Pages

Friday, February 27, 2015

పనిమనిషి రచయిత్రిగా మారిన క్షణాలు…



ఇతరుల ఇళ్ళలో కసువు తోసి, నేల కడిగి, వంట చేసి బతికే ఒక సాధారణ పనిమనిషి… తన చిన్ని జీవితంలో జరిగిన ఓ గొప్ప పరిణామంతో అత్యంత జనాదరణ పొందిన రచయిత్రిగా భారతీయ సాహిత్య వినీలాకాశంలో మెరుస్తోంది. చెత్త తోయడం, ఇల్లు కడగడం, వంట చేయడం ఒక పనేనా… రోజూ కోట్లాదిమంది “ఆడజనం” చేస్తున్నది అదే పనేగా… దాంట్లో విశేషం ఏముంటుంది. ఇక ఆ పనుల్లో సృజనాత్మకత కూడానా… అని ఎవరయినా ఈసడించవచ్చు.

కానీ, చెత్త తోసిన ఆ చేతులు… నేల కడిగిన ఆ చేతులు… వంట చేసిన ఆ చేతులు… తన జీవితం గురించి తాను రాసే అవకాశం దక్కినప్పుడు, తన బాధామయగాథను ప్రపంచానికి చెప్పాలని ఓ చిరు ప్రయత్నం చేసినప్పుడు ప్రపంచమంతటా కోట్లాదిమందిని కదిలించిన ఓ సజీవగాథకు ప్రాణం పోసినట్లయింది. ఆ చిట్టి చేతులు తన గురించి, తన బాల్య, కౌమార్య జీవితం గురించి తనకు తెలిసిన భాషలో రాసుకున్న కథను ఇవ్వాళ (2004 నుంచి) ప్రపంచమంతా తన కథగా గానం చేస్తోంది.

ఉయ్యాలలూపిన చేతులు ఊళ్ళేలగలవా… -రాజ్యాలు- అనే ప్రశ్నకు ఇది సందర్భం కాదు. ఎందుకంటే అవి ఇంటి చెత్త తోసిన చేతులు, యజమాని ఇంట్లో నేల కడిగి శుభ్రపర్చిన చేతులు. ఆ చేతులు రాసుకున్న తనదైన కథా సౌరభం ఇవ్వాళ విశ్వసాహితీ వీధుల్లో గుబాళిస్తోంది. ఓ పనిమనిషి కలల ప్రపంచాన్ని, జీవన దుర్భరత్వాన్ని తోటి ప్రపంచం ముందు పరచిన ఆ కథ పేరు “ఎ లైఫ్‌ లెస్ ఆర్డినరీ”. ఆ మట్టి చేతుల మనిషి హల్దార్… బేబీ హల్దార్ (ఆమె తండ్రి హవల్దార్ పనిచేశారు కాబట్టి ఈమె పేరు బేబీ హవల్దార్‌గా  -హల్దార్- రూపాంతరం చెందిందట).

