Pages

Tuesday, December 14, 2010

ఆబాల గోపాల కథల పత్రిక “చందమామ”

ఆరు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను ఆకట్టుకుంటూ వారిని అద్భుతమైన ఊహాలోకపు మంత్రజగత్తులో విహరింప జేస్తున్న కథల పత్రిక “చందమామ”.

పిల్లల్లారా, చిన్నారీ, అమ్మాయీ, అని సంబోధిస్తూ, పాలు తాగే పసిపిల్లలకు ఊకోట్టే కథలను చెబుతూ 'చనుబాల' కథల పత్రికగా 1947 జూలై నెలలో తెలుగు, తమిళ భాషల్లో ప్రారంభమైన చందమామ అతి త్వరలోనే ఆబాల గోపాల కథల పత్రికగా భారతీయ సాహిత్య ఆకాశంలో తటిల్లున మెరిసింది.

జాతి జీవనంలో సాంస్కృతిక రాయబారిగా నిలిచిపోయిన అరుదైన పత్రిక చందమామ. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చందమామ కథల పత్రికను చదివే ఉంటారనడం అతిశయోక్తి కాదు. దైవ ప్రయత్నం కంటే మానవ ప్రయత్నానికి, తద్వారా మనుషులు సాధించే అంతిమ విజయాలకు ప్రాధాన్యమిచ్చే చందమామ కథలు తరాలు మారినా, సాంకేతిక జ్ఞాన ఫలాలతో జీవితం మూలమలుపులు తిరుగుతున్నా భారతీయ పాఠకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. సున్నిత హాస్యం, విజ్ఞానం, వినోదాల మేళవింపుగా రూపొందుతూ వచ్చిన చందమామ కథలు వాటికి తోడయిన అద్బుత చిత్రాలు -చిత్రా, శంకర్, ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య, రాజీ తదితరుల చిత్ర సృజన- భారతీయ పిల్లల మానసిక ప్రపంచాన్ని దశాబ్దాలుగా వెలిగిస్తూ వస్తున్నాయి.

ఆ పిల్లలు ఆ కథలతో పాటు పెరిగినా, జీవితంలో అన్ని దశలనూ అధిగమించినా సరే ఈనాటికీ వారు తమ బాల్యాన్ని మర్చిపోలేదు. తమ బాల్యాన్ని మంత్రనగరి సరిహద్దులలో ఊగించి, శ్వాసించిన చందమామ కథలనూ మర్చిపోలేదు. తెలుగునేల మీదే కాదు.. భారతీయ భాషలన్నింటిలోనూ అలనాటి తరం చందమామతో తమ అనుబంధం మర్చిపోలేదు. 1947 నుంచి చందమామ పత్రికను కొంటూ తమ పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకూ కూడా చందమామ కథలు చదివి వినివిస్తూ, తాము మళ్లీ మళ్లీ చదువుతూ చందమామతో తాదాత్మ్యం చెందుతున్న పాఠకులు దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ మరే పత్రికకూ లేరని చెప్పడం కూడా అతిశయోక్తి కాదు.

ఆరు దశాబ్దాల క్రితం పిల్లల పత్రికగా మొదలైన చందమామను ప్రస్తుతం 70, 80 ఏళ్ల పైబడిన వారు ఇప్పటికీ కొని చదువుతూ తమ మనవళ్లు, మనవరాళ్లకు వాటిని చదివి వినిపిస్తున్నారంటే ఒకనాటి చనుబాల కథల పత్రిక క్రమంగా ఆబాల గోపాల కథల పత్రికగా మారిన వైనం బోధపడుతుంది.

మారుతున్న కాలం, మారుతున్న తరాలు, పిల్లల అభిరుచులకు అనుగుణంగా దశ, దిశలు రెండింటినీ మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న చందమామను వెనక్కి పట్టి లాగి మూలం నుంచి పక్కకు పోవద్దని హెచ్చరిస్తూ, ధ్వజమెత్తుతూ, దూషిస్తూ కూడా చందమామ సారాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతున్న పాఠకుల వంటి వారు మరే భారతీయ పత్రికకూ కూడా లేరు. యాజమాన్యం చేతులు మారినా చందమామ మూల రూపం మారితే సహించబోమంటూ నిరసన తెలుపుతూ, ఉత్తరాలు, ఫోన్లు, ఈమెయిళ్లు, ఎస్ఎమ్ఎస్ ల ద్వారా అలుపెరుగని పోరాటం చేస్తున్న అరుదైన పాఠకులు చందమామకు తప్ప ప్రపంచంలో మరే పత్రికకు కూడా లేరని చెప్పవచ్చు.

చందమామ ఎందుకింత చరిత్ర సంపాదించుకుంది! లక్షలాది మంది పిల్లలు పెద్దల మనో ప్రవంచంపై ఇంత మహత్ ప్రభావాన్ని చందమామ దశాబ్దాలుగా ఎలా కలిగిస్తూ వస్తోంది? భారతీయ సాహిత్యాకాశంలో కథా కాంతులు మెరిపించిన ఈ గొప్ప చరిత్రకు, ఈ గొప్ప సంస్కృతికి ముగ్గురు మహనీయులు కారణం. వారి వల్లే, వారి దార్శనికత వల్లే చందమామ ఇంతటి ఘనతర చరిత్రను సాధించగలిగింది. వారు నాగిరెడ్డి, చక్రపాణి, కుటుంబరావు గార్లు. తొలి ఇద్దరూ చందమామకు రూపురేఖలు నిర్దేశిస్తే, తనకే సాధ్యమైన అతి సరళమైన రచనా శైలితో ఆబాల గోపాలం చందమామను తమ హృదయాలకు హత్తుకునేలా మార్చిన వారు కొడవటిగంటి కుటుంబరావు గారు. తను ఏ కథనైనా మన దేశానికీ, తెలుగు భాషకూ సరిపోయేట్టు మలిచి రాసేవారు.

అనన్య సామాన్యమైన ఈ త్రిమూర్తుల దార్శనిక కృషి ఫలితంగా, ప్రపంచ సాహిత్యంలోని గొప్ప అంశాలన్నీ “చందమామ”లో కథలుగా వచ్చాయి. భారతం, రామాయణం, భాగవతం, ఉపనిషత్తుల్లోని కొన్ని కథలూ, కథా సరిత్సాగరం, బేతాళకథలూ, పంచతంత్రం, బౌద్ధ జాతక కథలు, జైన పురాణ కథలు, అరేబియన్‌ నైట్స్‌ ఇలా విశిష్టమైనవన్నీ మామూలు కథల రూపంలో వచ్చాయి. భాసుడు, కాళిదాసు, ఇంకా ఇతర సంస్కృత రచయితల నాటకాలూ, షేక్‌స్పియర్‌ అనువాదాలు ఎన్నిటినో పాఠకులు చదవగలిగారు.

ఇవి కాక గ్రీక్‌ పురాణాలైన ఇలియడ్‌,ఒడిస్సే, వివిధ దేశాల జానపద కథలూ, పురాణ కథలూ, ప్రపంచ సాహిత్యంలోని అద్భుత కావ్యగాథలూ అన్నీ “చందమామ”లో సులభమైన భాషలో వచ్చాయి. పురాణాలే గాక ఇతర సాహిత్య రత్నాలైన కావ్యాలు శిలప్పదిగారం, మణిమేఖలై లాంటివి కూడా వచ్చాయి. “చందమామ” ఆఫీసులో అన్ని ప్రపంచదేశాల జానపద కథలూ ఉండేవి.

భారతీయ పిల్లలను జానపద ప్రపంచపు ఊహాలోకాల్లో విహరింపజేస్తూ వచ్చిన చందమామ కథలు, వారు సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేటట్లుగా, నిజాయితీ, లోకజ్ఞానం, నైతిక ప్రవర్తన, కృతజ్ఞత, వినయం, పెద్దల పట్ల గౌరవం, ఆత్మాభిమానం, పౌరుషం, దృఢ సంకల్పం లాంటి మంచి లక్షణాలను అలవరచుకునేలా చేస్తూ వచ్చాయి. మంచి అలవాట్లు, నీతి, నిజాయితీ, స్నేహం, విశ్వాసం నేర్పుతూనే పిల్లలకు పుస్తకాలు చదవటం నేర్పుతోంది చందమామ.

చందమామ కథలు ఏ వ్యక్తిత్వ వికాసానికీ తీసిపోని విజ్ఞాన గనులని చందమామ అభిమానులు ముక్తకంఠంతో చెబుతున్నారు. “విలువలు నేర్పుతూ, ఊహాశక్తిని పెంపొందిస్తూ, సమస్యల చిక్కుముడులు ఎలా విప్పదీయాలో చూపిస్తూ, కొత్త విషయాలు నేర్పుతూ, చరిత్రని గురించిన సంగతులు, పురాణాలు, ఇతిహాసాలు.. ఒహటేమిటి, అదీ-ఇదీ అని కాదు, లేనిది లేనే లేదు.. నీతి కధల్లోనే ఎన్నో రకాలు.. గుణపాఠాలు నేర్చుకునే కధలు, మార్పు(పశ్చాత్తాపం) గురించిన కధలు, మంచిగా ఉండేవాళ్ల కధలు – ఇలా ఎన్నో.. చిన్నప్పటి నుండి ఇలాంటివి చదవడం వల్ల, మనకి తెలియకుండానే ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటాం.. ఎప్పుడైనా తప్పు చేయాల్సి వచ్చినా భయమేస్తుంది, ఆ కధలోలా నాకు కూడా ఏమైనా జరుగుతుందేమో అని.. అలా పిల్లల వ్యక్తిత్వాలని తీర్చిదిద్దే పత్రిక చందమామ అంటే అతిశయోక్తి కాదేమో..

చందమామతో పాటు మరిన్ని పిలల్ల పత్రికలూ ఉన్నా, భాషలో, కథల ఎంపికలో, మరీ ముఖ్యంగా బొమ్మలలో చందమామకి ఉన్న ప్రత్యేకత చందమామదే. చందమామ అనుకోగానే, గుర్తొచ్చేవి బొమ్మలు.. కధల కంటే కూడా బొమ్మలు చాలా బావుండేవి.. రాము(రాముడు మంచి బాలుడు) ఇలానే ఉంటాడేమో.. పాపం విక్రమార్కుడు ఇలా బేతాళుడిని మోసుకువెళ్ళేవాడా, అబ్బ ఆ యువరాణి ఎంత అందంగా ఉందో! గయ్యాళి గంగమ్మ ఇలానే ఉంటుందా.. పైగా ఆ నెలలో ఏమైనా పండగలు ఉంటే వాటికి తగ్గ బొమ్మలతో అందంగా ముస్తాబై ఉండేది..” –మేధ, బెంగళూరు

చందమామ రాగానే పోటీ పడి ఎవరు ముందు చదవగలుగుతామా అని ఆత్ర పడడమూ, చందమామ అభిమానులందరికీ పరిపాటిగా ఉండేది. కొత్త చందమామ కోసం బేరాలు. బొమ్మలు చూసి ఇస్తాను అనో, ఒక్క పేజీ కథ ఒకటి చదివి ఇచ్చేస్తాననో, లేకపోతే చదివే వారి పక్కనే కూర్చుని వారితో పాటే చదవడమో, రక రకాలుగా ప్రయత్నాలు సాగుతుండేవి. మొదటి రుచి అందుకోవాలని. అలా హడావిడిగా మొత్తం పత్రిక తిరగేసినా, అందరి వంతులూ అయిపోయాక తీరిక సమయాలలో ఎవరికి వాళ్లు తొందర లేకుండా మళ్ళీ మళ్ళీ చదువుకునే వాళ్ళు. ఇక ఆ తర్వాత బొమ్మలు మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ చూసుకునే వాళ్లు. అలా చూసుకుంటూనే, పిల్లలు, పెద్దలు ఆ కథల గురించీ, బొమ్మల గురించీ చర్చించుకునే వాళ్లు.

ఈ మధ్యే చందమామ సీనియర్ చిత్రకారుడు శంకర్ గారిని చందమామ పనిలో భాగంగా పోన్ చేసి మాట్లాడితే చందమామను మొదటినుంచి పిల్లలూ, పెద్దలూ ఎందుకు అంత ఆసక్తిగా, ఆరాటంగా చదివారో అద్బుతంగా వివరించారు. పేదవాళ్లకు, పనిపాటలు చేసుకుంటూ బతికేవారికి కాస్త తీరిక సమయంలో చదువుకునేందుకు కథలు తప్ప జీకేలు, కార్టూన్‌లు ఉపయోగపడవని, కష్టజీవులకు కాస్త సరదా తెప్పించేందుకు, శ్రమను మరిపించేందుకోసమే చందమామ కథలు ముందునుంచి ప్రయత్నించాయని శంకర్ గారు చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా చందమామ వస్తోందంటే కారణం కథలేనని, కథల కోసమే చందమామను చదువుతున్నారని ఆయన అమూల్యమైన అభిప్రాయం చెప్పారు. గ్రామఫోనూ, రేడియో తప్ప మరే ఇతర వినోద విజ్ఞాన సాధనమూ లేని కాలంలో చదువగలిగిన ప్రతి వారికి చందమామ చక్కటి వినోద సాధనంగా పనిచేసిందని అభిప్రాయపడ్డారు.

చింతచెట్టుమీద దయ్యం గురించి చదివితే, ఆ దయ్యం కూడా… మనిషి కష్టాలు దయ్యం పెట్టే బాధల కంటే ఎక్కువ అనే సత్యాన్ని గ్రహించి అప్పటినుంచి అది మనుషులను పీడించడం మానుకున్న వైనం చదివితే కష్టాలు పడుతున్న వారి మనస్సుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందని, వారి శ్రమను, కష్టాన్ని కూడా మరిపించడంలో భాగంగా చందమామ కథలు పుట్టాయని శంకర్ గారు తమ అమూల్యమైన అభిప్రాయం చెప్పారు.

భయపట్టే దయ్యాలు, రాక్షసులూ కాకుండా మంచి వారికి సాయపడే దయ్యాలు, రాక్షసులు ఇతివృత్తంగా కథలు మార్చి ప్రచురించిన కారణంగా చందమామ కథను లక్షలాది మంది భారతీయులు తమ స్వంత జీవిత అనుభవాలతో పోల్చుకుని పరవశించారు. దశాబ్దాలుగా ఇదే తీరు.

చందమామలోని మరో ప్రత్యేకత ఏమిటంటే తేనెలూరే తియ్యటి తెలుగు. తెలుగు భాష నిసర్గ సౌందర్యాన్ని, భాషలోని తియ్యదన్నాన్ని చూడాలంటే కూడా చందమామనే చూడాలి. నాలుగైదు తరాల ప్రజలు, పాఠకుల జ్ఞాపకాల్లో చందమామ భాష నిల్చిపోయింది. భాష విషయంలో చందమామలో తప్పు దొర్లిన ఘటన దాదాపు ఉండేది కాదంటే చందమామ సంపాదకులు భాషకు, శైలికి ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది.

ఇన్ని సుగుణాల రాశి కాబట్టే చందమామ కొన్ని తరాల పిల్లలకు, పెద్దలకు కొండంత వెలుగు. అందులోనూ పాత చందమామలు అంటే తెలుగు ప్రాంతంలో ఎంత పోటీ ఏర్పడింది అంటే రాష్ట్రంలో ఎక్కడా పాత పుస్తకాల కొట్లలో, రోడ్జు పక్క అంగళ్లలో చందమామ సంచికలు దొరకని పరిస్థితి. పూర్వకాలంలో లంకెబిందెలకోసం వెతుకులాట ప్రారంభించినట్లుగారాష్ట్రంలో చందమామలు, పాత చందమామల కోసం వెతుకులాట మొదలయింది.

‘చంపి’ -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రియులు- లుగా ముద్రపడిన చందమామ వీరాభిమానులు పోటీలు పడి చందమామలు సేకరించడం, ఆన్‌లైన్‌లో పీడీఎఫ్ రూపంలో చందమామ పాత సంచికల ఫైళ్లను వెతికి పట్టుకుని సేకరించి తమ వద్ద ఇన్ని సంవత్సరాల చందమామలు ఉన్నాయి అని బ్లాగ్ లోకానికి టముకు వెయ్యడం గత కొంత కాలంగా నిత్య కృత్యంగా మారింది.

అలనాటి, ఈనాటి పాఠకులలో చందమామ కథలపట్ల ఉన్న ఈ వీరారాధనను గుర్తించి చందమామ యాజమాన్యం కూడా 1947 నుంచి 2000 వరకు చందమామ సంచికలను ఆన్‌లైన్‌లో ఉచితంగా చందమామ వెబ్‌సైట్‌లలో ఆర్కైవ్స్ విభాగంలో పొందుపర్చింది. ప్రపంచ వ్యాప్తంగా చందమామ పాఠకులు మొత్తం పది భాషల్లో ఇప్పుడు ఇంటర్నెట్‌లో 53 ఏళ్ల సంచికలను ఉచితంగా చూసి చదువుకోవచ్చు. ఆవిధంగా ప్రపంచంలో ఏ కథల పత్రికా సాధించని అరుదైన ఘనతను చందమామ సాధించింది.

“చందమామ నా ప్రాణనేస్తం. అమ్మ తన చిన్నప్పుడు చందమామ, తోకచుక్క, పాతాళదుర్గం, చదువుతూ పెరిగింది. నేను అక్క, అన్న, చందమామ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాళ్లం.” అంటూ నాలుగైదు తరాలుగా పిల్లలు చందమామతో తమ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. సున్నిత హాస్యంతో, విజ్ఞాన వినోదాత్మకమైన చక్కటి చందమామ కథలు చక్రపాణి నిర్దేశకత్వంలో కొడవటిగంటి కుటుంబరావు పెట్టిన ఒరవడిలోనే సాగుతూ తరాలు మారినా పాఠకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి.

తెలుగులో ప్రత్యామ్నాయ వెబ్‌సైట్‌లలో ఒకటిగా పేరు పొందిన ప్రజాకళ.ఆర్గ్ నుంచి బాలసాహిత్యం శీర్షిక కోసం నెలనెలా చందమామ కథలను పరిచయం చేయాలని ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్నొక గౌరవంగా భావించాను. ఎందుకంటే నేను కూడా బాల్యంలో పల్లెటూర్లో చందమామకోసం పోటీ పడి చదువుతూ పెరిగిన వాడినే. చందమామ పత్రికపై ఉన్న ఈ మమకారం చివరకు 35 ఏళ్ల తర్వాత నాకు కూడా చందమామలో ఓ స్థానం కల్పించింది. కథా సాహిత్యంలో వైభవోజ్వల ఘనతను సాధించుకున్న చందమామ పత్రికను మొదట పరిచయం చేసిన తర్వాత ప్రతినెలా ఒక విశిష్టమైన చందమామ కథను పరిచయం చేద్దామని నా ప్రయత్నం.. ప్రజాకళ పాఠకులు మే నుంచి ప్రతి నెలా చందమామ కథల నేపథ్యాన్ని, వాటి పరిచయాన్ని ఆస్వాదిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కలిగించిన ప్రజాకళ.ఆర్గ్ వారికి కృతజ్ఞతలు
- కె.రాజశేఖర రాజు

7 అభిప్రాయాలు
# Rohiniprasad 05 ఏప్రిల్ 2010 , 9:32 am
ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తికి తాను నిర్వహిస్తున్న బాధ్యతల గురించి అభిరుచి ఉండడం తప్పనిసరి కాదు. ఈ విషయంలో రాజశేఖరరాజుగారి ధోరణే వేరు. చందమామ గురించీ, దాని చరిత్రను గురించీ ఆయనకు ఎంతో ఆసక్తీ, అభిమానమూ ఉండడం చాలా మంచి విషయం.
చందమామ నిర్వహణ వ్యవస్థలో ఇటీవల జరిగిన కొన్ని ఘోరమైన తప్పిదాల కారణంగా దాని చరిత్రను వివరించే కొన్ని అమూల్యమైన, అపూర్వమైన ఆధారాలు కనుమరుగైపోయాయి. అప్పటితరంలో ముఖ్యపాత్ర చేపట్టినవారందరూ కాలం చెయ్యడంతో ఆ చరిత్రను తవ్వి తీయడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా ఈ బాధ్యతను చేపట్టిన రాజు ఎంతైనా అభినందనీయుడు.

# bhandaru srinivasrao 08 ఏప్రిల్ 2010 , 3:10 am
రాజు గారికి
చాలరొజులుగా మీ వ్యాసాలు చదివే వీలు దొరకలెదు. prajakala కు ధన్యవాదాలు.
భండారు శ్రీనివాస రావు

# దామోదరం మారెం 09 ఏప్రిల్ 2010 , 12:21 am
తొలుత చందమామ చరిత్ర గురించి ఇంతగా ప్రత్యేక శద్ధ తీసుకుని, భావి తరాలు మరిచిపోకుండా వివరించిన రాజశేఖర రాజు గారికి ధన్యవాదాలు. ఎన్ని సంచికలు వచ్చినా…చందమామ పత్రిక మాత్రం “లివింగ్ లెజెండ్” వంటిదని నిస్సందేహంగా చెప్పొచ్చు. మీ నుంచి మరెన్నో అద్బుతమైన కథనాలు రాగలవని ఆశిస్తున్నాను.

# murali mohan mallareddy 25 ఏప్రిల్ 2010 , 11:42 am
రాజు గారికి అభినందనలు. ఇటీవలే చందమామ కు కొన్ని కథలు పంపించాను. రాజు గారు వాటిని చక్కగా ఆదరించి ఎంతో ప్రొత్సాహాన్ని అందిస్తున్నారు. చందమామ తో ఇదివరకు పాఠకుడిగా ఉన్న అనుబంధం ఇప్పుడు రచయితగా మొదలవుతోంది. మహామహుల రచనలు వచ్చిన చందమామ లో నా కథలు కూడా రాబోతున్నాయన్న తలంపే ఎంతో సంతోషాన్ని కలుగజేస్తోంది. రాజు గారి కృషి అభినందనీయం…. మల్లారెడ్డి మురళీ మోహన, అంబాలా, హర్యానా.

# Hymavathy 02 ఆగస్టు 2010 , 12:47 am
చందమామ రాజు గారికి!

వెబ్ లో ఎన్నో సైట్స్లొ లో చందమామ గురించిన విషయాలు, చరిత్ర ప్రచురించడం ముదావహమం.[ఇక్కడవ్రాయడం కష్టం గానే ఉంది. లేఖిని లో వ్రాయడం అలవాటు] ఐతే ఏపత్రికైనా దాని బాగోగులగురించిన ఫీడ్ బ్యాక్ తెల్సుకుంటుంటేనే మంచి చరిత్రను రూపొందించుకుంటుంటుంది.అది చందమామ మాత్రమేచేయగలగడం మరో గొప్పవిషయం. చందమామ పాత పాఠకులనందరినీ ,[ అంటే ఓల్డ్ పాఠకుల సదస్సు రాష్ట్రములవారీగా ఏర్పాటుచేస్తే ఎంతో బావుంటుంది.ఎందుకంటే దాసరి సుబ్రహ్మణ్యం గారిలా జీవంతో ఉన్నపుడు ఎవ్వరూ అంతగా పట్టించుకోక , ఆతరువాత ఎన్ని వ్యాసాలు, బాధలు, గాధలు చెప్పుకున్నా ఏమీ ప్రయోజనం ఉండదేమో!
70 ఏళ్ళ ”చంపి” గారిలాంటి వారెందరో ఇంకా ఉండవచ్చు. కనుక యోచించగలరు.ఇలా చందమామ గురించిన కధల ప్రచురణవలన ప్ర జాకళ కూ పాఠకులు పెరిగిపోతారనడం యదార్ధం

# నారాయణ 16 ఆగస్టు 2010 , 10:39 am
చందమామకున్న చారిత్రక నేపధ్యాన్ని రాజుగారు చాలా చక్కగా చిత్రీకరిస్తున్నారు. నాగిరెడ్డి-చక్రపాణిగార్లు తెలుగు సాహిత్యానికి, పిల్లల పఠనాసక్తిని పెంచటానికి చందమామను స్థాపించి, దాన్ని పెంచి పెద్దచేసి ఇంతటి దాన్ని చేశారు. అయితే ఈ మధ్యకాలంలో చందమామలోని కథల్లోగాని, వాటి ప్రెజెంటేషన్లోగాని నిజంగా పెను మార్పులే చోటు చేసుకున్నాయి. (”..చందమామ కథలు గతంలో ఉన్నంత బాలేవు” అనేది నా వ్యక్తిగత అభిప్రాయం; అయితే దానికిక్కడ తావులేదు). ఈ క్రమంలో రాజుగారు చందమామ ప్రస్తుత యాజమాన్యం గురించి, వారికి చందమామ చరిత్రతో ఉన్న అనుబంధం గురించి, వృత్తి ప్రవృత్తుల రీత్యా వారికి తెలుగు భాష/ పిల్లలతో ఉన్న సంబంధాల గురించీ కూడా వివరిస్తే బాగుంటుంది.

