Pages

Wednesday, April 15, 2015

సోమరులకెందునూ మోక్షము లేదు….


ఇప్పుడు విద్య వ్యాపారంగా మారి అటు టీచర్లూ, ఇటు పిల్లలూ క్షణక్షణమూ లెక్కించుకునే కాలం కాబట్టి పిల్లల, టీచర్ల మనస్తత్వాలు మొత్తం మీద ఎలా ఉంటున్నాయో తెలీదు కాని….మారోజుల్లో టీచర్లు ఏ క్లాసు పాఠం చెప్పేవారు అయినా సరే, సబ్జెక్టు మాత్రమే కాక జీవితానికి సంబంధించిన విలువల గురించి సందర్బం వచ్చినప్పుడల్లా పిల్లల మనసుల్లో నాటేవారు. విసుగు తెప్పించే మామూలు పాఠాల కంటే అప్పుడప్పుడూ అయ్యవార్లు చెప్పే ఇలాంటి జనరల్ విషయాలే చాలా బాగుండేవి.

అయితే వాటిని ఎంతవరకు పాటించాం అనే అంశం కంటే క్లాసుపాఠాల బోర్ నుంచి మా తరం పిల్లల్ని తప్పించడమే కాదు. ఆరేడు గంటలపాటు నిరవధికంగా రకరకాల పాఠాలు వినవలసివచ్చిన మాకు అవి పెద్ద ఉపశమనం గాను, నిద్రమత్తునుంచి వదిలించేవి గాను ఉండేవి. ఊళ్లల్లో హరికధ, బుర్రకథలు వంటివి సుదీర్ఘంగా ప్రదర్శిస్తున్నప్పుడు హరదాసులు, గాయకులు అప్పుడప్పుడు చెప్పే పిట్టకథలు సైతం ఇలా జనం నిద్రను పోగొట్టి మళ్లీ కథలో లీనం చేయడానికి ఉపయోగపడేవి కదా. అసలు పిట్టకథల ప్రయోజనం ఇందుకోసమేనేమో..

మేం ఊర్లో అయిదోక్లాసునుంచి గెంతు వేసి మా పల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలోని సెకండరీ స్కూల్‌లో ఆరవ తరగతికి వెళ్లినప్పుడు హిందీ టీచర్ అయిన కృష్ణమూర్తి సార్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటున్నాయి. ఆయన తొలిరోజు మా క్లాసుకు వచ్చినప్పుడే అందరివద్దా నోట్సు ఉన్నాయా అని అడిగి ఈ వాక్యం రాసుకోమని చెప్పారు. “సోమరులకెందునూ మోక్షము లేదు…” చాలా సాదాసీదాగా ఆయన ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించేవారు.

“పల్లెబడులలోంచి పెద్దబడికి వచ్చారు కాబట్టి అయిదారు సబ్జెక్టులు చదివి మననం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏరోజు పనిని ఆ రోజే పూర్తి చేసుకోండి. ఎప్పుడూ ఏ పనిని పెండింగ్‍‌లో పెట్టవద్దు. అలా పెండింగ్‌లో పెట్టకూడదు అని తెలిసి వచ్చేలా, గుర్తు చేసేలా మీ ప్రతి నోట్స్ పుస్తకంలోనూ సోమరులుకెందునూ మోక్షము లేదు అని రాసుకోండ్రా” అని పురమాయించేవారు. ఒకవేళ ఏ పిలగాడయినా తాను చెప్పినట్లు నోట్సులో ఈ వాక్యం రాసుకోలేదని కనిపెట్టినట్లయితే వెంటనే తొడబెల్లం పెట్టేవారు.

రాయలసీమలో పిల్లలను కాస్త తీవ్రంగా దండించాలనుకునే అయ్యవార్ల చేత వజ్రాయుధం లాంటిది ఈ తొడబెల్లం. ఏ కాలంనుంచి ఈ శిక్షా పద్ధతిని అమలు చేస్తూ వచ్చారో తెలీదు కాని దీనికి గురైన పిల్లలకు మాత్రం ఆ రాత్రి నిద్ర పట్టదంటే నమ్మండి. తప్పుచేసిన పిల్లలకు చెంప పగులకొట్టడం, వీపుమీద పిడిగుద్దులతో సత్కరించడం వంటి మామూలు శిక్షలు సరిపోవనుకున్నప్పుడు గురువులు వెంటనే పిల్లల తొడను చేతి వేళ్లతో పట్టుకుని మెలిపెట్టేవారు. మెలిపెట్టడంతో పాటు ఒక్కోసారి గిచ్చేవారు.

