Sunday, June 10, 2018

సినిమా కళ ఉద్దీప్తమైన క్షణం : మహానటి


మూడు వారాల తర్వాత మహానటి సినిమాను చూశాను. హైదరాబాద్ లోని ఈసీఐఎల్‌.. ఏఎస్‌రావు నగర్‌లోని రాధికా థియేటర్లో మా చెల్లి మాధవి, బావ, తమ్ముడు రాంబాబుతో కలిసి మహానటిని ఎట్టకేలకు -27-05-2018-న చూడగలిగాను. సినిమా చూశాక రోజుల తరబడి ఆ జ్ఞాపకాలే వెంటాడాయి. మహానటికి తెలుగు ప్రేక్షకులు అర్పిస్తున్న నీరాజనం అనిర్వచనీయం. స్వయంగా సినిమాను థియేటర్లో చూస్తే తప్ప ఆ అనుభూతి మనకు అందదు. మూడో ఆదివారం సెకండ్ షో సైతం హౌస్ ఫుల్ కావడం చిత్రవిజయానికి గుర్తు. వృద్ధులతో సహా కుటుంబాలకు కుటుంబాలు సినిమాకు రావడం పాతతరంపై కొత్త తరం చూపించిన గౌరవం కావచ్చు. దాదాపు మూడు గంటలపాటు సాగిన సినిమా ముగిశాక థియేటర్ మొత్తం సావిత్రి పునర్ జ్ఞాపకాలతో మూగపోయింది.సినిమాలో వాస్తవానికి భిన్నంగా అనేక అంశాలు ఉన్నాయంటూ రంధ్రాన్వేషకులతోపాటు సినిమా కళ పట్ల గౌరవంతో విమర్శించినవారి వ్యాఖ్యలను, సమీక్షలను అలా పక్కన బెడితే.. తెరమీద తెరవెనుక సావిత్రి విశ్వరూపాన్ని జనరంజకంగా చూపించడంలో కొట్టొచ్చినట్లు కనిపించేది ఒక్కటే. దర్శకుడి నిజాయితీతో కూడిన ప్రయత్నం.

మానవజాతి సృజించిన అత్యున్నత ఆధునిక కళారూపం సినిమా అయితే, ఆ సినిమా కళను ఉద్దీపింపజేసిన అతి గొప్ప సినిమాలలో మహానటి ముందువరుసలో నిలుస్తుంది. పల్లెటూర్లో పుట్టి ఊహ తెలిసినప్పటినుంచి గత నలభై ఆయిదేళ్ల నా జ్ఞాపకాల్లో బళ్లు కట్టుకుని మైళ్లదూరం ప్రయాణించి టెంట్లలో సినిమాలను చూసి ఆనందించిన ఆ అద్భుతమైన రోజులు మళ్లీ గుర్తొస్తున్నాయి. మల్లీశ్వరి, దేవదాసు, మాయాబజారు, అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం, ఆకలిరాజ్యం, మరోచరిత్ర, సాగరసంగమం, అన్నమయ్య, బాహుబలి, ఇప్పుడు మహానటి.. మానవ భావోద్వేగాలను శిఖరస్థాయికి తీసుకెళ్లిన గొప్ప సినిమాలను చూసిన అద్భుతానుభవంలో నేనూ ఒక భాగం. తల్చుకుంటేనే మనసు పులకరించి, మా బాల్యాన్ని తరింపజేసిన గొప్ప సినిమాలు కళ్లముందు మళ్లీ కదలాడుతున్నాయి.

నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులవి. 1978-79 అనుకుంటాను. మాయాబజార్ సినిమా విడుదలై పాతికేళ్లయిన సందర్భంగా సితార సినీ పత్రికలో ఆ సినిమా గురించి ఒక కథనం ప్రచురించారు. అప్పటికి పాతికేళ్లకు ముందు పుట్టినవారు మాయాబజార్‌ సినిమాను చూడకపోయి ఉంటే వారు తెలుగువారు కానేవారు అని ఆ కథనంలో రాశారు.ఆనాటికి నాకు 17 ఏళ్ల వయస్సు. ఆనాటికి ఊరి టెంటులో కాని, తర్వాత రాయచోటి హాళ్లలో కానీ మాయాబజార్ సినిమా చూసే అవకాశం కలగలేదు. ఆ తర్వాత యూనివర్సిటీలో పీజీ కోసం తిరుపతికి వచ్చినప్పుడు 1983-84 ప్రాంతంలో జ్యోతి థియేటర్లో మాయాబజార్ చూశాను. తిరుపతిలో పాతసినిమాలు చూడాలంటే జ్యోతి మహల్, ఇంగ్లీషు సినిమాలు చూడాలంటే ఐఎస్ మహల్ థియేటర్లు ప్రసిద్ధి. ఎట్టకేలకు మాయాబజార్‌ను 22 ఏళ్ల వయసులోనే చూసి నేనూ తెలుగువాడినే అని రొమ్ము విరుచుకు సంతోషించిన రోజులవి.

ఇప్పుడు మరో 35 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్ల తర్వాత సితార సినీ పత్రికలో ఆనాడు వచ్చిన కథనంలోని ఆ సాహస ప్రకటనను మళ్లీ చేయాలనిపిస్తోంది.మహానటి సినిమాను థియేటర్లో చూడకపోతే మనం తెలుగువాళ్లం కాము. కాలేము. తెలుగు గడ్డపై అతి సాధారణ కుటుంబంలో పుట్టి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, పదితరాలపాటు జనం మరవని, మరవలేని చరిత్రను సొంతం చేసుకున్న సావిత్రి మూర్తిమత్వాన్ని శిఖరస్థాయిలో మనముందు ప్రదర్శించిన అద్వితీయ కళారూపం మహానటి. దర్శకుడు రూపొందించుకున్న స్క్రిప్ట్ తర్వాత, మన సావిత్రిని మళ్లీ కళ్లముందు నిలిపిన అతి గొప్ప నటనను ప్రదర్శించిన సావిత్రి పాత్రధారి కీర్తి సురేష్‌కి చేతులెత్తి నమస్కరించాల్సిందే. నిజంగానే ఆమెను సావిత్రి పూనినట్లుంది.


కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా సాధించలేని పబ్లిసిటీని ఒక్క మౌత్ పబ్లిసిటీ అదీ జనం నోటినుంచి వచ్చే మాటలు సినిమాను ఎక్కడికో తీసుకెళతాయంటే దానికి ఆధునిక నిర్వచనం మొదటిది బాహుబలి అయితే రెండోది మహానటి. ఈ రెండు సినిమాల్లోని భయంకరమైన లోపాలను, తప్పు వాస్తవాలను చాలామంది చాలా రకాలుగా ఒకరకంగా నిజాయితీగానే ప్రస్తావించారు. విమర్శించారు కూడా. కానీ ఆ భయంకరమైన లోపాలన్నీ సినిమా చూశాక చంద్రునిమీద దూదిపింజలాగా తేలిపోతాయి. ఈ మధ్యకాలంలో కోట్లాది మంది ఒళ్లు పులకరించిపోయిన అనుభూతికి ప్రత్యక్ష నిదర్శనం ఈ రెండు సినిమాలు. బాహుబలి కల్పన అని కొట్టిపారేయవచ్చు. విజయేంద్రప్రసాద్ కథకు రాజమౌళి శిల్పంలాగా చెక్కకపోతే బాహుబలికి ఆ ఫేమ్ ఎక్కడిది అని తీసిపారేయవచ్చు. కానీ మహానటి అలా కాదే!

