Pages

Saturday, July 21, 2012

ఓడి గెలిచిన యోధానుయోధుడు స్పార్టకస్

సమకాలీన ప్రపంచంలో పరిచయం అవసరం లేని వాళ్లలో ఒకరి పేరు సూచించండి. నాకయితే వెంటనే గుర్తుకొచ్చే పేరు చేగువేరా. అలాగే ప్రాచీన ప్రపంచంలో పరిచయం అవసరం లేని వాళ్లలో ఒకరి పేరు సూచించమంటే నా మనస్సులో మెదిలే తొలి పేరు స్పార్టకస్.

వీరిలో రోమ్ సామ్రాజ్యపు బానిసత్వ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరగబడి బానిసల గుండెలను రగిలించి తిరుగుబాటు చేసి రోమ్ పాలకులను గడగడలాడించిన ప్రాచీన తిరుగుబాటుదారుడు స్పార్టకస్. కాగా,  లాటిన్ అమెరికాను అమెరికా సామ్రాజ్యవాద డేగ పట్టునుంచి తప్పించే లక్ష్యంతో తనమీద తానే ప్రయోగం చేసుకని ప్రాణార్పణ చేసిన సాహసోపేత విప్లవకారుడు చేగువేరా.

గెలిచి ఓడడానికి, ఓడి గెలవడానికి మానవ చరిత్రలోనే ప్రతీకలుగా నిలిచిపోయన అసమాన ధీరులు స్పార్టకస్, చేగువేరా. జీవితానికి, మరణానికి కూడా సార్థకత ఉండాలని తపించిన అచ్చమైన మనుషులు వీళ్లు.

స్వేచ్ఛ కోసం పోరాటం…. జీవించడం కోసం పోరాటం… ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పోరాటం… చివరకు మరణించడానికి కూడా పోరాటం… ఇదే స్పార్టకస్ మనుషులకు అందించిన నిజమైన సందేశం. రెండు సహస్రాబ్దాల తర్వాత కూడా ఈ సందేశానికి కాలం చెల్లిపోలేదు. ప్రపంచం నూతన బానిసత్వపు కోరలకింద మగ్గుతున్న నేటికాలంలో కూడా స్పార్టకస్ తనదైన సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు.

రెండువేల సంవత్సరాలుగా మరుగున పడిన ఓ విషాదాంత ధీరోదాత్తుడి విఫలగాథను హాలీవుడ్ యాభైఏళ్ల క్రితం ప్రపంచానికి అందించింది. అర్థ శతాబ్దం తర్వాత కూడా స్పార్టకస్ చిత్రం మానవజాతికి అందిస్తున్న సందేశం పలుచబారలేదు.

ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అత్యుత్తమ సినిమాలను పరిచయం చేద్దామని భావించినప్పుడు నా మనస్సులో మెదిలిన మొదటి సినిమా “స్పార్టకస్.”  అందుకే తొలుత ఈ సినిమా పరిచయం తోటే ప్రారంభిస్తున్నాను.

స్పార్టకస్ చిత్ర ప్రాశస్త్యం
ప్రపంచ సినిమా చరిత్రలో తొలి మేధో మహాకావ్యంగా గుర్తించబడిన “స్పార్టకస్” చిత్రం తొలిసారిగా 1960లో విడుదలయింది. రోమన్ సామ్రాజ్య చరిత్రలో మరుగునపడిపోయిన ఓ మహత్తర ఆదర్శ భావాన్ని, భయంకరమైన దృశ్యాలను రెండు వేల సంవత్సరాల తర్వాత మానవజాతి జ్ఞాపకాల్లోకి తెచ్చిన మహా కళాఖండం “స్పార్టకస్.” మూడు దశాబ్దాల తర్వాత పునరుద్దరించిన కొత్త చిత్రం (1991) కూడా అలనాటి అద్భుత కావ్యానికి ఏ మాత్రం భంగంకాని విధంగా రూపొందింది. పునరుద్ధరణ తర్వాత కూడా దాని మేధోశక్తి అంతరించలేదు.

ఈనాటి ప్రమాణాల రీత్యా చూస్తే స్పార్టకస్ సినిమాలో అత్యంత సాహసోపేతమైన అంశం ఏదయినా ఉందంటే అది చిత్రం ముగింపే. సమకాలీన చిత్రాలకు బిన్నంగా ఇది విషాదాంత కథ. అయినా సరే 187 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్ర కావ్యం ఏ రకంగాను ఓ మతిహీన ముగింపును ఇవ్వదు. అదే దీని గొప్పతనం. ఒక విషాదాంతం సాహసోపేతమైన అంశంగా మారడానికి దారితీసిన ఆ ఘటన ఏది మరి!

వాస్తవ చరిత్రకు భిన్నంగా సినిమా చివర్లో శిలువ వేయబడిన కథానాయకుడు స్పార్టకస్… అన్ని సినిమాలలో సాంప్రదాయకంగా చూపించే కథానాయకుడి అంతిమ విజయానికి దూరం కావడంతో పాటు.. బానిసత్వానికి వ్యతిరేకంగా తాను వెదజల్లిన భావాలు చరిత్రలో నిలిచిఉంటాయని తన్ను తాను ఓదార్చుకుంటాడు. ఇదే సినిమా ముగింపు.

ఈ సినిమాకు రోమన్ సామ్రాజ్యాన్ని వణికించిన రోమన్ బానిస స్పార్టకస్ -కిర్క్ డగ్లస్- కథ మూలం. బానిసత్వానికి వ్యతిరేకంగా కలగంటూ స్పార్టకస్ తిరుగుబాటుకు నేతృత్వం వహిస్తాడు. సినిమాలో నేపధ్య వ్యాఖ్యాత ప్రేక్షకులకు హామీ ఇస్తూ ఇలా అంటాడు. “బానిసత్వానికి చావు – మరో రెండు వేల సంవత్సరాల తర్వాత గాని మళ్లీ ఇది ఆవిర్బవించదు.”

సినిమాలో రోమన్ సైనికుడిని కరిచినందుకుగాను స్పార్టకస్‌కు మరణ శిక్ష విధిస్తారు. అయితే బానిస మల్లయుద్ధ యోధుల దళారీ అయిన బటియాటుస్ -పీటర్ ఉస్తినోవ్- అతడిని రక్షించాడు. ఇతడి మల్లయుద్ధ అకాడెమీలో నే స్పార్టకస్ యుద్ధ కళల్లో శిక్షణ పొందుతాడు. ఓ రోజు ఇద్దరు శక్తిమంతులు తమ భార్యలతో కలిసి రోమ్ నుండి అక్కడికి వస్తారు. ఎదురెదురు పోరులో బానిసలు పోరాడుతూ చనిపోవడాన్ని చూస్తూ వినోదించాలని ఆ భ్రష్ట మహిళలు కోరతారు. అలా, స్పార్టకస్ మరో నల్ల గ్లాడియేటర్ -ఊడీ స్ట్రోడ్-తో ఇక్కడ తలపడతాడు. చివరకు స్పార్టకస్‌ను ప్రాణాలతో విడిచిపెట్టిన నల్ల యోధుడు చివరకు తానే చనిపోతాడు.

ఇద్దరు భ్రష్ట మహిళల వినోదం కోసం తాము చచ్చేదాకా పోరాడాల్సిరావడం స్పార్టకస్‌లో తీవ్ర ఆగ్రహాన్ని రెచ్చగొట్టింది. దీంతో మొదలైన బానిసల తిరుగుబాటు దాదాపు అప్పటి ఇటలీలో సగం విస్తీర్ణంలో చెలరేగింది. బలహీనపడి, శిక్షణ సరిగా లేని రోమన్ సైన్యాలతో స్పార్టకస్ అనుచరులు యుద్ధాల్లో తలపడ్డారు. స్పార్టకస్ విజయానికి అతి సమీపంలోకి వచ్చాడు కానీ, అతడి దళాలు రెండు సైన్యాల మధ్య చిక్కుకుపోయి విషాదకరంగా ఓటమి పాలయ్యాయి.

రోమన్ పతనం నేపధ్యంలోనే ఈ  పరిణామాలన్నీ జరిగాయి. నాటి సెనేట్ రాజకీయ క్రీడలను కూడా ఈ చిత్రం ప్రతిభావంతంగా చూపింది. వయోవృద్ధుడు, బలవంతుడు అయిన సెనేటర్ గ్రాచూస్ (చార్లెస్ లాఫ్టన్)ను పక్కకు తప్పించి తానే రోమన్ సామ్రాజ్య నియంత కావాలని క్రాసస్ (లారెన్స్ అలివర్) ప్రయత్నిస్తుంటాడు. దీంట్లో లైంగిక అంశాలు కూడా చోటుచేసుకున్నాయి. గ్రాచూస్ స్త్రీలోలుడు, క్రాసస్ ఉభయలింగ సంపర్కధారి. అయితే స్పార్టకస్ సహచరి, బానిస మహిళ వరీనియా (జీన్ సైమన్స్)తో ప్రేమను జయించుకోవాలనే బలీయమైన కాంక్ష అతడిలో రగులుతుంది.

స్పార్టకస్ (1960) చిత్రం స్టాన్లీ కుబ్రిక్ దర్శకత్వంలో వచ్చింది. స్పార్టకస్ చారిత్రక జీవితంపై, బానిసల చివరి యుద్దంపై హోవార్ట్ ఫాస్ట్ అదే పేరుతో రచించిన మేటి నవల దీనికి ఆధారం. ఈ చిత్రానికి డాల్టన్ ట్రుంబో స్క్రీన్‌ప్లే రాశాడు. చిత్ర నిర్మాత కిర్క్ డగ్లస్. ఆనాటికి 31 ఏళ్ల ప్రాయంలో ఉన్న స్టాన్లీ క్యుబ్రిక్ దీనికి దర్శకత్వం వహించాడు.

