Wednesday, November 30, 2016

డబ్బులిచ్చే ఏటీఎం మారాజు ఎక్కడ?


భారత దేశంలో ఇప్పుడు పొకెమాన్ వీడియో గేమ్ అడి పోకెమాన్‌లను వెదికి పట్టుకునే ఆట చరిత్రలో కలిసిపోయినట్లుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారికి మరో గేమ్‌ను అవసరం కొద్దీ ఆడాల్సి వస్తోంది. అదేమిటంటే, నగరాల్లో, పట్టణాల్లో ఏ ఏటీఎమ్‌లో ఏ సమయంలో డబ్బు దొరుకుతోంది అనే సమాచారాన్ని జీపీఎస్ సహాయంతో తెలుపుతున్న వాల్‌నట్ వంటి యాప్ ‌లను గాలించడం వేలం వెర్రిగా మారింది. పగలు పూట భారతీయ నగరాల్లో దాదాపుగా ఏ ఏటీఎం కూడా పనిచేయడం లేదు. కానీ రాత్రిపూట మాత్రం బ్యాంకులు అరుదుగా నైనా ఏదో ఒక చోట పరిమిత మొత్తంలో ఏటీఎంలో డబ్బు పెట్టడం.. స్మార్ట్ ఫోన్ లో నిత్యం గాలిస్తున్న జనాలు ఫలానా స్థలంలో ఫలానా బ్యాంకుల ఎటీఎంలో డబ్బు పెట్టారని వాల్ నట్ యాప్ అలర్ట్ చేసిన వెంటనే ఆ ఏటీఎంకు వెళ్లడం.. రెండుగంటల్లోనే ఆ ఏటీఎం ఖాళీ కావడం రివాజుగా మారింది.

వాల్ నట్ యాప్ లో షార్ట్ క్యూ అని మెసేజ్ వచ్చిన వెంటనే పరుగెత్తి ఆ ఏటీఎం చేరుకున్నవారు అదృష్టవంతులు. లాంగ్ క్యూ అని మెసేజ్ చూపిన తర్వాత అక్కడికి వెళ్ళినవారికి డబ్బు అందవచ్చు. అందకపోవచ్చు కూడా. డబ్బు ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో కనబడే ఏటీఎం సింబల్ డబ్బు అయిపోగానే నీలం రంగులోకి మారటం వాల్ నట్ యాప్‌లో చూడగానే హతాశులై జనం వెనక్కు తిరగడం ఇప్పుడు మన నగర జీవిత విధానంలో భాగమైపోయింది. కొందరు లక్కీగా ఒక ఏటీఎంలోనే అలా డబ్బు దక్కించుకోవడం జరుగుతుండగా కొందరు అలాంటి నాలుగైదు ఎంటీఎంల వద్దకు వెళ్లి కూడా డబ్బు దక్కించుకోలేక వెనుదిరగడం.. ప్రపంచంలో ఏ దేశ  ప్రజలు కూడా రాత్రిపూట ఇలాంటి ఆటను ఇంతవరకు ఆడలేదనే చెప్పాలి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఏ స్థానిక వీధిలోని ఏటీఎంలో అలా డబ్బు పెట్టిన విషయం అక్కడి స్థానికులకు అసలు తెలియకపోవడం. వారంతా గాఢ నిద్రలో ఉంటున్న సమయంలో ఇలా కొన్ని దొంగ ఎటీఎంలు తెరుచుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ లో చూసిన బయటి జనాలు అక్కడికి పరుగెత్తి ఉన్న కాస్తా డబ్బు లాగేస్తున్నారు. ఇలా అర్ధరాత్రి, అపరాత్రి కొన్ని ఏటీఎంలను ఎందుకు తెరుస్తున్నారో.. బ్యాంకుల ఉద్దేశం ఏమిటో కూడా స్పష్టం కాదు. ఇంతకూ ఈ దేశానికి ఏమవుతోందో మరి.

ఈలోపున మన అభినవ పిచ్చి తుగ్లక్ రాజ్యంలో అవినీతి ఇంటిదొంగల్లోనే పేరుకుపోయిందని తాజాగా బయటపడింది. బ్యాంకు ఖాతాదారులకు కూడా గంటల కొద్దీ క్యూలలో నిల్చున్నా పరిమితమైన డబ్బు కూడా దొరకక అల్లాడిపోతున్నారు. కానీ మరోవైపున సాక్షాత్తూ బ్యాంకు మేనేజర్లు, పోస్టాపీసుల అధిపతులు, ఉద్యోగులు కూడబలుక్కుని మరీ కోట్లాది పాత నేట్లకు బదులు కొత్త నోట్లు బ్యాంకుల్లోనే మార్పిడి చేసి అందుకు 20 నుంచి 25 శాతం కమిషన్ తీసుకున్నారన్న వార్తలు సగటు మనిషిని రగిల్చి వేస్తున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. మన రూపాయి మీద నమ్మకం పోయింది. ఇప్పుడు బ్యాంకులమీద కూడా నమ్మకం పోగొట్టుకోవలసిన సమయం ఆసన్నమైనట్లుంది.

నవంబర్ 10-15 మధ్య బ్యాంకుకు ఒకరోజు నగదు మార్పిడికి వచ్చిన వారే వరుసగా మూడు రోజుల పాటు వచ్చి నగదు మార్చుకున్నట్లు ఆ బ్యాంక్‌ల నుంచి తెప్పించిన డాక్యుమెంట్ల ద్వారా స్పష్టమైంది. ఉదాహరణకు మొదటి రోజున రెండు వేల మంది నగదు మార్పిడి చేసుకుంటే వారిలో 1,000 మందికి సంబంధించిన ఐడీలను జిరాక్స్ తీసి, మళ్లీ వాటినే సమర్పించి బ్యాంక్ మేనేజర్లు నగదును విత్‌డ్రా చేశారు. నల్లకుబేరులు తెచ్చిన పాత నోట్లు తీసుకుని విత్‌డ్రా చేసిన ఈ కొత్త నగదును సమర్పించారు. ఇందుకుగాను నల్లకుబేరుల నుంచి సంబంధిత బ్యాంక్ సిబ్బందికి 20 నుంచి గరిష్టంగా 35 శాతం వరకు కమీషన్ లభించింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని వెయ్యికి పైగా వివిధ బ్యాంక్ శాఖల్లో నగదు మార్పిడి కుంభకోణం చోటు చేసుకుందని తాజా సమాచారం. ఖాతాదారులు నగదు మార్పిడి కోసం సమర్పించిన ఐడీ ప్రూఫ్ ‌లను మళ్లీ మళ్లీ వాడి బ్యాకు అధికారులు, సిబ్బంది ఇష్టం వచ్చినట్లుగా పాత నోట్లకు బదులు కొత్త నోట్లను బ్యాంకుల్లోనే మార్పిడి చేసి కమిషన్ పుచ్చుకున్నట్లు వస్తున్న వార్తలు దిగ్భ్రాంతిని కలిగించడం కాదు... అవినీతిపై యుద్ధం ఇలాగే ఉంటుందన్న నగ్నసత్యాన్ని కొత్త రీతిలో చెబుతున్నాయి. సాక్షాత్తూ రిజర్వ్ బ్యాకు అధికారుల హస్తం కూడా దీంట్లో ఉందని బయటపడటం మరీ ఘోరం.

నగదు మార్పిడికి వెళ్తే అందుకు సమర్పించే గుర్తింపు కార్డు పత్రం ఏదైనా దాని జిరాక్స్‌పై  సంతకం ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. అదే సంతకంతో కూడిన జిరాక్స్ పత్రం ఇస్తే బ్యాంక్‌లు తిరస్కరించాలి. వారికి నగదు మార్పిడి చేయకూడదు. కానీ దేశవ్యాప్తంగా జరిగినట్టే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అక్రమ తతంగం చోటు చేసుకుంది. మొదటి మూడు రోజులు వచ్చిన గుర్తింపు కార్డులనే జిరాక్స్ తీసి కొందరు బ్రాంచ్ మేనేజర్లు కొత్త రూ.2 వేల నోట్లు, రూ.100 నోట్లను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్న అంశం ఆర్బీఐ దృష్టికి, సీబీఐ దృష్టికి వెళ్లింది. ఈ భారీ స్కామ్ వివరాలు అన్నీ బయటపడాలంటే కనీసం 3 నెలలు పడుతుందని అంచనా. వీళ్లకెవరికీ ఏ శిక్షలూ పడవన్నది మరొక విషయం అనుకోండి.

దేశభక్తులు, వారి తైనాతీలు, మోదీ భక్తులకు అర్థం కాని విషయం ఇదే. మాఫియా ఎక్కడో లేదు రిజర్వ్ బ్యాంకులోనే, దేశంలోని ప్రధాన బ్యాంకులలోనే, దాగి ఉందనేది ఇప్పటికే స్పష్టమైనా వీరు కళ్లు తెరవరు. నిద్రలేచింది మొదలు పడుకునే దాకా మోదీ జపమే. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ, దాని లుచ్ఛా యాజమాన్యం చేస్తున్న నిర్వాకం ఎప్పుడూ ఇలాగే ఉందన్న సత్యాన్ని వీరు గమనించరు. బ్యాంకర్లకు, రాజకీయ నేతలకు ఉన్న అవినీతి బంధం ఎన్ని అక్రమాలనైనా పెంచి పోషిస్తున్నదన్నది జగమెరిగిన సత్యం. వందకోట్లమందికి తమ కష్టార్జితం చేతిలోకి రాకుండా పోయిన దుర్భర పరిస్థితి రాజ్యమేలుతున్నచోటే లక్షలకు లక్షల రూపాయలు ఇలా అక్రమార్గంలో వక్రమార్గంలో పోతున్న ఘటనలు నిత్యవార్తలవుతున్నాయి. పెట్టుబడి విశ్వరూపానికి ఇవన్నీ నిదర్శనాలే.

బ్యాకుల్లో డబ్బులు ఖాతాదారులకు అందుబాటులో లేకపోవడానికి, దొడ్డి మార్గంలో బ్యాంకుల నుంచే డబ్బు అపమార్గం పడుతుండడానికి అవినాభావ సంబంధం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కింది లింకును చూడండి.

బ్యాంకు మేనేజర్లపై సీబీ'ఐ'

సోవియట్ యూనియన్ మరి కొద్ది నెలల్లో రద్దవడానికి ముందు 1991లో ఆ దేశాధ్యక్షుడు గొర్బాచెవ్ ఇలాగే పెద్ద రూబుల్స్ ని రద్దు చేస్తే మూడు రోజుల్లో జనం తమ వద్ద ఉన్న పాత రూబుల్స్‌ని బ్యాంకులలో డిపాజిట్ చేశారు. సరిగ్గా మూడు  రోజుల్లోనే అక్కడి బ్యాంకులు కొత్త రూబుల్ నోట్లను బ్యాంకులలో చలామణికి అందుబాటులోకి తెచ్చాయి. ఎవరికీ ఏ ఇబ్బంది కలుగలేదు. 25 ఏళ్ల క్రిత జరిగిన ఈ అవినీతిపై యుద్ధ చర్యలు కూడా సత్ఫలితాలను ఇవ్వలేదని, పాత నోట్లు, లేదా నల్లధనం రద్దు ద్వారా అవినీతి సమసిపోదని  చరిత్ర నిరూపించింది.
అలాగే 1987లో బర్మా సైనిక జుంటా పార్టీ చైర్మన్ నల్లధనంపై యుద్ధం పేరుతో పెద్ద నోట్లను రద్దు చేస్తే, బర్మా నగరాల్లో రేగిన ఆహార అలజడిని అణిచే క్రమంలో సైన్యం దాదాపు 10 వేలమందిని కాల్చిచంపింది. నగదు చెల్లింపులకు దూరమైన బర్మా రైతులు వస్తుమారకపు పద్ధతిలో తమ వద్ద ఉన్న ఆహార ధాన్యాలను తమకు అవసరమైన వస్తువుల కోసం మారకం చేసి ఉన్న ధాన్యాలను మొత్తంగా మార్పిడి చేసుకోవడంతో నగరాలకు ఆహార ధాన్యాల సరఫరా మొత్తంగా నిలిచిపోయి ఆకలి దాడులు చెలరేగిన నేపథ్యంలో అంతమందిని సైన్యం కాల్చి చంపినా తమ అధ్యక్షుడి పదవిని కాపాడలేకపోయాయి. బర్మా పెద్దనోట్ల రద్దు అవమానకరమైన రీతిలో ఘోర పరాజయం మిగల్చడంతో సంస్కర్తగా పేరుగాంచిన సైనిక జుంటా పార్టీ చైర్మన్ తన పదవికి  రాజీనామా చేసి తప్పుకోవలసి వచ్చిందని తెలుస్తోంది.. పైగా సంస్కర్త హృదయం కలిగిన ఇతడు రెండు సార్లు నోట్ల రద్దు చేస్తే రెండుసార్లూ పరాభవమే మిగిలిందట.

బర్మాలో పెద్ద నోట్లను రద్దు చేస్తే ఏమైంది?

Sunday, November 27, 2016

ప్రజలపై యుద్ధ ప్రకటన పెద్ద నోట్ల రద్దు


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు దేశీయ కరెన్సీపై భారతీయులు శతాబ్దాలుగా పెట్టుకుంటూ వచ్చిన విశ్వాసాన్ని పటాపంచలు చేసిపారేసిందా? నోట్లమార్పిడి అనే పెద్దపులిపై మోదీ స్వారీ చేస్తున్నారా? తాననుకున్నది చేయడం తప్ప ఏ ఒక్క విలువనూ, రాజ్యాంగ సంప్రదాయాలను పాటించని మోదీ.. పెద్ద నోట్ల రద్దుద్వారా భారత ప్రజలపై యుద్ధప్రకటనను చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు అవుననే సమాధానమిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది యావత్ప్రపంచంలో శాంతికాలంలో కనీవినీ ఎరిగి ఉండని ఘటన అనీ, ఏ నియంతా సొంత ప్రజలను ఈ విధంగా సవాలు చేసిన చరిత్ర ఇంతవరకూ లేదని (పిచ్చి తుగ్లక్ అనే మధ్యయుగ చక్రవర్తి దీనికి మినహాయింపుగా చెప్పవచ్చేమో) పుల్లారావుగారంటున్నారు. సగటు మనిషి భారతీయ రూపాయిపై ఇక ఎన్నటికీ విశ్వాసం ఉంచడనీ. వందల ఏళ్లుగా ఉనికిలో ఉన్న రూపాయిని. మోదీ చిత్తుకాగితంలా మార్చేశారనీ,  మోదీ కానీ మరెవరైనా సరే తమ డబ్బును ఉన్నఫళాన విలువలేనిదిగా మార్చివేస్తారని జనంకు తెలిసివచ్చిందనీ, ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించగలదని అర్థమైందనీ, ప్రపంచ వ్యాప్తంగా భారతీయ రూపాయి పరువు దిగజారిపోయిందనీ ఈయన స్పష్టం చేస్తున్నారు.

1812లో నాటి రష్యాపై అనాలోచిత యుద్ధం ప్రకటించి ఘోరంగా దెబ్బతిన్న నెపోలియన్ చక్రవర్తి కానీ, సోవియట్ యూనియన్‌పై శాంతి సంధి చేసుకుని కూడా 1941లో ఆ దేశంపై ఆకస్మిక దురాక్రమణ దాడి ప్రారంభించి, రెండో ప్రపంచ యుద్ధంలో అనూహ్య ఓటమికి గురైన అడాల్ఫ్ హిట్లర్ కానీ.. ఎందుకు తమను తాము ధ్వంసం చేసుకుని, సర్వస్వం కోల్పోయారన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారని ఈయన అంటున్నారు. తెలివైన, శక్తిమంతులైన మనుషులు తమకు తాముగా తప్ప తమ శత్రువులద్వారా ఎన్నడూ ఓటమికి గురికారని పై రెండు ఘటనల బట్టి ఎవరైనా అంచనా వేయవచ్చునని కూడా ముక్తాయిస్తున్నారు.

గత రెండేళ్లుగా రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు సాక్షిలో వ్యాసాలు రాస్తున్నారు. కాంగ్రెస్ అవినీతి పాలనతో మోదీ పాలనను పోలుస్తూ చాలా వ్యాసాలలో మోదీ నిర్ణయాలను ఆయన సమర్థిస్తూ వచ్చారు. కానీ 130 కోట్లమంది భారతీయులను ఒక్కసారిగా రోడ్లపైకిలాగి బ్యాంకులముందు సాగిలపడేటట్లు చేసిన పెద్దనోట్లరద్దు విషయంలో మోదీ ప్రభుత్వం, బీజేపీ నేతల అహంభావ వైఖరిని, తలపొగరు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మోదీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక విమర్శతో ఆయన పాఠకుల ముందుకొచ్చారు. నవంబర్ 26న సాక్షి పత్రికలో వచ్చిన ఆయన వ్యాసం 'నోట్లమార్పిడి పులిపై మోదీ స్వారీ' పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవచ్చు.

