Wednesday, April 15, 2015

సోమరులకెందునూ మోక్షము లేదు….


ఇప్పుడు విద్య వ్యాపారంగా మారి అటు టీచర్లూ, ఇటు పిల్లలూ క్షణక్షణమూ లెక్కించుకునే కాలం కాబట్టి పిల్లల, టీచర్ల మనస్తత్వాలు మొత్తం మీద ఎలా ఉంటున్నాయో తెలీదు కాని….మారోజుల్లో టీచర్లు ఏ క్లాసు పాఠం చెప్పేవారు అయినా సరే, సబ్జెక్టు మాత్రమే కాక జీవితానికి సంబంధించిన విలువల గురించి సందర్బం వచ్చినప్పుడల్లా పిల్లల మనసుల్లో నాటేవారు. విసుగు తెప్పించే మామూలు పాఠాల కంటే అప్పుడప్పుడూ అయ్యవార్లు చెప్పే ఇలాంటి జనరల్ విషయాలే చాలా బాగుండేవి.

అయితే వాటిని ఎంతవరకు పాటించాం అనే అంశం కంటే క్లాసుపాఠాల బోర్ నుంచి మా తరం పిల్లల్ని తప్పించడమే కాదు. ఆరేడు గంటలపాటు నిరవధికంగా రకరకాల పాఠాలు వినవలసివచ్చిన మాకు అవి పెద్ద ఉపశమనం గాను, నిద్రమత్తునుంచి వదిలించేవి గాను ఉండేవి. ఊళ్లల్లో హరికధ, బుర్రకథలు వంటివి సుదీర్ఘంగా ప్రదర్శిస్తున్నప్పుడు హరదాసులు, గాయకులు అప్పుడప్పుడు చెప్పే పిట్టకథలు సైతం ఇలా జనం నిద్రను పోగొట్టి మళ్లీ కథలో లీనం చేయడానికి ఉపయోగపడేవి కదా. అసలు పిట్టకథల ప్రయోజనం ఇందుకోసమేనేమో..

మేం ఊర్లో అయిదోక్లాసునుంచి గెంతు వేసి మా పల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలోని సెకండరీ స్కూల్‌లో ఆరవ తరగతికి వెళ్లినప్పుడు హిందీ టీచర్ అయిన కృష్ణమూర్తి సార్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆయన తొలిరోజు మా క్లాసుకు వచ్చినప్పుడే అందరివద్దా నోట్సు ఉన్నాయా అని అడిగి ఈ వాక్యం రాసుకోమని చెప్పారు. “సోమరులకెందునూ మోక్షము లేదు…” చాలా సాదాసీదాగా ఆయన ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించేవారు.

“పల్లెబడులలోంచి పెద్దబడికి వచ్చారు కాబట్టి అయిదారు సబ్జెక్టులు చదివి మననం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏరోజు పనిని ఆ రోజే పూర్తి చేసుకోండి. ఎప్పుడూ ఏ పనిని పెండింగ్‍‌లో పెట్టవద్దు. అలా పెండింగ్‌లో పెట్టకూడదు అని తెలిసి వచ్చేలా, గుర్తు చేసేలా మీ ప్రతి నోట్స్ పుస్తకంలోనూ సోమరులుకెందునూ మోక్షము లేదు అని రాసుకోండ్రా” అని పురమాయించేవారు. ఒకవేళ ఏ పిలగాడయినా తాను చెప్పినట్లు నోట్సులో ఈ వాక్యం రాసుకోలేదని కనిపెట్టినట్లయితే వెంటనే తొడబెల్లం పెట్టేవారు.

