Pages

Friday, November 20, 2015

భయమూ, ద్వేషమూ లేని జీవితాన్ని ఆమె సాక్షిగా గడుపుతాం!



ఉగ్రవాదులను కనిపిస్తే చాలు నరికిపడేయాలన్నంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత వాతావరణంలో ద్వేషాన్ని వారికి బహుమతిగా అందివ్వబోమని ప్రకటించడానికి ఎంత సాహసం కావాలి? తమకు తాముగా సృష్టించి వదిలిన భస్మాసురులను మట్టుబెట్టడానికి మరో భీకర యుద్ధ రంగాన్ని సృష్టించాలనుకుంటున్న పాశ్చాత్య పాలకులకు ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రపంచం పట్ల ఎంత మమకారం ఉండాలి?

ఉగ్రవాద దాడుల్లో ప్రేమాస్పదురాలైన జీవన సహచరిని అతడు శాశ్వతంగా కోల్పోయాడు. పన్నెండేళ్లపాటు నిస్వార్థంగా ప్రేమను పంచిపెట్టిన అమృతమయమైన ఒక సుకుమార, సున్నిత నిసర్గ సౌందర్యాన్ని అతడు ఉగ్ర దాడిలో పోగొట్టుకున్నాడు. పారిస్ లోని బటాక్లాన్ థియేటర్‌లో, నవంబర్ 17న ఐఎస్ఐఎస్ చేసిన మెరుపుదాడిలో ఒకేచోట 82 మంది తోటి ప్రేక్షకులతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఆమెకు కానీ, ఆమెను కోల్పోయిన ఆ భర్తకు కానీ, వారి నెలల ప్రాయపు చిన్నారి కుమారుడికి కానీ ఏ రాజకీయాలూ తెలీవు. తమకు అందుబాటులో ఉన్న జీవితాన్ని కాసింత సంతోషంతో, కాసింత స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో గడుపుదామనే చిన్న కోరిక తప్ప వారికి ఈ ప్రపంచంలో పెద్దగా ఆశలూ లేవు.

కానీ మృత్యువు వికటాట్టహాసం చేసిన ఆ కాళరాత్రి తన నెచ్చెలిని పోగొట్టుకున్న ఆ భర్త జీవితకాల బాధను కూడా దిగమింగుకుని యావత్ ప్రపంచానికీ చిరుసందేశం పంపుతున్నాడు. తన భార్యను చంపిన వారికి తన ద్వేషాన్ని పొందే అవకాశం కూడా ఇవ్వబోనంటూ అతడు చరిత్ర కనీవినీ ఎరుగని తిరస్కార, ధిక్కార సందేశాన్ని ఉగ్రవాదులకు అందించాడు. తానూ, 17 నెలల ప్రాయంలోని తన కుమారుడూ ఇరువురం కలిసి భయమూ, ద్వేషమూ లేని జీవితాన్ని భార్య జ్ఞాపకాల సాక్షిగా గడుపుతామంటూ ప్రపంచం పట్ల, జీవితం పట్ల ఎనలేని విశ్వాసం ప్రకటించాడు. ద్వేషంతో కాదు.. ప్రేమతో, వెరపులేనితనంతో జీవిస్తామంటున్న ఈ సాధారణ పౌరుడు శ్వేతజాతీయుడు కాదు. ఒక పర్షియన్. బతుకు కోసం ఫ్రాన్స్‌ను మాతృదేశంగా చేసుకున్న పరదేశీయుడు. పేరు ఆంటోనె లేరిస్. ఆమె పేరు హెలెన్ ముయాల్ లేరిస్ (35 ఏళ్లు). ఇద్దరిదీ పన్నెండేళ్ల బంధం. వారికి పదిహేడు నెలల కుమారుడు మెల్విల్.