భారతీయ పనిమనిషి, రచయిత్రి అయిన బేబీహల్దార్ రాసిన జీవిత చరిత్ర “ఆలో అంధారి” లేక “ఎ లైఫ్‌లెస్ ఆర్డినరీ” రచయితగా మారిన ఈ పనిమనిషి దుర్భర జీవితం గురించే వర్ణిస్తుంది. 1973 లేదా 74లో పుట్టిన ఈమె నాలుగేళ్ళ వయస్సులో కన్నతల్లి వదిలివేస్తే నిర్లక్ష్యపు తండ్రి పోషణలో పెరిగింది. నమ్మశక్యం కానంత తక్కువ వయస్సులో… పన్నెండేళ్ళ పసిప్రాయంలో పెళ్ళి పాలబడిన హల్దార్ 13 ఏళ్లకే తల్లయింది. నిత్యం భర్త వేధింపులు భరించే శక్తి లేక ముగ్గురు సంతానాన్ని తీసుకుని ఢిల్లీ వెళ్ళి ఓ ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. ఈ క్రమంలో ఇంటి యజమానుల పీడనను అనేకసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వ్యక్తిగతంగా, సామూహికంగా అంతులేని ఈ బాధల దుర్భరత్వంలోంచే ఆమె ఇంటిపని ముగిశాక దొరికాక కాసింత విరామ సమయంలో తన గురించి రాసుకోవడం మొదలెట్టింది. బెంగాలీ భాషలో అతిసాధారణ, వాస్తవిక శైలిలో రాస్తూ పోయింది. తన చిన్ని దుర్భర జీవితంలో పెనుమార్పుకు దారితీసిన ఈ పరిణామానికి ఓ “కరుణామయుడి” చల్లని చలువే కారణం. ఆయనే ఆమె చివరి యజమాని, రచయిత, మానవ నిర్మాణ శాస్త్రంలో (ఆంథ్రోపాలజీ) రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రబోధ్ కుమార్. తన జీవితం గురించి తానే రాసుకోవాలని ఆమెను ప్రోత్సహించడమేగాక, ఆమె పుస్తకాన్ని ఎడిట్ చేయడంలో కూడా సహకరించారు.

ఈయన జగమెరిగిన హిందీ సాహిత్యవేత్త మున్షీ ప్రేమ్‌చంద్ మనవడు కావడం మరో విశేషం. హల్దార్ రచనను ఈయన హిందీలోకి అనువదించి పెట్టారు. హిందీ భాషలో ఈ పుస్తకం మొదట 2002లో ప్రచురితమవగా, బెంగాలీ మూల భాషా ప్రచురణ 2004లో ప్రచురింపబడింది. బెంగాలీ మూలాన్ని సుప్రసిద్ధ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్వయంగా ప్రచురించడం విశేషం…ఎడిషన్ 2005లో మళయాళం వెర్షన్ రాగా, ఇంగ్లీష్ అనువాదం 2006లో ప్రచురింపబడింది. భారత్‌లో ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా ప్రజాదరణ పొందింది. కాగా, ఫ్రెంచ్, జపనీస్ భాషల్లో దీన్ని అనువదించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని గుర్గాన్‌లో ఇప్పటికీ ప్రొఫెసర్ గారి ఇంట్లో ఉన్న హల్దార్ తన తొలి పుస్తకానికి తరువాయి భాగాన్ని 2006లో రాయడం మొదలెట్టింది. (ఇది 2008లో నా మరొక బ్లాగులో రాసిన కథనం అని మర్చిపోవద్దు)

రచయిత్రిగా మారిన నేపథ్యం

ప్రొఫెసర్ ప్రబోధ్ కుమార్ తన ఇంటి పనిమనిషికి సరైన దిశలో అందించిన కాసింత తోడ్పాటు భయానకమైన హల్దార్ చీకటి జీవిత స్మృతులను తొలగించింది. ఆమె మానసిక ప్రపంచం తేజోమయం కావడానికి దారితీసిన ఆ మహత్తర క్షణాల గురించి కాస్త….

ముగ్గురు పిల్లల తల్లి. 29 ఏళ్ళ వయసులో ప్రొఫెసర్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. నిశ్శబ్దంగా కసువు ఊడుస్తూ… ఇల్లు తుడిచేది, వంట చేసేది… కఠినతరమైన జీవితం… కానీ ఒక పనిలో మాత్రం ఆమె పనితనం నెమ్మదించేది. షెల్ఫ్‌లోని పుస్తకాలను ప్రత్యేకించి బెంగాలీ పుస్తకాల దుమ్ము దులపరిస్తున్నప్పుడు మాత్రం ఆమె పని మందగించేది. పేజీ పేజీని తిరగేస్తూ పాతబట్టతో మెల్లగా పుస్తకాన్ని పట్టి పట్టి మరీ తుడుస్తుండేది. పనిమనిషి స్వభావానికి భిన్నమైన పనితనం ఇక్కడ కనబడడంతో షెల్ఫ్ వద్ద ఆమె ఏదో చేస్తోందని ప్రొఫెసర్ పసిగట్టారు.