గమనిక:
మనకున్న కొన్ని ప్రత్యామ్నాయ వెబ్‌సైట్లలో ఒకటైన ప్రజాకళ.ఆర్గ్ చందమామ కథల గురించి కథనాలు పంపమని అడిగినప్పుడు పంపిన మొదటి కథనం ఇది. చందమామ కథల ఒరవడి గురించి సూచన ప్రాయంగా తెలుపుతున్న ఈ కథనం అప్పట్లో మంచి స్పందనలను కూడా పొందింది. ఈ కథనం ప్రచురించి ప్రోత్సహించిన ప్రజాకళ.ఆర్గ్ వారికి కృతజ్ఞతాభివందనలు.

ప్రజాకళ.ఆర్గ్‌లో ఈ కథనం మూల లింకును కింద చూడవచ్చు.
http://prajakala.org/mag/2010/04/చందమామ

Wednesday, December 8, 2010

బేతాళ కథలు – కుటుంబరావు గారి ఒరవడి

గుణాఢ్యుని బేతాళ కథలు
వేణుగారూ! గుణాఢ్యుని బేతాళ కథలు పరిచయంపై మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. అసలు ఈ పుస్తకం చివర్లో బేతాళుడు విక్రమాదిత్యుడికి ప్రసన్నమై దొంగ బిక్షువు పన్నాగాలను వివరించి అతడిని తుదముట్టించడంలో సహకరించిన తర్వాతి ఘట్టం చదివినప్పుడు రోమాలు నిక్కపొడుచుకున్నాయి నాకు. మనోహరాలైన యీ యిరవై నాలుగు ప్రశ్న కథలూ, వీటితోపాటు యీ చిట్ట చివరి ఇరవై ఐదవ కథా లోక ప్రసిద్ధాలై ప్రకాశించాలి అని నా కోరికఅని త్రివిక్రమ సేన మహారాజు అడిగితే అలాగే అని వరమిచ్చిన బేతాళుడు ఇలా అంటాడు.

అలాగే అవుతుందిముందు చెప్పిన ఇరవై నాలుగూ, ఈ చివరి కథా కలిపి బేతాళ పంచవింశతి అన్న పేరుతో విశ్వ విఖ్యాతమై, పూజనీయమై, మంగళకరమవుతాయి. ఇందులో ఏ కొద్ది భాగాన్నయినా ఎవరు ఆదరంగా చదివినా, విన్నా వాళ్లు పాప విముక్తులవుతారు. బేతాళ పంచవింశతి ప్రసంగ, శ్రవణాలు జరిగే చోట యక్ష, బేతాళ, పిశాచ, రాక్షసాదులు ప్రవేశించలేరు

రెండు వేల సంవత్సరాల క్రితం గుణాఢ్యుడు బేతాళ పంచవింశతి కథలకు ఇలా ముగింపునిచ్చాడు అనే విషయం తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది నాకు. పాప విముక్తులు కావడం, యక్ష, బేతాళ, పిశాచ, రాక్షసాదులు ప్రవేశించలేకపోవడంవంటి వర్ణనలు గుణాఢ్యుడి కాలంనుంచి నేటి దాకా భారతీయ భావనా ప్రపంచంలో కొనసాగుతుండటం మనం హరికథలు, నాటక ప్రదర్శనల సమయంలో చూస్తూనే ఉన్నాం.

అయితే పాఠకులు విమర్శనాత్మకంగానే పరిశీలించి, తమదైన విచక్షణతోనే వీటిని స్వీకరించాల్సిన అంశాలు ఒరిజనల్ బేతాళ కథల్లో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఈ పుస్తకంలోని మూడో కథ చివర్లో స్త్రీలు సహజంగా క్రూర హృదయులు, కుత్సితులుఅని చిత్రరధుడనే గంధర్వుడు వ్యాఖ్యానిస్తాడు. పాప స్వభావులు, దురాచారపరులు అయిన పురుషులు ఎప్పుడో, ఎక్కడో ఒకప్పుడు ఉండవచ్చును. తరచూ స్త్రీలలో ఎప్పుడూ అలాంటివారే ఎక్కువఅని త్రివిక్రమ మహారాజు చేత గుణాడ్యుడు చెప్పిస్తాడు.

స్త్రీపురుషుల స్వభావాన్ని ఇంతగా సాధారణీకరించి -జనరలైజ్- చెప్పిన ఈ వ్యాఖ్యానాన్ని ఆనాటి పితృస్వామిక సమాజపు నేపధ్యంలోనే అర్థం చేసుకోవాలి. రెండువేల సంవత్సరాల తర్వాత కూడా స్త్రీల గురించి పురుషులలో చాలా మందికి ఈ భావాలే ఉండటం మనం చూస్తున్నాం కదా. స్త్రీపురుషుల మధ్య వ్యవస్థాగతంగా ఏర్పడిన వైరుధ్యానికి ఇవి ప్రతిరూపాలే కదా..

ఇక్కడే చందమామ సవరించి, రూపొందించిన బేతాళ కథల గొప్పతనం మనకు అర్థమవుతుంది. గుణాఢ్యుడి కథల్లో ఇలాంటి పితృస్వామిక సమాజ మానవ స్వభావానికి సంబంధించిన తప్పు వ్యాఖ్యానాలు ఎన్నో ఉండవచ్చు. కాని వాటిని మనం తప్పుపట్టలేం. అవి ఆనాటి సమాజానికి సంబంధించిన సాధారణ మానవ భావనలు.

ఈ పితృస్వామిక వర్గీకరణల అసహజత్వాన్ని విమర్శనాత్మకంగా, విచక్షణతో వేరుపర్చి స్త్రీపురుషులు సమానులు అనే నేటి సమానత్వ భావనాధారను చందమామ బేతాళ కథలు గత 55 ఏళ్లుగా ఎంత చక్కగా పిల్లల్లో, పెద్దల్లో ప్రసారం చేస్తూ వచ్చాయో మనందరికీ తెలుసు. చందమామలో తొలి బేతాళ కథను చూసినా ఈ 2009 అక్టోబర్ చందమామ సంచికలోని బేతాళకథను చూసినా సరే, బేతాళ కథల విషయంలో చందమామ చూపిస్తూ వచ్చిన విచక్షణ, హేతుబద్ధత మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

చందమామ బేతాళ కథలు ప్రదర్శిస్తూ వస్తున్న ఈ విచక్షణా దృక్పధానికి, నూతన భావ సంస్కారానికి ఇద్దరు మహనీయులు కారణం. వారు చక్రపాణి, కుటుంబరావు గార్లు. ప్రత్యేకించి 1930ల చివరికే మార్క్సీయ భావధారను తనలో నిక్షిప్తం చేసుకున్న కుటుంబరావు గారుసిద్ధాంత రాద్దాంతాలు, పదాడంబరాల జోలికి పోకుండా తాను నమ్మిన హేతుపూర్వక ఆలోచనా సరళిని బేతాళ కథలకు జోడించి వాటిని ఆధునిక మానవ సంస్కారానికి ప్రతీకలుగా చేసి ప్రాణప్రతిష్ట పోశారు.

దానికి చక్రపాణిగారి ఆమోదముద్ర ఉండటంతో మూడు దశాబ్దాలపాటు కుటుంబరావుగారి ప్రజాస్వామిక ఆలోచనా ధార బేతాళ కథలలో నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చింది. మార్క్సిజానికి సంబంధించిన పదజాలం వాడకుండానే కుటుంబరావుగారు తన ఇతర అన్ని రచనల్లోనూ ఆధునిక మానవ సంస్కారాన్ని ఎలా ప్రతిఫలిస్తూ వచ్చారో చందమామ కథలు కూడా దానికి మినహాయింపు కాదు.

బూర్జువా, భూస్వామ్యం, అర్ధవలస, అర్ధభూస్వామ్య వంటి ఒక పట్టాన కొరుకుడు పడని పదాలతో మన దేశపు సామాన్య ప్రజలను భయపెట్టడానికి బదులుగా భూమ్మీద తనకే సాధ్యమైన తేలిక పదాలతో, సరళ వచనంతో ఆయన చందమామ కథలకు రూపురేఖలు దిద్దారు. మధ్యయుగాల జానపద సంస్కృతికి ఆధునిక మానవ సంస్కారాన్ని జోడించి కుటుంబరావుగారు దేశ దేశాల కథలను మలచడంలో చూపించిన నైపుణ్యం చందమామకు భారతీయ కథాసాహిత్యంలో, ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం కల్పించింది.

చక్రపాణి గారి దార్శనికత, కుటుంబరావు గారి ఒరవడికి చందమామ చిత్రకారుల మంత్రజాలం తోడవటం, మొదట్లో రాజారావు, ముద్దా విశ్వనాధం గార్లు తర్వాత దాసరి సుబ్రహ్మణ్యం గారు తదితర శక్తివంతమైన రచయితల మేళవింపుతో కూడిన చందమామ సంపాదక బృందం దన్ను చందమామకు స్వర్ణయుగాన్ని తెచ్చిపెట్టాయి. వీరి సహాయ సహకారాలు లేకుండా చందమామ కోట్లాది పాఠకులను అలరిస్తూ రావడం జరగని పని కూడా.

బాల సుబ్రహ్మణ్యం గారి సహాయ సంపాదకత్వంలో వస్తున్న చందమామ ఈనాటికీ ప్రాథమికంగా అదే ఒరవడిలో కొనసాగుతుండటం యాదృచ్చికం కాదు. (సహాయ సంపాదకత్వం అనేది టెక్నికల్ ఫ్యాక్ట్ మాత్రమే.. నిజానికి చందమామ ప్రింట్ విభాగం మంచిచెడ్డలన్నింటికీ గత కొంతకాలంగా ఆయనే బాధ్యులు. విశ్వంగారు చందమామలో ఉన్న రోజుల్లో కూడా అంటే గత మూడు దశాబ్దాలుగా కూడా చందమామ కథల ఎడిటింగ్‌లో, ఇతర చాకిరీలో ప్రధాన భారం బాలుగారిదే అనేది చరిత్ర చెబుతున్న సాక్ష్యం)

కథలకు కొసమెరుపు ఇవ్వడంలో, చివరి క్షణంలో కూడా పలానా కథలో మార్పు చేస్తే బాగుంటుందేమో అంటూ విశ్వంగారు మూడు దశాబ్దాల క్రితంనుండి ఇటీవలి వరకూ చందమామకు నెరుపుతూ వచ్చిన సంపాదకత్వ బాధ్యతలు కూడా తక్కువేం కాదు. మరి చందమామ ఆవరణలో పుట్టిపెరిగిన విశ్వంగారు నలబై, యాబై ఏళ్ల పాటు దానిలోని ప్రతి శాఖలో జరుగుతున్న పనిని ఆకళింపు చేసుకున్న అనుభవాన్ని పుణికి పుచ్చుకున్నారాయె.
 
ఇది కుటుంబరావు గారి శత జయంతి సంవత్సరం. ఈ అక్టోబర్ 28న ఆయన నూరవ పుట్టిన రోజుకు సంబంధించిన జ్ఞాపకాలను తల్చుకుంటున్నప్పుడు తెలుగు పాఠకులు, రచయితలు, సాహిత్యాభిమానులు, చందమామ ప్రియులు మర్చిపోకూడని అంశం చందమామ బేతాళ కథలు.

శతాబ్దాలు గడిచినా గుబాళింపు తగ్గని గుణాఢ్యుడి బేతాళ మూలకథల మూసలోనే గత 55 ఏళ్లుగా ఎన్నో కొత్త, ఆధునిక భావప్రేరిత కథలను సృష్టించి చందమామతన పిల్ల పాఠకుల, పెద్ద పాఠకుల మనసులను ఏళ్ల తరబడి రంజింప చేసింది. ఈ నాటికీ చేస్తూనే ఉంది. ఈరోజుకీ చందమామ కార్యాలయానికి వస్తున్న పాఠకులు లేఖలు బేతాళ కథల పటుత్వాన్ని, గొప్పదనాన్ని ప్రశంసించకుండా ఉండటం లేదంటే మనం ఆశ్చర్యపడనవసరం లేదు.

ఒక విషయం మాత్రం నిఖార్సుగా చెప్పవచ్చు. మానవ సంస్కారానికి, మానవ సద్బుద్ధికి పట్టం కట్టే కథలకు తెలుగులో కుటుంబరావు గారే ఆద్యులు కాకపోవచ్చు కాని, ఈ కోణంలో ఆయన ప్రవేశపెట్టిన ఒరవడి మాత్రం చందమామ కథలపై శాశ్వతమైన ముద్ర వేసింది. ఎంతగా అంటే చందమామ కథల స్వభావాన్ని ఎవరూ మార్చలేనంతగా.

మరో వంద సంవత్సరాలు చందమామ కొనసాగిన పక్షంలో కూడా, చందమామ కథల స్వభావం మారబోదని ఇన్ని ఒత్తిళ్లు, ఆటుపోట్ల మధ్య కూడా మనం సగర్వంగా చెప్పవచ్చు. చందమామ రూపం ఎన్ని కొత్త లేదా అసంబద్ధ (?) ధోరణులలో కొట్టుకుపోయినా సరే దాని కథల స్వభావం మాత్రం మారదు గాక మారదు. తరాలు మారుతున్నా, చదివే పాఠకుల ప్రాధాన్యతలు మారుతున్నా చందమామ మనగలుగుతోందంటే దశాబ్దాలుగా చెక్కుచెదరని దాని కథల ఘనతర పునాదే కారణం.

ఈ రూపంలోనే మనం చక్రపాణి, కుటుంబరావుల దార్శనికతను, చందమామ కథల్లోని ఆధునిక సమాజపు నూతన భావధారను మన హృదయాల్లో నింపుకుందాం. అదే వారికీ, చందమామ స్వర్ణయుగంలో తమ వంతు పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ నిజమైన నివాళి కూడా.

మూలంలోని కథలు అని మాత్రమే కాదు.. పీకాక్ క్లాసిక్స్ వారి ఆ ఆకర్షణీయమైన గోదుమ వర్ణపు నిసర్గ ముద్రణా సౌందర్యాన్ని, మరణ శయ్యపై ఉండి కూడా ఆధునిక అనువాద మాంత్రికుడు సహవాసి గారు సృజించిన చిట్టచివరి రమణీయ అనుసృజనను ఆస్వాదించడానికయినా గుణాఢ్యుని బేతాళ కథలుపుస్తకం తప్పక చదవండి. కొని చదవండి. అవి 2 వేల ఏళ్ల క్రితం గుణాఢ్యుడు రాసిన బృహత్ కథలనే విషయం గుర్తుపెట్టుకుని మరీ చదవండి.
వేణుగారి స్పందన, వ్యాఖ్య ప్రభావంతో రూపొందిన ఈ కథనానికి తొలి భాగాన్ని కింది లింకులో చూడగలరు.
http://blaagu.com/chandamamalu/2009/10/30/%e0%b0%97%e0%b1%81%e0%b0%a3%e0%b0%be%e0%b0%a2%e0%b1%8d%e0%b0%af%e0%b1%81%e0%b0%a1%e0%b0%bf-%e0%b0%ac%e0%b1%87%e0%b0%a4%e0%b0%be%e0%b0%b3-%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2%e0%b1%81/
RTS Perm Link
2 Responses to “బేతాళ కథలు కుటుంబరావు గారి ఒరవడి
  1. SIVARAMAPRASAD KAPPAGANTU on November 1, 2009 10:09 PM Edit This
అతి + అంత అత్యంత (ఇదే సంధో నాకు తైయదుకాని) అద్భుతంగా విశ్లేషించి బేతాళ కథలోని గొప్పతనాన్ని, కొడవటిగంటి వారు ఆ కథలకు మెరుగు దిద్ది చందమామలో పిల్లలకు అందించిన తీరు అందరికీ తెలియచేశారు. కొడవటిగంటి వారి శతజయంటి సందర్భంగా అంతగా ఎవరికీ తెలియని కుటుంబరావుగారి ఈ సాహితీ ప్రక్రియ మీ ద్వారా తెలియటం ముదావహం.
 
మీరు వ్రాసినట్టుగా కుటుంబరావుగారు సిద్ధాంత రాద్దాంతాలు, పదాడంబరాల జోలికి పోకుండా తాను నమ్మిన హేతుపూర్వక ఆలోచనా సరళిని బేతాళ కథలకు జోడించి వాటిని ఆధునిక మానవ సంస్కారానికి ప్రతీకలుగా చేసి ప్రాణప్రతిష్ట పోశారు”. 

కుటుంబరావుగారి వ్రాసిన ఏ పదంలోనైనా సరే ఆయన తానేదో బోధిస్తున్న పోకడలను ఎప్పుడూ చెయ్యలేదు. తన రచనల ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం కూడ ఎప్పుడూ తలపెట్టలేదు. పిడివాదం లేదు ఆయన రచనలలో. వారి రచనలు చదువరిని అలోచింపచేసేవి. అదే కుటుంబరావుగారి రచనలు చిరంజీవులుగా నిలచిపోవటానికి మూల కారణం.

మార్క్సిజం చట్రంలో ఇరుక్కుని రచనలు చేసి ఉంటే అవి ఎప్పుడో అటకెక్కేవి. కారణం సామాజిక స్పృహ హేతుబధ్ధంగా అలోచించటం ఏదో ఒక వర్గానికి చెందినది కాదు.

మహారచయిత కుటుంబరావుగారి శతజయంతి సందర్భంగా ఒక మంచి కోణం చూపించారు రాజుగారూ. అభినందనలు.

కుటుంబరావుగారి మీద మీ ముఖ్య వ్యాసం కోసం చందమామ ఆన్ లైను లో ఎదురు చూస్తూ…..
  1. వేణు on November 2, 2009 1:50 AM Edit This
రాజు గారూ! అడగాలే కానీ, బేతాళ కథల ప్రత్యేకత గురించి చక్కటి విశేషాలు ఎన్ని అయినా
మీరు అలవోకగా రాసేట్టున్నారు. ఈ కథలకు కుటుంబరావు గారు సమకూర్చిన ఒరవడి గురించి బాగా వివరించారు. మీకు ప్రత్యేక అభినందనలు!

Tuesday, December 7, 2010

'చందమామ బ్లాగు' నుంచి 'నెలవంక' దాకా...

గత సంవత్సరం -2009- జూలైలో సదసత్సంశయంతోనే మొదలు పెట్టిన నా బ్లాగు -చందమామ చరిత్ర-ను -blaagu.com/chandamamalu - తెలుగు బ్లాగ్ లోకం, ప్రత్యేకించి 'చందమామ' అభిమానులు, పాఠకులు త్వరలోనే తమ స్వంతం చేసుకున్నారు. దశాబ్దాలుగా చందమామ పఠనంలో, దాని జ్ఞాపకాలలో ఓలలాడుతూ వస్తున్న పాఠకులు, కన్న ఊరిని , దేశాన్ని వదిలి జీవితం కోసం ప్రపంచం నలుమూలలకూ పయనించి వెళ్లిన చందమామ అభిమానులు ఈ బ్లాగును అసాధారణ రీతిలో ఆదరించారు.

ఆన్‌లైన్ పాఠకులు, చందమామ అభిమానులు, బ్లాగర్ల ప్రోత్సాహం వల్లే 15 నెలల కాలంలో 180 కథనాలు చందమామ చరిత్ర బ్లాగులో ప్రచురించడమైంది. ఈ 180 కథనాల్లో దాదాపు 120 కథనాలు పూర్తిగా చందమామ చరిత్రకు సంబంధించినవి. చందమామ సంస్థాపకులు నాగిరెడ్డి-చక్రపాణి గార్ల పత్రికా విధానంలో భాగంగా మరుగున పడిపోయిన చందమామ పత్రిక విశేషాలను, అందులో పనిచేసిన అపురూప వ్యక్తులు, మాన్య సంపాదకులు, రచయితలు, అద్వితీయ చిత్రకారులు, దశాబ్దాలుగా సేవలందించిన సిబ్బంది, తదితర చందమామ చరిత్రకు సంబంధించిన విశేషాలను గత సంవత్సరం పైగా చందమామ చరిత్ర బ్లాగులో క్రమం తప్పకుండా ప్రచురించడం జరిగింది.

చందమామలో పనిచేస్తూ ఉన్న క్రమంలో ఆ బ్లాగు ద్వారానే ఎంతోమంది చందమామ రచయితలు, కథకులు, పూర్వ సంపాదకులు, చందమామను దశాబ్దాలుగా గుండెలకద్దుకుని పదిలపర్చుకుంటున్న పాఠకులు, వీరాభిమానులు మళ్లీ చందమామతో సంబంధాల్లోకి వచ్చారు. నాకంటే ముందుగా గత నాలుగు సంవత్సరాలుగా ఇంటర్నెట్‌లో చందమామను ప్రస్తావిస్తూ మంచి మంచి కథనాలు ప్రచురిస్తూ వచ్చిన ప్రముఖ బ్లాగర్లు, 'చంపి'లు, -చందమామ పిచ్చోళ్లు లేదా ప్రేమికులు - 'వీరచంపి'లు ఎందరో మరెందరో చందమామ చరిత్ర బ్లాగుకు ప్రేరణగా నిలుస్తూ చందమామ పత్రిక చరిత్రకు సంబంధించిన విలువైన సమాచారం అందిస్తూ వచ్చారు.

సర్వశ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్, త్రివిక్రమ్, సిహెచ్ వేణు, నాగమురళి, బ్లాగాగ్ని, కె. శివరాం ప్రసాద్, సుజాత గార్లు చందమామ చరిత్ర బ్లాగు రూపొందించడానికి ముందు ఆన్‌లైన్‌లో చందమామ గురించి ప్రపంచానికి తెలియజేసిన ప్రముఖ బ్లాగర్లు. తర్వాత, చందమామ సీరియల్స్ రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారిపై వసుంధర గారు కౌముది వెబ్‌సైట్‌లో ప్రచురించిన సుబ్రహ్మణ్య సృష్టి వ్యాసం, దాసరి గారిని 2008లో, 2009లో రెండుసార్లు స్వయంగా కలిసి ఇంటర్వ్యూ ప్రచురించి చందమామ పాఠకులకు పెన్నిధిని ప్రసాదించిన వేణుగారి వ్యాసాలు ‘చందమామ’ రచయితను కలిసినవేళ...., ‘ఈనాడు’లో చందమామ కథల మాంత్రికుడు! ... ముఖ్యంగా ఈ మూడు కథనాలు చూశాకే చందమామ చరిత్రను లోపలినుంచి వెలికి తీయాలనే కోరిక బలపడింది.

