Pages

Sunday, February 24, 2019

బ్రిటిష్ పాలకులపై ఓడి గెలిచిన జన నాయకుడు : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి


ప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం (1857) ప్రారంభం కావడానికి పదేళ్లకు ముందే బ్రిటిష్ వారి దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన జన నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తన ఆత్మాభిమానాన్ని అవమానించినందుకు నిరసనగానే కాకుండా అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా  విస్తృత జన సమూహాలను కూడగట్టి వేలాదిమంది మద్దతును పొంది రెండేళ్లపాటు పాలకులపై తిరుగుబాటు ప్రకటించిన వాడు ఉయ్యాలవాడ. బ్రిటిష్ సైనికబలం ముందు నిలబడలేక వరుస పరాజయాలతో బందీగా చిక్కి ఉరికొయ్యకు వేలాడిన ఉయ్యాలవాడ 172 ఏళ్ళ క్రితమే తెలుగు సీమలో ప్రత్యేకించి కర్నూలు లోని కోయిలకుంట్ల ప్రాంతంలో (అప్పట్లో కడప ప్రాంతపరిధిలోనిది) జనం నోళ్లలో తరతరాలుగా నానే వీరగాధగా నిలిచిపోయాడు. ఫిబ్రవరి 22న కర్నూలులో ఉయ్యాలవాడ కంచు విగ్రహ ఆవిష్కరణ జరిగిన సందర్భంగా ఆయన నాటి పోరాటంలో వాడిన కరవాలాన్ని ఆయన కుటుంబానికి సంబంధించిన నేటి సభ్యులు ప్రదర్శించారట.

ఉద్యమ కాలంలో బందీ కాబడిన 901 మందిలో 412 మందిని విడుదలకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించింది, 223 మందిని జామీనుతో వెళ్ళడానికి అంగీకరించింది, ముగ్గురికి జీవితాంతం, ఐదుగురికి పద్నాలుగేండ్లు, నలుగురికి ఎనిమిదేండ్లు, ముగ్గురికి పదేండ్లు, 83 మందికి ఐదేండ్లు, ఒక్కరికి మూడేండ్లు, ఆరుగురికి రెండేండ్లు, ముగ్గురికి ఒక ఏడు, ఇద్దరికి ఆరు నెలలు, మొత్తం నూటపన్నెండు మందికి శిక్ష విధించింది. ఇక, నరసింహారెడ్డికి మరణ శిక్ష విధించబడి కోయిలకుంట్ల వీధుల్లో సంకెళ్ళతో త్రిప్పబడి, ఆ తరువాత జుర్రేటి బావివద్ద (జుర్రేటివాగు ఒడ్డున గల బావి) ఉదయం 7 గంటల సమయాన పిబ్రవరి 22, 1847 న ఉరితీయబడినాడు. ఆ ప్రాంత జనాల్లో భయం కల్పించడంకై ఆతని శవం 1877 వరకు అక్కడే వ్రేలాడదీయబడి ఉండేదని ఇప్పటికీ అక్కడి జనాల్లో కథనాలు ఉన్నాయి.

బ్రిటిష్ పాలకులచేతిలో ప్రాణం కోల్పోయినా ప్రజలకు ప్రధానంగా ఉన్న ఇనాంల రద్దు నిర్ణయాన్ని బ్రిటిష్ వారు పునఃపరిశీలన చేసేట్లు, వారి భూహక్కులు తిరిగి ఇవ్వబడేట్లు తన ఉద్యమంతో ప్రభావం చూపగలిగాడు. ఇందుకై 1858లో మద్రాస్ ప్రభుత్వం డబ్ల్యు. టి. బ్లేయ్‌ర్ అధ్యక్షతన ఇనాం కమిషన్‌ను నియమించింది. మద్రాసు ప్రెసిడెన్సీలోని అన్ని రకాల ఇనాంలను పరిశీలించి, వాటిని క్రమబద్దీకరించే పనిని ఇది పూర్తి చేసింది. ఇంతటి ఘనతల్ని సాధించినాడు కాబట్టే ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆతని ఉద్యమం ఎంతోమందికి, ఎన్నో ఉద్యమాలకు స్పూర్తినిస్తున్నాయి.

ఈ వీరోచిత గాధను చరిత్ర నేపథ్యంలో వెలికితీసి విశ్రాంత చరిత్ర ఆచార్యులు దేవిరెడ్డి సుబ్రమణ్య రెడ్డి గారు రాసి పంపిన ఈ పెద్ద వ్యాసం తెలుగు పాఠకులందరికీ వాస్తవగాధను తెలియపరిచే కరదీపికగా ఉంటుందని ఆశిస్తున్నాను. తెలుగు నేలలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన అలనాటి పోరాటాలను, ప్రత్యేకించి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటగాధను దాదాపు 300 పేజీల పుస్తకం సైజులో దేవిరెడ్డి రాశారట. ఏనాటికైనా దాన్ని ఆయన దాన్ని ముద్రించగలిగితే అరుదైన చరిత్రకు సంబంధించిన విశేషాలు మనందరికీ లభిస్తాయి. త్వరలో ఆ పనికి ఆయన పూనుకుంటారని ఆశ.