ఒకరోజు ఆమెను నేరుగా అడిగేశారు. “నువ్వు చదువుతావా…?” అని.

అంతే, తాను బిస్కెట్ డబ్బాలో చేయి పెడుతుంటే యజమాని పట్టుకున్నంతగా ఆమె గిల్టీగా ఫీలయింది. స్కూల్ చదువుతో -7వ తరగతి- సరిపెట్టుకున్న హల్దార్ మన ప్రొఫెసర్‌ గారింట్లో బెంగాలీ పుస్తకాలు కనబడినపుడు పేజీలు తిరగేస్తూ చదివే ఆసక్తిని చంపుకోలేక పోయింది. పుస్తకాలపై ఆమె అనురక్తి ఇలా బట్టబయలు కాగానే ఆయన తన పుస్తకాల షెల్ఫ్‌ను వాడుకోమని స్వేచ్ఛ ఇచ్చారు.

ఆడబానిస తొలి స్వతంత్ర పయనం అలా మొదలైంది. ఆమాట చెవుల పడిందో లేదో, ఆబగా ఆమె అందుకున్న తొలి పుస్తకం ఏమిటో తెలుసా… తస్లీమా నస్రీన్ రాసిన నా బాల్యం (మై ఛైల్డ్‌హుడ్).

ఆ పుస్తకం చదువుతున్నంతసేపూ తన కథనే చదువుతున్నంత ఉద్వేగం. ఒక్కొక్కటిగా షెల్ప్‌లోని పుస్తకాలన్నీ ఆమె పఠనా ప్రపంచంలో చేరిపోయాయి. ఆశాపూర్ణాదేవి, మహాశ్వేతాదేవి, బుద్ధదేవ్ గుహ… ఇలా ఎందరో బెంగాలీ రచయితలు… కోట్లాదిమందికి సాహిత్య పఠనావకాశం నేటికీ లభ్యంకాని భారతదేశంలో, ఒక పనిమనిషి చిన్ని ప్రపంచాన్ని ఉద్దీప్తం చేసిన మానవీయ క్షణాలవి… పనిమనిషిని మనిషిలా గుర్తించకుండా గాడిద చాకిరి చేయించుకుంటూ, అనుమానపడుతూ వారి మనసుల్లో నరకం సృష్టించే వాతావరణానికి భిన్నంగా ఆ “కరుణామయుడు” అమృతహస్తాలతో ఆమెకు పఠనానుభవాన్ని ప్రసాదించారు.


ఒకరోజు… ప్రొఫెసర్‌గారు ఆమె చేతికి ఓ కాపీ పుస్తకాన్ని, కలాన్ని అందించి, “రాయి” అంటూ ఆజ్ఞాపించారు. అది ఒకే ఒకమాట… కేవలం రెండక్షరాలు… ఒక్కసారిగా ఆమె ఏడ్చేసింది. నిరాశతో… నిస్పృహతో… ఏం రాయాలి? రాయడానికేముంది? మూడు దశాబ్దాల అజ్ఞానం, చిమ్మ చీకటి రోజులు, కర్కశమైన జీవితానుభవాలు ఆమెను వెంటాడాయి. నిజంగా తనదో మతిలేని జీవితం, మాజీ సైనికుడు, డ్రైవర్ అయిన తండ్రి ఉద్యోగరీత్యా ఎక్కడికెళితే తామూ అక్కడికి వెళ్ళడం… ఇలా కాశ్మీర్ నుండి ముర్షీదాబాద్ వరకు అటునుంచి దుర్లాపూర్ వరకూ జీవితం ఎక్కడికి తంతే అక్కడికి ప్రయాణం….