గత 50 సంవత్సరాలుగా ఈ సినిమా తనదైన ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది. ప్రత్యేకించి యుద్ధరంగ దృశ్యాల అమేయ శక్తి, అలివర్, డగ్లస్, లాఫ్టన్‌ల అద్భుత నటనా ప్రదర్శన సంవత్సరాలు గడిచినా తమ ప్రాచుర్యాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాయి.

బానిస తిరుగుబాటు నేత స్పార్టకస్‌గా కిర్క్ డగ్లస్, అతడి విరోధి, రోమన్ సైన్యాధిపతి, రాజకీయనేత అయిన మార్కస్ లిసినియస్ క్రాసస్‌గా లారెన్స్ అలివర్ ఈ చిత్రంలో నటించారు. బానిసల వ్యాపారి లెంట్యులస్ బటియాటస్‌గా నటించిన పీటర్ ఉస్తినోవ్ ఈ చిత్రంలో ఉత్తమ సహాయ నటుడుగా ఆస్కార్ అవార్డ్ అందుకున్నాడు కూడా. జాన్ కెవిన్ జూలియస్ సీజర్‌గా నటించగా జీన్ సైమన్స్, చార్లీస్ లాఫ్టన్, జాన్ ఐర్లండ్, హెర్బర్ట్ లోమ్, వూడీ స్ట్రోడ్, టోనీ కర్టిస్, జాన్ డాల్, చార్లీ మెక్‌గ్రా ఈ చిత్రంలోని ఇతర పాత్రలను పోషించారు.

సినిమా పరిచయం
రోమన్ పాలిత ప్రాంతమైన లిబియాలో బానిసలు పనిచేస్తున్న దృశ్యంతో సినిమా మొదలవుతుంది. పనిచేస్తూ కిందపడిపోయిన ముదుసలికి సాయపడేందుకోసం వచ్చిన ధ్రేషియన్ జాతీయుడైన స్పార్టకస్‌ను రోమన్ సైనికుడు కొరడాతో బాది వెనక్కు వెళ్లి పని చేయమని చెబుతాడు. కుపితుడైన స్పార్టకస్ ఆ సైనికుడిపై దాడి చేసి కాలిమడమపై కొరకడంతో అతడిని బంధించి అన్నాహారాలు అందివ్వకుండా చంపేయ్యాలని శిక్ష విధిస్తారు.

లెంట్యులస్ బటియాటస్, లానిస్టాలు మల్లయుద్ధ యోధులకోసం వెతుకుతూ అక్కడికి వస్తారు. అక్కడ పలువురు బానిసలను తనిఖీ చేసిన అనంతరం వారు చివరగా స్పార్టకస్ వద్దకు వస్తారు. చెక్కుచెదరని అతడి స్థైర్యాన్ని, చక్కటి ఆరోగ్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని గుర్తిస్తారు. ఇక్కడే బటియాటస్ పలువురు బానిసలతో పాటు బానిసలను కొంటారు.

మల్లయోధుల శిక్షణా శిబిరం ఉన్న కేపువా వద్దకు వీరిని తీసుకెళతారు. థ్రేషియన్‌ను ఎందుకు చంవవచ్చో ఉదాహరణ మాత్రంగా ప్రస్తావించిన అక్కడి శిక్షకుడు మార్సెలస్ వచ్చీరాగానే స్పార్టకస్‌ను రెచ్చగొడతాడు. ఇక్కడే మరొక మల్లయోధుడు క్రిక్సస్‌ (జాన్ ఐర్లండ్), స్పార్టకస్ మధ్య స్నేహం చిగురిస్తుంది,

మల్లయుద్ధ శిక్షణా శిబిరంలో మల్లయోధుల శిక్షణను, జీవితాన్ని సినిమాలో వివరంగా చిత్రించారు. ఇలా ఉండగా ఓ రోజు రోమన్ సైన్యాధిపతి క్రాసస్, రెండు జతల మల్లయోధులు పోరాడుతూ చావడం చూడాలని కోరుకుంటున్న తన స్నేహితులు, స్నేహితురాళ్లతో కలిసి ఈ శిబిరానికి వస్తాడు. స్పార్టకస్, క్రిక్సస్, ఓ ఇధియోపియా బానిస డ్రాబా, గాలినో అనే మరో మల్లయోధుడిని ఈ పోటీలకు ఎంపిక చేస్తారు.

తొలి పోటీ క్రిక్సస్, గాలినో మధ్య జరుగుతుంది. పోటీలో గెలిచిన క్రిక్సస్ ప్రత్యర్థిని చంపేస్తాడు. తర్వాత డ్రాబాతో తలపడిన స్పార్టకస్ అనూహ్యంగా ఓడిపోతాడు. అయితే అతడిని చంపడానికి తిరస్కరించిన డ్రాబా వీక్షకుల గ్యాలరీలో కూర్చున్న వారిపైకి తన ఈటెను విసిరివేస్తాడు. రోమన్లపై దాడికి గాను ఎగిరిదూకిన డ్రాబాను సైనికులు వధిస్తారు. క్రాసస్ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోతాడు. వెళ్లే ముందు బానిస యువతి వరీనియాను అతడు కొనుగోలు చేస్తాడు. బటియాటుస్ ఈమెను స్టార్టకస్ వద్దకు పంపుతాడు. వారిద్దరూ పరస్పరం ఇష్టపడతారు.

వ్యక్తిగతంగా తనకు తగిలిన దెబ్బకు తోడుగా, రోమన్ సైన్యాధిపతి, అతడి మిత్రుల వ్యవహారంతో రెచ్చిపోయిన స్పార్టకస్ తిరుగుబాటు లేవదీస్తాడు. శిక్షణా శిబిరం నుంచి విముక్తులైన మల్లయోధులు త్వరలో కేపువా దాని చుట్టుపక్కల ఉన్న జిల్లాలను పట్టుకుంటారు. అనేకమంది స్థానిక బానిసలు తిరుగుబాటుదారులతో కలిసిపోతారు. సిసిలియన్ దారిదోపిడి దొంగల నౌకల ద్వారా బ్రండిసియం రేవు గుండా సముద్రమార్గాన తప్పించుకోవాలని స్పార్టకస్ పథకం రచిస్తాడు.

బానిస తిరుగుబాటును అణచడానికి ప్లెబియన్ సెనేటర్ గ్రాచూస్ జిత్తులమారితనంతో రోమ్ సెనేట్‌లో క్రాసస్ స్నేహితుడైన మార్కస్ గ్లాబ్రస్‌కు రోమ్ సైనిక శిబిరంలోని ఆరు బలగాలను ఇచ్చి పంపుతాడు. గ్లాబ్రస్ పరోక్షంలో రోమ్ సైనిక శిబిరంపై నియంత్రణను తన మిత్రుడైన జూలియస్ సీజర్‌ చేపట్టేలా దారి ఏర్పరుస్తాడు గ్రాచూస్.

ఈలోగా సిసిలీ గవర్నర్ నుంచి క్రాసస్ కొత్త బానిసలను బహుమతిగా పొందుతాడు. వారిలో సిసిలీలోని మునుపు పిల్లల సంరక్షకుడిగా పనిచేసిన ఆంటోనియస్ కూడా ఉంటాడు. క్రాసస్ తీవ్రంగా బెదిరించడంతో ఆంటోనియస్ అక్కడినుంచి పారిపోయి స్పార్టకస్ చెంత చేరతాడు.

బానిసయోధులలో కొత్తగా చేరిన వారిని స్పార్టకస్, క్రిక్సస్ సమీక్షించి వారి నైపుణ్యాలకు తగినట్లుగా ఆయా పదవులలో నియమిస్తారు. వారిలో ఒకడైన ఆంటోనియస్‌ తన్ను తాను కవి, ఊహాతత్వవేత్తగా పరిచయం చేసుకుంటాడు. తర్వాత అతడు బానిస సైన్యానికి వినోదం పంచిపెడతాడు. అయితే రాజకీయాలకు, కళకు మధ్య ఉన్న సంబంధంపై పరోక్షంగా వ్యాఖ్యానించడం ద్వారా, సైనికుడిగా కావాలన్న ఆకాంక్షను అతడు వ్యక్తపరుస్తాడు.

బటియాటుస్ చెరనుంచి తప్పించుకుని మరో బానిస యజమాని ఆస్తిగా మారిన వరీనియా మళ్లీ స్పార్టకస్‌ను కలుసుకుంటుంది. రోమ్ సైన్యానికి చెందిన ఆరు పటాలాలపై దాడిచేసి నిర్మూలించిన స్పార్టకస్, అతడి సైన్యం సముద్రం వేపుగా పురోగమిస్తుంది. ఓడిపోయిన గ్లాబ్రస్ అవమాన భారంతో రోమ్‌కు తిరిగి వస్తాడు. ఆరుపటాలాల సైన్యంలో కేవలం 14 మంది మాత్రమే బతికి బట్టకట్టి తిరిగి వస్తారు. సెనేట్ విచారణ అనంతరం బానిసలతో యుద్ధంలో నిర్లక్ష్యవైఖరికి గాను గ్లాబ్రస్‌ను క్రాసస్ రోమ్ నుంచి బహిష్కరించక తప్పింది కాదు.

తిరుగుబాటును అణచడానికి రోమ్ మళ్లీ సైన్యాన్ని పంపుతూవచ్చింది. కానీ ప్రతిసారీ స్పార్టకస్ వాటిని ఓడిస్తూ వచ్చాడు. మెటాపోంటమ్‌లో జరిగిన ఓ దాడిలో 19 వేల మంది రోమన్‌లు మరణిస్తారు. దీంతో సెనేట్ నుంచి క్రాసస్ తప్పుకుంటాడు. ప్రవాసంలో ఉన్న తన మిత్రుడు గ్లాబ్రస్ గతే ఇతడికీ పట్టేది. కానీ పరిస్థితులు పూర్తిగా విషమించి సెనేటర్లు తనను రోమ్ నియంతగా చేసే తరుణంకోసం అతడు వేచి చూస్తున్నాడని గ్రహించిన గ్రాచూస్ అలాంటి అవకాశం క్రాసస్‌కు రాకుండా బానిసలు తప్పించుకోవడంలో సహాయం చేస్తుంటాడు.

