Pages

Thursday, November 19, 2015

వాళ్లకు తుపాకులుంటే మనకు పూలున్నాయి కద నాన్నా!




ఒకే ఒక ఉగ్రదాడితో పారిస్ గుండె పగిలింది. నవంబర్ 17 కాళరాత్రి ఐఎస్ ఉగ్రవాదుల కాటుకు గురైన పారిస్ బిత్తరపోయింది. ప్రపంచ పాలకులనే నివ్వెరపోయేలా చేసిన ఆ దాడి పారిస్ లోని ప్రతి ఒక్కరినీ భయకంపితులను చేసింది. ఇక ఇక్కడ ఉండొద్దు వెళ్లిపోవలిసిందే అంటూ పసిపిల్లలు సైతం తేల్చేసుకునేలా చేసిన ఆ దాడికి 129 మంది బలయ్యారు. మనుషులు ప్రాణాలు అమూల్యమైనవి. కాదనలేం. కానీ దశాబ్దాల తరబడి పరస్పరం పెంచుకున్న పౌర బంధాలు ఒక్క క్షణం పిడుగుపాటుకు గురయ్యాయి.

దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి కన్న తండ్రితోపాటు వచ్చి చూసిన చిన్నారి బాలుడితో తండ్రి మాట్లాడిన మాటలు కోట్లాది మందిని ఇప్పుడు భావోద్వేగంలో ముంచెత్తుతున్నాయి. ఆ తండ్రీ కుమారుల సంభాషణపై ఒక ఫ్రెంచ్ పత్రిక లె పెటిట్ రిపోర్టర్ తీసిన వీడియోను ఇప్పటికే కోటీ 20 లక్షల మంది ఆన్‌లైన్ వీక్షకులు చూశారు. లె పెటిట్ జర్నల్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆ ఇంటర్వ్యూ ప్రపంచాన్ని కదిలించివేస్తోంది.

తాము నివసిస్తున్న ఫ్రాన్స్ గురించి, అది ప్రాతినిధ్యం వహిస్తున్న విలువల గురించి గర్వపడేలా తన కుమారుడికి బోధించాలని ఆ తండ్రి భావించాడు. ఆ ఉద్దేశంతోనే దాడి తర్వాత ఏం జరుగుతోందో పిల్లవాడికి చూపించాలని స్మారక చిహ్నం వద్దకు తీసుకెళ్లాడు.

పారిస్‌లో ఉగ్రవాద దాడి జరిగిన బటాక్లాన్ థియేటర్ వద్దకు తండ్రితోపాటు వచ్చిన ఆ చిన్నారిని ఫ్రెంచి జర్నల్ టీవీ విలేకరి 'ఏం జరిగిందో ఇలాంటి దాడులను ఎందుకు చేస్తున్నారో అర్థమవుతోందా' అని అడిగాడు.

ఆ చిన్నారి బాలుడు చెప్పాడు. 'అవును. ఎందుకంటే వారు నీచులు. మంచివాళ్లు కాదు. మేం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి. రక్షణ లేదు. ఇళ్లు మారవలసిరావటం ఆందోళనగా ఉంటుంది.'

ఆ క్షణంలో ఆ బాలుడి తండ్రి జోక్యం చేసుకుని భయపడనవసరం లేదని ధైర్యం చెప్పాడు. 'ఫ్రాన్స్ మన ఇల్లు నాన్నా, మనం వెళ్లిపోవలసిన అవసరం లేద'ని చెప్పాడు. వారి సంభాషణ ఇలా సాగింది.

అబ్బాయి: కాని ఇక్కడ చెడ్డవాళ్లు ఉన్నారు నాన్నా...

నాన్న: అవును. కానీ చెడ్డవారు ప్రతి చోటా ఉన్నారు కదా.

అబ్బాయి: వారికి తుపాకులున్నాయి. వాళ్లు మనల్ని కాలుస్తారు. ఎందుకంటే వారు భయంకరమైన మనుషులు నాన్నా..

