Pages

Saturday, December 4, 2010

మా తెలుగు మాస్టారూ…మా తెలుగు పద్యమూ…

పల్లెటూరి బడిలో 8వ తరగతి చదువుతున్న రోజులు….7వ తరగతి నుంచి అప్పుడే పెద్దక్లాసుకు ఎగబాకివచ్చిన రోజులు.. (1974) మా క్లాసుకు రెండు సెక్షన్‌లు. 8 ఎ, 8 బి. మా బి సెక్షన్‌కి తెలుగు టీచర్‌గా సహదేవరెడ్డి సార్ వచ్చేవారు. పురాణాలు, ప్రబంధాలు, చక్కటి పద్యపఠనాలతో క్లాసును ఉర్రూతలూగించేవారు..

ఇంగ్లీష్, సైన్స్, లెక్కలు సబ్జెక్ట్‌లతో పరమ విసుగ్గా ఉండే మాకు తెలుగు క్లాస్ అంటే చాలు చెవులు నిక్కబొడుచుకుని ఆయన రాక కోసం ఎదురు చూసేవాళ్లం. మామూలుగానే తెలుగు క్లాసు అంటే పిల్లల తూగును, నిద్రమత్తును వదిలించేదని అప్పట్లో గుర్తింపు పొందింది. అందుకే లెక్కలు, సైన్స్ మధ్యలో లేదా సైన్స్, ఇంగ్లీష్ మధ్యలో తెలుగు క్లాసును ఇరికించేవారు. ఇది తెలుగు టీచర్లను కాస్త మండించేదనుకోండి.

మా సహదేవరెడ్డి సార్ తెలుగు ప్రాచీన సాహిత్యం పట్ల మాలో ఎంత గాఢానురక్తిని క్లాసులో పెంచి పోషించేవారంటే ఏ ఒక్కరం కూడా తెలుగు క్లాస్‌ను తప్పించుకునే వాళ్లం కాదు. స్వతహాగా గత జీవితంలో హరికథాగానం చేసి బతికిన ఆయన రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం.

పద్యాన్ని మొదటిసారి రాగయుక్తంగా, రెండోసారి మామూలుగా చదివి వినిపించే ఆయన నేర్పుకు మేం దాసోహమయ్యేవాళ్లం. పద్యాన్ని రాగయుక్తంగా పాడకుండా చదివి వినిపించాలన్న నిబంధన ఇంటర్, డిగ్రీ, పిజి తరగతులలో అప్పటికే అమలవుతున్నందువల్ల మేం పై చదువులకు వెళ్లే కొద్దీ తెలుగు పద్య గాన మహిమా శ్రవణానుభవం మాకు కొరవడిందనుకోండి.

ఆ పురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి భా
షాపరశేషభోగి వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
క్షాపరతంత్రు డంబురుహగర్భ కులాభరణం బనారతా
ధ్యాపనతత్పరుండు ప్రవరాఖ్యు డలేఖ్యతనూవిలాసుడై

అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ
పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన
స్పుట నటనానురూప పరిపుల్ల కలాపి జాలమున్ గ్ర
కట శరత్కరేణు కర కంపిత జాలము శీత సాలమున్

అంటూ సంస్కృత సమాస పద భూయిష్టమైన మనుచరిత్రలోని ప్రవరుడి ఘట్టాలను పాడి వినిపిస్తుంటే, మాకు ఒక్క పదం అర్థం కాకపోయినా ఒళ్లు పులకరించిపోయేది. రేడియోలో ఘంటసాల, సుశీల, లీల, జిక్కి పాటల, పద్యాల పారవశ్యం ఒక వైపు, ఇల్లు వదిలాక స్కూల్లో తెలుగు పద్య శ్రవణానందం మరోవైపు… మా బాల్యం ఎంత హాయిగా గడిచిపోయిందో…

వ్యావసాయిక జీవన సంస్కృతిలో పెరిగిన మా కష్టాలను తాత్కాలికంగా మర్చిపోయేలా చేసిన ఈ పాటలు, పద్యాలు ఒక రకంగా చెప్పాలంటే పారే యేటినీటిలో స్నానంలాగా, మా తరాన్ని సేదతీర్చేవి,

తెలుగు పాట… తెలుగు పద్యం… ఈ రెండింటికి నోచుకున్న పచ్చకాలం మాది. ఇవి లేని పల్లె జీవితాన్ని ఊహించుకోలేం. ఇప్పటికీ ఘంటసాల పద్యాలు రేడియోలోనో, టీవీలోనో, సినిమాల్లోనో, లేక ఇంట్లో మా సిస్టమ్‌లోనో వింటూ ఉంటే ప్రపంచాన్ని అలాగే మర్చిపోవాలన్నంత మైమరపు… తదనంతర జీవితంలో ఎన్ని డక్కీమొక్కీలు తిన్నా, సొంతఊరు వదిలి చదువు కోసం, ఆశయం కోసం, జీవిక కోసం ఎన్నెన్ని ప్రాంతాలు తిరిగినా ఆ తెలుగు పద్య గాన శ్రవణా సౌరభం నానుంచి దూరం కాలేదు.

“కనియెన్ రుక్మిణి, చంద్రమండల ముఖున్, కంఠీరవేంద్రావలగ్ను…” అంటూ శ్రీకృష్ణపాండవీయం సినిమాలో తొలిసారి శ్రీకృష్ణుడిని రుక్మిణి సందర్శించిన తీరును ఘంటసాల పాడగా వింటూంటే… ప్రాణం అలాగే వదిలేసినా చాలు అనిపించేంత ఆత్మానందం (?) సంగీతం, మృదంగ ధ్వని, లయ, గానం కలగలసిన ఆ మహిమాన్విత అనుభూతిని ఈ నాటికీ మర్చిపోలేను.

ఇలాంటి ఎన్ని పద్యాలు ఎన్ని పర్యాయాలు భట్టీ కొట్టి మరీ మా బాల్యంలో మేం నడుస్తున్నప్పుడు, పనిలో ఉన్నప్పుడు, కొండలు గుట్టలు ఎక్కుతున్నప్పుడు మేం పాడుకునేవారిమో… దీనికంతటికీ మా తెలుగు టీచర్ పెట్టిన పద్య బిక్షే మూలం.