తర్వాత చరిత్ర మీకందరికీ తెలిసిందే. చందమామ చరిత్ర బ్లాగు చందమామ ఆన్‌లైన్ అభిమానులందరికీ ఒక ప్రపంచ వ్యాప్త వేదికగా నిలిచింది. దాదాపు 45 మంది చందమామ అభిమానులు ఇప్పటివరకూ తమ చందమామ జ్ఞాపకాలు పంపారు. వీటిని చందమామ వెబ్‌సైట్లో, చందమామచరిత్ర బ్లాగులో ప్రచురించడం జరిగింది. వ్యక్తిగతంగా నేను చిన్నస్థాయిలో మొదలు పెట్టిన చందమామ చరిత్ర బ్లాగు త్వరలోనే పాఠకుల విపరీత ఆదరణతో చందమామ అధికారిక బ్లాగుగా రూపాంతరం చెందింది. ఇలా వ్యక్తిగతంగా మొదలు పెట్టిన బ్లాగు సంస్థకు చెందిన బ్లాగుగా మారడం బహుశా అరుదైన విషయమే అనుకుంటాను. నా జీవిత పర్యంతం దాచుకోవలసిన మధుర జ్ఞాపకాల్లో ఇదీ ఒకటిగా ఉంటుంది.

బ్లాగ్ మొదలు పెట్టాక శివరాంప్రసాద్ గారు అందించిన ప్రోత్సాహం, ప్రేరణ గురించి ప్రస్తావించకపోతే కృతజ్ఞత అనే పదానికి బహుశా అర్థం ఉండదనుకుంటాను.

2011 ఫిబ్రవరినుంచి ప్రింట్ చందమామ పత్రికలో కూడా నా జ్ఞాపకాలు పేరిట చందమామ అభిమానుల జ్ఞాపకాలను వారి ఫోటోతో సహా ఒక పేజీలో పరిచయం చేయడం జరుగుతోంది. మొదటగా, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారి చందమామ జ్ఞాపకాలు ప్రింట్ చందమామలో ప్రచురితం కానున్నాయి.

అలాగే గత నాలుగు నెలలుగా ప్యాకెట్ సైజులోకి కుంచించుకుపోయి పాఠకుల శాపనార్థాలకు గురవుతున్న చందమామ 2011 జనవరినుంచి మళ్లీ పాత చందమామ సైజులో రాబోతోంది. పాఠకుల ఒత్తిళ్లు, తగ్గిన అమ్మకాలు ఏవైనా కావచ్చు.. చందమామ మళ్లీ చందమామలాగే ఉండబోతోంది. భూమి గుండ్రంగా ఉంటుందనేది ఎంత గొప్ప సత్యమో ఇలాంటప్పుడే బోధపడుతూంటుంది కదా! ఇటీవల కొన్ని నెలలుగా చందమామలో పేజీ నిండుగా బొమ్మలు అచ్చవుతూ పాఠకుల ఆదరణను విశేషంగా చూరగొంటున్న విషయం కూడా చందమామ అభిమానులకు, పాఠకులకు తెలిసిందే.

చివరగా.. గత సంవత్సరన్నర కాలంగా అంటే 2009 జూలై నుంచి 2010 నవంబర్ వరకు ఉద్యోగ జీవితం మినహాయించగా, నా శక్తియుక్తులన్నింటినీ చందమామచరిత్ర బ్లాగు -blaagu.com/chandamamalu- మీదే కేంద్రీకరించాను. ఒక విషయం మాత్రం ఇక్కడ నొక్కి చెప్పాలి. చందమామలో మరుగునపడిన వారి అరుదైన జీవిత వివరాలను, అరుదైన చరిత్రను బయటి ప్రపంచానికి అందించడానికి 60 ఏళ్ల తర్వాత దేవుడే రాజశేఖరరాజును చందమామకు పంపించాడంటూ కన్నీళ్లు పెట్టుకునే చందమామ చిత్రమాంత్రికులు శంకర్ గారి ప్రేరణ లేకుంటే ఇంత తక్కువ కాలంలో చందమామ గురించిన విశేషాలను ఇంత విస్తృత స్థాయిలో బయట పెట్టగలిగేవాడిని కాదు.

పరమ భక్తి భావంతో ఆయన అలా అన్నప్పుడల్లా నేను సిగ్గుతో తల వాల్చేస్తాననుకోండి అది వేరేవిషయం. మానవసంకల్ప బలానికి ప్రాధాన్యమిచ్చే కథలు ప్రచురించే చందమామలో 60 ఏళ్లుగా తాను గీస్తూ వస్తున్న ప్రతి బొమ్మనూ దైవసంకల్పంగా చెప్పుకునే మాన్యులు శంకర్ గారు. ఆయన గురించి తెలుగులో వచ్చిన కథనాలను ఒకటీ రెండు ఇంగ్లీషులోకి అనువదింపజేసి (శివరాం ప్రసాద్ గారు) బ్లాగర్ల కామెంట్లతో సహా ప్రింటు తీసి ఆయనకు అందిస్తే ఎంత ఆరాధనగా చూసేవారో.

అయితే సమయాభావం వల్ల చందమామ విశేషాలనే కాకుండా రోజువారీ ఘటనలపై నా స్పందనలను, ఇతర సాహిత్య, సినీ, సాంస్కతిక విషయాలను కూడా చందమామ బ్లాగులోనే ప్రచురిస్తూ రావడం జరిగింది. చందమామలో చందమామకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉంటే బాగుంటుందనేది మొదటినుంచీ పైవారి అభిప్రాయం.

బయటకు చెప్పలేని అనేక కారణాల వల్ల చందమామ ప్రస్తుత యాజమాన్యం చాలా విషయాల్లో మోతాదుకు మించిన జాగ్రత్తలతో ఉంటోంది. లీగల్ పరంగా కూడా కొన్ని సంస్థకు ఇబ్బంది కలిగించేవిగా ఉంటాయని భీతి. ఉదాహరణకు 'చందమామ సంస్థాపకులు నాగిరెడ్డిగారిపై డీవీడి,' 'తెలుగు సినిమా విశ్వరూపం మాయాబజార్' వంటి కధనాలు వాటికి జోడించిన ఫోటోలు కాపీరైట్ సమస్యగా మారుతుందేమోనని పైవారి అభిప్రాయం.

వీరివైపు నుంచి ఇవి న్యాయకారణాలే కాబట్టి అలా ప్రస్తుత చందమామకు సంబంధం లేని ఇతర కథనాలను బ్లాగునుంచి తొలగించి మరొక బ్లాగులో ప్రచురించవలసిన అవసరం ఏర్పడింది. దీంతో ఈ నవంబర్ మూడోవారంలో చందమామ చరిత్ర బ్లాగులోంచి 70 కథనాలను తొలిగించి వేరు చేసి ఉంచాను.

ఈ మధ్యే వ్యక్తిగతంగా నెలవంక పేరుతో ఒక బ్లాగును కూడా కొత్తగా రూపొందించుకున్నాను.
kanthisena.blogspot.com

ఈ కాంతిసేన, నెలవంక ఎవరో చందమామ పాఠకులకు, చంపిలకు ఇప్పటికే అర్థమయిందనుకుంటాను.

చందమామ చరిత్ర బ్లాగులోంచి తొలగించిన దాదాపు 70 కథనాలను ఇందులో క్రమంగా ప్రచురించిన తర్వాత దీన్ని పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో నడపాలని నా ఆకాంక్ష. తర్వాతే దీన్ని కూడలి, జల్లెడ, హరం, తెలుగుబ్లాగు వంటి ఆన్‌లైన్ కూడళ్లలో జతచేయాలని అనుకుంటున్నాను.

దీంట్లో చందమామ విశేషాలతో పాటు నా వ్యక్తిగత స్పందనలకు సంబంధించిన కథనాలు కూడా వివిధ కేటగిరీల రూపంలో ఉంటాయి. అలా నాకు మరికొంత స్వేచ్చ కూడా లభించే అవకాశం ఉందనుకుంటున్నాను. వృత్తికి, ప్రవృత్తికి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ నాకూ ఒక స్వంత బ్లాగు ఉందని చెప్పుకోవడానికి ఇది పనికివస్తుంది అని ఓ చిన్న ఆశ.

నన్ను 'చందమామ రాజు'ను చేసి అపూర్వగౌరవం కల్పించిన చందమామ చరిత్ర బ్లాగుకు మీరు అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఎప్పటిలాగే కొనసాగిస్తారని, వ్యక్తిగత ప్రాతిపదికన ఇప్పుడు మొదలెడుతున్న స్వంత బ్లాగును కూడా ఆన్‌లైన్ పాఠకులు, చందమామ అభిమానులు, 'చంపి'లు ఆదరిస్తారని, ఆదరించాలని మనసారా కోరుకుంటూ....
మీ
చందమామ రాజు.
kanthisena.blogspot.com
krajasekhara@gmail.com

Monday, December 6, 2010

పత్రికలలో పదప్రయోగాలు

passive smoking = మారు పొగ -పొగ తాగేవారు వదిలే పొగను పీల్చడం.
concluding session = ముగింపోత్సవం (ఆసియాడ్, చైనా)

పాసివ్ స్మోకింగ్‌ పదానికి నవంబర్ 27నాటి ఈనాడు పత్రికలో చక్కటి తెలుగు పదం వాడారు. మారు పొగ. తమిళంలో డీలక్స్ బండికి ‘సొగసు వండి’ అని ఎంత చక్కటి పదం వాడుతున్నారంటే వింటూనే మనసుకు హాయి అనిపిస్తుంది. మనమేమో ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సెమీ లగ్జరీ, డీలక్స్, ఆర్డినరీ బస్సు పదాలను అలాగే వాడేస్తున్నాం కదా.. ఫ్లై ఓవర్ బ్రిడ్జ్‌ పదాన్ని దాదాపు తెలుగులో అన్ని పత్రికలూ ఇంగ్లీషు ఉచ్చారణలోనే రాస్తున్నాయి. కాని పాటక జనం అని పిలవబడే మామూలు మనుషులు దీన్ని ‘పై వంతెన’ అని పిల్చుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఇంగ్లీష్ ఉచ్చారణ రాదు కదా. కాబట్టి తమదైన భాషలోకి సులువుగా దీన్ని మార్చేసుకున్నారు. విశాఖలో డ్రెడ్జర్ పదానికి 70 లేదా 80 ఏళ్లకు ముందే కూలీలు తవ్వోడ అని పేరు పెట్టుకున్న విషయం తెలుసు కదా..

పదాలను కృత్రిమంగా చొప్పించడానికి బదులుగా, సంస్కృత పదాలను రుద్దడానికి బదులుగా మామూలు మనుషులు వాడే పదాలను వెతికిపట్టుకుని అలవాటు చేస్తే ఎంత బాగుంటుందో! కాని ప్రజలనుంచి నేర్చుకోవడం అనే విలువను మనం పాటిస్తే మన అభిజాత్యాల మాటేమిటి? అవెక్కడికి పోవాలి? కాబట్టి మనకు పదాల విషయంలో కూడా రుద్దుడు తప్పదు.

హైకమాండ్ = అధినాయకత్వం (స్థల పరిమితి లేదా స్థల పొదుపు కారణంగా హైకమాండ్ అనే ఆంగ్లపదాన్నే కొనసాగిస్తున్నారు ప్రత్యేకించి శీర్షికలలో)

ఛీఫ్‌విప్ -ఇంగ్లీషులో ఇవి రెండు పదాలు కాని ఈనాడులో దీన్ని ఒకే పదంగా వాడుతున్నారు.- ఇలాంటివి బోలెడు. ఇతర పత్రికలలో విడిగానే వాడుతుండవచ్చు. ఇలా పదాలను ప్రత్యేకించి రెండు నామవాచకాలను లేదా విశేషణాన్ని నామవాచకాన్ని కలిపి వాడడం, విడదీయడం చాలా సందర్భాలలో జరుగుతోంది. దీనికి ప్రామాణికమైన వాడుక అంటూ లేనట్లే కనిపిస్తోంది.

ప్రింట్ మీడియా – ముద్రణా మాధ్యమం
ఎలెక్ట్రానిక్ మీడియా – దృశ్యమాధ్యమం -ఈనాడు ప్రయోగం-
ఎలెక్ట్రానిక్ మీడియా – దృశ్యమాధ్యమ- విలేకరులు
నేనయితే ముద్రణా మాధ్యమం, దృశ్యమాధ్యమం అనేది ఈ దేశంలో నూటికి 70 మంది పలకలేరని హామీ ఇవ్వగలను. -1980లలో జరిగిన ఓ సర్వేలో ఆకాశవాణిలో వాడుతున్న పదాల్లో 70శాతం గ్రామీణ ప్రజలకు అర్థం కాలేదని తేలింది. జన మాధ్యమంగా పేరు పడిన రేడియోనే ఇంతగా ప్రజలకు దూరంగా ఉంటున్నప్పుడు పత్రికలు, పాఠ్యపుస్తకాల కథ చెప్పవలసిన పనిలేదు - వీటికి బదులుగా ప్రింట్ మీడియా, ఎలెక్ట్రానిక్ మీడియా అనే ఇంగ్లీషు పదమే సులువుగా ఉన్నట్లు తోస్తుంది.

ఇంగ్లీష్ వద్దంటే దానర్థం సంస్కృతంతో బాదించుకోవడం అని అర్థం కాదు కదా. వినడానికి ఎంత గంభీరంగా ఉన్నా ఈ సంస్కృత పదాలు ఎంత కృత్రిమంగా కనిపిస్తాయో.. మా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలలో శాస్త్రాలకు తెలుగుపదాలను చివర్లో ఇచ్చేవారు. వాటిని చూడగానే భయం వేసేది. కారణం అవి మాకు అర్థం అయ్యే పదాలు కావు. ఉదా. నకశేరుకాలు, అకశేరుకాలు.. ఈ నాటికీ ఈ పదాలకు నిఘంటువు చూస్తే కానీ నాకు అర్థం తెలీదు. ప్రభుత్వం, దాని నిపుణులూ ఇలాంటి పదాలతో కొడితే మనం ఇక తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? ఇంగ్లీషో లేదా సంస్కృతమో నేర్చుకుంటే పోయేది కదా. గ్రామీణ విద్యార్థులకు సైన్స్, లెక్కలు అంటే ఎందుకంత భయం అంటే దాంట్లో పదాలు చూసేననిపిస్తుంది. స్వయానా వాటిబారిన బడ్డాం కదా. నిజం చెప్పాలంటే పల్లెటూరి బళ్లలో తెలుగు మాత్రమే బాగా వినేవాళ్లం. బట్టీ కొడితే కూడా సైన్స్, లెక్కలు వచ్చేవి కాదు. పదాలు చూస్తేనే భీతి.


డుమువులు చేర్చితే తెలుగయిపోతుందా?

ఇది వందేళ్లుగా కొనసాగుతున్న భాషావివాదం కావచ్చు. ఇలా విదేశీ పదాలకు డు,ము,వు లు చేర్చి తెలుగు చేసేయడం మనకు ఎంత అలవాటయిపోయిందంటే ఆంగ్లంలోకి తెలుగులోకి వస్తున్న పదాలలో 60 శాతం పైగా ఇలా డుమువీకరణకు గురై భాషలో కలిసి పోతున్నాయి. ప్రపంచంలో ఏ భాష అయినా ఇంత భారీస్థాయిలో అన్యభాషాపదాలను పదాల చివర్లో అచ్చులు తగిలించి తనలో కలిపేసుకోవడం జరిగిందేమో మనకు తెలీదు. కానీ దీంట్లో కూడా ఒకేరకమైన ప్రయోగాలు లేవు. ఒకే పదానికి డుమువు చేర్చడం, చేర్చకుండా హలంతంతోనే తీసుకోవడం –ఉదా. ఆపాయింట్‌మెంటు – ఆపాయింట్‌మెంట్- ఒక్కో పత్రిక ఒక్కోలా ఈ పదాన్ని ప్రయోగించడం ద్వారా గందరగోళం. దీంతో ఎలా రాస్తే సరైంది, సరైంది కాదు అనేది బోధపడదు.

నోటీసు – నోటీస్
ప్లాంటు – ప్లాంట్

ఇలా వీటికి ఏక సూత్రత ఉండటం లేదు. ఒకే పత్రిక బిన్న సందర్భాల్లో ఈ రెండు పదాలనూ ప్రయోగిస్తూంటుంది.

అయితే
చానెల్, ఎపిసోడ్, సీరియల్, సీరీస్, భోగస్, హౌసింగ్, గ్రేడింగ్, టెక్నిక్, ఇండోర్, అవుట్‌డోర్, స్పెషల్, స్పెక్ట్రం, డిమాండ్, మార్కెట్, స్కామ్, ఫండ్, బిజినెస్, టర్మ్, డిపాజిట్, ఇన్వెస్టర్, సావనీర్, ఛైర్మన్, బ్రాయిలర్, ఇన్వెస్టర్ వంటి పదాలను దాదాపు హలంతాలతోనే -పదం చివరలో హల్లు చేర్చడం- ముగిస్తున్నారు.

ఇవీ ఈనాడు ప్రయోగాలే

ఈనాడులో డుమువులు
రిస్కు, నోటీసు, కోర్సు, రేటు, లేయరు, సిమెంటు, రిజర్వు బ్యాంకు,
పదం చివరలో అచ్చు చేర్చడానికి ఇవి ఉదాహరణలు


రిస్క్-రిస్కు, నోటీస్-నోటీసు, రేట్, రేటు, లేయర్-లేయరు, బ్యాంక్, బ్యాంకు వీటిలో ఏది వాడినా అర్థభేదం లేదు. కాని ఈనాడులో వీటికి డుమువులు తగిలించారు.

కాని ఇదే ఈనాడులో ‘మరోపుస్తకం రాస్తా: వై.వి.రెడ్డి’ అనే శీర్షికన నవంబర్ 28న బిజినెస్ విభాగంలో రాసిన వార్తలో గవర్నర్, గవర్నరు అంటూ హలంతం, ఉకారాంతాన్ని చేర్చి మరీ వాడారు. పదాల వాడకంలో ప్రామాణికతకు మారుపేరుగా గుర్తింపు పొందిన ఈనాడులోనే ఈ తేడాలు ఒకే వ్యాసంలో కిందా పైనా పంక్తులలో వచ్చి చేరుతున్నప్పుడు ప్రామాణికతకు అర్థం లేదనిపిస్తుంది.


ఇతర పేపర్లలో కూడా ఇలాంటి భిన్నప్రయోగాలతో కూడిన పదాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇలాంటి భాషా పద ప్రయోగాలు చూస్తున్నప్పడు ప్రామాణికతకు అర్థమే లేదని జనం రాసిందే భాష, జనం మెచ్చిందే భాష అనుకోక తప్పదు.

అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే నగరాల పేర్లలో కూడా పత్రికలు ప్రామాణికతను పాటించకపోవడం. ఉదా. తమిళనాడు నుంచి వచ్చే తెలుగు టాబ్లాయిడ్‌లలో తమిళనాడు రాజధాని పేరే రెండు రకాలుగా వాడబడుతోంది. ఈనాడు, సాక్షి పత్రికల్లో చెన్నై అని రాస్తే, ఆంధ్రజ్యోతి మొదటినుంచి చెన్నయ్ అని ప్రయోగిస్తోంది. మిగతా అన్ని నగరాల పేర్లను ఒకేలా రాసే తెలుగు పత్రికలు చెన్నయ్ లేదా చెన్నై విషయంలో వేర్పాటువాదానికి గురైపోయాయి.

ఇక మదురై అనే పదం విషయంలో కొనసాగుతున్న గందరగోళం అంతా ఇంతా కాదు. తమిళంలో మహా ప్రాణాలు –ఒత్తక్షరాలు- లేవు కాబట్టి ‘మదురై’ నగరానికి ఒత్తు లేకుండా పలకడం వారికి అలవాటు. కాని ద్రావిడభాషలన్నింటిలో లాగే అచ్చతెలుగులో కూడా మహాప్రాణాలు లేనప్పటికీ సంస్కృతప్రభావంతో ప్రతి అక్షరానికీ ఒత్తులు రాసే అలవాటు రాతలో స్థిరపడిపోవడంతో తమిళనాడునుంచి ముద్రిస్తున్న తెలుగు టాబ్లాయిడ్‌లలో చాలాసార్లు మదురై అనే రాస్తున్నప్పటికీ, కంట్రిబ్యూటర్ల స్థాయిలో పంపే వార్తలను ఎడిటింగ్‌ సమయంలో సరిదిద్దనప్పుడు మదురై, ఒత్తు కలుపుకుని మధురై అని ముద్రణ అవుతోంది. మనకు మధుర అనే పదానికి వత్తు తగిలించడం అలవాటే కాని తమిళులు చూశారంటే వాళ్ల ప్రాణం అలాగే పోతుంది. మనకేమో మధుర మీనాక్షి, వారకేమో మదురై మీనాక్షి. ఈ రెండు పదాల్లో అర్థ భేదం లేదు కాని, ఒక రాష్ట్ర భాషా సంప్రదాయాలను గౌరవించవలసిన పెద్ద సమస్య దీంట్లో దాగి ఉంది.

మొత్తం మీద చూస్తే తెలుగు భాషను బాల్యం నుంచి మనం నేర్చుకుంటున్నప్పుడు సాధారణ తెలుగు మనకు దరిదాపులలోకి రాదనే అనిపిస్తూంటుంది. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల ద్వారా ప్రభుత్వ తెలుగు నేర్చుకున్నాము. తర్వాత పత్రికలు, డిటెక్టివ్ నవలలు, ఇతర సాహత్యం ద్వారా ఒకరకం తెలుగును నేర్చుకున్నాము. ఆ తర్వాత యూనివర్శిటీ స్థాయిలో ఒకరకం తెలుగు ఉద్యోగాల్లో చేరుతూ వచ్చాక ముఖ్యంగా లోకలైజేషన్ పేరిట బహుళజాతి సంస్థల ఉత్పత్తులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే –స్థానికీకరణ- పనుల్లో చేరినప్పుడు నిజంగా మనకు ఉన్న మతి పోతుంది. నేను వెబ్‌దునియాలో పనిచేస్తున్నప్పుడు మైక్రోసాఫ్ట్, గూగూల్, రిలయన్స్, నోకియా, మోటారోలా తదితర ఉత్పత్తుల సాఫ్ట్‌వేర్‌లు మరియు యూజర్ మాన్యువల్స్‌ని అనువదించే బృహత్తర పనిలో నాలుగేళ్లు కొనసాగాను.

