Thursday, March 19, 2015

ఈ అవమానాల కంటే ఆ 'వీడియో' అంత ఘోరమైందా?


ప్రపంచంలో మిగతా దేశాల్లో పరిస్థితిని అలా పక్కన బెడదాం. మన దేశంలో మాత్రం మగాడి కొవ్వుకు ఏ ఆడదీ సరిపోవడం లేదు. జుగుప్స కలిగిస్తున్నా సరే.. కొన్ని నిజాల్ని, కొన్ని వ్యాఖ్యలనూ  అందరం వినడం.. కాదు కాదు... పంచుకోవలసిన అవసరం.. ఇన్ని వేల సంవత్సరాల ఘనతర చరిత్ర తర్వాత ఇప్పుడే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. కామ నరం కట్టలు తెంచుకునిపోయిన మన దేశపు మగాడి కంటికి పసిపాపలూ సరిపోవడం లేదు. పండు ముదుసళ్లూ సరిపోవడం లేదు. చివరకు ముష్టెత్తుకుని బతుకుతున్న అభాగ్య మహిళలను కూడా వదలడం లేదు.

ఇండియాస్ డాటర్‌ డాక్యుమెంటరీని నిషేధించి ప్రపంచం ముందు పరువు కాపాడుకున్నామని శ్రీమాన్ కేంద్రప్రభుత్వం వారు చంకలు గుద్దుకుంటూ ఉండవచ్చు కానీ పశ్చిమ బెంగాల్లో 72 సంవత్సరాల క్రైస్తవ సన్యాసినిపై జరిగిన అత్యాచారంపై అసహ్యం వ్యక్తపర్చేందుకు భాషలోని ఏ పదాలు సరిపోకపోవచ్చు. ఈ దేశం బాగుపడే లక్షణానికి దూరమవుతోందనడానికి ఇంతకు మించిన నిఖార్సు సాక్ష్యం మరొకటి దొరకదు. అన్ని రకాల విద్వేషాలను పెంచి పోషించే రంగస్థలం ఒకటి యావద్దేశంలో తయారయ్యాక పార్లమెంటులో మన జాతి నిర్దేశకులు ఎన్ని బూటకపు ప్రకటనలు చేసినా ఇలాంటి ఘటనలు జరగకుండా ఆగవని తేలిపోతోంది.

తనపై లైంగిక దాడి జరిపిన వారిని క్షమించాలనీ, తన రక్షణ కంటే ఇప్పుడు తన పాఠశాల, అందులో చదువుతున్న పిల్లల రక్షణ గురించే ఎక్కువ ఆందోళనగా ఉందంటూ ఆ క్రైస్తవ సన్యాసిని చేసిన వ్యాఖ్య జాతి మొత్తానికి మరింత అవమానాన్నీ, ఆవేదననూ కలిగిస్తోంది. ఘటనపై ఎంత విచారం వ్యక్తం చేసినా కేంద్ర పరిధిలో లోని చోట ఢిల్లీ అవతల రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే వాటి అధికారం పుట్టలో వేలు పెట్టలేమనీ, మా పరిధిలో ఏం చెయ్యాలో అదంతా చేస్తామని ప్రకటన చేయడం ద్వారా దులుపుకోవడానికి కేంద్రానికి సులువు కావచ్చు.

పోనీ.. మసీదుల ధ్వంసం, చర్చీల ధ్వంసం, ముదివగ్గు సన్యాసినుల జీవన విధ్వంసం అన్నీ వదిలేయండి. మతమార్పిడీలను, మరొక అంశాన్నీ కారణాలుగా పేర్కొని ఈ విద్వేషాన్ని సమర్థించుకుందాం. కానీ బుధవారం నాటి పత్రికలు కొన్ని తిరగేస్తే ఈ దేశం భవిష్యత్ తరాలకు సంజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం నూటికి నూరు రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది.

మచ్చుకు కొన్ని ఘటనలు..

నిన్నటి నమస్తే తెలంగాణ పత్రికలో రెండు వార్తలు..