మనకు రెండు తరాల క్రితం ఈ భూమ్మీద, మనగడ్డపైనే పుట్టి పెరిగిన ఒక అమాయకపు కొంటెపిల్ల మన తల్లిదండ్రుల, అవ్వతాతల కళ్లముందే చిత్రసీమలో ఎదిగి సినిమాకళకు మహిమాన్విత నిర్వచనంలా ప్రభాసించిన కథే మహానటి. అది కల్పన కాదు. మూడక్షరాలను చిత్రరంగస్థలంపై మూర్తీభవింపచేసిన వాస్తవరూపం. నరాలను ఉద్రేకపరిచే ఒక్క కాముక దృశ్యం కూడా చూద్దామన్నా కనిపించలేదు. ఒక్క ఫైటింగ్ కూడా లేదు. ఒక్క వెకిలి హాస్యపు కంపూ లేదు. ఒక్క పనికిమాలిన హీరోయిజమూ లేదు. పంచ్‌ల కోసమే పుట్టిస్తున్న ఒక్క దరిద్రపు డైలాగూ లేదు. ఒక్క రక్తపాత ఘటనా లేదు. కానీ మాయాబజార్ తర్వాత శంకరాభరణం తర్వాత, అన్నమయ్య తర్వాత (బాహుబలిని మినహాయిస్తే) మూడుగంటల పాటు ఆబాల గోపాలం తనువు పులకరింపజేసిన అపూర్వ కళకు కట్టెదుటి రూపం మహానటి. బీ సెంటర్లనుంచి ఏ సెంటర్ల నుంచి, ఐమాక్స్ థియేటర్ల నుంచి చూసిన చూస్తున్న జనం నోట ఒకేమాట. మహానటి. ఒక సినిమాను, ఒక పాత్రను, ఒక జీవితాన్ని యావత్ సమాజం ఇంతఆర్తితో తమ సొంతం చేసుకున్న ఘటన చలనచిత్ర చరిత్రలో చాలా అరుదుగా సంభవిస్తుందేమో.

తెలుగు హీరో చిరంజీవి కోట్లమంది ప్రేక్షకుల గుండె చప్పుళ్లను ఒక్కటిగా చేసి ఒక గొప్ప నిజాన్ని మాట్లాడారు. 'మహానటి సినిమాను చూస్తున్నంతసేపూ ఏడుస్తూనే ఉన్నాను. ఏడుస్తూనే మొత్తం సినిమాను చూశాన'న్నారు. మా సినిమా ప్రారంభోత్సవానికి, విడుదలకీ వచ్చి నాలుగు మాటలు చెప్పి ఆశీర్వదించండి అని ఎవరైనా నిర్మాతలు, నటులు, దర్శకులు అడిగితే లేదనకుండా, కాదనకుండా తాను ఎన్నో సార్లు ఎందరి సినిమాలకో సరుకు లేకున్నా ముఖప్రీతి కోసమైనా చాలా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ మహానటి సినిమాపై చిరంజీవి చేసిన వ్యాఖ్య నిజాయితీకి నిలువెత్తు గోడగా నిలిచిందనడమే నిజం. రెండు వారాల క్రితం ఆ ఆదివారం రాధికా ఐమాక్స్ థియేటర్లో సెకండ్ షో కి వెళ్లినప్పుడు జనం మొత్తం మూగపోయి సినిమాలో లీనమవడమే నాకు కనిపించింది, వినిపించింది.

ఇంతమంది జనం మహానటి సినిమానూ చూస్తూ మౌనంగా విలపించారంటే, సావిత్రి విషాదాన్ని తమదిగా సొంతం చేసుకున్నారంటే, తెలుగుప్రజల భాగ్యవశాత్తే ఇంత మంచి సినిమా, ఇంత కరుణామయ కళ మనకు అందిందనే చెప్పాలి. ఇంటర్వెల్‌ సమయంలో థియేటర్ నుంచి బయటకు రాకుండా సగంమందికి పైగా లోపలే ఉండిపోయారంటే వాళ్లనుభూతి చెందుతున్న ఆ ట్రాన్స్, ఆ కళాత్మక మత్తు వేసిన ముధ్ర ఏమిటో అర్థమవుతుంది. ముఖ్యంగా పదే పదే మహానటీ.. అనే బిట్ వెనుక వినిపించిన సంగీతం సావిత్రి జీవితంలోని ఆనందాన్నీ దాని వెనకే వెంటాడిన విషాదాన్నంతటినీ రంగరించిపోసినట్లుగా సినిమా విజయానికి మూలకారణమై నిలిచింది. చివరివరకూ ప్రేక్షకులను విషాదాంతపు అనుభూతితో నిలిపిన గొప్ప మ్యూజిక్ బిట్ అది.

