Pages

Monday, March 28, 2016

ఇలాంటి వీసీ 'గురువు' లెక్కలోకి వస్తాడా?

కొన్ని రోజుల క్రితం 'అది దేశద్రోహం కాక మరేమిటి' అంటూ ఆరెస్సెస్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి భాగయ్య గారు 'సాక్షి' పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం లింకును ఈ బ్లాగులో పొందుపరుస్తూ నా భిన్నాభిప్రాయం పోస్ట్ చేశాను. 'రోహిత్ ఆత్మహత్య ముమ్మాటికీ దురదృష్టకరం.' అంటూ బాధను వ్యక్తీకరిస్తున్నవారు.. తన ఆత్మహత్య తర్వాత నేటివరకూ హెచ్‌సీయూలో జరుగుతున్న అమానుష పరిణామాలకు ఎవరు బాధ్యులో చెప్పరే అని ప్రశ్నిస్తూ కింది అభిప్రాయం ప్రకటించాను.

"హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ అప్పారావు పొదిలి రెండునెలల తర్వాత చెప్పా చెప్పకుండా మళ్ళీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తన అధికారిక నివాసంపై దాడి జరిగితే యూనివర్సిటీ చరిత్రలో దుర్దినం -బ్లాక్ డే- అంటూ ఓండ్రపెట్టాడు. ఒక మేధోవంతుడైన విద్యార్థి... కేవలం  వీసీగా తన నిర్లక్ష్యం, క్రూరత్వం కారణంగా గుండె పగిలి చావును కొని తెచ్చుకుంటే ఆరోజు అదే యూనివర్సిటీ చరిత్రలో బ్లాక్ డే అయిందనే మాట ఈ మహానుభావుడి నోటివెంట పెగల్లేదు. అతగాడి ఇంట్లో ధ్వంసమైన ఫర్నిచర్‍‌కు ఉన్నంత విలువ కూడా ఆ యూనివర్శిటీలో విద్యార్థికి లేదు."

"మనుషుల ప్రాణాలను నిలువునా హరించే చర్యలు, లెటర్లమీద లెటర్లు, హెచ్చరికల మీద హెచ్చరికలు చేసి రాచి రంపాన పెట్టి మనిషిని నిలువునా హతమార్చిన పెద్దమనుషులు, తారామణులు, చేసిన తప్పు ఎక్కడ మెడకు చుట్టుకుందోనని అబద్దాల మీద అబద్దాలు పలికి బయటపడ్డవారు.. వీరెవ్వరూ దేశద్రోహులు కారు. వీరెవ్వరూ జాతి ద్రోహులు కారు..."

నా టపా చదివిన ఒక అజ్ఞాత వ్యాఖ్యాత మరికొన్ని విమర్శలు చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వీసీ మీద దాడి చేసిన వారిని సమర్థిస్తున్నారని నన్ను విమర్శిస్తూ ఇలా వ్యాఖ్యానించారు.

"గురువు దైవంతో సమానం అంటారు. అలాంటి గురువు మీద దాడిని సమర్ధిస్తున్న మిమ్మల్ని చూసి ఏమనాలో అర్థం కావటం లేదు."

దానికి ఆ టపాలో  నా వ్యాఖ్య ఇది.

"ఇక గురువు. గురువు మీద దాడి. నేను సమర్థించడం.. ఒక పచ్చి హంతకుడిని గురువుగా భావించడం నాకు చేతకాదు. అంత శక్తీ నాకు లేదు. హెచ్ సీయూలో గొడవ జరిగినప్పటినుంచి అబద్దాలు, అబద్దాల మీద అబద్దాలు.. దొడ్డిదారిన రాయబారాలు.. దొంగ బతుకు బతకడం కూడా గురుత్వంలో భాగమేనా? కేంద్రం ఎజెండాలో భాగంగా దొంగదారిలో వచ్చి రాజకీయం చేస్తున్న వారు గురువులు. ఆహా.."

నా పై అభిప్రాయాన్ని పూర్తిగా పక్కన బెట్టినా ఫర్వాలేదు. కానీ...

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్యుద్ధాన్ని పోలిన పరిస్థితులు తలెత్తడానికి ఎవరు కారకులో కూలంకషంగా వివరిస్తూ ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి పంపిన రచన ఆదివారం నాటి 'సాక్షి' సంచిక (27-03-2016) 4వ పేజీలో ప్రచురితమైంది. ఆయన పేరు కె.ఆర్. వేణుగోపాల్. "ఇది విద్యాహక్కుకు భంగం కాదా" అనే శీర్షిక కింద ఆయన కొన్ని మౌలిక విషయాలను లేవనెత్తారు.

"హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్యుద్ధాన్ని పోలిన పరిస్థితులు తలెత్తడానికి ఆ విశ్వవిద్యాలయ వివాదాస్పద వైస్‌చాన్స్‌లర్ డాక్టర్ అప్పారావు మళ్లీ పదవీ బాధ్యతలను చేపట్టడంలో ప్రదర్శించిన బాధ్యతా రాహిత్యం, మొరటుతనం ప్రధాన కారణం."

"కొన్ని మాసాల నుంచి మానవ హక్కుల రక్షణలో ఆయన దారుణమైన అసమర్థతతో వ్యహరించారు. అందు లోనే విద్యార్థుల విద్య హక్కు ఇమిడి ఉంది. రోహిత్ వేముల ఆత్మహత్య సహా,  విశ్వవిద్యాలయ ప్రాంగణం యుద్ధాన్ని మరిపించే రీతిలో తయారు కావడానికి ఇదే కారణం. సమ్మె చేస్తున్న విద్యార్థులను శాంతింపచేయడంలో  వైస్‌చాన్స్‌లర్ పూర్తిగా విఫలమయ్యారని, ఫలితంగానే సమస్య ముదిరి పోయిందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నియమించిన నిజనిర్ధారణ సంఘం కూడా చెప్పేసింది."

"వైస్‌చాన్స్‌లర్ మళ్లీ విధులు చేపట్టడానికి వచ్చేనాటికి రూపన్‌వాల్ జుడీషియల్ కమిషన్ తన నివేదికను సమర్పించలేదు. తాను చేసిన పనికి వైస్‌చాన్స్‌లర్ కుంటిసాకులు వెతుకుతూ ఎలిబీ సృష్టించుకుంటున్నారు తప్ప, ఒక విద్యాలయం యుద్ధాన్ని మరిపించే విధంగా తయారు కావడానికి తన వంతు పాత్రను గురించి ఆయన అంతరాత్మను ప్రశ్నించుకోవడం లేదు."

"కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలతో వైస్ చాన్స్‌లర్ సెలవుపై వెళ్లారన్నది సుస్పష్టం. ఇన్‌చార్జి వీసీని ఆయన స్థానంలో నియమించడం కూడా జరిగింది. అలాంటప్పుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు లేకుండానే, వైస్‌చాన్స్‌లర్ తనకు తానై కార్యాలయానికి వచ్చి ఎలా కూర్చుంటారు చెప్పాపెట్టకుండా వైస్ చాన్స్‌లర్ అలా మళ్లీ వచ్చి విధులు ఎలా చేపట్టారని మానవ వనరుల అభివృద్ధి శాఖ కూడా విస్తుపోయిందని విశ్వసించదగిన మీడియా వార్తల వల్ల తెలుస్తున్నది. నిజానికి ఆ మంత్రిత్వ శాఖ నిజంగానే ఆశ్చర్యపోయిందా; లేక ఇది కూడా దోబూచులాటేనా?"

వేణుగోపాల్ గారు ఇలా తమ అభిప్రాయం వ్యక్తం చేశాకు వేరే మాటలు అనవసరం. బీజేపీ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిగారి సిఫారసుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్‌గా గద్దెనెక్కినట్లు అందరూ చెప్పుకుంటున్న అప్పారావు పొదిలి ఆ వర్శిటీలో గత కొన్ని నెలలుగా ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తూ వస్తున్నారో.. నేను కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గారి నిర్వాకంపై తెలంగాణ శాసనసభలో తీర్మానం చేయవలసిన స్థాయి సదరు వీసికి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈసడించుకున్న విషయం తెలిసిందే.

రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి  కె.ఆర్. వేణుగోపాల్ గారు హెచ్‌సీయూలో విద్యాహక్కు, మానవ హక్కులు టోకున ఉల్లంఘనకు గురవుతున్నాయని, ఈ పాపాలనుంచి ఎవరూ బాధ్యతను తప్పించుకోలేరని అభిప్రాయపడుతూ రాసిన కథనం పూర్తి పాఠాన్ని కింది లింకులో చదవగలరు

ఇది విద్యాహక్కుకు భంగం కాదా




2 comments:

Sangireddy Hanumantha Reddy said...

Excellently analysed. I am happy once again for your progressive ideas.

Zilebi said...


రాజ శేఖర రాజు గారికి,

మీ బ్లాగు కాంతిసేన (నెలవంక) జిలేబి వదన అగ్రిగేటర్ లో కలుపు బడింది . జిలేబి వదన సెక్యులార్ నాన్ థీయిస్ట్ నాన్ ఎథీయిస్ట్ లిస్టింగ్ :) జేకే !

Aggregator link

http://www.zilebivadana.blogspot.com

మీరు కొత్త టపా వేస్తే కనిపిస్తుంది

చీర్స్
జిలేబి

Post a Comment