Pages

Sunday, July 31, 2022

సారపు ధర్మమున్ విమల సత్యము...




దాదాపు 45 ఏళ్లకు ముందుమాట. చిన్నవయసులోనే పాఠ్య పుస్తకాలతోపాటు చందమామ, బాలమిత్ర వంటి బాలల కథా పత్రికలు (చందమామ ఆబాల గోపాల పత్రిక అని తర్వాత్తర్వాత అర్థమైందనుకోండి), ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి పత్రికలు, (ఈనాడు అప్పటికి ఊళ్లలోకి రాలేదు)  ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి వారపత్రికలు పల్లెటూర్లోని మా కుటుంబాలను ప్రతినెల, ప్రతి రోజూ పలకరిస్తున్న కాలమది. ఎమెస్కో పాకెట్ బుక్స్ పథకం ద్వారా వంద రూపాయల సంవత్సర చందా ఒకేసారి కట్టేసి నెలకు మూడు పుస్తకాలు నాన్న తెప్పిస్తూ పుస్తకాలు చదవండిరా జ్ఞానమొస్తుంది అని చెప్పి ప్రోత్సహించిన కాలమది. (అప్పట్లో ఒక పుస్తకం కనిష్ట ధర 3 రూపాయలు మాత్రమే. పది రూపాయలకు మూడు పుస్తకాలు పోస్టులో పంపేవారు) 

ఆనాడు ఏకైక వినోదసాధనం రేడియో మాత్రమే కాబట్టి శ్రీలంక తెలుగు రేడియోలో మీనాక్షి పొన్నుదురై అనే తెలుగు ప్రోగ్రామర్ అద్భుతమైన మాటలు, ఆ తర్వాత ఆమె శ్రోతలు వినడానికి వేసే మధురమైన పాత సినిమా పాటలు వింటూ, రేడియోలో రాత్రిపూట క్రమం తప్పకుండా వచ్చే పద్య నాటకాలు వింటూ బాల్యాన్ని పారవశ్యంగా గడుపుతున్న కాలమది. ఇదంతా 1970ల మధ్య నాటి ముచ్చట. ఆమెను మీనాక్షి అక్కయ్యా అని ఉత్తరాల్లో సంబోధించేవారని గుర్తు. ఆమె మాటల, పాటల ప్రజెంటేషన్ ఎంత ఆకర్షణీయంగా ఉండేదంటే నాటి ఆంధప్రదేశ్ లోని జిల్లాల నుంచి శ్రీలంక రేడియో శ్రోతలు వెర్రెత్తిపోయి ఆమెకు లేఖలు రాసేవారు. వాటిలో ఒకటి రెండు తదుపరి వారం చదివి వినిపించేవారామె. ఆమె తెలుగు మాట్లాడే తీరు తమాషాగా ఉండేదని తిరుపతి సీనియర్ జర్నలిస్టు మిత్రులు రాఘవ శర్మ గారు ఇప్పుడే గుర్తు చేశారు. బహుశా ఆమె తమిళ మూలాలు దీనికి కారణం కావచ్చు. 

ఆమె ఉచ్ఛారణ తీరు అలా ఉంచితే ఆమె శ్రోతలకు ఆపాత మధురమైన తెలుగు పాత సినిమా పాటలు అందించేవారు. మధ్యాహ్నం తర్వాత అరగంట ప్రోగ్రామ్ టైం అయిపోగానే వినపడుతున్న పాటను అలాగే కట్ చేసి మరొక భాషా ప్రోగ్రామర్ వచ్చేవారు. ప్రాణం ఉసూరుమనేది. శ్రీలంక రేడియోలో తెలుగు పాటల కార్యక్రమం పూర్తికాగానే మరొక మహిళ తమిళంలో సినీ పాటల కార్యక్రమం మొదలెట్టేవారు ఇక పండుగల వేళ ఊరిలో హరికథలు, భజన పాటలు కలిగించే మహదానందం గురించి చెప్పాల్సిన పనిలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచేకొద్దీ వందలు కాదు వేల పుస్తకాలు (డిటెక్టివ్ నవలలు, మాసపత్రికలు, వాటిలోని సీరియల్స్, కథలు, బాలల పత్రికలు, వార పత్రికలు,  దినపత్రికలు, వాటిలోని రాజకీయాంశాలు... ఇలా చదవని పుస్తకం లేని కాలం కూడా వచ్చేసిందనుకోండి) చదివిన అనుభవం తక్కువ కాదు. 

