Saturday, May 27, 2017

ఐదు దశాబ్దాల వసంత మేఘగర్జన.. నక్సల్బరీ

‘‘నక్సల్బరీ ఏకీ రస్తా’’ ‘‘నక్సల్బరీ గతం కాదు, చరిత్ర, వర్తమానం, భవిష్యత్తుకూడా.’’ 

‘‘నక్సల్బరీ ఏకీ రస్తా’’ ‘‘నక్సల్బరీ గతం కాదు, చరిత్ర, వర్తమానం, భవిష్యత్తుకూడా.’’
92 ఏళ్ళ కురు వృద్ధుడు కొకొణ్‌ మజూందార్‌ తడబడుతోన్న గొంతులోంచి ఏమాత్రం తొట్రుపడకుండా నక్సల్బరీని వ్యాఖ్యానించిన తీరు ఇది. నక్సల్బరీ విప్లవోద్యమ ముద్దుబిడ్డ చారూమజూందార్‌ యావత్‌ భారతదేశ జనావళికి అందించిన పోరాట పంథాని చేబూని, చైనా విప్లవోద్యమ మహానాయకుడు మావోసేటుంగ్‌ లాంగ్‌మార్చ్‌ స్ఫూర్తితో పశ్చింబెంగాల్‌ లోని కుగ్రామమైన  నక్సల్బరీ నుంచి చైనాకు నడిచి వెళ్ళి అక్కడ ఆయుధ శిక్షణనొంది, మావోతో చర్చలు జరిపి తిరిగొచ్చిన నాటి నవయుకుడు నేటి కురువృద్ధుడు కొకొణ్‌ మజూందార్‌ తెలుగు గడ్డ నుంచి తొలిసారిగా నక్సల్బరీలో అడుగుపెట్టిన ఏకైక పత్రిక ‘సాక్షి’తో అన్న మాటలివి.

‘‘దేశ అంతరంగిక భద్రతకు పెనుముప్పు నక్సలిజం’’ ఈ మాటలన్నది భారతదేశ మాజీ  ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌. ఇదే ప్రజల భాషలోకి తిరగరాస్తే నక్సల్బరీ ఒక ఊరు కాదు. ఓ సిద్ధాంతం. నక్సల్బరీ ముప్పుకాదు, పెను ఉప్పెన. ప్రపంచం నలుమూలలా వెల్లువెత్తుతోన్న ప్రజా పోరాటాలూ, జాతుల విముక్తి ఉద్యమాలతో ప్రభావితమై విప్లవాన్ని వర్షించిన  వసంత మేఘ గర్జన నక్సల్బరీ. యాభై వసంతాలను పూర్తిచేసుకుంటోన్న నక్సల్బరీలోనికి అడుగుపెట్టిన సాక్షికి నక్సల్బరీ విప్లవోద్యమం, నిర్బంధం, నాటి ఆదివాసీ, రైతాంగ పోరాటాలూ, భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాట్లూ అనుభవాలను సజీవంగా మా ముందుంచారు.

నక్సల్బరీ నెత్తుటికి ప్రత్యక్ష సాక్షి శాంతి ముండాపదిహేను రోజుల పురుటి గుడ్డును పొత్తిళ్ళలోకెత్తుకుని రైతాంగపోరాటంలో పాల్గొన్న ఆదివాసీ యువతి యిప్పుడు పండు ముసలి శాంతి ముండా స్వయంగా నాటి పోరాటాన్ని సాక్షికి కళ్ళకు కట్టినట్టు చెప్పారు.

