Pages

Thursday, December 29, 2016

కాసిన్ని కన్నీళ్లతోనా రాయడం!



గుత్తా వెంకట లక్ష్మీ నరసింహారావు అంటే చాలామందికి తెలియదు. జీవీఎల్‌ నరసింహారావు అంటే పత్రికారంగంలో పనిచేసిన కొందరికి తెలుసు. ‘జీవీఎల్‌’ అంటే రాజకీయ పత్రికారంగాల్లో ప్రముఖులు, అప్రముఖులు చాలామందికి తెలుసు. బాల్యదశ (బాలసంఘం) నుండి అంత్యదశ వరకూ కమ్యూనిస్టుగా జీవించిన ఓ కామ్రేడ్‌ జీవీఎల్‌. అరవై నుండి తొంబైవ దశకం చివరి వరకూ పాత్రికేయుడు జీవీఎల్‌ నరసింహారావు. మాజీ కేంద్ర మంత్రి, ఆమధ్య మరణించిన పర్వతనేని ఉపేంద్ర జీవీఎల్‌కు బాలసంఘం రోజులనుండీ బాల్య మిత్రుడు. సుప్రసిద్ధ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్‌ జీవీఎల్‌కు ఉద్యమ సహచరుడు. ఆయనలో సగం వయస్సువాళ్లం మేం. అయినా ఏనాడూ పెద్దరికం చెలాయించని జీవీఎల్‌ మాలో ఒకరు. మాకో ప్రేరణశక్తి.

ఉద్యమంలో యోధుడు, జీవితంలో సాధువు అయిన మనిషి గురించి రాయడం ఎలా! సాదాసీదాగా కనిపించే మనిషిని, నిండుగా జీవించిన మనీషిని చిత్రించడం ఎలా! నిరంతరం తనలోకి తాను చూసుకుంటూ, తను నమ్మిన రాజకీయ తాత్విక దక్పథాన్ని చివరి కంటా దృఢతరం చేసుకుంటూ నిజంగా సజీవంగా జీవించిన వ్యక్తి గురించి, మాలోంచి జారిపోయిన శక్తి గురించి రాయటం మాటలా!

కాసిన్ని కన్నీళ్లతోనా రాయడం! అది మాకు నచ్చని విషయం, ఆయన మెచ్చని విషయం. దోసెడు ఎర్రపూలతోనా నివాళులివ్వడం! ఇలాంటివన్నీ ఆయన ససేమిరా అంటాడనీ తెలుసు. అయినా ‘అదేం కుదరదు, నువ్వేం చేస్తావో మాకు తెలవదు’ అంటారు మా ‘వృత్తిమిత్రులు’. బెజవాడలో మా మిత్ర బృందం ఏవేవో చేయాలని అనుకున్నపుడు, చేసినపుడు మాకు మేము పెట్టుకున్న పేరది.

మేము మార్క్సిజంలోకి తొంగిచూసి జర్నలిజంలోకి జంపయిన ఓ అరడజనుమంది జర్నలిస్టులం. అందరిదీ పల్లెటూళ్ల నేపథ్యమే. వివిధ పత్రికల్లో సంపాదక వర్గానికి సంబంధించిన వివిధ బాధ్యతల్లో పనిచేసేవాళ్లం. విజయవాడ పటమట ఎన్నెస్సెమ్‌ హైస్కూల్‌ రోడ్డులోంచి ప్రభ అమరయ్య (ఇప్పుడు సాక్షి అమరయ్య), నిర్మల హైస్కూలు వెనక రోడ్డులోంచి జ్యోతి కృష్ణ, శాంతి నర్సింగ్‌హోమ్‌ పక్క సందులోంచి భూమి నరసింహారావు, అయ్యప్పనగరో, చౌదరిపేట నుంచో నేను, రాంబాబు, పాషా పంటకాల్వ సెంటరుకు వచ్చిచేరేవాళ్లం.

వేరుశనక్కాయ గింజలు నములుతూ, మెుక్కజొన్న పొత్తులు, పలకమారిన జాంకాయల్ని కబుర్ల మధ్యలో కొరుక్కుతింటూ పటమట యు.సి టీస్టాల్లో టీలు తాగుతూ జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు, జర్నలిస్టుల రాజకీయాలు, డెస్కుల్లో రిస్కులూ, హస్కులు, జోకులూ అన్నీ కప్పుల్లోంచి లేచే టీ పొగల్లా గుప్పుమంటుండేవి. సిగరెట్‌ అంచున లేచే ధూమంలా రింగురింగులు తిరుగుతూ సాగేవి.

