Pages

Saturday, January 14, 2023

స్టాలినూ.... కుమారుడూ...

 



స్టాలిన్ పక్కన ఉన్న ఆయన కొడుకు

యాకోబ్ జుకాష్ విలీ!

రెండవ ప్రపంచ యుద్ధంలో లెఫ్టినెంట్ సైనికుడు. 

రెడార్మీ సైనికులతో బాటు నాజీలకు ఖైదీగా దొరికాడు! 

యాకోబ్ నాజీల జైలులో నిర్బంధించబడ్డాడు.!


కొద్ది కాలంతరువాత నాజీల అత్యున్నత సైనికాధికారి 

మార్షల్ ఫెడరిక్ పాలస్ రష్యా రెడార్మీకి ఖైదీగా దొరికాడు!


తమ అత్యున్నత సైనికాధికారీ, యుధ్ధవ్యూహ నిపుణుడూ అయిన 

పాలస్‌ను విడిపించుకోడానికి నాజీలు బేరం పెట్టేరు!

మీరు మా పాలస్‌ను విడిచి పెడితే మేము

స్థాలిన్ కొడుకైన యాకోబ్‌ను విడుదల చేస్తామని ప్రతిపాదించారు!


అప్పుడు స్టాలిన్ ఏమన్నాడంటే..


నాకొడుకు తన తోటి రెడార్మీ

సైనికులతో విడుదలౌతాడు !

అంతేగానీ నా కుమారుడ కోసం 

పాలస్‌ను విడుదలచేసి

నా సోవియట్ ప్రజలను నరకానికి తోయలేనని 

స్థాలిన్ ఖైదీల మార్పిడీకి అంగీకరించలేదు!


దీనితో 1943 ఏప్రిల్ 14న యుధ్ధఖైదీ 

స్టాలిన్ కుమారుడు యాకోబ్ ను

నాజీలు కాల్చిచంపేరు!


దేశరక్షణకోసం స్టాలిన్ 

తన ప్రేమాస్పదుడైన కొడుకును త్యాగంచేశాడు!

కమ్యునిస్టుల జీవితాలు

త్యాగభరితంగా ఉంటాయి

..........................................


విజయవాడ నుంచి మా మంచి మిత్రుడు శ్రీను గారు వాట్సాప్‌లో పంపితే దొరికిన ఫోటో కథనం ఇది. 

సోషల్ మీడియా చేసే అతి గొప్ప పనుల్లో ఇది ఒకటి. చాలా ముఖ్యమైన విషయాలను, రహస్యంగా ఉండిపోయిన నిజాలను కూడా చాలా తేలిగ్గా పోస్ట్ చేసి ఊరకుండిపోతుంది. 

రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ అధినేత తన కొడుకును త్యాగం చేశాడని చదివి ఉంటాము కానీ యూనిఫాం ధరించిన కుమారుడితో కలిసి స్టాలిన్ ఫోటో దిగిన దృశ్యం ఇంతవరకు చూడలేదు. అందుకే ఇది అరుదైనది. 

కొరియా గడ్డపై అమెరికా యుద్ధంలో కొరియా పక్షాన నిలిచి మద్దతు పలికి, ప్రజావిముక్తి సైన్యాన్ని పంపించిన క్రమంలో తన కుమారుడిని కూడా యుద్ధంలో పోగొట్టుకుంటాడు చైనా అధినేత మావో సేటుంగ్. అప్పుడే పెళ్లయి భర్తను కోల్పోయిన తన కోడలికి సాంత్వన పలుకుతూ మావో చెప్పిన మాటలు మరుపురావు. తన కుటుంబ సభ్యులు కాబట్టే బందీగా దొరికిన కుమారుడి విషయంలో బేరసారాలకు తాను దిగలేదని ఆమెను ఓదార్చుతూ యావత్ చైనా విముక్తి కోసం సాధారణ ప్రజలు పడుతున్న బాధలను మావో గుర్తు చేసుకుంటాడు. 