శాంతి ముండా! విప్లవాగ్నులను రాజేసిన నక్సల్బరీ పురిటిగడ్డపై భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన మహోద్యమంలో చిందిన నెత్తుటికి ప్రత్యక్ష సాక్షి. నక్సల్బరీ ఉద్యమానికి ప్రత్యక్షనాయకత్వం వహించి, మొదటి నక్సలైట్‌గా ప్రసిద్ధిగాంచిన కానూసన్యాల్‌తో భుజం, భుజం కలిపి నడిచిన నక్సల్బరీలో మిగిలిఉన్న నాటి పోరాట జ్ఞాపకం శాంతి ముండా. నక్సల్బరీ అనే నాలుగక్షరాలు ఐదు దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలను, మరెన్నో త్యాగాలను తనలో నింపుకున్న విప్లవోద్యమ మహాచరితపై ఆమె ఓ చిరు సంతకం. నా ప్రశ్నలకు సమాధానంగా ఆమె నోరు విప్పింది.

శాంతి ముండాది నక్సల్బరీ ప్రాంతంలోని సిలిగురికి ఐదారుకిలోమీటర్ల దూరంలో ఉన్న హత్‌ఘిస్సా గ్రామం. కమ్యూనిస్టు పార్టీ చీలికకు ముందే ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కాలంలోనే అంటే 1958లో తొలిసారిగా ఆమె పార్టీలో సభ్యురాలిగా చేరారు. 1967లో ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సల్బరీ సాయుధ తిరుగుబాటులో ముందువరుసలో ఉన్నవారిలో శాంతిముండా కూడా ఒకరు. నక్సల్బరీ తొలితరం నాయకుడైన కానూసన్యాల్‌తోనూ, ఆయన సిద్ధాంతంతోనూ  తుదకంటా వెన్నంటి నడిచిన కూనూదాదా అనుచరురాలు. భూపోరాటాల్లో 12 ఏళ్ళ చిన్నారి శాంతి ముండా భాగమయ్యారు.

‘‘రెండు బీగాల (ఆరెకరం) పొలం తిండికే చాలేది కాదు. దీనికి తోడు భూస్వాముల దగ్గర తెచ్చుకున్న రుణం తీర్చేందుకు పండిన పంట మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. ఇక మిగిలిన తాలు గింజలను చీపురుతో పోగుచేసుకుని ఇంటికి తెచ్చుకుని గంజితాగి బతికే పరిస్థితి మాది’’.  ‘‘మాదే కాదు. హతిఘస్సా చుట్టుపక్కల గ్రామాల్లోని మెజారిటీ ప్రజలందరిదీ అదే పరిస్థితి. అంతా చిన్న, సన్నకారు రైతులే. రోజురోజుకీ శృతిమించిపోతున్న పెత్తందార్ల, జోతేదార్ల పోకడలకు వ్యతిరేకంగా చిన్న నిరసనలుగా ప్రారంభమైన మా పోరాటం దావానలమైంది. అయితే 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా నాటి తమ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు స్ఫూర్తిదాయకమయ్యిందని శాంతి ముండా గుర్తుచేసుకున్నారు.

నక్సల్బరీ నిప్పుకణికకు ఇక్కడే బీజంనక్సల్బరీ ప్రాంతంలో 1960 దశకం ప్రారంభం నుంచే సిపిఎం నాయకత్వంలోనే పోరాటబీజాలు పడ్డాయి. ఆ క్రమంలో 1967 మార్చి 3న డార్జిలింగ్‌ జిల్లాలోని నక్సల్బరీకి సమీపంలోని హతిఘస్సా ప్రాంతంలో భూస్వాముల, జోతేదార్ల దోపిడీకి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది. çపండించిన పంట మొత్తాన్ని భూస్వాములే దోచుకుంటుంటే కడుపుమండిన రైతాంగం భూస్వాముల భుముల్లో ఎర్రజెండాలు పాతి పంటను కోసుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత భూస్వాముల గ్రామీణ ప్రాంతాల పెత్తందార్ల దోపిడీని నిర్మూలించడానికి రైతాంగాన్ని సంఘటిత పరిచి సాయుధం చేయాలని నాటి సిపిఎం స్థానిక పార్టీ నిర్ణయించింది.దీనికి ప్రధానంగా చారూమజూందార్‌ సిద్ధాంతభూమికను తయారుచేసారు. 8 డాక్యుమెంట్ల పేరుతో నక్సల్బరీ పోరాటానికి ముందే ఆయన ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసారు. దీని ప్రభావంతో నక్సల్బరీ, కరీబరీ, ఫాన్సీ దేవ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 274 చదరపు మైళ్ళ ప్రాంతంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో 60 కి పైగా పోరాట సంఘటనలు జరిగాయి. గ్రామగ్రామంలో రైతులు కమిటీలుగా ఏర్పడి జోతేదార్ల వద్ద ఉన్న భూములను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. దాదాపు 20 వేల మంది రైతులు ఉద్యమంలో పూర్తికాలం కార్యకర్తలుగా చేరారు.

