సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం ఈ భూమ్మీద నుండి ఒక మనిషి వెళ్లిపోయాడు. ఒక అమర స్వరం ఇక పాడలేనని సెలవు తీసుకుంది. దివిజ కవివరుల్ గుండియల్ దిగ్గురనంగ చందాన ఆ మనిషి, ఆ స్వరం ఈ భౌతిక ప్రపంచం నుంచి వెళ్లిపోయాయి. మనిషి లేడు... ఆయన స్వరం లేదు. నాలుగు దశాబ్దాలు గడిచాయి. కాని ఆ మనిషి, ఆ స్వరం ఈ గడ్డ జ్ఞాపకాల్లోంచి అంతరించి పోలేదు. కొన్ని లక్షల కుటుంబాలు ఆయన పాటలు వింటూనే తరిస్తున్నాయి. జీవితంలో తమకెదురవుతున్న సమస్త బాధలను, సంతోషాలను, ప్రేమాభిమానాలను, పిడుగుపాటులా తగిలే ఎదురుదెబ్బలను, విచారాన్ని, వేదనను, భక్తిభావనను, శృంగారాన్ని, కరుణ రస హృదయ స్పందనలను ఆయన పాటల ద్వారా వింటూ స్వాంతన పొందుతూ ఈ నేల మీది మనుషులు సేద తీరుతున్నారు. ఆయన పాడింది మూడు దశాబ్దాలు.. ఆయన గతించిన తర్వాత గడిచిన కాలం నాలుగు దశాబ్దాలు. గత ఏడు దశాబ్దాలుగా ఈ నేల ఆయన పాటలతో పునీతమవుతూనే ఉంది.
ఊర్లలో హరికథలు పాడుతూ బాల భరతుడిలా జనాన్ని మెప్పించిన వాడు, తెలుగుసీమలో ఒక మారుమూల నాలుగిళ్లలో అన్నం అడుక్కుని, కొందరమ్మలు పెట్టిన బిక్ష సాక్షిగా సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న ఓ పిల్లాడు.. తెలుగు నేల నలుచెరగులా, ప్రపంచంలో తెలుగువాళ్లు కాలు మోపిన ప్రతి చోటా తన ఉనికిని పాట రూపంలో, పద్యం రూపంలో చాటుకుంటూ చిరంజీవిగా మనందరిమధ్యే ఉంటున్నాడు. కంచుకంఠానికి శాశ్వత నిదర్శనంలా నిలిచి, మూడు తరాలపాటు తెలుగుదేశంలో ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింప జేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. తెలుగు పాట, తెలుగు పద్యం గొప్పతనాన్ని ప్రపంచానికి కమ్మటి గొంతుతో పరిచయం చేసిన ఘంటసాల... మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీత, నేపధ్య గాన చరిత్రలో కరిగిపోని సంతకంలా తెలుగు వారి హదయాల్లో నిలిచిపోయాడు.
ఆయన గాత్రం, అసలున్నాడో లేడో తెలియని 'దేవుడు' కరుణించి, తెలుగు ప్రజలకి ప్రసాదించిన అపురూప వరమని కొనియాడుతున్నారు. అటు ఆస్తికులను, ఇటు నాస్తికులను కూడా, స్వరపేటికలోంచి పెల్లుబికి వచ్చే మహా వేదనలో ముంచెత్తి ఏడ్పించి, కన్నీరుపెట్టించిన అమరగానం ఆయనది. పాటలోని భావానికి పడిపోకున్నా, లోబడిపోకున్నా, మాంత్రిక మహనీయ కంఠస్వరంతో వాదాలను, సిద్ధాంత భేదాలను పక్కనబెట్టించి మనుషులను కరిగింపజేసిన అపర తుంబుర నాదానికి ఆయన గొంతు ఒక అచ్చమైన ప్రతిబింబం. శాస్త్రీయ సంగీత ఛాయలనుంచి, లలిత సంగీతంలోకి తెలుగు సినిమాపాట పరిణామం చెందుతున్న క్రమంలో వేలకొద్దీ పాటలు, పద్యాలూ పాడి, తెలుగు సినీ గాన చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించిన గొప్పకళాకారుడు ఆయన.
