Pages

Saturday, March 18, 2017

ప్రజాసాహితి – 400వ సంచిక, 400 సంచికల సి.డి. ల ఆవిష్కరణ


‘భారతి’ తర్వాత తెలుగు సాహిత్య చరిత్రలో 400కు పైగా సంచికలను పూర్తి చేసుకున్న మాసపత్రిక ‘ప్రజాసాహితి’. నాల్గవ వంతుకు పైగా అంటే 100కు పైగా సంచికలను ప్రత్యేక, విశిష్ట సంచికలుగా వెలువరించటం ద్వారా తన సాంస్కృతికోద్యమ కర్తవ్య దీక్షను ప్రజాసాహితి ప్రదర్శించింది. సరాసరిన ప్రతి నూరు సంచికలలో 11 దాకా ప్రత్యేక సంచికలున్నాయి.

ప్రజాసాహితి ప్రత్యేక సంచికలు అంటే ఎక్కువ పేజీలతో, సాధారణ సంచిక కంటే ఎక్కువ పరిమాణంతో, వెలువరించే పద్ధతి కాదు. ఒక ప్రత్యేక అంశం పైన – ప్రధానంగా సాహిత్యకారులపై, సామాజిక సందర్భౌచిత్యం గల అంశాలపై ప్రత్యేక దృష్టితో సంచికలు తెచ్చారు. ఉదాహరణకు 1980 ఆగస్టులో ప్రఖ్యాత రచయిత కొడవటిగంటి కుటుంబరావు చనిపోయిన వెంటనే 1980 అక్టోబరులో (37వ సంచిక) ఆయనపై ప్రత్యేకంగా ఒక సంచికను తెచ్చారు. 1995 సెప్టెంబరు 28న గుర్రం జాషువా గారి శత జయంతి సందర్భంగా కూడా ప్రజాసాహితి ఆయనపై ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది.

మతతత్త్వం భారతదేశాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు 1991 నాటి జనవరి సంచికనూ, 1992 నాటి డిసెంబరు సంచికనూ – (బాబ్రీ మసీదు కూల్చివేసిన వెంటనే) ప్రచురించింది. అలాగే 2005లో ‘గ్రామీణ జీవన సంక్షోభం - రైతాంగ ఉద్యమం’ అనే అంశం పైనా, మహాకవి గురజాడ 150వ జయంతి సందర్భంగా, 2012లో ఆయనపై రెండవసారి ప్రత్యేక సంచికను తెచ్చింది. అలా గడిచిన 40 సంవత్సరాలలో 45కు పైగా ప్రత్యేక సంచికలను విడుదల చేసిన ఘన చరిత్ర ప్రజాసాహితిది.

ప్రజాసాహితి 100-200-రజితోత్సవ సంచిక–300వ సంచిక - అన్నీ ప్రత్యేక సంచికలే. ఆ క్రమంలో యిప్పుడు 400వ సంచికను “25 ఏళ్ల ప్రపంచీకరణ:సాoస్కృతిక విధ్వంసం:సాహిత్యోద్యమం” అనే అంశంపై ప్రత్యేక సంచికగా విడుదల చేసారు.