ఈ కంపెనీలు ఐటీ పదాలనే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా సూత్రీకరించి గ్లాజరీని తయారు చేసి అనువాదకులకు కాదు... కాదు.. లోకలైజర్‌లకు –స్థానికీకరణ కర్తలు- పంపేవి. డీఫాల్ట్ అనే పదాన్ని నాలుగు కంపెనీలు నాలుగు రకాలుగా నిర్వచించి గ్లాజరీలలో కూరిస్తే మేం వాటినే చచ్చినట్లు ఆయా క్లయింట్‌లకు చేసి పంపాల్సి వచ్చేది. సెంట్రల్ యూనివర్శిటీ స్థాయి వాలిడేటర్లను ఈ కంపెనీలు నియమించి వారి మాటనే ఫైనల్‌గా చేసేవి. వారు సూచించే పదాలు సందర్భానికి తగినట్లుగా కాకుండా రొడ్డకొట్టుడు పద్ధతిలో సాగటంతో వాటిని ఏ మాత్రమూ మార్చకుండా అలాగే చేసి పంపాల్సి వచ్చేది. భాష, భావం, సందర్భం రీత్యా కూడా ఈ పదం సరైంది కాదు అని మేం సూచించినా టీమ్ మొత్తంగా ఏకాభిప్రాయంతో మా అసమ్మతిని ప్రకటించినా వారి మాటే ఫైనల్. చివరకి గ్లాజరీలో అచ్చుతప్పులు ఉన్న విషయం కనిపెట్టి వాటిని రిమైండ్ చేసినా మార్చవద్దు అలాగే చేయండి అనే వారు.

ఆ నాలుగేళ్ల పనిలో మేం రకరకాల తెలుగు నేర్చుకున్నాం. ఆరు నెలలు మైక్రోసాఫ్ట్ తెలుగు, నాలుగు నెలలు గూగుల్ తెలుగు, 5 నెలలు నోకియా తెలుగు, మరి కొన్ని నెలలు రిలయన్స్, మోటారోలా తెలుగు నేర్చుకుంటున్నాములే అని చెప్పుకుని సమాధానపడేవాళ్లం. తెలుగు వాళ్ల అదృష్టం కొద్దీ ఈ గొప్ప గొప్ప సంస్థల ఉత్పత్తుల స్థానికీకరణలు వారి వద్దే ఉండిపోయి అటకెక్కిపోయాయి కాని అవి మార్కెట్లోకి పెద్ద ఎత్తున వచ్చి ఉంటే జనాలుకు తిక్క పట్టేది.

మనకు వచ్చే తెలుగే అంతంతమాత్రం అనుకునేటప్పుడు ఈ రకరకాల తెలుగు భాషల వాడకాలు మీద పడి ఏది సరైనదో, ఏది సరైంది కాదో కూడా తేల్చుకోవడం చాలా కష్టమైపోతుంది. ఈ ఐటీ పదాలు, పరిభాషలూ, పొట్టి పదాల విభజనలూ వచ్చి పడ్డాక తెలుగులో ఏ పదాలను కలిపి వాడాలో, వేటిని విడదీసి వాడాలో మొత్తంగా మర్చిపోతున్నాము. ఎందుకు కలపాలి, ఎందుకు విడదీయాలో తెలియనంత గుంజాటన.

ద్రావిడ భాషా కుటుంబంలో ఒకటిగా తెలుగుకు ఒక ప్రత్యేక లక్షణం ఉంది. మన భాషలో ఒకే పదం ఒక సుదీర్ఘ వ్యాక్యాన్ని స్పురిస్తుంటుంది
ఉదా: చేయాలనుకుంటున్నాను ( I want to do)
తెలుసుకోవాలనుంది (I want to know)
ఇలాంటివి కొన్ని వందల ప్రయోగాలు సమాజం వాడుతూ వచ్చింది. కానీ ఐటీ ఉత్పత్తులు, పత్రికల వాడుక పుణ్యమా అని మన భాష తన లక్షణాన్నే పోగొట్టుకుని పొట్టిపదాల సమాహారంగా మారిపోతోంది. చివరకు విభక్తి ప్రత్యయాలను కూడా పదం నుండి విడబెరికి మరీ రాస్తున్నారు.

జీవితమంతా ఎక్కడ ఉద్యోగంలో చేరితే అక్కడ అమలయ్యే భాషను, దాని ఫార్మాట్‌ను నేర్చుకోక తప్పదేమో అనిపిస్తూంటుంది. చివరకు పత్రికలు కూడా తమ తమ ఫార్మాట్‌తో కూడిన తెలుగును ఉపయోగిస్తున్నాయి. అందుకే చాలాసార్లు జోకులేసుకునేవాళ్లం. మనం ఈనాడు తెలుగు నేర్చుకోవాలా? ఆంధ్రజ్యోతి తెలుగు నేర్చుకోవాలా? లేదా ఇతర పత్రికల తెలుగు నేర్చుకోవాలా? ఇలా చర్చించి చర్చించి ‘మనకు అస్సలు తెలుగు రాదులే’ అని తేల్చేసుకుని ఎవరిదారిన వాళ్లం పోయేవాళ్లం.

చివరగా ఒకే ఒక ఉదాహరణ. మా చిన్నప్పటినుంచీ పీజీ చదువేంత వరకూ ‘ఉన్నది’ పదంతో పాటు ‘వున్నది,’ ‘వున్నాడు’ అనే ప్రయోగాలను కూడా విరివిగా వాడుతూ వచ్చాము. చిన్నప్పుడు కాని, పెద్దయ్యాక కాని ఎవ్వరూ మాకు ఈ రెండింటిలో ఒకటి తప్పు అని చెప్పలేదు. నేర్పలేదు. పైగా కథా రచయితలు, నవలా రచయితలు తమ రచనల్లో వున్నది, వున్నాడు, వుంది, వుండేది అనే ప్రయోగాలను కొన్ని వందలసార్లు వాడుతూ వచ్చారు. ఇప్పటికీ వాడుతూనే ఉన్నారు.

కానీ ఆన్‌లైన్, ప్రింట్ మీడియాలోకి అడుగుపెట్టాక ‘వు’కార ప్రయోగం నిషేధమైపోయిందని చాలా లేటుగా బోధపడింది. 30 ఏళ్లు నేర్చుకుని, రాస్తూ వస్తున్న పదం ఇప్పుడు ప్రింట్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు నిషిద్ధం అయిపోయింది. దీనికి ఈనాడు పదప్రయోగాల కర్తలే, దాని జర్నలిజం స్కూళ్ల ప్రిన్సిపాళ్లే ప్రధాన కారకులు తెలియవచ్చింది.

పత్రికాఫీసుల్లో, ఆన్‌లైన్‌లో ఉన్నప్పుడు పొరపాటున వున్నది, వుంది అని రాస్తే హత్య చేసినంత సీరియస్‌గా చూసేవాళ్లు. ఈ తరహా పదప్రయోగాలు పత్రికలకు ఎందుకు నిషిధ్దమైపోయాయి, వందలాది రచయితలకు, నాలాంటి పాతకాలం చదువులు చదువుకున్న వారికి ఇవి ఎందుకు నిషిద్ధం కాకుండా పోయాయి అనే విషయం ఎంత చించుకున్నా బోధపడేది కాదు. ఈనాటికీ ఇంతే. భాషను ఇలాగే రాయాలి, ఈ నుడికట్టుగళ్లలోనే పొందుపర్చాలి అనే నిరంకుశత్వం పత్రికలు ఎందుకు గుత్త తీసుకున్నాయి. పత్రికలే ఆధునిక గ్రాంధిక వాద సమర్థకులుగా తయారవుతున్నాయా అనిపిస్తుంది.

చివరకు కొన్న తరాల పిల్లలకు మంచి భాషను నేర్పినట్లు పేరుపడిన చందమామ పాత సంచికలలో కూడా ఈ వున్నది, వున్నాడు, వుంది ప్రయోగాలు చాలా సార్లు కనిపిస్తున్నాయి. పట్టి పట్టి చూస్తే కూడా వీటిని చందమామ కథల పత్రిక నిషేధించినట్లు, వదిలేసినట్లు నాకు కనిపించలేదు.

కొన్ని దశాబ్దాలుగా తెలుగు సమాజం, ప్రజలూ, రచయితలూ, నవలాకారులూ, కథకులూ వాడుతూ వచ్చిన ప్రద ప్రయోగాలు ఈనాడు తదితర పత్రికల నిరంకుశత్వం కారణంగా, ఆధునిక చిన్నయ సూరిల రుద్దుడు కారణంగా ఇప్పుడు పత్రికలలో ఉనికిలో లేకుండా పోయాయి. మొత్తం సమాజ వాడుకను తోసిపుచ్చిన ఈ దారుణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పత్రికలు వాడలేదు కాబట్టి, నిషేధించాయి కాబట్టి ఇలాంటి పదాలు తెలుగు పదాలే కాకుండా పోతాయా?

“ఆర్య వ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబు” ఇది మనం చిన్నయసూరి బాలవ్యాకరణంలో నేర్చుకున్న మాట. అంటే పూర్వకవులు తమ కావ్యరచనలలో తప్పులు రాసినా వాటిని ఒప్పులుగానే స్వీకరించాలి అని అర్థం. కావ్యరచనలలో శతాబ్దాల క్రమంలో జరుగుతూ వచ్చిన తప్పులను కూడా మనం స్వీకరించాలని చిన్నయసూరి చెబితే నెత్తిన పెట్టుకుని మోస్తున్నాం. కాని జనం వాడుకలో వందల, వేలసార్లు వ్యవహరించబడుతున్న పదాలను, వాడుకపదాలను నేటి పత్రికా నిరంకుశులు నిషేధిస్తే ఇదేమి న్యాయం అని అడగడానికి కూడా వీల్లేకపోతోంది.

శతక్కొట్టిన, వీరబాదిన వంటి డజన్లకొద్దీ అపభ్రంశ పదాలను వాడుకలోకి తీసుకురావడంలో పత్రికలదే ప్రధాన భాధ్యత. కానీ వీళ్లే ఇది వాడవద్దు, ఇలా రాయకూడదు అని నిరంకుశ రేఖలు గీస్తున్నారు.

ఇది న్యాయమేనా?

పత్రికల నిరంకుశత్వం నశించాలి.

ముఖ్యంగా భాష విషయంలో......

Saturday, December 4, 2010

లియో టాల్‌స్టాయ్ శతవర్ధంతి

లియో టాల్‌స్టాయ్ శతవర్ధంతి

“ప్రపంచమంతా, భూఖండమంతా ఆయనకేసి చూస్తోంది. ప్రతి చోట నుంచీ, చైనా నుంచీ, ఇండియానుంచీ, అమెరికా నుంచీ జీవనాడులు ఆయన్ను పెనవేసుకుని ఉన్నాయి. ఆయన ఆత్మ శాశ్వతంగా అందరికీ చెందుతుంది”
“ఈ మానవుడు ఇక్కడ జీవించినంత కాలం నేను ఈ లోకంలో అనాధని కాను.”
“ఈ మానవుడు దేవుడిలా ఉన్నాడు.”

ఒక విశ్వ శ్రేణి రచయిత -మాగ్సీం గోర్కీ- తన సమకాలీనుడైన మరొక విశ్వ శ్రేణి రచయితను -లియో టాల్‌స్టాయ్- ఉద్దేశించి చేసిన గొప్ప వ్యాఖ్యలివి. ఇప్పటికి వందేళ్ల క్రితం -20-11-1910- కన్ను మూసిన లియో టాల్‌స్టాయ్, ఈ ప్రపంచం చదవటం అనే అలవాటును మర్చిపోనంత కాలం గుర్తుంచుకోవలసిన మహనీయ సాహితీవేత్త. రష్యన్ ఉచ్ఛారణలో ఈయన పేరు లేవ్ నికొలాయెవిచ్ తోల్‌స్తోయ్. తెలుగు వాళ్లకు మాత్రం లియో టాల్‌స్టాయ్ అని పిలవడమే అలవాటయింది.

ప్రపంచం నలుమూలల నుంచీ ఆస్తికులు, నాస్తికులు, సాంప్రదాయికవాదులు, ధార్మికులు, విప్లవకారులు… నానా రకాల మనుషులూ ఆయన్ని గత వందే్ళ్లుగా గుర్తుపెట్టుకుంటూనే వస్తున్నారు. భిన్న సిద్ధాంతాలు, భిన్న ఆచరణలు, భిన్న విశ్వాసాలు కలిగిన వాళ్లు ఈ ప్రపంచంలో ఏ సాహిత్య కారుడినయినా తలమీది పెట్టుకుని వందేళ్లుగా ఆయన రచనలను ప్రపంచంలోని అన్ని భాషలలోనూ కళ్లకద్దుకుని చదువుతున్నారంటే ఆ అపురూప గౌరవం టాల్‌స్టాయ్‌కే దక్కుతుంది.

ఎందుకీ మానవ రూపంలోని మహర్షి పట్ల ప్రపంచానికి ఇంత ఆసక్తి? నీతినీ, న్యాయాన్నీ, చరిత్రనూ, సమాజాన్నీ, సాహిత్య సౌందర్యాల్నీ, తాత్విక శాస్త్ర వికాసాన్ని తాను పొందటమే కాకుండా ఈ అన్ని అంశాలనూ తన రచనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని ప్రసరించగలిగిన మేటి సాహితీకారుడీయన. అందుకే “ఆయన చనిపోతాడంటేనే భయమేస్తోంద”ని మరొక రష్యన్ విఖ్యాత కథకుడు చెహోవ్ అప్పట్లోనే అన్నాడు.

‘యుద్ధము – శాంతి’, ‘అన్నా కెరేనినా’, ‘నవజీవనం’, ‘కొసక్కులు’ వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అనేకానేక నవలల కర్త ఆయన. ఆధునిక జీవన చిత్రణకు అద్భుత పరికరమైన నవలలను, దేశదేశాల భాషల్లోకి అనువదించబడిన మరెన్నో కథలను రాసినాడు తోల్‌స్తోయ్. సమాజంపై సాహిత్యం, కళల ప్రభావాన్ని వివరించే ‘కళ అంటే ఏమిటి’ అనే గ్రంధాన్ని కూడా రాశారు.

ప్రపంచంలో దాదాపు ప్రతి భాషలోకీ అనువాదమైన, ఇప్పటికీ కథా ప్రేమికులు చదువుకుంటూ వస్తున్న ‘మనిషికెంత నేల కావాలి?’, ‘విందు తర్వాత,’ -ఇవి రెండూ తెలుగులోనూ వచ్చాయి- ‘పాదర్ సెర్జియస్,’ ‘యజమాని, అనుచరుడు’ వంటి అజరామర కథలను ఆయన కలం వెలువరించింది. ఇకపోతే ‘నీలోనే దేవుని రాజ్యం ఉన్నది,’ ‘ఒప్పుదల’, ‘నా నమ్మకాలు’, ‘ప్రేమ సిద్ధాంతము, హింసా సిద్దాంతము’ -The law of Love and the law of Violence- వంటి భావస్ఫోరక వ్యాసాలు ఎన్నో రాశాడు.

తోల్‌స్తోయ్ సాహిత్య ప్రభావానికి క్రూర నిరంకుశ రష్యన్ జైళ్లలో కొన్ని సంస్కరణలు జరిగాయి. జీవితం చివరివరకూ తన్ను తాను ఆదర్శ మతధార్మికుడిగానే నిలిచి ఉన్న టాల్‌స్టాయ్, మరోవైపున స్వయంగా దోపిడీదారులుగా మారిపోయిన మతాధిపతులనూ, ధనికుల దోపిడీకి వత్తాసుగా మతాన్ని నిలిపిన మతాధికారులనూ తీవ్రంగా నిరసించాడు. తన రచనల ద్వారా రష్యన్ ప్రాచీన చర్చిమీద పోరాటాన్ని ఎక్కుపెట్టడమే కాకుండా, క్రైస్తవంలోని మూఢాచారాలమీదా, స్వార్థపర మతాచార్యుల మీదా తిరుగుబాటు చేస్తూ రచనలు కొనసాగించాడు. కానీ వ్యక్తిగత మత విశ్వాసాలను మాత్రం ఆయన వ్యతిరేకించలేదు.

‘అరాచకవాద’ క్రైస్తవం ఆయన రచనలపై అమిత ప్రభావాన్ని కలుగ జేసింది. అధికార చర్చి భావాలనూ, అర్థం పర్థం లేని నిబంధనలనూ, రాచరికాన్నీ, రాజ్యాధిపత్యాన్నీ, వ్యక్తిగత ఆస్తినీ వ్యతిరేకించేదే ఈ ‘అరాచకవాదం’. ఈ అరాచక వాదం ప్రభావంతోటే, లెనిన్ సోదరుడు రష్యన్ చక్రవర్తి జార్ నికోలస్‌పై హత్యాప్రయత్నానికి పాల్పడి ఉరికంబమెక్కిన విషయం తెలిసిందే.

ఈ అరాచకవాద ఆదర్శాలతోటే తోల్‌స్తోయ్ తన జమీందారీ పద్ధతులకు భిన్నంగా తన అలవాట్లను పూర్తిగా మార్చుకున్నాడు. ఆనాటికి ఈయనకు వారసత్వంగా సంక్రమించిన సంపద తల్చుకుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి. మాస్కోకు 150 కి.మీ. దూరంలోని తులా రాష్ట్రంలోని మారుమూల కుగ్రామంలో ఆయనకు వచ్చిన పిత్రార్జిత సంపద ఎంతో తెలుసా? 15000 ఎకరాల భూమి మాత్రమే. పదిహేనువేల ఎకరాల రష్యన్ ప్రభు వర్గీయుడు ‘మనిషికెంత నేల కావాలి’ అనే కథ రాసి, చనిపోయాక ఆరడుగులు చాలు అనే ముగింపు నివ్వడమే ఒక చారిత్రక అభాస కాగా, ఆ అభాసకు ఆయన నడివయస్సులో తలెత్తుకున్న అరాచకవాద ఆదర్శాలే కారణం.

అరాచకవాదం పునాదిగా ఆయనలో పెరిగిన ఆదర్శాలు ఆయన జీవిత పునాదిని తలకిందులు చేశాయి. పొగతాగడం, మద్యసేవనం, మాంసాహారం వంటి అలవాట్లను వదిలేశాడు. ఈ 15 వేల ఎకరాల కుర్ర జమీందారు తన ఆదర్శాల సాక్షిగా సామాన్య రైతు దుస్తులు ధరిస్తూ, సాధ్యమైనంత వరకు తన శ్రమమీదే ఆధారపడి జీవించసాగాడు. తన దుస్తులు తానే ఉతుక్కునేవాడు. తన చెప్పుల్ని తానే కుట్టుకునేవాడు. ఇంద్రియ నిగ్రహానికి కూడా పూనుకున్నాడు.

క్లుప్తంగా జీవితం…
18, 19 శతాబ్జాలలోని రష్యా కులీన కుటుంబాలలో లియో టాల్‌స్టాయ్ వంశీకులదీ ఒకటి. 18వ శతాబ్దిలో ఈయన ముత్తాతను పీటర్ ది గ్రేట్ కౌంట్ బిరుదుతో సత్కరించాడు. ఆ విధంగా ఈ వంశీకులకు జార్ చక్రవర్తి దర్బారుతో సన్నిహిత సంబంధాలేర్పడ్డాయి. తులా రాష్ట్రంలో 1828లో టాల్‌స్టాయ్ జన్మించాడు. తండ్రి పదిహేను వేల ఎకరాల భూస్వామి. బాల్యంలోనే తల్లిదండ్రులు మరణించినప్పటికీ టాల్‌స్టాయ్ సుఖభోగాలకేమీ లోటు రాలేదు. ప్రయివేట్ ట్యూటర్ల వద్ద విద్యాభ్యాసం, తర్వాత కజాన్, పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయాల్లో చదివినా చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో ఎక్కడా డిగ్రీ రాలేదు.

యవ్వనం తొలిరోజుల్లోనే హై సొసైటీలో ప్రవేశించిన టాల్‌స్టాయ్ అందగాడు కానప్పటికీ ఫ్యాషన్ దుస్తులపై మోజు. కోపిష్టి, అందరితో పోట్లాటలు. ధనవంతులకు కాలక్షేపంగా ఉండే తాగుడు, జూదం, స్త్రీ లాలసత్వం, ఎప్పటి కప్పుడు జేబులు ఖాళీ అయ్యేవి. కాని డబ్బులకు మాత్రం కొదవలేదు.

ఇరవయ్యో మూడో ఏట అన్న ప్రోత్సాహంతో సైన్యంలో చేరిక, తోటి సైన్యాధికారులతో వ్యసనాలు. విశృంఖల జీవితం ద్వారా సిఫిలిస్ సుఖవ్యాధి కానుకగా లభించింది. అయితే ‘ఈ విలాసాలు నా వ్యక్తిగత బలహీనత కాదని, మావంటి ధనికులకిదొక స్టేటస్ సింబల్ కూడా’ అని ఓ సందర్భంలో డైరీలో రాసుకున్నాడు కూడా.

మానుకోలేని అలవాట్ల పట్ల నెమ్మదిగా పశ్చాత్తాపం, ఆత్మవిమర్శ పెరిగింది. 1854లో క్రిమియన్ యుద్ధం జరిగేటప్పటికి సైన్యంలో లెప్టినెంట్ పదవికి ప్రమోషన్ వచ్చింది. కానీ ఆ జీవితం మోహం ఎత్తడంతో రిటైర్మెంట్ తీసుకుని యూరప్‌లో పర్యటించాడు. అప్పటిదాకా రాసిన స్కెచెస్‌, కోసక్కులు అనే కథా సంకలనం ప్రచురించాడు.

ఉద్యోగ విరమణ తర్వాత యాస్నాయా పొల్వనా -తన కుగ్రామం- కు తిరిగొచ్చాడు. అప్పటికే 34 ఏళ్లు. విచ్చలవిడితనం పట్ల విసుగెత్తిపోయాడు. పెళ్లి చేసుకుని స్థిరపడాలనే కోరిక ప్రబలం కావటంతో డాక్టర్ బెర్స్ అనే ప్రముఖ వైద్యుడి కుమార్తె 18 ఏళ్ల సోన్యాని పెళ్లాడాడు. ఆమె పొదుపరి. చాలా కాలం సుఖజీవనం. మొత్తం 13 మంది పిల్లలు. ఎస్టేట్‌ మరో వెయ్యెకరాలు పెరిగింది.

యవ్వనంలో టాల్‌స్టాయ్ నిరీశ్వరవాది. యుద్ధము-శాంతి నవల తర్వాత మార్పు ప్రారంభమైంది. మత విశ్వాసాలు పెరగలేదు కాని ఈ సర్వసృష్టికీ మూలకారణమే దేవుడు అనుకున్నాడు. జీసస్‌ని పూజ చేయడం కాదు. అలాగా బతకాలి, ఈ లోకంలో చెడు ఉన్నది కాని దానికి చెయ్యి అడ్డుపెట్టనవసరం లేదు, అన్నాడు. జరిగేదేదో జరగనీ.

ఈ విశ్వాసాల పరిణామంగా జీవిత పద్ధతి కూడా మారింది. వ్యక్తి సమస్యలన్నింటికీ పరిష్కారం శారీరక శ్రమలో ఉందని భావించాడు. తన ఎస్టేట్ యాస్నాయా పోల్వానాలో కట్టెలు కొట్టడం, పొలం దున్నటం వంటి పనులన్నీ చేశాడు. నీవంటి గొప్ప రచయిత ఇలా తనకు సంబంధించని విషయాల్లో తలదూర్చి కాలయాపన చేయాలా, అంటూ నిరసన తెలిపింది భార్య.

ఈ లోకంలో దోపిడీకి, అసమానతలకు మూలం స్వంత ఆస్తి అన్నది తదుపరి దశ. టాల్‌స్టాయ్ వంటి వ్యక్తులు విశ్వాసానికి ఆచరణకూ తేడా చూడరు. కాని భార్య అడ్డుపడింది. “ఉన్నదంతా దానం చేస్తే పదముగ్గురు పిల్లలతో తనెక్కడికి పోవాలి? వాళ్ల చదువులు, పోషణ ఎవరు చే్స్తారు?” ఆమె పోరు పడలేక ఆస్తిని భార్యా, పిల్లల పేర రాశాడు.

