. ఎదుటి వాళ్లని దెబ్బతీయటానికి తప్ప. ఇక్కడ జెండర్ ప్రస్థావన అనవసరం. జెండర్ గురించి మాట్లాడే స్రీవాదులంతా ఆర్ధికంగా, సామాజికంగా ఉన్నత వర్గాలకు చెందిన వారు. వారేమి వెనకబడి లేరు. కుటుంబం నుంచి ఆస్థి, భర్త డబ్బులు,ఉద్యోగం, హక్కులు అన్ని చేతిలోపెట్టుకొని ఆధిపత్యం చెలాయించేవారు. ఇటువంటి మహిళలు వెనకబడిపోయారని మీరేమి బాధపడకండి. చేతనైతే మీ పల్లేలో పూలమ్మే ఆమేకి, కూలి చేసుకొనే మహిళలకు సహాయం చేయాండి. వారి దగ్గర ఇవేమి లేవు.

Raja Sekhara Raju said...

నా టపా కొత్తగా ఆవేశకావేషాలను ప్రేరేపించినట్లు లేదు కదా. పార్టీలకు అతీతంగా స్త్రీల పట్ల మన రాజకీయ నేతల స్పందనలు, వ్యాఖ్యలు అవసరమైనంత స్థాయిలో సున్నతత్వాన్ని ప్రదర్శించడంలో పదే పదే విఫలమవుతున్నాయన్నదే. ప్రధానంగా ఈ టపా సారాంశం. ఆ అధికారి వ్యాఖ్యల కంటే దేశానికి దశా, దిశా ఇవ్వాల్సిన రాజకీయ నాయకత్వం స్త్రీల పట్ల అవగాహనకు సంబంధించిన వ్యవహారంలో ప్రవర్తిస్తున్న తీరు మరింత ప్రమాదకరంగా ఉందన్నదే. సంస్కృతి అనేది పై వర్గాల నుంచి కింది వర్గాలకు వ్యాపిస్తుందన్నది నిజమే అయితే.. జాతి నిర్మాణంలో నాయకత్వం విఫలమయినట్లే చెప్పాలి.
ఒక అంశంలో నేను మరింత సంయమనంతో ఉండాల్సింది. సోనియా గాంధీ రంగుపై కేంద్రమంత్రి 'వాంతి చేసుకున్నాడని' అనకుండా ఉండాల్సింది. ఆ పదం వాడనంత మాత్రాన ఆయన చేసిన తప్పు ప్రకటన తీవ్రత తగ్గదు. ఇది పార్టీలకు సంబంధించిన అంశమే కాదు. కానీ అధికారానికి రాకముందు కన్నా, అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల నుంచి పదే పదే వస్తున్న అపసవ్య వాఖ్యలు ఆ పార్టీని సెల్ఫ్ గోల్ లోకి నెట్టేస్తున్నాయి. రంగు గురించి మాట్లాడటం జాతి వివక్షత అవునో కాదో కానీ ఇప్పుడు ఇది దేశాల మధ్య సంబంధాలను కూడా ప్రభావితం చేసేంత స్థాయికి వెళ్లిపోయింది. మనం కోల్పోతున్నది ఇదే..

అపవాఖ్యల పట్ల మీడియా ఏ పార్టీనీ వదల్లేదనుకుంటాను.

ఈ టపాను ఇంత విస్తృతంగా చదివిన, వ్యాఖ్యానించిన అందరికీ ధన్యవాదాలు.

Anonymous said...