చివరికి ఈ చదివే పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే రాయచోటిలో 1977-83 మధ్య కాలంలో నేను ఇంటర్, డిగ్రీ చదువుతున్న సంవత్సరాల్లో రోడ్డుమీద చింపి పడేసిన పేపర్ ముక్కలు కూడా గబాలున తీసుకుని నడుస్తూ చదువుకుంటూ పోతుండగా, రోడ్డు మీద జనం వింతగా చూస్తూ పోయే పరిస్థితి వచ్చేసింది. ఇదంతా బాల్యజీవితం నుంచి కౌమార జీవితంలోకి అడుగుపెడుతున్న కాలంలో నేను పొందిన జీవిత వికాస అనుభవం. 

ఇదంతా ఒకెత్తు అయితే.. ఇంట్లో అమ్మ ద్వారా మాకు లభ్యమైన సాహిత్య, సాంస్కృతిక, సినీ జ్ఞాన సంపద ఒకెత్తు. పద్యం, పాట తెలుగు సాహిత్యానికి రెండు కళ్లు అని ఆమె భావయుక్తంగా పాడి వినిపించేది. సావిత్రి అంతటి గొప్ప నటి, భానుమతి అంతటి గొప్ప గాయని, ఘంటసాల వంటి మేటి గాయకుడు ప్రపంచంలోనే ఉండరు, ఉండబోరు అని ఆమె ప్రగాఢ నమ్మకం. అలాగని సుశీల, లీల, జిక్కీ, జానకి వంటి గాయనిల దివ్య గాన లహరిని ఆమె తక్కువ చేసింది లేదనుకోండి. కానీ నటనలో సావిత్రి, సంగీతాలాపనలో భానుమతి, ఘంటసాలను మించినవారు మరొకరు ఉండరని ఆమె నమ్మకం. 

అన్నింటికంటే మించి ఎమెస్కో బుక్స్ ద్వారా ఆరోజుల్లో మా ఇళ్లలోకి వచ్చిపడిన ఉషశ్రీ భారతం, ఉషశ్రీ రామాయణం చదువుతూ ఆయన అద్భుతమైన శైలిని మైమర్చిపోతూ మళ్లీ మళ్లీ చదువుకోవడం ఒక గొప్ప జ్ఞాపకం. అమ్మ పెద్దగా చదువుకోలేదు. మహా అయితే ఆరో తరగతితో ఆమె చదువు నిల్చిపోయిందనుకుంటాను. కానీ తన తరంలో (1960లలో) రచయిత్రుల సీరియల్స్, నవలల ద్వారా చదవటం అనే అభ్యాసం చక్కగా అలవాటు చేసుకున్న అమ్మ సాహిత్య, సాంస్కృతిక అంశాలపై స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉండేది. గురజాడ కన్యాశుల్కం వంటి గొప్ప నాటకం మనం ఏ భాషలోనూ చూడలేమని ఆమె చెప్పిన తర్వాతే నాన్న వద్ద పోరు పెట్టి కన్యాశుల్కం నాటకాన్ని ఎమెస్కో పాకెట్ బుక్స్ ద్వారా తెప్పించి మరీ మేం చదివిన అనుభవం మర్చిపోలేను. తెలుగు సమాజంలోని సామాన్యుల మాండలికాలను సమగ్ర స్వరూపంతో పరిచయం చేసిన తొలి నాటకం కన్యాశుల్కం. ఆ నాటకంలో గురజాడ అప్పారావు వాడిన ఇంగ్లీషు వ్యాక్యాలు, పదాలు తదుపరి నాలుగైదేళ్లలో మళ్లీ మళ్లీ చదివిన తర్వాత కానీ అర్థం కాలేదంటే నేను సిగ్గుపడాల్సిందేమీ లేదు. 