ఈ బృహత్ వ్యాసంతో పాటు దేవిరెడ్డి గారు పంపిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అరుదైన అసలు ఫోటోతోపాటు వారి ఈ తరం బంధువుల ఫోటోలను, నాటి కోట బురుజులను, ఆయన ఆనాడు ఉపయోగించిన ఫిరంగిని కూడా ఇక్కడ ప్రచురించడమైనది. తెలుగునేలపై జరిగిన ఈ మహత్తరమైన ఘటన గురించి కూలంకషంగా తెలుసుకోవాలనుకుంటే వ్యాసం కింద ప్రచురించిన ఆయన మొబైల్ నంబర్‌లో సంప్రదించగలరు.

దేవిరెడ్డి గారు రాసిన పూర్తి వ్యాసాన్ని ఇక్కడి నుంచి చదవగలరు




ఉయ్యాలవాడ నరసింహారెడ్డి: జన సమస్యలపై పోరాడిన వీరుడు

ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ 1600లో ఏర్పరచబడింది. భారత్‌లో ‘‘ఫ్యాక్టరీ’’ అనబడిన తొలి వ్యాపార స్థావరాన్ని సూరత్‌లో 1611లో ఏర్పరచుకొంది. తరువాత, పశ్చిమ తీరంలో, తూర్పు తీరంలో, దేశపు లోతట్టు ప్రాంతాల్లో కూడా వ్యాపార స్థావరాల్ని ఏర్పరచుకొంది. తీరాంధ్రలో తొలి స్థావరాన్ని మచిలీపట్నంలో 1611లో ఏర్పరచుకొంది. నేటి నెల్లూరు జిల్లాలోని ఆర్మగాన్ అనబడిన దుగ్గరాజపట్నంలో మొట్టమొదటి కోటను 1626లో నిర్మించుకొంది. కాళహస్తి రాజా నుండి నాటి తెలుగు ప్రాంతం మద్రాసును మరో స్థావరంగా 1639లో పొంది, ఫోర్ట్‌సెయింట్‌జార్జ్ కోటను 1640 నాటికి నిర్మించుకొంది. క్రమంగా దేశమంతా వ్యాపారాన్ని వ్యాప్తిచేసుకొంది. మన సరకుల్ని ఎగుమతి చేసి విపరీతంగా ఆదాయాల్ని పొందింది. మన జనంతోనే సిపాయి సైన్యాన్ని ఏర్పరచుకొంది. మన రాజ్యాల రాజకీయాల్లో తలదూర్చి యుద్ధాలతో, అంగీకారాలతో మన పాలకుల్నే దాదాపు లేకుండా చేసింది; రాజకీయ, ఆర్థిక అధికారాల్ని చేజిక్కించుకొంది.
                ఆ తరువాత, చేనేత వృత్తి వంటి పని వారికి బ్రతుకుతెరువు లేకుండా చేసింది (డీ ఇండస్ట్రియలైజేషన్). వ్యవసాయదారుల్ని పీడించింది (డీ పెజంటైజేషన్). వారసత్వంగా తరతరాలుగా వస్తుండిన భూహక్కును రైతులకు లేకుండా చేసింది (పర్మనెంట్ హెరిడిటరీ ఆకుపెన్సీ రైట్ టు ల్యాండ్). తక్కువ పన్ను చెల్లింపుతో గాని, పన్ను మినహాయింపుతో గాని అనుభవిస్తుండిన ఇనాందార్ల భూములపై పూర్తిస్థాయి పన్ను విధించి, పీడించి వసూలు చేసింది. వ్యాపార, వాణిజ్య కారులు స్వేచ్ఛగా తమ వృత్తిని సాగించలేని పరిస్థితిని కల్పించింది. కొండ ప్రాంతాల జనాల హక్కుల్ని హరించింది. గ్రామ సభల హక్కుల్ని కుదించి వేసింది. దేశం గ్రామీణ దేశంగా మారేట్లు (రూరలైజేషన్), జనం నాశనమయ్యేట్లు (రూయినైజేషన్), దరిద్రులుగా మారేట్లు (పాపరైజేషన్) చేసింది. పరిమితికి మించిన ఆదాయాన్ని ఇవ్వలేని వ్యవసాయంపై మాత్రమే అత్యధిక జనం ఆధారపడి జీవించేట్లు కుటీర పరిశ్రమలు, వ్యాపార వాణిజ్యాల నాశనం ద్వారా చేసింది. దీనితో తలసరి ఆదాయం పడిపోయింది. జనం చేతిలో నిత్యావసర సరకుల్ని కొనుక్కొని తినడానికి అవసరమైన డబ్బు లేకుండా పోయింది. దీనితో తిండిలేని కృత్రిమ క్షామాలు, కరువులు, వాటి కారణంగా ఆకలి చావులు దేశ చరిత్రలో తొలిసారిగా వీరిపాలనలో సంభవించసాగాయి. కొత్త భూశిస్తు విధానాల్తో పన్నుల భారం విపరీతంగా పెంచడంతో రైతుల ఆదాయాలు తగ్గి, అప్పులపాలయి, భూముల్ని వ్యవసాయేతరులైన వడ్డీవ్యాపారులు వంటి వారికి ఇచ్చేసే పరిస్థితుల్ని కల్పించింది; వారు కౌలుదార్లుగా, వ్యవసాయ కూలీలుగా మారేట్లు చేసింది. అనగా, దేశంలో తొలిసారిగా ఆంగ్లేయుల పాలనలో వ్యవసాయ కూలీల వర్గం నూతనంగా పుట్టుకొచ్చింది (వడ్డీవ్యాపార వర్గంవలె). ఉదాహరణకు, లక్ష జనాభాకు బెంగాల్ ప్రసిడెన్సీలో పదిలక్షల పన్ను, బొంబాయిలో పదిహేడు లక్షల పన్ను వసూలు కాబడగా, మన మద్రాసు ప్రసిడెన్సీలో మాత్రం ఇరవైమూడు లక్షల పన్ను వసూలు చేయబడింది. అంతేగాక, ప్రాధాన్యతా రంగాలుగా నిలదొక్కుకొని వేలఏండ్లుగా జనం మొత్తానికీ ఉపాధి కల్పిస్తుండిన (ఫుల్ ఎంప్లాయ్‌మెంట్) వ్యవసాయ, పారిశ్రామిక (కుటీర పరిశ్రమ) రంగాల్ని, వాటి మధ్య తరతరాలుగా ఉండిన అనుంధాన్ని దెబ్బతీసింది. ఇలాంటి అంశాల కారణంగా ఆంగ్లేయుల పాలన ఆరంభమైన తొలిరోజుల నుండే వారికి వ్యతిరేకంగా దేశమంతటా, ఎల్లప్పుడూ, ఏదోఒకచోట తిరుగుబాట్లు జరుగసాగాయి. భవిష్యత్తులో జరిగిన 1857-58 నాటి సిపాయిల తిరుగుబాటుకు, 1885 1947 మధ్య జరిగిన స్వాతంత్య్రోద్యమానికి ఇవి స్పూర్తిదాయకంగా నిలిచాయి.
                ఇలా 1857కు పూర్వం తిరుగుబాటు చేసిన వారిలో నాటి మద్రాసు ప్రసిడెన్సీ లోని తెలుగు ప్రాంతాల పాలయగాళ్ళు, జమిందార్లు కూడా ఉన్నారు. నేడు రాయలసీమగా పిలువబడు ఒకప్పటి ‘‘సీడెడ్ జిల్లా’’ల్లో ముప్పయ్ వేల సైన్యం కల్గిఉండిన ఎనభై మంది పాలయగాళ్ళు ఉండేవారు. వీరు 1800-1802 మధ్య, ఆతరువాత 1846 లో తిరుగుబాట్లు చేశారు. ఐదువేల సైన్యం కల్గి ఉండిన పదిమంది ‘‘చిత్తూరు పాలయగాళ్ళు’’ 1801-1805 మధ్య తిరుగుబాటు చేశారు. ఇరవై వేల సైన్యం కల్గి,‘‘పశ్చిమ పాలయగాళ్ళు’’ అని పిలువబడిన నలుగురు పాలయగాళ్ళు నేటి నెల్లూరుచిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉండేవారు. నలభై వేల సైన్యం కల్గి ఉండిన డెబ్బయ్ మంది జమిందార్లు ‘‘ఉత్తర సర్కార్ల’’ ప్రాంతంలో ఉండేవారు. వీరు కూడా సుదీర్ఘ కాలం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పదునెనిమిది, పందొమ్మిది శతాబ్దాల్లో పోరాడారు. ఐతే, తెలుగు ప్రాంతాలన్నింటిలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారిలో ఇప్పటి కర్నూలు జిల్లాలోని (ఒకప్పటి కడపలో ఉండిన) ఉయ్యాలవాడ పాలయగాళ్ళ కుటుంబానికి చెందిన మజ్జర నరసింహారెడ్డి 1846లో చేసిన  తిరుగుబాటు ముఖ్యమైంది; విశిష్ఠమైంది.
                సీడెడ్ జిల్లాలని పిలువబడిన నేటి రాయలసీమ ప్రాంతం 1800 లో ఆంగ్లేయుల పరమయ్యాక దాని తొలి ‘‘ప్రిన్సిపల్ కలెక్టర్’’గా థామస్ మన్రో నియమింపబడిన కాలానికి ఉయ్యాలవాడ పాలయానికి నరసింహారెడ్డి తండ్రి పెద్దమల్లారెడ్డి పాలయగాడుగా ఉండేవాడు. పెద్దమల్లారెడ్డికి చిన్నమల్లారెడ్డి అను తమ్ముడు కూడా ఉండేవాడు. అప్పట్లో ఈ పాలయానికి రు.30,480-8-5 రెవిన్యూ వస్తుండేది. నరసింహారెడ్డి తాత, అనగా, అమ్మకు తండ్రయిన జయరామరెడ్డి నొస్సుం కు పాలయగాడుగా ఉండేవాడు. ఈ పాలయానికి రు.83,230-0-0 రెవిన్యూ వస్తుండేది. థామస్ మన్రో సీడెడ్ జిల్లాల్లోని ఎనభై మంది పాలయగాళ్ళను 1800-1802 మధ్య సైన్యంతో, బెదిరింపులతో, బలవంతంతో పదవుల నుండి తొలగించి, వారికి పెన్షన్లు ఇచ్చినప్పుడు పెద్దమల్లారెడ్డి, చిన్నమల్లారెడ్డికి కలిపి రు.70-0-0, అనగా ఒక్కొక్కరికి, రు.35 వంతున, జయరామి రెడ్డికి రు. 