ఆఖరుకి సుబ్రహ్మణ్యస్వామి రాతలకు విలువివ్వాలన్నమాట!! ఆయన దిగజారుడు రాతలు నాకు డిటెక్టివ్ నవల్లకన్నా కామెడీగా అనిపిస్తాయ్. ఆయనమీదకూడా బోలెడుమంది నెట్‌లో బోలెడురాస్తున్నారు. మరి వాటిని నువ్వెందుకు చదవకూడదు? సోనియాని అత్యంత నీచంగా చిత్రీకరించడం ఒక ఉద్యమంలాగా నెట్‌లో జరుగుతుంది. నువ్వన్నట్లుగా అబ్బాయ్.... సరోజినీనాయుడు ఇప్పుడు బ్రతికే ఉంది, కాంగ్రెస్‌లో అధ్యక్షస్థానంలో ఉంటే, ఆవిడమీదకూడా సుబ్రహ్మణ్యస్వామి, మరియు నీలాంటి స్వామిభక్తులూ అవే చవకబారు అబధ్ధాలు రాసేవాళ్ళు. అప్పుడుకూడా నువ్వు నాకు వాటిని నెట్‌లో చదవమని చెప్పుడేవాడివి.

మనకు స్త్రీలను గౌరవించడం చాతకాదని నేను అనగలనా? వంటగదికీ, పడగ్గదికీ... మహా ఉంటే ఇంటికీ పరిమితమైపోయిన స్త్రీని మనం గౌరవించగలం. స్వంత అభిప్రాయాలున్నవాళ్ళతోనే మనకు సమస్యంతా.

నేను రాజకీయనాయకుల్ని అభిమానించే స్థాయిలోలేను.

Anonymous said...

స్వామివి చౌకబారు ఆరోపణలా! ఆయన మీద అభిప్రాయం భలే చెప్పావులే. మొన్నటివరకు తెలుగు రాజకీయ నాయకులంతా అధిష్టానం అంట్టూ భయభక్తులతో, సాష్టంగం చేసు, పాదాలు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకొని, ప్రపంచంలోని అత్యంత శక్తివంతురాలిని వొంట్టిచేత్తో ఢీకొన్నాడు.
ఎప్పుడైనా అమేరికలో హార్వర్డ్, ఇండియాలో ఉన్న ఐ.ఐ.టి., ఐ.ఐ.యం., ఐ.ఐ.యసి. పేరు విన్నావా? ఆ కేంపస్ లో అడుగుపెట్టావా? అక్కడ కెళ్ళి గాలి కబుర్లు చెపితే మొహాన నవ్వి పోతారు. దేశ విదేశాలలో పెద్ద విశ్వవిద్యా సంస్థలలో చదివే వారికి ఆయన పోరాటం గురించి ఎన్నో ఏళ్ళుగా చెపుతున్నాడు. స్వామి ప్రతి మీటీంగ్ కి ఆ విశ్వవిద్యాలయాలలో కిక్కిరిసి పోతాయి.అందులో నిజం ఉంది గనుకనే వారంత ఆయనకు అండగా నిలచారు. దయానిధి మారన్ ఆస్థి 740కోట్లు ఎవరి పోరాటం వలన జప్తు అయిందో, 2జి కేసులో జీరో లాస్ అని చెప్పిన ప్రభుత్వం పై ఎవరు పోరాటం చేసి కోర్టు లో అడ్డుకొంటే నేడు లక్ష కోట్ల పైన సొమ్ములు ప్రభుత్వానికి వచ్చాయో. అటువంటి స్వామి నీకు డిటేక్టివ్ లా కనిపిస్తాడా. తెలుగు సాహిత్యం చదివి వాదనకు వచ్చావనుకోలేదు.

మీలా బ్లాగులో కుచొని ఆదర్శలు వల్లే వేయటం ఇంకా చాలా మంది చేస్తున్నారు. సారంగ,విహంగా,ఈ మాట అనే వెబ్ సైట్లో పనిపాటలేని, గాలి కబుర్లు రాసివారు చాలా మంది ఉన్నారు. మీరు అక్కడకు పోయి ఆడవారికి జరిగే అన్యాయాలపై కథలు రాసి అవార్డ్ గెలుచుకోండి! భారతీయ సంస్కృతి, అణచివేత, పురుషాదిక్యతని అని నాలుగు పడికట్టు పదాలు నేర్చుకొని వ్యాసాలు రాస్తే ప్రత్యేక బోనస్ పాయింట్లు ఉంటాయి. ఓల్గా అనే ఆవిడ ఇందులో పి. చ్.డి చేసింది. ఆమే పుస్తకాలు నాలుగు చదివితే అవార్డ్ సాహిత్యం రాయటంలో పట్టు చిక్కుతుంది. All the best.