అలాగే 1950ల కష్టకాలంలో హాస్టల్లో చదువుకుంటున్న మావో కన్న కూతురు తగిన రేషన్ లభ్యంకాక సగం ఆకలితో నకనకలాడుతూ తల్లిదండ్రుల  ఇంటికి వచ్చి, హాస్టల్లో రేషన్ విధించడం వల్ల కడుపు నిండా తినలేకపోతున్నానని పేవులను అంటుకుపోయిన కడుపును పట్టుకుని చూపించి తన పరిస్థితిని చెప్పలేక చెప్పినప్పుడు, కన్నకూతురు దీనస్థితిని తట్టుకోలేక 'తన కుటుంబంలో పుట్టారు కాబట్టే మీకు ఇలాంటి  బాధలు తల్లీ' అంటూ విలపిస్తూ చైనా చైర్మన్ మావో సేటుంగ్ విషాదంలో మునిగిపోయాడని చైనా సాహిత్యం చెబుతోంది. చివరకు మావో అంగరక్షకుడు ఆ పాపను తీసుకెళ్లి కోరినంత తిండిపెడితే ఆబగా తిన్న వైనం కూడా మనం చదువుకున్నాం. 

సంపదను, లేమిని, సంతోషాన్ని, విచారాన్ని కూడా ప్రజలు, నాయకత్వం సమానంగా పంచుకుని జీవించిన నిజమైన ప్రజా జీవితమది. నిత్యదారిద్ర్యంలో కునారిల్లుతున్న వారు, తరాలు కూర్చుని తిన్నా సంపద మేట కరగని భాగ్యజీవితంతో మదిస్తున్నవారు ఉంటున్న మన సమాజాన్ని ఆనాటి చైనా, సోవియట్ యూనియన్ ఆదర్శాలతో పోల్చనైనా పోల్చలేమేమో...

విప్లవం సాధించిన సోవియట్ యూనియన్, చైనా వంటి దేశాల్లో దేశనాయకుల పిల్లలు తిండి విషయంలో కూడా ఇంత పక్షపాత రహితంగా పెరిగారని, అవసరమైనప్పుడు ప్రాణత్యాగాలు కూడా చేశారని తెలిస్తే మన రాజకీయ నాయకులు, వారి పిల్లల వైభోగం చూసి చీదరపుడుతుంది. ఎలాంటి అసమాన సమాజంలో మనం ఉంటున్నామోనని అగ్రహం కలుగుతుంది. 


మీ త్యాగం ఉన్నతమైనది అదీ హిమశిఖరాల వంటిదీ.. 

మీ ఆశయం శాశ్వతమైనది. అది కమ్యూనిజం తెస్తనంటదీ... 

30 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో విప్లవోద్యమం రాసి, పాడుకున్న మహాద్భుతమైన కారుణ్య గీతం ఇది.

కమ్యూనిస్టులు ముఖ్యంగా విప్లవోద్యమ కార్యకార్తలు అంటేనే ద్వేషంతో గొంతు చించుకుంచుకుంటున్నవారికి కమ్యూనిస్టులు త్యాగాలు అణుమాత్రంగా కూడా అర్థం కావు. ప్రయత్నించరు కూడా.

ఇలాంటి వారిని చూసే కాబోలు... 1948 ప్రాంతంలో తెలుగునేలపై తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టుల ప్రాణార్పణల వార్తలను విని ప్రముఖ సాహితీవేత్త గుడిపాటి వెంకటా చెలం గారు ఒకే వ్యాఖ్య చేశారు. 'కమ్యూనిస్టుల విధానాలను నేను అంగీకరించక పోవచ్చు. కానీ జీవితాన్ని తృణప్రాయంగా ప్రజల కోసం అర్పించే వారి త్యాగాన్ని శిరసున పెట్టుకుంటాను' అన్నారాయన.

.................................


స్టాలిన్ తనయుడితో కూడిన ఈ ఫోటో సహిత వ్యాఖ్యను పంపగానే మిత్రులు ఆలూరి రాఘవ శర్మ గారి తక్షణ స్పందన ఇది. చూడండి.

''చాలా అరుదైనది. గొప్పది. దేశం కోసం స్టాలిన్ కొడుకును త్యాగం చేస్తే , కొడుకు కోసం, వారసుల కోసం దేశాన్ని త్యాగం చేస్తారు మన నాయకులు.

నేను fb లో పోస్టు చేస్తాను.''

శ్రీనుగారూ చాలా చాలా ధన్యవాదాలండి. స్టాలిన్, ఆయన కుమారుడి ఫోటోతో కూడిన వ్యాఖ్యను వాట్సాప్ లో పంపి ఒక్కసారిగా పాత జ్ఞాపకాలను తవ్వుకునేలా చేశారు. థ్యాంక్యూ అండి.

2 comments:

Anonymous said...

prastutam unna TN stalin aayana kumaarudi sangati choodandi.

kanthisena said...

తమిళనాడు స్టాలిన్ ఆయన కుమారుడి గురించి ఇక్కడ ఎందుకూ...

Post a Comment