                           *****************

నవంబర్‌ 9, 2016... భారతీయపౌరులు ఒక్కసారిగా తమ వద్ద ఎలాంటి డబ్బూలేదని, డబ్బుకోసం బ్యాంకులకు వెళ్లలేమని గ్రహించిన రోజు. తమ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక చర్య వంద కోట్లమందికి పైగా ప్రజలను శక్తిహీనులుగా, దుర్బలురుగా దిగజార్చిన రోజు. యావత్ప్రపంచంలో శాంతికాలంలో కనీవినీ ఎరిగి ఉండని ఘటన ఇది. ఏ నియంతా  ప్రజలను ఈ విధంగా సవాలు చేసిన చరిత్ర ఇంతవరకూ లేదు 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ప్రజలు సాధారణ జీవన కార్యకలాపాలను కొనసాగించారు. 2016 నవంబర్‌ 8న రూ. 1000, రూ, 500 నోట్లను రద్దు చేసినట్లుగా ప్రధాని నరేంద్రమోదీ నాటకీయంగా ప్రకటించారు. ఇది నల్లధనాన్ని అడ్డుకుంటుందని, దొంగనోట్లను తొలగిస్తుందని, పాకిస్తాన్‌ నుంచి వచ్చే ఉగ్రవాదులకు నిధుల వెల్లువను నిలిపివేస్తుందని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇవి చాలా గొప్ప లక్ష్యాలు. వెనువెంటనే రాజకీయ పార్టీలు చాలావరకు మోదీ చర్యను సమర్థించారు. ప్రజలు తమను ఎక్కడ అవినీతిపరులుగా భావిస్తారేమో అనే భయంతో ఏ రాజకీయ నేతా నోట్ల మార్పిడి అనేది చెడ్డది అని చెప్పడానికి సిద్ధపడలేదు. దాదాపు 130 కోట్లమంది ప్రజలు నివసిస్తున్న దేశంలో 86 శాతం కరెన్సీ నోట్లను ఉన్నఫళాన ఉపసంహరించినటువంటి నాటకీయ మార్పును భారత్‌ మునుపెన్నడూ చూడలేదు.

పెద్ద నోట్ల రద్దు చర్య గొప్ప విజయం కలిగిస్తుందని మోదీ బలంగా విశ్వసించారు కనుకే ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీని ఈ ప్రకటన చేయడానికి అస్సలు అనుమతించలేదు. మొత్తం పేరు తనకే దగ్గాలని మోదీ కోరుకున్నారు.

ఫ్రాన్స్‌ చరిత్రలోనే అతి శక్తిమంతుడైన చక్రవర్తిగా పేరొందిన నెపోలియన్‌ 1812లో ఉన్నట్లుండి రష్యాపై ఆగ్రహించాడు. ఇంగ్లండ్‌కు సంబంధించిన సమస్యల్లో రష్యా తనతో కలిసి రావడం లేదన్న ఆగ్రహంతో నెపోలియన్‌ 1812 జూన్‌లో రష్యాపై యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో నెపోలియన్‌ ఓడిపోవడమే కాకుండా ఫ్రాన్స్‌ నుంచి శాశ్వతంగా దూరమయ్యాడు. ఆ ఓటమి సంభవించి 200 ఏళ్ల అనంతరం కూడా ఫ్రాన్స్‌తో ఎలాంటి భౌగోళిక సరిహద్దులూ లేని రష్యాతో అనాలోచిత యుద్ధం ద్వారా నెపోలియన్‌ అంతటి తెలివైన వ్యక్తి తన్ను తాను ఎందుకు ధ్వంసం చేసుకున్నాడని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.

అలాగే బ్రిటన్‌ను, యూరప్‌ను దాదాపుగా ఓడిస్తున్నట్లు కనిపించిన హిట్లర్‌ అప్పటికే తాను శాంతి ఒప్పందం కుదుర్చుకున్న రష్యాపై దాడి చేయాలని ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాడు. రష్యాపై దాడి ద్వారా హిట్లర్‌ రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయాడు. రష్యాపై దాడి చేసి హిట్లర్‌ ఎందుకు సర్వస్వం కోల్పోయాడన్నది నాటినుంచి నేటివరకూ ఎవరికీ అంతుబట్టడం లేదు.

తెలివైన, శక్తిమంతులైన మనుషులు తమకు తాముగా తప్ప తమ శత్రువులద్వారా ఎన్నడూ ఓటమికి గురికారని పై రెండు ఘటనల బట్టి ఎవరైనా అంచనా వేయవచ్చు. మోదీ తన్ను తాను ధ్వంసం చేసుకుంటున్నారా అని ఇప్పుడిప్పుడే నిర్ణయించడం కష్టం. దానికి 2019 వరకు చాలా సమయమే ఉంది. కానీ మోదీ సృష్టించిన ఈ పెద్దనోట్ల రద్దు మోదీకే తీవ్ర ఇక్కట్లను సృష్టించిపెట్టింది. మోదీ తనకుతానుగా దీన్ని కొనితెచ్చుకున్నారు. ఏ రాజకీయనేతా మోదీకి సమస్యలన్ని సృష్టించలేదు. మోదీ పులిమీదికి ఎగిరి దుమికారు కానీ దాన్ని స్వారీ చేయలేకున్నారు. తాను స్వారీ చేయాలి లేదా పులి తననే కబళిస్తుంది.

పెద్ద నోట్ల రద్దు వెనుక ఉన్న నిజాలేమిటో సాధారణ పరిశీలన ద్వారా చూద్దాం.

1. గత 200 ఏళ్లలో ఏ ప్రముఖ దేశమూ ప్రస్తుతం భారత్‌లోలాగా నోట్ల మార్పిడిని లేదా పెద్ద నోట్ల రద్దును చేసి ఉండలేదు. అమెరికా, బ్రిటన్‌ లేదా మరే ఇతర అభివృద్ధి చెందిన దేశం కూడా ఇలాంటి చర్యను చేయలేదు. యుద్ధకాలంలో నోట్ల మార్పిడి కొంత మేర జరిగి ఉండవచ్చు కాని శాంతి కాలంలో ఎన్నడూ జరగలేదు. అంటే ఇతర దేశాలకు, వారి ఘనమైన ఆర్థిక వేత్తలకు బుర్ర లేనట్లా? ఈరోజు ప్రపంచంలో అత్యంత అధికంగా నకిలీ నోట్లు ఉన్న ద్రవ్యం డాలర్‌. ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాక్‌.. ఎక్కడైనా ఉగ్రవాదులు అమెరికా డాలర్లతోనే వ్యవహిస్తుంటారు. దక్షణ అమెరికా మాదకద్రవ్య మాఫియాలు మొత్తంగా వందలకోట్ల డాలర్లను కలిగి ఉంటున్నారు. డాలర్‌ను రద్దు చేయడం ద్వారా అమెరికా వారిని దెబ్బతీయవచ్చు. కాని అది ప్రమాదకరమే కాని పరిష్కారం కాదు కాబట్టి అమెరికా అందుకు పూనుకోలేదు. డాలర్‌పై విశ్వాసం అత్యున్నత జాతీయ ప్రయోజనం కలిగినట్టిదని అమెరికాకు తెలుసు.

2. ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న ఇలాంటి నోట్ల మార్పిడిని చరిత్రలో ఏ ఆర్థికవేత్తా సూచించలేదు. మీ బట్టలను మార్పు చేస్తే మీ వ్యాధి తొలగిపోతుందని చెప్పడంలాంటిదే నోట్ల మార్పిడి,. మీ శరీరంలో ప్రాథమికంగా ఏదో తప్పు ఉండబట్టే మీరు రోగగ్రస్తులవుతుంటారు తప్పితే బట్టలు మార్చినందుకు కాదు. నోట్ల మార్పిడి వ్యాధికి ఏ రకంగానూ చికిత్స కాదు. ఇంతకుముందు నల్లధనాన్ని రూ.1,000ల్లో దాచేవారు. ఇప్పుడు రూ.2,000లలో దాచి ఉంచుతారు.వ్యాధికి  చికిత్స చేయండి . అంతే కాని, మీ బట్టలను మార్చవద్దు.

3. పెద్ద నోట్ల రద్దు ద్వారా పాకిస్తాన్‌ ఇకపై భారత్‌కు నకిలీ నోట్లు పంపలేదని మోదీ చెప్పారు. భారత్‌ కొత్త నోట్లను జారీ చేసినంత మాత్రాన, నకిలీ నోట్లను తయారు చేయకుండా పాకిస్తాన్‌ను అడ్డుకోలేం. అణుబాంబులు చేయగలిగిన పాక్‌ ఎలాంటి నకిలీ నోట్లనయినా చేయగలదు. కాబట్టి నకిలీ నోట్లు రాకుండా ఆపలేము.

4. పాకిస్తాన్‌నుంచి నకిలీ నోట్లను పొందుతున్న భారత్‌లోని ఉగ్రవాదుల ఆటకట్టయిందని మోదీ అన్నారు. ఇది కూడా తప్పే. భారత్‌లో ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయడానికి మన శత్రువులు భారీ మొత్తంలో ఖర్చుపెట్టడం లేదు. చిన్న మొత్తాలను వారు ఎప్పటికీ పంపుతూనే ఉంటారు, పాకిస్తాన్‌ చర్యలను నోట్ల మార్పిడి ఏరకంగానూ ఆపలేదు. యుద్ధాన్ని నోట్లమార్పిడి అరికట్టలేదు.

5. పెద్ద నోట్ల రద్దు ద్వారా సంపన్న భారతీయులే నష్టపోయి, పేదలు లాభపడతారని మోదీ వ్యాఖ్య. కాని భారతీయ జనాభాలో 40 శాతం మంది మధ్యతరగతి ప్రజలేనని మోదీ మర్చిపోయినట్లుంది. మధ్యతరగతి ప్రజలు చాలావరకు నగదు రూపంలోనే డబ్బును భద్రపర్చుకుంటారు. ఇప్పుడు వీరి బాధ తక్కువగా లేదు. వీరుకూడా మోదీని ఎన్నటికీ క్షమించరు. పన్నుపరిధికి అవతల ఉన్న మధ్యతరగతి ప్రజల డబ్బును పన్ను క్షమాభిక్ష పథకంలోకి తీసుకురాకుండా ప్రభుత్వం నిర్దయగా వ్యవహరించి 130 కోట్ల మందిని ఇక్కట్లకు గురి చేసింది. సంపన్నులు కూడా తమ వద్ద నల్లధనాన్ని తమ పరుపుల కిందో, తోటల కిందో దాయరు. దాన్ని వడ్డీలు, సినిమాలు, రియల్‌ ఎస్టేట్, విదేశీ ద్రవ్యం, భూమి కొనుగోలు వంటివాటిపై మదుపుచేస్తారు. పెద్దనోట్ల రద్దుతో నల్లధనం హుష్‌కాకీ అయిపోతుందని భావించేవారు ఆర్థికసూత్రాలను విస్మరిస్తున్నట్లే లెక్క.

6. సంపన్నులు ఇకపై నిద్రపోరని మోదీ అంటున్నారు. కానీ ఐఏఎస్‌ అధికారి, రాజకీయనేత, సినీ నటుడు లేక అవినీతిపరులు ఎవ్వరూ బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడిన పాపాన పోలేదు.ఈ అంశంపై మోదీ చేస్తున్న రాజకీయ ప్రకటనలు తనకు, బీజేపీకి తీవ్ర నష్టం కలిగించనున్నాయి. ప్రజల బాధల పట్ల నమ్రతను ప్రదర్శించడానికి బదులు, అహంకారపు ప్రకటనలు చేయడం నష్టదాయకమని బీజేపీ వ్యాఖ్యాతలు గుర్తించాలి. 1975లో ఎమర్జెన్సీ విధించాక ఇందిరాగాంధీ, ఆమె మంత్రివర్గ సహచరులు అది దేశానికి మంచిదన్నారు, ఎమర్జెన్సీని వ్యతిరేకించే ఎవరయినా సరే దేశద్రోహులే అనేశారు. తీరా ఎన్నికల సమయంలో ఏం జరిగిందే అందరికీ తెలుసు.

7. కార్మికులు, రైతులు, దినసరి కూలీలు, రిక్షాలాగేవాళ్లు, టాక్సీ, ఆటో డ్రైవర్లు, హోటల్‌ కార్మికులు, వితంతువులు, మధ్యతరగతి ప్రజలు, బ్యాంకులకు వెలుపల కొద్ది మేరకు డబ్బు దాచుకునేవారు ఈ నోట్ల మార్పిడితో తీవ్రంగా దెబ్బతింటున్నారు. తమ పిల్లలకు కూడా ఇవ్వకుండా చాలామంది వృద్ధులు నగదును తమ వద్ద ఉంచుకుంటున్నారు. ఇలాంటి వారు సైతం మోదీ తమను బాధపెడుతూ, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని భావిస్తున్నారు.

8. బ్యాంకుల వద్ద భారీ స్థాయిలో డిపాజిట్లు సమకూరాయి కాబట్టి వాటిని అవి మదుపు చేస్తాయని మోదీ భావన. ప్రపంచంలోనే అత్యధిక మదుపుల రేటు గల దేశం భారత్‌. భారతీయులు తమకోసం పొదుపు చేసుకుంటారు. బ్యాంకులు కనుక భారీ డిపాజిట్లను పొందితే, వాటిని బడా వ్యాపారులకు ఇస్తాయి. బ్యాంకులు లక్షల కోట్ల మొండిబకాయిలను కలిగి ఉన్నట్లు అందరికీ తెలుసు. ఈ భారీ డిపాజిట్లు విజయ్‌మాల్యా వంటి సంపన్నుల జేబుల్లోకే వెళతాయని మోదీ గుర్తుంచుకోవాలి.

పెద్దనోట్ల రద్దు ఫలితాలు
పెద్దనోట్ల రద్దు విషయంలో మోదీ వైఖరి సరైందేనా లేక ఆ చర్యతో యావద్దేశానికే విపత్తు సృష్టించారా అనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుంది. కాని ఈ నోట్ల రద్దు వల్ల జరగనున్న సత్వర పరిణామాలు ఏవి?

1. సగటు మనిషి భారతీయ రూపాయిపై ఇక ఎన్నటికీ విశ్వాసం ఉంచడు. రూపాయి వందల ఏళ్లుగా ఉనికిలో ఉంది. మోదీ దాన్ని చిత్తుకాగితంలా మార్చేశారు. అమెరికన్‌ డాలర్‌ కంటే ముందు కాలం నుంచే రూపాయి ఉనికిలో ఉంది. మోదీ కానీ మరెవరైనా సరే తమ డబ్బును విలువలేనిదిగా మార్చివేస్తారని జనంకు తెలిసివచ్చింది. ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరించగలదని అర్థమైంది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ రూపాయి పరువు దిగజారిపోయింది.

2. నవంబర్‌ 9, 2016 నుంచి దేశంలోని ప్రతి వర్గ ప్రజల బాధలు వర్ణనాతీతం. కన్నీళ్లు, ప్రాధేయపడటం, అభ్యర్థించడం ఏవీ సహాయం చేయటం లేదు. డబ్బు పొందడానికి కోట్లాది భారతీయుల రోజూ క్యూలలో నిలుచుంటున్నారు. ప్రతి రోజూ వీరి పరిస్థితి నరకమే. బ్యాంకులలో ఉన్న వారి సొంత డబ్బును ప్రభుత్వం సున్నా చేసిపారేసింది.

3. ఇక రైతులు, గ్రామీణ ప్రజల బాధలు చెప్పనలవి కాదు. నగరాల్లోని ప్రజలు బ్యాంకులలో డబ్బులు ఉంచుకుంటారు. గ్రామాల్లో నగదు రూపంలోనే డబ్బులు దాచుకుంటారు. భారతీయులు తమ డబ్బులను కూడా బ్యాంకులలోంచి తీసుకోలేకపోతున్నారంటే ప్రజాస్వామ్యం లేనట్లే లెక్క. చరిత్రలో ఏ రాజూ, ఏ నియంతా ఇలాంటి చర్యకు పాల్పడలేదు.