అంతకంతకూ రచయితగా, తాత్వికుడిగా టాల్‌స్టాయ్ ప్రభావం రష్యన్ సమాజంమీదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేధావుల్లో, శాంతి కాముకుల్లో, సంస్కర్తల్లో కూడా పెరిగింది. ఆయన బోధనలు, సిద్ధాంతాలకు అనుగుణంగా కాలనీలు, కమ్యూన్‌లు, ఆశ్రమాలు ఏర్పడ్డాయి. దక్షిణాఫ్రికాలో గాంధీ కూడా టాల్‌స్టాయ్ ఆశ్రమం స్థాపించి ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు.

అయితే జీసస్‌లాగా, సాటి మనిషిని ప్రేమించమని చెప్పిన మనిషి, తన భార్యా పిల్లల్ని విస్మరించాడు. భూస్వామ్య కులీన వర్గాలలోని డాంబికం, హోదాలకోసం పాట్లు, కృత్రిమ జీవితం తన స్వంత జీవితం నుంచి కూడా ఆయనను అవతలికి నెట్టాయి. దానికి తోడు ఆస్తి వ్యవహారాలపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఆదాయానికి గండిపడడం కుటుంబ జీవితంలో మరిన్ని ఘర్షణలకు తావిచ్చింది.

దీంతో 1881కి ముందు ఆయన రాసిన రచనల హక్కులను తన పేరున రాయించుకున్న భార్య సోన్యా స్వంతంగా ప్రచురణ ప్రారంభించి ఆదాయం సంపాదించడం, తన పుస్తకాలు ధనసంపాదనకు మార్గం కావడం టాల్‌స్టాయ్‌కి కోపం తెప్పించింది. దీంతో 1881 తర్వాత తను రాసిన పుస్తకాలపై ఎవరికీ కాపీరైట్ లేదని ప్రకటించేశాడు. ఇది చాలదన్నట్లుగా గతంలో భార్య పేర రాసిన హక్కుల్ని వాపసు తీసుకున్నాడు. ఇంటి పోరు పరాకాష్టకు చేరింది. రెండో కూతురి ప్రేమసంబంధం విచ్ఛిన్నమయిన ఘటన భార్యాభర్తల మధ్య మరింత అఖాతం సృష్టించింది.

తన 82వ ఏట 1910లో జీవితం మీద విరక్తి కలిగిన టాల్‌స్టాయ్ ఇంటినుంచి బయలు దేరి కుంభవర్షంలో రైలుప్రయాణం చేశాడు. భార్యకు తన జాడ తెలియకూడదని చెప్పకుండా బయలుదేరి షమార్డి స్టేషన్‌లో విశ్రాంతి కోసం దిగినప్పుడు జలుబు జ్వరం పట్టుకుంది. ఈ వృద్ధ ప్రయాణీకుడెవరో అప్పటికే తెలిసిపోయింది. అస్టాపోవో స్టేషన్‌లో రైలు ఆపిన కొద్ది గంటల్లోనే టాల్‌స్టాయ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా వార్తా ప్రసారాలు, వందలాది జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు ఆ కుగ్రామంలోని రైలు కంపార్ట్‌మెంట్లనే తమ కార్యాలయాలుగా మార్చుకుని వార్తలు పంపారు.

ఆ చివరి క్షణాల్లో ప్రభుత్వాధినేతలు, ప్రధానమంత్రులు టాల్‌స్టాయ్ గురించి వాకబు చేసారు. నవంబర్ 20 ఆదివారం ఉదయం ఆరింటికి టాల్‌స్టాయ్ ఈ లోకం నుంచి మహాభినిష్క్రమణం చేశారు. నోబెల్ ప్రైజ్ అందుకోలేనంత మహోన్నతుడు; జీసస్‌లాగా జీవించాలని, పూజించవద్దని ప్రపంచాన్ని అభ్యర్థించిన సాధుశీలి; హింస, అహింస ఆచరణలపై ప్రపంచ వ్యాప్త చర్చకు దారితీసిన మహా రచనలు చేసిన రుషితుల్యుడు తన జీవన యాత్ర ముగించారు.

అన్నిటికంటే ముఖ్యంగా రష్యన్ సాహిత్యాకాశంలో ధృవతారగా మిలమిలలాడుతున్న టాల్‌స్టోయ్ బోధనల సారాంశాన్ని నాటి రష్యా విప్లవ ప్రజానీకం, మేధో ప్రపంచం పరిత్యజించింది. కాగా, చెడు ఉంటే పట్టించుకోకు, అలా వదిలేయి జరిగేది జరుగుతుంది అని బోధించే ఆయన ఆరాజకీయ, అప్రతిఘటనా సూత్రాలు గాంధీ గారి చేతిలో అహింసా పోరాటంగా మారి నిరాయుధ ప్రతిఘటనతో భారత రాజకీయాలను కొత్త మలుపు తిప్పాయి. దాని మంచి చెడ్డలను మరోసారి బేరీజు వేసుకుందాం.

ఆధునిక మహిళల పొలికేక అన్నా కరేనినా..
‘ఆడది మగవాడికంటే భౌతికంగా ఎక్కువ నిజాయితీతో ఉంటుంది.. ఆమె అబద్దం ఆడినప్పుడు తనే నమ్మదు..’ అని ఒక సందర్భంలో గోర్కీ వద్ద ప్రస్తావించిన టాల్‌స్టాయ్, ఆధునిక ప్రపంచ సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటిన మహోన్నత నవల ‘అన్నా కరేనినా’ రచనతో ఆనాటి సాహిత్య ప్రపంచంలో పెను సంచలనం కలిగించాడు.

వివాహేతర సంబంధాల విషయంలో స్ర్రీకొక న్యాయం, పురుషుడికొక న్యాయం నగ్నంగా శతాబ్దాలుగా చెలామణీ అవుతున్న భయంకర సత్యం ఈ నవల ఆవిర్భావంతో పెను కుదుపుకు గురైంది. ద్వంద్వ విలువలు రాజ్యమేలుతున్న వ్యవస్థలో భర్తలపై ఎంత అసహ్యం పుట్టినా, ఆర్థిక భారంతో పిల్లల్ని ఒంటరిగా పెంచలేక, సమాజంలో రక్షణ లేక భార్యలు తమ అసహ్యాల్ని దిగమింగుకుని ఎలాగో కాపురాలు చేస్తూ వస్తున్న ప్రపంచవ్యాప్త సామాజిక దౌష్ట్యాన్ని తీవ్రంగా నిరసిస్తూ టాల్‌స్టాయ్ దాదాపు 150 ఏళ్ల క్రితమే అన్నా కరేనినా నవలలో చిత్రించాడు.

స్త్రీలకు జరుగుతూ వస్తున్న అన్యాయాలను అన్యాయాలుగా చూడ్డానికే పూర్వకాలం నుంచీ ఈ సమాజం నిరాకరించింది. కనీసం ఇప్పుడంటే ఈ విషయాన్ని చర్చిస్తూ ఎంతో సాహిత్యం వస్తోంది కాని వందేళ్ల క్రితం అలాంటి ప్రయత్నమే ఊహించడానికి వీల్లేనట్లుగా ఉండేదంటే, ప్రపంచంలోని యావత్తు నాగరిక సమాజాలన్నింటిలోనూ స్త్రీల స్థితి ఎంత దుర్దశలో ఉన్నదీ గ్రహించవచ్చు. కానీ 150 ఏళ్ల కిందటే స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తూ ప్రపంచ సాహిత్యంలోనే మొదటి సారిగా ఒక సాహసోపేత ప్రయత్నం జరిగిందంటే అదెంత విప్లవాత్మకమైన ఆలోచనో మనం ఊహించవచ్చు.

సమాజంలో తనకు కనిపించిన ప్రతి దురన్యాయాన్నీ గమనించి ప్రశ్నించినట్లుగానే, ఈ విషయంలోనూ ప్రశ్నిస్తూ, ఎత్తిచూపుతూ ఒక గొప్ప కళాత్మకవైభవంతో, అపరూప శిల్ప విన్నాణంతో ఓ బృహన్నవలారాజాన్ని టాల్‌స్టాయ్ రచించగానే ఆయన ఇతర రచనలకు లాగానే ఈ నవల కూడా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

ఒక సంపన్న రష్యన్ కులీన కుటుంబంలో అన్నా వివాహేతర సంబంధం, దానివల్ల కలిగిన పరిణామాల చుట్టూ తిరిగే ఈ నవల 19వ శతాబ్దంలో రష్యాలోని సాంఘిక పరిస్థితులు, రాజకీయాలు, మానవ, కుటుంబ సంబంధాల చర్చించే విస్తృత వేదికగా నిలిచింది. వివాహిత అయిన అన్నా వివాహేతర ప్రేమలోకి వెళ్లి, విఫల ప్రేమికురాలై రైలుకింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం అన్యాయ సమాజం ముందు ఓ మహిళ ఎలుగెత్తి చాటిన పొలికేక.

ప్రపంచంలో, వివాహేతర సంబంధం అనేది పురుషులకు ఒక ఘనవిజయంగానూ, విస్మరించదగిన చిన్న దోషంగానూ, స్త్రీలకు మాత్రం క్షమించరాని ఘోర అపరాధపు విలువగా కొనసాగినంత కాలం, అన్నా 150 ఏళ్ల క్రితం పెట్టిన ఆ పొలికేక సమాజానికి మంట పెడుతూనే ఉంటుంది.

టాల్‌స్టాయ్ సత్యాహింసల గురించి, రష్యన్ విప్లవం, భారత స్వాతంత్ర్య సంగ్రామంపై ఆయన ప్రభావం గురించి మరో కథనంలో తల్చుకుందాం.

(సరిగ్గా వందేళ్ల క్రితం ఈ రోజునే 20-11-1910 కన్నుమూసిన టాల్‌స్టాయ్ శత వర్ధంతి సందర్భంగా ప్రజాసాహితి నవంబర్ సంచికను ప్రత్యేక సంచికగా తీసుకువచ్చింది. శైలి మినహాయిస్తే ఈ కథనం మొత్తానికి ఈ ప్రత్యేక సంచికే వనరు అయింది. టాల్‌స్టాయ్‌ని ఆన్‌లైన్ పాఠకులకు మరోసారి గుర్తు చేయాలనే ప్రయత్నంలో సహకరించిన ప్రజాసాహితి ప్రత్యేక కథనాలకు కృతజ్ఞతలు.

కొసమెరుపు. ఈ రోజు మీరు ఖాళీగా ఉంటే, మీవద్ద ఇప్పటికే టాల్‌స్టాయ్ రచనలు ఉండిఉంటే వాటిలో ఏదో ఒక భాగం చదవండి. అసలే టైం లేదనుకుంటే కనీసం ఆయన రాసిన ‘మనిషికి ఎంత నేల కావాలి?’ ‘విందు తర్వాత’ అనే అద్భుతమైన కథలనయినా చదవండి. పాతికేళ్ల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్లు టాల్‌స్టాయ్ కథలను 'విందుతర్వాత' అనే పేరుతోనే అనుకుంటాను… చిన్న పుస్తకంగా వేశారు. లేదా చిన్న పిల్లలకోసం ఆయన రాసిన గొప్ప కథలనయినా మీ పిల్లలకు చదివి వినిపించండి.

మానవరూపంలో అవతరించిన ఈ దేవుడిని ఇలాగే తల్చుకుందాం. ఇలాగే నివాళి పలుకుదాం.

November 20th, 2010న చందమామ బ్లాగులో ప్రచురించబడింది.

టాల్‌స్టాయ్ | Edit | Comments (3)

3. Responses to “లియో టాల్‌స్టాయ్ శతవర్ధంతి”

1. దాసరి వెంకటరమణ on November 22, 2010 4:15 PM Edit This
లియో టాల్‌స్టాయ్ గురించిన మీ కథనం అద్భుతంగా వుంది. ప్రజాసాహితి నవంబర్ సంచిక నేను చదివాను. మీ కథనం ఆ సంచికలోని టాల్‌స్టాయ్ గురించిన వివరాలకు సంక్షిప్తీకరణ అని చెప్పవచ్చు.

టాల్‌స్టాయ్... ఈ ప్రపంచం చదవటం అనే అలవాటును మర్చిపోనంత కాలం గుర్తుంచుకోవలసిన మహనీయ సాహితీవేత్త. నీతినీ, న్యాయాన్నీ, చరిత్రనూ, సమాజాన్నీ, సాహిత్య సౌందర్యాల్నీ, తాత్విక శాస్త్ర వికాసాన్ని తాను పొందటమే కాకుండా ఈ అన్ని అంశాలనూ తన రచనల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని ప్రసరించగలిగిన మేటి సాహితీకారుడీయన.
అక్షరాల నిజం.

జీసస్‌లాగా జీవించాలని, పూజించవద్దని ప్రపంచాన్ని అభ్యర్థించిన సాధుశీలి;
టాల్‌స్టాయ్ సాహిత్య ప్రభావానికి క్రూర నిరంకుశ రష్యన్ జైళ్లలో కొన్ని సంస్కరణలు జరిగాయి.
చాలా గొప్ప విషయం.

చదువు మీద శ్రద్ధ లేకపోవడంతో ఎక్కడా డిగ్రీ రాలేదు.
నిజమే మహాను భావులంతా అలాగే వుంటారేమో శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు మూడో తరగతిలోనే లెక్కల మాస్టరుకు భయపడి చదువు మానేసి పారిపోయారు. ఇప్పుడు ఇన్ని వేల మంది హృదయాల్లో స్థానం సంపాదించారు.

'అస్టాపోవో స్టేషన్‌లో రైలు ఆపిన కొద్ది గంటల్లోనే టాల్‌స్టాయ్ గురించి ప్రపంచ వ్యాప్తంగా వార్తా ప్రసారాలు, వందలాది జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు ఆ కుగ్రామంలోని రైలు కంపార్ట్‌మెంట్లనే తమ కార్యాలయాలుగా మార్చుకుని వార్తలు పంపారు.'
ఆ కాలంలో కూడా జర్నలిస్టుల పరిస్థితి అలాగే వుందన్న మాట.

‘ఆడది మగవాడికంటే భౌతికంగా ఎక్కువ నిజాయితీతో ఉంటుంది.. ఆమె అబద్దం ఆడినప్పుడు తనే నమ్మదు.. ప్రపంచంలో, వివాహేతర సంబంధం అనేది పురుషులకు ఒక ఘనవిజయంగానూ, విస్మరించదగిన చిన్న దోషంగానూ, స్త్రీలకు మాత్రం క్షమించరాని ఘోర అపరాధపు విలువగా కొనసాగినంత కాలం, అన్నా 150 ఏళ్ల క్రితం పెట్టిన ఆ పొలికేక సమాజానికి మంట పెడుతూనే ఉంటుంది.'
ఇది చాల ఉత్కృష్టమైన భావం.

ఆయన చిన్న పిల్లల సంభాషణల్లో (యుద్ధం, మతం, పన్నులు ) వంద సంబత్సరాల క్రితమే అంతటి పరిణతి వుందంటే నమ్మలేం. చలం గారి దొంగలున్నారు జాగ్రత్త, పెళ్లి ముస్తాబు, పుట్టిన పండుగ, వినాయక చవితి, డబ్బు, మొదలైన రచనలలోనూ, నరసింహావతారం లో ప్రహ్లాదుని సంభాషణల్లో, ఈ తరహ పిల్లల తెలివి తేటలు ప్రష్పుట మౌతవి.

‘మనిషికెంత నేల కావాలి?’, ఈ కథ తెలుగులో చాలా మంది అనువాదం చేసి వుండ వచ్చు. కాని ఈ కథ కేంద్ర బిందువును తీసుకొని అనేక మంది అనేక విధాలుగా కథలను మలచారు. అలాంటి కథ ఒకటి నేను చదివాను. నాకు గుర్తు వున్నంత వరకు చెబుతాను. బహుశ చందమామ లోనే అనుకుంటాను.

ఒక చోట సముద్రంలో రత్నాలు దొరుకుతుంటవి ఒక ధనవంతుడు కూలీలను పెట్టి వెతికిస్తుంటాడు. వాళ్లకు ఏమి దొరికితే దానిని ధనవంతుడికి ఇవ్వాలి. వాళ్ళ కూలి రోజుకు ఇరవై వరహాలు. రత్నాలు దొరికిన దొరుకకున్నా కూలి ఇవ్వాల్సిందే. ఇలా వుండగా ఒకడికి ఒక అమూల్యమైన రత్నం దొరుకుతుంది. దాని వేల ఎవరూ కట్టలేరు. దానిని ఇరవై వరహలకు ధనవంతుడికి ఇవ్వడం ఇష్టంలేక అతడిని మోసం చేసి రాజు గారికి చూపిస్తే. రాజుగారు తన ధనాగారం నుండి. ఒక రోజు అతడు మోయగాలిగినంత ధనం తీసుకు పొమ్మంటాడు. కానీ ఒక షరతు సూర్యాస్తమయం తర్వాత ధనాగారం లో కనబడితే వురి తీస్తానంటాడు. వాడు మధ్యాహ్నం వరకు ఎడ్ల బండ్లు కిరాయికి మాట్లాడుకోవడం, గోనే సంచులు తాయారు చేసుకోవడం మొదలైనవి చేసాడు. తర్వాత ధనాగారం వచ్చి ఒక్కో సంచి నింపడం మొదలుపెట్టాడు. చాల సంచులు నింపాడు. అలా నింపుతూనే వున్నాడు. సాయంత్ర మైంది. నింపు తూనే వున్నాడు. చీకటి పడబోతుంది. భటులు హెచ్చరిస్తూనే వున్నారు. ఇక సూర్యాస్తమయానికి ఇక కొద్ది ఘడియల వ్యవధి మిగిలి వుంది. ఒక సంచి మోయ లేక మోయలేక గుంజుకు రాసాగాడు. చాల కష్టమైంది. భటులు ధనాగారం తలుపులు మూయ సాగారు. ఇక లాభం లేదు. ఒక్క క్షణంలో బయటికి వెళ్లక పొతే ప్రాణానికే ప్రమాదం. అక్కడ ఒక సంచిలో వున్నా వరహాలను రెండు పిడికిళ్ళ నిండా తీసుకొని ఒక్క దుముకున ధనాగారం బయట పడ్డాడు. భటులు తలుపులు మూసేసారు. రెండు పిడికిళ్ళ వరహాలు లెక్క పెడితే సరిగ్గా ఇరవై వరహాలు వున్నై.

మీరు పరిచయం చేసిన తీరు బావుంది అభినందనలు

2. చందమామ on November 22, 2010 5:05 PM Edit This

శ్రీ వెంకట రమణ గారికి
నమస్కారం.
మొదట్లోనే చెప్పాను ఈ పెద్ద కథనంలో శైలీ పరమైన మార్పులు, అక్కడక్కడా వ్యాఖ్యానాలే నావి తప్పితే మొత్తం విషయం ప్రజాసాహితి నుంచి తీసుకున్నదే ఆధారం. గత గురువారం రాత్రి ప్రజాసాహితి ఆ సాంతంగా చదివాను. అంతలోనే 20వ తేదీనే టాల్‌స్టాయ్ శత వర్థంతి అని గుర్తుకొచ్చింది. ఉన్న విషయాన్నే ఆన్‌లైన్ పాఠకులకు వివరంగా పరిచయం చేద్దామనే తలంపుతో శుక్రవారం ఆఫీసులోనే కసరత్తు చేసి శనివారం మధ్యాహ్నానికి సిద్ధం చేయగలిగాను. అయితే చాలా సమయం తీసుకుంది సాపు చేయడానికి. చందమామకు సంబంధించినది కానప్పటికీ మీరు ఇంత ఓపికగా ఈ కథనం ఆసాంతం చదివి విలువైన వ్యాఖ్య పెట్టారు. ఒక్క సారిగా సేద దీరినట్లుగా ఉంది.

ఒక చేదు వార్త ఏమటంటే నిన్నా మొన్నా పత్రికలలో చదివాను. రష్యాలో టాల్‌స్టాయ్ శత వర్థంతి అనే అంశాన్ని ఇటు ప్రభుత్వమూ, అటు ప్రజానీకమూ కూడా ఏమాత్రమూ పట్టించుకోలేదట. నాకు బాధ కన్నా ఒకటనిపించింది. రష్యా ఎంతగా మారిపోయింది. ఎంతగా భ్రష్టుపట్టిపోయింది అంటే ఇంకా బాగుంటుందేమో.. ప్రపంచం మొత్తానికి ప్రస్తుతం కాల్ గర్ల్స్‌ని సరఫరా చేస్తున్న ఆ ‘గొప్ప’ దేశానికి ఇంత ‘చిన్న’ వ్యక్తి ఎలా కనిపిస్తాడు లెండి ఇప్పుడు.

ఏమయినా ఇంత మంచి కామెంట్‌ని ఇంత రాత్రి పూట ఓపిగ్గా పోస్ట్ చేశారు.
మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

3. kalpanarentala on November 22, 2010 11:16 PM Edit This
సరైన సమయానికి మీరు రాసిన వ్యాసం, దాసరి గారు ఎంతో శ్రద్ధగా పెట్టిన కామెంట్ రెండూ బావున్నాయి. ప్రజాసాహితి నేను చూడలేదు కాబట్టి చెప్పలేను కానీ మీరు ముఖ్యమైన పాయింట్లు కవర్ చేశారు. అయితే కొన్ని విషయాల్లో ఆయన లైఫ్ గురించి సందేహాలున్నాయి. కొంత తీరిక చిక్కగానే వీలైతే నేను వ్యాసం రాసినప్పుడు ఉదహరిస్తాను. ఇక అనాకేరినీనా గురించి…మాత్రం అక్షరలక్షల్లాంటి మాటలు చెప్పారు. దాని మీద కూడా నా ప్రత్యేక వ్యాసం వీలైనంత తొందర్లో రాస్తాను. అన్నింటిని మర్చిపోతున్న తరంగా బతికేస్తున్నప్పుడు ఇలాంటి వ్యాసాలుమన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయి. అలా గుర్తు చేసినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు.
కల్పనారెంటాల

మా తెలుగు బాల్యానికి ధన్యవాదాలు

రాష్ట్రావతరణ దినోత్సవానికి సరిగ్గా వారం రోజుల క్రితం ఈ వాక్యం రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ దుమ్ము దులిపింది. “ఐ నెవర్ స్పీక్ తెలుగు” మీడియా మితిమీరిన అతిశయోక్తికి తోడుగా ఈ సత్యాన్ని ఇప్పుడే తాము కనిపెట్టినట్లుగా ప్రతి టీవీ యాంకరన్నా. యాంకరమ్మా ఆ మైదుకూరు స్కూల్‌తో ఆటాడుకున్నారు. ఇంగ్లీషు మాట విరుపులు లేనిదే ఒక పదం సరిగా పలకలేని ఈ గురువింద గింజల సంగతి అలా పక్కన పెడితే.. మా అనుభవంలో ఉన్న సంగతులు కొన్ని పంచుకోవాలనుకుంటున్నాను.

ఓ రకంగా మా తరం వాళ్లం అదృష్టవంతులమే (?) అని చెప్పాలి. ఇది 1970ల నాటి మాట. ఆరోజుల్లో అందరు పల్లె పిల్లల మాదిరే మేమూ తెలుగు బళ్లోలోనే చదువుకున్నాము. 6 నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలోనే చదువుకున్నాము. తెలుగులో చదువుకున్నందుకు మేమే రోజూ సిగ్గుపడలేదు.