ఈ క్రమంలోనే జరిగిన సంఘటన నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటచరిత్రలో నిప్పుకణికగా చెప్పుకోవచ్చు. మే 24న జోతేదార్లకు మద్దతుగా వస్తున్న పోలీసులకు అక్కడి రైతాంగానికీ, ఆదివాసీలకు మధ్య జరిగిన ఘర్షణలో సోనం వాంగ్డే అనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై ఆదివాసీలు సాంప్రదాయక ఆయుధాలైన బాణాలతో దాడిచేసారు. దానికి ప్రతీకారంగా మే 25వ తేదీన పోలీసులు బెంగాయ్‌ జోతె గ్రామంపై పెద్దెత్తున జరిపిన కాల్పుల్లో 7 గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఒక పురుషుడు మరణించారు. ఆ కాల్పుల్లో ధనేశ్వరీ దేవి, సీమేశ్వరీ మాలిక్, నయనేశ్వరీ మాలిక్, సురుబాలా బర్మన్, సోనామతీ సింగ్, ఫులుమతీదేవి, సంసారీ సైభానీ, గౌద్రౌ సైబానీ, కర్సింగ్‌ మాలిక్‌ తోపాటు ఇద్దరు చిన్నారులు మరణించారు. ప్రసాద్‌ జోతె మారణకాండగా పేరొందిన ఈ ఘటన నక్సల్బరీ పోరాటానికి నాందీ ప్రస్థానంగా చెప్పుకోవచ్చు. ఈ ఘటనతో పోలీసుల నిర్బంధం తీవ్రమైంది. చారూమజూందార్‌ తో పాటు అనేకమంది నాయకులు అజ్ఞాత వాసంలోనికి వెళ్ళారు.

చైనాకు వెళ్లి మావోను కలిసిన నక్సల్బరీ నాయకత్వంఆ సమయంలోనే  కానూసన్యాల్, కొకణ్‌ మజూందార్, కుదన్‌లాల్‌ మాలిక్, దీపక్‌ బిశ్వాస్‌ అనే నలుగురు సభ్యులతో కూడిన నక్సల్బరీ నాయకత్వం చైనాలో మావోసేటుంగ్‌ని కలిసి, ఆయుధ శిక్షణతో పాటు, నాటి భారత విప్లవ రాజకీయాలను చర్చించారు. 1967 సెప్టెంబర్‌లో బయలుదేరి వెళ్ళిన బృందం డిసెంబర్‌ 24 వరకు  మూడునెలలపాటు చైనాలో గడిపింది. ఈ బృందంలో ఒకరైన కుదన్‌లాల్‌ మాలిక్‌ నాడు మావోసేటుంగ్‌తో తమ అనుభూతులను నెమరువేసుకున్నారు. మావోను కలిసిన అనుభవం మమ్మల్నెంతో ఉత్తేజితులను చేసిందనీ, నక్సల్బరీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు అశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో భాగం చేయాలనీ, లేదంటే తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేసినట్టే రాజ్యం అణచివేస్తుందనీ మావో వ్యాఖ్యానించారని కుదన్‌లాల్‌ మాలిక్‌ గుర్తుచేసుకున్నారు.