4. డబ్బు, పని లేకుండా కోట్లమంది బాధపడుతున్నారు. డబ్బు లేదు కాబట్టి ఉద్యోగం, ఉపాధి లేదు. కోట్లాదిమంది పనికి దూరమయ్యారు. కూలీలు వృథాగా కూర్చున్నారు. కష్టించే ప్రతి వ్యక్తి ఇప్పుడు పనిలేని బిక్షగాడైపోయాడు. నడినెత్తిమీద అణుబాంబు పేలి జీవితం అంతమైనట్లుగా ఉంది. ఇక బయటి ప్రపంచానికి తెలియకుండా ఉన్న ప్రజల బాధలు చెప్పనవసరం లేదు. కాని 130 కోట్లమంది ప్రజల్లో ప్రతి ఒక్కరూ మోదీ చర్యద్వారా దెబ్బతిన్నారు.

మోదీ ఎందుకిలా చేశారు?
మోదీ హయాం సగం పూర్తయింది. ఏదో ఒక పెద్ద చర్య చేపట్టాలన్నది మోదీ వాంఛ. తాను వాగ్దానం చేసినట్లుగా విదేశాల నుంచి నల్లధనం తీసుకురాలేకపోయాడని విమర్శలు ఉన్నాయి. కానీ తాను సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలడని నిరూపించుకోవాలని మోదీ భావించినట్లుంది. బలమైన నేతలనే ప్రజలు ఆరాధిస్తారని మోదీ భ్రమిస్తున్నారు. పాకిస్తాన్‌పై సర్జికల్‌ దాడుల తర్వాత మోదీ ఇమేజ్‌ అమితాబ్‌ బచ్చన్‌ అంత స్థాయికి ఎదిగిపోయింది.

అంతకుమించి కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారుతోపాటు మోదీ చుట్టూ పదవీవిరమణ చేసిన అధికారులే ఎక్కువగా ఉన్నారు. అత్యత బలహీనుడైన ఊర్జిత్‌ పటేల్‌ను మోదీ కోరి ఆర్బీఐ గవర్నరుగా ఎంచుకున్నారు. ఇక ఆర్థిక శాఖలోని ఐఏఎస్‌లు ఏ ప్రధానమంత్రికైనా సరే జీహుజూర్‌ అనేవాళ్లే. మోదీ మంత్రివర్గంలోనే ఏ మంత్రి కానీ, ఎంపీ కాని మోదీ చేస్తున్నది తప్పు అని చెప్పే స్థితిలో లేరు. నోట్ల మార్పిడి నిర్ణయం విషయంలో ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీనే సంప్రదించలేదన్నది తెలిసిందే.. నేత చుట్టూ చెంచాలు, భజనపరులు ఉన్నప్పుడు రాజనీతి, రాజకీయం ఆత్మహత్య చేసుకోక తప్పదు. ప్రజలు శిక్షకు గురవటం తప్పదు.

ప్రమాదకరమైన విషయం ఏమిటంటే నోట్ల మార్పిడి అనేది విజయం సాధించిందంటే, మోదీ మరింత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తారు. మనకు అణుబాంబులున్నాయి. కాని వాటిని ఎన్నడూ ఉపయోగించలేం. నోట్ల మార్పిడి ఒక ఆర్థిక అణుబాంబు. నోట్లమార్పిడి విఫలమైతే, (విఫలవుతుందనే అనుకుంటున్నా) భవిష్యత్తులో మోదీకి కష్టాలు తప్పవు. కాని ఆయన దేశానికి ఇప్పటికే ఏదో రకంగా హాని కలిగించేశారు.

వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు.
ఈమెయిల్ః drppullarao@yahoo.co.in

నవంబర్ 26న సాక్షి సంపాదక పేజీలో వచ్చిన పెంటపాటి పుల్లారావు గారి సంక్షిప్త పాఠాన్ని కింది లింకులో చూడవచ్చు.

నోట్లమార్పిడి పులిపై మోదీ స్వారీ
http://www.sakshi.com/news/vedika/demonetization-is-modi-riding-on-tiger-426157


Friday, November 18, 2016

తిరుమలలో 'నారాయణ'.. నారాయణ.. నారాయణ!భారత ప్రజలపైనో, అక్రమార్కులపైనో ఇంకా స్పష్టం కాని సర్జికల్ దాడితో, పెద్ద నోట్ల రద్దుతో దేశం దేశం ఇప్పుడు రోడ్లపైపడి ఊగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రంగా భావించి వదిలిన పెద్ద నోట్ల రద్దు ఒక్క దోపిడీదారును, నల్లధన మాఫియాను రోడ్డెక్కించకపోయినా 120 కోట్ల పైబడిన సగటు భారతీయులు మాత్రం ఇప్పుడు అక్షరాలా బ్యాంకుల పాలబడ్డారు. ప్రజలపై సర్జికల్ దాడి విశ్వవార్త అయిపోయిన ప్రస్తుత నేపథ్యంలో తెలుగు మీడియాలో ఒక వార్త ఇప్పుడు ట్రెండ్ అయి కూర్చుంది. అదేమిటంటే.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తన భార్యతోపాటు తిరుమల దేవాలయం సందర్శించడమే కాకుండా ఎప్పటిలాగే మీడియాకు దర్శనమిచ్చేశారు. దేవుడిపై ఎప్పుడో నమ్మకం పోయిందంటూనే తాను దేవుడికి వ్యతిరేకం కాదన్న నారాయణ మరోసారి సంచలన వార్తగా మారారు.

కమ్యూనిస్టులు తాము దైవ భావాన్ని నమ్మకున్నా.. తమ ఇళ్లలో ఇంకా సాంప్రదాయ విశ్వాసాలను మరవని వారి అభిప్రాయాలను గౌరవించడం తప్పుకాకున్నా తామే స్వయంగా తిరుమల దేవాలయానికి వెళ్లడమే కాకుండా,  'నువ్వు నిజంగా ఉంటే.. పార్లమెంటులో ఉన్న వందలాదిమంది ఆర్ధిక నేరగాళ్ళను ’గాడిలో పెట్ట’మని ఏడుకొండల వెంకన్నను కోరిన'ట్లు మీడియాకు చెప్పడం కమ్యూనిస్టుల్లో, హేతువాదుల్లో, నాస్తికవాదుల్లో తీవ్ర నిరసనలకు దారి తీస్తోంది.

ఈ నేపథ్యంలో "కుటుంబంలో ముఖ్య సభ్యులైన శ్రామికుల్లోనూ పీఠాధిపతుల్నీ, బాబాల్నీ నారాయణ భార్య వెంకన్నను నమ్మిన దానికన్నా బలంగా నమ్మే వాళ్ళున్నారు. వాళ్ళు కూడా ఆర్థిక నేరస్తుల్ని గాడిలో పెట్టడానికీ, దోపిడీ పీడనలను అంతమొందించడానికీ పలానా బాబా లేదా పీఠాధిపతి పాదధూళే పరిష్కారమని అంటే.. నారాయణ వెళతారనే ఆశిద్దాం. ’మతం మత్తుమందు’ అన్న నోటితోనే 'మతమే అన్నింటికీ మందు’ అని అనేసీ; ’పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అని నినదించిన నోటితోనే ’ప్రార్థిస్తే పోయేదేం లేదు.. పోరాడే బెడద తప్ప’ అని నినదించేస్తే .. నారాయణ గారి ద్విపాత్రాభినయం పరిపూర్ణమవుతుంది సుమీ!" అంటున్నారు యు. సూర్యచంద్రరావు గారు.

నిన్న సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ సంపాదక పేజీ (18-11-2016) లో వచ్చిన 'ప్రార్థిస్తే పోయేదేం లేదు.. పోరాడే బెడద తప్ప..’ అనే పేరుతో వచ్చిన తీవ్ర అభిశంసన వ్యాసంతో పాటు "మార్క్సిజాన్ని, దేవుణ్ణి ఏకకాలంలో విశ్వసించే వీలులేదా?" అనే పేరుతో సీనియర్ రచయిత, సీరియస్ అధ్యయనకారులు రావు కృష్ణారావుగారు ఒక మిత్రుడి ప్రశ్నకు సమాధానంగా రాసిన ప్రామాణిక రచనను కూడా నా బ్లాగులో పొందుపరుస్తున్నాను. లాటిన్ అమెరికన్ దేశాల్లో మతాధిపతుల మద్దతును కూడా కూడగట్టి కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేసినమాట నిజమే. కానీ ఒక వ్యక్తి దైవాన్ని విశ్వసిస్తే మార్క్సిజానికి అతనితో పేచీలేదు. ప్రజాజీవితంలోకి మతం ప్రవేశించడాన్ని, వ్యవస్థీకృత మతాన్ని మార్క్సిజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అని చెబుతూ కష్ణారావు గారు తన రచనలో ఒక తాత్విక, సైద్ధాంతిక మార్గదర్శనం చేసారు.

"మతానికి విరుద్దంగా చేసే విమర్శకు పునాది ఏమిటంటే, మానవుడే మతాన్ని నిర్మిస్తాడుగాని మతం మానవుణ్ణి కాదు. మతం అంటే ఇంకా తననుతాను తెలుసుకోలేకపోయిన లేదా అప్పటికే తిరిగి కోల్పోయిన మనిషి స్వీయ చైతన్యం, అత్మగౌరవం......... మానవుడే మానవ ప్రపంచం. అతడే రాజ్యం. అతడే సమాజం. ఈ రాజ్యం, ఈ సమాజం తలక్రిందుల ప్రపంచం కనుక, తలక్రిందుల ప్రపంచ చైతన్యమైనటువంటి మతాన్ని ఉత్పత్తి చేశాయి.

మతవేదన నిజమైన వేదనకు వ్యక్తీకరణేగాక నిజవేదనకు వ్యతిరేకంగా నిరసన కూడా! మతం అణగద్రొక్కబడిన జీవి నిట్టూర్పు. నిరుత్సాహ పూరిత పరిస్థితుల్లో అది ఒక స్పూర్తి అయినట్లే హృదయంలేని ప్రపంచానికి అది హృదయం. అది ప్రజలకు నల్లమందు......."

అని  కారల్ మార్క్స్ చెప్పిన అభిప్రాయాలను ఉటంకిస్తూ రావు కృష్ణారావు గారు చేసిన రచనను మార్కిస్టుల కంటే మార్క్సిస్టు వ్యతిరేకులు కూడా చదవటం అవసరం. మతం పట్ల మార్క్సిజం ఏం చెబుతోంది అని తెలుసుకోవడానికి ఇది ఒక ప్రామాణిక పత్రంగా చెప్పవచ్చు.

(ఈ కింది రెండు రచనలను బ్లాగ్ పాఠకులకు అందివ్వమని కోరడమే కాకుండా రావు కృష్ణారావు గారి రచనను కూడా తన గ్రూపు నుంచి తీసి అందించిన అమరయ్య గారికి (సాక్షి ఉద్యోగి, సీపీఐ అభిమాని) ధన్యవాదాలు. ఆలోచనాత్మకమైన రచనలను అందించిన ఈ ఇద్దరు రచయితలకు అభినందనలు)

                                             ****************

'ప్రార్థిస్తే పోయేదేం లేదు.. పోరాడే బెడద తప్ప..’ 
'బూర్జువా ప్రజాస్వామ్యం’లో పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలను నిరంకుశంగా అమలు చేస్తూనే.. అదంతా ప్రజా సంక్షేమానికేనని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటారు. ఇలాంటి ద్విపాత్రాభినయంలో వారికి.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తారకమంత్రంగా చెప్పుకుంటూ సురక్షితంగా కాలక్షేపం చేసే వామపక్ష నేతలు గట్టి పోటీదారులేనని చాలా సందర్భాల్లో రుజువైంది. తక్కిన సందర్భాల్లో మాట విడిచిపెట్టినా ఎన్నికలప్పుడు వారు తమ ద్విపాత్రాభినయానికి ’గతితార్కిక చారిత్రకభౌతికవాద’ సిద్ధాంతపు  ముసుగును కప్పుకుంటుంటారు. ఓ ఎన్నికలప్పుడు ’ప్రపంచ బ్యాంకుకు పెద్ద పాలేరు’గా కనిపించిన బూర్జువా నేతే తర్వాతి ఎన్నికల్లో జట్టు కట్టదగ్గ జనప్రియుడిగా కనిపిస్తాడు.

తన  ప్రధాన బలాల్లో హేతువాదం ఒకటైన మార్క్సిజం ’లౌకిక’ సమస్యలకు వైయక్తిక విశ్వాసాలతో కూడిన పరిష్కారాన్ని అణుమాత్రం అంగీకరించదు. ’మతం మత్తుమందు’ అన్న మార్క్స్‌ దేవుడిని నమ్మలేదు, కానీ దేవుడిని నమ్మే కోట్లాది మందిని ప్రేమించాడు. అయితే వారి సమస్యలూ, సంక్షోభాల పరిష్కారానికి దేవుడితో ముడిపెట్టబోతే మాత్రం తప్పక దుడ్డుకర్ర పుచ్చుకుని తరిమి ఉండేవాడు. ప్రతి అడుగూ మార్క్సిజం వెలుగులో వేస్తామనే కమ్యూనిస్టు నాయకుల్లోనూ మార్క్స్‌ దుడ్డు కరక్రు గట్టి పని చెప్పేవాళ్లున్నారనడానికి  తాజా ఉదాహరణ సీపీఐ నేత కె.నారాయణ. ఆయన నిన్న భార్యతో కలిసి తిరుమల వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు.

దేవుడిపై నమ్మకం పోయిందంటూనే దేవుడికి (దేవుడిని నమ్మే వాళ్లకి కాదు సుమీ!) వ్యతిరేకం కాదన్నాడు. తాను మాటల ఈటెలు దూసే బూర్జువా నాయకులకన్నా ద్విపాత్రాభినయంలో ’ఒళ్ళు జలదరించే’ స్థాయిలో మెప్పించాడు. పార్లమెంటులో ఉన్న వందలాదిమంది ఆర్ధిక నేరగాళ్ళను ’గాడిలో పెట్ట’మని (శిక్షించమని కాదు సుమీ!) ఆయన వెంకన్నను  కోరాడు. పార్లమెంటు సహా దేశంలో ఉన్న ఆర్ధిక నేరస్థుల్లో ఎక్కువమంది నుంచి భారీ మొత్తాల్లో ముడుపులు అందుకునేది వెంకన్నేనని –పాపం.. తాను ఆ మధ్య తినకుండా వదిలిన కోళ్ల సాక్షిగా ఆయనకు తెలీదనుకోవాలి కాబోలు! సహధర్మచారిణి కోరిక మేరకు వెంకన్న గుడికి రావడం ఆనందంగా ఉందని ఆయన చెప్పాడు.

కమ్యూనిస్టులది చిన్న కుటుంబం కాదు.. వారి స్వప్నమే వసుధైక కుటుంబం. ఆ కుటుంబంలో ముఖ్య సభ్యులైన శ్రామికుల్లోనూ పీఠాధిపతుల్నీ, బాబాల్నీ నారాయణ భార్య వెంకన్నను నమ్మిన దానికన్నా బలంగా నమ్మే వాళ్ళున్నారు. వాళ్ళు కూడా ఆర్థిక నేరస్తుల్ని గాడిలో పెట్టడానికీ, దోపిడీ పీడనలను అంతమొందించడానికీ పలానా బాబా లేదా పీఠాధిపతి పాదధూళే పరిష్కారమని అంటే.. నారాయణ వెళతారనే ఆశిద్దాం. ’మతం మత్తుమందు’ అన్న నోటితోనే 'మతమే అన్నింటికీ మందు’ అని అనేసీ; ’పోరాడితే పోయేదేం లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అని నినదించిన నోటితోనే ’ప్రార్థిస్తే పోయేదేం లేదు.. పోరాడే బెడద తప్ప’ అని నినదించేస్తే .. నారాయణ గారి ద్విపాత్రాభినయం పరిపూర్ణమవుతుంది సుమీ!
–యు. సూర్యచంద్ర రావు,
మొబైల్ 96766 35017

                                    *********************

మార్క్సిజాన్ని, దేవుణ్ణి ఏకకాలంలో విశ్వసించే వీలులేదా?
యువమిత్రుడు కళ్యాణ్ అడిగిన ప్రశ్న ఇది. నాకు చాతనైనంత మేరకు వివరించే ప్రయత్నం చేస్తాను. మార్క్సిజం కేవలం ఒక రాజకీయ సిద్దాంతం కాదు. అది ఈ ప్రపంచాన్ని, అందులో మన జీవితాన్ని అర్ధంచేసుకునే ఒక సాధనం. కేవలం అది ఒక రాజకీయ సిద్దాంతమైవుంటే సోవియట్ యూనియన్ పతనం, చైనా పెట్టుబడిదారీ విధానాలకు మళ్ళడం జరిగిన వెంటనే అది అంతరించిపోయి ఉండేది. ప్రస్తుతం అమెరికా, యూరపుల్లో పైశ్రేణి మేధావులు గతంలో ఎన్నడూ లేనంతగా మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారు. మార్క్సు సాదాసీదా మేధావి కాడు. అందుకే 2000 సంవత్సరంలో BBC నిర్వహించిన పోల్ సర్వేలో మార్క్సు సహస్రాబ్ది మేధావిగా ఎన్నికయ్యాడు. ఆయన్ను ఎన్నుకున్నవారు కమ్యూనిస్టులు కారు.