తెలుగు పద్యాన్ని తలుచుకున్నప్పుడల్లా ఘంటసాల గారి గానం ఒకవైపు, మా తెలుగు టీచర్ గారి గంభీర శ్రవణం ఒకవైపు ఈ నాటికీ నేను కలలో కూడా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు. తెలుగు పద్యగానామృతాన్ని మాకు పంచిపెట్టడంతో పాటు ఎన్ని వెలలేని జీవిత సత్యాలను ఆయన ఆ మూడేళ్ల మా స్కూలు జీవితంలో మాకు నూరిపోశారో….

(కానీ ఆయనలో ఒకే ఒక్క అంశం నాకు నచ్చలేదు. కవిత్వం అంటే ప్రబంధ సాహిత్యమేనని ఢంకా భజాయించే ఆయన వచన కవిత్వం అన్నా, ముఖ్యంగా శ్రీశ్రీ కవిత్వం అన్నా ఒళ్లు మంట ఆయనకు. ఎందుకంటే చందస్సుల సర్ప పరిష్వంగాన్ని చీల్చి చండాడుతానని శ్రీశ్రీ మహాప్రస్థానంలో కవితా ఓ కవితాలో తేల్చి చెప్పాడు మరి. పద్యమన్నా, చందస్సు అంటే పడి చచ్చే ఆయనకు వాటిపై శ్రీశ్రీ కొట్టిన దెబ్బ మండించిందనుకుంటాను.
పద్యం పట్ల ఆయన అభిమానం శ్రీశ్రీ కవిత్వాన్నే తోసి పారవేసింది -నెగేట్-. క్లాసులో ఆయన శ్రీశ్రీని తిడుతుంటే మేం నవ్వుకునే వాళ్లం. ఎందుకంటే అప్పటికే అంత నిశితంగా కాకపోయినా పత్రికలలో, రేడియో ప్రసంగాలలో శ్రీశ్రీ గురించి అంత చిన్న వయసులోనే ఎంతో కొంత తెలుసుకుని ఉన్నాం. ఆ తర్వాత ఇంటర్ దాటి డిగ్రీ, తర్వాత యూనివర్సిటీ చదువులకు వచ్చాక, ప్రగతిశీల సాహిత్యం అందుబాటులోకి వచ్చాక జీవిత దృక్పథమే మారిపోయిందనుకోండి.)

ఈ రోజు ఆయన ఉన్నారో లేరో.. కానీ, కడప జిల్లా సుండుపల్లి మండలంలోని మా గుట్టకిందరాచపల్లె (జి.కె.రాచపల్లి) హైస్కూలు, 8, 9, 10 తరగతుల్లో మేం కూర్చున్న ఆ తెలుగు తరగతి గదులు, ఆ గదుల్లో కుర్చీలో మూర్తీభవించిన గానగంధర్వుడిలా మా సహదేవరెడ్డి సార్… ఇంకా ఇప్పటికీ గొంతెత్తి పాడుతున్నట్లు, జీవితంలో మేం కోల్పోతూ వస్తున్న ఎన్నెన్నో మధురానుభవాలను తట్టి లేపుతున్నట్లు…. పద్యం అనే తెలుగు జాతి సంపద సాక్షిగా మమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నట్లు…

మర్చిపోలేను… తెలుగు పద్యం అంటే రాజులు, రాణుల అంగాగ వర్ణనలకు ప్రాధాన్యమిచ్చిన ఫ్యూడల్ సాహిత్య ప్రతీక అంటూ గడచిన శతాబ్ద కాలంగా తెలుగు సాహితీలోకంలో ఎన్ని వాదోపవాదాలు పదే పదే కొనసాగుతూ వస్తున్నప్పటికీ… మర్చిపోలేను… పద్యరూపంలోని ఆ లయాన్విత సంగీత ఝరిని… ఆ విశ్వవీణానాదాన్ని…. పద్యగానంతో, శ్రవణంతో మా బాల్యజీవితాన్ని వెలిగించిన, మా సహదేవరెడ్డి మాస్టారు చిరస్మృతులను మర్చిపోలేను.
రాజు
blaagu.com/chandamamalu

January 3rd, 2010 న చందమామ బ్లాగులో ప్రచురించబడింది.

Edit | Comments (18)

18 Responses to “మా తెలుగు మాస్టారూ…మా తెలుగు పద్యమూ…”
1. Bhaskara Rami Reddy on January 3, 2010 5:53 PM Edit This
80 వ దశకంలో నా హైస్కూల్ చదువు సాగుతున్నప్పుడు కూడా ఇలాంటి తెలుగు టీచర్లను చూసాను రాజు గారు. సుబ్బారెడ్డి అని టీచరు వుండేవారు. ఒక్కొక్కసారి చెట్టుకింద కూర్చోపెట్టి తెలుగు పాఠం చెప్తుంటే, ఆ రాగయుక్త గానానికి మిగిలిన క్లాసుల విద్యార్థులందరూ నిశ్శబ్దం గా ఓచెవు ఇటు పడేసేవారు.

2. kalpana on January 3, 2010 8:38 PM Edit This
రాజు గారు,
మీరెంత అదృష్టవంతులు.
“ రాగయుక్తంగా ప్రబంధపద్యాలు పాడి వినిపిస్తుంటే మంత్రముగ్ధులం అయ్యేవాళ్లం.”
ఇంత మంచి తెలుగు మాస్టర్ దొరికినందుకు. ఇప్పటి తెలుగు పంతుళ్ళ గురించి, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెస్సర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
అబ్బా మళ్ళీ ఏమీ పద్యాలు గుర్తు చేశారండీ.. అటజని గాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్జరీ… చదువుకున్నా కూడా మళ్ళీ వొళ్ళు పులకరిస్తుంది.

“ తెలుగు పద్యం అంటే రాజులు, రాణుల అంగాగ వర్ణనలకు ప్రాధాన్యమిచ్చిన ఫ్యూడల్ సాహిత్య ప్రతీక అంటూ గడచిన శతాబ్ద కాలంగా తెలుగు సాహితీలోకంలో ఎన్ని వాదోపవాదాలు పదే పదే కొనసాగుతూ వస్తున్నప్పటికీ… “
భలే వారే. అవన్నీ పట్టించుకోకుండా హాయిగా తెలుగు పద్యాన్ని, తెలుగు పాట ని ఆనందించండి.
మీతో పాటు మమ్మల్ని కూడా ఇవాళ ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అందుకు మీకు కృతజ్ఞతలు.