చారూ మజూందార్‌ కుమారుడు అభిజిత్‌ మజూందార్‌విప్లవ నినాదానికి సైద్ధాంతిక భూమికనందించిన పేరు. యాభయ్యేళ్ళుగా పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న పేరు. దేశంలోని లక్షలాది మంది ప్రజల్లో విప్లవాగ్నులు రగిల్చిన చిన్న నిప్పుకణికను అందించిన నాలుగక్షరాల నక్సల్బరీ ఉద్యమాన్ని సాయుధపోరాటంవైపు మళ్ళించి, పాలకులను గడగడలాడించిన చారూ మజూందార్‌ ఏకైక కుమారుడు అభిజిత్‌ మజూందార్‌ అన్న మాటలవి.

‘‘చైనా ఛైర్మన్‌ ఈజ్‌ అవర్‌ ఛైర్మన్‌. మావో సేటుంగ్‌ ఈజ్‌ అవర్‌ లీడర్‌. చిన్ని చిన్ని చేతులతో మేం రాసిన గోడరాతలవి. నిజానికి విప్లవోద్యమ ఆటలవి. మాటలైనా, పాటలైనా, చివరకు ఆటలైనా నాడు విప్లవమే. అత్యంత నిర్భందం మధ్య, పోలీసు పదఘట్టనల మధ్య మా కుటుంబం నేపథ్యం అసాధారణంగా గడిచింది’’.

‘‘అప్పటికి నాకు ఏడేళ్ళుంటాయేమో కొనసాగించాడు చారూమజూందార్‌ సంతానంలో అందరికన్నా చిన్నవాడైన అభిజిత్‌ మజూందార్‌. అభిజిత్‌ మజూందార్‌కి ఇద్దరక్కలు. అనిత, మధుమిత. అంత చిన్న వయస్సులో అన్ని ఘటనలూ సరిగ్గా గుర్తులేకపోయినా అర్థ రాత్రీ అపరాత్రీ అని లేకుండా ప్రతినిత్యం ఇంటిని ముట్టడించి, భయభ్రాంతులకు గురైచేసిన నాటి నిర్బంధం నాకు మిగిల్చిన చేదు జ్ఞాపకాలెన్నో.  ‘‘ సమానత్వం కోసం సాయుధపోరాటమార్గాన్ని ఎంచుకున్న నాన్నని ఓ హంతకుడిలా చూసిన సమాజం నుంచి అమ్మ చాలా చేదు అనుభవాలను ఎదుర్కొంది. అయినా మొక్కవోని ధైర్యం మమ్మల్ని మనుషులుగా తీర్చిదిద్దింది.’’

మా అమ్మమ్మ ఊరైన సిలిగురిలో అమ్మా, నాన్న ఇద్దరూ కలిసారు. పెళ్ళి చేసుకున్నారు. మాది ఉమ్మడి కుటుంబం. మా తాతగారు ప్రభుత్వోద్యోగి. రాజకీయ అవగాహన కలిగిన కుటుంబం మాది. అమ్మా, నాన్నా ఇద్దరూ మార్క్సిస్టు పార్టీ సభ్యులుగా ఉండేవారు. మార్క్సిస్టు పార్టీతో సైద్ధాంతికంగా విభేదించి  నాన్నతో సహా  కానూసన్యాల్‌ మరికొందరు నాయకులు మార్క్సిస్టు లెనినిస్ట్‌ పార్టీని స్థాపించారు. అప్పటికీ కూడా అమ్మ సిపిఎం సభ్యత్వాన్ని వదులుకోలేదు. రాజకీయంగా నాన్నకి వెన్నుదన్నుగా నిలిచింది అమ్మ. మా ఇల్లు ఎప్పుడూ చాలా సందడిగా ఉండేది. ఎవరెవరో వచ్చి పోతూ ఉండేవారు. ఇంట్లో చాలా తక్కువగా గడిపేవారు. రాను రాను నాన్న ఇంటికి రావడం తగ్గిపోయింది. ఇంకొన్నాళ్లకు నాన్న అర్థరాత్రుళ్ళు ఏ కొద్ది సమయమో మేం నిద్దట్లో ఉండగా కనిపించేవారు. అది కలో నిజమో కూడా తెలియని మగతలో మమ్మల్ని పలకరించిన జ్ఞాపకాలు.