చరిత్ర తొలినాళ్ళనుండీ నాస్తికత్వం వ్యాప్తిలో ఉంది. మధ్యయుగాల్లో మతవ్యవస్థలు బలపడి నాస్తికులను, వారి రచనలను భౌతికంగా నాశనం చేశారు. ప్రాచీనకాలంలోను, రినైజాన్స్ యుగంలోనూ, నాస్తిక, హేతువాదాలదే పైచేయి. అయితే నాస్తిక తత్వవేత్తలు, హేతువాదులు చెప్పలేకపోయినదాన్ని మార్క్సు చెప్పాడు. చాలా మంది మత, దైవ విశ్వాసాలకు కారణం భయం, అజ్ఞానం అన్నారు. ఏ తత్వవేత్త చూపనంత సానుభూతిని మార్క్స్ విశ్వాసులపట్ల చూపాడు. వారి మతవిశ్వాసాలకు వారినే బాధ్యుల్ని చేయకుండా సామాజిక కారణాలను వివరించగలిగాడాయన. దుర్భరజీవిత పరిస్థితుల నుండి ఊరటకోసం ప్రజలు ఈ విశ్వాసాలను కల్పించుకుంటారని, నిజజీవితంలో ఈ దుర్మార్గాన్ని, దైన్యాన్ని తొలగిస్తే విశ్వాసాలు తొలగి పోతాయని ఆయన అభిప్రాయం. మార్క్సు మతం గురించి చెప్పింది చాలా తక్కువ. అయితే అది చాలా విలువైనది. ఆయన చెప్పిందాంట్లోంచి కొన్ని వాక్యాలను ఉటంకిస్తాను.

".......... మతానికి విరుద్దంగా చేసే విమర్శకు పునాది ఏమిటంటే, మానవుడే మతాన్ని నిర్మిస్తాడుగాని మతం మానవుణ్ణి కాదు. మతం అంటే ఇంకా తననుతాను తెలుసుకోలేకపోయిన లేదా అప్పటికే తిరిగి కోల్పోయిన మనిషి స్వీయ చైతన్యం, అత్మగౌరవం.... మానవుడే మానవ ప్రపంచం. అతడే రాజ్యం. అతడే సమాజం. ఈ రాజ్యం, ఈ సమాజం తలక్రిందుల ప్రపంచం కనుక, తలక్రిందుల ప్రపంచ చైతన్యమైనటువంటి మతాన్ని ఉత్పత్తి చేశాయి.

మతం ఈ ప్రపంచ సాధారణ సిద్దాంతం. దాని విజ్ఞాన సర్వస్వ సంగ్రహం, దాని జనరంజక తర్కం. దాని ఆధ్యాత్మిక ఆత్మగౌరవానికి షరతు. దాని ఉత్సుకత. దాని నైతిక సమర్ధన, దాని పవిత్ర పూరకం, ఓదార్పుకి, విముక్తికి దానికున్న సార్వత్రిక మూలం. మతం మానవ సారం యోక్క మనఃకల్పిత వాస్తవీకరణ. ఎందుకంటే నిజానికి మానవసారమంటూ ఏమీ లేదు. అందుచేత మతానికి వ్యతిరేకంగా చేసే పోరాటం, మతాన్ని ఆధ్యాత్మిక సుగంధంగా కలిగిన ప్రపంచానికి వ్యతిరేకంగా చేసే పరోక్ష పోరాటమే!

మతవేదన నిజమైన వేదనకు వ్యక్తీకరణేగాక నిజవేదనకు వ్యతిరేకంగా నిరసన కూడా! మతం అణగద్రొక్కబడిన జీవి నిట్టూర్పు. నిరుత్సాహ పూరిత పరిస్థితుల్లో అది ఒక స్పూర్తి అయినట్లే హృదయంలేని ప్రపంచానికి అది హృదయం. అది ప్రజలకు నల్లమందు......."

1950 ప్రాంతం వరకు ప్రపంచవ్యాప్తంగా నల్లమందు(opium)ను పెయిన్ కిల్లర్ గా వాడేవారు. అది చాలా ప్రభావశీలంగా పనిచేసేది. నాకు తెలిసి 1980 వరకు opium derivativesని డాక్టర్లు prescribe  చేసేవారు. వాటి దుష్ఫలితాలవల్ల కాలక్రమేణా వాటి వాడకాన్ని నిషేధించారు.

మనుషులు(మనందరం కూడా) ఊహాలోకాల్లో విహరిస్తూ మనం ఏమికావాలనుకున్నామో దాన్ని అక్కడే తీర్చుకుంటాం. దీన్ని day dreaming అంటారు. ఇది చాలా హాయినిస్తుంది. అయితే ఎప్పటికప్పుడు వాస్తవ జీవితం మనల్ని తట్టిలేపుతుంది. పగటి కలలు శృతిమించితే వాస్తవ జీవితం నుండీ పారిపోయి అన్నివిధాల విఫలమవుతారు. ఆధునిక మానవుని పరిస్థితిని వివరిస్తూ జీన్ పాల్ సార్త్ ఇలా చెబుతాడు.

‘కటికచీకటిలో నాలుగు రోడ్ల కూడలిలో నిలిచి ఎటు వెళ్ళాలో తెలియక ఎవరికీ వినపడని పిచ్చి కేకలు వేసే వాడు’ అంటాడు. ఇలాంటి దుర్భర పరిస్థితి నుండి కాస్త ఊరట కోసం భ్రమలను ఆశ్రయిస్తాం.వాడగా, వాడగా నల్లమందు మోతాదు సరిపోనట్లే ఈ భ్రమలు కూడా! మార్క్స్ చెప్పినదాని ప్రకారం దీన్నుండి బయట పడటానికి భ్రమలవసరమయ్యే పరిస్తితులపై పోరాడాలి. మనం పోరాటం ప్రారంభించిన వెంటనే పరిస్థితులు మారిపోకపోయినా మనకు భ్రమల అవసరం తీరిపోతుంది.

మార్క్సుకి నాస్తికత్వం, మత విమర్శ లేదా రాజకీయం ఇవన్నీ ప్రధమ ప్రాధాన్యత లేదా అంతిమ లక్ష్యం కావు. ఆయన ఏకైక ధ్యేయం మానవ శ్రేయస్సు, స్వేచ్చ, విముక్తి. మానవుడే ఆయన సిద్దాంతానికి కేంద్రబిందువు. అటువంటి మానవాభ్యుదయాన్ని ఎలా సాధించాలనే ఆలోచనల్లోనే మిగిలినవన్నీ వస్తాయి. మార్క్సు మతాన్ని నల్లమందుతో పోల్చాడు. అది శారీరక, మానసిక బాధలన్నిటిని ఉపశమింపజేసి తాత్కాలికంగా హాయినిస్తుంది. అయితే దీర్ఘ కాలం ఇవి వాడితే మనిషిలో క్రియాశీలత, చురుకుదనం లోపించి మందబుద్దిగా చేస్తుంది.

మార్క్సిజానికి అధిష్టాన దేవతైన మానవుని విముక్తికి, అభ్యుదయానికి అడ్డుతగిలే దేన్నైనా మార్క్సిజం విమర్శిస్తుంది. మార్క్స్ తన యవ్వనకాలంలో ప్రొమీథియస్ అనే గ్రీకుపురాణ పాత్రను తన ఆదర్శంగా చెప్పుకున్నాడు. ఈ ప్రొమీధియస్ ఒక టైటాన్(ద్వితీయశ్రేణి దేవత). మనుషులు చలికి పడుతున్న బాధలను చూసి, చలించి స్వర్గంనుండీ నిప్పుని దొంగిలించి మనుషులకిస్తాడు. దేవుడు అతనికి కఠిన శిక్ష విధిస్తాడు. ఆ శిక్షకు లొంగకుండా అతను 'I hate the pack of Gods' అని ప్రకటిస్తాడు. మార్క్స్ కూడా మానవాళి శ్రేయస్సుకోసం ఎన్ని బాధలైనా భరించడానికి సిద్దమయ్యాడు.

ఒక వ్యక్తి దైవాన్ని విశ్వసిస్తే మార్క్సిజానికి అతనితో పేచీలేదు. ప్రజాజీవితంలోకి మతం ప్రవేశించడాన్ని, వ్యవస్థీకృత మతాన్ని మార్క్సిజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రపంచ చరిత్రని పరిశీలిస్తే వ్యవస్థీకృతమైన మతం లేదా మత వ్యవస్థ నిర్వహించిన దుర్మార్గమైన పాత్ర అర్ధమవుతుంది. దేవుడి పేరుతో, మతం పేరుతో కోట్లాదిమందిని చంపారు. ఇంకా చంపుతున్నారు. అందుకే బెట్రాండ్ రస్సెల్, "వ్యవస్థీకృతమైన మతం మానవాళికి శాపం" అన్నాడు. రస్సెల్ మార్క్సిస్టు కాడు.

కొద్దిగా మార్క్సిజాన్ని చదువుకున్న నేను అందులో వంటబట్టింది రవ్వంతైనా నాలో చాలా మార్పు వచ్చింది. ప్రపంచాన్నేగాక, అందులో నాజీవితాన్ని, నన్ను నేను ఎంతో కొంత తెలుసుకో గలిగాను. అన్నిటినీ మించి నాకు  తెలియకుండానే ఆత్మగౌరవం ఏర్పడింది. ఈ ఆత్మగౌరవంతో బానిస భావాలను ధిక్కరించసాగాను. నన్ను కించపరిచే భావజాలాన్ని, వ్యవస్థలను కసిగా ద్వేషించసాగాను. 'నేను కూడా మనిషినే,మనిషిగా నేనేవ్వరికీ తీసిపోను’ అని చైతన్యవంతంగా ఫీల్ అవ్వసాగాను. నేను హిందువుగా శూద్రకులంలో పుట్టాను. నాలుగు కులాలను నేనే సృష్టించాను అని చెప్పే గీతను, శూద్రులు తమకంటే అధికులైన మూడుకులాలకు ఫలాపేక్షలేకుండా సేవచేయాలనే మనుధర్మ శాస్త్రాన్ని అంగీకరించకపోగా ద్వేషిస్తాను. పోనీ మతం మారదామంటే మానవులందరూ పుట్టుకతోనే పాపాత్ములు అని చెప్పే క్రైస్తవాన్నిగాని, "దేవా, నీ ముందు నేను ఏమీకాను" అంటూ గుండుగీయించుకుని, రోజుకి ఐదుసార్లు మోకరిల్లి నమాజు చేయవలసిన ఇస్లాంని గాని స్వీకరించలేను.

చిన్నతనంలో తల్లితండ్రుల ఆసరాతో పెరిగాను. ఊహతెలిసాకా ఈ సామాజిక కీకారణ్యంలో దేవుని ఆసరాగా చేసుకుని నడుద్దామనుకున్నాను. కానీ నేను ఎక్కడికీ వెళ్ళడంలేదని, వెలుగనే భ్రమలో చీకట్లో అక్కడే కొట్టుకుంటున్నానని అర్ధమయ్యింది. అందుచేత దేవుని ఆలంబన వదిలేసి ఇపుడు మనుషులనే ఆలంబనగా చేసుకున్నాను. చీకటిని జయించే మార్గాలకోసం వెతుకుతున్నాను. ఇదీ నాకు మార్క్సిజం నేర్పినది.

"తత్వవేత్తలు ప్రపంచాన్ని రకరకాలుగా వర్ణించారు. అసలు విషయం ఏమిటంటే మనం దాన్ని మార్చాలి" అనేది మార్క్స్ చెప్పిన సుప్రసిద్ద సూక్తి. మరో సందర్భంలో "పరిస్థితులు మనుషుల్ని రూపొందిస్తుంటే ఆ పరిస్థితుల్ని మనుషులే మార్చాలి" అని చెప్పాడు. మనిషి క్రియాశీల జోక్యంతో సమాజాన్ని మార్చాలని, ఆ ప్రయత్నంలో మనిషి మారతాడని మార్క్సిజం చెబుతుంది. సరిగా ఇక్కడే దైవ విశ్వాసానికి, మార్క్సిజానికి పేచీ వస్తుంది. తన జీవితాన్ని బాగుచేసే బాధ్యత దేవునిపై ఉంచుతాడు విశ్వాసి. మనిషి సమాజంలో విడదీయరాని భాగమని, ఆ సమాజ బాగుతోనే అతని బాగు సాధ్యమని మార్క్సిజం భావిస్తుంది. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించి పాలిస్తున్నాడని విశ్వాసుల నమ్మకం. ప్రజలే చరిత్ర నిర్మాతలని మార్క్సు చెప్పాడు. మానవాళి శ్రేయస్సుకోసం మనం ప్రయత్నించాలా లేక దైవాన్ని ప్రార్ధించాలా అనేది ఇక్కడ సమస్య. దేవుణ్ణి మనిషే సృష్టించుకున్నాడు, కాబట్టి ఈ ప్రపంచాన్ని కూడా మనిషే బాగుచేసుకోవాలనేది మార్క్సిజం వాదన.

మానవ ప్రయత్నాన్ని ఏ మేరకు నిరోధిస్తుందో ఆ మేరకు దైవవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తుంది మార్క్సిజం.

సమాజాన్ని దేశాన్ని మార్చి ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించేలా కృషి చేయడానికి ఆవిర్భవించింది కమ్యూనిస్టు పార్టీ. ఆ పార్టీ జాతీయ నాయకులే తమ బాగుకోసం దైవాన్ని ఆశ్రయిస్తే ఇక పార్టీ చేసే కృషి ఏముంటుంది? వారు తమ బాధ్యతలనుండి తప్పుకొని ఏం చేసుకున్నా అభ్యంతరముండదు. కమ్యూనిస్టు పార్టీలు మార్క్సిజమే తమ సిద్ధాంతమని చెప్పుకుంటాయి. అందుచేత మార్క్సిజాన్ని నమ్మేవారంతా అటువంటి చర్యలను విమర్శిస్తారు.
–రావు కృష్ణారావు.

                                        *****************

"ప్రస్తుతం అమెరికా, యూరపుల్లో పైశ్రేణి మేధావులు గతంలో ఎన్నడూ లేనంతగా మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారు."

రావు కృష్ణారావు గారు అమెరికా, యూరపుల్లో పై శ్రేణి మేధావులు గతంలో ఎన్నడూ లేనంతగా మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్నారు అని ఒక విషయం తన రచనలో వెల్లడించారు. దానికి చిన్న చేర్పు... పై శ్రేణి మేధావులే కాదు.. కింది శ్రేణి భవిష్యత్ మేధావులు సైతం మార్క్స్ ని తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారని ఇటీవలే హైదరాబాద్ నగర ఇంటెలిజెన్స్ శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన ఒక రిపోర్టులో వెల్లడించినట్లు తెలియవస్తోంది. దళిత, అస్తిత్వ ఉద్యమాల కేంద్రంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 2,500 మంది విద్యార్థులు ఉంటే వారిలో కనీసం 750 మంది వివిధ వర్గాల విద్యార్థులు మార్క్స్ రచనలను తీవ్రంగా అద్యయనం చేస్తున్నారని సాక్షాత్తూ  ఇంటెలిజెన్స్ శాఖ నివేదించడం సంచలనాత్మకం. కాగా ఇది మార్క్సిజం పునరుజ్జీవమవుతున్నదనటానికి తిరుగులేని సంకేతంగానే చూడవచ్చా...?