రాయలసీమలో పిల్లలను కాస్త తీవ్రంగా దండించాలనుకునే అయ్యవార్ల చేత వజ్రాయుధం లాంటిది ఈ తొడబెల్లం. ఏ కాలంనుంచి ఈ శిక్షా పద్ధతిని అమలు చేస్తూ వచ్చారో తెలీదు కాని దీనికి గురైన పిల్లలకు మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టదంటే నమ్మండి. తప్పుచేసిన పిల్లలకు చెంప పగులకొట్టడం, వీపుమీద పిడిగుద్దులతో సత్కరించడం వంటి మామూలు శిక్షలు సరిపోవనుకున్నప్పుడు గురువులు వెంటనే పిల్లల తొడను చేతి వేళ్లతో పట్టుకుని మెలిపెట్టేవారు. మెలిపెట్టడంతో పాటు ఒక్కోసారి గిచ్చేవారు.

ఇది ఎంత సుదీర్ఘకాలంపాటు కొనసాగితే పిల్లవాడికి అంతసేపు నరకం కనబడుతుందన్నమాట. ఒక్కోసారి ఇంటికి పోయాక కూడా ఆ తొడబెల్లం సలుపు, గిచ్చుడు తగ్గకపోతే అమ్మ దగ్గర పట్టు వేయించుకునేవారం. తమ బిడ్డలను అలా హింసించిన టీచర్ల బతుకును గ్రామీణ తిట్లతో అమ్మలు ఉతికేసేవారనుకోండి. అలా ఆయన పెట్టే ఈ రకం హింసకు తట్టుకోలేక అందరమూ ఈ వాక్యాన్ని నోట్సులలో నింపేవారం. నోట్స్ మధ్య పేజీలలో కూడా పుట పైభాగాన రాసుకోమని చెప్పేవారాయన.

అలా అయిదేళ్లపాటు ఆయన చెప్పిన ఈ మెరుపువాక్యం అలాగే మాకు గుర్తుండిపోయింది. ఇంటర్ డిగ్రీల్లో సైతం నోట్స్ పుస్తకాలలో ఇది అలవాటుగా రాసుకుంటూ వచ్చాను. అయితే మేం ఎంతవరకూ ఈ వాక్యసారాంశాన్ని ఆచరించామంటే చెప్పలేను. స్కూల్లో ఏడెనిమిది గంటల వరుస శిక్ష పూర్తయ్యాక పల్లెటూళ్ల విద్యార్థులకు పనులు, ఆటలు, భజనలు ఇవి ఇచ్చే ఉత్సాహం అంతా ఇంతా కాదు కాబట్టి వెంటనే మేం ఇటు వైపుకు మళ్లేవాళ్లం.

వ్యవసాయం లేదా ఊర్లో వృత్తి పనులు చేసుకునే కుటుంబాలనుంచి వచ్చిన వారే మా స్కూల్లో అన్ని క్లాసుల్లో ఉండేవారు. సహజంగానే చదువు పట్ల ఉద్యోగస్తుల కుటుంబాల్లో మాదిరి కఠినమైన సమయపాలనను మేం పాటించేవాళ్లం కాదు. దీనికి కారణం కూాడ ఉండేది. గ్రామీణ పిల్లలకు చదువు మాత్రమే వ్యాపకం కాదు. తమ స్థాయిల్లో వ్యవసాయ, వృత్తి పనుల్లో పాల్గొనవలసి రావడం వల్ల మాకందరికీ చదువు పట్ల కంటే వృత్తిపనుల పట్లే ఎక్కువ ఆసక్తి, అనురక్తి ఉండేవి.

అందుకే బడికి పోవడం, స్కూలుకు పోవడం కంటే బడినుంచి బయటపడిన వెంటనే ఏదో ఒక విధమైన ఆటల్లో, పనుల్లో, భజన, పల్లీయ సంస్కృతికి సంబంధించిన ఇతరవ్యాపకాల్లో పాల్గొంటూ పరమానందంగా గడిపేవాళ్లం. అది పైచదువులకు పోవడానికి, మంచి వృత్తి చదువులు ఎన్నుకోవడానికి చాలామందికి ఆటంకంగా నిలిచేది కూడా.