మోహన్ గీసిన ముఖ చిత్రం – ప్రపంచీకరణ సృష్టించిన సాంస్కృతిక విధ్వంసాన్ని “ఉక్కు డేగ పై ధిక్కార స్వరంతో శాంతి పావురపు సృజనగా” సాగుతున్న లాంగ్ మార్చ్ అంటూ ఈ 400వ సంచిక ప్రత్యేకతను కనుల ముందు దృశ్యమానం చేస్తుంది. 156 పేజీల సంచికలో 6 కథలూ, 17వ్యాసాలూ, 7గురు ప్రముఖుల సందేశాలూ, 17కవితలూ, 2 పాటలూ, 4 సమీక్షా వ్యాసాలూ..తో పాటు సాధారణ సంచికల ధారావాహికలను కొనసాగిస్తూ ఈ సంచిక వెలువడింది. నేతాజీ చరిత్రని ఆవాహన చేసుకుంటూ పాపినేని శివశంకర్ రాసిన కవిత ఒక విశిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. 25 ఏళ్ల సామ్రాజ్యవాద ప్రపంచీకరణాన్ని భారత ప్రజలపై సాగుతున్న విధ్వంసక సాంస్కృతిక దాడిగా, కొనసాగుతున్న ప్రజా వ్యతిరేక భూస్వామ్య-సామ్రాజ్యవాద సంస్కృతుల విస్ఫోటనంగా ప్రజాసాహితి పరిగణిస్తూ వస్తోంది. అందుకే దాని ఆర్ధిక-రాజకీయ స్వభావాలను పాఠకులకు అర్ధం చేయిస్తూ ఏ ఏ విధంగా సాంస్కృతిక రూపాలలో అది వ్యక్తమవుతూ వస్తోందో విశ్లేషించే వ్యాసాలూ యిందులో చెప్పుకో దగినన్ని ఉన్నాయి.

తెలుగు సినిమా రంగంలో, భూస్వామ్య వారసత్వ సంస్కృతిని బలోపేతం చేస్తున్న పెట్టుబడిని బహిర్గతం చేస్తున్న ఆదిత్యనాధ్ వ్యాసం చాలా మంది ఎరుగున్న వాస్తవాల వెనుక ఎరగని మన సామాజిక వ్యవస్థ లక్షణాన్ని  పట్టి చూపిస్తుంది. 25 ఏళ్ల క్రితమే సామ్రాజ్యవాద ప్రపంచీకరణపై కూచిపూడి యక్షగాన ప్రక్రియలో ఎక్కుపెట్టిన ‘అప్పులభారతం’ గురించి వారాల కృష్ణ మూర్తి వ్యాసం ద్వారా పాఠకులు తెలుసుకుంటారు. విద్యా సాగర్ కావ్యం “దిష్టిబొమ్మను” (1995) ఇటీవలి ప్రజాసాహితి పునర్ముద్రించింది. దాన్ని మేడిపల్లి ఈ సంచికలో విశ్లేషించారు. భాషపై, బాల్యంపై, విద్యార్ధి-యువజనులపై, మహిళలపై, మత మౌఢ్యం రూపంలో ప్రపంచీకరణo ఎలా విధ్వంసక పాత్ర నిర్వహిస్తుందో తెలిపే వ్యాసాలిందులో ఉన్నాయి.

“రాజ్యం-రచయితలూ” అన్న సి.హెచ్. మధు వ్యాసం నేటి రచయితలందర్నీ తట్టి లేపుతున్నట్లుగా, ఆలోచించమన్నట్లుగా, మీరెటు వైపూ అని నిలదీస్తున్నట్లుగా వుంటూ – ప్రజల పక్షాన నిలవమని ఆదేశిస్తున్నట్లు సాగుతుంది. సాధారణ సినీ ప్రేక్షకుల దృష్టికి రాని అనేక విశిష్ట డాక్యుమెంటరీలను కోల్‌కతా బాలాజీ తెలుగు పాఠకులకు పరిచయం చేసారు.

గడిచిన 25 ఏళ్లలో ప్రజాసాహితిలో వెలువడిన కొన్ని కథలలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ వ్యక్తీకరణల గురించి డా.శాంతి కుమార్ రాస్తే, మహిళల జీవితాలను ప్రభావితం గావించిన కొన్ని కథలను వి. ప్రతిమ విశ్లేషించారు. “ప్రపంచీకరణ-సాహిత్య సాంస్కృతికోద్యమాలు” పై ఎ.కె. ప్రభాకర్ వ్యాసం, “రాజకీయ వ్యవస్థ – దాని సాంస్కృతిక పరిణామాలు” పై సూర్యసాగర్ వ్యాసం, “25 ఏళ్ల ఆర్ధిక పరిణామాలు”పై శశికుమార్ వ్యాసం, గ్రామీణ దళిత, బడుగు వర్గాల జీవితాలను గెంటివేతలకు (విస్థాపన అంటున్నారు) గురి చేస్తున్న విధానాల పై డా. తోట జ్యోతి రాణి వ్యాసాన్ని ఈ సంచికలో చూడగలుగుతాం.