32 ఏళ్ల క్రితం ఎస్వీ యూనివర్సిటీలో తెలుగు విభాగం ప్రొఫెసర్ మద్దూరి సుబ్బారెడ్డి గారు క్లాసుచెబుతూ పదే పదే ఒక విషయం చెప్పేవారు. 'మార్క్సిజాన్ని వ్యతిరేకించండి కానీ ముందుగా అదేెం చెబుతోందో చదవండి' అనేది ఆయన సూక్తి. పైగా మార్క్సిజాన్ని వ్యతిరేకించేవారు కూడా ఆ సిద్ధాంతాన్ని అధ్యయనం చేయకుంటే వారి వారి అవగాహనల్లో ఏర్పడేది పాక్షికత్వమే అని ఆయన సోదాహరణపూర్వకంగా చెప్పేవారు. సీపీఐ నేత కె. నారాయణ గారి లాగే పరమ సాంప్రదాయిక కుటుంబంలో పెరిగి.. విశ్వవిద్యాలయ చదువు వరకు రాగలిగిన నేను... 1984లో అప్పుడప్పుడే ఎస్వీయూ లైబ్రరీలో సృజన, ఈపీడబ్ల్యూ వంటి పత్రికల ద్వారా, విశాలాంధ్ర బుక్ షాప్ సందర్శన ద్వారా సమాజాన్ని కొత్తగా చదువుతున్న నేపథ్యంలో ప్రొఫెసర్ సుబ్బారెడ్డి గారి సూచనలు నాలో అధ్యయన కాంక్షను మరింత పెంచాయే కాని తగ్గించలేదు. జాతీయోద్యమ కవిత్వం మీద ఆయన పీహెచ్‌డీ చేశారు. యూనివర్సిటీ రాజకీయాల్లో ముఖ్యంగా కుల రాజకీయాల్లో ఆయన పాత్ర ఒక మేరకు ఉంటున్నా ఒక విధమైన ఉదారవాద ఆలోచనలు ఆయన క్లాసుద్వారా, బోధనల ద్వారా నాలాంటి వారిమీదా ప్రభావం వేశాయనుకుంటాను.

'మార్క్సిజాన్ని వ్యతిరేకించండి కానీ ముందుగా అదేెం చెబుతోందో చదవండి'

ఈ ఒక్కమాటతో ఆయన నాకు గౌరవనీయ వ్యక్తి అయిపోయారు. ఇప్పుడు యూరప్ మేధావులు, మన వద్ద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రేపటి మేధావులు కూడా మార్క్సిజాన్ని అధ్యయనాంశంగా ఎంచుకోవడం  గమనార్హం.

'యూరప్‌ని కమ్యూనిజం భూతం ఆవహించింది' అనేది మార్క్స్ ఎంగెల్స్ సుప్రసిద్ధ రచన 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో తొలి వాక్యం. కానీ....

మార్క్స్ 'భూతం' ప్రపంచాన్ని ఇంకా పట్టి ఊగిస్తూనే ఉన్నట్లుంది మరి..


Saturday, November 12, 2016

వ్యవస్థీకృత హింసతో ప్రజాస్వామ్యం సాధ్యమేనా?

"ప్రతి పనిలో స్వంత లాభం ఏమిటి అని ఆలోచించి, దాన్ని నేర్పుగా సాధించుకోవడమే లక్ష్యమైన స్థితిలో కేవలం తమ సొంత తృప్తి కోసం కాక పీడిత ప్రజల పక్షాన నిలబడే వారి నిజాయితీని పూర్తిగా తప్పుబట్టడం కష్టం. అట్లాంటి వారు దశాబ్దాలుగా మరణిస్తూ ఉండటమూ కలత పెట్టే అంశమే. పారిన రక్తానికీ, సాధించిన మార్పుకూ మధ్య పొంతన లేకపోవడం కూడా సమస్యనే. స్వాతంత్ర్యానికి ముందూ తరువాతా, అటువంటి వారి త్యాగాలు ఒకమేర ప్రభావితం చేయడం ద్వారా రూపొందిన ప్రజాస్వామిక చట్టాలు కూడా అమలు కాని స్థితి భయం పుట్టిస్తోంది. మనం వ్యవస్థీకృత హింస పట్ల భయం వల్లనో, నిస్సహాయత వల్లనో, ఆ హింస ద్వారా మన ప్రయోజనాలు నడిచిపోతున్నాయి అనో.. చల్నేదో అనుకునే స్థితి ఉన్నంత సేపు ఏదో ఒక  మూల సాయుధ వామపక్ష రహస్యోద్యమం.. అది ఎంత అశక్తమైనదీ, పెద్దగా సానుకూల ఫలితాలు సాధించలేనిదీ అయినా సరే... ఒకమేర పీడితులకు, వ్యవస్థాపరమైన అన్యాయాన్ని సహించని వారికీ అది ఒక ఆకర్షణీయమైన పోరాట మార్గంగా కనిపించడాన్ని మాత్రం అసంబద్ధం అనలేము"

అంటున్నారు హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా లోని రాజనీతి శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ హెచ్ వాగీశన్ గారు. ప్రజాస్వామ్యం ప్రబోధించే స్వేచ్ఛా సమానత్వాల మధ్య ఒక క్రియాత్మకమైన సమతూకాన్ని మన సామాజిక వ్యవస్థ, దాని పాలకవర్గాలు నెలకొల్పడంలో విఫలమైన ప్రతి చోటా ఆ వైఫల్యపు తీవ్రత, అక్కడి ప్రజల స్పందనను బట్టి పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయన్నది వీరి అభిప్రాయం.

సాయుధ పోరాటాలు హింసకు (వారి పరిభాషలో ప్రతిహింస) ప్రాధాన్యమిస్తున్నాయి కాబట్టి వీటిని క్రూరంగా అణిచివేయడమే పరిష్కారమని మన దేశ మధ్యతరగతి ప్రజానీకంలో అతి పెద్ద సెక్షన్ బలంగా అభిప్రాయపడుతున్న నేటి కాలంలో "హింస మూలాలు మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, మనచుట్టూ ఉన్న వ్యవస్థల పని తీరులో ఉన్నవి అని గుర్తించాలి. మచ్చుకు, ఆడపిల్లను మనిషిగా గుర్తించక పోవడం, పక్క వాడిని కులం పేరనో మతం పేరనో  చిన్న చూపు చూడటం, అడ్డమైన గడ్డితిని సంపాదనపరులవుతున్న వారి అడుగులకు మడుగులొత్తడం వంటి వాటితో మొదలుకొని.. నా చిన్ని పొట్టకు శ్రీ రామ రక్ష అనుకుంటూ.. ఎవడికి ఏం అయితేనేమి నేను బాగుంటే చాలుననే స్వార్థపూరిత చింతనే వ్యవస్థీకృత హింసకు ఊతమిస్తుందని గుర్తించడం అవసరం. ఇటువంటి వాతావరణంలో నియమబద్ద ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టదని గుర్తించడం ప్రస్తుతం అత్యవసరం. నిత్య జీవితంలో అన్యాయాన్ని గుర్తించి వ్యతిరేకించే కార్యాచరణ విస్తృత స్థాయిలో నిరంతరం సాగడం అవసరం" అని అంటున్నారు ప్రొఫెసర్ వాగీశన్ గారు.

మావోయిస్టులను పోలీసులు ఎన్‌కౌంటర్లలో చంపితే తప్పు అయితే, కోవర్టులనే పేరుతో సామాన్యులను, ప్రతీకార దృష్టితో పోలీసులను మావోయిస్టులు చంపటం తప్పు కాదా.. పౌరహక్కులనేవి మావోయిస్టులకేనా, సామన్యులకూ, పోలీసులకూ వర్తించవా? అంటూ ఉద్యమ వ్యతిరేకులే కాకుండా పౌర సమాజంలోని కొన్ని సెక్షన్ల ప్రజలు కూడా తీవ్రంగానే ప్రశ్నలు సంధిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో.. ప్రజాస్వామ్య వైఫల్యమే సమస్త ఉద్యమాల పుట్టుకకు, కొనసాగింపుకు మూలం అని ఈయన చెబుతున్నారు. ఆ పోరాటాల, ఉద్యమాల శక్తి, వాటికి దొరికే మద్దతు సంశయాత్మకమే అయినా.. వాటి సామర్థ్యాలు, వాటి విజయావకాశాలు కూడా సందేహాస్పదమే అయినప్పటికీ ఆ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయని వాగీశన్ అంటున్నారు. 

సాయుధ పోరాటాలకు గతంలో ఉన్న మద్దతు ఇప్పుడు తగ్గినట్లు కనిపించడానికి కారణాలను చెబుతూనే.. ఏది అభివృద్ధి  అనే చర్చ, దేశంలోని  ప్రతిఒక్కరికీ, గౌరవప్రదమైన బతుకుదెరువు ఏమిటి  అన్న చర్చ ప్రజాస్వామ్యానికి అత్యవసరం. కానీ వ్యవస్థీకృత హింస ఈ చర్చలను సాగనివ్వదంటున్నారు.. రాజ్యమూ, సమాజమూ, మార్కెట్టూ అనే మూడు వ్యవస్థలు అనేక రూపాల్లో శక్తిమంతుల ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహాలతో సాగుతున్నప్పుడు ఆ వ్యూహాలు నగరంలో, గ్రామంలో, అడవిలో వివిధ పద్ధతుల్లో అమలు అవుతున్నప్పుడు మనం ఏమిచేయాలి అన్న ప్రశ్నను నిరంతరం  వేసుకోవడం, సమాధానాలను, సమష్టి చింతన ఆచరణలో వెతుక్కోవడం తప్ప నియమ బద్ధ ప్రజాస్వామ్యాన్ని నిలుపుకునే మార్గం మరోటి లేదు అంటున్న ప్రొఫెసర్ వాగీశన్ గారు "వ్యవస్థీకృత హింస - నియమబద్ధ ప్రజాస్వామ్యం - సాధ్యాసాధ్యాలు" అనే పేరిట రాసిన వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ చదవగలరు.

మావోయిస్టులకు, మావోయిస్టు వ్యతిరేకులకు, ఎదురుకాల్పుల సమర్థకులకు, వాటి వ్యతిరేకులకు, సాధారణ ప్రజాస్వామిక వాదులకు అందరికీ ఇది ఒక అధ్యయనాంశంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయంతోటే ఈ వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ ప్రచురించడమైనది.

                               *****************

వ్యవస్థీకృత హింస - నియమబద్ధ ప్రజాస్వామ్యం - సాధ్యాసాధ్యాలు
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో పోలీసు కాల్పుల వల్ల ముప్పై మంది మావోయిస్టులు  చనిపోయారన్న విషయం త్వరలోనే వార్తా పత్రికలలో కనిపించదు. అయితే సాయుధ వామపక్ష ప్రతిఘటన ఉద్యమం అనే రాజకీయ పోరాటం మాత్రం మన  ప్రజాస్వామ్యం పైన ఎక్కుపెట్టిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవలిసిన అవసరాన్ని, అదే నిజమైన ప్రజాస్వామిక విముక్తి  మార్గంగా నమ్మిన వారు కోల్పోయే ప్రాణాల ద్వారా గుర్తుచేస్తూ ఉంటుంది. ఏ యుద్ధంలోనైనా  మొదట హత్యకు గురియ్యేది సత్యమే అనేది అసత్యం  ఏమీ కాదు. మనం ప్రజాస్వామ్యంగా పిలుచు కుంటున్న, మనం వోట్ల రూపంలోనూ,  ఇతరత్రా కూడా, భయం వల్లనో, విశ్వాసం వల్లనో, అవసరాల వల్లనో, విధేయత చూపుతున్న ఈ పాలనా వ్యవస్థ  నియమబద్దతను పాటించి  ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు  సమాధానం  చెప్పే అవకాశం  తక్కువ.

ఈ సందర్భంలో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో మాట్లాడటం అవసరం. ప్రజాస్వామ్యం  అన్న మాటకు ప్రజాదరణ  ఇరవయ్యో శతాబ్దం నుండి పెరిగింది. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల మూక పాలన కాదనీ ప్రజలు తమ అనుభావాల  వెలుతురులో  చర్చించుకొని రూపొందించుకున్న నియమాల అనుసారం సాగే పాలన అనే అర్థంలో అది ప్రస్తుతం కొనసాగుతున్నది. అందుకే వ్యక్తిస్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇచ్చే లిబరల్  కాపిటలిస్ట్ సమాజాలు కానీ,  సమానత్వానికి ప్రాధాన్యతను ఇచ్చే  ఒక మేర  సోషలిస్ట్ విలువలను నెలకొల్పే సమాజాలు గానీ తమ పాలనా రూపాలను ప్రజాస్వామిక  రూపాలు అనే పేర్కొంటున్నాయి.

మొత్తంగా ఏదో ఒక రూపంలో ఆయా స్థల కాల సందర్భాల్లో స్వేచ్ఛా సమానత్వాల మధ్య ఒక క్రియాత్మక  సమతూకం ( డైనమిక్  ఈక్విలిబ్రియం) నెలకొల్పడం అనే కత్తి మీద సామే  ప్రజాస్వామ్యం. అయితే తమను తాము ప్రజాస్వామికం అని ప్రకటించుకున్న రాజ్యాలు తమ పని తీరుల వల్ల సదరు రాజ్య వ్యవస్థనూ. అంటే దాని కోసం పనిచేస్తూ ఉండే ప్రభుత్వ వ్యవస్థనూ, అక్కడి ఆర్థిక వ్యవస్థనూ (అంటే మార్కెట్లను), సామాజిక వ్యవస్థనూ -  పైన పేర్కొన్న స్వేచ్ఛా సమానత్వాల సమతులనాన్ని పట్టించుకునేటట్టు చూడవలిసి ఉంటుంది. ఈ పని చెయ్యడంలో విఫలమైన ప్రతిచోటా ఆ వైఫల్యపు తీవ్రత అక్కడి ప్రజల స్పందనను బట్టి పోరాటాలు ఉంటాయి.

మన దేశంలో కూడా నిరాయుధ, సాయుధ పద్దతుల్లో పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీరులో ప్రజల పట్ల మన ప్రభుత్వం వ్యవహార శైలి మీద, ఈశాన్య భారత దేశంలో మన సైన్యం జులుం పట్ల, ఆదివాసీ ప్రాంతాలల్లో వనరుల కోసం జరుగుతున్న విధ్వంసం పట్ల, గ్రామం నగరం అనే తేడాలేకుండా కొనసాగుతున్న అమానవీయమైన అవినీతి మీద ప్రతిఘటన సాగుతూనే ఉన్నది. ఆ పోరాటాల శక్తి, వాటికి దొరికే మద్దతు సంశయాత్మకమే. వాటి సామర్థ్యాలు, వాటి విజయావకాశాలు కూడా సందేహాస్పదమే అయినా పోరాటాలు సాగుతూనే ఉంటాయి.

ఇటువంటి పోరాటాల వరుసలో, వ్యవస్థ  సమూల మార్పు కోసం సాగే పోరాటంగా తమను తాము  రూపొందించుకున్న మావోయిస్టు సాయధ విప్లవ పోరాటం  గత నలభై  సంవత్సరాల పైబడి  ఉనికిలో ఉన్నది.  “దోపిడీ  వర్గాల చేతులలో ఉండే అధికారం ఎప్పటికీ ప్రజాస్వామికంగా  రూపొందదు. అందువల్ల  పీడిత వర్గాలు దీర్ఘకాల ప్రజాయుద్ధం ద్వారా ఈ వ్యవస్థను కూల దోసి నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం ద్వారానే  విమోచన పొందుతారు” అనే విశ్వాసంతో వీరు పోరాడుతున్నారు. ఈ  సాయుధ పోరాటపు గమనం,  వారి విశ్వాసమూ, ప్రశ్నలకు అతీతమైనవి కావు. ప్రస్తుతం ఆదివాసీ ప్రాంతాలలో వనరుల మీద దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు పట్టు బిగిస్తున్నాయి. ఆదివాసులు మునుపటికంటే ఎక్కువగా జీవన్మరణ పోరాటంలోకి నెట్టబడినారు. అందుకే సాయుధ పోరుకు మద్దతు అధికంగా ఉన్నది. అంటే అక్కడ మాత్రమె సమస్యకూ పోరాటానికి మధ్య బలమైన సంబంధం కనిపిస్తున్నది. మైదాన ప్రాంతాలలో ఒకనాడు ఈ ఉద్యమానికి (కనీసం తెలుగు ప్రాంతాలలో) ఉన్న మద్దతు ఇప్పుడు కనిపించడం లేదు. దాని అర్థం మైదాన ప్రాంతంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సమస్యలు  ఏమీ లేవని అర్థం కాదు.