8,323-10-5 ఇవ్వడం జరిగింది. పెద్దమల్లారెడ్డికి ముగ్గురు కుమారులైనందున ఆతని మరణానంతరం చిన్నవాడైన నరసింహారెడ్డికి తండ్రి పెన్షన్‌లో సుమారు పన్నెండు రూపాయలు నెలసరి పెన్షన్‌గా రావడం జరిగింది. (పెద్ద మల్లారెడ్డి పెద్ద భార్య కుమారులు  కుమార మల్లారెడ్డి,  వరదారెడ్డి లకు రెండు భాగాలు పోగా) తాత జయరామిరెడ్డి మరణించాక ఆతనికి వస్తుండిన పెన్షన్ నరసింహారెడ్డి తల్లికి రావడంతో అది నరసింహారెడ్డి కుటుంబానికి ఆదరువుగా ఉండేది. కాని తల్లి మరణించాక ప్రభుత్వం దానిని ఆపివేసింది. ఐతే, తల్లి పెన్షన్ తనకు కొనసాగించాలని నరసింహారెడ్డి కోరడం జరిగింది. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీనితో ఆంగ్లేయులపై నరసింహారెడ్డికి ఆక్రోశం పుట్టుకొచ్చింది. కాని, అతడు తొందరపడలేదు. కొంతకాలం వనపర్తి జమిందార్ వద్ద, మరికొంత కాలం బనగానపల్లిలో కొంతభాగానికి అధిపతిగా ఉండిన హైదరాబాదు పఠాన్ షా ఆలంఖాన్ వద్ద ఉద్యోగం చేయడం జరిగింది. ఇదే కాలంలో ఉయ్యాలవాడ, నొస్సుం తదితర ప్రాంతాల్లోని రైతులు తరతరాలుగా అనుభవిస్తుండిన పలురకాల భూహక్కుల్ని బ్రిటిష్ వాలకులు తొలగించంతో బాటు మితిమీరిన స్థాయిలో పన్నులు విధించి, నిక్కచ్ఛిగా వసూలు చేయసాగారు. దీనితో, కోపోద్రిక్తుడైన నరసింహారెడ్డి ప్రజల భూహక్కుల రద్దుకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఆరంభించాడు.
                ఇతని ఉద్యమం ప్రధానంగా జన సమస్యలకై, ముఖ్యంగా రైతుల భూసమస్యలకై జరుగుతోన్న పోరాటం గావున కట్టుబడి, భటవృత్తి, ఖైరతి వంటి పలు రకాల ఇనాందార్లు, ఇతర రైతులు, చెంచులు, యానాదులు, వడ్డెర్లు, గ్రామాధికారులు, కరణాలు, వ్యవసాయ కూలీలు వంటి వారు వేలకొద్ది ఇతని పోరాటంలో పాల్గొనసాగారు. వీరేగాక, కడప, కర్నూలు, బళ్ళారి, హైదరాబాదు ప్రాతాల పాలయగాళ్ళు, జమిందార్లు, రాజులు వంటివారు కూడా ఏదోఒక రూపంలో ఇందులో పాల్గొన్నారు. మట్ల వంశపు ఔక్ రాజకుటుంబీకులు వెంకటరామరాజు, నారాయణరాజు, నరసరాజు వంటివారు, బనగానపల్లి జాగీర్దార్ గులాం మహమ్మద్ ఖాన్, జటప్రోలురాజా లక్ష్మణరాయుడు, మునగాలరాజా రామకృష్ణారెడ్డి, పెనుకొండ రాజా, కంపిలి ఆనెగొంది రాజు మంత్రి పంపాపతిరావు, హైదరాబాదు ప్రాకుటూరు జమిందార్ లాల్‌ఖాన్ జమేదార్, కోలాపురం, అలంపురం జమిందార్లు, వనపర్తి రాజా రామేశ్వరరావు, కర్నూలు పాపాఖాన్, ఆతని తండ్రి హైదరాబాద్ వాసి సలాంఖాన్, నొస్సుం కట్టుబడి దఫేదార్, గోడ సుబ్బడు, చాగలమర్రి తాలూకా పాతకందుకూరు గ్రామాధికార్లు, ఆకుమల్ల వాసి గోసాయి వెంకన్న, కరణం అశ్వద్ధం, దరిసి రోసిరెడ్డి, జంగం మల్లయ్య వంటివారు అనేకమంది నరసింహారెడ్డికి అండగా నిల్చారు.
                జన సమస్యలకై నరసింహారెడ్డి ఆంగ్లేయులతో పోరాటానికి సిద్ధమౌతున్న దశలో, 1845లో, గోసాయి వెంకయ్య అను సన్యాసిని నరసింహారెడ్డి కలవడం, తిరుగుబాటు ద్వారానే అనుకొన్న లక్ష్యాలు సాధించవచ్చునని ఆతడు నరసింహారెడ్డితో ప్రోత్సాహపు మాటలు అనడం, ఇద్దరూ కలసి కోయిలకుంట్ల తాలూకా, తదితర ప్రాంతాల్ని సందర్శించడం, అక్కడి జనాల ఆలోచనల్ని అంచనా వేసుకోవడం ఒకదానివెంట మరొకటి త్వరత్వరగా జరిగిపోయాయి. ఇదే తరుణంలో, 1846 జూలై తొలినాళ్ళలో నరసింహారెడ్డికి అండగా నిలవడానికి ముప్పయ్ మంది ముందుకు రావడం జరిగింది. అంచనాలకు తగినట్లు జనం మద్దతు వస్తుండడంతో నరసింహారెడ్డి ధైర్యం మరింత పెరిగింది. దీనితో పోరాటానికి నిర్ణయించుకొని, ఆంగ్లేయుల్ని రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తించ సాగాడు. తొలుత, తన పెన్షన్ తీసుకోవడానికి ఇకమీదట తాను స్వయంగా రానని, తహసిల్దారే తనకు పంపాలని కోయిలకుంట్ల తాలూకా తహసిల్దారును