పాపినేని శివశంకర్ రూపొందించిన కొత్త భావనల్ని విశ్లేషించిన కొత్తపల్లి రవిబాబు, ఒక దళితుని ఆత్మ కథను వివరంగా పరిచయం చేసిన జి.వి.భద్రం, నూరేళ్ళనాటి సోవియట్ విప్లవ ప్రభావంతో వెలువడిన భారతీయ కవిత్వం పై రాచపాళెం, దంగల్ సినిమా పై వెన్నెల చేసిన సమీక్ష మొదలైన వ్యాసాలన్నీ కూడా ఈ సంచికలో చూడవచ్చు. గతంలో 2 ప్రత్యేక సంచికలను పునర్ముద్రించిన ఘనత ‘జనసాహితి’ సంస్థకుంది. 1981 నాటి తెలంగాణా పోరాట సాహిత్య సంచిక (41)నూ, ప్రజాకళారూపాల ప్రత్యేక సంచిక (1985 జూన్)ను తిరిగి ముద్రించారు. నిజానికి అలాంటి ప్రత్యేక సంచికలు ఇంకా – ఉదా|| గరికపాటి రాజారావ్ సంచిక, ‘గోర్కి నవల అమ్మ’ పై సంచిక – పునర్ముద్రణ కావాల్సి వున్నాయి. ఇప్పుడు 400 సంచికలనూ సి.డి.ల రూపంలో కూడా విడుదల చేస్తున్నట్లు జనసాహితి ప్రకటించింది. సాహిత్యాభిమానులకూ, సాహిత్య-సామాజిక చరిత్ర పరిశోధకులకూ ఓపిక వున్నంత మేర ఆరగించగలిగే విందును అందుకోవటమే తరువాయి.

(ఆదివారం (19-03-2017) విజయవాడ, హైదరాబాద్, ఒంగోలు, అనకాపల్లి, శ్రీకాకుళంలో ప్రజాసాహితి 400వ సంచిక, 400 సంచికల సి.డి. ల ఆవిష్కరణ సభల సందర్భంగా)  

మరిన్ని వివరాలకు

మంజరి lakshmi
23-22-123, శివాలయం స్ట్రీట్,
సత్యన్నారాయణ పురం, విజయవాడ:520 011
ఫోన్ నెం.:086 2535884
lakshmi manjari <manjari.lakshmi57@gmail.com>


గమనిక: 
ఇప్పటికే ప్రగతిశీల సాహిత్యానికి పెనుగొమ్మగా నిలిచిన సృజన పాతికేళ్ల సంచికలను, అరుణతార 35 ఏళ్ల సంచికలను డీవీడీరూపంలో అందించిన సృజన సాహితీ మిత్రులు, అరుణతార నిర్వాహకులు నాలుగు దశాబ్దాల తెలుగు ఉద్యమ సాహిత్య, సాంస్కృతిక మేధోకృషికి సంబంధించిన చరిత్రను తెలుగు పాఠకులకు శాశ్వత ప్రాతిపదికన అందించి ఎనలేని సహాయం అందించారు. ఇప్పుడు ప్రజాసాహితి మాసపత్రిక 40 సంవత్సరాల సంచికలను రెండు డీవీడీల రూపంలో అందిస్తున్న ప్రజాసాహితి నిర్వాహకులు జ్ఞానాన్ని పాఠకుడికి ముంగిట్లోకి తీసుకువస్తున్న నిరుపమాన ప్రక్రియ క్రమానికి అద్భుతమైన తోడ్పాటునిస్తున్నారు. హైదరాబాద్‌ సాహిత్య మిత్రులు వీలయితే రేపు సాయంత్రం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగనున్న ప్రజాసాహితి 40 ఏళ్ల సంచికల డీవీడీల ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కాగలరు.

0 comments:

Post a Comment