సావిత్రి జీవితంలోని సంతోషానికి, వేదనకు, బాధకు, విషాదాంతానికి కర్త కర్మ క్రియ సావిత్రి మాత్రమే అని చెబితే న్యాయంగా ఉంటుందా? మహానటి సినిమా చూడక ముందు ఇదే ప్రశ్న వేసుకున్నాను. చూసిన తర్వాత కూడా ఇదే ప్రశ్న వేసుకుంటున్నాను. అవును. సావిత్రి జీవితంలోని ప్రతి అనుభవానికి సావిత్రే మూలం. చిన్నప్పటినుంచి చివరిదాకా తానెలా ఉండాలనుకుందో అలాగే ఉండిపోయింది. ఎవరి మాటా వినలేదు. ఎవరి సలహానూ పాటించలేదు. ఎవరి మెప్పు కోసమో జీవించలేదు. తన సంతోషాన్ని, చిలిపితనాన్నీ, తన వైభవాన్ని, తన పేదరికాన్ని, తన భావోద్వేగాలను పూర్తిగా తనకే సొంతం చేసుకుంది. ఒకరిని తప్పు పట్టలేదు. వేలెత్తి చూపలేదు. తన సినీ జీవితానికి తిలకం దిద్ది మద్దతిచ్చి తోడుగా నిలబడ్డాడన్న ఏకైక కారణం అతడితో జీవిత బంధం వరకూ తీసుకెళ్లింది. ఇద్దరు పెళ్లాల మొగుడైన జెమినీని నమ్మింది. తనకే సొంతమవుతాడని భ్రమించింది.

కానీ పుష్పంమీద వాలడం జీవన ధర్మంగా పెట్టుకున్న ఒక భ్రమరం తన చుట్టూ మాత్రమే తిరగదన్న వాస్తవాన్ని గ్రహించిన క్షణం... 'అది తన బలహీనత, కానీ తన ప్రేమ మొత్తం నీమీదే' అన్న భ్రమర న్యాయాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఇద్దరు భార్యలతో గడుపుతూనే మూడో పెళ్లికీ సిద్ధమైన బంధంలో పవిత్రతకు, స్వచ్ఛతకు తావులేదన్న నిజాన్ని గ్రహించకపోవడమే సావిత్రి చేసిన తప్పా? వ్యక్తిగత జీవితంలో ఇంకేమీ మిగలబోదన్న వాస్తవం అర్థమయ్యాక కూడా బతుకు కోసమో, నటన మీద పిచ్చితోనో, చివరి క్షణం వరకు సినిమాల్లో నటిస్తూనే పోవాలన్న కాంక్షతోనో మాత్రమే సావిత్రి మరో 15 ఏళ్లు బతికిందా? అన్నీ ప్రశ్నలే. సినిమా చూసినంత ఈజీగా తేల్చుకోలేని ప్రశ్నలు. కన్న కూతురితో సహా అందరూ సావిత్రి గురించి పాక్షిక సత్యాలనే చెబుతున్నారనిపించేలా నలుమూలల్నుంచి ఆమెతో పరిచయం ఉన్నవారు నేటికీ బయటపెడుతున్న వాస్తవాలు.. ఏది నిజమో, ఏది అబద్ధమో ఎవరికీ పూర్తిగా తెలీదు. నిర్ధారణ లేదు.

