Pages

Thursday, January 28, 2021

గుస్సాడి నృత్య మారాజుకు ‘పద్మా’భరణం

 

గుస్సాడి నృత్య మారాజుకు పద్మాభరణం

ఆత్రం భుజంగరావు

 ప్రభుత్వం ఇచ్చింది పద్మశ్రీ అవార్డు 

ఆదివాసులిచ్చింది గుస్సాడి బిరుదు...

 


కొమురం బీం జిల్లా జైనూరు మండలంలోని ఆదివాసీ కుగ్రామం మార్లవాయిలో ఒక నిరుపేద కుటుంబంలో 60 ఏళ్ల క్రితం కనకరాము, రాజుభాయి దంపతులకు ఏకైక సంతానంగా కనకరాజు జన్మించారు. ఆదివాసీ గోండు తెగకు చెందిన అక్షరం తెలియని కళాతపస్వి ఈయన. ఇద్దరు భార్యలు, 11 మంది సంతానం (ముగ్గురు మగపిల్లలు, 8 మంది అమ్మాయిలు) కలిగిన పెద్దకుటుంబీకుడు కనకరాజు. అడవి పోడు వ్యవసాయం. వర్షాధారంపై ఆధారపడిన జీవనం. ఖాళీ సమయంలో గ్రామంలో ఉన్న ఆశ్రమపాఠశాలలో దినసరి కూలీగా 30 ఏళ్లనుంచి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తడికల పెంకుటింటిలో నివాసం. ఆదివాసీ పండగలలో ముఖ్యమైనదైన దండారి పండుగ వచ్చిందంటే నెల రోజుల ముందునుంచే గుస్సాడి టోపీలను అలంకరించడం ఈయనకు ఆనవాయితీ. యుక్తవయస్సు నుంచే గుస్సాడి నృత్యం అంటే ప్రాణంలా భావిస్తూ వచ్చారు. ఎత్మసూర్ (ఆత్మదేవత) దేవుని సన్నిధిలో నేటికీ గుస్సాడి నృత్యంలో శిక్షణ ఇస్తూ యువ గుస్సాడీల తప్పటడుగులను సవరిస్తూ వారిని ముందుకు నడుపుతారు. గుస్సాడి నృత్య ప్రదర్శనకు గానూ ఏరోజూ తనకు వయస్సు అడ్డు రాలేదు. దండారి పండగ 20 రోజులవరకు ఉంటుంది. ఆయన లేనిదే మార్లవాయి గ్రామ దండారి ముందుకు సాగదు. ఆయనకు ఆదివాసులు ప్రేమతో ఇచ్చిన బిరుదు గుస్సాడి. ప్రభుత్వం ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆదివాసులకు ఆత్మగౌరవంగా భావిస్తున్నారు.


 గుస్సాడి నృత్యం గోండు ఆచారంలో ప్రధానమైనది. ఈ నృత్యాన్ని గుస్సాడి వేషధారణతో ప్రదర్శించి ప్రజలను అలరించేవారు. పూర్తి ఆదివాసీ నృత్యమైన గుస్సాడిని దండకారణ్యం నుంచి రాష్ట్రాల రాజధానులను దాటించి దేశ రాజధాని డిల్లీలోనూ ప్రదర్శనలు చేసి అబ్బురపర్చారు కనకరాజు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే గిరిజన కళాబృందాల్లో గుస్సాడి వేషంలో కనకరాజు తప్పనిసరిగా ఉండేవారు. ఉమ్మడి ఏపీ రాజధానిలో, జిల్లా స్థాయిలో కూడా సాంస్కృతిక ప్రదర్శనల్లో కనకరాజు కనిపించేవారు. ఢిల్లీ, హైదరాబాద్ సాంస్కృతిక ప్రదర్శనలలో రిపబ్లిక్ ఉత్సవాల్లో ఎన్నోసార్లు పాల్గొన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈయన కృషి, పట్టుదలను గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం ఆదివాసీ సమాజానికి ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నాం. ఒక మూలవాసీ కళను గుర్తించి అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడం ఆదివాసీలందరికీ స్ఫూర్తినిస్తుంది.


