Thursday, February 23, 2017

అనువాదంతోనే జీవితం పండించుకున్న మాననీయులు ఏజీ యతిరాజులు


ఎనభై సంవత్సరాల వయస్సులో కూడా అలుపెరగకుండా తెలుగు, తమిళ భాషల్లో అనువాద రంగంలో నిరంతరం కృషి చేసిన సృజనకారుడు ఏజీ. యతిరాజులు గారు. తెలుగు, తమిళ సాహిత్యాభిమానులకు గత 56 సంవత్సరాలుగా వీరు సుపరిచితులే. తమిళనాట వీరి గ్రంథాలు పది ముద్రణలు పొందాయి. అలెక్స్‌ హేలీ– ‘ఏడు తరాలు’, డా. కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’, కళ్యాణరావు ‘అంటరాని వసంతం’ తదితర పుస్తకాలను తమిళంలోకి అనువదించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ హిందీ గ్రంథాల అనువాదాలకు కేంద్ర, తమిళనాడు పురస్కారాలను అందుకున్నారు. ప్రసిద్ధ హిందీ రచయిత రాహుల్‌ 12 గ్రంథాలను తమిళంలో వరుసగా అనువదించి ప్రచురించినందుకు తమిళనాడు ప్రభుత్వంచే సన్మానం పొందారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ జన విజ్ఞాన వేదిక కార్యకర్తగా ఆ రెండు సంస్థల సన్మానాలను స్వీకరించారు. తమిళనాడులోని ‘దిసై ఎట్టుం–నల్లి’ సాహితీ సంస్థ చేత అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే లక్ష్మణన్‌ ద్వారా జీవిత సాఫల్య పురస్కారం పొందారు.

తమిళనాడులోని గుడియాత్తంలో చేనేత కుటుంబంలో 1935 ఆగస్టు 4న యతిరాజులు జన్మించారు. మునెమ్మ, గోవిందస్వామి వీరి తల్లిదండ్రులు. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషలలోనూ, ఆయా భాషల సాహిత్యంతోనూ వీరికి మంచి పరిచయం ఉంది. వీరి మాతృభాష తెలుగు. చిత్తూరు జిల్లాలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. చిత్తూరు పట్టణం గ్రీమ్స్‌పేటలో నివాసం ఉంటున్నారు.

15వ ఏట నుంచే తమిళనాడులోని గుడియాత్తం పట్టణంలో వామపక్ష ఉద్యమంతో సన్నిహిత సంబంధం కారణంగా 1950 నుంచే ‘జనవాణి’, ‘సందేశం’ పత్రికల ద్వారా తెలుగు అభ్యుదయ సాహిత్యంతో పరిచయంవల్ల తెలుగు, హిందీ, తమిళం భాషల్లోని అభ్యుదయ రచనలను మరో భాషా పాఠకులకు అందించాలనే లక్ష్యం ఏర్పడిందంటారు యతిరాజులు.

హిందీ ఎంఏ, బీఈడీ అయిన పారంగల్, శిక్షణ కళా ప్రవీణ్, ప్రవీణ్‌ ప్రచారక్‌ వీరి విద్యార్హతలు. సాహితీ అధ్యయనం, సాహిత్య బోధన, అనువాద రచనలతోబాటు సామాజిక సేవ కూడా వీరికి చాలా ఆసక్తికరమైన రంగాలు. సాహిత్యకారుడిగా, సాహిత్య ప్రేమికుడిగా మొదలైన ప్రస్థానమే అనువాదకుడిగా అతడి ప్రారంభం.

పదేళ్ల వయస్సులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసాక నెలకొన్న దారుణ కరువు పరిస్థితుల్లో ఆకలి, దారిద్య్రం, అభద్రతా భావనలు బాల్యంలోనే తనపైన తీవ్ర ప్రభావాన్ని చూపాయంటారు. శేరు బియ్యం కోసం ఒక రోజంతా వరుసలో నిలబడటం తనకింకా బాగా గుర్తుందంటారు.

