Thursday, November 3, 2016

'ప్రతీ' వాళ్లమ్మ - మున్నా వాళ్లమ్మ


"మహాశ్వేతాదేవి రాసిన ‘ఒక తల్లి’ ఈ దేశ మహిళల చరిత్రలోనే ఒక విభిన్నమైన, అత్యంత వైవిధ్యమైన మాతృత్వానికి సంబంధించిన నవల. యాభై ఏళ్ల క్రితం ఆమె సృష్టించిన ‘సుజాత’ పాత్ర విప్లవ రాజకీయాలను పాఠకులకు సులభంగా అర్ధం చేయించటానికి ఎన్నుకొన్న పనిముట్టు. ఆ రాజకీయాల కోసం చనిపోయిన ఒక కొడుకుకు తల్లి అయినా, అసలు ఎలాంటి రాజకీయాలు తెలియని విద్యాధికురాలైన స్త్రీ దృష్టి కోణం నుండి రాసిన నవల. కొడుకు మరణానికి కారణం తెలుసుకొనే ప్రయత్నంలో సుజాత ఆమెకు ఆమే రాజకీయాలు తెలుసుకొంటుంది. సమాజంలో ఉండే వర్గాలు, వర్గ సంబంధాలు ఎరుక పర్చుకొంటుంది. రాజ్యమూ, దాని క్రూరత్వం గురించి తెలుసుకొని కర్తవ్య బోధ చేసి సహజ మరణం చెందుతుందా పాత్ర.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పిన సంవత్సరానికి మరుసటి సంవత్సరమే వ్రతీ జన్మిస్తాడు. ఉన్నత మధ్య తరగతి కుటుంబంలో మసలుకొంటున్న నోరులేని తల్లి సుజాతకు ఐదో సంతానంగా అతడు పుడతాడు. 1947 తరువాతి ఇరవై సంవత్సరాలలో కలకత్తాలో హతమై పోయిన వారిలో వ్రతీ వెయ్యీ ఎనభై నాలుగోవాడు. ఈ నవలకు బెంగాలి మూలం ‘హజార్ చౌరాసీ కా మా (వెయ్యీ ఎనభై నాలుగోవాడి అమ్మ).’ పేరులోనే రాజకీయ చరిత్ర ఉన్న నవల యిది. గోవింద్ నిహలానీ దర్శకత్వంలో ఈ నవల సినిమాగా వచ్చి, ముగింపు గొప్ప నిరాశను కలిగించింది.

నక్సల్బరీ మేఘ గర్జనలు అలుముకొని ఉన్న కాలమది. కలకత్తాలోని దివ్యనాధ్ చటర్జీ యింట్లో అశాంతి నెలకొన్నది. కారణం ఈ యింటి చిన్న కొడుకు వ్రతీ ‘దేశభక్తులు’గా చలామణి అవుతున్న వారి చేతిలో హతుడయ్యాడు. వ్రతీ, వ్రతీతో బాటు జరిగిన నలుగురు యువకుల హత్యలకు పోలీసుల మద్దతు ఉంటుంది. సమాజ మార్పు కోసం జరిగే రహస్యోద్యమంలో పని చేసే ఆ బృందం, ఒక ద్రోహి సమాచారంతో ప్రమాదంలో పడుతుంది. వారిలో ఒకడైన సమూ యింటిలో వారు ఉండగా ఆ హత్యలు జరుగుతాయి. వ్రతీ మరణం కలిగించాల్సిన దుఃఖం కంటే అలాంటి చావు కలిగించిన అవమానమే వ్రతీ కుటుంబ సభ్యులను కలవర పెట్టింది. వ్రతీ పేరు దినపత్రికల్లో రాకుండా దివ్యనాధ్, అతని పెద్ద కొడుకు జ్యోతీ ప్రయత్నాలు చేస్తుండగా వ్రతి తల్లి సుజాత కొడుకు శవాన్ని చూడటానికి మార్చూరీకి వెళుతుంది. వ్రతి మరణ కారణం కోసం ఆనాడు ఆమె మొదలు పెట్టిన అన్వేషణ రెండు సంవత్సరాల తరువాత ఆమె మరణంతోనే ముగుస్తుంది.