తల్లిలేని పిల్ల, తండ్రి, సవతితల్లి దూషణలను పంటిబిగువున భరించడం, చివరకు పెళ్ళయ్యాక భర్తతోనూ వేధింపులు… తీవ్రమైన నిరాశా నిస్పృహల మధ్య ముగ్గురు పిల్లల తోడుతో అంతవరకూ ఎరిగివుండని ఢిల్లీకి రైలెక్కేయడం. దేశ రాజధాని నగరంలో జీవితం తీరుతెన్నులు అతి త్వరలోనే ఆమెకు అర్థమయ్యాయి. తాగుబోతు భర్తల దాష్టీకం భరించలేక దారిద్ర్యంతో వేగలేక, ఇల్లువిడిచి పారిపోయిన వేలాది స్త్రీలు ఢిల్లీలో ఎంచుకున్న బాటే ఆమెకూ శరణ్యమైంది. జీతాలు సరిగ్గా చెల్లించని ఇంటిపనిని ఎన్నుకుంది. కొన్నిసార్లయితే గడ్డకట్టించే శీతల రాత్రుల్లో పిల్లలతో పాటు వీధుల్లో గడిపింది.

అలాంటిది… ఆమె చీకటి జీవితం మొట్టమొదటిసారిగా ఇపుడు బంధనాలు తెంచుకుని, తన గురించి, తన బతుకు గురించి రాసేందుకో శైలిని ఆమెకు అందించింది. వెంటనే…కలాన్ని అందుకుంది. తన దినవారీ పనిలో తప్పని మరో భారంగా కలం పట్టాక తొలి పేజీలను అతి కష్టం మీదే అయినా కృత నిశ్చయంతో, గుడ్డి విశ్వాసంతో రాయటం మొదలెట్టింది.  20 ఏళ్లుగా తాను కాపీ పుస్తకంలో  రాసింది లేదు..అక్షర క్రమం మర్చిపోయింది కూడా, ముఖ్యంగా కాపీ పుస్తకంలో తాము రాయవలసింది పోయి తమ తల్లి ఎందుకు రాస్తుందో తెలుసుకోవాలని పిల్లలు భావించినప్పుడు ఆమె చాలా ఇబ్బందిపడింది.

అయితే ఆమె రాసిన తొలిపదాలే తమవైన మాయను ప్రదర్శించాయి. అవి గతంనుండి ఆమెను బంధవిముక్తి చేశాయి. కన్నతల్లి తమను వదిలి పెట్టి కనపడకుండా వెళ్లిపోయిన బాధాకరమైన స్మృతులను, తనను పెళ్లాడిన వ్యక్తి తన పరుపు మీదికి ఎక్కి తనపై తొలి రోజే అత్యాచారం జరిపిన ఆ రాత్రిని, తన భర్తచేత చంపబడిన సోదరిని, 13 ఏళ్ళ పసిప్రాయంలో తొలి బిడ్డను ప్రసవించిన సందర్భంగా తాను అనుభవించిన బాధను, భీభత్సాన్ని.. ఇన్నాళ్లుగా తాను ఎవరికీ చెప్పుకోని, తానైనా గుర్తించలేని విషాద స్మృతులను నోట్ పుస్తకంలోకి ఎక్కించడం మొదలు పెట్టింది.

ఆమెను ఇప్పుడిక ఎవరూ అడ్డుకోలేరు. వంటగదిలోనూ, కూరగాయలు, వంట పాత్రల మధ్య నోట్ పుస్తకాన్ని అటూ ఇటూ జరుపుతూ, ఇల్లు చిమ్మడానికి, తుడవడానికి మధ్య విరామంలోనూ, పిల్లలను పడుకోబెట్టిన తర్వాత నడిరేయిలోనూ ఆమె రాస్తూ పోయింది. ఏదైనా రాయడానికి కూర్చునే ముందు కుర్చీ, అధ్యయన, రాత సామగ్రిని సిద్ధం చేసుకోవాల్సి వచ్చేది కాని రాత మొదలెట్టాక కూరగాయలు తరుగుతున్నంత సులువుగా రాసేదాన్ని అని ఆమె చెప్పుకుంది.