ముఖ్యంగా నాచ్చి క్వశ్చన్ అనే పదం గింజుకున్నా అర్థం అయ్యేది కాదు. కానీ ''ఏం వాయ్ మైడియర్ వెంకటేశం.. నిన్ను సురేంద్రనాథ్ బానర్జీ అంతటి వాడిని చేస్తానోయ్'' అంటూ గిరీశం కోసే కోతలు కడుపుబ్బా నవ్వించేవి. అంత చిన్నవయస్సులోనే అగ్నిహోత్రావధాన్లు పేరు వింటేనే వణుకు వచ్చేది. ఎందుకంటే తెలుగు కుటుంబాల్లో అప్పటికీ ఇప్పటికీ నాన్నలంటే ఎవరిమాటా వినని, చెప్పినా పట్టించుకోని అగ్నిహోత్రావధానుల వంటి వారే కదా. కానీ... తాంబూలం ఇచ్చేశాను తన్నుకు చావండి అంటూ కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు వేసిన డైలాగ్ ఇప్పటికీ జ్ఞాపకాల్లో ఉంటూనే వస్తోంది. ఇక రామప్పంతులును 'లొటి పిట' అంటూ మధురవాణి ఆటాడించడం, ఎవడో మంచం కింద దూరినట్లుందే అంటూ గిరీశం అన్నప్పుడు, మధురవాణి తర్జని చూపిస్తూ మంచం కింద రామప్పంతులు దూరాడని సంజ్ఞ చేయడం... సినిమాలో చూపించినంత దృశ్యమానంగా అంత చిన్న వయసులోనే స్ఫురించి నవ్వు తెప్పించేది. ''స్వతంత్రం వచ్చింది సరే ఊరి హెడ్ కనిస్టీబును ఎప్పుడు మారుస్తారు'' అంటూ ఈ నాటకంలో ఒక పాత్రధారి అడగటం షాక్ కలిగించింది. ఈ వందేళ్లపైబడిన కాలంలో మన పోలీసుల పట్ల జనంలో ఉన్న ఈ వ్యతిరేకత కాస్తయినా తొలిగిందా అంటే డౌటే మరి.


మరోసారి సారపుధర్మమున్ విమల సత్యము...

ఇదంతా ఒక కథ అయితే అమ్మ మహాభారతంలోని ఒక పద్యాన్ని విశేషంగా మా మధ్య మాటల్లో ప్రస్తావించేది. సారపు ధర్మమున్ విమల సత్యము అనే పద్యం ఒక్కటి మిగిలి, తక్కిన మహాభారతం లేకుండా పోయినా ఆ గ్రంథం విలువ తగ్గదు అనే బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చేదామె. ఆ పద్యాన్ని రాగయుక్తంగా ఆలపించి వినిపించేది. అంత విలువ ఏమిటో ఆ చిన్ని బాల్యంలో మాకు అర్థం కాలేదు కానీ తర్వాత రోజుల్లో ఎస్వీ యూనివర్సిటీకి వచ్చి అక్కడి లైబ్రరీలో తెలుగు విభాగంలో భారతి, జయంతి వంటి సాహిత్య మాస పత్రికల బౌండు పుస్తకాలు వెతికినప్పుడు ఆ పద్యం విశేషాలను తరచి తరిచి చూసి తెలుసుకున్నాను. సత్యాన్ని, ధర్మాన్ని దక్షత ఉండీ రక్షించకపోతే ఆ సమర్థునికే చేటు కలుగుతుంది కానీ దైవం మాత్రం చూస్తూ ఊరకుండడనీ, దెబ్బతింటున్న ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని తప్పకుండా కాపాడతాడు అనీ ఈ పద్యం అర్థం. 


సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ

బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె

వ్వార లుపేక్ష చేసిరది వారల చేటు గాని ధర్మ ని

స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్.


ఇన్నేళ్ల తర్వాత సారపు ధర్మమున్ విమల సత్యమున్ పద్యాన్ని రావిశాస్త్రి గారు రాసిన 'నిజం' కథకు అన్వయిస్తూ ఈ జూలై 30న సాక్షి సంపాదక పేజీలో (శనివారం) వచ్చిన ఒక అద్భుత వ్యాసం చూశాను. రావిశాస్త్రి శతజయంతి సందర్భంగా ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పేజీ ఆయన శత జయంతి జ్ఞాపకాలను ఏ తెలుగు వార్తా పత్రికకూ సాధ్యం కాని రీతిలో అక్షరీకరించిందనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఈ ప్రత్యేక పేజీలో రావిశాస్రి గురించి వచ్చిన ఆ అయిదు కథనాలూ విలువైనవే కానీ తిక్కన మహాభారతంలో రాసిన ఆ గొప్ప పద్యంతో పోలుస్తూ, రావిశాస్త్రి 60 ఏళ్ల క్రితం 1962లో రాసిన 'నిజం' నాటకాన్ని అందులోని ఒక కథనం ప్రస్తావించింది. 'అరవై ఏళ్లయినా అదే నిజం'' అనే పేరుతో వచ్చిన ఆ వ్యాసకర్త రాంభట్ల నృసింహశర్మ గారు.

