Pages

Thursday, July 28, 2016

ట్రంప్‌ను బండకేసి బాదిన మిషెల్ మిస్సైల్


అలుగుటయే ఎరుంగని ధర్మజుండే యలిగిన నాడు.. అంటూ భారతంలో ధర్మరాజు వ్యక్తిత్వం గురించి ఒక గొప్ప పద్యం మనందరికీ తెలుసు. శాంతమూర్తి, క్రోథరహితుడు అయిన ధర్మరాజు నిజంగా కోపగిస్తే, ఆగ్రహిస్తే ఏమవుతుంది? సూర్యచంద్రులు గతులు తిప్పుతారు. సప్తసముద్రాలు ఉప్పొంగుతాయి. భూమండలం భూకంపాలతో ప్రకంపించి పోతుంది అన్న చందాన ఆ పద్యం ధర్మరాజు ఆగ్రహం కలిగించే ప్రభావం గురించి వర్ణించింది. ఒక వ్యక్తి ధర్మాగ్రహానికి ఉన్న మహత్తర ప్రభావం శక్తి ఏమిటో ఆ పద్యం ద్వారా తెలుసుకోవచ్చు.

మన దేశానికి కొన్ని వేలమైళ్ల దూరంలో ఉన్న అమెరికాలో మొన్న ఒక స్వరం న్యాయానికి, అన్యాయానికి మధ్య ఉన్న సన్నని వారను ఇంతే శక్తివంతంగా చాటి చెప్పింది. కాని ఆగ్రహంతో కాదు. ద్వేషంతో కాదు. నిందారోపణలతో కాదు.. ద్వేషపు మాటలు మాట్లాడేవారు, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే వారు దేశాధ్యక్ష పదవికి తగరని చెప్పిన అరుదైన స్వరం అది. సంకుల సమరంలో ప్రత్యర్థులు తమ స్థాయిని దిగజార్చుకుని నీచత్వాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు ఆ సమరంలో పాల్గొంటున్న ఎదిరిపక్షం మరింత ఉన్నతంగా ప్రవర్తించాలే తప్ప ప్రత్యర్థి స్థాయికి దిగజారకూడదని ఆ స్వరం హితవు చెప్పింది.  ఒక సంక్షోభం మనకు ఎదురైనప్పుడు, మనల్ని దెబ్బతీసినప్పుడు మనం చేయాల్సింది పరస్పరం నిందించుకోవడం కాదు. ఒకరు చెప్పేది మరొకరు ఆలకించాలి అంటూ ప్రబోధించింది. పురాతన కాలం నుంచి మానవులు చాటుతూ వచ్చిన భావౌన్నత్యానికి ఆ స్వరం ఒక కొత్త రూపమిచ్చింది.

అమెరికా అధ్యక్షపదవికి బరిలో నిలబడనున్న తొలి అమెరికన్ మహిళ హిల్లరీ క్లింటన్‌కి మద్దతుగా డెమోక్రాటిక్ పార్టీ నిర్వహించిన జాతీయ మహాసభలో అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా చేసిన అద్వితీయ ప్రసంగంలోని కొన్ని మాటలివి. అమెరికా సమాజాన్ని, చివరకు రిపబ్లికన్ పార్టీ నేతలను కూడా కలవర పెడుతూ విద్వేషం పునాదిగా దూకుడుతనం చూపుతున్న డొనాల్డ్ ట్రంప్‌ (రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పదవికి బరిలో నిలిచిన వ్యక్తి) పేరును సైతం కనీసంగా ప్రస్తావించకుండా, హిల్లరీ ఎందుకు భవిష్యత్ అమెరికన్ ప్రెసిడెంట్‌ కావాల్సి ఉందో సూచిస్తూ మిషెల్ సంధించిన అగ్ని సదృశమైన మాటల మంత్రజాలమిది.

‘బానిసలు నిర్మించిన శ్వేతసౌధంలో నేను ప్రతి ఉదయం నిద్ర లేస్తున్నాను నా ఇద్దరు కుమార్తెలు.. అందమైన, తెలివైన నల్ల యువతులు శ్వేతసౌధం ఆవరణలో కుక్కపిల్లలతో ఆడుకోవడాన్ని చూస్తుంటాను. వారి తండ్రి పౌరసత్వాన్ని ప్రశ్నించే వారిని, ఆయన విశ్వాసాన్ని ప్రశ్నించే వారిని విస్మరించాలని, టీవీ చానళ్లలో ప్రముఖుల విద్వేష ప్రసంగాలు అమెరికా వాస్తవ స్ఫూర్తికి ప్రాతినిధ్యం కాదని వారికి మనమెలా చెప్పగలం? వారు దిగజారినపుడు మనం మరింత ఉన్నతంగా ప్రవర్తించాలి అని చెప్తాం’  అన్నారు మిషెల్ ఒబామా. మిషెల్ పావుగంట ఉద్వేగ ప్రసంగం పార్టీ డెలిగేట్లను కదిలించింది.ఈ ప్రసంగానికి డెమోక్రాటిక్ పార్టీ డెలిగేట్లు హర్షాతిరేకాలతో స్పందించగా కొందరు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడిన ఒక్కొక్కమాట తూటాలా ఎలా పేలిందంటే సోషల్ మీడియాలో ఇవ్వాళ మిషెల్ ప్రసంగం ఒక గొప్ప ట్రెండ్ సెట్టర్ అయి కూచుంది. నేను కల కంటున్నాను అంటూ దాదాపు అర్ధ శతాబ్దం ముందు అదే అమెరికాలో నల్లజాతి ప్రజల హక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చేసిన చారిత్రాత్మక ప్రసంగాన్ని తలపించిందంటూ మీడియా వ్యాఖ్యానిస్తోంది.