3. రవి on January 3, 2010 11:17 PM Edit This
భలే ఉన్నాయి మీ జ్ఞాపకాలు. అదృష్టవంతులు. నేను చదువుకునేప్పుడు, నాకూ ఓ తెలుగు పంతులమ్మ ఉండేది. ఇప్పుడు ఏ లేశమాత్రం తెలుగు మీద అభిమానం ఉన్నా, ఆ తల్లి అప్పుడు నాకు పెట్టిన భిక్షే.
అన్నట్టు ఆరవ తరగతి నుంచీ, పదవతరగతి వరకు, అన్ని పరీక్షలలోనూ (చివరికి యూనిట్ టెస్ట్‌తో సహా) నాకే ఎక్కువ మార్కులు. అది అప్పట్లో నాకో ప్రిస్టేజి ఇష్యూ గా భావించేవాణ్ణి.

4. వేణు on January 3, 2010 11:26 PM Edit This
రాజు గారూ, మీ తెలుగు మాస్టారి ‘పద్యగాన శ్రవణ సౌరభాన్ని’గురించి ఎంత బాగా గుర్తు చేసుకున్నారండీ ! మీ ‘మహిమాన్విత అనుభూతి’, స్మృతులూ ‘చందమామ’ కథలంత మనోహరంగా అనిపిస్తున్నాయి. అన్నట్టు- మీ చిన్నప్పటి ఫొటో భలేవుంది!

5. రాజు on January 3, 2010 11:57 PM Edit This
భాస్కర రామిరెడ్డి గారు,
మీరు కూడా ఆ స్వర్ణయుగంలోనే చదివారన్నమాట. మీ అనుభవం మాకు కూడా ఉంది. ఆ మూడేళ్ల కాలంలో సహదేవరెడ్డి సార్ ఏ క్లాసులో, ఏ తరగతి వారికి పాఠం చెబుతున్నాసరే పక్క తరగతుల్లోనే ఉన్న మేం ఆయన పాడుతున్న పద్యం వినడానికి చెవులు రిక్కించి కూర్చునే వారం.

మా క్లాసులో ఇతర సబ్జెక్టుల టీచర్లు పాఠం చెబుతుంటే వారి పాఠాన్ని వింటున్నట్లుగా ఎంత చక్కగా నటించేవారమో. కానీ మా కళ్లు మాత్రమే క్లాసులో టీచర్ వైపు ఉండేవి తప్పితే చెవులు మాత్రం గాల్లో మంద్రమంద్రంగా తేలియాడుతూ వచ్చే ఆ పద్య శ్రవణంకోసం పడి చచ్చేవనుకోండి. ఓ రకంగా చూస్తే దీన్ని పల్లెపట్టు స్కూళ్లలో లెక్కలు, సైన్స్, ఇంగ్లీషు, సాంఘికశాస్త్రం ఇలా సకల శాస్త్రాలమీద తెలుగు పద్యం సాధించిన విజయంగా చెప్పవచ్చు.
మీ అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

కల్పన గారూ,
మీకూ తెలుగు పద్యం మీద మమకారం ఉంటుందని ఊహించలేదు. ఇప్పుడు పాఠశాలల్లో కూడా తెలుగు పద్యాన్ని పాడటం నిషేధించారేమో నాకు తెలియదు. పద్యాన్ని పాడటం కాకుండా చదవాలని ఎప్పుడైతే తీర్మానం చేశారో అప్పుడే తెలుగు క్లాసుపై అభిరుచి, ఆసక్తి పిల్లల్లో నశించడం మొదలైందనుకుంటాను.

నేను తిరుపతిలో 20 ఏళ్లక్రితం ఓ రెసిడెన్షియల్ కాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసినప్పుడు క్లాసు రూములో ప్రతి రోజూ పాఠం మొదలు పెట్టేముందు ఓ తెలుగు పద్యమో, లేదా వచన కవిత్వమో, గేయమో తప్పకుండా చదివి.. కాదు కాదు.. పాడి వినిపించి మరీ పాఠం మొదలు పెట్టేవాడిని. నిద్రపోయే ఆ కొద్దిగంటలు తప్ప తక్కిన విద్యాజీవితమంతా భట్టీ చదువుల భారం మోస్తూ ఉంటున్న ఆ పిల్లలు మొదట్లో ఆ అయిదు నిమిషాలు నేను చెప్పే ఆ పద్యం, గేయం, పాట కోసం సమస్త దేహాన్ని చెవులుగా చేసుకుని రిక్కించి మరీ వినేవారు.

రోజులు జరగగా జరగగా తెలుగు గద్యభాగంలోని పాఠాలను వాటిలో ఉత్కంఠ భరితంగా సాగే పద, వాక్యబంధాలను కూడా ఉద్వేగంగా చదివి వినిపించడం మొదలెట్టాను. పిల్లలు దానికీ పడిపోయారు. అప్పుడు తెలిసింది నాకు మన తరం పిల్లలు ఏం కోల్పోతున్నారో, ఏం కోరుకుంటున్నారో..

మీరన్నట్లు తెలుగు పద్యసాహిత్యంలోని ఆణిముత్యాల్లో మేలిముత్యం అటజని కాంచి.. పద్యం. ఆ అభంగ, తరంగ, మృదంగ అంటూ సాగే ఆ పద్యభాగం నిజంగా మా అందరి హృదయాల్లో మృదంగాన్ని మోగించేది. సంగీత సాహిత్యాల మేలు కలయికకు నిరసనగా నిలిచిన అరుదైన పద్యాల్లో ఇదీ ఒకటి. ఇక వసుచరిత్రలోని పద్యాలు చెప్పవలసిన పనిలేదు. అందులోని ప్రతిపద్యమూ సంగీతభరితమే.

చెన్నయ్‌లో ప్రస్తుతం పచ్చయప్పాస్ కాలేజీలో 33వ బుక్ ఫెయిర్ జరుగుతోంది. ఎమెస్కో వారు ప్రచురించిన అన్ని ప్రబంధాలను మళ్లీ ఓసారి కొనుక్కోవాలనిపిస్తోంది.

