Pages

Thursday, October 6, 2011

స్టీవ్ జాబ్స్.. భారతదేశం.. యాపిల్

సాంకేతిక చరిత్రలో ఒక గొప్ప శకం ముగిసింది. భవిష్యత్ తరాలపై కూడా ప్రభావితం చూవుతుందని ప్రశంసలు పొందుతున్న ఓ గొప్ప సాంకేతిక దార్శనికుడు, యాపిల్ ఆవిష్కర్త కన్నుమూయడంతో మనకాలానికి చెందిన ఒక గొప్ప మేధో సృజన శాశ్వత విరామం పొందింది.

స్టీవ్స్ జాబ్స్ -56- చరిత్రలో ఓ గొప్ప సాంకేతిక బ్రాండ్ ఆవిష్కర్త కన్నుమూశాడు. టెక్నాలజీ జార్ అని ప్రపంచం తనను ఇప్పుడు ముద్దుగా పిలుస్తోంది. సంగీతం, మొబైల్ ఫోన్లు, కంప్యూటింగ్ చరిత్రను విప్లవీకరించిన అమోఘ సాంకేతిక విన్నాణానికి మారుపేరు స్టీవ్. కంప్యూటింగ్ ప్రపంచాన్ని ఒంటిచేత్తో మార్చివేసి, పాకెట్ డివైసెస్ భావనను పూర్తిగా పునర్విచించిన దార్శనికుడు స్టీవ్ జాబ్స్. తను ఆవిష్కరించిన ఆధునిక సాంకేతిక ఉపకరణాలకంటే ప్రపంచ జ్ఞానానుభవానికి అతడు చేసిన దోహదం, ప్రపంచ డిజిటల్ భవిష్యత్తు పట్ల అతడు ప్రదర్శించిన ఆశావహ దృక్పధం చరిత్రలో సాటిలేనివి.

30 సంవత్సరాలుగా నిరంతరం ఆలోచిస్తున్న ఒక మహా మేధకు జీవితం తొలి దశలో భారతదేశంలోనే జ్ఞానోదయం వంటిది కలిగిందంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. కాని తాను చిన్న వయసులో అలవర్చుకున్న హిప్పీ సంస్కృతి జ్ఞానాన్వేషణలో భారత్‌ను సందర్శిచేలా చేసింది.

భారత పర్యటన
ప్రపంచ వ్యాప్తంగా పలువురు మహా వ్యక్తుల విషయంలో జరిగినట్లే యాపిల్ సహ-నిర్మాత స్టీవ్ జాబ్స్ తాత్విక చింతనకు భారత దేశమే మూలాధారం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 18 ఏళ్ల చిన్న వయస్సులో ఇండియాలో పలు ప్రాంతాలు సందర్శించిన తర్వాత, స్టీవ్ బౌద్ధమతం స్వీకరించాడు.

1970ల మధ్యలో స్టీవ్ భారతదేశంలో పర్యటించాడు. డిగ్రీ చదువునుంచి తొలి సెమిస్టర్‌లోనే వైదొలగిన తర్వాత అమెరికాలో ఒక వీడియో గేమ్స్ తయారీ సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తూ పోగుచేసుకున్న డబ్బుతో అతడు ఇండియా పర్యటనకు వచ్చాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్వేషణలో భాగంగా స్టీవ్ భారత్ పర్యటనకు వచ్చాడు. అతడి భారత పర్యటనపై అప్పట్లో ఎలాంటి వార్తలూ ప్రచురించబడలేదు కాని, భారత పర్యటనలో భాగంగా తను చేసిన కొన్ని వ్యాఖ్యలు జ్ఞానబోధ, ఆధ్యాత్మికత పట్ల గురించి తానేమనుకుంటున్నది తెలియపరుస్తున్నాయి.

ఆరెగాన్ లోని పోర్ట్‌ల్యాండ్‌లో రీడ్ అనే ఒక ప్రయివేట్ మానవ శాస్త్రాల అధ్యయన విభాగంలో డిగ్రీ చదువుతూ మధ్యలోనే వదిలేసిన స్టీవ్ మత వ్యవహారాలలో మంచి ఆసక్తి కలిగిన నిరంతర తాత్విక విద్యార్థి. అతడు ఒకే ఒక సెమిస్టర్ -మూడు నెలలు?- చదివిన తర్వాత ఎందుకు కాలేజీ చదువును వదిలి పెట్టేశాడో కూడా ప్రపంచానికి వింత వార్తలాగే ఉంటుంది. పుట్టుకతో మధ్యతరగతికి చెందిన స్టీవ్, తను చేరిన సంపన్నుల కాలేజీలో ఇమడలేకపోయాడని, అందుకే అతడు చదువును మధ్యలోనే వదిలేశాడని వార్తలు.