 ఆదివాసులుగా పుట్టి ఎస్టీ రిజర్వేషన్లతో ఉద్యోగాలు చేస్తూ, ఉన్నత విద్య పొందుతూ గిరిజన సంస్కృతి తెలీకుండానే గడుపుతున్నవారు ఎక్కువ మంది. కానీ కారడవుల్లో ఉండి ప్రకృతిని ఆరాధిస్తూ తమ ఆచారాలను కాపాడుతూ భావి తరానికి అందిస్తూ కనకరాజు చేసిన కృషి అసామాన్యం. చాలామంది ఆదివాసీ విద్యావంతులు అభివృద్ధి మాయాజాలంతో ఆదివాసీ ప్రకృతి అనుబంధ సంస్కృతిని కనుమరుగు చేస్తున్న పరిస్థితుల్లో.. ప్రకృతి సిద్ధమైన గుస్సాడి నృత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ దానిలో ఉన్న మానసిక ఉల్లాసం, గ్రామాల మధ్య, మనుషుల మధ్య అనురాగానుబంధాలు, మానవులకు ఉండాల్సిన మానమర్యాదలను గౌరవించడం, మానవ సంబంధాలు పెంచుకోవడం వంటి అంశాలను కనకరాజు తన ప్రదర్శనలతో చాటి చెబుతుటారు. గుస్సాడి రూపంలో ఉన్న వస్తువులతో రాజు కాలిగజ్జెల అల్లికలు, వాయిద్యాలు తయారు చేస్తారు. నెమలి ఈకలతో గుస్సాడి టోపీలను అల్లుతారు. డప్పు, డోలు, డోల్కి వీటికి సంబంధించిన పాటలు, కథలు, దండారి పూర్వపరాలు, హాస్య నాటికలు, పదాలు, స్త్రీ పురుష వేషాలతో హాస్య నృత్యాలు చేసి ప్రజలను అలరిస్తారు. తన సహజమైన సొంత అనుభవాలను జోడించి, ఆదివాసీ సమాజానికి నష్టం కలిగిస్తున్న సంఘటనలను కల్పించి చెబుతారు. 


 మూడు తరాలుగా తన దంత గుప్త విద్యను ప్రచారంలో పెట్టి మౌఖికంగా ఆదివాసీ సమాజాన్ని చైతన్య పరుస్తున్న కళాకారుడు కనకరాజు. సమాజం నుంచి ఏనాడూ ఏదీ ఆశించని నిగర్వి కనకరాజు. ఇలాంటి నిరాడంబరునికి అత్యున్నత పురస్కారంతోపాటు ఒక ఇల్లు, శాశ్వత ఉద్యోగం, వ్యవసాయ భూమి కల్పిస్తూ ప్రభుత్వం అండదండలు అందించాలని, కనకరాజులో ఉన్న కళా, సాంస్కృతిక వైభవానికి తగిన గుర్తింపునివ్వాలని నాగరిక సమాజానికి విజ్ఞప్తి.

(ఆదివాసీ కళాకారుడు గుస్సాడి కనకరాజుకు పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా)

వ్యాసకర్త ఉపాధ్యాయుడు 

ఉట్నూరు, ఆదిలాబాద్

మొబైల్ 9440585605

..............

కొసమెరుపు:

ఆదివాసీ కళాకారుడు గుస్సాడి కనకరాజు గారికి పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా ఉట్నూరు మండలంలో టీచర్‌గా పనిచేస్తున్న ఆత్రం భుజంగరావు గారు సాక్షి సంపాదకపేజీ కోసం ఈ వ్యాసం పంపారు. ఈయన కనకరాజు గారి సమీప బంధువే. ఆదివాసీలం తెలుగు అంతబాగా రాదనీ, తన వ్యాసంలో తప్పులుంటే కాస్త సవరించిగలరు అంటూ భుజంగరావుగారు అభ్యర్థించారు. నిజంగానే ఆయన శైలి మౌఖిక వ్యవహారానికి సమీపంగా ఉంటుంది. అక్షరం ముక్క రాని గుస్సాడి నృత్య కళాకారుడు కనకరాజుగారి గురించి ఆయన పంపిన వ్యాసాన్ని కాస్త సవరించి ఈరోజు (28-1-2021) సాక్షి సంపాదక పేజీలో ప్రచురించడమైనది.