అటు డొనాల్డ్ ట్రంప్, ఇటు హిల్లరీ క్లింటన్ కూడా సగటు అమెరికన్లకు ఒరగబెట్టేది ఏమీ లేదని, ఈ ఇద్దరు అభ్యర్థులూ కార్పొరేట్ అనుకూల నేతలేననీ, గత వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికాలో వర్గ అసమానతలను, సంపద తారతమ్యాలను పెంచివేసిన చరిత్రకు వీరు భిన్న కోణాల్లో ప్రతినిధులే అంటూ భిన్నాభిప్రాయాలు కూడా వెలువడి ఉండవచ్చు. కానీ అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేయాలన్న ట్రంప్ నినాదాన్ని ఎండగడుతూ.. ప్రపంచంలో అమెరికా అతి గొప్ప దేశమని, ఇంతకుముందు ఒక ఆఫ్రికా-అమెరికా జాతీయుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతోపాటు, ఇప్పుడు ఓ మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకోగలిగే అవకాశం లభించడమే అందుకు నిదర్శనమని మిషెల్ నింపాదిగా చెప్పిన మాటలు విద్యుత్తేజం కలిగించాయి. బానిసలారా మానవత్వాన్ని ప్రేమించండి.. నియంతృత్వాన్ని కాదు అంటూ విశ్వ దర్శకుడు చార్లీ చాప్లిన్ గ్రేట్ డిక్టేటర్ సినిమాలో చేసిన మరపురాని ప్రసంగాన్ని మరోసారి గుర్తు చేశాయి. అమెరికా సమాజానికి ట్రంప్ చేసిన గాయాన్ని, యావత్ ప్రపంచంపై దాని ప్రతిఫలనాన్ని మెత్తగా దునుమాడుతూ మిషెల్ చేసిన ప్రసంగం కోట్లమందికి సూటిగా తగిలింది.

అమెరికన్లు ఏవైపు నిలబడాలో, ఏ వైపు నిలబడకూడదో అన్యాపదేశంగా సూచిస్తూనే.. ఒకప్పటి బానిసల వారసులు శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన చరిత్రను కొనసాగించడానికి ఏం చేయాలో.. భవిష్యత్తులో అమెరికన్ మహిళలు, వారి కుమార్తెలూ మరిన్ని అవకాశాలను పొందడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చెబుతూ దిశానిర్దేశం చేస్తూ మిషెల్ వెలువరించిన ప్రసంగమది. నిజం చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్‌ పేరుకీ, ప్రతిష్టకీ గత కొద్దినెలల్లో ఇంత నష్టం కలిగించిన వారు మరెవ్వరూ లేరని పాశ్చాత్య మీడియా కోడై కూస్తోంది. అమెరికాలోనే కాకుండా యావత్ ప్రపంచం కూడా డొనాల్డ్ ట్రంప్‌ను శక్తివంతంగా దెబ్బతీయగలిగేది ఎవరు అని ఎదురుచూస్తున్న తరుణంలో మిషెల్ ప్రసంగం నిజంగానే మిస్సైల్‌లాగా పేలింది. డెమాక్రాటిక్ పార్టీలో ఏ గవర్నరూ, ఏ కాంగ్రెస్ ప్రతినిధీ తీసుకురాలేనంత ఐక్యమత్యాన్ని మిషెల్ ప్రసంగం ఒక్క క్షణంలో తీసుకొచ్చింది. అమెరికన్లుగా మనం నేడు ఎదుర్కొంటున్న సమస్య నలుపూ, తెలుపూ కాదు. 140 అక్షరాలతో అది పరిష్కారమయ్యేదీ కాదు (ట్విట్టర్‌లో ట్రంప్ ద్వేషపూరిత ట్వీట్లపై వ్యాఖ్య) కాదంటూ నిండుసభలో ఆమె చేసిన వ్యాఖ్య వింటున్నవారిని మంత్రముగ్ధుల్ని చేసింది.