ఈలోగా క్రాసస్ బానిసల పథకాన్ని ఓడించడానికి సర్వం సిద్ధం చేసుకుంటాడు. మాజీ బానిసలు సముద్ర తీరం చేరేసరికి, సిసిలియన్లను క్రాసస్ కొనేశాడని వారికి అర్థమవుతుంది. సిసిలియన్ రాయబారి స్పార్టకస్‌కు, గర్భవతి అయన వరీనియాకు, బానిస ప్రముఖులకు నచ్చచెప్పి ఆసియాకు వెళితే రాజాల్లాగా బతకవచ్చని చెబుతాడు. నిజాయితీ పరుడైన స్పార్టకస్ తన సైన్యాన్ని వదిలి వెళ్లిపోవడానికి అంగీరించడు. పైగా తాను మూడు రోమన్ సైన్యాల మధ్య చిక్కుకున్నట్లు గ్రహిస్తాడు. అవి కాలబ్రియాలోని పాంపే, బ్రుండిసియం లోని లుకల్లస్, రోమ్‌లోని సైనికపటాలం.

రోమన్ సైనిక మోహరింపు కారణంగా స్పార్టకస్ రెండు రోమన్ సైన్యాల నడుమ చిక్కుకుపోయే స్థితి ఏర్పడుతుంది. అతడికి మిగిలిన ఏకైక మార్గం ఏదంటే పోరాడుతూ రోమ్ మార్గం గుండా తప్పుకోవడమే. కానీ గెలిచే అవకాశం చాలా తక్కువ.

ఈలోగా సెనేట్ క్రాసస్‌కు అసాధారణ అధికారాలను కట్టబెడుతుంది. స్పార్టకస్ పట్టుబడితే అతడిని గుర్తుపట్టడానికి గాను క్రాసస్ మల్లయోధుల శిబిరం యజమాని బటియాటూస్‌ను చేరదీస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఓడిపోయిన తర్వాత మిగిలి ఉండే స్పార్టకస్ సైన్యాన్ని తనకు అప్పగిస్తానని క్రాసస్ హామీ ఇస్తాడు.

అంతిమయుద్ధంలో స్పార్టకస్ స్త్రీపురుషులతో కూడిన తన సైన్యాలను రోమ్ సైనిక శిబిరానికి వ్యతిరేకంగా కూడగడతాడు. తొలిదశలో బానిసలు కొన్ని విజయాలు సాధిస్తారు కాని, తర్వాత క్రిక్సస్ యుద్ధంలో మరణిస్తాడు. పైగా, పాంపీ, లుకల్లస్ నుంచి వచ్చిన అదనపు సైన్యాల ముందు బానిస సైన్యం వీగిపోతుంది. ఈ యుద్ధంలో బానిస సైన్యానికి సంపూర్ణ పరాజయం కలుగుతుంది. ఇరుపక్షాల సైనికులూ తీవ్రంగా దెబ్బతింటారు.

బతికి బయటపడ్డ వారిలో స్పార్టకస్, ఆంటోనియస్ కూడా ఉంటారు. స్పార్టకస్‌ను కాని అతడి శవాన్ని కాని చూపించినట్లయితే బందీలను శిక్షించకుండా వదిలిపెడతానని క్రాసస్ హామీ ఇస్తాడు. స్పార్టకస్, ఆంటోనియస్‌లు లేచి నిలబడతారు. అయితే స్పార్టకస్ మాట్లాడేముందుగా ఆంటోనియస్ తానే స్పార్టకస్‌నని కేకవేస్తాడు. అంతే.. బతికి ఉన్న ప్రతి బానిస సైనికుడూ తానే స్పార్టకస్‌నని లేచి నిలబడతారు.

కుపితుడైన క్రాసస్ యుద్ధరంగం నుంచి రోమ్ వైపు దారి తీసే ఏపియన్ మార్గంలో బానిసలను అందరినీ శిలువ వేయవలసిందిగా ఆదేశిస్తాడు. అయితే ఆంటోనియాను గుర్తుపట్టడమే కాక, తాను కేపువాను సందర్శించిన సందర్భంగా చూసిన స్పార్టకస్ ముఖాన్ని క్రాసస్ గుర్తుపట్టి ఇద్దరినీ చివరిదాకా ప్రాణాలతో ఉంచుతాడు. ఓపియన్ వే వైపు బయలుదేరిన ఇతర బానిస యోధులను ఒకరి తరవాత ఒకరిని రోమ్ సైనికులు శిలువ వేస్తారు.

యుద్ధంలో చావగా మిగిలిన బానిసలను తనకు అప్పగిస్తానని చేసి మాటతప్పిన క్రాసస్‌పై పగ తీర్చుకోవడానికి బటియాటస్ కాచుకుని ఉంటాడు. యుద్ధరంగంలో పట్టుబడిన వరీనియా, ఆమె తొలి బిడ్డను క్రాసస్ ఇంటికి తీసుకువస్తారు. వరీనియాను తన బానిస ప్రేమికురాలిగా చేసుకోవాలని క్రాసస్ ప్రయత్నిస్తాడు. ఆమెను లొంగదీసుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తాడు.

రోమ్ రాజకీయాల్లో ప్రాబల్యం తగ్గి క్రాసస్ ప్రాభవాన్ని గ్రహించిన సెనేట్ అధ్యక్షుడు గ్రాచూస్ తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా క్రాసస్ నుంచి వరీనియాను తప్పించేందుకు బటియాటస్‌ను నియమిస్తాడు. తర్వాత ఆమెకు, ఆమె బిడ్డకు స్వేచ్ఛ ప్రసాదిస్తూ స్వహస్తాలతో సంతకం పెట్టిన అనుమతి పత్రాలను వారికి అందజేస్తాడు.

వారు వెళ్లిపోయాక, గ్రాచూస్ రెండుకత్తులను తీసుకుని ఒకదానికేసి చూసి ‘హు… వాడిగా ఉంద”ని గొణుక్కుంటాడు. తర్వాత ఒక కత్తిని చేతబట్టి మరొక కత్తిని కింద పెట్టిన గ్రాచూస్ పక్కనున్న గదికి వెళ్లి తాను జీవితం నుంచి నిష్క్రమిస్తున్నదానికి సూచనగా తెర మూసివేస్తాడు.

ఈలోగా, శిలువ వేయబడడానికి ముందుగా బానిసలు హీనాతి హీనమైన పరిస్థితులనుంచి లేచి నిలబడి రోమ్ సామ్రాజ్యాన్నే ఎలా సవాలు చేశారనే విషయాన్ని స్పార్టకస్ మననం చేసుకుంటాడు. కాస్సేపయ్యాక క్రాసస్ అక్కడికి వస్తాడు. స్పార్టకస్, ఆంటోనియస్‌లను చచ్చేంతవరకూ కొట్లాడవలసిందిగా ఆదేశిస్తాడు. మరుసటిదినం సంబరాలు జరుపుకునేంత వరకూ కూడా ఓపిక పట్టలేని క్రాసస్, తాను కోరినా స్పార్టకస్ తన ఉనికిని చెప్పలేదనే కసితో ఇద్దరి మధ్యా జరిగే పోరులో గెలిచిన వాడిని శిలువ వేయిస్తానని ప్రకటిస్తాడు.

దీంతో శిలువపై ఎక్కి నరక యాతనలు పడి చావడం నుంచి పోటీదారును తప్పించాలనే ఉద్దేశంతో స్పార్టకస్, ఆంటోనియస్‌లు ఒకరి నొకరు చంపుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ పోరులో ఆంటోనియస్‌ చంపబడిన తర్వాత వరీనియా, ఆమె బిడ్డ క్రాసస్‌ బానిసలుగా మారారనే విషయం స్పార్టకస్ చెవిన వేస్తారు. తర్వాత రోమ్ స్థూపాలపై అతడిని శిలువ వేస్తారు. స్పార్టకస్ అమరుడవుతున్న ఈ తరుణాన తాను మొట్టమొదటి సారిగా స్పార్టకస్‌ను చూసి భయపడుతున్నానని క్రాసస్ సీజర్‌వద్ద అంగీకరిస్తాడు.

ఈలోగా ఏపియన్ మార్గం గుండా గాల్ వైపు బయలు దేరిన బటియాటస్, వరీనియాలు ఆ మార్గంలో చిట్టచివరగా శిలువ వేయబడిన స్పార్టకస్‌ను చూస్తారు. అప్పటికి అతడింకా చనిపోయి ఉండడు. తమకు పుట్టిన బిడ్డను వరీనియా స్పార్టకస్‌కు చూపిస్తుంది.

తమ బిడ్డను స్వేచ్ఛామానవుడిగా పెంచుతానని, పెరిగి పెద్దయ్యాక తన తండ్రి ఎవరో, అతడు కన్న కలలు ఏమిటో బిడ్డకు తెలియజేస్తానని వాగ్దానం చేసి స్పార్టకస్‌కు ఆమె తుది వీడ్కోలు పలుకుతుంది. అంతిమ శ్వాస తీయడంతో స్పార్టకస్ తల వెనక్కు వాలిపోతుంది. వరీనియా రథంలోకి ఎక్కి బయలు దేరుతుంది.

స్పార్టకస్ చిత్రం షూటింగ్ విశేషాలు...
స్పార్టకస్ నవలా రచయిత హోవార్డ్ ఫాస్ట్‌నే సినిమా స్క్రీన్‌ప్లే రాయడానికి ఎన్నుకున్నారు కానీ తన నవలకు వెండితెర రూపం ఇవ్వటం కష్టసాధ్యమనిపించిన తర్వాత అతడి స్థానంలో డాల్టన్ ట్రంబోను నియమించారు. ఇతడు కూడా సామ్ జాక్సన్ అనే మారు పేరుతో ఈ స్క్రీన్‌ప్లేను రూపొందించాడు.