ఇది ఎంత సుదీర్ఘకాలంపాటు కొనసాగితే పిల్లవాడికి అంతసేపు నరకం కనబడుతుందన్నమాట. ఒక్కోసారి ఇంటికి పోయాక కూడా ఆ తొడబెల్లం సలుపు, గిచ్చుడు తగ్గకపోతే అమ్మ దగ్గర పట్టు వేయించుకునేవారం. తమ బిడ్డలను అలా హింసించిన టీచర్ల బతుకును గ్రామీణ తిట్లతో అమ్మలు ఉతికేసేవారనుకోండి. అలా ఆయన పెట్టే ఈ రకం హింసకు తట్టుకోలేక అందరమూ ఈ వాక్యాన్ని నోట్సులలో నింపేవారం. నోట్స్ మధ్య పేజీలలో కూడా పుట పైభాగాన రాసుకోమని చెప్పేవారాయన.

అలా అయిదేళ్లపాటు ఆయన చెప్పిన ఈ మెరుపువాక్యం అలాగే మాకు గుర్తుండిపోయింది. ఇంటర్ డిగ్రీల్లో సైతం నోట్స్ పుస్తకాలలో ఇది అలవాటుగా రాసుకుంటూ వచ్చాను. అయితే మేం ఎంతవరకూ ఈ వాక్యసారాంశాన్ని ఆచరించామంటే చెప్పలేను. స్కూల్లో ఏడెనిమిది గంటల వరుస శిక్ష పూర్తయ్యాక పల్లెటూళ్ల విద్యార్థులకు పనులు, ఆటలు, భజనలు ఇవి ఇచ్చే ఉత్సాహం అంతా ఇంతా కాదు కాబట్టి వెంటనే మేం ఇటు వైపుకు మళ్లేవాళ్లం.

వ్యవసాయం లేదా ఊర్లో వృత్తి పనులు చేసుకునే కుటుంబాలనుంచి వచ్చిన వారే మా స్కూల్లో అన్ని క్లాసుల్లో ఉండేవారు. సహజంగానే చదువు పట్ల ఉద్యోగస్తుల కుటుంబాల్లో మాదిరి కఠినమైన సమయపాలనను మేం పాటించేవాళ్లం కాదు. దీనికి కారణం కూాడ ఉండేది. గ్రామీణ పిల్లలకు చదువు మాత్రమే వ్యాపకం కాదు. తమ స్థాయిల్లో వ్యవసాయ, వృత్తి పనుల్లో పాల్గొనవలసి రావడం వల్ల మాకందరికీ చదువు పట్ల కంటే వృత్తిపనుల పట్లే ఎక్కువ ఆసక్తి, అనురక్తి ఉండేవి.

అందుకే బడికి పోవడం, స్కూలుకు పోవడం కంటే బడినుంచి బయటపడిన వెంటనే ఏదో ఒక విధమైన ఆటల్లో, పనుల్లో, భజన, పల్లీయ సంస్కృతికి సంబంధించిన ఇతరవ్యాపకాల్లో పాల్గొంటూ పరమానందంగా గడిపేవాళ్లం. అది పైచదువులకు పోవడానికి, మంచి వృత్తి చదువులు ఎన్నుకోవడానికి చాలామందికి ఆటంకంగా నిలిచేది కూడా.

‘చదువుకోకుంటే బిచ్చమెత్తుకోని తిరుగుతార్రా’ అంటూ టీచర్లు చెప్పే చదువుల సారానికి, ‘పనులు చేయకపోతే కూడా బిచ్చమెత్తుకొని తిరుగుతార్రా’ అంటూ మా పెద్దవాళ్లు చెప్పే జీవన సారాంశానికి ఎక్కడో లంకె తప్పింది కాబట్టి ఈ గొప్ప సత్యం కూడా ఆచరణలో అలా అటకెక్కిపోయింది కానీ, నా జ్ఞాపకాల దొంతరలో మాత్రం ఈ వాక్యం అలాగే నిలిచిపోయింది.

“సోమరులకెందునూ మోక్షము లేదు….”

గమనిక:
ఇది 2008లో నా మరొక బ్లాగ్‌లో పోస్ట్ చేసింది. ఈ బ్లాగ్‌ను ఇప్పుడు ఉపయోగించడం లేదు


0 comments:

Post a Comment