మన దేశంలో ఆర్ధిక సరళీకరణ మొదలైనప్పటినుండి అంటే దాదాపు రెండు దశాబ్దాలుగా ఒక మేర దారుణమైన పోలీసు చర్యల ద్వారా, ఇంకొక మేర ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు తెలిపే పీడిత కుల వర్గ శ్రేణులు రాజ్యంతో ఒక మేర సామరస్యం ద్వారా (ఎంగేజ్‌మెంట్)  ద్వారా తమ  సమస్యలు తీరుతాయి అనీ, నిరంతర సంఘర్షణ ( కాన్ఫ్రంటేషన్) పెద్దగా ఫలించదు అని భావించడం వల్ల పోరాటానికి మద్దతు తగ్గింది. దీనితో పాటు రాజ్య యంత్రానికున్న వివిధ తీర్ల నిఘా (సర్వైలెన్స్) సామర్థ్యం పెరగడం ద్వారా కూడా సాయుధ రహస్య ఉద్యమానికి మద్దతు కొంత తగ్గింది. ఎంగేజ్ మెంట్ మార్గం ద్వారా పీడిత కుల వర్గ  శ్రేణుల జీవితాల్లో ఎటువంటి సానుకూల మార్పు వచ్చింది అనే అంశంపై ఇంకా శాస్త్రీయ సామాజిక ఆర్ధిక విశ్లేషణ చెయ్యవలిసి ఉన్నది.

ముఖ్యంగా  సాయుధ  రహస్యోద్యమం  ద్వారా  మాత్రమే  సానుకూల మార్పు సాధ్యం అని భావించే వారు కొంత  నిష్పాక్షికంగా అధ్యయనం చేయవలిసి ఉన్నది. ఈ స్థితిలో కొన్ని పరిణామాలు మాత్రం నిశ్చయంగా జరిగినాయి. ఒకటి పోలీసుల శక్తి  విపరీతంగా పెరిగింది (అంటే వారి  విచారణా, నేర నిరోధ సామర్థ్యం చట్ట బద్ధ వ్యవహారం పెరిగిందని అర్థం కాదు) సామాన్యుల నిత్య జీవన వ్యవహారాల్లో దీని ప్రభావం చాలా ఉన్నది.  రాజ్యంతో ఎంగేజ్‌మెంట్ మార్గంలో పయనించిన, పయనిస్తున్న వారిలో పెద్ద భాగం తమ వ్యక్తిగత శక్తిని  పెంచుకునే నూతన పైరవీకారు సెక్షన్‌గా రూపొందినారు. మరోవైపున వ్యవస్థీకృత హింస రూపాలు వాటి పని తీరు విస్తరిస్తూ ఉన్నాయి.

వ్యవస్థీకృత హింస - అప్రజాస్వామ్యం  క్రూరమైన కవలలు
వలసపాలన అనంతర సమాజాల్లో పాలనా వ్యవస్థల్లో,  ప్రభుత్వ యంత్రాగం పనిలో, వాణిజ్య  వస్తు సేవల వినిమయ క్షేత్రమైన మార్కెట్టు, సాంస్కృతిక నిర్మాణ నియంత్రణ క్షేత్రమైన  సమాజం మూడూ చాలా పకడ్బందీగా హింసను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఈ మూడు నిర్మాణాల మీద  పాత వలస రాజ్యాల పెత్తనం వివిధ రూపాల్లో సాగుతూ ఉంటున్నది. అవి  ప్రపంచ  ఆధిపత్యాన్ని నెరిపే పనిలో నిరంతరం ఉన్నాయి. ఈ మొత్తం వ్యవస్తీకృత హింసగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో అమలు అవుతూ ఉంటుంది. దేశీయ ప్రాంతీయ సందర్భంలో  ఈ వ్యవస్థీకృత హింస ద్వారా మేలు పొందే శక్తుల మధ్య మైత్రి ఉంటుంది. సంపద కేంద్రీకరణ, కొత్త కొత్త పద్దతుల్లో పెత్తందారీ సామాజిక, సాంస్కృతిక  సంబంధాలను  నిలపడం, వీటికి అవసరమైన రాజకీయ ఆర్ధిక వ్యవస్థను ప్రోత్సహించడం అనేవి వ్యవస్థీకృత హింసకుఉండే లక్ష్యాలూ సాధనాలు. ఏది అభివృద్ధి  అనే చర్చ, దేశంలోని  ప్రతిఒక్కరికీ, గౌరవప్రదమైన బతుకుదెరువు ఏమిటి  అన్న చర్చ ప్రజాస్వామ్యానికి అత్యవసరం. కానీ వ్యవస్థీకృత హింస ఈ చర్చలను సాగనివ్వదు.

నియమబద్ధ ప్రజాస్వామ్యం అంటే అనేక రీతుల్లో ఆధిపత్యాన్ని తిరస్కరించడం.  స్వేచ్చా సమానతలతో కూడిన పరస్పర సహకార సంబంధాలను పెంపు చేసి కాపాడుకోవడం అని అర్థం. వ్యవస్థీకృత హింస కంటికి కనిపించే తీరులోనూ, కనిపించని  తీరులోనూ మన నిత్య జీవితాలను ప్రభావితం చేస్తుంది. అందుకే  ఈ హింసకు వ్యతిరేకమైన ఆలోచన కార్యాచరణలో ఉండటం అనేది సామాన్యమైన విషయం  కాదు అని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ హింసమీద కేవలం సాయుధ రహస్య ఉద్యమం ద్వారా విజయం సాధించడం సులభం కాదు. అది కేవలం అప్పుడప్పుడు చేసే పెద్ద చప్పుడుగా మిగిలిపోయే అప్రాధాన్య స్థితిలోకి  జారుకుంటుంది.

మన నిత్య జీవితంలో మనలను నిరంతరం పీడిస్తున్న సమస్యల పట్ల  మనం వ్యక్తులుగానూ బృందాలుగానూ స్పందించే  స్వభావాన్ని నిరంతరం పెంచుకోవడమే మన ముందున్న మార్గం. మాటలు కోటలు దాటించడం మాని, మనం ప్రతినిత్యం  హింసను ఎదుర్కొనే చర్చ- చర్య అనే జీవన విధానంలోకి  మారడం అవసరం. చాలా  దారుణంగా మనుషులను  పీడించే అంశాలను ఎట్టి పరిస్థితిలో మనం సాధారణంగా ఆమోదించే విలువగా (నార్మల్ వాల్యూ) మారకుండా ప్రయత్నం చేయవలిసి ఉంటుంది.  రాజ్యమూ, సమాజమూ, మార్కెట్టూ అనే మూడు వ్యవస్థలు అనేక రూపాల్లో శక్తిమంతుల ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహాలతో సాగుతున్నప్పుడు ఆ వ్యూహాలు నగరంలో, గ్రామంలో అడవిలో వివిధ పద్ధతుల్లో అమలు అవుతున్నప్పుడు మనం ఏమిచేయాలి అన్న ప్రశ్నను నిరంతరం  వేసుకోవడం, సమాధానాలను, సమష్టి చింతన ఆచరణలో వెతుక్కోవడం తప్ప నియమ బద్ధ ప్రజాస్వామ్యాన్ని నిలుపుకునే మార్గం మరోటి లేదు.

ఏది ఏమైనా ప్రతి పనిలో స్వంత లాభం ఏమిటి అని ఆలోచించి, దాన్ని నేర్పుగా సాధించు కోవడమే వ్యక్తిత్వ వికాసమైన స్థితిలో, అది విశాల జనామోదం పొందుతున్న కాలంలో కేవలం తమ  స్వంత తృప్తి  కోసం కాకుండా, పీడిత ప్రజల పక్షాన నిలబడే వారి నిజాయితీని  పూర్తిగా తప్పుబట్టడం కష్టం. అట్లాంటి వారు దశాబ్దాలుగా మరణిస్తూ ఉండటమూ కలత పెట్టే అంశమే. పారిన రక్తానికీ, సాధించిన మార్పుకూ మధ్య  లేని పొంతన ఒక సమస్యనే. స్వాతంత్ర్యానికి ముందూ తరువాతా, అటువంటి వారి త్యాగాలు ఒకమేర ప్రభావితం చేయడం ద్వారా రూపొందిన ప్రజాస్వామిక చట్టాలు కూడా అమలు కాని అప్రజాస్వామిక స్థితి నేడు భయం పుట్టిస్తోంది. మనం వ్యవస్థీకృత హింస పట్ల భయం వల్లనో, నిస్సహాయత వల్లనో, ఆ హింస ద్వారా మన ప్రయోజనాలు నడిచి పోతున్నాయి అనో..  చల్నేదో అనుకునే స్థితి ఉన్నంత సేపు ఏదో ఒక  మూల సాయుధ వామపక్ష రహస్యోద్యమం అది ఎంత  ఆశక్తమైనదీ, పెద్దగా సానుకూల   ఫలితాలు సాధించ లేనిదీ అయినా ఒక మేర పీడిత  సముదాయాలలోని వారికీ, వ్యవస్థాపరంగా జరుగుతున్న అన్యాయాన్ని సహించని వారికీ ఒక ఆకర్షణీయమైన పోరాట మార్గంగా  కనిపించడాన్ని మాత్రం అసంబద్దం అనలేము. 

వ్యవస్థీకృత హింసను మనం వ్యక్తుల  స్థాయిలో, కుటుంబాల స్థాయిలో,  కులాల లేదా ఇతర సాంస్కృతిక సముదాయాల స్థాయిలో  గుర్తించి తీరాలి. అట్లనే వాటికి బయట ఉన్న(వాటితో బలంగా సంబంధం గల)  సామాజిక-సాంస్కృతిక, ఆర్ధిక, రాజ్య సంబంధ నిర్మాణాల పనితీరులో నిరంతరం గుర్తించడం, ఎదుర్కోవడం చెయ్యవలిసి ఉంటుంది. ఎందుకంటే  ఆ హింస మూలాలు మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, మనచుట్టూ ఉన్న వ్యవస్థల పని తీరులో ఉన్నవి అని గుర్తించాలి. మచ్చుకు, ఆడపిల్లను మనిషిగా గుర్తించక పోవడం, పక్క వాడిని కులం పేరనో మతం పేరనో  చిన్న చూపు చూడటం, అడ్డమైన గడ్డితిని సంపాదన పరులవుతున్న వారి అడుగులకు మడుగులొత్తడం వంటి వాటితో మొదలుకొని నా చిన్ని పొట్టకు శ్రీ రామ రక్ష అనుకోని  ఎవడికి అయితేనేమి నేను బాగుంటే చాలుననే  చింతననే వ్యవస్థీకృత హింసకు ఊతమిస్తుందని గుర్తించడం అవసరం. ఇటువంటి వాతావరణంలో నియమబద్ద ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదని గుర్తించడం ప్రస్తుతం అత్యవసరం. నిత్య జీవితంలో అన్యాయాన్ని గుర్తించి వ్యతిరేకించే కార్యాచరణ విస్తృత స్థాయిలో నిరంతరం సాగడం అవసరం.

వ్యవస్తీకృత హింసనూ, దానిని పెంపొందించే అప్రజాస్వామిక వ్యవస్థను మనం ప్రాణ హాని లేని, లేక తక్కువ ప్ర్రాణ హాని ఉండే ప్రయత్నాల ద్వారా లేదా ప్రజాస్వామికంగా మార్చుకోగలమా  అన్న కీలకమైన, తప్పించుకోలేని ప్రశ్న.. ఇటువంటి మరణాలు సంభవించిన ప్రతిసారీ ముందుకొస్తుంది. ఈ  ప్రశ్నను ఎదుర్కొని దానికి సమాధానం వెదికే పయనమే సమాజంలో ప్రజాస్వామిక జీవితాన్ని నిలిపే పోరాటమనీ, దాన్ని నిత్య జీవితంలోకి తెచ్చుకోవడం అవసరమని మనం గుర్తించాలనీ ఈ రకమైన మరణాలు మనలను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాయని గ్రహించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం.

3-11-2016
హెచ్ .వాగీశన్
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్ , నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్.
ఈమెయిల్: vajimukha@gmail.com


ఆలోచనాత్మకమైన ఈ వ్యాసం సంక్షిప్తపాఠం కింది లింకులో చూడవచ్చు

ఆ కాల్పులు వ్యవస్థకే సవాళ్లు..!
http://www.sakshi.com/news/vedika/aob-encounter-challengings-for-our-system-421428?from=inside-latest-news

సాక్షి సౌజన్యంతో...

Monday, November 7, 2016

నిజంగానే.. ఇప్పుడు జరగవల్సింది ఏమిటి?


ఏఓబీ ఎన్‌కౌంటర్ ప్రజాయుద్ధంపై చేసిన గాయం మానుతున్నట్లుంది. ఊహించని పెను నష్టం ఉద్యమాన్ని, సానుభూతిపరులను కలవరపెడుతున్న నేపథ్యంలోనే ఆర్కే తదితర నాయకత్వం సురక్షితమన్న వార్త అడవినీ, మైదానాన్ని సాంత్వన పరిచినట్లే ఉంది. ఆర్కే ఏమయ్యాడు, ఇతర నాయకత్వం ఏమయింది అనే చర్చ ముగిసింది. మరోవైపున జరిగిన నష్టం పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేస్తూనే.. ప్రజాయుద్ధం అంటే ఇదేనా?  ప్రజలు స్పందించని యుద్ధాలు అవసరమా? ఒక్క 'పని స్థలం'లో అయినా ఈ ఏకపక్ష దాడి పట్ల నిరసన వ్యక్తం చేశారా, సుదీర్ఘమైన, నిరంతరమైన పని అవసరాన్ని నిర్లక్ష్యం చేసి ఆకస్మిక దాడుల్నీ, అతి కొద్దిమంది నడిపే విప్లవాల్నీ రాజకీయపంధాగా అనుసరిస్తున్నామా? అంటూ రంగనాయకమ్మ వంటి వారి నుంచి హెచ్చరిక రూపంలోని విమర్శల క్రమం మీడియాలో మొదలైంది.  

ఇప్పుడు జరగవల్సింది ఏమిటి?
http://www.andhrajyothy.com/artical?SID=330340

"ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో, మావోయిస్టు పార్టీ మీద, ప్రభుత్వం చేసిన హత్యా కాండ, శ్రామిక వర్గ గ్రహింపు వున్న వారికి గాఢమైన దుఃఖం కలిగిస్తుంది. ‘వర్గ పోరాటం’లో, ప్రజా యుద్ధ పంధా పట్ల మావోయిస్టు పార్టీకి వున్న అవగాహనా, ఆచరణా, ఎంత లోపభూయిష్టమైనవైనా, ఆ పార్టీ, ఆ ప్రాంత ఆదివాసీ ప్రజల ప్రయోజనాల కోసమే పోరాడుతున్నదనేది నిజం! ... మావోయిస్టు పార్టీలో, కార్యకర్తలు గానీ, నాయకులు గానీ, జీతభత్యాలకో, ఎక్స్‌-గ్రేషియాలకో, ప్రమోషన్లకో, చేరిన వారు కారు! ఆదివాసీ ప్రయోజనాలే వారి ఉద్యమ లక్ష్యం!"  "జరిగిన ఆపద ఇంతదీ, అంతదీ కాదు ఘోరమైనది! అటువంటి ఘోరం జరిగితే, శ్రామిక ప్రజలలో ఎంత కదలిక కనపడింది? ఎక్కడైనా ఒక్క కార్మిక సంఘం, తన నిరసనని చూపించిందా? ఎక్కడైనా, నిరసనలతో ఒక్క బస్సు ఆగిందా? ఒక్క రైలు ఆగిందా? ఒక్క పని స్థలంలో సమ్మె జరిగిందా?... అంటూ రంగనాయకమ్మ గారు ప్రశ్నలు సంధించారు. 

‘‘ప్రజల ప్రయోజనాలనే లక్ష్యంగా చేసుకుని పోరాడుతున్నామే! ఇల్లూ వాకిలీ, సదుపాయాలూ, ఆరోగ్యాలూ, అన్నీ వదులుకుని, పోలీసు నిర్బంధాలకూ-చిత్రహింసలకూ - చివరికి కాల్పులకు గురవుతున్నామే! ఇన్ని జరుగుతోన్నా ప్రజలు ఎందుకు స్పందించడంలేదు మనది ప్రజా యుద్ధ పంధాయేనా లోపం ఏదైనా జరుగుతోందా’’ అని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా ఆత్మ విమర్శ ఎన్నడైనా జరిగిందా?.. ‘‘పొలాలూ- ఫ్యాక్టరీలూ-గనులూ రవాణా - వంటి పని స్తలాల్లో శ్రామికుల్ని సంఘాల్లో సంఘటితం చేయడానికి మనం ఏం చేశాం’’ అని ఆలోచించారా? సంఘటితం కాని ప్రజలు ఒంటరులుగా ఏం తెలుసుకుంటారు? అని ప్రశ్నించారామె. పైగా నూటయాభై ఏళ్ల క్రితం ఎంగెల్స్ రాసిన ముందుమాటలోంచి ఒక వాక్యాన్ని ఉదహరించారు కూడా. 