ఓ రోజు ‘నిర్మలా హైస్కూలు ఎదురుగా నిన్న కొత్తగా ప్రారంభించిన ‘టేకిట్‌ ఈజీ’ హోటల్లో మనం రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకి కలుస్తున్నాం. మనకో కొత్తవ్యక్తి పరిచయం కానున్నారు. వివరాలు రేపు...’ అంటూ అమరయ్య నుంచి అందరికీ ఫోను కాల్స్‌.

మరీ పన్నెండున్నరకు కాకపోయినా కొంచెం అటూ ఇటుగా అందరం టేకిట్‌ ఈజీ హోటల్‌కి చేరుకున్నాం. అమరయ్య ఏ కవినో, ఏ రచయితనో, ఏ రహస్యోద్యమ నాయకుణ్ణో వెంటబెట్టుకొస్తున్నాడనుకున్నాం. కానీ అవేమీ లేని మాకెవరికీ ఏరకంగానూ పరిచయంలేని ఓ పెద్దాయనతో వచ్చి అప్పటికే అమరయ్య హోటల్లో కూర్చొని ఉన్నాడు. తెల్లటి పైజమా, లాల్చీ, కళ్లద్దాలతో చాలాసాదాసీదాగా ఉన్నాడాయన.

అమరయ్య అందర్నీ ఆయనకు పరిచయం చేశాడు. ఆ పెద్దాయన తెల్లగా నవ్వుతూ అందరితో చేతులు కలిపారు. ఆయన ఎడమ చేతిలో రెండేళ్లమధ్య సిగరెట్టు కూడా ఎర్రగా నవ్వుతోంది. ‘ఈయన జీవీఎల్‌గారు. జీవీఎల్‌ నరసింహారావుగారు. పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు. ఉండటం బెజవాడే’ అంటూ పరిచయం చేశాడు. గత శతాబ్ది చివరి దశకంలో సంగతులివి.

లక్ష్యసాధనలో కసిని ఓ ముసలాయన నవ్వులో కూడా చూడవచ్చని ఈ పెద్దాయన్ని మెుదటిసారిగా కలిసినపుడు మాకు తెలిసింది. నవ్వంటే జ్ఞాపకం వచ్చింది. ఎపుడూ ఆ మఖంమ్మీద నిలిచి వెలిగే తెల్లని చిరునవ్వూ, ఆయన ఎడంచేతి రెండేళ్ల నడుమ రగిలిపోయే సిగరెట్‌ ఎర్రని వేడి నవ్వూ; ఈ రెండూ నవ్వులూ పరస్పర విరుద్ధ అంశాలు. ఆయన తెల్లని చిరునవ్వు మాకు ఉత్తేజం. సిగరెట్‌ ఎర్రని వెచ్చని నవ్వు జీవీఎల్‌గారి రాతకి ఉత్తేజం. కానీ చివరికి ఆ ‘ఎర్రని నవ్వే’ ఆయనకు మృత్యుముఖ సందర్శనం చేయించింది.

అప్పటివరకూ వృత్తి ఉద్యోగానికే పరిమితమైన మా వ్యాపకాలకు కొత్త అజెండాను అందించారు జీవీఎల్‌. నిరంతర వయోజన విద్యాకేంద్రాల కోసం ఆయన అప్పటికే ఓ పత్రిక నడుపుతున్నారు. కార్పోరేట్‌ వైద్యరంగం విజయవాడలో వేళ్లూనుతున్న కాలమది. ప్రజలకు వైద్య అరోగ్య విషయాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించాలని అందుకోసం ఓ పుస్తకం తీసుకురావాలని ఆయన ప్రతిపాదన. రెండుమూడు నెలల కృషి ఫలితంగా ‘హలో డాక్టర్‌!’ పేరుతో ఒక విశేష సంచికను తీసుకువచ్చాం.

కార్పోరేట్‌ విద్యావిధానానికి ప్రత్యామ్నాయ విద్యాబోధన ఉద్యమం విజయవాడలో ఊపందుకుంది. విద్యావేత్త ఎన్‌. శివరామ్, శాంతి విద్యావనం పర్వతనేని కిషోర్‌మాస్టారు, వికాసవిద్యావనం పరిమి దంపతులు, గౌతమ్‌ విద్యాసంస్థల అధిపతి చౌదరిబాబు మరికొందరు అందుకు నడుంకట్టారు. అందులోనూ వృత్తిమిత్రులు తలదూర్చారు.