‘చదువుకోకుంటే బిచ్చమెత్తుకోని తిరుగుతార్రా’ అంటూ టీచర్లు చెప్పే చదువుల సారానికి, ‘పనులు చేయకపోతే కూడా బిచ్చమెత్తుకొని తిరుగుతార్రా’ అంటూ మా పెద్దవాళ్లు చెప్పే జీవన సారాంశానికి ఎక్కడో లంకె తప్పింది కాబట్టి ఈ గొప్ప సత్యం కూడా ఆచరణలో అలా అటకెక్కిపోయింది కానీ, నా జ్ఞాపకాల దొంతరలో మాత్రం ఈ వాక్యం అలాగే నిలిచిపోయింది.

“సోమరులకెందునూ మోక్షము లేదు….”

గమనిక:
ఇది 2008లో నా మరొక బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. ఈ బ్లాగ్‌ను ఇప్పుడు ఉపయోగించడం లేదు


Thursday, April 2, 2015

మగాళ్లతో మీరు సరదాగా గడుపుతారా?తీహార్ జైలులో ఉన్న నిర్భయ కేసులోని దోషి ముఖేష్ సింగ్ ఇప్పటికీ ఏమంటున్నాడో మనం ఇటీవలే చూశాం. నిందితుల తరపున కేసు వాదించిన ఆ లాయర్లు న్యాయదేవతను తమ 'డైమండ్ మహిళ' వ్యాఖ్యల ద్వారా ఎంత పునీతం చేశారో కూడా విన్నాం. దేశం దేశమే జైలులాగా, అలాంటి లాయర్ల ఖిల్లాగా ఉందని వస్తున్న అభిప్రాయాల పదునును ఏమాత్రం తగ్గించకుండా మరొక పసందైన సన్నివేశానికి కూడా మన దేశమే సాక్షిగా నిలిచింది. దీంట్లో కొత్తదనం ఏదంటే ఈ సారి వంతు ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌ది కావడమే.

విషయానికి వస్తే.. మార్చి 18న హాంకాంగ్ వెళ్లడానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక మహిళ అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారి బారిన పడింది. ఆమె బెంగళూరు నివాసి. తన భర్తను కలుసుకోవడానికి హాంకాంగ్ వెళుతున్న ఆమెను ఆ అధికారి మాటలతోనే కుళ్లబొడిచేశాడు.

ఆమె ధ్రువపత్రాలను తనిఖీ చేసే క్రమంలో ఆమెను అసహ్యకరమైన మాటలతో వేధించడమే కాదు.. దేశీయ, అంతర్జాతీయ మార్గాల మధ్య ఉండే ఎస్కలేటర్ పొడవునా ఆమెను అనుసరించి వెళుతూ మహా ఇబ్బంది కలిగించాడట. అదేంటో ఆమె మాటల్లోనే చూద్దాం.

'ఆ అధికారి నన్ను తాగుతావా అనడిగాడు. నువ్వు స్మోక్ చేస్తావా, చికెన్ తింటావా, నీ భర్త లేనప్పుడు మగాళ్లతో నువ్వు సరదాగా గడుపుతావా, సంతాన నిరోధం కోసం నీవు సర్జరీ చేసుకున్నావా? అని ప్రశ్నల వర్షం కురిపించాడు. చివరి ప్రశ్ననయితే కనీసం నాలుగుసార్లు అడిగాడు' అని ఆమె సిఎన్ఎన్-ఐబీఎన్ చానెల్ విలేకరికి చెప్పింది.
పైగా, ఇద్దరు బిడ్డల తల్లి అయిన ఆమెను పట్టుకుని తనతో కలిసి మూడోబిడ్డను కనాలనుందా అనడిగాడు. హాంకాంగ్‌కు ఒంటరిగా ఎందుకెళుతున్నావు. భర్తను కలవడానికేనా లేక ఇతర మగాళ్లతో సరదాగా గడపడానికా.. అని కూడా రెట్టించాడు. పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లే ఆమెలాంటి ఆడవారు వివాహేతర సంబంధాల కోసమే విదేశాలకు తరచుగా వెళుతుంటారని కూడా అతగాడు వ్యాఖ్యానించాడు.