కోరడం జరిగింది. ఇందుకు తహసిల్దార్ రాఘవాచార్యులు ఉగ్రుడై, నరసిహారెడ్డిని పట్టుకు రమ్మని పోలీసుల్ని, 106 మంది కట్టుబడి దారుల్ని పంపడం జరిగింది. నరసింహారెడ్డిని పట్టుకోవడానికి  పోలీసులు కొంతకాలం ప్రయత్నించడం, పోలీసుల్ని బంధించడానికి నరసింహారెడ్డి ప్రయత్నించడం వంటి తరుముకోవడాలు కొంతకాలం జరిగాక కర్నూలు జిల్లాలోని చాగలమర్రి తాలూకాలోని మిట్టుపల్లి అను చిన్న పట్టణంలో ఇరువురిమధ్య ఘర్షణ జరిగింది. ఇందులో, తొమ్మిదిమంది పోలీసుల్ని నరసింహారెడ్డి అనుచరులు చంపడం జరిగింది. ఐనా, ఈ గొడవ ఇంతటితో ఆగలేదు.
                ఇది జరిగాక, నరసింహారెడ్డి, ఆతని అనుచరులు దాదాపు మూడువందల మంది మేచ్‌లాక్స్, డేగర్స్, కత్తులు, కర్రల్ని చేతబట్టుకొని జూలై పదవతేదీ 1846న కోయిలకుంట్లను ముట్టడించారు, తహసిల్దార్‌ని బంధించారు, దగ్గర్లోని తాలుకా ఖజానా లోని రు. 805`10`4 కొల్లగొట్టారు, ఆతరువాత జరిగిన ఘర్షణలో ఐదుగురు పోలీసుల్ని చంపేశారు. ఈ సంఘటనతో నిచ్ఛేష్టుడైన బ్రిటిష్ అధికారి జాన్ కొక్రేన్ (ఆక్టింగ్ కలెక్టరు అండ్ మెజిస్ట్రేట్), కర్నూలు లోని గవర్నర్ ప్రతినిధి సెప్టిమస్‌స్కాట్, కడప సేనల అధిపతి కలొనల్ గ్రంథం వంటివారిని చైతన్య పరచి, తనుకూడా కోయిలకుంట్లకు పరుగుతీయడం జరిగింది.
                ఇదే తరుణంలో నరసింహారెడ్డి, ఆతని అనుచరులు కోయిలకుంట్లను వదలి, దువ్వూరు తాలూకాలోని రుద్రవరం వైపు పయనమై, దారి మధ్యలో ఆనెగొందె వద్దగల రంగస్వామి ఆలయంలో విశ్రాంతి తీసుకొని, ఆతరువాత రుద్రవరం చేరి, దానిని మూడువేల మందితో ముట్టడించి, దోచుకొన్నారు. నరసింహారెడ్డిని బంధించడంకై శ్రీనివాసరెడ్డ్డి, నర్శిరెడ్డి అను తహసిల్దార్లు, బ్రిటిష్ సైన్యాలు రుద్రవరంకు వచ్చినా ఆతనిని పట్టుకోలేకపోయారు. రుద్రవరం సంఘటన జరిగిన వెంటనే ఉద్యమకార్లు నల్లమల అడవుల్లోకి జారుకొని, చివరకు కొత్తకోట చేరి, అక్కడే పదిరోజులు విడిదిచేసి, ఆతరువాత దగ్గర్లోని గిద్దలూరుకు వెళ్ళడం జరిగింది.
                రుద్రవరం ఘటనతో దిమ్మతిరిగిన బ్రిటిష్ సైనిక అధికారులు బ్రిగేడియర్‌జనరల్ జాన్ ఆండర్సన్, లెఫ్టినెంట్ రసెల్, లెఫ్టినెంట్ లిల్లీక్రాఫ్ట్, కెప్టన్ నాట్, లెఫ్టినెంట్ వాట్సన్ వంటివారు సైన్యాల్ని సమాయత్తపరిచారు. కాని, అప్పటికే గిద్దలూరు చేరిన నరసింహారెడ్డి, ఆతని అనుచరులు 1846 జూలై 22, జూలై 23 తేదీలలో రెండు పర్యాయాలు అప్పటికే అక్కడికి చేరుకొనివున్న వంద వాట్సన్ సైన్యాలపై ముట్టడిచేసి, వారిని ఐదు గంటలపాటు చుట్టుముట్టి దిగ్భంధించారు. కాని, దీని తరువాత జూలై 23, 1846న ఇరువురిమధ్య ఇక్కడ జరిగిన యుద్ధంలో వాట్సన్ ఉద్యమ కారుల్ని ఓడించడం జరిగింది. ఇందులో రెండు వందల మంది ఉద్యమకారులు మరణించగా, మిగిలినవారు తప్పించుకు వెళ్ళారు. ఈ ఘర్షణలో కంభం తహసిల్దార్ కూడా మరణించడం జరిగింది.
                