సుజాత మధ్య తరగతి మిధ్య విలువలకు అతీతమైన ఆలోచనా ధోరణి కలిగిన మహిళ. కొడుకుల మరణం అందరి తల్లులకు కలిగించే మామూలు శోకంతో పాటు ఆమెలో కొన్ని ప్రశ్నలు మొలకెత్తుతాయి. కాలంతో పాటు శోకం కనుమరుగవుతుందని అంటారు. కానీ ఆమె శోకం కాల ప్రవాహం గట్టున విత్తనంగా మొలిచి అంతకంతకు పెద్దదవుతుంది. వ్రతి మరణించిన కారణం ఆమెకు అర్ధం అయ్యే కొద్దీ ఆమె దుఃఖం పెరిగిపోతుంది. ఇక ఆ శోకం ఒక కన్నతల్లి వ్యక్తిగత శోకం స్థాయిని దాటి సామాజిక వ్యధగా పరిణామం చెందుతుంది. వ్రతీ బ్రతికి ఉన్న కాలంలో కొంతకాలమే అతడు తన మీద ఆధారపడ్డ పసిబిడ్డ అనీ, అతడి సామాజిక జీవనం ప్రారంభం అయ్యాక అతడు తనకు అపరిచితుడే అని అర్ధం చేసుకొంటుంది. సామాజిక పీడన రద్దుకోసం పని చేసిన కొడుకు – సమాజంలోనూ, కుటుంబంలోనూ ఎప్పుడూ అణచివేతకు గురి అయ్యే తల్లి .. వీరిద్దరి మధ్య అనుబంధాన్ని ‘న భూతో, న భవిష్యత్’ అన్నట్లు రాశారు మహాశ్వేతాదేవి."(మహాశ్వేతా దేవి నవల ఏక్ హజార్ చౌరాసీకీ మా సినిమాలో చిత్రం)

'ప్రతీ' వాళ్లమ్మ గురించి తెలుసుకోవాలంటే పై పరిచయం పూర్తి పాఠాన్ని కింది లింకులో చదవండి. ఒక తల్లి సుజాత అంతరంగాన్ని, ఆత్మ ఘర్షణను ఆవాహనం చేసినట్లుగా అత్యద్బుతరీతిలో మహాశ్వేతాదేవి నవల 'ఒక తల్లి'ని ఈ కింది లింకులో పరిచయం చేసిన వారు రమాసుందరి గారు. ఇంత గొప్ప పరిచయం అందించిన వారికి మనఃపూర్వక అభినందనలు.

లక్షలాది తల్లుల ప్రతిబింబం 'ఒక తల్లి' సుజాత
రమా సుందరి
https://kadhalu.wordpress.com/2016/09/05/%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AC%E0%B0%BF%E0%B0%82/

********************

మున్నా వాళ్ల అమ్మపిల్లలకు రెక్కలొస్తాయి. ఎగిరిపోతారు.
‘బడిపంతులు’ సినిమాలో...
‘రెక్కలు అలసి మేమున్నాము...’ అని తల్లితండ్రులు వాపోతారు.
మున్నా అలా కాదు.
రెక్కలొచ్చాయని అమ్మానాన్ననూ,వాళ్ల ఆశయాన్నీ వదిలిపోలేదు.
రెక్కలు ఉన్నాయి కాబట్టే... అడవిలోకి ఎగిరిపోయాడు.
చిన్నప్పుడు మున్నా తల్లితో అనేవాడు...
‘‘అమ్మా... వర్షం వస్తోంది. పిట్టలకు ఇళ్ళుండవు కదా..
మనింట్లోకి రమ్మనమ్మా...’’ అనేవాడు!
రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో మున్నాను పెంచింది తల్లి.
ఇప్పుడు తనే.. కొడుకును పోగొట్టుకొని... భర్త జాడ కనుమరుగై
రెక్కలు తెగిన పక్షి అయింది. కన్నీటి వర్షంలో తడుస్తోంది.

బిడ్డల్ని త్యాగం చేసిన విప్లవ మాతలను చూశాం. అసలు బిడ్డలే వద్దనుకున్న తల్లి తండ్రులనూ విప్లవంలో చూశాం. కానీ ప్రజాయుద్ధంతో మరణాన్ని జయించడమెలాగో నేర్పిన తండ్రి ఆర్కేనే అంటారు కొడుకు మున్నా (పృథ్వి) చేయిపట్టుకొని ఉద్యమానికి పరిచయం చేసిన కన్నతల్లి శిరీష అలియాస్ పద్మక్క. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) భార్యగా, చెట్టంత కొడుకుని తాజా ‘ఎన్‌కౌంటర్’లో పోగొట్టుకున్న తల్లిగా ఆమె దుఃఖాన్నీ, జ్ఞాపకాలనూ ‘సాక్షి ఫ్యామిలీ’తో పంచుకున్నారు. ‘దూరంగానే ఉన్నా మా మనసులెంతో దగ్గరగా ఉన్నాయనుకున్నా. కానీ రాజ్యం మా కుటుంబాల్ని చెదరగొట్టింది. నా కొడుకుని పొట్టనబెట్టుకుంది. నా భర్తని మాయం చేసింది. అయినా ఈ యుద్ధం ఆగదు’ అని తేల్చి చెప్పిన పద్మక్కతో సాక్షి దినపత్రిక ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చదవండి..