చదువు నిలిపివేసిన తొలిరోజుల్లో బతకడం కోసం కోక్ బ్యాటిల్స్‌ని సేకరించి కంపెనీకి తిరిగి ఇచ్చే పనిలో ఉండేవాడు. (భారత పర్యటనకోసమే ఈ పని చేశాడని చాలామంది అంటున్నారు). స్థానిక్ హరే కృష్ణ ఆలయంలో వారానికి ఒకసారి ఉచిత భోజనం కూడా చేసేవాడట. తనకంటూ అప్పట్లో ప్రత్యేకంగా గది ఉండేది కాదని, మిత్రుల గదుల్లోని నేలమీద పడుకుని నిద్రించేవాడినని స్టీవ్ తర్వాత చెప్పుకున్నాడు. కోక్ ఖాళీ బ్యాటిళ్లను సేకరించి వాటిని అయిదు సెంట్లకు -డాలర్‌కు వంద సెంట్లు- ఒకటి చొప్పున కంపెనీకి తిరిగి ఇచ్చేసి వచ్చిన దాంతో ఆహారం కొనుక్కునేవాడినని, స్థానికంగా హరేకృష్ణ ఆలయంలో ప్రతి ఆదివారం రాత్రి ఉచితంగా అందించే మంచి భోజనం కోసం పట్టణంలో ఏడు మైళ్లు నడిచి వెళ్లేవాడినని స్టీవ్ చెప్పుకున్నాడు. నిజంగా తాను అలాంటి జీవితాన్ని చక్కగా ఆస్వాదించాడట కూడా.

భారత దేశంలో అనాధపిల్లలు జీవితం గడుపుతున్న రీతిలో, సెంటు సెంటుగా కూడబెట్టిన డబ్బుతో స్టీవ్ 18 ఏళ్ల వయస్సులో భారత దేశం వచ్చాడు. 1970లలో నీమ్ కరోరి బాబా అనే హనుమాన్ భక్తుడికి అమెరికాలో కొద్దిమంది సహచరులు ఉండేవారట. అతడిని కలవాలనే స్టీవ్ తన మిత్రుడు, రీడ్స్ కాలేజీలో సహాధ్యాయి కొట్కే తో కలిసి తన ఆశ్రమానికి వచ్చాడు కాని అప్పటికే బాబా చనిపోయారని తెలుస్తోంది.

భారతదేశం నుంచి అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నప్పుడు అతడు జ్ఞానోదయం పట్ల తనదైన రీతిలో వ్యాఖ్యానించాడని తెలుస్తోంది.

"ఒక నెల రోజుల్లో జ్ఞానోదయం పొందగల చోటును వెతకడానికి మేము వెళ్లి ఉండలేదు. మొట్టమొదటిసారిగా నేను ఇక్కడే వాస్తవాన్ని గ్రహించనారంభించాను అదేమంటే కారల్ మార్క్స్, నీమ్ కైరోలి బాబా కంటే ఎక్కువగా ధామస్ ఎడిసన్ ప్రపంచాన్ని మరింతగా మెరుగుపర్చి ఉండవచ్చు."

అలా భారత పర్యటన ముగిసిన కొద్ది కాలంలోనే స్టీవ్ బౌద్ధమతాన్ని స్వీకరించాడు. తన తలను గుండు గీయించుకున్నాడు కూడా. భారతీయులకు మల్లే వదులుగా ఉండే దుస్తులు ధరించసాగాడు. మానసిక సంబంధమైన అంశాలపై ప్రయోగాలు కూడా తరచుగా చేశాడు.

తర్వాత కొద్ది కాలంలోనే యాపిల్ సంస్థకు తన కుటుంబ గ్యారేజీలో రూపు దిద్దాడు. ఒరేగాన్‌లో ఒక కమ్యూన్‌లో యాపిల్ పళ్లతోటను చూసిన తర్వాత తను పెట్టబోయే సంస్థకు యాపిల్ పేరును సూచించాడని తెలుస్తోంది.