నాన్న చారూమజూందార్‌ పీడిత జన విముక్తికోసం తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారాన్ని సాధించాలని సాయుధపోరాటానికి పిలుపునిచ్చిన విప్లవ కారుడు. మా అమ్మ లీలా మజూందార్‌ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌. ఇల్లు దాటి బయటికెళ్ళాలంటే మాకుటుంబానికి భయం. ఏవేవో కామెంట్స్‌ మా మనస్సుని కష్టపెట్టేవి. మమ్మల్ని ఉద్దేశించి వాళ్ళన్న మాటలు మమ్మల్ని చిత్రవధ చేసేవి. ‘‘నాన్న ప్రాణాలు తీస్తాడు, అమ్మ ప్రాణాలకు వెల కడుతుంది’’(అమ్మ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌). బూర్జువా చదువులొద్దని చెప్పే వాళ్ళ పిల్లలే ఆ బూర్జువా చదువులు చదువుతారంటూ మమ్మల్ని నాన్న మరణం తరువాత కూడా వేధించిన అనుభవాలున్నాయి.

పోలీసుల వేధింపులు మాకు కొత్తకాదు. నాన్న రహస్యజీవితంలోనికి వెళ్ళిపోయాక పోలీసుల టార్చర్‌ విపరీతంగా పెరిగిపోయింది. అర్ధరాత్రులూ, అపరాత్రులూ అని లేకుండా మా యింటిపైన దాడిచేసేవారు. అటువంటి సందర్భాల్లోనే అమ్మ ధైర్యం చూసి అంతా అవాక్కయ్యేవాళ్ళు. పోలీసులను లోనికి అనుమతించేవారు కాదు. అరెస్టు వారెంట్‌ అడిగేవారు. అది చూపించినా తెల్లవారే వరకూ ఇంట్లోకి పోలీసులను రానిచ్చేది కాదు. వచ్చే ముందు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాలను కూడా బయటే పెట్టి రమ్మని ఆదేశించేది. లేదంటే వాళ్ల జేబుల్లోని ఆయుధాలు మా ఇంట్లో దొరికేవి. అందుకే అమ్మ అంత కఠినంగా వ్యవహరించేవారు.

నాన్నని చంపేసాక అంతా నిశ్శబ్దం...
1972 జూలై 16న అరెస్టు చేసి కలకత్తా లోని అలీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేసి జూలై 28న చంపేసారు. నాన్న భౌతిక కాయాన్ని తీసుకొచ్చిన ఘటన నాకింకా గుర్తు. ప్రాణంలేని ఆయన శరీరాన్ని చూసి కూడా ఈ పోలీసులు, పాలకులు భయభ్రాంతులకు గురయ్యారు. నిశ్శబ్దంగా కదులుతున్న మనుషుల మధ్యలోంచి పోలీసులు మమ్మల్ని మాత్రమే మా నాన్న భౌతిక కాయం దగ్గరికి తీసుకెళ్ళారు. అంత నిర్బంధంలోనూ ఎక్కణ్ణుంచో హోరుగాలి మోసుకొచ్చిన నినాదం గంభీరంగా నా చెవుల్లో మార్మోగుతోంది. ‘‘చారూబాబూ అమర్‌రహే’’ నినాదాలను మోసుకొచ్చిన గాలి సైతం గంభీరంగా కదులుతోంది అమ్మలాగే. కళ్ళనిండా నీరునింపుకొని జ్ఞాపకాల్లోంచి బయటకు రాలేకపోయారు అభిజిత్‌.

