Pages

Wednesday, July 29, 2015

కొన్ని మరణాలు సామూహికమే...!


కొన్ని మరణాలు సామూహికమే...!

సామూహిక మరణం అంటే
అందరూ కలసి చావడం కాదు

ఒక్క మరణాన్ని 
సమాజమంతా అనుభవించడం...!

ఒక్క బ్రతుకును
దేశమంతా కోల్పోవడం...!

అవును మరి!

జీవితాన్ని జాతికి అంకితమిచ్చిన వాడి మరణం
సామూహికం కాకుండా ఎలా పోతుంది?

తన సృజనతో దేశానికి ఊపిరిచ్చిన వాడి మరణం 
వైయక్తికం ఎలా అవుతుంది?

జననంలోనే కాదు.. మరణంలోనూ
మనకు మిగిలిందీ.. మనకు మిగిల్చిందీ
ఆ స్ఫూర్తినే కాదా... 
ఆ దివ్యాగ్ని జ్వాలనే కదా!

అద్దంకి తుషార, హైదరాబాద్
27-07-2015

డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం కన్నుమూశారని తెలియగానే ఒక యువహృదయం గుండె లోతుల్లోంచి సహజాతిసహజంగా పెల్లుబికి వచ్చిన అక్షర నీరాజనం ఇది. కోట్లమంది భారతీయులు.. ప్రత్యేకించి యువతీ యువకుల హృదయాలను కదిలిస్తున్న కలాం స్మృతులకు ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని (బిటెక్ థర్డ్ ఇయర్) పట్టిన ఆత్మీయ నివాళి ఇది.

"సామూహిక మరణం అంటే అందరూ కలసి చావడం కాదు.. ఒక్క మరణాన్ని సమాజమంతా అనుభవించడం...! ఒక్క బ్రతుకును దేశమంతా కోల్పోవడం...!" అంటూ మహాకావ్య సదృశ ప్రారంభంతో తుషార అప్పటికప్పుడు రాసిన కవితా పాదాలు ఆయన మరణం సామూహికం కాకుండా ఎలా పోతుంది అంటూ ఒక మహాద్భుత సమర్థనతో ఇలా ముగిశాయి

"అవును మరి! జీవితాన్ని జాతికి అంకితమిచ్చిన వాడి మరణం సామూహికం కాకుండా ఎలా పోతుంది? తన సృజనతో దేశానికి ఊపిరిచ్చిన వాడి మరణం వైయక్తికం ఎలా అవుతుంది?"

"ఒక దివ్యాగ్నిని అంతఃకరణలో ఉంచుకునే మనందరం జన్మించాం. ఆ అగ్నికి  రెక్కలు తొడిగి దాని మంచితనం మెరుగును ఈ ప్రపంచమంతా నింపివేసే దిశగా మన ప్రయత్నాలు ఉండాలి" అంటూ భారత క్షిపణి శాస్త్ర పితామహుడు కలాం రాసిన అగ్నిజ్వాలల వంటి అక్షర తూణీరాలు ఒక తరం యువతీయువకులపై శాశ్వత ప్రభావం వేశాయి. వాటి ప్రభావం ఎంత గొప్పదంటే.. స్వాతంత్ర్యానంత దేశ చరిత్రలో తొలిసారిగా.. తమ జీవితాలు ఎంతో విలువైనవని, తాము సాధించాల్సిన కలలు తమ కళ్లముందు నిలబడి తమను వెంటాడుతున్నాయంటూ యువత ఉద్వేగంతో ఊగిపోయింది.

200 సంవత్సరాలకు పైగా పరాయిపాలనలో మగ్గిపోయిన భారత జాతి సగర్వంగా తలెత్తుకుని బతుకుతున్న తరంలో మనముంటున్నాం. ఆర్థిక పరాధీనత ఇప్పటికీ వెంటాడుతున్నా.. కోట్లమందికి ఇప్పటికీ జీవితం ప్రశ్నార్థకంలా మిగులుతున్నా.. అందుబాటులో కి వచ్చిన కాసిన్ని అవకాశాలనే రెండుచేతులతో ఒడిసి పట్టుకున్న భారత యువత ప్రపంచ యవనికలో తన పరిశ్రమతో, మేధస్సుతో అద్భుతాలు సృష్టిస్తూనే ఉంది.

నాయకత్వం అంటేనే నమ్మకాలు పూర్తిగా కోల్పోతున్న కాలంలో వందకోట్ల పైబడిన ప్రజానీకానీకంలో పెను ఆశల్ని, ఆకాంక్షల్ని రగిలించిన ఒకేఒక్కడు కలాం. ఈ దేశ యువతరం తన స్ఫూర్తిని ఎక్కడి నుంచి గ్రహిస్తోందో.. ఏ మహనీయ మూర్తిమత్వం ప్రేరణతో తన పయనాన్ని కొనసాగిస్తోందో .. ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణకు మారుపేరు కలాం. సమస్త రాజకీయ మరుగుజ్జులను దాటుకుని, ఈ దేశం, ఈ జాతి నమ్మకం ఉంచిన, గౌరవం పెంచుకున్న ఒకే ఒక్క మౌని కలాం. రాజకీయం అనే కళకు దూరంగా జీవిత పర్యంతం బతికిన ఆ మహనీయుడికి ఒక తెలుగు యువతి పట్టిన అక్షరాంజలి ఇది.

మా ఇన్‌చార్జి ద్వారా తర్వాత తెలుసుకున్నదేమంటే ఆమె నిజంగానే పుస్తకాల పురుగు. ఎంతగానంటే 20 ఏళ్ల ప్రాయంలోనే అంతగా అర్థం కాకపోయినా కారల్‌మార్క్స్ 'కేపిటల్‌' గ్రంథాన్ని ఏకధాటిగా చదువుకుంటూ పోయిన తీవ్ర పఠనాసక్తి ఆమెది. కారల్ మార్క్స్‌నే చదవడానికి ప్రయత్నించిన ఆమె ఇక ఏ పుస్తకంపై అయినా ఆసక్తి పెట్టగలదంటే సందేహమెందుకు?