వ్యవస్థా వ్యతిరేక దృక్పథం
1955లో శాన్‌ప్రాన్సిస్కోలో పుట్టిన స్టీవ్ అమెరికాలో హిప్పీ సంస్కృతి వ్యాపిస్తున్న కాలంలో పెరిగాడు. హిప్పీల సంస్కృతికి ప్రతినిధులైన బాబ్ డిలాన్, బీటిల్స్ అతడి అభిమాన సంగీత కారులు. వీరి రాజకీయ అభిప్రాయాలు, వ్యవస్థా వ్యతిరేక దృక్పధాలతో ఇతడు భాగం పంచుకున్నాడు. బీటిల్స్ లాగే స్టీవ్స్ కూడా ఆధ్యాత్మిక మార్గాన్వేషణలో భాగంగా భారతదేశం సందర్శించాడు. వారిలాగే ఇతడు కూడా తన పుట్టి పెరిగిన ప్రాంతాల్లో, చివరకు ఆఫీసులో కూడా కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాడని సిఎన్ఎన్ నివేదించింది.

యాపిల్ చరిత్ర,, గుడ్డపీలికల దశనుండి సంపన్న జీవితం వరకు సాగిన స్టీవ్ జీవితం ఈ మహావిజయ గాథకు ఒక గట్టి నిదర్శనంలా నిలుస్తోంది. స్టీవ్ సాధించిన ఈ అసాధారణ విజయం తనను ఇక వెనక్కి తిరిగి చూసుకోనివ్వలేదు. తర్వాత అతడు మరెన్నడూ భారతదేశానికి రాలేదు కూడా. ఐబీఎమ్ నుంచి హెచ్.పీ దాకా ఐటీ పరిశ్రమ మొత్తంగా భారతీయ సిలికాన్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నప్పుడు కూడా స్టీవ్ భారతదేశంలో అడుగుపెట్టడానికి ఆసక్తి చూపించలేదు.

బౌద్ధమతంపై తీవ్ర ఆసక్తి కలిగిన స్టీవ్, ఇండియా పట్ల సానుకూల వైఖరిని అవలంబించలేదు. భారత పర్యటన కాలంలో ఇక్కడ తాండవిస్తున్న దారిద్ర్యాన్ని, ఇక్కడి కల్లోల పరిస్థితులను చూసి అతడు తీవ్రంగా అసంతృప్తి చెంది ఉండవచ్చు. తాను తదనంతర జీవితం పొడవునా ఆసక్తి ప్రదర్శించిన తన కలల ఉత్పత్తిలోనే అతడు బహుశా నిజమైన జ్ఞానోదయాన్ని కనుగొని ఉండవచ్చు.

వ్యక్తి - వృత్తి- నిమ్నోన్నతాలు
విజయానికి నిజమైన అవకాశం ఉద్యోగంలో కాకుండా వ్యక్తిలోనే దాగి ఉంటుదనేది నేటి నానుడి. స్టీవ్ జాబ్స్‌ని గురించి ఎవరయినా నిర్వచించాలంటే పై పంక్తులు చక్కగా సరిపోతాయి. యాపిల్ సంస్థ భారాన్ని పద్నాలుగేళ్ల పాటు మోస్తూ వచ్చిన స్టీవ్ ఈ అక్టోబర్ 5నే కన్నుమూశాడు. స్టీవ్ కెరీర్, జీవితం బాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తీసిపోవు. కంప్యూటింగ్ ప్రపంచ రారాజుగా పేరొందిన ఈ కాలేజ్ డ్రాపవుట్ తన మిత్రుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి సిలికాన్ వ్యాలీలోని తన కుటుంబ గ్యారేజీలో అపెల్ కంప్యూటర్‌ సంస్థను 1970ల చివరలో ప్రారంభించాడు.

తను ప్రవేశపెట్టిన యాపిల్ 1 కంప్యూటర్ పెద్దగా విజయం పొందనప్పటికీ యాపిల్ 2 మాత్రం విజయం సాధించింది 1980లో ఐపీఓ ద్వారా స్టీవ్ మిలియనీర్‌గా మారాడు. తదనంతరం ఐబీఎమ్ పలు పర్సనల్ కంప్యూటర్లను ప్రారంభించడంతో ఈ విజయ గాధకు అడ్డంకులు ఎదురయ్యాయి. తన మిత్రుడు, భాగస్వామి వోజ్నియాక్ విమానప్రమాదంలో గాయపడటంతో పరిస్థితులు మరింత విషమించాయి. జీవితంలో నిజమైన మలుపు తిరగసాగింది.