‘‘ఆకస్మిక దాడుల కాలమూ, చైతన్యం లేని జనాలను చైతన్యం గల అతి కొద్దిమంది నడిపే విప్లవాల కాలమూ, గతించిన కాలం అయింది. సామాజిక వ్యవస్తను సంపూర్ణంగా పరివర్తన చెందించడం - అనేదే ప్రశ్న అయినప్పుడు, జనాలు తమంతట తాము దానిలో (వర్గ పోరాటంలో) వుండి తీరాలి. ఏది సమస్యో, తాము దేని కోసం పోరాడుతున్నారో, అప్పటికే గ్రహించి వుండి తీరాలి. ఏమి చెయ్యాలీ - అనే దానిని జనాలు అర్థం చేసుకోవాలీ - అంటే, సుదీర్ఘమైన, నిరంతరమైన పని అవసరం’’ (మార్క్స్‌ రాసిన ‘ఫ్రాన్సులో వర్గ పోరాటాలు’కి ఎంగెల్స్‌ - ముందు మాట) 

అదే సమయంలో మిత్రులు,  ప్రజాసాహితి పత్రిక సంపాదకవర్గ సభ్యులు దివికుమార్ గారు ఆంద్రజ్యోతి ఆదివారం సంచిక (06-11-2016)లో ప్రచురితమైన రంగనాయకమ్మ గారి విమర్శను సపోర్టుగా చేసుకుంటూనే..,. టెర్రరిస్టు చర్యల ద్వారా మనం సాధించేమి ఏమీ ఉండదని 85 ఏళ్ల క్రితం భగత్ సింగ్ చేసిన సూత్రీకరణను గుర్తు చేస్తూ గతంలో 2007లో జనశక్తి పత్రికలో రాసిన వ్యాసాన్ని నాకు పీడీఎఫ్‌ రూపంలో పంపారు. 

ప్రజావ్యతిరేకులైన బ్రిటిష్ అధికారులను కసితో చంపడం, పార్లమెంటు వంటి కొన్ని వ్యూహాత్మక ప్రాంతాల్లో సంచలనాత్మకంగా బాంబులు వేయడం వంటివి దీర్ఘకాలిక విప్లవానికి హానికరమైనవని భగత్ సింగ్ చేసిన ప్రకటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం పట్ల ప్రజలపట్లే కాదు. ఉద్యమ నిర్మాణాల పట్ల, కార్యకర్తల జీవితాల పట్ల కూడా బాధ్యతాయుతంగా మెలిగిన నిష్మల్మష కమ్యూనిస్టు విప్లవకారుడు భగత్ సింగ్ అంటూ ప్రస్తుత మావోయిస్టు పార్టీ ఉద్యమ కార్యాచరణ తీరుపై నర్మగర్భపు రీతిలో తీవ్ర వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశారాయన. కార్యకర్తలను కాపాడుకోవడం అంటే సాయుధ పోరాటం కాకుండా కొన్ని ఎం.ఎల్ పార్టీలు పార్లమెంటరీ పంధాను చేపట్టి దాని ద్వారా పాలకప్రభుత్వాల నుంచి వచ్చే అన్ని రకాల వెసులుబాటులను పొందడమా అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తోంది. 

అయితే.. ఆకస్మిక దాడులు, అతికొద్దిమంది నడిపే విప్లవాలుగానే ఒక సాయుధపోరాట సంస్థ ఆచరణ కొనసాగుతోందా అనేది ఎంత ఆలస్యంగానైనా మావోయిస్టు పార్టీనుంచే సమాధానం రావాల్సి ఉంది. రంగనాయకమ్మ గారే  కాదు.. దివికుమార్ గారే కాదు..  ఎవరు ఈ ప్రశ్న వేసినా దానిపై ఆవేశం, ఆగ్రహ స్పందనలకు అతీతంగా సైద్ధాంతికపరంగా సమాధానం ఇవ్వాల్సిందే. ఆ బాధ్యత ఉద్యమానిదే కాదు.. ఉద్యమాన్ని సమర్థిస్తున్న ప్రజాతంత్ర సంస్థల బాధ్యత కూడా. కానీ.. ఎంగెల్స్ పేర్కొన్న "సుదీర్ఘమైన, నిరంతరమైన పని అవసరం" అన్న ఎరుక లేకుండానే గత యాభై ఏళ్లుగా సాయుధపోరాటం చేస్తున్న ఒక విప్లవ సంస్థ మనగలుగుతోందా? 
అన్నదే ఆలోచించవలసిన, చర్చించవలసిన అంశం. 

దండకారణ్యంలో జనతనరాజ్యం పేరిట సాగుతున్న నూతన పాలన గురించి దేశ విదేశాల మీడియాలో వార్తలు, సంబంధిత సాహిత్యం విస్తృతంగా వస్తున్నా, అందుబాటులో ఉన్నా.. దాని గురించి ఏమాత్రమూ ప్రస్తావించకుండా మావోయిస్టు పార్టీ ఆచరణను కొన్ని వ్యక్తిగత దాడులు, వ్యక్తుల హత్యలకు పరిమితం చేస్తూ మాట్లాడటం.. దానికి భగత్‌సింగ్‌ టెర్రరిజంపై చేసిన వ్యాఖ్యలను ఉల్లేఖించడం కనీసం న్యాయబద్ధమైన చర్చేనా అనేది తేలాల్సి ఉంది. భారత పాలక వర్గాలు కూడా వేయని ఆరోపణను మావోయిస్టు పార్టీపై చేస్తూ దాన్ని టెర్రరిజం పరిధిలోకి కుదించడం సమంజసమేనా అనేది ప్రత్యామ్నాయ ఉద్యమాల మద్దతుదారులు ఆలోచించాలి. సాయుధ పోరాటం అనే పదాన్నే పరమ అభ్యంతరకరమైన భావనగా ముద్రించే ఇలాంటి విమర్శలు సాధించే అంతిమ ప్రయోజనం ఏమిటి అనేది కూడా తేలాల్సి ఉంది. 

ఈ సందర్భంగా.. పీఓడబ్ల్యూ (ప్రగతిశీల మహిళా సంఘం) అధికార మాసపత్రిక 'మాతృక' నవంబర్ సంచిక కవర్ పేజీలో వచ్చిన 'క్షమాపణ' అనే కవిత హృద్యంగానూ, జరిగిన నష్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే సానుకూల అవగాహన కల్పించేది గానూ ఉంటూ ఆలోచనల్లో ముంచెత్తింది.

"బిడ్డలు రాలిపోయే కాలం.. అయినా నేనిప్పుడు శోకం గురించి మాట్లాడను.. 
పోరాటపు పాతపాట.. పల్లవులు మారిస్తే సరిపోదు, హృదయాలను మార్చాలి."

అంటూ దిశానిర్దేశం చేస్తున్న ప్రబోధాత్మక కవిత ఇది. కవితలోని కొన్ని ప్రతీకలు, పోలికలు అభ్యంతరకరంగా ఉన్నట్లనిపించినా కొత్త ఆలోచనలను రేపటంలో ఇది తన వంతు ప్రేరణ నిస్తోంది. 

'మాతృక' పత్రిక నవంబర్ సంచిక సాఫ్ట్ కాపీ పంపిన రమాసుందరి గారికి ధన్యవాదాలు.

క్షమాపణ

బిడ్డలు రాలిపోయేకాలం
అయినా 
నేనిప్పుడు శోకం గురించి మాట్లాడను.

ఎందుకంటే
తెరుచుకునే ఉన్న ఆ కనులలో
కలలే తప్ప కన్నీరు లేదు.

అవును, అప్పుడెప్పుడో
జనం కోసం అడవుల్లో
తపస్సులు చేసే వాళ్లు

ఇప్పుడు తుపాకులతో
కాలం చేస్తూ, వాళ్లే.

అమ్మలు కొందరు
ఇక్కడ బిడ్డలను దానం చేస్తే
కొందరు బిడ్డలు వారి అయ్యలను అంకితమిచ్చేశారు.

మరణం మహత్తర దు:ఖం కాదు
ఎప్పటికీ జీవితం కంటే,
ఓ దేహరూప సంతకమై
మిగిలినప్పుడు, ఈ సమాజపు పుటపై.

పాలిచ్చి పెంచిన బిడ్డలు
పాడెపై పోరాడుతున్నప్పుడు కూడా
ఆ తల్లి క్షమిస్తుందీ, ఈ రక్తగర్భని.

మనమే
నిద్ర నటించడం అలవాటై
దానిలోనే మరణిస్తాం
ఓ ఉదాత్త ఉత్తేజాన్ని 
ఆశాపతన కాలాన ఏకాకిని చేసి.
ప్రజల దు:ఖం
ప్రపంచానికెప్పటికీ సుఖం కాదు, వాళ్లకిలాగానే.

తండ్రులారా, తల్లులారా
రాలిపోయిన బిడ్డలారా
బతుకీడుస్తూ, ఏడుస్తూ
కీడులతో పీడించబడే జనంలారా

పోరాటపు పాతపాట
పల్లవులు మారిస్తే సరిపోదు,
హృదయాలను మార్చాలి.

అప్పుడే కదా
అస్తమించిన ఆ సూరీడు
రుధిరపు రొప్పులను తప్పించుకొని
రెపరెపలాడేదో, నవసమాజ పతాకమై.

మాతృకలో వచ్చిన ఈ  కవిత రచయిత భాస్కర్ కె.గారు.

Saturday, November 5, 2016

పథకం ప్రకారమే దాడిమల్కన్‌గిరి జిల్లా రామగూడ గ్రామం సమీపంలో ఆంధ్రా-ఒడిస్సా పోలీసులు చేసిన దాడి పూర్తిగా  పథకం ప్రకారమే జరిగిందని  ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగబంధు పేర్కొన్నారు. ఈ ఘటనపై జగబంధు చేసిన ప్రకటనను మీడియాకు పంపించిన ఆడియోలో గుర్తు తెలియని మావోయిస్టు మహిళ చదివి వినిపించారు. ఆ ప్రకటన పూర్తి పాఠం..

"అక్టోబర్ 24న మల్కన్‌గిరి జిల్లా, రామగూడ గ్రామం సమీపంలో మా మకాంపై ఆంధ్ర-ఒడిశా పోలీసులు సంయుక్తంగా దాడిచేసి 31 మంది కామ్రేడ్స్‌ని హత్యచేసిన ఘటనపై ఇప్పటివరకు పోలీసు అధికారులు చేసిన ప్రకటనలు వాస్తవంగా జరిగిన సంఘటనకు పూర్తి భిన్నంగా, అవాస్తవాలతో కూడినవిగా ఉండి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి. పోలీసుల దిగ్బంధంలో చిక్కుకున్న మేము వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంలో కొంత ఆలస్యం జరిగింది. 

అసలేం జరిగిందంటే అక్టోబర్ 23వ తారీఖున మా దళం రామగూడ గ్రామానికి చేరుకుని అక్కడే మకాం వేసింది. రాత్రి అదే స్థలంలో పడుకున్నాం. 24 ఉదయం పోలీసులు మా మకాం వైపు రావడాన్ని గమనించిన ప్రజలు మాకు సమాచారం ఇవ్వడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని వారిని నిర్బంధించారు. ఉదయం 6 గంటలకు రోల్‌కాల్ జరుగుతున్న సమయంలో రెండువైపుల నుంచి మా మకాంకి అతి సమీపంలోకి పోలీసులు చేరుకున్నారు. అప్రమత్తమైన మా పిఎల్‌జిఎ (ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం) వెంటనే కాల్పులు ప్రారంభించింది. ఆ సమయంలో మాతోపాటు ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరాయుధులైన యువతీయువకులు పక్కనే ఉన్న గ్రామంవైపు పరుగెత్తారు. పరుగెత్తిన వారిపైనా, పక్కనే ఉన్న నదిలో చేపలు పడుతున్నవారిపైనా పోలీసులు విచ్చలవిడిగా ఆటో ఆయుధాలతో కాల్పులు జరిపారు. కాల్పుల్లో అనేకమంది గాయపడ్డారు. వారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నారు. 

మా దళం పోలీసులను ప్రతిఘటిస్తూనే మకాం నుంచి క్షేమంగా రిట్రీట్ అయ్యాం. ఆ సమయంలో మాకు ఎలాంటి భౌతిక నష్టం జరగలేదు. అయితే అప్పటికే మా దళం రెండు వలయాలుగా పోలీసులచే చుట్టివేయబడిఉంది. ఒక వలయాన్ని ఛేదించడానికి నలభై నిమిషాల పాటు కాల్పులు జరిపి సురక్షితంగా రిట్రీట్ అయ్యాం. దాని తర్వాత పోలీసులు పన్నిన మరో వలయంచే చుట్టివేయబడ్డాం. వారంతా కొండలను ఆక్రమించుకుని మా రిట్రీట్ దిశగా అనుసరిస్తూ అన్ని వైపుల నుంచి కాల్పులు ప్రారంభించారు. 

అప్పటికే కాల్పులు ప్రారంభమై గంట గడిచిపోయింది. పోలీసులు వందలాది తూటాలను కాల్చగా మేము వందలాది తూటాలను కాల్చాము. చివరి వలయాన్ని గండికొట్టే సమయంలో మేము ఒక కొండ నుంచి మరొక కొండకు వెళుతున్నప్పుడు చిన్న మైదానాన్ని దాటి కొండ ఎక్కాల్సి వచ్చింది. అప్పుడు పోలీసు బలగాలు అతి సమీపానికి చొచ్చుకు వచ్చాయి. వందలాది పోలీసులు కొండలపై అనుకూల రక్షణలో ఉండి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దాన్ని రెండువైపులా గండి కొట్టే సమయంలో కొద్ది మంది కామ్రేడ్స్ అమరులై, అనేకమంది గాయపడి మిగిలిన కామ్రేడ్స్‌ను రక్షించారు. గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న మా కామ్రేడ్స్‌ని పోలీసులు చుట్టుముట్టి హతమార్చాయి. కొందరు గాయాలతో తప్పుకున్నారు. 27వ తారీఖును మరిన్ని అదనపు బలగాలను రప్పించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా దిగ్బంధించి, గాయపడిన మా కామ్రేడ్స్‌ని తప్పించుకోనీయకుండా వెతికారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాకకు స్వాగతంగా అప్పటికే వారి చేతుల్లో ఉన్న నలుగురు సాధారణ యువతీ యువకులైన కుదిరిగుడ కొమలి, శ్యామల పిల్లిపొదిరి, కావేరి ముదిలి-లచ్చ ముదిలి, డక్క పొదిరిలను కాల్చి చంపి మరో ఎన్‌కౌంటర్ కథనాన్ని అల్లారు.