ప్రత్యర్థి పేరును కూడా ప్రస్తావించకుండా  బండకేసి బాదటం ఎలాగో మిషెల్ ప్రసంగం నిరూపించి చూపింది. అమెరికన్ ప్రథమ మహిళలు సందర్భానుసారం చేసిన ప్రసంగాల్లో అత్యంత శక్తివంతమైన, ప్రభావశీలమైన ప్రసంగం ఇవ్వాళ మిషెల్ పేరిట చరిత్రకెక్కింది. వర్గ అసమానతలు రాజ్యమేలుతున్న సమాజంలోనూ మంచికీ, చెడుకూ వ్యత్యాసం ఎలా ఉంటుందో సూచించిన మిషల్ ఒబామా ప్రసంగం పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడండి. చదవండి.

Watch first lady Michelle Obama’s full speech at the 2016 Democratic National Convention
https://www.youtube.com/watch?v=4ZNWYqDU948

FULL TRANSCRIPT MICHELLE OBAMA'S DEMOCRATIC NATIONAL CONVENTION SPEECH
http://europe.newsweek.com/michelle-obama-speech-transcript-democratic-national-convention-484189

మిషెల్ ఒబామా ప్రసంగం విన్నాక, చదివాక ఆమె మాటల సారం కొంతైనా భారత దేశానికి వర్తిస్తుందేమో చూడండి. ఈ దేశ మూలవాసులకు, శ్రమజీవులకు, దళిత, ఆదివాసీ ప్రజానీకానికి, వారి జీవన విధానానికి తూట్లు పొడుస్తున్న, సమాజాన్ని నిలువునా చీలుస్తున్న పోకడలతో మిషెల్ ప్రసంగాన్ని పోల్చి చూడండి.

అదేవిధంగా వేలాది సంవత్సరాలుగా దళితులు సాగిస్తూ వచ్చిన శ్రమసంస్కృతిని గౌరవించని అమానవీయ సమాజ పోకడలపై ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చిన అద్భుత కథనాన్ని తప్పక చూడండి.

చరిత్రకు పాదుకలిచ్చిన చర్మం
http://www.sakshi.com/news/opinion/opinion-on-leather-industry-by-mallepalli-lakshmayya-370117

6 comments:

నీహారిక said...

మిషెల్ ఒబామా ప్రసంగం విన్నాక, చదివాక ఆమె మాటల సారం కొంతైనా భారత దేశానికి వర్తిస్తుందేమో చూడండి.

భారతదేశంలో ఒక శక్తివంతమైన మహిళను ఎన్నుకోమని మరో శక్తివంతమైన మహిళ ఇలా మాట్లాడతారంటారా ? ఒక మహిళ అధికారంలోకి వస్తే గుండు గీయించుకుని ముండ మోస్తాను అని మరో మహిళ బెదిరించిన ఘన చరిత్ర మనది !

kanthisena said...

"ఒక మహిళ అధికారంలోకి వస్తే గుండు గీయించుకుని ముండ మోస్తాను అని మరో మహిళ బెదిరించిన ఘన చరిత్ర మనది!"

నీహారిక గారూ, మిషెల్ ప్రసంగాన్ని భారతదేశానికీ వర్తించి చూడమని నేనన్న సందర్భం వేరనుకోండి. కానీ మీ వ్యక్తీకరణ కూడా శక్తివంతంగానే ఉంది. ఇక్కడ ఇది చర్చనీయాంశం కాదనుకుంటాను. తక్షణ స్పందనకు ధన్యవాదాలు.

Grey hat said...

ఆమె speech నచ్చింది.

అందులోనూ... "మీ చేతివ్రేళ్ళ కొనల న్యూక్లియర్ కోడ్లున్నప్పుడు, మీరు quick decisions తీసుకోజాలరు" అన్నప్పుడు, "మీరు మీ చర్మాలని పలుచనగా ఉంచుకోజాలరు" అన్నప్పుడు.


ఒక్క విషయం మరువలేకున్నాను. ఇలాంటి అసహనాన్ని లేవగొట్టేకదా మన ప్రధాని పదవిలోకొచ్చినది?

నీహారిక said...

ఈ రోజు కూడా హిల్లరీ ఇటువంటి బెదిరింపు మాటలే మాట్లాడారు. అణుబాంబులు చేతిలో ఉంచుకుని కోపంగా మాట్లాడే వాళ్ళ చేతికి అమెరికా అధ్యక్ష పదవి ఇస్తారా ? అని అడిగారు.

కేసీఆర్,మోదీ లాంటి విద్వేషకారులను పదవిలో కూర్చోబెట్టడం వల్ల ఒక ఉపయోగం ఉంది.విద్వేషాలు ఎలా పుడతాయో వారికి తెలుసు కాబట్టి వారు జాగ్రత్తగానే ఉంటారు.

బాగా అల్లరిచేసే నన్ను మా టీచర్ క్లాస్ లీడర్ని చేసినట్లన్నమాట ! లీడర్ అయ్యాక అల్లరి చేయడం ఎలా కుదురుతుంది ?

నీహారిక said...

@ Grey hat,

వాస్తవాన్ని చెప్పినందుకు అభినందనలు !

Anonymous said...

అసహనాన్ని ప్రధాని కాదురా రెచ్చగొట్టింది, మీడీయా రా పుస్కి.

Post a Comment