అప్పట్లో పెప్సీ అధిపతిగా ఉన్న హోంచో జాన్ స్కల్లీని యాపిల్‌లో చేరవలసిందిగా స్టీవ్ ఆహ్వానించాడు. కాని, ఈ స్కల్లీనే యాపిల్ నుంచి స్టీవ్‌ని సాగనంపాడు. స్టీవ్‌ని సాగనంపిన తర్వాత .యాపిల్ భాగ్యరేఖ తారుమారయింది. దాని ఉత్పత్తులు వరుసగా విఫలం చెందడంతో స్కల్లీ కూడా సంస్థనుంచి బహిష్కరించబడ్డాడు. స్టీవ్ తిరిగి యాపిల్‌కి వచ్చిన తర్వాతే సంస్థ దశ తిరిగింది. రెండోసారి వచ్చిన వెంటనే ఐపాడ్ పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్‌ని, ఐఫోన్, ఐప్యాడ్‌లను స్టీవ్ ప్రవేశపెట్టాడు. ఇవి మొత్తం కంప్యూటింగ్ ప్రపంచాన్ని, సెల్యులార్ ఫోన్ వ్యాపారాన్నే విప్లవీకరించేశాయి.

స్టీవ్ గొప్పతనం ఏదంటే తన నిజమైన దార్శనికతే. సాంకేతిక జ్ఞాన సరిహద్దులను ముందుకు నెట్టడంలో అతడి సృజనాత్మక తృష్ణ సాటిలేనిది. తాను ఈ ప్రపంచాన్ని ఒక కోణంలో మార్చగలనని విశ్వసించాడు, నలుగురికీ భిన్నంగా ఆలోచించాడు. తన నమ్మకాన్ని రుజువు చేశాడు. టెక్నాలజీపై తన నమ్మకం ప్రపంచాన్ని మార్చగలుగుతుందని ఒకనాడు అతడు భావించాడు. ఈరోజు ప్రపంచం దాన్ని నిరూపిస్తోంది.

వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తులు, నిర్మాణరంగం వంటి సాంప్రదాయిక రంగాలకు స్టీవ్ మేధస్సు ఎలాంటి దోహదం చేయలేదన్నది వాస్తవమే కావచ్చు. కాని సాంకేతిక జ్ఞానం ప్రపంచాన్ని, వినోద పరిశ్రమ, ఐటీ, కంప్యూటింగ్ రంగంలో మారుస్తుందని నిరూపించడంలో స్టీవ్ తన సమకాలీన ప్రపంచంకంటే ఎంతో ముందు ఉంటూ వచ్చాడు. తానే చెప్పుకున్నట్లు మనిషి జీవితం చాలా పరిమితమైనది. ఒక వ్యక్తి తన పరిమిత జీవితంలో ఇంతకంటే సాధించవలసింది ఏముంటుంది?

కారల్ మార్క్స్ కంటే, నీమ్ బాబా కంటే ప్రపంచాన్ని ధామస్ ఎడిసనే మరింత ఎక్కువగా మార్చి ఉండవచ్చునంటూ స్టీవ్ చేసాడని చెప్పబడుతున్న వ్యాఖ్యలను వివాదాస్పదంగా చూడనవసరం లేదు. ఈ వ్యాఖ్యలు తన భవిష్యత్ దర్శనాన్ని చూపించాయి. తను భావించిన రంగంలో అతడు సాధించినది అద్వితీయ విజయం. అంతే.

మరణం ఇప్పటికీ చివరి గమ్యమే...
స్టీవ్ మరణంపై అధికారిక ప్రకటన వెలువడలేదు కాని చాలాకాలంగా తను కేన్సర్, ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ వచ్చాడు. 2005లో స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో చేసిన ప్రసంగం స్టీవ్ జీవితంలోనే అత్యంత గొప్పదైన, చిరస్మరణీయమైన ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయింది.
మొదటిసారిగా ఇక్కడే తను ఎదుర్కొంటున్న ప్రమాదకరమైన పాంక్రియాటిక్ కేన్సర్ గురించి స్టీవ్ బయట పెట్టాడు.