ఫలితాలు అనూహ్య రీతిలో సాగాయి. రాయవలసిందిగా హల్దార్‌కు చెప్పినప్పుడు ఆమె మనస్సును సమస్యలపై కేంద్రీకరింపజెయ్యాలన్నదే తన ఆలోచన అని ప్రొఫెసర్ గుర్తు తెచ్చుకున్నారు. అయితే నోట్ పుస్తకంలో రాసిన విషయాలు ఎంతో అద్భుతంగా వచ్చాయని చెప్పారాయన. ఆమె రాసింది చదువుతూ, తప్పులు దిద్దుతూ, ఫోటో కాపీలు తీస్తూ ఎంతో ప్రోత్సాహం ఇచ్చారాయన. ఇలా నెలల తరబడి రాస్తూ పోయింది.

ఆమె రచనల పట్ల ఆయన ఎంత ఉద్వేగం పొందారంటే అవి బాగున్నాయని భావించిన తన నిర్ణయాన్ని సైతం తాను విశ్వసించలేకపోయారు.సాహిత్యానికి సంబంధించి పరస్పరం అభిప్రాయాలు పంచుకునే తన స్నేహితులు అశోక శేక్సారియా, రమేష్ గోస్వామిలను సంప్రదించారు. బేబీ రాత ప్రతిని చదివిన ఆ ఇద్దరూ ఇది మరో అన్నే ఫ్రాంక్ డైరీ అవుతుందని ప్రశంసించారు. (రెండో ప్రపంచ యుద్ధకాలంలో నాజీల జాతి హనన కాండకు బలైన యూదు బాలిక అన్నే ప్రాంక్ నాజీల చేత చిక్కి బలయ్యేంతవరకూ రాసుకున్న తన అజ్ఞాత జీవితపు అనుభవాల సమాహారమే ‘అన్నే ఫ్రాంక్ డైరీ’)

ఇలా బెంగాలీలో హల్దార్ రాసిన మూలాన్ని ప్రబోధ్ మొదట హిందీలోకి అనువదించారు. అలా వెలుగులోకి వచ్చింది ఆలో అంధారి -చీకటి వెలుగు- అయితే అతి సాధారణ వర్ణనతో కూడిన ఈ రచనకు ప్రచురణకర్తను పట్టుకోవడం తలకు మించిన పని. ఎందుకంటే సాధారణ పాఠకుల అభిరుచులకు ఇది కొరుకుడుపడనిది. అయితే చిన్నస్థాయి ప్రచురణా సంస్థ అయిన రోషని పబ్లిషర్‌ను నడుపుతున్న సంజయ్ భారతి తనకు నష్టం కలిగించినా సరే ఈ పుస్తకాన్ని ప్రచురించే బాధ్యతను తలపై పెట్టుకున్నాడు.

ఇలా పుస్తకం ప్రచురించబడడమే గొప్ప కాగా, దాని అమ్మకాలు ఈ నలుగురు సాహితీమిత్రులను ఆశ్చర్య పరిచాయి. హిందీ అనువాదమైన ఆలో అంధారి ప్రచురించబడిన తొలిరోజునుంచి అమ్మకాలు మొదలయ్యాయి. స్వీపర్ నుంచి రిటైరైన హెడ్‌మిస్ట్రెస్ వరకూ ఈ పుస్తకం కాపీని కొనడానికి ఆసక్తి చూపారు. ఇది ఎంతగా అమ్ముడుపోయిందంటే దాని రెండో ఎడిషన్ సైతం రెండు నెలల్లోపే అమ్ముడు పోయింది. ఈ పుస్తకం సినిమా హక్కుల గురించి ప్రకాష్ ఝా మాట్లాడడం జరిగింది. కొందరైతే దీన్ని నాటకంగా రూపొందించాలనుకున్నారు. ఇతరులు ఈ రచనను ఇంగ్లీష్, ఒరియా, తమిళ్, తెలుగు భాషల్లోకి సైతం అనువదించడానికి నడుం కట్టారు. కలకత్తాలోని కొత్త సాహిత్య పత్రిక భాషా బంధన్ బెంగాలీలో ఈ పుస్తకాన్ని సీరియల్‌గా వేసింది.

