ఘంటసాల కన్ను మూసిన సందర్భంగా ఆయన మృతికి అందరూ నివాళి అర్పిస్తున్నారు. ఆయన మధుర స్వరాన్ని కొనియాడుతున్నారు. అయితే ఘంటసాల గురించి నిజాన్ని గ్రహించడంలో ఈ ప్రశంసలు విఫలమౌతు న్నాయి. ఎందుకంటే ఆయన గాయకుడు మాత్రమే కాదు. నిజమైన కవి. ప్రేమ, విచారం, సంతోషం, భాధ, దయ, ఆనందం, విషాదాలకు సంబంధించిన ప్రగాఢమైన అనుభూతులను మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా ఆయన వ్యక్తీకరించాడు. మానవులకు సంబంధించిన ఈ ప్రాధమిక ఉద్వేగాలను ఆయన స్వయంగా అనుభూతి చెంది ఉండకపోతే, ఆ జీవిత నేపథ్యంలో ఆయన నివసించి ఉండకపోతే వాటిని అంత వాస్తవికంగా, అంత సుసంపన్నంగా, అంత ఇష్టంగా ఆ మానవానుభూతులను ఘంటసాల తన స్వరంలో పలికించి ఉండేవారు కాదు.
మానవ ఉద్వేగాలను ఇంత మహనీయ మహత్వంతో పలికించిన మహాకవులెవరూ చరిత్రలో ఇంతవరకు లేరు. సహజంగానే ఇది ఆయన హృదయ స్వచ్ఛతను, మానసిక నిర్మలత్వాన్నే సూచిస్తుంది. ఆయన పాటలను వింటూ పరవశించే శ్రోతలు ఆయన అందించిన పరిపూర్ణమైన, మహోన్నతమైన జీవన తాత్వికతను అనుభూతి చెందకుండా తమ మనోభావాలను అణుచుకోలేరు. మానవ జీవితానికి సంబంధించిన తాత్వికతను ఆయన తన పాటల్లో అత్యంత స్పష్టంగా ప్రతిబింబించారు.
ఇంతవరకు చరిత్రలో పదాలు, పదబంధాలు ఎన్నడూ వ్యక్తీకరించలేనంత గాఢంగా, జీవితాన్ని వ్యక్తపరిచేందుకు ఆయన తన పాటల ద్వారా ప్రయత్నించారు. సినిమా కథలో భాగంగానే ఆయన చాలా పాటలు పాడి ఉండొచ్చు. కాని ఒక క్రమంలో అవి స్వతంత్ర స్థాయిని పొంది, తమ స్వంత అర్థం సంతరించుకుని, సినిమా కథ సందర్భం నుంచి తమను తాము విముక్తి చేసుకునేవి. ఈ వాస్తవాన్ని ప్రజలు గ్రహించారు కాబట్టే థియేటర్లలో చూడటం కంటే థియేటర్ల బయట ఆ పాటలను వినడానికే పదే పదే ప్రయత్నించేవారు.
చదువుకున్న, చదువుకోని తెలుగు ప్రజలపై ఆయన పాటల ప్రభావం ఎంతగా ఉండేదంటే తెలుగు ప్రజల రోజువారీ ఆంతరంగిక జీవితాలను అవి గుణాత్మకంగా మార్చాయి. ఇవ్వాళనుంచి (1974) ఆంధ్రప్రదేశ్‌లో జనజీవితం ఉద్వేగరహితంగా, బోసిపోతుందని మనం వెరపు లేకుండా చెప్పవచ్చు. నిస్సందేహంగా, ఘంటసాల రాక తోటే తెలుగు ప్రజల భావోద్వేగాల చరిత్రలో ఓ కొత్త శకం మొదలైంది. ప్రజల హృదయాలలో నిక్షిప్తమై ఉన్న రహస్య నిధులను ఆయన వెలికి తీశారు. ఆయనే లేకుంటే అవి నేటికీ నిద్రాణ స్థితిలోనే పడి ఉండేవి. అంతవరకు హిందీ సినిమా సంగీతం కోసం ఎదురు చూసే తెలుగు ప్రజలకు ఒక వినూత్నమైన ఊహాత్మక అనుభవం అందుబాటు లోకి వచ్చేసింది. ఆ విశిష్ట అనుభవమే ఘంటసాల పాట.
ఆశ్చర్యం ఏమిటంటే, ఆయన తనలోని కళను విస్తృతంగా వాణిజ్య ప్రయోజనం కోసమే ఉపయోగించినప్పటికీ నాణ్యత విషయంలో కాని, నిజమైన ప్రేరణను కలిగించడంలో కాని ఆ కళ తన నాణ్యతను ఎన్నడూ కోల్పోలేదు. అనేకానేక చెడు ప్రభావాలకు గురికాకుండా ఆయన చిత్రపరిశ్రమలో వెలుగొందుతూ వచ్చారు. అసంఖ్యాకంగా ఆయన పాటలు పాడినప్పటికీ జీవితం చివరివరకు ఆయన అలిసిపోలేదు, పాటపై అనురక్తి తగ్గిపోయిన దాఖలాను ప్రదర్శించలేదు.
తన మరణంతో మనం మరో నేపధ్య గాయకుడిని మాత్రమే కోల్పోలేదు. ఒక కవీశ్వరుడిని కోల్పోయాం. ఒక జాతి ప్రజల భావోద్వేగాలను మేల్కొలిపి తారాస్థాయికి తీసుకెళ్లిన కవీంద్రుడిని కోల్పోయాం. వాస్తవంగానే, ఘంటసాల పాట లేని తెలుగు ప్రజలను ఊహించడం అసాధ్యం. ఆయన వదిలివెళ్లిన ఖాళీని పూరించగల గాయకుడు లేడు. సాధారణ లలిత సంగీతకారుడి లేదా సాంప్రదాయేతర సంగీతకారుడి స్థాయిని ఘంటసాల నిస్సందేహంగానే శిఖరస్థాయిలో నిలబెట్టారు.