భూమ్మీద మనిషి జీవితం చాలా పరిమితమైంది కాబట్టి ఏదో అల్లాటప్పా జీవితం గడుపుతూ వృధాపర్చరాదని ఈ ప్రసంగంలో స్టీవ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అతడు చెప్పిన వాక్యం "to stay hungry, stay foolish since a person`s limited time on earth should not be wasted in living someone else`s life." అక్కడి శ్రోతలను ఉర్రూతలూగించింది.

"ఎవరూ చావాలనుకోరు. స్వర్గానికి పోవాలనుకున్న వారు కూడా అక్కడికి వెళ్లడానికి ఇక్కడ చనిపోవాలని కోరుకోరు. మరణం అనేది మనందరం పంచుకునే గమ్యస్థానంలా ఇప్పటికీ ఉంటోంది. ఎవరూ దాన్నుంచి తప్పించుకోలేరు." అంటూ స్టీవ్ 2005 జూన్ 12న యాపిల్ కంప్యూటర్ సీఈఓగా చేసిన ప్రారంభోపన్యాసంలో చెప్పాడు.

చరిత్రలో అది గొప్ప ప్రారంభోపన్యాసాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ప్రసంగంలో స్టీవ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి జీవితం చాలా పరిమితమైంది కాబట్టి ఇతరులు బతుకుతున్నట్లుగా బ్రతుకుతూ జీవితాన్ని వృధా చేసుకోవద్దని సూచించాడు. పిడివాదంలోకి కొట్టుకుపోవద్దని, ఇతరులు ఆలోచనల ఫలితాలపై ఆధారపడి పిడివాదం మనుగడ సాధిస్తూ ఉంటుందని సూచించాడు. ఇతరుల అభిప్రాయాల ప్రతిధ్వనులను మీ స్వంత అంతర్వాణిగా చేసుకోవద్దని విద్యార్థులను ఉద్దేశించి స్టీవ్ చెప్పాడు.

మీ హృదయాన్ని, మీ సహజాతాన్ని అనుసరించే ధైర్యాన్ని కలిగి ఉండటం అన్నిటికంటే ముఖ్యమైన విషయమని వారికి భోధించాడు. మీరు నిజంగా ఏం కావాలనుకుంటున్నారో మీ హృదయానికి, మీ అంతర్వాణికి మాత్రమే తెలుసునని వాటితో పోల్చుకుంటే మిగతావన్నీ అప్రాధాన్యవిషయాలే -సెకండరీ- అని స్టీవ్ చెప్పాడు. ఈ సందర్భంగానే అతడు విద్యార్థులకు, మిగతా ప్రపంచానికి కూడా ఒ గొప్ప ప్రకటన వెలువరించాడు "ఆకలిగొని ఉండండి, మూర్ఖంగా కూడా ఉండండి" - Stay Hungry. Stay Foolish?- నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను.

ఈ సుప్రసిద్ధ ప్రసంగంలోనే అతడు చావు గురించి కూడా మాట్లాడాడు. 2004లో తను కేన్సర్ వ్యాధి పరీక్ష జరిగిందని తెలిపాడు. స్కానింగ్‌లో తన శరీరంలోని క్లోమంలో -pancreas- కేన్సర్ కణితి ఏర్పడినట్లు తెలిసిందని, ఆనాటికి తనకు క్లోమం అంటే ఏమిటో కూడా తెలియదని చెప్పాడు. ఇది దాదాపుగా నివారణ కాని కేన్సర్ రకమని, మూడు లేదా ఆరు నెలలకంటే ఎక్కువగా తాను బతికి ఉండటం కష్టమని కూడా డాక్టర్లు చెప్పారని తెలిపాడు.

తన స్వంత వైద్యుడు ఇక ఇంటికి పోయి తన వ్యవహారాలను చక్కదిద్దుకోమని చెప్పారట. వైద్యుల పరిభాషలో, చావుకు సిద్ధంగా ఉండమని దీనర్థం. శస్త్రచికిత్స ద్వారా మాత్రమే నివారించదగిన అరుదైన క్లోమ కేన్సర్ తనకు ఉందని తెలిశాక వైద్యులు విలపించడం ప్రారంభించారట.

తర్వాత తనకు శస్త్ర చికిత్స జరిగిందని, చావును ఎదుర్కొవడానికి ఇదే తనకు అతి దగ్గర మార్గమని, మరికొన్ని దశాబ్దాలు కూడా తను ఈ మార్గంలోనే ఉండవచ్చని భావిస్తున్నట్లు స్టీవ్ చెప్పాడు.