గిద్దలూరు యుద్ధం తరువాత తిరుగుబాటుదార్లు కంభం వైపు పయనించి కృష్ణమచెట్ట్టిపల్లి, ఆతరువాత గిద్దలూరుకు నాలుగు మైళ్ళ దూరంలోని ముండ్లపాడుకు చేరుకొన్నారు. ఐతే, జూలై 24, 1846న ఇక్కడ కెప్టన్ నాట్ ఆధీనంలోని యాబైమంది కర్నూల్ సవార్లు, 250 మంది సైన్యాలకు, తిరుగుబాటు దార్లకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు ముప్పయ్ మంది ఉద్యమకార్లు మరణించారు, ముప్పయ్ ఐదు మంది బంధీ అయ్యారు. కర్నూల్ అసిస్టెంట్ కమిషర్ కెప్టన్ రసెల్‌ని నరసింహారెడ్డి కాల్చిచంపడం జరిగింది. ఇది జరిగాక నరసింహారెడ్డి తిరిగి కొత్తకోటకు వెళ్ళాడు. ఇదే సమయంలో కొందరు అనుచరులు నరసింహారెడ్డిని వీడడం కూడా జరిగింది. బ్రిటిష్ సైన్యం కూడా నరసిహారెడ్డిని వెంటాడసాగింది. దీనితో, నరసింహారెడ్డి కొత్తకోట వద్ద తన కుటుం సభ్యుల్ని వదిలేసి, నల్లమల అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అనుచరులు చాలామంది చిందరవందర కావడం కూడా జరిగింది.
                ఇలాంటి స్థితిలో నరసింహారెడ్డిపై, ఆతని అనుచరులపై కన్నేసి ఉంచాలని జనరల్ ఆండర్సన్, కెప్టన్  నాట్, కెప్టన్ కోట్స్, మేజర్ రీడ్ వంటి వారిని బ్రిటిష్ అధికారులు ఆజ్ఞాపించడం జరిగింది. అరతేగాక, నరసింహారెడ్జిని బంధించిన వారికి వెయ్యి రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ఆగస్టు 1846 మొదటి వారంలో ప్రకటించడం జరిగింది. సైనిక రక్షణలో నరసింహారెడ్డి కుటుంబ సభ్యుల్ని కడపకు తీసుకెళ్ళడం జరిగింది. అంతేగాక హైదరాబాదు, కర్నూలు, గుంటూరు ప్రాంతాల్లోని నరసింహారెడ్డి సన్నిహితుల పేర్లను సేకరించే ప్రయత్నం కూడా జరిగింది. అలాంటి వారిలో ముఖ్యులు: గోసాయి వెంకయ్య, కరణం అశ్వద్ధం (గుండ్లదుర్తి), దర్శి రోసిరెడ్డి (గుండ్లదుర్తి), జంగం మల్లయ్య, కాస్సాని వాలయ్య (గ్రామాధికారి మరియు కట్టుబడి ఇనాందార్ల నాయకుడు, నొస్సుం).
                ఇది ఒకవైపు జరుగుచుండగా, నరసింహారెడ్డి, ఆతని వీరాభిమానులు గోసాయి వెంకయ్య, కరణం అశ్వద్ధం లతో కలసి కృష్ణానదిని దాటి హైదరాబాదు నిజాం భూభాగాల్లో ప్రవేశించాడని కొక్రేన్‌కు సమాచారం వచ్చింది. దీనితో ఆగష్టు 26, 1846న హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెంట్‌ను అలర్ట్ చేసి, నల్లమల అడవుల ప్రాంతాల్లో సైన్యం నిలపడం జరిగింది.
                ఇలా వెళ్ళిన నరసింహారెడ్డి 1846 సెప్టంబర్ మొదటి వారంలో కృష్ణా నది దక్షిణ ఒడ్డున ప్రత్యక్షమయ్యాడు. దీనితో ఉద్యమకారులంతా కోయిలకుంట్ల, ఔక్ (అవుకు) ల దగ్గర్లోని ఎర్రమలై అడవులవద్ద పోగయ్యారు. ఇది తెలిసిన కొక్రేన్ కూడా నొస్సుం, కోయిలకుంట్ల, ఔక్, తిమ్మనంపేట, జమ్మలమడుగు వంటి ప్రాంతాలకు సైన్యాల్ని పంపాడు. ఐనా, నరసింహారెడ్డి కోయిలకుంట్ల, ఔక్, నొస్సుం వంటి ప్రాంతాల్ని సందర్శించి, కట్టుబడిదార్లు మొదలైన వారితో సంప్రదించి, అక్కడి ప్రజల్ని ఉద్యమానికి సమాయత్తపరచాడు. ఆతరువాత ఆతని అనుచరులు రెండు గ్రూపులుగా విడిపోయి సూదమలచెన్నియ, సూద్దనుల్ల అను రెండు గ్రామాల్ని సెప్టంబర్ 21, 1846న దోచుకొన్నారు.
                ఈ సంఘటన జరిగినందుకు మద్రాసు ప్రసిడెన్సీ గవర్నర్ సైనికాధికారుపై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చడం జరిగింది. దీనితో, అక్టోబర్ తొలినాళ్ళలో గ్రంథం, నాట్, ఫిర్త్ వంటి అధికారులు పెల్నికోట, భద్రాచలం, ఔక్, చిన్ననాయనిపేట, నొస్సుం, ఉయ్యాలవాడ, కోయిలకుంట్లలకు సైన్యాలతో పరుగులుతీశారు. కాని, అక్టోబర్ 4, 1846న రెండు వందల మంది ఉద్యమకారులు ఔక్ ను ముట్టడించి భద్రాచలం కొండపై గల కోటలో పోగయ్యారు. అతేగాక, 1846 అక్టోబర్ 8,న నరసింహారెడ్డి నుట్టపల్లిని దోచుకొన్నాడు. ఆ తరువాత, నరసింహారెడ్డి, ఆతని అనుచరులు జగన్నాథం కొండపై గల జగన్నాథం ఆలయంలో గుమికూడారు. ఇది తెలుసుకొన్న బ్రిటీష్ సైనికాధికారులు