మా బంధువుల పిల్లలు హైదరాబాదు, ఢిల్లీలలో చదువుకుంటూ వేసవి సెలవుల సందర్భంగా ఊర్లకు వచ్చినప్పుడు వారితో సంభాషణలు జరిపేటప్పుడు వారి ఆంగ్ల ఉచ్చారణ, నాగరికపు భాష మాలో కాస్త ఆసక్తి కలిగించినప్పటికీ లోక వ్యవహారాలు, సామాన్య జ్ఞానానికి సంబంధించి వారికంటే మాకే కాస్త ఎక్కువ జ్ఞానం ఉన్నట్లు రుజువు చేసుకుని సంతోషపడ్డామే తప్ప ఆంగ్లం చదువుకోలేదే, మాట్లాడలేదే అని ఏనాడూ కుంగిపోలేదు.

పైగా మేము చదువులో, పత్రికలు, పుస్తకాలు చదవడంలో, మహాకావ్యాలను, గొప్ప పుస్తకాలను జీర్ణింప చేసుకోవడంలో ఏనాడూ వెనుకబడి లేము. ఆ రోజు చదివిన తెలుగు పద్యాలు, పుస్తకాలు, పురాణాలు మాకు ఈరోజుకీ ఉద్యోగాల రూపంలో ఉపాధి కల్పిస్తున్నాయి తప్ప ఎందుకు తెలుగు చదివామా అని బాధపడిన రోజు మా జీవిత జ్ఞాపకాల్లో లేదు.

అంతెందుకు.. పిల్లలను ఇంగ్లీషులో మాత్రమే మాట్లాడమని చెప్పే దరిద్రపు పాఠశాలలను, ఇంట్లో తెలుగు మాని, పిల్లలతో ఇంగ్లీషులోనే మాట్లాడే దరిద్రపు కుటుంబాలను, దరిద్రపు తల్లిదండ్రులను మా రోజుల్లో మేం ఎన్నడూ చూడలేదు. (ఎవరికయినా బాధ కలిగిస్తే క్షమించాలి)
మరి ఈ ముదనష్టపు సంస్కృతి ఎక్కడినుంచి వచ్చిందో కాని తెలుగు నేలపై తెలుగు మాట్లాడిన పాపానికి పసిపిల్లల మెడలో పలుపుతాడులాగా ఐ నెవర్ స్పీక్ తెలుగు ‘సిగ్గు బిళ్లలు’ తగిలించే వరకు మనం ఎదిగిపోయాం ఇవ్వాళ.

ఎవరేమైనా అననీ… మా బాల్యానికి మేం ధన్యవాదాలు తెలుపుకోవాలి. మేం తెలుగులోనే చదివాం, తెలుగు బళ్లలోనే చదివాం, తెలుగు మాట్లాడే పెరిగాం. మా తల్లిదండ్రులను మేం అమ్మా, నాన్నా, అయ్యా, నాయనా, అప్పా అనే పిలిచి పెద్దవారిమయ్యాం. ఇందుకు మేం ఏనాటికీ సిగ్గుపడం.
మాతృభాషను కొద్దో గొప్పో సరిగా నేర్చుకున్నందుకు దాని బలంతో ఇతర భాషలను కూడా అంతో ఇంతో నేర్చుకున్నాం. పదవ తరగతితోటే ఇంగ్లీషు, లెక్కలు, హిందీ పీడ వదులుతుందని సంతోషపడ్డ క్షణాలను దాటుకుని మాతృభాషపై పట్టు ఉన్న పునాది మీద నిలబడి ఇతర భాషల్లో కూడా అనువాదాలు చేయగల స్థితికి క్రమంగా చేరుకున్నాం.

అన్నిటికంటే మించి మా బాల్యం ‘చందమామ’ సాక్షిగా పుట్టింది, పెరిగింది. జీవితాంతం తెలుగులోనే రాయడానికి, మాట్లాడడానికి ఈ ఒక్క జ్ఞాపకం చాలు మాకు. మా నాన్న మాకు ఊహతెలియని వయస్సులో చందమామ తెచ్చి ఇచ్చి దీనివల్ల జ్ఞానం వస్తుంది చదవండిరా అన్నాడు.
జ్ఞానం వచ్చిందో లేదో తెలియదు కానీ, ఆనాటి నుంచి మేం తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం మర్చిపోలేదు. అమ్మను అమ్మా అని, నాన్నను నాన్నా అని పిలవడం మర్చిపోలేదు. ఈ ఘోరమైన నేరాలకు గాను మా తరం ప్రపంచం నిండా మునిగిపోయిందీ లేదు.

సాఫ్ట్‌వేర్, ఐటీ, బహుళజాతి సంస్థలు, వాటిలో ఉపాధి అవకాశాలు ఇవి తప్ప మరొకటి కనబడకుండా పోయిన, వినబడకుండా పోయిన ఈ నాటి ప్రపంచంలో తెలుగుకే ఇంకా అంటిపెట్టుకని ఉన్నందుకు మేం కోల్పోయిందేమీ లేదు.

భాషమీద ప్రేమా, మమకారం, మనదీ అనిపించుకున్న పునాదిపై విశ్వాసం ఉన్నంతవరకూ ఈ ‘నెవర్ స్పీక్ తెలుగు’ వికృత వైపరీత్యాలు మనల్నేమీ చేయలేవని మా ప్రగాఢ విశ్వాసం.

మేం ఇలాగే బతికాం.. ఇలాగే బతుకుతాము కూడా…

November 1st, 2009న చందమామ బ్లాగులో ప్రచురించబడింది

ఆన్‌లైన్ చందమామ రచనలు | Tags: అమ్మ, ఆంగ్లోన్మాదం, చందమామ, తెలుగు, నాన్న, భాష, మైదుకూరు | Edit | Comments (6)

6 Responses to “మా తెలుగు బాల్యానికి ధన్యవాదాలు”

1. రవి on November 1, 2009 11:21 PM Edit This
నా మనసులోకి తొంగి చూసి రాసినట్టుంది ఈ టపా. ఈ టపాలో ప్రతి అక్షరం నేను కూడా డిటో డిటో …

2. వేణు on November 2, 2009 1:45 AM Edit This
నాలాంటి వారి గొంతులను ఏకం చేసి, పలికినట్టు చాలా బాగా రాశారు. మాతృభాష సరిగా రాకుండానే పరభాషలో పట్టు పెరగాలనే అత్యాశల మధ్య బతుకుతున్నాం. ‘మేం ఇలాగే బతికాం.. ఇలాగే బతుకుతాము కూడా…’ అంటూ టపా చివర సూటిగా, నిర్ద్వంద్వంగా చేసిన ప్రకటన ఎంతో గొప్పగా ఉంది!

3. subhadra on November 2, 2009 2:45 AM Edit This
చప్పట్లు…చాలా చాలా బాగా చెప్పారు..మీ పోస్ట్ చదివి నేను కుడా నా బాల్యానికి దన్యవాదాలు చెప్పుకు౦టున్నాను.

4. సిరిసిరిమువ్వ on November 2, 2009 4:03 AM Edit This
మా అందరి మాటా మీ నోట ఎంత బాగా చెప్పారు! చప్పట్లు.

5. chandamama on November 2, 2009 4:22 AM Edit This
రవి, వేణు,సుభద్ర, సిరిసిరిమువ్వ గార్లకు,
ఈ స్పందన చాలు.. తెలుగుపై మమకారం ఇంకా నిలుపుకోవడానికి మీ ఈ స్పందనలు చాలు. ఇంగ్లీషు రానందుకు, మాట్లాడలేనందుకు, ఇంగ్లీషు ఉద్యోగాలు చేయలేనందుకు సిగ్గుపడని వారు, తల దించుకోని వారు లోకంలో ఇంకా ఉన్నారు.. ఈ ధైర్యంతోటే, ఈ విశ్వాసంతోటే మనం తెలుగును ప్రేమిద్దాం. ముందు తెలుగు నేర్చుకుందాం. తర్వాత ప్రపంచం మీదికి పోదాం..
మీ అందరికీ నా నెనర్లు..

6. రవి on November 2, 2009 6:17 AM Edit This
ఇంకా విచిత్రాలు గమనించాలండి.
మనం (ఈ కాలపు కాస్మోపాలిటన్ ఉద్యోగులు) ఈ ఉద్యోగాలు చెయ్యటానికి కారణం, మనకు కాస్తో, కూస్తో ఉన్న విశ్లేషణా సామర్థ్యం – దానికి ఆలంబన మనకు (తెలుగువాళ్ళకు) ఉన్న గణిత సామర్థ్యం. అది ఎలా అబ్బిందంటే, మాతృభాషలో బోధన వల్ల. అదొక్కటే కాదు, ఈ ఉద్యోగాలు చేస్తూ, పూర్తీగా డబ్బు చుట్టూ తిరిగే ఈ నగరాలలో, కాస్తో కూస్తో సెంటిమెంటల్ గా, హృదయవాదులుగా ఉండగలుగుతున్నామంటే, దానికి కారణమూ మాతృభాషే.
ఈ విలువలన్నీ చవకగా ఎంచి, ఏరిపారేసే వాళ్ళు ఉన్నారు.
చూద్దాం. సత్యమే జయిస్తుంది.

చందమామ లెజెండ్ నాగిరెడ్డి గారిపై డీవీడీ

విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పించిన “లైఫ్ స్కెచ్ ఆఫ్ ఎ లెజెండ్ శ్రీ బి నాగిరెడ్డి” అనే డీవీడీ డాక్యుమెంటరీ ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత మళ్లీ దొరక బుచ్చుకున్నాను. విజయా ఆసుపత్రిలో నాగిరెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఒక ప్రత్యేక మందిరంలో ఆవిష్కరించి దానికి ఒక మ్యూజియం స్థాయిని కల్పించాలని ఆయన బంధువులు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ అరుదైన డీవీడీ డాక్యుమెంటరీ రూపొందింది.

నాగిరెడ్డి గారి జీవిత విశేషాలను, చందమామ, విజయా స్టూడియో, విజయా హాస్పిటల్ ఆవిర్భావ నేపధ్యాలను మీడియా మిత్రులకు అందజేయాలనే తలంపుతో విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఎండీ రాంబాబు గారు ఈ డీవీడీని 2007లో చెన్నయ్ మీడియా మిత్రులకు ఇచ్చినట్లు వినికిడి. ఇవి తప్ప ఈ డీవీడీలను ఎవరికీ అందుబాటులోకి తీసుకురాలేదు.

2007లో ఈ డీవీడీని నాగిరెడ్డి గారి కుటుంబ సభ్యులకోసం, ఆయన కాంస్య విగ్రహ ఆవిష్కరణ కోసం మాత్రమే రూపొందించినప్పుడు మా జర్నలిస్టు మిత్రుడు, విశ్వనాధ్ -ప్రస్తుతం హెచ్‌‍ఎమ్‌టీవీ రాయలసీమ కో ఆర్డినేటర్- ప్రెస్ మీట్‌ ద్వారా దాన్ని సంపాదించాడు. తెలుగువారే కాకుండా యావద్భారతమూ మర్చిపోలేని చందమామ, విజయా హాస్పిటల్, విజయా స్టూడియోస్‌ని స్థాపించిన నాగిరెడ్డి గారిని ఓ రెండున్నర గంటల పాటు తల్చుకుంటూ ఎందరో ప్రముఖుల స్మరణలతో ఈ డీవీడీ రూపొందింది.

మా మిత్రుడు, సహచరుడు విశ్వనాధ్ 2007లో ఈ డీవీడీ గురించి చెప్పినప్పుడు, భంగపడి, బతిమాలి, బామాలి ఎలాగో ఒకలాగు ఈ డీవీడీని సంపాదించాను. ఒరిజనల్ కాపీని తిరిగి ఇచ్చేయాలని తను చెప్పడంతో వెంటనే దాన్ని మూడు కాపీలు తీయించి రెండు నాకు, ఒకటి తనకు ఇచ్చి భద్రపర్చాను. అప్పటికి నేను చందమామలో ఇంకా చేరలేదు. ఇంట్లోనే ఉంటుందిలే అనే భరోసాతో దాని గురించి పట్టించుకోలేదు.

కానీ గత సంవత్సరం అపరూప చిత్రాల సేకర్త, అరుదైన డాక్యుమెంటరీల సంకలన కర్త శ్రీ బి.విజయవర్ధన్ గారితో -బెంగళూరు- పరిచయమై నా వద్ద నాగిరెడ్డి గారిపై తీసిన డీవీడీ ఉందని చెబితే తప్పక తనకూ ఓ కాపీ కావాలని చెప్పారు. అప్పటికే ఆయన చందమామ సీనియర్ చిత్రకారులు శంకర్ గారిపై వీడీయో ఇంటర్‌వ్యూను తీసి చందమామకోసం ఒక కాపీ పంపారు.

చందమామ సంస్థాపకుడిపై డీవీడీని ఆయనకూ తీసి ఇవ్వాలని అనుకుంటే ఇంట్లో గతంలో దాచిన రెండు కాపీలూ దొరకలేదు. గుట్టలు గుట్టలుగా పుస్తకాలు, డీవీడీలు ఎక్కడ చూసినా పేరుకుపోవడంతో ఈ అపరూప డీవీడీ ఎక్కడో తప్పిపోయింది. ఇలా కాదని తిరుపతిలో ఉంటున్న మా మిత్రుడు విశ్వనాధ్ వద్ద కూడా ఒక కాపీ ఇచ్చి ఉంచాను కాబట్టి అక్కడ ప్రయత్నించి ఇన్నాళ్లకు దాన్ని ఎలాగోలాగు పట్టేశాను.

విజయవర్దన్ గారూ!
అమ్మకానికి ఏమాత్రం అందుబాటులో లేని ఈ అరుదైన డీవీడీని మీరు కోరిన విధంగా తీసి కాపీ చేసి ఉంచాను. మీ చిరునామా మళ్లీ నాకు ఓసారి మెయిల్ చేస్తే ఈ వారమే మీకు దీన్ని పంపిస్తాను. మీకు ఇచ్చిన మాటను తీర్చే ప్రయత్నంలో పోయిందనుకున్న ఈ అరుదైన డీవీడీ మళ్లీ చేజిక్కినందుకు సంతోషంగా ఉంది.

ఇసుక మీద ఓనమాలు – టీచర్ రామరాజు
“ఇసుక మీద ఓనమాలు రాయడంతో నా విద్య ప్రారంభమయింది” అంటూ నాగిరెడ్డి గారి మాటలతో మొదలవుతుంది ఈ డీవీడీ. “నేనీ నాడు ఈ స్థితికి చేరానంటే మా తాతగారు, నాకు చదువు నేర్పిన టీచర్ రామరాజు గారు కారణం. మా టీచర్ అప్పట్లో నా వీపు మోగించి ఉండవచ్చు కాని నాకు పన్నెండేళ్ల వయసు వచ్చేసరికి రామాయణం, భారతం, భాగవతాలను వర్డ్ టు వర్డ్ కంఠతా వచ్చేలా చెప్పించారు. మీరు వేరే రకంగా అనుకోకపోతే, మా తెలుగు టీచర్ బయట వెళ్లేటప్పుడు ‘ఒరేయ్ క్లాసును కాస్త చూసుకోరా’ అని చెప్పేవారు. అంటే తనతో సమానంగా నేను తెలుగు నేర్చుకున్నానని ఆయన గ్రహించేశారు. కాని ఇంగ్లీష్ అస్సలు రాకపోవడంతో పెద్దలు నాకు ట్యూషన్ ఏర్పర్చారు.”

చందమామ సంస్థాపకులు నాగిరెడ్డిగారు, కడపజిల్లా సింహాద్రిపురం మండలంలో పొట్టిపాడు గ్రామంలో జన్మించారు. రైతు జీవితం తెల్లవారు నాలుగన్నరకు మజ్జిగన్నం తిని పొలానికి వెళ్లడంతో మొదలవుతుంది. పనివాళ్లు రాకముందే బండి కట్టుకుని పొలం వద్దకు పోయి రడీగా ఉండాలిరా అనే పెద్దల మాటను తుచ తప్పకుండా పాటించారాయన. పొలంలోకి ముందుగా పనివాళ్లు కాక ఇంటి మనిషి పోవాలి అనేది రైతు జీవన సంస్కృతి. ‘ఆనాటి నుంచి ఈనాటి వరకు తెల్లారి ఆ నాలుగన్నర గంట అయిందంటే తర్వాత నేను నిద్రపోవడం ఎరుగను’ అన్నారీయన.

స్వాతంత్ర్య పోరాటం – ఉల్లిపాయల వ్యాపారం
1940లలో ఉధృతంగా సాగుతున్న స్వాతంత్ర్య పోరాటంలో చిన్నవయస్సులోనే నాగిరెడ్డి గారు పాల్గొని దెబ్బలు తినటంతో ఆయన తండ్రి వీడు చెడిపోతున్నాడేమో అనే భయంతో మద్రాసులో తాను నడుపుతున్న ఉల్లిపాయల వ్యాపారంలో నాగిరెడ్డిగారిని పెట్టారు. అలా వ్యాపారంకోసం ఆయన బర్మా రంగూన్ ప్రయాణాలు చేస్తూండేవారు. రెండో ప్రవంచయుద్ధ కాలంలో బాంబులు కురిసి వ్యాపారం కుప్పకూలడంతో ఆయన వ్యాపారంలో సర్వం కోల్పోయారు.

ఉల్లిపాయల వ్యాపారంలో దెబ్బతిని సర్వం కోల్పోగానే అంతవరకూ బర్మా, రంగూన్ లకు ప్రయాణిస్తూ వ్యాపారం చేస్తున్న నాగిరెడ్డి గారు భార్య శేషమ్మ గారితో కలిసి కడపజిల్లా రాజంపేటకు దగ్గరగా ఉన్న ఒక కుగ్రామం ఓరంపాడు -నెల్లూరు-లో ఓ పూరిపాకలో మూడేళ్లపాటు అత్యంత కనాకష్టమైన జీవితం గడిపారు.

1940ల మొదట్లో జరిగిన ఈ ఘటనలో ఆయన ఈ ఊర్లో ఉన్నప్పుడు వైద్య సౌకర్యం లేని ప్రజలకు మందులు ఇవ్వడంతో పాటు, పిల్లలను సాయంత్రం పూట చేరదీసి ఇష్టమైన కధలను రక్తికట్టేలా చెప్పేవారు. వారికి ఎలాంటి కథలు నచ్చుతాయో వారి హావభావాలు పసిగట్టడంద్వారా తెలుసుకుని సరైన కథలను ఎంపిక చేసుకుని చెప్పేవారు.

నాగిరెడ్డి – చక్రపాణి – చందమామ
1943లో మళ్లీ మిత్రుడి సహాయంతో మద్రాసుకు వచ్చిన నాగిరెడ్డిగారు అయిదు వేల రూపాయలతో ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు. అదే సుప్రసిద్ధమైన బి.ఎన్.కె ప్రింటింగ్ ప్రెస్. ఆ రోజుల్లో బి.ఎన్.కె ప్రెస్ అంటే ఒక చరిత్ర.. ఆసియా ఖండంలోనే అంత పెద్ద ప్రిటింగ్ ప్రెస్ లేదనే స్థాయికి అది అచిరకాలం లోనే ఎదిగింది. చందమామ ప్రింటింగ్ అవసరాలు ప్రెస్ పరిమాణాన్ని బాగా పెంచివేశాయి.

“రోజూ రాత్రి పూట పడుకునే ముందు మా అవ్వగారు ఏదో ఒక కథ చెబితే కాని నిద్రపోయేవాడిని కాను. మనకు ముఖ్యంగా ఇతిహాసాలలో భారతం, భాగవతం, రామాయణం చాలా ముఖ్యమైనవి. దేవుని దయవల్ల రామరాజు టీచర్ నాకు ఈ పుస్తకాలను చక్కగా బోధ చేయడం వల్ల, ఆ పుస్తకాలలోని కథలను పిల్లలకు అర్థమయ్యేలా తిరిగి వారికోసం రిలీజ్ చేయాలని అనిపించేది. చక్రపాణి గారు మద్రాసుకు తన పత్రిక ప్రిటింగ్ కోసం వచ్చి కలిసినప్పుడు ఈ విషయం చెబితే ఆయన కూడా ఈ ఆలోచనను ఒప్పుకోవడం. పిల్లలకోసం కథల పత్రికను పెట్టాలని చక్రపాణిగారు సలహా చెప్పారు. ఇద్దరి ఆలోచనలు అలా కలవడంతో చందమామ పత్రికను 1947లో పెట్టడం జరిగింది. చందమామ పత్రిక అలా చరిత్రలో నిలిచిపోయిందంటే చక్రపాణి గారే కారణం.”

మన జీవితవిధానం, హైందవ సంప్రదాయం మన తర్వాతి తరాలకు ఎక్కడ దూరమవుతుందని నాగిరెడ్డిగారి తండ్రి భయపడేవారు. ఆయన భయమే తదనంతరం చందమామ ఆవిర్భావానికి కారణమైంది. స్వామి రామతీర్థ చెప్పిన కథలు, జీవిత ఉదాహరణలు నాగిరెడ్డిగారికి ఎంతో ఇష్టం. చందమామ స్థాపనకు ముందు కథలపై ఆయన అభిమానానికి రామతీర్థ కూడా ప్రేరణగా నిలిచారు.

(సినీ నటి జమున గారు 1947 తొలి చందమామను తెనాలిలోని బంధువులు తీసి పంపితే చదివారు. అప్పటినుంచి ఈనాటివరకు అంటే 2007 వరకు అన్ని చందమామలు కొని చదివి భద్రపరుస్తూ వస్తున్నారు. ఆమె మాటల్లో చెప్పాలంటే ఈ అపరూపమైన ఆస్తిని ఎవరికీ ఇవ్వలేదట. అన్ని చందమామలూ అలా భద్రపరుస్తూనే ఉన్నారట. నమ్ముతారో లేదో నాకు తెలియదని ఈనాటికీ చందమామను తాను చదువుతూనే ఉన్నానని ఆమె నాగిరెడ్డిగారిపై డీవీడీ డాక్యుమెంటరీలో చెప్పారు.)

విజయా ఆసుపత్రి నేపథ్యం
“1942లో మా నాన్న డయాబెటిక్ పేషెంట్. మద్రాసులో ఒక ఆసుపత్రిలో చేర్పిస్తే నరకం. జంతువుల్లాగా ట్రీట్ చేసేవాళ్లు, రోగుల వెన్నంటి వచ్చే వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. డిశ్చార్చ్ అయి ఇంటికి తీసుకువచ్చాక అయిదు నెలలు ఆలోచించాను. రోగులకే కాకుండా రోగులను వెన్నంటి వచ్చే సహాయకులకు, బంధువులకు సౌకర్యం కల్పించే ఆసుపత్రి ఉంటే ఎంత బాగుంటుందని పదే పదే ఆలోచించాను. ఆ ఆలోచనే విజయా హాస్పిటల్‌కు మార్గ నిర్దేశం చేసింది. ప్రపంచంలోని అతి గొప్ప కంటి ఆసుపత్రులలో ఒకటైన శంకర్ నేత్రాలయ హాస్పిటల్ విజయా హాస్పిటల్ స్పూర్తితోటే పుట్టింది.”
‘పేషెంట్ ఎంత ఇంపార్టెంటో, పేషెంట్ తరపున వచ్చిన వారికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రోగులతో పాటు వారి బంధువులూ వస్తారు. వారు వస్తారు. అది వారి తత్వం. వారికి మనం సౌకర్యాలు కల్పించాలి.’ ఇదీ నాగిరెడ్డి విజన్. విజయా హాస్పిటల్ ప్రాంగణం రోగులతో పాటు వచ్చిన బంధువులకు కల్పతరువు లాంటిది. ఏ ఆసుపత్రి ప్రాంగణంలోనూ ఇలాంటి సౌకర్యాలు చూడం మనం. రోగుల వెన్నంటి వచ్చిన వారిని ఇతర హాస్పిటల్స్‌లో చీదరించుకుంటారు, బయటకు పంపేస్తారు.