ఈ సినిమాకు దర్శకత్వం వహించమని వచ్చిన ప్రతిపాదనను డేవిడ్ లీన్ తోసిపుచ్చిన తర్వాత సుప్రసిద్ధ దర్శకుడు ఆంథోనీ మాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించవలసి ఉంది. అయితే తొలివారం షూటింగ్‌లో క్వారీలో తొలి దృశ్యాలను తీసిన తర్వాత మాన్‌పై డగ్లస్ విరుచుకుపడ్డాడు.

సినిమా పరిధిని చూసి అతడు భయపడినట్లు తనకు అనిపించిందని డగ్లస్ తర్వాత తన జీవిత చరిత్ర పుస్తకంలో రాసుకున్నాడు. అయితే మాన్ ఇంత కంటే పెద్ద కళాఖండాలను కూడా తదనంతరం తీసాడు. ఏదేమైనా దర్శకుడిగా మాన్ తొలగింపుకు కారణాలు ఈనాటికీ నిగూఢంగా ఉండిపోయాయి. తర్వాత ముప్పై ఏళ్ల వయసు కుర్రాడు స్టాన్లీ కుబ్రిక్‌ను దర్శకుడిగా తీసుకున్నారు.

ఆనాటివరకు హాలీవుడ్ చిత్ర పరిశ్రమ చేయనంత పెద్ద ప్రాజెక్టుగా స్పార్టకస్ చిత్రం చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా నిర్మాణ వ్యయం అప్పట్లోనే 12 మిలియన్ డాలర్లు. సినిమాలో 10,500 మంది పాత్రలు పోషించారు.

“డబ్బు, సామగ్రి, మనుషులూ ఉన్నాక హాలీవుడ్ లో ఓ “స్పార్టకస్”, సోవియట్ రష్య్యా లో ఓ “వార్ అండ్ పీస్” తీయడం పెద్ద కష్టమేమీ కాదనే చెప్పాలి. కానీ మనకు ఇలాంటి భారీ చారిత్రక ప్రాధాన్యత కలిగిన చిత్రాలు డబ్బులున్నా తీయడం సాధ్యమా” ఆని సత్యజిత్ రాయ్ వంటి సుప్రసిద్ధ దర్శకుడే ఓ సందర్భంలో వాపోయారంటే స్పార్టకస్ చిత్ర నిర్మాణ విశిష్టత మనకు స్పష్టంగా బోధపడుతుంది.

స్పార్టకస్ చిత్రాన్ని మొదట 35 ఎంఎం టెక్‌నిరామా ఫార్మాట్‌లో తీశారు. తర్వాత 70 ఎంఎం చిత్రంగా మార్చారు. భారీ సమూహాన్ని తలపింపజేయడానికి మిచిగాన్ రాష్ట్రంలోని నోటర్ డేమ్ కాలేజ్ ఫుట్‌బాల్ గేమ్ షౌటింగ్ హాల్‌లో 76 వేలమంది వీక్షకులను రికార్డు చేయగలిగే త్రీ ఛానల్ సౌండ్ ఎక్విప్‌మెంట్‌ను కుబ్రిక్ సిబ్బంది ఉపయోగించారు.

సినిమాలోని సాధారణ దృశ్యాలను హాలీవుడ్‌లోనే తీశారు. కానీ యుద్ధరంగ దృశ్యాలను స్పెయిన్ లోని మాడ్రిడ్‌ నగరం వెలుపలి విశాల మైదానంలోనే తీయాలని దర్శకుడు కుబ్రిక్ పట్టుపట్టాడు. రోమన్ సైన్యంగా నటించడానికి స్పానిష్ పదాతి దళానికి చెందిన 8 వేల మంది సైనికులను ఉపయోగించారు.

వీరిని డైరెక్ట్ చేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన గోపురాలమీదికి ఎక్కి దర్శకుడు ఆదేశాలిచ్చేవాడు. అయితే ప్రీవ్యూ సమయంలో ప్రేక్షకుల వ్యతిరేక స్పందన ఫలితంగా ఒక్కటి మినహా అన్ని యుద్ధ రంగ దృశ్యాలను దర్శకుడు తొలగించవలసి వచ్చింది.

అంతకు మించి, అంతిమ శిలువ సన్నివేశంలో తాత్కాలిక సైకిల్ సీట్లమీద నిలబడి ఉన్న ఓ ఎక్స్‌ట్రా నటుడు పొరపాటున జారిపడి మరణించాడట.

స్పార్టకస్ సినిమాను 1967లో మళ్లీ విడుదల చేశారు. అసలు చిత్రం నుంచి 23 నిమిషాల భాగాన్ని కుదించారు. 1991లో ఈ 23 నిమిషాల కుదింపును చేర్చి మరోసారి చిత్రాన్ని విడుదల చేసారు. అయితే 1960లో తీసిన తొలి చిత్రం నుంచి తీసివేసిన హింసాత్మక యుద్ధ సన్నివేశాలతో కూడిన మరో 14 నిమిషాల నిడివి భాగాలను కూడా చేర్చి మరీ విడుదల చేసారు.

అమెరికా చిత్రపరిశ్రమ తరపున నిర్వహించిన ఓసర్వేలో స్పార్టకస్ చిత్రం పది అత్యుత్తమ అమెరికా ప్రామాణిక సినిమాలలో అయిదో స్థానం దక్కించుకుంది.

“నేనే స్పార్టకస్‌ని” అంటూ ఈ చిత్రం చివర్లో తీసిన దృశ్యం ప్రపంచ వ్యాప్తంగా పలు సినిమాలకు, పాత్రలకు ప్రేరణగా నిలిచింది. స్పార్టకస్ ఉనికి రోమ్ సైన్యం ముందు బయటపడకుండా ఉండేలా చేసి అతడి ప్రాణాలను కాపాడడానికి బానిస యోధులు ఒకరి వెనుక ఒకరు లేచి నిలబడి నేనే స్పార్టకస్ అని అరుస్తారు. 1964లో సోవియట్-క్యూబా దేశాలు నిర్మించిన సంయుక్త చిత్రం “ఐ యామ్ క్యూబా” లో పట్టుబడిన క్యూబన్ గెరిల్లాలు నేనే ఫిడెల్‌ని అంటూ ప్రకటించుకుంటారు. వియత్నాంకు చెందిన ఓ సినిమాలో కూడా ఇదే రకమైన దృశ్యం కనబడుతుంది.



చారిత్రక అసందర్భాలు
సినిమాలో స్పార్టకస్ బానిసగా పుట్టినట్లు చూపించారు. అయితే నిజమైన స్పార్టకస్ సైనికుడిగా పనిచేస్తూ రోమన్ సైన్యం నుంచి పారిపోయినాడని, చివరకు పట్టుబడగా శిక్ష కింద అతడిని బానిసగా అమ్మివేశారని చరిత్రకారులు భావిస్తున్నారు. ప్రాచీన లిబియా గనుల్లో ఇతడు పనిచేసినట్లు ఎలాంటి ఆధారమూ లేదు.

క్రీస్తుశకం ఒకటవ శతాబ్దానికి ముందు గ్లాడియేటర్ తరహా మల్లయోధులు ఉనికిలో లేరు.

గ్రాచూస్ పాత్ర కూడా చరిత్రకు అనుగుణంగా లేదు. క్రీస్తుపూర్వం 163 నుంచి 121 మధ్య కాలంలో టైబీరియస్ గ్రాచూస్, గేయస్ గ్రాచూస్ అనే ఇద్దరు విప్లవ రాజకీయ వాదులు ఉనికిలో ఉండేవారు. సినిమాలో ఉన్న గ్రాచూస్ ఈ ఇద్దరు చారిత్రక వ్యక్తుల, వారి జనాకర్షక రాజకీయ వైఖరుల సమ్మేళనంగా రూపొందాడు.

రోమ్ సైనికశిబిరంపై జూలియస్ సీజర్ నియంత్రణ లేదు. ఎందుకంటే అది క్రీస్తుపూర్వం 71లో కాని ఉనికిలోకి రాలేదు. నగర రక్షకులు మాత్రమే నగరాన్ని కాపాడుతూ వీధులను నియంత్రించేవారు. సినిమాలో చూపిన ప్రయేటోరియన్ గార్డ్‌ను ఆగస్టస్ మరో 70 సంవత్సరాల తర్వాత మాత్రమే ఏర్పర్చాడు.

స్పార్టకస్ యుద్ధంలో చనిపోయాడు కానీ అతడి భౌతికకాయం మాత్రం దొరకలేదు. కానీ చిత్రంలో అతడిని శిలువ వేసినట్లు చూపారు.

క్రాసస్ ఎన్నడూ రోమ్ నియంతగా కాలేదు. స్పార్టకస్ సైన్యాన్ని ఓడించినందుకు గాను అతడికి రోమన్ సెనేట్ ఓ నామమాత్రపు పతకాన్ని మాత్రమే బహుకరించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్పార్టకస్ మరణానంతరం ఉత్తరానికి పారిపోయిన బానిసల సైన్యపు అవశేషాలను వెంటాడి ఓడించిన పాంపేకే సంపూర్ణ రోమన్ విజయ గౌరవం దక్కింది. .

ఇదే స్పార్టకస్ చిత్ర నిర్మాణ చరిత్ర.. ఫిల్మ్ క్లబ్బులు దాదాపు అంతరించిపోయిన ఈ కాలంలో ప్రయత్నిస్తే ఈ చిత్రం డీవీడీలలో కూడా ఉత్తమ నాణ్యతతో దొరికే అవకాశముంది. బానిసత్వాన్ని అసహ్యించుకుని తన జాతి జనుల్లో మంటలు రగిలించిన స్పార్టకస్ మానవ చరిత్రలోని మహాయోధుల్లో ఒకడు.