కానీ ఒకటి మాత్రం నిజం. ఇదొకటే నిజం. 1952 నుంచి 1981లో కన్నుమూసేంతవరకు సావిత్రి జీవితంలోంచి వ్యక్తిగతాన్ని మినహాయిస్తే, మనకు వద్దనుకుంటే చివరికీ మిగిలేది మూడక్షరాల నటవిశ్వరూపం. నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వంటి స్టార్ నటులు కూడా ఆ మూడక్షరాల నట విరాడ్రూపం ముందు నిలబడాలంటేనే వణికిపోయిన మహనీయ మూర్తిమత్వం. 78 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో నటనకు మారుపేరుగా నిలిచిన ఒకే ఒక్కడు ఎస్వీరంగారావు సైతం సావిత్రి ముందు నిలబడి నటించాలంటే జాగ్రత్తగా ముందే సిద్ధపడి రావలసివచ్చేదంటే అది ఆ మూడక్షరాల మనిషి సినిమా కళపై చేసిన చెరగని సంతకం. హీరోయిన్‌గా వెలిగిపోయినపుడు లక్షలు తీసుకున్నా, సైడ్ పాత్రలకూ, తల్లి పాత్రలకూ పరిమితమై పాత్రకు ఆరువేల రూపాయలు మాత్రమే తీసుకోవలసి వచ్చినా, 'ప్రేక్షకులచేత చప్పట్లు కొట్టించుకోవడానికే బాబాయ్ మనం ఉండేది, ఉండాల్సిందీ...' అంటూ నటజీవితంపై తాత్విక వ్యాఖ్యానం చేసినా అది సావిత్రికే చెల్లు.

మన సావిత్రిని ఇలాగే గుర్తు పెట్టుకుందాం. ఆమె వ్యక్తిగత జీవితాన్ని, దానిలోని నిమ్నోన్నతాలను సవినయంగా, నమ్రతతో ఆమెకే వదిలేద్దాం. మన తీర్పులను, ముద్రలను వినడానికి, సమాధానం ఇవ్వడానికి కూడా ఆమె మన ముందు లేదు. జీవితం మొత్తంలో రాజీపడని వైఖరి, సర్దుబాటు అనే మాటకు తావివ్వని ప్రవృత్తి, తానేమనుకుంటే అదే నిజం అనుకున్న నమ్మకం. మనిషిమీద నమ్మకం సడలుతుండే కొద్దీ గరళాన్ని మింగి.. అదే నమ్మకం, అదే జీవితం అనుకున్న మొండితనం... సామాన్య జీవితాలకు అర్థం కాని, ఎవరూ సాహసించలేని ఈ వ్యక్తిగత తెంపరితనాన్ని దాటి చూస్తే... మొదట్లోనే చెప్పినట్లు సినిమా కళను ఉద్దీపింపచేసిన మహత్వపూర్ణ నటనా కౌశలం సావిత్రి.

నా చిన్నప్పుడు అంటే 1970లలో మాయాబజారు సినిమా ఊరి టెంట్లలో ప్రదర్శిస్తే బళ్లు కట్టుకుని మరీ వచ్చి చూశారు జనం. మహానటి సినిమాకు ఎవరూ బళ్లు కట్టుకుని రాలేదు. కారణం ఊర్లలో ఇప్పుడు టెంట్లు లేవు. బళ్లూ లేవు. వ్యవసాయం మొత్తంగా యంత్రాల పాలబడుతోంది. కష్టజీవి శ్రమను పోగొట్టి విరామాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందించిన ఆ గొప్ప సినిమా సంస్కృతి ఇప్పుడు పల్లెల్లో లేదు. ఎందుకంటే అక్కడ కూడా అన్ని ఇళ్లల్లో టీవీలు దూరేశాయి. 40 ఏళ్లలో జీవితం ఇంతగా మారిపోయిందా అంటూ నివ్వెరపోతున్న క్షణాల్లో మండువేసవిలో మలయమారుతంలా చల్లగా పలకరిస్తూ వచ్చింది సావిత్రి. అదే మహానటి.

