Pages

Sunday, January 27, 2019

తిరుమల చరిత్రపై అరుదైన గ్రంథం: "గాడ్స్ ఆన్ అర్త్ : తిరుమల చరిత్ర"

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ విశ్రాంత చరిత్ర ఆచార్యులు ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి, చరిత్రకు సంబంధించిన ప్రాథమిక, ద్వితీయ మూలాధారాలను విస్తృతంగా సేకరించి, శోధించి రచించిన "గాడ్స్ ఆన్ అర్త్ : తిరుమల చరిత్ర" పుస్తకావిష్కరణ నేడు (27-01-2019 ఆదివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరించనున్నారు. సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ శ్రీ కె. రామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రిటైర్డ్) శ్రీ ఐవైఆర్ కృష్ణారావు "గాడ్స్ ఆన్ అర్త్ : తిరుమల చరిత్ర" పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

ఇంతవరకు తిరుమల చరిత్రపై తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ, వివిధ బాషల్లోనూ వచ్చిన, పలువురు రాసిన పుస్తకాలకు భిన్నంగా 2 వేల సంవత్సరాల చారిత్రక పరిణామక్రమంలో తిరుమల శ్రీనివాస ఆలయం ఎలా పరిణమిస్తూ, అభివృద్ధి చెందుతూ వచ్చిందో పరిపూర్ణంగా చరిత్రను పునాదిగా చేసుకుని దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి రాసిన విశిష్ట గ్రంథమిది. క్రీస్తు శకం ఒకటవ శతాబ్దిలో తిరుమల పరిసరాల పాలకుడైన తొండైమాన్ చక్రవర్తి చెట్లనీడలో, చెదల పుట్టల నడుమ కప్పబడి ఉన్న వెంకటేశుని ప్రతిమను వెలికి తీయించి పున:ప్రతిష్ట గావించి శిలాస్తంభాలతో మండపరీతి ఆలయాన్ని నిర్మించింది మొదలుకుని క్రీ.శ. నాలుగు-తొమ్మిది శతాబ్దాల మధ్య కాలంలో ఆళ్వారులు ఎంతో కష్టంతో కొండల నడుమన ఉన్న వేంకటేశుని దర్శించి తాము సేకరించిన వివరాలను పాటగట్టి ఆ భక్తితత్వాన్ని దక్షిణ భారత దేశమంతా ప్రచారం చేసిన చరిత్రను రచయిత అత్యంత నిర్దిష్టంగా, హేతుపూర్వకంగా ఈ పుస్తకంలో వివరించారు. శ్రీ వేంకటేశ్వరుడి లీలలు, మహిమలు, భక్తి వంటి ఆధ్యాత్మిక వివరాల కంటే 2 వేల సంవత్సరాల చరిత్ర క్రమంలో తిరుమల చరిత్రను ఆధార సహితంగా వెలికి తీసి మనముందు ఉంచిన అసలు సిసలు చరిత్ర రచన ఇది. తొండైమాన్, ఆళ్వారులు, పల్లవులు, యాదవరాజులు, విజయనగరరాజులు, రామానుజాచార్యులు వంటి ఆధ్యాత్మిక మూర్తులు తిరుమల ఉనికికి, ప్రాశస్త్యానికి ఎలా దోహదపడుతూ వచ్చారో కూలంకషంగా ఆధారసహితంగా తెలిపిన నిర్దిష్ట గ్రంథమిది.

నేడు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుపతి పట్టణ నిర్మాణానికి యాదవరాజులే కారణమని, 24-02-1130 సంవత్సరం తిరుపతితోపాటు, గోవిందరాజ ప్రతిమా స్థాపన మొదలైందని, గోవిందరాజ ఆలయ గోపురం క్రీ.శ 1219న నిర్మించారని, ప్రాంతీయ చరిత్రకు ప్రచారం లేక యాదవరాజుల పాత్ర మరుగునపడిపోగా, తదనంతరం విజయనగర పాలకులే ఆలయ వృద్ధికి ప్రధాన కారకులని చరిత్ర రూపొందడం గురించి రచయిత శాస్త్రాధారల సహితంగా వివరించారు. హిందువుల ప్రాచీన తీర్థయాత్రా ప్రాంతాల్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమలను 1వ శతాబ్దంలో పుల్లికున్రం (పుల్లి అనే రాజు కొండ) అని, తర్వాత వేంగడం అని పిలిచేవారు. క్రీ.శ. 1013 ప్రాంతం నుంచే తిరుమల అనే పేరు స్థిరపడిందని ప్రాచీన తమిళ సంగం యుగపు సాహిత్య ఆధారాలతో రచయిత వివరించారు.