పారిస్ ఉగ్రదాడిలో సహచరిని కోల్పోయిన మూడు రోజులకు ‘మీరు నా ద్వేషాన్ని కూడా పొందలేరు’ (యు విల్ నాట్ హావ్ మై హార్టెడ్) అంటూ ఫేస్‌బుక్‌లో ఫ్రెంచ్ భాషలో లేరిస్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆన్‌లైన్‌ పాఠకుల హృదయాలను కదిలిస్తోంది.
https://www.facebook.com/antoine.leiris/posts/10154457849999947?pnref=story
Antoine Leiris

129 మందిని బలిగొన్న ఉగ్రవాదులను ఉద్దేశించి లేరిస్ రాసిన పోస్టును ఇంతవరకు రెండు లక్షలమంది షేర్ చేశారు. అలాగని లేరిస్ ఉపన్యాసాలేవీ దంచలేదు. కేవలం నాలుగు చిన్ని పేరాల స్పందన మాత్రమే ప్రపంచంతో పంచుకున్నాడు. ప్రస్తుతం కుటుంబంలో తానూ తన కుమారుడు మాత్రమే ఉండొచ్చు కానీ ప్రపంచంలోని అన్ని సైనిక బలగాలకంటే తాము ఇప్పుడు అతిశక్తిమంతులం అంటూ ఉగ్రదాడులను లెక్కచేయనితనంతో ఆ తండ్రి చేసిన పోస్ట్‌ ఇప్పుడు యావత్ ప్రపంచం ముందూ మన కాలపు ధిక్కార స్వరాన్ని వినిపిస్తోంది. నీవు లేని ప్రపంచంలో నీ జ్ఞాపకాలతోటే నిర్భయంగా, ద్వేష రహితంగా బాబును పెంచుతానంటూ శాశ్వతంగా దూరమైన భార్యకు అతడు పలికిన నివాళి సమాజంలో విభజనలను, ద్వేషాన్ని పెంచి పోషించాలని చూస్తున్న సమస్త శక్తులకూ గుణపాఠమై నిలుస్తోంది.

ఫ్రాన్స్‌కే కాకుండా పాశ్చాత్య దేశాల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకే విఘాతం కలిగించినట్లు భావిస్తున్న పారిస్ దాడులు అటు స్థానికులనూ, ఇటు శరణార్థులను కంపింపజేస్తున్నాయి. ఫ్రాన్స్ లోని ముస్లిం జనాభాపై, ఆశ్రయం కోరి వస్తున్న ముస్లిం శరణార్థులపై ప్రతీకార దాడులు తప్పవని భయాందోళనలు చెలరేగుతున్న తరుణంలో లేరిస్ వంటి పలువురు పర్షియన్లు సమాజాన్ని ద్వేషంతో ముంచెత్తించాలనుకుంటున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల లక్ష్యాన్ని తాము లెక్కపెట్టబోమని, తమ జీవితాలను ఇక్కడే ఎప్పటిలా గడుపుతామని ప్రకటిస్తున్నారు.

ఉగ్ర దాడుల పట్ల లేరిస్ వినిపించిన ఆ మానవ ధిక్కారాన్ని తన మాటల్లోనే విందాం


"శుక్రవారం రాత్రి మీరు ఒక ఆసాధారణమైన జీవితాన్ని (నా జీవిత ప్రేమమూర్తిని, నా కుమారుడి తల్లిని) బలిగొన్నారు. కానీ మీరు నా ద్వేషాన్ని పొందలేరు. మీరెవరో నాకు తెలీదు. నాకు తెలుసుకోవాలనీ లేదు. మీరు మృతాత్మలు.. అంతే. మీరు ఎవరికోసం గుడ్డిగా మనుషులను చంపుతున్నారో ఆ దేవుడు మమ్మల్ని తన ప్రతిబింబంగా చేసుకున్నట్లయితే మాత్రం.. నా భార్య దేహంలోకి మీరు చొప్పించిన ప్రతి తూటా ఆయన హృదయంలో ఒక్కో గాయమై తగిలి తీరుతుంది. 

అందుకే, నా ద్వేషాన్ని కూడా మీకు నేను దక్కనివ్వను. సరిగ్గా మీరు ద్వేషాన్నే కోరుకుంటున్నారు. కాని ద్వేషం పట్ల ఆగ్రహంతో స్పందించడం అనేది బాధితులను అదే అజ్ఞానంలో పడవేయడంతో సమానం. ద్వేషమే మిమ్మల్ని అలా తయారు చేసింది. మీరు నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. నా దేశపౌరుల పట్ల నేను అవిశ్వాసం ప్రదర్శించాలని, నా భద్రతకోసం నా స్వేచ్ఛను త్యాగం చేయాలని మీరు కోరుకుంటున్నారు. కాని అక్కడే మీరు ఓడిపోయారు.