మాయాబజారు సినిమా చూడకపోతే తెలుగువాళ్లు కాదు అని 70ల చివర్లో ఒక సినిమా పత్రిక కథనం మమ్మల్ని భయపెట్టింది. ఇప్పుడు అదే భయాన్ని మహానటికి కూడా ఆపాదించు కోవాల్సి ఉంది. మహానటి సినిమా చూడకపోతే, అదీ థియేటర్లోకి వెళ్లి చూడకపోతే మన తెలుగువాళ్లం కాదు అని కొత్త స్లోగన్ రాసుకోవాలిప్పుడు. మరోసారి చెబుతున్నా.. సినిమా కళను ఉద్దీపింప చేసిన అరుదైన చిత్రాల్లో మహానటి తాజా సినిమా. మనం మర్చిపోయిన అలనాటి సుగంధ పరిమళాన్ని మరోసారి ఆస్వాదించాలన్నా.. మహానటి చిత్రాన్ని ఎవరూ మిస్ కాకూడదు. ఇంకా ఎవరైనా చూడకుంటే ఇప్పటికైనా వెళ్లి చూడండి. థియేటర్లో మాత్రమే చూడండి. బాహుబలి సినిమాను మిస్సయినా పర్వాలేదు. మహానటిని మాత్రం ఈ తరంలో ఏ ఒక్కరూ మిస్ కాకూడదు. ఎందుకంటే ఈ సినిమాను చూడకపోతే మనమీద కూడా తెలుగువాళ్లం కాదు అనే అపప్రథ కచ్చితంగా పడుతుంది.
-------------
నిజామాబాద్‌కు చెందిన ధర్మరాజ్ అనే అతను మహానటి సినిమా చూసి యూట్యూబ్‌లో రాసిన నాలుగు ముక్కలు మళ్లీ ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. "అది సినిమా కాదు.. ఒక జీవిత పాఠం.. జీవితంలో మనం చేసే పొరపాట్లు.. జీవితం మనకు ఇచ్చే అవకాశాలు.." అంటూ మొత్తం సినిమా గురించి రెండు చిన్న వాక్యాలలో అద్భుతంగా స్పందించారు. సినిమాలో నిజంగా సావిత్రే ఉందనుకుని, మధ్యలో అలా చేయకు ఇలా చేయకు అని చెబుదామా అనే తాదాత్మ్యత లోకి వెళ్లిపోయారీయన.

సినిమా రివ్యూలు, మేధోవంతమైన సమీక్షలు వంటివి పక్కన బెడితే.. ఒక సగటు ప్రేక్షకుడు మహానటి పట్ల ఎంత గొప్పగా స్పందించారో కింది పేరాలో చూడండి.

"నిన్న మహానటి సినిమా చూసిన... అది సినిమా కాదు ఒక అద్భుత దృశ్య కావ్యం... ఒక జీవిత పాఠం... జీవితంలో మనం చేసే పొరపాట్లు... జీవితం మనకు ఇచ్చే అవకాశాలు... Ball will come to our court... definitely... But how we will utilise it is important... That is life... That Is "Mahaanati" Saavitri... చివరకు ఇలా ఎందుకు జరిగింది అని భారమైన హృదయంతో థియేటర్ నుండి బయటకు వచ్చాను... సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కళాకారులు కనబడలేదు.... ఆ మహానటి సావిత్రమ్మను దగ్గర నుండి చూస్తున్నాను అనే ఒక గట్టి భావన... మధ్య మధ్యలో సావిత్రమ్మను పిలిచి చెబుదామా అన్నంత అలజడి హృదయంలో..."
dharamraj
నిజామాబాద్
--------------------
ధర్మరాజ్ ఒక్కరే కాదు... ఒక సినిమాను చూసి థియేటర్ నుంచి లక్షలాది మంది మౌనంగా విలపిస్తూ, దీర్ఘాలోచనతో బయటకు రావడం ఎలా సాధ్యం అనే ప్రశ్నకు మన తరం జీవితంలో నిలువెత్తు సమాధానం మహానటి. మన సావిత్రికి జననీరాజనం మహానటి. తప్పక ఈ ఆదివారమైనా వెళ్లి చూడండి. థియేటర్లోనే చూడండి.

మహానటిపై ఈ కథనం ముందుగా నా పేస్ బుక్ లో పోస్ట్ చేశాను. కింది లింకులో చూడండి
సినిమా కళ ఉద్దీప్తమైన క్షణం : మహానటి

0 comments:

Post a Comment