తాను త్వరలోనే చనిపోతానని గుర్తుంచుకోవడం అనేది జీవితంలో పెద్ద అవకాశాలను రూపొందించడంలో తనకు ఉపయోగపడే అత్యంత ప్రముఖ ఉపకరణంగా భావిస్తున్నట్లు స్టీవ్ చెప్పాడు. ఇలాంటి గొప్ప ఉపకరణాన్ని -టూల్- తానింతవరకు ఎదుర్కోలేదని స్టీవ్ ముగించాడు.

జీవితం అంచుల్లో ఉన్నట్లు స్టీవ్‌కి తెలుసా?
అనేక సంవత్సరాలుగా క్లోమ కేన్సర్‌ను ఎదుర్కొంటూ వచ్చిన స్టీవ్ జాబ్స్‌కి తాను త్వరలోనే మరణించబోతున్నట్లు కొన్ని వారాల క్రితమే తెలుసునట. నవంబర్ 21న మార్కెట్లోకి వస్తున్న 'స్టీవ్ జాబ్స్' అనే పుస్తకం ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ పుస్తక రచయిత ఇసాక్సాన్ నాలుగు వారాల క్రితం చివరిసారిగా స్టీవ్‌ని ఇంటర్‌వ్యూ చేశాడట. ఈ ఆగస్ట్ నెలలో యాపిల్ సీఈఓగా దిగిపోతున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూను అతడు నిర్వహించాడు. తాను త్వరలోనే చనిపోతున్నట్లు జాబ్స్ ఈ ఇంటర్‌వ్యూ చివరలో సూచించాడట.

గత రెండేళ్ల కాలంలో ఇసాక్సాన్, స్టీవ్‌ను 40 కంటే ఎక్కువసార్లు ఇంటర్‌వ్యూ చేశాడట. ఈ క్రమంలో అతడు స్టీవ్ మిత్రులు, కుటుంబాలతో కూడా మాట్లాడాడు. ఇసాక్సాన్ ఆస్పెన్ ఇనిస్టిట్యూట్ ప్రధాన కార్యనిర్వాహకాధికారి, టైమ్ మేగజైన్ మాజీ ఎండీ కూడా. అల్బర్ట్ ఐన్‌స్టయిన్, బెన్ ఫ్రాంక్లిన్ అనే రెండు అత్యధికంగా అమ్ముడుపోయిన జీవిత చరిత్ర రచనలు కూడా ఇతడు గతంలో చేశాడట. `iSteve The Book of Jobs` అని మొదట పేరు పెట్టిన ఈ పుస్తకం 2012లో విడుదల కావలిసి ఉండగా, స్టీవ్ మరణంతో ఈ నవంబర్ 24నే మార్కెట్లో `Steve Jobs` అనే పేరుతో విడుదల చేయనున్నారు.

ఈ పుస్తకంలోని విషయాలపై స్టీవ్ ఎలాంటి నియంత్రణలు విధించలేదని, తాను కలిసి పనిచేసిన వ్యక్తుల గురించి నిక్కచ్చిగా, కొన్ని సార్లు కర్కశంగా -brutally- కూడా మాట్లాడాడని పుస్తక ప్రచురణ కర్త తెలిపారు.

స్మరణ
గుడ్డపీలికల జీవితం నుంచి యాపిల్ బ్రాండ్ వరకు ఎదిగి ముగిసిన స్టీవ్ గురించి సమకాలికులు ఏమనుకుంటున్నారు? తరతరాల వరకు నిలిచి ఉండగల గొప్ప ప్రభావాన్ని స్టీవ్ జాబ్స్ ఈ ప్రపంచంపై ముద్రించారని మైక్రోసాప్ట్ అధినేత బిల్‌గేట్స్ ఉద్వేగంగా చెప్పారు. అతడితో పరిచయం కలిగి ఉండటం, తెలుసుకుని ఉండటమే ఒక గొప్ప గౌరవమని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. 30 ఏళ్ల క్రితమే మేమిద్దరం కలుసుకున్నామని, మా జీవితాల్లో సగం కంటే ఎక్కువ కాలం మేం సహచరులుగా, పోటీదారులుగా, స్నేహితులుగా కూడా గడిపామని, స్టీవ్ మరణంతో తాను నిజంగా విషాదంలో మునిగిపోయానని గేట్స్ చెప్పారు.