ఎలా సాధ్యం? ఒక మనిషికి అతడి గొంతుకు ఇది ఎలా సాధ్యమైంది? ఒక గొంతు ప్రేమను పలికించవచ్చు, ఒక గొంతు విచారాన్ని తారాస్థాయికి తీసుకుపోవచ్చు.. ఒకరు చిలిపితనానికి తేనెసొగసులద్ది పరవశింపజేయవచ్చు. ఓ గొంతు విషాదానికి శిఖర స్థాయి నిచ్చి ఉద్వేగంలో ముంచెత్తవచ్చు. ఓ గొంతు శృంగారానికి అపర శ్రీనాధ కవి సార్వభౌముడిలా నిలిచి కంచుడక్కను పగులగొట్టవచ్చు... ఒక గొంతు నవ్వించవచ్చు, ఒక గొంతు కన్నీరు తెప్పించవచ్చు. ఓ గొంతు ఆథ్యాత్మిక ప్రపంచపు సరిహద్దుల్లోకి మనిషిని తీసుకుపోయి అక్కడే విడిచి రావచ్చు.
కాని ఇదేమిటి? అటు భక్తిని, ఇటు రక్తిని, అటు ప్రేమను, ఇటు ఎడబాటును, అటు వేదనను ఇటు అనుకంపనను, విరక్తిని, అల్లరిని, సంతోషాన్ని ఒక్క మనిషి సమస్తజీవుల తానైన చందాన నవరసాలను ఒక్క గొంతులో పలికించడమేమిటి? మన కళ్లముందు ఈ ప్రపంచంలో ఎన్ని భాషల్లో, ఎంతమంది ప్రసిద్ధ గాయనీ గాయకులు పాడటాన్ని, పాటలతో జీవితాన్ని పండించుకోవడాన్ని మనం చూడలేదు? కనలేదు..! వినలేదు..? ప్రేమను పలికించినవారు, విషాదాన్ని గుండెనిండా నింపినవారు.. భక్తిని రంగరించి పాడినవారు ఎంతమందిని మనం చూడలేదు. కాని ఇన్ని మానవ అనుభూతులను ఒక గొంతు.. ఒకే ఒక్క గొంతు పలకడమేమిటి? ఒక జాతి గొంతును తన గానంతో తరింపజేయడమేమిటి?
అనితర సాధ్యమైన ఈ గంధర్వ గాన కళ ఈయనకే ఎలా సాధ్యమైంది? ఆయన కంఠంలో పలికిన భక్తి, విచారం, వేదన, విరక్తి, ప్రేమ, చిలిపితనం, శృంగారం, అల్లరి, గడుసుదనం మరొకరికి అనుకరణ సాధ్యంకాదని తెలుగు జాతి ముక్త కంఠంతో శ్లాఘిస్తోంది. ప్రపంచ గాన చరిత్రలో ఒక గాయకుడు ఇన్ని మానవ మనోభావాలను, సంవేదనలను మూడు దశాబ్దాలపాటు ఒకే స్థాయిలో పాడటం జరిగిందా, మన దేశంలో కాని, ఇతర దేశాలలో కాని నవరసాలను జీవిత పర్యంతమూ పలికించిన గొంతు ఎక్కడైనా ఉందా అనేది రేపటి పరిశోధకులకే వదిలేద్దాం...
కాని.. అనేకులు చెబుతున్నట్లు ఆయన కారణ జన్ముడు కాడు. గంధర్వగాయకుడు కాడు.. దేవుడు ప్రసాదించిన వరప్రసాదం అంతకంటే కాదు. పేదరికాన్ని జీవితపు తొలినాళ్లలో ఘోరంగా అనుభవించిన ఆ చిన్ని జీవితం, ఆకలి విశ్వరూపాన్ని తాను చేపట్టిన మధూకర వృత్తి సాక్షిగా చవిచూసిన ఆ పిల్లాడి జీవితం తన గొంతును రాగరంజితం చేసింది. మానవ జీవితపు సమస్త వేదనలను, ఆశలను, ఆరాటాలను, అభిమానాలను, అనురక్తులను ఆయన కంఠం తనవిగా చేసుకుంది. పేదరికం, ఆకలి ఆ గొంతుకు అమృతాన్ని అందించి కమ్మటి స్వరాన్ని ఈ ప్రపంచానికి చిరస్థాయిగా అందించాయి.