పద్యం పట్ల మీ అనురక్తికి మనఃపూర్వక అభినందనలు


6. రాజు on January 4, 2010 12:14 AM Edit This
రవిగారూ,
“ఆతల్లి అప్పుడు నాకు పెట్టిన భిక్షే..” మీ పంతులమ్మ పట్ల మీరు ప్రకటించిన భావం కృతజ్ఞతకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడుతోంది. మార్కుల విషయంలో మీ అనుభవమే నాది కూడా. 500 మంది పిల్లలు చదివే మాస్కూల్లో తెలుగులో తొలి మార్కులు నాకు, మా ఊరివాడైన శ్యామసుందర్‌కి మాత్రమే వచ్చేవి. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో కూడా తనకు తెలుగులో నూటికి 79 మార్కులయితే నాకు 78 మార్కులు.

‘ఆ ఒక్క మార్కుకు కాస్త ముక్కిఉంటే ఏం పోయేదిరా నీకు’ అంటూ సహదేవరెడ్డి సార్ నన్ను అభిమానంగానే మందలించారనుకోండి. ఎందుకంటే నేను ఆయన స్టూడెంట్‌ని కాగా మా శ్యామ్ మరో తెలుగు టీచర్ స్టూడెంట్. చేతివ్రాత బాగా లేనందున నాది ఇక్కడ వెనుకపట్టే అయ్యేది. నిజంగా అదో బంగారు కాలం. మళ్లీ రాదు కూడా.. నిజంగా తెలుగును ఓ ప్రిస్టేజి ఇష్యూగానే భావించి పోటీ పడేవాళ్లం.

వేణుగారూ,
“మహిమాన్విత అనుభూతి, పద్యగాన శ్రవణ సౌరభం..” ఈ పదాలే ఏదో మ(హ)త్తును కలిగిస్తున్నాయి. మా చందమామ బాల్యంలో పద్యాలు, పాటలు కూడా భాగమే మరి. బాల్య జీవితంలో మాకు ఏవి లేకున్నా సరే మాకు చందమామ పత్రిక ఉండేది. తర్వాత ఇంట్లో రేడియో ఉండేది. కడప రేడియో స్టేషన్ నుంచి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మలయమారుతంలా సాగివచ్చే పద్యాలు, పాటలు ఉండేవి. జీవితం ధన్యం కావడానికి ఇంకేం కావాలి? నిజంగానే ఏవాదాలు, దృక్పధాలు, సిద్ధాంతాలు, ఉద్యమాలు లేని బాల్యం మాది. అప్పట్లో మమ్మల్ని ఆప్యాయంగా, ఆర్తిగా పలకరించినవి చందమామ, రేడియో పాటలు, పద్యాలు మాత్రమే.
ఎలా మరువగలం…!
ధన్యవాదాలు

7. రవి on January 4, 2010 1:26 AM Edit This
రాజు గారు, మీది 70 వ దశకం అయితే, నాది 80 వ దశకం ద్వితీయ అర్ధం. మీ కాలంలో 78 మార్కులంటే ఊహించగలను. నా వరకూ వచ్చేసరికి 89 అయాయి. ఇప్పుడు తొంభై తొమ్ముదులు, నూర్లు సర్వసాధారణమయాయి అనుకుంటాను. అవన్నీ పక్కన పెడితే, తెలుగు మీద అభిమానం మాత్రం అంత బలంగా ఉండేది, వెనుకటి రోజుల్లో.

8. chandamama on January 4, 2010 1:45 AM Edit This
రవి గారూ, మీరన్నది నిజం. మా రోజుల్లో తెలుగులో 78 మార్కులంటే మా స్కూలు టీచర్లే అదిరిపోయేటంత ఎక్కువ మార్కులు మరి. సంధి సమాసాల్లో ఒక చిన్న అక్షర దోషం కనబడినా మార్కులపై కోత విధించిన రోజులవి. తెలుగు సబ్జెక్టు తీసుకోవడానికి పిల్లలు తటపటాయించే కాలం రావడంతో భాషా దోషాలను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదనుకుంటున్నా. మీకు 89 మార్కులంటే చాలా గొప్పే మరి.. తర్వాత యూనివర్శిటీలో కూడా తెలుగులో66 శాతం సాధించడమే గొప్పయిపోయింది మాకు.

9. sreedhar on January 4, 2010 9:36 AM Edit This
రాజు గారు,
నాకు కూడా తెలుగు పద్యాలు చదవడం అన్నా లేక రాయడం అన్నా చాలా ఇష్టం!!

మీది ఏ ఊరు? ఎందుకు అడుగుతున్నాను అంటే మీ ఫోటో పై రాయచోటి డిగ్రీ కళాశాల అని ఉంది. మాది కూడా రాయచోటి కి దగ్గర్లోని ఒక పల్లెటూరు.
శ్రీధర్.
http://telugupadyaalu.blogspot.com/

10. kalpana on January 4, 2010 10:00 AM Edit This
రాజు గారు,
మీ సమాధానం ఇంకా ముచ్చట గా వుంది. మరి మా కోసం కూడా (మేము కూడా మీ స్కూల్ పిల్లలు అనుకోండి) ఆ పద్యాలు చదివి రికార్డ్ చేసి పెట్టండి.
“ మన తరం పిల్లలు ఏం కోల్పోతున్నారో, ఏం కోరుకుంటున్నారో..”
పిల్లలే కాదు, పెద్దవాళ్లం కూడా అన్నింటిని కోల్పోతున్నాము. మరి మీరు కూడా మంచి తెలుగు మాస్టర్ కదా.మాకోసం కొన్ని తెలుగు పద్యాలు……ప్లీజ్,
మీరు చెన్నై లో వుంటారా? మా తమ్ముడు అక్కడే వుంటాడు. అసలు ఒక్కో ప్రబంధం మీద ఒక్కో పోస్ట్ రాయవచ్చు మీరు. మేము ఎదుచూస్తూ వుంటాము మీ అనుభవాల కోసం.