అయితే హల్దార్‌కు మాత్రం రచయితగా తన రెండో జన్మలో తనకు జరిగిన మంచి అంటూ ఉంటే నూతన స్నేహితులు దొరకడమే అంటుంది. జీవితంలో మొదటిసారిగా తన రచన తన మాటల్లోనే రూపొందినప్పటికీ దానికీ ఒక విలువ అనేది ఉందన్న విశ్వాసం ఏర్పడింది అంటుందామె. తన జీవితం, తను రాసిన పుస్తకం పత్రికలలో, టివీల్లో చర్చనీయాంశం అవుతుందని తాను ఏ మాత్రం ఊహించలేదని వినమ్రంగా చెప్పింది. తాను రచయితను కాదని, తానొక వంటమనిషిని మాత్రమేనని నిర్వికారంగా చెప్పుకునే హల్దార్ తన జీవిత కథ ఇంత సంచలనం ఎందుకు రేపిందో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని అంటుంది. అయితే జీవితంలో ఒక విషయంలో మాత్రం మార్పు వచ్చింది. అదేమంటే గతంలో తన పిల్లలు ఆమెను ఫలానా అని పరిచయం చేయడానికి సిగ్గుపడేవారట. ఇప్పుడు వాళ్లు మా అమ్మ రచయిత్రి అని గర్వంగా నలుగురికీ చెప్పుకుంటున్నారట.

తన రెండో పుస్తకం అయిన ‘ఈస్సాత్ రూపాంతర్’ -చిన్న చిన్న మార్పులు-ను కూడా ఇటీవలే ఆమె పూర్తి చేసింది. ఆలో అంధారీ -ఎ లైఫ్ లెస్ ఆర్డినరీ- ప్రచురించిన తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న మార్పులను ఈ రెండో పుస్తకంలో పొందుపర్చింది. గత జీవితంలో సాదా సీదా పనిమనిషిగా కాలం గడిపిన తనకేసి ఎవరూ తలెత్తి చూసేవారు కాదని ఆమె గతాన్ని తల్చుకుంటూ చెబుతుంది. అయితే ఉన్నట్లుండి ప్రతి ఒక్కరూ తనతో మాట్లాడడానికి ఆత్రుత ప్రదర్శిస్తున్నారట. పనిమనిషి నుంచి రచయిత్రిగా మారిన హల్దార్‌కి ఇవ్వాళ ప్రతిరోజూ వందలాది ఉత్తరాలు వస్తుంటాయట.

—————————————

జీవితం మలుపు తిరిగిన ఆ క్షణం…


బేబీ హల్దార్ రాసిన ‘ఎ లైఫ్ లెస్  ఆర్డినరీ’ అత్యంత దుర్భర జీవితంపై ఎదురు తిరిగిన అద్భుత మానవ శక్తికి తిరుగులేని నిదర్శనం. నిజంగానే అది ఒక ‘అసాధారణ జీవితం’ గురించి ఓ మామూలు పనిమనిషి వెలువరించిన అంతర్మధనం. దైనందిన జీవితంలో తమవైన అభిప్రాయాలు, ఆకాంక్షలు, వ్యక్తీకరణలకు చోటులేకుండా మగ్గిపోతున్న ఒక సామాజిక విభాగం తమ శక్తినంతా కూడదీసుకుని పెట్టిన పొలికేకే ‘ఎ లైఫ్ లెస్  ఆర్డినరీ’.