నేను ఆమెను ఇవ్వాళ ఉదయం చూశాను. చివరిసారిగా అంటే రాత్రింబవళ్లు నిరీక్షించిన తర్వాత ఆమెను ఇవ్వాళే చూశాను. శుక్రవారం రాత్రి ఆమె బయటకు వెళ్లినప్పుడు ఎప్పటిలాగే ఆమె సౌందర్యంతో మెరిసిపోయింది. 12 ఏళ్లుగా తన ప్రేమతో నన్ను దాసోహం చేసుకున్న అద్భుత సౌందర్యంతో ఆమె వెళ్లిపోయింది. నిజమే. ఆమెను కోల్పోయిన బాధలో నేను కుప్పగూలిపోవడం నిజమే. మీరు చిన్న విజయం సాధించారని నేను అంగీకరిస్తున్నా. కానీ గుండెను తొలిచివేస్తున్న ఈ బాధ తాత్కాలికమే. ప్రతి రోజూ, ప్రతి క్షణం ఆమె మాతో ఉంటుందని నాకు తెలుసు. మీరు ఎన్నటికీ ప్రవేశించలేని ప్రేమాన్విత స్వేచ్ఛా స్వర్గంలో మేం మళ్లీ మళ్లీ కలుసుకుంటూనే ఉంటాం.

ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం. నేనూ, నా కుమారుడు. కానీ ఒక విషయం మాత్రం చెప్పదల్చుకున్నా. ప్రపంచంలోని సకల సైనిక బలగాల కంటే మేము శక్తిమంతులం. మీమీద దృష్టి పెట్టేంత సమయం నాకు ఏమాత్రం లేదు. మా అబ్బాయి మెల్విల్‌ను నేను నిద్ర లేపాల్సి ఉంటుంది. అతడి వయసు కేవలం 17 నెలలు మాత్రమే. అతడు ఎప్పటిలాగే తన ఆహారం తీసుకుంటాడు. ఎప్పటిలాగే మేము కలిసి ఆడుకోవడానికి వెళతాం. ప్రతిక్షణం అణువణువునా చెక్కు చెదరని సంతోషాన్ని అనుభవిస్తూ.. ఈ చిన్నారి జీవితాంతం మిమ్మల్ని అవమానిస్తూనే, భయపెడుతూనే ఉంటాడు. ఎందుకంటే, అతడి ద్వేషాన్ని కూడా మీరు పొందలేరు."

యావత్ ప్రపంచానికి తన ఈ చిన్ని లేఖ ద్వారా లేరిస్ అందించిన మహత్తర సందేశం అటు ఉగ్రవాదులకే కాదు.. ఆ ఉగ్రవాదులను నిత్యం సృష్టిస్తున్న వ్యవస్థలకు కూడా మర్చిపోలేని గుణపాఠాన్ని అందిస్తోంది. ద్వేషించడం అనే బహుమతిని పారిస్ ఉగ్రవాదులకు తాను అందించనంటున్నాడు ఆ తండ్రి. మరణంతో కూడా విడిపోని స్వేచ్ఛాయుత ఆత్మిక స్వర్గంలో ప్రతి రోజూ తాము కలుసుకుంటూ ఉంటామని, ఆ స్వర్గంలోకి మీరెన్నడూ ప్రవేశించలేరంటూ ఉగ్రవాదులందరికీ సవాల్ విసురుతున్నాడు. సమాజాన్ని ద్వేషంతో ముంచెత్తించాలనుకుంటున్న వారి లక్ష్యాన్ని తామెన్నటికీ సరకు చేయమని, తమ జీవితాలను ఇక్కడే ఎప్పటిలా గడుపుతామని ఆ తండ్రి చేస్తున్న హెచ్చరిక విద్వేషాన్ని ప్రేరేపించాలనుకుంటున్న సమస్త శక్తులకు చెంపపెట్టులాంటిది. మిన్ను విరిగి మీద పడినా చలించని మానవాత్మ ముందు ప్రపంచంలోని సైనిక బలగాలన్నీ కూడా శక్తిహీనమే అని ప్రకటించిన సాహసోపేత వ్యక్తిత్వం ఆ తండ్రిది.