11. కామేశ్వర రావు on January 4, 2010 12:14 PM Edit This
రాజుగారు,
తెలుగు పద్యాన్ని గురించి ఎంత మంచి రుచికరమైన మాటల్ని చెప్పేరండి! అంతమంచి మాస్టారు దొరికిన మీరు ఎంతో అదృష్టవంతులు. మళ్ళీ మీరు మాస్టారై మీ విద్యార్థులకి ఆ అమృతాన్ని అందించడం గొప్ప విషయం. కల్పనగారు అన్నట్లు ఆ మాధుర్యాన్ని మాక్కూడా కొంచెం (వినిపించి)పంచిపెట్టరూ.
తెలుగు పద్యాలు పాఠశాలల్లో పాడకూడని నిషేధించారా? ఇంక కొన్ని రోజుల్లో ఇళ్ళల్లో అమ్మలు జోలపాటలు కూడా పాడకూడదని నిషేధిస్తారో ఏమో!

12. రాజు on January 4, 2010 12:19 PM Edit This
శ్రీధర్ గారూ, నా మెయిల్‌లోనే మా ఊరు, మాస్కూలు వివరాలు ఇచ్చినట్లున్నాను. మళ్లీ చూడండి. కడప జిల్లా, రాయచోటి తాలూకా, సుండుపల్లి మండలం, మడితాడు గ్రామం, చండ్రాజుగారి పల్లె. మా స్కూలు… గుట్టకింద రాచపల్లి హైస్కూలు. 35 సంవత్సరాల క్రితం మమ్మల్ని కాస్తయినా మనుషులుగా తీర్చి దిద్దిన స్కూలు. ఆ స్కూలులో మేం నాటి, పోటీలు పడి పెంచిన చెట్లు, చదువు, కాసింత సంస్కారం కూడా నేర్పిన గురువులు. అది ఓ పాత బంగారు లోకం. రాయచోటి దగ్గర ఊరు అంటే మీరు మాకు చాలా దగ్గరే మరి.

మీ బ్లాగు చూశాను. ఓ వేమన శతకం, ఓ సుమతి శతకం… ఇవి చాలు మూడు నాలుగు శతాబ్దాల క్రితం తెలుగు ప్రజల అనుభవసారాన్ని చాటి చెప్పడానికి. ఇవి మా తెలుగు పద్యాలు. మా జీవన వేదాలు అని ప్రపంచ సాహిత్యం ముందర సవాలు చేసి మరీ నిలబడడానికి ఈ రెండు శతకాలు చాలు.

తమ కాలపు సమాజాన్ని, దాని మంచిచెడ్డలను, నీచ, నికృష్ట మానవ స్వభావాలను నిర్భయంగా, నగ్నంగా, కొండొకచో మహా మూర్ఖంగా కూడా చాటి చెప్పిన పద్యశతకాలివి. వేశ్యలను సాధారణ మానవ స్వభావంతో బూతులతో తిట్టడం కూడా ఈ పద్యాల్లో ఉంటుంది. ఇలాంటి వాటిని మనం విచక్షణతో పరిహరించి, తీసివేస్తే బాగుంటుంది.

కాపీ రైట్ సమస్యలు లేకుంటే మీ బ్లాగును మరిన్ని పద్యాలతో, మీ స్వంత వ్యాఖ్యానంతో ఇంకా సుసంపన్నంగా మలచండి. పూర్తిగా పద్యాలకే అంకితం చే్స్తూ మంచి బ్లాగు నిర్వహిస్తున్నందుకు అభినందనలు. మీకు తీరిక ఉండి, సమయం సహకరిస్తే వచన కవిత్వంలోని గొప్ప గేయకవితలను కూడా ప్రత్యేక కేటగిరీలో ఉంచి ప్రచురించండి.

మన తెలుగు పద్యం ఎంతటి శక్తివంతమైందో, ఒక ఊరిలో నివసించాలంటే ఆ ఊరు ఏ లక్షణాలతో ఉండాలో చెప్పే ఈ పద్యం ఒక్కటి చాలు చూడండి. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరు, ద్విజుడు వీళ్లంతా ఉన్న ఊరిలోనే ఉండమని సుమతీ కారుడు అప్పట్లోనే చెప్పాడు. నాటి గ్రామీణ సమాజ అవసరాలను మహత్తరంగా చాటి చెప్పిన ఈ పద్యసారాన్ని మన జీవితాలకు మన ఊర్లకు ఇప్పుడు అన్వయించుకుందామా?

మన ఊర్లలో ఇప్పుడు వైద్యుడు లేడు. అంతా పట్నాలకు పారిపోయారు. వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడిన ద్విజుడు లేడు. విదేశీ చదువులకోసం ప్రవాసం పోయాడు లేదా పౌరోహిత్యం కోసం కాదు కాదు.. పొట్టకూటికోసం పట్టణాలకు పెద్ద పెద్ద గుడులకు వలసపోయారు. ఎప్పుడూ ఎడతెగకుండా పారే ఏరు. మన కలలో కూడా ఇలాంటిది ఇప్పుడు మన పల్లెల్లో కనపడదు. సహాయపడే అప్పులోడు కాదు కదా.. గ్రామీణ జీవితాన్ని పీల్చి వేస్తున్న వడ్డీ వ్యాపారస్తులు మాత్రమే ఉన్నారు. మనం వీటిని ఊర్లు అనే అందామా? ఇక్కడే సుమతీ శతకకారుడి గొప్పతనం మనకు అర్థమవుతుంది.

మీ బ్లాగులో తెలుగు తల్లి చిత్రంతో మా తెలుగుతల్లికీ మల్లెపూదండ గీతం సైడ్‌లో ఉంచారు. కొన్నాళ్ల తర్వాత దీన్ని ఈ రూపంలో పాడుకోలేమో మరి. తెలుగు తల్లి మాటేమిటో కాని ఆమె పుత్రులు నిట్టనిలువుగా చీలిపోయారు. ఇక కలిసి బతకడం కల్లే అనిపిస్తోంది. మళ్లీ అక్కడా ఇక్కడా విద్వేషాలు, విధ్వంసాలు మొదలయ్యాయి.

మన పునాదిని అర్థం చేసుకోవడానికయినా మీరు మన ప్రాచీన గతాన్ని స్పురింపజేసే ఇలాంటి పద్యాలను తప్పక ప్రచురిస్తూ పోండి. మీ బ్లాగులో ప్రభాకర మందార గారన్నట్లు “సముద్రమంత భావాన్ని నాలుగు చిన్న చిన్న వాక్యాలలో పొందుపర్చడం మన తెలుగు పద్యానికే చెల్లింది.”
మీరు ఇలాగే ముందుకు పోండి..