కాని విజయా హాస్పిటల్ చరిత్రలో ఇలాంటి అనుభవం ఎవరూ చూడలేదు. హాస్పిటల్ కారిడార్లు కాని, భవంతుల ముందు అరుగులు కాని విశాలంగా ఉంటాయి. రోగి బయటకు వచ్చినా కాసేపు కూర్చుని సేద తీరడానికి ఇవి ఉపయోగపడతాయు. విజయా హాస్పిటల్ ఎంత సౌకర్యం కల్పించిందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు.

నాగిరెడ్డి గారు ఉన్నంతవరకు రాయలసీమ నుంచి ఎవరైనా రోగులు ఆసుపత్రికి వచ్చారంటే ఆప్తబందువు చెంతకు వచ్చినట్లే పీలయ్యేవారు. ముఖ్యంగా కడప జిల్లా రైతులు, మధ్యతరగతి ప్రజలు విజయా ఆసుపత్రికి చికిత్స కోసం వస్తే వారు నాగిరెడ్డిగారి స్వంత మనుషుల కిందే లెక్క. ఆయన డాక్టర్ కాదు. కాని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఆయన విజయా ఆసుపత్రిలో పట్టి పట్టి నడుస్తూ డాక్టర్లను, సిబ్బందిని, రోగులను పలుకరించేవారు.

ఎవరయినా డిశ్చార్జ్ అయి వెళ్లిపోతుంటే వారికి జాగ్రత్తలు చెబుతూ, వారి కారు తలుపులను తాను మూసి సంతృప్తిగా పంపించేవారు. తన ఇంటికి, తన ఆసుపత్రికి వచ్చిన వారు తన స్వంత మనుషులకిందే లెక్క., చివరివరకూ ఆయన అలాగే చూసుకున్నారు. ఈ రోజు ఆసుపత్రి ఎలా ఉందో తెలియదు కాని, ఈ మహనీయ మూర్తిమత్వం సాయంత్రం పూట ఆసుపత్రిలో నిదానంగా నడుస్తుంటే అతి ఎత్తైన ఆసుపత్రి భవంతులు, వాటి గోడలు కూడా ఆయన ముందు చిన్నపోయేవి.

“మీ స్వంత బంధువులకు ఎలా దగ్గిరుండి చికిత్స చేయిస్తారో, అలాగే రోగులందరికీ మీరు సేవలను అందజేయాలి” అని ఆయన ఆసుపత్రిలో చేరిన వైద్యులకు, సిబ్బందికి పదే పదే చెప్పేవారు. ‘పేదవారికి, మధ్యతరగతి వారికీ సహాయం చేయాలని విజయా ఆసుపత్రి కట్టానయ్యా. దాన్ని మీరు నిలబెట్టాలి’ అంటూ ఆసుపత్రిలో కొత్తగా చేరిన ప్రతి ఒక్కరికీ చెప్పేవారాయన.

ప్రారంభంలో కేవలం 60 పడకలతో ప్రారంబించిన విజయా ఈరోజు 650 పడకలు, వందమంది వైద్యులు, 1600 మంది సిబ్బందితో నడుస్తోంది, సంవత్సరానికి లక్షా 25వేల మంది ఇన్ పేషెంట్లు, 6 లక్షల మంది అవుట్ పేషెంట్లు ఈ ఆసుపత్రి గడప తొక్కుతుంటారు. దక్షిణ భారత రాష్ట్రాల నుంచే కాకుండా, అస్సాం, బీహార్, బెంగాల్, అండమాన్ దీవులనుంచి కూడా ఈ ఆసుపత్రికి రోగులు వస్తుంటారు.

“అందుకే మరో 200 సంవత్సరాలు గడిచినా విజయా, అపోలో ఆసుపత్రులలో డాక్టర్లు మారతారు కాని ఆసుపత్రులు నిలుస్తాయి. అంతటి చక్కటి పునాదితో వీటిని కట్టాము” అంటూ అప్పోలో హాస్పిటల్స్ సంస్థాపకులు ప్రతాప్ రెడ్డి గారు ఈ సందర్భంగా నాగిరెడ్డిగారిని తల్చుకున్నారు.
“మీరు రెండు నెలలు మీ సిబ్బందికి, ఉద్యోగులకు జీతాలు చెల్లించే స్థితిలో ఉంటే ఆ సంస్థ బాగున్నట్లు లెక్క.. ఇన్‌స్టిట్యూట్ ఈజ్ లైక్ ఎ మదర్, తల్లి బాగుంటే పిల్లలను చక్కగా కాపాడుతుంది” అనే నాగిరెడ్డి గారి కలల సాకారం విజయా ఆసుపత్రి. ఈ మహనీయుడి మూర్తిమత్వాన్ని స్మరించుకోడానికైనా విజయా ఆసుపత్రిలో ఆయన జీవితాంతమూ తిరుగుతూ వచ్చిన ప్రాంగణాలను మనం చూడాల్సిందే.

తీర్చిదిద్దినట్లుగా, నీట్‌గా ఉన్న విజయా ఆసుపత్రి అందచందాలు, చందమామ ప్రింట్ అయ్యే క్రమం చూడాలంటే ఈ డీవీడీని తప్పక చూడాలి.
ఎప్పుడూ రెండో స్థానాన్ని ఆయన అంగీకరించరు. “పని ఎత్తుకుంటే అందరికంటే మనమే మొదట్లో ఉండాలి” ఇది ఆయన ఫిలాసఫీ.

విజయా వారి వెన్నెల
ప్రపంచంలో కల్మషం లేనిది, కల్తీ లేనిది, వివక్ష లేనిది ఉందంటే ఆ ఘనత వెన్నెలకు కూడా దక్కుతుంది. వెన్నెల మంచికీ, చల్లదనానికి, సహాయ గుణానికీ గుర్తు. విజయా వారి సినిమాలు వెన్నెల కుప్పలు.

నాగిరెడ్డి గారు తాము తీసే ప్రతి సినిమాను ప్రేమించారు, బిడ్డలాగా అక్కున చేర్చుకున్నారు. ఇంటిల్లిపాదీ వచ్చి చూసి, సంతోషించాలి, ఇలా జరగాలంటే చెడు అస్సలు చెప్పకూడదు, చూపకూడదు. తెరపై మూడు గంటలపాటు మంచే కనపడాలి. మంచికే విజయం దక్కాలి. విజయా వారి సినిమాలు చేసి చూపించింది దీన్నే మరి.

అసలు విజయా పిక్చర్స్ నేపధ్యమే ఒక విషాద ఘటనతో ప్రారంభమైంది.

1940ల నాటికి అనంతపురంలో మాలా నారాయణ స్వామి అనే ఆయన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఎన్నో పరిశ్రమలు స్థాపించారు. లక్షలు గడించారు. తాడిపత్రి, గుత్తి పట్టణాల్లో నూనెమిల్లులు, తాడిపత్రి అనంతపురంలలో కో-ఆపరేటివ్‌ మిల్క్‌ సొసైటీ, తాడిపత్రిలో మార్కెట్‌ యార్డు స్టోర్స్‌, రాయలసీమలో పలుచోట్ల ఖాదీ గ్రామోద్యోగ సంస్థలు అనంతపురంలో కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ స్థాపించారు. కలకత్తా నుండి బర్మాకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసేవారు. ఇన్ని సంస్థల యజమానిగా అతనిని ‘రాయలసీమ’ బిర్లా అనేవారు. కస్తూరిబా స్మారక నిధికి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎందరో బీద విద్యార్థు లకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి, ఉచిత వసతి, భోజనవసతి కల్పించిన దాత ఆయన. నారాయణస్వామి ఆర్థిక సహాయంతో జీవితంలో ఎన్నో గొప్ప పదవులందుకొన్న వారిలో ముఖ్యులు దామోదరం సంజీవయ్య గారొకరు.

మద్రాసులో ఉల్లిపాయల వ్యాపారం చేసే బి.నాగిరెడ్డి, బి.ఎన్‌. రెడ్డి గార్లతో నారాయణస్వామి మైత్రిని పెంచుకొన్నారు. వారితో కలిసి సినిమా నిర్మాణం ప్రారంభించారు. ‘అప్పట్లో, ఆసియాలోకెల్లా అతిపెద్ద సినిమా స్టూడియోగా పేరుగాంచిన వాహినీ స్టూడియో (మద్రాసు) మూలపురుషుడు మూలా నారాయణ స్వామి’. నారాయణ స్వామి ఛైర్మన్‌గా, బి.ఎన్‌.రెడ్డి మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వాహినీ ఫిల్మ్‌ సంస్థను ప్రారంభించి ‘వందేమాతరం’ చిత్రం నిర్మించారు. సుమంగళి, పోతన, స్వర్గసీమ వంటి హిట్‌ చిత్రాలను నిర్మించారు. 1947లో వాహినీ స్టూడియో ప్రారంభించారు. వ్యాపార దృష్టితోపాటు కళాదృష్టిని మేళవించి ఉత్తమ చిత్రాలను నిర్మించారు. క్రమంగా కె.వి.రెడ్డి చక్రపాణి గార్లు ఆ సంస్థలో చేరారు.

ఈలోగా నారాయణ స్వామి గారి వ్యాపారాలు ఇన్‌కమ్‌టాక్స్‌ వారి దృష్టిలో పడినాయి. ఆ అధికారిని బదిలీ చేయించడానికి యత్నించారు, కానీ అధికారి కూడా చాలా పట్టుదల, నిజాయితీ కలవాడు. నారాయణ స్వామి వ్యాపారాల్లోని లావాదేవీలను పరిశీలించి దాదాపు 30 లక్షల ట్యాక్స్‌ విధించాడు. నారాయణ స్వామి వ్యాపారాలన్నిటినీ సీజ్‌ చేశాడు.

నారాయణ స్వామికి ‘అప్పులు పుట్టని స్థితిని గమనించిన మిత్రులు అతనికి దూరమయ్యారు. మహాదాత నారాయణ స్వామి మనోవ్యాధితో పాటు క్షయ వ్యాధికి గురై మదనపల్లి శానిటోరియంలో చికిత్స పొందుతూ 1950 ఆగస్టు 20న కన్నుమూశారు.

తర్వాత నారాయణ స్వామి కుమారుడు రంగయ్య వాహినీ స్టూడియోను నాగిరెడ్డికి అమ్మివేశారు.

ఉన్నట్లుండి 30 లక్షల రూపాయల పన్ను జరిమానా కట్టవలసిందిగా ఆదేశించడంతో ఆయన ఆర్థిక సామ్రాజ్యం కుప్పకూలిపోయిన ఈ సందర్భంలోనే ఆయన నాగిరెడ్డిగారిని సంప్రదించి వాహినీ స్టూడియోస్‌పై కూడా ఐటీ వారి కన్ను పడుతుందేమో అనే భయంతో, వీలైతే స్టూడియోను మీరే లీజుకు తీసుకుని నడపవలసిందిగా సూచించారు. తర్వాత తాను నష్టాలనుంచి బయటపడినప్పుడు స్టూడియో గురించి ఆలోచిద్దామని చెప్పారట.

ఈ విషయం నాగిరెడ్డి గారు చక్రపాణిగారి చెవిన పడేశారు. “ఈ తెల్ల ఏనుగును మనమెలా భరించేది, అయినా మనకు సినిమాలెందుకు” అని మొదట్లో చక్రపాణి గారు కొట్టిపడేశారు. కాని నాగిరెడ్డి గారు వదల్లేదు. ఇప్పటికే నారాయణ స్వామిగారు స్టూడియోపై అయిదు లక్షలు ఖర్చుపెట్టారు కాబట్టి మనం అంత పెట్టుబడి పెట్టాలన్నా సాధ్యం కాదు కాబట్టి లీజుకు తీసుకుంటే ఉన్న నిర్మాణాల్లోనే సినిమా ప్రారంభించవచ్చు గదా అని పట్టు పట్టారు.

ఈ లోపలే ఈ విషయం తెలిసిన ఎల్వీ ప్రసాద్ గారు ఈయనను కలిసి సినిమా తీయడానికి అవకాశం ఇవ్వండని కోరారు. ‘మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సినిమా తీస్తాను’ అని చెప్పారట. దీంతో మనదేం పోయిందిలే అనుకుని వాహినీ స్టూడియోను లీజుకు తీసుకుని 15 వేల రూపాయలతో సినిమా మొదలెట్టేశారు. అదే.. విజయా వారి తొలి సినిమా ‘షావుకారు.’ తర్వాత పూర్ణచంద్రరావు గారు మరో 75 వేల రూపాయల సహాయం చేయడంతో ఇక వీరు వెనుదిరగలేదు.

వాహినీ స్టూడియోతో బి.ఎన్‌.రెడ్డి, బి.నాగిరెడ్డి, కె.వి.రెడ్డి మున్నగు వారితో సన్నిహితులుగా ఉండిన సినీ రచయిత డి.వి. నరసరాజు గారు, వాహినీ స్టూడియో, నారాయణ స్వామి జీవిత ప్రస్థానాన్ని తమ ‘తెరవెనుక కథలు’ పుస్తకంలో చక్కగా చిత్రించారు.
షావుకారు, పాతాళభైరవి, గుండమ్మకథ, మాయాబజారు, గుణ సుందరి, సిఐడి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గంగ-మంగ, రాజేశ్వరీ విలాస్ కాపీ క్లబ్, బృందావనం, ఇవి విజయావారి వెన్నెల కుప్పల్లో కొన్ని.

నాగిరెడ్డి గారు మొదట టీటీడీ సభ్యుడు, తర్వాత ఛైర్మన్‌ అయ్యారు, “తిరుపతిలో అయిదేళ్లు వర్షం కురవకపోయినా ఒక్కసారి కల్యాణి డామ్ నిండిందంటే అయిదేళ్లు నీళ్లు సరఫరా ఆవుతాయి. అది నా హయాంలోనే జరిగింది.. క్యూ కాంప్లెక్స్ కట్టి వందలాది మంది భక్తులకు సౌకర్యం కల్పించాను. దీంట్లో నేను చేసిందేమీ లేదు. ఇది కేవలం భగవత్ కృప.”

మాట తప్పవద్దు
“మాట తప్పవద్దు అనేది మా కుటుంబం నాకు నేర్పిన విలువ. నేను నష్టపోయినా నన్ను నమ్మి వ్యాపారంలోకి దిగిన వారు నష్టపోకూడదనేది నా తత్వం.” ఇచ్చిన మాట తప్పవద్దు. ఇది ఆయన జీవితాంతం వదలకుండా పాటించిన మాట. అందుకే సత్య హరిశ్చంద్రుడు అంటే ఆయనకు అంత ఇష్టం.
“మ్యాన్ మైనస్ ఈగో ఈజ్ గాడ్
గాడ్ మైనస్ ఈగో ఈజ్ మ్యాన్”
నాగిరెడ్డి గారు వీటిలో తొలి కోవకే చెందుతారు అనేది విజయా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్ గారి అభిప్రాయం.

సర్వశ్రీ అక్కినేని నాగేశ్వరరావు, డివిఎస్ రాజు, రామానాయుడు, కె.విశ్వనాధ్, సింగీతం శ్రీనివాసరావు, రామోజీరావు, జమున, డివీ.నరసరాజు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణిశ్రీ, కృష్ణ, విజయనిర్మల, పద్మనాభం, జయంతి, లక్ష్మి, ఎస్.వి.కృష్ణారెడ్డి, రావి కొండలరావు, రాజేంద్రప్రసాద్, పి.లీల. (మలయాళీ), పసుమర్తి కృష్ణమూర్తి, డాక్టర్ సత్యభామా రెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ పి.చిన్నస్వామి, డాక్టర్ ఎం.ఆర్ రెడ్డి, డాక్టర్ సి. రంగారావు, డాక్టర్ ఎన్ ఎస్ రెడ్డి -సినిమా ధియేటర్ ఓనర్ కూడా- డాక్టర్ బాబూ రాజేంద్రన్. డాక్టర్ కె.ఎన్. రెడ్డి, డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ జయం, డాక్టర్ బి. సతీష్ రెడ్డి, (నాగిరెడ్డి గారి మనవడు), డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి -అప్పోలో హాస్పిటల్స్- డాక్టర్ పి.నంజుండయ్య, డాక్టర్ రాంబాబు, డాక్టర్ చంద్రమౌళి రెడ్డి ఐఎఎస్, వి.వెంకట్రామిరెడ్డి, బి. వేణుగోపాల రెడ్డి, బి విశ్వనాధ రెడ్డి, శ్రీమతి ఎ.విజయలక్ష్మి, తదితర ప్రముఖులు నాగిరెడ్డి గారి గురించిన తమ జ్ఞాపకాలను ఈ డీవీడీ డాక్యుమెంటరీలో పంచుకున్నారు.

నేటి తరాలు మర్చిపోయిన, చూడలేకపోయిన నాటి అమృత గాయని పి.లీల గారిని లైవ్‌లో చూడాలంటే ఈ డీవీడీలోనే సాధ్యం. గుండమ్మ కథ సినిమాలోని పాట లేని 10 నిమిషాల సంగీత ఝరి -ఎల్ విజయలక్ష్మి నృత్యం-లో ఒక బిట్‌ను ఈ డీవీడీలో చూపించారు. ఆ రోజుల్లో ఎల్ విజయ లక్ష్మి మా ఆరాధ్య నృత్య తార అని చెప్పడానికి సందేహించవలసిన పనిలేదు. మూర్తీభవించిన శిల్ప సౌందర్యం ఆమె స్వంతం. ఇప్పడు తన గురించి ప్రస్తావించడానికి ఇది సందర్భం కాదు.

నాగిరెడ్డి గారి విజన్.
“ఉన్న మంచినే చెబుతాం. ఉన్నా చెడును మాత్రం చెప్పం…” ఇది నాగిరెడ్డి గారి విజన్. చందమామ, విజయా సినిమాలు, విజయచిత్ర సినీ పత్రిక, ఎప్పుడూ మంచినే చెప్పాయి. ఉన్నా చెడు చెప్పలేదు. మంచిని మాత్రమే చెప్పాలని, చూపాలని, ముద్రించాలని ఒక మహా దార్శనికతను ప్రకటించడం, చివరి క్షణం వరకు దానికి కట్టుబడటం ప్రపంచంలో ఎవరికి సాధ్యం?

రావికొండల రావుగారి సంపాదకత్వంలో విజయచిత్ర సినీ పత్రికను స్థాపించినప్పుడు నాగిరెడ్డి గారి ఆయనకు ఒకే సలహా చెప్పారట. “చూడయ్యా సినిమా పత్రిక ఎలా నడపాలనేది మీరే నిర్ణయించుకోవాలి. కానీ ఇంటిల్లిపాదీ వచ్చి పత్రికను చూసి, చదివేలాగా తీర్చిదిద్దండి. అందరిచేతా బాగుందనిపించుకోవడమే మన పత్రిక లక్ష్యం కావాలి.”

హిమాలయ పర్వతభారాన్ని ఎంత సులువుగా చెప్పేశారో. విజయచిత్ర ప్రారంభం అయ్యేనాటికీ తెలుగులో సినీ పత్రికలు రకరకాలుగా కంపు కొడుతున్నాయని రావి కొండలరావు గారి ఉవాచ. పత్రిక ఎలా పోతుంది, ఏం వేస్తున్నారు అనే విషయాలు పట్టించుకోని నాగిరెడ్డిగారు ‘ఇంటిల్లిపాదీ చదివేలా తీసుకురండి’ అని మాత్రమే సలహా ఇచ్చారు. అదీ ఒక సినిమా పత్రికమీద ఈ భాధ్యత పెట్టారు.

తదనంతరం విజయచిత్ర సాధించిన అపూర్వ విజయం మనందరికీ తెలిసిందే. కొడవటిగంటి కుటుంబరావు గారి ఆధ్వర్యంలో గతంలో 1950ల మొదట్లో మూడేళ్ల నడిచిన ‘కినీమా’ సినీ పత్రిక తర్వాత అంతటి ఘన కీర్తి, ప్రజాదరణ ఒక్క విజయచిత్రకే దక్కిందంటే అతిశయోక్తి కాదు. 53 ఏళ్ల చందమామలను ఆన్‌లైన్ చందమామ భాండాగారంలో పెట్టి తరతరాలకూ అందిస్తున్నట్లుగా, కినీమా, విజయ చిత్ర, యువ పత్రికలను కూడా ఆర్కైవ్స్‌లో పెట్టి అందించాలని చందమామ పాఠకులు ఈనాటికీ కోరుతున్నారంటే వాటి విలువ ఎవరికయినా బోధపడుతుంది.

నాకోసం ఓ కంటినీరు…
“ఈ ఆస్తి ఈ పిల్లలూ, ఈ ఇళ్లూ ఇవేవీ మిగలవు, వీళ్లెవరూ మనకు మిగలరు అనేది నాకు తెలుసు, ఊరికే వేషధారిగా బతకటం సాధ్యంకాదు. పదిమందికి మంచి చేసి పోవడం ఇదే నాకు తెలిసింది. నా మిత్రులే కాకుండా నా బంధువులే కాకుండా నా అనేవారు కానివారు కూడా నాకోసం ఒక కంటి నీరు వదిలినారంటే… అదే నాకు తృప్తి.”

డీవీడీ ఇంటర్వ్యూలో ఈ మాటలంటున్నప్పుడు ఆయన కళ్లలో నీటిపొర. మూగపోయిన కంఠం..
నిజంగానే… ఆయన 2004లో పోయినప్పుడు అఖిలాంధ్రమూ, తమిళనాడు ప్రజానీకమూ, యావత్ భారత దేశమూ నిజంగానే.. ఆయనకోసం విలపించింది.

చందమామ కథలు, వాటిని చదివే తరతరాల పాఠకులు, విజయా సినిమాలు, వాటిని చూసే తరతరాల ప్రేక్షకులు, విజయా హాస్పిటల్, అక్కడికి వచ్చి చికిత్స చేయించుకునే తరతరాల రోగులు ఉన్నంతవరకు నాగిరెడ్డి గారు చరిత్రలో వెలుగొందుతూనే ఉంటారు.

అరుదైన వ్యక్తులపై డాక్యుమెంటరీలు తీయాలంటే ఇలా తీయాలనేంత చక్కటి నాణ్యతతో ఈ డీవీడీ రూపొందింది. చూస్తున్నంత సేపు ఇది డాక్యుమెంటరీలా కాకుండా విజయా వారి సినిమాలాగే చల్లని అనుభూతి కలిగిస్తుంది. ఇప్పటికే ఎవరైనా ఈ డీవీడీని పొందగలిగి ఉంటే చందమామ అభిమానులకు అందించడానికి ప్రయత్నించగలరు.

ఈ డీవీడీని చందమామ అభిమానులు, విజయా పిక్చర్స్ సినిమాల అభిమానులు కాకపోతే మరెవ్వరు చూడాలి?