నాన్న: (కుమారుడికి ధైర్యం చెబుతూ) సరే.. వారికి తుపాకులు ఉండొచ్చు. కానీ మనవద్ద పూలున్నాయి కదా.

అబ్బాయి: కానీ పూలు ఏమీ చేయలేవు కదా నాన్నా.

నాన్న: అలా చూడు. ప్రతి ఒక్కరూ అక్కడ పూలు ఉంచుతున్నారు. ఇది తుపాకులకు వ్యతిరేకంగా పోరాడటమే మరి.

పిల్లాడు: తన చుట్టూ చూస్తూ నవ్వుతూ అడిగాడు. 'ఇవి కాపాడటానికేనా? కొవ్వొత్తులు కూడా కాపాడటానికేనా?'

నాన్న: తుపాకులకు వ్యతిరేకంగా పోరాడటంలో పూలు, కొవ్వొత్తులు కూడా భాగమే నాన్నా.

ఇలా సాగిన ఇంటర్వ్యూ చివరలో ఆ రిపోర్టర్ 'ఇప్పుడు నీవు స్థిమితపడినట్లేనా' అంటూ ఆ అబ్బాయిని అడిగాడు.

పిల్లాడు: అవును.. ఇప్పుడు నాకు పర్వాలేదు.

చనిపోయినవారికి పూలతో, కొవ్వొత్తులతో నివాళులర్పించడం కూడా తుపాకులకు వ్యతిరేక పోరాటంలో భాగమే అంటూ కన్నతండ్రి ఇచ్చిన జవాబు తన చిన్ని కుమారుడికి నచ్చచెప్పడమే కాదు.. కోట్లమంది హృదయాలను చెమ్మగిల్లజేస్తోంది.

తన తండ్రి భరోసా ఇస్తూ చెబుతున్న మాటల కంటే అతడి ముఖాన్ని నేరుగా చూస్తూ ధైర్యం తెచ్చుకుని నవ్వుతున్న ఆ పిల్లవాడిని వీడియోలో చూస్తే పిల్లల మనసులు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంత సున్నితంగా ఉంటాయనే విషయం గుర్తొస్తుందని ఒక వ్యాఖ్యాత కామెంట్ కూడా పెట్టారు. తల్లిదండ్రులు శారీరకం గానే కాదు, మానసికంగా కూడా పిల్లల రక్షకులుగా ఉంటారన్నది ఆ తండ్రిని చూస్తే బోధపడుతుంది.

ఆ తండ్రీకుమారుల సంభాషణను కింది వీడియో లింకులో చూడవచ్చు

https://www.youtube.com/watch?v=fpHJ-0BOdPI

1 comments:

Saahitya Abhimaani said...

ఇదొక వెర్రి కుట్టే వాదన. టెర్రరిస్టుల వల్ల బాగుపడినది కొవ్వొత్తుల పరిశ్రమ ఒక్కట. పిరికి సన్నాసులు చెయ్యగలిగినది ఏమున్నది, ఒక కొవ్వొత్తి పట్టుకు తిరగటం. టెర్రరిస్టుల ఇజాలను సమర్ధించటం మానెయ్యాలి. టెర్రరిస్టులకు ఆయుధాలు అందకుండా చెయ్యాలి. అంతేకాని ఎక్కడ టెర్రరిస్టులు కాల్పులు జరిపితే అక్కడికల్లా వెళ్ళి పూలు పెట్టి కొవ్వొత్తులు వెలిగిస్తే టెర్రరిజం పోదు. టెర్రరిజాన్ని ఇనప పాదంతో అణిచేయ్యాలి ఆ పని మనం వ్యక్తిగతంగా చెయ్యలేకపోయినా, ఆ పనిచేస్తున్న వాళ్ళను విమర్శించటం చెయ్యకుండా ఉంటే అదే పదివేల పూలతో, లక్ష కొవ్వొత్తులతో సమానం.

Post a Comment