ధన్యవాదాలు

Anonymous said...

ఆయనమీదకూడా బోలెడుమంది నెట్‌లో బోలెడురాస్తున్నారు. మరి వాటిని నువ్వెందుకు చదవకూడదు?

పనిలేని మనసిక రోగులు రాస్తారు. బుర్రలేని వాళ్లు అటువంటి ఆరోపణలు చదువుతారు. వాటిని నిజమని నమ్ముతారు. స్వామి మీద ఆ అరోపణలు చేయటమేందుకు? కేసే పెట్టవచ్చు కదా! డి.యం.కె,జయలలిత పార్టి, కాంగ్రెస్ పార్టి నాయకులు టివి షోలలో నువ్విలా మాట్లాడుతున్నావు కేసు వేస్తాము.నోటిసులు పంపిస్తామని అంటారేగాని, ఇప్పటివరకు ఎందుకు చేయలేదాపని. ఇక స్వామి ఇతరులమీద చేసిన ఆరోపణలను సుప్రీం కోర్ట్ ఒప్పుకుంది. దటిజ్ స్వామి.

Anonymous said...

"అమేరికలో హార్వర్డ్, ఇండియాలో ఉన్న ఐ.ఐ.టి., ఐ.ఐ.యం., ఐ.ఐ.యసి."

అంటే నీదృధ్టిలో అవన్నీ పుడింగు సంస్థలన్నమాట. ఇప్పుడు చెబుతున్నాను వినుకో... నేను పుట్టింది ఫ్రాన్స్‌లో. చదివింది stuttgartలో.ల్ దానర్ధం నేను నీకన్నా ఉన్నతుణ్ణనా? (నెను అలా అనుకోవడంలేదు. just నువ్వు అలా అనుకుంటున్నావని చెప్పడానికి నా వివరాలు వెల్లడించాను).

"స్వామి ప్రతి మీటీంగ్ కి ఆ విశ్వవిద్యాలయాలలో కిక్కిరిసి పోతాయి.అందులో నిజం ఉంది గనుకనే వారంత ఆయనకు అండగా నిలచారు."

పుట్టపర్తిస్వామివారి భాగోతమంతా వీడియోల్లో చూసికూడా జనాలు ఆయన్ను ఒక అవతార పురుషుడని నమ్మారు. కోలా కృష్ణమోహన్ యూరో లాటరీని ప్రభుత్వాలే నమ్మాయి. Populus vult decipi (ergo decepeteur). అని లాటిన్‌లో ఒక సామెత ఉంది తెలుసుకొని తగలడు. ఎమతమంది నమ్మారు అన్నాదే ప్రమాణమైతే, కృషిబ్యాంకు అత్యుత్తమమైనదిగా వెలుగొందాలి. సారంగ రచయితలను విమర్శించే, వోల్గా పేరెత్తే class నీకుందనుకుంటే నువ్వు ఆకాశమ్మీద ఉమ్ముతున్నట్లే (తప్పుగా అర్ధంచేసుకోకు దోస్త్.... నువు చేసిన విమర్శలో ఉదాహరణలేదు కేవలం అభిప్రాయమే ఉంది). నేను వోల్గా గారితో పూర్తిగా ఏకీభవించను.

Je pense, donc je suis

Anonymous said...

ఇంతింటా అన్నమయ్య అన్న సినిమా ఎన్నిరోజులాడిందో నీకు తెలుసా? సన్నీ లియోనె సినిమా కనీసం యాభైరోజులాడుతుందని నేను writingలో ఇవ్వగలను. మిత్రమా. పాపులారిటీ ఆధారంగా నిజం ఇదీ అని ఒక అవగాహనకు రాలేం. APలో రోజూ తులసి తీర్ధం తాగేవారెందరున్నారో, బారులో C2H5OH(అనగా ఆల్కహాలు) తాగేవాళ్ళెందరో ఒక్కసారి తెల్సుసుకో.