ఈ సినిమా డీవీడీ లభ్యమైతే ముందు మీ కుటుంబంతో కలిసి చూడండి. పిల్లలకు ప్రతి దృశ్యాన్ని విడమర్చి చెప్పండి. స్వేచ్ఛకోసం పోరాడటం కంటే మించిన గొప్ప గుణం లేదని వారికి అర్థం చేయించండి. వీలైతే ఈ సినిమాను మీ మిత్రులకు, బందువులకు, ఇరుగుపొరుగువారికి కూడా చూపించండి. దయచేసి షోకేసుల్లో మాత్రం దీన్ని భద్రంగా పదిలపర్చకండి.
కె.రాజశేఖర రాజు
Blaagu.com/chandamamalu
krajasekhara@gmail.com

గమనిక:
స్పార్టకస్ సినిమా పరిచయం 2010లో ప్రాణహిత.ఆర్గ్ వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది.
http://www.pranahita.org/2010/01/odi_gelichina/

ప్రపంచ సినిమా చరిత్రను విశేషంగా ప్రభావితం చేసిన ప్రామాణిక చిత్రాలను పరిచయం చేయాలంటూ ప్రాణహిత.ఆర్గ్ నిర్వాహకులు చేసిన ప్రతిపాదన మేరకు 2010లో మొదటగా స్పార్టకస్ సినిమాను పరిచయం చేశాను. ఈ వరుసలో మరొక రెండు సినిమాలు పరిచయం చేసిన తర్వాత నిర్వహణా సమస్యలతో ఆ వెబ్‌సైట్ నిలిచిపోయింది. వాటిని వరుసగా ఇక్కడ నా బ్లాగులో ప్రచురించి తర్వాత వీలువెంబడి ఇతర క్లాసికల్ చిత్రాలను కూడా పరిచయం చేద్దామనుకుంటున్నాను.

ఈ స్పార్టకస్ సినిమా పరిచయాన్ని మొదట ప్రచురించిన ప్రాణహిత.ఆర్గ్ వారికి కృతజ్ఞతలు.
 
రాజశేఖర రాజు

కింది అభిప్రాయాలు ప్రాణహిత.ఆర్గ్ వెబ్‌సైట్‌లో అప్పట్లోనే ప్రచురించబడ్డాయి.

9 అభిప్రాయాలు »ప్రత్యేక వ్యాసాలు
9 Responses to “ఓడి గెలిచిన యోధానుయోధుడు స్పార్టకస్”

    1
    హెచ్చార్కె Says
    January 14th, 2010 at 1119 am

    చాల మంచి వ్యాసం. ఏ వర్షనో చెప్పలేను గాని, స్పార్టకస్ సినిమా రెండు మూడు సార్లు చూశాను. సిడి, డివిడి సంపాదించడం… కష్టం కాదనుకుంటాను, ఒక మంచి సినిమాను చర్చించినందుకు అభినందనలు. రాజ శేఖర్ గారు చేసిన వ్యాఖ్యల్లో… “స్వేచ్ఛ కోసం పోరాటం…. జీవించడం కోసం పోరాటం… ఆత్మగౌరవ పరిరక్షణ కోసం పోరాటం… చివరకు మరణించడానికి కూడా పోరాటం… ” అనే వాక్యంలో చివరి భాగం మంచి వైఖరి కాదని నా అభిప్రాయం. ‘జీవించడం కోసం, స్వేచ్చ కోసం… చచ్చిపోతామని భయపడకుండా పోరాడవలసిందే. ప్రజలు ఆలా పోరాడుతారు కూడా. పోరాడకపోతే ‘బతకలేని’ స్థితిలోనే ప్రజలు పోరాడుతారు. “మరణించడానికి కూడా పోరాటం…” అనేది అర్థ రహితం. మరణాన్ని ఒక ఫెటిష్ గా మార్చడం ఇప్పటికే చాల జరిగింది. ఎంత ‘అందం’గా కనిపించినా ఇదొక అవాంఛనీయ ధోరణి.
    2
    venkati Says
    January 15th, 2010 at 304 am

    సమకాలీన కార్మిక ఉద్యమానికి, సామ్యవాదం అనబడే గమ్యం అన్నా ఉంది. స్పార్టకస్ కాలంలో ఈ శాస్త్రీయ అవగాహన లేదు. స్వార్థం మానవ నైజం అని అన్ని ముఖ్య ప్రవాహాలు ఘోషిస్తున్న ఈ సమయంలో, మానవుడి స్వభావ సిద్ధమైన నిస్వార్హతని స్పార్టకస్ తిరుగుబాటు సూచిస్తుంది. మంచి వ్యాసం.
    3
    venkati Says
    January 15th, 2010 at 314 am
    రంగనాయకమ్మ గారి స్పార్టకస్ పరిచయం ఒక మంచి పుస్తకం.
    4
    కెక్యూబ్ వర్మ Says
    January 15th, 2010 at 1006 pm

    మరణానికి కూడా సార్థకత ఉండాలని తపించిన అచ్చమైన మనుషులు వీళ్లు.

    మనిషిలోని స్వతస్సిద్ధమైన తిరుగుబాటు తత్వానికి ప్రతీకలైన స్పార్టకస్, చేగువేరాల పరిచయంతో మొదలైన మీ పరిచయ వాక్యాలు చాలా బాగున్నాయి. ఒక ధీరోదాత్తుని వీరగాధను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    5
    ప్రాణహిత » ప్రాణహిత జనవరి 2010 సంచిక Says
    February 5th, 2010 at 441 pm

    [...] ఓడి గెలిచిన యోధానుయోధుడు స్పార్టకస్… [...]
    6
    రాజశేఖరరాజు Says
    February 6th, 2010 at 1045 am

    హెచ్చార్కె గారు పంపిన వ్యాఖ్యకు కొంత వివరణ. మరణాన్ని ఒక ఫెటిష్ గా మార్చడం కోసం స్పార్టకస్ చిత్ర పరిచయం చేయలేదు. శిలువపై ఎక్కి నరక యాతనలు పడి చావడం నుంచి పోటీదారును తప్పించాలనే ఉద్దేశంతో స్పార్టకస్, ఆంటోనియస్‌లు ఒకరి నొకరు చంపుకోడానికి తీవ్రంగా ప్రయత్నించిన సందర్బాన్ని వివరించడానికే మరణించడానికి పోరాటం అని రాయవలసివచ్చింది. ఇక్కడ లక్ష్యం కోసం చనిపోవడం కాదు. శిలువ ఎక్కి భయానకంగా చావడం కంటే ఎదురెదురు యుద్ధంలో పోట్లాడుకుని పోరాడడం గొప్ప అనుకున్నారు వారు. దాంట్లో కూడా తన ప్రత్యర్థిని ఆ భయానక చావునుంచి తప్పించడానికి కొట్లాడటం. ఇక్కడ మరణాన్ని ఫెటిష్‌గా మార్చడం ఎక్కడ ఉంది. కాని త్యాగపూరిత మరణం అనేది ఎంత అందంగా కనిపించినా ఇదొక అవాంఛనీయ ధోరణి అనే మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను. లక్ష్యంకోసం మరణిస్తున్నవారు చనిపోవడానికి సిద్దమై ఉద్యమాల్లోకి పోవడం లేదు. ఉద్యమాల్లో చనిపోతే పేరు వస్తుందనే గుర్తింపు కోసమూ వారు పోరాటబాట పట్టలేదు. కానీ ప్రాణాన్ని బలిపెట్టకుండా లేదా ప్రాణాలకు తెగించకుండా శాంతియుతంగా చరిత్రలో ఏ మార్పూ జరగలేదు. అహింస ద్వారా మార్పు జరిగిందని చెప్పుకుంటున్న ఘటనల్లో ఎంతమంది సామాన్యుల ప్రాణాలు ఉన్నఫళాన పోయాయో లెక్కలు వేస్తే తెలుస్తుంది. అహింసా పోరాటాల్లో నాయకులు ఎవరూ మరణించలేదు కాబట్టి ఆ పోరాటాన్ని అహింసా పోరాటం అని ముద్రిస్తే చెల్లుబాటయిపోతుందా మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
    7
    హెచ్చార్కె Says
    February 7th, 2010 at 519 am

    రాజ శేఖర్ గారూ,
    1) నేను ఉటంకించి వ్యాఖ్యానించిన మీ వాక్యానికి ఈ అదనపు వివరణ అవసరమైనదే. ఆంటోనియస్ ను శిలువ వేదన నుంచి తప్పించడానికి స్పార్టకస్, అతడిని ద్యంద్వ యుద్ధంలో నిర్జించి, తానే ఆ భయానక మరణాన్ని స్వీకరించడం తప్పకుండా ఉదాత్తమే. మీ వాక్యం అలాంటి ప్రత్యేక పరిస్థితిని ప్రతిబింబించలేదు. అది జనరల్‍ కామెంటుగానే వుంది. అందువల్ల మీ ఈ అదనపు వివరణ అవసరమైనదే. అభినందనలు.
    2) స్పార్టకస్ జీవిత కథ లోని ఆ ప్రత్యేక సందర్భంలో ‘మరణాన్ని ఫెటిష్ గా మార్చడం’ అని నేను అనడం లేదు. కాని జనరల్‍ గా ‘మరణాన్ని ఫెటిష్ గా మార్చే పని’ చాలానే జరిగింది. ఇప్పటికీ జరుగుతోంది. మీ వాక్యం… అది మీ వ్యాసం ఉద్దేశం కాకపోయినా… అలాంటి జనరల్‍ స్పృహనే కలిగిస్తుంది. ఇదొక అవాంఛనీయ ధోరణి అనడంలో నాకెలాంటి సందేహం లేదు. నిజానికి ఈ ధోరణి నిహిలిజానికి మరో రూపం అని కూడా అనుకుంటున్నాను. దానికి దోహదం చేసే సాహిత్యకళారాజకీయ రూపం ఏదయినా అవాంఛనీయమే. అందుకే ‘అందం’ అనే మాట ఉపయోగించాను.
    3) ఇక, ప్రజా పోరాటాలలో ‘హింస’ గురించి మీరు నాకెందుకు క్లాసు తీసుకున్నారో తెలియలేదు. నేను ‘అహింసా వాది’ని కాను. తమ మీద హింసను హింసాత్మకంగా ఎదిరించడానికి ప్రజలకు ఉన్న హక్కును గౌరవిస్తాను. అసలు ప్రజలది, ప్రజా పోరాటాలది హింస కాదు, ప్రతి హింస. హింసకు అవకాశం ఉంటుందనే భయంతో ప్రజలు అన్యాయానికి తలవంచాలని కోరుకోను. నిక్కమైన ఏ ప్రజాతంత్రవాదీ అలా కోరుకోడు. నా వ్యాఖ్యలో ఈ అవగాహన స్పష్టంగానే వుంది. అందువల్ల, మీ వివరణలో రెండో భాగం… నా వ్యాఖ్య సందర్భంగా… ఏమాత్రం సందర్భోచితం కాదు.
    ధన్యవాదాలు
    8
    రాజశేఖరరాజు Says
    March 18th, 2010 at 614 am