ప్రపంచంపై స్టీవ్ కలిగించినంత గొప్ప ప్రభావాన్ని ప్రపంచం చాలా అరుదుగా మాత్రమే ఇతరులలో చూడగలుగుతుందని, అతడి ప్రభావం అనేక తరాలపాటు నిలిచి ఉంటుందని వాల్‌స్ట్రీట్ జర్నల్‌ వెబ్‌సైట్‌కి పంపిన ప్రకటనలో గేట్స్ తెలిపారు. స్టీవ్‌తో కలిసి పనిచేశామంటేనే మేం చాలా అదృష్టవంతులమని, మా జీవితాలకు అదొక అత్యంత గొప్ప గౌరవమని, స్టీవ్ మరణంతో చాలా కోల్పోతున్నానని బిల్‌గేట్స్ నివాళి పలికారు.

మనిషి శాశ్వతం కాకపోవచ్చు కాని పేర్లు శాశ్వతమే. సాంప్రదాయాలు, ఆశల వెదుకులాటలను నిర్వచించే జీవితం కోసం తపన పడుతున్న వేలాదిమంది ఆశాజీవులకు స్టీవ్ ఎప్పటికీ ప్రేరణ కలిగిస్తూనే ఉంటాడు.

(స్టీవ్ జాబ్స్ గురించి ఆంగ్లంలో విస్తృతంగా లభ్యమవుతున్న సమాచారాన్ని తెలుగులో అందించడానికి చేసిన ప్రయత్నం.)

స్టీవ్ జాబ్స్ పై కొన్ని కథనాలను కింద చూడండి.

స్టీవ్ జాబ్స్ -- జీవిత సత్యాలు
యాపిల్సారధి స్టీవ్ జాబ్స్అస్తమయం
http://teluguvartalu.wordpress.com/2011/10/06/%e0%b0%af%e0%b0%be%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%a7%e0%b0%bf-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%80%e0%b0%b5%e0%b1%8d-%e0%b0%9c%e0%b0%be%e0%b0%ac%e0%b1%8d/
డిజిటల్ ప్రపంచం సంచలనం, యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కన్నుమూతhttp://teluguvaahini.com/%e0%b0%a1%e0%b0%bf%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a%e0%b0%82-%e0%b0%b8%e0%b0%82%e0%b0%9a%e0%b0%b2%e0%b0%a8%e0%b0%82-%e0%b0%af.html
Steve Jobs and his India connection
Jobs talked cancer, death at Stanford in 2005
Buddhism -- India`s gift to Steve Jobs
In memoriam Steve Jobs
Jobs said little about pancreatic cancer struggls
Steve Jobs The monk who left India to make i-Products
Apple's Steve Jobs 'may never be equaled'

11 comments:

Anonymous said...

my deepest condolence to who are the followers of "Jobs" .nice article,informative and heart touching.
thanks
sam

kanthisena said...

అజ్ఞాత గారూ,
ముందుగా మీ సహానుభూతికి ధన్యవాదాలు.
కాని ఒక చిన్న సందేహం. దీనికి కూడా అజ్ఞాతంగా ఉండవలసిన అవసరం ఏమిటి? తెలుగు బ్లాగుల్లో లేదా బ్లాగర్లలో ఉంటున్న తీవ్ర వ్యతిరేక ధోరణులు, విద్వేష ప్రకటనల ప్రభావమే అవసరం లేనిచోట కూడా అజ్ఞాతలను తయారు చేస్తోందా. ఇదే నిజమైతే నిజంగా ఇది విషాదకరం. ఇది మీపై కోపం కాదు.. తెలుగు బ్లాగర్లలో నెలకొన్న అవాంఛనీయ ధోరణులపై బాధ. అంతే.

ధన్యవాదాలు.

Jawahar said...

చాలా బాగా రాసారండి. మీరు వర్డ్ వెరిఫికేషన్ disable చేస్తే బాగుంటుంది.

kanthisena said...

జవహర్ గారూ,
ముందుగా మీరన్న వర్డ్ వెరిఫికేషన్ అంటే ఏమిటి. తెలుగు వాక్యం మధ్యలో ఇంగ్లీషు పదాలు, వాక్యాలు ఆధారం కోసం ఉంచటమనేనా?

Stay Hungry. Stay Foolish,
living someone else`s life.

అనే ఇంగ్లీషు వాక్యాలకు నా తెలుగు అనువాదం సరిగా ఉందో లేదో అనే సందేహం రావడంతో నేరుగా మూల వాక్యాలనే రెండు మూడు సందర్భాల్లో జోడించాను. అంతే తప్ప మరో కారణం లేదు.