ఫ్రాంటియర్‌ పత్రిక సంపాదకుడు తిమిర్‌ బసుభారత దేశ ఉద్యమ చరిత్రలో ‘ఫ్రాంటియర్‌’పత్రిక పాత్ర చిరస్థాయిగా  నిలిచి ఉంది. నక్సల్బరీ ఉద్యమ కాలం నుంచి ఆ పత్రికలో పనిచేసి, ప్రస్తుతం అదే పత్రికకు సంపాదకుడిగా ఉన్న తిమిర్‌బసును వెతుక్కుంటూ వెళ్ళాం. కలకత్తాలోని ఓల్డ్‌సిటీ ప్రాంతంలో ఉన్న 61, మట్‌లేన్‌లో యిప్పుడో ఇంకాసేపట్లోనో కూలడానికి సిద్ధంగా ఉన్నట్టున్న ఓ పురాతన భవనంలోని చిన్ని గది ఆ పత్రిక కార్యాలయం. ఫ్రాంటియర్‌ ఎడిటర్‌ తనను, తనలాంటి వారినెందరినో ఉత్తేజితం చేసిన నక్సల్బరీ ప్రభావాన్ని వివరిస్తూ మావోనినాదాన్ని పలవరించిన నాటి పశ్చిమబెంగాల్‌ పల్లెలను, పట్టణాలను ఆవిష్కరించారు. ‘‘గ్రామాలకు తరలిరండి’’ ఇది చైనా విప్లవోద్యమంలో మావో నినాదం. ఆ నినాదాన్ని నక్సల్బరీ అందిపుచ్చుకుంది. ‘‘బూర్జువా చదువులు మాకొద్దు’’ అనే చారూ నినాదం ఆనాడు భారతదేశ వ్యాప్తంగా ఎందరో మేథావులను, డాక్టర్లను, ఇంజనీర్లను వాళ్ళ చదువులను వదిలేసి నక్సల్బరీ ఉద్యమంలో మమేకమయ్యేలా చేసింది. భారత దేశం నలుమూలల నుంచి నవయువకులు పశ్చింబెంగాల్‌కి పరుగులు పెట్టారు. భూస్వామ్య విధానానికీ, జాగీర్దారీ విధానానికీ, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో వారు కీలక భూమిక పోషించారు.

సాంస్కృతికోద్యమ నాయకుడు కంచన్‌కుమార్‌ఎనబైయేళ్ళు పైబడినా తొణకని ఆత్మవిశ్వాసంతో మావోయిజమే సరైనవిప్లవ మార్గమంటూ... సరిగ్గా నేటి మరో నక్సల్బరీ ఉద్యమ ఆవశ్యకతను అరగంట సేపు అనర్గళంగా వివరించారు కలకత్తాలోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ పరిసరాల్లో నివసిస్తోన్న తొలిసాంస్కృతికోద్యమ నాయకుడు కంచన్‌కుమార్‌. దాదాపు కలకత్తాలోని అన్ని విశ్వవిద్యాలయాల నుంచి వందలాది మంది విద్యార్థులు నక్సల్బరీ రైతాంగ సాయుధ పోరాటానికి మద్దతుగా నిలిచారు. అలాగే ‘దేర్‌ ఈజ్‌ నో కన్‌స్ట్రక్షన్, వితౌట్‌ డిస్ట్రక్షన్‌’ 'పాతని ధ్వంసం చేయకుండా నూత్నంగా దేన్నీ నిర్మించలేం’ అనే మావో నినాదాన్ననుసరించి చైనా విప్లవంలో మాదిరిగానే పాత సంస్కృతికి చిహ్నలైన నాయకుల విగ్రహాలను కలకత్తాలో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టారు. కాలక్రమేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీవ్ర నిర్బంధం వల్ల నక్సల్బరీలో ప్రారంభమైన నక్సలైట్‌ పోరాటం పశ్చిమబెంగాల్‌లో దీర్ఘకాలం కొనసాగకపోయినప్పటికీ దాని ప్రభావం అనేక ఉద్యమాల పైన, సాహితీ సాంస్కృతిక రంగాలమీద చివరకు సినీరంగంపైన కూడా గొప్ప ప్రభావాన్ని కలుగజేసిందని తొలి సాంస్కృతికోద్యమ నాయకుడు కంచన్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