    మీ వివరణతో ఏకీభవిస్తున్నాను హెచ్చార్కె గారూ, కానీ మరణాన్ని ఫెటిష్‌గా మార్చడం అనే భావనను ఇంకా లోతుగా పరిశీలించకుండా, చదవకుండా నేను చర్చలోకి దిగడం భావ్యం కాదనుకుంటున్నాను. మీరు చాలా కాలంనుండి ఈ భావనపై విమర్శనాత్మకంగా ఆలోచిస్తున్న విషయం నాకు తెలుసు. కాని మళ్లీ మీ వ్యాఖ్యల వెనుక పునాదిని అధ్యయనం చేయడానికి నావద్ద ప్రస్తుతం సంబంధిత పుస్తకాలు ఏవీ లేవు. లేవనే కన్నా సేకరించినవి అన్నీ పోగొట్టుకున్నానంటే బావుంటుందేమో. మరణాన్ని మార్మికతగా, మాయాజాలంగా ప్రేరేపించే భావజాలాన్ని నిహిలిజం అని మీరు గుర్తు చేశారు కనుక దీనిపై మరింత లోతైన అధ్యయనం అవసరమే.. ఇది కేవలం పరస్పర చర్చలు, వాదోపవాదాల ద్వారా మాత్రమే కుదిరే పని కాదు. ఒక సీరియస్ విషయంపై మళ్లీ దృష్టి సారించినందుకు ధన్యవాదాలు.
    మీరు భలేవారండీ.. మీకు క్లాస్ తీసుకోవడమా
    9
    హెచ్చార్కె Says
    March 19th, 2010 at 145 pm

    రాజశేఖర రాజు గారూ,
    నిజమే. మీరు బాగా గుర్తు చేశారు. వాదోపవాదాల వల్ల కాకుండా, మనకు మనం చదువుకోడం, ఆలోచించడం, ఆలోచనలు పంచుకోడం ద్వారానే మంచి అవగాహనకు రాగలుగుతాం. ‘వాదం’ వల్ల, అంతకు ముందు మన మనస్సులలో ఉన్న అహేతుకాలు మరింత బలపడే ప్రమాదం కూడా ఉంది.
    ‘క్లాసు తీసుకోడం’ అనే మాట సర్దాగా అన్నానంతే.
    ఇదే కోవలో ఏంజెలో పౌలస్ సినిమా ‘ఎటర్నిటీ అండ్ ఎ డే’ని పరిచయం చేస్తే బాగుంటుంది. సిడి దొరుతుందేమో చూడాలని వుంది.

Monday, June 25, 2012

ఇదేం కమ్యూనిజం...!


ఈ ఆదివారం ఉదయం దినపత్రికల లోపలి పేజీలలో ఓ దుర్వార్త.

"రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీకి సిపిఎం ఇచ్చిన మద్దతును నిరసిస్తూ ప్రసేన్‌జిత్ బోస్ ఇచ్చిన రాజీనామాను తిరస్కరించిన సిపిఎం ఆయనను పార్టీ ప్రాధమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది. ప్రణబ్‌ను బలపరుస్తూ పొలిట్ బ్యూరో నిర్ణయించడాన్ని నిరసిస్తున్నాను. ఇది చాలా పెద్ద తప్పని, దీనివల్ల పార్టీకి నష్టంతో పాటు వామపక్ష ఐక్యతకూ భంగకరం అని ప్రసేన్ పార్టీకి బహిరంగ లేఖ రాశారు. నాయకత్వం మరో ఖరీదైన తప్పు  చేస్తోందని, తమ సూచనలన్నీ బుట్టదాఖలవుతున్నాయని పార్టీ సభ్యులు ఆవేదన చెందుతున్నారని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బోస్ తన లేఖలో పేర్కొన్నారు."

తమ రాజకీయ వైఖరికి దురుద్దేశాలు అంటగట్టేందుకు ప్రయత్నించినందుకు ఆయన్ను పార్టీనుంచి బహిష్కరిస్తున్నట్లు సిపిఎం పొలిట్ బ్యూరో శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.  బోస్ శుక్రవారమే రాజీనామా చేసినప్పటికీ దాన్ని తిరస్కరించి వేటువేశామని తెలిపింది.

కాగా, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి చేసిన బోస్. సీపీఎం పరిశోధన విభాగం కన్వీనర్‌గా వ్యవహరించారు. పలు చానెళ్లలో పార్టీ తరపున చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  ప్రణబ్ అభ్యర్థిత్వానికి సిపిఎం మద్దతు తెలుపడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. 2007 నుంచి పార్టీ నాయకత్వం వరుస తప్పులు చేస్తోందన్నారు.

"కాంగ్రెస్, బి.జె.పి పార్టీలపై రాజకీయ పోరాటం సాగించాలని ఏప్రిల్ మహాసభల్లో నిర్ణయించిన సి.పి.ఎం పార్టీ" తన నిర్ణయాన్ని తనే తుంగలో తొక్కుతూ ఆ  పార్టీ పాలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రసేన్ జిత్ రాజీనామా ప్రకటించటమే ఒక షాక్ కాగా, ఒక అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి రాజీనామాను తిరస్కరించిన పార్టీ, అతడిని పార్టీ నుంచే బహిష్కరించడం మరో షాక్. పార్టీ మౌలిక నిర్ణయంతో విభేదిస్తే దానికి వ్యతిరేకంగా పోరాడటమే సంప్రదాయంగా ఉన్న పార్టీ నిర్మాణంలో అందుకు భిన్నంగా ఆయన రాజీనామా చేయడం, దానికి ఫలితంగా బహిష్కరణకు గురవడం... ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో ఎక్కడైనా ఇలాంటి ఘటన జరిగిందేమో నాకయితే తెలీదు.

పైగా "బోస్ శుక్రవారమే రాజీనామా చేసినప్పటికీ దాన్ని తిరస్కరించి వేటువేశామని తెలిపింది." అంటూ పత్రికలలో వచ్చిన వార్త సాక్షరంగా నిజమే అయితే ఇంత కసాయి పార్టీ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలోనే ఉండదు.

సరిగ్గా నెలరోజుల క్రితం అనుకుంటాను. తెలుగుదేశంలో సీనియర్ నేతగా ఉన్న మైసూరారెడ్డి ఏ కారణం వల్లైనా కావచ్చు పార్టీకి రాజీనామా చేస్తే తెలుగుదేశం పార్టీ ఆ రాజీనామాను కూడా పక్కనబెట్టి బహిష్కరించినట్లు గుర్తు. ఇది నిజమే అయితే ఒక పాలకవర్గ పార్టీకి, ఒక కమ్యూనిస్టు పార్టీగా చెప్పుకుంటున్న పార్టీకి తన సభ్యుడి అసమ్మతిని, ధిక్కారస్వరాన్ని అంచనా వేయడంలో, తీర్పు చెప్పడంలో ఏమాత్రం తేడా లేనట్లే కనిపిస్తోంది.

పైగా "పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని ఆయన లేఖాంశాలు అపఖ్యాతిపాలు చేసే విధంగా ఉన్నాయని" ప్రసేన్ జిత్ బహిష్కరణకు సాకులు వెతకడం కూడా సిపిఎంకే చెల్లనుకుంటాను. ఒక కమ్యూనిస్ట్ పార్టీ -?- మూడునెలల క్రితం ఆమోదించిన రాజకీయ తీర్మానానికి -కాంగ్రెస్, బిజెపి రెండింటిపై రాజకీయ పోరాటం సాగించాలనే తీర్మానానికి- భిన్నంగా మరో నిర్ణయం తీసుకుంటున్నప్పుడు కనీసం తన పార్టీ సభ్యుల అవగాహన కోసమైనా ముందస్తు వివరణ ప్రత్రికా ముఖంగా ఇవ్వవలిసిన బాధ్యత ఆ పార్టీకి లేదా అనేది ఒక ప్రశ్న. పరుపు, ప్రతిష్ట అనే పదాలకు అర్థం ఉందనుకుంటే, వాటికి గత కొన్నేళ్లుగా తూట్లు పొడుస్తూ కూడా -బలవంతంగా రైతుల భూములు గుంజుకోవడం, నందిగ్రామ్ పోలీసు కాల్పులు వగైరా- పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని ప్రసేన్ లేఖాంశాలు అపఖ్యాతిపాలు చేసే విధంగా ఉన్నాయని సిపియమ్మే ఆరోపించడం అంటే దొంగే దొంగ అని ఆరోపించినట్లుంది.