మున్నా వాళ్ల అమ్మ
Sakshi  Updated November 01, 2016 2248 (IST)
http://www.sakshi.com/news/family/sakshi-special-interview-maoist-leader-rk-wife-417828

మహాశ్వేతాదేవి నవల్లోని తల్లి సుజాతను నేను చూడలేదు. అది కల్పన లాంటి వాస్తవ జీవిత చిత్రణ. కానీ మున్నా వాళ్లమ్మ పద్మను 18 ఏళ్ల క్రితం రెండు సందర్భాల్లో చూశాను. ఒకసారి అనారోగ్యంతో ఉన్న తన జీవన, ఉద్యమ సహచరుడు ఆర్‌కెతో కలిసి వచ్చినప్పుడు ఒక మహానగరంలో, మరోసారి సహచరుడిని కలిసేందుకు వచ్చినప్పుడు నల్లమల అడవి క్యాంపులో... రెండు సార్లు ఆమెను చూశాను. తొలుత జీవన సహచరుడు, ప్రజాయుద్ధ నేత ఆర్.కె కి దూరంగా, తర్వాత తను ప్రాణంగా ప్రేమించిన కుమారుడు మున్నాకు దూరంగా గడపాల్సి వచ్చిన ఈ తల్లిని అప్పట్లో అతి సమీపం నుంచి చూసినప్పుడు మర్చిపోలేని ఆమె పరిదీనవదనం 18 ఏళ్ల అనంతరం కూడా కళ్లకు కట్టినట్లే కనిపిస్తోంది.

సాక్షి నవంబర్ 1వ తేదీ ఫ్యామిలీ విభాగంలో వచ్చిన మున్నా తల్లి ఇంటర్వ్యూ ఈ మధ్య కాలంలో నేను చూసిన, చదివిన మానవీయ కథనాల్లో అత్యంత కరుణామయమైన, దయనీయమైన కథనం.


"వాళ్ళ నాన్న అనుసరించిన మార్గాన్ని మున్నా ఎంచుకుంటాడని నేనూ అనుకోలేదు. వాళ్ళ నాన్న త్యాగం వాడికి అర్థమైతే నా కన్నీటిని వాడు అర్థం చేసుకుంటాడనుకున్నా. నా దృష్టిలో మున్నా చిన్నపిల్లాడే, కానీ వాడేంటో కొద్దికొద్దిగా అర్థం అయ్యేసరికే వాడు నాకందనంత ఎదిగిపోయాడు."

మహాశ్వేతాదేవి నవల ఒకతల్లి సుజాత, మున్నా తల్లి శిరీష (పద్మ) ఇద్దరికీ ఒకే అనుభవం.. తమ కుమారుల్లో ఏముందనే విషయం కొద్దికొద్దిగా అర్థం అయ్యేసరికి అటు ప్రతీ, ఇటు మున్నా ఆ తల్లులిద్దరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. కల్పన వంటి వాస్తవ సాహిత్యంలో ఒక తల్లికి, వాస్తవ జీవితంలో గర్భశోకం అనుభవిస్తున్న మున్నా తల్లికి ఎంత దగ్గరి సంబంధం ఉందో.. సాహిత్యానికి, జీవితానికి మధ్య సరిహద్దులను చెరిపివేసిన అత్యున్నత మాతలు, బిడ్డల కన్న పేగు కథలవి. అయిదు దశాబ్దాలుగా ఈ దేశ నడిబొడ్డున జరుగుతున్న రక్తప్లావిత మహోన్నత ఆచరణకు సంబంధించిన బాధామయ గాథలివి.

ఈ ఇద్దరు తల్లుల కడుపులో పుట్టిన ఆ బిడ్డలకు ఏ స్వార్థమూ లేదనే ఈ సందర్భంగా భావిస్తున్నాను. స్వార్ధరాహిత్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా బలిపెట్టిన పసిబిడ్డలు వాళ్లు. ఆదివాసీల అన్నం తిన్న రుణం తీర్చుకున్న నిర్మల హృదయులు వాళ్లు. వాళ్లకు రెండుచేతులెత్తి జోహార్లు చెబుతున్నా.