సత్యం పట్ల, సౌందర్యం పట్ల తృష్ణతోపాటు, తన ప్రభావ ప్రపంచంలోకి ఇతరులను కూడా తీసికొచ్చి ప్రాథమికమైన స్వీయ ఎరుకను తీసుకొచ్చిన ఘనుడు ఘంటసాల. ఆయన దుర్బల దేహాన్ని గమనించిన ఎవరయినా, ఆయనలో సంగీత స్ఫూర్తి ఇంత స్థాయిలో ఉందని ఊహించలేరు. కాని తన జీవిత క్రమం సంగీతాన్ని ఆయనకు పేటెంట్‌గా మార్చేసింది. దాన్నే ఇవ్వాళ అందరూ చూస్తున్నారు.. వింటున్నారు..
ఆయన మరణం తర్వాత ఆయన సంగీతం అన్ని కాలాల్లోనూ నిలిచి ఉంటుందని, ఉనికిలో ఉంటుందని పలువురు భావిస్తుండవచ్చు. ఈ మృత కవీంద్రుడి సజీవ స్వరం మనల్ని సమ్మోహన పర్చడానికి, దాసానుదాసులుగా మార్చుకోవడానికి అలా అలా కొనసాగుతూనే ఉంటుందని పలువురు భావిస్తూండవచ్చు. అయితే ఈ విశిష్ట, నిరుపమాన గాయకుడితో వస్తున్న చిక్కల్లా ఏమిటంటే మనం ఇంకా ఈయన సాధించినదానితో సంతృప్తి చెందడం లేదు.
ఆయన స్వరం నుంచి వెలువడిన మేధోపరమైన, శాశ్వతమైన, వినిర్మలమైన, నాజూకైన, సృజనాత్మకమైన సంగీతం పట్ల మన అనురక్తి, తృష్ణ ఇంకా ముగియలేదు. ఆయన నుంచి చాలినంత సంగీతామృతాన్ని పొందామని కొంతమంది భావిస్తుండవచ్చు కాని, ఆయన సంగీతంతో మనలో చాలామంది ఇంకా సంతృప్తి చెందడం లేదు. విన్న కొద్దీ మళ్లీ మళ్లీ వినాలని పించే అమృత గుళికలను మనముందుంచి వెళ్లారు. ఆ పాటలతో సంతృప్తి చెంది ఇక చాలు అనుకోవడం అసాధ్యం. ఘంటసాల అనే ఈ గాన గంధర్వుడితో వస్తున్న చిక్కు ఇదే..
ఘంటసాల మృతిపై నాటి 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నివాళి
(ఈ రచన ఘంటసాల గారు కన్నుమూసిన రెండు రోజుల తర్వాత నాటి 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రికలో 14-02-1974వ తేదీన ప్రచురితమైంది. దీన్ని రచించిన వారు కె. కుమార శేఖర్, ఎలుగు. అంతకుమించి తన విశేషాలు ప్రస్తుతం ఎవరికీ తెలీవు. ఘంటసాల గానమాధుర్య శకాన్ని అనన్యసాధ్యమైన రీతిలో ఆవిష్కరించిన ఆ రచయిత ఎవరో ఇవ్వాళ ఎవరికీ తెలియదు. ఈ వ్యాసం ఆంగ్లపాఠాన్ని ప్రచురించిన ఘంటసాల. ఇన్పో వెబ్‌సైట్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది.
"No Mere Singer" అనే పేరుతో వచ్చిన నాటి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనానికి ఇది స్వేచ్ఛానువాదం.
దీని ఆంగ్ల లింకు
http://www.ghantasala.info/theman/no_mere_singer.html
http://www.ghantasala.info సౌజన్యంతో)
గమనిక: ఘంటసాల గారి వర్థంతి సందర్భంగా 2014 ఫిబ్రవరి 12న నేను స్వేచ్ఛానువాదం చేసి నాటి andhraprabha.com తెలుగు వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఈ అరుదైన వ్యాసాన్ని ఇక పోగొట్టుకున్నట్లే అని భావిస్తున్న తరుణంలో చిరంజీవిబ్లాగ్.కామ్ అనే కింది బ్లాగులో యధాతథంగా అచ్చేసి ఉండటం ఇప్పుడే చూశాను. బంగారో లేదా తిరుపతి లడ్డూనో ఏదైతేనేం కోల్పోయాననుకున్న రచన తిరిగి కంటపడింది. అందుకు ఆ బ్లాగర్‌కు కృతజ్ఞతలు.
మరొకరి మంచి రచనను ఇలా ఇతర బ్లాగర్లు తమ బ్లాగుల్లో ప్రచురించుకోవడం కూడా ఒక్కోసారి మనమంచికే దారి తీస్తుందన్నమాట. చాలా సంతోషం. నా చందమామ చరిత్ర http://blaagu.com/chandamamalu/ బ్లాగు మళ్లీ మాయమైంది కాబట్టి దాంట్లో ఉన్న ఘంటసాల గారిపై రెండు వ్యాసాలను నా ఈ కాంతిసేన బ్లాగులో మళ్లీ భద్రపరుస్తున్నాను.
కె.రాజశేఖరరాజు
8341571371
నా వ్యాసం పునర్ముద్రణకు అవకాశం కల్పించిన కింది బ్లాగర్‌కు ధన్యవాదాలు.
http://www.chiranjeeviblog.com/forums/index.php?topic=6732.0
0 comments:
Post a Comment