యుద్ధాలవల్ల స్త్రీలు, పిల్లలు, సాధారణ ప్రజానీకం ఎన్ని అవస్థలు పడతారో, జీవితం ఎంత దారుణంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన కారణంగానే హింసకు, యుద్ధానికి తాను వ్యతిరేకం అంటూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే దుష్టశక్తుల్ని వ్యతిరేకించే సాహిత్యమే నాకు అత్యంత ప్రమాణీకరమైందని అంటారు యతిరాజులు.

హిందీనుండి వీరు పలు గ్రంథాల్ని తమిళంలోకి అనువదించారు. రాహుల్‌ సాంకృత్యాయన్‌ స్వీయ చరిత్ర 4 భాగాలు, దేశ దిమ్మరి పురాణం, హిందూ తత్వశాస్త్రం, బౌద్ధ తత్వశాస్త్రం, ఇస్లాం తత్వశాస్త్రం, ఐరోపా తత్వశాస్త్రం, గతితార్కిక, భౌతిక శాస్త్రం, వైదిక ఆర్యులు, దివోదాసు రామరాజ్యం–మార్క్సిజం, ప్రేంచంద్‌ కథానికలు, శివశర్మగారి సంస్కృతులు.

ఇవికాక తెలుగు నుండి తమిళంలోకి చాలా గ్రంథాల్ని అనువదించారు. కృష్ణారెడ్డి ‘ఉప్పెన’ నవల, వెంకటేశ్వరరావు ‘మహాత్ములు’, మేజర్‌ జైపాల్‌ సింగ్‌ ‘దేశం పిలిచింది’ అమీర్‌ హైదర్‌ఖాన్‌ ‘స్వీయచరిత్ర’, పుచ్చలపల్లి సుందరయ్య ‘విప్లవ పథంలో నా పయనం’ (2 భాగాలు) హోవర్డ్‌ ఫాస్ట్‌ – ‘స్పార్టకస్‌’, అలెక్స్‌ హేలీ ‘ఏడుతరాలు’, డాక్టర్‌ కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ మొదలైనవి.

ఆయా మూల భాషల్లోని విశిష్టమైన గ్రంథాల్ని వీరు ఎంపిక చేసుకోవటంలోనే ఒక విలక్షణత సుస్పష్టంగా కనబడుతుంది. సమాజంలోని అన్ని తరగతుల వారికి, అన్ని స్థాయిల వారికి ఉపయోగపడే విధంగా వీరి అనువాద రచనలు విస్తృత ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. అనువాద రంగంలో దశాబ్దాల తరబడి వీరు సాగిస్తున్న కృషి ఫలితంగా తెలుగు, తమిళ భాషల్లోకి ఎన్నో విలువైన గ్రంథాలు చేర్చబడ్డాయి.

నిత్య సాహిత్య విద్యార్థిగా ఉంటూ, తెలుగు, తమిళ సాహిత్య రంగంలో ఎప్పుడు ఎక్కడ మంచి పుస్తకాలు వచ్చినా, వాటిని వెతికి పట్టుకుని చదువుకునే ఔత్సాహిక సాహిత్యాభిమాని, నిరంతర పాఠకుడు యతిరాజులు.

‘రోజూ పుస్తకాలు చదువుతారా సార్‌’ అనడిగితే వారు చెప్పే సమాధానం ఒక్కటే– వారి సాహిత్య వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ‘రోజూ అన్నం తింటాం కదా అని తినటం ఏరోజూ మానెయ్యం కదా? అట్లాగే చదవటం కూడా నిరంతరం కొనసాగుతూనే ఉండాలి’ అంటారు ఎనభైయ్యేళ్ల యువ సాహిత్యకారుడు, అలుపెరుగని యతిరాజులు.