"ఇలాంటి శోకాలు, ప్రశ్నలు తరువాత కాలంలో ఈ దేశంలో, ఎన్ని లక్షల మంది తల్లులకు అనుభవం అయ్యాయో! ఎంతో మంది ‘ఒక తల్లులు’ ఆదివాసీ గిరిజన గూడేల నుండి, మధ్య తరగతి కుటుంబాల నుండి ఆక్రోశించారో! పదహారు ఏళ్ల బిడ్డను అడవుల్లో పోలీసులు ఎన్ కౌంటర్ చేసి కర్రకు కట్టి పోలీసు స్టేషన్ కు తీసుకొని పోతున్నప్పడు, కొడుకు శవం కోసం వారిని రహస్యంగా వెంబడించిన ఆదివాసీ తల్లి వారిలో ఒకటి. కూతురు ఎంకౌంటర్ ను ఖండిస్తూ నడివీధిలో రాస్తారోకో చేసిన శృతి తల్లి వారిలో ఒకరు. అమరవీరుల బంధు కమిటీ నాయకురాలిగా తన కూతురు శవాన్నే గుర్తు పట్టాల్సి వచ్చిన శాంతక్క ఆ తల్లులలో ఒకరు. వ్రతీ లాంటి అమరవీరుని తల్లి సుజాతకు యాభై ఏళ్ల క్రితం తన నగలు కొన్ని దాచి మృత వీరుల కుటుంబాలకు సహాయపడాలన్న ఆలోచన బీజ రూపంలోనే ప్రారంభం అవుతుంది. నేటికీ ఆ చావులు 1084 నుండి కొన్ని లక్షల వరకు పెరిగి, చనిపోయిన వారి తల్లులు ఉద్యమిస్తున్నారు. పోరాటాలు లేని ప్రపంచ భాగం సూది మొనంతా కూడా లేదు. రాజ్య హతులు లేని భూమి ఈ భూగోళంలో వెదికినా కనబడదు. నేడు ప్రపంచమంతా అమరవీరుల పోరాట కమిటీలు, భారతదేశం నుండి టర్కీ, మొరాకో వరకూ వర్ధిల్లుతున్నాయి. బిడ్డల పోరాట వారసత్వాన్ని నేడు తల్లులూ, తండ్రులూ మోస్తున్నారు. ‘ఒక తల్లి’ సుజాత మరణానంతరం కూడా వేలాది తల్లుల గుండె జ్వాలలను రగిలిస్తుంది."

ఒక తల్లి నవల పరిచయంకి పై అద్భుత ముగింపు నిచ్చిన రమాసుందరిగారికి మరోసారి అభినందనలు..

గమనిక:
ఒక్క విషయం. పై రెండు లింకుల్లో ఏ ఒక లింకును చదవడం మర్చిపోయినా గత 50 ఏళ్లుగా ఈ దేశ చరిత్రలో పోరుబాట ఎంచుకుని నేలకొరుగుతున్న పిల్లల తల్లుల ఆత్మ ఘోషలో సగాన్ని ఈ బ్లాగ్ పాఠకులు మిస్సయినట్లే..

అందుకే ఆ ఇద్దరు తల్లుల ఆత్మఘోషను మళ్లీ ఇక్కడ లింకుల రూపంలో చూడండి.

లక్షలాది తల్లుల ప్రతిబింబం ఒక తల్లి సుజాత
Posted by రమా సుందరి in వెలుతురు పిట్టలు, వ్యాసాలు ≈ 3 వ్యాఖ్యలు
https://kadhalu.wordpress.com/2016/09/05/%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AC%E0%B0%BF%E0%B0%82/

మున్నా వాళ్ల అమ్మ
Sakshi  Updated November 01, 2016 2248 (IST)
http://www.sakshi.com/news/family/sakshi-special-interview-maoist-leader-rk-wife-417828

ఇద్దరు తల్లుల ఆత్మఘోషను ఒక చోటికి చేర్చి అందివ్వడమే ఇక్కడ నా పాత్ర. ఆ తల్లుల వేదనను ప్రపంచానికి పరిచయం చేసిన రమాసుందరి, అత్తలూరి అరుణ గారి పరిచయం, ఇంటర్వ్యూలే ఈ కథనానికి మూలం.

2 comments:

Kcube Varma said...

కదిలించే వ్యాసాలు. చాలా మంది ఆచార్యులకు మేధావులకు సమాధానం లభ్యమవుతుంది మనసుంటే.

Raja Sekhara Raju said...

వర్మ గారూ,

ఉద్యమంపై, దాని నడకతీరుపై ఎన్ని భేదాభిప్రాయాలున్నా సరే.. మనసనేది ఉంటే అందరినీ కదిలించే అనుభవాలే కదా ఆ తల్లులిద్ద్రరివీ. సకాల స్పందనకు ధన్యవాదాలు. వీలయితే మీ మిత్రులకు కూడా ఈ పోస్ట్ లింకును షేర్ చేయగలరు.

Post a Comment