కొక్రేన్, నాట్‌లు బీడు ప్రాంతాల్లో ఆశ్విక దళాల్ని ఉంచి, కొండపైకి పశ్చిమం నుండి నైన్యాలతో ముట్టడి చేయించారు. లెఫ్టినెంట్ న్యూలిన్, యంగ్‌హస్బెండ్  వాంటివారైతే కొండపైకి ప్రాకి, ఆలయాన్ని చుట్టుముట్టారు. దీనితో ఇరువురి మధ్య ఇక్కడ యుద్ధం ఆరంభమైంది. ఇందులో ఉద్యమకారులు 46 మంది చనిపోయారు, 8 మంది గాయపడ్డారు, 83 మంది లొంగిపోయారని తెలుస్తోంది. ఇక, నరసిహారెడ్డికి మోకాలిపై గాయం కావడంతో పోరాటం చేయలేక, తప్పించుకోలేక బంధీ అయ్యాడు. 
                ఈ సంఘటన తరువాత నరసింహారెడ్డి నాయకత్వాన జరిగిన ఉద్యమ విషయాలు లోతుగా తెలుసుకోవడంకై మద్రాసు ప్రభుత్వం ఒక స్పెషల్ కమీషన్‌ను నియమించింది. దీని అద్యక్షుడుగా డబ్ల్యు.ఎ.డి.ఇంగ్లిస్ నియమించబడినాడు. పరిశీలన పూర్తయ్యాక, ఈ కమీషన్, ఉద్యమ కాలంలో బందీకాబడిన తొమ్మిది వందల ఒకరిలో నాలుగు వందల పన్నెండు మందిని విడుదలకు అనుమతించింది, రెండు వందల ఇరవైమూడు మందిని జామీనుతో వెళ్ళడానికి అంగీకరించింది, ముగ్గురికి జీవితాంతం, ఐదుగురికి పద్నాలుగేండ్లు, నలుగురికి ఎనిమిదేండ్లు, ముగ్గురికి పదేండ్లు, ఎనభైమూడు మందికి ఐదేండ్లు, ఒక్కరికి మూడేండ్లు, ఆరుగురికి రెండేండ్లు, ముగ్గురికి ఒక ఏడు, ఇద్దరికి ఆరు నెలలు, మొత్తం నూటపన్నెండు మందికి శిక్ష విధించింది.
                ఇక, నరసింహారెడ్డికి మరణ శిక్ష విధించబడి కోయిలకుంట్ల వీధుల్లో సంకెళ్ళతో త్రిప్పబడి, ఆ తరువాత జుర్రేటి బావివద్ద (జుర్రేటివాగు ఒడ్డున గల బావి) ఉదయం 7 గంటల సమయాన పిబ్రవరి 22, 1847 న ఉరితీయబడినాడు. ఆ ప్రాంత జనాల్లో భయం కల్పించడంకై ఆతని శవం 1877 వరకు అక్కడే వ్రేలాడదీయబడి ఉండేదని ఇప్పటికీ అక్కడి జనాల్లో కథనాలు ఉన్నాయి. నరసింహారెడ్డివలె ఉరితీయబడి, వ్రేలాడి ఉంచబడిన వారిలో తిరువాన్కూరుకు చెందిన వేలుతంబి, హైదరాబాదులో 1857 నాటి తిరుగుబాటు కాలంలో బ్రిటీష్ రెసిడెన్సీపై ముట్టడి చేసిన బేగంబజార్ నివాసి తుర్రేబాజ్ ఖాన్ వంటి వారు అనేకమంది ఉన్నారు. అసలు, 1857 ఉద్యమ కాలాన బెనారస్-అలహాబాద్‌ల మధ్య మైళ్ళకొద్ది దూరం చెట్లకు వ్రేలాడదీయబడిన శవాలు దర్శనమిస్తుండేవి. ఇలాంటి క్రూర చర్యలకు కారకుడైన బ్రిగేడియర్ నీల్‌ను మానవ రూపపు రాక్షసుడు అని అప్పట్లో అనేవారు. తరువాతి కాలాల్లో ఇతడిని మరో డయ్యర్ అనేవారు. నరసింహారెడ్డి ఉరితీయబడినాక ఆతని వీరత్వంపై కుప్పలకొద్ది వీరగాథలు, నాటకాలు, కథలు వంటి పలు కళలు పుట్టుకొచ్చాయి. నేటికీ అవి తెలుగు ప్రాంతాలన్నింటిలో ప్రాచుర్యంలో ఉన్నాయి.
                నరసింహారెడ్డి ఉద్యమ ఫలితాల్ని పరిశీలిస్తే, జన పీడిత పాలకులతో ఓడిగెలిచిన నాయకుడని ఆతని గురించి చెప్పక తప్పదు. ప్రాణం కోల్పోయినా ప్రజలకు ప్రధానంగా ఉన్న బ్రిటిష్ వారి ఇనాంల రద్దు నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసేట్లు, వారి భూహక్కులు తిరిగి ఇవ్వబడేట్లు తన ఉద్యమంతో ప్రభావం చూపగలిగాడు. ఇందుకై 1858 లో మద్రాస్ ప్రభుత్వం డబ్ల్యు. టి. బ్లేయ్‌ర్ అధ్యక్షతన ఇనాం కమిషన్‌ను నియమించింది. మద్రాసు ప్రసిడెన్సీలోని అన్ని రకాల ఇనాంలను పరిశీలించి, వాటిని క్రమబద్దీకరించే పనిని ఇది పూర్తి చేసింది. ఇంతటి ఘనతల్ని సాధించినాడు కాబట్టే ఇప్పటికీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆతని ఉద్యమం ఎంతోమందికి, ఎన్నో ఉద్యమాలకు స్పూర్తినిస్తున్నాయి.