స్వాతంత్య్రం భారతదేశానికి వచ్చిన తర్వాత ఆ పండుగ వాతావరణం తదనంతర కాలంలో దేశంలో ఎక్కడా కనిపించకపోవడం బాధాకరం అని, సమానత్వం లేకపోవడం వల్ల స్త్రీలు, దళితులు పడే బాధలు తనను కలచి వేశాయని, పీడితుల వైపు నిలబడి వారిలో చైతన్య కలిగించే రచనలు స్ఫూర్తి కలిగిస్తాయి కాబట్టే అలాంటి మహత్తర రచనల్ని తనంతట తాను అనువదించటం ప్రారంభించానని వారు అంటారు. దేశ విభజన సమయంలో నెలకొన్న అల్లకల్లోలం, విధ్వంసకాలు, స్త్రీలపై అత్యాచారాలు, కుటుంబాలు నాశనం కావటం, శరణార్థుల బాధలు తనను ఎంతగానో కలచివేసాయని, ఈ కారణాలే సాహిత్య అధ్యయనం వైపు, అనువాదాలవైపు తనను నడిపించాయని యతిరాజులు చెబుతుంటారు.

తెలుగులోకన్నా తమిళంలో సాహిత్య పత్రికల సంఖ్య ఎక్కువగా ఉందనీ, వాటి స్థితి నిలకడగా ఉందనీ, అందుకే తమిళంలో ఆయా వాదాలు, భావాలకు ఆదరణ ఎక్కువగా ఉందనీ, తమిళంలో అనువాద గ్రంథాలు పది ముద్రణలు కూడా జరుగుతున్నాయనీ, వేలాది ప్రతులు అమ్ముడవుతున్నాయని యతిరాజులు చెబుతుంటారు.

అనువాదాల్లో అనువాదకుడి భావజాలానికి, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించిన అనువాదాలు చాలా ముఖ్యమైనవిగా ఉంటూ చాలామంది పాఠకులకు అతి తక్కువ కాలంలో చేరువ కావటానికి ప్రయత్నిస్తాయి. అందుకే అనువాదకుడు తన స్వంత నిర్ణయంతో, ఎంపికతో చేసే అనువాదాలకు స్థల, కాల పరిమితులు ఉండవు. ఇలాంటి అనువాదాలు చరిత్రలో నిలచిపోతాయి. చరిత్రను కూడా సృష్టిస్తాయి.

కేవలం కాల్పనిక సాహిత్యమే కాక, చరిత్ర, సామాజిక శాస్త్రాలకు చెందిన ఎన్నో విలువైన గ్రంథాల్ని, అంతే విలువైన ఆత్మకథల్ని, స్వీయ చరిత్రల్ని కూడా యతిరాజులు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోకి అనువదించారు.

వీరు అనువదించిన పుస్తకాలను, వస్తు విస్తృతిని, విభిన్న ఎంపికల్ని పరిశీలిస్తే వీరియొక్క విశాల దృక్పథం, ఆలోచనా పరిధి అర్థమవుతాయి. సమాజానికి చాలా అత్యవసరమైన మందుల్లాంటి విలువైన ఎన్నో పుస్తకాల్ని వీరు అందజేశారు. రాయటానికి చేయి సహకరించకపోయినా తాను చెబుతూ డీటీపీ చేయించడం విశేషం. ఇంత వయసులో కూడా వీరు నిత్య చదువరిగా ఉండటం అద్భుతమైన విషయం. వివిధ భాషల్లోని ప్రగతిశీల మానవతా రచనలను ఇతర భాషలకు అందజేయటం వీరికి చాలా ఇష్టమైన ప్రవృత్తి.

కె.చిన్నప్ప భారతి నవలలు – ‘దాహం’, ‘సంఘం’తో పాటు ఇ.యం.ఎస్‌. నంబూద్రిపాద్ రచనలు ‘వైదిక భారతం’, ‘భారతదేశ చరిత్ర’ తదితర పుస్తకాలను తమిళం నుండి తెలుగులోకి ఏజీ. యతిరాజులు అనువదించారు. హిందీ నుండి తెలుగులోకి అనువదించిన రచనలు– శివశర్మ ‘సంస్కృతులు’, రాహుల్‌జీ ‘ఈ దుష్ట సమాజం సమాజం పతనం కాక తప్పదు’, ప్రభాకర సాంజ్‌గిరి ‘మనిషి కథ’, గిజూభాయి ‘సమగ్ర సాహిత్యం’ ఏడు భాగాలు.