సికిందరాబాద్ లోని పాత గాంధీ ఆస్పత్రి ప్రదేశంలో ప్రహారీ పక్కన ఉన్న చెట్ల పొదల్లో మంగళవారం తెల్లవారు జామున ఓ మహిళ మృతదేహం వెలుగులోకి వచ్చింది. మృతదేహంపై తీవ్రగాయాలు. లైంగిక దాడి చేసి ఆమెను హతమార్చి ఉండొచ్చని పోలీసుల ప్రకటన. నమస్తే తెలంగాణా పత్రిక టాబ్లాయిడ్‌లో హత్యకు గురైన ఆ 40 ఏళ్ల మహిళ ఫొటోను అత్యంత జుగుప్సాకరమైన భంగిమలో చూపించారు.

(సరదాగా రేప్ చేసుకుంటే అమ్మాయిలు పడి ఉండాలి కానీ తిరగబడితే ఊరకే వదిలిపెడతామా అని నిర్భయ హంతకుల్లో ఒకడైన ముకేష్ సింగ్ అన్ని మాటలు నిజమయ్యాయి అప్పుడే. అత్యాచారం అనంతరం హత్యలకు ఇది శ్రీకారమేనా?)

ఆ పక్క కాలమ్‌లోనే మరో వార్త. కుత్బుల్లాపూర్ సర్కిల్ జగద్గిరి గుట్ట పరిధిలోని మైసమ్మ నగర్‌లో కూలిపని చేసుకుని బతికే కుటుంబానికి చెందిన 9 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల పక్కింటి అబ్బాయి నోట్లో చేతి రుమాలు కుక్కి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

తెలంగాణ రాజధానిలో ఈ ఘోరాలు నమోదైతే.. నవ్యాంధ్ర రాజధానికి నిలయమైన గుంటూరులో ఇంకా గొప్ప ఘటనలు జరిగాయని ఆంధ్రజ్యోతిలో మరి రెండు వార్తలు..

గుంటూరులోని బాపట్ల నియోజకవర్గం గడ్డంవారిపాలెంలో 55 ఏళ్ల ప్రభుదాస్ అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను (1వ తరగతి, 2వ తరగతి) చాక్లెట్ ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి వారిపై .... చేశాడు.

(ఇక దేశంలో చాక్లెట్లపై నిషేధం విధిస్తే చాక్లెట్ల పరువు కూడా కలకాలం భద్రంగా ఉంటుందేమో కదా..)

మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో మానసిక స్థితి సరిగా లేక తల్లితో గొడవపడి ఇంట్లోనుంచి వచ్చేసి అర్థరాత్రి వనపర్తి బస్టాండుకు చేరితే మార్కెట్ యార్డులో ఉన్న విజయకుమార్ అత్యాచారం చేశాడని అదే పేపర్ వార్త.

ఇక సాక్షి పత్రికలో వార్త ప్రకారం, హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల బాలిక అపహరణ యత్నానికి గురై చావు తప్పి బయటపడిందట.

ఎన్ని మంచివార్తలు... జాతి గౌరవాన్ని నిలబెట్టే ఘటనలు...

ఆ 'పనికిరాని' ఆంగ్ల మహిళ ఇంగ్లండ్ నుంచి పరిగెత్తుకు వచ్చి 'భారత పుత్రి' గురించి పనీపాటా లేకుండా వీడియో తీసి ప్రపంచం ముందు ప్రదర్శించకుండా ఉంటే మన పరువు ఇంకెంత పదిలంగా ఇలా పేపర్ల మాటున దాక్కుని ఉండేదో కదా..

అప్పుడెప్పుడో రామారావు సినిమా దానవీరశూరకర్ణలో చెప్పినట్లుగా మన పరువు ఎప్పుడో గంగ మురికిలో కలిసిపోయింది. ప్రతి రోజూ, ప్రతి గంట, రాత్రి పగలు తేడా లేకుండా మనం పోగొట్టుకుంటున్న పరువు..  ఒక వీడియోపై నిషేధం విధించినంత మాత్రాన నిలుస్తుందా?

ఈ గొప్ప పరువు నిలిపే వార్తలు తిరిగేశాక ఇక నిద్రేం పడుతుందనీ...?

నాకయితే ఇండియాస్ డాటర్ వీడియో వివాదం అనంతరం ఎన్డీటీవీలో ఉడ్విన్, నిర్భయ తల్లిదండ్రులతో జరిపిన ఇంటర్వ్యూను మరోసారి చూడాలనిపిస్తోంది.