నిజం నీరు కారిపోయి పత్తేదారులక్కూడా పత్తా లేకుండా ఏ లోతుల్లోకో యింకిపోకుండా కాపు కాయడానికే న్యాయ, పోలీసు వ్యవస్థలున్నాయి. మరి అవి అలా పన్జేస్తున్నాయా? చేసుండుంటే శాస్త్రిగారు ఈ నాటకం ఎందుకు రాసి ఉండేవారు అని ఆ వ్యాసంలో ప్రశ్నించారు రచయిత. ఈయన మాటల్లోనే 'నిజం' గురించి చదువుకుందాం..

''పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ తదితర ముఖ్య స్థాయిల్లో దక్షులైనవారంతా నిజం చెప్పకపోతే ఏమవుతుందో, ఆంధ్రమహాభారతం ఉద్యోగ పర్వంలో చెప్పకనే చెప్పారు తిక్కన. 'సారపు ధర్మమున్ విమల సత్యము, పాపము చేత బొంకుచే' అనే పద్యంలో... చేతనైన వాళ్లు కూడా న్యాయధర్మాలను కాపాడే సత్యదీక్షను నిర్లక్ష్యం చేస్తే కాపాడే బాధ్యతను దైవమే తీసుకొంటుందని తిక్కన ఏడు శతాబ్దాల క్రితమే సూచ్యం చేశారు. కానీ అరవైఏళ్ల క్రితం 'మీరింక మారరు, కాదు, మారుతానంటారా! ఎప్పుడో బాణం పట్టుకు శ్రీరాముడో, నాగలి పట్టుకు ఏ బలరాముడో ఒస్తే మీరు మారాలేమో కానీ, మీరు మరింక మారరు. మీరే కానీ మారితే, భగవంతుడున్నాడనే లెక్క. మిమ్మల్ని మంచికి మార్చగల వారెవరైనా ఉంటే భగవంతునితో సమానమనే లెక్క'' అని సుశీల పలికిన 'నిజం' నాటకం ఇప్పుడు అరవయ్యేపడిలో పడింది''.

... కాబట్టి నిజం, దేవుడు అనేవి రెండూ లేవు. ఈ రెండూ వేర్వేరూ కావు. దేవుడు నిజమైనా కాకున్నా, నిజమే దేవుడు అన్న సత్యం ఆవిష్కృతమయ్యేలా రావిశాస్త్రి రాసిన నాటకం 'నిజం' అని రాంభట్లగారు తన ఈ చిన్ని కథనంలో పేర్కొన్నారు.

ఎప్పుడో 45 ఏళ్ల క్రితం 1975 ప్రాంతాల్లో అమ్మ ద్వారా నేను విన్న ఆ 'సారపు ధర్మమున్ విమల సత్యము'  పద్యం ఆంద్ర మహాభారత రచనాకాలం నుంచి నేటివరకు ఒకే సత్యాన్ని గొప్పగా చెబుతూ వస్తోంది. సమర్థులైన వారు కూడా అసత్యం నుంచి సత్యాన్ని, అధర్మం నుంచి ధర్మాన్ని కాపాడకపోతే, సత్య దీక్షను నిర్లక్ష్యం చేస్తే ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని కాపాడే బాధ్యతను దైవమే తీసుకుంటాడన్నది 'సారపు ధర్మమున్' పద్య సారం. ప్రాచీన సాహిత్యంలో సామాజిక వాస్తవాన్ని ఆ నాటి పరిమితుల్లోనే ఎంత గొప్పగా ఈ పద్యం చెప్పిందో చూడాలి మరి. కానీ రావిశాస్త్రి గారు 60 క్రితం రాసిన 'నిజం' నాటకం కూడా సత్యాన్ని, ధర్మాన్ని రక్షించలేని వ్యవస్థలే నేటికీ రాజ్యమేలుతున్నాయని సారపు ధర్మమున్ పద్యం సాక్షిగా కొత్త రూపంలో చాటి చెప్పింది.