దీనికి రాజకీయ కమ్యూనిజం ఆచరణ చరిత్రలోనే మూలం ఉందేమో మరి. వేళ్లతో లెక్కించగలిగినంత తక్కువ మంది సభ్యులతో కూడిన పొలిట్ బ్యూరో, పార్టీ రాజకీయ ఆచరణ సర్వస్వాన్ని నిర్ణయించగలిగే అపరిమితాధికారాలను గుప్పిట్లో పెట్టుకోవడం మొదలయ్యాకే ఇలాంటి భ్రష్టాచారాలు కమ్యూనిస్టు పార్టీలకు తగులుకున్నాయనుకుంటాను. పార్టీని వేలెత్తి చూపితే వ్యతిరేక పంధాగా, పంథాను తప్పు పట్టినంతమాత్రానే విమర్శించినంతమాత్రానే ఎంతటి ఘనాపాటీల చరిత్ర అయినా సరే ప్రజా ద్రోహ చరిత్ర'గా మారిపోవడం 1930ల తర్వాతనే మొదలయిందనుకుంటాను. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌ల కాలం నాటి కమ్యూనిస్టు ఆచరణలలో భిన్నాభిప్రాయాన్ని ఏమాత్రం సహించలేని ధోరణులను నేనయితే చదవలేదు. వినలేదు కూడా.

జర్మనీ కార్మిక వర్గ నాయకురాలు రోజా లగ్జెంబర్గ్, విప్లవానంతరం శైశవదశలోని సోవియట్ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో పొడసూపుతున్న అప్రజాస్వామిక లక్షణాలను ఎత్తి చూపుతూ సోవియట్ తరహా కమ్యూనిజం అతి త్వరలోనే శ్రామిక వర్గ నియంతృత్వం పేరిట ప్రజారాసుల సమిష్టి కార్యాచరణల అమలుకు భిన్నంగా పోలిట్ బ్యూరో నియంతృత్వాన్ని నెలకొల్పే ప్రమాదకరమైన నియంతృత్వ ధోరణుల్లోకి ప్రయాణించనుందని తీవ్రంగా విమర్శించారు. లెనిన్ బతికి ఉన్నప్పుడే ఆమె చేసిన ఈ విమర్శను తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం పెడచెవిన పెట్టింది లేదా సాయుధ బలంతో రాజ్యాధికారంలోకి వచ్చాక, ఇక కమ్యూనిజానికి, పార్టీకి తిరుగులేదని భ్రమిసిపోయి, రాజకీయాధికారపు గర్వాంధకారంలో కన్నుమిన్నూ గానకుండా వ్యవహరించింది.

దాని ఫలితాలను గత 80 ఏళ్లుగా అందరం చూస్తూనే ఉన్నాం...

పొలిట్‌బ్యూరో నిర్ణయాలకు అందరూ గంపగుత్తగా చేతులెత్తేస్తూ ఏకగ్రీవతీర్మానాలు అమలయిపోయే భ్రష్ట ధోరణులు ఉనికిలోకి వచ్చేశాక ఇలాంటి ఏకశిలాసదృశ -మోనోలితిక్- నిర్మాణాలకు ఎదురునిల్చి పోరాడటం ప్రసేన్ జిత్ లాంటి వ్యక్తులకు సాధ్యమయ్యే పనేనా?

అందుకే ఆయన రాజీనామా ఇచ్చినట్లుంది. దానికి కూడా సహించలేక ప్రసేన్‌జిత్‌ను బహిష్కరణ వేటుతో చంపేశారు. ఈ బహిష్కరణతో, సిపిఎం పార్టీలో నిన్న గాక మొన్న చేరిన బుడ్డాపకీరు కూడా ఇక ఆయన ముఖం చూడడు.

ఆహా -రాజకీయ- కమ్యూనిజమా!

ఇలాంటి కమ్యూనిజాన్ని ఎవరూ కోరుకోకూడదు. మన ఖర్మ ఏమంటే భారతదేశంలో అన్ని రకాల కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాలూ ఇలాగే ఏడుస్తున్నాయి. కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను ఇలాగే ఉద్ధరిస్తున్నాయి. ఉద్యమ నిర్మాణాలలో ఇన్ని లోపాలు పెట్టుకుని, కమ్యూనిస్టు సిద్ధాంత వ్యతిరేకులు కమ్యూనిస్టు పార్టీల దౌర్భాగ్య ఆచరణను సాకుగా చూపి కమ్యూనిజాన్నివిమర్శిస్తున్నారంటే మనం ఉలికిపాటుకు గురికావలసిన పని లేదేమో మరి.

దీనర్థం ఇక మనందరం కమ్యూనిజం అనే ఆదర్శాన్ని తోసిపారేయాలని కాదు.

(ఈ కథనంలో అధికభాగాన్ని విశేఖర్ గారి తెలుగువార్తలు బ్లాగులో "రాష్ట్రపతి ఎన్నిక: సి.పి.ఎం సిద్ధాంతకర్త ప్రసేన్‌జిత్ బహిష్కరణ" కథనానికి వ్యాఖ్యగా పోస్ట్ చేశాను. తర్వాత మరి కాస్త పొడిగించి నా బ్లాగులో టపాగా ప్రచురిస్తున్నాను.)

Sunday, February 5, 2012

సోవియట్ రష్యాలో జీవితంపై అరుదైన కథనాలు

మిత్రులు శ్రీ భండారు శ్రీనివాసరావుగారు సోవియట్ యూనియన్‌ ఉనికిలో ఉన్న చివరిరోజుల్లో మాస్కోలో పనిచేసినప్పుడు తాను ప్రత్యక్షంగా చూసిన, పొందిన సోవియట్ రష్యా జీవితానుభవాలపై రెండేళ్ల క్రితం రాసిన కథనాలు అప్పట్లో చదవటం ఒక మహానుభూతిని కల్గించింది. ఒక రకంగా అవి బ్లాగ్ లోకంలో సంచలనం కలిగించిన ప్రత్యేక విశిష్ట రచనలు.

"ఆ రోజుల్లో 'అలా వుండేది, యిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన 'స్వర్ణ యుగాలు' చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా.

నేను కమ్యూనిష్టుని కాను. వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు. ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం' నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం. నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయిన, గౌరవ ప్రదమయిన, తృప్తికరమయిన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే. వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా గోరంతను 'కొండంత' చేసి చెబుతున్నానేమో అని అనిపించక తప్పదు. అందుకే 'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సి వచ్చింది."

అంటూ శ్రీనివాస రావు గారు తన సోవియట్ రష్యా అనుభవాలను ఇంత ఆలస్యంగా రాయడానికి కారణాలను చెబుతూ రాసిన పై వ్యాఖ్య నన్ను అప్పట్లో విశేషంగా ఆకర్షించింది. కమ్యూనిస్టు పార్టీ వాసన లేని వ్యక్తి, జీవికలో భాగంగా సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపిన వ్యక్తి అక్కడ తాను గడిపిన జీవనం తన జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకున్నారు. "నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయిన, గౌరవ ప్రదమయిన, తృప్తికరమయిన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే." అని కూడా పరమ నిజాయితీగా తన అంతరంగాన్ని ఆకర్షించారు.

1987 నుంచి 1991 వరకు అంటే సోవియట్ యూనియన్ రద్దయ్యే వరకు విదేశీ ఉద్యోగి స్థాయిలో 'పిల్లజమీందారు' జీవితం గడిపిన శ్రీనివాసరావు గారు ఆ దేశం గురించి చేసిన అపురూప కృషిని నెత్తిన పెట్టుకుంటూ అప్పట్లోనే ఆయన రాసిన ఒక టపాకు ఇలా వ్యాఖ్య పంపాను.

"విదేశీ పర్యటనలు,విహారాలపై గతంలో ప్రముఖుల వ్యాసాలు, యాత్రా విశేషాలు ఎన్నో చదివాను. కాని వాటిలో చాలావరకు ఫలానా ప్రాంతం చూశామని, పలాని విశేషాన్ని తిలకించామని, పలానా కట్టడాన్ని చూశామని చెప్పేవారే తప్ప ఓ నగరజీవితాన్ని, ఓ వ్యవస్థ పనితీరును ఇంత హృద్యంగా, ఇంత ఆసక్తికరంగా రాయడాన్ని ఇంతవరకు నేను చూడలేదు.

మీ అయిదేళ్ల మాస్కో జీవితాన్ని ఔపోసన పట్టినట్లు రాస్తున్నారు. ఒక వ్యవస్థ మంచిని చూడడానికి, గుర్తించి ప్రకటించడానికి మనం సిద్ధాంతాలు వల్లెవేయవలసిన అవసరం లేదు. ముద్రలు తగిలించుకోవలసిన అవసరమూ లేదు. మీలా ఉన్నది ఉన్నట్లుగా, చూసింది చూసినట్లుగా, పలవరించి రాస్తే చాలు.

సోవియట్ వ్యవస్థ లోపాలు ఎన్నయినా ఉండవచ్చు కానీ ప్రజలందరికీ మంచి జీవన ప్రమాణాలను అందించడంలో అది సక్సెస్ అయినంతగా భూమ్మీద మరే దేశం కూడా కాలేదని మీ కథనాలబట్టి తెలుస్తోంది. కమ్యూనిస్టు వ్యవస్థ గొప్పతనాన్ని సిద్ధాంతాల ద్వారా మాత్రమే చదువుకున్న నాలాంటివారందరికీ మీరు ప్రత్యక్షంగా ఓ భూతల స్వర్గాన్ని కళ్లకు కట్టిస్తున్నారు.

జీవితంలో సమానత్వాన్ని ఇంత గొప్పగా ఆచరణలో చేసిచూపించిన ఆ గొప్ప దేశంలో మీరు కొన్నేళ్లు బతికారు. ఎంత అదృష్టవంతులు మీరు. అదృష్టానికి మారుపదం దొరకడం లేదు నాకు. శ్రీనివాసరావు గారూ.. మీరు ఇలాగే రాస్తూ పోండి. వీలయితే మీరు మాస్కో జీవితంలో ఫోటోలు తీసుకుని ఉంటే వాటినే ఓ కథనంగా కూడా ప్రచురించండి. చిన్న క్యాప్షన్లతో అయిదారు ఫోటోలను ఒకే ఆర్టికల్‌గా పోస్ట్ చేయవచ్చు.

భవిష్యత్తరాలకు మానవ సమాజంలో ఒకనాడు వెలిగిన భూతలస్వర్గాన్ని మీరు బ్లాగీకరించి భద్రపరుస్తున్నారు. దయచేసి వెంటనే విశాలాంధ్రవారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ మాస్కో అనుభవాలను పుస్తక రూపంలో తీసుకురండి. కళ్లకు అద్దుకుని తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం.