అందుకే, అది వెలువడిన మరుక్షణంనుంచి అసమాన విజయాన్ని సరైన సందర్భంలో, సకాలంలో పొందటంలో ఆశ్చర్యపడాల్సింది లేదు. పాచిపని, ఇంటిపని, వంటపని ఇలా సాధారణ సమాజం ఏ మాత్రం విలువ ఇవ్వని పనులకు జీవితాన్ని అంకితం చేసుకున్న సామాన్య మహిళ హల్దార్ ఇవ్వాళ వ్యక్తిగా, రచయితగా విజయం పొందడానికి కారణం ఆమె తన చుట్టూ ఉన్న అంథకారాన్ని కళ్లకు కట్టేంత శక్తివంతంగా తన సొంత భాషలో రాసుకుంటూ పోవడమే తప్ప మరే విశిష్టత లేదు.

నాలుగేళ్ల క్రితం (2004లో)  విడుదలయింది మొదలు ఇప్పటిదాకా ఏడుసార్లు పునర్ముద్రణలు పొందినా అన్ని పుస్తకాలూ అమ్ముడుపోవడం అన్న సత్యమే ఈ పుస్తకం గొప్పతనాన్ని చెబుతోంది… ఆమె వాణిని, జీవన కాఠిన్యాన్ని, అంధకారంలోంచి వెలుగులోకి ఆమె సాగించిన చిరు ప్రయాణాన్ని సమాజం వింటోంది. స్పందిస్తోంది. పన్నెండేళ్ల ప్రాయంలో వివాహం జరిగాక పుట్టింటికి దూరం కావడం, 14 ఏళ్ల లోపే తల్లి కావడం, వివాహ జీవితంలో భయానక అనుభవాలనుంచి పారిపోయి ఢిల్లీలో పాచిపని చేసుకుని బతకాల్సిరావడం..

….చివరకు ఓ కరుణామయుడి ఆపన్న హస్తం అందించిన నైతిక మద్దతుతో ఆమె తన కడగండ్ల జీవితాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం దాకా ఆమె తన తొలి పుస్తకంలో సాధారణ మానవ జీవితానికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టలేదు. అలాగని తనపై జాలిపడేలా ఉద్వేగ శైలితో రచన సాగించలేదు. సాహిత్యానికి సంబంధించిన ఏ మెరుగులు, ఉపమలు, అలంకారాలు, శైలీ పటుత్వం అన్నేదే లేకుండా.. తాను మాట్లాడే భాషలో, తనకు తెలిసిన భాషలో, తనకు చేతనైన శైలిలో మనుషుల బాధల పాటల పల్లవిని ఆమె ఈ పుస్తకంలో ఆలపించింది.

ఆమె అవలంబించిన సాధారణ రచనా శైలి కారణంగా ఇప్పుడూ, భవిష్యత్తులోనూ పులిట్జర్ తదితర అవార్డులను ఆమె పొందలేకపోవచ్చు. కాని మనిషికి సంబంధించిన ఏదో అంశాన్ని ఆమె తట్టిలేపింది. అందుకే ప్రపంచమంతా ఆమె భాషను ఇవ్వాళ వింటోంది. ఆమె బాధలను ప్రపంచం తనదిగా చేసుకుని స్పందిస్తోంది.

(ఈ కథనం 2008 ఫిబ్రవరిలో నా మరొక బ్లాగులో ప్రచురించినది. మరోసారి గుర్తు తెచ్చేందుకు ఇక్కడ పోస్ట్ చేయడమైనది. ఈ పుస్తకం అప్పట్లోనే తెలుగులో కూడా వచ్చినట్లుంది. తెలుగు పాఠకులకు మాత్రం 2008 సంవత్సరంలోనే ఆంధ్రజ్యోతిలో మొదటిసారిగా మా స్నేహితురాలు నీలిమ ఈమె గురించి పరిచయం చేశారు.)

కె.రాజశేఖర రాజు.
8341571371

Posted on February 29th, 2008 by mohana


1 comments:

Zemkarlos said...

Awesome article, I am regular visitor of this website, keep up the excellent work, and I will be a regular visitor for a very long time..Luxury Condos For Sale in Miami

Post a Comment