ఇది కాక మీ భావం మరొకటయితే వివరించండి.
వ్యాఖ్యకు ధన్యవాదాలు.

Jawahar said...

నెలవంక గారు,
నేనన్నది కామెంట్లు పెట్టేటప్పుడు మేము ఎంటర్ చెయ్యాల్సిన వర్డ్ వెరిఫికేషన్ (పదం నిర్దారణ)గురించి. ఇది మీ బ్లాగ్ సెట్టింగ్స్ లో ఉంటుందనుకుంట.

Indian Minerva said...

నిన్ననే ఈయన స్పీచ్ చదివాను. ఇప్పుడు మళ్ళీ తెలుగులో చదివాను. కొన్ని వాక్యాలు ఇంగ్లీషుకంటే తెలుగులోనే బాగున్నాయనిపించింది. మరికొన్ని ఇంగ్లీషులోనే బాగుమ్నాయ్.

నవంబర్ ఇరవయ్యొకటో ఇరవైనాలుగో తెలీదుకానీ పుస్తకం విడుదలకోసం ఎదురుచూస్తున్నాను.

kanthisena said...

జవహర్ గారూ,
అర్థమయింది. పదం నిర్ధారణను నా బ్లాగ్ సెట్టింగులలో డిసేబుల్ చేశాను. కృతజ్ఞతలు.

మినర్వా గారూ,
చాలా సంతోషం. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

cbrao said...

ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ గురించి అనేక కొత్త విషయాలు తెలిసాయి. ఆసక్తికరంగా ఈ వ్యాసాన్ని అందించినందుకు అభినందనలు.

Unknown said...

రాజుగారు
మీ శైలిని మెచ్చుకోకుండా ఉండలేక రాస్తున్నాను.
వ్యాసంలో చరిత్ర ప్రస్థావన అర్థవంతంగా ఉంది. సృజనపరుడు, చింతనా శీలి, మన కాలపు వ్యాపారి, సాంకేతికతకు రూపాలనద్దిన సృష్టికర్త ఇలా చాలా కోణాలతో ఉన్న మనిషిగా స్టీవ్ కనపడుతున్నాడు. ఒక కలగాపులగమైన మనిషి.

మన కాలపు అద్భుతాలు, అద్భుత వ్యక్తులు రూపొందడం చూస్తున్నాను. మన మనస్సులో ఉన్నవి లేదా, మన ధోరణిలో మంచి అనుకున్నవి తను చేయలేదుకదా అని నేను నిందించబోవడం లేదు. అయితే శాస్త్రం, సాంకేతికతా ఒకానొక దశ నుండి ఎలా రూపొందాయో పట్టించుకోనవసరం లేని తరంతో నేనున్నానని అనుకోవడం నాకు అసహనాన్ని కలిగిస్తుంటుంది. స్టీవ్ కూడా అట్లాంటి తరానికి రోల్ మోడల్‍గా నిలబడాలనుకున్న మనిషే కదాని అనిపిస్తుంది. స్టీవ్ కాకపోతే మరొకడు ఐప్యాడ్, ఐపోన్ తయారు చేసి డబ్బులు సంపాయించుకుని ఉంటాడు. మునిగేదేముంది. ఆయన తన తరం సాంకేతికతతో వ్యాపారంలో తలపడ్డాడు. ఉన్న సాంకేతికతకు రంగులద్దడం తప్ప చేసింది ఏమిటో నాకు తెలియడం లేదు. కాబట్టి తను ఎడిసన్ స్థాయి కూడా కాదనుకుంటా.
ఇక పోతే తనకు ఒక రకంగా మార్క్స్ పేరును
మరో రకంగా నీమ్ కైరోలీ లాంటి బాబాల పేర్లను తలుచుకునే స్థాయి తనకు ఖచ్చితంగానే లేదు.
చనిపోయిన వాళ్ళ కళ్ళు చారడేసిగా ఉండవు. ఉంటేగింటే అవి బతికి ఉన్నప్పుడే ఉండాలి.

దాసరి వెంకటరమణ said...

మంచి వ్యాసం హృదయానికి హత్తుకొనేలా వ్రాశారు. అభినందనలు!

VEECube said...

రాజశేఖర్ గారూ మీ వ్యాసం చాలా చక్కగా ఉంది.
రమణవి3

Post a Comment