‘జ్ఞాపకాల పందిరి’ – ‘ఆనాటి ఆనవాళ్ళు’
తెలుగు చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయం కేటాయింపజేసుకున్న ..మహా వ్యక్తి బి.నాగిరెడ్డిపై ‘జ్ఞాపకాల పందిరి’ పేరుతో రెండేళ్ల క్రితం ఓ పుస్తకం వెలువడింది. బి.నాగిరెడ్డి తనయుడు బి.విశ్వనాధ్‌ రెడ్డి ఈ బృహత్‌ కార్యాన్ని చేపట్టారు. నేటితరం వారికే కాకుండా, భావి తరాలవారికీ ఉపయోగపడేలా నాగిరెడ్డి జ్ఞాపకాలన్నింటినీ గుదిగుచ్చి పుస్తకంగా వెలువరించారు.

దీనితోపాటు ప్రముఖ యువ సినీ పాత్రికేయుడు పులగం చిన్నారాయణ గారు రచించిన ‘ఆనాటి ఆనవాళ్లు’ పుస్తకం కూడా రెండేళ్ల క్రితం విశ్వనాధరెడ్డి గారు ప్రచురించారు. తెలుగు సినిమా మొదలై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన వజ్రోత్సవాలలో భాగంగా ఈ పుస్తకం ప్రచురించారు. గత 75 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో 75 ఆణిముత్యాల్లాంటి సినిమాలను ఈ పుస్తకంలో సమీక్షించారు. ఇవి రెండూ చందమామ అభిమానులను అలరించే అద్భుత సమాచార గనులు. చదవకపోతే తప్పక తీసుకోండి.

గత మూడురోజులుగా జలుబు, గొంతునొప్పి, కండ్లకలకతో ఇబ్బందిపడుతున్నాను. ఈ రోజు నాగిరెడ్డి గారిపై డీవీడీని మళ్లీ ఓసారి పూర్తిగా చూస్తూ ఈ కథనం పూర్తి చేసేసరికి మనసంతా ఫ్రీ అయిపోయింది..

November 14th, 2010న చందమామ బ్లాగులో ప్రచురించబడింది.

RTS Perm Link
test Filed under B.Nagireddy | Edit | Comments (14)

14 Responses to “చందమామ లెజెండ్ నాగిరెడ్డి గారిపై డీవీడీ”

1. SIVARAMAPRASAD KAPPAGANTU on November 14, 2010 12:49 PM Edit This
చాలా మంచి సమాచారం ఇచ్చారు రాజుగారూ. మీరు సేకరించిన డి వి డి ఈసారి భద్రం సుమా. మళ్ళి మళ్ళి అటువంటి అపురూపమైన కళాసంపదను తిరిగి పొందలెము. నాగిరెడ్డిగారు గురించిన చాలా విషయాలు విశేషాలు చక్కగా చెప్పారు. ఆ డి వి డి ని నేను విజయవర్ధన్ గారి వద్దకు వచ్చిన తరువాత నేను చూద్దామని ఆశ.

మీ వ్యాసంలో పంటికిందకు రాయిలా ఒక్క మాట మాత్రం ఉన్నది అది “మడమ తిప్పవద్దు”. ఈ మాటను, ఈ మధ్య కాలంలో చౌకబారు సినిమాలల్లోనూ రాజకీయాల్లోనూ ఏ మాత్రం సందర్భ శుధ్ధి లేని వాడకంతో భ్రష్టు పట్టించటంతో ఈ వ్యాసం చదువుతున్నప్పుడు గుర్తుకు రాకూడని వ్యక్తులు జ్ఞప్తికి వస్తున్నారు. దయచేసి ఆ మాటను మార్చి మరొక సముచితమైన మాటను వాడండి,

2. chandamama on November 14, 2010 1:11 PM Edit This
శివరాం గారూ,
మీరు ఇంటర్నెట్‌కి అందుబాటులో ఉండను అని సమాచారం పంపడంతో ఊళ్లో లేరనుకున్నాను. కాని మొదటగా మీరే ఈ కథనం చూశారు. మీరన్న ఆ పంటికింద రాయిని ఇప్పుడే మూలంలో తొలగించేశాను. మడమ తిప్పవద్దు అన్న పదం అక్కడిదాగా పోతుందని నేను ఊహించలేదు. సకాలంలో మంచి అంశం గుర్తు చేసారు.

మీరు విజయవర్ధన్ గారి వద్దనుంచి తీసుకోవడం ఎందుకు? ఒక కాపీని మీకే నేరుగా పంపిస్తాను. మీకు కాకపోతే మరెవరికి పంపించాలి? అయితే విజయవర్దన్ గారికి మాట ఇచ్చాను కాబట్టి ఆయన పేరు ప్రత్యేకించి పేర్కోన్నానంతే..
థాంక్యూ ఫర్ కాంప్లిమెంట్…

3. Dasari Venkata Ramana on November 14, 2010 1:23 PM Edit This
రాజు గారూ! నాగిరెడ్డి గారిపై మీరు రాసిన కథనం చదువుతూంటే మీరు చెబుతున్న ఆ డీవీడీ చూస్తున్న అనుభూతి కలుగుతున్నది….
…… అలాగని ఆ డీవీడీ నాకు అవసరం లేదు అని నా వుద్దేశ్యం కాదు సుమా! అభినందనలు.

4. chandamama on November 14, 2010 1:38 PM Edit This
వెంకట రమణ గారూ,
ముందుగా నేను కొన్ని డీవీడీలను సిద్ధం చేస్తాను. మీతో సహా చందమామ అభిమానులందరికీ దీన్ని అందించడానికి ఏర్పాట్లు చేస్తాను. దీనిలో ఏ కమర్షియల్ ఎలిమెంట్లూ ఉండవని హామీ ఇస్తున్నా. విజయా ఆసుపత్రి వారు దీన్ని మార్కెట్లో రిలీజీ్ చేసి ఉంటే అపురూప సేకరణగా దీన్ని అందరమూ కొని భద్రపర్చుకోగలిగేవాళ్లం. అలాంటి వీలు లేదు కాబట్టే ఈ ప్రయత్నం.
మీరు ఇటీవలే పంపిన ‘వ్యక్తివికాసం’ కథ ఎంపికయింది. జనవరి నెలలో ఇది ప్రింట్ కావచ్చు. ఫైనల్‌గా పేజ్ లిస్ట్ తయారయ్యాక మీకు తెలుపాలనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. మంచి కథ పంపినందుకు ధన్యవాదాలు. మంచి కథ అంటే అన్ని అడ్డంకులనూ తప్పించుకుని ఎంపికయ్యే కథ అని నా ఉద్దేశం. మీ నుంచి మరిన్ని “మంచి” కథలు ఆశించవచ్చా?

5. kcube on November 14, 2010 9:04 PM Edit This
రాజుగారూ దానిని నెట్ లో అప్ లోడ్ చేయకూడదా? అంతా చూస్తాం కదా? మెగా అప్ లోడ్ సైట్ లో చేసి ఇక్కడ లింక్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ కాలం దాచుకోవడం కంటే పంచుకునే అవకాశం ఎక్కువగా వుంది కదా? మీ ఇష్టం…

6. దామోదరం on November 15, 2010 12:28 AM Edit This
తెలుగు సినీ పరిశ్రమకు వాణిజ్య దృష్టితో కాకుండా ఉత్తమాభిరుచితో సేవలు అందించిన ఓ మహోన్నత వ్యక్తి గురించి ఇంత విఫులంగా వివరించినందుకు ధన్యవాదాలు. భావితరాలకు ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి తెలపాలన్న మీ తపన ఎంతైనా గొప్పది. ఇలాంటి అభిరుచిని మీరు కొనసాగిస్తారని ఆశిస్తున్నా….

7. Bhanu Chowdary on November 15, 2010 2:28 AM Edit This
Raju garu, Naku Oka DVD pampincha galaru leda internet lo upload chesinaa link ivvagalaru.

8. వేణు on November 15, 2010 3:13 AM Edit This
రాజు గారూ! చాలా ప్రత్యేకతలున్న డీవీడీ గురించి మా అందరితో పంచుకున్నందుకు మీకు అభినందనలూ, ధన్యవాదాలూ. కాపీరైట్ సమస్య లేకుంటే ఈ డీవీడీని నెట్లో అప్ లోడ్ చేస్తేనే మంచిది! నాగిరెడ్డి గారి జీవన వైవిధ్యం ఎంతో ఆసక్తికరం. చందమామ స్థాపన నేపథ్యం తెలుసుకోవటం సంతోషంగా ఉంది.

బీఎన్ కే ప్రెస్ లో చందమామ రంగుల ముద్రణ ప్రత్యేకత గురించి ఈ డీవీలో విజువల్స్ తో పాటు క్లుప్తంగానైనా ప్రస్తావించివుంటారు . నిజానికి ఆ ప్రెస్ ముద్రణ ‘చందమామ చరిత్ర’లో ప్రముఖమైన అంశం కూడా! ఆ విశేషాలన్నీ వివరంగా మీరే ఓ టపాగా రాయాలి!

9. కమల్ on November 15, 2010 10:25 AM Edit This
తెలుగు చలనచిత్ర ఆణిముత్యం గురించి మంచి వ్యాసం ఇచ్చారు, ధన్యవాదాలు మీకు. మీరు చెప్పిన డి.వి.డి మేము పొందాలంటే బయట దొరుకుతుందా..? లేక ఆ డి.వి.డి ని ఎలా పొందగలమో చెప్పగలరు..! మీ వ్యాసం ఆసాంతం ఆలరించింది.. సినీప్రముఖులందరి గురించి..చెప్పారు కాని అసలైన వ్యక్తిని మరిచిపోయారు..బహుశ కాకతాళియంగా జరిందనుకోవచ్చు..అసలు విజయా సంస్థ అని అనగానే గుర్తోచ్చే మరొక వ్యక్తి ఉన్నారు.

10. rajasekhara Raju on November 16, 2010 6:05 AM Edit This
శ్రీ మట్టెగుంట అప్పారావు గారు, శ్రీ జొన్నలగడ్డ మార్కండేయులుగారు ఈ కథనంపై తమ అభిప్రాయాలను ఈమెయిల్‌కు పంపారు. అవి వ్యక్తిగతం కావు కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను.

నాగిరెడ్డిగారి డీవీడీ చూడలేకపోయినా వివరంగా విశేషాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. కొంతకాలం “చందమామ” ఆగిపోయి తిరిగి ప్రచురణ మొదలు పెట్టాక ఆ ప్రతులను నాగిరెడ్డిగారికి ఆయన కుమారుడు శ్రీ విశ్వం చూపించినప్పుడు తృప్తిగా గుండెలకు హత్తుకున్నారట. ఆ సమయంలోఆయనతీవ్ర అనారోగ్యంతో వున్నారు. “చందమామ ను అమితంగా అభిమానించే నేను కొద్ది కాలం నుంచి కొనడం మానివేశాను. అక్టోబరు సంచిక అలనాటి ముఖచిత్రంతో వచ్చిందని తెలిసి కొన్న నేను అవాక్కయ్యాను. రూపే మారిపోయింది.ఓ చిన్న పాకెట్ బుక్ సైజులో వుంది.పైలోకాల్లో వున్న నాగిరెడ్డి చక్రపాణిల ఆత్మ ఎంత క్షోభిస్తుందో అనిపించింది. ఇంటికి రాగానే నా పాత చందమామల బైండ్లను మరో సారి తనివితీరా చూసుకొని ఆనందించా. ప్రస్తుత నిర్వాహకులు కనిసం తెలుగు చందమామ ప్రచురణ నిలిపి వేసి అభిమానుల గుండెకోతను దూరం చేయాలని కోరుకుంటున్నాను. ఈ మాటలను తీరని వ్యధతో వ్రాస్తున్నందుకు మన్నించండి.
–మట్టెగుంట అప్పారావు

డియర్ రాజశేఖర్ గారు
నాగిరెడ్డి గారి మీద స్పందనలు చూసి మిమ్మలిని మళ్ళీ అభినందిస్తున్నాను నా కామెంటు అక్కడ రాస్తుంటే సేవ్ అవడము లేదు. అందుచేత pdf గా వెంటనే ఇదివరకే పంపించాను చూసే ఉంటారు. దాగని యదార్థ విషయాన్ని మనసున కట్టుకునేలా కనులముందు నిలిపిన మీ అంకిత భావ శైలీ వివరణ ఎ కోణం లోంచి చూసినా అబినందనీయము.
మార్కండేయులు

11. Chandamama on November 16, 2010 6:09 AM Edit This
శ్రీ బి. విజయవర్ధన్ గారు బాపు గారి బొమ్మల సైట్ గురించి సమాచారం పంపారు. అది ప్రస్తుతానికి ఇక్కడ పొందుపరుస్తున్నాను.
నమస్కారము.

బాపు అభిమానులకు ఒక శుభవార్త. బాపు గారి కోరిక మేరకు నా మిత్రుడు రవి శంకర్ ఒక web site నిర్మించాడు. ఇకపైన బాపు గారి బొమ్మలన్నీ ఈ site ద్వారా కొనుక్కోవచ్చు. బాపు గారి బొమ్మలను బాపు గారి అనుమతి లేకుండా పలువురు అమ్ముతున్నారని, బాపు గారే ఈ web site ద్వారా బొమ్మలను అందుబాట్లోకి తెస్తున్నారు. ఈ web site గురించి బాపు గారి మాటల్లోనే వినవచ్చు (క్రింద జత చేసిన videoలో చూడవచ్చు). ఈ విషయం మీ మిత్రులందరికీ తెలియపరచండి. అనధికారిక అమ్మకాలను నిలువరించటంలో తోడ్పడండి. వీలైతే మీ బ్లాగులో ఈ విషయం ప్రచురించండి. బాపు గారి videos మీ బ్లాగులో పెట్టడానికి వీలుగా embed code క్రింద జత పరిచాను.

Web site గురించి చెబుతున్న బాపు గారు (తెలుగులో).
Web site గురించి చెబుతున్న బాపు గారు (Englishలో)
Thanks & Regards
Vijay (B.Vijay Varthan)

12. K.Rohiniprasad on November 16, 2010 7:25 AM Edit This
చక్రపాణిగారిలాగే నాగిరెడ్డిగారు కూడా మితభాషి. ఆయన మోడెస్టీ చూస్తే ఆశ్చర్యం వేసేది. తన పిల్లల పెళ్ళి రిసెప్షన్లవంటి సందర్భాల్లో సైతం ఆయన ఒదిగి, ఒక పక్కగా నిలబడి బిడియంగా నవ్వుతూ అందరినీ ఆహ్వానించేవారు. ముఖ్యమంత్రులూ, సినిమా స్టార్లూ, సినీ ఇండస్ట్రీలోని అతిముఖ్యులూ హాజరయే ఆ ఫంక్షన్లలో ఆయనే స్టార్ ఎట్రాక్షన్ అయినప్పటికీ ఆయన వైఖరి అలాగే ఉండేది. చదువులూ, డిగ్రీలతో సంబంధంలేని మంచి సంస్కారం ఆయనలో కనబడేది.

13. చందమామ on November 16, 2010 11:12 AM Edit This
రోహిణీ ప్రసాద్ గారూ, నేను ఒత్తిడిలో ఉండి వదిలేసిన చక్కటి అంశాన్ని మీరు ప్రస్తావించి మంచి పనిచేశారు. మితభాషి, నిగర్వి, నమ్రతా స్వభావి, బిడియం, సాధారణ మానవ ప్రపంచంలో ఎవ్వరమూ ఊహించలేని మంచితనం…. ఒక వ్యక్తి ఇన్నివిధాల వ్యక్తిత్వ గుణాలను జీవిత పర్యంతమూ కొనసాగించడం ఇక ఎన్నడూ చూడలేమేమో..

నిజంగానే ఈ డీవీడీలో ఆయన చరమాంకంలో ఉండి మాట్లాడుతున్నప్పుడు కూడా వంగిన భంగిమలోనే ఉన్నారు తప్పితే వీపు నిటారుగా పెట్టలేదు. కాసింత సంపద, కాసింత అధికారం, కాసింత స్థాయి రాగానే ఇక కాళ్ళు భూమ్మీద మోపలేనంత మహా గర్విష్ట ప్రపంచంలో ఉంటున్నాం. ప్రపంచంలో ప్రారంభించబడిన తర్వాత… పాడైపోయిన, విధ్వంసమైపోయిన మహా మహా పరిణామాలన్నీ వ్యక్తుల అహాలతో, అహాల ప్రదర్శనలతోనే, ఇతరులపై ముద్రలు వేసి తొక్కడంతోటే సగం నాశనమైపోయాయని నా నిశ్చితాభిప్రాయం.

సాధికారికంగా ఒక్కటి మాత్రం చెప్పగలను. ఆయన రైతుబిడ్డగా పుట్టాడు. జీవితంలో అడుగడుగునా రైతు లక్షణాలను ఏమాత్రమూ విడువకుండా, మరవకుండా బతికాడు. ఆయన వదనం ఏ భంగిమలో చూసినా ఆనంద విషాదాల కలయికగానే నాకు కనిపిస్తుంటుంది. సరిగ్గా భారతీయ రైతు వదనం కూడా ఇదే. ఎప్పుడు జీవితంలో ఆనందం వస్తుందో, ఎప్పుడు విషాదం ప్రవేశిస్తుందో తెలియని బతుకు ఈ దేశపు రైతుది. సర్వం కోల్పోయి బికారిగా మిగిలినా, పుంజుకుని కోట్లకు పడగలెత్తినా ఆయన ముఖంలో అదే ఆనందం, అదే విషాదం.

ఈ పిల్లలూ, ఆస్తులూ, సంపదలూ ఏవీ మిగలవు అని చివర్లో అంత ఘంటాపధంగా ఆయన ప్రకటించాడంటే జీవితం పట్ల సగటు రైతుకున్న నిర్వేదమే అందుక్కారణం.

నూటికి 99.9 శాతం ఆయన మనీషి. మిగిలిన 0.1 శాతం మచ్చ ఏ మనిషికైనా ఉంటుంది. దాన్ని ఈ సందర్భంలో ప్రస్తావించడం భావ్యం కాదు. పరిపూర్ణత ఎక్కడ సాధ్యపడుతుంది?

నాగిరెడ్డిగారిపై విజయా పబ్లికేషన్స్ ప్రచురించిన జీవిత, వృత్తి విశేషాల సమాహారం ‘జ్ఞాపకాల పందిరి’ని మళ్లీ ఈరోజు పరామర్శగా చూశాను. ఈ డీవీడీలో కూడా లేని ఎన్నో విశేషాలు ఈ చిన్ని పుస్తకంలో ఉన్నాయి. చిన్నప్పుడు ఆయన ఇంట్లో, బడిలో, ఊరిలో నేర్చుకున్న మంచి విలువలు ఏ ఒక్కటీ ఆయన జీవితంలో వదిలిపెట్టలేదు. వీలైతే మీరు కూడా తప్పక ఈ పుస్తకం చదవగలరు.
మంచి విషయాన్ని ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.

14. చందమామ on November 16, 2010 11:41 AM Edit This
కుబేర్ వర్మ, దామోదరం, భాను, వేణు, కమల్, అప్పారావు, మార్కండేయులు గార్లకు క్షమాపణలు. మొన్న ఆదివారం అనారోగ్యంలో ఉండి కూడా వీరావేశం పూనినట్లుగా అన్ని పనులూ మానుకుని ఈ కథనం పూర్తి చేశాను. సోమవారం మళ్లీ పడిపోయాను. ఇప్పుడు మాత్రమే సమయం దొరికింది. ఆలస్యానికి ఇదే కారణం.

మీరు కోరినట్లుగా డీవీడీ నెట్‌లో అప్‌లోడ్ చేయడం నాకు కుదరకపోవచ్చు. చాలా మొహమాటాలు, మరికొన్ని భయాలు అడ్డువస్తున్నాయి. దానికి తోడు మిత్రుల సదుద్దేశపు హెచ్చరికలు కూడా అనుకోండి. విజయా హాస్పిటల్ యాజమాన్యమే తగిన ధరతో ఈ డీవీడీని అందరికీ అందుబాటులోకి తెచ్చి ఉంటే చాలా బాగుండేది. కానీ చందమామ తన చరిత్ర తానే లేకుండా చేసుకున్నట్లే, మరుగున ఉండడం అనే చందమామ సంప్రదాయాన్నే వీరు నాగిరెడ్డిగారి విషయంలోనూ అమలుపరిచారనుకుంటాను. అందుకే కొంత లేటయినా డీవీడీనే కాపీ చేసి పంపుతాను. కాపీ రైట్ హక్కుల విషయంలో ఇదీ కూడా అభ్యంతరకరమే కావచ్చు. కానీ మన చిన్నప్పటినుంచి చందమామకోసం ఎన్ని విధాలుగా కొట్లాడేవాళ్లమో, ఏ రకంగానైనా సరే ఆ పుస్తకాన్ని కొల్గగొట్టేవాళ్లమో, ఆ సాంప్రదాయంలో భాగంగానే చందమామ అభిమానులకు దీన్ని అందివ్వాలని ఉంది.
మీరందరూ డీవీడీ అడుగుతున్నారు కాబట్టి నా పర్సనల్ ఈ మెయిల్‌కి మీ చిరునామాలు పంపగలరు

krajasekhara@gmail.com
కొంత సమయం తర్వాత మీకు వీటిని తప్పక అందించే ప్రయత్నం చేస్తాను.
వేణుగారూ, డీవీడీలో చందమామ విశేషాల గురించి ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. కొన్ని వందల చందమామలు బీఎన్‌కె ప్రెస్‌ అసెంబ్లింగ్ లైన్‌లో ఫైనల్ పిన్నింగ్‌తో తయారై వెళుతున్న అపరూప దృశ్యాన్ని క్షణ కాలం పాటు మాత్రమే చూపించారు. చూసింతర్వాత నిరాశ పడవకండి. నాగిరెడ్డిగారిపై సమకాలీనుల నివాళికే దీంట్లో ప్రాధాన్యత. ఆ పరిమితితోనే చూడడానికి సిద్దంగా ఉండండి.
అంతకు ముందుగా నాగిరెడ్డి గారి వర్దంతి సందర్భంగా ఆరునెలల క్రితం టీవీ ఛానెళ్లలో వచ్చిన ప్రత్యేక ప్రోగ్రాముల వీడియో లింకులను నిన్న నెట్‌లోంచి పట్టుకుని మీకూ అందిస్తున్నాను చూడండి.

b. Nagireddy biography vedio links
1.
http://www.youtube.com/watch?v=e5TRKcAdWkc
2.
http://www.youtube.com/watch?v=IR8ODS2s1W8
3.
http://andhrawatch.com/tv-shows/7130-ntv-b-nagi-reddy-biography-2-videos.html

వీటిలో 3వ లింకు అంతక్వాలిటీతో లేదనిపిస్తోంది. నిన్న మా తమ్ముడికి ఈ లింకులను పంపితే వాటిని నేరుగా డౌన్‌లోడ్ చేశాడు. తొలి రెండింటి క్వాలిటీ చాలా బాగుంది. నాగిరెడ్డిగారి మొత్తం జీవిత స్కెచ్‌పై Ntv తెలుగు ఛానెల్ అందించిన ప్రోగ్రాంని రెండు వీడియో ఫైళ్లుగా ఒక బ్లాగర్ తన బ్లాగులో లింకులను ఇచ్చారు. దాన్నే మావాడు డౌన్‌లోడ్ చేసేశాడు.

వీలయితే మీరందరూ వీటిని చూడగలరు. క్వాలిటీ చాలా బాగున్నాయి. విషయమూ బాగుంది.
స్పందించిన అందరికీ ధన్యవాదాలు.

అప్పారావుగారూ, మీ స్పందనలో మీరు వెలువరించిన గుండెకోతను అర్థం చేసుకుంటున్నాము. కాని ఈ విషయంలో నిస్సహాయులం. క్షమించండి.