చివరాఖరుగా.. 'నీ పర్సనల్ మొబైల్ నంబర్ ఇచ్చివెళ్లు.. నీ భర్త ఇంట్లో లేనప్పుడు నీకు కాల్ చేస్తాను' అని కూడా ఆ అధికారి అన్నాడు. ఇంత జరిగాక, ఆ మహిళ తన కుటుంబంతో కలిసి ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు పంపింది. కానీ ఆ ఫిర్యాదుకు ఇంతవరకు అంటే 15 రోజుల తర్వాత కూడా సమాధానం కానీ, స్పందన కానీ లేదట.

ఆ వార్త సారాంశం ఇంతే.  ఒక్క మాట కూడా నేను కల్పించి చెప్పింది లేదు. firstpost.comలో మార్చి 27న వచ్చిన ఒక చిన్న వార్త ఇది. చాలా ఆలస్యంగా బయటపడిన ఘటన కావడంతో ఇది ఆ మహిళ వెర్షన్‌ని మాత్రమే చెప్పిన వార్తగా రూపొందింది. అవతలిపక్షం స్పందనను ఈ వార్తలో పొందుపర్చే అవకాశం కూడా లేదు.

అయితే ఈ వార్తకు కింద కామెంటు పెట్టిన వారి వ్యాఖ్యలు ఈరోజు నాకు మరింత జ్ఞానాన్ని ఇచ్చాయని మాత్రం అంగీకరించి తీరాలి. ఒక సమస్యను ఎన్ని కోణాల్లోంచి చూడాలో, ఒక ఘటన ఎన్ని డైమెన్షన్ల నుంచి చూడబడుతుందో.. మధ్యలో ఎన్ని వ్యంగ్యాలూ, ఎన్ని అపవ్యాఖ్యలూ, హేళనలూ పుట్టుకొస్తాయో కూడా అవి నేర్పాయి.

ఒక్కటి మాత్రం వాస్తవం. సంస్కృతి.. ఘనమైన నాగరికత. గత వైభవ దీప్తి వంటి పెద్ద పెద్ద మాటల జోలికి పోనవసరం లేదు కానీ, ఇంటిబయట తిరిగే, పనిచేసే, ప్రయాణం చేసే ఆడవారి పట్ల నూటికి 99 మంది మన దేశంలోని పురుష పుంగవుల్లో కొద్దో గొప్పో తేడాలతో సరిగ్గా ఆ ఇమ్మిగ్రేషన్ అధికారి ఆలోచనలే ఉంటాయనటంలో సందేహమెందుకు?

బీహార్ మాజీ ముఖ్యమంత్రి మాంజీ ఎంత రంజుగా ఇదే మాటలన్నాడో కదా బహిరంగ సభలో. 'పేదవర్గాలకు చెందిన మగవాళ్లు బతుకుకోసం వలస వెళితే ఇంట్లోని ఆడవాళ్లు ఏం చేస్తారో మీకు తెలుసుకదా' అనే ఆయన వెకసెక్కపు మాటలు టీవీ తెర నిండుగా వినడాన్ని, చూడటాన్ని మనం ఇంకా మర్చిపోలేదు.

మిగతా ప్రపంచం ఎక్కడయినా చావనీ... ఎలాగైనా ఉండనీ... భారతీయులుగా మనం ఇలాగే పుట్టాం, పెరిగాం. మునుపటి తరాలు, ఆ వెనుకటి తరాలు, రేపటి తరాలు కూడా మన జాతిలో సగం గురించి ఇలాగే భావిస్తూవచ్చాయి. భావిస్తున్నాయి. భావిస్తూ ఉంటాయి కూడా. ఈ నగ్న వాస్తవాన్ని మనం అంగీకరిస్తే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆవేశకావేషాలకు గురవ్వాల్సిన పని ఉండదు.