దోపిడీ పద్ధతులు మారాయి కానీ లక్షణం మారలేదు.. అందుకే నక్సల్బరీ సజీవం..

నాటి నక్సల్బరీ తరం నేడేం కోరుకుంటోందో శాంతిముండా ఇలా చెపుతున్నారు
.

"సాయుధ పోరాట చైతన్యం ప్రజల మనసుల్లో నుంచి చెరిగిపోలేదు. అయితే దొపిడీ పద్ధతులు, విధానాలు మారాయిగానీ దోపిడీ లక్షణం మారలేదు. పాత దోపిడీవిధానాల స్థానంలో కొత్తవిధానాలు వచ్చాయి. అప్పుడు జోతేదార్ల ఆక్రమణలో ఉన్న భూములను రైతాంగం పోరాడి సాధించుకున్నది. కానీ యిప్పడవే భూములను విమానాశ్రయాలూ, టీ తోటలూ, ఇతరత్రా అభివృద్ధి పేరుతో ఆక్రమించుకుంటున్నారు. దీంతో వేలాది మంది భూమినుంచి వెలివేయబడుతున్నారు.  నిరాశ్రయులుగా మారుతున్నారు. నక్సల్బరీ చూపిన పోరాట మార్గం ఇంకా సజీవంగా ఇక్కడి ప్రజల హృదయాల్లో నాటుకొని ఉంది. అందుకే నక్సల్బరీకి మరణం లేదు. అది సజీవంగా ఉంది. ఉంటుంది. దోపిడీ ఉన్నంత కాలం ఆ పోరాట స్ఫూర్తి ఇక్కడి ప్రజలనే కాదు, యావత్‌ దేశ ప్రజానీకాన్ని ముందుకు నడిపిస్తుంటుంది. "

అరుణ అత్తలూరి
ప్రిన్సిపల్ కరస్పాండెంట్
సాక్షి దినపత్రిక

గమనిక: సాక్షి దినపత్రిక ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అత్తలూరి అరుణ గారు నక్సల్బరీ ఉద్యమానికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా స్వయంగా పశ్చిమ బెంగాల్ లోని నక్సల్బరీ పరిసర ప్రాంతాలను సందర్శించి అక్కడ ఉద్యమ జ్ఞాపకాలుగా మిగిలివున్న అలనాటి ప్రముఖులను కలిసి చేసిన ఇంటర్వ్యూ పాఠం ఇది. ఈ రచన సంక్షిప్త పాఠం సాక్షి దినపత్రిక 25-05-2017 నాటి సంపాదకీయ పేజీలో "ఐదు దశాబ్దాల మేఘగర్జన" పేరిట ప్రధాన వ్యాసంగా అచ్చయింది. ఆ ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ ఈ బ్లాగులో ప్రచురించడానికి అవకాశం ఇచ్చిన అరుణ గారికి కృతజ్ఞతలు.భారత ప్రజా రాజకీయాలలో నక్సల్బరీ నేపథ్య చరిత్రను మరోసారి విస్తృత ప్రజానీికానికి పరిచయం చేస్తూ ఈ వ్యాసాన్ని ప్రచురించిన సాక్షి పత్రికకు ధన్యవాదాలు.


ఐదు దశాబ్దాల మేఘగర్జన


http://www.sakshi.com/news/opinion/five-decades-of-naksalbari-478624