వేమన సుమతి పద్యాలకు సరళమైన భావం, శ్రావ్యమైన సంగీతంతో ఆడియో కాసెట్లు తయారుచేయాలని సంకల్పించాం. పద్యాలను ఏర్చికూర్చడం ఖర్చు భరించడం మావంతు. భావాన్ని అందించడం జీవీఎల్‌గారి వంతు. సంగీతాన్ని, గాత్రాలను సమకూర్చడం సంగీత దర్శకులు ప్రజానాట్యమండలి కళాకారులు బొడ్డుగోపాలంగారి వంతు. అనుకున్న సమయం మించినా మంచి ఫలితాలు వచ్చాయి. వాటి ఆవిష్కరణ రోజు జీవీఎల్‌గారిని ఎంతగా కోరినా వేదికమీదకు ఎక్కలేదు. మాధ్యమంలో పనిచేసినప్పటికీ ప్రచార అర్భాటాలకు ఆమడ దూరంగా ఉన్నారాయన.

దాని కొనసాగింపుగా 'వేమన్న ఏమన్నాడు' పుస్తకాన్ని తీసుకొచ్చాం. నాటినుండి జీవీఎల్‌గారికి బాల సాహిత్య సృజనపట్ల ఆసక్తి పెరిగింది. కిలాడి దెయ్యాలు, పాతాళ జలరాక్షసులు, మేడారం జాతర, గబ్బిలమూ గుడ్లగూబ, నూరు కథలతో కథాశతంకం, కథలుతినే జడలభూతం, షేక్స్‌పియర్‌ నాటక కథలు పుస్తకాలుగా విశాలాంధ్ర ప్రచురణాలయం ద్వారా అచ్చయ్యాయి.

జీవీఎల్‌ రచనా వ్యాసంగం విశాలాంధ్ర దినపత్రిక ఉద్యోగంతో ప్రారంభమయింది. మధ్యలో ఏ మలుపులు తిరిగినా చివరిగా విశాలాంధ్రకు రాస్తుండగానే ముగిసింది. ఏలూరు కమ్యూనిస్టుపార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే అత్తలూరి సర్వేశ్వరరావు పత్రికా రంగంవైపు ప్రోత్సహించారని జీవీఎల్‌ గుర్తుచేసుకునేవారు.

1934లో పశ్చిమగోదావరిజిల్లా పోతునూరులో కమ్యూనిస్టు కుటుంబంలో జీవీఎల్‌ జన్మించారు. ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు, స్వతంత్ర ఆర్ట్స్‌ వ్యవస్థాపకులు యుగంధర్‌ ప్రోత్సాహంతో బాలసంఘంలోచేరి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 1949 –52 మధ్యకాలంలో పర్వతనేని ఉపేంద్ర, గుత్తికొండ నాగేశ్వరరావు తదితరులతో కలిసి జాతీయ విద్యార్థి వికాస మండలిని స్థాపించి ఆ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించారు. అనంతరం పశ్చిమగోదావరిజిల్లా యువజన సమాఖ్యకు కార్యదర్శిగా పనిచేశారు. 1952, 55 సాధారణ ఎన్నికల్లో చురుకైన పాత్ర పోషించారు. భారత కమ్యూనిస్టుపార్టీ ఏలూరు తాలూకా కమిటి సభ్యులుగా పనిచేశారు. 1955 అనంతరం పార్టీ బాధ్యతల నుండి రిలీవయ్యారు.

1961నుండి 63వరకు విశాలాంధ్ర దినపత్రికలో పనిచేశారు. అనంతరం సీపీఎం నడిపిన జనశక్తి పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా పనిచేశారు. వీవీ రాఘవయ్యగారి జ్యోతి రాజకీయ వారపత్రికకు, 1979–81 కాలంలో విశాఖలో విజయభాను వారపత్రికకు, 81–83లో గౌతులచ్చన్నగారి బహుజన వారపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. తొలికోడి సాయంకాల దినపత్రికను ఏలూరులో కొంతకాలం, గుంటూరులో కొంతకాలం సొంతగా నడిపారు. 1991 నుండి 2000 వరకు ఆంధ్రపత్రిక దినపత్రిక మాగజైన్‌ ఎడిటర్‌గా పనిచేశారు.

నిరంతర వయోజన విద్యాకేంద్రాల కోసం లేఖ పక్షపత్రికను విజయవాడనుండి నడిపారు. వయోజనులకు సుబోధకంగా ఉండేట్టు చదువుపట్ల ఆసక్తిని కలిగించే విధంగా సంధులు లేని అత్యంత సరళమైన భాషను వాడేవారు. పత్రికలలో వచ్చే ఆసక్తికరమైన వార్తాంశాలను, వైద్య ఆరోగ్య వ్యవసాయ పర్యావరణ తదితర అంశాలను చక్కని కథల రూపంలో, చిన్న చిన్న పాఠ్యాంశాలుగా కూర్చేవారు. ఈ విషయంలో జీవీఎల్‌ అరుదైన తనదైన ఒక ప్రత్యేక శైలిని రూపొందించుకున్నారు.