Nirbhaya's Parents Talk to NDTV About Documentary on 'India's Daughter
https://www.youtube.com/watch?v=R6_SKpm8RpA

ఆ వీడియో అమెరికాలో విడుదలైన సందర్భంగా మూడు రోజుల క్రితం yahoo.com లో చిత్ర నిర్మాత, దర్శకురాలు, కంపోజర్‌‌లతో ఆ యాంకర్ చేసిన అద్భుతమైన ఇంటర్వ్యూను కూడా పనిలో పనిగా మళ్లీ చూడాలనిపిస్తోంది.

'India’s Daughter' The true story behind the banned film
http://news.yahoo.com/india-s-daughter-documentary-about-2012-delhi-gang-rape-and-murder-

భయపడకండి. ఈ రెండు ప్రోగ్రామ్‌లూ పై వార్తల కంటే, మన ఘన వారసత్వం కంటే పెద్ద జగుప్సాకరంగా లేవనే మాటిస్తున్నా...

ఒక అమ్మాయిని ఘోరంగా అత్యాచారం చేసి, చంపితే వేలాది మంది స్త్రీపురుషులు మొత్తం ప్రభుత్వంపైనే తిరగబడిన ఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా జరగలేదనీ, తన 57 ఏళ్ల జీవితంలో అన్యాయం పట్ల ఇంతటి గొప్ప స్పందనను ఎక్కడా చూసి ఎరుగననీ, ఆనాటి నిరసనలూ, ప్రజాగ్రహ ప్రదర్శనలూ భారత చరిత్రలో గర్వించదగిన అత్యుత్తమ క్షణాలని ఆ పనికిరాని మహిళ యాహూ.కామ్ ఇంటర్వ్యూలో ప్రకటిస్తోంది...

అవి అత్యుత్తమ క్షణాలో... పనికిరాని క్షణాలో మనకు మనమే చూసి నిర్ణయించుకుందాం. ఆ తర్వాత ఎవరి అంచనా, ఎవరి జడ్జిమెంటు వారికుంటుంది కదా..!

3 comments:

Anonymous said...

నిన్న ఒక అద్భుత వ్యాసం కినిగెలో చదివాను : patrika.kinige.com/?p=5283

నిషేధం తప్పు తెలుసుకొని సరిదిద్దుకొనేందుకు కాదు. డాక్యుమెంటరీ మన 'గొప్ప సంస్కృతి' 'బబుల్' ని బ్రద్దలు కొడుతుంది కాబట్టి, దాన్ని నిషేధించేసి నిజాన్ని బయటకు పొక్కకుండా చేస్తే, మన 'గొప్ప సంస్కృతి' నీడలో మనం అవసరమైతే అత్యాచారాలని ఒక ఆయుధంగా వాడి స్త్రీలను 'సరైన దారిలో' పెట్టవచ్చు.


సమాజం ఎప్పుడొ బయాస్డ్‌గా తయారయిపోయింది. దేశభక్తుడంటే దేశంలో ప్రజలు బాగా ఉండాలనికాక 'దేశం పరువు' పోకుండా చూసుకొనేవాడుమాత్రమే నని ఇప్పుడు అర్ధం చెబుతున్నారు. ముఖేష్‌లాగా వాదించినవారు అప్పుడూ ఇప్పుడూ మన బ్లాగుల్లో ఉన్నారు. We are just letting them go away ratherthan avoiding such thoughts. http://ssmanavu.blogspot.in/2015/03/65-240000.html

Ghetghr said...

This is new funny pics web please check this site and let’s enjoy

All New Animated Funny Animated
Latest Funny Celebrities Funny Photos and Animation Celebrities Pictures
New Indian Funny pics wallpapers pictures 2015 Indian Funny Pictures
New good morning images Good Morning

Raja Sekhara Raju said...

అనామకుడు గారూ, క్షమించాలి మీ వ్యాఖ్య ఇన్నాళ్లుగా చూడలేకపోయాను. ఇదెలా జరిగిందో అర్థం కావడం లేదు. ఏదేమైనా తక్షణ స్పందనగా మీరు పంపిన వ్యాఖ్యకు కృతజ్ఞతలండీ.

Post a Comment