ఈమాట.కామ్ వంటి కొన్ని తెలుగు వెబ్ సైట్లలో ప్రాచీన పద్యాల గురించిన చక్కటి వ్యాఖ్యానాలతో వ్యాసాలు ప్రచురిస్తున్నారు.
చూస్తున్నారనుకుంటాను.
అభినందనలతో
రాజు

13. chandamama on January 4, 2010 1:49 PM Edit This
కామేశ్వరరావు గారూ,
మీ ఆప్తవాక్యానికి ధన్యవాదాలు
పద్యం వినిపించి పంచి పెట్టడం మాటేమో గానీ, పల్లెలో ఉన్నప్పుడు చెరువు వద్దకు పోతున్నప్పుడో, గుట్టలెక్కుతున్నప్పుడో, పశువులను మేపుతున్నప్పుడో కాసింత సమయం దొరికిందంటే చాలు ఏదో ఒక పద్యమో, పాటో, శ్రీశ్రీ గేయమో ఆరున్నొక్కరాగంతో గొంతెత్తి పాడుకునేవాళ్లం. మైళ్ల కొద్దీ దూరం పొలాల్లోకి, పక్క ఊర్లకు నడిచిపోవలసి వచ్చినప్పుడు కూడా మాకు పద్యాలు, పాటలే కాసింత ఊరట నిచ్చేవి.

ఇక చిన్నప్పుడు రాత్రిపూట ఏరు దాటుతున్నప్పుడు, ఊరికి తిరిగి వస్తున్నప్పుడు చిమ్మచీకటిలో, నిశ్శబ్ద వాతావరణంలో తన్నుకుని వచ్చే భయాన్ని అధిగమించాలంటే మాకు పద్యం లేదా పాటే శరణ్యమయ్యేది. సిగ్గు, సందేహం, సంకోచం వంటివి ఏవీ లేకుండా నోరారా పాడుకోవడానికి పల్లె ఎంత అనుకూల ప్రాంతమో.. ఈ వాతావరణానికి దూరమై 20 ఏళ్లయింది.

ఇప్పుడు అంతా పట్నవాసపు జీవితమే.. ఉన్న ఇరుకిళ్లలోంచి శబ్దం బయటకు పోతే కష్టం. ఎవరేమనుకుంటారో అనే మొహమాటం. అంతకు మంచి మనం రాగం తీస్తుంటే బయటినుంచి విన్నవారు నవ్వుతారేమో అనే సంకోచం. అందుకే మనసులో పాడుకోవడం. గతాన్ని గుర్తు తెచ్చుకోవడం. ఇలా అరుదుగా బ్లాగుల్లో బయటపడిపోవడం. అంతకుమించి ఇంకేవీ లేవండీ మనవద్ద. కానీ ఈ పనిఒత్తిళ్లూ, జీవిక కోసం చేయవలసిన అనివార్యతలూ లేని జీవితం ఒకటి ప్రాప్తించాక మళ్లీ ఆ పాత జీవితానికి, ఆపాత గాన మాధుర్యానికి తరలి వెళ్లలేమా అనే ఆశ మాత్రం చావడం లేదు.

అయినా జోలపాటలు ఇంకా ఎక్కడున్నాయిప్పుడు? వాటిని పాడుకునే కాలమేనా ఇది. టింకిల్ టింకిల్ టింకిలే పాటలే గదా ఇప్పుడు ఎక్కడ చూసినా
తెలుగు పద్యంపై మీ బ్లాగు చాలా బాగుంది. చూసిన వెంటనే నా చందమామ బ్లాగులో తెలుగుపద్యం కేటగిరీ కింద చేర్చేసుకున్నాను. మనం ఇలాగే కలుసుకుంటూ ఉందాం లెండి.
రాజు
blaagu.com/chandamamalu
telugu.chandamama.com

14. chandamama on January 4, 2010 2:39 PM Edit This

కల్పన గారూ,
మీ తూర్పు పడమర బ్లాగు -http://kalpanarentala.wordpress.com/- లో మీ వివరాలు చూశాను, రెంటాల గోపాల కృష్ణ గారి అమ్మాయి కదా మీరు. ఆ అభిరుచి, ఆ సాహిత్య వాతావరణం ఎక్కడికి పోతుంది మరి. మీ సోదరుడు రెంటాల జయదేవ్ గారే కదూ.
మేం చెన్నయ్‌లో తేజస్ -తెలుగు జర్నలిస్టుల సంఘ సభ్యులుగా అరుదుగా కలుసుకుంటుంటాం. చెన్నయ్‌లో పలు సమావేశాల్లో ఆయన ప్రసంగాలు విన్నాను. అంతే తప్ప పెద్దగా పరిచయం లేదు. ఒకరినొకరు గుర్తుపడతాం తప్పితే అంతకుమించి సాహిత్య సన్నిహిత సంబంధం మా మధ్య ఏర్పడలేదు. ఎందుకో కారణం తెలీదు మరి. జర్నలిస్టు ప్రపంచంలో తొలినుంచి నేను భాగం కాకపోవడం చేత బయటి సర్కిల్‌తో పెద్ద పరిచయాలు లేవు. ఈ బ్లాగు ద్వారానే పదిమంది సాహితీ మిత్రులతో ఇటీవల పరోక్ష పరిచయాలు అవుతున్నాయి.

మంచి సమావేశం, లేదా సాంస్కృతిక కార్యక్రమం చెన్నయ్‌లో జరిగితే, తెలిసి ప్రవేశం దొరికితే పోయి చల్లగా ఆస్వాదించి రావడం మాత్రమే తెలుసు నాకు. ఇండియా టుడేలో పనిచేస్తున్నారు కదా.. పాపం.. విఎకే రంగారావు గారు తటస్థపడితే చాలు సభల్లో ఆయనకు మీ సోదరుడికి తండ్లాటే అనుకోండి. హాయిగా నవ్వుకుంటుంటాం అలాంటి సందర్భాల్లో.. ఇదీ మా పరిచయం. మీ ద్వారా అయినా తనతో పరిచయం పెరుగుతుందేమో చూద్దాం.