ఆ అపరూప ప్రత్యేక సంచికలో రావిశాస్త్రిగారి శతజయంతి సందర్భంగా వచ్చిన అయిదు చక్కటి వ్యాసాల కోసం కింది లింక్‌లో చూడండి


అల్పజీవుల బుద్ధిజీవి

https://epaper.sakshi.com/3551526/Hyderabad-Main/30-07-2022#page/6/1


(30-07-2022 నాటి సాక్షి సంపాదకీయ పేజీ రావిశాస్త్రి శతజయంతి ప్రత్యేక సంచిక)

...................................................


కొసమెరుపు:

సారపు ధర్మమున్ పద్య భావం గురించి నెట్‌లో వెతికితే దొరికిన సమాచారం...

సారపు ధర్మమున్ విమల సత్యము పద్యం ఆంధ్రమహాభారతములో ఉద్యోగ పర్వంలో తృతీయాశ్వాసంలో తిక్కన చెప్పిన పద్యమిది. అత్యంత ప్రాచుర్యం పొందిన, తెలుగు సమాజంలో సూక్తిగా, వ్యాఖ్యగా పలుమార్లు పలు సందర్భాల్లో తిరిగితిరిగి చెప్పుకున్న పద్యమిది. సత్యాన్ని, ధర్మాన్ని దక్షత ఉండీ రక్షించకపోతే అది ఆ సమర్థునికే చేటు.

సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ

బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె

వ్వార లుపేక్ష చేసిరది వారల చేటు గాని ధర్మ ని

స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్.


ఒక అనువాదం

ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది గాని ధర్మనిస్తారకము, సత్యశుభదాయకము అయిన దైవం లేకపోలేదు. కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. ఆ సత్యధర్మాలను ఉద్ధరించటానికి దక్షులైన భీష్మద్రోణాదులు ఉపేక్ష వహిస్తున్నారు. దీనివలన వారికి కీడు కలుగుతుందే గాని సత్యాన్ని, ధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు.


మరొక అనువాదం

సారమైన ధర్మం పాపం చేతా, ఏ మాలిన్యమూలేని సత్యం బొంకు చేతా గట్టెక్కలేక చెడిపోయే దశను సమర్థులైనవారు ఉపేక్ష చేస్తే అది వారికి చేటు తెస్తుంది. కాని ధర్మాన్ని గట్టెక్కించేది సత్య శుభస్థితిని యోగ్యులకు సమకూర్చేదీ అయిన దైవము ఎల్లవేళలా ఉంటుంది.

మహాభారతంలో శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో భీష్మునితో శ్రీకృష్ణుని సంభాషణలో భాగమైనదీ పద్యం. సమర్థత కలిగివుండీ సత్యము, ధర్మము పాడయ్యేప్పుడు భీష్ముడి వంటి దక్షుడు కాపాడకపోతే ఆయనే పాడవుతాడని, కానీ ఆ సత్య ధర్మాలను కాపాడేందుకు భగవంతుడు ఉండనే ఉన్నాడని ఈ పద్యంతో చెప్తాడు. అయితే ఆ భగవంతుడు తానే కావడం విశేషం, భావి భారత యుద్ధంలో ధర్మం జయిస్తుందని, ఏ కారణంతోనైనా అధర్మపక్షం వహించడం భీష్మునికి చేటు అని చెప్తాడు. కౌరవ పాండవులలో ఎవరికి చావు, బాధ కలిగినా దుఃఖించేది నీవే కదా. అలా కాకుండా ఈ రెండు పక్షాల వారిని కాచుకోవలసిన కర్తవ్యం నీదే అని ఉపదేశించి పాండవులు ఒక్క మాటగా ధృతరాష్ట్రునితో చెప్పమన్న విషయాన్ని చెప్పి, వారు సభ్యులతో చెప్పమన్న విషయాన్ని పై పద్యం సాక్షిగా శ్రీకృష్ణుడు వివరిస్తాడు.

.................................................


- కె. రాజశేఖరరాజు

79893 74301 / 73496 94557

1 comments:

Anonymous said...

నాకు మరింతగా నచ్చిన పద్యం... పోలగ ధర్మశీలుడై భూరి బలాధికుడైన ధారుణీపాలకు రక్షమున్వడసి భార్యను పుత్రుల నర్థ యుక్తితోనోలిన మేలుగా బడసి ఊళ్లను నున్నది మేలుగాని అట్లు కాని నాడేల గృహస్థ వృత్తి..... పద్యం

Post a Comment