గాయపడి శత్రు వలయంలో చిక్కిన మరో మహిళా కామ్రేడ్‌ను 26న రామగూడ ప్రజలందరూ చూస్తుండగానే కాల్చి చంపారు. అలాగే గాయపడి కదల్లేని స్థితిలో ఉన్న మరో ఇద్దరు కామ్రేడ్లు గౌతమ్, నరేశ్‌లను 27 ఉదయం 7 గంటలకు గ్రామ ప్రజలు చూస్తుండగానే కాల్చి చంపి ఎన్‌కౌంటర్ కథను అల్లారు. మా కామ్రేడ్స్ ఈ ఎన్‌కౌంటర్ ఎదుర్కోవడంతో అత్యంత ధైర్యాన్ని, సాహసాన్ని, త్యాగనిరతిని ప్రదర్శించారు. వారు అమరులవుతూ కూడా వారి చేతుల్లోని ఆయుధాలను శత్రువుల చేతికి చిక్కకుండా మా సహచర కామ్రేడ్లకు అందిస్తూ అమరులయ్యారు. ఈ హత్యా ఘటనలో 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మొత్తం 31 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. అందులో 9 మంది నిరాయుధులైన సాధారణ యువతీ యువకులే. అందులో 9మందిని కూడా పట్టుకుని 24న నలుగురిని, 25వ తేదీన నలుగురిని, బలగాలు వాపస్ అయ్యే రోజున మరొకర్ని హత్య చేశారు.
అమరులైన వారి వివరాలు:
కామ్రేడ్ ప్రసాద్ @ బాకూరు వెంకటరమణ (AOB SZCM), బాకూరు గ్రామం విశాఖ జిల్లా
కామ్రేడ్ దయా @ కిష్టయ్య (AOB SZCM), నల్గొండ జిల్లా
కామ్రేడ్ గంగాధర్ @ ప్రభాకర్ (DVCM), యాప్రాలు, రంగారెడ్డి జిల్లా
కామ్రేడ్ కిరణ్ @ సువర్ణ రాజు (డి.వి.సి.యం), పశ్చిమగోదావరి జిల్లా
కామ్రేడ్ మున్నా @ పృధ్వీ (ప్లటూన్ డిప్యూటీ), ఆలకూరపాడు
కామ్రేడ్ బిర్సు @కేశవరావు (సెక్షన్ కమాండర్), తాడిపాలెం, విశాఖ జిల్లా
కామ్రేడ్ రాజేష్ @ సోమ్లు (సెక్షన్ డిప్యూటీ), ఊరు-కొట్టం, బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ ఎర్రాలు @ నంగాలు (సిపిసిఎమ్), ఊరు- ఎర్రం ,బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ బుద్ధి @ బుద్రిసోరి (ఎసియం), ఊరు-గురునామ్, బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ మంజుల @ ఉంజీ (ఎసియం), ఊరు-నాంగెల్ గూడెం, సుక్మా జిల్లా
కామ్రేడ్ గౌతమ్, టెక్నికల్ దళ కమాండర్, కాంకేర్,
కామ్రేడ్ మురళి @ సింహాచలం (ఎసియం), విజయనగరం జిల్లా
కామ్రేడ్ మధు @ దాసు (ఎసియం), పశ్చిమగోదావరి జిల్లా
కామ్రేడ్ లత @ భారతి (ఎసియం), హైదరాబాద్
కామ్రేడ్ మమత @బొట్టు కుందన (పియమ్), శ్రీకాకుళం జిల్లా
కామ్రేడ్ దాసు @ సాధురామ్ (పియమ్), వాకపల్లి గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ నరేశ్ @ సురేశ్ (పియమ్), గ్రామం-సామాన, కోరాపుట్ జిల్లా
కామ్రేడ్ తిలక (పియమ్), పశ్చిమ బస్తర్, బీజాపూర్ జిల్లా
కామ్రేడ్ గంగ @ గంగ మాధవి (పియమ్) శీలకోట గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ రజిత @ కామి (పియమ్), నానాదరి గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ జ్యోతి (పియమ్), సుమనోవ గ్రామం, విశాఖ జిల్లా
కామ్రేడ్ కమల @ లక్కీ (పియమ్) ఆలుమ్ గ్రామం, బీజాపూర్ జిల్లా

సాధారణ యువతీయువకులు:
లచ్చ మొదిలి, గ్రామం- డక్ల పొదురు, మల్కన్ గిరి జిల్లా
కావేరి మొదిలి, గ్రామం- డక్ల పోదురు
బుమిలి, గ్రామం- బచ్చర పొదురు
మల్కన్ పాంగి, గ్రామం-బచ్చర పొదురు
అమల, గ్రామం- బచ్చర పొదురు
షిండే, గ్రామం- ముక్కుడు పల్లి
శ్యామల, గ్రామం-సుంగి పొదురు
జయా, గ్రామం- కొదురుగూడ
కొమలో, గ్రామం- కోదురుగూడ
           
            మా అమరుల శవాల పట్ల అత్యంత అమానుషంగా వ్యవహరించారు. ఆదరాబాదరాగా పోస్టుమార్టం నిర్వహించి, వాళ్ళ శవాలను బంధుమిత్రులు గుర్తుపట్టే విధంగా ఫోటోలను ప్రదర్శించకుండా సాధారణ అట్టపెట్టేల్లో పెట్టారు. వారి కుటుంబసభ్యులు శవాలను తీసుకుపోయి చివరిసారి చూపుకు కూడా నోచుకోకుండా చేశారు. ఈ అమరవీరులందరికీ మా పార్టీ తలవంచి వినమ్రంగా జోహార్లర్పిస్తున్నది. వారి కుటుంబసభ్యుల, బంధుమిత్రుల బాధలు, దుఃఖంలో పాలుపంచుకుంటున్నది. వారిని హత్య చేసిన రాజ్యాంపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనుతున్నది. వారి ఆశయాలను తుదకంతా కొనసాగిస్తామని శపథం చేస్తున్నది. అమరులైన కామ్రేడ్లందరూ పీడిత వర్గాల నుండి ఉద్యమంలోకి వచ్చిన వారే. వాళ్ళు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమించారు. అయితే ఆ సమస్య పరిష్కారానికి సాయుధమవ్వడం తప్ప మరో మార్గం లేదని స్వీయ అనుభవం ద్వారా తెలుసుకొని ఆయుధాలు పట్టారు. ఇది ప్రభుత్వం చెబుతున్నట్లుగా శాంతి భద్రతల సమస్య కాదు. నూటికి తొంభై శాతంగా ఉన్న ప్రజల సమస్య. ప్రజల సామాజిక ఆర్థిక సమస్య. ఈ సమస్య మా కామ్రేడ్స్ ను హత్య చేయడం ద్వారా పరిష్కరించలేరు. ఈ సమస్య పరిష్కారమయ్యేవరకు ప్రజలు పోరాడుతూనే ఉంటారు. పోరాడే ప్రజల నుండే మళ్ళీ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అమరులు లేని లోటును మళ్ళీ భర్తీ చేస్తాం. మా పార్టీకి త్యాగాలు కొత్తవి కాదు. త్యాగాల చాలు వేస్తూనే ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఈ సంఘటనలో మేము శత్రువును అంచనా కట్టడంలో చేసిన పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాం. అందుకు తీవ్రంగా విచారిస్తున్నామని ప్రజలకు తెలియజేస్తున్నాం. వారి ఆశయాలను ముందుకు తీసుకుపోడానికి శత్రువుతో మరింత వర్గ కసితో పోరాడాలని పిలుపునిస్తున్నాం. ఈ సంఘటనలో నిరాయుధులైన తొమ్మిది మంది యువతీ యువకులను సజీవంగా పట్టుకుని హత్య చేసిన సంఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ హత్యాకాండను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
            కటాఫ్ ఏరియా మావోయిస్టులు సేఫ్ జోన్ గా వాడుకుంటున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారం వట్టి బూటకం. ఈ ప్రాంత ప్రజలు మా పార్టీ నాయకత్వంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా, బలిమెల రిజర్వాయర్ ముంపు నిర్వాసిత సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలిటెంట్ ఆందోళన చేస్తున్నారు. దున్నేవారికే భూమి సమస్యపై వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకొని భూమిలేని పేదలకు పంపిణీ చేస్తూ వ్యవసాయక విప్లవ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. అలాగే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. దీంతో రాజ్యం ప్రత్యేకంగా కేంద్రీకరించి ఆంధ్రా ఒడిశా పోలీసులు సంయుక్తంగా అనేక సంవత్సరాల నుండి కూంబింగ్ ల పేరుతో దాడులు చేసి ప్రజలను, పి.ఎల్.జి.ఏ సభ్యులను హత్యలు చేశారు. గత రెండు సంవత్సరాల నుండి నాయకత్వ నిర్మూలన కోసం ప్రత్యేకంగా కేంద్రీకరించారు. అందులో భాగంగా జరిగిందే అక్టోబర్ 24 ఘటన. అయితే పోలీసులు ప్రకటిస్తున్నట్లుగా ఆ సమయంలో మా పార్టీ పైకమిటీ సమావేశాలు గానీ, ప్లీనాలు గాని ఏమీ లేవు. ఆ ప్రాంత ఆర్గనైజేషన్ లో భాగంగానే మా దళం అక్కడికి వెళ్లింది. పక్కా సమాచారంతోనే 23 రాత్రి అత్యంత రహస్యంగా మా మకాం పరిసరాలకు బలగాలను చేర్చి చుట్టుముట్టి ఉన్నారు. మరికొన్ని బలగాలను 24 ఉదయం 6 గంటలకు రప్పించుకొని చుట్టుముట్టి దాడి చేశారు. దీనికి లొంగిపోయిన మాజీల సహకారం కూడా తీసుకున్నారు. ఈ ఘటన జరటానికి దారితీసిన మా లోపాలను సమీక్షించుకుంటూనే, దీనిలో ఇన్ ఫార్మార్లుగా వ్యవహరించిన వారిని, అలాగే విప్లవద్రోహులైన మాజీలను ప్రజల సహకారంతో శిక్షిస్తామని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఇప్పటికీ ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి వందలాది బలగాలతో గాలింపులు కొనసాగిస్తున్నారు. దాంతో ప్రజలు చేతోకొచ్చిన పంటను రక్షించుకోలేకపోతున్నారు. పశువులను కాపలా కాయలేకపోతున్నారు. ఈ బలగాలను వెంటనే వెనక్కి తీసుకోకపోతే రెండు రాష్ట్రాల అధికార టిడిపి, బిజెడి నాయకులు మూల్యం చెల్లించవలసి ఉంటుంది.

విప్లవాభివందనాలతో
జగబంధు
ఎఒబి ఎస్.జెడ్.సి అధికార ప్రతినిధిఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగబంధు ప్రకటన పూర్తి ఆడియో పాఠాన్ని కింది సాక్షి లింకులో వినవచ్చు.

9 మంది సామాన్య పౌరులను చంపారు!
http://www.sakshi.com/news/district/9-people-common-citizens-killed-418752


విరసం వెబ్‌సైట్‌లో వచ్చిన జగబంధు అసంపూర్తి ప్రకటనను కింది లింకులో వినవచ్చు.

పథకం ప్రకారమే దాడి: ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి జగబంధు
http://virasam.org/article.php?page=303

                                                    **********

ఆంధ్రజ్యోతి పత్రికలో ఆర్కె ఎందుకు ఏఓబీకి వచ్చాడనే అంశంపై ఒక విశేష కథనం వచ్చింది.

ఆర్కే క్షేమం: వరవరరావు 
04-11-2016 00:58:43
http://www.andhrajyothy.com/artical?SID=329559

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే ఉనికిపై ఉత్కంఠ వీడింది. ఆయన క్షేమంగా ఉన్నారని మావోయిస్టు పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. గతనెల 24న ఒడిసాలోని మల్కన్‌గిరి అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన అనంతరం మరో రెండు చోట్ల ఎన్‌కౌంటర్‌లు చోటుచేసుకున్నాయి. పోలీసు కాల్పుల్లో మావోయిస్టు నేత ఆర్కే గన్‌మెన్‌ కూడా మరణించారు. ఈ నేపథ్యంలో ఆర్కేకు కూడా గాయాలయ్యాయని, ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారని ప్రజాసంఘాలు తొలి రోజు నుంచి ఆరోపిస్తున్నాయి. అయితే... ఆయన తమ అదుపులో లేరని పోలీసులు హైకోర్టుకు కూడా నివేదించారు. చివరికి... ఆయన క్షేమంగా ఉన్నారంటూ హక్కుల నేతలకు సమాచారం వచ్చింది. విరసం నేత వరవరరావు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

ఆర్కే క్షేమంగా ఉన్నారు: పద్మక్క
అది సాధారణ సమావేశం కాదు! పార్టీ పునర్‌వ్యవస్ధీకరణ, కీలక బాధ్యతల్లో మార్పులు, చేర్పులు భవిష్యత్‌ కార్యాచరణ, పార్టీ విధివిధానాలపై చర్చించేందుకు ఏఓబీ పరిధిలోకి వచ్చే కీలక నేతలంతా హాజరైన/హాజరు కావాల్సిన సమావేశం! ఏవోబీ కమిటీ రూపురేఖలు, భవిష్యత్ కార్యాచరణ, కీలక వ్యూహాలు రచించేందుకు ఉద్దేశించిన సమావేశం! కానీ... ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడింది. అంతేకాదు... కొత్త బాధ్యతల్లోకి రావాల్సిన నేతలు, దండకారణ్యంతోపాటు, ఇతర డివిజన్లకు వెళ్లాల్సిన ముఖ్యులు సైతం ఎన్‌కౌంటర్‌లో మరణించారు. గతనెల 24న జరిగిన ఏవోబీ ఎన్‌కౌంటర్‌ సందర్భంగా మావోయిస్టు పార్టీ అంతర్గత డాక్యుమెంట్లు కూడా వెలుగుచూశాయి. ఆంధ్రా-ఒడిసా ఉద్యమాన్ని మరింత దూకుడుగా తీసుకెళ్లేందుకు, ప్రత్యేకించి బాక్సైట్‌ వ్యతిరేక ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఆ పార్టీ కార్యాచరణ చేపట్టింది. ఓ వైపు నిర్భంధాన్ని ఎదుర్కొంటూనే, మరోవైపు పట్టున్న ప్రాంతాల నుంచి కొత్తగా ఇతర ప్రాంతాలకు విస్తరించాలని ప్రణాళికలు వేశారు. ఇందుకోసం ప్రజాసమస్యలే ఆయుధంగా ఉద్యమాలు నిర్మించాలని, గ్రామాలు, పట్టణాల్లో ఉన్న పార్టీ శ్రేణులు, సానుభూతిపరుల సహకారం పెద్ద ఎత్తున తీసుకోవాలని డాక్యుమెంట్‌లో రాశారు. ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీలోనే పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ప్రతిపాదించారు. వీటిని ఆర్కేనే ఏవోబీ కమిటీలో చర్చించి అమలు చేయాల్సి ఉంది. ఇక్కడ కేంద్ర కమిటీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఏవోబీ కార్యదర్శిగా ఆర్కేను రిలీవ్‌ చేసింది. ఆయన స్థానంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పద్మక్కను ఎంపిక చేశారు. ఆమె ప్రస్తుతం దండకారణ్యం ప్రత్యేక జోనల్‌ కమిటీలో, డీకే కమిటీలో సభ్యురాలు. 

వారిని జాగ్రత్తగా చూసుకోండి
జైళ్లలో ఉన్న నేతల కుటుంబీకులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కిందిస్థాయి నాయకత్వాన్ని ఆదేశించింది. లొంగిపోయేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజా సంఘాలకు కూడా వారికి సంబంధించిన సమాచారం ముందుగానే ఇవ్వాలని ఆదేశించింది. అయితే, పార్టీలోనే ఉంటున్న పెద్దలు (వెటరన్స్‌) కొందరు క్షేత్రస్థాయిలో తిరగలేకపోతున్నారని, వారి సంరక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డివిజన్‌, ఏరియా కమిటీలను ఆదేశించింది.
                               **************************

ఒకవైపు మావోయిస్టు నేత ఆర్కే క్షేమం అనే వార్తతోపాటు, ఏవోబీ ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందనే అంశంపై మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన ఈ అధికారిక ప్రకటన చాలా విషయాలను స్పష్టం చేసినట్లే... ఆయుధాలతో పరస్పరం తలపడుతున్న పక్షాలకు ఏమరుపాటు ప్రాణాంతకం. క్షణకాలంలో మొదలయ్యే అనూహ్య దాడిని (సర్‌ప్రైజ్ అటాక్) తట్టుకుని నిలబడటం ఎదిరిపక్షానికి చాలా కష్టం.  గత నాలుగేళ్లలో ిఇది పదే పదే అటూ ఇటూ రుజువవుతూనే ఉంది. 

అన్నిటికంటే మించి.. 30 మంది పైగా మరణించిన ఒక మేజర్ ఎన్‌కౌంట‌ర్‌లోనూ ఆర్‌కేతో సహా అగ్రశ్రేణి నాయకత్వం ప్రాణాలతో తప్పించుకుందంటే ఆ దాడి నిష్ఫలమే అని చెప్పాలి. ఇంతమందిని చంపాం అని లెక్క వేసుకోవడానికి తప్పితే దాడికి దిగిన పక్షం సాధించింది ఏమీ లేదనేది స్పష్టం. అదే సమయంలో 1998లో ఇదే పరిస్థితుల మధ్య ఏఓబీలో జరిగిన కోపర్‌డెంగ్ ఎన్‌కౌంటర్‌ను గుర్తు చేసుకుంటే కేడర్ పరంగా మావోయిస్టు పార్టీకి ఇప్పుడు జరిగిన నష్టం కూడా తక్కువేం కాదు. 

అంతిమంగా అర్థం అవుతోందేమిటంటే అడవిలో ఆదివాసులు ఉన్నంతవరకు.. వారి భూములను, వారివైన వనరులను కొల్లగొట్టే విధానాలు ఉనికిలో ఉన్నంతవరకు ఇలాంటి ఘటనలు ఆగిపోవడం అనేది జరగనిపని. అది రావణ కాష్టమా లేక మరే పదంతో పిిలిచినా సరే. సమస్య రగలడం శాశ్వతం. ఆదివాసుల ఉనికి సమస్యను పోలీిసులు, తుపాకులు, బుల్లెట్లు, మాయం చేయలేవు. 

ఆదివాసులకు మద్దతిస్తున్న, ఆదివాసుల మద్దతు పొందుతున్న మావోయిస్టులను, నక్సలైట్లను జల్లెడ పట్టడం అంత సులభం కాదు. అది మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ అప్పట్లో తలమీద దువ్వెనతో దువ్వుకుని కూంబింగ్ అంటే ఇదీ అని చూపించినంత సులభం అంతకంటే కాదు.