ఆంధ్ర, తెలంగాణ రెండు ఎడిషన్లలో ఈ వ్యాసాన్ని ప్రచురించడంతో రచయితకు తెల్లవారి 5.30 గంటలనుంచి పుంఖానుపుంఖాలుగా ఫోన్ కాల్స్ వెల్లువలా వచ్చిపడ్డాయని రచయితే చెప్పారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్స్  వస్తూనే ఉన్నాయని ఒకేరోజు రెండుసార్లు చార్జి పెట్టుకోవలసి వచ్చిందని భుజంగరావుగారు చెప్పారు. అరుదైన తెలంగాణ కళాకారుడు గుస్సాడి కనకరాజు గురించిన కథనాన్ని తెలుగు రాష్ట్రాల పాఠకలోకం అద్భుతంగా స్వీకరించినట్లే తెలుస్తోంది. పైగా మద్రాసు, ఒడిశా వంటి ప్రాంతాలనుంచి కూడా కాల్ చేశారని, యూనివర్శిటీ ప్రొఫెసర్లు కూడా మాట్లాడారని నా రచనకు ఇంత గొప్ప స్పందన ఎప్పుడూ చూడలేదని కృతజ్ఞతలు తెలిపారు రచయిత.


 
ఈ సందర్భంగా కనకరాజు గారు నివసిస్తున్న పూరి గుడిసె ఫోటోలు కూడా పంపారాయన. జీవితం మొత్తంగా అదివాసీ కళకు అంకితం చేసిన గుస్సాడి కనకరాజుకు అక్షరం ముక్క రాకపోవడమే కాడు. చివరకు ఆధునిక జీవితానికి అత్యవసరమైన మొబైల్ ఫోన్ కూడా లేదట. ఆయన కుటుంబీకులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కాబట్టి ఆయన ఊరినుంచి నగరానికి, నగరం నుంచి ఊరికి రాకపోకలు చేస్తుంటారు. ఎలాగోలా ఒక ఫోన్ అయినా పెట్టుకోండి అని గుస్సాడి రాజు కుటుంబానికి చెప్పానని రచయిత తెలిపారు.

ఎలా అర్థం చేసుకోవాలి ఈయనని... కళాకారుడు అంటేనే పైరవీకారుడు అనే పెద్ద అపప్రథ రాజ్యమేలుతున్న నేటికాలంలో ఆ పదాలకు అర్థం కూడా తెలీకుండా గడుపుతున్న నిరుపమాన జీవితం కదా ఆయనది.. పద్మశ్రీ వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయో లేదో కానీ ఆయనను వరించిన పద్మశ్రీ పురస్కారం మాత్రం ఈరోజు నిజంగా పునీతమైందని ఒక మిత్రుడు చెప్పిన మాట అక్షరసత్యమే.

ఇంతవరకు ఆయన ఎవరినీ ఏదీ యాచించలేదు.. నాగరిక సమాజం, నాగరిక ప్రభుత్వాలు ఆయన్ను పట్టించుకుంటాయో లేదో తెలీదు కానీ జీవిత పర్యంతమూ ఆయన ఆడిపాడి కాపాడుకున్న గుస్సాడి కళారూపం కాసింత ఊపిరి పీల్చుకునే అవకాశం కల్పించే అర్హత మనకు ఉందా లేదా అనేదే పెద్ద ప్రశ్న.

NB:

చివరగా.. ఆయన గురించి ఏదైనా సాక్షికి రాసి పంపుతారా అని అడిగినప్పుడు భుజంగరావు గారి ఫోన్ ఇచ్చి వ్యాసం రాయించి సాక్షికి గౌరవం కలిగించిన మిత్రులు జయధీర్ తిరుమల రావుగారికి కృతజ్ఞతలు కాదు.. నిండు నమస్కారాలు..

 ......................