Anonymous said...

ఓ మీరు పుట్టింది ఫ్రాన్సా ! అందుకేనెమో మీలో లవణంగారి (మన్మధుడి లో బ్రహ్మానందం పేరు)ఛాయలు కనిపిస్తున్నాయేమిటా అనుకొన్నాను :)

యు.పి.ఏ. వాళ్ళు లక్షల కోట్లు పప్పుబెల్లం లా పంచుకొనితినేస్తే,వాళ్లకి నాయకురాలు మహిళ కనుక ఆమేని గౌరవించాలి. అదే గదా మీరుచెప్పేది. ఒకసారిదేశంలో మహిళల దగ్గరికేళ్లి ఇదే మాటచెప్పండి. అమ్మా పాపం ఆమే పాలన కాలం లో ఒక నాలుగైదు లక్షల కోట్లు చిన్న చిన్న తప్పూల వలన జరిగాయి. అందువలన మనకి ధరలు పెరిగాయి, పిల్లలకి ఉద్యోగాలు రాలేదు. ఇవేమి పెద్ద విషయాలు కాదు కదా. ఆడకూతురు అంత పెద్ద పదవిలో ఉండటమే మన స్రీజాతికి గొప్పకదా! ఆమే పార్టి స్కాంలు చేసిందని విమర్శించకుడదుగదా అని చెపితే, వాస్తవాలు తెలిసిన తరువాత మహిళలు రోజాలా బూతులు తిడతారో లేక అంజలిదేవిలా జాలి పడతారో మీకే తెలుస్తుంది. పాత రోజులు కాదు జాలిపడటానికి.

స్వామి కి సాటి,పోటి ఎవరు లేరు. ఆయన వన్ మాన్ ఆర్మీ. ఆయన చెప్పేవి వాస్తవాలు. అది నేడు నిజంగా నిరూపించబడ్డాయి.దేశంలో అవినీతికి చిరునామ అయిన కాంగ్రెస్ పార్టి, తమిళనాడులోని ద్రవిడ అధికార,ప్రతిపక్ష పార్టిలు రెండు ఆయన దెబ్బకు కుదేలైనాయి. అదే ఆయన చేసిన పోరాటానికి దక్కిన ప్రతిఫలం. చెప్పినదానికి ప్రత్యక్ష ప్రమాణం. ఇంకా ఆయనని అనుమానించే వారున్నారంటే అటువంటి బధిరులని ఎమి చేయలేము. ఆయనచెప్పేవి అవాస్తవాలైతే కేసు పెట్టుకోవచ్చు గదా! దేశంలో ఒక్కరు కూడా ఎందుకు ముందుకు రాడు.
భౌతిక ప్రపంచంలో ఉన్నతమైనవి తప్పక ఉంటాయి. దేశంలో పేపర్లు ఎన్నో ఉన్నా హిందు పేపర్ కి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఎన్నో విశ్వ విద్యాలాయాలు ఉన్న పైన చెప్పినవి ఖచ్చితంగా ఉన్నతమైనవే. నువ్వు అవి గొప్పవి కాన్వు అని అనుకోనంత మాత్రాన ఒరిగేదేమి ఉండదు. అందరు ఐ.ఐ.టి లో చదవటానికి పోటిపడతారా లేక శ్రీకాళహస్తి, రాయచోటి లో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదవటానికి పోటిపడతారా?

Anonymous said...