ఉగ్రవాదులను కనిపిస్తే చాలు నరికిపడేయాలన్నంత ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న ప్రస్తుత వాతావరణంలో ద్వేషాన్ని వారికి బహుమతిగా అందివ్వబోమని ప్రకటించడానికి ఎంత సాహసం కావాలి? తమకు తాముగా సృష్టించి వదిలిన భస్మాసురులను మట్టుబెట్టడానికి మరో భీకర యుద్ధ రంగాన్ని సృష్టించాలనుకుంటున్న పాశ్చాత్య పాలకులకు ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి ఈ ప్రపంచం పట్ల ఎంత మమకారం ఉండాలి? ఒక చిన్ని లేఖ రూపంలోని ఈ మానవీయ సందేశం... బాధితులందరి తరపున ఈ ప్రపంచం ముందు ప్రకటిస్తున్న వేడుకోలు. అటు ఉగ్రవాదులూ, ఇటు పాలకులూ ఈ వేడుకోలు సారాంశాన్ని ఇకనైనా గ్రహిస్తారా?

(మనం రోజువారీ జీవితంలో చేస్తున్న చిన్న పనుల్లో ఏవైనా అడ్డంకులు ఎదురైతే ఎక్కడలేని చిరాకు కలుగుతుంది. మన వాదనకు, అభిప్రాయాలకు, భావజాలానికి కాస్త భిన్నంగా ఎవరైనా విభేదిస్తే.. అడ్డంగా నరికేయాలన్నంత అసహనం, కోపం అమాంతంగా మనల్ని ఆవహిస్తుంటాయి. మనకు కాస్త అపకారం తలపెట్టిన వారిని రావిశాస్త్రిగారి మాటల్లో చెప్పాలంటే ఒకసారి చంపిన తర్వాత మళ్లీ చంపాలన్నంత ప్రతీకార క్రౌర్యం మనలో రాజుకుంటూ ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అన్ని విధాలుగా బండబారిపోతున్నాం మనం.  కానీ... పారిస్‌లో ఆ పర్షియన్ భర్త , తన జీవితంలోనే అత్యంత సన్నిహితురాలైన భార్యను, 12 ఏళ్లు ప్రేమను  పంచిపెట్టిన ప్రేమమూర్తిని కోల్పోయిన పరమ విషాద పరిస్థితుల్లో కూడా అందుకు కారకులను ద్వేషించనంటున్నాడు. అన్నిటికంటే మించి అతడొక సామాన్యుడు. ప్రేమైక మూర్తిని పోగొట్టుకున్న ఆ తండ్రికి, ఆ నెలల ప్రాయపు చిన్నారికి కాస్త సానుభూతి చెబుదాం. కానీ.. ఉగ్రవాదుల దాడిలో జీవన సహచరిని కోల్పోయిన ఆ సామాన్యుడు అసామాన్యంగా ప్రదర్శిస్తున్న ఈ శాంతి సందేశం నుంచి మనం నేర్చుకోగలిగింది ఏమయినా ఉందా?)

ఈ కథనం సాక్షి దినపత్రిక సంపాదకీయ పేజీలో (తెలంగాణ ఎడిషన్) నిన్న -19-11-2015- 'మృతాత్మలను ద్వేషించలేం' శీర్షిక పేరిట ప్రచురితమైంది. స్థలాభావం వల్ల పత్రికలో కుదించిన ఈ కథనం పూర్తి పాఠాన్ని ఈ బ్లాగులో ప్రచురించడమైనది.

(వారాంతపు సెలవు -బుధవారం-పై విరామంగా ఇంట్లో  ఉంటున్నప్పుడు, బిజీగా లేకుంటే ఈ కథనం రాసి పంపగలరా అంటూ ప్రతిపాదించి సోర్స్ పంపిన మా ఎడిట్ పేజ్ ఇన్‌చార్జ్ వేణుగోపాల్ గారికి... చాలారోజుల తర్వాత మళ్లీ కన్నీళ్లు పెట్టుకునేలా చేసినందుకు కృతజ్ఞతలతో)

సాక్షి పత్రికలో వచ్చిన ఈ కథనం లింక్ కింద చూడగలరు.
మృతాత్మలను ద్వేషించలేం
http://www.sakshi.com/news/opinion/even-we-dont-hate-them-says-frace-attak-victim-291769

కె. రాజశేఖరరాజు
7396494557 (నా కొత్త మొబైల్ నంబర్)
krajasekhara@gmail.com

1 comments:

addankikesavarao said...

ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ ఎవరినీ ద్వేషించలేరు...

Post a Comment