సాధారణంగా ఒక యూనివర్సిటీ కానీ, సాహిత్య సంస్థకానీ, ప్రచురణ సంస్థకానీ చేయాల్సినంత పనిని యతిరాజులు ఒక్కరే ఒంటరిగా చేయటం వీరి కృషికి, చిత్తశుద్ధికి సాక్ష్యం. విలువైన రచయితల విలక్షణ రచనల్ని ఎంతో శ్రద్ధగా ఎంపిక చేసుకుని, సహజమైన రచన అనిపించేంత రీతిలో, ఎక్కడా ఇది అనువాద రచన కదా అనే భావన రానివ్వకుండా, పాఠకుడి చేత ఆసక్తికరంగా చదివింపజేసేలా అనువాదం చేయటం యతిరాజులు ప్రత్యేకత. అందుకే సమకాలీన అనువాద రచయితల వరుసలో వీరికి ప్రత్యేక స్థానం ఉంది.

సాహితీవేత్త ఏజీ. యతిరాజులు కన్నుమూత

ప్రముఖ సాహితీవేత్త, అనువాదకుడు ఏజీ. యతిరాజులు మృతికి సాహితీ స్రవంతి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. చిత్తూరు జిల్లాకు చెందిన యతిరాజులు ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే అనేక పుస్తకాలను అనువదించారు. తమిళ, హిందీ, తెలుగు భాషల్లోని ప్రజలకు ఉపయోగపడే సాహిత్యాన్ని ఎంపిక చేసుకుని అంకిత భావంతో చేసిన ఆయన అనువాదాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. రాహుల్‌ సాంకృత్యాయన్‌ రచనలను హిందీ నుండి తమిళంలోకి అనువదించినందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ విద్యావేత్త గిజుభాయి సాహిత్యాన్ని హిందీ నుండి తెలుగులోకి అనువదించారు. ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ప్రచురించిన గిజుభాయి పుస్తకాలు విశేషంగా ప్రచారం పొందాయి. అభ్యుదయ, ప్రగతిశీల ఉద్యమాలను ప్రోత్సహించేవారు. సామాన్యుల జీవితాల్లో మార్పు రావాలని ఆకాంక్షించిన యతిరాజులు గారి మృతి తెలుగు సాహిత్యానికి, అనువాద సాహిత్య రంగానికి తీరని లోటు. చివరికంటా ప్రజా సాహిత్యంపట్ల, ప్రజా ఉద్యమాలపట్ల అభిమానాన్ని వెలిబుచ్చిన యతిరాజులు నిజమైన ప్రజా రచయిత. సాహితీ స్రవంతి నిర్వహించే కార్యక్రమాలకు నిరంతరం ప్రోత్సాహాన్ని అందించేవారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.
– తెలకపల్లి రవి గౌరవ అధ్యక్షులు, వొర ప్రసాద్‌ అధ్యక్షులు సాహితీ స్రవంతి, గవర్నరుపేట, విజయవాడ

తెలుగులో వీరు అనువదించిన పుస్తకాలు ప్రజాశక్తి బుక్ షాపులో దొరుకుతాయి.

(నాలుగు పుస్తకాలు రాస్తేనో, అనువాదాలు చేస్తేనో విశ్వమంతా టముకు వేసుకుని పురస్కారాల మీద పురస్కారాలు తీసుకుని అంతర్జాలంలో ప్రచారంలో అందరికంటే ముందుండే మహానుభావులు తయారవుతున్న కాలంలో ఆన్‌లైన్ మొత్తం గాలించినా ఒక్కటంటే ఒక్క ఫోటో లేకుండా అనువాద కృషిలో మునిగిపోయిన నిరాడంబరులు యతిరాజులు. ఉన్న ఆ ఒక్క ఫోటో కూడా ఒక తమిళ వెబ్ సైట్ నుంచి తీసిందే. )