పుట్టపర్తి బాబా ను ఎంతమంది విమర్శించినా ఆయన ఏనాడు విమర్శకులపై కక్ష కట్టింది లేదు.వాళ్లని నిందించింది అంతకన్నా లేదు. విమర్శకులే కక్ష కట్టి కనిపించిన అవకాశం వచ్చినపుడల్లా విమర్శించి హీరోల వలే ఫీలయ్యారు. ఆయన గ్లోరి దిన దినప్రవర్ధమానమైందే గాని తగ్గలేదు. ఏనుగు దారిలో పోటూంటే కుక్కలు శక్తి కొలది మొరుగుతునే ఉంటాయి. అంతకు మించి అవేమి చేయలేవు. వాటికా శక్తి లేదు. బాబా తాను ప్రపంచానికి ఎమిచేయాలనుకొన్నాడో అది చేసిపోయాడు.

మిత్రమా! ప్రముఖ కాపి పేస్ట్ రచయిత ఓల్గ గురించి ప్రస్థావించకుండ ఉండవల్సినది. పుస్తకాలు చదవకుండ అనవసరంగా విమర్శించను. ఆమే పేరు సోషల్ మీడీయాలో ఎక్కువగా వినిపిస్తూంటే, ఎమిరాసిందా అని మూడు పుస్తకాలు కొన్నాను. విముక్త, స్వేచ్చ,ఓల్గ ఆలోచనతరంగాలు. విముక్త మొదటి రెండు కథలు చదివి పక్కన పెట్టాను. స్వేచ్చ పుస్తకం ముగిసే లోపు తలనెప్పికి పది ఝండు బాములు ఖాళీ అయ్యాయి. ఆలోచన తరంగాలలో ఒక్కటి ఒరిజినల్ ఆలోచనలేదు. అన్ని నిరాధారణ ఆరోపణలే. ఏ పుస్తకంలో ను ఆమే ఆరోపణలకు సాక్షంగా డేటాను గాని, రెఫెరెన్స్ గాని ఇవ్వలేదు.యురోప్, అమెరికా మార్క్సిస్ట్,ఫెమినిస్ట్ రచయితల ఆలోచనలు తెలుగులో కి కస్టమైజేషన్ చేసి పుస్తకాలను రాసి కేరీర్ క్రియేట్ చేసుకొన్నారు. అంటే మన రాఘవేంద్ర రావు, బాలివుడ్ మహేష్ భట్ హాలివుడ్ సినేమాలని కాపి చేసి సినేమాలు తీసి సొమ్ముచేసుకొన్నట్లు.

మిత్రమా! ఆమే రాసిన కథల స్టొరి లైన్ సినేమావారికి చెపితే, మేలోడ్రామ అద్ది, స్రీల కష్టాలను ఇంకా బ్రహ్మాండంగా రాస్తారు. కె.బాలచందర్, దాసరోడి పాత సినేమాలు చూడు. వాటికి, ఈమే రాసిన కథలకు తేడా ఏముంది?

Anonymous said...

పాపులారిటీ ఆధారంగా నిజం ఇదీ అని ఒక అవగాహనకు రాలేం.
స్వామిని సుమారు ఐదారు సంవత్సరాలు గా ఫాలో అవుతున్నాను. అప్పట్లో ఆయనకి పాపులారిటి ఎమిలేదు. ఆయన పేరు ఎక్కడా వినిపించేదే కాదు. ఆయనని కనీసం టివిలో ఒక్క నిముషంకూడా చూపేవారు కాదు. పేపర్లో వార్తలు వచ్చేవి కాదు.2జి కేసులో లైసెన్సులు సుప్రీం కోర్ట్ రద్దు చేసిన తరువాత విధి లేక ఆయన గురించి చెప్పవలసిన అవసరం మీడీయాకు ఏర్పడింది. నిజం నిలకడమీద తెలుస్తుందనటానికి స్వామి పోరాటం ఒక ఉదాహరణ.

నేనేమి బారులో మందు తాగేవారు మంచి వారుకాదని అనలేదు. తులసి తీర్ధం, బారులో ఆల్కహాలు తాగే వారిద్దరు వాళ్ల ఆనందం కోసం ఆ పనులు చేస్తున్నరని నువ్వు తెలుసుకో!

Post a Comment