మంచి తెలుగు మాస్టారును అవునో కానో తెలీదు కానీ. రకరగాల సబ్జెక్టులతో, భట్టీయంతో బుర్రవేడెక్కిపోయే పిల్లలకు కాస్సేపు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిద్దాం అనే ఆలోచనతోటే వారితో పద్యాలతో, పాటలతో, గేయాలతో మమేకమయ్యేవాడిని. అంతే ఇరవయ్యేళ్ల తర్వాత కూడా వారు ఎక్కడున్నా సరే నన్ను మర్చిపోలేదు. ఓసారి ప్రార్థనా సమయంలో గురజాడ వారి దేశమును ప్రేమించుమన్నా గేయం రాగయుక్తంగా విషాద శైలిలో పాడి వినిపిస్తే పక్కన ఉంటున్న మా కాలేజీ సంస్థాపకులలో ఒకరైన సాయిగారు -తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో ఎకనమిక్స్ లెక్చరర్- తన జీవితంలో ఓ గొప్పరోజిది.. ఓ గొప్ప గేయాన్ని విన్నరోజిది అంటూ చేతులు పట్టుకున్నారు. మర్చిపోలేని క్షణాలవి.

ఇది 20 ఏళ్ల క్రితం నాటి మాట లెండి. తర్వాత్తర్వాత అనూహ్యంగా ఉద్యమాల్లోకి, అనంతరం కంప్యూటర్ ప్రపంచంలోకి, సాఫ్ట్‌వేర్ లోకలైజేషన్ లోకి, ఇటీవలే చందమామ పనిలోకి వచ్చిన తర్వాత ఇక పద్యశ్రవణం, పద్యగానం ఎక్కడ కుదురుతాయి. అప్పుడప్పుడూ ఇలా మననం చేసుకోవడం తప్పితే..

ఇక పద్యాల రికార్డు అంటారా.. నా గొంతు నేను వినడం కోసమైనా ఏదో ఓ సందర్భంలో రికార్డు చేస్తే బాగుంటుందేమోనని అనిపిస్తూ ఉంటుంది. అందుకు సందర్భం వస్తుందేమో.. చూద్దాం.

ప్రాచీన సాహిత్యాన్ని, పద్య సాహిత్య వైభవాన్ని చాలా మందే ఇప్పుడు వెబ్‌సైట్లలో, బ్లాగుల్లో పరిచయం చే్స్తున్నట్లున్నారు కదూ.. మళ్లీ మనమెందుకులెండి.. అంత పాండిత్యం కూడా లేని వాళ్లం. అప్పుడప్పుడూ క్లాసురూమ్ అనుభవాలతో ఇలా బ్లాగుల్లో కలుసుకుంటే చాలనుకుంటాను.
మీ ఆప్తవాక్యాలకు కృతజ్ఞతలు.
రాజు
ఇమెయిల్: krajasekhara@gmail.com
rajasekhara.raju@chandamama.com

NB: మీ బ్లాగులో ఇటీవలే పరిచయం చేసిన ‘మధుపం’ -పూడూరి రాజిరెడ్డి-, పుస్తక పరిచయం చాలా బాగా వచ్చింది. అలాగే ‘మనసుని మెలిపెట్టే జ్ఞాపకాల రచయిత్రి అజర్ నఫిసీ!’ పేరుతో మీరు పరిచయం చేసిన ఇరాన్ రచయిత్రి వివరాలు అద్భుతంగా ఉన్నాయి. -Things I Have Been Silent About- చెన్నయ్‌లో ఈ పుస్తకం దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. మీ చక్కటి శైలికి అబినందనలు

15. SIVARAMAPRASAD KAPPAGANTU on January 5, 2010 7:30 PM Edit This
రాజుగారూ,
అనిటికన్న మీ ఫొటో చాలా బాగున్నది. అప్పటి అమాయకత్వపు చూపులలో ఉన్న అందం ఎప్పటికి మరువలేము కదా. మంచి జ్ఞాపకాల దొంతరను కదలించారు రాజుగారూ. మేము చదువుక్నే రోజులలో బిల్వహణ శాస్త్రి గారని ఒక హింది మాష్టారూండేవారు. ఆయన పాఠం చెప్తుంటే అటు ఇటు గదులలో కూడ మారుమోగేది. హిందీ పాఠాలను చక్కగా వివరించేవారు. తెలుగు పాఠాలకు వస్తే కాలేజీలో జంధ్యాల మహతీ శంకర్ గారు (జంధ్యాల పాపయ్య శాస్త్రిగారికి దగ్గర బంఢువు) తన గాన కౌశలంతో మాకు తెలుగు సాహిత్యం మీదకు మనసులను మళ్ళించారు. ఆయన పద్యం పాడుతుంటే అలా పద్యాలను చదవలేనందుకు బాధ కలిగేది. అవొక అద్భుతమైన రోజులు(1973-76) డిగ్రీ రెండో సంవత్సరం నుంచి తెలుగు ఇంగ్లీషులు లేవు.
మీరు ఈసారి మీ ఊరు వెళ్ళినప్పుడు సహదేవ రెడ్డిగారిని కలసి నా నమస్కారాలు తెలియ చేయండి. ఆయన కు ఓపిక ఉంటే మీకు వీలైతే ఆయన పద్య గానన్ని రికార్డు చేసి అందరికి అందించండి. ఇదొక చిన్న కోరికలాగ కనిపిస్తుంది కాని, ఎంత కష్టమో నాకు తెలుసు. ఒక టి కుదిరితే మరొకటి జ్కుదరదు.
మంచి వ్యాసం, అద్భుతమైన అనుభూతులు అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు రాజుగారూ.

16. kalpana on January 5, 2010 7:49 PM Edit This
రాజు గారు,
అయ్యో, మా నాన్న గారి పాండిత్యం అసలు నాకు పిసరంతా కూడా రాలేదనుకుంటాను. ఇంకో మాట కూడా చెప్తాను సరదాకి. పండిత పుత్ర పరమ శుంఠ. మా నాన్నగారు నిస్సందేహం గా పండితులు. కాబట్టి నేను శుంఠనన్నమాట.
ఇక మా తమ్ముడు కి, మీ కామెంట్ పంపించాను. తప్పక మీతో మాట్లాడతాడు.
నా గురించి ఇంత వోపికగా చదివి నాలుగు మంచిమాటలు రాసినందుకు చాలా సంతోషంగా వుంది.