బయటివాడో, బయటిదో ఒకరన్నారనీ, వీడియోలు తీశారని బాధపడటం.. కించపడటం, పరువునష్టంగా ఫీలవడం, దేశభక్తిని కృత్రిమ రంగుల్లో కొత్తగా ప్రదర్శించడం వంటి భావోద్వోగాలకు మనం గురి కావలసిన అవసరమూ లేదు. మనం ఇలా ఉన్నాం అనే నిజాన్ని ఒప్పేసుకుంటే పోయె. మనవద్ద లేని, మనకు చేతకాని అనవసర భేషజాలకు పోవడం ఎందుకనేదే నా ప్రశ్న.

ఢిల్లీ విమానాశ్రయంలో ఈ వ్యవహారానికి మూలపురుషుడైన ఆ మగాధికారి ఫోటోను చూశాను. టై, ఇన్‌సర్ట్, షూస్ తగిలించుకోవడం తప్పితే మిగతా ఆపాదమస్తకం అతగాడు అచ్చంగా మనలాగే ఉన్నాడు. అమ్మయ్య.. అతడు దేవుడు మాత్రం కాదు.. మన వాడే.. మన మగాడే..

ఓపిక ఉంటే ఫస్ట్‌పోస్ట్.కామ్ లోని ఒరిజనల్ వార్త, దానిపై వ్యాఖ్యలు కూడా కింద చూడగలరు.

'Do you have fun with other men' Immigration officer crosses new line in sexual harassment

http://www.firstpost.com/living/do-you-have-fun-with-other-men-immigration-officer-crosses-new-line-in-sexual-harassment-2176963.html

కొసమెరుపు: 
" మీరు నర్సులు.. ఎండలో ధర్నా చేస్తే నల్లబడతారు. అవకాశాలు తగ్గుముఖం పడతాయి. తర్వాత పెళ్లికొడుకులూ దొరకరు"
ఇది ఈ రోజే అంటే ఏప్రిల్ 1న మన గోవా ముఖ్యమంత్రి గారు నర్సులకు  చేసిన పవిత్ర ప్రవచనం. ఈయన రాజ్యంలో నర్సులు తమ సమస్యలు పరిష్కారం కాలేదని వీధికెక్కారు. అంతే. ఈ చిన్న పాపమే వాళ్లు చేసింది. ఇక మీకు పెళ్లి కొడుకులు దొరకరనేంతవరకు పోయింది వ్యవహారం. తర్వాత ఆ మాటే తాననలేదని ఆయన వివరణ ఇచ్చి ఉండవచ్చు. కానీ కావాల్సింది 'మీరు అందంగా ఉండేవారు. ఇప్పుడు చూడండి.. నల్లబడిపోయారు' అనే మాటలతో సానుభూతి చూపడమా లేక  ఆ నర్సులను వీధులకెక్కకుండా సమస్యలు పరిష్కరించడమా...? ఇది గాల్లో కలిసిపోయింది.

మరొక మెరుపు...
తెల్లతోలు ఉంది కాబట్టే సోనియాకు కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కిందని కొంత సేపటి క్రితం జాతి వివక్షా వ్యాఖ్యలతో వాంతి చేసుకున్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కాస్సేపట్లోనే క్షమాపణలతో బొక్కబోర్ల పడ్డాడు. ప్రమాదాన్ని గ్రహించిన సీనియర్ మంత్రి ఒకరు (మన వెంకయ్య గారేనా) క్లాస్ పీకడంతో ఈయన సర్దుకున్నాడని వార్తలు.

ఇప్పుడు చెప్పండి.. మనం ఇలా కాక మరోలా ఉంటామా? ఉండగలమా..? మన పరువు ఇలా కాక మరోలా ఎప్పుడయినా, ఏ కాలంలో అయినా ఉండి ఏడ్చిందా?


ఈ అంశంపై కొనసాగుతున్న చర్చను కింది కథనాల్లోనూ చూడవచ్చు. 

మరోసారి నేతల మకిలి!
http://www.sakshi.com/news/editorial/again-leaders-got-black-spot-with-controversial-comments-227177

రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
http://www.sakshi.com/news/opinion/why-government-target-roja-226541