అలాగే మాస్కో జీవితంలో మీరు చూసిన లోపాలను కూడా తప్పక రాయండి. లోపాలను కూడా మీరు రాయకపోతే అది ఎప్పటికీ లోటుగానే ఉంటుది.

ప్రేమతో, అభిమానంతో..
రాజు
21 జనవరి 2010 11:58 సా "

సోవియట్ యూనియన్‌ పతనానికి ముందు సమాజ జీవితాన్ని కళ్లారా చూసిన ఈ సామాన్యుడు, ఆ దేశాన్ని సందర్శించిన ఏ ప్రముఖుడూ రాయలేనంత పరమ నిష్పాక్షికంగా ఈ మార్పు చూసిన కళ్లు కథన పరంపరలో అక్షర బద్దం చేశారు. దశాబ్దాల తర్వాత కూడా తన ప్రాసంగికతను కోల్పోనటువంటి ఈ గొప్ప రచనను సమాజ చలనం, పరిణామాల పట్ల ఆసక్తి కలిగిన వారు తప్పక చూడాలనే అభిప్రాయంతో ఆయన రాసిన 17 కథనాల లింకులను ఈ టపాలో ఒకే చోట పోస్ట్ చేస్తున్నాను. కింది లింకులను తెరిచి వరుసగా చదవండి. ఒక అద్భుత ప్రపంచం మీ కళ్లముందు ఆవిష్కరించబడుతుందనడంలో సందేహించవలసిన పనిలేదు.

శ్రీనివాసరావు గారూ,
మరోసారి ధన్యవాదాలండీ.

-----------------

మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు) - భండారు శ్రీనివాస రావు

జర్నలిష్టులందరూ తమ వృత్తి అనుభవాలను గ్రంధస్తం చేస్తుండాలని మిత్రుడు దేవులపల్లి అమర్ చెబుతుంటారు.గ్రంధ ప్రచురణ అనేది సామాన్య జర్నలిష్టులకు అలవి కాని భారం. అయినప్పటికీ, అనుభవంలోకి వచ్చిన విషయాలను కనీసం కాగితం మీద పెట్టడం వరకు జరగాలన్నది నా అభిప్రాయం కూడా. అయినా సరే - ఇంచుమించు రెండు దశాబ్దాల క్రితం - మాస్కోలో గడిపివచ్చిన సుమారు ఐదేళ్ళ అనుభవాలను అక్షర బద్ధం చేసే ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఏకధ్రువ ప్రపంచ వ్యవస్తను ప్రశ్నిస్తూ- నూతన సామ్యవాద సిద్దాంతాలను ప్రవచిస్తూ - ఏడు దశాబ్దాలకు పైగా సాగిన మొట్టమొదటి 'సోవియట్ కమ్యూనిష్ట్ ప్రభుత్వ చరమాంకాన్ని కళ్ళారా చూడగలిగిన అరుదయిన అవకాశాన్ని ఆలంబనగా చేసుకుని - 'మార్పు చూసిన కళ్ళు' అనే పేరుతో ఆనాటి అనుభవాలను గుదిగుచ్చి గ్రంధస్తం చేయాలనే ప్రబలమయిన కాంక్షను ఎన్నో ఏళ్ళుగా అదిమిపెట్టుకోవాల్సి వచ్చింది. దీనికి కారణాలు అనేకం. ఆనాడు నేను చూసింది మరో ప్రపంచం. అప్పటికీ ఇప్పటికీ యెంతో తేడా.

ఆ రోజుల్లో 'అలా వుండేది, యిలా వుండేది' అని రాస్తే నమ్మడానికి వీల్లేకుండా ఈనాటి రష్యన్ల జీవన విధానాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. రతనాలను రాశులుగా పోసి- వీధి అంగళ్ళలో విక్రయించిన 'స్వర్ణ యుగాలు' చరిత్ర పుటల్లో ఆనవాలుగా మిగిలిపోయినట్టే - ఆ నాటి నా అనుభవాలు కూడా. నేను కమ్యూనిష్టుని కాను. వృత్తి రీత్యా వివిధ రాజకీయ పార్టీలవారితో అంటకాగి తిరిగివుండ వచ్చు కానీ ఏ రకమయిన రాజకీయ వాసనలను నేను వొంటబట్టించుకోలేదు. ఒక సామాన్యుడిగా అప్పటి కమ్యూనిస్ట్ రష్యాలో కాలుమోపాను . అక్కడ నేను గడిపిన 'జీవనం' నా జీవితంలోనే ఒక సువర్ణ అధ్యాయం. నేనూ, నా భార్యా పిల్లలూ - అత్యంత సుఖప్రదమయిన, గౌరవ ప్రదమయిన, తృప్తికరమయిన రోజులు గడిపింది ఆ రోజుల్లోనే. వాటిని గురించి ఏ కొంచెం చెప్పినా గోరంతను 'కొండంత' చేసి చెబుతున్నానేమో అని అనిపించకత ప్పదు. అందుకే 'మార్పు చూసిన కళ్ళు' అక్షరబద్ధం చేయడానికి ఇంతగా తటపటాయించాల్సి వచ్చింది.

అంతేకాదు. కాలం గడుస్తున్నకొద్దీ - గుర్తుంచుకోవాల్సిన విషయాలు కూడా గుర్తుకురానంతగా మరపున పడడం సహజమయిన విషయం. తేదీలు, పేర్లూ స్పురణకు తెచ్చుకోవడం క్లిష్టంగా మారుతుంది. విషయానికి న్యాయం చేయలేక పోతున్నామేమో అన్న సంశయం మరింత వెనక్కి లాగుతుంది. ఏతా వాతా జరిగింది ఏళ్ళతరబడి కాలయాపన.
(దస్వి దానియా అంటే రష్యన్ లో మళ్ళీ కలుద్దాం)

'మార్పు చూసిన కళ్ళు ' చదువుతున్నవారికి రచయిత విజ్ఞప్తి:
చరిత్రలో 'గుప్తుల స్వర్ణ యుగం' చదువుకున్నాము. నిజమా కాదా అన్న మీమాంసకు ఎవ్వరం తావివ్వలేదు. ఇదీ అలాగే.
ఆ రోజుల్లో మాకు ప్రతి రోజు 'ఇది నిజంగా నిజమేనా?' అనే సందేహం వెంటాడుతూనే వుండేది. ఇన్నేళ్ళ తరవాత మళ్ళీ గుర్తు చేసుకుని రాస్తున్నప్పుడు కూడా ఆ సందేహం అంటిపెట్టుకునే ఉంటోంది. మెదడులో నిక్షిప్తం చేసుకున్న విషయాల సింహావలోకనమే ఈ రచన. డయిరీల్లో రాసుకున్నది కాదు. అందువల్ల సమగ్రతకు కొంత భంగం వాటిల్లడమో లేదా విషయాలను ఒకచోట గుదిగుచ్చడంలో ఒకమేరకు అస్పష్టతకు అవకాశం ఏర్పడడమో, పునరుక్తి దోషాలకు తావివ్వడమో జరిగివుంటే పెద్ద మనసుతో నన్ను క్షమించాలని కోరుతున్నాను. అలాకాక చరిత్ర వక్రీకరణ కనిపిస్తే నిర్మొహమాటంగా తెలియచేసి దిద్దుబాటుకు అవకాశం ఇవ్వాలని మనస్పూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.
-భండారు శ్రీనివాసరావు
302, మధుబన్, ఎల్లారెడ్డిగూడా,
శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ - 500 073.
ఫోన్: 040-23731056 (email: bhandarusr@yahoo.co.in)
------------------

1.
మార్పు చూసిన కళ్ళు - ఆనాటి మాస్కోలో మా అనుభవాలు - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_01.html

2
గురువారం 7 జనవరి 2010
మార్పుచూసిన కళ్ళు - ఆనాటి సోవియట్ మాస్కో అనుభవాలు - రెండో భాగం - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_07.html

3.
శుక్రవారం 8 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు) - మూడో భాగం - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_08.html


4.
సోమవారం 11 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు -ఆనాటి మాస్కో అనుభవాలు- నాలుగో భాగం-భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_11.html


5.
సోమవారం 11 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు) - ఐదో భాగం - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_9811.html


6.
శుక్రవారం 15 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మాస్కో అనుభవాలు - ఆరో భాగం- భండారు శ్రీనివాసరావు)
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_15.html


7.
శుక్రవారం 15 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (మాస్కో అనుభవాలు -ఏడో భాగం ) - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_8240.html


8.
శనివారం 16 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు-ఎనిమిదో భాగం)
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_16.html


9.
ఆదివారం 17 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు- తొమ్మిదో భాగం) -భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_17.html


10.
మంగళవారం 19 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదో భాగం)- భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_19.html


11.
మంగళవారం 19 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు- పదకొండో భాగం) -భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_3369.html


12.
బుధవారం 20 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పన్నెండో భాగం)- భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_20.html


13.
బుధవారం 20 జనవరి 2010
మార్పుచూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు పదమూడో భాగం) - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_7837.html


14.
మంగళవారం 26 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (ఆనాటి మా మాస్కో అనుభవాలు- పదునాలుగో భాగం)) - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_26.html


15.
బుధవారం 27 జనవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు- పదిహేనో భాగం ) - భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/01/blog-post_27.html


16.
మంగళవారం 2 ఫిబ్రవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మా మాస్కో అనుభవాలు - పదహారో భాగం) - భండారు శ్రీనివాస రావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/02/blog-post.html


17.
మంగళవారం 2 ఫిబ్రవరి 2010
మార్పు చూసిన కళ్ళు (అలనాటి మాస్కోలో మా అనుభవాలు-పదిహేడో భాగం)- భండారు శ్రీనివాసరావు
http://bhandarusrinivasarao.blogspot.com/2010/02/blog-post_02.html