డా॥ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి
రిటైర్డ్‌ ప్రొఫెసర్, చరిత్ర శాఖ, ఎస్వీ యూనివర్శిటీ, తిరుపతి.
189 బి, తుమ్మలగుంట, తిరుపతి  517 502.
మొబైల్ : 9849584324
ఈమెయిల్: dsreddy.svu@gmail.com

NB: కర్నూలులో ఫిబ్రవరి 22న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థూపావిష్కరణ సందర్భంగా ఉయ్యాలవాడ పోరాట నేపధ్యం గురించి దేవిరెడ్డి గారు రాసిపంపిన ఈ బృహత్ వ్యాసాన్ని చాలా వరకు సంక్షిప్తం చేసి సాక్షి పత్రిక ఏపీ ఎడిషన్ సంపాదకీయ పేజీలో (22-02-2019) ప్రచురించటమైనది. సకాలంలో ఉయ్యాలవాడపై సంక్షిప్తంగా నైనా కథనాన్ని ప్రచురించినందుకు ఆవిష్కరణ సభకు వచ్చిన వారందరూ సంతోషాన్ని వ్యక్తపరిచారంటూ దేవిరెడ్డి గారు ఇవ్వాళే నాకు కింది మెసేజ్ పంపారు. దాన్ని కింద చూడండి.

Dear Sir, Namaste.  Thank you very much for the help. Every one felt happy with the article on the eve of installation of the big bronze statue of Uyyalavada with a sword in hand on a horse. I could see the original sword used in the fight and preserved by his family and displayed at the meeting yesterday. I am really grateful to you for this and for the others also. .

Devireddy subramanyam reddy


ఈ బృహత్ వ్యాసాన్ని నా ఈ బ్లాగులో, ఫేస్ బుక్‌లో కూడా ప్రచురించడానికి అవకాశం ఇచ్చిన గురుతుల్యులు దేవిరెడ్డి గారికి కృతజ్ఞతలతో... 




ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ వాస్తవ చిత్రాన్ని సైరా చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా నేడు మీడియాకు విడుదల చేశారు.

విప్లవ వీరుడు..రేనాటి సూర్యుడు

పై లింకులో కోవెలకుంట్లలో ఫిబ్రవరి 22న ప్రతిష్ఠించిన ఉయ్యాలవాడ కంచువిగ్రహంతో పాటు ఆయన చరిత్రకు చెందిన మరికొన్ని విశేషాలతో సాక్షి ప్రత్యేక వ్యాసం ఉంది. చూడగలరు.