17. chandamama on January 6, 2010 11:43 PM Edit This

‘మా తెలుగు మాస్టారూ, మా తెలుగు పద్యమూ’ అనే నా తాజా టపా చూసిన వలబోజు జ్యోతి గారు (http://jyothivalaboju.blogspot.com) వ్యక్తిగతంగా పంపిన మెయిల్‌లో కొన్ని మంచి విషయాలు తెలిపారు. బ్లాగులలో వ్యాఖ్య పెట్టకూడదు అని నిర్ణయించుకున్న ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తూనే, ఆ మెయిల్‌లో పొందుపర్చిన విషయాలను సందర్భోచితంగా ఉంటుందని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఆమె మెయిల్ ప్రకారం ఆమెది కూడా బంగారు బాల్యమే. అమ్మ తనచేత చదివించిన చందమామ పత్రికే తెలుగు అంటే ఇష్టాన్ని కలిగించిందట. మనలో చాలామందికి లాగే ఆమె కూడా స్కూలు నుంచి డిగ్రీవరకు తెలుగులోనే చదివారట. బ్లాగులలో కొచ్చాక తన తెలుగును మరింత మెరుగులు దిద్దుకుంటున్నానని ఆమె చెప్పారు.

మా తెలుగు మేష్టారును పోలిన వారు మన బ్లాగ్లోకంలో కూడా ఉన్నారని. ఆశువుగా అలా పద్యాలు అల్లెస్తారని ఆమె చెప్పారు. ఆయన శ్రీ చింతా రామకృష్ణారావు. http://andhraamrutham.blogspot.com/

నాదంటే నాదని ప్రస్తుతం తెలుగువారు కొట్లాడుకుంటున్న హైదరాబాదులో ఆయనకు ఉద్యోగం చేయాలంటే అసలు తెలుగు నేర్పే కాలేజీలే కరువైన విషయాన్ని ఆమె చెప్పారు.

అయినా ప్రస్తుతం మనకు ఇలాంటివి ఎందుకు దృష్టిలోకి వస్తాయి లెండి.

18. chandamama on January 7, 2010 12:40 AM Edit This

శివరాంగారూ,
పద్యకవిత్వాన్నే కాదు. వచన కవిత్వాన్ని కూడా చక్కగా పాడి వినిపించవచ్చు అనే విషయం ప్రస్తుతం మన విద్యాశాఖ ప్రభువుల వారికి తెలియదనుకుంటాను. చదివి వినిపించి ఎలాగోలా ముగించేస్తే చాలని ఏలినవారు భావిస్తున్నట్లుంది. పూర్వ కాలంలో వలే రాగాలు తీయనవసరం లేదు కానీ రాగయుక్తంగా పాడితే పిల్లల మనసులను క్లాసురూములో రంజింపజేయవచ్చు అనే విషయం ఇప్పుడు అందరూ మర్చిపోయినట్లే ఉంది.
జంధ్యాల మహతీ శంకర్ గారి తెలుగు పాఠాలను విన్న భాగ్యవంతులు మీరు. జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు తిరుపతిలో పాతికేళ్ల క్రితం ఎస్వీయూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ ఫంక్షన్‌కు వచ్చి దేశానికి భవిష్యత్తు ఇంజనీర్లు, భవన నిర్మాతలే అయినప్పటికీ తెలుగు భాష సౌందర్యాన్ని మర్చిపోవద్దని విద్యార్థులకు చేసిన విజ్ఞప్తి ఇంకా నా కళ్లముందు కదులాడుతానే ఉంది. ఆయన రాసిన పుష్పవిలాపం, కుంతీకుమారి పద్యాలకు ఘంటసాల వారి ఆలాపనలు మీ వద్ద ఉన్నాయి కదూ!

నే నొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మవంచి గో
రానెడు నంతలోన విరు లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమందెదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై.

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవనమెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారబోతురు గదా! నరజాతికి నీతి యున్నదా !

ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి
ముడుచు_కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

హాయిగా చెట్టుపైనున్న పూలను కర్కశంగా కోసి, సూదులతో గ్రుచ్చి, త్రాళ్ళతో బిగించి, మానవులు తమ భోగ వస్తువులుగా వాడుకోవడం క్రౌర్యం అని పూలు రోదిస్తే పూలకోసం వచ్చిన భక్తుడు తల్లడిల్లి వెనుదిరిగాడట… గొంతుకు ఉరి బిగించి గుండెలో సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురకటా దయలేని మీ యాడువారు అని పూలు రోదించిన వైనం ఘంటసాల గారు పద్యరూపంలో పాడుతుంటే అప్పట్లో కొందరు తెలుగు మహిళలు తలలో పూలు ధరించడానికి కూడా భయపడిపోయారని ప్రతీతి.

మా తెలుగు మాస్టారు సహదేవరెడ్డి గారు ఇప్పుడు లేరు. ఈ కంప్యూటర్లు, మొబైల్స్, కెమెరాల గురించి గ్రామీణ సమాజానికి పెద్దగా తెలియని కాలంలోనే ఆయన కన్నుమూశారు. ఆయన పద్యగానం రికార్డు చేసే అవకాశం లేదు. ఎవరయినా ఆయన పద్యాలను రికార్డు చేసి ఉండే అవకాశం కూడా లేదు. ఉంటే… నా మట్టుకు నాకు భూమ్మీద అంతకంటే మంచి వార్త మరొకటి ఉండదు.

ఈ టపాకు వచ్చిన స్పందనలు చూస్తుంటే నాకు చదువు, సంస్కారం నేర్పిన మా గుట్టకింద రాచపల్లె హైస్కూలు పిల్లలకోసం చందమామ పత్రికను పంపించాలని ఆలోచన వస్తోంది. త్వరలో ఈ పని చేయగలనని విశ్వసిస్తున్నాను.

ధన్యవాదాలు

2 comments:

karlapalem Hanumantha Rao said...

తెలుగు పద్యాలను రాగయుక్తంగా చదివి వినిపించ కూడదా!అలా కొత్తగా నియమం వుందా!
తెలుగు మాధుర్యాన్ని శ్రోతలు విని తరించకుండా తుగ్లక్ లు పన్నిన మరో కుట్ర కాదు కదా ఇదీ?

BHANUGKMASTER said...

https://www.facebook.com/bhanuchandraperala/

Post a Comment