గుస్సాడి నృత్యం గురించి మరింత సమాచారం

గుస్సాడీ- దండారి ఉత్సవంలో గుస్సాడిల నృత్యాలు || కే.బి కాలనీ || Gussadi dance

https://www.youtube.com/watch?v=2JRmhVLprJg&ab_channel=AdivasiKabur

 గుస్సాడీ కళాకారుడు కనకరాజును అభినందించిన మంత్రి

సాక్షి, ఆదిలాబాద్‌ : కొమరం భీమ్‌ జిల్లా అదివాసీ  కళాకారునికి అరుదైన గౌరవం లభించింది‌. సంప్రదాయాలు పాటిస్తూ, ఆచారాలు పరిరక్షిస్తున్న ఆదివాసీ కళకారుడు కనకరాజు.. సంప్రదాయ గుస్సాడీ న్రుత్యం చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. అలాంటి  గుస్సాడీ కళకారుడు కనకరాజును కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు వరించింది. పద్మశ్రీ అవార్డు  దక్కిన వారిలో తెలంగాణ నుంచి ఎంపికైన వారిలోకనకరాజు ఏకైక వ్యక్తి కావడం విశేషం. గిరిజన గుస్సాడీ కళకారునిగా అరుదైన పద్మశ్రీ  అవార్డు కనకరాజుకు లభించడంతో అదివాసీల ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అదివాసీ కళకారునికి కేంద్ర పురస్కారం దక్కించుకున్న కనకరాజును అందరూ అభినందిస్తున్నారు. 

అద్బుతమైన కళా నైపుణ్యంతో ఈ అవార్డును సాదించిన కనకరాజును మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా ఓకళాకారునిగా కేంద్రం పురస్కారం లబించడంపై కనకరాజు సంతోషం వ్యక్తం చేశారు. కలలో కూడ ఈ అవార్డు దక్కతుందని ఊహించలేందని భావోద్వేగానికి లోనయ్యారు. అవార్డు తనకు దక్కినప్పటికీ గిరిజనుల కళకు సర్కార్ ఇచ్చిన గౌరవంగా బావిస్తున్నానని  కనకరాజు పేర్కొన్నారు. అయితే కళకారుని అద్బుతమైన నైపుణ్యం ఉన్నా.. అర్థికంగా అంతంత మాత్రమే బతుకున్నారని, అర్థికంగా సర్కారు అదుకోవాలని కనకరాజు కోరారు.

అయితే గుస్సాడీ  కళ వందల ఎళ్ల  కాలం నుండి వస్తున్నా కళ. ప్రతి ఏటా దీపావళి సందర్భంగా  దండారి  ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అదివాసీల దైవం ఎథ్మసూర్‌ను ప్రార్థిస్తూ  గుస్సాడీ నృత్యం చేస్తారు గిరిజనులు. గుస్సాడీ  నృత్యం చేసే వాళ్లు నెత్తిన నెమలి  పించం, భుజాన జింక చర్మాన్ని దరించి, చేతిలో దండారి పట్టుకొని గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలకు అనుగుణంగా గుస్సాడీ చేసే నాట్యం చూపరుల గుండెలను హత్తుకునేలా ఉంటుంది. ఇలాంటి అద్బుతమైన కళను కనరాజు పరిరక్షరిస్తున్నారు. అందులో బాగంగా గుస్సాడీలో గిరిజనులకు శిక్షణ ఇస్తున్నారు.

ఈవిదంగా కొన్ని వందల మందికి శిక్షణ ఇచ్చారు. అందుకే కనకరాజును గుస్సాడీ గురువుగా పిలుస్తుంటారు. ఒకవైపు గుస్సాడీ  కళను పరిరక్షిస్తూనే మరోకవైపు కనకరాజు శిక్షణ ఇస్తున్నారు. అద్బుతమైన నైపుణ్యంతో అనేక ప్రాంతాలలో గుస్సాడీ కళ ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ ప్రదాన మంత్రి ఇందిరాగాంధీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం  ముందు ఢిల్లీలో ప్రదర్శనలు ఇచ్చారు..ఇలా ఏందరో మహనుబావులను  గుస్సాడీ కళ నైపుణ్యంతో అకట్టుకున్నారు‌. వివిర రంగాల వ్యక్తుల నుండి ప్రశంసలు, మన్ననలు కనకరాజుకు లబించాయి.

0 comments:

Post a Comment