భారతీయ సంస్కృతి మూలాలు -వేంకటేశ్వరుడు అనే తొలిపలుకులతో పాటు గాడ్స్ ఆన్ అర్త్, సైన్స్, ఆర్కియాలజీ, టెంపుల్ ఆర్ట్, హిస్టరీ చెబుతోన్న నిజం, తొలినాళ్లలో తిరుమల, తిరుచానూరు, తిరుపతి, తిరుపతి పుట్టుక, ప్రాచీన తమిళ సంగం యుగపు సాహిత్యంలో తిరుమల తొలిపాలకుడు పుల్లిరాజు, తిరుమల వేంకటేశ్వరుని ఆవిర్భావం, తొండైమాన్ చక్రవర్తి విశిష్టత, ప్రాచీన తెలుగు నేల హద్దులను తెలుపుతున్న తిరుమల చరిత్ర, ఆళ్వారులు, శిలప్పదికారం, తిరుమల ఆలయం నిర్మాణం, పెరుగుదల, తిరునాళ్లు -తిరుమల, వైష్ణవ ఆచార్య పురుషులు, రామానుజులు, వేదాంత దేశికులు, హరిదాసులు, దాసరీలు, అన్నమాచార్య, పురందరదాసు, త్యాగరాజు, తరిగొండ వెంగమాంబ, విజయనగర రాజులు వంటి అధ్యాయాలతో తిరుమల ఉజ్వల చరిత్రను ఆధార సహితంగా చెప్పడానికి ప్రయత్నించిన పరిశోధక స్థాయి కలిగిన గ్రంథమిది.

ఇక రెండో విభాగంలో విజయనగర రాజుల పోషకత్వంతోపాటు తిరుమల ఆలయ దోపిడీకి వచ్చిన పోర్చుగీస్ గోవా గవర్నర్ మార్టిం, అఫాన్సో డీ సౌసా ప్రయత్నం విఫలమై వెనుదిరిగిన చరిత్రను రచయిత కథ చెబుతున్న రీతిలో రోమాంచితంగా వర్ణించారు. పోల్చడానికి వీల్లేదు కాని రాబర్ట్ క్రాంవెల్ రాసిన ఎ ఫర్ గాటన్ ఎంపైర్ విజయనగర అనే (విజయ నగర సామ్రాజ్యం) ప్రామాణిక గ్రంథంలోని వర్ణనలను పోలిన ఘటనలను ఈ పుస్తకంలో రచయిత అద్భుతరీతిలో పొందుపర్చారు. తెలుగునాడులో వేంకటపతి  రాయల కాలంలో చంద్రగిరిలో క్రైస్తవం అడుగుపెట్టి వ్యాప్తి చెందిన ఘటనను కూడా కథాకథన పద్ధతిలో రచయిత వివరించారు.

వ్యక్తిగతంగా నాకయితే విజయనగర సామ్రాజ్యం చదివినప్పుడు ఎంత ఆసక్తి, ఉత్కంఠతో చదివానో ఈ పుస్తకం చదువుతుంటే కూడా అదే ఆసక్తి కలిగింది. ఇప్పటికే పుస్తక ప్రదర్శన శాలల్లో విడుదలై పెద్ద సంఖ్యలో ప్రతులు అమ్ముడైన గాడ్స్ ఆన్ అర్త్ : తిరుమల చరిత్ర అతి ప్రాచీన ఆలయ చరిత్రను చారిత్రక దృక్పథంతో తెలుసుకోవాలని కుతూహలపడే ప్రతి ఒక్కరికీ అవసరమైన పుస్తకం. అత్యంత ప్రాచీనమైన చిత్రపఠాలను పొందుపర్చడం ఈ గ్రంథానికి మరింత సొగసునిచ్చింది.

ఈ పుస్తకాన్ని రచయిత ఇవ్వగానే రెండు రోజుల్లో చదివేసి, 20 ఏళ్లు చదివినా ఈ పుస్తకంలోంచి ఇంకా ఎదో తెలుసుకోవలసింది ఉండే ఉంటుందంటూ కితాబిచ్చిన టీడీడీ పూర్వ ఛైర్మన్ వ్యాఖ్యలు దీని విశిష్టతను పెంచుతున్నాయి.

ఒకటి మాత్రం నిజం. 300 పేజీల ఈ హార్డ్ బౌండ్ పుస్తకంలో ఎలాంటి మహిమలు లేవు. భక్తి ప్రచారాలు లేవు. వేంకటేశ్వరుడి లీలలు లేవు. కాని మనిషి తమకు మంచి చేసినవారిని దేవుళ్లగా, చెడు చేసిన వారిని రాక్షసులుగా భావించి కొందరికి దైవత్వం, కొందరికి దానవత్వం ఎందుకు  ఆపాదిస్తూ వచ్చాడో పరిణామ క్రమంలో వివరిస్తూ వచ్చిన గొప్ప పుస్తకం ఇది. అందుకే  భక్తి ప్రాతిపదికన కాకుండా ఆలయాల వికాస, వైభవ క్రమాలను ఆధార సహితంగా చరిత్ర నేపథ్యంలో తీసుకువచ్చిన ఈ పుస్తకాన్ని చరిత్రపై కుతూహలం కలిగిన ప్రతి ఒక్కరూ చదవాల్సిందే.

ప్రతులకు
Devireddy Publications
C/o Devireddy Subramanyam Reddy
303, B1 Block, Varapura Homes, Sri Sai apartments
Tummalagunta, Tirupati - 517502
Andhrapradesh
Mobile: 98495 84324
Email: dsreddy.svu@gmail.com
(రిటైర్డ్ ప్రొఫెసర్, ఎస్వీ యూనివర్శిటీ


పుటలు 300 పైగా
వెల రూ.300.00లు
విదేశాలకు: 5 డాలర్లు

గమనిక: ఈ పుస్తకం పై ఆసక్తి కలిగిన వారు నేడు -27-01-2109- న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్‌లో జరుగనున్న పుస్తకావిష్కరణ సభకు రావచ్చు. అందరూ ఆహ్వానితులే.

0 comments:

Post a Comment