జీవితంలో బాధ పడనివాడు, బాధ అంటే ఏమిటో తెలియని వాడు, ఆకలి రుచెరుగనివాడు, సమస్త బాధల వెనుక ఒక జీవితం అంటూ ఉంటుందన్న ఆశను, వాస్తవాన్ని ఆకలి సాక్షిగానే గుర్తెరగని వాడు మనిషిని కరిగించే పాట పాడలేడు. అతడు త్యాగరాజు కావచ్చు, అన్నమయ్య కావచ్చు.. రామదాసు కావచ్చు.. చివరకు గద్దరే కావచ్చు... వీరి పాటల వెనుక ఉన్న మహిమాన్విత శక్తికి వారి జీవిత నేపథ్యమే కారణం. వీరిలో ఏ ఒక్కరు సంపన్నులై ఉన్నా వారికి కళా జగత్ చరిత్రలో స్థానం ఉండేది కాదన్నది వాస్తవం. తదనంతర జీవితంలో వారు ఎంత ఉన్నత స్థాయికైనా ఎదగవచ్చు. కాని పేదరికమే వారిని నడిపించింది. జీవితంలో లేమితనం వారిని రగిలించింది. కష్టభూయిష్ట బాల్యమే వారిని రాటుదేల్చింది.
మన కన్నీళ్లు, మన వేదన, మన దుఃఖం ఇవి పాటకు, గానానికి ప్రాణ ప్రతిష్ట చేస్తాయనే సత్యాన్ని అన్నమయ్య గీతాలాపనకు ప్రాణంపోసిన శోభారాజు ఒక సందర్బంలో అన్నట్లు గుర్తు. తిండికి ముఖం వాచిపోయిన తన పేదరికమే, తన ఆకలే తన పాటకు మూలమైందని, అన్నమయ్య పాట రూపంలో తన అకలిబాధ వెలికి వచ్చిందని ఆమె పాతికేళ్ల క్రితమే ఒక సందర్భంలో అన్నారు. చరిత్రకెక్కిన, చరిత్రను చరితార్థం చేసిన ప్రతి గొప్ప వ్యక్తి జీవితం వ్యక్తిగత బాధనుంచే మొదలైంది. ఘంటసాల దానికి అతీతుడు కాదు. ఆయన గొంతు పలికించిన అద్భుత రాగాలకు, కమనీయ వ్యక్తీకరణలకు ఆయన అనుభవించిన బాధ కారణం. ఆకలి కారణం, కటిక పేదరికం కారణం.
ఆయనను ఇలాగే స్మరించుకుందాం. గుర్తించుకుందాం... ఆయన గొంతులో తారాడిన పాట పలికించిన సహస్ర వ్యక్తీకరణలను మనం ఇలాగే భద్రపర్చుకుందాం. మరో వెయ్యేళ్లు గడిచినా జాతి మర్చిపోని ఈ గాన గంధర్వుడికి ఇలాగే నివాళి పలుకుదాం.
(ఫిబ్రవరి 11 ఘంటసాల వర్థంతి)
గమనిక: ఘంటసాల గారి వర్థంతి సందర్భంగా 2013-14లో నేను andhraprabha.com లో పనిచేసేటప్పుడు 'జాతి అమర గాయకుడు ఘంటసాల', 'కేవలం గాయకుడే కాదు' అనే పేర్లతో రెండు సంస్మరణ వ్యాసాలు 2014 ఫిబ్రవరి 11, 12 తేదీల్లో రాశాను. మొదటిది ఆయనపై నా అనుభూతి. రెండోది దాదాపు 40 ఏళ్ల క్రితం ఘంటసాల కన్నుమూసిన సందర్భంగా నాటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో కె. కుమార శేఖర్ అనే వ్యక్తి రాసిన అద్భుతమైన ఆంగ్లవ్యాసానికి స్వేచ్ఛానువాదం. andhraprabha.com ఇప్పుడు లేదు. దాంట్లో ఆరునెలలపాటు శ్రమించి నేను రాసిన వందలాది వ్యాసాలూ లేవు. బ్లాగు రూపంలో అయినా దొరికిన కొన్ని రచనలనయినా భద్రపర్చుకోవాలనే పేరాశతో ఈ ప్రయత్నం.
(పేరాశ అని ఎందుకంటున్నానంటే వారం క్రితం వరకు పనిచేసిన నా చందమామ చరిత్ర బ్లాగ్ మళ్లీ ఆన్‌లైన్ నుంచి కనుమరుగైంది. మళ్లీ వస్తుందో లేదో తెలీదు. blaagu.com వారి డొమైన్‌లో blaagu.com/chandamamalu అనే పేరుతో నేను రూపొందించుకున్న 'చందమామ చరిత్ర' బ్లాగు అది. జల్లెడ.కామ్ వారు మరోసారి ఈ విషయమై నాకు సహాయం చేస్తే బాగుండు.)
రాజశేఖర రాజు
8341571371
హైదరాాబాద్
1 comments:
చాలా బాగా రాశారు!
సుస్వరాల టంకశాల మన ఘంటసాల!
Post a Comment