తుషారా... చదువు తల్లీ... కలాం నుంచి కారల్ మార్క్స్ దాకా నువ్వు ఎంచుకున్న ఈ ప్రపంచ పరిశీలనా చట్రాన్ని ఇలాగే కొనసాగించు.. జీవితం పట్ల స్ఫూర్తి పొందడానికి, విశ్వ మూర్తిమత్వాన్ని ఆకళింపు చేసుకోవడానికి నీవెన్నుకున్న మార్గం నుంచి ఎన్నటికీ వైదొలగకు. చదవటం కంటే చూడటంమీదే ఆసక్తి పెంచుకుంటున్న కొత్త తరాలకు నీ అభిరుచి కూడా ప్రేరణ కావాలి.

గమనిక: 
నిన్న అంటే సోమవారం (27-07-2015) సాయంత్రం కలాం కన్నుమూత వార్త విన్న వెంటనే సాక్షి పత్రికకు తుషార పంపిన ఈ భావోద్వేగ స్పందనను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాం. ఎడిటోరియల్ పేజీ (4)లో సింగిల్ కాలమ్ లెటర్ స్థానంలో ఈ కవితను కూర్చి ఇంకా చోటు ఉండటంతో తప్పనిసరై ఆమె కవితకు ముగింపుగా చివరి కవితా పాదాన్ని మావైపునుంచి చేర్చాం. ఈ అదనపు చేర్పుతో పనిలేకుండానే ఆమె పంపిన లఘుకవిత సారాంశం అమూల్యం.. అమోఘం.

దాన్ని మీకోసం ఈ బ్లాగులో మరోసారి పోస్ట్ చేస్తున్నాం.

మంగళవారం (28-07-2015) సాక్షి సంపాదక పేజీలో (4) లో దిగువ భాగంలో ఈ కవితను చూడవచ్చు
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/28072015/4

5 comments:

Thushara Addanki said...

రాజశేఖరరాజు గారికి,
మీరు చెప్పినట్టే ఈ బాటను ఎప్పటికీ విడువను. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు తపన పడుతూనే ఉంటా.
మీ బ్లాగులో నా కవితకు స్థానం కల్పించినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ పోస్టును ఆశీర్వచనంలా భావిస్తున్నాను.
కృతజ్ఞతలు.
తుషార.

Shruti said...

స్ఫూర్తి అంటే ఇన్ని రోజులు మాటలలో వినడమే కాని ఒక మహా వ్యక్తి మరణంతో అది ఇలా ఉంటుందని తెలిసింది. ఆ మహా వ్యక్తి అబ్దుల్ కలాం గారికి నా హృదయపూర్వక నివాళి.

kanthisena said...

తుషార.. చాలా సంతోషం అమ్మా.. తప్పకుండా నీ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. చిన్న వయస్సులోనే చక్కటి వ్యక్తీకరణ శైలి వచ్చింది. తప్పకుండా తెలుగులో ఒక బ్లాగును రూపొందించుకుని సమస్త స్పందనలనీ ఇలాగే వ్యక్తీకరించాలని కోరుతున్నాను. హైదరాబాదులో ఏటా డిసెంబరులో జరిగే బుక్ ఫెయిర్ కు నాన్న తీసుకెళుతున్నారు కదా.. సకాలంలో కలాంగారిపై ఇంత మంచి కవితను సాక్షికి పంపినందుకు ధన్యవాదాలు.

addankikesavarao said...

మా అమ్మాయి తుషార కలాం గారి మరణం పై స్పందిస్తూ రాసిన కవితను మీరు మరింత పరిపుష్టం చేసి సాక్షి లో వెంటనే ప్రచురించడమే కాకుండా మీ స్వంత బ్లాగులో కూడా స్థానం కల్పించినదుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్రేయోభిలాషి బుద్ధచంద్రదేవ్.

kanthisena said...

కాస్త ఆలస్యంగా మీ వ్యాఖ్య చూస్తున్నాను చంద్రదేవ్ గారూ,
ఒక్క మరణాన్ని సమాజమంతా అనుభవించడం...! ఒక్క బ్రతుకును దేశమంతా కోల్పోవడం...!
అంటూ నాలుగు పాదాల్లో కలాంగారి మూర్తిమత్వాన్ని ఒడిసిపట్టుకున్న చక్కని వ్యక్తీకరణ మీ అమ్మాయిది. ఆమె కవితలో నాకయితే ఒక భావిరచయిత తొంగి చూస్తున్నారు. చదువులకు మాత్రమే ఆమె ప్రతిభను పరిమితం చేయకండి. తనలోని జ్ఞాన జిజ్ఞాసను మరింత రగిలించండి. బాహుబలి సినిమాకు చందమామ సీరియల్ కంచుకోట ప్రేరణ కావచ్చంటూ మా మిత్రులు వేణు (ఈనాడు చదువు విభాగం) వేణువు బ్లాగ్‌లో రాసిన కథనం లింక్ మీరు పంపారు. దాన్ని నేను కూడా నెలక్రితమే చూశాను. చందమామ సీరియల్‌కి బాహుబలి కాపీ కాకపోవచ్చు కాని మాహిష్మతి రాజ్య ప్రస్తావన వరకు ప్రేరణ ఉండవచ్చు. అయినా వేణు రాసిన ఆర్టికల్ చాలా బాగుంది.. ధన్యవాదాలండీ.

Post a Comment