మహాకవి శ్రీశ్రీ షష్ఠిపూర్తి ఉత్సవాల సందర్భంగా ‘విశాఖ విద్యార్థుల బహిరంగ లేఖ’ బయటకొచ్చింది. అదొక సంచలనం. దానికి స్క్రిప్టు, దర్శకత్వ బాధ్యతలు జీవీఎల్‌గారివే. ఇందులో విశాఖ వైద్య విద్యార్థులు ప్రధాన పాత్ర పోషించారని జీవీఎల్‌ అనేవారు.

వ్యక్తిగత జీవితంలో, రాజకీయ, సామాజిక, పత్రికా రంగాల్లో ఎక్కడా రాజీపడని, మడమతిప్పని అసలైన యోధుడు జీవీఎల్‌.

వృత్తి ప్రవత్తుల నేపథ్యంలో కలిసి హటాత్తుగా వెళ్ళిపోయిన జర్నలిస్టు చంద్రశేఖర్‌గారు మాతో ఎప్పుడూ అంటూండేవారు. ‘మీ ముచ్చట్లు, ఆలోచనలు, కార్యకలాపాల్ని కాగితాలమీద పెట్టండి. ఒకప్పటికి అదే చరిత్ర అవుతుంది. మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది’ అని. ‘మాకు పెద్ద తలకాయ కదా’ ఆ పనిని జీవీఎల్‌గార్నే ప్రారంభించమన్నాం మేమంతా. అంతకన్నా నాకు అర్జంటు పనులున్నాయంటూ ఈ నెల (డిసెంబర్) 22వ తేదీ సాయంత్రం ఆయన వెళ్లిపోయాడు.

(2017 జనవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హాలులో జీవీఎల్‌ సంస్మరణ సభ జరుగనున్న సందర్భంగా...)
--వృత్తి మిత్రులు

జీవీఎల్ జ్ఞాపకాల గురించి ఆయనతో పరిచయం ఉన్న వృత్తి మిత్రుల పేరుతో చిరు, చిర వ్యాసం అందించిన సాక్షి సాగుబడి సంపాదకులు పతంగి రాంబాబు గారికి ధన్యవాదాలూ, కృతజ్ఞతలూ... ఈ వ్యాస రచయిత శరత్‌చంద్ర జ్యోతిశ్రీ.

ఈ వ్యాసం నేటి (30-12-2016) సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ సంపాదక పేజీ -4- లో సంక్షిప్త రూపంలో ప్రచురితమైంది.

సాక్షి సౌజన్యంతో...

2 comments:

Unknown said...

బ్లాగ్ నిర్వాహకులు రాజు గారికి ధన్యవాదాలు. మా వృత్తిమిత్రుల నివాళిని మీ బ్లాగ్లో పోస్టు చేసి జీవీఎల్ గారికి సముచిత నివాళి అర్పించారు. వాస్తవానికి మా తరఫున ఈ వ్యాసాన్ని అందించిన వ్యక్తి మా మిత్రుడు కామ్రేడ్ కొమ్మాలపాటి శరత్ చంద్ర జ్యోతిశ్రీ. భాషను ముక్కలు ముక్కలు చేసి చిన్న చిన్న పదాలతో వార్తలు, కథలు రాసిన వాళ్లలో కొడవటిగంటి కుటుంబరావున, చలాన్ని చూస్తాం. ఆ తర్వాత జర్నలిజంలో జీవీఎల్ గారిని చూశా. నిరంతర చదువరి. అవిశ్రాంత రాతగాడు. మాటల పొదుపరి. కన్నీటి నివాళి. 
అమరయ్య.

kanthisena said...

జీవీఎల్ గారి జ్ఞాపకాలను పంచుకున్న శరత్ చంద్ర జ్యోతిశ్రీగారిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అమరయ్య గారూ.. వ్యక్తులు కనుమరుగయ్యాక మాత్రమే వారి పూర్తి వివరాలు, కన్నీటి జ్ఞాపకాలు ప్రపంచం ఎరుకలోకి వస్తున్నందుకు బాధ ఉన్నా. తదుపరి తరాలకు కూడా వారి జ్ఞాపకాలు ఈ రూపంలో అయినా మిగులుతున్నందుకు అలా గుర్తు చేసుకుంటున్నందుకు సంతోషపడాలి కూడా. బాధ, సంతోషం రెండింటినీ సమస్థితిలో అనుభవిస్తున్నాం కదా..

Post a Comment